మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/నేను ఎలా ప్రేమించను?
59. నేను ఎలా ప్రేమించను?
మేము పర్వతం మీద బాగా ఎత్తున ఉన్నాం. క్రింద లోయ కనిపిస్తోంది. పెద్ద నదీ ప్రవాహం ఎండలో వెండితాడులా ఉంది. అక్కడక్కడ ఆకుల గుబురుల మధ్య నుంచి ఎండపడుతోంది. ఎన్నో రకాల పువ్వుల సువాసన వస్తోంది. ఆ ఉదయం రమణీయంగా ఉంది. నేలమీద మంచు ఇంకా ఒత్తుగా ఉంది. సువాసనతో కూడిన గాలి లోయ మీదుగా వస్తోంది. దాంతో బాటు దూరాన్నుంచి మనుషుల చప్పుడూ, మువ్వల ధ్వనీ అప్పుడప్పుడు గంట చప్పుడూ వినవస్తోంది. లోయలోంచి పొగ తిన్నగా పైకి పోతోంది. దాన్ని చెల్లాచెదరు చేయటానికి తగినంత బలంలేదు గాలిలో. పొగపాయ చూడటానికి చాలా అందంగా ఉంది. లోయక్రింద నుంచి పైకి లేచి ఆకాశాన్ని అందుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది - ఆ పురాతన దేవదారు వృక్షం లాగ. ఒక పెద్ద నల్లని ఉడత మమ్మల్ని చూచి తిట్టి తిట్టి చివరికి మానేసి, చెట్టుమీంచి క్రిందికి వచ్చింది ఇంకా కనుక్కుందామని. తరవాత కొంత తృప్తిపడి చకచకా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక చిన్న మబ్బు ఏర్పడుతోంది. అది మినహా ఆకాశం నిర్మలంగా, మృదువుగా లేత నీలం రంగులో ఉంది.
ఆయన కళ్లకిదేమీ కనిపించటంలేదు. ఆయన తన ముఖ్య సమస్య గురించి సతమతమవుతున్నాడు - అంతకు ముందు ఇతర సమస్యలతో సతమతమయినట్లుగానే. సమస్యలు ఏర్పడుతూ ఆయన చుట్టూ చేరి ఉన్నాయి. ఆయన బాగా ధనవంతుడు. సన్నగా కడ్డీలా ఉన్నాడు. కాని కులాసాగా ఉండి చిరునవ్వులు చిందిస్తాడు. ఇప్పుడాయన లోయకేసి చూస్తున్నాడు. కాని, చైతన్యవంతం చేసే అ అందం ఆయన్ని స్పృశించలేదు. ఆయన ముఖం మెత్తపడలేదు. అ గీతలు ఇంకా అలాగే కఠినంగా నిర్ణీతంగా ఉన్నాయి. ఆయన ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాడు - డబ్బుకోసం కాదు, దేవుడు అని ఆయన అనుకునేదానికోసం. ఆయన ఎప్పుడూ ప్రేమ గురించీ, దేవుడి గురించే మాట్లాడతాడు. ఆయన ఎంతో దూరాలు వెళ్లి అన్వేషించాడుట. ఎంతో మంది గురువుల వద్ద ఉన్నాడుట. వయస్సు పైబడుతున్న కొద్దీ ఆయన అన్వేషణ మరింత తీవ్రంగా అవుతోందిట. ఆయన ఎన్నోసార్లు వచ్చాడు ఈ విషయాలు మాట్లాడటానికి. కాని, గడుసుగా ముందువెనకలు ఆలోచిస్తున్నట్లుగా కనిపించేవాడు. దేవుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవటానికి ఎంత ఖర్చవుతుంది. ప్రయాణానికి ఎంత ఖర్చవుతుంది - అని నిత్యం లెక్కలు వేసుకుంటూ ఉండేవాడు. ఆయనకున్నదంతా తనతోపాటు తీసుకువెళ్లలేడని తెలుసును. ఇంకేదైనా తీసుకువెళ్లవచ్చునేమో, తను వెళ్లేచోట పనికొచ్చే నాణెం లాంటి దేదైనా? ఆయన కఠినాత్ముడు. హృదయంతోగాని, చేత్తోగాని ఎప్పుడూ ఔదార్యం చూపించడు. ఇంకా కొంచెం ఇవ్వాలంటే ఎంతో సందేహిస్తాడు. ఎవడికి తగినట్లు వాడికి ఫలితం ముట్టాలంటాడు - తనకు తగినట్లు తనకు ముట్టినట్లుగా. ఆ రోజు ఉదయం తన్ను తాను ఇంకా తేటతెల్లం చేసుకోవటానికి వచ్చాడు. ఏదో కష్టం బాధిస్తోంది. చాలా వరకు విజయవంతమైన ఆయన జీవితంలో ఏవో తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి. విజయలక్ష్మి ఆయన్ని పూర్తిగా వరించటం లేదు.
"నేను ఎటువంటి వాడినో నాకు తెలిసివస్తోంది" అన్నాడు. "ఇన్నేళ్ల నుంచీ మిమ్మల్ని తెలియకుండా వ్యతిరేకంచి ప్రతిఘటించాను. మీరు ధనవంతులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. మా గురించి ఎన్నింటినో పరుషంగా మాట్లాడుతారు. మీమీద నాకు కోపం వచ్చేది. కాని తిరిగి మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోయేవాణ్ణి. మిమ్మల్ని అందుకోవటం నావల్లకాదు. ఎన్నోవిధాల ప్రయత్నించాను. మిమ్మల్ని తాకలేకపోతున్నాను. ఇంతకీ నన్నేం చేయమంటారు? మీ మాటలు వినకుండా, మీ దరిదాపుల్లోకి ఎక్కడికీ రాకుండా దేవుడు చేసి ఉంటే బాగుండేదనుకుంటూ ఉంటాను. నాకిప్పుడు రాత్రులు నిద్ర ఉండదు. ఇదివరకు ఎంతో చక్కగా నిద్రపోయేవాడిని. భయంకరమైన కలలు వస్తున్నాయి నాకు. ఎప్పుడో గాని కలగనే వాణ్ణికాదు. మీరంటే భయం వేసేది. మిమ్మల్ని మౌనంగా శపించుకున్నాను. కాని, వెనక్కి తిరిగి పోలేను. నేనేం చెయ్యాలి? నాకు స్నేహితులు లేరు. మీరన్నట్లు ఇదివరకులా వాళ్లని కొనుక్కోలేను. జరిగిన దానివల్ల నేను పూర్తిగా బయటపడి పోయాను. నేను మీకైనా స్నేహితుణ్ణి కాగలనేమో. మీరు సహాయం చేస్తానన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను. నేనేం చెయ్యాలి?"
బయటపడటం అంత సులభం కాదు. అందులోనూ తన్నుతానే బయటపెట్టుకోవటమా? ఆ అలమారుని ఎప్పుడైనా తెరుస్తారా? దానిలో తాను చూడదలుచుకోనివన్నిటినీ కుక్కి జాగ్రత్తగా తాళం వేసి మూసి ఉంచినదాన్ని తెరుస్తారా? అసలు దాన్ని తెరవాలనీ, అందులో ఏముందో చూడాలనీ అనుకుంటారా?
"నేను చేస్తాను. కాని ఎలా మొదలుపెట్టాలి?"
నిజంగా చెయ్యాలనుకుంటున్నారా, లేక, ఆ ఉద్దేశంతో కేవలం ఆటలాడుకుంటున్నారా? ఒకసారి తెరిస్తే కొంచెమైనా సరే. దాన్ని మళ్లీ మూయటం సాధ్యం కాదు. అ తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. పగలూ, రాత్రీ, దానిలో ఉన్నవి పైకి ఒలికిపోతూ ఉంటాయి. పారిపోవటానికి ప్రయత్నించవచ్చు. ఎప్పుడూ చేసేదే ఆ పని. కాని, అది అలాగే ఉంటుంది. నిరీక్షిస్తూ, గమనిస్తూ. నిజంగా తెరవాలని అనుకుంటారా ఎవరైనా?
"నిజంగానే నేను చేస్తాను. అందుకే వచ్చాను నేను. నేను దాన్ని ఎదుర్కోవాలి. అన్నీ ఆఖరైపోయే చోటికి చేరుతున్నాను - అందుకని. నేనేం చెయ్యాలి?"
తెరిచి చూడండి. ధనం కూడబెట్టటానికి గాయపరచాలి, క్రూరంగా, ఔదార్యం లేకుండా ఉండాలి - నిర్దాక్షిణ్యత, గడుసుగా లెక్కలు వేసుకోవటం, నిజాయితీ లేకపోవటం ఉండాలి. బాధ్యత, కర్తవ్యం, సామర్థ్యం, హక్కులు వంటి - ఎంతో మధురంగా ధ్వనించే మాటలతో కప్పిపుచ్చి చేసే అహంకారపూరిత చర్య అధికారం కోసం ప్రయత్నించడం కూడా ఉండాలి.
"అవును, అదంతా నిజమే. ఇంకేదన్నా నిజమే. ఎవ్వరి గురించీ ఆలోచించటం ఉండదు. మత సంబంధమైన వ్యాపకాలు మనకు గౌరవ ప్రతిష్టలనిచ్చే తొడుగులు మాత్రమే. ఇప్పుడు చూస్తే ప్రతిదీ నా చుట్టూ తిరిగినట్లుగా అనిపిస్తోంది. నేను కేంద్రాన్ని - కాదని నటించినా, అదంతా చూస్తున్నాను. కాని నేనేం చెయ్యాలి?"
మొట్టమొదట ఉన్నవాటిని ఉన్నట్లుగా చూడాలి. కాని, ఆ తరవాత వీటన్నిటినీ తుడిచి పారవెయ్యటం ఎలా కుదురుతుంది? అప్యాయత, ప్రేమ అనే పొగలేని జ్వాలలేనట్లయితే? ఈ జ్వాల ఒక్కటే ఆ అలమారులోని వాటినన్నిటినీ తుడిచి పారవెయ్యగలదు. ఇంకేదీ కాదు. విశ్లేషణగాని, త్యాగంగాని, పరిత్యాగంగాని చెయ్యలేదు. ఈ జ్వాల ఉన్నట్లయితే, అప్పుడది త్యాగంకాదు, పరిత్యాగం కాదు. అప్పుడు తుఫానుని ఢీకొంటారు, మీరు ఎదురు చూడకుండానే.
"కాని, నేను ప్రేమించటం ఎలా? మనుషులంటే నాకు అప్యాయత లేదని నేనెరుగుదును. నేను నిర్దాక్షిణ్యంగా ఉన్నాను. నాతో ఉండవలసిన