మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/అనుభూతి, ఆనందం
85. అనుభూతి, ఆనందం
మేము సముద్రంపైన బాగా ఎత్తులో ఉన్నాం. ఇంజన్ల చప్పుడులో గాలిగొట్టం చేసే రొదలో మాట్లాడటం కష్టమవుతోంది. అదీకాక, కొంతమంది కాలేజి కుర్రాళ్లు అ ద్వీపంలో జరగబోయే క్రీడా సమావేశానికి వెడుతున్నారు. వారిలో ఒకతని దగ్గర "బాన్జో" ఉంది. దానిమీద ఎన్నోగంటలసేపు వాయిస్తూ పాడాడు. తక్కిన వాళ్ళని పురికొల్పగా, వాళ్లంతా కలిసి పాడారు. "బాన్జో" ఉన్న కుర్రవాడి గొంతు బాగుంది. అవి "క్రూనర్లూ", "కౌబాయ్"లూ పాడేవీ, "జాజ్" సంగీతమూను. అంతా బాగా పాడారు అచ్చు గ్రామఫోను రికార్డులో లాగే. అదొక చిత్రమైన గుంపు. వాళ్లు ప్రస్తుత గురించే ఆలోచిస్తారు. ఆ క్షణంలో ఆనందించటం తప్ప వాళ్లకింకో ఆలోచన ఉండదు. రేవులో అన్నీ సమస్యలే - ఉద్యోగం, వివాహం, వృద్ధాప్యం, మరణం. కాని, ఇక్కడ సముద్రం పైన, ఎత్తున అమెరికన్ పాటలూ, సచిత్రపత్రికలూ, నల్లని మబ్బుల్లోని మెరుపునీ వాళ్లు పట్టించుకోలేదు. సముద్రంతో బాటు వంపు తిరిగిన నేలని గాని ఎండలో దూరంగా కనిపిస్తున్న ఊరుని గాని చూడలేదు వాళ్లు.
ద్వీపం ఇప్పుడు సరిగ్గా మాక్రింద ఉంది. పచ్చగా మెరుస్తోంది, వానలో ప్రక్షాళితమై. ఆకాశం మీంచి చూస్తే ప్రతిదీ ఎంత పరిశుభ్రంగానూ, తీర్చిదిద్దినట్లూ కనిపిస్తుంది! అన్నిటికన్నా ఎత్తైన కొండ అణగిపోయినట్లుగా ఉంది. తెల్లని అలల్లో చలనం లేదు. చేపలు పట్టే మట్టిరంగు పడవ ఒకటి తెరచాపలు వేసుకుని హడావిడిపడుతోంది. తుఫాను రాకముందే చేరుకోవాలని. త్వరలోనే సురక్షితంగా చేరుకుంటుంది, రేవు దగ్గరలోనే కనిపిస్తోంది. చుట్టుతూ క్రిందికి వచ్చిన నది సముద్రంలోకి వచ్చింది - మన్నురంగూ, బంగారు వన్నే కలిసినట్లుంది. అంత ఎత్తునుంచి నదికిరు వైపులా ఏం జరుగుతుందో చూడవచ్చు. భవిష్యత్తు మరుగుపడిలేదు, మలుపు అవతల ఉన్నప్పటికీ. ఎత్తులో గతంగాని భవిష్యత్తుగాని ఉండదు. వంపు తిరిగిన స్థలం విత్తనం నాటే సమయాన్ని గాని, ఫలం అందుకునే సమయాన్ని గాని దాచి ఉంచలేదు.
పక్కసీట్లో ఉన్నాయన జీవితంలోని కష్టాలగురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. తన ఉద్యోగం గురించీ, నిత్యం ప్రయాణం చెయ్యటం గురించీ తన కుటుంబం లెక్క చెయ్యకపోవటం గురించీ, నేటి రాజకీయాల నిష్ప్రయోజనాన్ని గురించీ నిష్ఠురంగా మాట్లాడాడు. ఎక్కడికో దూరం వెడుతున్నాడు. ఇల్లు వదిలివెడుతున్నందుకు కొంత విచారిస్తున్నట్లుగా ఉన్నాడు. చెబుతున్నకొద్దీ ఆయన మరింత గంభీరంగా అయి, ప్రపంచం గురించీ, ముఖ్యంగా తన గురించీ, తన కుటుంబం గురించీ అంతకంతకు మరింత వ్యాకులపడుతున్నాడు.
"ఇదంతా వదిలేసి ఎక్కడికైనా ప్రశాంతమైన చోటుకి వెళ్లిపోవాలనీ, ఏదో కొద్దిగా పనిచేసుకుని సుఖంగా ఉండాలనీ ఉంది. నా జీవితంలో ఇంతవరకు సుఖపడ్డాననుకోను. సుఖం అంటే ఏమిటో ఎరగను. ఏదో జీవిస్తాం, పుట్టిస్తాం, పనిచేస్తాం, చచ్చిపోతాం - జంతువుల్లాగే. నాలో ఉత్సాహం అంతా పోయింది - డబ్బు సంపాదించటం తప్ప. అది కూడా విసుగెత్తిపోతోంది. నా ఉద్యోగం నేను బాగానే నిర్వహిస్తాను. మంచి జీతం సంపాదిస్తున్నా. కాని ఇదంతా ఎందుకోసమో ఏమీ అర్థం కాదు నాకు. నాకు ఆనందంగా ఉండాలని ఉంది. నేనేం చెయ్యగలను? మీ ఉద్దేశం ఏమిటి?"
అర్థం చేసుకోవటానికిది చాలా క్లిష్టమైన విషయం. గంభీర సంభాషణకిది అనువైన స్థలంకాదు.
"నా కింక మరో సమయం దొరకదని నా భయం. దిగీ దిగగానే నేను వెళ్లిపోవాలి మళ్లీ. నేను గంభీరంగా ఉన్నట్లు అనిపించకపోవచ్చు. కాని నాలో అక్కడక్కడ గంభీరమైన అంశాలు లేకపోలేదు. ఉన్న చిక్కంతా అవన్నీ ఒకచోట కూడనట్లుండటమే. మనస్సులో గంభీరంగానే ఉంటాను. మా నాన్నగారూ, మా పెద్దవాళ్లూ అంతా చిత్తశుద్ధికి పేరుపొందినవారే. కాని ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల నేను పూర్తిగా గంభీరంగా ఉండాలంటే కుదరనివ్వటం లేదు. దాన్నుంచి బయటకు కొట్టుకొచ్చాను. మళ్లీ దాంట్లోకే వెళ్లాలని ఉంది. ఈ అజ్ఞానాన్ని మరిచిపోవాలనుకుంటున్నాను. నేను బలహీనతతో పరిస్థితుల గురించి సణుగుతూ ఉండొచ్చు. అయినా కానీ, నేను నిజంగా ఆనందంగా ఉండాలని కోరుతున్నాను."
అనుభూతి ఒకటీ, ఆనందం మరొకటీ. అనుభూతి ఎప్పుడూ మరింత అనుభూతిని కోరుతుంది. అంతకంతకు దాని పరిధి విశాలమవుతుంది. సుఖానుభూతులకు అంతంలేదు. వాటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది, కాని అవి సఫలం కావటంలోనే అసంతృప్తి ఉంటుందెప్పుడూ. ఇంకా కావాలనే కోరిక ఉంటుందెప్పుడూ. ఇంకా ఎక్కువ కోరటానికి అంతుండదు. అనుభూతీ, అసంతృప్తీ వేరుకాలేనివి. ఎందువల్లనంటే, ఇంకా ఎక్కువ కావాలనే కోరిక వాటిని ఒకచోట బంధించి ఉంచుతుంది. అనుభూతి అంటే ఇంకా ఎక్కువ కావాలని కాని, తక్కువ కావాలని కాని కోరటం. అనుభూతి పరిపూర్ణం కావటంలోనే ఇంకా కావాలనే కోరిక ఉద్భవిస్తుంది. అంటే, ఉన్నదానితో అనునిత్యం అసంతృప్తి పడటమే. ఉన్నదానికీ, ఉండబోయేదానికీ మధ్య సంఘర్షణ ఉంటుంది. అనుభూతి ఎప్పుడూ అసంతృప్తే. అనుభూతికి మత సంబంధమైన దుస్తులు వేయవచ్చు. కాని ఇంకా ఉన్నట్లుగానే ఉంటుందది: మానసికమైనదిగా, సంఘర్షణగా, భయంగా, శారీరకమైన అనుభూతులు ఎప్పుడూ ఇంకా కావాలని గోలపెడతాయి. వాటికి ఆటంకం కలిగినప్పుడు, కోపం, అసూయ, ద్వేషం కలుగుతుంది. ద్వేషంలో ఆనందం ఉంటుంది. ఈర్ష్య తృప్తినిస్తుంది. ఒక అనుభూతికి అడ్డుతగిలితే అది తెచ్చే నిస్పృహవల్ల కలిగే వైరుధ్యంలోనే సంతృప్తి దొరుకుతుంది.
అనుభూతి ఎప్పటికీ ప్రతిక్రియే. అది ఒక ప్రతిక్రియ నుంచి మరొక ప్రతిక్రియకు తిరుగాడుతూ ఉంటుంది. తిరుగాడేది మనస్సు. మనస్సే అనుభూతి. మనస్సు అనుభూతులకి - సంతోషదాయకమైన వాటికీ, అసంతోషకరమైన వాటికీ నిలయం. అనుభవం అంతా ప్రతిక్రియే. మనస్సు అంటే జ్ఞాపకం, అంటే అదీ ప్రతిక్రియే కదా. ప్రతిక్రియని, అంటే అనుభూతిని తృప్తిపరచటానికి సాధ్యం కాదు. ప్రతిక్రియ ఎప్పుడూ తృప్తిగా ఉండదు. ప్రతిక్రియ ఎప్పుడూ లేని స్థితిలోనే ఉంటుంది. లేనిది ఎన్నటికీ ఉండలేదు. అనుభూతికి తృప్తి అనేది తెలియదు. అనుభూతీ, ప్రతిక్రియా ఎప్పుడూ సంఘర్షణని పెంపొందిస్తాయి. సంఘర్షణే మరింత అనుభూతి అవుతుంది. గందరగోళం గందరగోళాన్ని పుట్టిస్తుంది. మనస్సు యొక్క కార్యకలాపం, దానియొక్క అన్ని రకాల స్థాయిల్లోనూ, అనుభూతిని పెంపొందింపజేయటమే. దాని పెరుగుదలకి ఆటంకం కలిగినప్పుడు వైరుధ్యంలోనే తృప్తి పొందుతుంది. అనుభూతీ, ప్రతిక్రియా - రెండు విరుద్ధమైన వాటి మధ్య జరిగే సంఘర్షణ. ప్రతిఘటనా, స్వీకారం, లొంగిపోవటం, తిరస్కరించటం - వీటి సంఘర్షణలో సంతృప్తి ఉంది, ఆ సంతృప్తి మరింత సంతృప్తి కోసం నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది.
మనస్సు ఆనందాన్ని కనుక్కోలేదు. ఆనందం అనుభూతి లాగ వెతికితే దొరికేది కాదు. అనుభూతి మళ్లీ మళ్లీ దొరుకుతుంది, ఎందుకంటే, అది ఎప్పుడూ పోతూనే ఉంటుంది. కాని ఆనందం దొరకటం సాధ్యంకాదు. జ్ఞాపకం ఉన్న ఆనందం అనుభూతి మాత్రమే - ప్రస్తుతాన్ని సమర్ధిస్తూగాని, వ్యతిరేకిస్తూగాని కలిగే ప్రతిక్రియ. జరిగిపోయినది ఆనందం కాదు. అంతమైన ఆనందానుభవం అనుభూతి, ఎందువల్లనంటే, జ్ఞాపకం అంటే గతం, గతం అంటే అనుభూతి కనుక. ఆనందం అనుభూతి కాదు.
మీరెప్పుడైనా ఆనందంగా ఉనట్లు తెలుసునా?
"కచ్చితంగా తెలుసును, దేవుడి దయవల్ల. లేకపోతే, ఆనందంగా ఉండటం నాకు తెలిసేదే కాదు."
మీకు తెలిసినదీ, మీరు ఆనందం అంటున్నదీ అనుభవం యొక్క అనుభూతి మాత్రమే నిశ్చయంగా. అది ఆనందం కాదు. మీకు తెలిసినది గతం. ప్రస్తుతం కాదు. గతం అంటే అనుభూతి, ప్రతిక్రియ, జ్ఞాపకం. మీరు ఆనందంగా ఉన్నట్లు మీకు జ్ఞాపకం. అయితే; ఆనందం అంటే ఏమిటో మీరు చెప్పగలరా? మీరు గుర్తుకి తెచ్చుకోగలరు. కాని, అది కాలేదు. గుర్తింపు ఆనందం కాదు. ఆనందం గురించి తెలియటం ఆనందం కాదు. గుర్తింపు జ్ఞాపకం యొక్క ప్రతిక్రియ. అనేక జ్ఞాపకాలూ, అనుభవాలూ కలగాపులగం అయిన మనస్సు ఎప్పటికైనా ఆనందంగా ఉండగలదా? అనుభవించటానికి గుర్తింపే ఆటంకమవుతుంది.
మీరు ఆనందంగా ఉన్నారని మీరు తెలుసుకున్నప్పుడు ఆనందం ఉంటుందా? ఆనందం ఉన్నప్పుడు మీకు తెలుస్తుందా? సంఘర్షణతోనే చైతన్యం వస్తుంది, ఇంకా కావాలనే గుర్తింపులోని సంఘర్షణతో. ఇంకా కావాలనే గుర్తింపు కాదు ఆనందం. సంఘర్షణ ఉన్న చోట ఆనందం ఉండదు. మనస్సు ఉన్నచోట సంఘర్షణ ఉంటుంది. ఆలోచన అన్ని స్థాయిల్లోనూ జ్ఞాపకం యొక్క ప్రతిక్రియే. అందుచేత ఆలోచన తప్పనిసరిగా సంఘర్షణని పెంపొందిస్తుంది. ఆలోచన అంటే అనుభూతి. అనుభూతి ఆనందం కాదు. అనుభూతులు ఎప్పుడూ తృప్తికోసం ప్రయత్నిస్తాయి, లక్ష్యం అనుభూతి. కాని ఆనందం లక్ష్యం కాదు. దాన్ని వెతికి పట్టుకోవటానికి కుదరదు.
"అయితే, అనుభూతులు ఎలా అంతమవుతాయి?"
అనుభూతిని అంతం చేయటమంటే మరణాన్ని ఆహ్వానించటమే. కోరికలను అణచిపెట్టటం మరొక అనుభూతి. కోరికలను అణచిపెట్టటం వల్ల శారీరకంగా గాని, మానసికంగా గాని సున్నితత్వాన్ని నాశనం చేయటం అవుతుంది కాని అనుభూతి కాదు. తన్ను తాను అణగద్రొక్కుకునే ఆలోచన మరింత అనుభూతిని కోరుతుందంతే - ఆలోచనే అనుభూతి కనుక. అనుభూతి అనుభూతిని అంతం చెయ్యలేదు. ఇతర స్థాయిల్లో వేరే అనుభూతులు ఉండవచ్చు. అంతేకాని అనుభూతికి అంతమనేది ఉండదు. అనుభూతిని నాశనం చెయ్యటమంటే సున్నితత్వం లేకుండా ఉండటం, మరణించటం, చూడకుండా ఉండటం, వాసన పీల్చకుండా ఉండటం, స్మరించకుండా ఉండటం, అంటే, వేరుగా ఉండటం. మన సమస్య పూర్తిగా వేరు, కాదా? ఆలోచన ఎన్నటికీ ఆనందాన్ని తీసుకురాలేదు. అది అనుభూతుల్ని జ్ఞాపకం తెచ్చుకోగలదు. ఎందుకంటే ఆలోచన అనుభూతి కనుక. అది ఆనందాన్ని పెంచలేదు, సృష్టించలేదు. దాన్ని క్రమంగా చేరుకోలేదు. ఆలోచన దానికి తెలిసిన దానివైపుకి పోగలదు. కాని ఆనందం తెలిసినది కాదు. తెలిసినది అనుభూతి. ఏం చేసినా సరే, ఆలోచన ఆనందం కాలేదు. ఆనందాన్ని వెతికిపట్టుకోలేదు. ఆలోచనకి తన నిర్మాణం గురించీ, తన కదలిక గురించీ మాత్రమే తెలుసును. ఆలోచన తన్నుతాను అంతం చేసుకోవటానికి ప్రయత్నం చేసిందంతే, తాను మరింత విజయవంతం అవటానికీ, లక్ష్యాన్ని చేరుకోవటానికీ, మరింత సంతృప్తినిచ్చే గమ్యాన్ని చేరుకోవటానికీ మాత్రమే. ఇంకా ఎక్కువ అనేది జ్ఞానం. ఆనందంకాదు. ఆలోచన తన పద్ధతులన్నీ తెలుసుకోవాలి, దాని కపటవంచనలన్నిటినీ తెలుసుకోవాలి. తన్ను గురించి తాను ఏవిధమైన కోరికా - ఉండాలనిగాని, ఉండకూడదనిగానీ లేకుండా తెలుసుకోవటంలో మనస్సు పని చెయ్యని స్థితికి వస్తుంది. పనిచెయ్యకుండా ఉండటం మరణం కాదు. ఆలోచన పూర్తిగా పనిచెయ్యకుండా ఉండటం మరణం కాదు. ఆలోచన పూర్తిగా పనిచెయ్యకుండా అనాసక్తంగా, అప్రమత్తతతో ఉండటం. అది ఉత్తమస్థితిలో ఉండే సున్నితత్వం. మనస్సు అన్నిస్థాయిల్లోనూ ఏమీ పనిచెయ్యకుండా ఉన్నప్పుడే ఏదైనా క్రియ జరుగుతుంది. మనస్సు యొక్క కార్యకలాపాలన్నీ అనుభూతులూ, ప్రేరేపణకీ, ప్రభావానికీ ప్రతిక్రియలూ మాత్రమే, అంచేత క్రియకానే కాదు. మనస్సు ఏవిధమైన కార్యకలాపం లేకుండా ఉన్నప్పుడే క్రియ జరుగుతుంది. ఈ క్రియకి కారణం ఉండదు. అప్పుడే ఆనందం ఉంటుంది.