భోజరాజీయము/ప్రథమాశ్వాసము

భోజరాజీయము

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతాస్తుతి

శ్రీరమణీపయోధరపరిస్ఫుటకుంకుమఫాలభాగక
స్తూరిక లిష్టకేళిగతిఁ జోఁకినభంగి నురంబునందుఁ బ్ర
స్ఫారితరత్నలాంఛనవిభాయుగళంబు దలిర్ప నొప్పు ల
క్ష్మీరమణుం డహోబలనృసింహుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

1


చ.

శ్రుతితతు లుద్భవించిన విశుద్ధగృహంబు లనంగఁ జాలి వా
క్సతికి నివానభూములనఁగాఁ దగి యెవ్వని మోముఁదమ్ము లం
చితగతి నొప్పు నట్టి సరసీరుహసంభవుఁ డిచ్చుఁగాత మ
త్కృతికిఁ జిరాయువు న్విమలకీర్తియు సజ్జనరంజకత్వమున్.

2


చ.

ఒకదెస మాతృభావమును నొక్కదెసం బితృభావమున్ సమాం
శకముగఁ దాల్చి యోగిజనసంతతి గన్గొను నంతరంగదృ
ష్టికి గుఱియై తపస్వులకుఁ జేరువచుట్టమనంగ భక్తరా
జికి నఱచేతిసొమ్మగు శశిస్ఫుటమౌళిఁ దలంతు శంకరున్.

3


ఉ.

విఘ్నము లెల్లఁ బాపి పృథివిన్ భవనీరధిపేర్మి గుల్భసం
దఘ్నము చేసి నిల్తు రుచితస్థితి నెవ్వనిభృత్యు లట్టి దుః

ఖఘ్నుఁడు షణ్ముఖప్రథమగర్భుఁడు భద్రగజాస్యుఁడైన యా
విఘ్నవిధుండు మత్కృతికి వేడుకతోడ సహాయుఁ డయ్యెడున్.

4


ఉ.

ఏసతిలావు లేక నరు లెవ్వరు నోరు మెదల్పలేరు ప
ద్మాసన వాసుదేవ నిటలాక్షులు లోనుగ నా త్రివిష్టపా
వాసులు పుట్టుఁ బేరు జెలువంబును నేరికి దాఁప రట్టి వా
ణీపతి మన్ముఖాబ్జమున నిల్చి విశేషవరంబు లీవుతన్.

5

పూర్వకవిస్తుతి

ఉ.

శ్రీకరమైన రామకథఁ జెప్పి కృతార్థులఁగా నొనర్చె భూ
లోకమువారి నే ఋషి త్రిలోకములుం బొగడంగ నట్టి య
స్తోకవచోభిరాముఁడు విశుద్ధతపోవిభవాధికుండు వా
ల్మీకిమునీంద్రుఁ డెప్పుడుఁ జలింపక నామదిలోన నుండెడున్.

6


ఉ.

ఏకపుఁబ్రోకయైన శ్రుతులెల్లను నేర్పున నేర్పరించి సూ
త్రాకృతు లొప్పఁ దీర్చి యితిహాసపురాణచయాదు లోలి న
య్యైకరణిం బ్రబోధనుల ప్రార్థ్యములై వెలయం రచించె న
వ్యాకులబుద్ధి నేపురుషుఁ డట్టి పరాశరసూనుఁ గొల్చెదన్.

7


చ.

వివిధపదానుయోజనఁ బ్రవీణుఁడు దండి, సమంచితార్ధగౌ
రవమునఁ బెద్ద భారవి, దురంధరుఁ డయ్యుపమాకవిత్వస
త్స్రవణతఁ గాళిదాసు, త్రివిధంబున మాఘుఁడు మేటి నాఁగ, వి
ట్లవనిఁ బొగడ్త కెక్కిన మహాకవులం బ్రణుతింతు నాఢ్యులన్.

8


ఉ.

నన్నయభట్టుఁ దిక్కకవినాయకు భాస్కరు రంగనాధుఁ బే
రెన్నిక కెక్కినట్టి యమరేశ్వరు నెఱ్ఱయమంత్రి నాదిగాఁ
జన్నకవీంద్రులన్ నవరసస్ఫుటవాణు లనంగ ధాత్రిలో
నున్నకవీంద్రులం దలఁతు మల్ల మెలర్పఁగ వాగ్విభూతికిన్

9

భాగవతసంకీర్తనము

సీ.

ఏమహాత్ములచేత నీజగత్త్రయము నా
        ప్యాయితం బయ్యె నయ్యమృతకరువి

చేఁ బోలె, వైద్యులచేతఁ బోలె సురక్షి
       తం బయ్యె, నూత్న రత్నములచేతఁ
బోలె నలంకృతిఁ బొరసెఁ, బాత్రిత మయ్యెఁ
       బుణ్యతీర్థముచేతఁ బోలె, నట్టి
వైష్ణవప్రవరుల వైనతేయు గజేంద్రు
       శేషుఁ బావని నంబరీషు ధ్రువుని


తే.

బలి విభీషణుఁ బ్రహ్లాదుఁ బాండవేయుఁ
బుండరీకు వేదవ్యాసుఁ బుత్రు భీష్ము
నారదునిఁ బరాశరుని శౌనకుని భృగుని
విదురు నక్రూరు గోపాలవితతిఁ దలఁతు.

10

గురుస్మరణము

సీ.

భూనభోహరిదంతపూరితనుతకీర్తి
       శాలి తిర్వెంగళచక్రవర్తి
సరలసాత్వికశుకప్రకరసత్ఫలపూర్ణ
       సహకార మళఘరిచక్రవర్తి
ఘనతరాజ్ఞానాంధకారవిఖండన
       చండాంశుఁ డౌబళచక్రవర్తి
నానార్థిజనచాతకానూనధనవృష్టి
       జలదంబు శ్రీదేవచక్రవర్తి


తే.

యనఁగ శ్రుతిచతుష్టయముతో నెనయునట్టి
యగ్రజులతోడఁ బుట్టిన యస్మదీయ
గురునిఁ దిరుమల నల్లానువరతనూజుఁ
దలఁతు గోవిందచక్రవర్తులఁ బ్రియమున.

11


వ.

అని యిష్టదేవతానమస్కారంబును విద్వజ్జనాభివందనంబును భాగవతసంకీర్తనంబునుం జేసి వాణీవరప్రసాదలబ్ధవాగ్విభవుండనై కృతి యొనర్ప నుద్యోగించి తత్కృతిలక్ష్మికి ముఖమండనంబుగా నస్మదీయవంశప్రశంస యొనర్చెద నది యెట్టి దనిన.

12

కవివంశాభివర్ణనము

సీ.

శ్రీరమ్యుఁడగు నాదినారాయణునినాభిఁ
       బొలుపార విరిదమ్మిపువ్వు పొడమె
నాపువ్వులోఁ బుట్టె నఖిలలోకంబులు
       పుట్టింపఁ జాలెడు ప్రోడపట్టి
యాపట్టిమోముల నామ్నాయవితతితో
       నావిర్భవించె విప్రాన్వయంబు
నాయన్వయంబున నతిదృఢాచారస
       మృద్ధులు పెక్కండ్రు ఋషులు పుట్టి


ఆ.

రట్టిఋషులలోన నధికతపోవిశే
షుండు వేదశాస్త్రశోభితుండు
ఘనుఁడు సూనృతైకధనుఁడు కౌండిన్యము
నీశ్వరుండు మెఱసె విశ్వనుతుఁడు.

13


శా.

ఆకౌండిన్యమునీంద్రవంశమున దుగ్ధాంబోధిసంజాతుఁడై
రాకాచంద్రుఁ డెలర్చుమాడ్కి నుపధారంబైకసంరంభుఁ డ
స్తోకానందుఁడు నందనార్యుఁడు ప్రసిద్ధుం డయ్యె నార్యప్రియుం
డాకారస్మరుఁ డచ్యుతాంఘ్రికమలధ్యానానురక్తుం డిలన్.

14


ఉ.

నందితశిష్టలోకుఁడగు నందనమంత్రికి లక్కమాంబకున్
నందను లుద్భవించిరి జనార్దనశంకరనిర్విభేదు లా
నందమయాత్ములాదిమునినాయకసత్యుఁడు సత్యమంత్రియున్
మందరశైలధీరుఁ డసమానుఁడు మాత్రిపురాంతకార్యుఁడున్.

15


వ.

అం దగ్రసంభవుండు.

16


ఉ.

సత్యవచోవిలాసుఁడు ప్రశస్తయశోవిభవాభిరాముఁ డా
దిత్యసమప్రకాశుఁడు సుధీజనచిత్తసరోజమిత్త్రుఁ డౌ
చిత్యపరుండు సర్వజనచిత్తవిదుం డన మంత్రికోటిలో
సత్యనమంత్రి యొప్పె నుడుసంఘములోపలఁ జంద్రుకైవడిన్.

17


ఉ.

సత్యముతో నహింస విలసద్గతిఁ గూడి చరించుచాడ్పునన్
సత్యనమంత్రిఁ గూడి గుణశాలిని తాతమ నిత్యనిర్మలా

పత్యసమేతయై నిఖిలబంధుజనంబులకుం బ్రమోదసం
పత్యుదయైకహేతువయి ప్రస్తుతి కెక్కె ధరాతలంబునన్.

18


క.

అతనికి నయ్యతివకు న
ప్రతిమ[1]మహోదారు లరయ భాసురకవితా
చతురుఁడు బయ్యనయును మతి
యుతుఁడగు నందనయు సత్ప్రియుఁడుతిక్కనయున్.

19


వ.

ఆసత్యనామాత్యు ననుసంభవుండు.

20


సీ.

మారాంబ కెనయైన మారాంబ పత్నిగాఁ
       గనియె నార్వుర వంశకరుల సుతుల
నిశ్చలధ్యానైకనిష్ఠాగరిష్ఠుఁడై
       షణ్మాసములు పురశ్చరణ చేసి
మావంశజులయింటి మార్జాలమునకైన
       నరకంబు లేకుండ వరము వడసెఁ
గడఁగి పునర్మాతృగర్భంబు సొరకుండఁ
       బ్రతిన గైకొని బ్రహ్మపదముఁ బొందె


ఆ.

ననిన నతనికీర్తి యఖిలదిక్తటములఁ
గప్పుకొనుట వేఱ చెప్ప నేల
విపులపుణ్యసదనుఁ ద్రిపురాంతకబ్రహ్మఁ
బోలఁ గలరె యితరపురుషు లెల్ల.

21


ఉ.

నిత్యులు తత్తనూభవు లనింద్యులు దేవనయున్ సురేశ్వరా
మాత్యసముండు నందనయు మాన్యుఁడు కొమ్మనయున్ గుణాఢ్యుఁ డా
దిత్యవిభుండు నాశ్రితవిధేయుఁడు మాచనయున్ బ్రశస్తసా
హిత్యుఁడు తిక్కధీమణియు నెన్నిక కెక్కిరి బంధుకోటిలోన్.

22


సీ.

ఆసత్యనామాత్యు నగ్రసూనుఁడు పయో
       నిధిగభీరుఁడు గదానిపుణుఁ డధిక

తేజుఁ డాశ్రితకల్పభూజుఁ డుత్కటకృపా
       రసపూర్ణహృదయుఁ డరాతిభయద
బాహాఢ్యుఁ డసహాయసాహసుం డంగనా
       జనభద్రుఁ డభినవమనసిజాతుఁ
డాశాంతవిశ్రాంతయశుఁ డార్తరక్షాతి
       దక్షుఁ డున్నతవక్షుఁ డక్షరాది


ఆ.

విద్యలందుఁ జతురుఁ డుద్యద్గుణశ్రేష్ఠుఁ
డనుపమానవిభవుఁ డమితపుణ్యుఁ
డనఁగ నెగడె భైరవామాత్యచంద్రుండు
రాజసభలయందుఁ బూజ వడసి.

23


చ.

క్షితిఁ గ్రతుకర్తృతామహిమ చేకొని పంచమవేదమైనభా
రతముఁ దెనుంగుబాస నభిరామముగా రచియించినట్టియు
న్నతచరితుండు తిక్కకవినాయకుఁ డాదట మెచ్చ భవ్యభా
రతి యనఁ బేరు గన్న కవిరత్నము బయ్యనమంత్రి యల్పుఁడే.

24


చ.

శరధిసుత న్వరించుజలజాతవిలోచనుమాడ్కి శీతభూ
ధరజఁ బరిగ్రహించుహిమధామకళాధరుపోల్కి సద్గుణా
భరణపవిత్రమూర్తిఁ గులపాలిక నాఁ దగు ప్రోలమాంబికన్
బరిణయ మయ్యె నెయ్యమున బయ్యచమూపతి వైభవోన్నతిన్.

25


క.

పతిభక్తి నరుంధతి, సూ
నృతమతి భారతి, జగద్గుణితసౌభాగ్య
స్థితి రతి, శాశ్వతవిభవా
యతి శ్రీసతి, యనఁగఁ బ్రోలమాంబిక వెలసెన్.

26


చ.

గుణయుతు లవ్వధూవరులకు జనియించిరి త్రేత రామల
క్ష్మణు లయి పుట్టి ద్వాపరయుగంబుతుదిం దగ రామకృష్ణులై
గణనకు నెక్కి యీకలియుగంబున నిట్లుదయించె లోకర
క్షణుఁ డగు విష్ణుదేవుఁ డన గంగనమంత్రియు ముమ్మడన్నయున్.

27


వ.

ఆ గంగనామాత్యు గుణవిశేషంబు లెట్టి వనిన.

28

సీ.

దుగ్ధాబ్ధిలోపలి తోయజాక్షుల మేలు
       కనిపి తీరంబున నునుపకున్న
హరుకంఠమున నున్న గరళానలము కప్పు
       విరియ నౌషధము ద్రావింపకున్న
నిందుబింబములోని యిఱ్ఱికి దీమంబు
       చూపి వెల్వఱిచి పోఁ జోఁపకున్న
సీరపాణికి నీలిచీరమీఁది ప్రియంబు
       మాన్పి వెల్లలు గట్ట మరపకున్న


తే.

నితనికీర్తికి సరి చెప్ప నెట్లు వచ్చు
ననఁగ బొగడొందు బయ్యదండాధినాథు
కూర్మపుత్రుండు కౌండిన్యకులపవిత్రుఁ
డంగసంభవనిభుఁడైన గంగవిభుఁడు.

29


క.

సోముఁడు రోహిణి నధిక
ప్రేమమున వరించుక్రియ గభీరాదిగుణ
శ్రీమహిమకీర్తి శోభిలి
కామాంబ వరించె మంత్రిగంగన ప్రీతిన్.

30


క.

ఆదంపతులకు హృదయా
హ్లాదకరులు సుతులు పెద్దనార్యుఁడు సుగుణ
మోదిఘనుఁ డప్పలన్నయుఁ
బ్రాదుర్భావంబు నొంది పరఁగిరి పేర్మిన్.

31


వ.

ఇట్టి సంతానంబువలన వెలయు గంగనామాత్యు ననుసంభవుండు.

32


చ.

కడిమిఁ గిరీటి, దానమునఁ గర్ణుఁడు, భోగమున న్సురేంద్రుఁ, డె
క్కుడువిభవంబునన్ హరి, యకుంఠితబుద్ధిఁ బురందరేభ్యుఁ, డు
గ్గడువగుధీరతన్ సురనగప్రవరుం డనఁ బ్రోలమాంబము
మ్మడి బెడఁగొందె రూపమహిమ న్మరుముమ్మడియై జగంబునన్.

33


సీ.

పితృబుద్ధి వదలక పేర్చి యచ్యుతుసేవ
       యనిశంబు చేయు ప్రహ్లాదుఁడనఁగ

నగ్రజన్మునితోడ నిగ్రహింపక శౌరి
       శరణు చొచ్చిన విభీషణుఁ డనంగ
ప్రభుత యెన్నఁడుఁ గోలుపడక సద్భక్తి ను
       పేంద్రుఁ బూజించు బలీంద్రుఁ డనఁగ
వైవాహికక్రియావైభవం బుడుగక
       బిసరుహాక్షునిఁ గొల్చు భీష్ముఁ డనఁగ


ఆ.

నితరమతములందు హృదయంబు చొనుపక
యొగిఁ దదేకనిష్ఠ యుల్లసిల్ల
పరమభాగవతవిభాసితుండై యొప్పెఁ
బ్రోలమాంబసుతుఁడు ముమ్మవిభుఁడు.

34


క.

ఆముమ్మడిప్రెగ్గడ శ్రీ
రాముఁడు సీతను వరించు క్రమమున సుగుణ
స్తోమాభిరామ నమితకృ
పామండిత నెఱ్ఱమాంబఁ బరిణయ మయ్యెన్.

35


సీ.

పతిభ క్తినిరతిని సతి యరుంధతిఁ బోల్పఁ
       దగు ననుమాట వ్యర్థంబు గాదు
సత్యవాక్ప్రౌఢిని సతి సరస్వతికంటె
       నెఱవాది యనుమాట కుఱుచ గాదు
సౌభాగ్యగరిమను సతి రతిదేవితోఁ
       బురుణించు ననుమాట బొంకు గాదు
సంపదపేర్మిని సతి శ్రీసతికి సదృ
       క్షం బనుమాట సంశయము గాదు


ఆ.

అనిన నితరసతుల కలవియె సతతవి
శ్రాణనక్రియాధురీణహస్తుఁ
డైన ముమ్మడీంద్రు నర్ధాంగలక్ష్మి నా
నతిశయిల్లు నెఱ్ఱమాంబఁ బోల.

36


క.

ఆరమణీరమణులకుఁ బ్ర
భారమ్యుఁడు తిక్కవిభుఁడు ప్రకటితశాంతి

స్ఫారుఁడు సింగనయును నను
వారలు పుట్టి రిలఁ బుష్పవంతుల మాడ్కిన్.

37


వ.

అయ్యిరువురయందు నగ్రసంభవుండు.

38


సీ.

సత్యభాషణమును సాధుపోషణమును
       సహజభూషణముగా జరగువాఁడు
ఆర్తరక్షణము దయార్ద్రశిక్షణము ను
       దాత్తలక్షణముగాఁ దనరువాఁడు
సుకృతభావనమును సుకవిసేవనమును
       నిత్యజీవనముగా నెగడువాఁడు
విష్ణుకీర్తనమును విమలవర్తనమును
       విహితవర్తనముగా వెలయువాఁడు


ఆ.

వాఁడె చూడుఁ డనుచు వసుధాజనంబులు
ప్రస్తుతింప నొప్పు భవ్యచరితుఁ
డుభయకులపవిత్రుఁ డురుకీర్తిధవళిత
దిక్కుఁ డెఱ్ఱమాంబ తిక్కవిభుఁడు.

39


సీ.

విలసితంబగు కృష్ణవేణి మలాపహా
రిణి భీమరథినా ధరిత్రియందుఁ
       దనరునదీత్రయాంతర్వేది యగు పావ
       నక్షేత్రమున శోభనమున కెల్ల
ధర నివాసంబగు పెరుమగూరుపురంబు
       నందు విద్వజ్జనానంద మైన
జీవనస్థితిచేతఁ జెన్నొంది వంశక
       ర్తృత్వసంపత్తిఁ బ్రభుత్వ మొంది


తే.

నెమ్మి ప్రత్యక్షపరమపద మ్మనంగ
నొప్పు శ్రీకాకుళంబున కొడయఁ డైన
యంధ్రవల్లభహరిసేవ నలరుచుండుఁ
బెక్కుభంగుల ముమ్మడితిక్కవిభుఁడు.

40

చ.

చిరతరశోభనుం డగు వసిష్ఠమునీశ్వరుఁ డయ్యరుంధతిం
బరిణయ మై గృహస్థగుణభాసితుఁడై వెలుఁగొందుమాడ్కిఁ గా
తరపరిరక్షణానవరతవ్రతశీలుఁడు తిక్కమంత్రిశే
ఖరుఁడు వివాహ మయ్యె గుణగౌరవశోభిని మల్లమాంబికన్.

41


సీ.

శ్రీవత్పగోత్రాబ్ధి శీతాంశుఁ డగునక్క
       దండాధినాథుఁ డీతరుణి తండ్రి
లావణ్యగుణపుణ్యలక్షణాన్విత యైన
       యక్కమాంబిక యీలతాంగి తల్లి
చిరకీర్తినిరతులు చిట్టనమంత్రియు
       నయ్యలార్యుఁడు నాతి కగ్రజన్ము
లచ్యుతాంఘ్రిసరోరుహార్చనారతుఁడు ద
       మ్మనమంత్రి యీయింతి యనుఁగుఁదమ్ముఁ


తే.

డనఘుఁ డగుకోటకరుణాకరార్యుఁ డను ఘ
నుండు ముదునూరిపెద్దవిభుండు నివ్వ
ధూమణికిఁ గూర్మిగల మేనమామ లనిన
మగువ లెనయె తిక్కనమంత్రిమల్లమకును.

42


సీ.

ఈయింతిప్రియభాష లెల్లపెద్దలకుమ
       బరమానురాగసంపాదకములు
నీయింతిహస్తాబ్జ మెల్లబంధువులకు
       లలితకల్పద్రుమ ఫలితశాఖ
యీయింతివర్తనం బెల్లయింతులకుఁ ది
       తివ్రతాచారోపదేశకర్త
యీయంతిమందిరం బిందిరాదేవికి
       సతతమనోజ్ఞ విశ్రామభూమి


ఆ.

యనఁగ సకలశోభనావాసదేశమై
యఖిలకులవధూజనావతంస
మగుచు వెలసెఁ దిక్కనామాత్యవిభుదేవి
మల్లమాంబ లోక మెల్లఁ బొగడ.

43

సీ

ఈగృహస్థుని కిట్టి యిల్లాలు గలుగుట
       ప్రాగ్భవార్జితపుణ్యఫలము గాదె
యోపతివ్రత కిట్టి హృదయేశుఁ డబ్బుట
       పరికింప ఘనతపఃఫలము గాదె
యీమహాప్రభువున కిట్టి సజ్జనురాలు
       గలుగుట సంసారఫలము గాదె
యీపుణ్యకాంతకు నిట్టి ధర్మక్రియా
       పరుఁడు గల్గుట దానఫలము గాదె


ఆ.

యనఁగ మహిఁ బరస్పరానుకూలత్వంబు
మిక్కుటముగ మంత్రితిక్కవిభుఁడు
మల్లమాంబికయును మహనీయజీవన
సౌఖ్యవార్ధిఁ గేళి సలుపుచుండ.

44


మ.

అరిషడ్వర్గముఁ దూలఁ దోలి ధరలో నైశ్వర్యషడ్వర్గ మీ
వరుసన్ భ్రాగ్భవ మొందె నాఁగ సుతషడ్వర్గంబు జన్మించెఁ ద
త్పురుషస్త్రీతిలకంబులందు ఘనసంతోషంబు తద్బాంధవో
త్కరముల్ పొంద సమగ్రసంపద నిజాగారంబునం జెందఁగన్.

45


వ.

వా రెవ్వ రంటేని.

46


ఉ.

భూసుతకీర్తి ముమ్మడివిభుండు మదగ్రజుఁ, డేను వైష్ణవ
ధ్యానసమాహితాత్ముఁడ ననంతసమాఖ్యుఁడ, నాదు తమ్ము ల
జ్ఞానవిదూరు లక్కనయు, సత్కవి చిట్టనయున్, వివేకవి
ద్యానిధి రామచంద్రుఁడు, నుదారుఁడు లక్ష్మణనామధేయుఁడున్.

47


క.

ఈయార్వురు నొక్కొక్కఁడు
వేయిండ్లకు మొదలుగాఁగ వెలయుదు రని కా
దే యాఱువేల పే రిడి
రీయన్వయమునకు నేష్య మెఱిఁగిన పెద్దల్.

48


వ.

ఇట్టి సంతానలతావితానంబునకు మూలకందం బనందగు తిక్కనామాత్యు
ననుసంభవుండు.

49

చ.

బలమున నాహలాయుధుఁ, డపారపరాక్రమలీలయందుఁ గే
వలమృగరాజు, రూపవిభవంబున వాసవసూతి, నీతికౌ
శలమున నయ్యుగంధరుఁడు, సత్యరూఢిని ధర్మజుండు నా
నిల నుతి కెక్కె ముమ్మరధినీశ్వరుసింగన బంధుకోటిలోన్.

50


వ.

అతని యతివ యెట్టి దనిన.

51


సీ.

రమణీయమైన భారద్వాజవంశవ
       ర్ధనుడు సింగనమంత్రి తనకుఁ చండ్రి
యఖిలసంపదలకు నావాసభూమి నాఁ
       దగునన్నమాంబిక తనకుఁ దల్లి
ఘనుఁడు నారనమంత్రియును గదాకుశలుండు
       మారనార్యుండును మహితమూర్తి
సింగధీమణియు ననంగసన్నిభుఁడు మా
       చనమంత్రియును సర్వసన్నుతుండు


తే.

వల్లభన్నయు ననఁగలవారు తనకు
ననుఁగుఁదమ్ములు దా నౌబళాంబ యనఁగ
నలరునయ్యింతి తనకు నిల్లాలు గాఁగ
మహితగుణశాలి సింగనమంత్రి వెలసె.

52


ఉ.

ఆతనినందనుల్ హరిపదాబ్జరతుండగు సింగమంత్రి, ని
ర్భీతుఁడు చిట్టయన్నయు, గభీరగుణాఢ్యుఁడు ముమ్మడన్న, ప్ర
ఖ్యాతుఁడు సింగశౌరి, ఘనుఁడౌ తిరువెంగళసింగరన్న నా
నాతతసచ్చరిత్రముల నన్వయపావను లైరి మేదినిన్.

53


వ.

ఇట్టిపుత్రరత్నంబులచేత నలంకృతుండగు సింగనమంత్రి సౌమిత్రియుం
బోలెఁ దనకు ననవరతప్రీతి గావింప నస్మదీయజనుం డగు తిక్కనా
మాత్యచంద్రుఁడు రామచంద్రుండునుం బోలె ధీరోదాత్తగుణోత్తరుండై
మెఱయుచుండు.

54


ఆ.

దేవతాన్వయంబు దేవేంద్రుచేఁ బోలె
మహితపుణ్యుఁడైన మనువువేడ

క్షత్రకులము వోలెఁ గౌండిన్యగోత్రంబు
వెలసెఁ దిక్కమంత్రివిభునిచేత.

55


క.

ఏతద్వాంశపయోనిధి
శీతాంశుఁడ బుధచకోరచిత్తప్రియుఁడన్
వీతకళంకుండఁ గళో
పేతుఁడ నిర్ధూతదురితపృథుతిమిరుండన్.

56


క.

నరహరిచరణసరోజ
స్మరణామృతపానసతతసంతుష్టాంతః
కరణుఁడ సంతతవాణీ
వరప్రసాదానులబ్ధివాగ్విభవుండన్.

57


క.

శ్రీయువతీకారుణ్యర
సాయత్తకటాక్షవీక్షణాపాదితసు
శ్రేయస్కుఁడఁ గవినికరవి
ధేయుండ ననంతనామధేయుఁడ జగతిన్.

58

కావ్యప్రస్తావన

సీ.

సకలవిద్యలయందుఁ జర్చింపఁ గవిత యు
       త్కృష్ట మం డ్రది నిత్యకీర్తికొఱకు,
నర్థాప్తి[2]కొఱకును, వ్యవహారలక్షణం
       బెఱిఁగెడికొఱకు, ననేకవిధము
లగునమంగళముల హరియించుకొఱకు, ను
       చితనిత్యసౌఖ్యసంసిద్ధికొఱకు,
నొనరఁ గాంతాసమ్మితోపదేశంబునఁ
       ప్రీతిపై హిత మాచరించుకొఱకు,


ఆ.

నయ్యెఁ గానఁ బెద్ద [3]లాదరించెద రందు
నేర్పుకొలఁదిఁ గృతి యొనర్పఁ బూని
యస్మదీయకృతికి నధిసతిఁ గావింప
నర్హుఁ డెవ్వఁ డొక్కె యని తలంచి.

59

క.

మనమునఁ దలపోయుచు నటు
గను మోడ్చినవేళ యొక్క ఘనతరతేజో
ధనుఁ డస్మత్స్వప్నంబున
ననుకంపాయత్తచిత్తుఁ డై పొడచూపెన్.

60


సీ.

ఆభవ్యుఁ డఖిలచరాచరాంతర్గతుం
       డైనయాదిమవిష్ణుఁ డని యెఱింగి
యాదేవు దివ్యభవ్యావతారంబుల
       నిట్టి యద్భుతమూర్తి యెద్ది యొక్కొ
యని చూచుచో మందహాసచంద్రిక గల్గు
       సింహవక్త్రంబునఁ జెలువమైన
మనుజదేహంబును మహితాంకతలమున
       నక్షీణసంపత్కటాక్షరుచులఁ


తే.

దనరుకాంతయును, సుధాధామరుగ్ధామ
సమము లైన శంఖచక్రములును,
దివ్యమాల్యములును, దివ్యాంబరంబులు
దివ్యభూషణములు దేజరిల్ల.

61


క.

ఆమూర్తికి నీమూర్తికి
నేమి విభేదం బనంగ నింపగు రూప
శ్రీమహిమఁ దనరి మద్గురుఁ
డామూర్తిన కదిసి యుండి యాదర మెసఁగన్.

62


ఆ.

'ఇందు రమ్ము వత్స యేను నీమీఁది కృ
పాతిశయముపేర్మి నరుగుదెంచి
నాఁడ' నమచుఁ బిలిచి నన్నాదరించి ప్ర
హర్షవార్ధి నోలలార్చి యపుడు.

63


చ.

అదె జగదేకవంద్యుఁ డగు నాదినృసింహుని దివ్యరూపసం
పదఁ గనుఁగొంటి సర్వసులభంబుగ; నీకృతిలక్ష్మికి న్వరుం
డొదవె, ఫలించె నీతలఁపు, యోగ్యుఁడవైతి, యశోవిభూతి క
య్యుదధివరేణ్యుచాడ్పున మహోన్నతజీవనవైభవంబునన్.

64

ఉ.

కావున నిమ్మహాత్ము నవిఖండితతేజుఁ, గృపావిధేయు, భ
క్తావనశీలుఁ, బావనతరాంఘ్రిసరోరుహజాతదేవతా
శైవలినీకు, నాకలితచక్రు, నహోబలతీర్థనాయకున్,
శ్రీవనితాధినాథుఁ బతిఁ జేయుము నీకృతికిన్ లసన్మతిన్.

65


వ.

అని యుపదేశించె, నంత నమ్మహామూర్తియుం దదనురూపంబులగు మధు
రాలాపంబుల నన్ను గౌరవించె; నంతన మేలుకని మేను బెద్దయుం బ్రొద్దు
తదీయధ్యానానందనిష్పందంబగు డెందంబుతో ననన్యసులభం బగు నప్ప
రమసౌఖ్యంబు ననుభవించి "నృసింహా! యిది యంతయు నీకృపావిశే
షంబుగా నిశ్చయించి నీమహానుభావంబు భావించి.

66


సీ.

వేదంబు లేదేవు పాదాబ్జములయందు
       ననిశంబు మ్రోయు నయ్యలులభంగి
నలువయేదేవుని నాభిసరోవరం
       బున నంబుపక్షులపోల్కిఁ జదువు
శేషుఁ డేదేవుని చెవిఁ జేరి యాప్తవ
       ర్గమువోలెఁ బరమార్థసమితిఁ బల్కు
నింద్రాదిదేవత లేదేవుఁ గైవార
       మొనరింతు రవ్వందిజనులభంగి


ఆ.

నట్టి దేవదేవు నఖిలాండనాయకు
నాదివిభు నహోబలాధినాథు
వరదుఁ బరమపురుషు శరణాగతత్రాణ
పరునిఁ బ్రస్తుతింప నొరులవశమె.

67


వ.

అట్లు గావున.

68


చ.

వెలయఁగఁ దొంటిపెద్దల కవిత్వమువోలె రుచించునొక్కొ యేఁ
బలికెదునూత్నకావ్యరసభావము లైనను భూమిఁ దల్లిదం
డ్రులకు నిజాగ్రసూనుల పటుప్రచురోక్తులకంటెఁ జిన్నబి
డ్డల వెడతొక్కుపల్కులు దృఢంబగుముద్దుల నీనకుండునే.

69


వ.

[4]అని నీదగు జగద్గురుత్వం బుపలక్షించి” మఱియును.

70

చ.

సదయుఁ డహోబలేశుఁడు ప్రసన్నగుణాఢ్యుఁ డనాధనాథుఁడై
చదువులకుం గరంగఁదు నిజంబగుభక్తిరసోక్తిఁ బోలె మున్
జదివినభార్గవాదులకు సన్నిధి చేసెనె దైత్యజాతుఁ డ
య్యదన సమస్తమందుఁ గల డంటకు దృష్టము చూపిన ట్లొగిన్.

71


క.

ఇది సార మిది యసారం
బిది యల్పము ఘన మిదనక యెందును దానై
వొదలుటఁ దెలుపఁడె దితిసుత
సదనస్తంభమున నెల్ల జగములు నెఱుఁగన్.

72


ఉ.

పోఁడిగ నెందునుం గలఁడు పొ మ్మనుదాసుని జిహ్వనుండియో
వేఁడి రమావిభుం డనెడివీఱిఁడి దైత్యునిదృష్టినుండియో
వాఁ డది వ్రేయు నింక నని వావిరిఁ గంబమునందునుండియో
నాఁ డటు లుద్భవించుట యనం దగు సర్వగతాత్ముఁ డల్పుఁడే.

73


సీ.

మశక పిపీలికా మక్షికా ప్రభృతులై
       చరియించు నజ్ఞానజంతువులకు
దృణగుల్మభూరుహదృషదాదికంబులై
       చను జడస్థావరజాతములకు
నపవర్గసుఖసిద్ధి యఱచేతిధన మన్నఁ
       దెలివియు భక్తియుఁ గలుగునట్టి
జనులకు గమనాగమనశూన్య మగు [5]సౌఖ్య
       గతి [6]బ్రాతె యిది యీయగణ్యపుణ్య


ఆ.

తీర్థసేవన వినుతింపఁ బెంపారున
త్యుత్తమమయి మహి నహోబలాఖ్య
తీర్థ మిట్టిమేటి తీర్థమునకుఁ గర్త
యగునృసింహుమహిమ యడుగనేల.

74


క.

కనుఁగొనిన నధికసుకృతము,
వినినం గల్మషహరంబు, వెలయఁగఁ జిత్తం

బునఁ దలఁప మేలు సేకుఱుఁ,
జనదే హరినాశ్రయంప సత్పురుషులకున్.

75


వ.

అని పురాణవేదు లగు నాదిపురుషులు చెప్పునప్పుణ్యవచనంబులు మున్ను కని యునికింజేసి నిశ్చితుండనై .

76


సీ.

నూతనం బయ్యుఁ బురాతనకృతులట్ల
       సంతతశ్రవ్యమై జరుగు ననియు
నాదిరాజసమానుఁ డగుభోజభూపతి
       చరిత యీకవితాప్రసంగ మనియు
నిందుఁ జెప్పెడికథ లిన్నియు నోలిఁ బ్ర
       శస్తధర్మోపదేశంబు లనియు
నఖిలజగన్నాథుఁ డగునహోబలనాథుఁ
       డీపుణ్యకృతికి నధీశుఁ డనియుఁ


ఆ.

[7]బృథివి నెల్లజనులు ప్రియభక్తి యుక్తిఁ బా
టింతు రనియు నూఱడిల్లి యేను
బరమసౌఖ్యమైన భవదాభిముఖ్యంబు
నెమ్మిఁ బడసి యధికనిష్ఠతోడ.

77


సీ.

వర్ణిత ప్రహ్లాదవాక్యజయ స్తంభ
       మగుమహా స్తంభంబునందు వెడలి
సురసిద్ధఖేచరనరయోగిహృద్ధ్యేయ
       మగుమహోజ్జ్వలకాయ మమరఁ దాల్చి
భూరిదానవవంశపూర్ణతటాకంబు
       కట్ట నాఁ దగు దైత్యుపొట్ట వ్రచ్చి
శిష్టజనప్రజాభీష్టదాససమర్థ
       మగునహోబలతీర్థమందు నిలిచి


తే.

యవని నాబాలగోపాల మగుసమస్త
జీవులకు నందుబడి యైన దేవభూజ

మయ్యె నేదేవుఁ డట్టిమహానుభావు
నాదినరసింహదేవుని నాశ్రయించి.

78

షష్ఠ్యంతములు

క.

అనితరసదృశమహాత్మున
కనిమిషవంద్యునకు బుధజనారాధ్యునకున్
వినమితసుత్రామునకును
ఘనతరకలిదోషతిమిరకమలాప్తునకున్.

79


క.

వినతాసుతగమనునకును
మనసిజజనకునకు నబ్ధిమందిరునకుఁ బా
వనతరమూర్తికి సన్ముని
మనస్సరోజాంచితభ్రమరవర్యునకున్.

80


క.

తామరసోదరునకును
ద్దామభుజావీర్యనిర్జితప్రతిభటపూ
ర్వామరునకు నజరామర
తా మహిమాస్పదునకును బుధప్రతిమునకున్.

81


క.

భవనాశనీనదీతీ
రవివాహోత్సునకు [8]నిందిరావనకేళీ
ప్రవణునకును యోగానం
దవినిర్మలమూర్తికిని సుధామయమతికిన్.

82


క.

శ్రీదేవీవరునకుఁ బ్ర
హ్లాదవచనపాలమోదితాత్మునకు జగ
న్మోదావహకారణునకు
నాదినృసింహున కహోబలాధీశునకున్.

83


వ.

అఖిలజగద్ధితావతారుండ వగు నీకు విన్నపంబు సేయు విధంబుగా నే నొనర్పం
బూనిన కథాప్రసంగం బవధరింపుము.

84

కథాప్రారంభము

క.

సూత్రకథ భోజరాజచ
రిత్రమ, యానడుమ ధర్మరీతులు నీతుల్
చిత్రకథ లై తలిర్పఁగ
శ్రోత్రసుఖముగా నొనర్పఁ జొప్పడి యుండున్.

85


వ.

అదియును దత్తాత్రేయమునీంద్రుండు వక్తయు, మహుం డను కాంభోజ
మహీశుండు శ్రోతయుంగా నధిగతవిద్యాసమాజుండగు భోజుండు పూర్వజన్మం
బున బ్రాహ్మణుండై యుండి దారిద్య్రభారంబు తోరంబగుటవలన సంభవించిన
విరక్తి కారణంబుగాఁ దీర్థయాత్రచేయుచుఁ బ్రయాగయందు నిష్టకామ్యసిద్ధి
పొంది శరీరవిసర్జనంబు చేపి సజ్జనప్రియుండై పుట్టి లాటదేశంబునందు ధారా
నగరంబున కధీశ్వరుండై రాజ్యంబు సేయుచు నొకనాఁడు మృగయావినో
దార్థంబు వనంబునకుం జని యందు సర్పటి యను నొక్క సిద్ధపుంగవుం గని
తన పట్టణంబునకుఁ దోడ్కొని వచ్చుటయు వాఁ డట్లు చనుదెంచి యొక్క
రాత్రి రహస్యవృత్తిం దనప్రభావంబు నెఱపం దలంచి పంచలోహమయంబై
యొప్పు నప్పుడమిఱేని కొలువుచవికెం దనచేతి ధూమవేధి యను నౌషధంబుచేత
శుద్ధసువర్ణంబు గావించి యెందేనియుం బోవుటయు మఱునాఁ డవ్విధంబు
చూచి యాయద్భుతకర్మంబు సర్పటికృతం బని యతని వెదకించి కానక
యొక్క కృతకమతంబున నాకర్షించి భోజుండు ధూమవేధిఁ దా నపహరించు
టయు నతండు కోపించి శాపంబిచ్చుటయుఁ దదీయప్రార్ధనంబున శాపంబుఁ
గ్రమ్మఱించుటయుఁ దదనంతరంబు భోజననిమిత్తంబున భోజసర్పటులకు
సంవాదవశంబున వివిధపుణ్యకథాప్రసంగంబులు పుట్టుటయు నను వృత్తాం
తంబులం గలిగి యిక్కావ్యంబు సర్వజనాకర్ణనీయం బై భోజరాజీయం బను
పేరంబరగుఁ దత్ప్రారంభం బెట్టి దనిన.

86


క.

మహితసముజ్జ్వలతేజుఁడు
విహితాచారైకరతుఁడు వీరవినోద
స్పృహుఁదు బహుకార్యదక్షుఁడు
మహుఁ డను కాంభోజరాజు మహిఁ గడునొప్పెన్.

87

క.

ఆనరపతిరాజ్యంబున
మానవు లందఱును ధర్మమార్గప్రవణుల్
దానత్యాగపరాయణు
లానందరసార్ద్రచిత్తు లధికధనాఢ్యుల్.

88


క.

నరు లడిగినట్ల వానలు
[9]గురియును, సస్యములు పండుఁ గొలఁదికి మిగులన్,
సురభులు ఘనముగఁ బిదుకును,
ధరణిఁ బ్రజావృద్ధి తనరుఁ దద్రాజ్యమునన్.

89


వ.

ఇట్లు సకలజనానురాగం బగు రాజ్యంబు నిరంతరపూజ్యంబై చెల్లుచుండఁ బెద్ద
కాలంబు సనుటయుఁ బురాకృతకర్మంబు కారణంబుగా నప్పుడమిఱేనిమేన
నతినికృష్టంబగు కుష్ఠరోగంబు ప్రవేశించిన నతండు.

90


ఉ.

'అక్కట! యేమి చేయుదు, మహౌషధసేవల దేవసేవలన్
దక్కక యీమహారుజ వృధా పరితాపముఁ బొంద నేల నే
నిక్కడ నుండి చేయుపని యెయ్యది? గౌతమి కేఁగి యందులో
స్రుక్కక మేను వైతు మఱిరోగము గీగము మాను నంతటన్.'

91


క.

అని తలంచి తనదు తలఁ పె
వ్వనికిఁ బ్రకాశింపకుండ వసుధాపరిపా
లనమునకుం దనతనుజ
న్ముని నునిచి నిగూఢమార్గమున వెలువడియెన్.

92


వ.

ఇట్లు కృతనిశ్చయుండై యరుగుదెంచునారాజురాకఁ దన దివ్యజ్ఞానంబున
నెఱింగి యమ్మహానది యాత్మగతంబున.

93


ఉ.

ఈతఁడు నన్నుఁ జొచ్చి తనహేయపుదేహము నుజ్జగించి ప్ర
ఖ్యాతిగ నూర్ధ్వలోకములు గాంచుటకుం జనుదెంచుచున్నవాఁ,
డీతనికుష్ఠగంధము సహించుట దుష్కర మేమిభంగిఁ బోఁ
ద్రోతునొకో యితండు కడుదూరమునంద తొలంగునట్లుగన్.

94


క.

అని తలఁచి తగునుపాయము
గని మునిభామినివిధంబు గైకొని శీఘ్రం

బున నతఁడు వచ్చుమార్గం
బున కెదురుగ నొక్కమ్రానిపొంత వసించెన్.

95


వ.

అయ్యవసరంబున.

96


క.

స్రుక్కినయంగుళములు, దళ
మెక్కినదేహమును, గాంతి యెడలినమొగమున్,
మక్కినచెవులును, ముడిఁగిన
ముక్కును నై వచ్చి మహుఁడు ముద్దియఁ గనియెన్.

97


చ.

కని మునిభామఁగాఁ దలఁచి గ్రక్కునఁ జేరి నమస్కరించి మో
డ్చినకరయుగ్మము న్నుదుటఁ జేర్చిన నావనితాలలామ దీ
వన లొకకొన్ని యిచ్చి “బుధవత్సల' యెచ్చటనుండి వచ్చి? తే
పని కెట పోయే దీవు? పరిపాటిగఁ జెప్పుము నాకు' నావుడున్.

98


వ.

'ఏను గాంభోజదేశంబునుండి వచ్చితి, నాపోయెడిపని యే మని చెప్పుదుఁ దల్లి!
తొల్లి మహామహీభారధౌరేయుండనై యుండునప్పుడు సకలజనంబులకు దృష్టి
ప్రియంబై యుండునట్టి నాగట్టి యొడలి కిట్టి కట్టిఁడిరోగంబు దైవకృతం
బున సంభవించిన.

99


చ.

కడుకొని కామినీజనుల కౌఁగిట నేమని యుండు వాఁడ, నా
కొడుకులఁ బొత్తునం గుడువఁ గొంకక యేమని పిల్చువాఁడ, నా
యెడ కరుదెంచు సేవకుల కేమని యేఁ గొలు విచ్చువాఁడ, నే
కడ చనువాఁడ, నేది కడగా నిటు వేగేడువాఁడ ధీరతన్.

100


చ.

అని మది రోత పుట్టుడు రయంబున గౌతమి కేఁగి యందులోఁ
దనువు తొఱంగువాఁడ నయి తత్పరతం జనుచున్నవాఁడ నే'
ననవుడు 'నమ్మచెల్ల తను వాఱడిఁ బుచ్చుట ధర్మమార్గమే
జనహితు లైనరాజు లిటు చచ్చిన మెత్తురె శాస్త్రకోవిదుల్?

101


చ.

అదియును గాక పూర్వకృత మైన యఘంబులు వ్యాధిరూపమై
పొదివినఁ దాను గైకొనక పోవునె చచ్చినఁ, గర్మశేషమై
వదలక క్రమ్మఱం దగిలి వచ్చుట సిద్ధ ముపాయయుక్తి మై
మెదలినఁ గీడు తప్పుఁ, దుది మే లొదవున్ విను నిక్క మెంతయున్.

102

వ.

కావున నీ కొక్కయుపాయంబు చెప్పెద, సకలజనవిధేయుం డగు నారాయణ
దేవుండు దత్తాత్రేయుం డను నామధేయంబుతో హేమకూటశైలంబున నున్న
వాఁ డందుఁ జనిన నీ కోర్కి సఫలం బగు, నయ్యోగీశ్వరేశ్వరుండును మనుష్యు
లకు దృష్టిగోచరుందు గాఁ డతనిఁ గనుటకై యొక్కమంత్రంబు చెప్పెద నది
యనుష్టించునప్పుడు గౌతమియంచు దర్శనస్పర్శనాదుల వర్జింపవలయు నట్లు
చేయనినాఁ డీమంత్రంబు పని చేయ దని చెప్పి యెప్పుడు నతండ తన్ను
దడవకుండునట్టి వైరాగ్యంబు పుట్టించి యొకమంత్రం బుపదేశించి యతని
మరలించి గౌతమి యథేచ్చం జనియె నది యట్ల కాదె.

103


క.

ఉత్తము లాశ్రితులం గృపా
యత్తతఁ జేపట్టి ప్రోతు, రటు గాకున్నన్
రిత్త చనఁ జేయ రొండు ని
మిత్తంబున నైన బ్రతుకు మెయికొనఁ జేర్తుర్.

104


వ.

అట్లు గౌతమిచేత నివర్తితుం డయి పోయి హేమకూటముం గాంచి రోగ
వేదనం డిగ్గఁద్రావుచు.

105


ఆ.

అట్లు చేరి యాతఁ డాపర్వతాగ్రంటు
నందు నొక్క రమ్యమైనచోట
వివులనిష్ఠతోడఁ దప మాచరింపంగ
మెచ్చి దివ్యవేష మచ్చుపడఁగ.

106


వ.

దత్తాత్రేయుండు దరిసెనం బిచ్చిన మహుండు.

107


ఉ.

అత్రిమహామునీశ్వరు తపోవనిజాత లసత్ఫలంబుఁ దే
వత్రయమాతగాఁగఁ జెలువం బగు నయ్యనసూయనెయ్యపుం
బుత్రుఁడు తోయజాతభవభూతగణేశులతోడఁబుట్టు దాఁ
జిత్రవరితుఁ డంచు నినుఁ జెప్పుదు రార్యులు యోగిపుంగవా!

108


వ.

అని బహుప్రకారంబులఁ బ్రస్తుతించునతని వాగ్జాలంబునకుఁ జాల రంజిల్లి
యమ్మునీశ్వరుండు 'ఓరీ! నీవు నా కందువ యె ట్లెఱింగి' తనిన నతఁడు
భయభక్తిసంభ్రమంబులు ముప్పిరిగొనుచుండఁ బ్రణామంబుఁ జేసి 'దేవా!
యవధరింపు' మని యి ట్లనియె.

109

క.

"రోగమున కోడి ప్రాణ
త్యాగము సేయుటకుఁ దెంపు దలకొనుమదితో
నాగౌతమి కరుగుచు నెల
నాగను బొడగంటి నొకవనస్పతి పొంతన్.

110


క.

కని ప్రణమిల్లిన నయ్యం
గన నావృత్తాంత మడగి కడు వగచి తపో
ధనవంద్యు నిన్నుఁ జెప్పిన
బనివిని నీకృపకు నేఁడు పాత్రుఁడ నైతిన్.

111


వ.

ఆయవ్వ యెవ్వ రగుటయు నెఱుంగ" ననవుడు దత్తాత్రేయుఁడు తన యోగ
దృష్టివలన నది గౌతమి యగుటయు నితనిపాపంబులు భరియింప నోపక
యిట్లు చేసె ననియు నెఱింగి యాతని నూఱడించి “యేను బ్రతిదివసంబును
బ్రాతరుచితకృత్యంబులు ప్రయాగయందుఁ జేయుదు, మాధ్యాహ్నికానుష్ఠానం
బులు హేమకూటపర్వతంబున ననుష్ఠింతు, నిశాసమయకృత్యంబులు శ్రీరంగ
ధామంబున నొనరింతు, నిది నాకు నియమం బై చెల్లు, నీత్రస్థానంబులు నాకు
నతిప్రీతికరంబు లయి యుండు, నట్లు గావున నింత ప్రొద్దు శ్రీరంగంబునకుం
జని రేపకడ వచ్చి నిన్ను రోగవిముక్తుం జేయుదు. నావచ్చునంతకు నిచ్చోటన
యుండు” మని విజయం చేసిన.

112


క.

ఆరాత్రి మహుఁడు తన దు
ర్వారదురితలతలు ఱే పవశ్యము దెగునం
చారూఢిం గౌతుకము మదిఁ
గూరఁగ నిద్రించె నచటఁ గుశలత్వమునన్.

113


వ.

మఱియుఁ బ్రభాతసమయం బగుటయు నమ్మహీపతికి నద్దివసంబున సంభవించు
శరీరనైర్మల్యంబు సూచించుచందంబున నంధకారంబు విరిసె, నతని
యంతర్గతానురాగంబు దీపించురూపం బెఱింగించు తెఱంగున బ్రాగ్దిశాభాగం
బునఁ గెంజాయ పొడమెఁ దదనంతరంబ.

114


క.

జక్కవ లలరఁ, జకోరము
లుక్కడఁ గమలములు విరియ, నొగిఁ గైరవముల్

స్రుక్క, సమస్తజనంబులు
మ్రొక్క, దిశలు వెలుఁగ భాస్కరుఁడు పొడతెంచెన్.

115


వ.

అప్పు డప్పుడమిఱేఁడు యథోచితకృతప్రాతరనుష్ఠానుండై యమ్మునిశ్రేష్టు
నకు నెదురు సూచుచుండె నంత.

116


క.

తొలునాఁ డవ్విభు నచ్చో
నిలిపి చనినయోగిరూప నీరజనాభుం
డెలమి దళుకొత్త లక్ష్మీ
లలనాసహశయనకేళిలాలసగతులన్.

117


చ.

చెలఁగుచు రంగధామమును జెంది విభావరి పుచ్చి, వేఁకువన్
వెడలి ప్రయాగ కేఁగి సురనిమ్నగయందుఁ బ్రభాతకృత్యముల్
సలిపి, నృపాలుపాలికిఁ దలంచినమాత్రన వచ్చెఁ గ్రేపుపై
నొలపినమక్కువన్ సురభి యుద్దవడిం బఱతెంచువాడ్పునన్.

118


వ.

ఇట్లు చనుదెంచి యతని యవయవంబులయందుఁ దన పాదరేణువు చమరి
యరోగదేహుండవు గమ్మని యనుగ్రహించిన.

119


క.

తొడిగినకుప్పస మూడ్చిన
వడువున నా రాజు మేన వపియించినయా
కడిఁదిరుజ లెల్లఁ బాసిన
నొడ లొప్పె సువర్ణహేతి నుజ్జ్వల మగుచున్.

120


చ.

కమలము నాచు వెల్వడి వికాసము నొందినయట్లు, మించుట
ద్దము తెర పుచ్చినట్టులు, సుధాకరబింబము కందు వాసిన
ట్లమరినకాంతి నొప్పె విగతామయభావ మెలర్ప; నమ్మహీ
రమణుని నెమ్మొగంబు రుచిరం బగు నేత్రమరీచు లొప్పఁగన్.

121


క.

తనమేను తాఁ గనుంగొని
మనమున నాశ్చర్యరసనిమగ్నుం డగుచున్
జనపతి ప్రహృష్టమతి న
మ్మునిపతికి బహప్రణామములు దగఁ జేసెన్.

122


వ.

అప్పు డమ్మునీంద్రుండు.

123

ఆ.

'అడుగు మింక నెట్టి యభిలాష?' యనిన 'నా
కింతకంటెఁ గోర్కి యేమి గలదు?
స్వామి! యీకథాప్రసంగంబు వినువారు
నిరయరహితు లగుచు నెగడ నిమ్ము.'

124


వ.

అని జగద్ధితలబ్ధనరుండై యా భూవరుండు.

125


ఉ.

'ఓమునినాథచంద్ర కరుణోర్జితచిత్త! త్వదీయదర్శనం
బేమి యొనర్ప లేదు? కడ యెవ్వరు గానఁగ లేరు నీమహ
త్త్వామృతవాహి, కే ననఁగ నల్పుఁడ, నెంతటివాఁడ, నార్తర
క్షామణి వీవు; నీకు సరి గల్గునె యెన్నఁడు నేజగంబులన్!

126


ఉ.

నీవు జగన్నివాసుఁడవు, నీకు సమస్తము నొక్కరూప; యి
ట్లై విలసిల్లుచుండియుఁ బ్రియంబు ప్రయాగము, హేమకూటమున్,
రా వగు రంగధామము ననంగలరావుల మూఁడు నంటి, ల
క్ష్మీవర! యందుఁ జొప్పడు విశేషము నాకు నుపన్యసింపవే!'

127


వ.

అనిన దత్తాత్రేయుం డి ట్లనియె.

128


క.

యాగంబుల నగుఫలమును
యోగంబులవలన నగు సమున్నతియును నా
నాగమవిహితార్చల నగు
భోగము శ్రీరంగసేవఁ బొలుపుగ నెగడున్.

129


ఆ.

అఖిలతీర్థఫలము నంతనంతం బగుఁ
గాని, రంగధామగామి యైన
యతని కొదవు నపునరావృత్తిసౌఖ్యంబు;
దీనిఁ బోల వితరతీర్థతతులు.

130


వ.

మఱియు హేమకూటమహత్త్వంబు చెప్పెద దత్తావధానుండవై యాకర్ణింపుము.

131


చ.

అజునకుఁ బైఁడికొండయు, సుధాంశుకళాకమనీయమౌళికిన్
రజతనగంబుఁ బోలె, ననురాగ మొనర్ప మదీయబుద్ధికిన్
సుజనవరేణ్య! వెండియును జూతుము విందుము గాని యట్టి య
క్కజ మగు పర్వతంబు మఱి గల్గదు సుమ్ము ధరాతలంబునన్.

132

క.

తక్కటి నెలవులకంటెను
నొక్కటి లక్షయును గోటియును గుణితములై
యెక్కుడు ఫల మొసఁగుట నీ
చక్కటి కెచ్చోటివారుఁ జనుదెంతు రొగిన్.

133


క.

హరిహర విరించు లేకో
దరులయి పుట్టుటకుఁ దాన తానక మగుని
ర్భరవైచిత్రి కలదె పెఱ
గిరులకు నీ హేమకూటగిరికిం దక్కన్.

134


క.

కావున నీ పర్వతము ప్ర
భావము వర్ణింప వశమె బ్రహ్మాదులకున్
నీ వింక వినుము చెప్పెద
భూవల్లభ! యీ ప్రయాగభూరిగుణంబుల్.

135


చ.

అతులితభక్తి యొప్పఁగఁ బ్రయాగజలంబులఁ గ్రుంకునట్టిసు
వ్రతుఁడు పురాకృతాఘనికరంబులు సర్వముఁ బాఱఁద్రోలు ట
ద్భుతమె ప్రయాగ యంచుఁ బెఱతోయములందు మునింగె నేనియున్
క్షితి నతినిర్మలుం డగుట సిద్ధ మతండు ధరాతలేశ్వరా!

136


చ.

వెలయఁ బ్రయాగమందు నొక విప్రున కన్నములఁ బెట్టిరేని న
య్యలఘుఫలంబు కోటిగుణ మై యొదవుం; గ్రతు వాచరించినన్
దలకొని యాగభాగములు తార భుజించు కుతూహలంబునం
దొలఁగక దివ్యతేజములతోఁ జనుదెంతురు వేల్పు లందఱున్.

137


చ.

పరగఁ బ్రయాగ మాఘము ద్విపక్షములందుఁ బ్రహృష్టచిత్తుఁడై
పరువడిఁ దీర్ధమాడుఘనపావనమూర్తి పునర్భవంబులం
బొరయఁడు, వాని వంశమునఁ బూర్వుల కెల్లను సంభవించు న
చ్చెరువుగ నాకలోకసుఖసిద్ధి యనేక సహస్రవర్షముల్.

138


క.

అచ్చుగఁ బ్రయాగలోపల
విచ్చలవిడిఁ దనదు మేను విడిచినమనుజుం
డొచ్చెల్ల! యేమి చెప్పుదు
జెచ్చెరఁ గను నిష్టకామ్యసిద్ధి ధరిత్రిన్.'

139

చ.

అనవుడు నా నరేంద్రుఁడు ప్రియంబున నిట్లను నమ్మునీంద్రుతో
'నొనరఁ బ్రియాగయందు మృతి నొందినమానవుఁ డిష్టకామ్యమున్
గను నని యాన వచ్చి తనఘా' యిట మున్న ప్రయాగయందు
యనువునఁ గన్నవారు గల రయ్య' జగంబున నెవ్వ రేనియున్.

140


వ.

అని తదీయనిదర్శనాకర్ణనకౌతుకాయత్తచిత్తుండై యడిగిన.

141

ఆశ్వాసాంతము

చ.

మృగనరవక్త్రవిగ్రహవిమిశ్రసముజ్జ్వల[10]విస్ఫురత్రయీ
నగశిఖరాధిరూఢ! భువనత్రయపాలనతత్పరోల్లస
త్సుగుణగరిష్ఠ! దానవనీషూదన! శిష్టజనాభినందనా
నుగనుతివాక్యపూజితమనోజ్ఞపదద్వయ! వైష్ణవప్రియా!

142


క.

యోగీంద్రహృదయమందిర!
భోగీశ్వరభోగశయన! భూగగనదిశా
భోగపరిపూర్ణతేజ! ద
యాగుణమణిభూష! నిర్జితాశ్రితదోషా!

143


మాలిని

సజలజలదవర్ణా! సంతతానందపూర్ణా!
త్రిజగదభయకర్తా! దిత్యపత్యైకహర్తా!
వృజినవనకుఠారా! వీరశృంగారసారా!
సుజనగణహృదీశా! సూర్యకోటిప్రకాశా!

144

గద్యము
ఇది వాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ
సుకవిజనవిధేయ ఆనంతయనామధేయప్రణీతం బైన
భోజరాజీయం బను కావ్యంబునందు
బ్రధమాశ్వాసము

  1. మనోదారులు
  2. కొఱకునా
  3. లాచరించెదరంచు
  4. అనిన
  5. నాఖ్య
  6. బ్రాతి
  7. బృథివి నెల్లజనులు ప్రియభక్తి, బాటింతురనియు నూఱడిల్లి యేను
  8. నిందిరాననకేళీ
  9. గురియుచు
  10. పావన