పరిచయము

'ఎడ్వర్డు ఫిట్సుగెరాల్డు' అనే ఆంగ్లకవి ఉమరుకావ్యాన్ని ఫార్షీనుండి ఆంగ్లభాషలోకి అనువదించి 1856 వ సంవత్సరం ప్రకటించాడు. కొంతకాలం వరకూ ఆంగ్లపండితులూ, కళావేత్తలూ దీన్ని అంతగా పాటించలేదు. మొదటి ముద్రణ ప్రతులు చెత్త పుస్తకాలతో పాటు అణాకూ, రెండణాలకూ అమ్ముడు పోయినవి. కాలక్రమేణా, ఉమరుఖయాము ప్రతిభ ఫిట్సుగెరాల్డు అనువాదం వల్లనే అన్ని దేశాలలోనూ వ్యాపించింది. అనేక భాషలలో ఉమరు కావ్యం అవతరించింది. ఆంగ్లములోగూడ ఫిట్సు గెరాల్డు అనువాదముకాక, ఇతరులవికూడా బయలుదేరినవి. ఫిట్సు గెరాల్డు సైతము తన అనువాదాన్ని అనేక మార్పులుచేసి మూడు నాలుగు సార్లు ప్రకటించాడు. ఇతరుల అనువాదాలు ఫార్షీ మూలమును ఎక్కువగా అనుసరించడానికి యత్నించి ఉండవచ్చును; కాని కాలం గడిచినకొద్దీ, ఫిట్సు గెరాల్డు అనువాదమే గణనకెక్కింది, ఎక్కుతున్నది గూడా. అందులోనూ, అతని మొదటి అనువాదమే ఆంగ్లభాషలో స్థిరపడిపోయింది. ఎనిమిది శతాబ్దాలనాటి ఉమరు వాక్యాలను ఉదాహరించవలెనన్నా, అతని కవితాశక్తినీ భావగాంభీర్యాన్ని చవిచూడవలెనన్నా. రసజ్ఞులందరూ ఫిట్సు గెరాల్డు ప్రధమ అనువాదాన్నే దృష్టిలో ఉంచుకుంటారు. సంస్కృత భారతాన్ని అనుసరించినా, తిక్కన భారతం స్వతంత్రకావ్యంగా వన్నె కెక్కి నట్లే. ఫిట్చు గెరాల్డు అనువాదం ఆంగ్లభాషలో స్వతంత్రకావ్యమనే కీర్తి గడించింది. 'గ్రే' కవి 'ఎలిజీ', 'టెన్నిసన్' కవి 'ఇన్ మిమోరియం' వంటి స్వతంత్ర రచనలకన్న ఈ ఫిట్సు గెరాల్డు అనువాద కావ్యమునుంచే పద్యపంక్తులనూ, విడివాక్కులనూ, సారస్వత ప్రియులు, సామాన్యపౌరులూ గూడ ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారు. ఫిట్సు గెరాల్డు సూక్తులు ఆంగ్లసుడికారంలో లీనమైనవి.

అసలు ఉమరుకావ్యంలో ఉన్న ఘనత ఏమిటి? తరతరాల నుండీ అన్ని దేశాలవారూ అతన్ని మెచ్చుకుని పదేపదే అతని పద్యాలను ఉదాహరించడ మెందుకు? “ఉమరుఖయాము సంఘాల" లోచేరి రసజ్ఞులు ఉమరు సందేశాన్ని తనివితీర - ఉమరు మధువును క్రోలినట్లే-ఆస్వాదించడ మెందుకు? మానవ హృదయంలో సృష్ట్యాది నుండీ అణిగియున్న సందేహాలనే, ఆవేదనలనే ఉమరు తన కావ్యంలో బహిర్గతం చేశాడు. ముఖ్యంగా, “కలడు కలండనెడి

వాడు కలడో లేడో” అన్న భయంకరమైన ప్రశ్నను గజేంద్రుడితో పాటు, సంశయగ్రస్తులైన సర్వమానవులతో పాటు, ఉమరుకూడా వేశాడు. ఆంధప్రాయమైన మూఢనమ్మకంతో తృప్తిచెందక, దీని అంతు కనుక్కోవలెనని జీవితమంతా పాటుపడ్డాడు. పండితులతో, వేదాంతులతో తర్కించాడు. అతని సందేహం తీరలేదు. వెళ్లినదారినే తిరిగి వచ్చినట్లయింది, అతనికృషి. ఉమరు భాషావేత్త, జ్యోతిశ్శాస్త్రంలో నిధి; వేదాంతులతో చెలిమిచేసినాడు; ముందు వెనుక లాలోచించకుండా అవివేరులవలె నాస్తికవాదంలోకి దిగలేదు. కాని, అప్రత్యక్షమై, అనుభవదూరమైన విషయాన్ని గూర్చి అంతులేని తర్కంలోకి దిగడం వృధాప్రయాస అనుకున్నాడు. “ధర్మమూర్తీ, దయాస్వరూపుడూ, అయిన మహావ్యక్తి ఈ సృష్టినంతా శాసిస్తున్నట్లయితే, ఆతడే సర్వాన్నీ చక్క పెట్టుతాడు; అన్యాయంగా, నిరంకుశంగా మనలను నరకకూపంలోకి త్రోయడు. అంతా శుభంగానే పరిణమిస్తుంది. ఇంతకన్న మనస్సును చీకాకు పెట్టుకోవడమెందుకు ?" ఇదే ఉమరు దృష్టి.

జీవితంలో కష్టమూ ఉన్నది; సుఖమూ ఉన్నది. సృష్టిలో అందవికారమూ ఉన్నది; అందమూ ఉన్నది. కండ్ల ఎదుట ఉన్న అందాన్ని చూచి సంతోషించడమూ, మనసుకు న్యాయంగా అందు

బాటులో ఉన్న సౌఖ్యాన్ని అనుభవించడమూ తప్పుకాదే ! గులాబి
పుష్పంలోని లావణ్యం నశిస్తుందనీ, ప్రియురాలి వదనంలోని కాంతి
తగ్గుతుందనీ, మధుపాత్రలో మధువు ఇంకిపోతుందనీ ఎవరికి తెలి
యదు? ఈ సౌఖ్యమూ, ఈ సౌందర్యమూ క్షణికమే కావచ్చును.
అంతమాత్రంచేత, ఆక్షణములోనే వాటిని ఎందుకు అనుభవించ
కూడదు? ఇది కేవలం విషయవాంఛానిమగ్నత కాదు. వివేకీ,
రసపిపాసుపూ, అయిన సత్పురుషుని సౌందర్యోపాసన. గమ్య
స్థానానికి ఇదికూడ ఒక మార్గమేమో!

ఉమరు 'మధువు ' 'పానపాత్ర,' 'ప్రియురాలు,' వంటి మాట
లను వాడినప్పుడు, వాటికి వేదాంతపరమైన గూఢార్థముండి తీరవలె
నని వాదించేవారు కొందరున్నారు. జీవాత్మ పరమాత్మల పరస్పర
సంధానమునుగూర్చిన 'సుఫీ'ల సిద్ధాంతాలనే ఉమరుకూడ తన
కావ్యంలో చేర్చాడని వీరి నమ్మకం.

కాని, 'సుఫీ 'లంటే ఉమరుకు గిట్టదు. వారుకూడా అతని నిరస
నకు గురియైన “డెబ్బదిరెండు శాఖల " లోనివారే. అంతరార్ధంతో
నిమిత్తంలేకుండ, స్పష్టంగా పై కికనుపిస్తున్న అర్థమే సరియైన
దని ఉమరు కావ్యాన్ని పరిశీలించిన పండితులలో అనేకమంది అభి
ప్రాయ పడుతున్నారు.

ఆంగ్లానువాదంలో కొన్ని చోట్ల, ఫార్షీ మూలంలోలేని భావాలు
చేర్చబడినవి. 58-వ పద్యం చివర, సృష్టికర్త మానవుని క్షమిం
చడమే కాకుండా అతనివల్ల తానే క్షమాపణ పొందవలెనన్న భావం
ఫిట్సు గెరాల్డుదే. అదేవిధంగా, 50 వ పద్యంలో " సర్వమూ
ఆతడే ఎరుగును" అని భగవంతునిగురించి చెప్పిన భావంకూడా
ఫిట్సు గెరాల్డు స్వంతమే. ఆంగ్లకవి, ఫార్షీ కావ్యాన్ని చక్కగా
పఠించి, హృద్గతంచేసుకుని, తనలో భాసించినరీతిని అనువదించాడు.

శ్రీరాయప్రోలు సుబ్బారావుగారు ఫిట్సు గేరాల్డు మొదటి
ఆంగ్లానువాదాన్ని అనుసరించారు. ఆంగ్లములోని భావాలను చాలా
సరసంగా తెనుగులోకి తేగలిగినారు. కొన్ని చోట్ల, తమ ప్రతిభా
విశేషంచేత, క్రొత్త అందాలు సమకూర్చినారు. ఉదాహరణంగా
కొన్ని చూపుతాను, 3-వ పద్యంలో, ఆంగ్లంలో :

“....Open then the door" అన్న వాక్యాన్ని,

"....ఎందుల కూరక యాలసింత్రు రారేమి కవాటముల్
తెరవరేమి?....." అని తెనిగించారు. 23-ప పద్యం చివరపాదం :

“'Sans Wine, sans Song, sans Singer, and-sans End ! "

అన్నవాక్యాన్ని,

".....మధువెండును పిమ్మట గాన మాగు గాయనులును
నిద్రవోదురు లయశ్రుతులున్ చెవికంద వాపయిన్" అని ఎంతో
రసవంతంగా వివృతంచేశారు. 51-వ పద్యంలో :

"Nor thy Tears wash out a Word of it" అన్నచోట,

"...... ఆలిఖితంబున నొక్క ముక్కయున్ చెఱగదు నీదు
బాష్పములు చెర్వయి వాగయి వెల్లిపోయినన్," అని అనువదిం
చారు. ఈ సందర్భాలన్నిటిలో శ్రీ సుబ్బారావుగారి తెలుగు
పద్యాలు చదివి చదివి మహదానందాన్ని పొందినాను. వీరు తమ
కావ్యమంతా చంపకమాల, ఉత్పలమాల వంటి వృత్తాలలో వ్రా
శారు. ఆంగ్లంలోని ఫిట్సు గెరాల్డు పద్యాల నడకకు సాధ్యమైనంత
సామీప్యంలో ఉన్నవి మన వృత్తాలే.

ఇంకొక విశేషం. ఫార్షీలోగాని, ఆంగ్లంలోగాని లేని ఒక
నూతన పద్ధతి వీరి కావ్యంలో కనిపిస్తున్నది. ఉమరు తన కావ్యాన్ని
ఒక్కసారిగా వ్రాయలేదు. ఎప్పుడో బుద్ధిపుట్టినప్పుడు ఏవో కొన్ని
భావాలను ప్రకటించేవాడు. వేమనపద్యాలవలెనే, ఉమరు పద్యాలు
ఐక్యత (Unity)గల కావ్యంగా ఏర్పడవు. శ్రీ సుబ్బారావుగారు
చాలావరకు ఉమరు తన ప్రియురాలిని సంబోధించినట్లుగా ఒక

సంకేత మేర్పరుచు కున్నారు. ఉమకు తన ఊహలనూ, అనుభవా
లనూ అందమైన పరిసరాలలో, ఎదుటనున్న ప్రియురాలితో చెప్పు
తున్నట్లు కల్పించాడు. అందుకే, మూలానికి వ్యతిరేకమైనా,
42 వ పద్యంలో :
"...an Angel Shape Bearing a Vessel on his shoulder..."
అన్న పంక్తిని,

"..... కాంచనభాండము నంసభాగమందిడి మెలమెల్ల కాలిడి
యె నేకత మీమధుశాల వాకిటన్ పడతి యొక ర్తె... .'
అని మార్చినారు. ఈ విధానంవల్ల వీరి ఆంధ్రానువాదానికి
ఐక్యతా, రసపుష్టీ సమకూరినవి.

శ్రీ సుబ్బారావుగారు ఇందులో కొన్ని పద్యాలు అనేక సంవత్స
రాలనాడే రచించారు. 1924 వ సంవత్సరం 'భారతి'లో వాటిని
ప్రకటించారు. ఈ నాటికి వారి 'తృణకంకణ ' రజతోత్సవ
ముద్రణకాగానే, దీనిని ఆంధ్రలోకానికి అందచేస్తున్నారు. ఆంగ్ల
భాషలో ఫిట్సు గెరాల్డు కావ్యంవలెనే, తెలుగులో వీరి అనువాదం
స్వతంత్ర కావ్యనున్నట్లే ప్రశంస పొందుతుంది. ఆంగ్లవాసన
లేనివారైనా, అమృతోపమానమైన వీరి కవితారసాన్ని చవిచూచి

ఆనందించగలరు. శైలియందేమి, భావప్రకటన యందేమి శ్రీ
సుబ్బారావుగారిది అందెవేసినచేయి.

ఇట్టి ఉత్తమకావ్యానికి పరిచయవాక్యం వ్రాయగలగశక్తి నాకు
లేదు. కాని శ్రీ సుబ్బారావుగారు ' లలిత ' 'తృణకంకణము'
రచించక పూర్వమే వారి స్నేహభాగ్యం నాకు లభించింది. చిన్న
నాటినుండీ పెంపొందుతూఉన్న ఈ గాఢస్నేహానికి ఏదో శాశ్వత
చిహ్నం ఉండవలెనను మా ఇరువురి కాంక్షకు ఈ పరిచయవాక్యం
ఫలితం.

నిజానికి, కవికీ చదువరికీ మధ్య ఈ రాయబారమెందుకు ?
ఇంతటితో నిలుస్తాను. ఇక 'మధుకలశా'న్ని ఆరాధించండి.

‘విశ్రాంతిమందిరం'

నంద్యాల

25 - 12 - 1938

కోలవెన్ను రామకోటీశ్వరరావు

1927 సం. డిసెంబరు 25 వ తేదీని మా 'త్రివేణి' పత్రిక
జననము, పదకొండేళ్లు నిండినవి, 'త్రివేణి' పుట్టినరోజు పండుగ నాడే
ఈ వ్యాసాన్ని వ్రాయడం శుభంకదా ! కో. రా.