మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఊహ, యథార్థం
37. ఊహ, యథార్థం
ఆవిడకి వివాహం అయి చాలా ఏళ్లయింది. కాని, పిల్లలేరు. ఆవిడకి పిల్లలు పుట్టలేదుట. ఆ యథార్థం ఆవిణ్ణి తీవ్రంగా కలచివేసింది. ఆవిడ అక్కచెల్లెళ్లకి పిల్లలున్నారుట. తనకే ఎందుకా శాపం? ఆవిడకి చిన్నప్పుడే వివాహం అయిందట - ఆనాటి ఆచారం ప్రకారం. ఆవిడ ఎన్నో బాధలు పడిందట. ఏదో కొంత ఆనందాన్ని కూడ అనుభవించిందిట. ఆవిడ భర్త పెద్ద ఉద్యోగి ఏదో కార్పొరేషన్‌లోనో ప్రభుత్వశాఖలోనో; వాళ్లకి పిల్లలేరన్న విషయానికి ఆయనా బాధపడ్డాడుట. కాని, ఆ యథార్థంతో ఆయన సమాధాన పడుతున్నట్లు కనిపిస్తోందిట. అదీ కాక, ఆయనకి తీరుబడి లేనంత వ్యాపకం, అన్నదావిడ. ఆయన మీద ఆవిడకి ఆధిపత్యం ఉన్నట్లు - మరీ ఎక్కువ కాకపోయినా. ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. ఆవిడ ఆయన మీద ఆధారపడింది. అందువల్ల ఆయన పైన ఆధిపత్యం చూపించకుండా ఉండలేదు. ఆవిడకి పిల్లల్లేరు కనుక ఆవిడ తీర్చుకోదలుచుకున్నదంతా ఆయనతోనే. కానీ, ఆయనకి ఆ శక్తి లేదు. ఆవిడే అన్నీ నిర్వహించాలి. అందుకే ఆవిడకి నిరాశ. ఆయన ఆఫీసులో అన్నీ చాలా కట్టుదిట్టంగా ఉంచుతాడనీ, నిరంకుశంగా ప్రవర్తిస్తాడనీ. కాని ఇంట్లో మాత్రం మెత్తగా ఏమీ పట్టించుకోకుండా ఉంటాడనీ ఆవిడే చిరునవ్వుతో చెప్పింది. ఆయన ఒక పద్ధతి ప్రకారం ఉండాలని కోరుతుందావిడ. ఆయన్ని తన పద్ధతిలో బలవంతంగా ఉంచాలని చూస్తోంది - ఎంతో సరళంగానే అయినా. ఆయన ఆవిడ అందుబాటులోకి రావటం లేదు. ఆవిడకి తను ఆధారపడటానికీ, తన ప్రేమ కురిపించటానికీ ఎవరూ లేరు.
యథార్థం కన్న మనకి ఊహే ఎక్కువ ముఖ్యం. ఎలా ఉండాలో అనే ఊహకి ఉన్నంత విలువ వాస్తవంగా ఉన్నదానికి ఉండదు. ప్రస్తుతం కన్న ఎప్పుడూ భవిష్యత్తే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. ఊఃహారూపం, సంకేతం వాస్తవమైన దాని కన్న గొప్పగా ఉంటాయి. వాస్తవమైన దాన్ని ఊహారూపంలో గాని, ఒక నమూనాతో గాని, కప్పిపెట్టి ఉంచుతాం. ఆ విధంగా ఉన్నదానికీ, ఉండాలనుకున్నదానికీ వైరుధ్యాన్ని సృష్టిస్తాం. ఉండాలనుకున్నది ఊహ మాత్రమే, కల్పితమైనది మాత్రమే. అందుచేత వాస్తవమైన దానికీ, భ్రమకీ మధ్య సంఘర్షణ - కేవలం వాటి మధ్య కాదు, మన లోపలే. మనకి వాస్తవికత కన్న భ్రమే ఇష్టం. ఊహ ఎక్కువ ఆకర్షణీయం గానూ, తృప్తికరంగానూ ఉంటుంది. అందుకే దాన్ని గట్టిగా పట్టుకువదలం. ఈ భ్రమే నిజమై, వాస్తవమైనది అబద్ధమైపోతుంది. ఈ నిజం అనుకునే దానికీ, వాస్తవమైన దానికీ మధ్య జరిగే సంఘర్షణలో చిక్కుకుంటాం మనం.
ప్రయత్న పూర్వకంగానో, అనాలోచితంగానో మనం ఎందుకు ఊహని పట్టుకుని వదలకుండా వాస్తవమైనదాన్ని అవతలికి తోసేస్తాం? ఊహగాని, నమూనాగాని స్వయంకల్పితమే. అదొక రకమైన స్వీయ ఆరాధన - ఆత్మని శాశ్వతం చేసుకోవటం. అందువల్లనే అది తృప్తికరంగా ఉంటుంది. అధికారం చెలాయించటానికీ, గట్టిగా పట్టుపట్టటానికీ, మార్గదర్శకత్వం వహించటానికీ, తీర్చిదిద్దటానికీ ఊహ శక్తినిస్తుంది. ఊహ స్వయంకల్పితం కావటం చేత తన్ను తాను ఎప్పుడూ వదులుకోదు. తన్ను తాను ముక్కలుగా చేసుకోదు. అందుకని ఒక ఆదర్శంగాని, ఊహగాని ఆత్మని సంపన్నయుతంగా చేస్తుంది. దీన్ని ప్రేమ అని కూడా అనుకుంటారు. నా కొడుకునీ, నా భర్తనీ ప్రేమిస్తున్నాను. వాళ్ళు ఇది అవాలి, అది అవాలి అని కోరుతున్నాను. ఇప్పుడున్నట్లుగా కాక, వేరే ఏదో అవాలని కోరుతున్నాను.
ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలంటే ఊహనీ, ఆదర్శాన్నీ అవతలికి తోసెయ్యాలి. ఉన్నదాన్ని అర్ధం చేసుకోవటం తక్షణం అవసరం కాదనిపించినప్పుడే ఊహని అవతలికి తోసెయ్యటం కష్టమవుతుంది. స్వయం కల్పితమైన ఊహ ఉన్నదాని కన్న ఎక్కువ సంతృప్తికరమైనది కాబట్టి ఉన్నదానికీ ఊహకీ మధ్య మనలో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఉన్నదాన్ని, అంటే వాస్తవమైనదాన్ని ఎదుర్కోవలసి, వచ్చినప్పుడే ఆ ఆదర్శం ముక్కలవుతుంది. అందుచేత ఊహని ఎలా వదిలించుకోవాలన్నది కాదు - వాస్తవమైన దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది అసలు విషయం. సంతృప్తిని కలిగించే ప్రక్రియని, స్వీయ ప్రకృతిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వాస్తవమైన దాన్ని ఎదుర్కోవటం సాధ్యం.
మనమంతా సాఫల్యాన్ని అపేక్షించే వాళ్లమే - ఏ రకంగా అపేక్షించి నప్పటికీ, ధనం, హోదా, పిల్లలు, భర్త, దేశం, ఆదర్శం, సేవ, త్యాగం, అధికారం చెలాయించటం, అణచి ఉంచటం - ఈ విధంగా. కాని స్వీయ సాఫల్యం పొందటం అంటూ ఉందా? సాఫల్యం పొంద కోరినది ఎప్పుడూ స్వయంకల్పితమే కదా - తాను ఎంచుకున్నదే కదా. అందుచేత సాఫల్యం పొందాలనే తపన ఆత్మని శాశ్వతం చేసుకునే విధానమే. వ్యక్తంగా గాని, అవ్యక్తంగా గాని సాఫల్యం పొందే విధానం తాను స్వయంగా ఎంచుకున్నదే. అది సంతృప్తి చెందాలనే కోరికపైన, ఆ సంతృప్తి శాశ్వతంగా ఉండాలనే కోరికపైన ఆధారపడి ఉంటుంది. అందుచేత కోరికను శాశ్వతం చేసుకునే మార్గాన్ని ప్రయత్నించటమే స్వలాభాన్వేషణ. కోరిక అశాశ్వతమైనది. దానికి ఒక స్థిరనివాసం లేదు. అది కావాలని పాకులాడుతున్న దాన్ని కొంతకాలంపాటు కొనసాగనివ్వవచ్చు. కాని, కోరిక అనేదానికే శాశ్వతత్వం లేదు. దీన్ని మనం అనాలోచితంగా గ్రహిస్తాం. అందువల్లనే ఊహనీ, నమ్మకాన్నీ వస్తువునీ, సంబంధాన్నీ శాశ్వతం చేసుకోవాలని ప్రయత్నిస్తాం. అది కూడా అసంభవం కాబట్టే అనుభవించేది అనే శాశ్వతమైన అంశాన్ని సృష్టిస్తాం. "నేను" అనేదాన్ని కోరిక నుంచి వేరు చేస్తాం. ఆలోచించే దాన్నీ, ఆలోచననీ వేరు చేస్తాం. ఈ విభేదం నిజానికి అసత్యమైనది. ఇది భ్రమకి దారితీస్తుంది.
శాశ్వతత్వాన్ని కోరటం స్వీయ సాఫల్యం కోసం అనంతంగా ఆక్రోశించటమే. ఆత్మ ఎప్పుడూ సాఫల్యం పొందలేదు. ఆత్మ అశాశ్వతమైనది. దేనిలో అది సాఫల్యాన్ని కోరుకుంటున్నదో అది కూడా అశాశ్వతమైనదే అవుతుంది. ఆత్మ అదేవిధంగా కొనసాగితే అది వినాశమే. ఎందువల్లనంటే, అందులో పరివర్తన చెందే అంశంగాని, కొత్త ఊపిరి గాని ఉండదు. కొత్తది సృష్టింపబడాలంటే ఆత్మ అంతమొంది తీరాలి. ఆత్మ అనేది ఒక ఊహ. ఒక నమూనా, ఒక జ్ఞాపకాల మూట - సాఫల్యాన్ని కోరే ప్రతి ఊహనీ, అనుభవాన్నీ మరికొంత వరకు కొనసాగించటమే. అనుభవం ఎప్పుడూ పరిమితం చేస్తుంది. అనుభవించేది ఎప్పుడూ అనుభవం తన్ను తాను విడదీసుకుంటూ, వేరుచేసుకుంటూ ఉంటుంది. అందుచేత అనుభవం నుంచీ, అనుభవం పొందాలనే కోరిక నుంచీ స్వేచ్ఛ లభించాలి. అంతర్గతమైన దారిద్ర్యాన్ని శూన్యతనీ కప్పిపుచ్చే మార్గమే సాఫల్యం. సాఫల్యంలో దుఃఖము, బాధా ఉంటాయి.