మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/పునశ్చరణ, అనుభూతి
26. పునశ్చరణ, అనుభూతి
పట్నవాసపు చప్పుళ్లూ, వాసనలూ తెరిచి ఉన్న కిటికీలోంచి లోపలికి వస్తున్నాయి. ఆ పెద్ద చతురస్రాకారపు తోటలో నీడలో కూర్చుని జనం వార్తలు చదువుతున్నారు. ప్రపంచ వ్యవహారాలు ముచ్చటించుకుంటున్నారు. పావురాలు రెపరెపలాడుతూ ఇక్కడా అక్కడా వాలుతున్నాయి తిండి వెతుక్కుంటూ. పిల్లలు పచ్చని మైదానం మీద ఆడుకుంటున్నారు. సూర్యుడు అందమైన నీడల్ని సృష్టిస్తున్నాడు.
అతనొక విలేఖరి. చురుకుతనం, తెలివితేటలూ ఉన్నవాడు. తన ప్రశ్నలకు ప్రత్యుత్తరాలేకాక, తన సొంత సమస్యల గురించి చర్చించాలని కూడా అభిలషించాడు. అతని పత్రిక కోసం ప్రశ్నలడగటం, ప్రత్యుత్తరాలు రాసుకోవటం అయిపోయాక, తన ఉద్యోగం గురించి చెప్పాడు - దాని విలువ ఎంతో - ధనరీత్యాకాదు, ఈ ప్రపంచంలో దానికున్న ప్రాముఖ్యం గురించి. అతను పెద్దవాడు, తెలివైనవాడు, సమర్థుడు, ఆత్మ విశ్వాసం ఉన్నవాడు. పత్రికా ప్రపంచంలో త్వరత్వరగా పై కొస్తున్నాడు. అందులోనే అతనికి భవిష్యత్తు ఉంది.
మన మనస్సుల్లో ఎంతో విజ్ఞానాన్ని కూరుతూ ఉండటం చేత సూటిగా అనుభవం పొందటం అసంభవమవుతోంది. సుఖాన్నీ బాధనీ అనుభవించటం సూటిగా వ్యక్తిగతంగా జరిగేదే. కాని, అనుభవాన్ని అర్థం చేసుకోవటం మాత్రం ఇతరులు - మత, సాంఘిక వ్యవస్థల అధికారులు - అందించిన పద్ధతి ప్రకారం జరుగుతోంది. ఇతరుల ఆలోచనలకూ ప్రభావాలకూ ఫలితం మనం. మత, రాజకీయ ప్రచారం మనల్ని తీర్చిదిద్దింది. దేవాలయం, చర్చి, మసీదు - వీటికి మన జీవితాల పైన ఏదో విచిత్రమైన అస్పష్టమైన ప్రభావం ఉంది. రాజకీయ సిద్ధాంతాలు మన ఆలోచనకు ప్రాణం పోస్తాయి. ప్రచారం మనల్ని తయారు చేస్తుంది, ధ్వంసం చేస్తుంది. మత సంస్థలు ఒకటో రకం ప్రచారకులు. ముందు నమ్మించటానికీ, ఆ తరవాత వదలకుండా ఉండటానికీ ఎలాంటి సాధనాన్నైనా ఉపయోగిస్తాయి.
సందిగ్ధమయ ప్రక్రియల సమూహం మనం. మనకి కలుగుతుందన్న భవితవ్యం ఎంత అనిశ్చయంగా ఉంటుందో మన మధ్యస్తస్థితి కూడా అంత అనిశ్చయంగానూ ఉంటుంది. కేవలం మాటలే అసాధారణమైన ప్రాముఖ్యం కలవిగా కనిపిస్తాయి మనకి. అవి కలిగించే మానసిక ప్రభావంతో, వాటివల్ల కలిగే అనుభూతులే అత్యంత ముఖ్యమైనవనిపిస్తాయి, ఆ ప్రతీక కవతల ఏమున్నదో దానికంటే కూడా.
సంకేతం, ఊహారూపం, జండా, మాట, ఇవన్నీ ఎంతో ముఖ్యం మనకి. నకిలీదేగాని నిజంకాదు మన శక్తి. ఇతరుల అనుభవాల గురించి చదువుతాం. ఇతరులు ఆడుతూంటే చూస్తాం, ఇతరుల ఉదాహరణలను అనుసరిస్తాం, ఇతరులు చెప్పినదాన్ని వర్ణిస్తాం. మనం లోపల శూన్యంగా ఉంటాం. ఈ శూన్యతని మాటలతోనూ అనుభూతులతోనూ, ఆశలతోనూ, ఊహలతోనూ నింపటానికి ప్రయత్నిస్తాం. కాని, ఆ శూన్యత అలాగే ఉంటుంది.
పునశ్చరణ, దాని అనుభూతులూ ఎంత ఆనందకరమూ, గౌరవ ప్రదమూ అయినప్పటికీ, అది అనుభవం పొందటం కాదు. ఒక పూజ, ఒకమాట, ఒక ప్రార్థన నిరంతరం పదేపదే పునశ్చరణ చేయటం వల్ల తృప్తికరమైన అనుభూతి కలుగుతుంది. దానికే ఎంతో గౌరవప్రదమైన పేరు పెడతారు. కాని, అనుభవం పొందటం అనుభూతి కాదు. ఇంద్రియ ప్రతిక్రియ వెంటనే వాస్తవికతకి చోటిస్తుంది. వాస్తవమైన దాన్ని, అంటే, "ఉన్నదాన్ని" కేవలం ఇంద్రియ జ్ఞానం ద్వారా అర్థం చేసుకోలేము. ఇంద్రియాల పాత్ర కొంతవరకే ఉంటుంది. కాని, అవగాహన గాని, అనుభవం పొందటం గాని, ఇంద్రియాలకు అతీతమైనది. అనుభవం పొందటం అయిపోయిన తరువాతనే అనుభూతి ముఖ్యమవుతుంది. అప్పుడు మాటలు అర్థవంత మవుతాయి. సంకేతాలు ఆధిక్యం చూపిస్తాయి. అప్పుడు గ్రామఫోను ఎంతో ఆనందదాయకమవుతుంది. అనుభవం పొందటం కొనసాగేది కాదు. కొనసాగేది అనుభూతి మాత్రమే, ఏ స్థాయిలోనైనా. అనుభూతి మళ్లీ కలిగినప్పుడు కొత్త అనుభవాన్ని పొందిన అనుభూతి కలుగుతుంది. కాని అనుభూతులు ఎప్పటికీ క్రొత్తవికావు. పునశ్చరణ చేసుకున్న అనుభూతులలో క్రొత్త దానికోసం వెతికి లాభం లేదు. అనుభవం పొందుతూన్న స్థితిలోనే క్రొత్తది ఉద్భవిస్తుంది. అనుభూతి కోసం ఆరాటం, ప్రయాస అంతమైనప్పుడే అనుభవం పొందటం జరుగుతుంది.
అనుభవం మళ్లీ సంభవించాలని కోరటం అనుభూతి యొక్క తీవ్ర లక్షణం. జ్ఞాపకాలను పెంపొందించుకోవటం, అనుభూతులను విస్తృతం చేసుకోవటమే. అనుభవం మళ్లీ సంభవించాలనే కోరిక - మీ అనుభవం అయినా, మరొకరి అనుభవమైనా సరే - బండబారేటట్లు చేస్తుంది. మరణానికి దారితీస్తుంది. పునశ్చరణ అయిన సత్యం అబద్ధమవుతుంది. సత్యం పునస్సంభవం కాదు. దాన్ని ప్రచారం చేయటానికి గాని, ఉపయోగించు కోవటానికి గాని వీలులేదు. సత్యాన్ని నాశనం చేసిగాని, కాదని గాని, మళ్లీ దాన్ని ఉపయోగించవచ్చు. కాని, అది ఇంక సత్యం అవదు. ప్రచారకులకు అనుభవం పొందటంతో ప్రమేయం లేదు. వారికి కావలసినదల్లా అనుభూతులను - మత, రాజకీయ, సాంఘిక, అంతరంగిక అనుభూతులను సమకూర్చటమే. ప్రచారకులు మతాన్ని ప్రచారం చేసినా, లౌకిక వాదాన్ని ప్రచారం చేసినా సత్యాన్ని చెప్పేవారు మాత్రం కాదు.
అనుభూతి పైన అభిలాష అంతమైనప్పుడే అనుభవం పొందటం సంభవమవుతుంది. పేరు పెట్టటం, మాటల్లో చెప్పటం అంత మొందాలి. మాటల రూపంలో పెట్టకుండా ఆలోచనా ప్రక్రియ జరగదు. మాటలలో చిక్కుకోవటం కోరికల భ్రమలలో బంధింపబడటమే.