మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/నమ్మకం

23. నమ్మకం

మేము బాగా పైన కొండల్లో ఉన్నాం. చాలా ఎండగా ఉంది. ఎన్నో నెలల నుంచీ వర్షం పడలేదు. చిన్న చిన్న నీటి ప్రవాహాలు నిశ్శబ్దంగా పోతున్నాయి. దేవదారు చెట్లు మట్టి రంగుకి తేలిఉన్నాయి. కొన్ని అప్పటికే చచ్చిపోయాయి. వాటి మధ్య నుంచి గాలి వీస్తోంది. కొండలు మడతలన్నీ విప్పుకుని అనంతంగా విస్తరించినట్లుగా ఉన్నాయి. అడవి జంతువులు చాలావరకు మరింత సౌకర్యవంతమైన చల్లని ప్రదేశాలకు వెళ్లిపోయాయి. కొన్ని ఉడతలూ, పాలపిట్టలూ మాత్రం ఉండిపోయాయి. వేరే కొన్ని చిన్ని పక్షులున్నాయి. కాని, అవి రోజంతా నిశ్శబ్దంగా ఉంటున్నాయి. చచ్చిపోయిన దేవదారు చెట్టొకటి ఎండలకి ఎండి ఎండి, తెల్లబడి పోయింది. చచ్చిపోయినా ఎంతో అందంగా ఉందది, ఎటువంటి సంచలనం లేకుండా నాజూగ్గానూ బలంగానూ ఉంది. నేల గట్టిపడి, నడిచేదారులు రాళ్లతోనూ, మట్టితోనూ నిండి ఉన్నాయి.

ఆవిడ ఎన్నో మత సమాజాల్లో చేరినట్లు చెప్పింది. ఆఖరికి ఒక దాంట్లో స్థిరపడి పోయిందిట. దానికోసం ఆవిడ ఉపన్యాసకురాలిగా, ప్రచారిణిగా పని చేసిందిట దాదాపు ప్రపంచమంతటా. ఆవిడ తన సంసారాన్నీ, సౌఖ్యాన్నీ మరెన్నిటినో ఈ సంస్థకోసం వదులుకున్నదిట. దాని నమ్మకాలనూ సిద్ధాంతాలనూ, ఉద్దేశాలనూ స్వీకరించి, దాని అధినాయకులను అనుసరించి ధ్యానం చేయటానికి ప్రయత్నించిందిట. సభ్యులచేతా, అధినాయకులచేతా కూడా ఎంతో గౌరవింపబడింది. ఇప్పుడు నమ్మకాల గురించీ, సంస్థల గురించీ, ఆత్మవంచన వల్ల కలిగే ప్రమాదాలు, మొదలైన వాటి గురించి నేను చెప్పినదంతా విన్న మీదట ఆ సంస్థనీ, దాని కార్యక్రమాలనీ వదిలిపెట్టేసింది. ప్రపంచాన్ని ఉద్దరించటంలో ఇంక ఏ మాత్రం ఆసక్తి లేదు. తన చిన్న సంసారంతోనూ, దాని సమస్యలతోనూ కాలక్షేపం చేస్తున్నది. ప్రపంచం గురించి దూరంనుంచే ఆసక్తి తీసుకుంటున్నది. నిష్ఠురంగా మాట్లాడుతున్నట్లు తోచింది - పైకి సానుభూతి, ఔదార్యం ప్రదర్శించినప్పటికీ, ఎందు వల్లనంటే ఆవిడ జీవితమంతా వృథా అయిపోయిందని చెప్పింది. ఇంతకాలం అంత ఉత్సాహంతో శ్రమించినందుకు ఆవిడ సాధించిందేమిటి? ఆవిడకేం ఒరిగింది? ఆవిడ ఎందుకంత అనాసక్తంగా, అలిసిపోయినట్లుగా ఉంది? ఆ వయస్సులో ఆవిడకి స్వల్ప విషయాల గురించి ఎందుకంత ఆత్రుత?

మనలోని సున్నితత్వాన్ని మనం ఎంత సులభంగా నాశనం చేస్తున్నాం! నిరంతర సంఘర్షణతో, అంతులేని పోరాటంతో, వ్యాకులపడి తప్పించుకు పోవటంతో, భయాలతో శీఘ్రమే మనస్సునీ, హృదయాన్నీ మందకొడిగా చేస్తాం. కాని మనస్సు తన నైపుణ్యంతో సత్వరమే సున్నితత్వం స్థానంలో మరొకదాన్ని కనుక్కుంటుంది. వినోదాలు, సంసారం, రాజకీయాలు, నమ్మకాలు, దేవుళ్ళు - ఇవన్నీ స్పష్టత, ప్రేమ ఉండవలసిన స్థానంలో చోటు చేసుకుంటాయి. విజ్ఞానంవల్లా, నమ్మకాలవల్లా స్పష్టత పోతుంది. ఉత్తేజకరమైన అనుభూతుల వల్ల ప్రేమ పోతుంది. నమ్మకం స్పష్టతను తేగలదా? చుట్టూ బిగించి గోడ కట్టుకుని ఉండే నమ్మకం అవగాహన కలుగ నిస్తుందా? ఈ నమ్మకాల అవసరం ఏమిటి? అసలే క్రిక్కిరిసి ఉన్న మనస్సుని చీకటిమయం చేయవా? ఉన్నదాన్ని అర్ధం చేసుకోవటానికి నమ్మకాల అవసరం ఉండదు. సూటిగా గ్రహించాలి. కోరిక అనేది అడ్డుపడకుండా సూటిగా తెలుసుకోవాలి. కోరిక చేపట్టే మార్గాలు చాలా సూక్ష్మమైనవి. వాటిని అర్ధం చేసుకోకుండా ఉంటే, నమ్మకం సంఘర్షణనీ, సందిగ్దతనీ, ప్రతికూలతనీ అధికం చేస్తుంది. నమ్మకానికి మరోపేరు మతం. మతం కూడా కోరికకి రక్షణ కల్పించేదే.

నమ్మకాన్ని చర్యకి సాధనంగా పరిగణిస్తాం. ఏదైనా ప్రత్యేకతనుంచి లభించే విచిత్రమైన శక్తిని నమ్మకం కలుగజేస్తుంది. మనం ఏదో ఒకటి చెయ్యాలనే ఆదుర్దాతో ఉంటాం. కాబట్టి నమ్మకం అవసరమనిపిస్తుంది. నమ్మకం లేకుండా ఏపనీ చెయ్యలేమనుకుంటాం. మనం జీవించటానికీ, పని చెయ్యటానికీ అవసరమనిపించేదాన్ని నమ్మకం మనకిస్తుంది. మనలో చాలామందికి నమ్మకం ఇచ్చేది మినహాయించి జీవితానికి వేరే అర్ధం ఉండదు. జీవితాని కన్నా నమ్మకానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. మన నమ్మకం ప్రకారమే జీవితం గడపాలనుకుంటాం. ఏదో ఒక నమూనా లేనట్లయితే ఏ పని అయినా ఎలా సాధ్యం? అందుచేత మన చర్య ఒక అభిప్రాయంమీద ఆధారపడి గాని, ఒక అభిప్రాయ ఫలితమై గాని ఉంటుంది. అందుచేత చర్య అభిప్రాయమంత ముఖ్యం అవదు.

మానసికమైనవి ఎంత బ్రహ్మాండమైనవైనా, ఎంత సూక్ష్మమైనవైనా, కార్యాచరణ పూర్తి కావటానికీ, ఒకరి బ్రతుకులోనూ, తద్వారా సమాజ వ్యవస్థలోనూ సమూలమైన పరివర్తన తీసుకురావటానికీ ఎంతవరకు దోహదం చేస్తాయి? అసలు అభిప్రాయం అనేది కార్యాచరణకు సాధనం అవుతుందా? ఒక అభిప్రాయం కొంత కార్యాచరణకు వరుసగా దారి తీయవచ్చు. కాని అది కార్యసంరంభం మాత్రమే. కార్యసంరంభం కార్యాచరణకి పూర్తిగా విరుద్ధమైనది. ఈ కార్యసంరంభంలోనే ఎవరైనా చిక్కుకునేది. ఏదైనా కారణం వల్ల ఈ కార్యకలాపం ఆగిపోయినట్లయితే దిక్కు తెలియకుండా తప్పిపోయినట్లు, జీవితం అర్ధ శూన్యమైనట్లూ, శూన్యమైనట్లూ అనుకుంటారు. ఈ శూన్యతని గురించి మనకి చైతన్యంగా ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా తెలిసే ఉంటుంది. అందువల్లనే అభిప్రాయం, కార్యకలాపం అన్నిటి కన్నా ముఖ్యమైనవయ్యాయి. ఈ శూన్యతని మనం నమ్మకంతో నింపుతాము. దాంతో, కార్యకలాపం మత్తు కలిగించే అవసరంలా తయారవుతుంది. ఈ కార్యకలాపం కోసం మనం అన్నిటినీ త్యజిస్తాం. ఎటువంటి ఇబ్బందికైనా, ఎటువంటి భ్రమకైనా లోనవుతాం. నమ్మకంతో వచ్చే కార్యకలాపం సందిగ్ధ జనకంగా, వినాశకరంగా ఉంటుంది. మొదట్లో ఎంతో క్రమబద్ధంగా నిర్మాణాత్మకంగా ఉండొచ్చును. కాని, దాని వెనుకనే సంఘర్షణ, దుఃఖం ఉంటాయి. మత సంబంధమైనది కాని, రాజకీయ సంబంధమైనది కాని, ఏవిధమైన నమ్మకమైనా సంబంధ బాంధవ్యాలను అవగాహన చేసుకోవటానికి ఆటంకం కలిగిస్తుంది. అవగాహన లేనిదే కార్యాచరణ సాధ్యంకాదు.