మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/పూజలూ, మతం మార్చుకోవటం
8. పూజలూ, మతం మార్చుకోవటం
పెద్ద ఆవరణలో ఎన్నో చెట్ల మధ్యన ఉందా చర్చి. జనం - నల్లవాళ్ళూ తెల్లవాళ్ళూ దాని లోపలికి వెడుతున్నారు. యూరప్‌లో ఉన్న చర్చిలన్నిటిలో కన్నా ఎక్కువ వెలుగుంది దాని లోపల. కాని ఏర్పాట్లు మాత్రం అట్లాగే ఉన్నాయి. ప్రార్ధన జరుగుతోంది. అందులో అందం ఉంది. అది అయిపోయిన తరువాత అక్కడున్న తెల్లవాళ్ళలోనూ, నల్లవాళ్ళలోనూ బహుకొద్ది మంది మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఎవరిత్రోవన వాళ్ళం వెళ్ళిపోయాం.
మరో భూభాగంలో ఒక దేవాలయం ఉంది. సంస్కృతంలో శ్లోకాలు గానం చేస్తున్నారు. హిందువులు చేసే పూజ జరుగుతోంది. అక్కడ చేరిన సమూహం యొక్క సంస్కృతి వేరు. సంస్కృత పదాల శబ్దం ఛేధించేట్లు చాలా శక్తిమంతంగా ఉంది. అందులో ఏదో చిత్రమైన భారం, గాంభీర్యం ఉన్నాయి.
ఒక నమ్మకం నుంచి మరొక నమ్మకానికీ, ఒక మూఢ సిద్ధాంతం నుంచి మరొక మూఢ సిద్ధాంతానికీ మారగలరు. కాని, సత్యాన్ని గ్రహించే స్థితికి మారలేరు. నమ్మకం సత్యంకాదు. మీ మనస్సుని మార్చుకోవచ్చును. మీ అభిప్రాయాన్ని మార్చుకోవచ్చును. కాని సత్యం అనేది, దైవం అనేది నమ్మకం కాదు. అది అనుభవంలోకి రావాలి. ఏదో నమ్మకంమీద, మూఢవిశ్వాసం మీద ఆధారపడినది కాదు. మీ అనుభవం ఏదైనా నమ్మకం మీద ఆధారపడినదైతే, మీ అనుభవం మీ నమ్మకం ప్రకారమే పరిమితమై ఉంటుంది. మీకేదైనా అనుభవం హఠాత్తుగా అనాలోచితంగా జరిగి, ఆ అనుభవం మీద మరికొంత అనుభవం అయితే అటువంటి అనుభవం కేవలం కొత్తగా ఎదురైన దాన్ని గుర్తుపట్టిన పాత జ్ఞాపకం మాత్రమే. జ్ఞాపకం అనేది ఎప్పుడూ గతించిపోయినదే. జీవించి ఉన్నదాని స్పర్శతో సజీవమవుతూ ఉంటుంది.
మతం మార్చుకోవటమంటే, ఒక నమ్మకం నుంచి మరొకదానికీ, ఒక మూఢ విశ్వాసం నుంచి మరొక దానికీ, ఒక పూజమాని మరింత తృప్తినిచ్చే మరొక పూజకీ మారటమే. దీనివల్ల సత్యాన్ని కనుక్కునే మార్గం మాత్రం కనుపించదు. పైగా తృప్తి పొందటం అనేది సత్యాన్ని కనిపించనివ్వదు. అయినప్పటికీ, మతసంస్థలూ, మతసంఘాలూ చేసే ప్రయత్నం అదే. మరింత ఒప్పించో, ఒప్పించకనో ఒక సిద్ధాంతం వైపుకో, మూఢవిశ్వాసం వైపుకో, ఆశవైపుకో మిమ్మల్ని మార్చాలని చూస్తారు. అంతకన్న మంచి పంజరాన్ని ఇస్తామని ఆశచూపిస్తారు. అందులో మీకు సుఖంగా ఉండొచ్చు, ఉండక పోవచ్చు. అది మీ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. ఏమైనా అది ఒక ఖైదు.
మతంలోనూ, రాజకీయాల్లోనూ వివిధ సాంస్కృతిక స్థాయిల్లో ఈ మార్పు జరుగుతోంది ఎల్లవేళలా. సంస్థలూ, వాటి అధికారులూ మనుషుల్ని తమ సిద్ధాంతరీతుల్లో - మత సంబంధమైనవి గాని, ఆర్ధిక సంబంధమైనవి గాని - వాటిలో ఇరికించి, తాము వర్ధిల్లుతూ ఉంటారు. ఈ తతంగంలోనే ఉంది. ఒకరి నొకరు స్వలాభం కోసం వినియోగించుకోవటమనేది. సత్యం ఎప్పుడూ ఇటువంటి విధానాల్లోని భయాలతో, ఆశలతో సంబంధం లేకుండా ఉంటుంది. మీరు సత్యంలోని అత్యున్నత ఆనందాన్ని చవిచూడాలంటే అన్నిరకాల పూజల్నీ సిద్ధాంతరీతుల్నీ వదిలించుకోవాలి.
మత సంబంధమైన, రాజకీయ సంబంధమైన వ్యవహార రీతుల్లో మనస్సుకి రక్షణ దొరకుతుంది. అందువల్లనే సంస్థలకీ శక్తి లభిస్తోంది. సంస్థలలో ఎప్పుడూ ఆరితేరినవారూ, కొత్తగా చేరినవారూ కూడా ఉంటారు. వీరు తమ మూలధనాలతో, ఆస్తులతో ఈ సంస్థల్ని పోషిస్తూ ఉండగా, ఈ సంస్థలో లభించే అధికారం, గౌరవం - అటువంటి వాటిని సాధించటాన్నీ, ప్రాపంచిక జ్ఞానాన్నీ ఆరాధించే వారినందరినీ ఆకర్షిస్తాయి. పాతపద్ధతులు ఇంకేవిధంగానూ తృప్తికరమైనవీ, ప్రాణ ప్రదమైనవీ కావని మనసుకి తోచగానే, మరింత సుఖాన్నీ, శక్తినీ ఇచ్చే నమ్మకాలవైపుకీ, మూఢ విశ్వాసాల వైపుకీ మారిపోతుంది. అందుచేత మనస్సు చుట్టుపక్కల ఉండే వాతావరణం నుంచి తయారైనదే-ఎప్పటి కప్పుడు మళ్ళీ రూపాందించుకుంటూ, అనుభూతుల నుంచీ, ఐక్యం చేసుకోవటంనుంచీ, బలం పుంజుకుంటూ ఉంటుంది. అందువల్లనే మనస్సు నీతి నియమాలనూ, ఆలోచనా విధానాలనూ, అటువంటి వాటిని పట్టుకొని వదలదు. మనస్సు గతం నుంచి ఉద్భవిస్తున్నంతకాలం సత్యాన్ని తెలుసుకోలేదు. సత్యాన్ని బయట పడనీయదు. సంస్థల్ని పట్టుకు వ్రేలాడుతూ సత్యాన్వేషణని వదిలి పెట్టేస్తుంది.
పూజాపునస్కారాల్లో పాల్గొనేవారికి అటువంటి వాటిలో సద్భావం కలగటం సహజం. అందరితో కలిసి చేసినా, వ్యక్తిగతంగా చేసినా, పూజా పునస్కారాల్లో కొంత మనశ్శాంతి లభిస్తుంది. నిత్య కార్యకలాపాలతోనూ, దైనందిన జీవితంలోనూ పోల్చుకుంటే, పూజల్లో కొంత అందమూ, క్రమపద్ధతీ ఉన్నప్పటికీ అవి ప్రధానంగా ఉత్తేజకాలు మాత్రమే. ఉత్తేజకాలు అన్నిటిలాగే అవికూడా మనస్సునీ, హృదయాన్నీ పూర్తిగా బండబారేటట్లు చేస్తాయి. పూజాపునస్కారాలు అలవాటయిపోతాయి. అవసరమనిపిస్తాయి. అవి లేకుండా ఉండలేమనిపిస్తుంది. ఈ అవసరాన్ని ఆధ్యాత్మిక పునరుద్ధరణ అనీ, జీవితాన్ని ఎదుర్కోవటానికి కావలసిన శక్తి అనీ, దినదినం, వారంవారం చేసే ధ్యానం అనీ పలువిధాలుగా పేర్కొంటారు. కాని, ఈ ప్రక్రియని మరింత పరీక్షగా చూస్తే నిజానికి, పూజలూ అవీ ఆత్మజ్ఞానం కలగకుండా గౌరవప్రదంగా బ్రహ్మాండంగా తప్పించుకోవటానికి చేసే వ్యర్ధ ప్రయాసలా కనిపిస్తుంది. తన్ను తాను తెలుసుకోకుండా ఏపని చేసినా అర్ధం ఉండదు.
పదేపదే శ్లోకాలు చదవటం, పదాలూ వాక్యాలూ జపించటంవల్ల మనస్సుని నిద్ర పుచ్చటం జరుగుతుంది, తాత్కాలికంగా కొంత ఉత్తేజకరంగా ఉన్నప్పటికీ. ఈ నిద్రావస్థలో కొన్ని అనుభవానికి వస్తాయి. కాని, అవి స్వయం ప్రేరితమైనవే. ఎంత తృప్తినిచ్చినా, ఈ అనుభవాలు ఊహాజనితమైనవే. దేన్ని పదేపదే జపించినా, ఏ విధంగా సాధన చేసినా సత్యం అనుభవంలోకి రాదు. సత్యం ఒక గమ్యంకాదు. ఒక ఫలితం కాదు, ఒక లక్ష్యం కాదు. దాన్ని ఆహ్వానించలేము. అది మనస్సుకి సంబంధించినది కాదు.