మణి మాలికలు/ప్రసాద్ అట్లూరి
ప్రసాద్ అట్లూరి
ఫ్లాట్ నెం. 43, ఈశ్వర్ విల్లాస్,
నిజాంపేట, కూకట్ పల్లి
హైదారాబాద్ - 500090
కలం పేరు: )-బాణం-->
వృత్తి : బిల్డర్ (నిర్మాణ రంగం)
మొబైల్ : 85000 87000
ఈ-మెయిల్: prasadatluri18@gmail.com
వెబ్: www.telugulokavithalu.com
మది(ణి) మౌక్తికాలు...
1. సుఖదుఃఖాలను వేరుగాచూస్తావే
కన్నీళ్ళైనా ఆనందభాష్పాలైనా ఉప్పగానేగా ఉంటాయి
2. ఊహలు మనసును మోసే గుఱ్ఱాలైతే
వాస్తవాలు ఎగిరి తన్నే గాడిదలు
3. ఇంకా ఎన్ని అడుగులు వేయాలి?
నన్ను వీడడానికి ... నిన్ను చేరడానికి!
4. నువ్వు లేవని తెలిసింది
నవ్వుకూడ ముఖం చాటేసింది
5. నీ వయ్యారాన్ని వర్ణిస్తూంటే
నా మాటలన్నీ ఖర్చయిపోతున్నాయి
6. నా ఊహల విహంగాలు నన్నొదలి
నీ మనసు ద్వీపానికే వలసపోతున్నాయ్!
7. పగలూ రేయీ రెండూ నాకిష్టమే
లేదంటే కలువ...పంకజం అలుగుతాయి
8. మాసిన బట్టల్లో చిరుగులు
దాయలేని దారిద్యం గురుతులు
9. ఎక్కుపెట్టిన ఇంద్రచాపంలా తను
తప్పుకోలేక తట్టుకోలేక నేను
10. మగాడి కళ్ళలో తిరిగే సుడిగుండాలు
ఎన్నటికీ తీరందాటలేని కడలి అలలు
11. నేల నిద్రకి ఉపక్రమించినట్లు ఉన్నది
వెన్నెలదుప్పటి కప్పుతోంది నింగి ప్రేమతో
12. ఆశల పల్లకిలో జీవితం ఊరేగుతోంది
బోయీనైన నన్నుచూసి జాలిగా నవ్వుతోంది
13. నీమనసు గెలిచే ధ్యాసలో పడి
నామనసు పారేసుకున్న విషయం మర్చిపోయా!
14. పగలురాత్రి చెప్పకనే చెబుతున్నాయ్
దేవుడు ఆడుతున్న దాగుడుమూతల్ని
15. నిన్ను కలసిన తొలి క్షణమే
నన్నుమరచిన మొదటి క్షణం యాదృచ్చికంగా
16. ఎప్పట్నుంచో నాకు ఒక కల
వచ్చిన కలలన్నీ గుర్తుపెట్టుకొని అచ్చేయించాలని
17. పంటకి ఎరువుకోసం రైతులు క్యూల్లోనా
పండించింది తింటూ జనం హోటళ్ళలోనా
18. నీ స్మృతుల సుడిగుండంలో చిక్కితే
వాస్తవం వడ్డుకి చేరటం కష్టమేసుమా!
19. పౌర్ణమికి తెల్లచీర అందాం
నెలవంకకి తెల్లంచునల్లచీర అందం
20. జీవితం ముళ్ళున్న పువ్వుల చెట్టు
తెలివిగా పూలెలా కోసుకుంటావో నీఇష్టం
21. మాటల తోటలో పరిచయమైంది ఎదకు
విరహాల వీధిలో వదిలిపోయింది తుదకు
22. స్వాతంత్య్రం వెలుగు తెస్తుందనుకొంటే
నల్లదొరల్ని నల్లధానాన్ని తెచ్చిందేమి
23. గతం కొలను తిరగ తోడుతుంటే
ప్రతి బిందువులో ప్రతిబింబమై తను!
24. అలవాటు ప్రకారం ఆరింకే లేద్దామని అనుకున్నా
స్వప్నసుందరి వచ్చి దుప్పట్లో దూరింది ఇంతలో
25. ఏమన్నా పోగొట్టుకుంటే తెగ బాధపడిపోతుంటాం
మరి మనసు పారేసుకుని మురిసిపోతామేంటి
26.నీ జ్ఞాపకాల కవాతుని ఆపవా
నా మనసు నేల ఛిద్రమవుతోంది
27. నీ ప్రేమలేఖలన్నీ తెల్లకాగితాలు అయ్యాయి
నువ్వేంటో తెలిసి తెల్లబోయిన అక్షరాలతో
28. కలల కొలనులోకి జారిపడిన ప్రతిసారీ
తనే వడ్డుచేరుస్తుంటే పేరడిగా... 'వేకువట'
29. గతానికి ఎప్పుడూ బడాయే
వర్తమానాన్ని తనే మోస్తోందని
30. నాగుండె నిండుగా జ్ఞాపకాలు
కొన్ని నీఅధరంలా తీయగా..ఇంకొన్ని నీహృదయంలా చేదుగా
31. నా గుండె ఆగిపోయేలా ఉంది
నీ జ్ఞాపకాల బరువును మోయలేక
32. 'నన్ను ప్రేమించడానికి ఎన్ని గుండెలు' అంటోంది
మీరే చెప్పండి, ఎన్నికావాలి ఒక్కటి చాలదూ
33. మూగదాని మనసుని గేలిచేస్తాం కానీ
మాటలొచ్చి మనం మాత్రం చేస్తున్నదేమి
34. నీచూపులు గుచ్చుకుంటున్నాయ్
విలుకానివా నువ్వు ....అడిగింది తను
35. నీ నవ్వొచ్చి
నా నవ్వుని చెడగొట్టింది తెలుసా
36. ఆకాశం వంగిపోయింది
బహుశా వయోభారమేమో!
37. ప్రతిదాన్ని బూతద్దంలో చూస్తావే నువ్వు
మనసు కాగితం మండిపోతుందని చెప్పానా?
38. నీమౌనమూ ఒకోసారి బావుటుంది
నీపై నాకున్న ప్రేమను తెలుసుకొనే అవకాశాన్ని కల్పిస్తూ
39. దస్తావేజులతో వచ్చింది తింగరబుచ్చి
'నా మనసుపై హక్కులన్నీ నీకే రాసిచ్చేస్తా' అన్నానని
40. జీవితాంతం బ్రతికేవాళ్ళమే అందరం
బ్రతికినంతకాలం జీవించేది ఎందరం?
41. నా మనసేమైనా ప్రేమసత్రమా..?
నీ ఇష్టమైనప్పుడు వచ్చిపోవడానికి..!
42. రాత్రి పెరట్లో రాలాయి వెండిపువ్వులు
తెల్లారేసరికి ఎవరో ఏరుకుపోయారు మొత్తంగా
43. నీగుండెల్లో కొంచెం చోటిస్తావా
ఇంటికి అద్దెకట్టలేక చస్తున్నా
44 ప్రతి పలకరింతకీ ఓనవ్వుల పువ్వు విసురుతోంది
బహుశా...తను వసంతుడి కూతురై ఉంటుందేమో!
45. అయిష్టంగానే నిష్క్రమించింది పాపం ప్రేమ
మనమధ్య తనకిక చోటులేదని తెలుసుకున్నాక
46. గతించిన కాలములో గడించిన అనుభవమంతా
రాబోయే రోజుల్లోకాబోయే ములధనమేగా|
47. రహదారి నిండా రాలినపూలే
మానవత్వాన్ని ఈదారినే తీసుకుపోయారా|
48. అందరూ తిడుతున్నారు తెలుసా
అక్షరాలన్నీ నీకోసమే ఖర్చుచేసేస్తున్నానని
49. నీపరిచయంలోని మాధుర్యమేగా
నాకు మదుమేహాన్ని పరిచయం చేసింది
50. ఎంత విచిత్రం!
నువ్వులేని నీలో నేనుండటం. నేను లేని నాలో నువ్వుండటం
51. నీ తలపుల తాకిడి తీవ్రతకి
నామది తలుపులు బద్దలయ్యేలా వున్నాయి
52. వేకువ వళ్ళు విరుచుకుంటోంది
చీకటి చాపను చుట్టేసి... దిక్కుల చాటుకి విసిరేసి
53. నాకలల్ని పండించుకోవాలి
నీ హృదయాన్ని కౌలికిస్తావా?
54. రాతిరంతా గస్తీ తిరుగుతాడు చందురుడు
కలువబాల మనసు ఎవరైనా కొల్లగొడతారేమోనని
55. నా హృదయాన్ని సిద్దం చేసా
నీ ప్రేమ వంగడాన్ని సాగు చేయడానికి
56. నామనసుకి వైధవ్యం ప్రాప్తించింది
చచ్చిపోయిన నీప్రేమ కారణంగా
57. గుడిమెట్లపై ఎదురుపడతాయేమో ప్రతిరోజూ
పాపం పుణ్యం, వస్తూ ఒకటి పోతూ ఇంకొకటి
58. అప్పుడే తెల్లారిందా మళ్ళీ!
మార్నింగువాక్కి వచ్చేశావు గుండెల్లోకి
59. నా గుండెకు ఊబకాయం వచ్చేలావుంది
నీ మధురస్మృతులు అపరిమితంగా రుచిచూస్తుంటే
60. నామనసుకు ఆజ్ఞలు జారీచేస్తున్నావ్
హృదయపు సింహాసనంపై కుర్చోపెట్టుకున్నాననేగా
61. పాపం, ఏమి బాకీఉన్నాడో
చుక్కలన్నీ చంద్రునిచుట్టూ తిరుగుతున్నాయ్
62. ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయింది
నీ జవాబురాని .. నా జీవితం
63. అక్షరాలను ఎంతలా మచ్చిక చేసుకున్నావ్!
ఎప్పుడూ నీగురించే వ్రాయానికి ఇష్టపడుతున్నాయ్
64. చీకటి వెలుగుల జీవన వేదికపై
కష్టసుఖాల నాటకం ఆద్యంతం వైవిధ్యభరితం
65. చూశావా, ఎన్ని మధురానుభూతుల్ని విరబూస్తోందో
నాహృదయంలో నువ్వు నాటిన ప్రేమమొలక
66. నా ప్రేమని ముడుపు కడుతున్నా
నీ దర్శనానికి సమయం కుదరటంలేదని
67. కన్నీళ్లను తుడవటం తెలిసిన చేతులున్నవాడికి
కన్నీళ్ళు పెట్టించకుండా చూసుకునే మనసుండదా
68. నీ జ్ఞాపకాల చిక్కుముడుల్ని విప్పవా
నా గతాన్ని నీనుంచి విడిపించుకోవాలి
69. నీమనసులో ఏముందో తెలుసుకోడానికి
ఎన్ని ఊసుల ఉపగ్రహాల్ని పంపాలి నీహృదయం పైకి
70. ఎంతటి నిర్దాక్షిణ్యం
నా మనసుని అన్యాక్రాంతం చేస్తున్న నీ తలపులకి!
71. నా మనసు పుస్తకం పేజీలు తిరగేస్తుంటే
ఎదురైన ప్రతి అక్షరమూ నీగురించే అడుగుతోంది
72. కన్నీళ్ళనే కానుకగా ఇచ్చిపోతుంది ఎందుకనో
తను గుండెల్లోకి వచ్చిన ప్రతిసారీ..!
73. నీచూపులతో చుట్టరికం కుదిరింది
బ్రహ్మముడితో బంధాన్ని బలపర్చుకుందామా
74. వసంతంలా విరబూసిన నా ప్రేమకి
శిశిరాన్ని పరిచయంచేసిన ఘనత నీదే
75. అలుపెరుగని పయనం కాలానిది
అడుగడుక్కీ మరణం క్షణానిది
76. రాత్రి డాబాపై కురిసిన వెన్నెలవాన
తెల్లారేసరికి ఇంకిపోయింది చుక్క మిగలకుండ!
77. మీఅమ్మాయికి సిగ్గెక్కువా
ఆహా.. కాలిబ్రొటనవేలు సగం అరిగిపోతేను
78. రాజకీయ క్రీడ
ఎవరెవరితో ఆడుతున్నారో తెలియదు చూసేవాడికి
79. నా ఆశల్ని నిమజ్జనం చేస్తున్నా
లోతు తెలియని కన్నీటి జలాశయంలో
80. అదృష్టం తీరం తాకేవరకూ ఆగవులే
కష్టాల కడలిలో అవస్థల ఆలలు
81. ఇంత మత్తుగా ఉంటోంది!
నీప్రేమలో.. క్లోరోఫాం కలిపావా!
82. ఎన్ని నిఘంటువుల్ని మింగేసుంటావో చిన్నప్పుడు
నీచూపుల్లో ఇన్నిన్ని అర్ధాలు దొరుకుతున్నాయ్
83. అనుబంధాల్లో ఆత్మీయత తగ్గినప్పుడు
బంధాలన్నీ పలుపుతాళ్ళగానే తోస్తాయి
84. నా జీవిత నవలకి నాయికవి నువ్వు
నా మనసు పుస్తకానికి ముఖచిత్రానివి నువ్వు
85. నా గుండె గదుల్నిండా
తీపి జ్ఞాపకాల ధాన్యాలు, అన్నీ నువ్వు నింపినవే
86. నేల రాలిన పూలమని చులకనేల
దైవాన్ని పూజించని తప్పు మీదికాదా
87. చివరిబెంచి కుర్రాడినే తరగతిలో
ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడినయ్యాగా నీప్రేమలో
88. నీ నిర్లక్ష్యపు చూపులని త్రిప్పుకోవా
నా మధుర స్మృతులు మాడిపోతున్నాయ్
89. నీకన్నుల్ల్లో ఉదయాన్నే ఉదయించా
సాయంత్రానికల్లా అస్తమింపజేస్తావని తెలియక
90. ఏ న్యూటనూ చెప్పలేదే..?
నీ గురుత్వాకర్షణ శక్తి నానుండి నన్ను లాక్కెళుతుందని..!
91. గుడిమెట్లపై పేదరికం గుడ్డలు పరిచింది
దేవుని పక్షపాతానికి పరిహారం కోరుతూ
92. పల్లెలు వెలవెలబోతున్నాయ్... బ్రతుకుల్లాగ
పట్టణాలు ఇరుకైపోతున్నాయ్... మనసుల్లాగ
93. నిన్ను నువ్వు తీసుకున్నంత సులువుగా
నన్నూ నాకు ఇచ్చేయగలవా యధాతధంగా
94. దరహాసంతో పెంచావ్ పరిచయాన్ని
పరిహాసంతో విరిచావ్ హృదయాన్ని
95. పరిచయాలు కావాలా
మనిషివని చెప్పడానికి..మానవత్వం చూపడానికి
96. మనసు ప్రమిదలో ప్రేమదీపం వెలుగుతోంది
తలపుల తైలాన్ని మురిపంగా వంపుకుంటూ
97. ఆనందం తనకు అమరత్వం కావాలంది
చిరునవ్వై నీ పెదవులపై చేరిపొమ్మన్నా
98. వెన్నెల కళ్ళాపి జల్లుతోంది జాబిల్లి
చుక్కల్ని పట్టుకొచ్చి ముగ్గులు వేస్తుందేమో
99. శ్రద్దగా వినవే!
నీ ముంగురులు ముచ్చటించేది నాగురించే
100. 'నిన్న' అలిగింది నా మీద
నాతో తనని నేటికి తీసుకురాలేదని
101. నీపేరు 'లతే'కదా?
అలవోకగా అబద్దాలల్లేస్తుంటేను!
102. నీ మనసులో చోటడిగితే తప్పేంటి?
నా మనసుని పారేసుకున్నది నీకోసమేగా
103. మల్లెలు తేలేదని అలిగినట్టుంది
మందారాలు పూయిస్తోంది కళ్ళల్లో
104. దస్తూరి బాగుందని ప్రేమించిందంట
జాతకాలు కుదరట్లేదు విడిపోదామంటోంది
105. గమ్యంలేని గాలిపటమైంది మనసు
నీఅభిమానపు దారం తెగిపోయాక
106. ఊరబావి గిలక శబ్దం మూగబోయింది
ఊరికొచ్చిన కర్మాగారం రాకాసి కేకలకి
107. ఆడపిల్లవేనా నువ్వసలు అన్నానని
బుగ్గన సిగ్గుల ముగ్గులేసి మరీ చూపించింది చెలి!
108. వెన్నెల మత్తుగా నవ్విందంటే
చీకటి చిత్తుగా ఓడిపోవలసిందే
109. నీ పెదవులు తియ్యదనం ఎంతో
నీ చిరునవ్వుని చూస్తే తెలుస్తుంది!
110. నిన్నీ పూతోటలోకి రావద్దంటే వినవు
నీనవ్వుల్ని పువ్వుల్ని వేరుచేయలేక చస్తున్నా
111. ఓ క్షణం క్షమాపణ అడిగింది
నిన్ను నానుండి దూరం చేసినందుకు
112. ఎదురుచూపుల కాగడా ఆరిపోయింది
నీ నిర్లక్ష్యపు గాలిదుమారానికి
113. ముదనష్టపు రాజకీయాలు ఇంకెన్నాళ్ళు?
మేనిఫెస్టోల కర్చీపుతో కళ్ళుతుడుస్తూ
114. మండుతున్న గుండెపై
మంటలార్పుతున్న ఫైరింజను నీళ్ళులా...వెన్నెల
115. మాటి మాటికి గుండెల్లో గుడారాలేస్తావ్
అదేమన్నా పర్యాటకప్రాంతమా విహారానికి రావడనికి!