భోజరాజీయము/చతుర్థాశ్వాసము

శ్రీ

భోజరాజీయము

చతుర్ధాశ్వాసము


శ్రీనాథ! సురక్షితనిఖి
లానాథ! దయామయాంతరంగ! శివావా
ణీనాథసంగ! వీర
శ్రీనిర్జితదైత్యరంహ! శ్రీనరసింహా!

1


వ.

అవధరింపుము.


క.

ఆమహునకు నాత్రేయమ
హాముని యి ట్లనియె 'భోజుఁ డట్టులు సిద్ధ
స్వామి తగఁ జెప్పుకథలు మ
నోమోదము గాఢముగ వినుచు ని ట్లనియెన్.

2


ఆ.

'ఇంద్రదత్తుఁ డానరేంద్రపుత్రునిఁ గొంచుఁ
బురికి నరుగఁ దెల్పితిరి తదుత్త
రప్రసంగ మేమి క్రమమున వర్తిల్లె
నంతవట్టు దెలియ నాన తిమ్ము.'

3


వ.

అనిన సర్పటి యి ట్లనియె. న ట్లింద్రదత్తుండు రత్నమండను మనోరథంబు
నందనృపతికిం జెప్పిన నతండు సంతసించి నిజపురోహితుం డగు చంద్ర
శర్మను గార్యం బడుగుడు నాతండు సంపాతియొద్దకుం దగువారి నంపి
క్రియాసిద్ధికిం గడంగుట కర్తవ్యం బనియె.

4


చ.

అనవుడు సంతసించి విభుఁ డార్యులఁ బంపుడు, వార లేఁగి యి
ట్లనికి 'ఘనుండు మాళవనృపాగ్రణి నందుఁడు మద్విభుండు; ద
త్తనయుఁడు రత్నమండనుఁ డుదారుఁడు, వానికి నీదు కూర్మినం
దన నడుగంగ వచ్చితి ముదాత్తచరిత్ర! కళింగభూవరా!

5

చ.

అనిన నతండు నెమ్మనమునం దొగి మోదము ఖేదముం బెనల
గొనఁగఁ బురోహితుం బిలిచి 'కోమలిజన్మఫలంబు మీకుఁ దోఁ
చిన తెఱఁ గంతయుం దెలియఁ జెప్పుఁడు వీరికి, వీరు సమ్మతిం
చినయటు లైన లెస్స, యఱ చేసిన దోషము వచ్చు' నావుడున్.

6


వ.

అతం డక్కన్నియ జన్మించిననాఁ డప్పుడమిఱేఁడు వినంగ నెట్లు చెప్పె నట్ల
పెండ్లి దొరలతోడనుం చెప్పి ప్రియోక్తిగా ని ట్లను.

7


ఉ.

నందనరేంద్రనందనుఁడు నాయకుఁ డౌటకుఁ బుష్పగంధి త
త్సుందరి యౌటకుం బరమశోభనసంపద మద్గృహంబునం
బొందుటకుం బ్రమోదరససింధుతరంగల నోలలాడమే
యందఱుఁ, బాపజాతి విధి యిట్టియరిష్ట మొనర్పకుండినన్.'

8


క.

అని పల్కిన 'నిది యల్పపుఁ
బనియె విచారించి చూడఁ బాడియ కాదే
యనుపుఁ డిదె పోయి వచ్చెద'
మని జనపతితోడఁ జెప్పి రప్పెండ్లిదొరల్.

9


ఆ.

మరలి పోయి నందధరణీశుతోడఁ జె
ప్పినఁ దలంకి యిట్టు లనియె నాతఁ
'డద్ది రన్న చచ్చినంతటి కల గన్న
నోలి మేలుకనియె యుండవలయు.

10


ఉ.

ఎక్కడి పుష్పగంధి, మఱి [1]యెక్కడి మత్సుఁతు డేమి గాఁగ నీ
మక్కువ లుల్లసిల్లెఁ గొఱమాలినదైవము త్రిప్పి త్రిప్పి పెన్
జిక్కులఁ బెట్టె నే నెటులు చేయుదు, దుఃఖము చూచి చూచి యా
ది క్కటు లుండ నిండు సుగతిం బెఱచోటుల లేరె కన్నియల్.'

11


చ.

అనవుడు రత్నమండనుఁ డనఁగశిలీముఖపాతభీతుఁడై
జనకునిఁ జూచి 'తక్కటి విచారము లేటికిఁ బుష్పగంధికై
తను వెటు లైన నేమి వసుధం బెఱ రాజతనూజ లేల య
య్యనిమిషనాథుపుత్రిదెస నైనను నాహృదయంబు నిల్చునే.

12

సీ.

ఆపద్మముఖిఁ బాసి యేపోఁడిమియు లేక
       పచ్చవిల్తునిచేతఁ జచ్చుకంటె
నిగ్రహం [2]బేద పాణిగ్రహోత్సవసౌఖ్య
       మాపోవఁ దొలి తొలి ననుభవింతు
నటమీఁద బ్రతుకు దైవాధీన మె ట్లయ్యె
       నయ్యె గా కేమి సేయంగ వచ్చుఁ
జావు లేకుండ నాజముచేత నాకుఁ దె
       చ్చినవారు గలరె యీ సృష్టియందు


ఆ.

[3]నడుము నడిఁకి యున్న నడుఁకునె బడె పెట్టు
వీర లెల్ల నీతివిదులు గారె
దూరభీతిఁజేసి చేరువ నగుకీడు
తప్పఁద్రోచు వెరవు చెప్పఁ గలరె.

13


చ.

అని కడుఁ దెంపు చేసి సుతుఁ డాడినమాటకు మాఱు పల్క నే
రనిమొగమోట నానృపతిరత్నము కొండొక వెచ్చనూర్చి నె
మ్మన మెరియంగ భూసురసమాజముఁ గన్గొని దీనభావ మా
ననమునఁ దోఁప మేనఁ జలనంబు గడుం బొదలంగ ని ట్లనున్.

14


క.

'ఓ విప్రవర్యులార! మ
దావాసమునందుఁ జెందునశుభంబులఁ బోఁ
ద్రోవను, సంతతశుభములు
గావింపను మీర కారె కర్తలు మాకున్.

15


ఉ.

కావున మాకు సేమ మగు కార్యము నేర్పడఁ జెప్పుఁ' డన్న నా
భూమిబుధాగ్రగణ్యులు ప్రభూతమతిం దలపోసి చూచి దే
వా! వెఱఁ గంద నేటికి భవత్తనయుండు గుణాధికుండు మా
దీవనఁ బెక్కువర్షములు తేజ మెలర్పఁగ జీవితుం డగున్.

16


ఆ.

విప్రభక్తి గలఁడు వినుము నీతనయుఁ డా
తనికి ధర్మదేవతయ సహాయ

మొనరఁ గలదు గాని మొండు గానేర దీ
సంశయంబు విడువు జనవరేణ్య!'

17


వ.

అనిన నవ్విప్రోత్తములమాట తనకొడుకు బ్రతుకు వృద్దికిం బూఁటగా మైకొని
రత్నపురాధీశుం డాపుండరీకపురాధీశునితో వియ్య మంద నియ్యకొని సపరి
వారంబుగా సంపాతినగరంబున కేతెంచె నయ్యవసరంబున.

18


సీ.

పుణ్యనిర్మలజలంబులను సుస్నాతుఁడై
       తడి యొత్త విమలవస్త్రములు దాల్చి
కస్తూరికామిశ్రగంధంబు మై నిండ
       నలఁది మాణిక్యమయంబులైన
కంకణాంగదహారకర్ణావతంసాది
       కలితభూషణముల నలరఁ దొడిగి
యంచితసౌరభోదంచితకించిదు
       త్ఫుల్లనానావిధపుష్పదామ


ఆ.

కములు దనరఁ బూని కల్యాణచిహ్నలు
గొమరు మిగుల మంచుఁ గొండయింటఁ
బరిణయముగ నరుగు పరమేశ్వరుండును
బోలె నొప్పె నానృపాలసుతుఁడు.

19


క.

ముందరఁ బురోహితుండు, పి
ఱుంద సచివుఁ, డాయుధపు మెఱుంగులు మెఱయన్
గొందఱు భటు లిరుగెలకుల
దందడి నడతేర వందితతి నుతియింపన్.

20


క.

భేరీజయఘంటాది మ
హారావములును వసుంధరామరవిజయా
శీరుక్త సుశబ్దములును
గౌరీకల్యాణవిభవ గానధ్వనులున్.

21


ఉ.

పౌరుల సాధువాదములు బాంధవకోటి ప్రమోదభాషలున్
వారవధూవిదూషకజనంబుల నాగరికంపుమాటలున్

బేరణి యై దిగంతములఁ బిక్కటిలంగ నపారవైభవో
దారత యుల్లసిల్లఁగ నతం డరుదెంచె వివాహవేదికిన్.

22


ఉ.

అప్పుడు బిట్టుబిళ్ళు విభుఁ డాతరుణిం గనుఁగొన్నఁ బువ్వుఁదే
రుప్పరవీథిఁ దోలుకొని యుగ్రగతిం బఱతెంచి కాముఁడే
చొప్పునఁ జూపునో తన ప్రసూనశరంబులవాఁడి యంచు వా
తప్పక చాటు వెట్టిన విధంబున నత్తెర యెత్తి రత్తఱిన్.

23


వ.

మంగళాశీర్వాదపురస్సరంబుగా సుముహూర్తం బనుచు మౌహూర్తికుండు
జయఘంటపై నక్షతలు చల్లిన

24


ఉ.

కంగున ఘంటపైఁ గొడుపు గ్రక్కున వైచుచుఁ దూర్యనాదముల్
నింగియు దిక్తటంబులును నిండఁగ విప్రులవేదనాద ము
ప్పొంగి చెలంగుచుండఁ దెర పుచ్చిన ముచ్చట వోవఁ జూచి ర
య్యంగజుఁ డార్వ నొండొరుల యాననపద్మము లావధూవరుల్.

25


ఉ.

అంతఁ బురోహితానుమతి నక్షతపాత్రలు సేరఁ దేర న
క్కాంతయుఁ గాంతుఁడున్ ముఖవికాసము లొప్పఁగ దోయిలించి య
త్యంతపుఁబ్రీతి నొండొరుల యౌఁదలలం దలఁబ్రాలు వోసి రం
తంతకు మేనులందుఁ బులకాంకురజాలము లుల్లసిల్లఁగన్.

26


తే.

పొలఁతి ప్రాణేశుతలఁ బ్రాలు పోయునపుడు
సిగ్గునెపమునఁ దనదు దోసిలి యొకింత
తడవునకుఁ గాని వదలదు తచ్ఛిరోజ
కరసరోజసంస్పర్శసౌఖ్యంబు మరగి.

27


క.

తలఁబ్రాలు వోయుచో నవి
తలవెండ్రుక లింత సోఁకి తన దగు బాహాం
గుళములు దక్కటియంగం
బుల కెక్కటి సేయ రాజపుత్రుఁడు మెఱసెన్.

28


క.

గుణమణియుత యగుసతిల
క్షణ మది ప్రాణేశ్వరునకు శాశ్వతసుఖకా
రణ మని యిటు చేసె ననఁగ
గుణమణియుతఁ జేసె విభుఁడు కోమలి నంతన్.

29

చ.

అతనునిఁ గెల్తు నీసతి సహస్థితి గల్గిన వంచునో, పురా
కృతసుకృతోపభోగతతికిం గుదు రీసతి యంచునో, యనా
గతఘనదుర్దశందలఁగఁగా వెర వీసతి గాంచు నంచునో,
యతఁ డిటు చేసే నాఁగఁ దరళేక్షణహస్తముఁ బట్టెఁ బ్రీతితోన్.

30


వ.

ఇవ్విధంబున నప్పల్లవపాణిం బాణిగ్రహణంబు చేసి శచీసమన్వితుం డగు
శతక్రతుండునుం బోలె ననుపమతేజోవిశేషవిరాజితుం డగు నయ్యవస
రంబున.

31


తే.

నేఁటిపట్టునఁ బగ లింత నిడివి యైన
నంగనాలింగనోత్సవాభ్యర్థి యైన
యానృపాత్మజుఁ డెట్లోర్చు ననుచు నర్కు
డతని కవకాశ మిచ్చినయట్లు గ్రుంకె.

32


క.

దంపతుల రాగరసముల
పెంపో, మన్మథతమంబు పెంపో యనఁగా
సొంపగుసంధ్యారాగప
రంపరయును జీఁకువాలుఁ బ్రబ్బెఁ బయిపయిన్.

33


వ.

తదనంతర సమయంబున.

34


చ.

జలజభవాండ మొప్పెఁ గలశంబువిధంబున, నందులోన ను
జ్జ్వల మగు చంద్రికాపటలి సన్నుతి కెక్కెఁ బయఃప్రపూరమై,
లలిత కలాకలాపసదలంకృతచారుసుధామరీచి యిం
పుల గని యై తనర్చెఁ బయిఁ వొంపిరి గట్టిన మీఁగడో యనన్.

35


క.

ఆరాత్రి పుష్పగంధికి
గారవమున జలక మార్చి కై సేసి సఖుల్
కోరి నృపాత్మజుశయ్యా
గారమునకుఁ దెచ్చి యతనిఁ గదియించుటయున్

36


సీ.

జలజాక్షి దన్ను నెచ్చెలులు పానుపుమీఁద
       నునుచుచోఁ బెనఁగక పెనఁగుటయును

సెజ్జకు వచ్చియుఁ జెలులు నవ్వెద రని
       మో మెత్తఁగా నోడు [4]ముగ్ధతయును
నొక్కొకపనివెంట నువిద లేఁగినఁ జిత్త
       మూటాడుచుండంగ నుండుటయును
జిట్టంటుచేఁతల సిగ్గు కీ లెడలించి
       పలికింప నల్లనఁ బలుకుటయును


తే.

దనువు పులకింప నధరామృతంబు గ్రోలి
కౌఁగిలించిన మర్మంబు కరఁగుటయును
దనకు నత్యంతసౌఖ్యప్రదంబు లగుచు
నలర సురతోత్సవాబ్ధిటె నోలాడె విభుఁడు

37


ఆ.

 ప్రధమరతమునందుఁ బంచసాయకతంత్ర
మంతవట్టు దనకు నవగతముగ
నభ్యసించె ననఁగ నయ్యింతి భర్తచి
త్తంబు వట్టు బహువిధంబులందు.

38


ఆ.

బాహ్యరతులఁ దొలుత బాలకి గరఁగించి
కూటమందు గెలుపు గొందు ననుచుఁ
గదిసి విమఁడు దాన కరఁగఁ జొచ్చుఁ బరస్ప
రానురాగమహిమ యడుగనేల.

39


వ.

ఇట్లు లబ్ధమనోరథుండై యా రత్నమండనుండు కతిపయదిసంబులకు సంపాతి
నృపతిచేత సత్కృతుండై యపారవిభవంబారఁ బుష్పగంధినిం దోడ్కొని
తన పట్టణంబున కరిగి నందమహారాజునకు నంబికాదేవికి నమస్కరించి యథా
సుఖవిహారంబుల నుండి యుండి యొక్కనాఁడు.

40


క.

మారుఁడు రమ్యారామవి
హారంబున మెఱయుమాడ్కి, నప్పరిసరకాం
తారమున కేఁగి ధీరో
దారుఁడు రాకొమరుఁ డేకతమున మెలంగన్.

41

ఉ.

క్రూరపుఁ జూపులు న్నిడుదకోఱలు నుగ్రపుమోము నెత్తుటం
బేరినకోరమీసములు బిఱ్ఱనవెండ్రుకలుం గృశత్వముం
గూరినదేహము న్వెడఁదకుక్షియు ఘోరరవంబు గల్గి యే
పారిన బ్రహ్మరాక్షసుఁ డుదగ్రబలుం డొకఁ డవ్వనంబులో.

42


చ.

ఉరుధరణీజశాఖపయి నుండి ఘనధ్వనిఁ దన్నుఁ బిల్వ సుం
దరతరవక్త్ర మెత్తి వెసఁ దప్పక చూచి కుమారుఁ డాత్మన
చ్చెరువడి పుష్పగంధికయి చెప్పిన యప్పలుకు ల్దలంచి 'యే
వ్వరికిని మీఱ రా దజుఁడు వ్రాసినవ్రా' లనుమాట దప్పునే.

43


ఆ.

ఆలతాంగిఁ బెండ్లియాడి తొమ్మిది ప్రొద్దు
లయ్యే నేఁటితోడ నదినిమిత్త
మై కదా భయంకరాకృతితోఁ బొడ
చూపె బ్రహ్మరాక్షసుండు నేఁడు.

44


క.

అని కొండొక చింతింపఁగ
ననుమానం బేల నాకు నాహారముగా
నిను నియమించె నజుఁడు ర
మ్మని వెండియుఁ బిల్చె నాతఁ డాగ్రహ మెసఁగన్.

45


వ.

ఇట్లు నెట్టుకొని పిల్చుచున్న బ్రహ్మరాక్షసునకు ధైర్యగుణమండనుం డగు
రత్నమండనుందు సవినయంబుగా ని ట్లనియె “నయ్యా! నీ యానతి నేను
జేసెద నా కొక్క విన్నపంబుగల దది యాకర్ణింపుము.

46


సీ.

'ఏను బోయినజాడ యెఱుఁగక నాతల్లి
       దండ్రులు నెంతయుఁ దల్లడిలుచు
నుండుదురో నన్ను నోరంత ప్రొద్దును
       నేత్తి పెంచినదాది యెంత వగచు
చుండునో నాచేయు నుద్యోగముల కెల్ల
       ననుకూలుఁ డై వచ్చు నాప్తుఁ డింద్ర
దత్తుఁడు దానెంత తలఁకునో నాకు దో
       సిలి యొగ్గి యే సౌఖ్యములును లేక

ఆ.

పుష్పగంధి యెంత పొగులునో యేఁ బోయి
వారి కెల్ల నుచితవచనరచనఁ
జేసి యూఱడించి శీఘ్రంబ వత్తు నీ
యాన నన్నుఁ బనుపు' మనిన నతఁడు.

47


తే.

'అవుర పులిచేతఁ జిక్కిన యతఁడు విడిచి
పోయి క్రమ్మఱి వచ్చుట బొంకు గాదె
తళియఁ బెట్టినయశనంబు తలఁగఁద్రోఁచి
పిదపఁ గుడివెద ననువాఁడు బేలకాఁడె.

48


క.

అది గాక నీవు చని వ
చ్చెద ననుటయుఁ, బిదప నీవు చేరేదవని నే
వదలుటయు ననుయుక్తంబులు;
చదురుఁడ వగు దేని రమ్ము చయ్యనఁగదియన్.'

49


చ.

అనవుడు 'నోమహాత్మ! యిటు లాడఁగనేటికి నీదు సమ్ముఖం
బున నిటు పల్కి నాకు మఱి బొంకఁగ వచ్చునె సర్వజీవులం
దును మనుజత్వసిద్ధి గడుదుర్లభ మట్టిమనుష్యదేహ మె
త్తిన తుదిఁ గల్ల లాడి సుగతిచ్యుతి నొందునె యెట్టినీచుఁడున్.

50


ఉ.

కావున నాకు బొంకు పలుకం బని లేదు, వృధా వినాశమై
పోవఁగ నున్న యీచెనఁటి బొంది భవాదృశు లైన పెద్ద లా
పోవఁగ నారగించుటకుఁ బూని సమర్పణ చేయరా దొకో'
నావుడు నాతఁ డుగ్రముగ నవ్వి 'యి వేటికి నిన్ని మాటలున్.

51


క.

ప్రత్యయపరిపాలకుఁ డగు
నత్యుత్తముఁ డెచటఁ గల్గు? నప్పటి పనికై
సత్యోక్తులు పచరింపఁగ
నత్యాచారంబు మది ననాచార మగున్.'

52


వ.

అనిన నతం డతని కి ట్లనియె.

53


క.

'మనుజుఁడ, సత్సంగతి గల
మనుజేంద్రసుతుండఁ గల్ల మాటాడెదనే

మును తిర్యగ్జాతి యనం
జనుధేనువు సత్యనిష్ఠ సల్పుట వినవే.'

54


క.

అనవుడు 'నాకథ యెట్టిది
వినవలయుం జెప్పు' మనిన 'విప్రవరేణ్యా!
విను' మనుచు రత్నమండనుఁ
డెనయంగా నతనితోడ నిట్లని చెప్పెన్.

55

గోవ్యాఘ్రముల కథ

సీ.

ఒకవిప్రవర్యుని హోమధేనువు నిత్య
       సత్యవర్తిని, సదాచారమూర్తి,
కలహంబునకుఁ బోదు, కలిగినంతనె తుష్టి
       నొందు, సందడి కోర్చు, నుఱ్ఱు వేయ
వలవదు, పిదుకుచో వరవృష్టిధారల
       చెలువునఁ జన్నులు చేఁపి కురియుఁ,
దెవు లెఱుంగదు, ఱొమ్ము తీండ్ర సాలఁగఁ గల్గి
       కురుమట్టమై చాలఁ గూడియుండు,


తే.

నిట్టిగోరత్న మొక్కనాఁ డేకతంబ
పోకు మేయుచునుండ బెబ్బులి యొకండు
దానిఁ గనిపొంచి యొడ లెల్ల దాఁచి వాల
మవనిఁ దాటించుచును వ్రేయ నడరుటయును.

56


క.

కళవళము లేక 'యోహో
నిలు నిలు' మని సురభి యిట్లనియెఁ జయ్యన న
ప్పులితో 'నాకొక చన వీ
వలయు వివేకించి నాదు వాక్యము వినుమా.'

57


క.

అనినఁ బులి గోవుపై నె
త్తినకేలును భీషణాకృతియుఁ బటమున వ్రా
సినచిత్తరురూపువిధం
బున ఖచరుల కద్భుతంబు పొదలఁగ నుండెన్.

58

చ.

పులి యటె, దీపనాసలము పొంగున మ్రోఁగుచు నున్కి యట్టె, యి
మ్ముల నొకపాఁడిగో వపుడు ముందటికిం జనుదెంచు నట్టె, హో
నిలు మనినం బయం బడక నిల్చికనుంగొను నట్టె బాపురే
కలఁగక యాడుమాట లయకాలుని నైన శమింపఁ జేయదే.

59


వ.

ఇట్లు నిల్చి యప్పుండరీకం బాధేనువున కిట్లను 'నామిషార్థినై వచ్చు నన్నిట్లు
వారింప గారణం బేమి? నీ వేమి చెప్పెడు? చెప్పు' మనిన నది దాని
కి ట్లనియె.

60


చ.

మును మునుఁ బుట్టె నాకు నొక ముద్దులపట్టి, యతండు పుట్టి యే
డెనిమిదినాళ్ళపాటి గలఁ డింతియ, పూరియు మేయ నేరఁ డేఁ
జని కడుపారఁ జన్గుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
మ్మని సుకృతంబు గట్టికొనవన్న దయాగుణ ముల్లసిల్లఁగన్.

61


వ.

అని పల్కుచుఁ దనలో ని ట్లని విచారించు.

62


క.

'రేపు చను గుడిపి వచ్చితి
నేపున నం దంద పరువు లిడి యంతటిలో
నాపుడిసెడు నఱగినఁ గొడు
కేపాటులఁ బడునొ వాని కెయ్యది గతియో.

63


ఏ నఱ్ఱు నాకు నుండఁగఁ
దా నను నండ గొని చెవులు దాల వయిచుచున్
మే నెఱుఁగక యుండెడు నా
కూనకు నెవ్వారు దిక్కొకో యిట మీఁదన్.

64


సీ.

 నన్నుఁ గానక పోయి నాపుత్రుఁ డేయావు
       పొదు గైనఁ దొడుకంగఁ గుదిలి కొనుచుఁ
గొమ్మున నదరంటఁ జిమ్మునో సుడిసిన
       నడ్డంబు దాఁకునో గొడ్డుటావు
లుగ్రమహోక్షంబు లోండొంటిఁ దొడరుచోఁ
       ద్రొక్కునో జఠరాగ్నిఁ బొక్కిపడుచుఁ
బొరుగిండులకు నొంటిఁ బోవఁ గుక్కలు దోలి
       కఱచునో గతిమాలి యఱచుకొనుచు

ఆ.

దిరిగి తిరిగి యధికదీనవక్త్రముతోడఁ
దోఁట దొడ్డి చొరఁగఁ దోలఁ బోయి
పడుచు పైద వెంటఁ బడి నొవ్వ వడుచునో
యేమి సేతు' నంచుఁ బ్రేముడించు.

65


వ.

అంతఁ దన యంతరంగం బంత యెఱింగిన నప్పులి సంశయించునో యను
తత్తఱంబునం జిత్తం బొక్కింత చేసికొని వైవర్ణ్యంబు దోఁపనీక క్రమ్మఱ
నమ్మొద వి ట్లనియె.

66


ఉ.

గుమ్మెడుపాల నాసుతునకుం బరితృప్తిజనించుఁ గాని మాం
సమ్ము సమస్తముంగొనక చాలదు నీ యుదరాగ్నికైన, ని
క్కమ్ముగ నిందులోఁ బ్రధమకార్యవినిర్గతి నీ వెఱుంగవే,
పొమ్మనవన్న! వ్యాఘ్రకులభూషణ! చయ్యనఁ బోయి వచ్చెదన్.

67


చ.

అనవుడుఁ బుండరీక మపహాస్యము చేసి 'యి దేమి గోవ! యి
ట్లనియెదు, నన్ను బేల్పఱచి యాత్మజుఁ డున్నెద కేఁగి సత్వరం
బునఁ జనుదెంతు నంటి, విది పోలునె, చెప్పెడువారు చెప్పినన్
వినియెడువారి కించుక వివేకము పుట్టదె యింత యేటికిన్.

68


ఆ.

గుండె నిమురుకొనుచుఁ గొడుకుపాలికి నేఁగి
కడుపు నిండఁ జన్ను గుడిపి నీవు
నెమరు పెట్టుకొనుచు నెమ్మది నుందుగా
కిచటి కేల వచ్చె దెఱిఁగి యెఱిఁగి.

69


వ.

అనిన నప్పుండరీకంబునకు వివేకంబు లేదు గదే యని శోకంబు నొందుచు
నా గోకులరత్నంబు వ్యాఘ్రంబునకు నిట్లను 'నే నిన్ను నొకకొన్ని వేష
భాషలం బ్రమోషించి యట పోయి క్రమ్మఱ రాకుండుదు నని నను నమ్మనేర
విది సాధులక్షణంబె? యే నసత్యవచనురాలనె?

70


క.

ఒక యితిహాసము చెప్పెద
నకలంకత వినుము, సూనృతాత్ముల చరితల్
సకలాఘక్షయకరములు
సుకృతనిధానములు కర్ణశోభితలీలల్.

71

వ.

అయ్యితిహాసం బెట్టి దనిన మగధదేశంబునందు [5]నంభీరుం డనునొక్క
మహీపాలుండు పెద్దకాలంబు తనకు సంతానంబు లేక భూదేవతల రప్పించి
పుత్రకామేష్టి సేయింప నయ్యగ్నికుండంబువలన నొక్కతేజోమూర్తి యగు
కొడుకును, నొక్క యధికస్వరూపిణి యగు కూఁతురుం బుట్టిన నయ్యిద్దఱకుం
గ్రమంబునఁ బావకలోముండును మదనరేఖయు నను నభిధానంబు లొనరించి
పెనుపుచుండునంత నయ్యిరువురు తండ్రినియోగంబున విద్యాభ్యాసంబు
సేయుచు.

72


చ.

సదమలయుక్తిఁ జేసి గురుసన్నిధిఁ బావకలోముఁ డోలిఁ బ్రాఁ
జదువులు ధర్మసంహితయు సామజశిక్షయు నశ్వశాస్త్రముం
బొదలెదు నస్త్రసాధనయు భూపతినీతియు గానవిద్యయున్
మొదలగు విద్య లెల్లఁ దుదిముట్ట నెఱింగెఁ బరిస్ఫుటంబుగన్.

73


క.

అతని సహోదరి యగు న
య్యతివయుఁ దగఁ గావ్యనాటకాలంకార
ప్రతతు లొగి నభ్యసించుచుఁ
జతురత మై నుండె నొక్కసమయమునందున్.

74


సీ.

నూఁగారుఁదీఁగెకు నూతనావాలమై
       తనరారు నాభిరంధ్రంబుఁ జూచి
సుభగత్వలక్ష్మికి సోపానమార్గమై
       రమణీయమగు వళిత్రయముఁ జూచి
యౌవనశబరు చే నమరుమారెడుపండ్ల
       క్రియ నందమగు కుచద్వయముఁ జూచి
ముఖచంద్రమండలంబునఁ దోఁచునమృతపూ
       రము భంగి మధురాధరంబుఁ జూచి


తే.

గురుతనూజుండు మనమునఁ గోర్కి నిగుడఁ
దోడిశిష్యుల నందఱు వీడుకొలిపి

వనిత నేకాంతమందిరంబునకుఁ దెచ్చి
కదియవచ్చిన నది వానికళ లెఱింగి.

75


చ.

ఇటు తగు నయ్య విప్రుఁడ వహీనగుణాఢ్యుఁడ వీవు, నీకు నే
మిటి కిటువంటి దౌష్ట్యము? శమించునె మజ్జనకుండు విన్నఁ? ద
క్కటిజను లేమి యండ్రు? మదిఁ గాంక్షయె కల్గిన నగ్నిసాక్షిగా
జిటికెన వట్టి కాక వృధ సేయుట ధర్మమె కన్యకాత్వమున్?

76


క.

పడతికిఁ గన్యాధర్మం
బెడలినఁ గొఱ యగునె వెండి యెవ్వరి కైనం
గడివోయినపువ్వులు మఱి
ముడుచునె రసికుఁ డగువాఁ డమోఘవివేకా!

77


ఉ.

కావున వీవు న న్గదియఁ గారణ మేమి తొలంగు' మన్న నా
భూవిబుధుండు 'నీవు నను బొందక పోయెద నన్న మైమెయిం
బోవఁగ నేల నిత్తు' నని పూని నృపాత్మజ నంటఁబట్టి వ
స్త్రావరణంబుఁ బుచ్చుటయు హస్తము చాచి విదల్చి వైచుచున్.

78


చ.

'తలకల మంచివాఁడవు గదా గురుపుత్రుఁడ వంచు నిన్ను నోఁ
బలుకక యున్న నీగతిని బాడి తొఱంగెదు చాలుఁ జాలు మా
టలపని యేల? వేగిరపడం బనిలే దబలుండ! యింటివా
రల కెఱిఁగించి నీచెనఁటిరంతులు సర్వముఁ జక్కఁ జేసెదన్.

79


చ.

అని కడుఁ దూలపోఁ బలుక నగ్గురుపుత్రుఁడు మూర్ఛ నొంది మే
దిని కొఱగంగ నవ్వనిత దిగ్గనఁ బట్టి నిజాంకపీఠ మా
తని కుపధానమై వెలయఁ దా నొనరించి మొగంబు చూచి ము
క్కునఁ బవనంబు లేమికి దిగుల్పడి కుత్తుక యంటి చూచుచున్.

80


క.

'అక్కట నాగురుపుత్రుం
దెక్కలిఁ గోల్పడితి, నెద్ది తెఱుఁగో, విప్రుం
డెక్కడి కెక్కడఁ దలఁచెను
దృక్కరణోన్మాద మింత తీవ్రం బగునే.

81


క.

గురుపత్నిఁ జంద్రుఁ డమ్ముని
వరపత్నిఁ ద్రివిష్టపైకవల్లభుఁడు పరా

శరుఁ డోడరేవుపడఁతిని
మరుగుటఁ గనువేదు ఱితరమర్త్యుల వశమే!

82


తే.

నాకుఁగా నీతఁ డిటు మరణంబు నొందె
నేని నా కెంత పాపమో, యిప్పు డితని
కోర్కి దీర్చితినేని నా కులములోన
నెంత హీనత వచ్చునో యేమి సేతు.

83


వ.

నని చింతించి యొక్క యుపాయంబు [6]గాంచి.

84


క.

తొడ చఱచి పేరఁ బిల్చుచు
నొడికంబుగఁ గరసరోజ మురమున నిడుచున్
వెడఁ గదలుఱెప్ప పొడ గని
వడఁతుక యొకకొంత డిందుపడియెడు వగతోన్.

85


క.

'అనఘా! యిది యెంతటి పని,
విను నా దెస నీకు నింత వేడుక గలదేఁ,
గను దెఱచి చక్కఁ జూడుము
మనలో మన కింత గలదె మతిహీనుఁడవై.

86


క.

నవ్వితి వై నను గాకే
నివ్విధ మి ట్లెఱుఁగుదును మహీసుర! నిను నే
నొవ్వం బలికితిఁ గరుణకు
దవ్వగుపని సేయ నేను ధర్మేతరనే.”

87


చ.

అనిన నతండు “నావలన నాదరణంబు తలంచియిట్లు [7]పే
ర్కొనియెడుఁ ; గంటి మంటి" నని గొబ్బునఁ గన్నులు విచ్చిచూచి పై
కొనఁగఁ దలంచినం గుసుమకోమల తత్తఱపాటు లేని నె
మ్మనమున విప్రుఁ జూచియిటు మానుము నీ కిఁక వేగ మేటికిన్.

88


క.

ఏ నొక్కటి నిను వేఁడెద
దానిం గాదనక నీవు దలకొని చేయం
గా నోపిన విద్వద్విను
తా! నీచిత్తంబుఁ బట్టుదానఁ బ్రియమునన్.'

89

వ.

అనిన నవ్విప్రుండు దమకించి.

90


క.

‘ధన మైనఁ బ్రాణమైనను
వనజానన! యేను నీకు వంచింతునె యే
పని యైన నడుగు మిప్పుడ
యొనరించెద' ననిన నప్పయోరుహముఖియున్.

91


క.

ధన మడుగఁ బ్రాణ మడుగన్
విను పరిణయ మైనపిదప నే నీయెడకుం
జనుదెంచి కొని మత్ప్రియు
నెనయఁగ నేఁ బొంద నాకు నీవర మీవే.'

92


చ.

అనుటయు 'బాపు బాపు నను నాసలపా లొనరించి నెమ్మదిం
జనువెర వె ట్లెఱింగితి, విచారవిమూఢున కైన నీవు ప
ల్కినపలు కియ్యకో లగునె? లేమ! వనంబున జున్ను రేఁచి తి
య్యని మధుపాన మొల్లక రయంబున నొండులపాలు సేయునే.

93


చ.

అది యటులుండె నీ విచటి కప్పుడు వచ్చెద నంటి వౌ, నినుం
గదలఁగ నిచ్చునే విభుఁడు? కాని ప్రసంగము లేల? నీవు నా
తుది నఱ లేక వచ్చుటకుఁ దొయ్యలి! యెవ్వరు పూఁట యంతకుం
బదిలము నిల్వ లేను, మరుబారికిఁ ద్రోవక నన్నుఁ గావవే.

94


క.

యాదృచ్ఛికసురతంబును,
జూదంబున గెల్వఁబడిన సొమ్మును, నుత్క్రో
శాదులు నప్పటి కప్పుడు
కాదే మఱి దుస్సిపోవుఁ గాక నిలుచునే.

95


క.

ఈవేళఁ దప్పిపోయిన
నావల నొకనాఁడు వత్తుననునది నిజమే
నీ వెంత చెప్పినను మ
ద్భావము నమ్మ' దనియతఁడు దాఁ బల్కుటయున్.

96


సీ.

' నా రాక సిద్ధమ్ము నమ్మునీ,' వని పెక్కు
       భంగుల శపథముల్ పలికి యబల

'విను మిదె యామ్నాయవిదుఁ డైనవిప్రుఁడు
       ధర్మప్రజార్ధమై తగినకన్య
నరసి పెండిలియాడ నరుగుచో విఘ్నంబుఁ
       గావించుపాపానఁ బోవుదాన
నప్పుడు రాకున్న' నని పల్కఁ' 'బోఁబోలు'
       ననియె నాగురుపుత్రుఁ, డట్ల పలికి


తే.

యరిగె రాజపుత్రి మరుసాయకము గుఱిఁ
దూఱ నాఁటి తిరిగి దొనకు నేఁగు
నట్లు నిర్వికారయానంబుతోఁ గీర్తి
సదన మైన తండ్రి సదనమునకు.

97


వ.

అంత నయ్యంతికిం దంత్రి యను రాజకుమారుండు వరుండై ప్రధమసంగ
మోత్సవసముత్సుకం బగు మనంబున దూతికాజనంబులం బనుప వార లచ్చె
లువం బిలువం బోయిన.

98


ఆ.

ఆనృపాలపుత్రి యాదటఁ గై సేసి
యతనుపాలి కరుగు రతియ పోలె
నరిగి యరిగి మున్ను గురుతనూజునితోడఁ
బల్కినట్టి కడిఁదిబాసఁ దలఁచి.

99


చ.

మదిఁ దలపోసి 'యాగురుకుమారునితో నలనాఁడు మత్పతిం
గదియుటకంటె మున్ను నినుఁ గానఁగ వచ్చెద నమ్ము మంటి, నీ
యదన నితండు నన్ను గవయన్ గుతుకంబునఁ బిల్వఁ బంచె నా
కదియు నవశ్య, మిప్పనియు నర్హమ, యెయ్యది యాచరింతునో.

100


సీ.

విప్రుపాలికిఁ బోయి వేగ వచ్చెద నన్న
       నృపదూతికల నాకు నిల్ప రాదు
మగనికోరిక దీర్చి మఱి వత్తు నని యేను
       జనిన నసత్యదోషంబు వచ్చు
నీపూట దప్పించి యెల్లి చూచెద [8]నని
       పతి వేడ్కఁ జెఱుచుట పాడి గాదు

పతితోన చెప్పి యీపని యొనర్చెద నన్న
       నెఱుఁగ రా దాతని హృదయసరణి


ఆ.

ధర్మసూక్ష్మ మెవ్విధము దుర్బలప్రబ
లంబు లెఱిఁగి నిశ్చయంబు సేయు
వార లెవ్వ రిచట వాక్రుచ్చి యొకరితో
జెప్ప రాదు త్రోపు సేయ రాదు.'

101


వ.

అని డోలాయమానమానస యగుచు నమ్మానవతి ధర్మస్థితికిం బతియనుమతియ
ముఖ్యగతిగాఁ దనమతి నిశ్చయింప దూతిక లచ్చెలువం బతితల్పంబున నిడి
తొలగి చనిరి.

102


తే.

అంత నయ్యింతి తన యంతరంగమందు
నతఁడు తనుఁ బొందఁ బై పడునంతకంటె
మున్న యీ మాట వినిపింపకున్నఁ గార్య
మనువు పఱచుట దుస్తర మని తలంచి.

103


ఉ.

చెప్పఁగ జూచి సిగ్గువడుఁ జెప్పఁగఁ, జెప్పకయున్నఁ దీర, దేఁ
జెప్పెదఁ గాక యంచుఁ దెగి చెప్పఁ దలంచు, ని దేమి మాటగాఁ
జెప్పుదుఁ, జెప్పినం బతియుఁ జిత్తమునం గలుషించునో, పరుల్
చెప్పెడువార్త కాదనుచుఁ జెప్పఁగఁ బూనునుఁ, జెప్పఁ గా దనున్..

104


క.

అప్పడఁతి యివ్విధంబున
ముప్పురి గొను సంశయంపుముంపునఁ బతికేఁ
జెప్పక యిది మఱి యెవ్వరు
చెప్పెద రని చెప్పఁ జూచుఁ జెప్పఁగ వెఱచున్.

105


ఆ.

అట్ల కాదె ముగ్ధ యటె, క్రొత్తపెండిలి
కూఁతు రట్టె, మగఁడు లాఁతి యట్టె,
యదియుఁ బ్రధమసంగ మాసన్నవేళటె,
సిగ్గు పేర్మి వేఱ చెప్ప నేల.

106


క.

అవి యన్నింటిని మిగులదె
భువి నెందును లేని యితరపురుషప్రారం

భవిచారము పతియెదురన
యవమానపుఁబనిని నాలు కాడునె తడవన్.

107


వ.

ఇట్లు విచారించి యెట్టకేలకుఁ దెంపుచేసి యజ్జనపతికి సాష్టాంగనమస్కారంబు
చేసి ముకుళిత కరాంబుజయై యున్న నాతఁ డత్తెఱవ తెఱం గెఱుంగక
వెఱఁగుపడి తన కెంగేలం బట్టి లేవనెత్తి యాలింగనంబు సేయుచుఁ దల్పంబు
మీఁదికి రాఁ దిగిచి 'మృగాక్షీ! యేను భవదీయలక్షణపరతంత్రుండనకదా
నీ వాంఛితం బెద్దియో వెఱవక యెఱింగింపుమనవుడు నమ్మగువ 'దేవా! యే
నొక్క విన్నపంబు చేసెద నది యుక్తం బైన నయు క్తంబైన నీ కనుగ్రహిం
పక పోరా దవధరింపు' మని యతనిచి త్తంబునకుఁ గినుక వొడమకుండునట్లుగా
నల్లనల్లనం జెవికిఁ జల్ల నగునట్లు మృదుభాషావిశేషంబుల నగ్గురుపుత్రు నభి
లాషయుం, దన వగు పరోష ప్రతిభాషలకు నోడి యతండు వాతాహతభూజంబు
నోజ నేలం గూలుటయు, నక్కారణంబున బ్రహ్మహత్య సిద్ధించె నే నేమి
సేయుదు నని తల్లడించి యతని బోధించుటకై తత్సమయసముచితవచనంబుల
నుపచరింపం బెద్దయుం బ్రొద్దునకు నతండు దైవాధీనంబునం జైతన్యంబు
నొంది క్రమ్మఱఁ దనతోఁ బరిచర్య సేయం దలంచినప్పు డప్పూపు దప్పింప
నొండువెరవు దొరకొనమిఁ దా న ట్లొడంబడి యెడ పల్కిన విధంబునుం
జెప్పి యప్పొలంతి మఱియు ని ట్లనియె.

108


సీ.

సుదతి కన్యాత్వవిచ్యుతి పొందు టపకీర్తి
       గాని పత్యనుమతి నైనకర్మ
మె ట్లైన మే లని యే నప్పు డతనికిఁ
       బరిభాష చేసితిఁ, బార్థివేంద్ర!
యిప్పు డాపరిభాష దప్పిన దోషంబు
       ప్రాపించు, సతి కైన పాతకంబు
పతిఁ బొందు నని చెప్పఁబడు నట్లుగావున
       వినిపింప వలసె నీ వివర మెల్ల


తే.

 నింక నిటమీఁద నీచిత్త మెట్టులుండె
నటుల చేసెద నానతి' మ్మనిన నాతఁ
డుల్ల మత్యంతచింతాపయోధి మునుఁగ
శిరము గంపింపఁ జేసి యచ్చెరువు నొంది.

109

క.

అతివలు సాహసకర్మణు,
లతిమాత్రము వారిబుద్ధి య ట్లై యునికిం
జతురానునకు నైనను
సతుల గెలువరాదు సహజసామర్ధ్యమునన్.

110


క.

ఎఱిఁగి యెఱిఁగి యొరుపాలికిఁ
దెఱవఁ బనుచుపనికి సమ్మతింపదు చిత్తం
బఱిముఱి నసత్యదోషము
పఱతెంచుట సిద్ధ మెట్లు పనుపక యున్నన్.

111


క.

ఎయ్యది కర్తవ్య మొకో
యియ్యెడ నాలోచనమున కెవ్వఁ డొకో తో
డయ్యెడు వాఁ డీ కార్యము
వయ్యము గాకుండఁ జేయవలయు వెరవుతోన్.

112


చ.

అని తలపోయుభర్తకుఁ బ్రియంబున ని ట్లను 'నింత నీమనం
బున ననుమాన మేమిటికిఁ బుచ్చఁ దలంచిన నన్నుఁ బోయి ర
మ్మను, మటు కాక నీవు వల దన్నను మానెద' సత్యనిష్ఠతో
నెనయఁగ రావుసుమ్ము మఱి యెన్నితపంబులు నీజగంబునన్.

113


క.

ధన మెల్లఁ బొలియునంతటి
పని పుట్టిన నాలి బిడ్డఁ బాసి నిరాశన్
జనునట్టియెడరు పుట్టిన
జనుఁ డేమఱకుండవలయు సత్యవ్రతమున్.

114


క.

తొల్లి హరిశ్చంద్రమహీ
వల్లభవల్లభుఁడు సత్యవాక్యము ధరణిం
జెల్లించె నతనివర్తన
మెల్లజగంబులఁ బ్రసిద్ధ మెఱుఁగమె కథలన్.

115


వ.

అది యట్లుండె నింక నొక్క విశేషంబు.

116


క.

అతివలమాయలు పెక్కులు
పతుల మొఱఁగఁ దలఁచి రేని పట్టఁగ వశమే

పతిభక్తివిరతలగు న
య్యతివలు గైకొనరు గాక యాదుర్గుణముల్.

117


క.

పతి దన కేడుగడయ గాఁ
బతియానతి మౌళిఁ బూని పతిచిత్తం బే
గతి నుండు నట్ల మెలఁగెడు
సతి గల్గినఁ బుణ్యగతి సుసాధ్యము పతికిన్.

118


వ.

ఇట్లు నడవక.

119


చ.

పెనిమిటిఁ దిట్టుచున్ సతులఁ బ్రేల్చుచుఁ బండులు గీటుకొంచు స
జ్జనుల నిరాకరించుచు నసత్యము లాడుచుఁ గన్నవారితో
డన కలహించుదున్ జోరనిఠావులు చొచ్చుచు విందు వీడు వ
చ్చినఁ దల యంటఁ గట్టుకొని జిఱ్ఱునఁ జీదుచు బిట్టు మూల్గుచున్.

120


చ.

తన కడుపార ము న్గుడిచి తా నొకనాఁడును గూటిపొంతఁబో
వనియది వోలె మోము దిగవైచుచు నూరకె కాళు లీడ్చుచున్
వనరుచు నింటివాకిటికి వచ్చినవారలముందటం దగం
బనివడి లేమి చెప్పుచు నభాగ్యుఁడు వీఁ డని భర్త దూఱుచున్.

121


ఆ.

భాండశుద్ధి లేక పరగ దేవాతిధి
పూజనములపొంతఁ బోక నీచ
వర్తనమున మెలఁగు వనిత ప్రాణేశున
కుభయలోకహాని యొనరఁ జేయు.

122


క.

కావునఁ బురుషుల కెందును
భూవల్లభ! మేలుఁ గీడుఁ బొందించుటకున్
భావింప ముఖ్యహేతువు
లావనితాజనుల కాక యన్యులు గలరే.

123


ఆ.

అధిప నానిమిత్తమై నీకుఁ బాపంబు
సంభవించుపనికిఁ జాలఁ గాన
నింత చెప్ప వలసె నింక నీ తలఁ పెట్టి
దట్ల చేయుదాన నాన తిమ్ము.'

124

చ.

అనవుడుఁ బాపభీతుఁ డగు నానరనాథుఁడు నాతిఁ జూచి 'నీ
కనితరసాధ్య మైన పరమార్థవివేకము కల్మిఁజేసి యే
ట్లనిననుఁ జెల్లు, నీ పలికినట్టుల పంతము దీర్చి రమ్ము పొ'
మ్మనుడు నమస్కరించి గృహ మల్లన వెల్వడి నిర్వికారతన్.

125


చ.

అనిమిషకన్యయో దితిసుతాన్వయకన్యయొ వీడు చూడవ
చ్చినవనకన్యయో యనఁగఁ జెన్నెసలారుచు నిండి సాంద్రమై
ఘన మగు చీఁకటిం గుసుమగంధి నిజాభరణప్రభావళుల్
దన కటు త్రోవ చూపఁగ ముదంబున నొంటియె యేఁగుచుండగన్.

126


వ.

భయంకరాకారుఁ డగు నొక్క రాక్షసుండు రాచవీథి నన్నాతికిఁ బొడసూపిన.

127


క.

ఆరాక్షసుఁ గన్గొనియును
నారాజీవాక్షి యంతరంగమునఁ బతిం
గోరి తలంచుచు వెఱవక
బోరనఁ జనుచుండ దనుజపుంగవుఁడు మదిన్.

128


క.

వెఱఁగు పడి యెట్లొకో యిటు
వెఱవనిచందంబు దీనివిధ మేర్పడఁగా
నెఱుఁగవలయు నని వెస డ
గ్గఱఁ జని వస్త్రాంచలంబు కరమునఁ బట్టెన్.

129


ఉ.

పట్టిన నేమియుం దిగులుపాటు మదిం బొరయంగ నీక యా
కట్టిఁడిదైత్యుఁ జూచి 'యనఘా! తగువాఁడవు కావె నీవు, నన్
బట్టుట ధర్మ మయ్య! పరభామఁ బతివ్రత నేను; నన్ను తోఁ
బుట్టువుగాఁ దలంచి వెసఁ బో విడు మంకిలి సేయ నేటికిన్.

130


ఆ.

అనిన నాతఁ డప్పు డమ్ముగ్ధపలుకు వి
దగ్ధభాష లద్భుతంబుఁ జేయు
నర్ధరాత్ర మెచటి కరుగుచున్నది దీని
వర్తనంబు దెలియ వలయు ననుచు.

131


ఉ.

ఎవ్వరిదాన వీవు? కుల మెయ్యది? యెయ్యది నీదు పేరు? నీ
కెవ్వఁడు భర్త? యొంటి నిటు లెవ్వనియింటికి మధ్యరాత్ర మీ

వెవ్వరుఁ గానకుండ వెస నేఁగెదు? నా కెఱిఁగింపు' మన్నఁ దా
నవ్వుచు నిర్వికారవదనంబున వాని మొగంబు చూచుచున్.

132


సీ.

మాతండ్రి యంభీరుఁ, డాతని సతియైన
       కుంభిని మాతల్లి, గుణగరిష్ఠుఁ
డైనపావకలోముఁ డన్న, రాచకొలంబు
       మాయది, నా పేరు మదనరేఖ.
నాభర్త తంత్రిభూనాథుండు, నేఁ జను
       పనియును జెప్పెద వినుము తెలియ'
నని తన్ను గురుపుత్రుఁ డాసించుటయు వాని
       కప్పుడు దాఁ బల్కిన శపథగతియు


ఆ.

భర్తచే ననుజ్ఞ పడసి యిప్పుడు వానిఁ
గానఁ బోవుచున్నదాన ననియు
విచ్చి చెప్పి వెలఁది విని దైత్యుఁ డి ట్లని
పలికె నతికఠోరభాష లెసఁగ.

133


ఉ.

ఎక్కడి పేదపాఱుఁ డిల, నెక్కడి నీ పరిభాష. నేఁడు ని
న్నక్కడి కేఁగు మంచు వెలయాలినిఁ బోలె వివేకహీనుఁడై
తక్కక యేమిగాఁ బనిచెఁ తంత్రివిభుం, డిది యట్టు లుండె, నేఁ
జిక్కినవాఁడ నాఁకట భుజింపఁగనిమ్ము భవచ్ఛరీరమున్.

134


వ.

అనిన విని బెదరు గదురని మదితో నమ్ముదిత యాయదయహృదయున కి ట్లనియె.

135


తే.

'కడఁగి యుదరాగ్ని యార్చుటకంటె నెక్కు
డైనసుకృతంబు గల దయ్య! యసురవర్య?
యోర్చి యుండు నీయాఁకలి దీర్చు దాన
యరిగి యిచ్చట నున్నట్ల తిరిగి వచ్చి.'

136


ఉ.

నావుడు 'మేలు మే లబల న న్నిట వెఱ్ఱులఁ బెట్టి నెమ్మదిం
బోవఁగఁ జూచె దీ వగునె, బుద్ధివిహీనుఁడఁ గాను, మోసపోఁ
బో, విబుధు ల్సహాయ మయి పూని కడంగిన సంగరంబునన్
జేవ యడంచి పుత్తు, నిను జెంది భుజింతును మాంసఖండముల్.

137

క.

అని దనుజుఁడు ధట్టించిన
వనజానన పల్కు 'నంతవాఁడవు గాదే
నిను నిప్పుడు గాదంటినె
విను యుక్తాయుక్తపదవివేకము వలదే.

138


క.

ఆరయఁ బెద్దలు దుష్టా
హారము గొన రెట్టిచోట నవ్విప్రునితో
నారీతిఁ బల్కి బొంకిన
నీరోఁతశరీర మెట్టు లిం పగుఁ జెపుమా.

139


ఉ.

ఆతనిపాలి కేఁగి యనృతాహ్వయదోషముఁ బొందకుండ సం
ప్రీతునిఁగా నొనర్చి సుచరిత్రత యొప్పఁగ నిందు వచ్చి ని
ష్పాతక మైన మే నొసఁగఁ బంచిన వేడ్క భుజింతు గాక ధ
ర్మేతరు నట్లు నీ కిచట నేటికి నిట్టి వృధా వివాదముల్.

140


చ.

అనవుడు దైత్యుఁ డి ట్లనియె 'నాడినయట్టుల చేయువారలుం,
బనివడి మున్ను గొన్నటుల పైకొని యప్పులు దీర్చువారలుం,
బొనరిన మేలుగీడులకుఁ బొంగక క్రుంగక యుండువారలున్
మనుజులలోన నుత్తము; లమర్త్యులు మెత్తురు తచ్చరిత్రముల్.

141


ఆ.

అట్టిమనుజు లుర్విఁ బుట్టరు, పుట్టిర
యేని నెందుఁ దఱచు గానఁబడరు,
వెల యెఱుంగరాని విపులార్థరత్నము
లుదధియందు నొదిగి యున్నయట్లు.

142


వ.

కావున సూనృతవ్రతనిరతు లగుట దుర్లభం బదియును గాక.

143


క.

బొంకుల కెల్లను మూలము
పంకజముఖు, లట్టినిన్నుఁ బాటిగఁ గొనినన్
గ్రుం కిడి యరుగుదు [9] గా కీ
వంక మరలి చూచిచేర వాలాయంబే.'

144


వ.

అనినం జిఱునవ్వు నవ్వుచు నవ్వనిత యి ట్లనియె.

145

చ.

ఒక ఘటికాద్వయంబు పని కూరక యింత విచార మేల?యిం
చుక యిటు నిల్చి నా నిజము చూడు నిశాచర! భూమి తోయ పా
వక పవనాంబరంబులు దివంబులు రాత్రులు సాక్షి నాదుమా
టకు నిదిగాక నీ మన సొడంబడ నే శపథంబు సేయుదున్.'

146


వ.

అనిన నమ్మగువకు రక్కసుందు వెక్కసపడి యి ట్లనియె.

147


క.

'నడిరేయి నిదురముంపున
నొడ లెఱుఁగక యున్నయతని నుగ్రగతిం బై
పడి పొడుచుక్రూరనరుఁ దే
గెదుగతి కేఁగెదు సుమీ మగిడి రాకున్నన్.'

148


చ.

అనవుడు నట్ల కాక యని యాసతి విప్రునియింటి కేఁగి య
ల్లన నతఁ డొంటి యున్కఁ బదిలంబుగఁ జూచి సమీపమందు ని
ల్చినఁ గని బిట్టుబిఱ్ఱఁ దన చిత్తము జల్లన మోము దేఱుకోఁ
గనుఁగొని 'యింత ప్రొ ద్దిటకుఁ గామిని! రాఁ గత మేమి?' నావుడున్.

149


క.

'విను మెఱిఁగి యెఱిఁగి నీవి
ట్లనఘా! న న్నడుగ నేల యలనాఁటం గో
లెను నీకోర్కికి మీ దె
త్తిన నాయౌవనము నుద్ధృతిం గనుఁగొనవే.

150


చ.

అనవుడు నద్దిరన్న మగనాలవు రాజతనూజ వీవు మ
జ్జనకుని శిష్యురాలవు పొసంగునె యెంతకు నెత్తికొంటి యో
వనిత! నమశ్శివాయ, తగువారలబిడ్డలు నిట్టి నీచవ
ర్తనముల కియ్యకొందురు గదా యిటువంటివ పో ప్రమాదముల్.

151


క.

కులహానియుఁ గులవృద్ధియుఁ
గులవనితలు మెలఁగునట్టి కుచరిత్రములం
బొలు పగుసుచరిత్రములం
దలకొనుఁ గాక మఱి యె వ్విధంబునఁ గల్గున్.'

152


చ.

అనవుడు నవ్వధూటి హృదయంబునఁ గొండొక లజ్జ నొంది యీ
యన యొక శిష్టు వోలె నిటు లాడెడు, వీనికి మాఱు పల్కకుం

డినఁ దగ దంచు ని ట్లనియె 'డెందము చందము నీకు నెటొకో
కనుఁగొన వల్లనాఁడు తమి గాంచి ప్రబుద్ధుఁడ వైతె యింతలోన్.

153


క.

ఎఱుఁగనివారి యెదురఁ బలె
నఱిముఱి మెఱమెచ్చుమాట లాడఁగ నేలా
నెఱవాది వగుదు నీ లా
గెఱుఁగమె ముని ముచ్చుఁదనము లేమిటి కింకన్.

154


సీ.

సన్న్యస్తచిత్తుల సంసర్గఁ గరకకా
       యలు కొన్ని నమలితో, యంత కంత
కశనంబు దఱిగి దేహము కొవ్వు చెఱచితో,
       యిల్లాలికన్నుల కింత వెఱతొ,
యిటు నటుఁ బో నని యే యింతి కైనను
       బాసలు చేసితొ, బలిమిగాను
వీథులఁ దిరుగంగ వెసఁ దలారులు పట్టి
       కొజ్జాను జేసిరో సజ్జవారి,


ఆ.

యూర కేల నన్నుఁ జేర వింతవిరక్తి
పరుఁడ వెట్లు నన్నుఁ బట్టి పెనఁగి
తల్లనాఁడు? నాఁటి యుల్లంబుపొగరు నేఁ
డెందుఁ బోయె మదనుఁ డేమి యయ్యె?

155


క.

అటు గాక దుష్టనిగ్రహ
పటుబాహాబలుఁడు నాదుభర్త యగుట న
న్నిట నీవు గదియ నోడెదో
కటకట! మగతనము లేదుగా నీయందున్.

156


క.

వెఱవకు మత్ప్రియునకు ని
త్తెఱఁ గెఱిఁగించి మఱి యరుగుదెంచితి; నీ వీ
పిఱికితన ముడిగి నను డ
గ్గఱుమా పోవలయు నాకుఁ గడుఁ దడ వయ్యెన్. '

157


ఉ.

నావుడు నాద్విజుండు 'మును నా కటు చేసినబాస దప్ప కి
ట్లీవనజాక్షి వచ్చి తగ నిప్పుడు నెట్టుకొనం దొడంగె నే

నేవిధిఁ ద్రోచువాడఁ బరమేశ్వర! మారవికార మెత్తి యా
త్రోవకుఁ జొచ్చితి న్మొదల, దోషముగాఁ గొని యిప్పు డోడెదన్.'

158


చ.

అనుచు నృపాలపుత్రి వదనాబ్జము గారవ మొప్పఁ జూచి 'మ
జ్జనకుఁడు నీగురుండగుటఁ జామ! సహోదరి వీవు నాకు, నే
రనీపని చేసి నాఁ డటులు రాగ మెలర్పఁగ నిన్నుఁ గొంగు వ
ట్టినదురితంబు వాయుటయె దెప్పర మైనది యంత చాలదే.

159


క.

నీ పంతము చెల్లించితి
నీపతికడ కేఁగు మింక నీ సూనృతని
ష్ఠాపారీణత జగమున
దీపించుం గాక సంస్తుతికిఁ బ ట్టగుచున్.

160


క.

అని దీవించిన నవ్వుచు
వినయంబున మ్రొక్కి యతని వీడ్కొని వేడ్కన్
జనుదెంచె బాల యే లొకొ
చని రా దని దనుజుఁ డాత్మ సంశయపడఁగన్.

161


వ.

అట్లు చనుదెంచిన యారాజపుత్రి నిర్వికారభావంబు నిరీక్షించి యారాక్షసుం
డి ట్లనియె.

162


ఆ.

'తావి గొనని పుష్పదామంబువిధమునఁ
జిదుమఁ బడని మావిచిగురు భంగిఁ
ద్రావఁ బడని నవసుధాధార పగిదిని
జెలువఁ జూడ సురతచిహ్న లేదు.

163


క.

ఇతరు లెఱింగినఁ దిరిగితొ,
యతఁ డచ్చట లేఁడొ, నీకు నతనికి మాటల్
గతి గూడక యుండిన వ
చ్చితొ, యంతయు నున్నరూపు చెపుమా నాకున్.'

164


వ.

అనిన నయ్యసురకు నబ్బిసరుహనేత్ర యి ట్లను 'నీ విప్పుడు చెప్పినయంత
రాయంబు లెవ్వియు లేవు. మద్భాగ్యనిమిత్తంబున నతనిచిత్తంబు ధర్మా
యత్తం బగుటయు నా వెఱ్ఱి దిరిగి సహోదరింగా నన్ను మన్నించి మర
లించిన నీయాఁకలి తీర్చుటకు నతిత్వరితంబున నిట కేతెంచితి.

165

తే.

ఇంకఁ దడవు సేయ నేటికి నసురేంద్ర!
జిహ్వ తృప్తితో భుజింతుఁ గాక
నాశరీర మనుచు నాతి యాతనిసమ్ము
ఖమున నిల్చె ముఖవికాస మెసఁగ.

166


క.

నిలిచిన గని వెఱ గందుచుఁ
దల యూఁచి కరాంగుళంబు దనముక్కుపయిం
జెలువుగ నిడుకొని 'దానవ
కులమున నేఁ బుట్టి చెనఁటికుక్షికిఁ గాఁగన్.

167


ఉ.

చంపితిఁ బెక్కుజంతువులఁ జాన! భవత్సము లైన సత్యవా
క్సంపద గల్గువారిఁ బొడగాన; దురాత్ముఁడ నైననాకు సి
ద్ధింపక యున్నె దుర్గతి? సుదృష్టి యెలర్పఁగ శుద్ధదేహిఁ గా
వింపఁ గదమ్మ! నన్ను' నని వేగమ వ్రాలెఁ బదద్వయంబునన్.

168


వ.

ఇట్లు వ్రాలిన.

169


క.

'అన్నన్న! యేల యిటువలె
నన్న! మిగులఁ బ్రొద్దు వోయె నాఁకొని కృశమై
యున్నాఁడ ' వనుచు నెత్తెఁ బ్ర
సన్నవదన యగుచు హస్తజలజాగ్రమునన్.

170


క.

ఎత్తిన లేచి కరద్వయ
మెత్తి లలలాటమున మోపి 'యిందుముఖీ! య
త్యుత్తమధర్మపథమునకు
నుత్తునిఁ గావించి కార్యయుక్తిఁ దెలుపవే.

171


క.

విను నీ సూనృతనిష్ఠయు,
ఘనుఁడగు నీ మగనిపెంపుఁ గడపట న వ్వి
ప్రుని వైరాగ్యంబును నా
మనమునకుఁ బ్రమోదరసనిమగ్నతఁ జేసెన్.

172


వ.

 కావున నాకు ధర్మోపదేశంబు చేసి పురాకృత దుష్కృతంబులకు నిష్కృతి
గావింపు' మనిన నవ్వనిత యి ట్లను 'నీ విప్పుడు క్షుత్పీడితుండవై యున్న
వాఁడ వస్మదీయదేహం బాహారంబుగాఁ గొని తృప్తుండవై మఱి నీ వెవ్వరి

చేత నైనను నుపదేశంబు గొనుము "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం”
బనుట వినవే' యనినఁ జెవులు మూసికొని యతండు 'తల్లీ! నీ విట్లాన
తిచ్చుట యుచితంబె, భవత్సాన్నిధ్యంబు నాభాగ్యవిశేషంబునం బొడమె, నా
యెఱుకతీఁగె సుడివడకుండ నీవిమలవాక్యజాలం బను ప్రాఁకువెట్టి ప్రోది
సేయుదు గాక, యుపేక్షించుట రక్షకుల లక్షణంబె? ' యనిన నాదనుజేంద్రు
నకు మనుజేంద్రనందన యి ట్లనియె.

183


క.

రక్కసు లెక్కడ ధర్మం
బెక్కడ యేయూరి కరయ నేత్రోవ మనం
బెక్కడికి నీడ్చె నీడ్చిన
యక్కడి కరుగంగనైన య ట్లయ్యెఁ దుదిన్.

184


క.

అది గాక ధర్మమార్గము
వదలక చనుబుద్ధి నీకు వాలాయంబై
యొదవిన నెట్టనఁ దగఁ జె
ప్పెద విను' మని చెప్పఁ దొడఁగె బింబోష్ఠి యొగిన్.

185


ఉ.

బొంకకు మెన్నఁడున్ దనుజపుంగవ! శాంతివహించి యుండు, మే
వంకను జీవబాధ లగువాని నొనర్పకు, శౌచివై గతా
హంకరణుండవై ఘనదయామతివై విజితేంద్రియుండవై
పంకజనాభదివ్యపదపంకజభక్తిపరాయణుండవై.

186


ఉ.

నెమ్మది నుండు, నీకు నిది నేమ, మిహంబుఁ బరంబుఁ గోరువా
రిమ్మహి నెవ్వరేనిఁ బరమేశు రమారమణీశు యోగిహృ
త్సమ్మతు సర్వలోకహితు సచ్చరితు న్మదిఁ గొల్వ రట్టివా
రెమ్మెయి నైనఁ గానఁగలరే కలదే మఱి దిక్కు వారికిన్?

187


క.

హరిభక్తివిరహితుం డగు
నరుఁ డసురాంశంబువాఁ డనంగను విందున్
హరిభక్తి గల్గె నేని న
సుర యైనను దేవతాంశజుం డనఁ బరగున్.

188


వ.

తొల్లి ప్రహ్లాద విభీషణాదు లగు నసురపుంగవులు హరిభక్తినిరతు లగుటంజేసి
యెం తెంత వా రైరి, వారి నిప్పుడు రాక్షసు లనవచ్చునె, వైష్ణవధర్మంబునకు

సాత్త్వికగుణంబు ప్రధానం బగుఁ గాని కులంబు ప్రధానంబు గా దిది పరమ
రహస్యం' బని యుపదేశించి, 'నా యొడఁబాటు చెల్లెఁ బొ'మ్మవి మరలించి
యతని వీడ్కొని చూడ్కులు దళుకొత్త నత్తన్వి నిజేశుపాలికిం జనియె;
నయ్యసురయు నది మొదలుగాఁ గ్రూరకర్మంబులు విడిచి హరిచరణస్మరణంబ
శరణంబుగాఁ దపంబు చేపి వైకుంఠప్రాప్తుం డయ్యె, నయ్యంతి యిట్లు సని
తంత్రిభూనాథునకుఁ దన పోయి వచ్చిన వృత్తాంతం బంతయుం జెప్పిన విని
యతండు దన యతివసూనృతోక్తియు బ్రాహ్మణునివిరక్తియు నసురవరుని
భక్తియుం దలపోసి సంతోషించుచుండె; నంత నయ్యిరువుర యంతఃకరణ
శుద్ధికి మెచ్చి శ్రీవిభుండు ప్రత్యక్షమయిన నవ్వధూవరు లిట్లని స్తుతించిరి.

179


క.

నీకంటెఁ బరము లేదు వి
వేకింప ముకుంద! వేదవేద్యులు నీది
వ్యాకృతి ప్రతిదివసము నా
లోకింపుదు రంతరంగలోచనశక్తిన్.

180


క.

నినుఁ దలఁప నెల్లదురితము
లును బొరియు దవానలంబులో వైచినమె
త్తనిదూది వోలె నిన్నుం
గనుఁగొన్నఫలంబు చెప్పఁగా నేల హరీ!

181


క.

కోరికల కెల్ల నెక్కుడు
కోరిక యగుమోక్షలక్ష్మిఁ గోరక యైనం
జేరును భవదీయపదాం
భోరుహములు నమ్మియున్న బుధులకుఁ గృష్ణా.'

182


చ.

అని కొనియాడుదంపతుల కాజగదేకగురుండు ప్రీతి ని
ట్లను 'మహి నేరికిం బడయ నబ్బని సూనృతనిష్ఠ మీమనం
బునఁ జలియింప కున్కిఁ గృప పుట్టి వరం బొక టిత్తు వేఁడుఁ డీ'
రవిన మహాప్రసాద మని యచ్యుతలోకము వేఁడి రిమ్ములన్.

183


ఉ.

వేఁడిన 'నల్ల కాక పృథివిం జిరకాల మభీష్టసౌఖ్యముల్
పోడిఁగ మీరు గాంచి మఱి పొందెద [10]రున్నతి' నంచుఁ జెప్పి యా

వేఁడివెలుంగు లోలిఁ బదివేలసహస్రము లున్నభంగి నె
వ్వాఁడు వెలుంగు నట్టిబుధవత్సలుఁ డేఁగె నదృశ్యమూర్తియై.

184


క.

ఆరమణీరమణులు నిం
పారఁగ బహువత్సరంబు లైహికసుఖముల్
గోరి యనుభవించి తుదిన్
జేరిరి హరియందు సుప్రసిద్ధము గాఁగన్.

185


ఉ.

కావున సత్యవాక్యము జగంబున నెక్కువ యండ్రు సర్వధ
ర్మావళియందు, నిట్టి సుమహత్త్వమునం గల సూక్ష్మధర్మ మేఁ
బోవఁగఁ ద్రోతు నయ్య చెడఁ బొందికగాం గ్రియ మాలి' యంచు న
గ్గోవు ప్రియంబునం బులికిఁ గొంకక చెప్పినచంద మంతయున్.

186


చ.

గొనకొని బ్రహ్మరాక్షసునకున్ మనుజేశ్వరనందనుండు చే
ప్పె ననుచు సిద్ధపుంగవుఁడు ప్రీతి జనింప నుపన్యసించె భో
జున కని యత్రిపుత్రుఁడు విశుద్ధచరిత్రుఁడు విస్తరించినన్,
విని మహుఁ డంతరంగమున వేఁడుక తీఁగె లెలర్ప నిట్లనున్.

187


ఆ.

'ఇంత యొప్పు నయ్య! యితిహాసచాతురి
శ్రుతిసుఖంబు నాత్మహితము నగుచు
జాదులను హరిప్రసాదంబు నైన నే
చంద మిదియు నట్టిచంద మయ్యె.

188


వ.

అని కొనియాడి 'తదనంతర కథాప్రసంగం బెట్టి' దని యడిగిన.

189


ఉ.

కారణసింహవక్త్ర! యలికస్థితచారునిమీలితాక్ష! శృం
గారరసాధినాయక! యఘప్రకరాంధతమోనిరాస నీ
రేరుహమిత్ర! దానవసరీసృపభంగవిహంగరాజ! వృ
త్రారిముఖాష్టదిక్పతిసదార్చితపాదసరోరుహద్వయా!

190


క.

అద్వంద్వ! యప్రతర్క్య! జ
గద్వంద్య! యనాదినిధన! గర్వితదితిపు
త్రద్విపసింహకిశోర! వి
షద్వరజదళాయతాక్ష! సన్మణివక్షా!

191

తోటకవృత్తము.

ధరణీధర! నిర్జితదైత్యవరా!
శరణాగతరక్షణ! చారుగుణా!
సురయూధ సమర్చిత! సూరియుతా!
పురుషోత్తమ! శాశ్వతపుణ్యతమా!

192

గద్యము
ఇది వాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ
సుకవిజనవిధేయ అనంతయ నామధేయ ప్రణీతంబైన
భోజరాజీయంబను కావ్యంబునందుఁ
జతుర్థాశ్వాసము

  1. యెక్కటి
  2. బేడ
  3. నుడుము
  4. ముగ్ధతనము
  5. శంబరుండను. ఈ రాజు అంభీరుఁడని తరువాత పేర్కొనఁబడును.
  6. గావించి
  7. పేర్కొనియెదు
  8. నన్న
  9. గా కే
  10. రుద్ధతి