మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఎరుక
41. ఎరుక
మేఘాలూ విస్తారంగా ఉన్నాయి ఎగిసిపడే తెల్లని కెరటాల్లాగ. ఆకాశం నిర్మలంగా నీలంగా ఉంది. దానికి ఎన్నో వేల అడుగుల క్రింద మేము నిలబడిన చోట నీలంగా వంపు తిరిగి ఉన్న సముద్రం ఉంది. దూరాన భూభాగం ఉంది. ఆ సాయంకాలం రమణీయంగా ఉంది - ప్రశాంతంగా, స్వేచ్ఛగా. దూరాన ఆకాశంలో నౌక పొగ కనిపిస్తోంది. నారింజ తోటలు కొండదిగువున పొడుగుతా ఉన్నాయి. వాటి పరిమళం గాలి నిండా ఉంది. సాయంకాలం నీలిరంగుకి మారుతోంది ఎప్పుడూలాగే. గాలికూడా నీలంగా అయినట్లుంది. ఆ లేతరంగులో తెల్లటి ఇళ్లు వెలవెల బోతున్నాయి. సముద్రపు నీలిరంగు ఒలికి నేలంతా పరుచుకున్నట్లుగా ఉంది. పైనున్న పర్వతాలు కూడ లేతనీలంరంగులో ఉన్నాయి. ఆకర్షణీయమైన దృశ్యం అది. అపారమైన నిశ్శబ్దం. సాయంకాలపు చప్పుళ్లేవో కొద్దిగా ఉన్నప్పటికీ, అవి కూడా నిశబ్దంలో భాగమైపోయాయి మేమూ అయినట్లుగానే. ఈ నిశ్శబ్దం ప్రతిదాన్నీ సరికొత్తగా చేస్తోంది - యుగాల తరబడి పేరుకున్న మురికిని, అన్ని గుండెల్లోని బాధనీ తుడిచిపెట్టేస్తూ. కన్నులు ప్రక్షాళితమైనాయి. మనస్సు ఆ నిశ్శబ్దంలో చేరింది. గాడిద ఒకటి ఓండ్ర పెట్టింది. దాని ప్రతిధ్వనులతో లోయంతా నిండింది. నిశ్శబ్దం వాటిని స్వీకరించింది. రోజు పూర్తి కావడంతో గతదినాలన్నీ మరణిస్తాయి. ఈ మరణంలోనే పునర్జన్మ ఉంటుంది - దుఃఖపూరితమైన గతం లేకుండా. అపార నిశ్శబ్దంలో జీవితం కొత్తగా ఉంది.
గదిలో ఒక మనిషి ఎదురు చూస్తున్నాడు - ఏవో మాట్లాడాలనే ఆదుర్దాతో. ఆయన ఒక రకంగా తీక్షణంగా ఉన్నాడు. కాని శాంతంగా కూర్చున్నాడు. పట్నవాసస్థుడని స్పష్టంగా తెలుస్తోంది. ఆ చిన్న పల్లెటూరులో ఆ గదిలో అందమైన నలగని దుస్తుల్లో ఉన్న ఆయన అదోలా ఉన్నాడు. ఆయన తన కార్యకలాపాల గురించీ తన ఉద్యోగంలో ఉన్న కష్టాల గురించీ, కుటుంబ జీవితంలో ఉన్న చిన్న గొడవలగురించీ, తన కోరికల తీవ్రత గురించీ చెప్పుకొచ్చాడు. ఈ సమస్యలన్నిటినీ తెలివిగా అందరిలాగే ఎదుర్కోగలిగాడు. ఆయన్ని నిజంగా చికాకు పరుస్తున్నవి లైంగిక వాంఛలు. ఆయనకి వివాహమైంది. పిల్లలున్నారు. అవన్నీ కాక, ఆయన లైంగిక కార్యకలాపాలు ఆయనకి తీవ్రసమస్య అయిపోయి, ఆయనకి పిచ్చెత్తిపోయేట్లు చేస్తున్నాయిట. కొంతమంది డాక్టర్లనీ, మనస్తత్వ విశ్లేషకులనీ సంప్రదించాడుట. కాని ఆ సమస్య ఇంకా అలాగే ఉందిట. ఇప్పుడు ఎలాగైనా దాని లోతుపాతులు తెలుసుకోవాలిట.
మన సమస్యల్ని పరిష్కరించుకోవటానికి మనం ఎంత ఆత్రుత పడతాం! ఏదో సమాధానం, ఏదో మార్గం, ఏదో మందుకోసం. సమస్యని యథాతథంగా పరిశీలించం. కాని ఉద్రిక్తతతో, ఆదుర్దాతో ఏదో పరిష్కారం కోసం వెతుకుతాం. ఆ వెతికేది తప్పని సరిగా స్వయం కల్పితమైనదే. సమస్య తాను స్వయంగా సృష్టించుకున్నదే అయినా, పరిష్కారాన్ని మాత్రం ఎక్కడో దానికి దూరంగా వెతుకుతాం. పరిష్కారం కోసం చూడటమంటే తప్పించుకోవటమే. అదే మనలో చాలామంది చెయ్యాలనుకునేది. అప్పుడు పరిష్కారం అత్యంత ముఖ్యమైపోతుంది - సమస్య కాదు. పరిష్కారం సమస్యకి విడిగా లేదు. పరిష్కారం సమస్యలోనే ఉంది - దానికి దూరంగా కాదు. పరిష్కారం అసలు సమస్యతో సంబంధం లేకుండా వేరుగా ఉంటే, మనం వేరే సమస్యలు సృష్టిస్తాం - సమస్యకి పరిష్కారాన్నెలా కనుక్కోవటం, ఎలా ఆచరించటం, ఎలా అమలుపరచటం మొదలైనవి. పరిష్కారం కోసం వెతకటం సమస్యని తప్పించుకోవటం కాబట్టి స్వయం కల్పితమైన ఆదర్శాల్లో, నమ్మకాల్లో, అనుభవాల్లో మునిగిపోతాం. ఈ స్వయంకృత రూపాల్నే ఆరాధిస్తూ అంతకంతకు మరీ అయోమయంగా అలసటగా అయిపోతాం. ఏదో ఒక నిర్ణయానికి రావటం కొంత సులభమే. కాని సమస్యని అర్ధ చేసుకోవటం శ్రమతో కూడినది. దానికి వేరే పద్ధతి ఉండాలి. ఆ పద్ధతిలో పరిష్కారం కావాలనే కోరిక మెదుల్తూ ఉండకూడదు.
సమస్యని అర్ధం చేసుకోవటానికి పరిష్కారం కావాలనే కోరిక నుంచి విముక్తి పొందటం అవసరం. ఈ విముక్తి పొందటం వల్ల పూర్తిగా ధ్యానం ఏర్పడటానికి వీలవుతుంది. వేరే ఇతర విషయాలవైపు మనస్సు మరలకుండా ఉంటుంది. సమస్యకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని సంఘర్షణ ఉన్నంత కాలం దాన్ని అవగాహన చేసుకోవటం జరగదు - ఈ సంఘర్షణే ధ్యానాన్ని మరోవైపుకి మళ్లిస్తుంది కనుక. సన్నిహిత సంపర్కం ఉన్నప్పుడే అవగాహన కలుగుతుంది. ప్రతిఘటన, వ్యతిరేకత, భయం, లేదా, అంగీకారం ఉన్నంతకాలం సన్నిహిత సంపర్కం ఏర్పడటం అసాధ్యం. సమస్యతో సరియైన సంబంధం ఏర్పరచుకోవాలి. అదే అవగాహనకి ఆరంభం. అయితే, సరియైన సంబంధం ఎలా ఉంటుంది, మీరు దాన్ని ఎలా వదిలించుకోవాలా అని బాధపడుతున్నప్పుడు - అంటే, దానికో పరిష్కారాన్ని వెతకాలనుకుంటున్నప్పుడు? సరియైన సంబంధం అంటే సన్నిహిత సంపర్కం. వ్యక్తంగా గాని అవ్యక్తంగా గాని ప్రతిఘటన ఉన్నప్పుడు సన్నిహిత సంపర్కం ఏర్పడటానికి వీలుండదు. సమస్య కన్న ఆ సమస్యని ఎలా సమీపిస్తున్నారన్నది ఎక్కువ ముఖ్యం. సమీపించే మార్గమే సమస్యనీ దాని అంతాన్నీ రూపొందిస్తుంది. సాధనం, లక్ష్యం, సమీపించే మార్గం వేరు కావు. సమీపించే మార్గమే సమస్య గతిని నిర్ణయిస్తుంది. సమస్యని ఎలా పరికిస్తున్నారన్నది అత్యంత ముఖ్యం. ఎందువల్లనంటే, మీ ప్రవృత్తి, మీ అయిష్టతలూ, భయాలూ, ఆశలూ దాని రంగుని మారుస్తాయి కనుక. సమస్యని సమీపించే పద్ధతిని ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తెలుసు కోవటం వల్ల సమస్యతో సరియైన సంబంధం ఏర్పడుతుంది. సమస్య స్వయంకృతం. అందుచేత స్వీయజ్ఞానం ఉండాలి. మీరూ, సమస్యా ఒక్కటే, వేరువేరు కాదు. మీరే మీ సమస్య.
'నేను' యొక్క కార్యకలాపాలు భయంకరంగా చికాకుపెడతాయి. 'నేను' స్వభావమే విసుగు కలిగించేది. దాని తత్త్వమే అసహనంగా ఉండటం, అర్థం లేకుండా ఉండటం, వ్యర్థంగా ఉండటం. దాని పరస్పర వ్యతిరేకమైన, విరుద్ధమైన కోరికలూ, ఆశలూ, నిరాశలూ, నిజాలూ, భ్రమలూ సమ్మోహితం చేస్తాయి. అయినా, అది శూన్యంగానే ఉంటుంది. దాని కార్యకలాపాలే దానికి నిస్త్రాణ కలిగిస్తాయి. 'నేను' స్వభావమే ఎప్పుడూ పైకెక్కుతూ, క్రిందికి దిగుతూ, అర్రులు చాస్తూ, నిస్పృహ చెందుతూ, ఎప్పుడూ లాభం పొందుతూనో నష్టపడుతూనో ఉంటుంది. ఈ వ్యర్థ పరిశ్రమ నుంచి ఎప్పుడూ తప్పించుకోవాలని ఉంటుంది. సంతృప్తి కలిగించే భ్రమలు - తాగుడు, లైంగికానుభవం, రేడియో, పుస్తకాలూ, జ్ఞానం, వినోదాలూ మొదలైన బాహ్య కార్యకలాపాల ద్వారా తప్పించుకుంటుంది. అది భ్రమలను పెంపొందించుకునే శక్తి - నానావిధ సమ్మిళితమైనదీ, అపారమైనదీ. ఈ భ్రమలు సవయంకృతమైనవీ, స్వయంకల్పితమైనవీ. అవే ఆదర్శవంతమైన, ఆరాధనా రూపాలైన గురువులూ, రక్షకులూ, తన్నుతాను శక్తివంతం చేసుకునేందుకు సాధనమైన భవిష్యత్తూ మొదలైనవి. తన విసుగుదల నుంచి తానే తప్పించుకోవటానికి 'నేను' అంతర్గతంగానూ, బహిరంగంగానూ తన అనుభూతులనూ ఉత్తేజాలనూ అనుసరిస్తుంది. ఆత్మ సంయమనానికి ఇవి ప్రత్యామ్నాయాలు. ఈ ప్రత్యామ్నాయాల్లో పడి తప్పించుకుపోవాలంటుంది. తరుచు విజయం సాధిస్తుంది. కాని ఆ విజయం దాని అలసటని మరింత అధికం చేస్తుంది. ఒక ప్రత్యామ్నాయం తరువాత మరొక దాన్ని అనుసరించటంలో ప్రతి ఒక్కటీ దాని సమస్యల్నీ దాని సంఘర్షణనీ, బాధనీ సృష్టిస్తుంది.
వ్యక్తి స్వీయ విస్మరణ కోసం అంతర్గతంగానూ బహిరంగంగానూ ప్రయత్నం జరుపుతాడు. కొంతమంది మతంవైపూ, మరి కొంతమంది ఏదో పనివైపూ, ఏవో కార్యకలాపం వైపూ మళ్లుతారు. తనను మరచిపోయేందుకు ఏవిధమైన మార్గమూ లేదు. లోపలా, బయటా ఉండే చప్పుడు తనని అణచి ఉంచవచ్చు. కాని, అంతలోనే అది మరో రూపంలో, మరో వేషంలో బయటికి వస్తుంది. అణగి ఉన్నది ఎప్పుడో అప్పుడు విముక్తి పొందాలి. త్రాగుడు, లైంగికానుభవం, భక్తి, జ్ఞానం - ఇటువంటి వాటి ద్వారా కలిగిన స్వీయ విస్మరణ వాటిపైన ఆధారపడేటట్లు చేస్తుంది. దేనిమీదైనా ఆధారపడితే అది సమస్యని సృష్టిస్తుంది. మీ విముక్తికోసం, స్వీయ విస్మరణ కోసం, ఆనందం కోసం తాగుడు మీదో, గురువు మీదో ఆధారపడితే అదే మీ సమస్య అవుతుంది. పరాధీనత, సొంతం చేసుకోవాలనే ఇచ్ఛనీ, ఈర్ష్యనీ, భయాన్నీ పెంపొందింపజేస్తుంది. అప్పుడు భయం, దాన్ని ఎలా తప్పించుకోవటం అన్నది మీ తీవ్ర సమస్య అవుతుంది. ఆనందాన్ని అన్వేషించటంలో సమస్యను మనమే సృష్టించుకుని అందులో చిక్కుకుంటాం. లైంగికానుభవంతో మనల్ని మరచిపోవటంలో కొంత ఆనందాన్ని చవిచూస్తాం. దాన్ని మన కోరికను సాధించుకోవటానికి సాధనంగా ఉపయోగిస్తాం. దేనివల్ల ఆనందం కలుగుతుందో అది తప్పనిసరిగా సంఘర్షణ పుట్టిస్తుంది - ఆనందం కన్న దాని సాధనమే ఎంతో ఎక్కువ అర్ధవంతం, ముఖ్యం అనుకుంటాం కాబట్టి. ఆ కుర్చీ అందం వల్ల నాకు ఆనందం కలిగితే ఆ కుర్చీ నాకు అత్యంత ముఖ్యమై పోతుంది. దాన్ని నేను అన్నిటి నుంచీ రక్షించుకోవాలి. 'నేను' అన్న ప్రత్యేకత కోసం ప్రయత్నించడం లేదా? నేనే ఆనందంగా ఉండాలనే అనుకోవడం లేదా? ఈ పోరాటంలో, ఒకప్పుడు ఆ కుర్చీ అందం వల్ల నేను పొందిన ఆనందాన్ని పూర్తిగా మరిచిపోతాను. నాకు కుర్చీయే మిగులుతుంది. కుర్చీ దానంతట అది విలువైనది కాదు. నేను దానికి అసాధారణమైన విలువ నిచ్చాను - అది నా ఆనందానికి సాధనం కనుక. అందువల్ల ఆనందానికి ఒక ప్రత్యామ్నాయం సాధనం అవుతోంది.
జీవించే ఒక మనిషి నా ఆనందానికి సాధనం అయినప్పుడు ఆ సంఘర్షణ, గందరగోళం, వైరుధ్యం, బాధా మరింత ఎక్కువగా ఉంటాయి. సంబంధం ఉపయోగం మీద ఆధారపడి ఉన్నప్పుడు మరీ పైపైన తప్పితే అసలు సంబంధం అనేది ఉంటుందా ఉపయోగించుకునే వారికీ, ఉపయోగింపబడే వారికీ మధ్య? మిమ్మల్ని నా కోసం ఉపయోగించుకుంటే మీతో నాకు సంబంధం ఉన్నట్లేనా? సంబంధం అంటే వివిధ స్థాయిల్లో పరస్పర సన్నిహిత సంపర్కం ఉండటం. ఇంకొకరు సాధనం మాత్రమే అయితే, ఆనందానికి ఒక మార్గం మాత్రమే అయితే, అతనితో సన్నిహిత సంపర్కం ఉంటుందా? ఆ విధంగా ఒకరిని ఉపయోగించుకోవటంలో స్వీయ ప్రత్యేకత కోసం ప్రయత్నించడం లేదా? 'నేనే' ఆనందంగా ఉండాలని అనుకోవడం లేదా? ఈ స్వీయ ప్రత్యేకతనే సంబంధం అంటున్నాను. కాని, వాస్తవంగా ఈ ప్రక్రియలో సన్నిహిత సంపర్కం ఉండదు. భయం లేనప్పుడే సంపర్కం ఉంటుంది. ఉపయోగించటం, ఆధారపడటం ఉన్నప్పుడు నరాలు పిండే భయం, బాధా ఉంటాయి. ఏదీ ప్రత్యేకంగా వేరుగా ఉండలేదు కాబట్టి, మనస్సు తన్ను తాను ప్రత్యేకించుకునేందుకు చేసే ప్రయత్నాలు నిస్పృహకీ, దుఃఖానికీ దారితీస్తాయి. ఈ అసంపూర్ణ భావాన్ని తప్పించుకోవటానికి ఊహల్లోనూ, మనుషుల్లోనూ, వస్తువుల్లోనూ సంపూర్ణతని అన్వేషిస్తాం. అంచేత మనం మళ్లీ మొదటికి వస్తాం - ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ.
'నేను' యొక్క కార్యకలాపాలు ఆధిక్యం వహించినప్పుడు ఎప్పుడూ సమస్యలు ఉంటాయి. ఏవీ 'నేను' యొక్క కార్యకలాపాలు, ఏవీ కావు - అని తెలుసుకోవటానికి నిరంతరం ధ్యానంతో చూడటం అవసరమవుతుంది. ఈ ధ్యానంతో చూడటం క్రమశిక్షణతో అలవరచుకున్నది కాదు. అది ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా విస్తారంగా తెలుసుకొని ఉండటమే. క్రమశిక్షణతో అలవడిన ధ్యానం "నేను"కు శక్తినిస్తుంది. అదొక ప్రత్యామ్నాయం, ఆధారం అవుతుంది. తెలుసుకొని ఉండటం అలా కాదు. అది స్వీయ ప్రోద్బలం వల్ల గాని, సాధన వల్ల గాని వచ్చినది కాదు. మొత్తం సమస్యలో ఉన్నదంతా - నిగూఢమైనదీ, పైపైన ఉన్నదీ కూడా అర్థం చేసుకోవటం అది. నిగూఢమైనది బయట పడాలంటే పైన ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలి. పైపై మనస్సు శాంతంగా ఉంటే గాని నిగూఢమైనదాన్ని బయటపెట్టలేము. ఈ ప్రక్రియ అంతా మాటలతో కూడినది కాదు. కేవలం అనుభవానికి సంబంధించిన విషయమూ కాదు. మాటల్లో వ్యక్తపరచటం మనస్సు మందకొడితనాన్ని సూచిస్తుంది. అనుభవం కూడబెట్టినదవటం వల్ల పునశ్చరణ అవుతుంది. తెలుసుకుని ఉండటం అంటే నిశ్చయానికి రావటం కాదు. లక్ష్య సూచన అంటే ప్రతిఘటన. దానికి ప్రత్యేకత కలిగించే లక్షణం ఉంది. తెలుసుకుంటూ ఉండటం అంటే ఉన్నదాన్ని ప్రశాంతంగా ఇష్టాయిష్టాలు లేకుండా గమనించటం. తెలుసుకుంటూ ఉన్నప్పుడు సమస్య దానంతటదే విప్పుకుంటుంది. ఆ విధంగా అది సంపూర్ణంగా అర్ధమవుతుంది.
ఏ సమస్య అయినా ఒక స్థాయిలోనే ఎన్నటికీ పరిష్కారం కాదు - అది అనేక రకాలతో సమ్మిళితమైనది కాబట్టి. దాని మొత్తం ప్రక్రియని అర్థం చేసుకోవాలి. సమస్యని ఒక స్థాయిలోనే - భౌతికంగా గాని, మానసికంగా గాని పరిష్కరించడానికి ప్రయత్నించటం మరింత సంఘర్షణకీ సందిగ్ధతకీ దారితీస్తుంది. సమస్య పరిష్కారం అవాలంటే ఇదంతా తెలుసుకుంటూ ఉండటం జరగాలి. దాని మొత్తం ప్రక్రియని తేటతెల్లం చేసే ఉదాసీన పూర్వకమైన ధ్యానం ఉండాలి.
ప్రేమ ఇంద్రియ సంబంధమైన అనుభూతి కాదు. అటువంటి అనుభూతులు మాటల ద్వారా, సంకేతాల ద్వారా ఆలోచనకు రూపానిస్తాయి. అనుభూతులూ, ఆలోచనా ప్రేమ స్థానంలో చోటు చేసుకుంటాయి. ప్రేమకి ప్రత్యామ్నాయం అవుతాయి. అనుభూతులు లైంగిక వాంఛల లాగే మానసికమైనవి. మనస్సు ఆకలినీ, భావోద్రికతనీ జ్ఞాపకం చేసుకోవటం ద్వారా పెంపొందిస్తుంది. ఆ విధంగా సంతృప్తి కలిగించే అనుభూతులు పొందుతుంది. మనస్సు వివిధ పరస్పర విరుద్ధమైన ఆసక్తులతో, కోరికలతో, వాటి వాటి ప్రత్యేక అనుభూతులతో కూడుకొన్నది. అందులో ఒకటి తక్కిన వాటిపైన ఆధిపత్యం వహించటం మొదలుపెడితే ఘర్షణపడి సమస్యని సృష్టిస్తాయి. అనుభూతులు సంతోషకరమైనవీ, సంతోషకరం కానివీ, రెండు రకాలైనవీ ఉంటాయి. మనస్సు సంతోషకరమైన వాటినే పట్టుకుని ఉంటుంది. వాటికి బానిస అవుతూ. మనస్సులో పరస్పర విరుద్ధమైన అనుభూతులు కూడబెట్టి ఉన్నప్పుడు ఈ బంధనం సమస్య అయిపోతుంది. బాధాకరమైన వాటిని తప్పించుకోవటం కూడా బంధమే. దాని భ్రమలూ, దాని సమస్యలూ దానివి. మనస్సే సమస్యల్ని సృష్టిస్తుంది. కాబట్టి వాటిని అది పరిష్కరించలేదు. ప్రేమ మనస్సుకి చెందినది కాదు. కాని అది మనస్సులోకి వచ్చినప్పుడు అనుభూతి కలుగుతుంది. అప్పుడు దాన్ని ప్రేమ అని పిలుస్తుంది. ఈ విధమైన మానసిక ప్రేమని గురించి ఆలోచించవచ్చు. దానికి ముస్తాబు చేసి ప్రత్యేకించవచ్చు. మనస్సు సంతోషకరమైన అనుభూతులను గుర్తుకి తెచ్చుకోగలదు. ముందుగానే ఊహించగలదు. ఈ ప్రక్రియే ఆకలి - దాన్ని ఏ స్థాయిలో ఉంచినా సరే. మనోరంగంలో ప్రేమ ఉండలేదు. మనస్సు అనేది భయం, విచక్షణ చేయటం, ఈర్ష్య, ఆధిపత్యం, పోల్చటం, వదులుకోవటం - ఇవన్నీ ఉండే స్థలం. అందుచేత అందులో ప్రేమ ఉండదు. అసూయ, గర్వం మాదిరే మానసికమైనది. కాని అది ప్రేమ కాదు. ప్రేమకీ, మానసిక ప్రక్రియలకీ మధ్య వంతెన కట్టి వాటిని కలపటం సాధ్యం కాదు. అనుభూతులు ఆధిక్యం పొందినప్పుడు ప్రేమకి స్థానం ఉండదు. మానసికమైనవి హృదయంలో నిండుతాయి. ఆ విధంగా ప్రేమ అపరిచితమైనదీ, ప్రయత్నించవలసినదీ, ఆరాధించవలసినదీ అవుతుంది. దాన్ని వినియోగించటానికీ, విశ్వసించటానికీ దాన్ని ఆదర్శంగా చేస్తారు. ఆదర్శాలన్నీ స్వయంకల్పితమైనవే. అందుచేత మనస్సు దాన్ని పూర్తిగా ఆక్రమించటంతో, ప్రేమ ఒక శబ్దం, ఒక అనుభూతి అవుతుంది. అప్పుడిక ప్రేమని పోలుస్తారు. "నేను ఎక్కువ ప్రేమిస్తాను. మీరు తక్కువ ప్రేమిస్తారు" అని. కాని ప్రేమ వ్యక్తిగతం కాదు. ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఆలోచనా రూపం లేనట్టి, అనుభూతి అనేది ఎంత మాత్రమూ లేనటువంటి స్థితే ప్రేమ.