భోజరాజీయము/సప్తమాశ్వాసము

శ్రీ

భోజరాజీయము

సప్తమాశ్వాసము

శ్రీశ్రితవిపులోరస్థల!
యాశ్రితజనపారిజాత! యానందసుధా
మిశ్రితమానస! నిగమప
రిశ్రితఫలపాకరూప! శ్రీనరసింహా!

1


ఉ.

 ప్రీతి యెలర్పఁగా నవధరింపు భవద్విమలాంశజుండు వి
ఖ్యాతతపోమహాత్ముఁ డగు నత్రితనూభవుఁ డానతిచ్చు నా
భూతలనాథుతో నిటులు భోజవిభుం డడుగంగ సిద్ధుఁ డ
ర్యాతతయుక్తిఁ జెప్పెను సమంచితపుణ్యకథాప్రసంగముల్.

2


వ.

అంత నవ్విప్రుండు వంజరుని తదనంతరవృత్తాంతం బెట్టి దనిన.

3


క.

'కంజభవాన్వయదీపక!
వంజరుచరితంబు భువననర్ణ్యము విను నీ
కుం జెప్పెద' నని యాభవ
భంజని యి ట్లనుచుఁ జెప్పె బ్రాహ్మణుతోడన్.

4


ఉ.

[1]వేసవికాల మాతపమువేఁడిమిఁ గాలినఱాలమీఁదఁ బ
ద్మాసనలీలఁ గైకొమచు, నంబుదవేళ నుదాననాబ్జుఁడై
వేసట లేక ఘోరతరవృష్టిని దోఁగుచు, శీతకాల మా
యాసము నోర్చి పెన్మడుగులందు వసించుచుఁ బెక్కు వర్షముల్.

5

వ.

మహోగ్రంబైన తపస్సు చేయుచున్నంతఁ దదీయతపంబు చెఱుపనో యన
నచ్చరలేమం బోని కామినీమణిని.

6


క.

ఒక్కతెఁ దోడ్కొని యచటికి
నొక్క మహీసురుఁడు, నొక్క యుర్వీశ్వరుఁడున్,
జొక్కమగు నొక్క వైశ్యుఁడు,
నొక్క చతుర్ధుండు వచ్చి యొండొరుఁ గడవన్.

7


క.

ఆమనుజాధీశునకుఁ బ్ర
ణామము లొనరింప నతఁడు నలుగురఁ గని 'మీ
రీమగువయుఁ దగ నిచటికి
నేమిటి కి ట్లరుగుదెంచు టేర్పడఁ జెపుఁడా!'

8


వ.

అని యడిగిన నతనికి బ్రాహ్మణుం డి ట్లనియె.

9


చ.

అనయము వేశ్య యీతరుణి, యీతఁడు క్షత్రియుఁ, డేను విప్రుఁడన్,
విను వణిజుండు వాఁ, డతఁడు వెల్మయు నల్వురుఁ దొల్లి దీని ది
క్కునఁ జరియించుచుండుదుము! కొండొకకాలము చెల్ల నింతి మా
మనములఁ గల్గు ప్రేమపరిమాణ మెఱుంగఁ దలంచి యి ట్లనున్.

10


ఉ.

'నీరును బాలుఁ బోలె మన నెయ్యము తియ్యము నొంది నేఁడు సొం
పారెడు, మీఁద నా కొకటి యైనఁ బదంపడి యే మొనర్తురో
మీ' రని యొత్తి చూచుటయు మేలుగ విప్రుఁడు 'నీకు నగ్నిసం
స్కార మొనర్చి శల్యములు జాహ్నవికిం గొనిపోదు నే' ననెన్.

11


ఉ.

చచ్చినతోన చత్తు ననె క్షత్రియజాతుఁడు, వైశ్యుఁ డర్థమున్
వెచ్చము సేయువాఁడ ననె, విప్రముఖంబున మించి కాష్ఠముల్
దెచ్చి దహించువాఁడ ననెఁ దెంపున నాలవజాతియాతఁ డీ
యచ్చునఁ బల్కు నప్పలుకు లాదటఁ గైకొని యుండు నింతియున్.

12


ఆ.

అంతఁ గొంతకాల మరుగ నాయింతి కృ
తాంతుప్రోలి కరిగె, నతఁడు దోన
చచ్చె, నితఁడు ధనము వెచ్చించె, వాఁడు ద
హించె, నేను శల్యసంచయంబు.

13

సీ.

గంగకుఁ గొని పోయి కలుపుచో గంగ ప్ర
       త్యక్షమై 'నీవు బ్రాహ్మణుఁడ వకట
శూద్రశల్యములు దెచ్చుట నీకుఁ బాడియే ?'
       యనిన నేఁ బూర్వవృత్తాంత మెల్ల
జెప్పి నాయెడఁబాటు దప్పక యట్లు దె
       చ్చితి నేమి సేతు నయ్యతివరూప
మచ్చొత్తినట్లు నా యంతరంగంబునఁ
       బాయకున్నది మరుబాణములకు


ఆ.

దెప్ప మైతి ననుచు ఱెప్పలఁ గన్నునీ
రపుడు గ్రుక్కికొనుడుఁ గృప దలిర్ప
నస్థిచయముమీఁద నాగంగ యొకమందు
వైవ నిది పునర్భవంబు నొందె.

14


క.

క్షీరాంబుధిఁ దఱువఁగ మును
శ్రీరమణి జనింపఁ దోన శీతకరుండున్
బోరన పుట్టినక్రియ నీ
భూరమణుఁడు పుట్టెఁ బొలతి పుట్టుకతోడన్.

15


ఉ.

అంత నదృశ్యమై చనియె నాదివిజాపగ , యేను వేడ్క ని
య్యంతికరంబు పట్టఁ గర మెత్తఁగఁ దా నెడ సొచ్చి దీనితోఁ
బంతము దక్కి మున్ను ఘనపావకకీలల మేను వైచి యీ
యంతరమందు నీకుఁ గుటిలాలక నొప్పన చేసి పోదునే.

16


ఆ.

వలదు తొలఁగు వెఱ్ఱివాఁడ వయ్యెద వీ ల
తాంగిఁ గదిసితేని యనిన నస్థి
సంచయంబు పుణ్యజలములఁ గలిపి ప్రా
ణములు మగుడ బడసినాఁడ నేను.

17


ఆ.

నానిమిత్తమునను మానిని యిచ్చోట
బ్రతికె నింతితోడఁ [2]బరిణయింతు

నబ్జవదనమీఁద యభిలాష విడిచి నీ
కిష్టమైనయెడకు నేఁగు మంటి.'

18


వ.

అవిన నతం డుదరి యాకసంబు దాఁకి యేమీ కొంకక
యింకను నిట్ల
పల్కుమా! నాచేతికొలఁది చూతుఁ గాని, యని భుజాస్ఫాలనంబు సేయుచు
నిలిచి యదల్చె; నేనును నాధౌతోత్తరీయంబు నడుమునం జుట్టుకొని నెట్టుకొని
యుండితి; నప్పు డీ తనుమధ్య మధ్యస్థయై మమ్ము వారించి, నామనోనేత్రంబు
లకు మీ రిరువురు నొక్కవిధంబు కాని భేదంబు లేదు, వాదంబు దక్కి మన
పురంబునకు నన్నుం దోఁకొని పోయి నలుగురు చెప్పినట్లు పొం డని
పల్కెనంత.

19


క.

ఇట్టిద యగు కార్యం బని
గట్టిగ నింతిఁ గొని పోయి కతిపయతిథులం
బట్టణము సొరఁగఁ గోమటి
సెట్టియు నీరెడ్డి కొడుకుఁ జెఱి యొకవలనన్.

20


చ.

కనుఁగొని హర్ష చిత్రపులకంబులు మేనుల నివ్వటిల్ల నీ
వనితకునై కదా ధనము వంచన సేయక పాఱఁ జల్లితిం,
బలివడి బేగ కట్టియలు బండ్లకుఁ బూన్చితి నంచుఁ దారు చే
పినపను లుగడించుచును శీఘ్రగతిం గదియంగ వచ్చినన్.

21


ఉ.

'చేరకుఁ డింతి నెవ్వఁ డిటు చేరినఁ బ్రాణముమీఁద వచ్చు నం
భోరుహసంభవాన్వయుఁడు పూజ్యుఁడు గాన సహించి యుంటిఁ గా
కొరయ నన్యు లెంతటి బలాధికు లైనఁ దృణీకరింపనే
మీర లెఱుంగ రిట్లు పులిమీసల నుయ్యల లూఁగ వచ్చునే.'

22


క.

అని యా రాజకుమారుడు
కినిసి పలికె; నపుడు వారికిని మాకును నీ
వనితకు వాదము ముదిరినఁ
జని చెప్పితి మప్పురంబు సభవారలకున్.

23


వ.

చెప్పిన విని యాసభాసదు లందఱు నొండొరుల మొగంబులు చూచి యీముడి
మాచేతం దీరదు, తత్పురంబుసమీపంబున నొక్క రాజర్షి యున్నవాఁ డతని

చేతఁ జక్కనగు, నందుఁ బొండనిన మిమ్ముఁ గాన వచ్చితి, మని యంత
వృత్తాంతంబును జెప్పి యవ్విప్రుండు మఱియు ని ట్లనియె.

24


క.

'మానలువుర వర్తనములు
వీను లలర మీరుఁ దొలుత వింటిర కాదే
యీనారీరత్నము మా
లో నెవ్వరి కర్హమగుఁ [3]దెలుపరే కరుణన్.'

25


మ.

అని భూదేవుఁడు పల్క వంజరనరేంద్రాధీశ్వరుం 'డేనుఁ జె
ప్పిన మీ రండఱు సమ్మతించెదరె, యీ బింబోష్ఠి మీలోన నొ
క్కని సొ మ్మయ్యెడిఁ గాన మాన రితరుల్ కామాతురస్వాంతులై
పెనఁగం బడ్డ సమంద మయ్యెడుఁ జుఁడీ పెన్పోరులై' నావుడున్.

26


క.

వినుతయశా! తగవునకుం
జని యోడిననరుఁడు ముదిసి చచ్చిన వగవం
బని లేదు బుద్ధిమంతుల
కనునానుడి వినమె యింత యన నేమిటికిన్.

27


తే.

మీరు నిఖిలార్థవేదులు మీరు చెప్పి
నట్లు గా దని త్రిప్పంగ నగునె మాకు
ననుచు నండఱు నేకవాక్యముగఁ బల్క
వారిదెసఁ జూచి యా రాజవల్లభుండు.

28


సీ.

పూఁబోడి నెక్కటిఁ బుట్టించుటకు హేతు
       వైతి గావునఁ దండ్రి వగుదు విప్ర!
వనజాక్షి పుట్టుతోడన నీవుఁ బుట్టితి
       కాన సోదరుఁడవు క్షత్రియుండ!
యువతి గల్గినఁ బూని యుత్తరక్రియలు సే
       యుటఁ దనూజుఁడవు వైశ్యుండ! నీవు
లలనకు నున్నకాలము కూడుఁ జీరయు
       నడిపి చచ్చినఁ గట్టె లిడుటఁజేసి

తే.

నీవు భర్తవు గాఁదగుఁ జూవె శూద్ర!'
యనుచు వివరించి చెప్పిన యతనిమాట
విని రయంబున శూద్రుండు వికచవదనుఁ
డగుచు నయ్యంతిఁ జేపట్టె నాక్షణంబ.

29


చ.

కనుగొని యున్నమువ్వురును గామశరానలతప్తచిత్తులై
కనలుచుఁ బోటు బోల దని కాన కితం డొక కాఁపువాని కే
మని కొనిపోయి నిష్కరుణుఁడై నవపల్లవకోమలాంగిఁ గ్ర
క్కునఁ దగ నిచ్చె మానికముఁ గ్రోఁతికి నిచ్చినమూఢు కైవడిన్.

30


తే.

ఎంత చెప్పిన నావగింజంత భూతి
పూయువానికి గుమ్మడికాయయంత
వెఱ్ఱి గల వను నార్యోక్తి వినమె తొల్లి
యితని యవివేక మది వేఱె యెన్న నేల.

31


చ.

అదియునుఁ గాక పేరడవులందు మృగంబులఁ గూడియున్నపెన్
ముదుకని కెట్టు పుట్టుఁ దుదిముట్టిన నాగరికంపుఁజందముల్
వదలక తోడఁ జచ్చుట, సువర్ణము దానముసేఁత, ప్రేతరా
ట్సదనము చొచ్చి యున్నసతిఁ జయ్యనఁ దెచ్చుట యెందుఁ బోయెనో.

32


క.

మోపెడు [4]కట్టెలఁ గాల్చిన
కాపే యర్హుఁ డగునటె జగన్మోహనలీ
లాపరిచయదృగ్దీప్తి
వ్యాపారాపాంగ మైన యంగనఁ గవయన్.

33


వ.

అని కోపోద్రేకంబు సైరింపం జాలక యా పెద్ద నుద్దేశించి 'యోయీ! నీవు
మావేడ్క చెఱచితివి గావున వనితానిమిత్తమై వహ్నితప్తుండవు గ' మ్మని
బ్రాహ్మణుండును, నీదయితకు నీవు భ్రాతవు గమ్మని క్షత్రియుండును, నీ
కళత్రంబునకు నీవు పుత్రుండవు గ మ్మని వైశ్యుండును శాపంబు లిచ్చిన
నెడ సొచ్చి యాశూద్రుండు వారి కి ట్లనియె.

34


క.

'ఓహో! యిటు సేఁత గురు
ద్రోహ మగుట గాన నేరరుం గదే "కామాం

ధో హి న పశ్య" త్యను పలు
కూహింపఁగ నిక్క మయ్యె నుడుగక మీచేన్.

35


తే.

ఇచట మీ రిచ్చుశాపంబు లెన్ని యైన
నాక కానిండు, సత్యవ్రతైకశీలుఁ
డితఁ డనపరాధుఁ డగు క్షమియింపుఁ' డనఁగ
నతని వారించి వారికి ట్లనియె విధుఁడు.

36


'కాముకునకుఁ, బాపకర్మున, కవివేకి,
కవనిపతికిఁ, గోపవివశమతికి,
మదవిజృంభితునకు, మద్యపాయికిఁ, గ్రూర
చేతసునకుఁ దగవు చెప్పఁ జనదు.

37


వ.

అదియునుం గాక సకలద్వంద్వంబులు విడిచి సమలోష్టకాంచనుండనై యుం
డియు మీతో భాషించినదోషం బూర కేల పోవు, నైనను మీకు నాచెప్పినట్లగుం
గదా యని వాలాయించి యడిగినప్పు డియ్యకొని యిప్పు డిటు చేఁత నా
భాగ్యంబ కాక మీ రేమి సేయుదు రోపితి రేని శాపంబులు క్రమ్మరింపుం
డంతకు శక్తులు గా రేని యూరక పొం' డనిన వారు 'తండ్రీ! వేసరినవాఁడు
వెలుంగుమీఁద వేన్నీళ్ళు చల్లినట్లు నిలు పోపక పలికితిమి గాక నిన్ను శపింప
మే మెంతవార' మని యుపదారోక్తులు పలుకుచు దుప్పి పోయిరి గాని
శాపంబులు మరలింప నోప రైరి; శూద్రుండు నతనిచేత ననుజ్ఞాతుండై
యాసతియుం చానును నిజగృహంబునకుం జనియె, మఱి కొండొకకాలంబు
సనుటయు నొక్కనాఁడు.

38


క.

ఆవనమున కొక భూపతి
భావ మలర వేఁట వోయి ప్రత్యక్షభవా
నీవిభుఁడో యన నొప్పెడు
నావంజరుఁ గాంచి నమ్రుఁడై యచ్చోటన్.

39


ఉ.

కొండొకసేపు తద్విదులగోష్ఠి సుఖింపుచు నుండి యీనృపా
లుండు మహానుభావుఁ డని లోకమువారలు చెప్ప నెప్పుడున్
విందును మున్ను నాకు నిదె నేఁడు నిదర్శన మయ్యె నన్ను నీ
తండు గృతార్థుఁ జేయఁదె ముదంబున మత్పురి కేఁగుదెంచినన్.

40

వ.

అని తలంచి.

41


క.

ఆతనిఁ దనపట్టణమున
కాతతభక్తిఁ గొని పోయి యతనికిఁ బరిచ
ర్యాతంత్ర మొనర్పఁ దనూ
జాత నునుప నతినివాతసదనమునందున్.

42


క.

ఆరాజుచేత నతఁ డటు
లారాధితుఁ డగుచు నుండె, నంతట నొకనాఁ
డారామారత్నము దన
చేరువ మెలఁగంగఁ గోర్కి చిగురొత్తుటయున్.

43


వ.

విప్రాదికంబగు విటత్రయంబువలన నైన శాపంబులు దన్నుఁ బ్రేరేప [5]నాగోతి
నతిప్రీతిం జూచి వ్యంగ్యరీతి నతం డి ట్టనియె.

44


క.

పెక్కుఁదెఱంగుల నా కి
ట్లెక్కుడు పరిచర్య చేసె దీ వెప్పుడు నిం
కొక్కటియ సుమీ కడమం
జిక్కినయది తెలిసికొమ్ము శీతాంశుముఖీ!

45


చ.

అనవుడుఁ గేలు మోడ్చి వినయంబున నిట్టను నాలతాంగి 'మ
జ్జనకుఁడు మీపదాబ్జములు చల్లన కాన భవత్సమీపమం
దునిచిన నున్నదాన మఱి యొం డన నేరక సన్మునీశ్వరా!
కనుఁగొన సర్వముం గడమ గాక యొకం డని చెప్ప నున్నదే.

46


ఆ.

ఏను బాల నగుట యెఱుఁగరే నాయందుఁ
గడఁగి కొఱఁత లెన్నఁ గలరె మీరు
నోలిఁ దప్పు లైన నొప్పులుగాఁ జూడుఁ
డిట్టు లవధరింప నేల యనఘ!'

47


ఉ.

నావుడుఁ జెక్కు మీటి 'నలినస్ఫుటలోచన! మాట లేల నీ
యౌవనలక్ష్మికిన్ భటుఁడ నైతి, ననుం గరుణింపు' మంచు వాఁ
డూవిళులూరుచుం బిలువ నుత్పలగంధియు 'నోమహాత్మ! నీ
కీవిధ మెట్లు చొప్పడియె నే నొక బ్రాతియె నీదు కోర్కికిన్.

48

ఉ.

కన్నియ నేను ధర్మగతి గామి యెఱింగియు నిట్టు లానతీఁ
జన్నె?' యనన్ 'లతాంగి! యిది క్షత్రియవంశమునందుఁ జెల్లు, నా
కన్నియుఁ జెప్ప నేల నను నేల గదే!' యను వంజరుండు; ము
న్నెన్నఁడు లేని నింద యిది యె ట్లగునో యని తూలు బాలయున్.

49


ఉ.

కొమ్మపదారవిందములకుం ప్రణమిల్లె విభుండు, మేనఁ గం
పమ్ము దలిర్ప నప్పడఁతి 'పాపము గట్టకు పార్థివేంద్ర! నీ
విమ్మెయి నిప్డు వేగపడి యీలువుపెం పెడలించి పోవఁగాఁ
బిమ్మటిమాట కోర్వ ననుఁ బెండిలిగ మ్మటు లైన మే లగున్.'

50


వ.

అనిన నతం డి ట్లనియె.

51


క.

'ఇది గాంధర్వవివాహము
సుదతీ! మన కిపుడు సాక్షి సూర్యుఁడె' యన 'నో
ముదుకఁడ! నీకొద దీరిన
వదలెద వే నొల్ల' ననుఁ బ్రవాళాధరియున్.

52


క.

'ఏ నేల నిన్ను వదలుదు
మానిని! యనుమాన ముడిగి మన్నింపుము, నా
చే నొకశపథము గొను' మని
దానియకిగినట్ల చేసె ధరణీపతియున్.

53


వ.

ఇత్తెఱంగున నత్తెఱవచిత్తంబు మెత్తం జేసి చిత్తజసుఖకేళిం దేలి యుండం
దనివి వోక యాకన్నియ నెత్తుకొని పరదేశంబున కరిగి యొక్క వివిక్తదేవా
లయంబునంచు నయ్యిందువదన నునిచి, గ్రాసార్థం బాసమీపగ్రామంబునకుం
జనిన నందొక వారనారీపరిచారిక వచ్చి పరిణతవయస్కుం డయ్యు వళితపలి
తంబులం దొరయక తరుణవయస్కుండ పోలె నున్న యన్నరనాథుం జూచి
'మాయక్క యెక్కడనేని యొక చక్కనివాఁడు గల్గినం గాని కేవలనర
మాత్రుల నెల్ల నంగీకరిపదు, నేఁ డితనిం జూపి యమ్మచ్చెకంటిచేత మెచ్చు
పడయుదు,' నని తలంచి యతనిం దోడ్కొని పోయిన.

54


ఉ.

ఆతనిఁ జూచి వేశ్యయుఁ దదాగమనోచితభాషణాదులం
బ్రీతునిఁగా నొనర్చి యధరీకృతమన్మథుఁ డివ్విటుండు నేఁ

డీతఁడు నాకుఁ జొప్పడునె యే నిల నింతకృతార్థ నౌదునే
నాతికిఁ జారుభర్తయ ధనంబులు సొమ్ములు వేయునేటికిన్.

55


ఆ.

ఇతనిఁ దడవు గాఁగ నిచ్చోట నిలుపను
వీని మనసులోని వింతదనము
పాయఁ ద్రోవ నేయుపాయంబు గలదొకో
యుచితభంగి యయ్యునుండవలయు.

56


క.

అని తలంచి వెండి పలకయుఁ
గనకపుసారెలును రత్నఖచితములై పే
ర్చినపాచికలును దెప్పిం
చి నృపోత్తము నెత్తమాడఁ జీరిన నతఁడున్.

57


క.

'నీతోడ నాడఁ దీరదు
నాతీ! నానాతి నేఁడు నావెంట నతి
ప్రీతిఁ జనుదెంచి శ్రాంతిస
మేత యగుచు నొంటి నున్న దేఁ బోవలయున్.'

58


క.

అనిన విని నీకు నిప్పుడు
వవితలు లే రనుట గాదు, వచ్చిన పిదప
న్మనసార నిష్టసుఖవ
ర్తనముల నొక్కింతసేపు దడయుట కీడే.

59


క.

పోయెదవు గాని రమ్మని
యాయంబుజనేత్ర దన కరాకర్షణముం
జేయుడు నొండన నేరక
కాయజునురిగోలఁ దగులు ఖగమును బోలెన్.

60


వ.

దానితో నెత్త మాడఁ గడంగిన.

61


క.

దశవిధముల నెత్తంబుల
శశిముఖి యే నెత్త మడిగెఁ జయ్యన నది త
ద్వశ మగు ద్యూతవిధిజ్ఞులు
ప్రశంస యొనరింప నానృపతి లజ్జింపన్.

62

ఉ.

ఓటమి మీఁద వైచుకొని యూరక పోవుట యెత్తు సాల ది
య్యాట యవశ్యముం గెలుతు నంచుఁ జలంబున నాడు, నాడి యా
యాటయు నోడు, నోడి యురియాడు నిదొంగన యున్నయున్కికిం
బాటలగంధితో గెలుపఁ బాటయి యుండమికిన్ విభుం డెదన్.

63


వ.

ఇవ్విధంబున నమ్మహీపాలునకుఁ గాలవిడంబంబు సిద్ధించె, నంతఁ బౌరకాంత
యొక ర్తె యొక్కపనివెంట నారాజపుత్రి యున్న దేవాగారంబునకుం బోయి.

64


క.

పూచినతంగెడు వోలె మ
రీచి నిబిడమణిగణస్ఫురితభూషణలీ
లాచాతురిఁ జెలు వొందెడు
నాచపలాక్షిఁ గని యద్భుతాత్మిక యగుచున్.

65


ఉ.

ఎక్కడనుండి వచ్చె నొకొ యీనవనీరజకోమలాంగి తా
నిక్కడ నొంటి నుండఁ గత మెయ్యదియో శశిమౌళి మాళిపై
నెక్కినయేటితోడఁ గలహించి హిమాద్రిజ యల్గి వచ్చి యీ
చక్కటి నిచ్చెనో, యనుచుఁ జప్పుడు సేయక డాయఁ బోయినన్.

66


ఆ.

బెదరి చూచు లేఁడికొదమచూపులఁ గీడు
పఱచునట్టి తనదు మెఱుఁగుఁజూపు
లడర నెదురు వచ్చి యప్పౌరికామిని
తోడ నిట్టు లనియుఁ దోయజాక్షి.

67


క.

ఎందుల దానవు? వెలఁది! న
నుం దా నిట చించి మన్మనోనాయకుఁ డే
గె, దడవు గలదు, రాఁడే
చందమొ కాపున గదా యిచట నెచ్చోటన్.

68


మ.

 హరవిద్వేషము దక్కి మన్మథుఁడు రుద్రాక్షంబులున్ భూతియుం
బరగం దాల్చి తదీయసత్కృపకుఁ దాఁ బాత్రుండు కాఁ బూని సు
స్థిరభక్తిం జరియింపఁ జొచ్చెనన నక్షీణద్యుతిం బొల్చు సుం
దరదేహం డతఁ డేమి యయ్యెనొ కదా! తల్లీ! తలం కయ్యెడున్.

69


చ.

అనుచు వివర్ణపక్త్ర యగు నానృపపుత్రిక నూరడించి 'కా
మిని! యొకదిక్కు చన్నతుది మిన్నక క్రమ్మఱ వత్తు రమ్మ! పో

యినపని గాక, భానుఁ డదె యిమ్ములఁ బశ్చిమవార్ధికీన్ రయం
బునఁ జనుచున్నవాఁడు తమముం గడుఁ బెల్లగు నింకఁ బైపయిన్.

70


క.

చోరులు వత్తురు గాదే
క్రూరమృగావళులు వచ్చు గుడిలోపల నీ
వీరేయి యొంటి నున్కి వి
చారముగా దరుగుదెమ్ము చయ్యన నాతోన్.

71


చ.

ఎదురుగ వచ్చు నీదు హృదయేశుఁడు, నంతకు రాక తక్కినన్
సుదతి! మదీయగేహమున సుస్తి వహించుట భార మైనఁ గాం
చెద నతఁ డెందు నున్న' నని చెచ్చెర నచ్చపలాక్షిఁ గొంచు న
మ్ముదుసలి యేఁగె నంత నృపముఖ్యుఁడు వచ్చి యదృష్టభార్యుఁడై.

72


ఉ.

చిత్తము జల్లన న్మిగులఁ జేడ్పడుఁ, బెద్దయుఁ గన్నునీరు చే
నొత్తుచుఁ జూచు నల్దెసలు, నూరక యిట్టును నట్టుఁ బాఱు, నె
ల్గెత్తి పొరిం బొరిం బిలుచు, నెవ్వరు పల్కిన నాలకించు, డ
గ్గుత్తిక పెట్టు నె ట్లగు నొకో యను, నెక్కడి కేఁగెనో యనున్.

73


ఆ.

ఏను బోయి తడవుగా నున్న నబల యి
చ్చోట నాకు నెదురు చూచి చూచి
యొంటి నుండ వెఱచి యూరిలోనికిఁ బోవఁ
బోలు ననుచు మఱియుఁ బోయి వెదకు.

74


ఆ.

నిప్పు ద్రొక్కినట్లు నిలువఁ డెచ్చోటను,
నాఁడుముసుకుఁ గని మహాశతోడఁ
గూడఁ బాఱి తేఱకొనఁ జూచి, య
ప్పొలఁతి గాకయున్నఁ బుల్లవడును.

75


చ.

పలుమఱుఁ దన్నుఁ జూచి మఱి పౌరజనంబులు వీఁగి వెఱ్ఱి నా
నలయక వీథులందు నిటు లాఱడిఁ ద్రిమ్మరుచున్నయమ్మహీ
తలపతిచంద మంతయును దా విని తొల్లిటి వారకాంతయున్
వెలయఁగ నాతనిం బిలిచి వేగ వివేకము నివ్వటిల్లఁగన్.

76


క.

ఉపచారోక్తుల నాతని
యుపతాపము డిందుపఱచి యొయ్యొయ్యనఁ దా

నుపగూహనాదిసుఖముల
నపరిమితప్రీతుఁ జేయ నతఁ డ ట్లుండెన్.

77


ఉ.

అక్కడఁ బేదరాలినిలయంబుస నానృపపుత్రి నెవ్వగం
బొక్కుచు మేర లేని తలపోఁతలఁ దూలుచు నుండ, నొక్కనాఁ
డక్కమలాక్షిఁ గన్గొనియె నప్పుర మేలెడు రాజసేవకుం
డొక్కఁడు, వాఁడు పోయి యది యున్న తెఱం గెఱిఁగించె భర్తకున్.

78


ఆ.

'అవధరింపు దేవ! యయ్యంబుజానన
యొప్పు చూడ నేత్రయుగము చాల,
దాలతాంగిగుణము లభినుతింపఁగ నొక్క
జిహ్వ జాల దేమి చెప్ప నింక.

79


క.

అవ్వనజాయతలోచన
యెవ్వరిసొమ్మై వరించు నివ్వసుమతిలోఁ
బువ్విలుతుఁ డతఁడ కా కొకఁ
డవ్వల మఱి కలఁడె' యని మహాశగఁ జెప్పెన్.

80


క.

ఆరాజు వానిచే నటు
లారాజీవాయతాక్షియౌవనవిభవం
బారఁగ విని మదనాస్త్రవి
దారితహృదయుఁ డయి తగవు తలఁపని మదితోన్.

81


క.

ఆపడఁతిఁ తెం డని
పై పై దూతికలఁ బనుప భయ మందుచు 'నో
పాపపుదైవమ! తుది న
న్నీపాటులఁ బడఁగఁ దెచ్చితే యిచ్చటికిన్.

82


ఉ.

తల్లినిఁ దండ్రిఁ బాసి కులధర్మము చూడక వెఱ్ఱిదాననై
యిల్లును బట్టు డించి యిటు లేటికి వచ్చితి? వచ్చి మన్మనో
వల్లభు నిందుఁ గోల్పడితి, వాఁ డిట కెప్పుడు వచ్చు? నింతలోఁ
గల్లరిబ్రహ్మ యేది గతిగా నొనరించెనొ యేమి చేయుదున్.

83


క.

ఈనృపతి పాపకర్ముం
డే నీతనిసమ్ముఖమున కే మని పోదున్

మానము వెలి యగు ప్రాణము
మానినులకు నేమి జాతి మహి నూహింపన్.

84


క.

అని తలంచి యబల దూతీ
జనముల కి ట్లనియెఁ 'గొంత సైరణ వలదే
కనుమఱుఁగు లేక యూరక
తన వలసినచోట్ల మెలఁగుతరుణులు గలరే.

85


ఉ.

ఎప్పుడు ప్రొద్దు గ్రుంకెడినొ యించుక సైపుఁడు మీనృపాలుతోఁ
జెప్పుఁడు వేగ మేల కడుఁ జేరువ నున్నది కార్య' మంచుఁ దా
నప్పని కియ్యకొన్నయటు లాడినఁ బోయిరి వారు, నాటిరే
యప్పటుబుద్ధిబుద్ధియుతు లాడట మెచ్చఁ దొఱంగె దేహమున్.

86


క.

పుడమి నపప్రథ యగునెడఁ
బడతికి దేహంబు విడువఁ బాడియ కాదే
సడి కంటెఁ జావు మే లను
నొడువు పురాతనము గాక నూతనపదమే.

87


వ.

ఇ ట్లాసతి మృతి పొందుట విని యమ్మనుజేంద్రుం 'డిది యెట్టి పతివ్రతయొ
కాక నాచేసినధౌర్త్యంబునకు లజ్జించి ప్రాణంబు లుజ్జగించె' నని పశ్చాత్తా
పంబు నొందుచు నెట్టకేలకు నారాత్రి గడపి మఱునాఁడు దానికి నగ్నిసంస్కా
రంబు సేయ నియోగించె, నావృత్తాంతంబుఁ గర్ణాకర్ణి నాకర్ణించి వంజరుం
డది తన యింతియ కాఁ బోలు నని యాందోళించుచు వచ్చి చూచి నిశ్చయం
బగుటయు శోకాక్రాంతుం డయి.

88


చ.

'నలినదళాక్షి! నీవు నలి నావెనుకం జనుదెంచి నాకుఁ బే
రెలమి యొనర్చి తిప్పు డిటు లీ వమరావతికిం జనంగ నే
నిలుచుట పంతమే, యిపుడు నీ వెనుకం జనుదెంతు' నంచుఁ బౌ
రులు వెఱఁ గందఁగా నుఱికె స్రుక్కక వంజరుఁ డాచితాగ్నిలోన్.

89


వ.

ఇ ట్లావిప్రశాపంబునకు ననురూపంబుగా నతండు మృతుం డగుటయు, నా
వేశ్యయు 'నానిమిత్తంబై కదా వీ రిరువురు నిట్లై' రని తాను నయ్యగ్ని
యందు కూలె; నమ్మువ్వురి మరణంబులకుం గారణంబై యుండి యే నూరు
కుండుట ధర్మంబు గాదని దాసియుం దదనుగమనంబు చేసె నంతయు విని

క.

ఆరా జచ్చెరు వందుచు
నారాజసరోజముఖుల యస్థులు గంగా
వారిఁ గలిపి రం డని తన
వారిం బనుపంగఁ బోయి వారును నొకచోన్.

91


వ.

ఒక్క విప్రుండు పెద్దకాలంబు దేవి పురశ్చరణంబు చేసి తత్ర్పసాదంబున
సంజీవని వడసి యుండుట యాత్తపరంపరవలన నెఱింగి యతని యున్నెడ
కేఁగి తమతెఱంగు చెప్పి 'విప్రా! నీవు పెద్దయు నాయాసపడి గడించినదివ్య
వస్తువునకు దాత్కాలికంబై యత్యంతసుకృతప్రదంబగు ప్రయోజనంబు
సిద్ధించె, వీరలప్రాణంబు లెత్తు మిదియ నీదగు నౌషధంబునకు నిదర్శనంబు
నగు' నని ప్రార్ధించిన నతం డట్ల చేసిన.

92


క.

తారయు జ్యేష్ఠయు లక్ష్మియుఁ
దారాధీశుండు నెవ్విధంబున దుగ్ధాం
భోరాశి బుట్టి రట్టుల
యారమణులు నతఁడుఁ బుట్టి రౌషధశక్తిన్.

93


ఆ.

ఇట్లు పుట్టి యతనియింతి మన్మథవికా
రావలోకనంబు లడర నతని
చెట్ట పట్టఁ బోవఁ 'బట్టకు పట్టకు
పొలఁతి నీకుఁ దోడఁబుట్టు నైతి.

94


వ.

న న్నింక వరించుట యుచితంబు గా దూరకుండ' మనిన వెఱఁగుపడి యుండె
నంత నవ్వేశ్యయు నాలా గె ట్లనిన నతండు దాని కి ట్లనియె.

95


క.

'ధర్మాధర్మపథంబుల
మర్మ మొకని కొకఁడు చెప్పుమాటయ లోకం
బర్మిలిఁ గొని తెలియ వలదె
కర్మాకర్మైకయుక్తి గనియెడుపనికిన్.

96


క.

మదిరాక్షి! వినుము నీవును,
మదంగనయు, దాసియును సమంబు సుమీ! నా
హృదయమున' కిప్పు డనవుడుఁ
బొదలెడుకోపమున రాజపుత్రిక పలికెన్.

97

వ.

ఏ మే మీ గ్రుడ్లు దింటయుం గాక గూ డెక్కి కూసెద వీ వేశ్యయు దాసియు
నీకన్నుల కెంత ప్రియ మయన నయిరి కాక నాకు సవతుగా నిట్లు పలుక నెట్లు
నో రాడె? నీవు నన్ను వరించునప్పు డన్యకాంతాసంగమంబు సేయకుండు
టకును, నన్ను వదలకుండుటకునుం జేసినశపథంబును గాదు పఱచితి,
పాపకర్ముఁడా! నీవు శుద్దాత్ముండ వైన నిన్ని యలజ ళ్ళేల వచ్చు' నని
నిషేధించి పలికి యంత నిలువక.

98


క.

'విందుము బొంకెడుపురుషునిఁ
జండాలుం డనఁగ నీవు క్షత్రకులుఁడవై
యుండియు బొంకితి గావునఁ
జండాలత నొందు' మనుచు శాపం బిచ్చెన్.

99


క.

అన వంజరుండు 'వనితా!
నిను గదిసిన నట్ల యగుదు, నీవును ననుఁ జే
రిన నట్టులు కావలదే'
యనుచుం బ్రతిశాప మిచ్చినట్లుగఁ బల్కెన్.

100


ఆ.

పలికి తపము సేయుతలఁపున వనభూమి
కరిగె, నదియు నొక్కయడవి కరిగెఁ;
జూచి వేశ్య వనరుచును బోయె నింటికి
దాసి తనదు వెంటఁ దగిలి రాఁగ.

101


వ.

మఱియుఁ గొంతకాలంబునకు నొక్కనాఁ డవ్వంజరుండు నిజానుష్ఠానంబులు
దీర్చి వన్యఫలంబు లనుభవించునప్పు డం దేమి విశేషంబు సోఁకెనో మస్త
కంబు మొదలుకొని సకలావయంబులందును నొక్క పొర యూడి సర్పంబు
కుబుసం బూడినట్లైన షణ్మాసమాత్రబాలుండై బాలలీలల మెఱయించుచుండ
నంత నతనికాంతయు దైవవసంబున నాపైత్రోవ నరుగుచుండి యతనిం
బొడగని వీఁ డెవ్వరివాఁడో, వీని తల్లిదండ్రు లెట్లే మైరో, యామిషార్థంబు
పక్షిరాక్షసులం దెవ్వ రేని వీనిం గొని పోయి పోయి చేతప్పి పడవైచిరో,
కాక యిందు రాకకుం గారణం బేమి యని నలుదిక్కులం బరిచరించుచు నెత్తు
కొని యురంబున నొత్తుకొని.

102

క.

మే నెంతయుఁ బులకింపం
గా నప్పుడు ప్రాణనాథుఁ గౌఁగిట నిడిన
ట్లైన, మది సంశయించుచు
వానిం గొని పోయి పెంచె వనిత ముదమునన్.

103


క.

దినదిన మొక్కొక కళగాఁ
బెనుపొందెడుచంద్రుమాడ్కిఁ బెరిగె నతం డే
డెనిమిది దినములనాఁటికి
మనసిజుకైవడి నతిసుకుమారాకృతితోన్.

104


వ.

ఇట్లు సుయౌవనుండై యావనిత పై నివ్వటిలు తనకోర్కి వితర్కించి దాని
కి ట్లనియె.

105


ఉ.

'మాతవు నీవు, నిన్నుఁ గని మానస మారయ నేమి పాపమో
నాతి! యధర్మలక్షణమునం జొరఁ దాటెడు నోజ లేక, నా
కీతలఁ పేల పుట్టె నొకొ యేగతి నేఁగుదు నొక్కొ' నావుడుం
చేతులు మోడ్చి యవ్వనిత చెచ్చెర ని ట్లని పల్కె వానితోన్.

106


ఉ.

'నీవు శిశుత్వ మొంది యవనిం బడి యుండఁగ నెత్తుకొన్నమ
ద్ఛావము నిట్లయై వెఱఁగుపాటు జనింపఁగఁ దెచ్చి పెంచితిం
దేవ! నిజంబు చెప్పుము, మదీయమనోహరుఁ డైన వంజర
క్ష్మావిధు నట్ల తోఁచెదవు కావు గదా యనుమాన మయ్యెడున్.'

107


ఆ.

అనిన నతఁడు దెలిసి 'యనుమాన మేటికి
వంజరుండ నగుదుఁ గంజనయన!
వెడలఁ బడితిఁ బొమ్ము విప్రాదులగువారి
మూఁడుశాపములను ముక్తి వడసి.'

108


వ.

అనిన నయ్యతివ వాని కి ట్లను, 'విప్రాదులనువా రెవ్వరు? వారు నిన్ను
శపింపం కారణం బేమి? నీ విప్పుడు శాపవిముక్తుండ నైతిం బొమ్మనుట
యేమిటం జేసి?' యనిన నవ్విటచతుష్టయంబు వవితావాదనిమిత్తంబునం దన
సమ్ముఖంబునకు వచ్చుటయుఁ, దానుఁ దీర్చినతగవు శూద్రునకుఁ దక్కఁ
దక్కినమువ్వురకు నసహ్యం బైనం గోపించి, శాపంబు లిచ్చిన తెఱంగునుం
జెప్పి మఱియు ని ట్లనియె.

109

క.

'నీతోడఁ జచ్చి క్రమ్మఱ
నీతో జన్మించి పిదప నీవు పెనుపఁగా
నీతనయుఁడ నై పెరుగుట
నోతరుణి! త్రిశాపముక్తి నొందితి నంటిన్.'

110


క.

అని చెప్పుచు నెట కేనియుఁ
జన నుద్యోగించురాజసత్తముఁ గని య
వ్వనిత మది బెదరు గదుర న
తని కి ట్లను మోమునందు దైన్యము దోఁపన్.

111


క.

'ఝషగర్భంబునఁ బొడమిన
ఝషకేతునిఁ గాంచి సంతసము నొందినయా
ఝషకేతువనితఁ బోలితి
ఝష కేతుసమాన! చూడు సత్కృప నన్నున్.'

112


వ.

అని తొల్లి మన్మథుండు నిటలనేత్రునేత్రవహ్నివలన సమసిననాఁడు శరమా
యాడంబరుండగు శంబరుం డంబరమార్గంబునఁ బఱతెంచి తత్సతియగు రతి
నతిత్వరితగతి నెత్తుకొనిపోయి యంతఃపురంబున వైచుకొనిన నది మాయావతి
యను పేఱం దత్సంగతం బొక్కటియు వెలిగాఁ దక్కటిపను లన్నియుఁ దాన
యనుసంధించుచు, స్వసంకల్పకల్పితయు స్వమూర్తిసదృఢయు నగునొక్క
కృతకవనిత నతనికోర్కి దీర్ప నప్ప టప్పటికి నియోగించుచుఁ దన పాతి
వ్రత్యంబునకు హాని లేకుండ నిట్టు చరించుచుండఁ బెద్దకాలంబునకు ద్వాప
రాంతంబున నఖిలభువనావనగుణభ్రాజిష్ణుండగు విష్ణుండు కృష్ణుండై పుట్టిన
నప్పుణ్యమూర్తికి రుక్మిణిదేవికిఁ గాముండు ప్రద్యుమ్నుండై పుట్టుట శంబరుం
డెఱింగి యాశిశువుం గొని పోయి సముద్రమధ్యంబున వైవ నొక్కమీను
మ్రింగె, నది యొక్క వేఁటకానిచేతం దగులు వడి యాశంబరునకు వాఁడు
కానుకగాఁ దెచ్చి యొప్పింప మాయావతిచేతం దఱుగంబడునప్పుడు శుక్తి
మధ్యంబునం బొల్చు ముక్తాఫలంబునుం బోలె నాఝషజఠరకుహరంబున
నున్న బాలునిం గని యతని గూఢవృత్తి నెత్తుకొని పోయి యద్దేవి రహస్య
ప్రదేశంబున నునిచి పెనుచుచుండ నతండు సంప్రాప్తయౌవనుండై శంబరు
వధియించి శంబరారి యను పేర నిజసతీయోగసౌఖ్యంబు లనుభవించుచుండుటఁ
జెప్పు నప్పురాతనకథారూపంబు దీపింప నాడిన నతం డి ట్లనియె.

113

ఆ.

'నలినవదన! యల్లనాఁడు నీ వాడిన
మాట మఱచి తెట్లు మాలతనము
వచ్చు నన్నుఁ జేర వచ్చిన నే నింత
కోర్వ నింక నూరకుండ నిమ్ము.'

114


క.

అని యతఁడు విడియ నాడిన
'ననఘా! యింతనెగు లైన నతులితసత్యం
బున కుపఘాతక మయ్యెడు
పని కొడఁబడుదురె వివేకపరిణతు లెందున్.

115


ఆ.

నన్ను వదలకుండ మున్ను చేసినబాసఁ
దలఁప వైతి గాన దానఁజేసి
సొలసి నిన్ను నట్లు పలికితి నీవు నా
పలుకు లింత యెగ్గు పట్టఁ జనునె?

116


వ.

అది యట్లుండ నిమ్ము.

117


మ.

నరకం బైనను నాక మైన మది నానందంబు గావింపదే
పురుషుం డింతియుఁ దానుఁ గూడి చనినం భూమీశ! చండాలదు
స్తరభావం బది నాకు నీకు సమమై సంధిల్లుఁ; బ్రారబ్ధముల్
పరిభోగం బధికంబు లౌ టెఱుఁగవే పౌరాణికప్రోక్తిమై.

118


క.

కావున మన మెట్లైనను
దైవకృపం జేసి బ్రతికెదము గాని ధరి
త్రీవర! నాకోరిక వృధ
గావింపకు' మనుచు మ్రొక్కెఁ గన్నీ రొలుకన్.

119


చ.

నృపతియుఁ దత్కుతూహలము నెమ్మిఁ గనుంగొని యాత్మఁ దద్దయుం
గృప చిగురొత్త నాశశిముఖిం దగఁ గౌఁగిటఁ జేర్చి మేన ద
ట్టపుపులకల్ జనింపఁగఁ దొడంగి మనోభవకేళిఁ దేల్చె, నా
నెపమున నంత్యజాకృతులు నెట్టనఁ దాల్చిరి వార లిద్దఱున్.'

120


ఉ.

నావుడు విప్రుఁ డిట్టు లను నాకమహానదితోడ 'వంజరుం
డావల మూఁడుజన్మముల యప్పటఁగోరెను యుష్మదీయసే

నావిమలాత్ముఁ డట్టె, తుది వారక శాపము లంది యిట్టు లే
లా వివిధంబు లైన వ్యధలం బడఁజొచ్చెఁ దపంబు పెంపఱన్?'

121


చ.

అనిన 'నతండు ముక్తి వడయన్ సమయం బరుదెంచెఁ గాన యా
తనికిఁ బురాకృతంబు లగు దారుణకర్మము లొందె, నివ్విధం
బున నఘముక్తి గావలసె, భూసురసత్తమ! యట్లు గాక త
క్కిన భవబంధముల్ తెగునె కేవలకర్మనిబద్ధదేహికిన్?

122


ఉ.

కావున వాఁడు క్షత్రియుఁడు గాని తలంపఁగ హీనజాతి గాఁ
డో వసుధామరేంద్ర! యతఁ డున్నెడకుం జని చెప్పు మయ్య! నా
జీవనగౌరవం బటులు చెప్పిన సప్పుడు వాఁడు ముక్తుఁడై
పోవుఁ బ్రియాసమేతుఁ డయి పొమ్ము! సమస్తము విస్తరించితిన్.'

123


క.

అని గంగానది చెప్పిన
విని విప్రుఁడు 'తల్లి! యేఁ బవిత్రుఁడ నైతిన్.
బనివినియెద' నని మ్రొక్కుచుఁ
జని కతిపయతిథుల కతని సదనము చేరెన్.

124


ఆ.

అతఁడు నతనిరాక కత్యుత్కటప్రీతి
దనర నెదురు చూచుచునికిఁ జేసి
కన్నయదియు మొదలు గాఁగ సాష్టాంగదం
డప్రణామములు గడంగి సేయ.

125


క.

ఉర్వీసురవర్యుఁడు నా
శీర్వాదము లొనరఁ జేసి స్మితవదనుండై
'గీర్వాణుల కెన వచ్చు న
ఖర్వగుణుఁడ వీవు సవతు గలదే నీకున్.

126


ఉ.

ఏను భవన్నియోగమున నేఁగితిఁ గాశికి, గంగలోఁ గృత
స్నానుఁడ నైతి, నీదగువచస్స్థితి చెప్పితి నప్పవిత్రతో,
నానది దివ్యతేజ మొలయం దనరూపము చూపె మందహా
సాననకాంతితోడ నయనామలరోచులు మేళవింపఁగన్.

127


క.

తనుఁ జూచినయట్టులకా
ననుఁ జూచి ప్రహర్ష మంది నాభృత్యుఁ డతం

డనితరసదృశుఁడు సుమ్మీ
యని ప్రస్తుతిఁ జేసే నమ్మహానది నిన్నున్.

128


ఆ.

అట్లు ప్రస్తుతించి యతఁడు సేమంబున
నున్నవాఁడె? నా [6]మహోన్నతియును
జెప్పు మతని కనియె నప్పు డే ని ట్లంటి
గంగతోడఁ గరయుగంబు మొగిచి.

129


ఉ.

నీకరుణారసంబునకు నిక్కముగా నిటు ప్రాప్తుఁ డైన సు
శ్లోకుఁడు హీనజాతుఁ డని చూడఁగరా దతఁ డెట్టిపుణ్యుఁడో
నా కెరిఁగింపవే, యనిన నాకమహానది నీ ప్రభావముల్
కై కొని చెప్పి వీడ్కొలిపెఁ, గంటిమి నీవగునద్భుతక్రియల్.

130


సీ.

గాఢనీహారంబు గప్పినఁ దప్పునే
       మార్తాండబింబ విస్ఫూర్తి పెంపు?
నీఱు పైఁ గవిసిన నాఱంగ నేర్చునే
       ప్రకటితదావపావకుని వేఁడి?
మసికోక ముడిచినఁ బస చెడిపోవునే
       తనరు ననర్ఘ్యరత్నంబు కాంతి?
భూరిశైవాలంబు పొదివినఁ బొలియునే
       విలసదంభోరుహవిభ్రమంబు?


తే.

దైవవశమున నీకుఁ బ్రాప్తవ్య మైన
ఘోరదురితంబు వీగెడుకొఱకు నిచట
నంత్యజాకృతి నొందినయంతలోన
వర్ణ్యమగు నీ తపోమహత్త్వంబు చెడునె?

131


క.

కంకుఁ డయి ధర్మజుఁడు, వల
లాంకుండై వాయుజుఁడు, బృహన్నలయై ని
శ్శంకుఁడు పార్థుఁడు, హయ గో
కింకరులై కవలుఁ దొల్లి గెలువరె దినముల్.

132

వ.

నీవు వంజరుండవు గాని చండాలుండవు గా వని యవ్విప్రుండు పల్కు
ప్రస్తుతవాక్యంబు లతనిచండాలత్వంబునకు నుచ్చాటనమంత్రంబులై శివసా
రూప్యపదకారణంబు లగుటయు.

133


సీ.

బహుభుజంగమభోగభారంబుక్రియ మౌళి
       సురుజటాజూట మచ్చెరువు గాఁగ
శకలేందుమధ్యగైరికరేఖగతి మోడ్పు
       గన్ను ఫాలమున కక్కజము గాఁగ
రజతాద్రిపై మంచు గ్రమ్మినపగిది భ
       స్మపుఁబూఁత యొడల విస్మయము గాఁగ
ధ్రువతటిత్పుంజంబు భువి నిల్పఁ బొడిచిన
       పోల్కిఁ ద్రిశూల మద్భుతము గాఁగ


తే.

లలితగజదైత్యచర్మంబు వెలయ భూరి
భుజగభూషణరాజవిస్ఫూర్తి యెసఁగ
నోలిఁ జండాలవేషంబు నుజ్జగించి
శంకరాకార మొందె వంజరవిభుండు.

134


చ.

అనిమిషు లప్పు డర్ధిఁ గొనియాడఁగ, నాడఁగ నప్సర స్సతుల్,
పనివడి కిన్నరాంగనలు పాడఁగఁ, జూడఁగ నెల్లవారలున్
గనకవిభూషణాంబరసుగంధసముజ్జ్వలమూర్తిఁ దాల్చెఁ, ద
ద్వనితయు నావిమానగతిఁ (?) దాఁ గదిసెం బతివామభాగమున్.

135


వ.

అయ్యవసరంబున.

136


ఆ.

కప్పురంపుఁబ్రతిమ కైలాసనగరంబు
నొద్ది పాదరసముముద్ద యనఁగ
నానృపాలుపాలి కతిచిత్రగతులతో
వచ్చి నిలిచె వృషభవల్లభుండు.

137


వ.

అట్లు సదాశివలాంఛితుండును, నంగనాసమన్వితుండును, గోరాజవాహనుండు
నునై యారాజపరమేశ్వరుండు ప్రమథు లెదుర్కొన హరనివాసంబైన కైలా
సంబున కేఁగె నట్లు గావున.

138

క.

సత్సంగతి గడుఁ బుణ్యము,
సత్సంగతి సేయవలయు సత్పురుషులకున్,
సత్సంగతి గని వంజరుఁ
డుత్సుకమతి నభవుపురికి నొప్పుగఁ జనఁడే!

139


క.

ఆరాజేంద్రుం డటు శివ
సారూప్యపదంబు నొంది గనినతెఱఁగు గ
న్నారఁగఁ జూచుచునికిఁ బెం
పారఁగ నవ్విప్రుం డిట్టు లని వర్ణించున్.

140


ఉ.

'ఏమని చెప్పవచ్చుఁ బరమేశ్వరభక్తుల సచ్చరిత్రముల్
రామయలట్ల యుండుదురు ధారుణిలో మఱి శంభుపాలి కు
ద్దామత నేఁగుచోఁ దమప్రతాపముఁ దేజముఁ జెప్పఁ జిట్టలై
భూమిఁ బొగడ్త కెక్కి తమపోడిమి చూపుదు రెల్లవారికిన్.

141


క.

పుట్టువుల కెల్లఁ గడపటి
పుట్టువుగా నిట్లతండు పుట్టినదానం
గట్టిగ నంత్యజుఁ డని పే
రెట్టివిశేషార్హ మయ్యెనే యీతనికిన్!'

142


మ.

అని వర్ణించుచుఁ దద్విచిత్రసుమహత్త్వాధిక్య మూహించి వా
రని వేడ్కల్ చిగురొత్త బాష్పజలధారాధౌతగండద్వయం
బును రోమాంచసమంచితాంగకములుం బ్రోత్ఫుల్లవక్త్రాబ్జమున్
వినతాకంపితమస్తకంబుఁ దగ నవ్విప్రోత్తముం డుండఁగన్.

143


ఉ.

పౌరులు చేరి 'యోపరమపావనమూర్తి! భవత్సమాగమం
బారయ నెట్టిదో యిచటి యంత్యజుఁ డిప్పుడ ముక్తుఁ డయ్యెఁ బం
కేరుహసూతివో, వృషభకేతుఁడవో, హరివో కదయ్య! నీ
వారినకాఁ దలంపు బుధవత్సల! మ' మ్మని పల్కి రందఱున్.

144


క.

ఆపల్కుల కతఁ డి ట్లను
'నోపౌరశ్రేష్ఠులార! యొప్పుగ వినుఁ డే
నాపద్మజశివవిష్ణుల
లోపల నెవ్వఁడనుఁ గాఁ బలుకు లే మిటికిన్.

145

క.

విప్రుఁడ నే, నయ్యంత్యజుఁ
డాప్రమథాధిపతిభక్తుఁ డాతఁడు తనధ
ర్మప్రాభవమున నియ్యెడ
నప్రతిహతతేజుఁడై హరాద్రికిఁ బోయెన్.

146


క.

వినుఁ డతనిమహిమ చెప్పెద
నని తన కాశీప్రయాణమాదిగ మఱి యా
తనిమోక్షము తుదిగాఁ గ
ల్గునడిమివృత్తాంత మెల్లఁ గొనకొని చెప్పెన్.

147


ఉ.

చెప్పినఁ బ్రీతులై యతనిఁ జెచ్చరఁ దోఁకొని పోయి బూరెలుం,
బప్పును, నెయ్యి, పాయసముఁ, బక్వఫలాదులు నేత్రతృప్తిగా
గుప్పిరి మున్ పథశ్రమము గూరినమేనికి దప్పి దీఱున
ట్లప్పురవిప్రముఖ్యులు; ప్రియంబునఁ గైకొని యేఁగె నాతఁడున్.

148


వ.

ఇ ట్లేఁగి తనపురంబు చేరి యాత్మగతంబున.

149


ఉ.

కాశికిఁ బోవఁ గంటి, మణికర్ణికఁ గ్రుంకిడఁ గంటి నేను, వి
శ్వేశుపదాబ్జసేవఁ బరమేశ్వరిసత్కృపఁ జాలఁ గంటి, న
క్లేశగతిన్ హిమాచలము క్రిందటి భూములు చూడఁ గంటి, న
చ్చో శిశువక్త్రజంబు లగు సూక్తు లొగి న్వినఁ గంటిఁ దేఁటగన్.

150


ఆ.

అక్కజంబులైన యట్టివిశేషంబు
లర్థిఁ జూడఁ గంటి నచట నచటఁ;
దిరిగి వచ్చి జన్మదేశము చొరఁ గంటి
మంటి ననుచు నాతఁ డింటి కరిగె.

151


క.

భయభ క్తిసంభ్రమంబులు
రయమున ముప్పిరి గొనంగఁ బ్రణమిల్లినయా
ప్రియసతి నుచితవచనసం
చయములఁ దగ గారవించి సౌహార్దమునన్.

152


ఉ.

ఇమ్ములఁ గాశికాపురికి నేఁగెడునప్పుడు, నందునుండి య
య్యమ్మికపంపునన్ హిమవదద్రిసమీపము కేఁగునప్పుడున్,

గ్రమ్మఱి వచ్చునప్పుడును గన్నవిశేషము లింతితోడ మో
దమ్మున్న చెప్పి విప్రుఁ, డది దానును జెప్పె నిహప్రసంగముల్.

153


వ.

ఇ ట్లన్యోన్యవిశేషభాషణంబులం గొండొకసేపు వినోదించి, యెల్ల దానంబుల
యందును నన్నదానం బసమానం బనియును, నందు సిద్ధించుపుణ్యం బగణ్యం
బనియును నెఱింగినవారై యాదంపతులు తదీయాచరణంబులు తమకు శరణం
బులుగాఁ బ్రవర్తించుచు ధనధాన్యసమృద్ధియుఁ బుత్రపౌత్రాభివృద్ధియుం గలిగి
బ్రతుకుచుండి రని చెప్పి సర్పటిసిద్ధుండు.

154


సీ.

'అన్నంబు బలకరం బన్న మాయుర్వృద్ధి
       కర మన్న మత్యంతకాంతికరము
తనుఁ జంప వచ్చిన ఘనశత్రునకు నైన
       నన్నంబు బంధుత్వ మావహించు
నన్నంబువలనన యమరులు ప్రీతులై
       పరులకుఁ గోరినవరము లిత్తు
రన్నదానముఁ బోల వన్యదానంబులు;
       ధరణిలోపల నన్నిదానములకు


ఆ.

ఫలము సరిగఁ జెప్పఁబడుఁ గాని యన్నదా
నంబుసేఁత కీ ఫలం బనంగ
నబ్జభవుఁడు నోపఁ డటు గాన వీవును
నన్నదానపరుఁడ వగుము భూప!

155


క.

ఇది నీ యడిగిన ప్రశ్నకు
సదమలమగు నుత్తరంబు జనవర! యేఁ బో
యెద' ననిన నాతఁ డి ట్లను
'నిది తగవా, మిము భజించు టిట్లనుటకునే!

156


సీ.

అఖిలదానములందు నన్నదానంబు వి
       శేషంబుగా మీరు చెప్పుచున్న
వారు తత్ఫలములవలనను జేరెడు
       ననువు పేయను మీరె యగుటఁజేసి

తత్ప్రతిగ్రహము సేఁతకు మీర యర్హు లా
       రయ నిప్పు డవ్వేళ యయిన దదియుఁ
గాక మీయందును గనఁగ నామీఁది య
       నుగ్రహం బధికసమగ్ర మగుటఁ


తే.

బరిహరింపక నావిన్నపంబు మీర
లవధరింపంగఁ దగు' నన్న 'నవనినాథ!
యింత చెప్పంగ నేల నే నింతవాఁడ
నయ్య' వ్రతభంగ మగునని యంటిఁ గాక.

157


ఆ.

నృపకులాబ్ధిచంద్ర! నీ వింత నెట్టుకొ
నంగఁ ద్రోచి పోవ నాకుఁ దగదు.
వినఁగ వలయు నాదు విధమును నీకు న
ట్లగుట నొక యుపాయ మవధరింపు

158


చ.

అనఘ! భవద్వధూవిమలహస్తసరోరుహదత్తభిక్షయుం
దనరఁగ వేఁడి నాల్గుసదనంబులభిక్షయుఁ గాంచి యివ్విధం
బునఁ గల పంచభిక్షయును ధూపవరా! భవదీయపంక్తి నిం
పెనయ భుజింతు; నొండ నకు మిప్పని దా నుభయార్ధముం జుమీ!

159


ఉ.

అచ్చటఁ దెచ్చుభిక్షయు నరాధిప! నీయశనంబు గాదె. నీ
వచ్చపుఁగూర్మిఁ బ్రోచుమనుజావళిసొమ్ము భవద్ధనంబకా కె
చ్చటనుండి వచ్చె? నిది యిట్టిదకా మది నిశ్చయింపు; నా
కి చ్చన విమ్ము' నావుడును 'నిట్టి దృఢవ్రతుఁ డెందుఁ గల్గునే.

160


క.

పట్టఁగ వలవదు వ్రత మది,
పట్టినఁ దుది విడువ వలదు, పట్టినవ్రత మే
పట్టున వదలక జరిపెడు
నట్టిజనులు పూజ్యు లనిమిషావళి కైనన్.

161


వ.

అని కొనియాడుచు నమ్మనుజేంద్రుం డనుమతింప నతండట్ల చేసె, న ట్లిరు
వురు నాహారంబులు గొనిన తదనంతరంబ.

162


క.

భోజమహీపతిచేతం
బూజితుఁడై యరిగె సిద్ధపుంగవుఁడు నరేం

ద్రా! జగతి నన్నదాన
భ్రాజిష్ణుం డయ్యే నానృపాలవరుండుఁ.

163


చ.

వినుము నరేంద్ర! భోజపృథివీతలనాథుని రాజ్యలీలయుం
బొనరఁ దదీయకాలమునఁ బుట్టినయట్టివిశేషరీతులుం
గొనకొని నీదు కర్ణములకు న్విశదంబుగ విస్తరించితిన్;
మనువిధుఁ డవ్విభుం డతనిమార్గము తక్కినవారి కబ్బునే.

164


సీ.

మొదలు సామోపాయమున సర్వభూప్రజా
       పరిపాలనము సేయుఁ బాడితోడ
నడరి రెండవయుపాయం బైన భేదముఁ
       బచరించుచుఁ బుణ్యపాపములయందు
మొగిఁ దృతీయోపాయ మగు దానవిభవంబు
       నెఱపు నశేషార్థినికరమందు
నటఁ జతుర్థోపాయ మైన దండక్రియ
       యడరించు మృగయావిహారమందుఁ


తే.

దనకు నెందును నెదురు లే కునికిఁజేసి
చతురుపాయములకు నిట్లు గతి యొనర్చె
నౌర యితఁ డంచు నీతిజ్ఞు లాదరింప
బుధపయోధిసుధాంశుండు భోజవిభుఁడు.

165


సీ.

చర్చింప రెండవ చంద్రుఁడు, మూఁడవ
       యశ్విని, నాలవ యగ్నిదేవుఁ,
డైదవ లోకపాలాఖ్యుఁ, డాఱవ పాండు
       సంతాన, మేడవ చక్రవర్తి,
యెనిమిదయగు సన్మునీశుఁడ, తొమ్మిద
       యగు భోగిపతి, పదియవ విరించి,
పదునొకొండవ చక్రపాణి, పండ్రెండవ
       శూలి, పద్మూఁడవ సూర్యుఁ డనఁగఁ,


ఆ.

దనరుఁ గాంతి, రూపమునఁ, బ్రతాపమున, స
త్యమున, ధర్మచరిత, నాజ్ఞ, శుచిని,

భూరిసత్వమునఁ, బ్రబుద్ధతఁ, గలిమిని,
భూతిఁ, దేజమునను భోజవిభుఁడు.

166


ఉ.

ఆరసి వీరు వీ రని కృతాదియుగంబుల మూఁటియందు నిం
పారఁగఁ బేర్కొనం గలుగునట్టి ఘనుల్గల రెన్నుచో బహు
క్ష్మారమణ త్తముల్; కలియుగంబున భోజవిభుండు సద్గుణా
కారుఁ డొకండ కాని మఱి కల్గఁడు తత్సదృశుండు భూవరా!

167


తే.

క్షీరపూరితఘటము, కర్పూరయుతక
రండ, ముద్యదిందుద్యుతిరమ్య మైన
కైరకాకర మనఁగ జగంబు మెఱయు
భోజవిభునిత్యకీర్తి విస్ఫూర్తిఁ జేసి.

168


చ.

అవిరళకీర్తినిత్యుఁడు, సమంచితపత్యుఁడు, శ్రీప్రయాగమా
ధవకరుణావలోకనసుధారసజన్ముఁడు, కామినీజన
ప్రవిమలచిత్తజన్ముఁడు, ప్రభాకరతేజుఁడు భోజుఁ డొప్పు వై
ష్ణవశుభయాగలక్షణవిచక్షణుఁడై చిరజీవనోన్నతిన్.

169


క.

అభినవభోజుఁ డనంగాఁ
బ్రభవించెఁ దనూజుఁ డానృపశ్రేష్ఠునకున్,
శుభలక్షణలలితుఁడు, శ
త్రుభయంకరుఁ; డార్యసన్నుతుఁడు ధీయుక్తిన్.

170


క.

నెట్టన భోజునికడుపునఁ
బుట్టినపుత్రుఁడఁట, యవ్విభుని చారిత్రం
బెట్టి దన నేలఁ? బులికిం
బుట్టినకూన యఁట! వేఁడి పులు మేపెడినే?

171


చ.

అవనికిఁ జందనంపుఁగలయంపి, పయోధికి ఫేనచిహ్న, వృ
క్షవితతికిం బ్రసూనతతి, శైలచయంబునకున్ నితాభ్రగౌ
రవ, ముడువీథికిన్ సురతరంగిణివెల్లి యనంగ నొప్పు భూ
భువనబిడౌజుఁడైన నవభోజునికీర్తి మనోజ్ఞమూర్తి యై.

172


ఉ.

ఆతఁడుఁ గాంచెఁ బుత్రుల ననంత
గుణాఢ్యులఁ, దత్తనూజులుం
జాతిగఁ గాంచి రాత్మజులఁ జారుయశస్కుల, వారలుం దనూ

జాతులఁ గాంచి రున్నతవిదారుల, నీక్రియ భోజవంశ మ
త్యాతతకీర్తి నొప్పె భరతాన్వయసన్నిభమై జగంబునన్.

173


క.

ఈభోజరాజచరితము
భూభువనమునందు నిఖిలపుణ్యాస్పదమై
శోభిల్లు నధికతేజో
లాభంబుల నిచ్చు శ్రోతలకు వక్తలకున్.

174


వ.

అని భోజరాజీయంబు నెయ్యంబున నాద్యంతంబు నత్యంతహృద్యంబుగా
నుపన్యసించి.

175


సీ.

అత్రిపుత్రుండు పవిత్రచరిత్రుండు
       వితతతపోమార్గసతతతపధికుఁ
డజ్ఞానదూరుఁ డతిజ్ఞానసారుఁ
       [7]డంతర్వైరివిదళనాఖర్వబలుఁడుఁ
జిరతరాయుష్మంతుఁ డురుతరస్వాంతుఁ డ
       ష్టాంగయోగప్రియాసంగతుండు
లక్ష్మీనివాసుండు లక్ష్మీనిరాసుండు
       నిఖిలాశ్రితవ్రాతసుఖకరుండు


ఆ.

నజరు డచలుం డనఘుఁ డజుఁడు దత్తాత్రేయ
మునివరుండు దనకు వినతుఁ డైన
మహుని వీడుకొల్పి మహితకృపాదృఙ్మ
రీచు లెసఁగ బుధులఁ బ్రోచుచుండె.

176


క.

దత్తాత్రేయప్రోక్త ము
దాత్తసుకృతభోగవిశ్రుతసునీతిపదా
యత్తంబై యితిహాసము
క్రొత్త గదే భూమి ననుచుఁ గొనియాడంగన్.

177


క.

ఆచక్రవాళ మాసృ
ర్వీచక్రం, బాశశాంకతిగ్మమయూఖం,

బాచతురాస్యముఖాఖిల
ఖేచర మగుఁగాత నాదు కృతిరత్నము దాన్.

178


సీ.

అఖిలజగత్సేవ్యమై భూమిపై నహో
బ లము దా నెందాఁక వెలయుచుండు
నాతీర్థమందుఁ బ్రఖ్యాతమై భవనాశ
       నీనది యెందాఁక నెగడుచుండు
నామహానదిపొంత నత్యంతపూజ్యమై
       గరుఁడాద్రి యెందాఁకఁ గదలకుండు
నయ్యద్రిశిఖరంబునందును నెందాఁక
       శ్రీనృసింహస్వామి స్థిరత నుండు


ఆ.

నస్మదీయకృతియు నందాఁక సంతత
శ్రావ్యమై సమస్తసభలయందు
విస్తరిల్లుఁ గాత వివిధకథానూత్న
రత్నభూషణాభిరామ మగుచు.

179


క.

గోవులకును బ్రాహ్మణులకు
భూవలయములోని పుణ్యపురుషులకు నఖీ
ష్టావాప్తి యొదవుఁ గావుత
దేవార్చితుఁడగు నృసింహదేవుని కరుణన్.

180


చ.

అని జగదేకవంద్యునకు, నాదినృసింహున, కిందిరామనో
వనజమధువ్రతేంద్రునకు, వారిజనాభునకున్, సరోజలో
చనునకు, సూరిలోకనుతచర్యునకున్, భవబంధజాలమో
చనునకు నేను నీవిమలసత్కృతి కానుకగా నొనర్చితిన్

181


క.

నన్ను భవద్భృత్యులలో
నెన్ని దయాదృష్టిఁ జూచి యిది మొదలుగ నీ
వెన్నఁడు వదలకు మిది నా
విన్నప మట్లైన నఘనివృత్తుఁడ నగుదున్.

182


చ.

సరసిజపత్రనేత్ర! భవసాగరబాడబవీతిహోత్ర ! ని
ర్జరపరిచార! ధాత్రిచరసంఘవిదార! విఘాతపాతకో

త్కర! సుకృతార్థకైరవసుధాకర! యాశ్రితపారిజాత! సు
స్థిరవరదాత! యోగిజనసేవిత ! శాస్త్రపురాణభావితా!

183


క.

అవయవయుతపరతత్త్వా!
భువనత్రితయాంతరాత్మ! పూర్ణమహత్త్వా!
భవనాశనితటినీతీ
రవిహారా! భాస్వదిందిరావనికీరా!

184


తోటకవృత్తము.

చందనకుంకుమసంయుతవక్షా!
కుందసుకుట్మలకోమలధామా!
వందితభక్తజనప్రియ! యోగా
నంద! యహోబలనాథ! నృసింహా!

185

గద్యము
ఇది వాణీవరప్రసాదలబ్దవాగ్విభవ తిక్కనామాత్యసంభవ
సుకవిజనవిధేయ అనంతయ నామధేయ ప్రణీతంబైన
భోజరాజీయంబను కావ్యంబునందు సర్వంబును
సప్తమాశ్వాసము

  1. ఇది షష్ఠాశ్వాసములోని పద్యము. కథను సంగ్రహించుటలో నిక్కడ
    ఉపయోగించుకొనుట యైనది.
  2. బరిణమింతు
  3. దెలుపవే
  4. కట్టెలు
  5. నాగొంతి
  6. మనోన్నతియును
  7. డంతర్వేది