భోగీరలోయ, ఇతర కథలు/బొమ్మలరాణి

బొమ్మలరాణి

ఆ రాత్రి తోలుబొమ్మలాట. ఎనిమిదిగంట లయ్యేటప్పటికి పందిరి తయారయింది. ఊళ్ళో బట్టలషావుకార్లు తటవర్తివారి నడిగి ఒక అరతాను కోరామల్లు పట్టుకువచ్చి తెరకట్టారు. తెర అడుగున గట్టి తడకలు గట్టారు. ఆరు పెద్దమండిగల్లో శేరుశేరు ఆముదంపోసి ఇనప కొంకెలలో పెట్టి తెర వెనకాల వేళ్లాడతీశారు.

తొమ్మిదింటికి ఊళ్లోవుండే పాటకజనులు, కాపులు, హరిజనులు మొదలగు యావన్మందీ వచ్చి తోలుబొమ్మల పందిరిముందర కూర్చున్నారు. తెరవెనుక దీపాలు వెలిగించారు. వెలిగించడంతోటే తెరమీద రాములవారు, లక్ష్మణస్వామి, హనుమంతుడు, జాంబవంతుడు, సుషేణుడు యింకా మూడు కోతులు యీ పక్కా ఆ పక్కా చెట్లు కాక యెనిమిది విగ్రహాలున్నాయి,

దీపాలు వెలిగించడం తోటే "తొండము నేకదంతమును" అనే పద్యం చక్కని గొంతుకతో తెర అవతల ఒక వృద్ధకంఠం ఆలాపించింది. ఒక వానరుని బొమ్మ తీసి ఆ ప్రదేశంలో నాలుగు తాళాలు, మద్దెల, తారశ్రుతిలో, మూడో కాలంలో, చతుష్కళలో "విఘ్న రాజా సిద్ధి వినాయకా" అంటూ నాటరాగంలో, ఏడు గొంతుకులు లయగా కలిసి, హంగు చేస్తూ వుండగా విఘ్నేశ్వరునిబొమ్మ ప్రవేశపెట్టించారు. 'తైతకధిమికిట' అని ఆ వినాయకుడు తాండవించిపోతున్నాడు. సభికుల హృదయాలు ఝల్లుమన్నాయి. పాట అయిపోయింది. వెనుకటి శ్రావ్యమైన వృద్ధ కంఠము ఇట్లా పలికింది :

వినాయకో విఘ్నరాజో ద్వైమాతుర గణాధిపాః !
అప్యేకదంత హేరంబ లంబోదర గజాననాః.
ఇత్యమరః.

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
    ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే.

అని యీలాగున ఈ రోజున మేము ఆడబోయేటటువంటి శ్రీమద్రామాయణంలో రామరావణాయుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం అనే ఆట ప్రారంభించేముందు విఘ్నేశ్వరుని ప్రార్థించిన వారమగుతూ యింక చదువుల తల్లియైన సరస్వతీ దేవిని ప్రత్యక్షం జేసుకుంటున్నాము.

"వీణా పుస్తకపాణి...." అనే శ్లోకం పాడుతూ విఘ్నేశ్వరుని విగ్రహాన్ని తీసి సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రవేశ పెట్టారు. ఆమెను లాస్యగతిని నాట్యమాడించారు. చక్కని పాట పాడారు. భాగవతాది గ్రంథాలలో సరస్వతీదేవి మీద వున్న పద్యాలన్నీ చదివారు. సరస్వతీదేవి పటమున్నూ మాయమైంది. మళ్ళీ వెనకటి వానర విగ్రహం వచ్చింది.

ఈ గుంపు చాల విద్వత్తుకల గుంపు. గుంపు పెద్ద వీరయ్య డెబ్బదిఏళ్ళ వాడైనా కంఠం గంభీరమంద్రంలో మంద్రంలో తెల్లటి జీడిపప్పు పాకంలా మా తియ్యగా సాగుతుంది. మంచి విద్యావంతుడు. వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం, సంస్కృత మహభారతం, నన్నయ తిక్కన ఎఱ్ఱాప్రెగ్గడల మహాభారతం ఆతనికి కంఠస్థం. మంచి నీళ్లప్రాయం. అమరం అనర్గళధార. ఒక్కొక్క కథకు నాలుగైదు తోలుబొమ్మ యక్షగానాలు అద్భుతంగా వచ్చును. సంగీతశాస్త్రం ప్రసిద్ధికెక్కిన కోన సుబ్రహ్మణ్యశాస్త్రిగారి దగ్గిర నిరాఘాటంగా నేర్చుకున్నాడు.

ఆతని కుమారుడు విఠలుడూ, విఠలుని ఇద్దరు భార్యలు నాంచారీ, రుక్మణీన్ని, విఠలుడి కొడుకు ఓబలయ్యా, వాడి తమ్ముడు బేట్రయ్య, విఠలుని కూతురు మీనాక్షి - ఈ ఏడుగురు ఆటలో పాలుగొనే జట్టు. తోలుబొమ్మలవాళ్ల ఆచారం ప్రకారం మొగవాళ్లూ, ఆడవాళ్ళూకూడా మద్దెల వాయించడం తిత్తివూదడం నేర్చుకోవాలి.

వీరయ్యకు గొంతు తొణకనన్నా తొణకదు. వీరయ్య కుమారునికీ, మనుమలకీ, కోడళ్లకీ, మనుమరాలికీ బొమ్మలు తయారుచేయడం వచ్చును. వీరయ్య తోలుబొమ్మల వాళ్లందరిలోను శిల్పసార్వభౌముడు. వెంకటగిరి సంస్థానం లోను, కార్వేటినగర సంస్థానంలోను, గద్వాలు సంస్థానంలోను వీరయ్యకు మూడు బంగారపు కడియాలు బహుమతులు వచ్చాయి. విజయనగరం మహారాజాగారు నూటయాభై రూపాయల శాలువానూ, నూటపదహారు రూపాయలు రొఖ్కమునూ బహుమతీ యిచ్చారు. నూజివీడు కోటలో వెండిజరీ పగిడీ, అయిదు కాసుల కంఠహారం, దోసెడురూపాయలు, ఒక ఎకరం ఇనాము యిచ్చారు.

2

పూర్వకాలంలో వీరయ్య సంపాదన దోసిళ్లకొద్దీ ఉండేది. సత్తెనపల్లిలో పదియెకరాల మాగాణిభూమి కొనుక్కున్నాడు. అయిదారుచోట్ల నాలుగువేలరూపాయలు వడ్డీ వ్యాపారానికి వేసుకున్నాడు. నేడు తోలుబొమ్మల్ని ఆదరించే వాళ్లు లేరు. మేరీఫిక్‌ఫర్డు, గ్రేటాగార్బో, నార్మా షీరరు, డగ్లసు మొదలగువాళ్ళు గమ్మత్తులు చేసే యీ రోజుల్లో తోలుబొమ్మలను ఆదరించే వాళ్లెవరు? ఐనా నాగరకత యింకా పూర్తిగా పాటకజనాన్ని ఆవహించ లేదు. వాళ్లని సరస్వతీమాత రక్షించాలి. తోలుబొమ్మలు చూసినా, యక్షగానాల్ని ఆదరించినా, బుర్రకథల వాళ్లని, దేవరకథలవాళ్లని, వీధి భాగవతుల్ని పోషించినా వాళ్లే యింకా.

వీరయ్యజట్టంటే ఇప్పటికీ పూర్వకాలపు వాసనలు పూర్తిగా పోని విద్యావంతులకు గౌరవమే. ఈ రోజున కొంచెం ప్రొద్దుపోయినా పదిగంటలకు ఊళ్ళోవర్తకులు, కరణాలు, పండితులు, ఓవరిసీయరు, స్కూళ్ళయినస్పెక్టరు, రెవిన్యూ యినస్పెక్టరు మొదలగు ఉద్యోగులు, ఏమీ చేయకుండా ఊళ్లో కూచొనియున్న కామేశ్వరరావు యం. ఏ. గారూ, యావన్మందీ వచ్చి వాళ్లకు వీలుగా ఏర్పరచిన పెద్దకాపుగారి పెద్దరుగుల మీద కూర్చున్నారు. చాపలమీద దిండ్లూ, పరుపులూ, తీవాసీలూ అన్నీ వేయించాడు, కామేశ్వరరావు యం. ఏ., పెద్దకాపు దగ్గిరచుట్టం.

హనుమంతుడికి రాములవారు సుగ్రీవుణ్ణి తీసుకురావలసినదిగా ఆజ్ఞాపిస్తున్నారు. రాములవారు కుడి చేతిని మాత్రం కదుపుతున్నారు : 'అయితే, ఓయి మిత్రుడా, హనుమంతుడా'

"అవును స్వామీ ఉహుఁ."

"కపి, ప్లవంగ, ప్లపగ, శాఖామృగ, వళీముఖాః,
 మర్కటో, వానరః కీశో వనౌకాః, ఇత్యమరః.

 అట్టి మర్కటశ్రేష్ఠుడై, ఉత్తముడైన సుగ్రీవుడు"

"చిత్తం రాఘవేంద్రా, శ్రీరామచంద్రా"

"హనుమంతా ఎందుకు నాకు ఆ సుగ్రీవుడు కనబడుతున్న వాడవుకుంటూ ఉండలేదేమోయి?"

"ఓహో రామచంద్రా దశరథపుత్రా, నేను తప్పకుండా సుగ్రీవమహారాజు ఏమిచేస్తున్నాడో చూసివస్తున్నాను రాఘవేంద్రా" హనుమంతుడు దేహమంతా కదుపుతూ శిరస్సు శ్రీరామచంద్రుని పాదాలకడ ఉంచుతూ ఆడిపోతున్నాడు. ఓ పక్కన ఉన్నబొమ్మలు తీసేసి, అక్కడ సుగ్రీవుడు, తారాదేవి, ఇద్దరు చెలికత్తెల విగ్రహాల్ని ప్రవేశపెట్టారు. సుగ్రీవుడు తారాదేవితో నర్మసంభాషణలు చేస్తున్నాడు. ఇంతలో తారాదేవి భర్తకు జవాబుచెపుతూ ఒక పాట యెత్తుకుంది. ఆ గొంతుక కిన్నరీమాధుర్యము, సమ్మోహన పూరితము, కాకలీమృదులోలితము.

ఆ పాట వింటూనే సభంతా నిశ్శబ్దం అయిపోయింది. పండితపామరుల యావన్మంది హృదయాలూ ఆనందంచే ద్రవించి పోయాయి. ఆ గానప్రవాహము సుళ్ళుచుట్టి సెలయేళ్ళయి ప్రవహించింది.

పెద్దకాపుగారి అరుగుమీద గోడకు జార్లాబడి, ఒయ్యారంగా సిగరెట్టు కాల్చుకుంటూ యేదో ఆలోచిస్తూన్న కామేశ్వర్రావు గబుక్కున లేచి కూచుని బొమ్మలతెర వంక చూశాడు. ఏమిటా ఆ గొంతుక? అని అనుకున్నాడు. వింటూన్నట్టు విననట్టూ, కునికినట్టు కునకనట్టూ కూచుని ఉన్న గాయక శ్రేష్ఠుడు సీతారామయ్య గారు ఉలిక్కిపడి, అతిశ్రద్ధతో పాట ఆలకించడం మొదలెట్టాడు. ఆ కంఠము అతితియ్యటిది. శారీరములో గంభీరత ఉంది. స్వాధీన కంఠము. శ్రమలేదు. యెత్తుగడలో, గమకంలో ప్రకృతి జనితమైన వైచిత్య్రముంది. ఆ బాలిక వీరయ్య కేమవుతుందో అనుకున్నాడు సీతారామయ్యగారు.

3

గాయకశ్రేష్ఠుడు సంగీతశాస్త్రపండితో త్తముడు సీతారామయ్యగారు, భీమవరంలో తోలుబొమ్మలాట అయిన వారంరోజుల వెనక ఓ సాయంత్రం ఇంట్లో కూచొని ఫిడేలు వాయించుకుంటున్నాడు. తన ఫిడేలు వాద్యం శ్రుతికాగా, వీథిలో తోలుతిత్తిశ్రుతిలో పంచమస్వరంలో చక్కని పాట విన్నాడు. ఆయన ఫిడేలును క్రిందపెట్టి వీధిలోకి వెళ్లాడు. ఒకబాలికా, ఒక ఆడమనిషి ముష్టికోసంవచ్చారు. పధ్నాలుగేళ్ళు యీడువున్న బాలిక పాడుతున్నది. నడిమివయస్సు గల స్త్రీ తిత్తి ఊదుతున్నది. సీతారామయ్యగారు మొన్న తోలుబొమ్మలాటలో, ముచ్చటపడుతూ విన్న కంఠమే యిది.

"అమ్మాయీ! నీకు వీరయ్య ఏమౌతాడు?"

"మా తాతయ్యండి."

"ఈ మని షెవరు?"

"మా అమ్మండి."

"నీకు సంగీతం ఎవరు నేర్పారు?"

"మా తాతయ్య నేర్పాడు సామీ."

"నీకు సంగీతం నేర్పితే నేర్చుకుంటావూ?"

తల్లి -- "సామీ అంత అదృష్టం మాకు పడుతుందాండీ?'

"అదృష్టానికేముందిలే. ఇటువంటి కంఠం క్రమమైన సాధనలేకపోతే దోహదం లేని పూలచెట్టులా ఉంటుంది. ఇలాంటి గొంతుకే నాచేతిలో పడితే, దీని ముందర కిన్నెరుల పాటలూ, మహతీవీణా కూడా అపశ్రుతిస్వరాలు పలకొద్దూ. దీని కీ గళ మెక్కడ నుం చొచ్చిందీ?"

"మా తల్లి గొంతు ఇంతకన్న అందగా ఉండేదండి" అని నడిమివయస్సుస్త్రీ బదులు చెప్పింది.

"నేను వీరయ్యతో మాట్లాడుతాను. అతన్ని ఒకసారి రేప్రొద్దున్న మా ఇంటికి పంపించు."

వాళ్లిద్దరూ వెళ్ళిపోయారు. సీతారామయ్యగారి కా మధురమైన గొంతుక ఆ రోజల్లా వినబడుతోనే ఉంది.

మఱునా డుదయమే వీరయ్యా, విఠలుడూ వచ్చారు. వీరయ్య ఎదటివాళ్లకు గౌరవం ఇచ్చి తనకు గౌరవం తెచ్చుకునే రకం. ప్రపంచకం యొక్క దాతృత్వం మీదే తాను ఆధారపడి ఉన్నప్పటికీ, వీరయ్య భట్రాజుకాదు. సీతారామయ్యగారి వంటి పండితోత్తముడు, సజ్జనుడు, ఉత్తమ గాయకుడు తన మనమరాలికి సంగీతం నేర్పడం కన్న అదృష్టం ఇంకోటి లేదని తెలుసును. అయినప్పటికీ ఈ రోజుల్లో తనకు వచ్చే ఆ కొద్ది రాబడీ తన మనుమరాలి గొంతుకవల్ల వస్తోంది. ఆ గొంతుకు వినబడకపోతే ఏ వూళ్ళోనూ అయిదు రూపాయల కన్న ఎక్కువ దొరకవాయను. సంగీతం నేర్చుకుంటే వచ్చే లాభం ఏమిటి? ఆటలకి ఎక్కువ డబ్బు వస్తుందా? లేకపోతే తాను తన మనుమరాలిని వెంటపెట్టుకొని సభలు చేయిస్తాడా? పైగా పిల్లకి గర్వం హెచ్చైపోయి తరతరాలనించీ వస్తూవున్న ఈ పవిత్రమైన వృత్తిని భీమవరం ముఱికికాలువలోనో, నర్సాపురం గోదావరిలోనో కలిపేస్తే !

"స్వామీ, తమరు శలవిచ్చింది ఎంతో సంతోషమైంది - కాని ఏమిచేసేది? వృత్తివాండ్లం. జట్టు కొద్దిమందే ఉంటిమి. ఈ కరువుదినాలలో మా రాబడి అంతా ఈ పిల్లదాని గొంతుకపైనే ఆధార పడిఉంది. స్వామీ?"

"ఓయి వెఱ్ఱివాడా, ఇప్పుడు కొంచెం కాలం మళ్ళు తోందోయ్. తోలుబొమ్మలు, వీథినాటకాలు మళ్ళీ దేశంలో ఉద్దరింపబడతాయి. నాగరికత కలవాళ్ళే వీట్లను ఉద్ధరిస్తారు. అల్లాంటప్పుడు నీ మనమరాలు సంగీతం నేర్చుకుని ఉందంటే నీ జట్టుకు వచ్చేగౌరవం ఇంతాఅంతా అని కాదు."

వీరయ్య -- అదేమిటి స్వామీ, వీథినాటకాలు మూలబడ్డాయి. కూచిపూడిభాగవతులు కూలిపోయారు. విప్రవినోదులు అయిపులేరు. సినీమాలు, నాటకాలు మఱి అదేంటి స్వామీ, ఏమిట్రా అబ్బాయి దానిపేరు, విప్రవినోదులు చేసే పనులు చేస్తారు?

సీతా -- ఓ ! మాజిక్కా !

వీర -- అదో అదండి. అల్లాంటివన్నీ పెరిగి పొయ్యాయి. సీతా -- ఓయి పిచ్చివాడా, పోనీ తోలుబొమ్మలు చచ్చిపోతాయే అనుకో. ఈ రోజుల్లో సంగీతం నేర్చుకున్న వాళ్ళకి డబ్బెక్కువ. సంగీతసభలు, సంగీత స్కూలుమేష్టర్లు, సంగీత గ్రామఫోనుప్లేట్లు, సంగీత సినీమాలు, ఆడవాళ్లు నాటకాల్లో వేషాలు వేయడం, ఎక్కడ జూసినా సంగీతానికే యీ రోజుల్లో డబ్బు. అల్లాంటప్పుడు కాస్త గట్టిగా సంగీతం నేర్చుకుంటే మీ కుటుంబమునంతా అదే పోషించగలదు. గౌరవము సంగతి జెప్పక్కర్నేలేదు. యేవంటా వోయ్ విఠలయ్యా ?

విఠ -- నిజం, సామీ ! మా అప్ప ముసలివాడు. వాడి కేమి తెలుసు. మా అమ్మణ్ణి మీ దగ్గర వుంచుదురు సామీ.

వీరయ్యకూడా వొప్పుకున్నాడు.

4

కామేశ్వరరావు యమ్. ఎ. గారికి సాలుకు వెయ్యి రూపాయలు వచ్చే ఆదాయం వుంది. ఏ వుద్యోగానికైనా ప్రయత్నించాలని వుంది. కాని ఇంటిదగ్గర తల్లితో ఒక తమ్ముడితో సంసారము పొదుపుగ కాలక్షేపం చేసుకుంటున్నాడు. ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టడం, తిరగడం, ప్రాధేయపడ్డం అతగాడు యెంతమాత్రం సహించలేక పోయాడు. కాంగ్రెసు అంటే అభిమానం. సాధ్యమైనంత వరకు స్వదేశీవస్తువులే కొంటూ వుంటాడు. కామేశ్వర్రావు రసపిసాసి కావడంచేత కళా హృదయానికి సంపూర్ణంగా వ్యతిరేకమైనటువంటి 'సేవ' అనే పదార్థము ఆతనికి యెల్లా ఆవేశం కలగ జేస్తుంది? ఆతని మనఃపథాలల్లో డ్రాయరుబల్ల, ప్రక్కని కాగితాలపెట్టి, బీరువా, కాగితాలకట్ట దొంతరలు ఇవి చిత్రలేఖానికీ, శిల్పానికీ వ్యతిరేకమైన అడ్డుగీత లని అనుకుంటాడు.

"ఆ కాగితాలు యెందుకు పంపించవు? ఈ విషయం మీద నోటు పంపించవేమీ? అనేమాటలు గాంధర్వ మహాకళకు అపశ్రుతులని తలుస్తాడు.

పై వారికి కిందవారికి పంపించే విజ్ఞాపనలు, తాఖీదులు కవిత్వం అవుతాయా అని పృచ్ఛ చేసుకుంటాడు.

ఏలాగున ఆతడు ఉద్యోగాలకి ప్రయత్నించగలడు?

కామేశ్వరరావుకు సంగీతమంటే పరమప్రాణం. కవిత్వమంటే చెవికోసుకుంటాడు. చిత్రలేఖనం, శిల్పం చూసి మురిసిపోతాడు. కళారసజ్ఞుడు. కాని ఒక్క కళలోనూ ప్రవేశం లేదు. గొంతుక కొంచెం బాగుంటుంది. అంచేత దేవులపల్లి వారి దేవాలయం దగ్గిరికీ, నండూరివారి నాయుడు గ్రామానికీ, చింతావారి పుణ్యక్షేత్రానికీ, కవికొండలవారి వికసితోత్పల దగ్గిరికీ, విశ్వనాధవారి కిన్నెరవాగులకీ, ముద్దుకృష్ణుని మురళీ జ్వాలల దగ్గిరికీ, తీర్థయాత్రలు చేస్తూ, వరుసలు నేర్చుకుంటూ వస్తూ వుంటాడు. గ్రామఫోనుపాటలు చాలా బాగా వచ్చును. స్థానం వారి స్థాయీ మార్పు విలాసాలకు మురిసిపోతాడు. అద్దంకి వారి ముద్దు గొంతుక, కపిలవాయి వారి గంగా ప్రవాహం, జొన్నవిత్తుల వారి కిన్నెర కంఠం, సి. యన్. ఆర్. చిన్నారి పొన్నారి పాటలు, తుంగలవారి గమకభంగిమాలు బాలగంధర్వుని పరమ గాంధర్వం, నారాయణరావు వ్యాస జీవగీతాలు, పెందార్కర్ వుద్దండ సంగీతం మురిసిపోయి, సొక్కి, కన్ను లరమూతలేసి ఆనందంలో వూగిపోయ్యేవాడు.

కాని సంప్రదాయసిద్ధమైన త్యాగరాయాదుల పాటలు, రాగాలాపనలు, రాగమాలాప్రవాహాలు అంటే అతనికి తలనొప్పి.

ఆ నాడు రాత్రి తోలుబొమ్మలాటలో సమ్మోహనాస్త్ర తుల్యమైన ఆ బాలికాకంఠం విన్నప్పుడే నెమ్మదిగా ఇంటికిపోయి అయిదురూపాయలనోటు పట్టుకొచ్చి తోలుబొమ్మల పందిరి వెనక్కి వెళ్ళి వీరయ్యని ఈవలికి పిలిచి 'నీ మనవరాలి గొంతుక్కి ఇదిగోరా బహుమానం' అని ఇచ్చాడు. ఆ తక్షణము వీరయ్య కథ ఆపుచేసి తెరమీద బొమ్మనెక్కించి 'మరీమరీ కామేశ్వర్రావుగారూ' అని పొగిడాడు. గొప్ప ప్రభువులకు చూపించే మంచిబొమ్మలు తెరమీద కెక్కించాడు.

ఆ నాటి నుంచీ కామేశ్వర్రావుకు మీనాక్షి కంఠము సర్వకాలము ప్రతిధ్వనిస్తూనే వున్నది.

ఆ బాలిక కొంచెము చామనఛాయ. నవయౌవనము పరిమళిస్తూ వున్న పొంకాల రేఖలు సుడులు తిరిగి కరిగి పోతూ వున్న విగ్రహము. మోము కోల. వెడల్పు కొంచెము తక్కువైన పొడుగుపాటి కన్నులు. చివరకొంచెము వట్రువ తిరిగిన ముక్కు. మావి చివుళ్ళ పెదవులు. అపశ్రుతిలేని సౌందర్యఖని. ఆ బాల మోము కళాకోవిదత్వము స్పష్టీకరిస్తూ వున్నది.

ఇదివరకు యేనాడున్నూ కామేశ్వర్రావు ప్రణయావేశుడు కాలేదు. పవిత్రమైన తెలగవారి కులం లో పుట్టిన తనకు, ఈ నీచంగా సంచరించే బొమ్మలాటవాళ్ల కన్నెపై ఈ రోజున ఈ ప్రణయ ప్రాదుర్భావము యేవిఁటి? చదువుకుంటూ వున్నా డనిన్నీ, ఇంత అన్నవస్త్రాలకి ఇబ్బంది లేకుండా వుండే సంప్రదాయకుటుంబంలోని పిల్ల వాడనిన్నీ ఆలోచించి, యెక్కువ కట్నంతో, తమబాలికల నిస్తామని అనేక పెద్ద కుటుంబాల నాయుళ్లూ, కాపులు వస్తూ ఉన్నారు. చక్కని, తెలివైన, చదువుకున్న బాలికను చూసి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు. ఆలాంటి తనకు ఈ ప్రేమ యెక్కడనుంచి ప్రత్యక్షమయిందో!

ఆ బాలిక ఈ ఊళ్ళోనే సంగీతము నేర్చుకుంటున్నది. అతని హృదయం రాగాలు పాడింది. తాను కూడా సంగీతము నేర్చుకోవాలని చిరకాలం నుంచి ఉన్నదిగా !

మర్నాడు సీతారామయ్య గారిని కలుసుకున్నాడు.

"ఏమండీ, గురువుగారూ, నమస్కారం."

"దీర్ఘాయుష్యమస్తు, వివాహసిద్ధిరస్తు. యేమండీ, కామేశ్వర్రావుగారూ, రెండు నెలల్నుంచి నా ఫిడేలు వినడానికి రావటం లేదే?"

"ఇదివరకు మీతో అంటూవచ్చాను గాని నా యమ్. ఎ. చదువుకీ సంగీతానికీ పడదని తమ శిష్యుణ్ణి కాలేదు. నాకు సంగీతం నేర్పడం మీరు మొదలెట్టాలని నామనవి."

"నాకు ప్రస్తుతం అయిదు పెద్ద పాఠా లున్నాయండీ. పొద్దున్న, రాత్రి ఇంటిదగ్గిర కుఱ్ఱాళ్లకి చెప్పాలి. తక్కిన కాలంలో ఈ అయిదుపాఠాలు సరిపోతాయి. బాబూ, నన్ను క్షమించాలి."

"యెల్లాగో తీరిక చేసుకుని మీ యింటిదగ్గరే నాకు ఆరో పాఠంగా నేర్పాలి. మీరే రెండుమూడుసార్లు నా గొంతుక మంచిది, సంగీతం నేర్చుకోమన్నారు."

"మీబోటివాళ్ళు మా ఇంటికి రావడమే!"

"నన్ను సంగీతం నేర్చుకో వద్దంటారా?"

"అయ్యయ్యొ! యెంతమాటంటారూ ! మీబోటి ఉత్తములకు సంగీతం నేర్పకపోతే నా విద్యెందుకండీ!"

"ఇన్నాళ్లూ ఈ చదువులతో కాలం వృథాపుచ్చాను. ఈ నాటికి నా కీ సత్సంకల్పం కలిగింది. సంగీతం విని ఆనందించేందుకైనా నేర్చుకోవాలని ఉంది."

"మీరు మా ఇంటికి రావడం నా మనస్సు ఒప్పదండీ." "అయితే, తమరు మా యింటికి తమ ఇష్టము వచ్చినప్పుడు దయచేయొచ్చునే."

"అయిదు పాఠాలు రోజంతా తీసుకుంటున్నాయి."

సీతారామయ్యగారు చిరునవ్వు నవ్వుకున్నాడు.

"మీ దీక్ష నాకు సంతోషం కలుగజేస్తున్నదండి."

"నాది ఆరోపాఠం. తమ ఇంటికే వచ్చి నేర్చుకుంటాను. తమ సేవ చెయ్యడానికి నా కీ సావకాశం ఇవ్వండి."

"మీరు ఉద్యోగానికి వెడుతారే!"

"అసలు ఉద్యోగానికే వెళ్ళను. ఒకవేళ వెడితే అంతవరకే చెప్పండి. నా అదృష్టం అంతే అనుకుంటాను. ఇక అభ్యంతరాలు చెప్పకండి. సంగీతహృదయం లోకి నన్ను చొచ్చి పోనివ్వండి. మిమ్మల్ని వదలను. మీ ఇంటికి వచ్చే నేర్చుకుంటాను. మంచి ముహూర్తం చూసి తమ రెప్పుడు రమ్మంటే అప్పటి నుంచి తమ దగ్గిర శిశ్రూష ప్రారంభిస్తాను," అని కామేశ్వర్రావు చేతులు జోడించినాడు.

"అయ్యయ్యో, అదేమిటి కామేశ్వరరావుగారూ," అని ఆయన కామేశ్వరరావు చేతులు పట్టుకున్నాడు.

5

కామేశ్వర్రావుపాఠం సాయంత్రం ఏడింటికి మొదలు పెట్టి ఏడున్నరకు పూర్తిజేసేవారు. ఆతను మహాదీక్షగా నేర్చుకుంటున్నాడు. అంచేతనే అందరికి గంట చెప్పేపద్ధతి తనదగ్గిర అవసరం లేకుండా చేసుకున్నాడు. ఏడున్నర దగ్గిర నుంచి రాత్రి యనిమిదిన్నర వరకు మీనాక్షికి పాఠం జెప్పేవారు సీతారామయ్యగారు. మీనాక్షిపాఠం అయిన తరువాతనే కామేశ్వర్రావు ఇంటికి వెడుతూఉండేవాడు. ఇంటిదగ్గిర సాధన చేయడం వల్ల కామేశ్వర్రావుకు సంగీతశాస్త్ర సిద్ధాంతాలన్నీ ఇట్టే కరతలామలకమైపోయాయి. జంటలు, గీతాలు, స్వరజితులు, వర్ణాలు ఆరునెలల్లో పూర్తిజేసి కీర్తనలకు వచ్చాడు. మీనాక్షి తనతాతగారు నేర్పినదంతా మర్చిపోయి మళ్లీ నేర్చుకోవలసివచ్చింది. అద్భుతమైన గొంతుక కాబట్టి మూడునెలలలో రాగాలు, కీర్తనలుకూడా ప్రారంభిచింది.

మీనాక్షి వికసిస్తూ ఉన్న పుష్పము. ఆమె ఇంకా అందాలు కోసుకొని దండలు గుచ్చుకుంటోంది. ఆమె హృదయము లేడిపిల్ల లాంటిది. చిన్నతనాన్నుంచి ఆమె కంఠంలోని గానాద్భుతంచూచి మురిసిపోయే తాతగారు ఆమెకు చక్కని సంబంధం వెతికి మనమణ్ణితెచ్చుకొని ఇల్లరికం ఉంచుకోవాలని ఉవ్విళ్లూరుతో ఉండేవాడు.

మీనాక్షికి కామేశ్వర్రావు ఎందుకంత తనతో చనవుచేసుకుంటున్నాడో అనే ఆలోచనైనా కలగలేదు. కామేశ్వర్రావును చూస్తే ఆమెకు చాలా సంతోషంగా ఉండేది. ఎప్పుడూ అతనితో ప్రాణమిచ్చి మాట్లాడేది. జట్టుతోపాటు ఆమె యెన్ని ఊర్లు తిరిగినా ప్రపంచజ్ఞానములోని ఓనమాలన్నా ఎరగదు. అంచేత కామేశ్వర్రావు రైళ్లను గురించి, విమానాలను గురించి, సినీమాలను గురించి, విద్యుచ్ఛక్తిదీపాలను గురించి, దేశాలు, దేశాలలోని ప్రజలు, పంటలు, నగలు, దుస్తులు మొదలైనవాటిని గురించి నోరూరేట్లు చెబుతూఉంటే విస్తుపోయి వింటూఉండేది.

మీనాక్షి సీతారామయ్యగారింట్లోనే భోజనం చేసేది. ఆయన తనకోసం అని ఇచ్చిన వీధిగదిలో సామాను పెట్టుకుని అక్కడనే పడుకునేది. కామేశ్వర్రావు స్నేహముచేత శుభ్రత, శుచి, రసజ్ఞత వీటినిగురించి మీనాక్షి బాగా నేర్చుకొన్నది. ఎరకలవాళ్ల పందులదొడ్డిలా వుండే మీనాక్షిగది నెమ్మది నెమ్మదిగా మార్పుచెంది ఆరునెలలలో కళాప్రదర్శనపు మందిరములా తయారైనది. మోడరన్‌రివ్యూ, భారతి, గృహలక్ష్మి మొదలైన పత్రికల్లోంచి కామేశ్వర్రావు సంగ్రహించిన బొమ్మలు అద్దాలు కట్టించి గోడలమీద వేలాడ గట్టుకుంది. రెండు మూడు జపాన్ వెదురు అల్లిక తెరలు కూడా గోడలకు తగిలించింది.

ఇంతలో సీతారామయ్యగారి పెద్దకూతురు పుట్టింటికి పండక్కని చక్కా వచ్చించి. ఆ అమ్మాయి అత్తవారు కాకినాడ. అత్తవారు మంచి నాగరికతగల కుటుంబమగుటచేత ఆమె అతి నవీన నాగరికతా సంప్రదాయంలో ప్రథమ తరగతిలో ప్రథమముగా వుంటూన్నవాళ్లలో ఒక్కత్తె. మన దేశంలో భర్తకి ఎట్లా యిష్టం అయితే అలాగ మారి పోతారుగా ఆడవాళ్ళు. ఆవిడకు సీతారామయ్యగారు పెట్టిన పేరు వియ్యమ్మ. నేడు విజయానందని. గోదావరి వరదలా ఇంట్లోకి చక్కావచ్చింది.

"అమ్మా, వీధిగదిలో నుంచున్న అమ్మాయి ఎవరే?"

"నాన్నగారి దగ్గిర సంగీతం నేర్చుకుంటూవున్న ఒక బొమ్మలాళ్లమ్మాయి."

"బొమ్మలా ళ్లేమిటేవు?"

"తోలుబొమ్మలాళ్లే."

"తోలుబొమ్మలాళ్లకి సంగీతం యేమిటి?"

"ఆ అమ్మాయి కంఠం కిన్నరీ కంఠం. అంత అందమైన కంఠం నేనెక్కడా వినలేదు సుమా! సంగీతంలో కూడా మీకు తగ్గ తెలివితేటలున్నాయి. ముచ్చటపడి నీకు యెంత బాగా సంగీతం నేర్పారో అంత యిదిగాను మీ నాన్నగారు యీ అమ్మాయికి నేర్పుతున్నారు మా మంచిపిల్ల. నేనంటే ప్రాణం. కూతుళ్లిద్దరు కాపరాల కెళ్లినందుకు నాకు మూడవ కూతురైంది."

ఆ రోజునుంచే విజయకి మీనాక్షికి కృష్ణా, తుంగభద్రా సంగమమైనది. విజయానందని పుట్టింట రెండునెలలు వుంది. ఆ రెండు నెలలలో వేణీభరం కూర్చే పద్ధతుల్లో, సొగసైన వస్త్రాలు యెన్నుకొనే విధాలల్లో, నగలు అలంకరించుకొనే రీతుల్లో, పువ్వులు ముడుచుకొనే మోస్తరుల్లో, మొహానికి 'మంచులు', వెన్నలు, పవుడర్లు, పెదవులకు, బుగ్గలకు రంగులు సొగసు చేసుకొనే సూత్రాలల్లో, టాల్కం పొడులు దేహానికి అద్దుకునే అందాలల్లో, యూడీకొలోను, లవండరు మొదలైన పరిమళ జలాలు బట్టలపై జల్లుకొనే చందాలల్లో విజయ మీనాక్షికి గురూపదేశము చేసినది.

విజయ సంగీతంలో సరస్వతి. గొంతుక అంత అందముగా వుండకపోయినా ఉత్కృష్టమైన సూక్ష్మాతిసూక్ష్మమైన శ్రుతి, స్వర, లయజ్ఞాన ముండుటచేత వినేవారి హృదయాలలో అమృతబిందువులు కురిసేటట్లు పాడగలదు. ఆమె వున్న రెండునెలలలోను మీనాక్షి పదియేళ్ళవిద్య నేర్చుకొన్నది.

ఆ రెండునెలలు కామేశ్వర్రావు మీనాక్షితో తా నొక్కడే యెక్కువ చనువుగా వుండేందుకు వీల్లేకపోయింది. కామేశ్వర్రావు సంగీతం నేర్చుకోవడం విజయకు ఆశ్చర్యమే వేసింది. విజయ మీనాక్షిని వెనక వేసుకొని చిత్రలేఖనాన్ని గురించి, హిందూదేశములో వుండే అద్భుత శిల్ప విన్యాస దేవాలయనిర్మాణాది విచిత్రాలనిగురించి కనుక్కుంటూ వుండేది. ఎంత అతీనవీనపద్ధతిని వేషం వేసుకున్నా విజయ అంటే కామేశ్వర్రావుకు యెక్కువ గౌరవము, భయమున్ను. వంచినతల యెత్తకుండానే మాట్టాడేవాడు. కన్నింగ్‌హామ్ ప్రభ్వి అజంతాబొమ్మలపుస్తకం, ఫెర్గుసన్‌గారి భారతీయ శిల్పగ్రంథాలు మొదలైనవి తెప్పించి కామేశ్వర్రావు వాళ్ళిద్దరకూ చూపించేవాడు. ఇంతలో విజయ అత్తవారింటికి వెళ్ళిపోయినది. అమ్మయ్యా అని కామేశ్వర్రావు నిట్టూర్పు విడిచాడు.

6

మీనాక్షి రెండేళ్లు గురుకులవాసము చేసింది. వచ్చిన చదువు చాలునని యింతలో ఆమె తాత వీరయ్య గరుత్మంతుడులా వచ్చి మనుమరాల్ని తీసుకు చక్కాపోయాడు. ఆ బాలిక సీతారామయ్యగారి కడ సెలవు పుచ్చుకొని ఆయన పాదాలకు, ఆయన భార్య పాదాలకు నమస్కారం చేసి తల్లి దండ్రులను వదలి వెళ్ళే బిడ్డలా వెక్కివెక్కి యేడ్చినది.

ఆ దంపతుల ఇరువురికిన్నీ కళ్లు చెమర్చినవి. వీరయ్య మనుమరాలిచేత తాంబూలములో పదికాసులుపెట్టి ఇప్పించబోగా సీతారామయ్యగారు కోపగించుకొని వీరయ్యను తలవాచేటట్లు చీవాట్లుపెట్టినారు. "ఆమె నా కూతురు. అల్లాంటి అమ్మాయికి చదువు చెప్పడం నా అదృష్టం" అన్నారు. భార్యచేత మీనాక్షికి పసుపు, కుంకుమ, చీర, రవికలగుడ్డ యిప్పించారు.

కామేశ్వర్రావు హృదయం దడదడమని కొట్టుకొంటోంది. కుంగిపోతూ నిలబడినాడు. మీనాక్షి కోసం తెప్పించిన తొంబదిరూపాయల తంబూరాను ఆమెకిస్తూ "మీనాక్షి ! ఇక నన్ను మరిచిపో" అన్నాడు.

మీనాక్షి వెక్కివెక్కి యేడ్చింది. కామేశ్వర్రావును వదిలిపెట్టి వెళ్ళుట ఆమెకు అంతరాంతరాలల్లో మరీ కష్టమై తోచింది.

7

అపుడు జట్టంతా బెజవాడలో ఉంది. వీరయ్య, విఠలుడు, చిన్నవీరయ్య మీనాక్షిని ఆనమాలుకట్ట లేకపోయారు. ఆ బాలిక పెంటకుప్పలోనుంచి బయలుదేరిన చేమంతిచెట్టు లా ఉన్నది.

మీనాక్షి తన వాళ్ళను యెగాదిగా చూచుకొన్నది. వందసంవత్సరాల క్రితం ఉతికిన బట్టలు కట్టుకుంటూ, వారానికి ఓమాటైనా స్నానం చేయకుండా తిరుగుతూ, నానావిధ నీచపదార్థాలు తింటూ, ఊరుబైట వేసుకున్న గూడుగుడిశల్లో, సామాను మోసుకునేందుకు ఉపయోగించే గాడిదల తోటి, కాపలా కాసుకునేందుకు ఉపయోగించే పులుల్లాంటి కుక్కలతోటి సావాసంచేస్తూ, నూనిరాసుకొని దువ్వుకో నందున పేలుపట్టియున్న తలలతో, వెఱ్ఱిమొఱ్ఱి రాళ్ళపూసల పేర్ల నగలు పెట్టుకొన్న మెళ్ళతో, వెండి మురుగులు అలంకరించిన చేతులతో, బంగారు గుల్ల దండకడియాలు దాల్చిన బాహులతో, వెండిబిళ్ళల మొలనూళ్లతో, వెండి వడ్డాణాళ్లతో, పొగాకు, తమలపాకూ గారలు కట్టించిన నోళ్ళతో తన చుట్టూ ఉన్న తన చుట్టాలను చూసేటప్పటికి మీనాక్షి హృదయం క్రుంగిపోయింది. సీతారామయ్యగారి ఇల్లు, ఆ రోజుల తన జీవితము మీనాక్షికి కళ్ల యెదుట అస్తమానమూ ప్రత్యక్ష మౌతూనే ఉన్నది. ఈ రెండేళ్ళూ సీతారామయ్యగారు తండ్రిఅయ్యాడు: ఆయనభార్య తల్లిఅయినది: ఆయన కుమార్తె అక్క అయినది; కామేశ్వర్రావు ప్రాణస్నేహితుడైనాడు. కంపులతో, పెంటపోగులతో నిండి వున్న ఆ యేలూరి కాలవగట్టు నరక కూపమై తోచింది. కామేశ్వర్రావుగారు తనకు పదేపదే చెప్పిన ప్రకృతి విలాసా లేమీ ప్రత్యక్షం కాలేదు సరికదా, ఆకాశాన్ని నక్షత్రాలు గాడిద లద్దెలలా కనపడ్డాయా బాలకు. బెజవాడ చుట్టూ ఉన్న కొండలు పాడైపోయిన పూరిగుడిసెల్లా ఉన్నాయి.

ఎందుకు తన కీ సంగీతంనేర్పించారు? బాగా బతకడం యొక్క అందం ఎందుకు తనకు నేర్పుట? అడవి కఱ్ఱకు శిల్ప సౌందర్యం యిచ్చింది మళ్ళీ ముళ్లడొంకల్లో పడవేయడానికా? ఆమెకు జలజల కన్నీళ్లు ప్రవాహాలు కట్టినవి. తండ్రీ, తాత, తల్లీ వాళ్లు యమకింకరుల్లా కనపడ్డారు. కామేశ్వర్రావుగారి పాదాలు కొలుస్తూ, దాసీలా ఇంత సేవ చేస్తూంటే బాగుండునే! గురువుగారికి, గురువుగారి భార్యకు వాళ్ళింటో పనిచేసే మనిషిలా తాను చాకిరీ చేస్తూ ఉండి పోతే బాగుండునే! గురువుగారూ, కామేశ్వర్రావుగారూ ఎందుకు తనను తాతగారు తీసుకొస్తూంటే ఊరుకొన్నారో. కామేశ్వర్రావు నాయుడుగారు తియ్యటి కబుర్లు చెపుతూంటే తాను నిజమనుకొంది. మలాం చేసి జీను వేసి, మంచి దుస్తులు వేసినా గాడిద గుఱ్ఱం ఏలా అవుతుందని వాళ్లిద్దరూ తనని వదిలేసి ఉంటారు. కులదైవము రాములవారు అసలున్నాడా ?

ఆ రా త్రల్లా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నది మీనాక్షి.

వీరయ్య తన మనవరాలు మళ్లీ తిరిగి తన జట్టులోనికి వచ్చినదనిన్నీ, పేరుపొందిన సంగీతపాటకుడగు సీతారామయ్యగారి దగ్గిర సంగీతవిద్య నేర్చుకొని గొప్పపాటకురాలైనదనిన్నీ బెజవాడ నగరాలపేటలో చాటింపించాడు. ఆ రాత్రి ఆకెళ్ళవారి సత్రందగ్గిర తోలుబొమ్మలు చూడడానికి వచ్చిన జనం బెజవాడ పుష్కరానికన్నా రారు. ఉత్తరగోగ్రహణం కథ ప్రారంభించారు. మీనాక్షిది సైరంధ్రి పాత్ర. బొమ్మలాట పాకలో ఒక మూల నలిగి పోయిన పువ్వులదండలా, చంద్రుడు లేకుండా కారుమబ్బులు పట్టి, తుంపర్ల పడుతూన్న రాత్రిలా కూచుని ఉంది. రెడ్డియ్య విఘ్నేశ్వర, సరస్వతీ ప్రార్థన లవగానే "ఆలాగున ధర్మరాజులవారున్నూ, భీమసేనులవారున్నూ, అర్జునమహారాజున్నూ, నకుల సహాదేవులైన కవలలున్నూ, ద్రౌపదీదేవి మహారాణియూ, ధౌమ్యులవారితో కూడానున్నూ" అని అన్నాడు.

"ఆహాఁ!"

"పన్నిండేళ్లున్నూ అటవీ, అరణ్యం,విపినం, గహనం, కాననం, వనం ఇత్యమరః, అయినటువంటి అరణ్యంలో వాసం చేసినవారు అవుకుంటూ -" "ఆహా! ఇక ఏలాగయ్యా? సంవత్సరో, వత్సరో, అబ్దో, హాయనో, శరత్సమాః, ఇత్యమరః, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసుంటుంది అని ఆలోచించుకుంటూ -"

"ఆహా!"

ఈ రకంగా కథసాగించారు. ఇంతలో ద్రౌపది పాట పాడవలసిన సమయం వచ్చింది. జట్టు అందరూ మీనాక్షి వైపు చూశారు. ఆ బాలిక మోకాళ్లు ముడుచుకొని కూర్చొని, మోము మోకాళ్ళలో ఉంచుకొని, చేతులు మోకాళ్ళకు చుట్టుకొని, కళ్ళలోంచి ఆశ్రుబిందువులు రాలుస్తూ ఈ లోకంలోనే లేదు. తల్లివెళ్ళి "మీనీ, మీనీ పాటపాడ్డానికి రావే, నీ దుంపతెగ, మొద్దులా కూర్చున్నా వేమే? లే, వచ్చి పాట పాడు," అని కేకలువేసింది. చిచ్చర పిడుగులా లేచింది మీనాక్షి.

"నేను పాడ దలుచుకోలేదు. మీ సరుకులు మోసే గాడిదలు లా మీరు కూడా గాడిదలు. తోలుబొమ్మలాటా? ఇది దెయ్యాలాటా? అని కాళ్ళు గబ గబ భూమికేసి తన్నింది. తల్లి బ్రతిమాలడం, తండ్రి కేకలు వేయడం, అంతా తాతగారు చూస్తున్నాడు. అందాకా ద్రౌపదిభాగం చిన్నవీరయ్యకు క్రొత్తగావచ్చిన భార్య చదువుతూ వున్నది. వీరయ్యకు కోపమువచ్చింది. ప్రళయకాలరుద్రమూర్తిలా అయిపోయాడు. రెక్కలుపట్టి నుంచోపెట్టాడు. "నీకు సంగీతం చెప్పించినందుకా ఇంత పొగరమోతుతనం? ఇంత ట్లోకే మహారాణి వైనావనా నీ వుద్దేశం, ఛండాలపు రండా లే, వచ్చిపాడు. చావగొట్టివేస్తాను," అని ఉరిమాడు.

తాతగారి కోపం చూసి దడదడలాడుతూ, భయంతో తెర దగ్గరకు వచ్చి, మద్దెలకు నమస్కరించి పాటయెత్తింది. శ్రుతి కలవదు. వెనకటి వరస రాదు. గొంతుక స్థాయికి పెరగదు. అందరూ అందిచ్చినారు. నాలుగు గొంతుకలు కలిసినవి. కాని మీనాక్షి గొంతుక అందుకోదే! పదిహేను నిమిషాలు తంటాలు పడ్డారు. మీనాక్షి గొంతుక అపశ్రుతి తప్పుకోదు, సామ్యం యేర్పడదు. తెర అవతల ప్రజల్లో గడబిడలు బయల్దేరాయి "మీనాక్షిని పాడమనండీ" "మీనాక్షిని పాడమనండీ" అని కేకలు. మీనాక్షి పాడలేదు. అందరికీ వెఱ్ఱెత్తిపోయింది. వీరయ్య అన్యాయంచేశాడు అంటూ ఉప్పెనకెరటం విరుచుకుపడ్డట్టు జనం అంతా పందిరి మీదకు విరుచుకు పడడం మొదలెట్టారు. వీరయ్య గజగజలాడిపోయినాడు. మీనాక్షి నిద్రలేచి వచ్చినట్లు లేచి వెనకటి గొంతుక తెచ్చుకొని వెనకటిలా పాడదామని యెంతైనా ప్రయత్నం చేసింది. కాని లాభం లేకపోయింది. ఆమెకు యేడుపు వచ్చింది. వెక్కి వెక్కి యేడ్చింది.

జనం వచ్చి తెరమీద పడి తెర పీకేసారు. విఠలుడు ఈ గడబిడంతా చూసి ఆడవాళ్ళని చేతికి దొరికినన్ని బొమ్మలు పట్టుకొని పారిపొమ్మన్నాడు. మిగిలిన బొమ్మలు చిన్న వీరయ్య చేతి కిచ్చి పరిగెత్తమన్నాడు. తిత్తీ, మద్దెలా యిచ్చి తండ్రిని పంపివేశాడు. ఇంతలో నగరాలలో వీరయ్య అంటే మంచభిప్రాయం కల్గిన ఒక వస్తాదుల జట్టు లాటీ కఱ్ఱలతో రంగంలో ప్రవేశించి, దెబ్బలాడి, ప్రజలు పాకకు నిప్పు అంటించకుండా చూశారు. జనం అంతా వెళ్ళిపోయిన తరువాత విఠలుడు తక్కిన వన్నీ సర్దుకొని తమ గుడిశెల కాడికి చేరుకున్నాడు.

జట్టును లేవదీసుకొని బందరు పారిపోయాడు వీరయ్య.

8

కామేశ్వర్రావుకు మీనాక్షి వెళ్ళినప్పటినుంచీ మతి లేదు. అతని ప్రేమకు మీనాక్షి నిదానమై పోయింది. యౌవనము వచ్చిన యిన్నాళ్ళకు ప్రేమంటే యేమిటో తెలుసుకున్నాడు. మీనాక్షితో రెండేళ్లు స్నేహం చేసి, మీనాక్షీ, తానూ సహాధ్యాయులై, మీనాక్షికి తాను గురువై, మెలిగినతరువాత తీరా మీనాక్షి వెళ్ళిపోయిన వెనుక తనని మూలమంతా కదిల్చి వేసిన ప్రేమతో ఆమెను ప్రేమిస్తున్నానని గ్రహించాడు. ఆమె మాటలు, దివ్యమైన ఆమె గాంధర్వమూ, విచిత్రసుందరమైన ఆమెమూర్తీ ఆతని బ్రతుకుచుట్టూ మహాప్రపంచములైనవి. మీనాక్షి నామము జపమైనది. "దేవీ మీనాక్షీ" అని ఆతని హృదయకుహరాలలో పల్లవి సర్వకాలమూ నినదిస్తూనేవున్నది.

భీమవరంలో ఒక్క నిముషం వుండలేకపోయినాడు. రెక్కలు కట్టుకొని బెజవాడ వచ్చిపడ్డాడు. అక్కడ వాకబు చేసి బందరు వెళ్ళారని తెలుసుకొని సాయంత్రానికి బందరు చేరుకున్నాడు. వీరయ్యజట్టువాళ్లు ఇనుకుదుర్లో తమ పూరి గుడిసెలు వేసుకున్నారు. కామేశ్వర్రావు తిరిగి తిరిగి అక్కడకు చేరుకున్నాడు. తన ఆత్మలో, ఆత్మయగు మీనాక్షి ఆ పూరిగుడిశెల్లో వుందనే భావం ఆతన్ని దహించి వేసింది. ఇదివరదాకా తోలుబొమ్మలవాళ్లు అల్లాంటి పూరిగుడిశెల్లో వుండడం అతనికేమీ ఆశ్చర్యం కలుగ జేయలేదు. అక్కడికి వెళ్ళి "వీరయ్యా" అని కేకవేసినాడు. వీరయ్య యివతలికి వచ్చి కామేశ్వర్రావుగారినిచూసి "బాబూ ! ఇల్లాగ వచ్చా రేమిటి?" అని ప్రశ్నించాడు, కామేశ్వర్రావు ప్రక్కనేవున్న కాలవకు కట్టిన తూము అరుగుమీద కూర్చొని వీరయ్యని ప్రక్కనే కూర్చోమన్నాడు.

వీరయ్య కామేశ్వర్రావుతో "బాబూ, నా నోటిదగ్గిర కూడు క్రిందికి బోర్లాపడింది సామీ" అని బెజవాడలో జరిగినదంతా వెళ్ళబోసుకొన్నాడు. "సీతారామయ్య బాబుగారు మా పిల్లను పాడుచేశారు సామీ, పాట పాడలేదు, గొంతు యెత్తలేదు, ఆట కెందుకూ పనికిరాకుండాపోయింది." అతడు నుదుటిమీద కొట్టుకున్నాడు.

కామేశ్వర్రావు అంతా నిమిషంలో గ్రహించాడు. అతనికి ఒక చక్కని ఆలోచన మృదువుగా తట్టింది. లేచి నుంచొని వీరయ్య బుజం మీద చెయివేసి "వీరయ్యా, నువ్వేమీ కంగారుపడకు, గురువుగారు చేసిన దెప్పుడూ తప్పు కాదు. అందులో మా గురువుగారు పరమ పవిత్రుడు. నువ్వు ఒక వారంరోజులు ఆటాగీటా తలపెట్టకు. ఓపికపట్టి మాత్రం యెదురు చూస్తూ వుండు" అని చెప్పి, ఆ చీకట్లలో మాయమై పోయాడు. వీరయ్యకు ఆశ్చర్యం వేసింది. కామేశ్వర్రావు గారు యేమిచేస్తారా అని అనుకుంటూ తన గుడిశెప్రక్క ఆరు బయట వేసిన నులక మంచము మీద నిద్రపోతూ వున్న మనమరాలిని చూసి "తల్లీ నీకు మీనాక్షీదేవి పేరు పెట్టుకొన్నాను. ఏంచేస్తావో?" అని తలపోసుకున్నాడు.

9

బందరులో వుండే ఉద్యోగస్థులకు, వర్తకులకు, భాగ్యవంతులకు, ఒక రోజున ఆహ్వానపు పత్రికలున్న కవర్లు వచ్చాయి.

గొప్ప సంగీతపు ప్రదర్శనం

శ్రీమతి మీనాక్షిబాయి

ఆర్యా!

అభినవ మీర యనదగిన ఈ బాలిక కంఠము మాధుర్యాతి మాధుర్యము, పాండిత్యము పండితుల చేతనూ మెప్పు పొంద దగినది. కాన తాము విచ్చేసి ఈ బాలికా గాన పవిత్రతలో దివ్యులుకండని మా ప్రార్థన.

కామేశ్వరరావు, ఎం. ఏ.,

సీతారామయ్య.

మచిలీపట్టణము,

16 - 4 - 1924.

గాత్రము --- మీనాక్షిబాయి

ఫిడేలు --- సీతారామయ్య

మృదంగము --- మణిఅయ్యరు

రేపు 17 - 4 - 24 తారీకున --- హాలులో 5 గంటలనుండి 8 గంటలవరకు ---


కామేశ్వరరావు పెద్దలందరకూ 3 రూపాయల టిక్కెట్లు పంపినాడు. బందరుపురమున నున్న సంగీత పండితులందరి కడకూ కామేశ్వర్రావు స్వయముగా వెళ్ళి వారి నాహ్వానించి, వారికి గౌరవపు టిక్కెట్లిచ్చినాడు.

ఊరంతా పేపర్లు పంచిపెట్టబడినవి. 17 వ తారీఖున 500 రూపాయల టిక్కెట్లమ్మబడినవి. హాలు కిటకిటలాడుతూ వున్నది. మణిఅయ్యరూ, సీతారామయ్యగారూ పక్క వాద్యాలు వాయించే ఈ ప్రతిభాశాలిని ఎవరయ్యా, అనుకుంటూనే వచ్చారు జనమంతా. సరీగా అయిదు అయ్యేటప్పటికి సీతారామయ్యగారు, మణిఅయ్యరుగారు, మీనాక్షి బాయీ వచ్చి కూర్చున్నారు. సభను చూసి మీనాక్షి గజగజలాడిపోయింది. అందాలు సుళ్లుచుడుతూ ఉమాదేవిలా వచ్చిన ఆ బాలికాదేవిని చూసి, "యీమెపాట యీమె అందానికి తగిందేనా," అని అనుకున్నారు. సభా ప్రారంభములో మీనాక్షి కొంత జంకింది. ఆనందరసవాహినియగు సీతారామయ్యగారి ఫిడేలు, లయామృతవర్షిణి యగు మణిఅయ్యరుగారి మృదంగం దివ్యంగా వినబడుతూ వున్నవి గాని మీనాక్షిగొంతుక ఎవ్వరికీ వినబడలేదు. సీతా రామయ్యగారు, "కళ్లు మూసుకొని పాడమ్మా" అని రహస్యంగా చెప్పారు.

మీనాక్షి కళ్లుమూసుకొని గురువుగారిని తలుచుకొని సమస్తమూ మరిచిపోయి, ఉత్కృష్టగానంతో అద్వైతరూపిణి అయింది. ఆమె కంఠము సంపూర్ణముగా వికసించిన మాలతితీగలా ఆ సభఅంతా అల్లుకుపోయింది. ప్రేక్షకులు అట్టి గొంతుక ఇదివరకు యెన్నడూ వినలేదు. అట్టి సంగీతమూ ఎప్పుడూ వినలేదు. సభ పూర్తి అయ్యేటప్పటికి సభికు లందరూ తన్మయులై ఉన్నారు.

పట్టణములోని పెద్దలూ, సంగీతవిద్వాంసులూ మీనాక్షిని పొగడుతూ ఉపన్యాసాలు ఇచ్చారు. జగద్విఖ్యాతులగు మణిఅయ్యరుగారినీ, సీతారామయ్యగారినీ గురించి చెప్పనక్కరలేదన్నారు. ఇంకో సభ ఆ పట్టణంలో చేయాలనికూడా కోరారు. ఆ వెనక రెండురోజులైన తరువాత సభలో 12 బంగారు పతకములూ, 100 రూపాయల వెండి గిన్నే మీనాక్షికి బహుమతు లిచ్చారు.

ఇదంతా చూసి వీరయ్య ఆశ్చర్యపూరితుడైపోయాడు. అలాంటి సభలూ చూడలేదు. అలాంటి పాటా వినలేదు. నీ మనవరాలు సంపాదించిందని 500 రూపాయలు తీసుకొచ్చి వీరయ్య ఒళ్ళో పోశాడు కామేశ్వరరావు. ఆరు నెలలు ఆటలాడినా వీరయ్య 200 లేనా కళ్లచూసేవాడు కాడు. కామేశ్వరరావు వచ్చిన డబ్బు మొత్తం తొమ్మిది వందల యేభై అనిన్నీ, మణి అయ్యరుగారికి రానూపోనూ ఖర్చులక్రింద, బహుమతీ క్రింద, ఇచ్చింది 300 అనిన్నీ, పేపర్లు అచ్చువేయించడం, ఊరంతా పంచిపెట్టించడం వాట్లకీ అయిన ఖర్చు నూరురూపాయలు అనిన్నీ, 50 రూపాయిలు హాలు అద్దె అనిన్నీ లెక్క చెప్పాడు.

కామేశ్వర్రావు పూరిగుడిశెలలో ఉండకూడదని, ఛండాలపు నీచపదార్థాలు తినకూడదనిన్నీ వీరయ్యతో హోరాహోరీని దెబ్బలాడి, ఆ గుడిశెలు, గాడిదలు, వాళ్ల బట్టలు అన్నీ, ఇతర బీదవాళ్ళకు దానా లిప్పించాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చి సత్రములో పెట్టాడు. శుభ్రమైన వస్త్రాలు కట్టబెట్టించాడు. మీనాక్షి హృదయం సంతోషంతో సంగీతాలు పాడుకొనేటట్లు వీరయ్య జట్టువాళ్ళందరికీ నాగరికతా దీక్ష నిచ్చాడు.

మీనాక్షి సంగీత సభలు నెల్లూరు, గుంటూరు, బెజవాడ, ఏలూరు, రాజమండ్రి మొదలైన పెద్దపురాలలో పెట్టించి, విశాఖపట్టణంలో సభ జరుగుతుందని ప్రకటించాడు. సీతారామయ్యగారినీ, అళహసింగరి శిష్యుడైన ఒక తెలుగు మార్దంగికుణ్ణీ తీసుకొని, కామేశ్వర్రావు ఈ సభలు చేయించాడు. భారతీయసంగీత మహాకాశంలో ఒక ఉత్కృష్టనక్షత్రం బయల్దేరిందనిన్నీ, మీరాబాయి మళ్ళీ అవతారం తాల్చిందనిన్నీ పత్రికలన్నీ ప్రశంసించాయి. మీనాక్షికి మెడల్సూ, హారాలూ, వెండివస్తువులూ మొదలైన బహుమానాలు వానలాగు కురిశాయి.

10

మీనాక్షికి కామేశ్వర్రా వంటే వెఱ్ఱి స్నేహభావం మొదటినుంచీ ఉంది. కాని స్త్రీపురుషసంబంధ మగు ప్రేమ భావాలన్నీ ఆమెకు కల్గలేదు. స్త్రీపురుషులకుండే ప్రణయ భావంగాని, మోహభావంకాని ఈలా వుంటుందని ఆమెకు తెలవదు. ఆమె చూపించే హావభావ విలాసాలు ఆమె హృదయంలో తాండవము చేస్తూ ఉన్న శైశవ, బాల్యదశలకు సంబంధించినవే. రూపంలో మూర్తీభవిస్తూ ఉన్నప్పటికీ, ఆ బాలికలో స్త్రీత్వము ఇంకా మనఃపధాలలో ఆవిర్భవించ నన్నా లేదు. కామేశ్వర్రావు వచ్చి చేసిన ఈ అద్భుత మంతాచూసి, మీనాక్షి విస్తుపోయి వెఱ్ఱి ఆనందంలో మునిగిపోయింది. కామేశ్వర్రావును కౌగలించుకొన్నది. "నాయుడుగారూ, మీరు గొప్ప మాంత్రికులా ఏమిటి" అన్నది. అతనికి అన్ని చాకిరీలూ చేసేది. తలదువ్వేది, నీళ్లు పోసుకునేటప్పుడు సబ్బుపెట్టి ఒళ్లు రుద్దేది తమలపాకులకు సున్నం రాసి యిచ్చేది.

భార్య చేసే చాకిరీలాంటి యీ పరిచర్యచూసి కామేశ్వర్రావు ఈ బొమ్మలరాణి తన్ను సంపూర్ణముగా ప్రేమిస్తున్నదని భావించుకున్నాడు. ఆమె తనను ముట్టుకున్నప్పుడల్లా అతని వొళ్ళు ఝల్లుమనేది. ఆమె తన దగ్గిరగా వచ్చినప్పుడల్లా తన ఒళ్ళోకి తీసుకునేవాడు. ఒకనాడు తన దృఢ బాహువుల్లో ఆ బాలికను అదిమిపట్టి, నవనవలాడు ఆమె నుని వెచ్చని దేహాన్ని తన దేహానికి హత్తుకొని, బుగ్గలపై, కంఠంపై, కన్నులపై, తలపై ముద్దులవర్షం కురిపించి ఆమె పెదవులను చుంబించనారంభించాడు. మీనాక్షి హృదయం జల్లుమన్నది. ఒళ్లు ఉప్పొంగిపోయింది. ఆమెలోని బాలికాత్వము పువ్వు రేకులలా రాలిపోయింది. ఆ బాలిక ఆతని కౌగిలింత లోనే జవ్వనియగు స్త్రీ అయినది. కాని కామేశ్వర్రావుపై ఇంకనూ ప్రణయభావ మేమాత్రమూ కలుగలేదు. స్త్రీత్వమంకురించిన నునుక్రొత్తలో పైకుబికిన మోహము ఆమెను వివశ నొనరించడం వల్ల ఆమె ఆతని కౌగిలింతలో హత్తుకుపోయింది.

ఆ మహాతరంగం దాటిపోయింది. మీనాక్షికి మెలకువ వచ్చింది. ఆమె ఆతని బాహువుల్లోంచి విడిపించుకొని ఆ గదిలోంచి బయటపడి తన గదిలో మంచంమీదపడి దొర్లుతూ యెందుకో తనకే తెలియకుండా వెక్కివెక్కి ఏడవడం ప్రారంభించింది. ఆ గంభీర విషాదానికి కన్నీళ్ళన్నా లేవు. ఆమె రావి ఆకులా గజగజ వణికిపోయింది.

కామేశ్వర్రావు మీనాక్షి తనను ప్రేమిస్తోందని గాఢ నిశ్చయం చేసుకున్నాడు. ఇంక తన కర్తవ్యం ఏమిటి? తనకు వివాహం కాలేదు. మీనాక్షితో వివాహం పనికిరాదా. వివాహం లేకపోతే మీనాక్షితో పులకరించే స్నేహమెట్లా? ఆలాంటి దివ్యమైత్రి తన అంతరాత్మకు వ్యతిరేకమా? అది తప్పా ? స్త్రీపురుష ప్రణయసంబంధానికి వివాహము ముఖ్యమా ? పురోహితుల చేతనూ, దొంగ ఆచారాలచేతనూ పుట్టిన ఈ పెళ్ళిళ్లు సత్యబద్ధమైనవా? భగవంతునికి యిష్టమైనవా? లేకపోతే వివాహంలేని ప్రణయం పాపభూయిష్టమైన దనే మాట నిజమా? ఇంతవరకూ తాను ప్రేమ అనే దేమిటో యెరుగడు. ఏదో అలంకరించుకొని, పొంకాలు తిరిగివున్న దేహంతో వున్న యువతు లాతని హృదయం చెదరగొట్టే వారు. తనకు మోహావేశము కల్గిన మాట నిజమే. అంత మాత్రమే. నిజమైన ప్రేమక్కూడా మోహావేశం వున్నది. ప్రణయంకూడా శారీర ప్రేమరహితమై అదోరకపు విచిత్రమైన ఉత్కృష్ట ఆశయభావమన్నా తాను నమ్మడు. భగవంతుని మీద ప్రేమా, దేశంమీద ప్రేమ కూడా దేహసంబంధం కోరుతున్నాయే!

ఈ విచిత్ర సంఘటన గుంటూరులో పురవిశ్రాంతి భవనంలో జరిగింది. సీతారామయ్యగారికీ, వీరయ్యకూ, కామేశ్వర్రావు హృదయం కీనీడగా, చూచాయగా గోచరించింది. వాళ్లిద్దరూ భయపడిపోయారు. అప్పటినుంచీ ఒకరి నొకరు సంప్రదించుకోకపోయినా కామేశ్వర్రావూ మీనాక్షి, ఏకాంతంగా వుండకుండా వాళ్లు చూస్తూ వుండేవాళ్లు. వీరయ్యకు తాను చెయ్యవలసినదేమిటో తోచలేదు.

పులిమీద పుట్ర అన్నట్లు కొందరు ధనవంతులు, ఒకరిద్దరు జమిందారులు వ్యంగ్యపు మాటలతో మీనాక్షిని తమతో ఒకటిరెండు రాత్రిళ్ళుగానీ ఇంకా యెక్కువగా గాని గడిపేటట్లు చేస్తే పదివేల దాకా కూడ బహుమతు లిస్తా మని కబుర్లు పంపించారు. వీరయ్య మండిపోయాడు. లోలోన క్రుంగిపోయాడు. ఈ సంగతి కామేశ్వర్రావుకు తెలియదు.

వీరయ్య సీతారామయ్యగారితో ఆ విషయం మనవి చేసుకున్నాడు. ఆయన తెల్లపోయినాడు.

సీతా -- ఈ ప్రపంచకములో యిదో పెద్ద దురన్యాయ మోయి! ఏ ఉత్కృష్టవిద్య నేర్చుకున్నా దెయ్యం నీడలా వెంటపడుతూ వుంటుంది ఈ దురదృష్టము. నాటకాల్లో వేషాలు వేసేవాళ్ళు, సంగీత పాటకులు గొప్పవాళ్ల యిళ్ళల్లో వున్న స్త్రీల మోహభాణాలకు గురా? ఆడవాళ్లు వస్తే మగవాళ్లు శుంఠలైపోవడమా? ఛీ! ఛీ!!

వీర -- ఏమిటండి, ఇప్పు డుపాయం? నాకు మతిపోతోంది.

సీతా -- నావల్లే యీ చిక్కు వచ్చిందని అనుకుంటా నోయ్!

వీర -- మాకులంలో వాణ్ణి యిట్టాంటప్పుడు మా అమ్మిణి పెళ్లిచేసుకుంటందా సామీ !

సీతా -- అదీ నిజమేనోయ్!

విఠలుడు -- మీరు మా అమ్మణితో కదిలేస్తురూ సామీ. మాకు దాని దగ్గిరికి వెళ్లడమే భయంగా వుండది.

11

కామేశ్వర్రావు జట్టునంతా చెన్నపట్టణం తీసుకెళ్లినాడు. అది 1925 వ సం. డిశెంబరునెల. అడయారులో దివ్యజ్ఞాన సమాజముయొక్క షష్టిపూర్తి మహోత్సవము అఖండ వైభవంతో జరుగుతూ వున్నది. దేశదేశాలనుంచి సభికులు ప్రతినిధులుగా వచ్చారు. వేలకువేలు సామాజికులూ, కాని వాళ్లూ కూడా ఉత్సవాలు చూచి ఆనందించడానికి వస్తూ వున్నారు. ఒకవైపు మహామఱ్ఱి వృక్షంక్రింద సభలు. ఒకవైపు చిత్రకళాప్రదర్శనం. ఇంకోచోట బౌద్ధ, పారశీక, క్రైస్తవ, జైన, మహమ్మదీయ, యూధ, హిందూమతాదులప్రార్థనలు. అఖండకోలాహలంగా వున్నది.

డాక్టరు జేమ్సు. హెచ్. కజిన్సుపండితుడు భారతీయ కళా వైభవ సముద్రములో మునిగి ఆనందపారవశ్యుడైపోతూ వుంటాడు. భారతీయ కళాద్భుతానికి దూరంగా వున్న భారతీయ మహాశయులకున్ను, ఇతర దేశీయులకున్ను ఆ కళలలో వున్న ఉత్కృష్టత వెల్లడించడానికి సంకల్పించు కొన్నా డా మహానుభావుడు.

ఆయన ఆ ఉత్సవాలకు జావా నుంచి ఒక తోలుబొమ్మలవాళ్ల జట్టు, వీధినాటకంవాళ్ల జట్టు రప్పించి ప్రదర్శనాలు యిప్పించాడు. ఆ ప్రదర్శనాలన్నీ కామేశ్వర్రావు మీనాక్షివాళ్లతోపాటు పరికించినాడు, ఆశ్చర్యపూరితుడైనాడు. ఆతని భావాలు ఆకాశవీధుల పరువులెత్తినవి. ఆ మరునాడు కామేశ్వర్రావు కొందరు స్నేహితుల సహాయంతో కజిన్సుగారిని కలుసుకున్నాడు.

కామే -- జావా తోలుబొమ్మలాట చూచానండి. ఆ ఆట ఆంధ్రదేశం నించే వెళ్లిందని నా ఊహ.

కజిన్సు -- కావచ్చును. ఈ రెండుదేశాల ప్రదర్శనాలకు చాలా సంబంధం వున్నమాట నిజమే.

కామే -- ఈ ఆటలో నాటకం, నాట్యం, సంగీతం, చిత్రలేఖనము, కవిత్వము, భాష మొదలైన కళలన్నీ దివ్యంగా కలిసి వున్నాయండి.

కజిన్సు -- జావా ఆటలో కొన్ని దోషాలు వచ్చాయి. ఆంధ్రదేశంలోని ఆటను కొన్ని దోషాలు ఆవరించినాయి. కళ రానురాను హీనస్థితికి వచ్చింది.

కామే -- మానవునిలో వున్న పశుత్వం (Atavism) ప్రతి వ్యక్తిజీవితం లోను ఒకసారి పైకివచ్చినట్లుగానే ఒక సంఘజీవితంలోకూడా అప్పుడప్పుడు వస్తుంది గాదండి.

కజిన్సు -- నువ్వు సరిగా చెప్పావయ్యా! ప్రేక్షకలోకం యొక్క హృదయస్థితిని బట్టి ప్రదర్శనం రీతిన్నీ మారుతూ వుంటుంది. సంఘకళారసజ్ఞత అధోలోకంలోకి పడిపోతూ వున్నప్పుడు ఆ పతనాన్ని ఆపుచేసి నిలబెట్టే బాధ్యత ప్రభుత్వంపైనా, కళాస్రష్టలపైనా, జమీందారులపైనా, ధనికిలపైనా వున్నది.

కామే -- అవునండి. ఈ తోలుబొమ్మల్లోని ఉత్కృష్టత మరిచిపోయి, ఉత్తములు విముఖులవడంచేత పాటక జనుల కోసం గంధోళిగాడు, కేతిగాడు, అల్లాటప్పగాడు తెరమీద విజృంభించారు. కాని జాగ్రత్తగా చూస్తే పెద్దపెద్ద పాత్రలకు గంభీరమైన అభినయం, చిన్నపాత్రలకు వాటికి తగిన నటన మాచిత్రంగా వుంటుందండి. రామచండ్రుడు చెయ్యి మాత్రం కదుపుతాడు. లక్ష్మణుడు తలకూడా తిప్పుతాడు. ఆంజనేయులు మొదలైనవాళ్లు దేహమంతా కదుపుతూ అభినయం చేస్తారు. రాక్షసులు గడబిడ దడబిడగా బల్లల చప్పుడు, బూరాల మోతలతో నీడల్లా వచ్చి రూపం పొంది, మళ్లీ పొగలా అయి మాయమవుతారు. తమ రాశీర్వాదిస్తే ఉదయశంకరుడు నాట్యకళను పునరుద్ధరించి నట్లున్ను, రవీంద్రుడు నాటకకళకు కొత్తపద్ధతిగ తిరిగి జీవం పోసినట్లున్ను, ఈ తోలుబొమ్మలాట కూడా మార్చి ఉత్తమ హృదయులు మెచ్చుకునేటట్లు చేద్దామని వుందండి.

కజిన్సు -- మీ భావం, ఆశయం చాలా బావున్నాయి. నాకు చేతనయినంత సహాయం చేస్తాను.

12

భారతీయ సంప్రదాయమైన చిత్రలేఖనము నేర్చుకుని ప్రసిద్ధికెక్కిన ఒక ఆంధ్ర చిత్రకారకుని కామేశ్వర్రావు చేరదీసాడు.

వీరయ్యతో, విఠలుడితో చాలారోజులు తర్జభర్జన చేశాడు. తోలుబొమ్మలాట విద్యలో తాను గొప్ప మార్పులు తీసుకొస్తాననిన్నీ, అందువల్ల లోకప్రఖ్యాతిన్నీ, మిక్కుటమగు ధనమున్నూ వీరయ్యకు చేకూరుతాయనీ కామేశ్వర్రావు వాళ్లకి నచ్చ చెప్పాడు.

అప్పుచేసి ఒక అయిదువందల రూపాయలు తెచ్చాడు. అవి ఖర్చు పెట్టి పురాతన భారతీయ సంప్రదాయాలైన అజంతా, మొగలు, రాజపుత్రపద్ధతులలో జపాను, టిబెట్టు, పారశీక, పాశ్ఛాత్య సంప్రదాయాలు సమ్మిళితం చేసి, నూతనంగావచ్చే "వ్యంజ" (Impressionism), "కోణ" (Cubism) మొదలైన రీతులను యిముడ్చుకుంటూ, కొత్త రీతులు కల్పించుకుంటూ, ఉద్భవించిన నూతన భారతీయ చిత్రలేఖన సంప్రదాయ ప్రకారంగా రామాయణ భారత కథలకు, భాగవతంలోని శ్రీకృష్ణునికథకూ, సంధ్యాతాండవం మొదలైన శివగాధలకూ సరిపడే చిత్రాలు వీరయ్య చేత, ఆ ఆంధ్ర చిత్రకారకుని సలహాతో తయారు చేయించాడు.

ఉదయశంకరుడు తన నాట్యానికి ఉపయోగిస్తూ వున్న సంగీతపు హంగుపద్ధతిని కామేశ్వరుడు అవలంబించి గొట్టు, వీణ, వాయులీన (Violin), మహావాయులీన (Violin-cella), తంబూరా, చితారు, ఇస్రాజ్ మొదలైన వాద్య విశేషాల్ని వాయించే వాళ్ళను పోగుచేశాడు.

13

ఈ నూతన సంప్రదాయపు తోలుబొమ్మలాటను మొదట అడయారులో డాక్టరు కజిన్సు మొదలగు సహృదయుల మ్రోల, ఓ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభించి ఆడింపించాడు కామేశ్వర్రావు. ఆట పన్నెండు గంటలకు పూర్తిఅయింది.

రంగంలో వుండవలసిన చిత్రాల మీదే వెలుగు పడుతుంది. ఉండనక్కరలేని బొమ్మలు తెరమీద లేవు. అభినయం, నృత్యం రసము వుట్టిపడుతున్నవి. సంభాషణ తెలుగులో చక్కని నుడికారంతో, తేనెలూరు తున్నది. హంగు చేసే సంగీతం విచిత్రము. ఉత్కృష్టపాత్రలు కర్ణాటక సంప్రదాయంగా నున్ను, ఇతరపాత్రలు యేలపాటల పద్ధతిగా నున్ను పాటలూ, పద్యాలు గానం చేసినారు, మహారాజు వస్తూ వున్నప్పుడు ఒక విధమైన సమ్మేళనగానం. మహాఋషి వస్తూ వున్నప్పుడు వినిపించిన సమ్మేళనగానం వేరు. మొదటిది ప్రాపంచికాద్భుతం సూచిస్తున్నది. రెండవది పారలౌకిక భావరసాలు వుట్టిపడజేస్తున్నది.

అందరూ నిస్తబ్ధులై చూశారు.

మీనాక్షి యింతపెద్దకళ్లు చేసుకుని కథ అంతా గమనించింది. ఆమె పేరుపొందిన సంగీత విద్వాంసురాల నన్న భావంతో తాను జట్టులో పాలుపుచ్చుకోలేదు. కామేశ్వర్రావు అందుకని ఆమెను ప్రార్థించనూ లేదు. తాను బొమ్మలరాణి. ఇంత చిన్నప్పుడు తాను గొంతుక యెత్తడం ప్రారంభించి నప్పటి నుంచిన్నీ జట్టు వాళ్ళూ, పల్లెటూళ్ళలో యితర్లూ తన్ను యెంతో ఆదరించే వాళ్లు. తాతగారికీ, తండ్రికీ గారాబు బిడ్డ. ఆలాంటి తన హృదయానికి తన రాజ్యానికి మించిపోయిన మహారాజ్యం ఓటి ప్రత్యక్షమైంది. ఆమె మనస్సు ఓ విధమైన వాంఛా మేఘంలో అలుముకుపోయింది. అన్నీ సుళ్లు చుట్టిపోయే ఆలోచనలే. అంతలో భయం.

తాను సంగీతంలో సేలం గోదావరి లా, బెంగుళూరి నాగరత్నం లా పేరు సంపాదించుకోవచ్చును. అది ఆఖరు కాదు కదా యీవాళ నుంచి? కామేశ్వర్రావు మళ్ళీ తోలుబొమ్మలాట మొదలుపెట్టించాడేమి? ఎంతబాగున్నా తోలుబొమ్మలాట మళ్ళీ వద్దు.

ఆమెకు గాడిద లద్దెలవాసనా, ఏళ్ళతరబడి చెమటలో తడి ఆరిపోయిన, భయంకరమైన ఛండాలపు మురికిగుడ్డల వాసన మళ్ళీకొట్టినవి. ఒళ్లు జలదరించింది. కళ్ళనీళ్లు తిరిగినవి. ఆ నరకంలోంచి రక్షించిన దైవసమానులు సీతారామయ్యగారు, కామేశ్వర్రావుగారు. వాళ్లు మళ్ళీ అధోలోకం లోకి తన్ను తోసివెయ్యరు కదా! అమ్మయ్యో!!

ప్రదర్శనం అయిన మర్నాటినుంచి కామేశ్వర్రావును చూడ్డానికి ఆమెకు భయం వేసింది. ఒకనాడు కామేశ్వర్రావు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె మంచంపైన మెత్తని దిండులోకి మొహందూర్చి తల యెత్తకుండా పడుకుంది. కామేశ్వర్రావు గదితలుపు చేర వేశాడు. ఆ బాలిక దేహసౌభాగ్యకాంతులు, ఆనందరేఖల వంపులుపోతూ, ఆ సన్నని తెల్ల పట్టుచీరలోంచి ప్రతిఫలిస్తున్నవి. ఆమె యౌవనము పూర్ణత దాల్చి ఆమె సౌందర్యానికి యింకా వన్నె తెచ్చింది. కామేశ్వరుని హృదయము వెర్రి ఆశ లో మునిగింది. ప్రేమపూర్ణతచే ఆతడు తూలుతూ పోయి మంచం పై పడుకునివున్న మీనాక్షిపై సుందరేశ్వరునిలా వాలాడు. ఆమెను తన బాహువుల్లోకి మింగివేసుకొన్నాడు. ఆమె కర్కశత్వము దాల్చి ఆతని బాహువుల్లో కఱ్ఱ వలె బిగుసుకొని పోయింది.

కామేశ్వర్రావు ఆశ్చర్యపడి

"మీనా ! నే నంటే నీ కాపేక్షలేదా?" అన్నాడు.

"........................."

"ఈ మూడేళ్ళనించి నా హృదయంలో ఒక దేవాలయం కట్టుకుని అందులో నిన్ను పెట్టి పూజ చేస్తున్నాను. ఆ రోజున మా ఊళ్ళో బొమ్మలాటలో నీ గొంతుకు విన్నప్పటినుంచీ..."

కామేశ్వర్రావు తన కౌగిలింత లోంచి ఆమెను వదలి ప్రక్కను కూర్చున్నాడు.

"ఆనందంలేని నా జన్మకు ఆనందం యిచ్చావు, మీనూ! నీ ప్రేమ అనే అమృతంతో నన్ను దివ్యుణ్ణి చేశావు." మీనాక్షి లేచి కూర్చుంది.

"ఈ కొత్త బొమ్మలాట లోకి నన్ను దింపుతారా యేవిటి నాయుడుగారు?"

"మీనూ, మీనూ! నా కుటుంబం యావత్తూ వదిలి వేశా. నా తల్లినీ, వాళ్ళనూ చూసి యేడా దయింది. నీ దాసానదాసుణ్ణి. నా ఈ జన్మ భయంకరమైన వట్టి ఎడారిని చేసినా, పరమ పవిత్రాలైన హిమాలయభూములు చేసినా నీ చేతిలోనే వుంది."

కామేశ్వర్రావు మంచము దిగి ఆమె పాదాల కడ మోకరిల్లి ఆమె వళ్ళో తలపెట్టుకుని ఆమె నడుంచుట్టూ తన రెండుచేతులూ చుట్టి "నా జన్మం పవిత్రం చేసిన దేవిని ఉద్భవించుకున్న నాకు కృపావరము దొరకదా?" అని అన్నాడు.

మీనాక్షి దృగంచలాల నుండి వేడి చుక్కలు కామేశ్వర్రావు తలపై పడ్డాయి.

"మీరు అద్భుతమైనటువంటి నూతన ప్రపంచంలోకి తీసుకువచ్చినారు నన్ను. గడ్డిపోచను దవనపుమొక్కగా చేశారు. నా చర్మం మీ కాళ్ళకు జోళ్లు కుట్టి యిచ్చినా నా బాకీ తీర్చుకోలేను."

"ఒట్టి బాకీయేనా?"

కామేశ్వర్రావు చటుక్కున లేచి ఆమె బుజాల మీద తన రెండు చేతులూ వేసి ఆమె వేపుకు దీనంగా చూస్తూ ప్రశ్నించాడు. ఇంతలో తలుపు తోసుకొని వీరయ్య, కామే శ్వర్రావు మేనమామ, సీతారామయ్యగారు లోపలికివచ్చారు. కామేశ్వర్రావు నిర్ఘాంతపోయాడు. మేనమామ అతి కోప కంఠంతో "యేవిరా, కాముడూ ! చదువు కున్నందుకు యిదేనా యేంటి? కులం తగలేస్తున్నావు. కుటుంబం తగలేస్తున్నావు. మా అప్ప కుళ్లికుళ్లి మంచం పట్టింది. మేం పదిమందిలో తలయెత్తుకుని తిరగ లేకుండా వున్నాం. అప్పులు చేసేసి తమ్ముణ్ణీ నిన్నూకూడా తగలేసుకుంటున్నావ్. నీ కొచ్చిన సమ్మంధాల వాళ్ళకి జవాబులు చెప్పలేకుండా సచ్చిపోతున్నాం. అనంతపురం డిప్యూటీకలక్టరుగారు పిల్లనిస్తామని నాతోకూడావచ్చారు. ఆయన పెద్ద హోటలులో వున్నారు. రా, అక్కడికిపోదాం. నీ మూటాముల్లీ సద్దుకో. మనం భీంవారం వెళ్ళిపోదాం లెగు."

సీతా -- నాయనా! వీరయ్య తన గొడవ తను చూసుకుంటాడు. ఆతనిపై దయ వుంచి ఇహ ఒదిలెయ్య మంటున్నాడు. నీ ధర్మం నువ్వు ఆలోచించుకో.

వీర -- కామేశ్వర్రావుబాబుగారూ! మీరు మాకు చేసిన ఉపకారానికి మేం యెన్ని జన్మలెత్తి మీకు సేవజేసినా కృతజ్ఞత తీర్చుకోలేమండి, మా తమ్ముడి కూతురు కొడుక్కి సామీ మా అమ్మణ్ణిని యివ్వడానికి సమ్మందం యేర్పాటు చేసినా. మేం అంతా ఒరంగలెడుతుండము.

కామేశ్వర్రావు తుపాకుల యెదుట సింహంలా చుట్టూ తేరిపార చూశాడు. మాట జవాబు చెప్పకుండా అతి కోప స్వరూపంతో మూడు అంగల్లో గుమ్మం దాటి విసవిస వెడలి మాయమయ్యాడు.

14

ఆ నాటి సాయంత్రం మీనాక్షి మాయమయింది. రెండురోజు లైన వెనక బెంగుళూరులో మీనాక్షి, కామేశ్వర్రావులకు వివాహం అయిందని పత్రికలలో ప్రచురణం అయింది. చెన్నపట్టణంలో బెంగలుపెట్టుకుని తిండి మానేసుకున్న వీరయ్య జట్టుకు సీతారామయ్యగారు నెమ్మదిగా ఈ వార్త వినిపించాడు. విఠలుడిమోము ప్రపుల్లమైంది. వీరయ్య విషాదంతోనూ, కోపంతోనూ కూలబడిపోయాడు.

ఈ వార్త విని కామేశ్వర్రావు మేనమామ మహాగ్రహంతో కామేశ్వర్రావుని బండబూతులు తిట్టుకున్నాడు.

సీతారామయ్యగారూ, కామేశ్వర్రావు మేనమామా భీమవరం తిరిగి వెళ్ళిపోయారు.

ఒక రోజు తెల్లవారేసరికి వికసించిన గులాబిపువ్వు మోముతో మీనాక్షీదేవి తాతగారి దగ్గఱకు వచ్చి నమస్కారం చేసింది. ఆమె పెదవులు చిరునవ్వు నవ్వుతున్నవి. ఆమెకళ్లు చిరుభయంతో బెదరుతున్నవి. ఆమె ఫాలంలో ముంగురులు చిరుగాలిలో చెదురుతున్నవి. ఆమె వాక్కులు చిరుకంపంతో తొణుకులాడినవి.

"నీ మొహం చూడకూడదు, అమ్మిణీ!"

"............"

"నువ్వెంత పాపం చేశావో నీకు తెలుస్తుందా?"

"............."

"నీకు పుట్టిన కొడుక్కి నా పేరు పెట్టుకోకు."

"తాతయ్యా, నీకు దణ్ణం పెడదామని అవతల నుంచుని వున్నారు. కామేశ్వర్రావుగారు ఒకదేవుడు."

కొత్తపద్ధతిలో అద్భుతమైనటువంటి అజినచిత్రనాటక ప్రదర్శనం మ్యూజియమ్ నాటక ప్రదర్శనశాలలో జరుగునని చెన్నపట్నంలోని పత్రికలన్నీ ప్రచురించాయి. ఆ ప్రదర్శనంలో బొమ్మలరాణి మీనాక్షిదేవికూడా పాలుగొంటుందనిన్నీ, ఇంత విచిత్రమగు ప్రదర్శనం భరతదేశంలో యిది వరకు చూపింపబడలేదనిన్నీ, ఈ ప్రదర్శన సూత్రధారుడైన కామేశ్వర్రావుగారు చాలా అభినందింపబడ తగినవాడనిన్నీ మొదలైన సంగుతులతో, జట్టులో పాల్గొనే వాళ్ళ ఛాయా చిత్రాలతో పత్రికలు వ్యాసాలు ప్రకటించినవి. ప్రదర్శనము శ్రీ గవర్నరుగారి అధ్యక్షతను జరిగింది. చూచినవాళ్ళంతా సంతోషంతో విస్తుపోయినారు. పదకొండువందలరూపాయల టిక్కట్లమ్మబడినవి.

నాటకంలో వున్న అందం, సినిమా టాకీలో వున్న అందం, చిత్రకళాప్రదర్శనంలో వున్న అందం కలవేసి యీ నవీనపద్ధతి రూపొందిందని పండితులు వ్యాసాలు వ్రాశారు.

ఓనాడు ఉదయాన్న కామేశ్వర్రావు భార్యతో భీమవరంలో తన ఇంటి దగ్గర మోటారునుంచి దిగినాడు. బెంగచే కృశించి తల్లి మంచముపట్టి వున్నది. ఇంతలో మెరుపుతీగలాంటి ఒక బాలిక ఆమె పాదాలకడ వ్రాలి, పాదాలపై తల వుంచి, పాదాలు పట్టుకున్నది. కామేశ్వర్రావు తల్లి నెమ్మదిగా లేచి "యెవరమ్మా నువ్వూ?" అని ఆ బాలిక తలపట్టుకొని యెత్తి మోము తేరిపారచూచింది.

"నువ్వెవరు, తల్లీ?"

ఆ బాలిక కన్నుల జలజల బిందులు రాలిపోతున్నవి.

"నువ్వు దేవతాకన్నెవు కాదుగదా?"

వర్షం కురుస్తూన్నపుడు వచ్చే వెన్నెలలా ఆ బాలిక పెదవులు నవ్వాయి.

కామేశ్వర్రావు తల్లి "నా బంగారుతల్లి, నువ్వెవరో తెలియలేదు నాకు" అని ఆ బాలికని దగ్గరకు లాగుకొని హృదయానికి అదుముకున్నది.

ఇంతలో గుమ్మముకడ నిలుచునివున్న కామేశ్వర్రావు

"అమ్మా! మీ ఆజ్ఞలేకుండా సంచరించిన ఈ అధముణ్ణి క్షమించి మా ఇద్దర్నీ దీవించవూ?" అన్నాడు.

ఆవిడకు హృదయం పొంగింది.

"నాయనా! ఈ దేవకన్నేనా నా కోడలు? బొమ్మలాట వాళ్ళ పిల్లంటే యానాదుల అమ్మాయి లా వుంటుందనుకున్నాను. ఈమె శాపం చేత పుట్టిన ఇంద్రుడు కూతురు రా!" కామేశ్వర్రావూ, మీనాక్షీ ఆమె పాదాలకడ మోకరిల్లారు. ఆ తల్లి కొడుకూ, కోడళ్ల తలల మీద రెండు చేతులూ వుంచి తలయెత్తి "శ్రీరాములూ, వీళ్ళిద్దర్నీ రక్షించు !" అన్నది.