శ్రీ.

శ్రీ భీమేశ్వరపురాణము.

పీఠిక.


శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుఁడగు శ్రీకాళహస్తీశ్వరుని యర్ధాంగలక్ష్మియు జగజ్జననియు నగు శ్రీజ్ఞానప్రసూనాంబకు భక్తిమెయి మేమర్పింపఁబూనిన "శ్రీజ్ఞానప్రసూనమాలిక ” యందు ద్వితీయప్రసూనముగ నీ భీమఖండ మనునామాంతరముగల శ్రీభీమేశ్వరపురాణముం గూర్చితిమి. ప్రథమప్రసూనమగు శ్రీకాళహస్తి మాహాత్మ్యము నిజవాసనావేల్లితాంధ్రప్రపంచం బై నెగడసాగి యైదేండైనను ద్వితీయప్రసూన మింతకాలము పొడగానరాకుండుటకుఁ గతం బీగ్రంథమందుఁగల చిక్కులతోడ గేవలము ధనాఢ్యులముకాని మా యత్నములు ముద్రణాద్యవసరములందలసగతి వహించుటయ. ఈ గ్రంథముయొక్క ప్రతులు చిక్కుట మిక్కిలి యరుదు.

మహారాజరాజశ్రీ, సమర్థి రంగయ్యసెట్టి బి. ఏ., గారొకప్రతియు, బ్రహ్మశ్రీ, మహారాజరాజశ్రీ, గురుజాడ శ్రీరామమూర్తిపంతులుగారొక ప్రతియు, బ్రహ్మశ్రీ, మహారాజరాజశ్రీ, పోతాప్రగడ బ్రహానందముగారొక ప్రతియు మా కిప్పించిరి. ప్రాచీన పుస్తకభండారమునందు రెండుప్రతులు చిక్కినవి. బ్రహ్మశ్రీ, మహారాజరాజశ్రీ, దర్భా వెంకయ్య బి. ఏ., బి. ఎల్., గారు, సంస్కృతభాషలో ముద్రింపంబడియుండు భీమకండంబను గ్రంథంబొకటిని మా కొసంగిరి. వీనిని సహాయముగాఁ గొని యీ భీమేశ్వరపురాణంబును మాశక్తికొలది సంస్కరించి వ్రాయించి ముద్రింపించినారము.

ఈ గ్రంథమునఁ దొలుదొల్త విఘ్నేశ్వరుని ప్రార్థనలోనె పద్యము వ్రాఁతప్రతులయం దిట్లుండెను:-

ఉ.

 ఏనికమోము తెల్లెలుకనెక్కినరావుతు రాచవారుసే
    నానియనుంగుపెద్దన వినాయకదేవుఁడు కర్ణతాళజం
    ఝానిలమారుతంబున నిరంతరముం బ్రబలాంతరాయసం
    తానఖినాఖినాఖినఖిదంతముల న్విదళించుగావుతన్.

ఈ పద్యముంకూర్చి మే మెఱింగినపండితుల నందఱనడిగినారము కాని యొక్కొకరును గ్రుక్కలుమ్రింగినవారలె, మార్పులు సూచించినవారలె. అయినను మా వ్రత మొకటికలదు. అది యేదియందురేని మేము ప్రకటించు గ్రంథములయం దాయా గ్రంథకర్త లేపదములు ప్రయోగించియుందురో వానిని సాధ్యమైనంతవఱకు నూహించి వేయవలయుననేకాని మాకుం దెలియనిచోట్ల నుండు నక్షరములఁదీసి పాఱవైచి మాకవిత్య మిఱికింపఁగూడ దనుటయే. ఈ నిర్బంధమునకు లోనైన మే మీవినాయకస్తుతింగల పద్యముంగూర్చి పడినకష్ట మా వినాయకునకే యెఱుక. ఇట్టి కష్టము లీగ్రంథమం దెన్నియో యుండినవి. వానినెల్ల శ్రీజ్ఞానప్రసూనాంబ కరుణచేతను బెద్దలసహాయమువలనను గడచి నేఁటి గ్రంథముఁ బ్రకటింపఁ గంటిమి.

ఇది పంచాశత్ఖండమండితం బగు స్కాందంబులోని యొక ఖండము. భీమఖండము నాఁబడు. గోదావరిజిల్లాలోని దక్షారామము లేక భీమేశ్వరం బనునొకశివస్థలమాహాత్మ్యముం దెలుపునది. ఆస్థలంబునకు దక్షిణకాశియను సంజ్ఞయుఁ గలదు. అది భోగమోక్షదం బని ప్రసిద్ధిఁ గాంచినది. దేవభాషయందు ముప్పదిరెండు సర్గలుగా విభజింపఁబడి యించుమించుగా రెండువేల శ్లోకములుగల యీ గ్రంథమును నాంధ్రంబున శ్రీనాథుఁ డను మహాకవి యాఱాశ్వాసముల గ్రంథముగ విరచించె.

శ్రీనాథుఁడు పాకనాటి నియోగిబ్రాహణుఁడు. భారద్వాజసగోత్రుఁడు నాపస్తంబసూత్రుఁడు బ్రాహీవరప్రసాదలబ్ధుఁడును శివపూజారతుండు. ఈయన తల్లిదండ్రులు భీమాంబయు మారయయు. తాత పద్మపురాణంబును రచించిన కమలనాభామాత్యుఁడు. వీనికిం బ్రమాణంబు లెవ్వియనిన:—


శా.

భారద్వాజపవిత్రగోత్రుని శుభాపస్తంబసత్సూత్రు వి
ద్యారాజీవభవుండు మారయకుఁ బుణ్యాచార భీమాంబకు
న్గారామైనతనూజు న న్ననఘు శ్రీనాథాఖ్యునిం బిల్చి స
త్కారం బొప్పఁగ గారవించి పలికె న్గంభీరవాక్ప్రౌఢిమన్.

నైషధము


శా.

బ్రాహ్మీదత్తవరప్రసాదుఁడ వురుప్రజ్ఞావిశేషోదయా
జిహ్మస్వాంతుఁడ వీశ్వరార్చనకళాశీలుండ నభ్యర్హిత
బ్రహ్మాండాదిమహాపురాణచయతాత్పర్యార్థనిర్ధారిత
బ్రహ్మజ్ఞానకళానిధానమవు నీభాగ్యంబు సామాన్యమే.

నైషధము


మ.

కనకక్ష్మాధరధీరు వారిధితటీకాల్పట్టణాధీశ్వరున్
ఘనుని న్బద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిపున్
వినమత్కాకతిసార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు మా
యనుఁగుందాతఁ బ్రదాత శ్రీకమలనాభామాత్య చూడామణిన్.

భీమ

ఈ కవిరచించిన గ్రంథములు మే మెఱింగినంతవఱకు నెవ్వియనిన:—

1. నవమరుత్తుచరిత్రము.

2. పండితారాధ్య చరితము; ఇది వేమారెడ్డి సేనానాయకుఁడైన మామిడి ప్రెగ్గడయ్యకు నంకితము.

3. శాలివాహనసప్తశతి.

4. నైషధము, ఇది వేమారెడ్డి సేనానాయకుని తమ్ముఁడైన మంత్రి సింగనకు నంకితము.

5. భీమఖండము; ఇది వీరభద్రరెడ్డి మంత్రియైన బెండపూఁడి యన్నామాత్యున కంకితము.

6. కాశీఖండము; ఇది వీరభద్రరెడ్డి కంకితము.

7. వీథినాటకము.

8. హరవిలాసము; ఇది వేమారెడ్డియొద్ద సుగంధ భాండాగారాధ్యక్షుఁడైయున్న సిరయాల తిప్పయ్య కంకితము.

9. పల్నాటి వీరచరిత్రము.

10. నందనందనచరిత్రము.

వేమారెడ్డియు, వీరభద్రరెడ్డియు నన్నదమ్ములు.

ఈ గ్రంథంబులు వ్రాయఁబడినవరుస కాశీఖండములోని యీ పద్యమువలన నొకింత తెలియును:—

సీ.చిన్నారిపొన్నారిచిఱుతకూఁకటినాఁడు, రచియించితిని మరుద్రాట్చరిత్ర
   నూనూగుమీసాల నూత్నయౌవనమున, శాలివాహనసప్తశతి నొడివితి
   సంతరించితి నిండుజవ్వనంబునను శ్రీ, హర్షనైషధకావ్య మంధ్రభాషఁ
   బ్రౌఢనిర్భరవయఃపరిపాకమునఁ గొని, యాడితిని భీమనాయకునిమహిమఁ
గీ.బ్రాయ మెంతయు మిగులఁ గైవ్రాలకుండఁ, గాశికాఖండమను మహాగ్రంధ మేను
   దెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశకటక, పద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి.

ఈ గ్రంథంబులు సంస్కృతజటిలంబులై ముద్దులుగుల్కుశైలిని సలక్షణంబగు భాషను వ్రాయఁబడియున్నవి. ఈ కవివ్రాయు సీసపద్యములు చూడఁ జూడఁ జవు లొలుకుచుండును.

ఈయనకవిత్వము మిక్కిలి రసవంతమనుటయం దీయనకుఁ గలిగియుండిన నమ్మకమునకుఁ గాశీఖండము కృతిభర్తయగు వీరభద్రరెడ్డి చెప్పినట్లు వ్రాయఁబడి యుండు నీపద్యము నిదర్శనము. ఈకవి తన కావ్యములయం దేయేవిధముగ భాషను బోషింప యత్నించినదియు నీ పద్యము తెలుపును:—

సీ. వచియింతు వేములవాడ భీమనభంగి, నుద్దండలీలనొక్కొక్కమాటు
   భాషింతు నన్నయభట్టుమార్గంబున, నుభయవాక్ప్రౌఢి నొక్కొక్కమాటు
   వాక్రుత్తు తిక్కయజ్వప్రకారము రసా, భ్యుచితబంధముగ నొక్కొక్కమాటు
   పరిఢవింతు ప్రబంధపరమేశ్వరుని ఠేవ, సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు.

శ్లో. "కాశీఖండ మయఃపిణ్డం నైషధం విద్వదౌషధమ్"

అనునటుల దేవభాషలో మిక్కిలి కఠినములు నాఁ బ్రసిద్ధిఁ గాంచిన కావ్యముల నీ కవిశిఖామణి సాహసించి తెనింగించెనన నీతని సామర్థ్యమునుగుఱించి వేఱుగఁ జెప్ప నక్కఱయుండదు. ఈ కవి వ్రాసిన గ్రంథములలో గొప్పవియు రసవంతములును ముద్రితములు నగు కాశీఖండము నైషధ మనునవి భాషాంతరీకరణములు తక్కినవియు నారసిచూచినఁ దఱచు దేవభాషలోని యేదో యొక గ్రంథమునం దుండి వ్రాయఁబడినట్లె యేర్పడును. ఎట్లనం బ్రకృతము శ్రీ సరస్వతియను మాసపత్రికయందు ముద్రింపఁబడుచుండు హరవిలాసమున 4-వ యాశ్వాసమున గౌరీతపస్సు, వివాహసందేశము మొదలగు పట్లం జూడుఁడు. కాళిదాసు కుమారసంభవమునకు యథాశ్లోకము భాషాంతరీకరణముగ నుండుట తెలియును. ఈ కవి వ్రాసిన భాషాంతరీకరణములు యథాశ్లోకముగ వ్రాయఁబడి యుండలేదు; ఈ విషయమున నీకాలపు భాషాంతరీకరణములగు కుమారసంభవము శాకుంతలాది నాటకములు మొదలగువానితో నివి తులఁదూఁగవు, తనతో సమకాలికుఁడైన బమ్మెరపోతనామాత్యుఁడు మూలము ననుసరించినంతమాత్రముఁగూడ నీకవి యనుసరించియుండలేదు, దృష్టాంతములం జూడుఁడు:—

23-వ పుట 13-వ పద్యమున సంతతము దేవవేశ్యాభుజంగుఁడతఁడు" అని యున్నది. దీనికి మూలము "సహిసర్వదేవరాట్" సాధ్యమైనపట్ల నెల్ల నిట్లు దేవునకేని గొప్పవారికేని యీ భుజంగత్వముఁ గల్పించుట యీ కవియొక్క గొప్పలోపము. దీనివలననే కృతిపతినింగూర్చి షష్ఠ్యంతములలో "పంచారామవధూటీ పంచాస్త్రవిహారకేలి పాంచాలునకున్" అని వ్రాసెను. ఇది యాకృతిపతికేనిఁ బంచారామవాసినులగు ఫుణ్యాంగనలకేని గౌరవజనకంబుగ మాకుఁ దోపదు. 23-వ పుట 14-వ పద్యము (“అతని నిశ్వాసముల మాత్ర నౌనొకావొ, వేదములును జరాచరవిశ్వజగము.” . దీనికి మూలము “భవత్యపాఙ్గమాత్రేణ తస్యసర్వమిదంజగత్.”

45-వ పుట 18-వ వచనము. “వేదండవదనశుండాకాండచుళికితోన్ముక్తసప్తగోదావర సలిలధారాఝణత్కారబృంహిత బ్రహ్మాండగోళంబును” అను దానికి మూలము “సప్తగోదావరతట క్రీడాసక్తస్యశీకరైః। గజాస్యస్య కరోన్ముక్తై క్లిన్నమార్తాణ్డమణ్డలమ్.”

91-వ పుట 159-వ పద్యము “పుండరీకత్వక్ప్రకాండాతిమండిత, కటిమండలంబు”

దీనికి మూలము “పుణ్డరీకోద్భవ శిరోమాలికాహారశోభితమ్.”

ఇందుఁ బుండరీకశబ్దము తక్క దానియర్ధము సహితము భిన్నము.

ఇట్లున్నను నొక్కొక్క యెడమూలాతిక్రమణమె రసమును మిక్కిలి పోషించిన ట్లగపడును. సూర్యోదయాది వర్ణనములందును నీకవి నిజకవితాప్రాగల్బ్యము విపులముగఁ దెలిపియున్నాఁడు. వలయునేని 25-వ పుట 30-వ పద్యము. తే. సంజకెంపును దిమిరంపు జంపునలుపు, గమిచి బ్రహ్మాండభాండంబు గరము మెఱసెఁ, బరమపరిపాకదశవృంతబంధ మెడలి, పతనమగుతాటిపంటితోఁ బ్రతిఘటించి." యను దీనిం జూడుఁడు. ఇట్టివి కొల్లలుగనున్నయవి. కవన మెచ్చటనేగాని తడవికొనిన ట్లగపడదు. “ముగురం గూర్చిన ముండదైవమునకున్, మోమోట లేదో సుమీ” యను దానివంటి దేశీయములు మంచినీళ్లప్రాయముగ నీకవి వాడును. వేయేల? హరవిలాసమున “గప్పలు, గఱరనరట్కరరవర గట్టని యఱచెన్" అని కప్పలకూఁతలను గవిత్వమునఁ జేర్చివ్రాసిన యీ మహాకవి శైలి యిట్టిట్టి దనవలయునే?

ఇతనికి శైవపక్షపాతము మెండనుట యీతనిచే రచింపఁబడిన గ్రంథములవలననేకాక యీ భీమఖండమునందు శ్రీకూర్మము సర్పవరమునుంగూర్చి మూలమున రెండధ్యాయములు మిక్కిలి విపులంబుగ స్తుతిపాఠములతోడ వ్రాయఁబడియుండ నాంధ్రంబున నీ రెండుస్థలములు నొక్క పద్యమున (29-51) నొక్కొక్క పాదమున నతిసంక్షేపముగ వర్ణింపఁబడుటవలనను దెలిసికొననగును.

88. 137 ముజ్జగంబు
13. 90 ముజ్జగంబు
37. 120 ఎల్లన్ శిష్యుల
107. 77 సీమటు

ఇట్టివి కొన్ని మృగ్యంబులగు ప్రయోగంబు లీకావ్యంబునఁ గనఁబడినవి. ఆంధ్రలక్షణంబు దెఱంగుంబట్టి యివి లక్షణవిరుద్దంబులన సాహసింపము అఖండయతి యీకవికి సమ్మతము.

ఉత్తరభాగమునం దేకారణముచేతనో యీ గ్రంథము మిక్కిలి యజాగ్రత్తతో వ్రాయఁబడిన ట్లగపడుచున్నది. ఎట్లనిన:—

54-62 తీర్థముల పేళ్లును వరుసయుఁ గ్రమంబుగ లేదు.

85 వక్త యెవరయినదియు మఱచి వ్రాయఁబడి యున్నది.

106-వ ఫుట 67-వ పద్యమున “అయిదుతరముల పూర్వుల నవలమీఁద, నందఱను గాచు నూర్ధ్వలోకాలయముల” దీనికిమూలము “దశపూర్వాన్ దశాపరాన్” అని యున్నది. 10-కి 5 వేసినది సహజోక్తికిని విరుద్ధముగనున్నది.

117-వ పుట 157-వ పద్యము ప్రథమపాదమునఁ బాపములు ప్రబలు ననఁబడియె. 2-వ పాదమున పాపక్షయము పేర్కొనఁబడియె. పాపంబులెట్లు ప్రక్షయం బందునో వ్రాయఁబడియుండలేదు. మూలమున నీపట్టున “సత్సమాగమ మన్నామ కథాశ్రవణ యోగతః । పాపక్షయోభవేద్దేవి” అని యున్నది.

గ్రంథాంతమున యోగవర్జనముపట్ల మూలాతిక్రమణమును గ్రమభంగమును దండిగఁ గనఁబడుచున్నవి.

ఈ కవి వ్రాసిన గ్రంథములలో "వీథినాటకము" అనునది యొకటి పేర్కొని యున్నాముకదా? వీథియనునది దశరూపకములలో నొకటి. శ్రీనాథునకేని యాతని సమకాలికులకేని నాటకములు వ్రాయనేల బుద్ధిపుట్టకపోయెనో యది మిక్కిలి చింత్యము.

ఈకవి భాగవతము నాంధ్రంబున రచియించిన మహాకవియగు బమ్మెర పోతరాజునకు బావమఱంది యందురు. వేంకటగిరిరాజులకు మూలపురుషుఁ డగుచెవిరెడ్డి మొదలు పదవతరమునం బుట్టి రాజ్య మేలిన సర్వజ్ఞసింగమనాయని నతనికి ముందువాఁడైన సింగమనేనిని సందర్శించిన ట్లగపడుటచే నీతనికాలము క్రీస్తు 15-వ శతాబ్దము పూర్వార్ధములోనిది యనవచ్చును. భీమఖండము ప్రథమాశ్వాసము 31-వ వచనమువలన నీ కవినిఁ బాలించిన రెడ్లయాస్థానము రాజమహేంద్రవరమని యేర్పడుటవలనను నితఁడు తన గ్రంథముల నెల్ల రెడ్లకో వారివారికో యంకితమిచ్చి యుండుటవలనను నితని నివాసభూమి రాజమహేంద్రవర మనియె చెప్పవలసి యున్నది. శ్రీనాథుఁడును బోతనామాత్యుఁడును వేంకటగిరి సర్వజ్ఞ సింగమనాయని యాస్థానకవులని యాసంస్థానవంశ చరిత్రమున వ్రాయఁబడి యున్నదఁటయని బ్రహ్మశ్రీ మహారాజరాజశ్రీ రాయబహుదరు కందుకూరి వీరేశలింగము పంతులవారు వ్రాయుచు దానినిఁ దాము విశ్వసింపమని తమ కవులచరిత్రములోఁ దెలిపియున్నారు. "ఈ సర్వజ్ఞ సింగమనాయఁడు కావ్యనాటకాలంకారములయందును దర్కవ్యాకరణాది శాస్త్రములయందును సమర్థుఁడై కావ్యములు వ్రాయడమునందుఁ బ్రజ్ఞకలవాఁడై సింగభూపాలీయ మనునలంకార గ్రంథమును జేసెను. ఈయన పరాక్రమశాలియై ప్రౌఢదేవరాయలవారి దినములలోఁ బ్రసిద్ధుఁడుగ నుండెను. శ్రీభాగవతముఁ దెనిఁగించిన బమ్మెరపోతరాజనే కవీశ్వరుఁ డీయనమీఁద భోగినీదండకమును జెప్పినాఁడు. నైషధముఁ దెనిఁగించిన శ్రీనాథుండను కవీశ్వరుఁడు సింగమనాయనిమీఁదఁ గొన్ని పద్యములఁ జెప్పియున్నాఁడు." అని మాత్రమె యీ వంశమువారి వంశవృక్షమునఁ గనఁబడుచున్నది. అయినను దీని నాధారముగఁ గొని యింగ్లీషు భాషలో రాజా టి. రామరావుగారిచే వ్రాయబడిన వంశచరిత్రమందుమాత్ర మిట్లని యున్నది:- "His Court is said to have been adorned by several poets among whom were Bammera Pota Raju who translated the Bhagavatam in Telugu and Sreenathudu the Telugu translator of Naishadam. Sarvagna Singama Nayudu formed the subject of a composition by the former called Bhoginee Dandakam and of some stray verses by the latter." పోతన శ్రీరామచంద్రుని యాస్థానకవియే కాని సామాన్య నరపతుల నాశ్రయించినవాఁడు కాఁడనుట లోకవిదితము. శ్రీనాధుఁడు తన గ్రంథములను రెడ్లకును వారి మంత్రులకును భాండాగారాధ్యక్షులకును నంకితం బొసఁగి లాభ మపేక్షించినవాఁడై యుండఁగ నతఁ డాస్థానకవియై యుండినచో "ఇమ్మను జేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనములున్। సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే। సమ్మెటపోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పెనీ। బమ్మెరపోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్॥ అని నరాంకితమున కెంతేనియు విముఖుఁడై కేవల ముదాసీనుఁడై యున్న బమ్మెరపోతనామాత్యుని నెట్లో మెప్పించి భోగినీదండకముం గైకొనిన సరసుఁ డగుసింగభూపాలుఁ డితనివలన నొక గ్రంథమేనియు నంకితము నడిగియుండమికిం గారణ మేమియై యుండును? కావున నీవార్త విశ్వసనీయము కానిదే. అయినను శ్రీనాథునకును సింగభూపాలునకును సమాగమము కలిగినదియు వార లొకరియం దొకరు మిగుల గౌరవముంచియుండి రనుటయు విదితంబ, ఎట్లనిన శ్రీనాథుఁడు సింగమనాయని కొలువుకూటంబు దరియం బోవునపు డీలాగు సరస్వతిని నుతించెనఁట.

సీ.

దీనారటంకాలఁ దీర్ఘమాడించితి, దక్షిణాధీశుముత్యాశాలఁ
బలుకుతోడై తాంధ్రభాషామహాకావ్య, నైషధగ్రంథసందర్భమునకుఁ
బగులఁగొట్టించి తుద్భటవివాదప్రౌఢి, గౌడడిండిమభట్టు కంచుఢక్కఁ
జంద్రశేఖరక్రియాశక్తి రాయలయొద్దఁ, బాదుకొల్పితి సార్వభౌమబిరుద
మెటుల మెప్పించెదో నన్ను నింకమీఁద, రావుసింగమహీపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు, సకలసద్గుణనికురుంబ శారదాంబ.


ఇట్లు నాయనింగారి సన్నిధిం జేరి శ్రీనాథుఁడు,


కం.

సర్వజ్ఞ నామధేయము, శర్వున కే రావుసింగ జనపాలునకే
యుర్విం జెల్లును నితరుని, సర్వజ్ఞుం డనుట కుక్క సామజమనుటే.


యనియెనఁట. అంత నాభూకాంతుం డొకసమస్య నొసంగ దాని నిట్లు పూరించెనఁట.


ఉ.

తక్కక రావు సింగవసుధాధిపుఁ డర్థుల కిచ్చుచున్నచో
దిక్కిలలేనికర్ణుని దధీచిని ఖేచరువేల్పు మ్రానుఁ బెం
పెక్కిన కామధేనువు శిబీంద్రుల నెన్నెదు 'భట్టదిట్టవై
కుక్కవొ నక్కవో ఫణివొ క్రోతివొ పిల్లివొ భూతపిల్లివో.


శ్రీనాధుఁడు సింగమనాయనిఁ జూచినపుడు ముదిమివయసున నుండవలయు. ఏలయన నీవంశమున నెనిమిదవపురుషాంతరమున నుండిన కుమారవేదగిరినాయఁడు మాచారెడ్డిని గొట్టి యాకాలపు దురాచారపద్ధతిని దల దనతమ్మపడిగలోఁ బొదివించెను. మాచారెడ్డి సోదరుఁ డనవేమారెడ్డి యంతటఁ బగఁబూని యాకుమారవేదగిరి నోడించి యతని తలఁ దెగనఱికి దానిం దనతమ్మపడిగలోఁ బొదివించెను. ఆ వేదగిరితమ్ముఁడు లింగమనాయఁడు సింగమనాయని పైతరమువాఁ డా యనవేమారెడ్డిం జంపి యతని తలను దనతమ్మపడిగం బొదిగించినదిగాక సందికంతపోతరాజను కఠారిని సైతముఁ గైకొనెను. ఈ కఠారికై శ్రీనాథుఁడు లింగమనీనిం జేరి.


సీ.

జగనొబ్బగండాంక సంగ్రామనిశ్శంశ, జగతీశరాయవేశ్యాభుజంగ
యఖిలకోటలగొంగ యరిరాజమదభంగ, మేలందుధరణీశ మీనజాల
మూరురాయరగండ మురియురాజులమిండ, యభివృద్ధిమీఱుచౌహత్తిమల్ల
ఘనగాయగోవాళ కామినీపాంచాల, బ్రహ్మాయుశశివంశ పరశురామ

దండిబిరుదులసురతాని గుండెదిగుల, భలిరె యల్లయవేముని పగఱమిండ
రమణమించిన మేదిని రావుబిరుద, సంగరాటోపమాదయ లింగభూప.


అనుపద్యమును జదివి దానిని మరలఁ బుచ్చుకొనెను. ఇదియునుఁగాక పైనుదాహరింపఁబడిన “నూనూఁగుమీసాల” యను పద్యమువలన శ్రీనాథుఁడు కాశీఖండమును రచించినపుడు “ప్రౌఢనిర్భరవయఃపరిపాకము” దాఁటియుండెను. ఆ కాశీఖండ మల్లాడ వీరభద్రారెడ్డి వేంకటగిరి సంస్థానమువారిలోఁ దొమ్మిదవపురుషాంతరమునం దున్నలింగమనేని సమకాలికుఁడు. దీనికిఁ బ్రమాణము.


ఉ.

బల్లరగండలింగవిభుపాదమునందుఁ బసిండియందె తా
ఘల్లురుఘల్లుఘల్లురని ఘల్లని మ్రోయఁగ భీతి గుండియల్
ఝల్లురుఝల్లుఝల్లురని ఝల్లన నల్లలాడుచుందు రా
యల్లయరెడ్డివేముఁడును నాతనితమ్ముఁడు వీరభద్రుఁడున్.


ఈకవి సింగమనాయనియొద్దకు రాఁ గతము మృగ్యము.

పైనుడువఁబడిన “సర్వజ్ఞ నామధేయము” అను పద్యమును సింగమనాయని కొలువులో శ్రీనాథుఁడు చదివి మరలినవెనుక రెడ్లవారతని నిచ్చకాలమారియని యాక్షేపించినట్లును దానికతఁ డాపద్యమున కన్యార్ధము కల్పించినట్లును నొక ప్రతీతి బ్రహ్మశ్రీ గురజాడ శ్రీరామమూర్తి పంతులవారి కవి జీవితములందుఁ గనఁ బడుచున్నది. "దీనారటంకాల” యను పద్యముం జదివినవారును "సింగభూపాలీయ" మనునామాంతరముగల ‘రసార్ణవసుధాకరా’ద్యుద్గ్రంథకర్తయు రసజ్ఞుఁడునునగు సింగభూపాలునిమహిమ నెఱింగినవారు నీకథ నంతయు నమ్మరు. ‘సర్వజ్ఞ నామధేయము’ అని శ్రీనాథుఁడు పొగడినదే నిజమును సలక్షణమును.

ఇంక శ్రీనాథునిఁ బోతనామాత్యుఁ గూర్చి కొన్ని కథలు కలవు. అవి యన్నియుఁ బోతనామాత్యుని పారలౌకిక ధర్మంబును శ్రీనాథుని యైహికభోగేచ్ఛను దెల్పునవి.

ఇంతటి మహాకవి యయ్యును గొప్పవారియాశ్రయముగలిగియుండియు ననేక గ్రంథముల రచించి యనేకుల కంకిత మిచ్చి లాభముఁ బొందియుండియు శ్రీనాథుఁడు తనయందలి గొప్పలోప మగు స్త్రీలౌల్యము వలనఁ గాఁబోలు నవసానదశయందు మిగుల దారిద్ర్యము ననుభవించినట్టు లీక్రింది పద్యములు తెల్పుచున్నయవి.


సీ.

కవిరాజుకంఠంబుఁ గౌఁగిలించెనుగదా, పురవీథి నెదురెండఁ బొగడదండ
సార్వభౌమునిభుజాస్తంభమెక్కెనుగదా, నగరివాకిటినుండు నల్లగుండు

ఆంధ్ర నైషధకర్త యంఘ్రియుగ్మంబునఁ, దగిలియుండెనుగదా నిగళ యుగము
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేతి, వియ్యమందెనుగదా వెదురుగొడియ
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము, బిలబిలాక్షులు దినిపోయెఁ దిలలుఁ బెసలు
బొడ్డుపల్లెను గొడ్డేఱి మోసపోతి, నెట్లు చెల్లింతుఁ డంకంబు లేడునూర్లు.


సీ.

కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి, రత్నాంబరంబు లేరాయఁ డిచ్చుఁ
గైలాసగిరిఁ బండె మైలారు విభుఁ డేగి, దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు
రంభఁ గూడెఁ దెనుంగు రాయరాహుత్తుండు, కస్తురి కేరాజుఁ బ్రస్తుతింతు
స్వర్గస్థుఁ డయ్యె విస్సనమంత్రి మఱి హేమ, పాత్రాన్న మెవ్వనిపంక్తిఁ గలదు
భాస్కరుఁడు మున్నె దేవునిపాలి కరిగెఁ, గలియుగంబున నిఁకనుండఁ గష్టమనుచు
నరుగుచున్నాఁడు శ్రీనాధుఁ డమరపురికి, దివిజకవివరుగుండియ ల్దిగ్గురనఁగ.