భాస్కరరామాయణము/యుద్ధకాండము2

చనుము కార్యసిద్ధి సమకూరఁ జేయుము, దనుజవంశతిలక యనిన నతఁడు.

1615


ఉ.

దేవర యానతిచ్చుపని దీర్చెద నేర్చినభంగి నీదుసం
భావన లన్నియున్ వఱితిపాలుగఁ జేయుట నాకు మంచిదే
యేవిధి నైన దేహముల కెల్లవిధంబులఁ జేటు గల్గుటన్
జీవితకాంక్ష గా దయినఁ జెప్పెద నొక్కటి నీకు నేర్పడన్.

1616


క.

నేరమి మాయామృగ మయి, మారీచుఁడు నీకు వెఱచి మానవపతిదు
ర్వారశరంబునఁ గూలు వి, చారము నా కొదవఁ జొచ్చె శక్రారాతీ.

1617


మ.

ఖరు నాదూషణుఁ దీవ్రసత్త్వుఁ ద్రిశిరున్ గర్వాంధు నక్షున్ భుజా
స్ఫురణాఢ్యుం డగుకుంభకర్ణుని నికుంభుం గుంభు నమ్మేఘనా
దు రణోగ్రున్ మకరాక్షు దుర్దమబలున్ ధూమ్రాక్షునిం బేర్చి చం
పిరి పెక్కండ్రు గపీంద్రులున్ నరులు నీపెం పెల్ల వే తూలఁగన్.

1618


మ.

సుతులం దమ్ముల మిత్రులన్ సుభటులన్ సొంపారఁగా నాజిఁ జం
పితి విం కేటికి లంక దమ్మునకు సంప్రీతిన్ సమర్పించి భూ
సుత నారామున కిచ్చి తాపసుఁడ వై శోకంబు పె ల్లార్చి రా
జతశైలంబున కేఁగు మిక్కడివృథాసంజీవనం బేటికిన్.

1619


ఉ.

ఓపితివేని బాహుపరిఘోన్నతితో సరిఁ బోరు మొండె సా
టోపదురంతరాఘవకఠోరశరార్చులయందు మ్రగ్గి [1]దు
ష్ప్రాపపదంబు నాఁ బరఁగు సన్నుతవిష్ణుపదంబు నొందు మీ
యాపద నిస్తరింపగ నుపాయము లెక్కడి వింక రావణా.

1620


మహాస్రగ్ధర.

అనినన్ దుర్వారరోషవ్యతికరకలుషోదగ్రనేత్రావలీసం
జనితోద్దామస్ఫులింగస్థగితదశదిశాచక్రుఁ డై వక్త్రనిర్య
ద్ఘనధూమస్ఫారజీమూతపటలరుచిరధ్వాంతుఁ డై చంద్రహాసం
బున వ్రేయంగాఁ దలంచెన్ భ్రుకుటికుటిలుఁ డై పూర్వదేవశుఁ డంతన్.

1621


క.

మది నీకుఁ గోప మేటికి, నిదె వెసఁ జనుచున్నవాఁడ నిప్పుడ యనుచుం
బదములకు నెరఁగి వీడ్కొని, కదలెన్ మారీచసుతుఁడు గ్రక్కునఁ జదలన్.

1622


వ.

అంత నద్దశముఖుండు క్రమ్మఱి వచ్చి యంతఃపురంబు సొచ్చి సెజ్జపయి మేను
వైచి నిర్భరచింతాభరపారావారనిర్మగ్నుం డైయుండె నంత నక్కడఁ గాల
నేమియును.

1623

మారీచసుతుం డగు కాలనేమి రావణుపంపున మాయాతపస్వి యగుట

సీ.

చంపకసహకారజంబీరపాటల, నారంగపున్నాగనారికేళ
తాలతమాలహింతాలకేసరపూగ, మందారకురవకమాతులుంగ
కర్ణికారాశోకఖర్జూరకృతమాల, ఘనసారచందనపనససాల

సప్తపర్ణపలాశసర్జరసార్జున, వటసల్లకాశోకకుటజతరువు
లెలమి సొంపార వేదశాస్త్రేతిహాస, పఠనములు రత్నమయదీపభరితరుచులు
వల్కలంబులును హుతపావకము లొప్పఁ గలుగునాశ్రమ మొక్కటి కడఁగి చేసె.

1624


సీ.

వల్లరీవలమానఝల్లరీఝంకార, వల్లకీకలనాదవేల్లితంబు
వరకుహూకంఠీరవస్ఫారకంఠీర, వత్రస్తపథికేభవలయితంబు
శుకశారికారబ్ధసురుచిరశ్రుతితర్క, మూలవచోయుక్తిముఖరితంబు
శింజానమంజీరమంజుగుంజితహంస, సారసోత్సుకసారసారసంబుఁ
బ్రాజ్యమంత్రస్వరయుతదీప్రాజ్యహోమ, ధూమధూసరకేసరద్రుమవిభాగ
మాహుతీరితశిఖిశిఖావ్యాకులంబు, నైనయాశ్రమమండల మది దనర్చె.

1625


క.

భాస్వరవిశాలతరకా, [2]ర్తస్వరతోరణవిరాజితమ్మును ఘనవే
దస్వరముఖరితనభము వి, కస్వరబహువిటపివల్లికాకలితంబున్.

1626


క.

తమలోన సహజ మగువై, రము దక్కి మృగేంద్రకుంజరంబులు శార్దూ
లమృగములు బర్హిణభుజం, గమములు మక్కువలు గలిగి కడు నొప్పారన్.

1627


సీ.

నిక్కి మూఁపులు వంచి ముక్కుపైఁ దనదృష్టి, నిలిపి నిశ్చింతత నెలకొనంగ
జప మంచు నొకపాటినెప మిడి పలుకుచు, జపమాలపూసలు జరపి జరపి
జడలును రుద్రాక్ష లొడలివిభూతియుఁ, బొచ్చె మేమియు లేక యచ్చుపడఁగ
ఘనతపోవ్రతములఁ గడు డస్సి కృతకపు, శ్రమమున మిక్కిలి యమరియున్న
కాలనేమిచేతఁ గమనీయతర మైన, యాశ్రమంబు సూచి యనిసుతుఁడు
యిది మహాద్భుతంబు [3]గద యేవనం బొకొ, యిచట మున్ను గాన మేమియొక్కొ.

1628


క.

ఎక్కడిపాలసముద్రం, బెక్కడియాపసిఁడికొండ యెక్కడివిసినం
బెక్కడిద్రోణమహీధర, మక్కట మార్గంబు దప్పె నతిరభసమునన్.

1629


మ.

అనుమానింపఁగ నేల యీద్విజునిచే నధ్వక్రమం బేర్పడన్
విని యే నేఁగెద నంచు డిగ్గి ఫలముల్ వీక్షించి కాంక్షించి కో
పనశీలుర్ మును లంచు నుగ్రతరశాపత్రస్తుఁ డై మాని య
మ్మునికిం జాఁగి నమస్కరించి పలికెన్ మోదంబు సంధిల్లఁగన్.

1630


ఉ.

మారుతసూతి నేను హనుమంతుఁడ రాముఁడు పంపఁగాఁ బయో
వారిధి కేఁగుచో నొదవె వావిరి యై జలతృష్ణ నాకు నీ
చేరువఁ దోయముల్ గలవె చెప్పుఁడు నావుడు నవ్వి యి ట్లనున్
ధీర కమండలూదకము తృష్ణ సనం దగఁ ద్రావు మేర్పడన్.

1631


వ.

అమృతోపమానంబులు రసవంతంబులు నగుఫలంబు లుపయోగించి యీరా
త్రి యిచ్చట నాసమీపంబున నిద్రాసుఖం బనుభవింపు మేను భూతభవిష్య
ద్వర్తమానంబు లగుమూఁడుకాలంబులు నెఱుంగుదుఁ దపోబలంబున రాఘవు

కృత్యంబు సమస్తంబును నా కధిగతంబు.

1632


సీ.

ఆరాముసుందరి నాసీత దశకంఠుఁ, డచ్చుగా వంచించి తెచ్చుటయును
దన్నిమిత్తంబునఁ దగ వాలి వధియించి, కడఁగి సముద్రంబు గట్టుటయును
లంకచుట్టును బెనులగ్గపట్టుటయును, గొనకొని దితిజులఁ గూల్చుటయును
ఘననాదుఁడును గుంభకర్ణుండుఁ బడుటయు, శోకించి కోపించి సురవిరోధి
శక్తి వేసి కూల్ప సౌమిత్రిఁ దజ్జీవ, నార్థ మరుగుదెంచె దరయ నీవు
గాన లేరు ధర్మహీనులు నను నీకుఁ, గానఁబడితిఁ బుణ్యఘనుఁడ వగుట.

1633


చ.

చెలువుగ రాముకార్యములు 1 సేయుట మా కది లెస్స యౌషధా
వలు లవలీల నీకుఁ గనవచ్చువిధంబుగ దివ్యమంత్రముల్
నలి నుపదేశ మిచ్చెద వనంబున నిక్కడ నట్టిమందులుం
గల వవి వాని రేపకడఁ గైకొని యేఁగుము లంక కెమ్మెయిన్.

1634


ఆ.

విను నిమేషమాత్రకమునకంటే వేగంబ, లంక కరుగునట్టిలావు గలుగు
నాదుమంత్రశక్తి నయమున ననవుడుఁ, బలికెఁ గ్రమ్మఱంగఁ బవనసుతుఁడు.

1635


మ.

అట రామానుజుఁ ఢీల్గి యుండ నిట నన్యాయంబు నాయున్కి య
క్కట నో రాడునె నాకుఁ బండ్లు దినఁగాఁ గ న్మోడ్చి నిద్రింప మి
క్కుట మీతృష్ణ కమండలూదకము సంకోచంబునుం గాన యి
చ్చట వాపీతటినీనదంబు లలరున్ సంప్రీతితోఁ జెప్పవే.

1636


క.

కడ లేనినీదుకరుణం, గడుపారఁగ నీరు ద్రావి కదలెదఁ గడఁకం
దడ వయినఁ బ్రొద్దు వొడుచున్, మడియును సౌమిత్రి మఱియు మగుడఁడు విప్రా.

1637


వ.

అనిన నమ్మాయాతాపసుండు దరహసితవదనుం డై యి ట్లను మదీయాశ్రమంబు
నకుఁ బూర్వభాగంబున నొక్కదివ్యసరోవరంబు గలదు నీ వందుల కేఁగి యమృ
తతులితంబు లగుతత్పుణ్యసలిలంబులు యథేష్టంబుగాఁ గ్రోలుము నీవు ననం
తసత్త్వసంపన్నుండ వయి యొప్పెద వద్దివ్యౌషధంబులు నీకుం బొడసూపు నరు
గు మని తనకూటశిష్యగణంబులచేతం ద్రోవ చూపించినం గపివరుండును గరళ
మిళితం బగుతేనియం బోలునమ్మునిపలుకులు విని యజ్జలాశయంబు గాంచి.

1638

హనుమంతుఁడు ధాన్యమాలిని యున్నకొలంకునకుఁ బోవుట

చ.

మదనునియాటప ట్టయిన మావులజొంపములందు మ్రోయుతు
మ్మెదలు దదీయశింజినికి మిం చొదవింపఁగ రాగసంపదు
న్మదపికకూజితంబులును మన్మథకీర్తన సేయుచంద మై
పొదలఁగ ముగ్ధవాక్యశుకపోతకసంశ్రయశాఖిశాఖ మై.

1639


సీ.

మలయమారుతమున మలయుపూఁదీఁగల, విరులనెత్తావులు వెల్లి గొనఁగ
మానక తొరఁగెడు మకరందరసములు, కాలువ లై భూమిఁ గలయఁ బాఱఁ
దేటిమొత్తంబులు తెఱవలతోఁ గూడి, వలరాజుబిరుదులు వఱలఁ బాడఁ

బొలుపార నెగసినపుప్పొడి వనలక్ష్మీ, కమనీయ మగుమేలుక ట్టనంగఁ
దలిరుటాకులు మరుతూపుటలుఁగు లనఁగఁ, గోరకములు వనపులకాంకురము లనఁగ
వనవసంతుఁడు శాసించువన మనంగఁ, దిరిగి వచ్చినతరుపంక్తిఁ బరఁగుదాని.

1640


చ.

తిలకితకాంతి నొప్పు గలతీఁగల నుయ్యెల లూఁగురాజహం
సలఁ జెలువారుదానిఁ గలసారసరాజితమత్తకూజితం
బులఁ బొలుపారుదాని నలిపోతకమేదుర[4]గుంజనాదసం
కుల మగుదానిఁ గ్రౌంచబకకోటియుతం బగుదాని నెంతయున్.

1641


చ.

కనకసరోజజాలములఁ గైరవషండములన్ వికస్వర
స్వనమధుమత్తషట్చరణసంయుతనీలసరోరుహంబులన్
జనితతరంగరంగదలిచంచలహల్లకజాలకంబుల
న్వనజముఖీవిలోలనయనచ్ఛవిమీనకదంబకంబులన్.

1642


క.

చెలువారుదాని నున్మద, కలహంసనినాదవిహగకలకలమధుపా
వలిగుంజితపికకోలా, హలసారసగీతచిత్తరహర మగుదానిన్.

1643


సీ.

కామినీకమనీయగతివిభ్రమస్పర్ధి, రాజహంసీరాజిరాజితంబు
మానినీనవక్షోజమండలాసూయాఢ్య, వలమానచక్రవాకలసితంబు
లలనాజనభూవిలాసాపహాసిత, రంగరంగదభంగసంగతంబు
నారీవిలోచననవకాంతితస్కర, వికసదుత్పలవనవిలసితంబు
ఫుల్లకౌరవమకరందపూరితంబు, మిలితాంబుజగతభృంగమిథునయుతముఁ
గూలతరుపతితకుసుమలాలితంబు, నగుసరోవర మల్లన యతఁడు మ్రోల.

1644


మ.

కని సమ్మోదముఁ బొంది వాయుజుఁడు దృక్పంకేజముల్ మూసి య
ల్లన యాలోనికి డిగ్గి పైకలఁక గేలం బాయఁగాఁ ద్రోచి యే
చినతృష్ణం దనివోవ [5]నుద్ధతమహాజీమూతమో నాఁగఁ గా
ననమాతంగముఁబోలెఁ దోయము లనూనప్రేమతోఁ ద్రావఁగన్.

1645


చ.

సరసమనంబునం దనివి చాలక దుస్తరదుర్భవోగ్రసా
గరమున మున్గి దుర్విషయగాఢరసంబులు గ్రోలువాని మా
య రభస మొంది మ్రింగుక్రియ నాతనియంఘ్రియుగంబు పట్టె ని
స్పరదురువేగ యై మకరి శాపవిముక్తియ కోరుకైవడిన్.

1646


మ.

ప్రకటగ్రాహము దన్నుఁ బట్టె నని విభ్రాంతాత్ముఁ డై చూచి తా
మకరిం గాఁ బరికించి [6]యుద్ధతరసోన్మాదంబునం చేర్చి
లకఠోరాశని దానిపండ్లు డులిచెన్ లంకేశలోలద్యశ

శ్శకలప్రక్రియ దోఁప మారుతి మహాసంరంభసంపన్నుఁ డై.

1647


ఆ.

అడరి వైనతేయుఁ డహిఁ జీరుకైవడిఁ, బరుషకంటకాదిభరిత మైన
మకరిజిహ్వఁ ద్రుంచె మారుతతనయుండు, కఠినసునిశితాగ్రకరరుహముల.

1648


చ.

అదియును నంతఁ బోవక రయంబున నాఁగి మహాగ్రహంబునన్
బ్రిదులఁగ నీక పట్టుకొని భీకరదుస్సహశాపరోగశాం
తిద మగుదివ్యభేషజము తేఁకువతోఁ గొనుభంగి మ్రింగె ను
న్మదుఁ డగువాయునందను నమానుషపౌరుషసత్త్వసాహసున్.

1649


సీ.

అది దన్ను మ్రింగుచో నాతఁ డిట్లను నాత్మ, నేమి సేయుదు నింక నెద్ది తెఱఁగొ
జననాథుకార్యంబుచంద మిం కెట్లొక్కొ, తెగటాఱవలసెనో దీనిచేత
వనజాప్తసుతుఁడును వనచరావలితోడఁ, బొలియునో నాజాడపొందు లేక
[7]మేనితోఁ బాయునో మిథిలేంద్రతనయయు, మనువంశుకీర్తియు మడియునొక్కొ
యని విచారించి నేర్పున నడరి దీని, కుక్షి లోపల వడిఁ జొచ్చి కూల్తు ననుచుఁ
దనువు సన్నముగాఁ జేసి తఱిమిచొచ్చె, నంధకూపములోపల నడఁగునట్లు.

1650


క.

కడుపారఁగ నాహారము, పడసితి నని ఘోరమకరి ప్రమదం బెసఁగన్
జడములలోనికి నరిగెం, దడయక పవమానుకూర్మికేతనయుం డంతన్.

1651


క.

నరములు ప్రేవులు నెమ్ములు, వెరవారఁగఁ ద్రెంచి త్రుంచి విఱిచి యుదగ్ర
స్ఫురణమున లోన నిండిన, గరళముచందమున నోర్వఁగా రాకున్నన్.

1652


చ.

ఉరుతర మైనవేదనకు నోర్వక భీకర మైనవక్త్రగ
హ్వరము రయంబునం దెఱవ వావిరి భీకరనక్రకూర్మద
ర్దురసముపేత మై జలము దొట్టుచు వచ్చిన వాత నించెఁ బొం
పిరి దగ వాయునందనుఁడు ప్రేవులప్రోవులముద్దఁ జెచ్చెరన్.

1653


చ.

నెఱఁకులు దాఁకి నొప్పి వడి నెమ్మనమున్ దిగులొంద సంధులున్
నుఱుముగఁ బార్శ్వభాగములు నుగ్గుగ నెత్తురు గ్రమ్మ నెమ్ములున్
విఱుగఁగ మాంసపూరములు వే నెఱయంగ నరంబు లన్నియున్
నెఱి దెగిపోవ నమ్మకరి నిల్వఁగ నోర్వక సంచలించుచున్.

1654


వ.

పై పయిం బ్రవరిల్లుమూర్ఛ నొందుచు దుశ్చికిత్సం బగుమహావ్యాధియుం
బోలె సముద్రోదరగతం బగుబడబానలంబు ననుకరించుచు మందిరాంతరజాజ్వ
ల్యమానపావకునివిధంబునఁ బరిధానాంతర్లీనమహోరగంబుకైవడిని గర్భకుహ
రవర్తి యైనయతనివిజృంభణంబున కోర్వక తదీయచరణనఖరతలప్రహారముష్టి
విచారణవాలఘట్టనంబులు సైరింపం జాలక యొఱలుచు నిది నాకు నఱుగునా
హారంబు గాదు దీన మరణంబు సిద్ధం బగు నని బెగ డొందుచున్నంతఁ బ్రాభంజని
యమ్మహోగ్రగ్రాహిరుధిరప్రవాహంబుల సిందూరితజలం బగుతత్సరోవరతటం

బునకు దానిం జేర్చి వచ్చి వెడలివచ్చి.

1655


చ.

తిమిరచయంబు వాసి చనుదెంచిననూతనభానుఁ బోలి రా
హుముఖవినిర్గతామృతమయూఖుఁ డనం దగి యొప్పె సాంద్రర
క్తమునఁ బరీతుఁ డై యతివికస్వరశుద్ధతరాంతరంగుఁ డై
సముదితబాడబానలవిసారిశిఖావృతవార్ధిఁ బోలుచున్.

1656


సీ.

వనభూమిఁ జూడంగ ననయంబు నేతెంచి, వఱలుజలాధిదేవత యనంగ
వాసవుఁ బెడఁబాసి వచ్చినసురలోక, లాలిత్యయుతరాజ్యలక్ష్మి యనఁగ
వలరాజుతోడుత నలిగి యేకతమునఁ దిరిగి యాడెడురతీదేవి యనఁగ
సలిలవిహారంబు సలుపంగ నగుదెంచి, చెలువారు కాననశ్రీ యనంగఁ
జెలఁగుకన్నులుఁ జన్నులుఁ జిన్నిమొగము, గలువఱేకులచెన్ను జక్కవలయన్ను
నిండుచందురుచందంబు నెరయ గెలిచి, మానినీత్వంబు గైకొన్నమకరిఁ గాంచె.

1657


శా.

ఆలోనన్ మణికాంచనోజ్జ్వలవిమానారూఢ యై విస్ఫుర
ద్రోలంబాలకహేమబంధురచలద్దోర్మూలవిద్యుల్లతా
జాలంబుల్ వెసఁ దొంగలింపఁగ నురోజద్వంద్వకుంభంబులన్
లీలం బయ్యెద మాటు సేయుచును బల్కెం బ్రీతిపూర్వంబుగన్.

1658


ఉ.

అంబుజమిత్రతేజ పవనాత్మజ కీశపతీ భవత్ప్రసా
దంబున నాకుఁ బూర్వకృతదారుణశాపవిముక్తి గల్గె నే
నుం బురుహూతునొద్ద కిదె నూతన నై చనుచున్నదాన నీ
కుం బరమార్థవృత్తి సమకూరఁగ నొక్కటి విన్నవించెదన్.

1659


సీ.

వలనుగా నీసరోవరమున మకరి నై, యుండుట యారావణుం డెఱింగి
మాయావి యైనయీమారీచనందనుఁ, బంపిన వీఁడు దపస్విరూప
మున వచ్చి నాచేత నిను వధియింపగఁ, బుత్తేర నేతెంచి పూని నీవు
నలిఁ బట్టువడియును బలసిద్ధుఁడవు గాన, విడిపించికొంటివి తడయ కిపుడు
వీని నమ్మవలదు వేవేగ దెగఁ జూడు, మరియ నిదియుఁ గృత్రిమాశ్రమంబ
యిచటి కుత్తరమున నేపారు దుగ్ధాబ్ధి, త్రోవ నీకు నిదియ ద్రోణగిరికి.

1660


ఉ.

అనిన విస్మయ మంది యి ట్లను ముదం బారంగ సామీరి యీ
ఘనగంభీరజలాశయంబున మహోగ్రగ్రాహి వై యుండి చ
య్యన దివ్యాంగన వైతి వెట్టులు మనోజ్ఞాభాషణప్రక్రియ
న్వినిపింపం దగునేని చెప్పఁ దగు నున్నిద్రాబ్జపత్రేక్షణా.

1661

ధాన్యమాలిని తనపూర్వవృత్తాంతము హనుమంతునకుఁ జెప్పుట

వ.

అనినం ద్రిదశకాంత దనపేరు ధాన్యమాలిని యని చెప్పి.

1662


ఉ.

తొల్లి మనోఙ్ఞలాన్యమునఁ దోషితుఁ డై గిరిశుండు వేడ్క సం
ధిల్లఁగ నాకు నిచ్చెఁ దగుదివ్యవిమానము దాని నెక్కి నే

నెల్లజగంబులుం గలయ నించుకమాత్రన సంచరించి యు
త్ఫుల్లసరోజషండములఁ బొ ల్పగునీసలిలాశయంబునన్.

1663


మ.

జలకేళీరతి నున్న నాకడకు రాజద్దివ్యతేజుండు ని
శ్చలదుస్సాధతపోధనుం డెలమితో శాండిల్యుఁ డేతెంచి సం
చలితాత్ముం డయి నన్నుఁ జూచి మదనాస్త్రవ్రాతపాతవ్యథా
[8]కలితుం డై పలికెం బ్రియోక్తుల సరాగస్వాంతుఁ డై యేర్పడన్.

1664


మ.

తరుణీ నాదెస నిల్పు మించుక దయార్ద్రం బైననీచూడ్కి సుం
దరమందస్మితకాంతి నెమ్మొగమునం దళ్కొత్తఁగాఁ బల్కు ని
ర్భరవక్షోజయుగంబు నాయురముపై రాగిల్లఁ బైకొల్పు దు
ర్ధరకందర్పదవాగ్ని యార్పఁ దరమే తన్వంగి నా కెమ్మెయిన్.

1665


సీ.

జిగిఁ దళుకొత్తునీచెక్కు లు పలుమాఱు, చుంబింప వేడుక సురుచిరముగఁ
బవడంపుఁగెంజాయఁ బరగినకెమ్మోవి, యమృతంబు గ్రోలంగ నాస మీఱఁ
జిక్కనిపయ్యెదఁ బిక్కటిల్లెడుచన్నుఁ, గవ నాయురంబునఁ గదియ నదుమఁ
దిరిసెంపుఁబువ్వులఁ దెగడు దోర్వల్లరీ, [9]యుగమునఁ గౌఁగిటి కొనరఁ జేర్పఁ
దలఁపుకోర్కులు పరిపాటి దప్పెనేని, మదనుతూపులు న న్నేల మనఁగనిచ్చుఁ
బ్రాణరక్షణ మరయంగఁ బరమధర్మ, మని యెఱుంగవె యుత్ఫుల్లవనజవదన.

1666


వ.

అనిన నమ్మునీంద్రునిపలుకులు విని యల్లన యిట్లంటి.

1667


చ.

అరయఁగ సర్వసిద్ధులకు హానికరంబులు నెల్లభంగులన్
దురితపదైకమూలములు దుష్టతరంబు లధర్మమూలముల్
సురతసుఖాభిలాషములు సూరలు మెచ్చరు వీన నీకు దు
ర్భరతరభవ్యదుశ్చరతపఃఫల మాఱడిఁ బుచ్చఁ బాడియే.

1668


క.

అని పలికిన శాండిల్యుఁడు, మనసిజశరపీడ్యమానమానసుఁ డై యి
ట్లనియెం దపమును జపమును, నినుఁ గవయుట సుమ్మి యిద్ది నిక్కువ మబలా.

1669


చ.

మదనునిపూవుటమ్ము లొగి మర్మము లాడిన మేనఁ బ్రాణముల్
మదిఁ బరికింప నిల్వ వనుమానము లే దది కారణంబుగా
ముదమున నిన్నుఁ జెంది తపమున్ సుకృతంబు ఘటింప నోపుదున్
బ్రదికిన సర్వసిద్ధులును బన్నుగఁ బొందఁగవచ్చు నుగ్మలీ.

1670


చ.

చటులసదర్పదర్పకభుజంగమదష్టుఁడ నైతి నాకు న
క్కట యని పల్లవాధరవికస్వరసాంద్రసుధారసంబు ను
త్కటముగ నిచ్చి మన్పు మతికదారుణమన్మథదావపావక
స్ఫుటితుఁడ నైతి మేలె తలపోయఁగ నీ కిది ధాన్యమాలినీ.

1671


వ.

అని యివ్విధంబున.

1672

చ.

పలుమఱుఁ బెక్కుచందములఁ బల్కు మునీంద్రునిఁ బల్కితిన్ రజ
స్వల నది గాన మూఁడుదివసంబులుఁ దాలిమిమై సహింపఁగా
వలయుఁ గృతాభిషేక నయి వచ్చెద నాలవనాఁడ యిఫ్డు నన్
దలఁపఁగఁ బొందఁ గా దనినఁ దాపసముఖ్యుఁడు సమ్మతించినన్.

1673


వ.

అంత నేనును గంధమాదనభూధరంబున కరిగితి నిట శాండిల్యుండు తద్దివసత్ర
యంబు యుగత్రయంబుగాఁ బుచ్చుచుండునెడఁ బ్రథమదివసంబునాఁటిరాత్రి
యందు దశగ్రీవుండు దిగ్విజయంబు సేసి సేనాసమేతుం డయి వచ్చి యామహీ
ధరంబుపయి విడిసిన.

1674


సీ.

బలములదందడిఁ బర్వతాగ్రముమీఁది, తోరంపుశిల లెల్ల దొర్లి పడఁగ
సింధురఘనతరస్కంధకషణములఁ, దఱుచుగాఁ దరువులు విఱిగి కూల
గుహలలోపల నున్నకుంజరవైరులు, గోలాహలంబున జాలిగొనఁగ
సామజభేరుండశరభశార్దూలాది, తతులు భయంబునఁ దల్లడిల్ల
హరిణచయములు బెగడొంది తిరుగఁబడఁగ, భుజగకులములు వడి బిలంబులు సొరంగఁ
దలఁకి పక్షిగణము నభస్స్థలికి నెగయ, నిర్జరావలి మిక్కిలి జర్జరముగ.

1675


ఆ.

అంత దశముఖుండు నాగంధమాధన, శైలతటములందు సరసవృత్తిఁ
దిరిగి తిరిగి పువ్వుఁదీఁగలఁ బొదరిండ్ల, నెమ్మనంబు చెలఁగ నిలిచి నిలిచి.

1676


చ.

శ్రుతు లొడఁగూడ నింపు మది సొంపు వహింపఁగ మంద్రమధ్యతా
రతిలకితంబుగా సకలరంజనరాజిత మైనగేయ మేఁ
జతురతతోడఁ బాడుచుఁ బ్రసన్నత నుయ్యల లూగి యాడఁగా
నతులితశౌర్యధాముఁడు దశాననుఁ డక్కడి కేఁగుదెంచినన్.

1677


చ.

కనుఁగొని జాతసంభ్రమవికారభ యాకులితాంతరంగ నై
తనువు సమీరకంపితలతాగతిఁ దల్లడ మంద దీర్ఘలో
చనసరసీరుహంబులకు సంతమసం బొదవంగ నున్ననా
కనియె విభావరీచరకులాధిపుఁ డంగజరాగమత్తుఁ డై.

1678


శా.

లంకానాథుఁడ సర్వరాక్షసకులాలంకారభూతుండ ని
శ్శంకుండ సమరంబులం దురుభుజాసారోగ్రుఁడన్ వాసవా
తంకాపాదనదక్షసాహసమహోదగ్రుండ నే నన్ను మీ
నాంకుం డిప్పుడు నీదునేత్రవిశిఖవ్యాలీఢుఁ జేసెన్ వెసన్.

1679


చ.

తవిలి ప్రియంబుతో నవసుధారసపూరము గల్గుమోవి నేఁ
జవిగొని మెచ్చుచున్ వలుఁదచన్గవ యక్కునఁ జేర్పఁ గోరెదం
గవయుము నన్ను మన్మథునిగాఢశరంబులఁ జాక మున్న యో

పవనవిధూయమానవరపంకజపత్రవిశాలలోచనా.

1680


క.

అనిన రజస్వలఁ బరతం, త్ర ననుం గవయంగ నీకుఁ దగ దని పల్కన్
దనుజపతి పరవశుం డై, యను నాతోఁ దమకపడుచు నతిలాలసుఁ డై.

1681


చ.

సొలవక మద్యపానమునఁ జొక్కినయయ్యెలనాఁగలున్
రజ
స్వలలుఁ బరాంగనల్ గలుగ సంతస మందుదుఁ గాన నాకు మి
క్కిలి గడులెస్స యంచుఁ దమకించుచు వాఁడు రమించె దీర్ఘకా
జలజిని మత్తసింధురము సంభ్రమ మొంది నలంచుకైవడిన్.

1682


వ.

అంత.

1683


శా.

నాగేంద్రప్రతిమానహస్తుఁ డసమానప్రాభవోద్యన్మరు
న్నాగేంద్రప్రథితోగ్రవిగ్రహుఁ డనూనభ్రాజమానప్రతా
పాగణ్యుండు విశాలవక్షుఁడు కఠోరాకారుఁ డై నాకు స
ద్యోగర్భంబున నుద్భవించె నతికాయుం డింద్రవిద్వేషి యై.

1684


వ.

దశముఖుండు వానిం దోడ్కొని చనియె నంత వాసరత్రయావసానసమయంబు
నఁ గృతస్నాన నయి సంప్రాప్తశరీరశుద్ధిసాధిమ నై ధౌతపరిధానాభరణాంగరాగ
మాల్యాలంకృత నై మునివల్లభుమ్రోల నిలిచి యల్లన యిట్లంటి.

1685


క.

కృతపుణ్యశీల దివస, త్రితయంబును గడచె నేఁడు దివిరినవేడ్కన్
రతిసుఖము నీకు నీ వ, చ్చితి నన్నుఁ బరిగ్రహింపు చిత్తం బలరన్.

1686


వ.

అనినంత.

1687


క.

నాచందము శాండిల్యుఁడు, సూచి వివేకించి యకట సొలవక కడుదు
ష్టాచరణ నాకుఁ బ్రతికూ, లాచరణము సేయ నుచిత మగునే నీకున్.

1688


సీ.

నామందిరంబులోనన యుండి వంచించి, యెవ్వనిఁ బొందితి వింతి చెపుమ
శఫరాక్షి నీవయస్సారస్య మెవ్వఁడు, మనమున బెగడక కొనియె నేఁడు
మగువ యెవ్వఁడు వచ్చి మదమున నీకచ, గ్రహణంబు గావించి కడఁగి పట్టె
నెలనాఁగ యిచటికి నెవ్వఁడు చనుదెంచి, కామాంధుఁడై నిన్ను గాసి చేసెఁ
దగవు నీవు నిచటఁ దప్పితి గావున, నీజలాశయమున నోజ దక్కి
యడరి ఘోరమకరివై యుండుమని యుగ్ర, శాప మిచ్చె నాకుఁ గోప మెసఁగ.

1689


మ.

అనురాగంబున నిన్నుఁ బట్టుకొని కామాయత్తుఁ డై గాసి చే
సినదుష్టాత్ముఁడు పుత్రసోదరసుహృత్సేనాసమేతంబుగా
ననిలో శత్రుచయంబుచేఁ బొలియు నన్యాయోదయత్పాతకం
బున నంచున్ ఘనశాప మిచ్చెఁ బ్రతిఘాస్ఫూర్జత్స్ఫులింగాక్షుఁ డై.

1690


సీ.

ఎనయంగ దర్పజితేంద్రియత్వములకు, ననుభోగరతినిస్పృతహత్వములకు
విదితమహామోహవిజ్ఞానములకును, ననురాగవైరాగ్యఘనతలకును
ఘోరతృషాలోభదూరత్వములకును, జనసంగమరహస్యచతురతలకు

గురుతరాహంకార[10]వరశాంతతలకును, మదలౌల్యరుచిరాప్రమాదములకుఁ
నొక్కచోట నునికి యెక్కడ సిద్ధించుఁ, దిమిరమునకు నుదితతేజమునకుఁ
జటులపాపకునకు సలిలపూరమునకు, నెందు నరసి చూడఁ బొందు గలదె.

1691


చ.

పరహితసత్యశీలకులభావదయాశమధర్మపుణ్యస
చ్చరితవివేకబుద్ధిభయసత్త్వగుణంబులు లేమ లున్నయా
పొరువునఁ బోవు చర్మమయపుత్రికలం దొకయింతసౌఖ్యమున్
దొరకునె మోసపోయి కడుదూషితచిత్తుఁడ నైతి నక్కటా.

1692


క.

నిరయమున కేఁగుతెరువులు, సురలోకము తెరువు గానిచొప్పులును మహా
దురితంబుల పొలిమేరలు, పరికింపఁగ నింతు లెందుఁ బ్రవ్యక్తముగన్.

1693


వ.

అని తర్కించుచున్న యమ్మునివరునిం జూచి వడవడ వడఁకుచు ముకుళితకర
కమల నై యి ట్లంటి.

1694


చ.

నిరుపమసత్కృపాకలిత నే సపరాధిని గాను వాఁడు దు
ర్భరభుజసారుఁ డై బలిమి బట్టి పరాభవ మొందఁజేసె మీ
రురవడి శాప మిట్లుగ మహోగ్రత నిచ్చితి రింక నాకు దు
స్తర మిది వార్ధికైవడిఁ బదంపడి దీని విముక్తిఁ జేయరే.

1695


వ.

అనిన ననుకంపాభరితుండై నావచనం బమోఘంబు గావున నిది యనుభవనీయం
బ కొంతకాలంబునకు దశరథపుత్రుం డగు రామునిపనిఁ బూని హనుమంతుం
డిందులకు వచ్చు నతనిచేత నీకు శాపవిముక్తి యగు నని యానతిచ్చి యాశాండి
ల్యుండు గంగాతటంబున కరిగె నట్ల నేడు నీప్రసాదంబున నేను గృతార్థ నైతిం
బోయివచ్చెద నని జగత్ప్రాణనందను దీవించి మెఱపునుంబోలె నప్పుడ యంత
ర్ధానంబు నొందిన నతండును జమత్క్రియమాణచిత్తుం డై క్రమ్మఱి కాలనేమి
సమీపంబునకు వచ్చిన వాఁ డి ట్లనియె.

1696


క.

నీ వీమడువున సలిలము, ద్రావెద నని పోయి యెంత తడసితి వట సం
జీవని నీ కుపదేశము, గావించెద వలతు వేనిఁ గైకొను మెలమిన్.

1697

కాలనేమి హనుమంతునిచేఁ జచ్చుట

క.

వెరవారఁగ శిష్యుఁడ వై, గురుదక్షిణ పెట్టు మనినఁ గోపం బెసఁగన్
గురుదక్షిణ యిదె కొ మ్మని, యురవడితో నురము పొడిచె నురుతరముష్టిన్.

1698


క.

ఘనముష్టిఘాతమున న, ద్దనుజుఁడు దండాభినిహతదర్వీకరకో
పనుఁ డై యెగయుచు నాపా, వనివక్షస్స్థలము వ్రేసె వడి ఖడ్గమునన్.

1699


చ.

చటులనిశాతఖడ్గశరశాతనుఁ డై పవమానసూతి యు
త్కటగతిఁ జీరి వ్రేసి వడిఁ దన్నిటలంబునఁ దాఁచి యార్చి నీ
కెటఁ జనవచ్చు నాయెదుట నిప్పుడు నిన్ బొలియింతు నంచు ను

ద్భటముగఁ బల్క దానవుఁడు పక్షిశరీరము దాల్చి గ్రక్కునన్.

1700


క.

ఎఱకలగాడ్పున నొగి వెడ, చఱువఁగ వడి వీచి యతని శాతనఖములం
జుఱుచుఱఁ జీరియు ముక్కునఁ, గఱచియు నొప్పించె వాఁడు గరువలిసుతుఁడున్.

1701


శా.

ఆటోపంబున వానిఁ బట్టి పరుషోద్యన్ముష్టిఘాతంబునం
ద్రోటీపాటన మాచరించి భుజగస్థూలోగ్రవాలంబునం
దాటించెన్ వడి నేల వ్రేసి చదిపెన్ దర్పంబు గ్రక్కించె నా
స్ఫోటం బొప్పఁగ ఱెక్క లెల్ల విఱిచెన్ శుంభత్సమారంభుఁ డై.

1702


వ.

అంత వాఁడు సింహాకారంబు దాల్చి.

1703


చ.

వికటసటావిపాటితనవీనవలాహకుఁ డై మహాప్రభా
వికసితదంష్ట్రికాగ్రముల వీరుని నాహనుమంతు గ్రుచ్చి సా
యకములఁ బోనిగోళ్ల నద రంటఁగఁ జీరి రవంబు సేసినం
జకితము లయ్యెఁ దద్విపినసామజయూథము లెల్ల నత్తఱిన్.

1704


ఉ.

ఇద్ధపరాక్రమాంచితుఁ డహీనబలాఢ్యుఁడు సింహరూపసం
సిద్ధవిభావు నద్దనుజుఁ జేరి మహాశనిఁ బోలు ముష్టి న
త్యుద్ధతి బీఱువోఁ బొడిచె నూర్జితగర్జితతర్జనక్రియా
రుద్ధదిగంతుఁ డై యుదితరోషలసచ్ఛరభంబుచాడ్పునన్.

1705


క.

[11]కేసరితనయుఁడు వడి న, క్కేసరిచరణములు శిరముఁ గెరలుచు నడుమున్
గాసిగ నప్పుడు దునుకలు, సేసియుఁ దనవాల మెత్తి చెలఁగుచు నడిచెన్.

1706


వ.

అంత నద్దానవుండు.

1707


శా.

సుగ్రీవుం డయి చేరి యి ట్లను మరుత్సూనుం బ్లవంగేశ యీ
వ్యగ్రత్వంబు దొఱంగు లక్ష్మణుఁడు సత్యం బార జీవించే ద్రో
ణగ్రావంబున కేఁగ నేటి కసమానప్రీతితో రమ్ము దుః
ఖగ్రాహ్యంబులు మందు లేల ధరణీకాంతాజ్ఞ నే వచ్చితిన్.

1708


తే.

అనిన మతిమంతుఁ డగుహనుమంతుఁ డతనిఁ, దెలియ నారసి కాకుంట తెలిసి యిచటి
కర్కసంభవుఁ డేటికి నడరి వచ్చు, ననుచు నాగ్రహనిగ్రహకవ్యగ్రుఁ డగుచు.

1709


ఉ.

ఓరి నిశాచరాధముఁడ యుగ్రసముద్ధతి మాయలాఁడ వై
సారము లేమిఁ జేసి పలుచందపురూపులు దాల్చి యీక్రియం
బో రొనరింప వచ్చితివి పోయిన ని న్నిఁకఁ బోవ నిత్తునే
దూరము గాదు కాలుపురిత్రోవ యటంచు నుదగ్రమూర్తి యై.

1710


శా.

తాలోత్తాలకరాళదుస్సహభుజాదండంబునన్ వ్రేసె నా
భీలప్రాభవదుర్నివారగతి యై భీమాసురోరస్స్థలీ
శైలోపాంతము దాన దానవుఁడు నిస్సత్త్వాత్ముఁ డై సోలి కీ

లాలౌఘంబులు నోరఁ గ్రమ్మఁగ విశాలధ్వానుఁ డై గ్రక్కునన్.

1711


సీ.

అంతన శతశృంగుఁ డై నిర్జరారాతి గర్జిల్లి సముదగ్రకార్ముకంబు
దాల్చి కర్ణాకృష్టదారుణశరజాల, ముల నాంజనేయుని ముంచెఁ బెలుచఁ
జదిపె వాలంబున సాయకావలి నెల్ల, నవలీల నలయక పవనసుతుఁడు
మఱియు మర్మంబులు నెఱయంగ నొప్పించె, రాత్రించరుండు నారాచములను
దాన్ని చీరి కఱచి తాడించి పిడికిళ్లఁ, బొడిచి చఱిచి యెత్తి పుడమి వైచి
మొగము పగులవేసి [12]మ్రోఁకాళ్ల ఘట్టించి, వక్ష మెడలి పగుల వాయుసుతుఁడు.

1712


క.

సామజరాజుకరంబునఁ, దామరసము ద్రించుభంగి దర్పోద్ధతుఁ డై
సామీరి బాహుయుగమున, నామనుజాశనునియుత్తమాంగముఁ దునిమెన్.

1713


తే.

అనుపమానైకఘోరమాయాబలాను, కలితు మారీచతనయునిఁ గాలనేమి
నగణితస్థితిఁ గాలునినగరి కనిచి, కీశనాథుండు వెస ద్రోణగిరికి నరిగె.

1714


ఉ.

సింధురవైరివిక్రమణశీలి యతండు పరిభ్రమింప సౌ
గంధికసంగబంధురితగంధసమీరణశాలి యై మరు
త్సింధుమనోజ్ఞశీకరవశీకరణాచరణాభిరాముఁ డై
గంధవహుండు వీచె నెసకంబున నాత్మజుమీఁద మెల్సునన్.

1715


వ.

అంత ననిలసుతుండు.

1716


ఉ.

ద్రోణము గాంచె నిర్జరవధూజనమంగళగేయవిస్ఫుర
ద్రాణము దీపరాజిరుచికరస్ఫురదోషధిసత్త్వకల్పిత
తాణము రత్నదీధితివిరాజితహాటకసానుమండలీ
కోణము నభ్రచుంబిగురుకూటవికస్వరధాతుశోణమున్.

1717


వ.

అనిలతనయుం డమ్మహీధరారోహణంబు సేసి దావదహనజ్వాలాదందహ్యమా
నంబులఁ బోని కనత్కనకకటకంబులు గనుంగొనుచు సౌదామనీదామసముద్దా
మంబు లగు హేమలతావితానంబులు సూచుచుఁ దారకితం బగుశరన్నభోభా
గంబు ననుకరించుచుఁ బతితతరుకుసుమం బగుమహేంద్రనీలస్థలంబు లాలోకిం
చుచు నవశోణితరణాంగణవికీర్ణగజకుంభపతితముక్తాఫలంబులుంబోలె ధాతుమ
యసానుతలంబుల వేణుమూలపతితంబు లగుమాక్తికంబులు సూచి మెచ్చుచు
సుషేణుండు చెప్పినయభిజ్ఞానంబు లుపలక్షించి యమ్మహౌషధంబులు డగ్గఱునం
త నవి యదృశ్యత్వంబు నొందిన నప్పర్వతంబున కిట్లనియె.

1718


సీ.

ఓమహీధర రాజ యుర్వీశపతి యైన, దశరథరాజనందనునియాజ్ఞ
సమకూర్ప వచ్చితి సర్వలోకములకు, హిత మైనసత్కార్య మెల్లభంగిఁ
గావున నీయందుఁ గలిగినదివ్యౌషధంబులు నా కిమ్ము తడయ కిపుడు
వలయు నే వడిఁ బోవ వంచింప నీ కేల, పెంపుతోడుతఁ గరుణింపు మనిన

నాధరాధరుండు నతిగర్వితుఁడపోలేఁ దన్ను సరకుగొనక దర్ప మొదవ
నవినయమున నమ్మహౌషధు లీకున్న, నలిగి పలికె నంత ననిలసుతుఁడు.

1719


మ.

ప్రియముల్ చెప్పిన నన్నుఁ గైకొనక దర్పిం చిట్లు [13]జాల్మత్వదు
ర్ణయశీలంబున నూరకుండితివి క్రూరత్వాత్మ దుర్బుద్ధి వై
దయయున్ ధర్మము సత్యమున్ గుణములున్ దాక్షిణ్యముం గల్గ వా
రయ నెందుం గఠినాత్ములందు సముదగ్రగ్రావ శైలాధమా.

1720


మ.

అని యుద్యత్పటురోమకూపవివరౌఘావిర్భవద్విస్ఫులిం
గనికాయంబులు గూడి మింటఁ గలయ గాఁ బర్వి మండంగ రో
ధనసర్వంకషతేజుఁడై చటులనాదన్యక్కృతాంభోధర
ధ్వని నార్చెన్ వెస సప్తలోకకుహరవ్యాప్తిక్రియాపాది యై.

1721


చ.

ఒఱగె వసుంధరాస్థలి మహోరగనాథుఁడు గ్రుంగెఁ గూర్మముం
దఱలె నభంబు మ్రోసె సురదంతులు మ్రొగ్గె దిగంతరంబు ల
త్తఱి నదరెన్ మరుత్సుతుఁడు దర్ప మెలర్ప నహార్య ముద్ధతిం
బెఱుకఁగ గోత్రశైలములు పెల్లగిలెం గలఁగెం బయోనిధుల్.

1722


క.

వ్యాళేంద్రతులిత మగుతన, వాలమ్మునఁ జుట్టి పెఱికె వానరపతి యా
శైలము మును మందరగిరి, హేలోత్సాహమునఁ జక్రి యెత్తినమాడ్కిన్.

1723


వ.

ఇట్లు దశయోజనవిస్తారంబును బంచయోజనాయతంబును నగునమ్మహీధరంబు
పెఱికి యెత్తి యార్చునవసరంబునం జిత్రసేనాదిగంధర్వులు ద్రయోదశకోటిసం
ఖ్యాకు లై పరస్సహస్రంబు లైనమొనలు దీర్చి పరశుగదాముద్గరపట్టిసప్రాస
ముసలకుంతభిండివాలకరవాలాదిమహాసాధనంబులక్రొమ్మెఱుంగులు గనల నతని
వీక్షించి వీఁడు నాఁడు గొనిపోయినదొంగ యెప్పటి సనుదెంచె వీనిఁ గృ
తాంతగోచరుం జేయుద మని యి ట్లనిరి.

1724

హనుమంతునితో గంధర్వులు యుద్ధము చేయుట

మ.

ఇది నీ కేటికి మేరుభూధరసమం బీయద్రి దేవవ్రజా
స్పద మిం దుండుదు మేము గావు త్రిజగత్సంజీవనాఢ్యంబు నీ
వది యిచ్చోటన పెట్టు తక్కిన మదగ్రానేకశస్త్రాలిచే
బ్రదుకన్ వచ్చునె యన్న నాతఁడు రణారంభోన్ముఖుం డై వడిన్.

1725


సీ.

దట్టించి యంఘ్రులఁ దన్ని నఖంబులఁ, జీరి తలంబులఁ జిక్కపఱిచి
పెడకేలఁ బొలియించి పిడికిళ్ల నొప్పించి, మోఁచేతిపోటులఁ బీఁచ మడఁచి
కఱచి వాలంబునఁ గట్టి యంబుధి వైచి, శైలతటంబునఁ జదియ వేసి
కడకాళ్లు పట్టి యుత్కటముగా వడిఁ ద్రిప్పి, యొకనితో నొక్కని నొగిని జఱిచి
కడఁగి కారింపఁ గొందఱు పుడమిఁ బడిరి, వెఱచి కొందఱు గనుకనిఁ బఱచి రపుడు

మూర్ఛనొందిరి కొందఱు మూఁక గట్టి, కొంద ఱూరక భ్రమ మొంది రందులోన.

1726


తే.

తల్లడించుచు మింట గంధర్వవరులు, నీకుఁ దెరువులు శుభములై నెరయుఁ గాక
యీయుపక్రమ మేరికిఁ జేయఁ దరమె, కొండ గొనిపొమ్ము వానరకులలలామ.

1727


క.

అని గంధర్వులు తొలఁగిన, ననిలతనూజుఁడు మహీధరరాన్వితభుజుఁ డై
తను సిద్ధసాధ్యగణములు, వినుతింపఁగ గగనవీథి వెలుఁగుచు నరిగెన్.

1728

భరతునిదుస్స్వప్నము

చ.

భరతుఁడు నాఁటిరాత్రి యశుభం బగునక్కలలోనఁ గాననాం
తరమున రామలక్ష్మణులు తైలినిషిక్తశిరస్కు లై సుదు
స్తర మగుపంకమధ్యమునఁ దద్దయుఁ జిక్కి కృశాంగు లై మహో
ద్ధురగతి నేడ్చుచున్ వితతదుఃఖము నొందుటఁ గాంచి భీతుఁ డై.

1729


చ.

తడయక మేలుకాంచి కల దారుణ మం చెదఁ జింత నొంది త
ల్లడమున వెళ్లి వచ్చి వికలత్వము నొందుచు దుర్నిమిత్తముల్
గడుకొని చూచి మేను వడఁరకం బటుధైర్యము దూలిపోయి పెం
పెడలి బహుప్రకారముల ని ట్లనుచుం దలపోయు నాత్మలోన్.

1730


ఉ.

నక్కలు గూయఁ జొచ్చె గగనంబున నుల్కలు రాలఁ జొచ్చె నే
దిక్కున నైన ధూమములు దీటుకొనం గవిసెన్ ధరిత్రియున్
గ్రక్కతిలంగఁ జొచ్చె నధికంబుగ నొక్కత ముక్తకేశ యై
మిక్కిలి యేడ్చుచున్నయది మీఁదటికీ డది యేమి పుట్టునో.

1731


ఉ.

రాముఁడు లక్ష్మణుండును ధరాసుతయున్ బలుకాననంబులం
దేమివిధిం జరించిరొకొ యేవిధిఁ బొందిరొ యేమి యైరొకో
యామహనీయకీర్తులకు నాపదలున్ వెసఁ గల్గునొక్కొ యిం
కేమి తెఱంగొ దీనికి సమోహిత మెయ్యదియొక్కొ దైవమా.

1732


క.

పదునాల్గువత్సరమ్ములు, దుదముట్టఁగ వచ్చె నేఁడు తుదగా గురుస
మ్మదముగ వార్తయు వినరా, దది యేమియొ తెగిరొకో కృతాంతునిచెయిదిన్.

1733


క.

కృతయజనతపోదాన, వ్రతజప[14]తీర్థోపవాసవరసుకృతంబుల్
కృతమతి నిచ్చితి రామున, కతులితముగఁ గలుగ నభ్యుదయ మనుచు వెసన్.

1734


చ.

అనఘుఁడు భూసురోత్తముల నాగమవిత్తము లైనవారి రాఁ
బనిచి యనేకదానజపపావకతర్పణధర్మశాంతు లిం
పొనరఁగ వేదచోదితనియోగముతో నొనరించి నెమ్మనం
బున [15]దురపిల్లి నెవ్వగలఁ బొందుచుఁ గుందుచు నుండ నత్తఱిన్.

1735


మ.

ఉదయద్భాస్కరమండలోల్లసితకాయుం డుగ్రసంవర్తని
ర్యదుదగ్రానితుల్యసత్త్వుఁ డురుధైర్యాతీతశైలుండు భా

తి దలిర్పం బవమాననందనుఁడు నందిగ్రామముం గాంచె భా
స్వదమేయద్యుతిపూరితాఖిలదిశాచక్రుండు సంభ్రాంతుఁ డై.

1736


మ,

ఘనసంకాశశరీరు వల్కలజటాకల్పుం దపోనిష్ఠితున్
వనజాతాయతచారునేత్రు భరతున్ వాతాత్మజుం డచ్చటం
గని యారాముఁడు లక్ష్మణుం డిలిగినం గాంతాలలామంబు సీ
తను నచ్చోటనె డించి వచ్చెనొకొ యుద్యద్దుఃఖభారంబునన్.

1787


సీ.

అరసి చూచెదఁగాక యని యాత్మఁ దలపోసి, యక్కట రఘురాముఁ డట్టివాఁడె
ధర్మదయాసత్యధనుఁడు ధీరోదాత్తుఁ, డచలేంద్రగురుధైర్యుఁ డనుజునింతి
నర్కతనూజాతు నావిభీషణుఁ గపి, వీరుల దిగనాడి పేరు చెఱిచి
చనుదెంచునే దశాననుఁ బోరఁ గూల్పక, యీకానితలఁ పేల నాకుఁ బుట్టె
దాశరథిఁ బోలు నితఁ డొకతాపసుండు, గలుగఁబోలును నిజమని కడకతోడ
లఘుజవంబునఁ బావని లంక కరుగఁ, గనియె నప్పుడు భరతుండు గగనవీథి.

1788


ఉ.

రాజకుమారశేఖరుఁ డరాతిభయంకరుఁ డభ్రవీథి వి
భ్రాజితతేజుఁడై యరుగుపావనిఁ జూచి యుదగ్రవిక్రమో
ద్వేజక మైనభూత మిది దీని శరంబునఁ గూల్తు నంచుఁ దా
రాజధరోరుకార్ముకకరాళతరాలఘుచాపధారి యై.

1789


క.

నిలిచినతఱి నశరీరిణి, పలికెన్ నీ కరయ నాప్తబంధుఁ డితనిపై
నలుగవలదు కరుణింపుము, బలవదమోఘాస్త్రజాల భరతనృపాలా.

1740


మ.

అని వీతెంచినఁ గైకయీతనయుఁ డత్యాశ్చర్యనిర్మగ్నుఁ డై
ధనువుం దూ పుపసంహరించి రఘునాథక్లేశముల్ మాన్పఁగా
మన మారం బరమేశ్వరార్చన లసామాన్యంబుగాఁ జేసి స
జ్జనగోష్ఠిం దగ నిల్చి యుండె భయదస్వప్నప్రసంగంబునన్.

1741


చ.

కనియెఁ గపీంద్రుఁ డంత ఘనగర్జననిస్వనవీతనిద్రమున్
ఘనతిమినక్రచంక్రమణకల్పితవీచికదంబభద్రముం
గనదురురత్నరాజిభుజగవ్రజసంచరణాతిరౌద్రమున్
జనితమరాళఫేనవిలసన్నవముద్రము నాసముద్రమున్.

1742

మాల్యవంతుఁడు రాక్షసబలంబులుం దానును హనుమంతుని నడ్డగించుట

వ.

అంత దశవదనుపంపున మాల్యవంతుండు సమగ్రబలసంపన్నులును వివిధమా
యావిశారదులును సమరకర్మదుస్సహులు ననేకాయుధోపేతులు నయినయఱు
వదికోట్ల రాక్షసులతో నొక్కటం గదిసి జలరాశిమధ్యంబునఁ గపివీరునిఁ బో
నీక పొదివిన నతండు విద్యుల్లతావేల్లితంబులును విజృంభితదంభోళిసంరంభంబులు
నూర్జితగర్జితంబులు నగుజీమూతంబులు గా శంకించి భీషణవివిధాస్త్రసింహనా
దంబుల నక్తంచరులుగా నెఱింగి గగనవీథిం బదఘట్టనంబులు లేమింజేసి నిశ్శబ్దం

బగుసంగరంబు ప్రవర్తించె నప్పుడు శరంబులఁ గీలించియు గదల వ్రేసియు భిండి
వాలంబుల వైచియు శక్తులఁ బఱపియుఁ జక్రంబులఁ బ్రయోగించియుఁ గత్తళం
బుల నొత్తియు బరిఘంబులఁ బరిఘట్టించియు ముసలంబుల మోఁదియుఁ గుం
తంబులఁ బొడిచియు గోణంబుల విసరివైచియు నంకుశంబుల సూటియుఁ గఠా
రంబుల నాటియుఁ గుఠారంబుల నఱకియు ని ట్లనేకప్రకారంబుల నొప్పింప నతం
డు నాజ్యాహుతులం బ్రవర్ధమానతేజుం డగుజాతవేదు ననుకరించి యనూన
సత్త్వంబునం బేర్చి మహార్ణవంబునం దిరుగునాదిమీనంబునుంబోలెఁ గాననం
బునం గనలుమహానలంబు చాడ్పునఁ దుంగమడువు సొచ్చి కలంచుమదకుంజరం
బుపగిది హరిణంబుల బెగడువఱుచుపుండరీకంబుమాడ్కి సర్పంబులదర్పం బడం
చువైనతేయునివిధంబున వాలంబున నసురులఁ జుట్టిపట్టి త్రిప్పి వారాశిలో వైచి
యుఁ జరణతాడనంబుల మరణంబు నొందించియుఁ బార్ష్ణిఘాతంబులం బడలు
పఱిచియుఁ బాదాగ్రంబులం దట్టుచు జానుఘాతంబులం గూల్చుచుఁ బార్శ్వ
ప్రహారంబులం బొలియించుచు నున్నం గనుంగొని యంత నమ్మాల్యవంతుండు.

1743


మ.

దివిజానీకము దల్లడిల్లఁగ సముద్దీప్తప్రతాపోగ్రుఁ డై
శ్రవణోపాంతనిషణ్ణకార్ముకవరజ్యానాదభూయిష్టుఁ డై
పవమానాత్మజుమీఁద వేయిశరముల్ భాస్వత్కరాభంబు లా
ర్చి వడిం గీల్కొలిపెం బ్రచండవిపులార్చిస్తోమభీమంబు గాన్.

1744


వ.

అంత హనుమంతుండు.

1745


శా.

లీలావిక్రమ మేర్పడన్ రణకరాళీభూతుఁ డై భోగిరా
జాలోలం బయి ధూమకేతనసముద్యద్దీధితిం బొల్చునా
వాలం బార్చుచు వాని నన్నియును దుర్వారంబుగాఁ ద్రుంచె ను
ద్వేలాతిప్రథమానమానసహజస్థేమానుభావంబునన్.

1746


చ.

తలకొని మాల్యవంతుతల దన్ని సమీరసుతుండు దా వియ
త్తలమున కంత బి ట్టెగసెఁ దానును దానవవీరుఁ డస్రధా
రలు దొరఁగంగ సొమ్మసిలి రౌద్రరసం బొదవంగఁ దేఱి య
గ్గలముగ నేసెఁ గీశుపయిఁ గాలునిచూపులఁ బోలుతూపులన్.

1747


క.

ఆలమున ననిలతనయుఁడు, వాలంబున విల్లు విఱువ వడితో వాఁడున్
శూలమున బిట్టుపొడిచెన్, ఫాలమునను రుధిరధార పఱపుగఁ దొరఁగన్.

1748


తే.

మఱియు శూలము మారుతాత్మజునియురము, గాఁడ వైచిన నాతండు గడఁగిపట్టి
యంఘ్రియుగమున నవలీల నడరి విఱిచె, నిక్షుదండముఁ బోలంగ నింతలోన.

1749


చ.

గద గొని వైచె దానవుఁడు గంధవహాత్మజుమీఁద నేపుతో
నది చనుదెంచి తాఁకెఁ జటుకలాశని శైలముఁ దాఁకుచాడ్పునం

గదలక [16]నిల్చి కాలుగతిఁ గన్నుల నిప్పులు రాల నుగ్రుఁ డై
పదముల బిట్టు తన్నె నరికభంజనవిక్రమసార మేర్పడన్.

1750


వ.

అంత నమ్మాల్యవంతుండు మారుతి కి ట్లనియె.

1751


మ.

వినతానందను నెక్కి వారినిధిలో విష్ణుండు నాతోడఁ బో
రొనరింపం గలుషించి నే ననుపమానోదగ్రబాణంబు లే
సిన నిల్పోపక కాందిశీకుఁ డయి పాసెం బోరికిన్ నీతరం
బె ననున్ సంగరభూమిలో గెలువఁ గాపేయంబునం జాకుమీ.

1752


క.

ఈగిరి నాపంపున నీ, సాగరమున వైచి పొమ్ము చంప ననుచు ర
క్షోగణవీరుఁడు వానర, నాగేంద్రునిమీఁదఁ బఱపె నవశితశక్తిన్.

1753


తే.

కడఁగి యొక్కట విస్ఫులింగములగములు, మింటఁ జెదరంగ వడిఁ బెనుమంట లెగయ
వచ్చునాశక్తిఁ బొడగాంచి వాయుసుతుఁడు, చెలఁగి పదములఁ దునుకలు సేసి యార్చె.

1754


సీ.

అంతట నమ్మాల్యవంతుండు గోపించి, కాళీకటాక్షప్రకాశ మొనరు
కరవాల మంకించి కదిపి వక్షస్స్థలి, వ్రాసిన నది వేగ విఱిగి పడిన
వజ్రసంహననుండు వాయుతనూజుండు, వాలపాశంబున వానికంఠ
మొగిఁ జుట్టి వైనతేయుఁడు భుజంగము పట్టి, త్రిప్పుకైవడి వడిఁ ద్రిప్పి మింటఁ
బెక్కుమాఱులు వెస వీచి త్రెక్కొనంగ, వదల వారిధిలోపల వైవ నతఁడు
ముక్తకేశాంబరోజ్జ్వలభూషుఁ డగుచుఁ, బడి రసాతలమున కేఁగె బలము దక్కి.

1755


క.

జితకాశి యైనయమ్మా, రుతసూనునియుగ్ర మైనరూపము గని ని
ర్గతసాధను లై దితిజులు, హతశేషులు లంకలోని కరిగిరి పెలుచన్.

1756


క.

గెలుపుగొని వాయుతనయుఁడు, బలవిక్రమభూతి యొదవ బాహాదండో
జ్జ్వలదివ్యభూధరుం డై చెలఁగుచు వడి నరిగె గగనసీమ వెలుంగన్.

1757


చ.

స్ఫుటతరదివ్యరత్నఘృణిశోభిమహౌషధభూధరప్రభా
పటలము మింటిపై నిగుడఁ బ్రస్ఫురదగ్నిరుచిచ్ఛటావిశం
కటుఁ డగువాయుసూనుఁడు వికస్వరుఁ డై చనుదేర రాఘవుం
డిట సరసీజబంధుఁ డుదయించెనో యంచుఁ బరీతశోకుఁ డై.

1758


మ.

రణలక్ష్మీరతిసక్తుఁ డై యలసి నిద్రాణత్వముం బొంది [17]
ప్రణతప్రక్రియ దోఁప నప్పుడు గతప్రాణుండు నాభీమరా
వణసంప్రేరితశక్తిఁ గూలి హతనిశ్వాసానిలుం డైనల
క్ష్మణు నాత్మానుజుఁ జూచి యి ట్లనియె నిక్ష్వాకుప్రభుం డార్తుఁ డై.

1759

రాముఁడు ద్రోణాద్రిప్రభం గాంచి యరుణోదయకాంతి యని శంకించి చింతించుట

క.

నగరాజధీర లక్ష్మణ, విగతస్నేహుండ వై వివేకింపక నన్
దిగనాడి నీకుఁ బోవఁగఁ, దగునే నా కేది దిక్కు తమ్ముఁడ చెపుమా.

1760


క.

రూపింప నెల్లవారికి, నేపారఁగఁ బ్రొద్దు వొడువ నీసమయమునన్
నాపాలఁ బ్రొద్దు గ్రుంకెను, భాపపుదుఃఖాబ్దిలోనఁ బడఁ బా లయితిన్.

1761


క.

నీరాక కెదురుచూచు చ, హోరాత్రము వగలఁ బొగిలి యుండుసుమిత్రం
జేరి యడుగ నే మనియెద, నేరీతి మొగంబుఁ జూతు నెక్కడఁ జొత్తున్.

1762


క.

భరతున కే మని చెప్పుదు, సరసుఁడు నీతమ్ముఁ డయిన శత్రుఘ్నునితో
నిరవుగ నేక్రియ బొంకుదు, గురుతరదుర్యశము నొంది కుందఁగ వలసెన్.

1763


తే.

అన్న దిగనాడి నను శర ణన్న నేను, లంకఁ బట్టము గట్టితి శంక మాను
మని విభీషణుఁ బలికితి నదియుఁ దప్పె, నిల నభాగ్యుల కెందును గలదె పెంపు.

1764


మ.

కమలాప్తుం డుదయాద్రిచేరువకు నిక్కం బారయన్ వచ్చె ని
త్తిమిరంబు విరియఁగఁ జొచ్చెఁ గలయన్ దిగ్భాగముల్ నిర్మల
త్వము వొందెన్ గ్రహతారకాతతులభాస్వత్స్పూర్తియుం దప్పె నే
నమరన్ లక్ష్మణువెంట నేఁగెద నసఃహ్యం బిచ్చటన్ నిల్వఁగన్.

1765


వ.

అని సుగ్రీవున కి ట్లనియె.

1766


ఉ.

బంధుఁడ వై తలిర్చుచు నపారబలీముఖసేనతోడుతన్
సింధువు గట్టి రక్కసులఁ జీరికిఁ [18]గోక వధించి తీవు నీ
బాంధవ మెల్లప్రొద్దుఁ దలఁపం డుగు నాత్మ మఱాకు మింకఁ గి
ష్కింధకుఁ బొమ్ము భానుసుత కీశబలంబులు నీవు నావుడున్.

1767


చ.

రవిసుతుఁ డంతయుం దెలిసి రాముని కి ట్లను భూమిపాలక
ప్రవర విచార మేమిటికిఁ బన్నుగ నాలవజాము సొచ్చె న
ప్పవనసుతుండు వచ్చు నరిభంజన శోకము మాను మింక నా
ప్లవగవరుండు వోవుపని పన్నుగ విశ్వసనీయమే కదా.

1768


వ.

అనినయనంతరంబ నిబిడప్రభామండలదుర్నిరీక్ష్యం డయి హనుమంతుండు
ప్రజ్వలన్మహౌషధీదీధితిభాసురం బగునాద్రోణనగంబు ధరియించి యేతెంచిన
నఖండచండతేజోమండలం బనఁ దేఱి చూడ రాకుండినఁ గపివీరులు భీతిల్లి పర
వశు లై యుండ రఘూద్వహుం డయ్యవసరంబున మార్తాండుం డని శంకించి.

1769


సీ.

ప్రలయకాలోదగ్రభగ్గుచండంబునఁ, గంటిమంటలు [19]మింటఁ గలయఁ బర్వ
రోమకూపంబుల భీమంబుగా విస్ఫు, లింగకణంబులు నింగి కెగయ
బ్రహ్మాండ మంతయు భగ్నంబుగాఁ జేయ, నప్పళించుతలంపు లుప్పతిలఁగ
నమరకులాధిపప్రముఖదిక్పాలుర, మసలక లీల భస్మంబు సేయఁ

బూనుకైవడి రఘురాజపుంగవుండు, తఱిమి జగములు విగతసత్త్వములు గాఁగ
జలధు లేడును నొక్కటఁ గలఁపఁజూచు, విధము నొందుచు నుద్ధతవేగుఁ డగుచు.

1770


సీ.

ద్రోణాఖ్యశిఖరికై దూర మేఁగినకపి, రాజలలామంబు రాకమున్న
రణభూమిఁ బడినలక్ష్మణుఁడు లేవకమున్న, ఘనమనోరథసిద్ధి గాకమున్న
యన్వయంబున కాది యయ్యును బగవానిఁ, గలసి నాకార్యంబు తలఁపులేక
కట్టిఁడితనమున ఖరకరుఁ డుదయించు, చున్నవాఁ డుద్ధతి నుచిత మేది
యరయఁ గల్లరి గావున వడరి నాడు, దివ్యశరమునఁ బడఁ గూల్తు దివిజు లడర
వసుమతీతల మే నరాక్షసము గాఁగఁ, జేయుదును నాకుఁ గలదె యజేయ మెందు.

1771


వ.

అని పలికి.

1772


శా.

ఆస్ఫోటించి పరాక్రమించి భయదవ్యాపారసన్నద్ధుఁ డై
విస్ఫూర్జల్లయకాలదావదహనావిర్భావమూర్తిక్రమ
ప్రస్ఫీతుం డయి వీరరౌద్రరససంరంభంబునం బొల్చి యు
గ్రస్ఫారప్రథితప్రతాపతపనైకత్వప్రతిష్ఠాత్ముఁ డై.

1773


చ.

పరఁగఁ బినాక మందుకొనుఫాలవిలోచనుమాడ్కి రాఘవుం
డురుతరసంభ్రమం బొదవ నూర్జితచాపముఁ దాల్చి పావకో
ద్ధుర మగు రౌద్రసాయకము దుర్దమశక్తి దలిర్పఁ జేర్చి భా
స్కరు నొకమాత్ర నేలఁ బడఁ గా వెస నేయఁ దలంచునత్తఱిన్.

1774


వ.

జాంబవత్సు గ్రీవవిభీషణాదులు సంభ్రమంబునం బఱతెంచి వినయవినమితశిగ
స్కు లై ఫాలభాగరచితకరసంపుటు లై యొక్కనికయి భువనత్రయంబుఁ జెఱు
పం జన దని మఱియు ని ట్లనిరి.

1775


సీ.

రఘువంశవర నీవు రౌద్రాస్త్ర మందిన, సురసిద్ధసాధ్యఖేచరభుజంగ
గంధర్వులాదిగాఁ 5 గడుభయంబునఁ బొంది, [20]యొగి దిక్కులకుఁ బాఱుచున్నవార
లతిశయోల్కాతతి నంబరస్థలి కాలి, పగులుచందంబున బడలువడియె
ధర గ్రక్కదలఁజొచ్చె ధరణీధరంబులు, వ్రాలుచు నున్నవి వార్ధు లెల్లఁ
గలఁగుచున్నవి గావునఁ గడఁగి దీని, సంప్రయోగంబు వల దింక జనవరేణ్య
దివ్యశైలంబుతోఁ జనుదెంచుచున్న, వాఁడు భానుండపోలె నవ్వాయుసుతుఁడు.

1776


క.

వరదివ్యౌషధలతికా, స్ఫురితం బగుద్రోణశిఖరి భుజబల మెసఁగం
గరువలితనయుఁడు దెచ్చెడు, సరసిజమిత్రుండు గాఁడు సౌజన్యనిధీ.

1777


వ.

అఖండక్ష్వేళారవపూరితాశాంతరుం డగుటం జేసి తపనుండు గామికి విచికిత్స వ
లదు పావనియ యగు నని పల్కి యమ్మహాత్మున కెదురుగాఁ గపులం బనువు
మనవుడు.

1778


మ.

దళదిందీవరచారుకాంతివిలసద్గాత్రుండు కౌతూహలా

మలఫుల్లత్సరసీజనేత్రుఁ డపరిమ్లానప్రసాదాననో
జ్జ్వలసంపూర్ణసుధాకరుండు రవిరాజద్దివ్యతేజుండు భూ
పలలాముండు కడంకతో నెదురుగాఁ బంపెం బ్లవంగావలిన్.

1779


శా.

అంతన్ భూమికి వచ్చుభానుఁ డన నత్యాశ్చర్య మొప్పన్ హనూ
మంతుం డాడట నేఁగుదెంచి కడురమ్యస్ఫూర్తి యై మేదినీ
కాంతాగ్రేసరుఁ డుత్సహింపఁగఁ బ్లవంగశ్రేణి మోదింపఁ ద
త్య్రాంతన్యస్తగిరీంద్రుఁడై సవినయవ్యాపారసంరంభుఁ డై.

1780


సీ.

ఇ ట్లను రఘునాథ యేఁ బోయి దివ్యౌషధంబులు తద్ధరాధరమునందుఁ
బరికించి కానక గిరియ తెచ్చితి నిది, యవధరింపుము వేడ్క నవనినాథ
మును మీరు పంచినఁ జనఁగ నే తేరంగ, నడుమ విఘ్నంబులు నాకుఁ గలిగె
మసలుట తప్పుగా మదిలోనఁ దలఁపకుఁ, డనిన రాముఁడు పల్కె ననిలతనయ
నీకుఁ దప్పులు గలవయ్య నీకతమున, దినకరాన్వయ మరయఁ బ్రతిష్ఠ
నన్నుఁ గాచితి వనుజుప్రాణములఁ బడసి, తింక నీఋణ మెన్నఁ డే నెట్లు దీర్తు.

1781


వ.

అనునయ్యవసరంబున భానునందనుండు సుషేణున కి ట్లనియె.

1782


తే.

ఎలమి సొంపార భూధర మెక్కి నీవు, నామహౌషధివల్లరి యరసి తెచ్చి
దాన సౌమిత్రి బ్రతికింపు తడయ కిపుడు, కౌతుకామృతపూరంబు గడలుకొనఁగ.

1783

విశల్యకరణిచే లక్ష్మణుండు పునర్జీవితుఁ డగుట

చ.

అనిన సుషేణుఁ డంతఁ బ్లవగావలి తోఁ జనుదేర సత్వరం
బున మణిజాలహాటకవిభూషితసానుతలంబు సాలచం
దనసహకారసుందరముఁ దామరసాంకసరోవిరాజితం
బును రమణీయశృంగ మగు భూధరరత్నము నెక్కి యి ట్లనున్.

1784


సీ.

ఇచట నింద్రుండు దిగీశులతోఁ గూడి, లోలుఁ డై యమృతంబు గ్రోలు వేడ్క
నిక్కడఁ ద్రైలోక్యహితముగా రాహువు, తల చక్రమునఁ ద్రుంచె దానవారి
చెలువంబు లగుమహాజీవనౌషధతతు, లిచ్చోటఁ గల వని యచ్చుపడఁగ
వానరావలి కెల్ల వరుసతోఁ జూపుచుఁ, జతురుండు గాంచె విశల్యకరణి
యనువుతోడుత నది పుచ్చుకొని మహీధ, రావతరణంబు వేగ సమాచరించి
ఘనతరస్థితి సంప్రయోగంబు సేయ, నాక్షణంబునఁ జూడ నృత్యద్భుతముగ.

1785


క.

గతవేదనుఁ డై సుప్తో, త్థితునిక్రియన్ లక్ష్మణుండు దెలిసి సముజ్జీ
వితుఁ డై గ్రక్కున లేచెం, బతిమనమున సంతసంబు పరువడిఁ బెరుఁగన్.

1786


మ.

అమితప్రాభవ మొప్ప నేఁగి నిరపాయప్రౌఢితో సర్వవి
ఘ్నములున్ లావున నిర్వహించి ఘనదోర్గర్వంబు నిండార న
శ్రముఁడై యేలినవానికార్యము లుదారస్ఫూర్తితోఁ దీర్చె ను
త్తముఁ డీమారుతి యంచు వానరులు మోదం బంది యగ్గింపఁగన్.

1787

మ.

ధరణీకాంతుఁడు రాముఁ డత్తఱి సముద్యత్కౌతుకాయత్తుఁ డై
పరమానంద[21]రసామృతంబుకరణిన్ బాష్పాంబువుల్ గన్నులం
దొరఁగంగాఁ బులకాళికంచుకితగాత్రుం డై నరేంద్రుండు సో
దరునిం గౌఁగిటఁ జేర్చె నిత్యసహజార్ధస్నేహభూయిష్ఠుఁ డై.

1788


చ.

అమలచరిత్ర సంభృతదయారసపూర్ణ సుషేణ నీప్రసా
దమున సహోదరుం బడసి ధన్యుఁడ నైతి సుదుష్కరోపకా
రము గలనీకు నేమియుఁ దిరంబుగఁ బ్రత్యుపకారపూరణ
క్రమ మది నాకుఁ దోఁప దది గల్గునె యేమిట నిర్వహింపఁగన్.

1789


వ.

అనియె నంతఁ గపివీరులు గౌతుకాయత్తాంతరంగు లై రామలక్ష్మణసుగ్రీవాను
మతంబునఁ దన్మహీధరారోహణం బాచరించి బహువిధమణిశృంగంబులు గనుం
గొనుచు నతిమధురమధురసంబులు గ్రోలుచు నభౌమరుచిభూమరుచిరఫలరసంబు
లాస్వాదించుచు నమృతసోదరంబు లగుపానీయంబులు ద్రావి విగతశల్యక్షతవే
దను లై క్రమ్మఱి యవతరించి రంత రాఘవుం డమానుషతేజుం డగుపవమాన
తనూజున కి ట్లనియె.

1790


తే.

తొల్లి యుండినచోటనె ద్రోణశైల, మునిచి రమ్ము రయంబున ననుడు నట్ల
కాక యని యాగిరీంద్రంబు గడఁకఁ గొనుచు, నంబరంబున నురపడి నరుగునపుడు.

1791

స్థూలజంఘాదిరాక్షసులతో హనుమంతుఁడు యుద్ధము సేయుట

క.

రాక్షసులు వాయునందను, వీక్షించి యుదగ్రరోషవివశాత్మకు లై
రక్షఃపతి కెఱిఁగించిన, నాక్షణమున దశముఖుండు నతిరభసమునన్.

1792


వ.

స్థూలజంఘమహానాదమహాదంష్ట్రమహోరస్కోల్కాముఖమహావీర్యచతుర్వ
క్త్రశంఖకర్ణహస్తికర్ణమేఘవర్ణచిత్రాదు లగునక్తంచరులఁ బెక్కండ్ర నియో
గించి మీర లిందఱుం జని యప్పవమానతనయుఁ బట్టుకొని యతనిచేత శైలం
బు సాగరంబునఁ బడ వైపింపుఁ డొండెఁ గా దేని వానిఁ దెగటార్చి జనుదెం డని ని
యోగించి యెవ్వండేని నిట్టిపరాక్రమంబు సేయు నతనికి నర్ధరాజ్యం బొసంగుదు
నిది యమోఘం బనిన వారలు ననేకవరూధినీసహస్రంబులతోఁ గదలి నానాప్ర
హరణపాణు లయి దేవాసురరూపంబులు దాల్చి కదిసి యురవడిం దాఁకి జీమూ
తంబులు శైలంబుఁ బొదువు పగిదిఁ బొదివి యాగ్రహంబున నహంకారహుంకా
రంబు లులియ నార్చి యి ట్లనిరి.

1793


మ.

ప్రవరానేకమహాస్త్రదుర్ణయభుజప్రఖ్యాతులన్ దేవదా
నవులన్ శూరుల మమ్ముఁ గైకొన కనూనస్ఫూర్తితోఁ గొండ గొం
చవలీలం జన నెట్లు వచ్చు నవివేకాయత్తచిత్తుండ వై
దివి నిం కెక్కడి కేఁగ శక్యము మదాంధీభూతదుష్టాశయా.

1794

మ.

అనినం బావని వారి కి ట్లనియె స్వాహంకారుఁ డై మిమ్ముఁ గై
కొనఁగా నెంతటివారు గర్వమునఁ బెక్కుల్ వల్కఁగా నేల యే
పున నాముందట నిల్చి మీకు మెయిమైఁ బో వచ్చునే యంచుఁ బెం
చె నుదగ్రం బగువాల ముద్ధత మహాకర్చిస్తోమభీమంబుగన్.

1795


ఉ.

వాసుకిభోగభీకరము వాసవదంతికరోపమంబు వి
త్రాసితభూతమండలము దర్పితదానవగర్వదారణో
ల్లాసము ధూమకేతనవిలాసము నిత్యసముల్లసజ్జయా
వాసము నైనవాయుసుతువాల ముదగ్రతఁ బేర్చె నెంతయున్.

1796


సీ.

శూలిఫాలానలాభీల మై మండుచు, నురవడిఁ గొందఱ నొగి దహించి
కాలదండాతికరాళ మై యడరుచుఁ, గ్రూరతఁ గొందఱఁ బారిసమరి
హాలాహలచ్ఛటోత్తాల మై పెరుగుచు, నేపునఁ గొందఱ రూపుమాపి
వ్యాళోగ్రమృత్యుపాశావార్య మై చేరి, సొలవక కొండఱఁ జుట్టి తాచి
కఠిననిర్ఘాతసంఘాతఘాతజాత, వేదనాపాదనాసూనవిదిత మగుచుఁ
జక్రిచక్రక్రమక్రియావక్రగతుల, వాయునందనువాలంబు వాలె నిట్లు.

1797


శా.

అంధీభూతము లయ్యె భూతములు ద్రాసాయత్తచేతస్కు లై
గంధర్వుల్ గలఁగంగఁ బాఱిరి కులగ్రావంబు లల్లాడె ది
గ్బంధంబుల్ శిథిలత్వ మొందె వసుధాభాగంబు గంపించెఁ బ్రా
క్సంధానంబులు దప్పె లోకముల కుత్సాదంబు సంధిల్లఁగన్.

1798


క.

పదములఁ దన్నుచు గర్జా, స్పదహుంకారముల బడలుపఱుచుచు నత్యు
న్మదమున మూర్ఛల ముంచుచు, నదయతఁ బోనీక పొదివి యదటడఁచె వెసన్.

1799


తే.

వచ్చి పొదివిన యాసురవారిదములు, వేయివిధముల నెల్లెడ విరియఁ బాఱ
భూరిబలుఁ డైనపవమానపుత్రుఁ డొప్పె, భాసురద్యుతిశారదభానుఁ డనఁగ.

1800


చ.

విజయముఁ బొంది విష్ణుపదవీథి నిరావరణప్రసన్నుఁ డై
నిజతనుకాంతి యెల్లెడల నిండఁ గళాపరిణాహశాలి యై
రజనికరుండుఁబోలె నభిరామదరస్మితపూర్ణచంద్రికల్
రజనీచరాస్యపద్మనికరంబులయుల్లసనంబు దూలఁగన్.

1801


క.

పోవుచు నానందితుఁ డగు, పావనిపై సిద్ధగణసుపర్వులు గురుసం
భావనలఁ బుష్పవర్షము, వావిరిగాఁ గురిసి రంబువాహములగతిన్.

1802


ఉ.

మానితవేగుఁ డైనపవమానతనూజ్యుఁ వీతఖేదుఁ డై
మానుగ ద్రోణశైల మసమాననిరూఢి దలిర్పఁ బ్రాక్తన
స్థానమునందు నిల్పి రఘుచంద్రునియొద్దకు వచ్చె నుల్లస
న్మానసవేగుఁడో యన నమానుషదైవికసత్త్వసంపదన్.

1803


క.

మనుజపతికి సౌమిత్రికి, నినసుతునకుఁ గ్రమముతోడ నెరఁగి వినతుఁ డై

తనపూర్వవృత్త మెల్లను, వినిపించెం గపివరుండు వేడుక యొదవన్.

1804


వ.

తదనంతరంబ రామసౌమిత్రిరవితనయులు తదీయప్రసంగంబు లాకర్ణించి విస్మ
యం బంది యిది యనన్యసుకరంబు నీక చేయంబోలు నింతియ యని హర్షో
త్కర్షపులకితశరీరు లయి యతని నుపగూహనంబుల సంభావించిన నుబ్బి కానన
చరు లందఱుం దములోనఁ బరస్పరాలింగనసుఖంబు లనుభవించి హనుమత్సు
షేణుల నగ్గించి లంకాపురసౌధజాలంబులం బ్రతిధ్వను లెగయ సింహనాదం
బులు సేసి చెలంగుచుండునాసమయంబున.

1805


చ.

వెలయఁ గలాఢ్యుఁ డైనశశి వేడుకఁ జేయురతోత్సవంబునన్
లలితరుచిస్ఫురద్గగనకలక్ష్మిమనోహరహారమౌక్తికం
బులక్రియ నున్నతారకలు పూర్వసురాధిపుభాగ్యచిహ్నముల్
దొలఁగినమాడ్కి దృష్టిపథదూరము లయ్యె గ్రమక్రమంబునన్.

1806


చ.

ఘనతరదానకర్దమితగండమతంగకల్సు లై మహా
స్వనగళదంబుసాంద్రతరవారిదబృందముఁ బోలుచున్నయ
ద్దనుజులశౌర్యసాహసమదస్ఫుట[22]సంతమసంబుతోన యేఁ
గె నతిభృశాంధకారము వికీర్ణతరం బయి యెల్లదిక్కులన్.

1807


చ.

కమలము లొప్పె వానరనికాయముఖాంబుజరాజితోన య
క్కుముదగణంబు పెంపఱిగె ఘోరనిశాటమనంబుతోన ఘూ
కములముదంబు దూలె దశకంఠసముద్ధతితోన చక్రవా
కము లనురాగ మొందె నధికంబుగ రాముసముద్యమంబుతోన్.

1808


సీ.

ఘనతమిస్రోన్మత్తకరిరక్తజలములఁ, జెలువారఁ దోఁగినసింహ మనఁగఁ
బూర్వపయోరాశిపొందున నుండక, వచ్చు బాడబమహావహ్ని యనఁగఁ
బ్రథమాద్రిశృంగంబుపైఁ దెచ్చి పెట్టిన, ఘనపదరాగైకకలశ మనఁగఁ
బ్రాచీవధూకరపల్లవతలమునఁ, గొమరారువిద్రుమగుచ్ఛ మనఁగ
భానుఁ డుదయించె రాఘవమానవాధి, పతిమనోరథపరిపక్వఫల మనంగ
భూరితేజంబు వెలుఁగంగ భువనభవన, తిమిరహతిఁ జేయఁజాలినదీప మనఁగ.

1809


వ.

అంతఁ గాల్యకరణీయంబు లగుసద్విధులు నిర్వర్తించి.

1810


ఉ.

మందరశైలధీరుఁ డసమానగభీరగుణాంబురాశి ని
ష్యందిసుధారసామలదయాపరిపూర్ణవిలోచనుండు సా
నంద[23]మనోహరుండు ఘననవ్యముఖేందువిలాసుఁ డై దశ
స్యందననందనుండు ప్రియ మారఁగ లక్ష్మణుతోడ ని ట్లనున్.

1811


ఉ.

ఈసునఁ జేసి దానవకులేశుఁడు భీకరశక్తి వైవ ను
ల్లాసము దక్కీ లావు వికలత్వము నొందఁగ నేల వ్రాలి ని

శ్వాసము పెంపునుం దఱిఁగి సంచలనాదులు దప్పి నీవు నేఁ
జేసిన యిట్టిభాగ్యమున జీవము నొందితివయ్య క్రమ్మఱన్.

1812


ఆ.

నాకు నీవు లేని నగరంబు రాజ్యంబు, సుఖము జయము భూమిసుతయు బ్రదుకు
నేమి కార్యమునకు సౌమిత్రి నావుడు, మ్రొక్కి పలికెఁ గేలు మొగిచి యతఁడు.

1813


మ.

అనఘా నీ కిటు లానతీఁ దగునె బాహాసత్త్వతేజఃప్రభా
వనిరూఢత్వము లుండ దీనునిగతిన్ వర్తింతురే దండకా
వనభూమిన్ మును నీవు సన్మునుల విశ్వాసంబుతోఁ బల్కి స
జ్జనసంఘంబులు మెచ్చఁ జేసిన ప్రతిజ్ఞల్ విస్మృతిం బొందునే.

1814


క.

ధరణిని గృతప్రతిజ్ఞా, పరిపాలనదక్షుఁ డెందుఁ బరమోత్కృష్టుం
డరయంగ నిదియ ధర్మువు, పురుషునకుఁ బరిగణింప భూరిప్రౌఢిన్.

1815


క.

శరణాగతపరిపాలన, పరమవ్రతపరుఁడ వనుచుఁ బాటించి భవ
చ్చరణములు గన్నశుభతర, చరితు విభీషణుని మఱవఁ జనునె నరేంద్రా.

1816


చ.

ఇనుఁ డపరాద్రికూటమున కేఁగక మున్న యెదిర్చి చంపు మ
ద్దనుజుని నాఁడు నీయెదురఁ దార్క్ష్యనిఁ జెందుభుజంగమంబుచా
డ్పున మృగరాజుఁ జేరుకరిఁ బోలుచు నుద్ధతహేతిపావకం
బునఁ బడి కాలు నాశలభకపోతముభంగి నశించు గ్రక్కునన్.

1817


తే.

కమలమిత్రుండు కరములఁ దిమిర మడఁచు, పోల్కి శరముల రావణుఁ బొదివి చంపు
మాజిఁ బడి యున్నయాతనియాననములు, సూడ వేడుక యయ్యెడు శూరతిలక.

1818


క.

తమ్ముఁడు సెప్పినవచనము, లిమ్మెయి నంగీకరించి హృదయములోనన్
సమ్మదము నొంది ఘనసమ, రమ్మున కుద్యుక్తుఁ డయ్యె రాఘవుఁ డంతన్.

1819


వ.

దశముఖుండును రాఘవునధ్యవసాయంబు సర్వంబు నెఱింగి పవననందనుప్రభా
వంబు దలపోసి డెందంబు దల్లడిల్లం బరాక్రమశౌర్యసాహసక్రమంబులు దిగనా
డి కులగురుండును నీతిశాస్త్రనిర్ణయకుశలుండును బరమమాయోపాయవేదియు
నగుశుక్రుసమీపంబున కేతెంచి దైన్యరసంబు మొగంబుల నిండి దైవాఱ సా
ష్టాంగనమస్కృతు లొనర్చి దశనిటలతటసంఘటితదశకరపుటుం డై గద్గదస్వరం
బున ని ట్లనియె.

1820

రావణుఁడు శుక్రాచార్యులతో యోచించుట

సీ.

లంకాపురంబుపై శంక యింతయు లేక, భానుజాదికపీంద్రసేనతోడ
విడిసి లగ్గలుపట్టి విడువక పోరుచు, సుతుల సోదరులను హితుల భటుల
నందఱ సమయించె నతిదుర్నివారుఁ డై, రణమహోగ్రుం డైన రాఘవుండు
విచ్చలవిడి మండువచిచ్చులోపలఁ బడు, మిడుతలఁ బోలుచు మిడుక లేక

యతనిబాణాగ్నిమంటల నడఁగిచనిరి, కుంజరంబులు రథములు ఘోటకములుఁ
గాల్బలంబులు నానాఁటఁ గలయఁబొలిసెఁ, జొచ్చి యొకఁడును బ్రదికినచొప్పు లేదు.

1821


క.

ఏచందంబున బ్రదుకుదు, నేచొప్పున నడుచువాఁడ నెఱిఁగింపు తగన్
నీచెప్పినట్ల చేసెద, నీచే మద్రాజ్యపదము నిలుచు మహాత్మా.

1822


వ.

అనిన శుక్రుం డిట్లనియె.

1823


మ.

సమరక్షోణితలంబునందుఁ బగఱన్ సాధింపఁగా దివ్యమం
త్రములుం దంత్రములు మహౌషధులు దథ్యం బార నుండంగ నీ
కు మనస్తాప మి దేల యేఁ గలుగ రక్షోనాథ నీ శత్రుసం
మము ప్రాణంబులు దాల్చి యాజి నిలువంగా నోపునే చెప్పుమా.

1824


చ.

ఉరుతర మైనధైర్యమున హోమము నీకు నపేతవిఘ్న మై
జరిగిన దివ్యఖడ్గశరచాపరథాశ్వములున్ మణిప్రభా
గురుతరవిస్ఫురత్కవచకుండలముల్ ప్రభవించు నగ్నిలో
నరుదుగ వానిఁ దాల్చి విమతాలి జయించెద వీవు నాజిలోన్.

1825


క.

కొను మీవరమంత్రంబులఁ, జను మింటికి హోమవిధియుఁ జలుపు మనిన న
ద్దనుజపతి వానిఁ గొని పురి, కనురాగం బొదవ వచ్చె నతిరభసమునన్.

1826


క.

నలి నగరవరణదుర్గం, బులు జతనము సేసి దనుజబృందమ్ముల ని
మ్ముల నుండఁ బనిచి తలుపులు, బలుపుగఁ బెట్టించి దెసలు పరికించి వెసన్.

1827


శా.

ఉద్యత్సత్త్వతృణీకృతత్రిదశు మాయోపాయరూఢక్రియా
మాద్యత్సాహసు నంతకప్రతిము దుర్మానాంధు నస్త్రైకసం
పద్యుక్తుం జతురంగచక్రసహితున్ బాహోద్ధతుం జేరువన్
విద్యుజ్జిహ్వుని నుంచె హోమవిధినిర్విఘ్నత్వసాకాంక్షుఁ డై.

1828

రావణుఁడు పాతాళహోమము చేయుట

వ.

స్నానాదికక్రియలు నిర్వర్తించి పాతాళంబుఁబోని గుహాగర్భంబు మృత్యుముఖగ
హ్వరంబు సొచ్చుక్రియం బ్రవేశించి రక్తస్రగనులేపనపటాలంకృతుం డై గంధ
కుసుమాక్షతార్చిత యైనవేదికయందు యథావిధి ననలంబు ప్రతిష్ఠించి హో
మీయంబు లగుపాత్రలు సంస్కరించి తత్సమీపంబున నస్త్రపరిధులు సేర్చి బి
ల్వభల్లాతకకరంజంబులసమిధలుఁ దత్ఫలంబులును సర్షపాగురుగుగ్గులుదూర్వలు
ను దధిమధుఘృతరక్తసురలును బ్రవాళపాయసదర్భలును గాకగృద్ధకంకశ్యేన
కురరభల్లసర్పంబులును ఛాగమీనమకరకచ్ఛపమేషంబులును ధాతురసంబు
లును గర్పూరకుంకుమచందనకుసుమంబులును గేశంబులును వేల్చుచు నిశ్చల
నియమంబున హోమంబు సేయునంత.

1829


శా.

పాతాళోపమగహ్వరాంతరమునం బైపై మహాధూమసం
ఘాతంబుల్ ప్రభవించి భీషణభుజంగస్తోమదృప్యద్విష

వ్రాతాసూనము లై యుగాంతజలదారంభంబు లై విస్ఫుర
ద్వాతోద్ధూతము లై నభంబు గలయన్ వ్యాపించె భీమంబుగన్.

1830


ఉ.

ఓలిన ధూమమండలము లుగ్రతఁ బేర్చి నభంబుఁ గప్పెఁ బా
తాళములోననుండి సముదగ్రత వచ్చి రవిం దమోఘ్ను నా
భీలత నొక్కమైఁ బొదువుభీకరసంతమసంబులో యనం
గాలకరాళగాత్రలయకాళిశిరోరుహసోదరంబు లై.

1831


చ.

అలఁగిరి సేంద్రదిక్పతు లృహంకృతి దప్పిరి సిద్ధచారణుల్
గలఁగిరి యక్షకిన్నరులు గంపము నొందిరి నందనౌకసుల్
నలఁగిరి దివ్యకామినులు నాశముఁ బొందిరి ఖేచరేంద్రులుం
దలఁగిరి సన్మునీశ్వరులు దల్లడ మందిరి వానరేశులున్.

1832


క.

ఆసమయంబునఁ గడుసం, త్రాసమున విభీషణుండు దశముఖుహోమో
ల్లాసితధూమంబులు గని, కౌసల్యాతనయుఁ బల్కెఁ గడురభసమునన్.

1833


సీ.

నినుఁ బోరిలోపల నిర్వహింపఁగ లేక, తద్దయు విముఖుఁ డై దశముఖుండు
తివిరి యాశుక్రోపకదిష్టమార్గంబున, విజయార్థి యై యదె వేల్చుచున్న
వాఁడు చూచితె నభోవలయంబు పటుధూమ, బహుళకదంబకపిహిత మగుచు
నున్న దిప్పుడు మహాహోమంబు నిర్విఘ్న, మై యథావిధిఁ బూర్ణ మయ్యెనేని
కులిశచక్రపినాకహస్తులకు నైన, దుర్జయుం డగుఁ గావునఁ దొడరి వేగ
మతనితద్విధి కంతరాయంబు సేయఁ, బనుపు వానరవీరుల బరవసమున.

1834


వ.

అనిన మనుకులకేతనుండు పవనసుతగంధమాదనాంగదమైందద్వివిదపనసశంభ
తారగజగవాక్షగవయవినతధూమ్రజ్యోతిర్ముఖనలనీలశతవలిక్రోధనకుముదవేగ
దర్శిగోముఖప్రముఖు లయిన మహాబలీముఖవీరులఁ బదికోట్ల నియోగించిన వా
రు పాదపపాషాణపర్వతపాణులై వియన్మార్గంబున నరిగి లంక సొచ్చి ఘూర్ణమా
నార్ణవోదీర్ణు లయి గర్జత్పర్జన్యసమూర్జితులై సింహనాదంబుల దిక్కులు పిక్క
టిల్లం జద లద్రువం బుడమి బడలువడం దఱిమి.

1835


మ.

నగసంకాశమహాశరీరులు మరున్నాగోపముల్ వానరుల్
నగరోపాంతము సేరి రక్షకుల నున్మార్గంబునం గూల్చి బి
ట్టుగ దౌవారికుల వధించి సమరాటోపంబునన్ బాహుగ
ర్వగరిష్ఠాసురభంజనోత్సవకృతవ్యాపారపారీణు లై.

1836


సీ.

పృథుశాలలం దున్నరథముల నేలతో, విఱుగంగ నురవడి వ్రేయువారు
విపులగేహస్థితద్విపరాజకుంభముల్, పొరిఁబొరిఁ బగులంగఁ బొడుచువారు
మందురావలి సొచ్చి మహితాశ్వములఁ బట్టి, చదియంగ నేలతోఁ జఱచువారు
నాయుధాలయముల కతిరయంబున నేఁగి, వివిధాస్త్రవితతులు విఱుచువారు
భాండగృహములలో నున్నబహుధనములు, సరకు సేయక మొగిఁ బాఱఁజల్లువారు

గొలఁది కెక్కిన సౌధముల్ గోపురములు, ధరణిపైఁ బడ వేడుకఁ దాఁచువారు.

1837


ఉ.

రావణుఁ బట్టి తెం డనుచు రాక్షసులన్ వడి మోఁదువారు దు
ర్భావుఁడు వానిఁ జూపుఁ డని బాధలఁ బెట్టెడువారు వాఁడు నే
ఠావున నున్నవాఁడొ ప్రకుటంబుగ మా కెఱిఁగింపుఁ డంచు బా
హావరశక్తియుక్తులు వనాటులు విక్రమలీల సల్పఁగన్.

1838


చ.

తలకుచు నాండ్రు బిడ్డలును దద్దయు నేడ్వఁగ నిండ్లు చొచ్చి యి
ట్టలముగ దైత్యవీరులఁ గడంగి వడిన్ వెడలంగ నీడ్చి త
ల్లులు వగ నొంది కుందఁ దలలుం జరణంబులుఁ గూడఁబట్టి భూ
తలమున వేసి చంపి రతిదారుణచేష్టితు లైనవానరుల్.

1839


లయవిభాతి.

కడలుకొనురౌద్రమునఁ గడఁగి సమరోత్సవము లెడపడక యుండ నొగి నడుముకొని శక్తిం
దడఁబడక పేర్చి వడి నడుగు లిడువేగమునఁ బుడమి పెనువ్రయ్య లయి బడలువడి క్రుంగన్
జడిసి చనురక్కసుల నొడిసి వెసఁ బట్టుకొని నడుము లగలం జఱిచి తొడరి తల లూడం
బొడిచి పెనునెత్తురులు మడువులుగఁ బాఱఁగను బెడిదముగ వానరులు సుడివడక పోరన్.

1840


ఉ.

భీతకరీంద్రదీనతరబృంహితనాదములం దురంగమ
వ్రాతవికీర్ణహేషితవిరావములన్ శిశువృద్ధకామినీ
జాతనితాంతరోదనవిసర్పిరవంబుల దుఃఖవిక్రియో
పేతము గాఁగ లంక వడి నేడ్చుచు నున్నదివోలె నుండఁగన్.

1841


తే.

సురిఁగి భయమున గొందులు సొచ్చువారు, నెగిచి పఱతేర సందుల కేఁగువారు
నరుగ వానరు లెదురైనఁ దెరలువారు, నైరి దితిజులు మద మఱి యంతనంత.

1842


చ.

పతిహిత మాచరింప నతిభవ్య విభీషణుభార్య సాధుస
మ్మతసుచరిత్ర యాసరము మానుగ వే చనుదెంచి యెంతయుం
జతురత వాలిసూనునకు సమ్మతిగాఁ గరసంజ్ఞఁ జూపె న
ద్దితిజుఁడు వేల్చుగహ్వరము ధీరులు వానరు లుత్సహింపఁగన్.

1843

అంగదాదివానరులు రావణుహోమము చెఱుచుట

వ.

అంగదుండును సమ్మదసంరంభరోషంబులు ముప్పిరిగొన రావణుం డున్నగుహా
ద్వారంబు నేర వచ్చి.

1844


క.

ఆవాకిట నున్నఘన, గ్రావం బవలీల నుగ్గు గాఁ దన్ని మహా
రావంబు సెలఁగ లోపలి, కావాలితనూజుఁ డేఁగి యంతటిమీఁదన్.

1845


ఉ.

రావణుఁ గాంచె నం దురుతరస్ఫుటసాయకజాలవిద్రుతై

రావణు సిద్ధఖేచరసురప్రమదాజనగర్భగోళవి
స్రావణు సద్భుజాతులితరాజతశైలవిభక్తశక్తివి
ద్రావణు లోకపాలకనిరాకరణప్రవణైకరావణున్.

1846


క.

ఘనుఁ డైనరామచంద్రుని, పనుపున జయభద్రుఁ డింద్రభంజనుఁ గదిసెన్
మును హరుఁడు దక్షునొద్దకుఁ, బనిచిన వడి నరుగువీరభద్రుఁడపోలెన్.

1847


వ.

అంత.

1848


క.

దనుజాధిపుఁ బొడగంటిని, జనుదెం డని యతఁడు పిల్వ సంరంభముతో
ననిలసుతుఁ గూడి చొచ్చిరి, వనచరు లాగహ్వరంబు వసుమతి వడఁకన్.

1849


క.

గుహ గాచియున్నదనుజులఁ, బహుభంగుల బారిసమరి ప్లవగులు బాహా
బహుమానంబునఁ బేర్చిరి, మహనీయజయాభిరామమహిమాస్పదు లై.

1850


వ.

అంత నంగదాదులు గూడి యొంటిమెయి హోమంబు సేయుభీమాసురనా
థునకుఁ దోడు వేల్చువారపోలెఁ దిరిగివచ్చి యున్నసమిధలును బరిధులును
గలశంబులును గరిమకరహయసృగాలకృకవారుకుర్కురోష్ట్రమస్తకంబులును
దధిరుధిరఘృతక్షీరపాత్రలును ననలకుండంబున వైచి వెఱచఱిచి యఱవం బొది
వి పట్టి కట్టి పరిచారకులను నంద పడవైచి దశముఖుచేతిస్రుక్స్రువంబులు పు
చ్చి పాఱవైచి తలప్రహారముష్టిఘట్టనంబులు సేయ నచలుం డై యచలంబుఁ
బోలె నున్నం గని కినిసి యంగదుఁ డంతఃపురంబున కరిగి.

1851


సీ.

కిసలయవిన్యస్తకేతకీద్యుతి దోఁపఁ, జేతిపైఁ బలుచనిచెక్కు సేర్చి
కమలదళోపాంతగళితహిమంబు నాఁ, గనుఁగవ బాష్పముల్ గడలుకొనఁగ
నుపరక్తుఁ డై యున్నయుడురాజుక్రియ మోము, చెలువంపునిగ్గులు దొలఁగిపోవ
వేఁడియూర్పులచేతఁ బోఁడిమి చెడి యున్న, లలితోష్ఠరుచిరపల్లవము వాడ
వగలఁ గందినడెందంబు వడఁకు దెల్పు, హారవల్లరి పలుమఱు నదరుచుండ
విరులదండలఁ బెనఁగొన్నవిపులకేశ, పాశ మంసస్థలంబునఁ బర్వి తూల.

1852


క.

వెర వేది చిన్నఁబోయిన, తరుణులు దను బలసియుండ దద్దయు దుఃఖా
తుర యగుమందోదరి సుర, వరవైరివధూటిఁ గాంచె వాలిసుతుండున్.

1853


వ.

కని కదియంబోవునప్పు డజ్జోటి యచ్చటినిశాటీగణంబులతో నిట్లని చెప్పి వగచుచు.

1854


చ.

కలనను గుంభకర్ణముఖగర్వితవీరసహోదరాలియుం
బొలిసె సురేంద్రజిత్ప్రముఖపుత్రులుఁ గూలిరి బంధుకోటి భృ
త్యులుఁ దెగటాఱి రింక మఱి యొక్కఁడ తక్కి దశాననుండు జం
జలమున రాము గెల్తు నని సంగరలీలకుఁ గాలు ద్రవ్వెడిన్.

1855


క.

అనిలోన రామచంద్రునిఁ, దనతరమే గెలువ నింక దశముఖుఁ డకటా
మన నొల్లఁడు మనుజేంద్రుం, డనయ మజేయుండు హరిహరరాదుల కయినన్.

1856


మ.

అని శోకించుచు సాంద్రబాష్పపటలవ్యాప్తాస్య యై బంధుకా

మినులుం దానును దాటకాదళనసౌమిత్రిప్రభావంబులన్
ఘనదోర్గర్వబలీముఖేంద్రబలముం గంపంబుతోఁ జెప్పికొం
చును భావిప్రళయంబు చూపుచు భయాస్తోకత్వ ముప్పొంగఁగన్.

1857

అంగదుఁడు రావణునొద్దకు మందోదరి నీడ్చి తెచ్చుట

వ.

ఉన్నయత్తఱి నయ్యంగదుండు సింహంబు కరిణిం బొదువుకైవడి సైంహికే
యుండు సుధాధామమండలిం జేరుపగిదిఁ గదిసి కరివరంబు సశైవాలంబుగాఁ
గమలినిఁ దిగుచుమాడ్కి మందోదరిఁ గచగ్రహణంబు సేసి తివిచిన.

1858


మ.

చెలువం బై చలతారకారుచిలసత్సీమంతముక్తాఫలం
బులు రాలెం గమనీయగాత్రలతికాపుష్పంబులో నాఁగఁ గుం
తలముల్ దూలె ముఖాబ్జభృంగము లనం దన్వంగిరత్నాఢ్యకు
ణ్డలముల్ జాఱె దశాస్యమంగళపరీణామక్రమం బేర్పడన్.

1859


ఉ.

రావణనాశలక్షణపరంపర లేర్పడఁ దెల్పునట్టి యు
ల్కావలి నాఁగ భూషణసమంచితరత్నము లెల్ల డుల్లఁ గం
గ్రేవల సాంజనాశ్రు లపకీర్తిఝరంబులుఁబోలె గ్రమ్మ బా
హావలయంబు లూడి పడె నాసురదోర్బలరూఢులో యనన్.

1860


సీ.

వరునికౌఁలి లేనివగఁ జన్నుగవ బాప్ప, కణములు నాహారమణులు దొరఁగ
దశకంఠవిజయావధానరావముతోన, మణిమేఖలాస్వన మణఁగిపోవ
దనుజేంద్రు చెడుట కేడ్చినభంగి నూపురం, బులు వింతమ్రోఁతతో భూమిఁ బడఁగ
వాసవారాతిగర్వగ్రంధికైవడి, సరవితో నీవియు సడలి జాఱ
దానవాధిపునిలుకడ దప్పినట్లు, పదసరోజయుగము దొట్రుపడుచు నుండ
దితిజనాథునిదర్పంబు దీఱుపగిది, వెలఁది కౌఁదీఁగ యెంతయు నులియ నపుడు.

1861


మ.

దనుజశ్రీఁ దల పట్టి యీడ్చుకరణిం దన్వంగికేశగ్రహం
బొనరం చేయుచు నంగదుఁ డసురకాంతోదీర్ణసంక్రాంతరో
దనరావంబులు నింగి ముట్ట సురకాంతాహర్షనాదంబు లో
లిన తోఁపంగ నలంఘ్యవిక్రమకరాళీభూతరోషంబునన్.

1862


వ.

అరుదెంచి కురరియుంబోలె రోదనంబు సేయుమందోదరి నవిశంకుం డై ముంద
ఱికిఁ దెచ్చి సాట్టహాసావలేపంబుగా లంకావల్లభు నవలోకించి యి ట్లనియె.

1863


శా.

మాయాకృత్యవిశారదుం డయినయామారీచుతోఁ గూడి య
న్యాయప్రక్రమవృత్తిమై వనములోనన్ రాము వంచించి చౌ
ర్యాయానంబున కోర్చి రూఢతరబారహాశక్తి వోనాడి దై
న్యాయత్తుండవ పోలెఁ దెచ్చితివి నీ వాధారుణీనందనన్.

1864


ఉ.

నే నిదె బాహుసత్త్వమువ నిక్కి నిశాచరు లెల్లఁ జూడఁగాఁ
బూని నిరర్గళక్రమవిభూషితవిక్రమసాహనంబుతో

మానిత యైననీమగువ మానుగఁ దెచ్చితిఁ జూడు మిప్పు డో
దానవనాథ చూపు భుజదర్పము లెన్నఁటి కింక డాఁపఁగన్.

1865


వ.

అనియె నంత మందోదరి భయలజ్జాశోకపరాభవరోషపరీత యై రావణున కి ట్లనియె.

1866


మ.

వనభూమిన్ మనువంశరాజతిలకున్ వంచించి యజ్జానకిం
గొని యేతెంచుట యెంతశౌర్య మని నీకుం జెప్పుచందంబునన్
నను నీదైత్యులు సూచుచుండఁగ ననూనస్ఫూర్తితోఁ బట్టి తె
చ్చెను నీయొద్దకు నీవనాటుఁడు భుజస్థేమావలేపంబునన్.

1867


మ.

అని నింద్రాదులఁ జీరికిం గొనక మాయాచాతురీవర్తనం
బున దుస్సాధత నుగ్రసాహసులలోఁ బూర్వాభిగణ్యుండు నా
తనయుం డుండిన నిట్లు సేయఁ దరమే దర్పంబునన్ వీని క
త్యనఘాచారుఁడు దుర్జయుండు నను నీయందాఁక రా నిచ్చునే.

1868


ఉ.

చి చ్చొడిగట్టి తెచ్చుక్రియ సీత నరణ్యములోన నుండఁగాఁ
దెచ్చిన పాప [24]మయ్యదియుఁ ద్రెక్కొని కాల్పక పోవ నిచ్చునే
యిచ్చ వివేకనీతిపథహీనత నార్యహితోపదేశముల్
మెచ్చక యింత చేసితివి మిన్నక పోవు కృతాపరాధముల్.

1869


చ.

కృత మిది కార్య మెల్లఁ బరికించిన సిద్ధియ లేదు గావునన్
గతజలసేతుబంధనముకైవడిఁ జూడ నిరర్థకంబు దీ
నతఁ బగవానిచేఁ బడిన నాదెసఁ జూడవు వీని భస్మసా
త్కృతముగఁ జేయ నేల తమకింపవు రాక్షసలోకనాయకా.

1870


ఉ.

శంక యొకింత లేక త్రిదశద్విషు రావణుకూర్మిసుందరిం
గొంకక వానరుం డొకఁడు గ్రొవ్వున ముందల పట్టి యీడ్చె నీ
లంకకు నేది ది క్కనఁగ లక్షిత మై ఘన మైనదుర్యశః
పంకము నిన్ను ముంచె నుదపానము నేనుఁగు ముంచుచాడ్పునన్.

1871


సీ.

విశ్వాత్ముఁ డీశుండు వెలయంగ నుండుకై, లాసపర్వత మెత్తి వాసి కెక్కి
ధారాళమదదిశాదంతిదంతంబులు, కేలిమైఁ దునుమాడి కీర్తి మించి
పోర నింద్రాదులఁ బో నీక వడిఁ బట్టి, మన్నించి విడిచిన మహిమఁ దనరి
చంద్రహాసాదికసాధనసామగ్రిఁ, బృథులసారంబు లై పెంపు మిగిలి
యుండునీభుజముల వేడ్క లొదవ నర్థిఁ, బారిజాతప్రసూన మింపార ముడువఁ
బడినమామకకుంతలభార మిట్లు, బలిమిఁ గాననచరుచేతఁ బట్టఁబడియె.

1872


ఉ.

మానము లజ్జయున్ విడిచి మందబలంబున హోమనిశ్చల
ధ్యానపరాయణుండ వయి తాపసవృత్తిఁ జరించి రాఘవుం
బూని జయింపఁ గోరు టిది పోలదు తద్ఘనకార్ముకచ్యుతా

నూనశిలీముఖానలమహోగ్రతరార్చులఁ గాలు మేర్పడన్.

1873


క.

మాయలు మంత్రంబులుఁ బని, సేయవు నీ కింక నింద్రజిత్తునితోడం
బోయె నవి యెల్ల విజయో, పాయము హోమమునఁ గలదె పరికింపంగన్.

1874


ఉ.

బాహుబలంబు రామనరపాలునిముందటఁ గొంతసేపు సో
త్సాహతఁ జూపి తత్ప్రదరదారుణపావకకీలలందుఁ బూ
ర్ణాహుతి గమ్ము చయ్యన నుదగ్రత దక్కిన సీత నిచ్చి సం
దేహము మాని పార్థివపతిన్ శరణొందినఁ గాచు నెమ్మెయిన్.

1875


వ.

అనిన విని దశవదనుండు రోషదహనదారుణధూమవిభ్రమంబు లగుభ్రూభం
గంబులు వికటంబు లయి యుండ నభియాతిం గనుంగొని సప్రేమకరుణంబు
లగుచూడ్కుల మందోదరిం జూచి దూరావధూతాహుతి యై మూర్తం బైన
రౌద్రంబుంబోలె సశరీరం బగుభయానకంబు ననుకరించుచుం గరవాలం బంకిం
చి యంగదుభుజాంతరంబు బిట్టు వేసి జీవితేశ్వరి విడిపించిన నదియును వికీ
ర్ణకేశకలాప యై బాష్పధారాసిక్తదుకూలసంశ్లేషవిభక్తగురుపయోధర యై
యేడ్చుచు నంతఃపురంబున కరిగె నిట వాలినందనుండు ప్రహారమూర్ఛాపరాధీ
నుండై వ్రాలిన.

1876


తే.

పొంగి కోపించి పవమానపుత్రుఁ డంత, మదము దూలఁగ రావణుమ స్తకములు
మొనసి వజ్రంబుఁ బోలెడిముష్టిఁ బోడిచెఁ, బొదలి నెత్తురు ధారలై చెదరి పఱవ.

1877


ఆ.

అంతలోనఁ దెలిసి యంగదుఁ డస్రాంబు, ధార లొలుక లేచి ధాతుశైల
మనఁగఁ గోప మడరి యాదైత్యుఁ దలమున, భూరిసత్వ మెడలిపోవ వ్రేసె.

1878


శా.

ఆదైత్యేంద్రుఁ డఖర్వవిక్రమకళాహంకారఘోరాట్టహా
సోదీర్ణధ్వను లుప్పతిల్ల నియమోద్యోగాంతరాయోద్యమ
త్ఖేదుం డై గద వ్రేసె నంగదుని నుద్దీప్యద్బలామ్రేడిత
ప్రాదుర్భావదురంతదుష్ప్రసహశుంభత్సాహసోల్లాసి యై.

1879


క.

బిట్టలిగి సమరకాంక్షం, బుట్టిన యుత్సాహ మొదవఁ బొంగి యసుర దా
నెట్టన డగ్గఱి మారుతు, పట్టిన్ దట్టించి వేసెఁ బటుఖడ్గమునన్.

1880


శా.

ప్రద్యోతప్రతిమప్రతాపవిభవప్రాగల్భ్యసంపన్నతా
విద్యోతుం డగురావణుండు గపులన్ వీక్షించి దర్పంబున
న్ఖద్యోతంబులు గాఁ దలంచి యనమానప్రౌఢశస్త్రావలీ
విద్యాపాటవ మొప్పఁ బోరె సమరోర్వీకంపసంపాది యై.

1881


వ.

ముసలంబున నీలునిఁ బరిఘంబున నలుని నంకుశంబున గజుని శక్తి శతబలిని
ముద్గరంబున మైందునిఁ దోమరంబున ద్వివిదుని గదాఘాతంబున గవాక్షునిఁ
గుంతంబున గంధమాదనుని నొప్పించిన వారును దుర్వారు లై సింహనాదం

సెలంగ నతని ముష్టితలప్రహారపార్ష్ణిఘాతవాలపాతనఖదారణదంతనిపీడ
నాదుల నొప్పించి కృతకృత్యు లై నిజసేనలం గూడుకొని నరపాలుపాలికి వచ్చి
రంత హనుమంతుండు రాఘవునకు మ్రొక్కి ముకుళితకరకమలయుగళుం డై
యి ట్లనియె.

1882


ఉ.

దేవర పంపునం జని యుదీర్ణసముద్ధతి లంక సొచ్చి యా
రావణుహోమకృత్యము నికరాకృతి నొందఁగఁ జేసి దుష్టదై
త్యావలి రూపు మాపి విహితస్థితి నేర్పడ విన్నవింపఁగా
భూవర యేఁగుదెంచితిమి పొల్పుగఁ గర్జము లాన తి మ్మొగిన్.

1883


వ.

అని పలికిన.

1884


క.

రాఘవుఁడు దైత్యుహోమము, మోఘత నొందుటకుఁ జాల మోదించి జయ
శ్లాఘాయుక్తుల నాహవ, లాఘవయుతులం బ్లవంగులం గొనియాడెన్.

1885


వ.

అంత నక్కడ.

1886


మ.

దనుజాధీశుఁడు హోమవిఘ్నమున నుద్యత్త్రాసుఁ డై నిర్వికా
రనిరూఢాకృతి వైరివీరవిజయారంభంబుతో నేఁగి నె
మ్మనమున్ మేనును గందఁ గుందుసుదతిన్ మందోదరిం గాంచి యి
ట్లనియె సాంత్వనపూర్వవిక్రమరసవ్యాపారఘోరంబుగన్.

1887


శా.

నీ వీభంగి మృగాక్షి వందఁ దగునే నే నుండఁగా నుగ్రబా
హావీర్యంబున రామలక్ష్మణులఁ గీశాధీశులన్ జాతవై
రావేశంబునఁ గూల్తుఁ బూర్వకృతకర్మాగ్రానురోధంబునన్
దైవాయత్తము లెన్ని చూడఁ దరమే తప్పింపఁగా నుగ్మలీ.

1888


ఆ.

రణములోన నేఁడు రాఘవుఁ జంపుదు, నొండె నతనిచేత నుగ్రశస్త్ర
నిహతి నొందువాఁడ నిక్కువ మిది యిందు, సందియంబు లేదు చపలనయన.

1889


క.

ననుఁ బోర నతఁడు చంపిన, జనకజ వధియించి నీవు సరభసగతి వై
యనలప్రవేశకృత్యం, బొనరింపుము వేడ్కతోఁ బయోరుహనయనా.

1890


వ.

అనిన వల్లభుపలుకు లాకర్ణించి మందోదరి యి ట్లనియె.

1891

మందోదరి రావణునకు రామునిమహత్త్వము చెప్పుట

మ.

రఘురామున్ రణభూమిలో గెలువఁగా రా కుంట తథ్యం [25]బతం
డఘదూరుండు కడిందివీరుఁడు ప్రభావాఢ్యుండు పూజ్యుండు లో
లఘనాస్త్రక్రమవేది లోకసతతశ్లాఘార్హసచ్చేష్టితుం
డు ఘనప్రాభవదూరితాసురవరాటోపానుభావుం డిలన్.

1892

ఉ.

ఊర్జితభవ్యవిక్రమమహోన్నతుఁ డాయతబాహువైభవో
పార్జితవీరశబ్దుఁ డనపాయబలుండు రఘూద్వహుం డనిన్
నిర్జరసిద్ధయక్షరజనీచరగుహ్యకఖేచరాలికిన్
దుర్జయుఁ డాతనిన్ గెలువ ధూర్జటి యైన నశక్తుఁ డారయన్.

1893


ఉ.

మానమదాతిరేకఘనమత్సరహీనయతీంద్రవిస్ఫుర
న్మాననరాజహంసు నసమానుఁ బరాభవదూరు నూర్జితా
మానజగత్ప్రపూర్ణమహిమస్ఫురణున్ హరి నాదిపూరుషున్
మానవరాజరూపధరు మానవమాత్రునిఁ గాఁ దలంచితే.

1894


మ.

శ్రుతిచోరుం డగుసోమకుండు భువనక్షోభంబు గావించి యా
తతకల్లోలవిలోలవారినిధి నుద్యద్దర్పుఁ డై చొచ్చినం
గృతకోదంచితమత్స్య మై యతఁ డతిక్లేశాత్ము నాక్రవ్యభు
క్పతి మర్దించి తనర్చెఁ దొల్లి నిగమారణ్యానుభావుం డొగిన్.

1895


మ.

భ్రమణామందరయోగ్రమందరగిరిప్రవ్యక్తపాషాణవి
క్రమణాపాకృతపృష్ఠభాసురమహాకండూతివిభ్రాంతుఁ డై
కమఠాకారము దాల్చి మున్ను విలసత్కారుణ్య మేపారఁగా
నమృతం బిచ్చె దయార్ద్రుఁ డై యతఁడు దేవానీకముల్ గ్రోలఁగన్.

1896


మ.

అవలీలన్ రజనీచరాధిపు హిరణ్యాక్షున్ వెసం గూల్చి య
ర్ణవదుర్వారతరాంబుమధ్యమనిమగ్నన్ ధారుణీదేవి ది
వ్యవరాహాకృతి యై యతండు లలితవ్యాపారుఁ డై యెత్తె ను
ద్భవనాశాదివిదూరుఁ డుజ్జ్వలమహాదంష్ట్రాగ్రభాగంబునన్.

1897


సీ.

వికటసటాకోటివిదళితాంభోదుఁ డై, కుటిలాగ్నిమయనేత్రఘోరుఁ డగుచుఁ
జటులనిశ్వాససంచలితకులాద్రి యై, భానుకోటిప్రభాభాసి యగుచు
నఖిలదిక్కూలంకషాయతహస్తుఁ డై, తర్జనగర్జనోదగ్రుఁ డగుచు
నట్టహాసవిదారితాజాండభాండుఁ డై, దివ్యాయుధస్తోమదీప్తుఁ డగుచు
నాతఁ డుగ్రత నరసింహుఁ డై హిరణ్య, కశిపువక్షము ఖరతరకరరుహములఁ
జీరి ప్రహ్లాదు నుత్తమశీలుఁ గాచె, భువనరక్షణశిక్షణప్రవణుఁ డగుచు.

1898


క.

నుతదివ్యమూర్తి ఖర్వా,కృతి యై యాతండు మున్ను కృతకవటుఁడు నం
దితభువనుఁడు నక్తంచర, పతి ముద్యత్సత్యయుక్తు బలి బంధించెన్.

1899


మ.

ప్రవరోదారతరప్రభావసహజప్రాగల్భ్యుఁ డై నిర్ఘృణా
తివినోదంబున జామదగ్న్యుఁ డగుచుం ద్రిస్సప్తకృత్వంబుగా
నవలీలం దునుమాడె హైహయముఖక్ష్మాధీశులన్ భీకరా
హవరంగంబున వజ్రసన్నిభకుఠారాభీలదోస్సారుఁ డై.

1900


తే.

చటులభుజగర్వవిక్రమసాహసమునఁ దఱిమి చేకొన్నధారుణీతలము నెల్ల

విమలతర మైననిస్పృహత్వమునఁ జేసి, భవ్యతముఁ డైనకశ్యపబ్రహ్మ కిచ్చె.

1901


క.

దశకంఠ నిన్నుఁ జంపఁగ, దశదశమఖరక్షణైకతత్పరమతి యై
దశరథసుతుఁ డై పుట్టెను, దశశతకరదీప్తి శౌరి తథ్యము సుమ్మీ.

1902


క.

ఆతనిమహానుభావము, లాతనిభుజయుగళమహిమ లాశౌర్యబల
ఖ్యాతులుఁ దగ వర్ణింపఁగ, నాతరమే పెక్కు లేల నలువకు వశమే.

1903


శా.

విశ్వామిత్రమఖంబు గాచుటకునై వి ల్లంది బాల్యంబునన్
విశ్వామిత్రపథంబు నొందినమహావీర్యోద్ధతం దాటకన్
విశ్వత్రాణము సేయఁ బూని సమరోర్విం గూల్చె లీలాగతిన్
విశ్వాధ్యక్షుఁ డితండు నీ వెఱుఁగవే [26]వీరోత్తమగ్రామణీ.

1904


క.

మారీచుఁ బాఱఁదోలి యు, దారబలుం డగుసుబాహు దర్పోద్ధతునిన్
శూరుని నొక్కటఁ గూల్చెను, బోర నితఁడు పిన్ననాఁడ పృథుబాణమునన్.

1905


క.

క్షణమాత్రలోనఁ గ్రూర, క్షణదాచరవరుల నోర్చి సవనరచితర
క్షణుఁ డయినయితనికి విచ, క్షణుఁడు మునీంద్రుండు దివ్యశరముల నొసఁగెన్.

1906


మ.

జననాథుల్ గురుబాహువీర్యసహితుల్ సజ్యంబుగాఁ జేయఁజా
లనిభూతేశుశరాసనంబు నవలీలం ద్రుంచినన్ మెచ్చి య
జ్జనకుం డాతని కిచ్చె భూమితనయన్ సాధ్వీలలామంబు సీ
త ననూనప్రియపూర్వకంబుగ సమాప్తప్రస్ఫురత్సంధుఁ డై.

1907


చ.

చలమున నిన్నుఁ బట్టి చెఱసాలను జొనిపిన కార్తవీర్యుచే
తులు దునుమాడి కూల్చిన సుదుర్జయు ధూర్జటిశిష్యు భార్గవున్
బలమునఁ జీరికిం గొనక బ్రాహ్మణుఁ డౌటను నొండు సేయఁగాఁ
దలఁపక పుణ్యలోకములు దప్పఁగఁ జేసె నమోఘబాణుఁ డై.

1908


వ.

జనకునియోగంబున నజ్జనకజసౌమిత్రిసహితుం డై వనంబునకుం జనుదెంచి
జటాజినవల్కలధరుం డై యుండి వెండియు దండకాటవియందు.

1909


మహాస్రగ్ధర.

ఘనుఁ డాజిం ద్రుంచె నత్యుత్కటవికటబలాక్రాంతదేవావరోధుం
గనదుగ్రోదారశూలగ్రథితబహువిధాకారసత్త్వానురోధున్
జనితత్రాసాత్యుదంచకజ్జలనిధిజలదస్ఫారనాదావరోధున్
హననప్రోద్యద్విరోధున్ యతిమునిసురనిత్యాపరాధున్ విరాధున్.

1910


మ.

అనపాయప్రథితప్రభావభుజగోద్యద్వాలపాశంబునన్
నిను బంధించి చతుస్సముద్రముల నున్నిద్రస్థితిన్ ముంచి వా
లిననసత్త్వంబున నొంచి వే విడిచి యాలీఢప్రభావక్రమం
బున రూఢుం డగువాలిఁ గూల్చె జవవద్భూమైకబాణంబునన్.

1911


క.

మానవనాథుండు జన, స్థానంబుననుండి బాహుదర్పితుల బలా

నూనుల ఖరదూషణులం, బో నీక వధించి త్రిశిరుపొంక మడంచెన్.

1912


తే.

వాలిఁ బొలియించి కిష్కింధ వానరేంద్రుఁ, గరుణ సుగ్రీవుఁ బట్టంబు గట్టినట్లు
నిన్నుఁ బొలియించి యీలంక నీతిశాలి, యగువిభీషణునకు నిచ్చునవ్విభుండు.

1913


క.

రామునిపరాక్రమము సం, గ్రామోదగ్రతయు వివిధకఘనతరశస్త్ర
గ్రామకుశలతయు నెఱిఁగియు, నేమియొకో యెఱుఁగనేర వే మనవచ్చున్.

914


చ.

శలభగతిన్ రఘూద్వహునిసాయకపావకహేతిరాశిలో
పలఁ బడి కాల నేమిటికి భాసురరాజ్యముతోడ సీత ని
మ్ములఁ దగ నిచ్చి సంసరణమోహము భోగము లెల్ల మాని కా
నల మునివృత్తి నుండుదము నా కిది దోఁచినచొప్పు వల్లభా.

1915


క.

పతితోడ ననుగమించుట, సతికిఁ బరమధర్మ మండ్రు సజ్జనులు దగన్
శ్రుతిచోదితాచరణములు, మతిఁ దలఁచిన నుభయలోకమహితము లెందున్.

1916


తే.

నీవు రణమున నీల్గిన నిక్కువంబు, నాకు నీతోడియనుగమనంబు లేదు
జనకువరమున మరణంబు జరయు నన్నుఁ, జెంద వెన్నఁడు నే నేమి సేయుదాన.

1917


చ.

సరసమనోరథాధిగమశాలి విభీషణుభార్య మైనయా
సరమయు రాముపత్ని యగుజానకియుం దగఁ జెప్పుకృత్యముల్
పరువడిఁ జేయఁగా వలయుఁ బన్నుగ నోప నానంగ రాదు కిం
కరిగతి నుండఁ బా లయితిఁ గర్మఫలంబులు దప్పిపోవునే.

1918


వ.

అనిన విని నిశాచరవల్లభుండు నిజవల్లభ నూరార్చి యి ట్లనియె.

1919


చ.

అనుజుల భృత్యులం బ్రియుల నాత్మజులం దగునట్టిమంత్రులన్
మునుకొని [27]యుద్ధరంగమున ముందటఁ జావఁగఁ ద్రోచి పుచ్చి యే
మని సుఖవృత్తి గోరెద నిరర్గళవిక్రమసాహసంబుపెం
పున రఘురాముతోఁ దొడరి పోరెదఁ గూల్చెద నొండెఁ జచ్చెదన్.

1920


క.

శతమన్యుప్రభృతిహరి, త్పతివిజయప్రథితబాహుబలగర్వితు మ
త్సుతు నింద్రజిత్తుఁ జంపిం, చితి నా కేమిటికి బ్రదుకు చింతింపంగన్.

1921


మ.

సురవిద్యాధరకిన్నరోరగవరస్తోమంబులన్ గెల్చి యు
ద్ధురతన్ సన్మునులన్ వధించి సుమహాదోషాతిరేకంబునం
బరకాంతావలిఁ బట్టి తెచ్చి యెపుడుం బాపంబు గావించునే
వెరవారన్ ముని నైన నవ్వరె రణోర్విన్ భీతి నా కేటికిన్.

1922


క.

నీ వేల నాకు నశ్వర, జీవం బది యేల భోగసిద్ధులు నీలం
కావాస మేల నిశ్చయ, భావితనాశాంగ మేల పంకజవదనా.

1923


సీ.

జంభారిదోస్స్తంభదంభోళిఘాతంబు, దహనుబాహాశక్తితాడనంబు
దండధరోద్దండదండనిపాతంబు, దైత్యేంద్రఖడ్గవిదారణంబుఁ

బాశహస్తోదగ్రపాశబంధంబు స, మీరణకేతనప్రేరణంబు
యక్షనాయకగదావిక్షేపణంబును, హరుశూలహతి నోర్చి యడరు నేను
నన్నుఁ గావు మనుచు నరు నెట్లు వేఁడుదుఁ, దెచ్చినట్టిసీత నిచ్చు టెట్లు
భరితచంద్రహాసబలము గల్గుచునుండ, నింతదీనవృత్తి యేల నాకు.

1924


క.

పరమార్థ మొకటి చెప్పెద, నిరపాయపదైకలబ్ధి నిశ్చితమహిమో
త్తర మైనపొందు పడయఁగ, నరుదుగ నా కిరవు గలిగె నంబుజవదనా.

1925


చ.

ఎఱుఁగుదుఁ బద్మబాంధవకులేశుఁడు పంకజనాభుఁ డౌట యే
నెఱుఁగుదు మున్న యిందిర మహీసుత యై తనరారుసీతగా
నెఱుఁగుదు నాకు రాఘవమహీశునిచేతివధక్రమంబు ని
ట్లెఱిఁగియు ముక్తిఁ బొందఁగ నభీష్టము గల్గుట నింత చేసితిన్.

1926


చ.

ధరణితలేశదివ్యశరదత్తసుదుర్లభముక్తికామినీ
పరిణయమంగళోత్సవము భాగ్యమునం జనుదెంచెఁ గాన య
త్యురుతర మైనయీశుభముహూర్తము తప్పక యుండ నేఁగి నే
నిరతిశయానుభావపదనిశ్చలసుస్థితిఁ బొంది యుండెదన్.

1927


చ.

అమితబలుండు రాఘవుఁడు యాజకుఁడైనఁ దదస్త్రవహ్నిసా
క్ష్యమున మదీయసాంద్రతరకాండశతాహుతు లొప్ప వేల్చి మో
దమునను ముక్తికాంత నిరతంబుగ మంగళలీలఁ బెండ్లి యై
విమలతదీయభోగపదవిశ్రుతసౌఖ్యనిరూఢిఁ బొందెదన్.

1928


వ.

అని సమరసన్నాహవ్యగ్రాయమానచిత్రాభినివేశసంపాదితమోక్షసుఖలీలానుభవ
లాలసుం డై కదలిపోవ సమకట్టి మందోదరిం జూచి మఱియు ని ట్లనియె.

1929


సీ.

కరిరాజుతోఁ బాయుకరిణిచందంబున, గురుమరాళము లేనిసరసిఁబోలె
సుభగభృంగము లేనికచూతమంజరిక్రియ, మిహిరుతోఁ బాయుపద్మిని యనంగ
వరవసంతుఁడు లేని [28]వనలక్ష్మికైవడి, [29]ధృతిఁ దరువును బాయుతీఁగ యనఁగ
హిమధాముఁ జూడనికుముదినిచాడ్పునఁ, బ్రద్యుమ్నుఁ బాసినరతి యనంగఁ
దోయజానన నీవు నాతోడఁ బాసి, పుణ్యమంగళచేష్టితస్ఫురణ దక్కి
యుచితసౌభాగ్యహీనవై యుండు మనిన, నువిద సిగ్గున నూరక యుండె నపుడు.

1930

రావణుఁడు యుద్ధమునకు వెడలుట

వ.

తదనంతరంబ నిజసహచరి వీడ్కొని చరణవిన్యాసంబున ధరణి గ్రక్కదల నుద
గ్రప్రత్యగ్రమహాగ్రహంబున దురవలోకుండై బహిరాస్థానసదనాంతర విన్యస్తమ
హోచ్చతరమణిహేమమయసింహాసనాసీనుం డై రోహిణశైలోపరిగతకాలజీ
మూతంబు ననుకరించుచు గర్జావిభ్రమంబుగా ప్రస్థానభేరి వ్రేయ నాజ్ఞాపింపఁ
దదనంతరంబ.

1931

సీ.

రోదసీకుహరంబు మేదురం బై యుండ, దిగ్గజశ్రేణియు మ్రొగ్గతిలఁగ
ధారుణీచక్రంబు తల్లడ మందంగఁ, బృథుగోత్రశైలముల్ పెల్లగిల్ల
సప్తార్ణవంబులు సరవితో ఘూర్ణిల్ల, దినమణి గతి తప్పి తిరుగఁబడఁగఁ
కొనకొని సురకోటిగుండెలు పగులంగ, శేషాహివీనులు చెవుడుపడఁగఁ
నగలి బ్రహ్మాండభాండంబు పగిలె ననఁగఁ, బ్రళయరుద్రుండు వాయించుపటహ మనఁగఁ
బిడుగు లొక్కట వడి మ్రోయుపెల్లు దోఁప, భీషణంబుగఁ బ్రస్థానభేరి మ్రోసె.

1932


మ.

సమరోల్లాసకుతూహలాదరసమంచద్విక్రమాడంబరా
సమరోషజ్వలనస్ఫులింగలహరీసంఛన్నదిగ్భాగుఁ డై
యమరోత్సాహము దక్క నుద్ధతమహాహంకారగర్జారవ
క్రమరోచిష్ణుఁడు జిష్ణుఁ డుష్ణకిరణభ్రాజిష్ణుతేజంబునన్.

1933


మ.

స్ఫురదుద్యద్దశమస్తకార్పితఖరాంశుప్రఖ్యసన్మౌలిబం
ధురుఁ డై రత్నపరిష్కృతాంగదలసద్దోస్స్తంభుఁ డై దివ్యభా
స్వరకర్ణాభరణాఢ్యుఁ డై రుచివిరాజత్తారతారావలీ
తరళోదంచితతారహారధరుఁ డై దైత్యేంద్రుఁ డొప్పెం గడున్.

1934


చ.

హరి మొద లైనదిక్పతులయాకృతులం దనరారి యున్నయా
బిరుదులఁ గ్రాలుపెండియముఁ బెం పగురత్నమయూఖచారునూ
పురమును వామపాదమునఁ బొల్పు వహింపఁగ సాంధ్యవారిదాం
బరములు దాల్చె రావణుఁడు భాస్వదుదారతరప్రతాపుఁ డై.

1935


వ.

చంద్రహాసప్రాసతోమరఖడ్గభిండివాలశరాసనముసలముద్గరగదాపరిఘపట్టిసశూ
లపరశుకఠారగోణచక్రాదిప్రహరణసమేతబాహుదండంబులు దేజరిల్లఁ దివిరి షో
డశచక్రసంఘటితంబును బటుతరకోటిద్వయఘంటాకలితంబును భల్లూకచర్మ
వర్మసమాచ్ఛాదితపవనజననతురంగసహస్రవాహ్యమానంబును గాలకేతుస
మాఖ్యాకసూతనియమితంబును రాహుశిరశ్చిహ్నితకేతనత్రయవిరాజమానం
బును నగుమహారథంబు వైకుంఠరథారోహణంబు సేయువడువున నారో
హించి రాకానిశాకరమండలోపమానమహనీయాతపవారణదశకంబు దనరం
గమలగర్భవాహనమరాళవిలాసాపహాసిప్రకీర్ణకంబులు వెలయ భేరీపటహఢక్కా
మృదంగకాహళశంఖనినాదంబు లులియఁ గరటిఘటాఘోటకకోటిరథస్తోమ
పదాతివరసహస్రంబులతో వెడలునవసరంబున.

1936


మ.

కదనోత్సాహరసంబు వెల్లివిరియంగా నట్టహాసస్ఫుర
ద్వదనోదగ్రమయూఖవేల్లితమహాదంష్ట్రాకరాళీభవ
ద్వదనోత్తాలవినిర్యదుగ్రదహనజ్వాలాపరీతాభ్రుఁ డై
కదలెన్ వీరుఁడు ఖడ్గరోముఁడు సమగ్రప్రాభవవ్యగ్రతన్.

1937


శా.

అభ్రాంతాహిమధామధాముఁడు యుగాంతాబ్ధిస్వనత్కార్ముకా

దభ్రాహీనభుజాతిభీముఁడు సముద్యద్రత్నభూషాసమూ
హభ్రాజిష్ణుఁడు [30]జిష్ణుఁ దూర్జితబలాహంకారఘోరుండు జ
న్యాభ్రాంతాత్ముఁడు సర్పరోముఁ డసమానారంభుఁ డై యేఁగెఁ దాన్.

1938


చ.

కదలె ననూనవేగరథకాంచనకేతనకాంతిజాలముల్
చదలఁ గ్రమంబుతోఁ బొదల సజ్యశరాసనరత్నహస్తుఁ డై
యుదితతటిన్మహేంద్రధనురూర్జితమేఘముఁబోలె వీరవై
రిదళనకౌతుకం బొదవ వృశ్చికరోముఁడు గర్జితోగ్రుఁ డై.

1939


ఉ.

మండలితోగ్రచాపరుచిమండలనిర్గతసాయకప్రభా
మండలచండసత్త్వుఁ డభిమానధనుండు సువర్ణవిస్ఫుర
త్కుండలమండితుండు పటుదోర్బలశాలి లయోత్థితాగ్నివ
ర్ణుం డగునగ్నివర్ణుఁడు వినోదగతిం గదలెన్ ససైన్యుఁ డై.

1940


క.

హరిసైన్యకాసనంబుల, దరికొని కాల్పంగ వచ్చుకదహనములగతిన్
వరశస్త్రార్చులు గ్రాలఁగ, నరుదెంచి రుదగ్రు లై నిశాటులు పెలుచన్.

1941


క.

తరుచరులుఁ దరులు గిరులును, గురుభూధరశృంగతతులుఁ గొని రణకేళిం
బరిణతమతు లయి తాఁకిరి, ధరణిపరాగంబు లెగసి తరణిం గప్పెన్.

1942


క.

కోలాహలంబు లొప్పఁ గ, రాళగదాకుంతశితపరశ్వథపరిఘా
భీలకరవాలభీషణు, లై లీలం బొడిచి రసురు లాకపికోటిన్.

1943


సీ.

మదసత్త్వరణకర్మమహితమహోత్తుంగ, కుంజరేంద్రముల డీకొలిపికొలిపి
ఖురకోటిపాటితక్షోణితలోద్ధత, ప్రథితాశ్వవరములఁ బఱపి పఱపి
రవిరథాతిశయాళురథనేమినిస్వనో, ద్ధురశతాంగంబులఁ దోలి తొలి
హర్యక్షదుస్సహశౌర్యగుణాకల్ప, ఘనపదాతులఁ బయిఁ జొనిపి చొనిపి
దైత్యనాథులు నలువురు దర్ప మెసఁగ
దిశలుఁ జదలును దూపుల దీటుకొనఁగఁ
గ్రమముతోడుత సింహనాదములు బెరయ
భూరిజవమునఁ గపులతోఁ బోరి రెలమి.

1944


సీ.

కలితలీలాకందుకక్రీడనక్రియ, వరమహీధ్రము లెత్తి వైచి వైచి
తర్జించి ఘనకళాతాడనస్థితి మహా, వృక్షజాతంబుల వ్రేసి వ్రేసి
కులిశసమాఘాతుఘోరారిదుస్సహ, కూర్పరహతులను గూల్చి కూల్చి
నిష్టురనారాచకనిశితోగ్రచటుల దు, ర్వారనఖంబుల వ్రచ్చి వ్రచ్చి
యార్పు లొదవ సమితి నేర్పులు మెఱయుచు
బలముఁ గినుకతోడిచలము మిగులఁ
గపులు పోరి రమరరిపులు భీతిల్లంగ

నడిమి తోడుతోడఁ దఱిమికొనుచు.

1945


వ.

అసిగదాప్రాసతోమరభిండివాలముసలముద్గరపరిఘశూలచక్రశరంబు
లు ప్రయోగించి నొంచియుఁ ద్రుంచియుఁ జించియు వ్రచ్చియు గ్రుచ్చియు వ్రే
సియు నేసియుఁ దలలు దునిమియుఁ గరంబులు నఱికియుఁ జరణంబులు ద్రెంచియుఁ
దొడలు నలంచియు నురంబులు భేదించియు నుదరంబులు చీరియుఁ బ్రక్కలు వ్ర
క్కలు సేసియు నుదగ్రు లగుయాతుధానులపయిం గవిసి మర్కటులును నగంబు
లు గురియించుచు గిరిశృంగంబులు వైచుచు నరదంబులకు లంఘించి బిరుదులు
సెలంగ రథసారధిరథ్యంబు లొక్కటఁ జదియ మోఁదుచు నుప్పరవీథికి దెప్ప
రంబుగా నెగసి సతురంగు లైనరాహుతులు సమయఁ గుప్పించి యుఱుకుచు నర
వాయి గొనక యాధోరణనివహంబుతోన రణపరిణతవారణంబులు సమంబు
గాఁ జదియఁ గొండలు వైచుచు నదల్చి కదల్చి తరునివహంబులం బదాతుల
యుక్కు స్రుక్కించుచు నరదం బరదంబుతోడ వీచివైచి తెగటార్చుచు నేనుఁగు
నేనుఁగుతో వైచి పీనుంగు గావించుచు ఘోటకంబుఁ బట్టి యన్యఘోటకంబు
తోఁ దాటించి కారించుచు సుభటుం బటురయంబునం బట్టి యితరసుభటుతోఁ
జఱచి వధించుచుఁ గఱచియుఁ జఱచియుఁ బొడిచియు నొడిచియు ని ట్లనేకప్ర
కారంబులం బోరు సల్పుచు మఱియును.

1946


చ.

ఉరుతరముష్టిఘాతముల నుగ్రనఖంబుల నోలి దైత్యులం
బొరిఁబొరిఁ గూలఁగాఁ బొడిచి పొంకము దక్కఁగఁ జీరి తన్ని వి
స్ఫురదురువాలపాశములఁ జుట్టి వెసన్ దివి వీచి వైచి ని
ష్ఠురరదనంబులం గఱచి శుంభదుదగ్రతఁ బేర్చి వానరుల్.

1947


చ.

కడిమిమెయిన్ నిశాచరుల గ్రక్కున మింటికి వీచి వైచినం
బిడుగులుఁబోలె నుద్దవిడి బెట్టిదు లై పొలియింపఁ బూని పైఁ
బడఁ జనుదేరఁ జూచి పటుబాహుబలంబునఁ బేర్చి యార్చుచుం
బిడికిటిపాలు సేసి యతిభీమముగా సమయించి రత్తఱిన్.

1948


సీ.

ముదితవానరఘనముష్టిఘాతంబున, నొఱలుచుఁ బడి కూలునురుగజములు
దీప్రకపీంద్రతలప్రహారంబులఁ, గొలఁది మీఱఁగ వ్రాలుఘోటకములుఁ
గుపితహరిక్షిప్రకుధరపాతంబుల, నఱిముఱి యైనశతాంగగణము
నుద్ధతశాఖామృగోద్ధూతతరుహతిఁ, దల లొగిఁ జదియుపదాతిచయముఁ
గలిగియుండియుఁ దఱుఁగనికడఁక పెరుఁగ, సమరకుతుకము మనమున సందడింప
భూపరాగంబు నభమునఁ బొదలి నెరయ, భూపరాగంబు సైఁపక యేపు రేఁగి.

1949


క.

దానవులు గవిసి యురవడి, వానరులన్ లెక్కగొనక వరతరనిశితా
నూనవివిధాస్త్రసంహతి, నోనాటఁగ నేసి రతివినోదస్థితితోన్.

1950


ఆ.

మస్తకములు చిదిమి హస్తముల్ దునుమాడి, పదయుగములు నఱకి ప్రక్కలోలి

ప్రక్కలించి మేను చెక్కి వక్షస్స్థలి, పటుతరాస్త్రతతులఁ బగులనేసి.

1951


వ.

రక్కసులు భీమతరంబుగాఁ బోరునవసరంబున.

1952


ఉ.

దానవభూషణాయుధశతప్రతిబింబితచారుబింబుఁ డై
మానుగ నుష్ణరోచి నిజమండలభేదవిశంకమానుఁ డై
మానుపఁ బూని వచ్చుక్రియ మంజుసముద్ధతరోపరోధసం
స్థానవిశేషసంపద నుదంచితుఁ డై తనరారె నెంతయున్.

1953


ఉ.

వానరదానవాశ్వరథవారణధూతవసుంధరాతలా
లూనపరాగ మంబుదములలో యన మింటికిఁ బోయి పోయి సో
పానపరంపరారుచిరభంగులభంగి సుయోధనిర్జరీ
యానసమాగతంబులకు నాయిత మై విలసిల్లె నత్తఱిన్.

1954


ఉ.

లోలనిశాటసాయకవిలూనము లై సముదగ్రహుంక్రియా
భీలత నొప్పి యుత్థితకపిప్రకరస్ఫురదుత్తమాంగముల్
లాలితలీలతోఁ ద్రిదశులం గలయం జనుదివ్యమూర్తులం
బోలఁగ వేడ్కతో ననుపఁ బోవువిధంబున నుండెఁ జూడఁగన్.

1955


ఉ.

భీకరవానరాధిపవిభిన్నతురంగమతంగజానురా
నీకము లూర్జితాస్రమయనిర్గతదుర్గమవార్ధిలోన ను
త్సేకము దక్కుటన్ మునిఁగి తేలుచు నొప్పెఁ బయోధిఖేలనా
స్తోకసముద్యమన్మకరదుష్టభుజంగఝషంబులో యనన్.

1956


సీ.

పెడకేల నొప్పించి పిడికిళ్ల దాడించి, పార్ష్ణిఘాతంబుల బడలువఱిచి
గిరులు పైఁ బడవైచి తరువులఁ బడమోఁది, దంతవ్రజంబులఁ దఱిమి కఱచి
మోఁచేతులను నొంచి మోఁకాళ్ల గట్టించి, కఠినతలంబులఁ గదిసి చఱచి
కరురహంబులఁ జీరి చరణాగ్రములఁ దాఁచి, పటువాలనిహతుల భంగపఱిచి
బిట్టు మీఁది కెగసి నెట్టన నార్చుచు, నశనులో యనంగ నసురవరుల
శిరముతోన మేను చిదిసిపోవఁగ నుబ్బి, యుతికి చంపి రిట్టు లుఱక కపులు.

1957


శా.

తుండాగ్రంబులఁ బట్టి మత్తకరులన్ దోర్గర్వ మేపార ను
ద్దండప్రాభవలీలఁ ద్రిప్పి వడితో ధాత్రీస్థలిన వ్రేసి యు
చ్చండప్రస్ఫుటవిక్రమంబున నుదంచత్స్యందనానీకినీ
తండంబుల్ వడి నుగ్గు సేసిరి కపుల్ దైత్యాంతకృచ్చౌర్యు లై.

1958


క.

హరిదళితకరటికుంభో, త్కరనిఃస్రుతతారమౌక్తికము లెగయుచు సం
వరణాగతసురకాంతా, గురుకుచకుంభములమీఁద గొనకొని పడియెన్.

1959


చ.

చటులమహాశనిప్రతిమచండిమధామము లై చలద్విశం
కటవిలయాగ్ని హేతితతికల్పము లై మిహిరాంశుమండలో

త్కటరుచిరంబు లై పరఁగి దానవయూథశిలీముఖంబు లొ
క్కట వడితో బలీముఖులుగాత్రము లుచ్చి పగిల్చె ధారుణిన్.

1960


మ.

కలహోదంచితకీశముక్తవిపులగ్రావంబు లేతెంచుచో
బలవద్విక్రము లైనదానవులు శుంభన్ముష్టిసంతాడనం
బుల లీలాగతి నుగ్గుగాఁ బొడిచినం భూమిస్థలిన్ వ్రాలె ను
జ్జ్వలదంభోళిసముద్ధతాహతిగళత్సంధిక్రమం బేర్పడన్.

1961


సీ.

మాతంగధారాళమదజలౌఘంబుల, భూతలంబు ననూపభూత మైనఁ
దురగసముద్దూతఖురపుటంబుల రేణు, పటలంబు లెగసి నభంబు వొదువ
మిన్నేఱు గలఁగిన మీనజాలంబులు, పరిచయస్థితి దప్పి తిరుగఁబడఁగ
నక్తంచరోదగ్రనారాచజాలంబు, పృథురజోధ్వాంతంబుఁ బెరుఁగఁజేయఁ
జేరి చలమున వానరశ్రేణి పేర్చి, కుధరకూటంబు లగములు గుప్పి గుప్పి
నిరతిశయముగ నార్పులు నింగి ముట్టఁ, గుప్పగూల్చె నిశాచరకోటి నపుడు.

1962


వ.

అట్టియెడ మనోరథంబులతోన భగ్నంబు లగురథంబులును మదోత్సాహంబుల
తోన పొలియుఘనగజంబులును సమరవ్యగ్రతలతోన సమయుజవనతురంగంబు
లు నుద్భటత్వంబులతోన కూలుసుభటనివహంబునుం గలిగి కోదండంబులఖండం
బులును రణమండలాగ్రపతితంబు లగుమండలాగ్రంబులును శోణితపంకఘనం
బు లగునపఘనంబులును బరశుభాంగప్రచ్ఛన్నంబు లగుపరశువులును దీప్రాసం
బు లగుప్రాసంబులును గులగులలై పడుకిరీటంబులును డొల్లుతలలును బగులువ
క్షంబులును దునియుచరణంబులును జెదరుమాంసరాసులును గుప్పలుగొనుమె
దళ్లును బ్రోవు లగుప్రేవులును దునుక లగుపునుకలును జొత్తిల్లునెత్తురులును
సంధిభగ్నంబు లగునెమ్ములును గలిగి యొక్కొక్కయెడ నిలిచిననిలువున నిష్క్రాం
తజీవు లయి ప్రతిభటులకుం బ్రతిఘటించుక్రియ భయానకరసంబు దొలఁకాడఁ
[31]బొలుచువారును, సముత్పాటితశిరస్కు లయ్యుం బూర్వపరిచయవశంబున సమ
రసన్నద్ధు లగువారును భ్రుకుటికుటిలంబులును విలూనంబులు నగునన్యోన్య
మూర్ధంబులఁ గరంబుల నవలంబించి యస్తవ్య స్తంబుగాఁ బూర్వప్రదేశంబున
నునుచువారును నాడుకబంధంబులునై యొప్పి మేదంబు లాస్వాదించి మాంసంబు
లు సవిచూచి యస్థిగతంబు లగుమజ్జలు పీల్చి రక్తంబులు గ్రోలి బాలకులఁ దనిపి
జల్లుఁ బోరాడుచు నీఁదుచుఁ దేలుచు మునుఁగుచు నొండెడలఁ బొడచూపుచుం దమ
వారలఁ బిలిచి మూఁకలు [32]గట్టుచు నాపానంబులు సలుపుచు దానవవానరుల
ఫాలపట్టంబుల నున్నపరాక్రమాద్యుపన్యాసంబులు గలయక్షరపంక్తులు సదివి
మెచ్చుపిశాచబేతాళడాకినీభూతకోటిచేతం బూరితం బయి యరణ్యంబునుం
బోలె నుద్దండపుండరీకసనాథం బై హేమకూటంబునుంబోలె సంస్థితానేకగంధ

ర్వాకలితం బై వసంతమాసంబునుంబోలె వికీర్ణశిలీముఖం బై వర్షాసమయంబు
నుంబోలెఁ గలుషకీలాలప్రవాహోపేతం బై నభోభాగంబునుఁబోలె నుద్దామ
సహస్రకరాధిష్టానం బై శరత్సమయంబునుంబోలె శరాసనవిభ్రాజమానం బై
సముద్రంబునుంబోలె ననేకవాహినీసమాకులం బై వియత్తలంబునుంబోలె
దృశ్యచిత్రాభరణాభిరామం బై పాతాళంబునుంబోలె మహాహేయాన్వితం బై
రుద్రవిలసితంబునుంబోలె నిహతగజాసురం బై యాసంగ్రామంబు ఘోరం
బయి ప్రవర్తించె మఱియును.

1963


సీ.

రథయానపాత్రంబు పృథుచక్రకమఠంబు, శవమకరంబును శయభుజంగ
మురుతరచామరోత్కరఫేనవితతి తు, రంగతరంగంబు రాజదస్త్ర
బడబాగ్నిదుర్గంబు బహురత్నసహితంబు, సంభ్రమావర్తంబు సామజాద్రి
కలితంబు డాకినీగణహాసఘోషంబు, సాంద్రశోణితపూరకసలిలమయము
నగుచు నబ్ధిఁబోలె నతిదుస్తరంబున, గాధతరము దుర్విగాహ మంత
రహితపార ముదితరసవాహినీకంబు, దుర్ణిరీక్ష్యగతి నుదీర్ణ మయ్యె.

1964


ఉ.

ఆసమయంబునందుఁ బవనాత్మజుఁ డంతకుఁ బోలి రాక్షస
త్రాసకరాట్టహాసమున దారుణుఁ డై సురసిద్ధకిన్నరో
ల్లాసము నివ్వటిల్ల నతిలాఘవలంఘనవిక్రమక్రియా
భ్యాసవిశేష మొప్పఁగ రయంబున నయ్యసిరోముఁ దాఁకినన్.

1965

ఖడ్గరోముఁడు హనుమంతునిచేఁ జచ్చుట

చ.

అతనికి దైత్యుఁ డిట్లనియె నందుల కెక్కడి కేఁగె దీవు ని
ర్జితహరి నైననన్ను [33]ననిఁ జేరఁగ శూలికి నైన శక్యమే
దితిజులఁ జంపినట్టిపగ దీర్చెద నిన్ బొలియించి భూతసం
తతి దనియంగ సద్బలివిధానము సల్పెదఁ గీర్తి నిల్పెదన్.

1966


మ.

అనినం గోపదవానలంబు ఘనదైత్యాభాషితాజ్యార్పణం
బున నత్యంతముఁ దేజరిల్ల నసుహృద్భూజవ్రజోత్పాటనం
బు నుదగ్రం బగుశౌర్యమారుతమునం బొల్పొంది నిర్ఘాతఘో
రనినాదంబున వానిమీఁది కుఱికెన్ రౌద్రాతిరేకంబునన్.

1967


క.

కరవాలము లగునక్తం, చరరోమములందు మునిఁగి చలశోణితని
ర్ఝధార లొలుక మూర్ఛా, పరవశుఁ డై తెలిసి యంతఁ బావని కడఁకన్.

1968


క.

రోమాసినిర్గతుం డై, యామారుతసూతి సింహికాత్మజసుమహా
భీమాననంబు వెడలున, భోమణిక్రియ నొప్పె నుదితభూరిద్యుతి యై.

1969


మ.

కులగోత్రోపమశైల మెత్తి గమనోగ్రుం డై హనుమంతుఁ డా
ఖలనక్తంచరుమీఁద వైవ వడితోఖండించె వాఁ డుగ్రరో

మలసత్ఖడ్గసముద్ధతాహతుల భీమప్రాభవం బేర్పడన్
బలభిద్భేదనశక్తియుక్తుఁడు దురావస్ఫూర్తినిర్వాహుఁ డై.

1970


మ.

వెస ఖండించు నదల్చుఁ ద్రుంచుఁ జఱచున్ వ్రేయున్ వడిం జీరు నీ
రసతో నొంచుఁ బరాభవించుఁ గలఁచున్ రౌద్రంబులోఁ దాఁకు వె
క్కసపా టొందఁగ వ్రచ్చుఁ జించుఁ బొడుచుం గారించుఁ దూలించు రూ
వుసెడం జేయు నలంచు గ్రుచ్చుఁ జిదుముం బో నీక కీశావలిన్.

1971


చ.

మఱియును దానవుండు హనుమంతు మహోద్భటవృత్తిఁ దాఁకి పై
కుఱికి తనూరుహాసిహతి నొంచుచు బిట్టుగఁ గౌఁగిలించి క్రి
క్కిఱిసినపోటులన్ మిగులఁ గీడ్పడ నెత్తురు గ్రమ్మఁ జేసి యి
ద్దఱు నవలీలఁ బోరి రతిదర్పితు లై సమరోత్సవంబుతోన్.

1972


ఆ.

అనిలతనయుఁ డంత నాగ్రహోదగ్రుఁడై, యెలమిఁ బెద్దకొండ యెత్తి తెచ్చి
దైత్యుమీఁద వైచె దానన వాఁడును, జమునిప్రోలు చూడఁ జనియె నపుడు.

1973


మ.

అటఁ గాలాహినికాశరోమములతో నాసర్పరోముండు ప్రా
కటసత్త్వంబున వానరప్రతతులం గారింపఁగాఁ జూచి యు
ద్భటవేగంబున నంగదుండు విజయస్తంభంబు నాఁ జాలి యు
త్కటసత్త్వం బగుబాహుదండమున నాదైత్యేశ్వరున్ వ్రేసినన్.

1974

సర్పరోమవృశ్చికరోములయుద్ధము

మ.

వికటోద్దీప్తతనూరుహాహివదనావిర్భూతలోలద్విష
ప్రకరాగ్నుల్ వడిఁ జుట్టుముట్టి చదలం బర్వంగ రోషించి ద
ర్పకరాళుం డగునంగదుం బొదివి శుంభద్వేగుఁ డై వ్రేసె ను
త్సుకు లై దైత్యులు మెచ్చి చూడఁ బ్లవగక్షోభంబు గావించుచున్.

1975


మ.

అది సైరింపక వాలినందనుఁ డమోఘారంభసంరంభుఁడై
మదిఁ గోపం బొదవంగ దానవశిరోమధ్యంబు ముష్టిస్ఫుర
ద్భిదురాపాతమునం బగిల్చి విజయోద్రేకంబునం గూల్చె నే
ర్పొదవం ద్రొక్కి శిరంబు ద్రుంచె జలదా[34]నూనోల్లసద్ధ్వానుఁ డై.

1976


ఉ.

వృశ్చికరోముఁ డంతఁ బరివీతదురాపవిషాగ్నివిస్ఫుర
ద్వృశ్చికరోముఁ డై భయదవేషమునం గపిరాజుసేనలన్
నిశ్చలవృత్తి నొంచి యతినిష్ఠురశూరతఁ దాఁకి తాఁకి తే
జశ్చటులాత్ముఁ డై పఱపెఁ జండభుజాయుధదుర్నిరీక్ష్యుఁ డై.

1977


క.

నీలుండు సాంబుతోయద, నీలుఁడు గోపించి యామినీచరుతోడం
గేళీగతిఁ దలపడియెను, వ్యాళేంద్రముఁ గవియునాగవైరియుఁబోలెన్.

1978


క.

దుస్సహతరరోమోత్కర, నిస్సరదురుగరళవహ్ని నిష్ఠురగతిచేఁ

దుస్సహుఁ డై వడిఁ బోరెను, దుస్సాధుం డైననీలుతోఁ బటుశక్తిన్.

1979


తే.

తఱిమి నీలుండు వైచినతరువు విఱిచి, దానవేశుండు దనచేతిదళము మెఱసి
యడరువానరుఁ బిడికిటఁ బొడిచె నతఁడు, గినుక మిక్కిలి తొడరినమనసుతోడ.

1980


మ.

అవలీలం దరు వమ్మెయిం బెఱికి క్రవ్యాదాధముం జేరి య
ద్దివిజుల్ సంతస మంది చూడఁగ భయాంధీభూతు లై రక్కసుల్
భువి నిశ్చేష్టత నుండి భూతనివహంబుల్ సంభ్రమింపంగ ను
ద్దవడిం ద్రిప్పి యదల్చి వ్రేయఁ బడియెన్ దైత్యుండు వీతాసుఁ డై.

1981


వ.

తదనంతరంబ.

1982


సీ.

కల్పావసాననిష్క్రాంతమహావహ్ని, దానవరూపంబు దాల్చెనొక్కొ
జగములన్నియు వేడ్కఁ జవిచూడ వచ్చిన, జలపాయి యైనకృశానుఁడొక్కొ
విశ్వేశుఫాలంబు వెడలి యేతెంచిన, దర్పకాంతకుఁ డైనదహనుఁడొక్కొ
దశకంధరోత్కృష్టదారుణక్రోధాగ్ని, పరిణాహగురుపరిపాక మొక్కొ
యనఁగ రోదోంతరం బెల్లఁ దనదుగాత్ర, నిర్గతార్చు లుదగ్రత నిండి పర్వ
హరికులాటవి గాల్పంగ నాగ్రహించి, యగ్నివర్ణుండు చనుదెంచె నార్పు లొదవ.

1983


వ.

ద్వాదశచండకరమండలంబు లైక్యం బొందినగతి నై రమ్మదసహస్రంబు లేకీభావం
బు నధిగమించుకరణి సర్వతేజంబుల యద్వైతంబుక్రియ వచ్చుచున్ననిశాటుం
గనుంగొని కుంభకర్ణశైలాశని యగురఘువీరుండు వీఁ డెవ్వండు వీనిపే రేమి
దశాననునాజ్ఞ దహనుం డరుగుదెంచుచున్నవాఁడో యని త న్నడిగిన విభీషణుం
డి ట్లనియె.

1984


శా.

స్ఫారాగ్నిప్రతిమాంగకీలములచే శైలంబులం గాల్చుమా
యారంభైకసహాయుఁ డిద్ధసమరవ్యాపారదక్షుండు దు
ర్వారోదంచితబాహువీర్యుఁడు సుపర్వద్వేషిసేనావలీ
వీరాగ్రేసరుఁ డగ్నివర్ణుఁ డితఁ డుర్వీనాథచూడామణీ.

1985


వ.

అనునవసరంబున వాఁడు ప్రచండక్ష్వేళానాదంబు సెలంగఁ గపులమనంబుల
దిగులు చొరంగఁ జటులనిశ్వాససమీరణసంధుక్షితనిజాంగదహనప్రభామండ
లుం డై కర్ణాంతోపసర్పదుదీర్ణకార్ముకమౌర్వీఘోషంబున సురలమనంబులు గ
లంగ సావలేపాట్టహాసపురస్సరవీరాలాపంబుల నమ్మేటిమగండు రామునకుం గిను
క పొడమ ధరణీకంపంబుగా నరదంబు వఱపి యతిరయంబునం బఱతెంచి యెదిర్చి.

1986

అగ్నివర్ణుఁడు రామునితో యుద్ధముచేసి కూలుట

ఉ.

వాఁడు నిమేషమాత్రమున వజ్రకఠోరతరంబు లైనక్రొ
వ్వాఁడిశరంబు లేసియు నవక్రపరాక్రమలీలఁ జూపుచుం
బోఁడిమియున్ రణోద్ధతియుఁ బొంపిరి వోవఁగ భూమిభర్తకు
న్వేఁడిమి చూపె నెంతయును నెమ్మన మచ్చెరు వందునట్లుగాన్.

1987

ఉ.

రాముఁ డుదగ్రభల్లమున రాక్షసువి ల్దునుమాడ వాఁడు సం
గ్రామకలావిచక్షణుఁడు ఖడ్గము దాల్చి యదల్చి వచ్చినన్
భూమివిభుండు దాని వడిఁ బొల్పుగఁ జూర్ణము సేయ వాఁడు దా
భీమగదాకరాళుఁ డయి పేర్చి కృతాంతుఁడపోలె నెంతయున్.

1988


చ.

కుటిలమహోర్జితత్వమునకున్ రణవిక్రమరూఢశక్తికిం
బటుతరసాధనప్రవణశభాసురయుక్తికి సాగ్రహోక్తికిం
జటులతరప్రతాపయుతసాహసరక్తికి మెచ్చి రాముఁ డు
త్కటగతి వారుణాస్త్రము సదర్పముగాఁ దొడిగెన్ నిశాటుపై.

1989


చ.

జలదము లుప్పతిల్లఁ విశంకటకోటితటిల్లతాసమా
కులితదిగంతరాళ మయి ఘోరతరాశనులోలిఁ గ్రాలఁగాఁ
జెలఁగుచు నగ్నిరూపమునఁ జెన్ను వహించునిశాటుఁ దాఁకినం
బొలుపఱి వాఁడు నంతఁ దెగిపోయె సురారులు దల్లడిల్లఁగన్.

1990


చ.

ప్రణుతమహాప్రభావజితభానుకృశానుఁడు బాహువిక్రమ
ప్రణమితలోకపాలకుఁడు బంధురదిగ్గజదంతఘట్టన
వ్రణకిణజాలదుర్జయతరస్ఫుటవక్షుఁడు ఘోరసంగరాం
గణమున నగ్నివర్ణుఁ డటు గ్రక్కున రాఘవుచేతఁ గూలినన్.

1991


సీ.

విలయకాలానలావిలధూమతతిక్రియ, వికటభయానకభ్రుకుటి దనరఁ
జబులదంష్ట్రాకోటిజటిలాంశుమండలి, విపులార్కదీప్తితో వియ్య మంద
దహనకుండోపమమహదక్షినివహంబు, క్రమమున నుల్కాశతమును నీన
దశవదనోదగ్రదంతంబు లన్యోన్య, ఘట్టన విస్ఫులింగములు నెఱపఁ
బర్మగర్భాండభాండంబు పగులనడువ, నంబురాసులు నేడు నొక్కంత చేయఁ
దలఁచుకైవడి దట్టించి కదశముఖుండు, గినుక పెరుఁగఁగ రాముతో ననియె నిట్లు.

1992


శా.

నాసామర్థ్యము నీ వెఱుంగ వనిలో నక్తంచర శ్రేణి ను
ల్లాసం బొందఁగఁ గూల్చి నిక్కెదవు వేల్లచ్చాపనిష్క్రాంతబా
ణాసారంబున నీప్రతాపదహనవ్యాసంబు నే నార్చెదం
ద్రాసోపేతులఁ జేసెదం ద్రిదశులన్ దర్పక్రియాశాలి నై.

1993


చ.

గెలిచితి నిర్జరాధిపునిఁ గీడ్వడఁ జేసితి జాతవేదునిం
గలఁచితి నాపరేతవిభు గ్రక్కున నొంచితిఁ గోణపేశునిం
దలఁకక వ్రేసితిన్ వరుణు దట్టనఁ బట్టితి నాసదాగతిన్
బలమునఁ గొట్టితిన్ ధనదుఁ బాఱఁగఁ దోలితి వానిమిత్రునిన్.

1994


మ.

బలదర్పంబుల మించి సర్వభువనప్రఖ్యాతిగా నద్రిజా
లలనుండుం బ్రమథామరాలియును లీలం గూడి యుండంగ నా
కలధౌతాచల మెత్తి బాహుపరిఘాగ్రస్తంభకూటంబులం

దు లసత్సౌధముభంగి నిల్పితి యశస్తోమోపమానంబుగన్.

1995


సీ.

మన్నామమంత్రంబు మానుగా యమదూత, చటులభూతగ్రహోచ్చాటనంబు
మత్ప్రతాపప్రౌఢిమహిమ గంధర్వయ, క్షాదికగహనదావానలంబు
మద్భుజావనములు మహనీయజయలక్ష్మి, విహరించునుద్యానవిపులతరులు
మత్కోపవేగంబు మత్తారికులశైల, పక్షపాతనివాతపవివరంబు
అట్టినాలావు దలపోయుననువు లేక, నిఖిలరక్షణపర యగునీతి లేక
ఘనతరం బగుసద్వివేకంబు లేక, పో రొనర్పంగ వచ్చితి బుద్ధి దప్పి.

1996


చ.

దురమున నూర్జితస్థితి నెదుర్కొని తీవ్రశరప్రకాండముల్
పరువడితోడ నేసి భుజబంధురసత్త్వము సూపి పోరుమీ
నరవర భీతి నొందక ఘనం బగుమచ్ఛరకోటి దాఁకినన్
సురుఁగక బీఱువోక వడి స్రుక్కక తూలక నిల్చియుండుమీ.

1997


ఆ.

ఒగి నరణ్యపథము నొందియు ననరణ్య, పథము నొంద నేల పార్థివేంద్ర
నీవు నాభుజములలా వెఱుంగవె భయా, శ్రితశరణ్యు నన్నుఁ జేరి బ్రదుకు.

1998


వ.

అనియె నయ్యవసరంబున.

1999


ఉ.

మానమదాతిరేకమును మచ్చరముం జలముం దలిర్ప న
ద్దానవరాజశేఖరుఁడు తద్దయుఁ బల్మరు నిట్టు పల్కుచో
వీనులు సోఁకినన్ నృపతివీరవరేణ్యుఁడు నవ్వుఁ గిన్కయున్
మానుగ నాననాంబురుహమండలిఁ దోఁపఁగఁ జూచి యి ట్లనున్.

2000


ఉ.

భూమనిజానుభావపరిభూతసురాసుర నీవు సెప్పఁగా
నేమిటి కింతవాఁడ వగు దిం దనుమానము గల్గ నేర్చునే
నీమహనీయశౌర్యమును నీకమనీయసమగ్రధైర్యమున్
నీమహిమానుషంగమును నేఁ బరికించి యెఱుంగుదుం జుమీ.

2001


శా.

వీరుం డాకృతవీర్యసూనుఁడు భుజావిఖ్యాతశౌర్యంబునం
గారాగారమునందు ము న్నెలమిమైఁ గాపుంచె నుద్దామస
త్సారాసారుఁడు వాలి వాలి సుమహాసత్త్వుండు దుర్వారతం
బారావారములందు ముంచె [35]నిను శుంభద్విక్రమారంభుఁ డై.

2002


తే.

బహుముఖంబులు బహువిధభాషణముల, కరయఁ గారణ మనవుడు ననియె నంత
బహుభుజంబులు బహుతర ప్రాజ్యసత్త్వ, మునకుఁ గానఁగ వచ్చిన మూల మనుచు.

2003


మ.

వినతాసూను నెదుర్చుభోగిపగిదిన్ వీరోగ్రహర్యక్షనా
థునిపై వచ్చుమదద్విపంబుకరణిన్ దుర్దాంతదర్పంబున
న్మనుజాధీశు నుదగ్రతం గదిసె నానక్తంచరేంద్రుండు నే
పున మార్తాండునిఁ జేరురాహుపగిదిన్ భూరిస్ఫురత్సత్త్వుఁ డై.

2004

రామరావణుల తృతీయయుద్ధము

చ.

రథవరనేమిఘట్టనతురంగఖురక్షతధూళి గ్రాలఁగాఁ
బృథివి పగిల్చి [36]బంగరపుఁబింజలయమ్ములు లీల నేయుచుం
గ్రథనతలాతినిష్ఠురత రాఘవుఁ డెంతయు మెచ్చునట్లుగాఁ
బ్రథితసముద్ధతిన్ మెఱసి రాక్షసముఖ్యుఁడు పోరె నెంతయున్.

2005


మ.

జలదాకారుఁడు రాఘవుండు విపులజ్యానాదగర్జారవా
కులితానేకకులాచలుం డయి చలత్కోదండపాండిత్య మి
మ్ములఁ బెంపారఁగ బాణవర్షముల నంభోజాసనాండంబు నిం
డ లసద్విక్రమ మొప్పఁగాఁ గురిసె నీడంబోక యాదైత్యుపైన్.

2006


చ.

పటుతరసాహసుం డగునృపాలకుఁ డేయుశిలీముఖంబు లొ
క్కట వడితోడ నేఁగి దశకంఠుముఖాంబుజషండమున్ సము
త్కటభుజకాననంబును నుదంచితహృత్కమలాంతరంబుఁ బ్ర
స్ఫుటతరభంగిఁ జెండె సురపూగము సంతస మంది చూడఁగన్.

2007


మ.

అసురాధీశ్వరుఁ డేయుబాణములు సర్పాకారఘోరంబు లై
విసరత్తీవ్రవిషానలంబు లెగయన్ విఖ్యాతఫూత్కారని
శ్వసితారావము భూనభోంతరముఁ బర్వం జేరఁగా వచ్చి య
వ్వసుధావల్లభువైనతేయవిశిఖవ్రాతంబులం దూలఁగన్.

2008


క.

ఆగ్రహమున భువనత్రయ, నిగ్రహకరుఁ డైనయామినీచరుసుమహ
ద్విగ్రహము గాఁడ నేసెను, విగ్రహదక్షుఁడు రఘుప్రవీరుం డలుకన్.

2009


క.

క్షుణ్ణారితూణసుషిరని, షణ్ణాస్త్రభుజంగమములు జనపతిమేనన్
షణ్ణవతిసంఖ్య నేసె వి, షణ్ణత యొదవంగ రాక్షసప్రభుఁ డంతన్.

2010


చ.

రథగతుఁ డై తనర్చి సమరంబు నుదగ్రతఁ జేయురావణుం
బృథివిఁ బదాతి యై యరివిభీషణుఁ డై యని నిల్చు రాఘవుం
బృథుతరవిస్మయక్రమము [37]పెం పొనరంగను జూచి దిక్పతి

ప్రథముఁడు పల్కె మాతలికిఁ బ్రస్ఫుటసాంద్రదయార్ద్రచిత్తుఁ డై.

2011

శ్రీరామునకు నింద్రుపంపున మాతలి రథము దెచ్చుట

ఆ.

త్రిదశహితము గోరి ధీరాగ్రగణ్యుండు, పూని దైత్యుతోడఁ బోరు సలుపు
చున్నవాఁడు నీవు నుచితత్వ మేర్పడ, రథము గొంచుఁ బొమ్ము రాముకడకు.

2012


వ.

అని సంక్రందనుం డానతిచ్చినయనంతరంబ.

2013


సీ.

కింకిణీమాలికాఝంకారముఖరంబు, సురుచిరనవరత్నశోభితంబుఁ
దటిదుజ్జ్వలోచ్చకేతనదండసహితంబు, గురుతరవైదూర్యకూబరంబు
జలజలోచనచక్రచక్ర సన్నద్ధంబు, నక్షకసంకలితాక్షయుగము
దుస్సహానిలవేగతురగోహ్యమానంబుఁ, దరుణార్కబింబసుందరము నగుచు
విమలవజ్రకల్పకమనీయకంకట, దివ్యచాపతూణదీప్తశస్త్ర
సహితమైనరథము జవమునఁ గొనివచ్చి, మొనసి రామచంద్రుమ్రోల మెఱయ.

2014


వ.

ధరణీస్థలంబున నిలిపి ముకుళితకరకమలుం డై రఘువీరు నవలోకించి యి ట్లను
దేవా దేవనాయకునాజ్ఞం జేసి మీకడకుం బనివింటి నీదివ్యం బగువారవా
ణంబును గృపాణంబునుం జాపశరాయుధశస్త్రంబులు నంగీకరించి సంక్రందన
స్యందనగతుండ పై నిశాచరాధము నిర్జింపు మనవుడు విభీషణుననుమతంబునం
బ్రదక్షిణపూర్వకంబుగా నద్దివ్యరథంబునకుం బ్రణమిల్లి వానరముఖకమలంబు
లు వికసింప నిశాచరమనకుముదంబులు ముకుళింప సహజతేజఃపుంజంబున
నసురాంధకారంబు విరియఁ గౌసలేయదివసకరుం డద్దివ్యశతాంగపూర్వాచలా
రోహణంబు సేసి.

2015


ఉ.

శారదనీరదప్రతిమ చారువిమానము లెక్కి నాకసం
చారులు యక్షసిద్ధగణసాధ్యమహోరగకిన్నరుల్ మహో
దారమనస్కు లై మనుజదానవనాథులపోరు సూడఁగాఁ
గోరి కుతూహలంబు లొడఁగూడఁగఁ జెచ్చెర వచ్చి రిమ్ములన్.

2016


సీ.

పంచాస్యయుగళంబుఁ బాథోధియుగ్మంబు, ఘనగిరిద్వంద్వము గగనయుగము
భాస్కరద్వయమును బావకద్వితయంబుఁ, గవిసి పోరుచు నున్నగతి దలిర్ప
[38]మెఱయంగ నంతంత మేఘగంభీరత, సమతుల్యు లగుచును సరభసమున
సామజభేరుండశరభోరగంబులు, సప్రతిభటము లై సంగరంబు
సల్పునట్లుగ నిరువురుఁ జలము బలము, మెఱయ నన్యోన్యజయకాంక్ష మిగులుచుండ
రఘుకులాంబుధిచంద్రుండు రావణుండు, నొరసి వ్రేల్మిడిఁ దలపడి రుక్కు మిగిలి.

2017

శా.

జ్యాఘోషంబులు దిక్కులందు నిగుడన్ జన్యక్రియాచాతురీ
శ్లాఘాయుక్తులు రామరావణులు గర్జాతర్జనాడంబరా
మోఘాపాతశిలీముఖంబుల లసన్మోదంబులం బేర్చి మ
ర్మాఘాతంబులు సేయుచుండిరి ఘనాహంకారహుంకారు లై.

2018


శా.

నిర్ఘాతప్రతిమానవేగయుతముల్ నిర్యత్ప్రకాశచ్ఛటా
దీర్ఘాపాతము లుగ్రభానుకిరణోద్దీప్తంబు లుద్యన్మహా
నిర్ఘోషంబులుఁ గల్పపావకశిఖోన్నిద్రంబు లై విష్ట పాం
తర్ఘాతం బొదవం దదీయశరజాతంబుల్ దనర్చెన్ వెసన్.

2019


చ.

దొనలకుఁ జేయి సాఁచుటయుఁ దూపులు గొంటయు లాఘవంబునన్
గొనయమునం దమర్చుటయుఁ గూర్చుటతోఁ దెగవాపి లక్ష్యభే
దన మొనరించుచందమును దథ్యముగాఁ బరికింపరాక యే
పున వెలయంగఁ బోరి రిటు భూపలలాముఁడు రాక్షసేంద్రుఁడున్.

2020


మ.

జననాథాగ్రసరుండు దైత్యవరుఁడున్ సవ్యాపసవ్యంబులం
బొనుపొందం దగ విండ్లు దాల్చి యెలమిం బుంఖానుపుంఖంబుగా
ఘనమార్గంబును దిక్కులుం బుడమియుం గప్పంగ ని ట్లేసి రే
పున నాటోపము లుప్పతిల్లఁగ భుజాభూయిష్ఠసత్త్వంబులన్.

2021


వ.

మఱియు నేకదశశతసహస్రాయుతలక్షకోటిప్రభృతిసంఖ్యాకశరంబు లేయుచు
నక్షీణతూణీరు లై మర్మంబులు నొప్పించియు వర్మంబులు సించియుఁ జరణో
రూదరవక్షఃకరాంసకంఠలలాటంబులు నొప్పించియు రథ్యంబుల నేసియు సార
థులం దూలించియుఁ గేతనంబులఁ ద్రుంచియు నిట్లు వివిధగతుల మెఱసి
పోరునవసరంబున నుభయస్యందనతురగఖురక్షతరథనేమిఘట్టనసముద్ధూతం
బగురేణుపటలంబురాయిడి కోర్వక పుడమి మింటికి వలసపోవుచందంబున
నెగసి జవనశరశతశాత్కారజనితపవనవిస్తారితం భై సమీకాలోకనాయా
తానేకకామినీనికాయచికురకుంకుమస్థానకం బన నిలుచుచు వియన్నదీసలి
లంబు పంకిలంబు గావించి యం దున్నకనకకమలంబులకుఁ బంకజత్వంబు
సార్థకంబు గావించుచు నిరాలంబం బగునంబరంబునం జనుచున్నరవితురం
గంబులకు నతిసాంద్రగాధం బగుటం జేసి విశ్రామంబు సేయుచుం దత్స్యం
దనచక్రపరిభ్రమణవేగానురోధంబునం బరివేషభ్రాంతి నొందించి నీరంధ్రం బ
గునంధకారంబు సంపాదించుచు నుండ నుభయసైనికులు నివ్వెఱఁగంది చూచు
చు నత్యాశ్చర్యంబుగా నాయకజయంబు గోరుచుండిరి తదనంతరంబ.

2022


శా.

కోలం గోలయుఁ దాఁకి పె ల్లెగయుచుం గ్రుద్ధోరగోద్యద్విష
జ్వాలాభీలతరస్ఫులింగలహరీసంఛాదితాభ్రాంతది
క్కూలోపాంతము లై కులాచలమహాకూటాగ్ర సంస్థానలీ

లాలోలస్థితి నెంతయుం దనరె వేల్లద్విక్రమప్రక్రియన్.

2023


వ.

అట దశముఖుండు దైవతాస్త్రంబు ప్రయోగించిన.

2024


చ.

మలయుచుఁ బెక్కుచందముల మండుచు మ్రోయుచు ధూమజాలకం
బులు గలిగించుచున్ వడి నభోవలయంబున నిండి పర్వుచున్
దలముగ విస్ఫులింగము[39]లతానక మై చనుచేర రాఘవుం
డలయక దాని నేసి యనయంబును శాంతము సేసె గ్రక్కునన్.

2025


వ.

మఱియును రావణుండు గాంధర్వాస్త్రం బేసిన.

2026


మహాస్రగ్ధర.

అదియున్ సాంద్రాంధకారవ్యతికరభయదం బై చలద్ధూమరేఖా
విదితం బై కాలజిహ్వావిపులభయద మై విస్ఫురత్కాలమేఘా
స్పద మై విభ్రాంతినిద్రాభరపరవశతాపాది యై యేఁగుదేరం
బదిలుం డై రాఘవుండుం బ్రతివిశిఖమునం బ్రచ్యుతిం బొందఁజేసెన్.

2027


క.

అక్షతపౌరుషనిధి హ, ర్యక్షపరాక్రముఁడు మహదహంకృతితోడన్
రాక్షసబాణం బేసెను, రాక్షసకులవల్లభుండు రామునిమీఁదన్.

2028


ఉ.

మీఱినకోఱలున్ మిగిలి మింటికిఁ బర్వినపల్లవెండ్రుకల్
తేఱినమిట్టగ్రుడ్డులు [40]నుదీర్ణతరం బగునట్టిసాహసం
బాఱనితేజమున్ దెసల నంటినచేతులు లోకరాజిలో
నేఱినమేటిరూపముల నెంతయుఁ బేర్చిరి రాక్షసుల్ వడిన్.

2029


వ.

అంత.

2030


శా.

నిష్కంపప్రథితానుభావుఁడు ధనుర్నిష్క్రాంతమౌర్వీరవా
విష్కారంబుగ వైష్ణవాస్త్ర మసుహృద్విభ్రాంతిగా నేసె శో
చిప్కేశుండు శిఖాగ్రచుంబితవియత్సీమంతుఁ డై మండ ధా
నుష్కాగ్రేసరురూఢిఁ జూపుచు రణానుష్ఠానశిక్షారతిన్.

2031


వ.

అయ్యస్త్రంబుచేత నాసురాస్త్రతేజంబు తరణికిరణంబులచేత నంధతమసంబు
వాయుపగిదిం బ్రతిహతం బైన.

2032


క.

శుష్యన్నిలింపముదముగఁ, బుష్యద్రజనీచరేంద్రభూరిరవుం డై
హృష్యత్పులకాంచితుఁ డై, దూష్యాశయుఁ డహిశరంబు దొడిగినమాత్రన్.

2033


సీ.

వెలరారుపొగగలవిషములు గ్రక్కుచు, ఫూత్కారనాదముల్ పొలుపు మిగులఁ
దఱచుగా ఘోరనేత్రముల మంటలు గ్రమ్మఁ, జూడామణిప్రభల్ చుట్టుముట్ట
భీకరదుర్గమానేకముఖములతో, వాసుకిభోగభావంబు లగుచు
[41]నిశితదంష్ట్రాకోటి నిష్ఠురత్వంబుగఁ, దార్క్ష్యుని బెగడించుదలము గలిగి
దెసలు నంబరంబుఁ దెఱపి లేకుండంగఁ, గప్పె భుజగతతులు గరుడకేతుఁ

డైనరాము గెలువ నరుదెంచుకైవడి, వచ్చి పొదువ నున్నవలను చూచి.

2034


క.

భూవరుఁడు పన్నగాస్త్రము, పై వచ్చుచునున్నఁ జూచి పటుతరశక్తిన్
భావించి గారుడాస్త్రము, వావిరిగాఁ దొడిగి యేసె వసుధ వడంకన్.

2035


సీ.

చటులపక్షానిలచలితమహాశైల, విపులాంగములు వెనువెంటఁ బర్వఁ
గులిశోగ్రపటుచంచుకోటిపుటంబులు, ఘనభుజంగంబులఁ గఱచి త్రుంచి
చలనఖరోదగ్రచరణతాడనముల, విరిసి మేఘంబులు దొరఁగి పొలియ
భుజగకులంబులఁ బొదివి చంపఁగఁ బూని, భూకంప మొదవించి ప్రాకటముగ
గారుడాస్త్రజనితగరుడగణంబులు, మింట సిద్ధసురులు మెచ్చి చూడ
రావణప్రయుక్త [42]మై వచ్చునస్త్రంబు, పొలువు నిమిషమాత్రఁ బొలియఁజేసె.

2036


వ.

రావణుండును దీవ్రంబు లగుమార్గణంబులు పై పయిం బఱపిన వాని నిశితభ
ల్లంబులు విశకలితంబులు గావించి రాఘవుండు దుర్వారదహనదైవత్యం బగు
మహాస్త్రంబు ప్రయోగించిన.

2037


శా.

ఊష్మవ్యాహతిదగ్ధపత్రసురరాజోద్యానధాత్రీజ మై
గ్రీష్మోదంశుసహస్రరశ్మశితభూరిజ్యోతిరుత్సిక్త మై
భీష్మాక్రాంతిదురంతధూమపటలీస్ఫీతాంతదిక్చక్ర మై
శుష్మప్రాభవ మొప్పె నెంతయును రక్షోనాథదర్పఘ్న మై.

2038


వ.

అంతఁ దమిస్రాచరకులాగ్రగణ్యుండు వారుణాస్త్రంబు ప్రయోగించిన.

2039


శా.

కాళీమూర్తికరాళకాలరుచి యై గర్జోర్జితం బై మహా
భీలేరమ్మదభీమ మై ఘనతటిద్భిన్నాఖిలాశాంత మై
వ్యాలోలాశనిపాతదుష్ప్రసహ మై యంభోదబృందంబు నా
[43]నాలోనం గరిహస్తధారజల మై యార్చెం దదస్త్రాగ్నులన్.

2040


వ.

అంత రఘువరుండు సమీరదైవత్యం బగునస్త్రంబు ప్రయోగించిన.

2041


మ.

కులశైలేంద్రగుహావిసర్పిసుమహద్ఘోరైకభాంకార మై
చలవేగోద్ధృతభూరుహానుగత మై సర్వంసహాకంపి యై
జలధిస్ఫారపయఃప్రపూరలహరీసంక్షోభసంపాది యై
కలయం బోవఁగ వీచె నభ్రతతి నుగ్రం బై తదస్త్రం బొగిన్.

2042


వ.

అంత దశముఖుండు వారణాపత్యం బగుమహాస్త్రంబు ప్రయోగించిన.

2043


మ.

తెలియన్ వారిధి యున్నదీశతసపత్నీభూతదానాంబు శై
వలినీచంద్రకితాంబురాశిజల మై వాలాహిదుష్ప్రేక్ష్య మై
చలహస్తాగ్రవిలూనదేవతటినీచంచత్సువర్ణాబ్జ మై
బలసెన్ వారణసంఘ మస్త్రజనితప్రఖ్యాతినిష్పన్న మై.

2044


వ.

అట నరేంద్రసింహుండు నారసింహం బగునస్త్రంబు ప్రయోగించిన.

2045

మ.

చటులోద్వృత్తిసటావిపాటివిరాజత్సాంద్రజీమూత మై
పటుకోటీనఖపాటితేభగణకుంభగ్రస్తముక్తాఫలో
ద్భటలోలచ్చరణాగ్ర మై విపులనాదత్రాసితాశాగజో
త్కట మై సింహచయంబు హస్తిసమితిం గారించె నిస్సీమతన్.

2046


వ.

అంత.

2047


తే.

విలయనిష్క్రాంతపావకవిపుల మగుచు, మిగిలి యెగసినమంటలు మిన్ను రాయ
నుల్లమున దేవనివహంబు తల్లడిల్ల, ననియె దైత్యుండు శితశూల మడరి తాల్చి.

2048


మ.

ఘనకోదండమునేర్పు మీఱ విశిఖగ్రామంబు సత్కౌశలం
బును నీ వేర్చడఁ జూపు మింక ననిలో భూరిప్రతాపంబు నే
వును గర్వంబును దూలిపోవ నిపు డీపొల్పొందుశూలంబు ని
న్నును నీసోదరుఁ గూల్చు నిక్కువము నన్నున్ గెల్వ నీశక్యమే.

2049


వ.

అని మిన్నంది మహాగ్రహవ్యగ్రాయమానుం డై.

2050


ఉ.

పూని యదల్చి వైచె నది భూరిజవంబున నుగ్రపావకా
నూనశిఖావలీజటిలితోద్ధత మై లయకాలరుద్రసం
ధానసమావహం బగుచుఁ దద్దయుఁ బేర్చినశూల మంత న
ద్దానవవంశవర్ధనునుదగ్రతఁ జూపుచు వచ్చెఁ బెల్చనన్.

2051


క.

నరవరుఁడు దానిపై శిత, శరములు గురియింప వాని సరకుగొనక యు
ద్ధురమున నొక్కటఁ గూల్చుచు, నురవడిఁ జనుదేరఁ జూచి యుద్ధతి మఱియున్.

2052


ఉ.

అంచిత మైనకూర్మి నమరాధిపుఁ డెంతయు వేడ్కతోడఁ బు
త్తెంచిన శక్తిఁ బుచ్చుకొని ధీరత వైచిన భానుమండలో
దంచిత మై నిశాటభయదం బయి దేవముదావహంబు నై
త్రుంచి దశాస్యుశూలమును దుర్దమ మై యది వచ్చి వ్రేల్మిడిన్.

2053


వ.

దశకంఠుండును వితథీభూతదివ్యసాధనుం డై సటానముత్పాటనకుసితం బగుకంఠీ
రవంబుచాడ్పునఁ గరాళక్ష్వేళాపూరితదిక్కుహరుం డై విస్ఫారంబు సెలంగఁ
బ్రళయాభ్రంబపోలె నశనికోటిదారుణంబు లైననిశితశరంబులు గురిసి దశ
విశిఖంబుల రాఘవు నన్నియశరంబుల మాతలిని వివశత నొందించి యొక్కనిశి
తభల్లంబున మణికాంచనమండితంబును నభ్రంలిహాగ్రంబును నప్రతివిహారంబును
సమీరణలోలపటవిరాజమానంబును నగుకేతుదండంబు గపులు నిలింపులు
నులుక నమరవైరు లలర నవనిం బడవయిచి.

2054


చ.

మఱియును దైత్యుఁ డానృపకుమారుని నుగ్రశిలీముఖంబులన్
నెఱఁకులు దూఱనేసి ధరణీస్థలి గ్రక్కదలంగఁ దేరిపైఁ
బఱపి యురోలలాటతటబాహులు నాటఁగఁ గీలుకొల్పి త
త్తఱపడఁజేసె దేవసముదాయము నెల్ల నుదగ్రవృత్తి యై.

2055

స్రగ్ధర.

కర్ణాంతాకృష్టచాపగ్రథితశరశతాక్రాంతదిక్చక్రవాళో
దీర్ణధ్వాంతంబు సిద్ధత్రిదశజనమనస్స్థిత్యపాయంబుగా స
ప్తార్ణోధిధ్వానధీరాయతగుణనినదాహంక్రియాయుక్తుఁ డై సం
పూర్ణత్రాసాతిఘాతస్ఫుటితులఁ గపులం బొల్పు దూలంగ నేసెన్.

2056


మ.

నృపకంఠీరవుఁ డంత సంగరకళానిష్ణాతరక్షోధిప
ద్విపముం జూచి సహింపఁజాలక సముద్వేలాస్త్రకోటీనఖా
గ్రపరిచ్ఛేదము సూపి రోషదహనాక్రామచ్ఛటాభీముఁ డై
విపులోదంచితనాదమేదురవియద్వీథీకుఁ డై క్రాలుచున్.

2057


క.

మండలితకనద్గురుకో, దండంబున వెడలు బాణతతి నొప్పించెన్
మెండుకొని దైత్యు నవనీ, మండలనాథాత్మజుం డమందత్వరుఁ డై.

2058


క.

దానవజీమూతం బా, మానవనాథాద్రిమీఁద మానక నారా
చానూనవృష్టి గురియం, గా నిశ్చలవృత్తి నుండెఁ గడురమ్యుం డై.

2059


క.

క్రందుకొని భూమిపతిసం, క్రందనుఁడు దశాననాద్రి గదలఁగ బాణా
స్పందితదంభోళి నిగుడ, నందంద యదల్చి కదిపె నతినిష్ఠురతన్.

2060


మ.

దశకోదండము లొప్పఁ దాల్చి సుమహాదర్పంబునన్ మించి య
ద్దశకంఠుండు దురాగ్రహంబు గదురన్ ధాత్రీతలాధీశుపై
దశదిగ్భిత్తులు వ్రీల నార్చుచు సమిద్ధౌరేయతాశాలి దు
ర్దశఁ బొందన్ నిశితాస్త్రముల్ పఱపె విత్రస్యత్ప్లవంగంబుగాన్.

2061


ఉ.

ఏకధనుర్ధరుం డగుమహీశకుమారుఁడు రాముఁ డుద్దతో
త్సేకముఁ బౌరుషక్రమము ధీరతయున్ భుజలాఘవంబునుం
బ్రాకటశస్త్రకౌశలముఁ బ్రాభవముం దనరారునట్లుగా
నాకపతీకవైరిపయి నారసముల్ గురియించి నొంచినన్.

2062


చ.

మదమును మానమున్ విపుమత్సరమున్ బలు పైనకోపమున్
హృదయమునందు నెక్కొనఁగ నేడ్తెఱఁ జూపుచుఁ బేర్చి యార్పులం
ద్రిదశులు బీఱువోయి పడఁ దేఁకువ దప్పక మించి వీఁకతో
వదలక యేసె బాణములు వారిజమిత్రకులావతంసు పై.

2063


సీ.

ఉల్కాసహస్రమహోదగ్రశరముల, రణపటిష్టుం డగురాము ముంచి
విస్ఫులింగోపమవిపులసాయకములఁ, బురుహూతుహయములఁ బొదుఁగ నేసి
దిననాథకరజాలతీవ్రబాణంబులఁ, జొలపక సుత్రామసూతు నొంచి
సౌదామనీదామసమవిశిఖంబుల, మహితశతాంగంబు మఱుఁగుపఱిచి
కనకకేతనంబు గానరాకుండంగ, నోలి శస్త్రసమితి గీలుకొలిపి
మఱియు నొవ్వఁ జొనిపె మానవాధిపుమేన, నిశితశస్త్రసమితి నెఱఁకు లగల.

2064


వ.

అయ్యవసరంబున.

2065

శ్రీరామునియొద్దకు నగస్త్యమహాముని వచ్చుట

చ.

నిరతిశయప్రభావుఁ డగునిర్జరవైరిశరాలివేఁడిమిం
బరవశుఁ డైనరామనరపాలకుపాలికి దివ్యఘోరదు
శ్చరసుమహత్తపోవిభవశాలి యగస్త్యుఁడు బంధురప్రభా
భరజితభాస్కరుండు ముని భవ్యదయానిధి వచ్చి యి ట్లనున్.

2066


సీ.

నీదివ్యతత్త్వంబు నిఖిలాగమంబులు, మానుగా వెదకియుఁ గానలేవు
నీభవ్యసస్మూర్తి నెరయ సంయమిచిత్త, తామరసంబులఁ దగిలియుండు
నీదీప్తికణములు నిక్కంబు పరికింపఁ, బావకుం డిందుండు భాస్కరుండు
నీమహామాయాతినిబిడవిలాసంబు, జగదుద్భవస్థితిక్షయకరంబు
విశ్వమయుఁడ వీవు విశ్వాత్మకుఁడ వీవు, విశ్వవిభుఁడ వీవు విష్ణుమూర్తి
నీవు సర్వభువనహితము సేయఁగఁ బూని, నరుఁడ వైతివయ్య నలిననేత్ర.

2067


వ.

కావున నీమహనీయానుభావంబు నెఱుంగఁ జతుర్ముఖపంచముఖషణ్ముఖసహస్ర
ముఖులకు నయిన నలవిగా దది యట్లుండె నిపుడు నీవు మానుషభూమికాపరిగ్ర
హంబున నటించుటం జేసి సర్వజ్ఞుండ వయ్యు నెఱుంగమి దాల్చుచున్నవాఁడవు
గావున సర్వలోకగురుండవు నీకు నొక్కటి యుపదేశించెద ననుట [44]బేలతనం బై
నను నవధరింపుము జయప్రదంబు నిఖిలైశ్వర్యమంగళసౌఖ్యావహంబును సక
లదురితదూరీకరణచణంబును నగునాదిత్యహృదయం బనుపుణ్యమహాస్తవంబు
సాదరంబుగాఁ బఠియింపుము మీవంశంబునకు నాద్యుం డయినభువనలోచను
నాదిత్యు నారాధింపుము నీకు జయంబు సమకూరు నని చెప్పి యరిగిన నవ్వి
భుండు సర్వదేవమయుం డగుభానుమంతుం బూజించి యనంతతేజోవిరాజమా
నుం డై సంగరోద్యోగంబునం బ్రతిఘటించి కోపించి నిలిచిన.

2068


స్రగ్ధర.

భూతంబుల్ దల్లడిల్లెం బుడమియుఁ గదలెన్ భూధరంబుల్ వడంకెన్
భీతిల్లెన్ దిగ్గజంబుల్ బెదరిరి విబుధుల్ బెల్లుగా మ్రోసె నబ్ధుల్
వే తూలెన్ శేషుఁ డంతన్ వెఱచెఁ గమఠుఁడున్ వ్రీలె దిగ్భిత్తు లెల్లం
బాతాళంబుం గలంగన్ బవనుఁడు నిలిచెం బాఱె దైత్యవ్రజంబున్.

2069


వ.

అయ్యవసరంబున.

2070


మ.

జననాథాగ్రసరుండు రాఘవుఁడు చంచత్కార్ముకజ్యామహా
ధ్వని నక్తంచరరాజముక్తివనితావైవాహికారంభసం
జనితోదంచితతూర్యరావముగతిన్ సంధిల్లఁగాఁ బూఁచి యే
పున బాణత్రయ మేసి మేన నలికంబుం గ్రుచ్చె మూఁడమ్ములన్.

2071


తే.

అంత రుధిరంబు దొరఁగంగ నసురవిభుఁడు, రామశరఘాతమధుమాసతరమణఁ జేసి
పుష్పితాశోకతరువుతోఁ బోలి యొప్పెఁ, గులిశహత మైనజేవుఱుఁగొండ యనఁగ.

2072

తే.

కోపపావక[45]తీవ్రప్రతాపుఁ డగుచుఁ, జాపకౌశల మమరంగ నేపు రేఁగి
ధరణినాథువిపులభుజాంతరమునందు, వేయిశరములు నిగిడించె వివిధగతుల.

2073


క.

పరువడి రుధిరము దొరఁగఁగ, నరుదుగఁ దనరారి నినకులాధిపుఁ డంతన్
సురరిపునాశము సెప్పుచు, సరి నెత్తురు గురియుచున్నజలదముఁబోలెన్.

2074


చ.

పొరిఁబొరిఁ బంక్తికంధరుఁడు భూవరు నేసినఁ గాఁడి పాఱి యు
ద్ధురగతి నేల నాటి యతితూర్ణము లై భుజగాలి భీతిసం
చరమతిఁ జూచుచుండఁగ రసాతలిఁ జొచ్చె నజస్రపాపమే
దురత నుదగ్రబాణము లధోగతి నొందినమాడ్కి నారయన్.

2075


వ.

రాఘవుండును దశవదనకఠోరబాణపరంపరాసారజర్జరీకృతశరీరక్షతనిష్ఠ్యూతధా
రాళకరాళరక్తసిక్తుండై మండలీకృతకోదండనిర్యాతంబులును సంతమససంపా
దకంబులును సమాచ్ఛాదితచండకరప్రకాశంబులును నీరంధ్రీకృతదిక్తటంబులు
ను గనకపుంఖమండితంబులు నగునిశితప్రదరంబులు వఱపినం జేయునది లేక
నివ్వెఱఁగంది శరగ్రహణాకర్షణసంధానమోక్షణాదులందును బరాధీనుండై యు
న్నం గనుంగొని దరహసితచంద్రికాసముల్లసితవదనచంద్రుం డై రామచంద్రుం
డు పేర్కొని పిలిచి రావణున కి ట్లనియె.

2076


మ.

తగునే స్రుక్కఁగఁ బెక్కుపంతము లొగిన్ దర్పంబుతో నాడి యి
ట్లు గడున్ నివ్వెఱఁ గంది యుండఁగ భుజాటోపంబు దా నెందుఁ బో
యె గుణంబుల్ దలపోయ కాడుదువు నీ వీభంగిఁ బొ ల్పేదినన్
నగరే నీసరివార లిందులకు నోనక్తంచరాధీశ్వరా.

2077


మ.

మును మీయన్నఁ గుబేరు గెల్చి సుమహామోదంబునం బుష్పకం
బనుమానింపక పుచ్చుకొంటి వతిమాయాదక్షతం గానలో
నను నాతమ్మునిఁ గన్మొఱంగి యిది యన్యాయంబు నా కట్లు భూ
తనయం దెచ్చితి నీవు వింశతిభుజా తర్కింపఁగా శౌర్యమే.

2078


క.

నాకన్నులయెదురం బడి, నీ కెక్కడి కేఁగవచ్చు నిష్ఠురగతిఁ బో
నీక పొలియించువాఁడం, జేకూరెం గోర్కి నాకు జితబలభేదీ.

2079


తే.

పాఱి పోయినఁ బో నీక పట్టి కూల్తు, నాతతాయివి నమరారి వైననిన్ను
నంబుజాసనహరిహరు లడ్డ మైన, నిజము సు మ్మిది యోరజనీచరేశ.

2080


వ.

నీమాంసశోణితమేదోమస్తిష్కంబుల భూతతృప్తి గావింతు నని పలుకుచున్న
యవ్వసుధావల్లభు నవలోకించి లంకావల్లభుండు సాగ్రహంబుగా ని ట్లనియె.

2081


చ.

గొనకొని యుద్ధరంగమునఁ గొందఱ రాక్షసులన్ వధించి యే
పునఁ గడు విఱ్ఱవీఁగెదవు పోటరి నంచు ని దెంతపెద్ద యి
వ్వనచరసేనఁ గూడుకొని వచ్చి సముద్రము దాఁటి క్రొవ్వునన్

నను వెఱపింపఁ జూచెదవు నా కిది గణ్యమె రాజనందనా.

2082


సీ.

వల్మీకమునకు నవ్వాసవగిరికిని, రాజిలంబునకు నురగవిభునకుఁ
గలవింకమునకును ఖగకులాధిపునకుఁ, బల్వలంబున కకూపారమునకు
ఖద్యోతమునకు నాప్రద్యోతనునకును, హరిణపోతమునకు హరిపతికిని
మశకజంతువునకు మదసింధురమునకు, నక్షంబునకుఁ గల్పవృక్షమునకు
నెట్లు నీకును నాకును నెనయ నగుట, యట్ల కావున నీతోడ నడరి పోర
సిగ్గు గదిరెడు నైన నిస్సీమవృత్తి, దొరయవలసెను దలపాటు దొరకుకతన.

2083


చ.

అమరులఁ జీరికిం గొనక యక్షుల నుక్కడఁగించి బల్మిమై
జము నదలించి ఖేచరభుజంగుల గ్రక్కునఁ దూలపుచ్చి లో
కము లవలీల గెల్చి యధికం బగుకీర్తికి నెక్కి మానవా
ధము సరిఁ జేసి పోరుదునె దర్పముఁ బెంపును రిత్తపుత్తునే.

2084


మ.

పటుబాహాబలశక్తి యేర్పడ ధనుర్బాణంబులం దాల్చి మ
ర్కటకోటిం దునుమాడి మారుతసుతుం గారించి సుగ్రీవుఁ బ్రా
కటశక్తిం బొలియించి వాలితనయుం గాలాలయుం జేసి యూ
ఱట నే నొందెద నిన్ను నీయనుజుఁ దీఱం జేసి నిశ్చింతతన్.

2085


మ.

ఒగి బాహాబలయుక్తుఁ డైనయతికాయుం గుంభకర్ణున్ మహా
నగభిద్భేదను నింద్రజిత్తు ననిలోనం గూల్చి నీ వుండఁగాఁ
బగ సాధింపక లంక సొత్తునె ధనుఃపాండిత్య మేపారఁగా
మగపంతంబున మీఱువాఁడ [46]విజయామానస్థితిం బేర్చెదన్.

2086


మ.

అని కల్పాంతకృతాంతుకైవడి నుదగ్రాటోపకోపమ్మునన్
జనితోత్సాహరసంబునం బొలిచి చంచత్కార్ముకజ్యాగళ
ద్ఘనదివ్యాస్త్రము లేసె రాఘవుపయిం గ్రవ్యాదనాథుండు గ
ర్జనతో నార్చుచు నేచి యశ్రమగతిన్ సవ్యాపసవ్యంబుగన్.

2087


శా.

క్షోణీచక్రము సంచలింపఁగ రథక్షోభంబు గావించి గీ
ర్వాణుల్ తల్లడ మంద నుగ్రదహనజ్వాలావలీవిస్ఫుర
ద్బాణశ్రేణులు లీలమైఁ బఱపె నద్ధాత్రీశుపై నుల్లస
త్త్రాణోదగ్రత రావణుండు విజయోత్సాహాతిరేకంబునన్.

2088


క.

జనపాలకనందనుఁ డవి, తునుమాడి నిజాస్త్రసమితిఁ దోడ్తోడన త
ద్ఘనకోదండపటుత్వము, ననురూపము గాఁగఁ బోరె నమరులు మెచ్చన్.

2089


క.

కులిశసమానశరంబులు, బలువిడిఁ గురియించె రామభద్రునిమీఁదం
జలముకొని దైత్యనాథుఁడు, విలయోత్థితవారివాహవిపులస్వనుఁ డై.

2090


క.

మఱి కాలాహిశరంబులు, దఱుచుగఁ బైఁబఱపి దెసల ధరణిని జదలన్

గిఱిగొని చీఁకటి ముంపఁగ, నెఱి దప్పక పోరు యామినీచరుఁ డలుకన్.

2091


శా.

క్షోణీమండలనాథసూనుఁడు నదత్కోదండుఁ డై దీర్ఘదృ
క్కోణోపాంతములందుఁ గెంపు గదురం గోపించి వల్మీకవ
త్తూణీరోదరనిర్గతాహివిశిఖస్తోమంబులన్ ముంచినన్
వేణీభూతము లై దశాస్యుఁ బొదివెన్ విధ్వంసనాయత్తతన్.

2092


ఉ.

భర్మవిచిత్రపుంఖశితబాణపరంపర లేసి గ్రక్కునన్
వర్మము సించి యుద్దవిడి వజ్రకఠోరశిలీముఖంబులన్
మర్మము లుచ్చిపోఁ జొనిపి మానక ఫాలమునందు గ్రుచ్చినన్
దుర్మదుఁ డైనరావణుఁడు దూలె రథంబునఁ గొండకైవడిన్.

2093


వ.

అయ్యవసరంబున.

2094


తే.

కాలకేతుండుభీతిల్లి కణఁకతోడఁ, దొలఁగఁ గొనిపోయె నరదంబు దురమునకును
నఱిమి పోటుల నెత్తురువఱద పుడమి, నడరు పెంధూళి నొక్కట నడఁగఁజేయ.

2095


తే.

రామబాణపరంపరారమణిచేత, నట్టు లాలింగ్యమానుఁ డై యసురవిభుఁడు
సాంద్రతర మైనపారవశ్యంబు నొంది, తెలిసి యల్లన గనువిచ్చి దెసలు చూచి.

2096


వ.

అసురవిభుం డరదంబుపై గ్రక్కున లేచి నిలిచి జగంబులు మ్రింగ నప్పళించు
మృత్యువుంబోలె నకాండప్రళయసంభ్రాంతకృతాంతాకృతి యై యాగ్రహించి
మనంబున లజ్జాసంభ్రమరోషంబులు ముప్పిరిగొన ధూమచ్ఛటాజటిలభ్రూభం
గవలయుం డై కరాగ్రస్రస్తంబు లగుధనురాదిసాధనంబు లెప్పటియట్ల యల
వరించి సన్నద్ధకంకటుం డై శిథిలమణికిరీటంబులు పొందుగా నిలిపి సారథిఁ
జూచి యి ట్లనియె.

2097


మ.

శరసంధానవిశేషవత్త్వము భుజాసారంబు మాయాక్రియా
పరిపాకంబుఁ బ్రతాపముం గలుగఁగాఁ బాటింప కి ట్లీవు
యరదం బేల తొలంగఁ దెచ్చితివి యీయాలంబు దా నెంత యీ
ధరణీపాలుఁడు నవ్వఁ జేసితివి నిందాదుస్స్థితిం బొందితిన్.

2098


క.

హరిదహనశమనరాక్షన, వరుణమరుద్ధనదశూలివరగంధర్వా
సురయక్షుల యుద్ధంబుల, నిరవుగ నాలావు నీవు నెఱుఁగుదు కాదే.

2099


క.

ఎఱిఁగియు సాహసమతి వై, మఱలింపఁగఁ దగునె రథము మానవపతికిన్
వెఱతునె నే నాతని ననిఁ, బఱ పెద నాలావు పెంపు బడి మఱచితివే.

2100


వ.

అనినం గాలకేతుండు రావణున కి ట్లనియె.

2101


ఆ.

ము న్ననేకయుద్ధముల నీకు సారథి, నైతి నింతబెడిద మైనసమర
మెఱుఁగ నీవు చిక్కి యిబ్భంగి వ్రాలిన, నిట్లు సేయవలసె హీనవృత్తి.

2102


వ.

మూఢత్వంబును బ్రమత్తత్వంబును రథచోదనాక్షమత్వంబును భీరుత్వంబును
బొంది కావించుట గాదు సారథు లగువారలకు రథికుండు పరిపంథిబాణపీడితుఁ

డై మూర్ఛాయత్తుం డయిన రథంబు దొలుగం గొనిపోవుట పరమధర్మం బది
యునుంగాక యిత్తురంగంబు లతిమాత్రరణంబున నాయస్తంబులై రథవహనం
బునం దక్షమంబు లగుటం బరికించి సేద దేర్పవలయుటం జేసి బుట్లు దెచ్చితి రథికు
నుత్సాహదర్పేంగితహర్షఖేదదైన్యాదైన్యపారవశ్యబలాబలనిమిత్తంబు లగుదశ
లక్షణంబులం బరికింప వలయు నవి నీయందుఁ గొన్ని కానంబడుటం జేసి యిట్లు
గావించితి నింతట నేమికొఱంత సముత్సాహంబుతో నాయుష్మంతుండ వయి
పగఱ గెలుతువుగాత మనిన నతనివలన సంతసిల్లి యెచ్చట రాముం డున్నవాఁ
డచ్చటికి రథంబు రయంబునం బఱపు మని దశకంఠుండు పలికిన నతండును.

2103


సీ.

నేమిఘట్టనముల భూమి విదీర్ణ మై, పాంసురూపమున నభంబు సొరఁగఁ
దురగసముద్ధతఖురతాడనంబులు, వరునన నహిరాజుశిరము లదర
రాహుధ్వజము సూచి రవి తల్లడంబునఁ, దొల్లింటిగతి దప్పి తొట్రు పడఁగఁ
గర్ణదుశ్శ్రవమహాకఠిననినాదంబు, జగదండమండలిఁ బగులఁ జేయఁ
గాలకేతుఁడు దననేర్పుకలిమి మెఱసి, యసురనాథున కుత్సాహ మతిశయిల్లఁ
దలఁపుకొలఁదులు గడవంగఁ దఱిమి పఱపె, నురుశతాంగమునురవడి సురలు గలఁగ.

2104


తే.

అంజనాచలసన్నిభుఁ డసురవిభుఁడు, ధన్వి యై హేమభూషణోదారరుచుల
నింద్రచాపంబుమెఱుఁగుల యేపు గలిగి, కాలజీమూతమో నాఁగఁ గానఁబడియె.

2105


మ.

హరిచక్రానుపమానవేగగతి నత్యంతంబు దుష్ప్రేక్ష్యుఁ డై
గరుడోద్దామసమానమానసజయోగ్రస్ఫారవేగంబునన్
ధరణీమండలి సంచలింపఁగ సముద్యద్భాతి దైత్యేంద్రున
య్యరదం బుద్ధతి నేఁగు దేరఁగ నరేంద్రాధీశ్వరుం డి ట్లనున్.

2106


శా.

కంటే మాతలి పంక్తికంఠురథ ముగ్రస్ఫూర్తియై సంచల
ద్ఘంటానాదము లద్రిగహ్వరమహాగర్భంబులం గ్రమ్మగా
మింటం బర్వెడుకేతనాంశువులయున్మేషంబుతో వచ్చె నా
వెంటన్ నీయరదంబునుం బఱపుమా వేగంబు రెట్టింపఁగన్.

2107


వ.

అనిన నమ్మాతలియు నుల్కాపాతాతియామిత్వంబు లలవడ నతిరభసంబుగా
నపసవ్యగతి సంక్రందనస్యందనంబు నయ్యాతుధానుపైఁ బఱపిన.

2108


శా.

గీర్వాణారి దురాగ్రహంబునఁ ద్రిలోకీభీకరాకారుఁ డై
గర్వగ్రంథి దృఢంబు సేయుచు దిశాకంపంబుగా నార్చుచున్
దోర్వీర్యంబున మించి దివ్యశరముల్ దోడ్తో ధరాధీశుపైఁ
బర్వం బెల్లుగ నేసెఁ గుండలితచాపప్రౌఢిమాసక్తిమై.

2109


క.

రథముపయి నేసి వడి సా, రథిపయిఁ గురియుచు మహేంద్రరథ్యంబులపైఁ

బృథులగతిఁ బఱపి రాముం, బ్రథనోగ్రుం బొదివె నిశితబహుబాణములన్.

2110


క.

సురవైరిసాంద్రబాణో, త్కరములచే మునిఁగి యొప్పె ధాత్రీపతి మే
దురమేచకజీమూతాం, తరితుం డగుభానుపగిదిఁ దత్క్షణమాత్రన్.

2111


చ.

పవనుఁడు తూలజాలములఁ బన్ను గఁ బాయఁగ వీచుచాడ్పునన్
జవమున మేదినీపతి నిశాచరబాణమహాపరంపరల్
తవిలి వినోది యై విరియఁ దట్టి యుదగ్రతఁ దేజరిల్లె నం
త విగతధూముఁ డై కనలు దావకృశానునిమాడ్కి నెంతయున్.

2112


శా.

ప్రత్యాలీఢవిశేషసంస్థితికళాపారీణత రాఘవుం
డత్త్యారూఢసమీకరాగమున నుద్యద్బాణజాలంబు లా
దైత్యాధీశునిమేన గ్రుచ్చిన సముద్దామస్ఫురత్ప్రాభవో
ద్వృత్త్యారంభమునన్ శిలీముఖము లుర్వీనాథుపై నించినన్.

2113


సీ.

సముదగ్రతరజయస్తంభంబు నా వింట, మించిననారి సారించి మెఱసి
కమలసంభూతాండగర్భగోళము నిండి, ఘనతదీయధ్వాన మినుమడింప
శక్రదత్తామోఘశక్తి వే సంధించి, విడిచినఁ బవికోటివితతు లొదవ
శతసహస్రాయతసముదాయములఁ బేర్చి, దహనార్కసంహతిమహిమ దెగడి
సురలు సెలఁగంగ దానవవరులు గలఁగ, రాముశరములు దైత్యునురస్స్థలంబు
గాఁడి నెత్తుటఁ గడియక కనదుదార, సురుచిరోల్కలకైవడిఁ బరఁగి పఱచె.

2114


వ.

కొన్ని సీతామహాదేవికి రామువిజయంబు సెప్పుగతి లంకకుం జనియెఁ గొన్ని
యి౦ద్రాదులకు రావణవధంబు గాఁగలదని యెఱింగించుక్రియ నాకసంబున కరి
గెఁ గొన్ని దిక్కాంతలకు లోకంబులకు సేమంబు గల్గు నని నివేదించుకరణిఁ ద
దుపకంఠంబులకుఁ బోయెఁ గొన్ని యిటమీఁద సుఖంబున నుండఁగలవారని
యురగులకుఁ గుశలవార్త ప్రకటించుమాడ్కిఁ బాతాళంబున కేఁగెఁ గొన్ని
దశాస్యుసర్వావయవసంధిమర్మంబులు గాఁడె మఱియు నీరంధ్రంబు లై రఘు
వీరు శరంబులు నిగుడం దొడంగిన.

2115


మ.

అమరద్వేషి శరంబు లేసిన నసూర్యంపశ్యశైలోదర
స్థమహాగహ్వరగర్భనిర్భరమహాధ్వాంతప్రభావచ్ఛిదా
క్షమతేజంబునఁ గ్రాలి దిక్కులు వెలుంగంగా లలాటాంతరా
ర్యమసాహస్రసమంబు లై పొదివె నుద్యద్వేగసంపధ్గతిన్.

2116


వ.

ఇతరేతరజయకాంక్ష లినుమడింపం జలంబును బలంబును గదిరి యెదిరి స్రు
క్కక యుక్కు దక్కక యుభయబాణంబులుం బరస్పరభేదనంబు నొందుచుండ
నన్యోన్యతర్జనవాక్యంబులు రోదోంతరంబు నిండ నేకైకసక్రోధశోణలోచనమ
యూఖచ్చట లకాలసంధ్య గావింప సదృశసాహససంపాదనసమరవ్యాపారబల
శౌర్యశస్త్రచాతుర్యు లై యొక్కనిమిషార్ధంబు నుడుగక నిద్రాదివ్యవహారం

బుల నొందక క్రమక్రమప్రవర్ధమానభుజలాఘవు లై సప్తాహోరాత్రంబులు
సమరంబు సలిపిరి తదనంతరంబ.

2117


ఉ.

దానవుతేరిపైఁ గురిసెఁ దద్దయు నెత్తుటివాన మేఘముల్
మానక యశ్వవాలముల మండుచు నిప్పులు రాలె నంత ర
క్షోనివహంబులోఁ దిరిగి ఘోరత నక్కలు గూయఁ జొచ్చెఁ బై
పై నిల వ్రాలెఁ గేతువులు పర్వె రజంబులతోడిధూమముల్.

2118


క.

నలుపులుఁ గెంపులుఁ బీతం, బులుఁ దెలుపులు హరితవర్ణములు నైనకరం
బులు గల్గి భాస్కరుఁడు చి, త్రలసద్ఘనధాతుయుక్తధరముం బోలెన్.

2119


సీ.

ప్రతికూలుఁ డై వీచెఁ బవనుండు రజముతో, నుల్కలుఁ బిడుగులు నోలిఁబడియెఁ
గాకగృధ్రోలూకకంకాదిఖగములు, నసురేంద్రుతలలపై నాడఁదొడఁగె
నొగి ముక్తకేశి యై యొకజోటి పలుమఱు, నరదంబు చేరువ నరిగె నంత
నేఁడు నీ వీల్గుట నిక్కువం బని పల్కె, నశరీరిణియును భూతావలియును
దిక్కు లెల్లఁ బొదివెఁ దిమిరసమూహంబు, మింట నడరె రజము మిక్కుటముగ
నిల ప్రకంప మొందె నెంతయుఁ దొలునాఁటి, యట్టలాడఁ జొచ్చె నంతనంత.

2120


క.

మునుకొని యీక్రియ నెంతయు. మునుముగ నగుదుర్నిమిత్తములు సూచి మనం
బున నాస విడిచి ధైర్యం, బనుమిత్రుని నూఁదిపట్టె నసురుఁడు కడఁకన్.

2121


చ.

గిరితరుజాలహస్తు లగుకీశులుఁ బట్టినభిండివాలము
ద్గరకరవాలశూలపరిఘప్రభృతిప్రతిభాసమాను లై
పరఁగిన దైత్యవీరులును బాయక పోరెడుపోరు మాని చి
త్తరువున నున్నభంగి విదితంబుగ నిశ్చలవృత్తి నుండఁగన్.

2122


చ.

కుటిలపరాక్రమప్రవణుఁ గుత్సితచేష్టితగర్హితున్ సము
త్కటదురితాలవాలు నతిదర్పితునిన్ రజనీచరాధముం
జటులనిశాతఘోరశరజాలములం బొలియింపు మంచు నొ
క్కటఁ బలికెన్ రఘూద్వహుని గ్రక్కున వేడుకఁ బంచభూతముల్.

2123


చ.

ఎనయఁగ దుర్నిమిత్తము లనేకములుం బొడగాన వచ్చినం
దననిధనంబు సిద్ధ మని దైత్యుఁడు శూరత నేపు రేఁగె న
మ్మనుజవరుండునుం దనకు మంగళసూచనచిహ్న లేర్పడం
గని విజయంబు నొందుటకుఁ గౌతుకి యయ్యె నిజాంతరంబునన్.

2124


చ.

రజనిచరుండు రాముఁడుఁ బరస్పరనిర్ణయలాలసాత్ము లై
భుజబలసత్త్వసంపదలు భూరిశరంబులపెల్లుఁ బ్రాభవం
బు జగదభీష్టదప్రథనభూతియఁ జూపుచుఁ బోరి రేపునన్
గజపతియున్ మృగాధిపుఁడుఁ గంపము నొందక పోరుకైవడిన్.

2125


మ.

వికసత్తేజము నొంది పెం పెసఁగునుర్వీనాథుశస్త్రాలి మృ

త్యుకటాక్షుచ్ఛటఁ బోలి యుగ్రగతి దైత్యుం దాఁకెఁ దత్తీవ్రసా
యకజాలంబులు రాముపై జయరమాపాంగచ్ఛవిం బర్వె ను
త్సుకుఁ డై నారదుఁ డుబ్బి యాడఁగ సురస్తోమంబు మోదింపఁగాన్.

2126


శా.

లంకానాథకులాచలంబు సమరశ్లాఘాసముద్యద్బలా
లంకారం బగు సాహసంబున విలోలత్సాయకగ్రావముల్
హుంకారంబున రామచంద్రహరిపై నుత్సాహ మేపార ని
శ్శంకుం డై కురిసెన్ లసద్భుజవనస్ఫారచ్ఛవిం బేర్చుచున్.

2127


సీ.

అర్ధచంద్రాకృతి నడరెడుతూపులు, నెఱిభుజంబులమీఁదఁ బఱపి పఱపి
నాగదంష్ట్రోదగ్రనారాచజాలంబు, ఘనభుజాంతరములఁ జొనిపి చొనిపి
పవికోటిసంకాశభల్లపరంపర, గురుఫాలతలముల గ్రుచ్చి గ్రుచ్చి
శూలోపమానత్రిశూలబాణంబుల, నుదరపార్శ్వములందుఁ బొదివి పొదివి
దర్పశాలి యైనదైత్యునిఁ దూలించి, క్రమముతోఁ దురంగమముల ముంచి
సూతుఁ డైనకాలకేతుని సోలించి, తేజరిల్లె నాజి రాజవిభుఁడు.

2128


వ.

పరిఘగదాపరశ్వథముసలముద్గరచక్రశూలభిండివాలకరవాలపట్టిసతోమర
ప్రాసంబులు ఖరాంతకుపైఁ బఱపి దశాస్యుండు సింహనాదంబు సేసిన నవ్విభుం
డన్నియు నశ్రమంబున నర్ధచంద్రబాణంబుల [47]నిక్షుదండఖండనంబుగా ఖండించి
నిరంతరగభీరసాయకాసారంబుల నద్దానవవీరు వెఱచఱవం జేసిన నతండునుం
గినుక గదుర రథయానపాత్రకర్ణధారుం డై సంగరసాగరంబునం బ్రవర్తింపఁ
బ్రతికూలంబుగాఁ గుంభకర్ణభంజనప్రభంజనుండు సుడివడం జేయుచుండెఁ దద
నంతరంబ.

2129


క.

సుత్రామునిహయములపై, ధాత్రీపతిమేనఁ గేతుదండంబునఁ ద
జ్జైత్రశతాంగముమీఁద వి, చిత్రశరము లేసె నసురశేఖరుఁ డంతన్.

2130


శా.

అన్యోన్యాస్త్రవిఘట్టనధ్వనులు నుగ్రాటోపలీలోల్లస
జ్జన్యాడంబరనాదముల్ తురగహేషాఘోషముల్ తర్జనో
పన్యాసక్వణనంబులున్ విపులచాపజ్యారవంబుల్ యుగాం
తన్యాయంబు దలిర్పఁ బేర్చెఁ జగత్కంపంబు సంధిల్లఁగాన్.

2131


చ.

ఇరువురుఁ బోరి పోరి యితరేతరముక్తనిశాతసాయకో
త్కరములు మేన నాటిన నుదగ్రతలుం బటుబాహుదర్పముల్
వరశరసంధిలాఘవము వావిరి యొక్కట నుజ్జగించి డె
ప్పర మగునొప్పిఁ గొంతవడి పన్నుగ నూరక నిల్చి రాజిలోన్.

2132


ఉ.

బోరనఁ గ్రొమ్మెఱుంగులు నభోవలయంబునఁ బర్వుచుండఁగా

భూరమణుండు నంత సురబృందము లాదట మెచ్చ నిస్వన
స్ఫారతరార్ధచంద్రముఖసాయక మొక్కటి యేసి కూల్చె దే
వారిరథధ్వజత్రయము నత్తఱి మ్రోయుట యేడ్చునట్లుగాన్.

2133


క.

లోకత్రితయజయస్తం, భాకృతి[48]గతిఁ గేతనత్రయము విఱిగిన ను
ద్రేక మొదవంగ రాముం, బ్రాకటముగ నొవ్వ [49]నేసెఁ బలలాశి యటన్.

2134


చ.

బలువిడిఁ గర్తరిక్రకచభల్లము లేసి నిమేషమాత్రలోఁ
దలలును జేతులుం దునుమఁ తత్క్షణమాత్ర మహాద్భుతంబుగా
మొలచినఁ జూచి రాఘవుఁ డమోఘతఁ దూపులు దాఁకనొక్కొ య
క్కొలఁదులఁ దాఁకినం దెగవొకో యని యచ్చెరు వందె నెంతయున్.

2135


తే.

మఱియు నెప్పటి దునుమాడె మానవేంద్రుఁ, డవియుఁ దొల్లింటికైవడి నడరి మొలచెఁ
బదిశిరంబులు నిరువదిబాహువులును, నధిపుమనమునఁ గడుసందియంబు గదుర.

2136


తే.

ముసలకరవాలపట్టిసముద్గరాసి, బాణకార్ముకకంకణోద్భాసితంబు
లయినచేతులు మణికిరీటాభిరామ, కుండలము లగుశిరములుఁ గూడి మొలచె.

2137


ఆ.

ధీరుఁ డయిననృపతి ఘోరభల్లంబులఁ, ద్రెంపఁ దడయ కంతఁ దేలి మొలచెఁ
దాళదీర్ఘబాహుతతులును రోహిణ, శిఖరమణికిరీటశిరము లొప్ప.

2138


సీ.

బాణాసనవ్యగ్రపాణి యై రాముఁడు, పఱఁగింపఁ బఱచునాభల్లతతులు
పవనపథంబున బలువిడి మ్రోయుచు, నురవడిఁ దాఁకఁగ నొక్కమొగిన
కీలు దప్పించినక్రియ నూడిపడుచున్న, శిరములుఁ గరములుఁ జెలువు మిగిలి
మణికుండలప్రభామండలంబులు, భానుమండలంబులుఁబోలె మెండుకొనుచు
భుజగరాజభోగపృథులతరాయత, భుజకదంబకములు పొలుపు మిగిలె
వెఱచి యంతనంత వేల్పులు దమపుష్ప, కములుఁ దారుఁ దొలఁగి కలయఁబఱవ.

2139


క.

తెగునెడ నెత్తురు నొప్పియు, మొగి నేమియుఁ గానరాక మున్న శిరంబుల్
యుగసన్నిభహస్తము లెడ, తెగక నిమిషమాత్ర మొలచు దృప్యద్గతితోన్.

2140


ఉ.

ఉన్నవి యున్నయట్ల తల లుర్వికి డిగ్గె శిరఃప్రవాహముల్
ము న్నొకసారె నిండుదెగ మోపినసాయక మట్లయుండఁ జాఁ
గె న్నెఱిఁదూపువెల్లి యని ఖేచరకోటి నుతించె నంచితో
త్పన్నదశాస్యరాఘవతపఃకరలాఘవచిత్రసంపదల్.

2141


ఉ.

[50]త్రెవ్వెడుగంటులం గురువు దేఱెడునెత్తురు రాకమున్న యే
నొవ్వియు నేవికారము మనోగతిఁ జెందకమున్న సాయకం

బవ్వలఁ బోకమున్న మకుటాగ్ర వఘట్టనరాణ మొప్పఁగా
నువ్వున నుప్పతిల్లె నసురోద్వహమూర్ధచయంబు గ్రక్కునన్.

2142


క.

తెగుతలలు మీఁది కురవడి, నెగయుతలలుఁ బడెడుతలలు నేర్పడ ధరణిన్
మొగిఁబడెడుతలలుఁ దఱుచై, గగనము ధరణియును నిండఁ గప్పెం దోడ్తోన్.

2143


తే.

తునిసి మీఁది కెగసి ఘనసత్త్వజవములఁ, బొలుపు మిగిలి మున్ను పూని వైవ
నున్నయాయుధములు పన్నుగ రఘువీరు, పయిఁ బ్రసక్తి వైచుబాహుతతులు.

2144


చ.

పరువడి రాముఁ డేయుశితభల్లములం దెగి తచ్ఛిరఃపరం
పర లొగి నుప్పతిల్లుచు నభస్స్థలి నాఁ జనుభద్రకాళి ని
ర్భర మగుకౌతుకం బొదవఁ బన్నుగఁ దాల్చుకపాలమాలికా
స్ఫురణములం దనర్చెఁ బృథుశోణితసూత్రనిబంధనస్థితిన్.

2145


చ.

అలయక కన్నుఱెప్ప యిడునంతవిళంబము లేక రాముడుం
దలలును జేతులుం దునుమ దైత్యవిభుండును విస్మయంబుగాఁ
దలబడి భూమిపాలుపయి దిట్టముగాఁ బఱపెన్ శిలీముఖం
బులు సురసిద్ధసాధ్యులు నభోవలయంబునఁ బిచ్చలింపఁగన్.

2146


సీ.

విచ్ఛాయ నొందక వేడుక దప్పక, కనుఱెప్ప వెట్టక కడఁక చెడక
హాసంబుఁ బొలియక త్రాసంబు నొందక, యావులింతలు లేక చేవ వెలయ
భ్రూభంగరుచులును భూరిధిక్కృతులును, నుగ్రవీక్షణములు నాగ్రహములు
భూరివిరావముల్ బొబ్బలు వార్పు ల, హంకారములు బహుహుంకృతులును
గలిగి దనుజుతలలు గలయుచుఁ దమలోన, మొనసి ముదముతోడ ముచ్చటాడు
రామభద్రుఁ దెగడు రావణు నుతియించు, సురలఁ గోప మడరఁ జూచు మెచ్చు.

2147


ఉ.

ఆర్పులు నింగి ముట్టఁగ నుదగ్రతరం బగుకిన్కతోడ ని
ట్టూర్పులు సంగడింపఁగ సముజ్జ్వలదంష్ట్రలక్రొమ్మెఱుంగులున్
దర్పముతోడిచూడ్కులు నుదారము లై నిగుడంగ మూర్ధముల్
నే ర్పొదవంగఁ ద్రుంచె ధరణీపతి సత్వరభల్లసంహతిన్.

2148


శా.

కుప్యద్రామవిముక్తతీవ్రవిశిఖక్షుణ్ణంబు లై యెంతయున్
దృప్యద్రావణమస్తకంబులు మదోద్రేకంబునన్ భానుమ
ద్దీప్యన్మండలలక్షితంబు లగుచున్ దేవావలిం ద్రాసవై
రూప్యాలంబము నొందఁజేసె విజయారూఢారవారంభతన్.

2149


చ.

తెగి యెదురై తనర్చి చనుదెంచుశిరం బది చూడ నెంతయున్
నెగడి నరేంద్రచంద్రుపయి నెక్కొని యున్నదురాగ్రహంబునం
బగగొని మ్రింగఁ బూని హతభావముతో నరుదెంచుచున్నరా
హుగతి వియత్తలంబునఁ బయోదవినీలిమభాసమాన మై.

2150


క.

గరుడధ్వజుఁ డగురాముని, నురవడితోఁ గఱవవచ్చునురగములగతిం

బరువడిఁ దెగిపఱచునిశా, చరుకరములు దెఱపి యీక చదలం బొలిచెన్.

2151


క.

కరము లనుకంబములసొం, పరాయంగా నిలిపి నిలిపి యనురాగమునన్
శిరము లనుసరసిజంబుల, విరచించినతోరణములు వెలసెం జదలన్.

2152


చ.

రవికులశేఖరుం డయినరాముశరంబులుఁ దద్విలూనదా
నవకరమస్తకంబులు నినాదచలద్బహుకాకకంకఘూ
కవిహగముల్ నభంబు వెసఁ గప్పినఁ జీఁకటి పర్వె రేయునుం
బవలును సంధ్యయుం దెలియఁ బ్రస్ఫుటభావము లేక యెంతయున్.

2153


శా.

ఈచందంబున భాస్కరాన్వయకులాధీశుండు పెంపార దు
ష్టాచారుం డగుపంక్తికంధరునితో నారూఢుఁ డై పోరి బా
హాచంచద్బలవిక్రముం డయినదైత్యాధీశునిం గూల్పఁగా
నేచొప్పుం దలపోయలేక విజయోపేతాంతరంగంబునన్.

2154


శా.

వీనిం బోలునిశాచరుల్ గలరె యీవిశ్వంబునన్ వీనిస
త్త్వానూనస్థితిఁ జూడ నచ్చెరువు బాహాశక్తియున్ వింత శ
స్త్రీనైపుణ్యము గ్రొత్త సంగరతలస్థేమంబు దా వేఱు నే
వీనిం జంపఁగ లేనొకో యకట నావీర్యోద్యమం బేటికిన్.

2155


మ.

తలలుం జేతులుఁ ద్రుంచి వేసరితి నుద్యత్ప్రౌఢిమైఁ బోరి దో
ర్బలముం జేవయుఁ జూపి యే విసిగితిం బ్రత్యర్థి నేచొప్పునన్
గెలువన్ వచ్చును వీని కస్త్రములచేఁ గీడ్పాటు వాటిల్లదో
విలయం బారయ వీని నొందదొకొ భావింపంగ నేచందమో.

2156


ఆ.

అనుచుఁ జింత నొంది యాత్మలోఁ దలపోసి, చేయునదియు లేక చిన్నఁబోయి
యలసి యున్నఁ జూచి యవ్విభీషణుఁ డిట్టు, లనియె రాముతోడ వినతుఁ డగుచు.

2157


చ.

ప్రముదితమానసుం డయినబ్రహ్మవరంబున వీనినాభియం
దమృతము కుండలాకృతి మహత్త్వమునం దగ నుంటఁ జేసి మూ
ర్ధములును జేతులుం దెగియుఁ దత్క్షణమాత్రన పుట్టుచున్న వీ
క్రమమునఁ జావు లే కునికి కారణ మి ట్లెఱుఁగంగఁ జెప్పితిన్.

2158


ఉ.

ఎక్కడఁ బట్టి వీనిపయి నేసెదు తూపుల నెంతఁ బోరినం
జిక్కఁడు వీడు మూర్ధములుఁ జేతులుఁ ద్రుంచుట కేదిమాన మీ
రక్కసునాభిఁ బావకశరంబు ప్రయుక్తము సేయు మంతటం
దక్కక యింకిపోవు నమృతం బొకమాత్ర నరేంద్రశేఖరా.

2159


మ.

మదమానంబుబు దూలి రావణుఁడు భీమప్రౌఢి వో నాడి నె
మ్మదియుం దక్కి నిరాశజీవుఁ డగు నాత్మన్ నీవు దొల్లింటిచొ
ప్పు దలిర్పన్ నిశితాస్త్రజాలముల నాస్ఫోటంబునన్ నూటతొ
మ్మిదిమాఱుల్ దలలుం గరంబులు బలోన్మేషంబునం ద్రుంచినన్.

2160

వ.

మఱి పొలియంగలవాఁ డని చెప్పిన రఘువీరుండు రోషానలవివర్తంబుం బోనిపా
వకదైవత్యం బగుబాణంబు మంత్రపూర్వకంబుగా సంధించి యేసి తదీయనాభి
యం దున్నయమృతంబుఁ దదనలంబున కాహుతి చేసి చక్రీకృతచాపమండలుం
డై తొంటికైవడి మఱియు నూటతొమ్మిదిమాఱులు దలలును జేతులు నశ్ర
మంబునం దునిమిన.

2161


సీ.

గరుడమహోరగగంధర్వు లార్చిరి, ధీరతఁ గపులు మోదించి రెలమి
మొగి మస్తకంబులు దెగిన వేగంబున, నొక్కట రుధిరంబు లుప్పతిల్ల
దావకపావకశిఖాతతిసమావృత మైన, నడగొండకైవడి నడరి పేర్చి
శోణితజలసేకశోణ మై యున్నయా, రాక్షసాధిపుశరీరంబుమీఁదఁ
దల దనర్చె మిగులఁ దరుణాతపక్రాంత, తటవిరాజదుదయధారుణీధ
రంబుమీఁద నొప్పురవిమండలముక్రియ, దృష్టిదుస్సహోగ్రతేజ మగుచు.

2162


మ.

అకటా యెవ్వరు ము న్నెఱుంగనిమదీయం బైనమర్మంబు వీఁ
డు కృతఘ్నుం డయి చెప్పెఁ గూల్తు నని యాటోపంబు దీపింపఁ గో
పకఠోరుం డయి శక్తి వైవ నది భూపాలుండు భల్లంబులన్
శకలీభూతత నొందఁ జేసె విపులజ్వాలౌఘముల్ పర్వఁగాన్.

2163


వ.

యంత్రకూటముఖంబులన్ వెడలుదహనంబువడువున రామశిలీముఖవిలూనకం
ఠనాళవివరంబులవలన నుప్పతిల్లి సహజరోషమహాపావకంబుంబోలె నిష్క్రామ
ణంబు నొందుచున్న యంతర్గతప్రతాపంబు ననుకరించుచు నొక్కయనూనంబైన
తేజంబు రావణశిరంబులవలన వెలువడి యతిజవనపవననిహతం బగుదీపంబపో
లెఁ బొలిసిన నద్దానవుండు నేకశిరంబున రామచంద్రు నవలోకించుచుఁ గరద్వ
యావశిష్టుం డై కులిశభగ్నశృంగంబులు గలిగి వనగజవిలూనపాదపం బై యేక
ద్వికూటతాలంబులం బొలుచుశైలంబుపగిది నుత్పాటితసటం బగుకంఠీరవం
బుక్రియ నపనీతదంష్ట్రం బగుమహానాగంబుచాడ్పున నపహృతకాలదండుం
డగుకృతాంతుకైవడి విభ్రష్టమహాశూలాయుధుం డగురుద్రుభంగిఁ గానిపించి
విజృంభణంబు దక్కియు ధైర్యం బవలంబించి.

2164


ఉ.

రాజితధాతునిర్ఝరధరాధరసన్నిభుఁ డైనదానవుం
డోజ దలిర్పఁ దొంటిక్రియ నున్నతచాపము దాల్చి భానుమ
త్తేజము లైనబాణములు దిక్కులఁ బిక్కటిలంగ సత్వరుం
డై జగతీశుపైఁ బఱపె నార్చుచుఁ జూడ్కుల మంట లొల్కఁగన్.

2165


చ.

ఇనకులరాజశేఖరు నహీనసమానమహాశరాసనం
బున వడి నుప్పతిల్లుశరపూగవిషానలకీల లొక్కపె
ట్టునఁ జనుదెంచి సాహసకఠోరతఁ బేర్చిన దైత్యుఁ దాఁకెఁ బై
కొని విపులోల్క లుగ్రగతిఁ గూడి మహీధ్రము గ్రమ్ముచాడ్పునన్.

2166

చ.

ఇరువురు నేయుబాణము లహీనజవంబునఁ బర్వుచుం బర
స్పరపరిఘట్టనోత్పతితపావకదగ్ధఘనచ్ఛదంబు లై
యురవడి దక్కి యుండియును యోధసమంచితహస్తలాఘవ
స్ఫురితవిశేషసంపదలఁ బొల్పుగ లక్ష్యము దాఁకు నెంతయున్.

2167


శా.

ధీరోదాత్తవరేణ్యుఁ డైనపతియున్ ధీరోద్ధరుం డైనర
క్షోరాజన్యుఁడు మేరుసారనినదత్కోదండు లై సాగరో
దారోర్మిప్రతిమానసాయకము లుద్దామంబుగా నేయుచో
నీరంధ్రత్వము నొందె నాకసము శూన్యీభూతసప్తాశ్వ మై.

2168


క.

కంఠీరవఘనసత్త్వుఁ డ, కుంఠితవిక్రముఁడు చటులకోదండుఁడు సో
త్కంఠత నటించునద్దశ, కంఠునిపైఁ గురిసె నిశితకాండములు వడిన్.

2169


తే.

జగము లన్నియు నొకతలచటులసత్వుఁ, డైనదశకంఠుఁ డొకతల యనఁగ నదియ
నిజము గావించుకైవడి నృపవరుండు, నుచితసంస్థితి నొకతల నునిచె నెలమి.

2170


క.

తలలుం జేతులుఁ దునిసినఁ, బొలివోవనిధైర్య మొంది భుజయుగళంబుం
దలయొకటి దక్కి యుండియుఁ, జలమున నయ్యసుర పోరె జనవిభుతోడన్.

2171


సీ.

ఉత్సాహశౌర్యసముత్సుకుం డై చారు, ధైర్యసామగ్రిచేఁ దరలఁబడక
విపులచాపము దాల్చు వెరవు దప్పకయుండి, బాణసంధానంబు పఱపు చెడక
నెలకొని తేరిపై నిలుకడ పాటించి, యేపారునాగ్రహ మినుమడింప
విపులతరం బైనవేదన దలఁపక, సింహనాదంబున చేవ గలిగి
కుటిలచేష్టుఁడు పంక్తిముఖుండు లేని, తలలుఁ జేతులు నున్నట్లు దర్ప మెసఁగి
యసముడింపక సాహస మెసక మెసఁగఁ, బేర్చి రాఘవుతోఁ బో రొనర్చుచున్న.

2171అ


ఉ.

మాతలి సూచి యి ట్లనియె మానవనాయక యీదురాత్ము ని
ర్ధూతవిభావుఁ జేసి వడిఁ ద్రుంపుము దొల్లిటిభంగిఁ గ్రమ్మఱం
జేతులు మస్తకంబులును జెచ్చెర వీనికి నుప్పతిల్లునో
యీతఱి నూరకుండఁ దగ దేపునఁ జంపుట మేలు సూడఁగన్.

2172


క.

కావున బ్రహ్మాస్త్రమునన్, రావణుఁ దెగటార్పు మడరి రాఘవ సురలం
బ్రోవుము సమస్తజగములఁ, గావుము భూతముల నెల్లఁ గరుణింపు తగన్.

2173


వ.

అనినయనంతరంబ రఘువంశదీపకుం డగురాజన్యనందనుండు మున్ను తాను
యజ్ఞరక్షణముదితుం డగువిశ్వామిత్రుచేత విధిపూర్వకంబుగాఁ బడసినపైతా
మహాస్త్రంబు వినయాదరభక్తిపురస్సరంబుగాఁ దలంచి పుచ్చుకొని.

2174


మ.

అపధూమానలతేజుఁ డానృపతి ప్రత్యాలీఢసంస్థానుఁ డై
విపులోదన్వదుదీర్ణఘోష యగుమౌర్విం గూర్చి బ్రహ్మాస్త్ర మ
భ్రపథం బందినక్రొమ్మెఱుంగు లొదవం బ్రవ్యక్తి నొందించుచుం
ద్రిపురారాతియుఁబోలె దుర్జయతరస్థేమాభిరామంబుగాన్.

2175

చ.

హరి మొదలైననాకపతు లందఱు సంతసమంది చూడఁగా
నరవరుఁ డుగ్రకోపభరణంబున దైత్యునురస్స్థలంబుపై
వెరవుగ దృష్టి నిల్పి పటుకవిక్రమ మొప్పఁగ నేసె నేసినన్
బరుసన నభ్రవీథి వెసఁ బర్వుచు మండుచు దుర్నివార మై.

2176


సీ.

విలయార్కమండలావిర్భావ మొదవంగ, సంవర్తపావకచటుల మగుచుఁ
గులిశమహాయుధకోటిసంకాశ మై, కాలదండాయుతాభీల మగుచుఁ
జటులచక్రసహస్రసన్నిభస్ఫురణ మై, రుద్రశూలోదగ్రరుచులు నిగుడ
నిర్ఘాతసంఘాతనిష్ఠురపాత మై, ఫణిరాజసముదాయభయద మగుచు
సప్తమారుతదుర్వారజపము గలిగి, దానవస్తోమహృదయసంత్రాస మొదవ
శతమఖుఁడు మొదలైనదిక్పతులు మెచ్చ, నతినిరర్గళ మైనబ్రహ్మాస్త్ర మడరె.

2177


మ.

 కులగోత్రంబులు గ్రుంగె నంబుధులు సంక్షోభించె నిద్ధాత్రియుం
జలనం బొందె హరిద్గజంబు లదిరెన్ సర్పాన్వయేశుండు ని
ట్టలమై యోర్వక వీఁగెఁ గూర్మపతి వ్రీడం బొందె సర్వంబు ని
ట్లు లయారంభముఁ జెందుమాడ్కిఁ దలఁకెన్ డోలాయమానస్థితిన్.

2178


వ.

ఉభయపార్శ్వములందు వసువులును ముఖంబునందు దహనతపనులును బక్షం
బులయందుఁ బవనుండును నడుమ రుద్రులును దేజరిల్ల సకలసురవందనీయంబు
ను సర్వసిద్ధసాధ్యగంధర్వపూజ్యమానంబును నిఖిలదానవమదాంధకారమా
ర్తాండమండలంబును గరిరథతురగపదాతిజీర్ణకాననదవానలంబును బరిఘప్రాన
ముద్గరాదిసాధనజీమూతప్రచండమారుతంబును బరిపంథిసేనాబహువ్యూహభే
దనంబు నగునద్దివ్యశరోత్తమంబు భూతంబులును సురలును జయజయధ్వనులు
సేయఁ జనుదెంచి యింద్రాదిదిక్పతులవజ్రాదిసాధనంబులం బగులనిరావణును
రస్స్థలంబు గాఁడి తదీయప్రాణంబులు గ్రోలుచుం బుత్రి యగుసీతనిమిత్తంబు వ
గచువసుమతికి రాక్షసాధము వధియించితి నని చెప్పం బోవుపగిది భేదించికొని
పాతాళంబు సొచ్చి నిమిషార్థమాత్రంబునం గ్రమ్మఱి రాముతూణీరంబు సొచ్చెఁ
దనంతరంబ.

2179


ఆ.

బ్రహ్మకులజుఁడైన రావణుఁ జంపిన, యఘము వాపికొనఁగ ననఘుఁ డైన
రాముఁ జెందె ననఁగ రభసంబుతో నస్త్ర, మడరి దొనయ చొచ్చె నంతలోన.

2180


శా.

రామాస్త్రక్షతరక్తధార లొలుకన్ రక్షోవిభుం డంత సు
త్రామోదంచితవజ్రభిన్న మగుగోత్రక్ష్మాధరంబో యనన్
భూమిం గూలె శరాసనంబు శిథిలీభూతత్వ మొందంగ ను
ద్దామాక్రందము సేయుచున్ విగళితాంతస్సారసంచారుఁ డై.

2181


మ.

ధరణీభూధరదిగ్గజాహిపతు లుద్యత్త్రాసు లై క్రుంగి రు
ద్ధురభీతిన్ హతశేషదైత్యగణముల్ దూలెం బ్రమోదించె వా

నరయూథంబులు సిద్ధసాధ్యసురు లానందించి రేపార న
చ్చరలుం గౌతుక మొంది యాడిరి సముచ్చద్గేయహృద్యంబుగాన్.

2182


చ.

తొరఁగుచు నున్నతేనియలఁ దోఁగి విధూతపరాగజాలధూ
సరరుచిఁ బొల్చియున్న మదషట్పదముల్ చనుదేర సాంద్రబం
ధురతరగంధసంపదలఁ దోరము లౌ పెనుఁబుష్పవర్షముల్
గురిసిరి రామచంద్రుపయిఁ గుప్పలు గాఁగ నిలింపు లింపునన్.

2183


మ.

మొరసెన్ దివ్యమృదంగవాద్యములు సమ్మోదంబుగా గంధమే
దుర మై చల్లనిగాలి వీచె దెసలుం దోడ్తోన నాకంబు [51]సుం
దరనైర్మల్యము నొందె భూతములు నుద్యత్ప్రీతిమైఁ బేర్చె ది
క్కరినాదంబులు మించె భద్రము సమగ్రం బయ్యెఁ బంచద్గతిన్.

2184


వ.

అంత లంకానాథాంతకుం డగురామభద్రుండు రోదోంతరంబునం బిక్కటిల్లి మం
దరమథ్యమానాంభోరాళిగభీరఘోషసమం బగుసురగరుడోరగకిన్నరఖేచరయ
క్షగంధర్వవిద్యాధరసిద్ధసాధ్యగుహ్యకజయజయధ్వను లాకర్ణించుచు విభీషణ
సుగ్రీవజాంబవదాదిదనుజవానరభల్లూకనాథులు సేయుసాధువాదంబుల లజ్జావ
నతవదనుం డై.

2185


మ.

భుజసామర్థ్యము నివ్వటిల్ల నెలమిన్ భూమీశ్వరుం డీగతిం
ద్రిజగత్కంటకుఁ గూల్చి దివ్యసహజస్థేమానుభావంబునన్
విజయశ్రీ విలసిల్ల సంభృతసముద్వేలస్ఫురత్కీర్తి యై
రజనీనాథసమగ్రసారవిభవప్రాగల్భ్యసంపన్నుఁ డై.

2186


సీ.

ఘోరవిక్రముఁ డైనతారకాసురుఁ గూల్చి, మహనీయుఁ డయినకుమారుఁ బోలి
విపులసత్త్వుం డైనవృత్రాసురునిఁ ద్రుంచి, యెప్పారునాపురుహూతుపగిది
రౌద్రాత్ముఁ డై నహిరణ్యకశిపుఁ జంపి, చెలువారునన్నరసింహుకరణి
నతిమాత్రబలుఁ డైనయంధకాసురు నొంచి, శోభిల్లుచున్నయాశూలిమాడ్కిఁ
బంక్తికంఠునిఁ దెగటార్చి భానుకులుఁడు, సమ్మదంబునఁ దనజయస్తంభ మొనర
ధరఁ బ్రతిష్ఠించుకైవడి ధన్వరత్న, మిచ్చెఁ దమ్మునిచేతికి నెసక మెసఁగ.

2187


చ.

రణమునఁ గొండపోలె రఘురాముశరంబునఁ గూలి యున్నరా
వణుఁ గని శోకవేగఘనవారినిధుల్ దను ముంప నావిభీ
షణుఁ డతిదీనుఁ డై యడలు సైఁపఁగఁజాలక చేరవచ్చి త
త్క్షణమున విన్ననౌచుఁ బలుచందములన్ విలపించె నేడ్చుచున్.

2188

రావణుమరణమునకు విభీషణుండు శోకించుట

శా.

అన్నా యోదశకంఠ ఘోరసమరవ్యాపారనిత్యత్వసం
పన్నత్వంబున రూఢి కెక్కి విలసద్భాహాబలప్రౌఢిచే

నౌన్నత్యంబున మించి దైవగతిఁ ద్రుట్యచ్ఛక్తి వై నేఁడు వి
చ్ఛిన్నాశేషశిరఃకరుండ వగుచున్ సీదద్గతిం గూలితే.

2189


మ.

సురలక్ష్మీకచకర్షణప్రవణముల్ శుంభద్రణోత్సిక్తముల్
హరశైలోద్ధరణప్రచండబలముల్ హర్యక్ష[52]దుస్సాధముల్
హరిదంతద్విరదేంద్రదంతదళన[53]వ్యాపారఘోరంబు లై
కర మై యున్నకరంబు లిప్పుడు పతంగశ్రేణిపా లయ్యెనే.

2190


క.

సురతరుకుసుమశ్రేణీ, సురుచిరమృదుతల్పమధ్యశోభిత మగునీ
యురుతరదేహం బిప్పుడు, పరుసనిసంగ్రామభూమిఁ బడఁ బా లయ్యెన్.

2191


తే.

అర్కమండలతులితంబు లై విపక్ష, తిమిరజాలకభేదనక్షమము లైన
విమలదీధితిమణికిరీటములు నేఁడు, సడలి యంతంత నుగ్గులై పుడమిఁ గూలె.

2192


క.

ఎనసినగురువిక్రమమున, ఘనతరభుజరాజిసత్త్వగౌరవముల న
త్యనుపముఁ డగునీతో నెన, యనఁ జాలినవారు జగములందుఁ గలారే.

2193


సీ.

నయశాలివై యుండి నరనాథుసుందరిఁ, దెచ్చి యీయాపదఁ దెచ్చికొంటి
వల దని చెప్పినఁ జలమున నబ్భంగి, నామాట లేమియు నమ్మవైతి
మనువంశనాథుని మనుజుఁ గాఁగఁ దలంచి, భూమినందన నిచ్చి పుచ్చవయితి
రామునితోడి వైరస్థితి యేప్రొద్దు, మాను మన్నను నీవు మానవైతి
నీతిహితములు సేకొన నేరనైతి, తెలిపి చెప్పినఁ క్రొవ్వునఁ దెలియవైతి
చెడుట నిక్కువ మనినను నుడుగవైతి, [54]తెగువ నాగ్రహబుద్ధియు దింపవైతి.

2194


క.

పరకాంతలు తల్లులుగా, నిర వందఁగఁ దలఁపకున్న నిహముం బరమున్
దొరఁకొనునె మేలు గలుగునె, దొర యండ్రే వాని బుధులు దుష్టుం డనరే.

2195


క.

ఘనతరదుర్మానముచే, ననయంబును గలుగునీస్వయంకృతదోషం
బున నింత పుట్టె నేఁ జె, ప్పినపలుకులు దప్పవయ్యెఁ బిదప నరసినన్.

2196


క.

అని శోకించుచుఁ దాలిమి, మనమున నెలకొనమిఁ జేసి మానము దూలన్
ఘనమూర్ఛ మునుఁగుఁ దెలియుం, దనుజేశుఁడు శోకవహ్నితప్తాత్ముం డై.

2197


క.

ఇనుఁడు ధరఁ బడియెఁ జంద్రుఁడు, మునిఁగెం దిమిరమున నగ్ని మొగి హిమ మయ్యెం
గనకాద్రి యొఱగె ననుక్రియ, దనుజాధిప పొలిసి తిట్లు దర్పము దూలన్.

2198


శా.

సారస్కంధము శౌర్యమూలము విరాజద్భాహుశాఖంబు దు
ర్వారోదారధృతిప్రవాళమతి దీప్యత్కోపపుష్పంబుఁ బా
పారంభైకఫలంబు నై పరఁగుదైత్యాధీశవృక్షంబు దా
నీరూపంబున రామహస్తి విఱిచెన్ హేలాసముల్లాసి యై.

2199


చ.

కరయుగదంతదుర్జయము గర్వమదాంధము ఘోరచాపదు

ర్భరతరదుస్సహక్రమముఁ బద్మజవంశసముద్భవంబు ని
ర్జరతరుషండఖండనవిశాలతరం బగు దైత్యరాజసిం
ధురపతిఁ గూల్చె రాముఁ డను దుర్జయసింహము బాణదంష్ట్రమై.

2200


ఆ.

నిబిడవిక్రమార్చి నిశ్వాసధూమంబు, సాహసేంధనంబు సత్ప్రతాప
మయిన రావణాగ్ని యారామజలదంబు, చేత నార్పఁబడుట సిద్ధ మయ్యె.

2201


వ.

అనునయ్యవసరంబున.

2202


సీ.

మొనసి మందోదరి మొదలైనదశకంఠు, వెలఁదు లత్తఱి లంక వెడలి వచ్చి
పదయుగంబులు దొట్రుపడ నీవిబంధంబు, లెడలంగ మేఖలల్ సడలి పడఁగ
ఘనకుచంబులభారమున నడుములు వీఁగ, భూషణావలు లూడి పుడమి నెరయ
బాష్పపూరంబులఁ బయ్యెదల్ దడియంగఁ, జికురభారము వీడి చిక్కుపడఁగ
దీనరోదనరవములు దెసలు నిండ, మొగములు దరము లురములు మోఁదికొనుచు
ము న్నెఱుంగని నెవ్వగ మునిఁగి పొగిలి, చెలఁగుమురిపపునడపుల చెలువు దక్కి.

2203


ఉ.

ఓదశకంఠ యోరమణ యోరజనీచరచక్రవర్తి నీ
వీదశఁ బొందఁ బా లయితి వీరణరంగమునందు మాకు నిం
కేది తెఱంగు నెక్కడికి నేఁగుదు మెవ్వరు దిక్కు నిట్టిని
ర్వేదపయోధి ముంచితివి విశ్రుతవిక్రమవర్యభూషణా.

2204


మ.

అని శోకించుచు వచ్చి వచ్చి నిహతాశ్వానీకభీత్యావహం
బును నిర్భిన్నమహామతంగజము విస్ఫూర్జత్కిరీటాంచితం
బును విచ్ఛిన్నశతాంగసంకులము [55]లోలద్భురీరక్తార్ణవం
బును వీతాసువనాటరాక్షసగణాపూర్ణంబు నై యెంతయున్.

2205


వ.

మఱియుఁ గూలినసింధురంబులును నెరసినవిభిన్నకుంభికుంభముక్తాఫలంబులు
నొఱగినగుఱ్ఱంబులును దునిసినతదీయచరణంబులును బెరసినతురంగపల్యయనం
బులును బడలుపడినయరదంబులును జూర్ణితంబు లయినచక్రంబులును దునుక
లయిననొగలును వ్రాలినపదాతులును బగిలినతలలును వ్ప్రక్కలయినప్రక్కలు నా
మూలలూనంబు లయినకరంబులును విచ్ఛిన్నంబు లగుచరణంబులును నికృత్తం
బు లగుజానుభిత్తంబులు నూరుఖండంబులుం గలిగిన రాక్షసకపివీరులును గలిగి
భగ్నకరవాలంబులును జెదరియున్నగదలును దఱుచైనముద్గరంబులును బ్రసృ
తంబు లగుముసలంబులును గలయంబడియున్నవిండ్లును సంకులంబు లయినబా
ణంబులును దుములంబు లయినప్రాసంబులును దుమురు లైనతోమరంబులును
దట్టంబు లైనపట్టిసంబులును నాభీలంబు లైనశూలంబులును దళితంబులైనచక్రం
బులును శకలితంబు లయినభిండివాలంబులును జూర్ణితంబు లైనపర్వతంబులును
బొడి యైనపాషాణంబులును నింతింతలై విఱిగి పడినతరువులును వడిం బఱచురక్త

మహానదులును నందు వడిం బడి యరుగుకరటితురంగశతాంగశకలసుభటకళేబరం
బులును నొండొంటిపయిం బడి చచ్చిన చతురంగసముదాయంబులు రాశీభూతం
బు లైనపిశితంబులును గర్దమీకృతంబులగుమేదోమాంసంబులును వికీర్ణంబులగు
నెమ్ములును జచ్చియుఁ జేతియాయుధంబులు విడువనివీరయోధులును నిలిచి నిలు
వునం బ్రాణంబులు విడిచియుఁ గూలక నిలిచియున్నమహాశ్చర్యశూరులును భ్రు
కుటికుటిలవదనులై యీల్గినమహావిక్రాంతులును రక్తమాంసలోలుపకాకకంకో
లూకగృథాదివిహంగంబులును వృకజంబుకంబులునుం గలిగి కపాలపాత్రలును
ధ్వజయూపంబులును జతురంగపశుసముదాయంబులును శరకుశవ్యతికరంబు
లును రుధిరపూరాజ్యంబులును మాంసాదిహోమద్రవ్యంబులును దూణస్రుక్స్రు
వంబులును శీర్ణభూషణమణిదహనంబులును గలిగి యజ్ఞాయతనంబుంబోలె
చామరమరాళంబులును దోమరకరవాలతరంగంబులును రథచక్రకూర్మంబులు
ను యుగ్యమీనంబులును గరిమకరంబులును బతితసుభటవదనకమలంబులు
ను దదీయలోచనకుముదంబులును రక్తాంబుపూరంబును గలిగి సరోవరంబునుం
బోలెఁ బున్నాగపూగమండితంబును గదళీకాకలితంబును శిలీముఖవిలసితం
బును బహుపలాశసమీచీనంబును నై యారామంబునంబోలె శతాంగసంకు
కులంబయ్యు [56]నేకాంగశరీరిసమన్వితంబును గంధర్వబహుళం బయ్యును రాక్షస
సంవృతంబును బుండరీకశతాకీర్ణం బయ్యును గృష్ణసారవ్యాప్తంబును, సుపర్ణ
శోభితం బయ్యును నాగేంద్రవదనంబును నై యున్నరణరంగంబునందు.

2206


సీ.

కరిశైలములు వైచి ఘనరక్తవారాశి, గట్టిగా సేతువు గట్టికట్టి
లంక చందము సేసి లగ్గలు పట్టుచు, నాజి గెల్చితి మని యార్చిమార్చి
యిలిగినదైత్యుల నిలిపి చిక్కితి రంచుఁ, బొను పైనకినుకతోఁ బొడిచిపొడిచి
తరువులు గొని తెచ్చి యరదంబు లురవడిఁ, బొడిపొడిగాఁ జేసి పొంగిపొంగి
కోర్కిఁ గ్రోఁతులకైవడిఁ గొన్నియెడల, లలివినోదము లీక్రియఁ జలిపిచలిపి
యొగిన భూతంబు లిబ్భంగి నుల్లసిల్లెఁ, జేరి రామునివిజయంబు కోరికోరి.

2207


సీ.

ఎలమిఁ జచ్చినగజంబుల నెక్కి యదలించి, యుద్వృత్తిమైఁ బోర నుత్సహించి
పడినగుఱ్ఱంబులఁ బట్టి యల్లన వేడ్క, సడలక యాజికి నడరఁ జూచి
రథములు పొందించి రమణతో నీడ్వంగ, రణము గావింపంగఁ గణఁక నేచి
దారుణోదగ్రపదాతు లై యార్చుచుఁ, గదియుచందంబున నెదురులేక
దైత్యవరులు పొదివి దర్పంబు నిండారఁ, గపులమీఁది కుఱికి కవియునట్టి
చంద మొదవ భూతసముదాయములు గొన్ని, యాగ్రహించుఁ జెలఁగు నడరు నవ్వు.

2208


ఉ.

తొట్టినబాణముల్ దొలఁగఁ ద్రోచి ప్రియం బొదవంగ దోయిటం
బట్టి [57]కవోష్ణశోణితము భామలు దారును గ్రోలి క్రోలి యే

పట్టునఁ దారయై పిశితతపంకములోఁ బడి మున్గి మున్గి లోఁ
బుట్టిన యుత్సవం బొదవ బోరన నార్చుచుఁ బెక్కుభంగులన్.

2209


మ.

ఎనయం బండువు సేయఁ గల్గెఁ గుతుకం బేపారఁగా నేఁడు ద
ప్పిన లే దెన్నఁడు నిచ్చ వచ్చుగతిఁ దృప్తిం బొంది మోదింత మం
చు నరేంద్రున్ వినుతించువానరబలస్తోమంబు నగ్గించు భూ
తనికాయంబులు డాకినీయుతము లై దర్పాతిరేకంబునన్.

2210


ఆ.

తనివి నొంది త్రేఁచుఁ దద్దయు ముదమున, సొక్కు నావులించు సోలి యాడుఁ
బాడుఁ దమ్ము మఱచుఁ బరమమోదంబున, నొందు నుబ్బు నార్చు నుల్లసిల్లు.

2211


సీ.

కడుపార నెత్తురు ఘనముగాఁ గొని ద్రావి, దిక్కులు నెరయంగఁ బుక్కిలించు
బలలఖండంబులు పడఁతుక విచ్చుచో, నొల్లఁ బెట్టకు మని యోఁకిలించు
మేదురం బగుచున్నమేదంబు చవిగొని, యడరిననిద్దుర నావులించు
మస్తిష్క మందంద మన మారఁగాఁ దిని, [58]నెలకొన్న యెఱుఁగమిఁ గలవరించు
మునుఁగు నీఁదుఁ దేలు మోదించుఁ గ్రీడించుఁ, ద్రుళ్లు గంతు లిడుచుఁ దూలియాడు
సరసవృత్తితోడఁ జల్లుఁ బోరాడుచు, భూతసమితి యిట్లు పొలుపు మిగిలి.

2212


క.

జానకి నాక్రియఁ దెచ్చిన, దానవపతి మంచివాడు తగ వరయంగా
దానికి నయి పోరాడిన, మానవపతి యట్టివాఁడ మది నూహింపన్.

2213


క.

అని భూతావలియును డా, కినులుఁ బిశాచములుఁ గౌతుకితమానసు లై
ఘనసంగ్రామంబున ని, ట్లనయంబును క్రీడ సల్పు నాక్షణమాత్రన్.

2214


సీ.

రఘునాథుఘోరశరంబులు విరులచే, నెఱి రచించినయట్టిపఱపు గాఁగ
మణికనకాంగదమహిత మై తెగిపడి, తనరుబాహువు లుపధానములుగఁ
[59]దోరంపుగంటులఁ దొరఁగునెత్తురు హరి, చందనోదంచితచర్చ గాఁగ
దట్టమై పర్వినధరణీపరాగంబు, చెలువారఁగాఁ గప్పుచీర గాఁగఁ
గాకజంబుకవృకఘూకకంకగృధ్ర, గణము సముచితపరిచారకత్వ మెనయ
వీరలక్ష్మీవిహారంబు వెలయఁ జల్పి, దీర్ఘనిద్రావశంబునఁ దెలివి దప్పి.

2215


తే.

విజయలక్ష్మీమహోదగ్రవిరహదహన, భూరిసంతాపదగ్ధుండపోలె నంత
రామచంద్రోదయంబున రమణ దక్కి, ధరణిఁ బడియున్నరాక్షసేశ్వరునిఁ గాంచి.

2216


క.

సమదగజరాజవిదళిత, ద్రుమముపయిన్ వ్రాలులతల [60]దొరయుచు రఘుభూ
రమణహతుఁ డైనరావణు, రమణులు పైఁబడిరి శోకరయహతమతు లై.

2217


క.

కరిరాజుతోడఁ బాసిన, కరిణులగతి భానుఁ బాయుకమలినులక్రియన్
వెర వేది రమణుఁ బాసిన, తరుణుల[61]బ్రతు కేమి చెప్పఁ దలపోయంగన్.

2218


వ.

అంత దహనుం బాసి యవసానంబు నొందుచిదురుశిఖలపగిదిఁ దపనుం బాసి వచ్చి

చరించుశూన్యాయమాన లైనసాయంతనమరీచులయట్లు నిశానాథుం బాసి ధూ
సరకాంతు లయినతారలపోల్కి జలదమండలంబు విడిచివచ్చి కుమ్మరుసీదత్ప్రకా
శ లగుతటిల్లతలచొప్పున నతిదీనభావంబు గలిగి ప్రతిపదస్ఖలచ్చరణపల్లవలును
బ్రపదసక్తమణిమేఖలాకలాపసూత్రలును నావిష్కృతనాభీమండలశ్లథనీవీదుకూ
లలును గమనాయాసఖేదజనితనిశ్వాసవేగపౌనఃపున్యప్రకటీభవద్వళితరంగలును
భిదురహారయష్టిమణిప్రతినిధి [62]విసూత్రముక్తావళిశంకాపాదినిరంతరనిర్వద్భాష్ప
కణికాసమాచితపీనస్తనభారనిర్వహణాసహిష్ణుభంగభీరుశాతమధ్యలును స్రస్తప
రిధానోపలక్ష్యమాణనవనఖరేఖోచ్ఛూనతాసంపాదికరకిసలయముహుస్తాడనపీ
డ్యమానోరస్స్థలీదృశ్యలును నిరంతరవిరహవేదనాకృశీభూతబాహాలతావిభ్రష్ట
మణివలయలును నిజపతినిధనభూనిర్దేశాసకృల్లక్ష్యమాణకనత్కనకకమ్రబాహు
మూలలును జిరంతననిబంధనక్లేశవిముక్తిలాభచ్ఛిన్నకంఠగుణకలాపలును నవ
వైధవ్యదీక్షాపదేశజ్ఞాపకనిపతత్కుండలలును బాష్పధారోచ్ఛ్వసితకస్తూరికాప
త్రలతాకల్పకపోలభాగలును శోకవేదనోష్ణసముచ్ఛ్వాసమ్లానబింబాధరపల్లవలు
ను భూయోభూయస్సముత్పతత్ఖేదశ్వసితసముజ్జృంభమాణనాసికాపుటలును న
యనోత్పలనిర్గతసాంజనబాష్పధారాసారరోలంబలును బ్రస్వేదజాలసిక్తరుచిరా
లికసక్తవిలులితాలకలును జరమభాగవిలంబమాననితాంతమందారదామబంధుర
నినదషట్పదనిర్విశేషవేణికలు నగుచు హానాథ హావీర హాదశానన యనుచు.

2219

రావణాంతఃపురస్త్రీలవిలాపము

చ.

అడలుచు నెత్తుటం దడియునంగముఁ గౌఁగిటఁ జేర్చు నోర్తు పైఁ
బడి వగ నొందు నోర్త మెడ బాహులచేఁ దవిలించు నోర్తు సొం
పడరఁగ మోము సూచి యనయంబును మోహము నొందు నోర్త పెం
పెడలి పదాంబుజంబులపయిం బడు నోర్తి విషాద వదనన్.

2220


చ.

తలఁచినఁ జూడ మావలనఁ ద ప్పొకయింతయు లేదు పిల్చినం
బలుకవు దీనవృత్తి బహుభంగుల మ్రంద నుపేక్ష చేసినన్
నిలుచునె మేనఁ బ్రాణములు నిన్ను నిమేషముఁ బాయనేర్తుమే
యలుగఁగ నేల నీకు దనుజాధిప కన్నులు విచ్చి చూడవే.

2221


క.

వెఱవవు నీ వెవ్వరికిని, వెఱు పరయఁగ నీకు వెఱచు వీరత్వమునం
బఱపితివి లోకపాలుర, మెఱసితివి జగంబులందు మేటి యనంగన్.

2222


శా.

హా నీ వీక్రియ నొక్కమాత్రఁ బృథుబాహాశక్తిఁ బోనాడి దు
ర్మానోద్రేకము గోలుపోయి రణశూరత్వంబు దూలంగ శ
స్త్రానూనోచితకౌశలంబు చెడి మాయాప్రౌఢియుం దక్కి యీ
దీనత్వంబున మర్త్యుచేఁ బొలిసితే తేజోనలం బాఱెనే.

2223

వ.

సురవిద్యాధరకిన్నరోరగగంధర్వపన్నగయక్షపక్షిసిద్ధాదుల నెల్లఁ జీరికింగొనక
చంద్రహాసైకసహాయుండ వై పరమేశ్వరలబ్ధవరప్రసాదానుభావంబున నెదురు
లేక దుస్సాధుండ వై చటులసమరవ్యాపారపారీణత్వంబున నెగడియున్ననీవు
నొక్కతాపసవేషంబు దాల్చిననరునిచేత మరణంబు నొందితివి మమ్ము నరయం
గలవార లిం కెవ్వరు గలరు.

2224


క.

వీఱిఁడితనంబు పెట్టుచు, దూఱం బని లేదు నిన్నుఁ దొల్లిటిచెయువుల్
దీఱ వవి యనుభవింపక, వే ఱొండునె పూర్వజన్మవివిధకృతంబుల్.

2225


క.

అని యిట్లు పెక్కుభంగుల, మనమున వగ వెల్లివిరియ మానము దూలన్
ఘనతరనవవైధవ్యం, బునఁ బొగులుచు నుండునంత భూరివ్యథతోన్.

2226

మందోదరీవిలాపము

వ.

అద్దనుజనాథునియగ్రమహీషి యగుమందోదరి యిట్లనియె.

2227


ఉ.

హా నక్తంచరరాజశేఖర సముద్యత్సాహసాడంబరా
హా నిస్సీమపరాక్రమక్రమజితేంద్రాదిప్రభావోన్నతా
హా నాగేంద్రసమానబాహుపరిఘా హా వీర హా రావణా
హా నాథా ననుఁ బాయ నీకుఁ దగునే హా చంద్రహాసాయుధా.

2228


ఉ.

మూడుజగంబు లోలి నొకమూలకుఁ దెచ్చి యుదగ్రవృత్తిమెఁ
బోఁడిమి నాఁడునాఁటికిఁ బ్రభూతముగా నుదయింపఁ బోరులన్
వేఁడిమి యెల్లవేల్పులకు వేయివిధంబులఁ జూపి గ్రక్కునన్
నేఁ డొకమర్త్యుచేత రజనీచరరాజలలామ కూలితే.

2229


చ.

హరి మొదలైనదిక్పతుల కందఱకున్ సమకూరెఁ గోర్కి వా
నరయుతుఁ డైనరామనరనాథుకతంబున నవ్విభీషణుం
డరుదుగ లంక యేలఁ గలఁ డవ్విభుసత్కరుణానుభావతం
బరభయచింత లేక సులభస్థిరరాజ్యసుఖానుషక్తిమై.

2230


క.

నెట్టన వానరు లంబుధి, గట్టినయానాఁడు మొదలుగా రాముఁడు దా
గట్టిగ మనుజుఁడు గాఁ డని, పుట్టెన్ నామది భయంబు పొలు పెడలంగన్.

2231


ఉ.

శ్రీతరుణీసమగ్రరతిశీలుఁడు సత్వరజస్తమోగుణా
తీతుఁడు చక్రపాణి నిను ధీరమతిం దెగటార్ప వానరీ
భూతదివౌకసుల్ గొలువఁ బొల్పుగ మర్త్యశరీర మొంది వి
ఖ్యాతిగ నట్ల చేసె నిది యన్యులకుం బొరిఁ జేయ శక్యమే.

2232


సీ.

ఆజనస్థానంబునందు ఖరాదుల, దురమున రాముఁడు దునుముటయును
శంకింప కసురులఁ జంపి లంకాపురి, కపియొక్కరుఁడు మున్ను గాల్చుటయును
కుంభకర్ణాదుల ఘోరాజిలోపలఁ, గ్రొవ్వఱఁ గ్రమమునఁ గూల్చుటయును
దివిషదీశుల కైనఁ దే రానిద్రోణాద్రి, మించినకడిమిఁ దెప్పించుటయును

నిట్టు లరసి చూడ నిన్నియు దుష్కర, ములు నమానుషములు చలము మాని
రమణతోడ సీత రామున కి మ్మని, చెప్పుమాట లెల్లఁ జెవులు సొరవు.

2233


క.

భాసురశీలఁ బతివ్రత, నాసీతం దెచ్చి తీ వహంకారమునం
జేసినపాపంబులు దోఁ, జేసేఁతం గుడుచు టింతసిద్ధమ కాదే.

2234


తే.

శుభచరిత్రుండు నిక్కము శుభము నొందుఁ, బాపశీలుండు పాపంబు పరఁగనొందు
గుణగణోత్తరుఁ డావిభీకషణుఁడు బ్రదికెఁ, గలుషలోలత నీ కిట్లు పొలియవలసె.

2235


సీ.

కమనీయతర మైనకైలాసగిరియందు, సలలితమందరాచలమునందుఁ
జారుసుఖావహమేరుశైలమునందుఁ, బర పైనహిమమహీధరమునందు
రమణీయ మగుచైత్రరథవనాంతమునందు, మనమార నందనవనమునందు
బహువిభ్రమోచితపాతాళములయందు, రమణ నాకాదిలోకములయందు
నేను నీతోడ దివ్యవిమాన మెక్కి, వివిధభంగుల విహరింతు వేడ్క లెసఁగ
భూరిభుజసార నీ విట్లు పొలియుకతన, నవ్యవైధవ్య మొందంగ నాకు వలసె.

2236


క.

సురతరుజకుసుమసురుచిర, పరిమళభరభరితశిశిరపరిమిళితలస
న్మరుదలసచలితసరసిజ, సురసరిదుదవిహృతిబహుళసుకృతము వొలిసెన్.

2237


క.

[63]జనకుఁడు దాను మయుం డని, ఘనభుజుఁడు దశాననుండు గాంతుం డనియుం
దనయుండు శక్రజి త్తని, మనమున గర్వింతు నట్టిమానము పొలిసెన్.

2238


క.

లలి నీ వింద్రియముల మును, గెలిచి జగత్త్రయము నోలి గెలిచితి వని యా
చలమున నవి నిను గెలిచెను, దలఁపఁగఁ బగ దీర్చునట్లు దానవనాథా.

2239


చ.

అనయము సర్వజంతువుల కారయ [64]లక్ష్యవిహీన మై ఘటిం
చినమరణంబు లే కునికి సిద్ధము గావున నీకు మేదినీ
తనయ నెపంబునం గలిగె దారుణమృత్యువు దాఁ బరాంగనా
జనములమీఁదిమక్కువ లసంశయముల్ నిధనైకమూలముల్.

2240


క.

జనకునిపాపపువరమున, ననయము నిను ననుగమింప నను వది లేకు
న్నను నిలువవలసె నకటా, తనపతితోఁ బాయుబ్రదుకు తరుణికి నేలా.

2241


క.

నామీఁద నీకుఁ గలిగిన, యామచ్చిక లామహావిహారములు గడుం
బ్రేమపుమేలపుఁబలుకులు, నే మయ్యెనొ యెందుఁ బోయె నెఱిఁగింపు తగన్.

2242


క.

పతిచావు వినినయప్పుడ, యతివలు ప్రాణములు విడువ [65]రఁట యది హార్డ
వ్యతికరమే తలపోసినఁ, బతిదైవత మైనసతియ బహుమతి నొందున్.

2243


సీ.

నేఁ డర్కుకరములు నిర్భయంబు గలంక, సొచ్చి విచ్చలవిడి సొలయఁ జొచ్చెఁ
బవనుండు సనుదెంచి పయ్యెదకొంగులు, లీలమై లలిఁ గదలింపఁ దొడఁగె
నుడిగముల్ సేయుట లుడిగి గంధర్వులు, నొగి సంతసంబున నున్నవారు

పరఁగ నెప్పటిహవిర్భాగముల్ చెందఁ [66]గాం, చుటను దివౌకులస్రుక్కు దీరె
యక్షకిన్నరగుహ్యకయాతుధాన, పక్షిఖేచరచారణపన్నగాదు
లరయ నూఱటఁ బొంది రత్యనుపమాన, సమ్మదామృతరసపూరసహితు లగుచు.

2244


వ.

మదీయజనకుం డైనమయుండును మహితమాయామతి యగుమారీచుండును
హితోపదేశగుణవంతుం డగుమాల్యవంతుండును బరమార్థభాషణుం డగువిభీష
ణుండును స్వామిభక్తిపవిత్రు లగుమిత్రులును భవదేకశరణ నగునేనును జెప్పినట్టిహి
తవాక్యంబులు వినవయితి వది యేల తప్పు నని యడలుచు డెందంబున నెవ్వగ
నివ్వటిల్ల సైరింపంజాలక పయిం బడి మూర్ఛిల్లి తెలిసి పతిహస్తంబులు తన
యురస్స్థలంబునం గదియించుచుఁ దదీయకపోలసమాఘ్రాణంబు సేయుచుఁ
దన్మస్తకంబులు దనయంకంబునం దిడుచు విశిఖవిశకలితం బగుతదీయోరస్స్థ
లంబునందుఁ దనయురం బదుముచు నో యసురేశా మదిరామదఘూర్ణాయ
మాననేత్రకమలంబులును జాటువాదచతురంబులును మందస్మితసుందరంబు
లును గనత్కనకమణికుండలమండితంబులును మత్పీతలలితాధరామృతంబులు
ను మద్విరచితహరిచందనకస్తూరికాఘనసారరుచిరతిలకలలాటంబులుం గలుగు
మొగంబులు వాంచి నాకు మొగమీక మొగమోట దక్కం దగునే దిక్కరిక
రాకారంబులును బందీకృతబృందారకసందోహదారకచభారమందారకుసుమ
మకరందబిందుపరాగరాగరూషితంబులును సకలసురాసురవిజయమహాక్రతు
యూపంబులును గైలాససముద్ధరణవిలాసవిలసితంబులును మదీయకబరీసుర
భికుసుమసురభీకృతకరరుహంబులును ద్రిభువనవిజయశ్రీవిహారాగారమూల
స్తంభంబులును సమస్తప్రహరణకృతశ్రమంబులును వీరలక్ష్మీవేణికాభిరామ
జ్యాఘాతకిణశ్రేణిసనాథంబులు నగుకరంబులు రామశరనికృత్తంబు లై నేలం
గూలెఁ గుంఠీకృతవజ్రపాణిప్రముఖదిగీశసురాసురదివ్యాస్త్రంబును దళితైరావ
ణాదిహరిత్కరిదంతకాండప్రకాండంబును నతివిపులంబును నగునురస్స్థలం బ
త్యంతరణశ్రీపరిరబ్ధం బయ్యె నక్కటా నీయట్టిశూరాగ్రేసరునకును [67]నిట్టివి
ధంబు గలిగె నింక నెవ్వరి ననవచ్చు నాతోఁ గూడి వీరె చూచితే విజిత
చతుర్దశభువనుండును రాక్షసకులసార్వభౌముండును నగునీదుకాంత లంతిపు
రంబు వెడలి సకలజనంబునుం జూడ నిట వచ్చియున్నవారు వీరల నభ్యంత
రంబులకుం బొం డని వీడ్కొలుపం దగదే పవనాతపస్పర్శంబు లనుభవింపని
మేనులకు నిప్పు డవి దొరకొనియె నెట్లు సైరింపవచ్చు నానతి లేక వచ్చినా
రని కినిసి యీశ పలుక నొల్లవొకొ యని మఱియు ననేకవిధంబుల విలపించు
చున్నమందోదరిం జూచి విభీషణుం డడలు గడలు కొన బాష్పపర్యాకులనయ
నుం డై యేడ్చుచు గద్గదస్వరంబున ని ట్లనియె.

2245

సీ.

దశకంఠవారాశి దశరథాత్మజసాయ, కేద్ధబాడబమున నింకిపోయె
రావణభూజంబు రాఘవవాతూల, వీజనంబున నేఁడు విఱిగికూలె
లంకేశదహనుండు లక్ష్మణాగ్రజకాల, [68]జలదపృషత్కవర్షముల నాఱెఁ
బౌలస్త్యరవి మహీపాలపశ్చిమమహా, దుస్తరాంబుధిలోన సస్తమించె
ననుచు నేడ్చుచు [69]దురపిల్లు నతనిఁ జూచి, యతివలందఱు విపులశోకాంబురాశి
మునిఁగి దరిఁ జేర నేరక మొనసి కరుణ, పుట్టునట్టుగ నేడ్చిరి పుడమిఁ బొరలి.

2246


వ.

అప్పు డవ్విభీషణుం గాంచి మందోదరి సోపాలంభంబుగా ని ట్లనియె.

2247


ఆ.

చాలుఁ జాలు వగవఁ గాలంబు గా దిది, లంక చేరె [70]రాజ్యలక్ష్మి గేరెఁ
గొఱఁత తీఱె నెల్లకోర్కులు సమకూఱెఁ, దుట్టు వాసె నింక దొసఁగు లేదు.

2248


ఆ.

అఖిలబంధురహిత మైనరాజ్యము సేఁత, కంటె నరసిచూడఁ గలదె మేలు
యెడరు వేచి చెఱుచునేవకాఁ డగువాని, కంటె మేలు సూవె కాలయముఁడు.

2249


క.

దనుజాధిపుఁ జంపించితి, తనిసితివే సంతసంబు దలమయ్యె నయో
మనుజేశమిత్ర నీ కీటు, గినియన్ దశకంఠుఁ డేమికీ డొనరించెన్.

2250


వ.

అనిన లజ్జావనతవదనుం డై పలుకక మిన్నకుండె నంత.

2251


ఉ.

మానుప రానినెవ్వగల మ్రంది దురంతవిషాదవేదనన్
మానము దూలిపోవ నసమానదయారస ముట్టునట్టుగా
మానక యేడ్చుదైత్యపతిమానవతీజనులన్ విభీషణున్
మానవరాజశేఖరుఁడు మానుగ ని ట్లని పల్కె నత్తఱిన్.

2252


క.

వగవంగ వలదు నీ వీ, మగువల నూరార్పు ధైర్యమహిమాత్ముఁడ వై
తగుభంగి నాదుమాటలు, విగతార్తత నాదరించి విను మసురేంద్రా.

2253


క.

వైరులఁ జంపుదు రొండెను, వైరులచేఁ జత్తురొండె వరజన్యములన్
వీరులజయాపజయములు, నారయ సమవృత్తి నుండ వనిరి మహాత్ముల్.

2254


ఉ.

ఈతఁ డశేషదిక్పతుల నేపడఁగించె నుదగ్రవృత్తిమై
నీతఁడు సప్తలోకముల నేలె నిరంకుశశాసనాఢ్యుఁ డై
యీతఁడు సర్వదానవుల నేర్పడ నేలె నుదీర్ణసారుఁ డై
యీతఁ డసాధ్యుఁ డేరికి నహీనపరాక్రమశాలి యెల్లెడన్.

2255


శా.

బాహావిక్రమగర్వితాప్రతిమదిక్పాలస్ఫురత్సైన్యస
న్నాహాడంబరశారదాభ్రపటలీకనాశానిలప్రస్ఫుటో
గ్రాహోపూరుషికాతినిష్ఠురతరవ్యాహారనాదక్రియా
మోహీభూతసమస్తవిష్టపుఁడు సమ్మోదింప నర్హుం డిలన్.

2256


శా.

నీరంధ్రప్రథితప్రతాప మొదవన్ నీయన్నచందంబునం

బోరంగాఁ దరమే తదీయసమరస్ఫూర్జద్విలాసంబు గ
న్నారం జూచితి గాదె విక్రమకలావ్యాపారవిఖ్యాతి మ
న్నారే యీతనిసాటిశూరు లసమానస్థైర్యసామగ్రులన్.

2257


మ.

తడఁబా టించుక లేక యుల్లసితదోర్దర్పోద్ధతుం డై యనిం
బడునందాఁకఁ బ్రవర్ధమానవిభవప్రఖ్యాతిమైఁ బేర్చి నే
ర్పడరం బోరె నితండు విస్మయరణవ్యాపారనిష్ణాతుఁ డి
య్యెడ నీదానవరాజు మెచ్చఁదగుఁ గా [71]కీదుర్దశన్ శోచ్యుఁడే.

2258


చ.

గెలు పది యేల పోరఁ బరికింప జయంబుఁ బరాజయంబునుం
దురితగతిన్ ఘటించు నది తొల్లియ నిశ్చయ మౌ నిశాటుదో
ర్బలమును విక్రమంబు రణపాటవమున్ బహుదివ్యసాధనం
బులకుశలత్వ మచ్చెరువుఁ బొల్పుగ నీక్రియఁ జావు మేలకా.

2259


వ.

కావున.

2260


చ.

నిలుకడ గల్గి సాంగముగ నిశ్చితశాస్త్రనిరూఢితోడ నీ
వలయక ధైర్యకౌతుకసమగ్రుఁడ వై భవదగ్రసూతికిన్
నెలకొని యున్నభక్తి విధినిర్ణయ మొప్పఁగ నగ్నిసంస్క్రియ
ల్సలుపుము లెమ్ము పొమ్ము సకలంబును జేయుము వేడ్క నావుడున్.

2261


ఉ.

ఈతని కగ్నిసంస్కరణ మేటికి నెక్కడిసోదరుండు నా
కీతతి ముట్టఁ గూడునె మహీసుత దేవరయింతిఁ దెచ్చి
జాతతపాపశీలుఁ డగు నాగమచోదితపశ్చిమక్రియా
ఖ్యాతికి నర్హుఁడే నయవిగర్హితచేష్టుఁడు మాననీయుఁడే.

2262

విభీషణుఁడు రావణునకు నగ్నిసంస్కారాదులు చేయుట

వ.

అనిన విని రఘువరుండును నద్దశాననుండు నీచెప్పినయంతకుం గలఁడైన నింక వం
దనీయుండ కాని నిందనీయుండు గాఁడు వైరంబు లామరణాంతంబులు గావున నిత
నితోడిమాత్సర్యంబు నాకు లే దితండు దురితదూషితుం డయ్యును సంగరక్రి
యామరనదీనిర్మగ్నుం డగుటం జేసి ప్రక్షాళితసకలమహాపాతకపంకుం డయ్యెం
గావున నితనికి నౌర్ధ్వదైహికక్రియలు వైదికతంత్రోక్తక్రమంబున నిర్వర్తింపు
మనిన నట్ల కాక యని రాక్షసులచేత నగ్నిత్రయంబు దెప్పించి శకటారోపితచం
దనాగురుప్రభృతిసురభీంధనంబులును ముక్తామణిప్రవాళంబులు గైకొని నిశా
చరులు సనుదేర మాల్యవత్ప్రముఖమంత్రిసనాథుం డై [72]సాశ్రునయను లైనయ
గ్రజన్ము లేతేరఁ బతాకాభిశోభితసువర్ణశిబికయందు దశముఖు నునిచి తూర్య
ఘోషంబు లులియం జని సురభీంధనరచితం బగు చితి ప్రజ్వరిల్ల నధ్వర్యుసహి
తుండై విభీషణుండు మేధ్యం బగుపశువు వేల్చి పృషదాజ్యపూర్ణం బగుస్రువంబు

వామభాగంబున దక్షిణహస్తంబున జుహువును నవ్యకరోపరిభాగంబున ధ్రువ
యు నాహవనీయయు నిడి [73]నాసికయందు స్రువయును గరంబులఁ బ్రాసితయు
ను శీర్షభాగంబున జమసంబును బాదంబుల శూర్పంబును సమంతనిపాత్ర యు
దరంబునను దధిఘృతకుశపూర్ణపాత్రియు శమ్యయుం దత్పదంబునం బెట్టి ము
సలోలూఖలంబులు నరణ్యుత్తరారణులు నవశిష్టపాత్రంబులు నూరుప్రదేశం
బునఁ బెట్టి యావహనీయంబు పూర్వంబున దక్షిణాగ్ని దక్షిణంబున గార్హ
పత్యంబు పశ్చిమంబునందు నునిచి మఱియు విధేయంబులు సమాచరించి య
థాక్రమంబున నగ్రజునకు నిర్వర్తితాగ్నిసంస్కారుం డై యనంతరకరణీయం
బులు ననుష్ఠించి క్రమ్మఱి వచ్చి రామభద్రునకు దండప్రణామం బాచరించిన
నవ్విభుం డతనిం గౌఁగిలించి సంభావించి యూఱడించి కరుణాకటాక్షసుధా
రసం బతనిమీఁదఁ జిలికి సౌమిత్రిం గనుంగొని యి ట్లనియె.

2263


ఆ.

నీవు లంక కరిగి నేఁడు విభీషణు, సకలదానవేంద్రసార్వభౌమ
భావ మంద లంకఁ బట్టంబు గట్టుము, నాప్రతిజ్ఞ నిండ నమితవైరి.

2264


వ.

అని యానతిచ్చుటయు.

2265


క.

రమణమెయిఁ బాకశాసన, సముఁ డగురఘువంశతిలకుశాసనమున సం
భ్రమమున నతండు సంపద, నమరావతిఁ బోలులంక కరిగి రయమునన్.

2266


సీ.

బలవైరిపురిఁ గ్రిందుకపఱుపంగఁ జాలిన, లలితసౌధంబులచెలువు గలిగి
యేడులోకంబులు నింతియ యనుమాడ్కిఁ, బఱపైనసప్తవప్రములు గలిగి
రోహణాద్రియ పెక్కురూపు లై యున్నట్లు, క్రీడాచలంబులక్రేళ్లు గలిగి
మేరుశైలంబుతో మేల మాడెడునట్టి, కనకగేహంబులకలిమి గలిగి
యోలి దెసలకడల మూలల చెంగట, నొదిఁగి యున్నసురమదోత్కటములఁ
దెగడుకరులుఁ గలిగి దినమణితేజీల, కంటె నొప్పుతురికిగములు గలిగి.

2667


ఆ.

అనుపమానరత్నకనకగేహంబులు, నెగడుదైత్యనాథునగరు సొచ్చి
నరవరేణ్యుఁ డంత సురగిరి ప్రాంతంబు, సేరుశీతరోచిచెలువు గలిగి.

2268

విభీషణపట్టాభిషేకము

క.

మానవపతినందనుఁ డట, నానాతీర్థాంబురాశి నదులజలంబుల్
వానరవీరులచేత న, నూనతఁ దెప్పించె గురుసముల్లాసమునన్.

2269


సీ.

సంచితమణిమయస్తంభాభిరామంబు, బహువిచిత్రవితానభాసురంబు
ఘనసముత్తేజితకనకవేదికమును, సామ్రపల్లవహేమకమ్రకుంభ
ముపకంఠగతమదద్విపసంకులంబును, బుణ్యాంగనాగేయపూరితంబు
మంగళతూర్యాదిసంగీతముఖరంబు, వందిమాగధజనానందితంబు
నై మనోజ్ఞ మైనయాస్థానమండపం, బమర నందు రత్నహైమతుంగ

భవ్యసింహయుక్తభద్రపీఠంబున, నునిచె దానవేంద్రు నుత్సహించి.

2270


క.

వారిపురోహితమంత్రు లు, దారమతిన్ సంతసిల్లఁ దద్దయు వేడ్కన్
భూరమణావరజుఁడు ప్రియ, మారఁగ నభిషిక్తుఁ జేసె నయ్యసురేంద్రున్.

2271


చ.

తరణియు శీతదీధితియుఁ దారలు శేషుఁడు నాదికూర్మమున్
ధరణియు రాముసత్కథయుఁ దథ్యముగాఁ గలయంతకాలముం
దరముగ లంక యేలు మని దీవన లిచ్చె నిశాటభర్తకుం
గరుణ దలిర్ప లక్ష్మణుఁడు గౌతుకసమ్మదనిర్భరాత్ముఁ డై.

2272


వ.

అని లక్ష్మణుం డానతిచ్చిన సంప్రాప్తలంకాసామ్రాజ్యుండై విభీషణుండు వివిధ
మంగళోపకరణమహనీయమణిభూషణాదులు గొనుచు లక్ష్మణానుచరుండై వచ్చి
సవినయంబుగ మ్రొక్కి రామాభిధానుం డగునారాయణునకు సమర్పించిన.

2273


మ.

అనఘుం డర్కకులప్రదీపుఁడు ప్రమోదాయత్తుఁ డై శక్రసూ
తున కాదివ్యవిభూషణాంబరము లస్తోకోత్సవం బొప్ప ని
చ్చి నయం బారఁగఁ బల్కి వీడ్కొలుప సుస్ఫీతాశ్వసాహస్ర కే
తనసర్వాంగశతాంగుఁ డై యరిగె నాతం డింద్రునిం గొల్వఁగాన్.

2274


వ.

అయ్యవసరంబున.

2275


క.

తనచేరువ ముకుళితకర, వనజుం డగువాయుసుతుని వదనేందురుచిన్
వనచరచకోరపంక్తుల, కనురాగము నివ్వటిల్ల ననియెం బ్రీతిన్.

2276


ఉ.

లంకకు నేఁగి సీత నకలంకపవిత్రచరిత్రఁ గాంచి ని
శ్శంకితవృత్తి దా గెలుపుచందము దైత్యులు చచ్చుచందముం
గొంకక పోరుచందము నకుంఠితసంగరకేళినిర్గతా
తంకు దశాస్యుఁ గూల్చినవిధంబును వేగమ చెప్పి రావనా.

2277


వ.

అనిన.

2278


క.

జనపతియానతిఁ బావని, దనుజులు దనుఁ జుట్టి కొలువఁ దత్పుర మెల్లం
గనుఁగొనుచు సీత యుండెడు, వనవాటికఁ జేర నరిగె వలయితగతి యై.

2279


క.

కూజత్పికాలపచ్ఛుక, రాజితగుంజద్విరేఫరవయుతబహుధా
త్రీజాతజాతనతత, భ్రాజితవనసన్నికర్షకభవ్యతఁ దనరన్.

2280


క.

కీలితవిచిత్రతరమణి, జాలకహాటకవితర్దిసంభృతసుషమో
త్తాలతరశింశుపాతరు, మూలనిషణ్ణన్ మహీజ ముద మలరంగన్.

2281


క.

వినయాదరసంభ్రమములు, మనమునఁ బెనఁగొనఁగ భయనమంచితభక్తిం
జనుదెంచి కాంచె ముందట, జనకసుతన్ రాముదేవి సాధుచరిత్రన్.

2282


సీ.

చెలు వేది పవలింటిశీతాంశుకళవోలె, ఘనధూమవృతదీపకళికవోలె
మలినవస్త్రచ్ఛన్నమణిశలాకయుఁబోలె, నవహిమాకుల యైననలినిఁబోలెఁ
గదుపుతోఁ బాసిన కొదమజింకయుఁబోలె, వాడువాఱిననవవల్లిఁబోలెఁ

బవనాభిహత యైనబాలకదళిఁబోలె, లీనకర్దమమృణాళికయుఁబోలె
వగలఁ బొగులుచు వలవంత వంది కుంది, చేరుగడలేమిఁ జెక్కిటఁ జేయి సేర్చి
యాత్మవల్లభు రాముని నాత్మలోన, నిలిపి యొండు దలంపక చెలఁగుసాధ్వి.

2283


చ.

పులులకు లోఁగియున్నమృగిపోలికిఁ బాములలోన నున్నలేఁ
జిలుక యనంగ సింహములచెంతను హస్తినిభంగిఁ జేఁదుతీఁ
గెలకడ నున్నకల్పలతకేళి మహీసుత ఘోరదైత్యకాం
తలనడుమం దమశ్శితరదస్థసుధాకరరేఖచాడ్పునన్.

2284


క.

వనరెడుజానకిఁ గని పద, వనజములకు నెరఁగి భక్తివశమున వినయా
వనతుఁ డయి మ్రోల నున్నం, గని తలఁచి యెఱింగి సీత కడుమోదమునన్.

2285


ఆ.

జనకునాజ్ఞఁ బూని సామ్రాజ్య మొల్లక, యడవి కేఁగుదెంచి నట్టివిభుఁడు
కుశలియే యుదారగుణసముద్రుండు నా, మఱిఁది సుఖము నొంది మెఱయునయ్య.

2286


వ.

అనవుడు.

2287

హనుమంతుఁడు సీతకు రామునివిజయంబు చెప్పుట

ఉ.

రాముఁడు లక్ష్మణుండును దిరంబుగ నెమ్మది నున్నవార లు
ద్దాముఁడు భానుసూతియును దైత్యవిభుండు విభీషణుండు ని
స్పీమవిభూతి వాలెద రశేషకపీంద్రులు నిర్భరప్రమో
దామృతవార్ధిఁ దేలెద రపాయము లేమియు లేవు జానకీ.

2288


శా.

కైలాసాచలచాలనోద్దతభుజాగర్వాంధు నింద్రాదిది
క్పాలాపాకరణస్ఫుటాధికరణప్రాగల్భ్యసంపన్ను ను
ద్వేలాడంబరదుస్సహాదికరణస్థోమానుభావస్మయుం
బౌలస్త్యున్ దశకంఠుఁ జంపె నతిశుంభత్ప్రౌఢి రాముం డనిన్.

2289


క.

అతికాయుఁ డై తనర్చిన, యతికాయుని మేఘనాదు ననిలో నపరా
జితబలుఁడు లక్ష్మణుఁడు వి, శ్రుతగతిఁ దెగటార్చె నస్త్రశుంభద్గతి యై.

2290


ఉ.

అంబరవీథి వచ్చి నిశితాయుధనిర్గతవిస్ఫులింగకా
డంబరు లై నిరంతరజటాలసటాలసదేణరాజఘో
రాంబుదనాదమేదురవియత్కకుబంతరు లైనదైత్యులం
బంబినకింకఁ జంపి రురుబాహులు వానరు లాజి నుగ్రు లై.

2291


ఆ.

నీదువల్లభుండు మోదంబు నిండార, లంకలోన గతకలంకచరితు
నాదశాస్యుననుజు ననఘు విభీషణుఁ, బట్ట మమరఁ గట్టెఁ బద్మనయన.

2292


క.

నీయంత నున్నగతి నిర, పాయంబుగ నూఱడిల్లు మరయఁగ లంకా
యుతరాజ్యము రఘుతన, యాయత్తము గాదె సందియం బిం దేదీ.

2293


ఉ.

నీరధి గట్టి రామధరణీపతి తమ్ముఁడుఁ దాను లంకపై
దారుణకోపుఁ డై విడిసి దానవకోటులఁ బంక్తికంఠునిం

బోర వధించి నిన్నుఁ గొనికిపోవఁ గలం డని మున్ను నీకు నే
ధీరతతోడఁ జెప్పిన ప్రతిజ్ఞలు వచ్చెఁ జుమీ మహీసుతా.

2294


వ.

అనునయ్యవసరంబున.

2295


ఉ.

వేదనఁ బైపయిం దొరఁగువెచ్చనికన్నులనీరు సాంద్రస
మ్మోదము కల్మిఁ జల్లనయి మున్కొని క్రమ్మఁ గృశాంగయష్టియున్
మేదుర మై తనర్పఁగ సమీహితరోమసముద్గమంబున
న్మేదినిపట్టి రామవిభు నెమ్మదిలో నెలకొల్చి సోలుచున్.

2296


క.

కపివీర నీవు చేసిన, యుపకారంబునకు సామ్య మొదవంగాఁ బ్ర
త్యుపకృతి సేయఁగఁ దరమే, విపులత్రిజగత్ప్రదానవిధులును సరియే.

2297


చ.

పతిహితముం బ్రతాపము నుపాయము శౌర్యము ధైర్యమున్ సమీ
హితకరణక్షమత్వము నహీనజవంబుఁ బరాక్రమంబు నం
చితవినయంబు నీతియు వశిత్వముఁ దేజము నీక యొప్పు మా
రుతసుత నీకు ధారుణి నొకరుల్ సరివత్తురె వారి మెత్తురే.

2298


సీ.

నీకతంబునఁ గాదె నృపకులాధీశ్వరుం, డెలమి నావృత్తాంత మెల్లఁ దెలిసె
నీప్రసాదమునఁగా నెరయంగ సౌమిత్రి, ప్రాణముల్ భూపతి పడయ నేర్చె
[74]నిండి దైవాఱిన నీదయచేతఁగా, పరఁగ నేఁ జావక బ్రతికి యుంటి
దుస్తరం బైనపాథోరాశి యెవ్వఁడు, నీవు దప్పఁగ దాఁట నేర్చువాఁడు
రమణ నీ వనుయానపాత్రమునఁ జేసి, భూతలేశ్వరుఁ డాపదంభోధి దాఁటె
నెన్ని చూచిన నీఋణ మెట్లు దీరు, ఘనయశోధామ మా కేడుగడయు నీవ.

2299


వ.

అనిన హనుమంతుండు లజ్జావినయవినమితుం డై యి ట్లనియె.

2300


శా.

తల్లీ మీ రిటు లాన తిత్తురె భవద్దాసుండ మీయాజ్ఞ నే
జెల్లింపంగలవాఁడ మీయభిమతశ్రీ కింత [75]పాత్రుండ ను
త్ఫుల్లత్సత్క రుణుండు భూవిభుఁడు నన్ బొల్పార మన్నించుచోఁ
దెల్లం బైనబలంబునం బరఁగితిం దేజంబునం బేర్చితిన్.

2301


తే.

పుణ్యభాగిని భవదీయభూరిశుద్ధ, మహితసాధ్వీత్వసుచరిత్రమహిమఁ జేసి
పరఁగ నెల్లెడ శుభము లప్రతిహతంబు, లయ్యె నిక్కువ మంభోరుహాయతాక్షి.

2302


వ.

అని తత్సమీపంబున నతిభయంకరాకారలు నతివిశంకటదంష్ట్రావికటవదన
లు సతివృత్తోన్నతస్తిమితతారలోహితకపిలాదివర్ణనేత్రలుఁ బరుషతర్జనవచనలు
నగురాక్షసాంగనలం జూచి కోపించి యుగ్రాకారుం డై యి ట్లనియె.

2303


చ.

పెలుచనినిన్నుఁ జేరి వెఱపించుచు నూరక యెగ్గు లాడుచుం
గొలఁదికి మీఱ నుగ్రగతిఁ గ్రొవ్వునఁ బాపము నాక చంపఁగా

నలుగుచుఁ బెక్కుచందముల నప్పటి కప్పటి కేడిపించుచుం
గలఁచుచు నున్నయీదనుజకామినులం దెగటార్చి పుచ్చెదన్.

2304


మ.

అనినన్ జానకి పల్కు నిట్టు లిది యన్యాయంబు వీ రందఱుం
దనుజాధీశునిపంపు సేయుటకు నై దట్టించుచో వీరలం
దునుమాడం దగునయ్య వాతసుత మత్పూర్వోగ్రకర్మంబు ద
ప్పునె వీ రేమిటివార లింతు లెదురే పొ ల్పేది నీముందటన్.

2305


వ.

అని తొల్లి యొక్కశార్దూలంబు వినుచుండ భల్లూకంబుచేతం జెప్పబడినయది
గల దాకర్ణింపుము.

2306


క.

[76]వెఱవక చేసినపాపము, మఱియొక్కఁడు పుచ్చుకొన సమర్థుఁ డగునె క్ర
మ్మఱఁ దనక కుడువవలయును, మఱలదు వెనువెంట వచ్చు మానుప నగునే.

2307


క.

సమయంబు రక్షణీయము, సమయము లంఘింపఁ గీడు సమకూరు నిలన్
సమయంబు దప్పి నడవరు, సమవృత్తిని సత్పురుషులు సన్నుతమతు లై.

2308


ఆ.

తనదుతొంటిజన్మమునఁ జేయుపాపంబు, శుభము నయినఁబిదపఁ జొలవ కెలమి
ననుభవింపవలయు నది యెన్నివిధముల, లేఁడు గీడు సేయువాఁడు దనకు.

2309


వ.

కావున నిరపరాధినులు నిజస్వామివచనపరాధీనలు నగువరులం గరుణింపు మిప్పు
డు రావణనిధనంబు వినియు నన్నుం దొంటిక్రియఁ దర్జించుచున్నవారే యని
మఱియు ని ట్లనియె.

2310


చ.

ఒకనిమిషార్ధ మైన నిట నూరక జీవితనాథు వేడ్కఁ జూ
డక నిలువంగ లే నతివిడంబన మైనను నిర్వహింప ను
త్సుకమతి నున్నదాన నృపసూనున కింతయు విన్నవింపు పొ
మ్ము కపివరేణ్య నీ వనిన మోదితుఁ డై తదనంతరంబునన్.

2311


క.

చని రామున కప్పలుకులు, వినిపించినఁ గొంతవడి వివేకించి మనం
బునఁ జింతించి క్రమంబున, దనుజాధిపుతోడ ననియె ధాత్రీపతియున్.

2812


ఉ.

దానవవంశభాస్వదవతంస విభీషణ నీవ యేఁగి య
జ్జానకి నాదుపంపునఁ బ్రసన్నమతిం దగుభంగి మంగళ
స్నానము సేయఁబంచి విలసన్మణిభూషణదివ్యవస్త్రమా
ల్యానుపమాంగరాగముల వర్థి నలంకృతఁ జేసి తేవనా.

2313


వ.

అని పంచిన నతండును సహర్షుం డై లంక కరిగి యంతఃపురంబుఁ బ్రవేశించి
నిజాంగనలకుఁ దద్వృత్తాంతం బంతయుం జెప్పి పంచిన వారలు సీతకడకుం జని
మ్రొక్కి దేవీ నీవల్లభుం డగురఘువల్లభుపంపున విభీషణుండు మమ్ము నీసమ్ము
ఖంబునకుం బుత్తెంచెఁ గావున నీవును దద్వచనానురూపంబున మంగళస్నానం
బాచరించి విలసన్మణిభూషణాంగరాగమాల్యాంబరంబులు దాల్చి భవజ్జీవితే

శ్వరుపాలికి విజయం చేయు మనిన జానకి వారల కి ట్లనియె.

2314


క.

స్నానాంగరాగమాల్యా, నూనాంబరభూషణంబు లొల్ల మదీశుం
గానంగ నిట్ల వచ్చెద, నే ననవుడు వార లి ట్లనిరి జానకితోన్.

2315


క.

కృతపుణ్యశీల విను నీ, పతియానతి సేయు మనినఁ బడఁతుకయును స
మ్మతమున జలకమున నవా, మృతధౌతశశాంకరేఖ మించు దెగడుచున్.

2316


క.

మొదలనె చెలువము నెల వగు, ముదితకుఁ బునరుక్తభావము లగుతొడవు లా
సుదతీమణిఁ జెందుట నొ, ప్పిదమునకుం బాత్ర మయ్యెఁ బెంపు దలిర్ఫన్.

2317


క.

అవిరళమణిభూషణముల, నవనితనూజాత యుజ్జ్వలాంబర యై చా
రువిమలతారలు గలిగిన, నవచంద్రిక గల్గురాత్రి నాఁ దనరారెన్.

2318


క.

దానవసుందరు లత్తఱి, జానకి నందలముమీఁద సమ్మద మొదవం
గా నునిచి శారదాభ్రవి, లీనత నేపారుచంద్రలేఖయుఁబోలెన్.

2319


వ.

సగౌరవంబుగాఁ దెచ్చిన.

2320


చ.

రజనిచరేశుఁ డత్తఱి ధరాసుతకుం బ్రణమిల్లి ముదంటన్
నిజ మగుభక్తియు భయము నివ్వటిలం దగ నేత్రవిస్ఫుర
ద్భుజుఁ డయి క్రందు మాన్చుచుఁ బ్రభూతనిశాచరసేవ్యమానుఁ డై
విజితదశాస్యుఁ డైనరఘువీరునకుం బ్రణమిల్లి యి ట్లనున్.

2321

విభీషణుఁడు సీతను దెచ్చి రామునకు సమర్పించుట

ఉ.

దేవరపంపునన్ వరసతీతిలకం బగుసీతఁ దెచ్చితిం
గావున నీదుదర్శనము కాంతకు నీఁదగు వేడ్క నావుడున్
భూవరుఁ డంత దైన్యమును మోదముఁ గోపము నొంది జాతచిం
తావిలమానసుం డయి రయంబున జానకిఁ బిల్వఁ బంచినన్.

2322


సీ.

దానవాధీశుండు జానకిఁ దోడ్తెచ్చు, నప్పుడు చలవేత్రహస్తుఁ డగుచు
సందడి జడియుచు నందంద దైత్యులఁ, గపుల నొక్కుమ్మడిఁ గడఁగి వ్రేయ
ఘూర్ణాయమానమహార్ణవఘోషంబు, ననుకరించుచు మహానినద మొదవ
విని కోసలేంద్రుండు కనుకని వీరలఁ, గలయ నొప్పింపంగ వలవ దుడుగు
వింత లెవ్వరు మన కిందు వీరి నీవు, భీమవేత్రాహతుల నడ్డపెట్ట నేల
కోరి విచ్చలవిడిఁ గనుగొండ్రు గాక, చూచునంతన యె గ్గేమి శుద్ధచరిత.

2323


క.

చీరలు దగుగృహములుఁ బ్రా, కారములును దగినతెరలుఁ గాపులు మఱువే
నారీజనులకు సమ్యగు, దారం బగుచరిత మొండు దప్పింపంగన్.

2324


క.

వ్యసనంబులఁ బరిణయముల, నసమము లగుసంగరముల యాగంబులఁ బ్రో
ల్లసదుత్సవముల మఱువులు, బిసరుహనయనలకు వలదు పృథులవిచారా.

2325


వ.

కావున నిది సంగ్రామంబు పరికించిన వ్యసనంబును నగు నింతియ కాదు విజయ
మహోత్సవంబు వర్తిల్లుచున్నయది విశేషించియు మత్సమీపంబునందు దూ

షణీయం బెద్దియు లేదు. సానుజమిత్రుండ నగునన్నుం జూచుఁగాక తో డ్తెమ్మన
వుడుఁ దద్వచనానంతరంబ ముందట సతీజనశిరోభూషణం బగుభూనందనం
దెచ్చి నిలుప నియోగించిన.

2326


మ.

ఇనసూనుండును వాయుపుత్రుఁడు ధర్మాధీశానుజుండుం బ్లవం
గనికాయంబులు రాముపల్కులు దదాకారంబునుం జేష్టలుం
గని పత్నీనిరపేక్షు డై యకట భూకాంతుండు చూడంగఁ గో
పనభావంబున నున్నవాఁ డని మదిన్ భావించి చింతింపఁగన్.

2327


సీ.

తొంగలిఱెప్పలఁ దొంగలించుచు సిగ్గు, నునుఁజూడ్కి నడుగుల నూలుకొనఁగ
సరిఁ గూడి తిరిగెడు గరువతనంబున, నిలుకడమైఁ బెంపు నెలకొనంగ
నుపవాసముల డస్సి యున్నయాకౌఁదీఁగ, నిలువరించెడులావు వెలితిపడఁగఁ
బెద్దగాలమునకుఁ బ్రియచంద్రుఁ గాంచుట, ఘనసమ్మదాంబుధి గడలుకొనఁగ
దుఃఖ మనియెడుచెఱువునఁ దొరుఁగునలుఁగు, లనఁగఁ గన్నీరు ధార లై యతిశయిల్ల
బెరుగులడలునఁ దనముకుఁజెరమ లదరఁ, దనుతలోదరభావంబు ఘనత నొంద.

2328


క.

నయమార రామచంద్రో, దయము మనోజ్ఞత్వ మొంద ధాత్రీతనయా
హ్వయచంద్రకాంతపుత్రిక, ప్రయతస్వేదాపదేశభరమునఁ గరఁగెన్.

2329


ఆ.

అంత సీత యేడ్చె నెంతయు ని ట్లని, యడలు నిలుపలేక యార్యపుత్త్ర
నిన్నుఁ బాయఁజేసె నిన్నిదినంబులు, నాపురాకృతోగ్రపాపఫలము.

2330


ఆ.

నృపతి తనదుమ్రోల నిస్సహఖేదంబు, నొంది యేడ్చునీత నుగ్రదృష్టిఁ
జూచి కెంపుపెంపుచూడ్కుల మొలతేర, నిగ్రహోక్తిఁ బలికె నాగ్రహమున.

2331


క.

అవమానవైరు లనియెడి, యవనిజములఁ బెఱికి వైచి యభిమానమునం
దివిరితి దైవాఱించితి, భువనముల ననింద్యకీర్తిభూమామృతమున్.

2332


ఉ.

పౌరుషముం బ్రతాపమును బాహుబలంబుఁ బ్రతిజ్ఞయుం బ్రియం
బార ఫలింపఁ జేసితి మదాంధనిశాచరమర్దనంబునం
గ్రూరత నిన్ను మున్ను చెఱగొం చరుదెంచినపంక్తికంధరుం
బోర వధింపఁ గంటిఁ బరిపూర్ణమనోరథసిద్ధిఁ బొందితిన్.

2333


సీ.

నీనిమి త్తంబుగ వానరస్నేహంబు, వాలిఁ జంపుటయును వాయుసుతుఁడు
నినుఁ జూడ వచ్చుటయును బ్లవంగులఁ గూడి, సేతువు బంధించి సింధునాథు
దాటుట యాలోనఁ దమయన్నయుద్ధతి, నీవిభీషణుఁ డాశ్రయించుటయును
నితనికి నీలంక యిచ్చెద ననుటయు, వెలయ నిప్పురిచుట్టు విడియుటయును
వాలి దుర్జయుఁ డైనరావణునిఁ జంపి, నెరయ నీచెఱ విడిపించుకొఱకుఁ జూవె
నేఁ గృతార్థుండ నిక్కంబు నేఁడు నాకుఁ, గోర్కు లేపార సఫలతఁ గూడె నిపుడు.

2334

క.

మానం బరయఁగఁ బ్రాణస, మానము మానంబు సఖుఁడు మానమె ధనమున్
మానము విడుచుటకంటెను, మానుగఁ బ్రాణములు విడువ మంచిది తలఁవన్.

2335


క.

ఆమానము గాచుటకయి, యీమానము లైనచెయ్వు లేపారంగా
నామహనీయతఁ దగ నిను, నే మగుడం దెచ్చు టెల్ల నింతియ కాదే.

2336


వ.

కావున నీయందు నాకుఁ బరిగ్రహబుద్ధి లేదు పురుషునకుఁ బ్రతిజ్ఞాపరిపాలనంబ
పరమధర్మంబు సుచరితతీర్ధోదకంబులఁ దుర్యశఃపంకంబు గడిగి పరమయశ
స్సుకృతంబు గూడఁబెట్టుటయ పరమార్థంబు సుధాసాగరశుద్ధం బైనయిక్ష్వా
కువంశంబునం బ్రభవించిన రాజన్యులు గాంభీర్యౌదర్యౌన్నత్యాదిగుణంబులు
పాటించి లోకాపవాదంబునకు నోడి పరిత్యాజ్యం బయినచోఁ దమశరీరంబు
నయిన విడుతు రనినఁ దదితరంబు లెంత నీ విన్నిదినంబులు పరదారాభిమర్శకుం
డగురావణునింట నుండుటం జేసి నాకు విడిపింప కుండుట లోకంబులయందు
యశోలజ్జామానచ్యుతు లవుం గావున నీచందం బనుష్ఠింపవలసె నింతియ కాని
నీవలన మాకు నెయ్యంబు లేదు ని న్నొల్ల నీవు వలసినచో నుండు మని మఱి
యు ని ట్లనియె.

2337


ఆ.

ఇంతి వినుము పురుషుఁ డెట్టివాఁ డయినను, బరునియింట నున్నపడఁతి మగుడఁ
బ్రాకృతుండపోలెఁ జేకొన నేర్చునే, యింతకంటె నింద యెద్ది గలదు.

2338


క.

ఘనతరసౌందర్యము గల, నినుఁ జూచి దశాననుండు నిశ్చలమతి యై
మనసిజరాగము నొందక, మనమున ధైర్యంబు గలిగి మసలునె చెపుమా.

2339


తే.

భరతలక్ష్మణశత్రుఘ్నతరణిసూను, వాలినందనదానవవరులలోన
నీమనంబున కెవ్వఁడో నెఱిఁ బ్రియుండు, వానిఁ జేకొను మిప్పుడు వనిత యనిన.

2340


సీ.

క్షితిపాలుకోపలోకహితదృష్టి పావక, భూరిశిఖాహతిఁ బొగిలి పొగిలి
రామునిష్ఠురవాక్యభీమాస్త్రములు లోన, వఱలఁ గాఁడిన బిట్టు వడఁకి వడఁకి
[77]కాంతానుచితనియోగవిషమహావ్యాప్తి, మూర్ఛిల్లి యెంతయు మునికి మునికి
నరలోకపాలకపరిహారపవనంబు, చేఁ దూలి పడురీతిఁ జెదరి చెదరి
తనశరీరంబులోనన తా నడంగు, కరణి దెస లేనివెరవున ధరణి సొచ్చు
పగిది స్రుక్కుచు నప్పటిపరమమోద, మెల్లఁ బోనాడి విన్ననై యొల్లఁబోయి.

2341


చ.

కదుకొని వేఁడిబాష్పములు గ్రమ్మి పయింబయిఁ బర్వి భీతిమై
నదరుచు విన్ననైనహృదయంబునఁ బొల్పగుహారయష్టి ప
య్యద దడియంగఁ గానఁబడి యంచితనిర్మలరత్నభూషలం
దదుచితదృశ్యమానమణిధామసముజ్జ్వలభాతి దోఁపఁగన్.

2342


వ.

గద్గదస్వరంబు గదుర ని ట్లనియె.

2343


మ.

తగునే న న్నిటులాడ నీకు ననవద్యం బైనసద్వర్తనా

దిగుణౌఘంబుల శుద్ధి నౌ నెఱుఁగవే తెంపాడ యుక్తంబె సా
రగరిష్ఠుండవు నీవు దుశ్శ్రవవిచాకరవ్యక్తిదూరీకృతం
బగువాక్యంబుల నొంప నేల యకటా యన్యాయసంసక్తనే.

2344


చ.

అనయము ధాత్రికిం దనయ నై యెలమిన్ మిథిలేశుఁ డైనయ
జ్ఞనకుఁడు పెంపఁగాఁ బెరిఁగి సమ్మద మందఁగ నీకుఁ బత్ని నై
యినకులుఁ డైనయాదశరథేశ్వరుకోడల నైననాకు ని
ట్లనుచితపాపకృత్యములయందుల వేడ్కలు గల్గనేర్చునే.

2345


ఆ.

నృపకులాగ్రగణ్య నీవు బాలుఁడ వైన, నాఁడు బాల నైననాకరంబుఁ
బట్టినాఁడ [78]వదియుఁ బాటిచేయవు దీని, కగ్ని సాక్షి యగుట యరయఁదగదె.

2346


మ.

మదధీనం బగుజీవితంబును మనోమానానురాగంబులుం
ద్వదధీనంబులు సేసి యన్యజనచింతాదూర నై తావకా
భ్యుదయం బెప్పుడుఁ గోరుచుండ నిట నీ వుగ్రంబుగాఁ బల్క వ్ర
య్యదు కంటే హృదయంబు వజ్రకఠినం బై యున్న దిప్పట్టునన్.

2347


తే.

పాపరతుఁ డైనదైత్యుచేఁ బట్టువడిన, యపుడు లంకాపురంబులో నడఁచునపుడు
పరమదుర్భాషణంబులు పలుకునపుడు, జనకులాధీశవర నాకుఁ జావ తగవు.

2348


చ.

పురుషులు నమ్మరేనిఁ దమపొల్తులచేష్టితచిత్తవర్తనం
బరయుట దప్పు గాదు మనుజాధిప యుక్తమ కాన నీ వొగిం
బరుసనిపల్కు పల్క వినఁ బా లయితిన్ సభలోన నక్కటా
శరములఁ బోలువాక్యములు సైఁతురటే సతు లింత కోర్తురే.

2349


చ.

నరవర నీవు చిత్తమున నమ్మనివాఁడవ యేని మున్ను న
న్నరయఁగ మారుతాత్మభవు నంపినయప్పుడు నీతలంపుచొ
ప్పరుదుగ నాకు నేర్పడఁగ నాతనిచే నెఱిఁగింతు వేని నే
నెరియుచుఁ బ్రాణముల్ విడుతు నిప్పుడు న న్నిటు లాడఁగూడునే.

2350


వ.

అని లక్ష్మణు నవలోకించి యేడ్చుచు ని ట్లనియె.

2351


ఉ.

లక్ష్మణ చూచితే యనఘలక్షణలక్షిత నైననన్ను దు
ర్లక్ష్మచరిత్రఁబోలె వికలస్థితిగా భవదగ్రజుండు దా
సూక్ష్మనిశాత యైనమతిఁ జూడక ఘోరవచోమహాగరు
త్పక్ష్మలితేక్షణాస్త్రముల పాల్పడఁ జేయుచు నున్నవాఁ డొగిన్.

2352


సీ.

పరవృత్తచేష్టితభావేంగితంబులు, సూచి తెలియు దీవు శుద్ధచరిత
యౌదార్యగంభీరతౌన్నత్యధైర్యాది, గుణముల నెంతయుఁ గొమరు మిగిలి

యాగమలౌకికవ్యవహారములయందు, నరయ నీ వెఱుఁగనియదియుఁ గలదె
నను నీవు దగఁ జిన్ననాఁటనుండియుఁ జూచు, చుండుదు విట యెగ్గు లున్నవయ్య
యొగి మహీపతి యప్పటనుండి పలుకు, ననుచితంబులు మాన్పంగ ననువు లేదె
పరుషదుశ్శ్రవభీషణభాషణములు, నీవు దయ మాలి విన నెట్లు నేర్చితయ్య.

2353


క.

మీ రింత నమ్మకున్నను, గౌరవ మేపార నన్నుఁ గరుణించి మహో
దారం బగుసొదఁ బెట్టుఁడు, ధీరమతిం జొత్తు నందుఁ దిర మగుకడఁకన్.

2354

సీత యగ్నిప్రవేశము చేయుట

చ.

కలఁగక జాతవేదసుముఖంబున నెంతయు శుద్దురాల నై
నలువయు శూలియున్ హరియు నన్ను వెసం గొనియాడునట్లుగాఁ
జొలవక మీరు మెచ్చుగతిఁ జొచ్చెదఁ జిచ్చు మదీయభర్తక
న్సెల వగునంతమీఁద శుభశీలత ధారుణి నాశ్రయించెదన్.

2355


మ.

అనినం దల్లడ మంది లక్ష్మణుఁడు దైన్యాయత్తచేతస్కుఁ డై
తనలోనం దలపోసి ఖేద మొదవన్ ధాత్రీపతిం జూచి య
జ్జనపాలాగ్రణి సన్న చేసిన నుదంచద్వేగ మేపార నే
చినమంటల్ మొగి మిన్నుముట్ట సొద పేర్చెన్ సీత మోదింపఁగాన్.

2356


తే.

పరమపావని యగుసీత పరఁగ నేఁడు, చెలఁగి నాయందుఁ జొచ్చుటఁ జేసి మిగుల
ననఘశీలుండ నయ్యెద నని ముదంబుఁ, బొందుకైవడి మిన్నంది పొదలె నగ్ని.

2357


వ.

తదనంతరంబ.

2358


క.

తల వాంచియున్నభాస్కర, కులపతికిఁ బ్రదక్షిణించి గురుతరకీలా
కుల మగుసొద చేరంగా, సలలితగతి నేఁగుదెంచి జానకి యంతన్.

2359


చ.

వినయముతోడ మ్రొక్కి యరక్తవిందనిభానన వేడ్క వీతిహో
త్రునకుఁ బ్రదక్షిణంబు సనుదెంచి కృతాంజలి యై త్రిలోకపా
వన గతసర్వభావన నివారితకల్మష సర్వనిర్జరా
నన సకలక్రియాధికరణప్రవణాభినివేశ పావకా.

2360


చ.

స్థిరమతులార యోసకలదిక్పతులార సురేంద్రులార కి
న్నరవరులార సర్పకులనాయకులార మునీంద్రులార ఖే
చరవరులార యక్షగణచారణగుహ్యకసాధ్యులార వి
స్ఫురదినచంద్రులార వరభూతములార యెఱింగి యుండుఁడా.

2361


క.

మీ రిందఱుఁ [79]దగుకరిగాఁ, గోరుచు నే నున్నదాన గురుహితమతి నా
చారిత్రం బేచందం, బేరూపము దాని విూర లెఱుఁగుదు రరయన్.

2362


వ.

కావున వాఙ్మనఃకాయకర్మబుద్ధీంద్రియతదర్థంబులం జేసి నిమేషకాష్ఠాకళాక్షణ
ముహూర్తయామసంధ్యాహోరాత్రపక్షమాసర్త్వయనవత్సరపరిగణితంబు

లగుకాలంబులు సాక్షిగా స్వప్నాద్యవస్థలయందును జ్ఞానాజ్ఞానంబులయందును
మద్వల్లభుం డగురఘునాథునకుం దప్పుట లేదు.

2363


క.

చాయగతి నాదుచిత్తము, పాయక రఘునాథునంద పరఁగునయెనిన్
న్యాయము దప్పక దహనుఁడు, ధీయుక్తిన్ నన్నుఁ గాచు ధృతి యెడఁగూడన్.

2364


తే.

దుష్టకల్మషబుద్ధి నై దోషమునను, జనకులాధీశునకుఁ దప్పి సచ్చరిత్ర
మెడలి నడుచుట గలిగిన నీక్షణంబ, చెలఁగి నను నగ్ని భస్మంబు సేయుఁగాత.

2365


మ.

అనుచు నిశ్చలచిత్త యై రఘుకులేంద్రాయత్తచింతావశం
బునఁ దాత్పర్యము గల్గి నిర్మలలసద్బుద్ధిప్రసాదంబుపెం
పున నభ్రంకషకీలుఁ డై కనలుచున్ భూరిప్రభుం డైనయ
య్యనలుం డుప్పతిలంగఁ జొచ్చె నిరపాయస్నేహరాగంబునన్.

2366


ఆ.

అనఘమంత్రపూత మైనయాజ్యాహుతి, పగిది ధరణిపుత్రి పడియె నంతఁ
దేజ మెసఁగ నగ్నిదేవుండు మిన్నంది, మహితశిఖలు గలిగి మండఁ జొచ్చె.

2367


ఉ.

లోలవిలాసఖేలనవిలోచనమానము లాననాబ్దమున్
లాలితబాహువల్లరిమృణాళములుం బృథుకేశభారశై
వాలము నొప్ప సీత యనవద్యపవిత్రచరిత్ర విస్ఫుర
చ్ఛీల కృశానునందు సరసీగతిఁ జూడఁగ నొప్పె నెంతయున్.

2368


చ.

పవడపురాశిలోనినవభర్మశలాకయుఁబోలెఁ జారుప
ల్లవములకుప్పలో నిడిన లాలితచంపకదామమట్లు ర
క్తవనజరాజిహంసి యనఁగా వరుణాభ్రములోన నున్నయా
నవశశిరేఖఁబోలె దహనస్థిత [80]యయ్యె విదేహకన్య దాన్.

2369


వ.

అప్పుడు పతివ్రతాశిరోమణి యగుసీత దహనశిఖావృతయై యున్నం గనుంగొని
దానవాంగనలు శోకింప నిశాచరులు దుఃఖింపఁ గపులు సమాక్రందనంబులు
సేయ సుగ్రీవుండు బెగ్గిల విభీషణుండు పారవశ్యంబు నొంద నంగదుండు విన్నఁ
దనంబు సెంద హనుమంతుండు ఖేదింప లక్ష్మణుండు వగలం బొగుల రాఘవుం
డవాఙ్ముఖుం డై నిర్వేదింప సురు లనుచితం బన సాధ్యు లన్యాయం బన యక్షు
లనుపేక్షణీయం బన గంధర్వు లద్భుతం బన మహోరగంబులు తగ దనఁ
జరాచరంబులు దృశ్యాదృశ్యంబులు నగుభూతంబులు దల్లడిల్ల మహాభూతంబు
లాక్రోశింప నక్కోలాహలంబు లొక్కపెట్ట నొదవిన.

2370


సీ.

ప్రమథులు సనుదేర బాలేందుధరుఁ డైన, మూఁడుగన్నులవేల్పు మున్ను గాఁగ
జగముల సృజియింపఁ జాలి యాద్యుం డైన, చతురాస్యుఁ డగుపద్మసంభవుండు
గమనీయవికసితకమలపత్రము లన, వేయికన్నులు గలవేల్పుఱేఁడు
వహ్నికాలాసురవరుణానిలశ్రీద, శూలహస్తులుఁ గూడి సురుచిరముగ

గరుడసిద్ధసాధ్యగంధర్వఖేచర, యక్షపక్షినాగయాతుధాను
లాదిగాఁగఁ బుష్పకారూఢు లయి రాము, ధీరుఁ జూడ నేఁగుదెంచి రెలమి.

2371


క.

అత్యాదరమున రాముఁడు, ప్రత్యుత్థానంబు సేసి భక్తి యెసఁగ స
న్నత్యాదివిధు లొనర్చెం, బ్రీత్యుత్కర్షాతిరేకబృంహితతనుఁ డై.

2372


వ.

తదనంతరంబ.

2373


క.

అంభోవాహంబులు నిఖి, లాంభోధులుఁ గూడి మ్రోయుననువునఁ బృథుసం
రంభమున లోకపాలురు, గంభీరార్థముల ననిరి కాకుత్స్థునకున్.

2374

ఇంద్రాదిదేవతలు రాముని స్తుతించుట

శా.

నీతత్త్వం బెఱుఁగం దలంపఁ దగ వర్ణింపంగ శక్యంబె మా
చేతఃపద్మగృహంబులన్ మొఱఁగి యక్షీణానుభావంబునన్
భూతాదిప్రకృతిప్రపంచరచనాభూమవ్యవస్థానసం
జాతప్రౌఢిమ గల్గి యుండుదువు చంచద్విభ్రమాభ్రతన్.

2375


శా.

వేదాంతంబులయందు నీ వొకఁడ వై వేద్యస్థితిం బొంది లో
కాదిత్వంబున నొప్పి సంసృతిపదాయత్తాతిదూరుండ వై
రోదోంతంబు సమాక్రమించి గురుచిద్రూపంబు నీ వై బహు
ప్రాదుర్భావము నొంది యుండుదువు శుంభత్ప్రాభవస్ఫూర్తి వై.

2376


వ.

స్థూలసూక్ష్మగురులఘుకఠినమృదువ్యక్తావ్యక్తరూపారూపగుణాగుణసన్నాసన్న
సరసనీరసత్వాదిరూపంబులు నీవ కాక యన్యథాభావం బెఱుంగ మవి నిర్హేతుక
ప్రవర్తనం బై విలసించు.

2377


తే.

నీవు నారాయణుండవు నీరజాక్ష, శంఖచక్రగదాశార్ఙ్గశాలి వీవ
యేకశృంగవరాహంబ నీవ దేవ, యక్షరం బగు బ్రహ్మంబు నరయ నీవ.

2378


తే.

నీవు విశ్వంబులోపల నెరయఁగలవు, తలఁప విశ్వంబు నీయంద నిలిచియుండు
వెలయ విశ్వంబునకు నీకు వేఱు గలదె, నిజము సర్వంబుఁ దలఁపంగ నీవ కావె.

2379


సీ.

ఆరయ రూపనామాదిభేదంబుల, విశ్వంబునం దెల్ల వెలయు దీవు
కావున నిట నీవు కానిది యెద్ది యీ, కమలసంభవసృష్టిఁ గలదు దాని
నే మెఱుంగుట లేదు నీ వాదిమూర్తివి, నీనిజరూపంబు నిక్కువముగఁ
దెలియ నెవ్వఁడు చాలు దృష్టిగోచరుఁడవు, కాకుండియును నెప్డుఁ గలవు నిన్నుఁ
దలఁచునాతండు పుణ్యుండు ధన్యతముఁడు, నొగి నుతించినయాతండు యోగ్యతముఁడు
వెలయఁ బొడగన్నయాతఁడు విదితయశుఁడు, సకలలోకంబులకు నెల్ల సాక్షి వీవ.

2380


వ.

భూమ్యాదిలోకంబులును సప్తసాగరంబులును సప్తద్వీపంబులు నుపద్వీపంబు
లుఁ బృథివ్యాదిభూతంబులును మేరుహిమవదాదిమహాగిరులును గౌతమీజాహ్న

వీప్రముఖపుణ్యనదులును మానసాదిసరోవరంబులును నందనచైత్రరథాదినా
నావనంబులును మృగపక్షిసరీసృపతిర్యగ్జాతిసత్త్వంబులును మనుప్రభృతిరాజ
లోకంబులును నారదాదిదివ్యతపోధనులును మహేంద్రాదిదిక్పతులును జిత్రసే
నాదిగంధర్వులును మాణిభద్రాదియక్షులును శేషవాసుకిప్రముఖనాగకులం
బును హిరణ్యకశిపుప్రముఖదైత్యకులంబును ద్వాదశభాస్కరులు నేకాదశ
రుద్రులు నష్టవసువులు నశ్వులును నక్షత్రగ్రహతారకాగణంబులును బితృదే
వతలును నిమేషాదికాలంబులును యుగమహాయుగకల్పంబులును మం
త్రంబులును యజ్ఞాంగంబులును నాగమంబులును శాస్త్రంబులు నేకాద్యనేక
సంఖ్యలును మఱియు నవ్యంబులు ననంతకోటిబ్రహ్మాండంబులు నీకుక్షియం
దడంగియుండు నీ వెంత గలవో యట్టినీవు యమనియమాద్యష్టాంగయోగ
పరాయణు లగుపరమయోగీంద్రులమనంబుల వర్తింతువు భవదీయం బగుమా
యాప్రపంచంబున మోసపోయి కాదె యనిత్యంబులుఁ దాత్కాలికసుఖలే
శాభాసకంబులును సకలదుఃఖైకాయతనంబులును నిరయైకహేతువులు నగు
సాంసారికబంధంబులం దగులువడి మానవులు విఱుగడ లేకున్నవా రవిద్యావ
రాధీనులై యున్నవారలకు నీపరతత్త్వం బెఱుంగం బోలునె రాగాదిరసానుప్ర
వేశ[81]దృఢీకృతం బగునజ్ఞానగ్రంథి వదల్పనేరక వివిధజన్మాదుల నొందుచుఁ
[82]దదీయక్లేశంబు లనుభవించుచున్నవారు ని న్నెఱుంగునతఁడు నిన్ను ముట్టు
వాఁడు నీయంతవాఁడ యగునిన్ను నిట్టివాఁ డని వర్ణింపఁ దరంబు గాదు.

2381


మ.

భువనంబుల్ మనుపంగఁ బూని సుమనఃకపూగంబులం గావఁగా
రవివంశోత్తముఁ డైనయాదశరథేంద్రక్ష్మావధూభర్తకుం
బ్రవరానందము గల్ల నందనుఁడ వై భాసిల్లు నారాయణుం
డవు నీ వారయ మర్త్యమాత్రుఁడవె రూఢప్రాభవా రాఘవా.

2382


శా.

పాతివ్రత్యగుణంబు సుస్థిరమతిం బాటించి కళ్యాణస
చ్చేతోవృత్తిఁ దనర్చి లక్షణములం జెల్వొంది శుద్ధక్రియో
చేతప్రక్రియ యైనజానకి భవత్ప్రేమానురూపంబుగాఁ
బ్రీతిం బుట్టిన యాదిలక్ష్మి దలఁపం బృథ్వీతలాధీశ్వరా.

2383


చ.

అకట యుపేక్ష సేయఁ దగునయ్య రఘూద్వహ మండుచున్నపా
వకమునఁ దత్సతీత్వగుణవైభవ మొప్పఁగ నుండునట్టిజా
నకి నిటు చూచుచుండఁ దగునా పిలిపింపఁగదయ్య సాధ్వి నూ
రక చెడనాడ నేల యనురాగదయామృతదృష్టిఁ జూడవే.

2384


క.

వనజేక్షణ నారాయణ, నిను నీ విట మఱవఁదగునె నిర్దయమతి వై
జనకసుత నుపేక్షింతురె, మనుజేశ్వర మమ్ము నెలమి మన్నింపఁగదే.

2385

మ.

అని యావేలుపు లిట్లు పల్క మదిలో నత్యంతమున్ సంతసి
ల్లి నరేంద్రుండు సమంచితాదరసమాలీఢాశయుం డై లస
ద్వినయానమ్రశిరస్కుఁ డై దశనకాంతిజ్యోత్స్నలన్ దేవచి
త్తనవీనోత్పలసంచయంబులు ప్రమోదం బందఁగా ని ట్లనున్.

2386


క.

మీరు ననుఁ బెక్కుభంగుల, నారాయణుఁ డనఁగ వలదు నరుఁ డనఁ దగు నే
నారయ దశరథరాముఁడ, నీరేరుహలోచనుండనే తలపోయన్.

2387


వ.

అని పలికిన.

2388


ఆ.

అనఘుఁ డైనదశరథాత్మజువచనంబు, విని మనంబులోన వేడ్క నిగుడ
వనజసంభవుండు వసుమతీపతికి ని, ట్లనియె సాంత్వవినతు $ లమరునట్లు.

2389

బ్రహ్మ రాముని స్తోత్రము సేయుట

తే.

వేయిగన్నులు వెలుఁగంగ వేయిదలలు, వేయిచరణంబు లింపార వివిధరూప
ధరుఁడవై యుండు దచుత్య సరసిజాక్ష, శార్ఙ్గచక్రగదాధర జలజనాభ.

2390


సీ.

నే నీదుహృదయంబు నీజిహ్వ భారతి, నీరోమకూపముల్ నిర్జరాలి
నీనిమేషము రాత్రి నీసమున్మేషంబు, దివము నీపలుకులు దెలియ శ్రుతులు
నీసముచ్ఛ్వాస మనిలము నీకన్నులు, ప్రాలేయభానుండు భాస్కరుండు
నీరోష మనలుండు నీప్రసాదము సుధాం, భోరాశి నీపదంబులు ధరిత్రి
నీశిరంబు నభము నీదుహస్తంబులు, దెసలు నీదుమూర్తి త్రిభువనములు
లోకమయుఁడ వీవు లోకాధిపతి వీవు, లోకనుతుఁడ వీవు లోకభరిత.

2391


సీ.

మేదినీశ్వర మున్ను మీనంబ వై నీవు, వెదకి తెచ్చితివయ్య వేదసమితిఁ
గాకుత్స్థకులదీప కమఠంబు నీ వయి, యమృత మిచ్చితి వేడ్క నమరతతికి
క్షితిభృదుత్తమ నీవు కటిరూపధరుఁడ వై, ధరణి యెత్తితి సముద్దామశక్తి
నరవరాధిప నీవు నరసింహమూర్తి వై, రాక్షసోరస్స్థలి వ్రచ్చి తయ్య
వామనత్వంబు ధరియించి వఱలి నీవు, ముజ్జగంబులు చేకొంటి మూఁడడుగులఁ
బరశురాముఁడ వై భూమిపతుల నెల్ల, సరవి ముయ్యేడుమాఱులు చంపితయ్య.

2392


క.

ఆనీవు జగద్ధితముగ, మానుషవేషంబు దాల్చి మహిమోన్నతిమై
మానుగ దశముఖుఁ జంపితి, దానవసేనావిరామ దశరథరామా.

2393


క.

రాఘవ నీబలవీర్య, శ్లాఘావిక్రమవిశేషసందర్శనముల్
మోఘములు గావు ఘనవిభ, వౌఘములకు నాస్పదంబు లుర్వీనాథా.

2394


వ.

అనునయ్యవసరంబున విశ్వమయుండును విశ్వైకసాక్షియు విశ్వపావనుండును
నగు వైశ్వానరుండు సముత్తాలాభీలజ్వాలావలీదహ్యమానంబు లగునింధనంబు

బులు పాయఁ ద్రోచి యస్వేదబిందుజాలాంచితయు నమ్లానవదనపంకజయు న
క్లిష్టతనువల్లికయు నతాంతలతాంతమాలికయు ననవసన్నాంగరాగయు ననాహ
తదుకూలయు ననిర్ధూతకేశకలాపయు నకంపమూర్తియు నవిచ్ఛిన్నహారా
ద్యలంకారయు నవిపాయానసూయాదత్తపుణ్యాంగరాగగంధబంధురమూర్తి
యు నై తొంటిక్రియ నున్నం గనుంగొని కపులు నసురులును సబాష్పనయను
లై నృపతి కిప్పురంధ్రీరత్నంబు నిన్నియెగ్గు లాడం దగ దన వసుమతీదుహిత
యగుసీతను రఘునాథుసన్నికర్షంబునకు నెత్తికొని తెచ్చి ముందు నిల్పి యి
ట్లనియె.

2395

అగ్నిదేవుఁడు సీతమహత్త్వము చెప్పి రామున కొప్పించుట

చ.

రఘుకులదుగ్ధవారినిధిరాజ భవత్సతి దూషితక్రియా
లఘుచరితానుషక్తిమెయి లౌల్యము దాల్చి చరింప నేర్చు నే
యఘములు జానకిం దలఁచితనంతనె నాశము నొందు నీకు ని
ట్లు ఘనతరాగ్రహంబునఁ గడుం జెడ నాడుటఁ జూడ యుక్తమే.

2396


క.

పస చెడవు మేనిమెఱుఁగులు, గసుగందవు క్రొవ్విరులును గనుఁగవ ధూమ
ప్రసరమున నెఱ్ఱఁబాఱదు, వెసఁ దలచీరయును నట్ల వెలయుటఁ గంటే.

2397


ఉ.

దైవము ప్రాణమిత్రుఁడును దాత సఖుండును జీవితార్థముల్
నీవుగ వాఙ్మనఃకరణకనిశ్చయబుద్ధిశరీరదృష్టిసం
భావితవృత్తి నేమఱక పన్నుగ నిన్నె తలంచు నన్యదు
ర్భావన లేదు భూమిసుత భవ్యచరిత్రపవిత్ర భూవరా.

2398


చ.

చపలాత్ముం డగుదానవాధిపతియాజ్ఞన్ వచ్చి నక్తంచరుల్
కృప యొక్కింతయు లేక యుగ్రగతి జంకింపంగ నోలిం బ్రలో
భపువాక్యంబులు పల్క బిట్టు వెఱపింపన్ నొవ్వఁగా నాడినన్
విపులస్వాంతమునం గలంగఁబడ దుర్వీకన్య రాజోత్తమా.

2399


క.

శుచి నై జగములకుఁ బరమ, శుచిత్వ మొనరించు నే వసుమతీతనయా
రచితప్రవేశమునఁ గడు, శుచి నైతిఁ గృతార్థభావసుభగుఁడ నైతిన్.

2400


సీ.

మందారభూజంబు మరిగినభృంగికిఁ, బిచుమందశాఖిపైఁ బ్రేమ గలదె
లలి మానసంబున మెలఁగెడుహంసికి, వెలయఁ బల్వలముపై వేడ్క గలదె
మలయద్రుమంబున మలయుభుజంగికి, బర్బూరతరువు[83]పై వలపు గలదె
భాస్కరోదయమున భాసిల్లుపద్మిని, కిందుకరస్పృష్టి నెలమి గలదె
రాజితానేకసద్గుణారామ రామ, ధర్మపాలనపరమ నీధర్మపత్ని
యైనసాధ్వికి సీతకు నన్యునందుఁ, గూర్మి యేచందమున సమకూడునయ్య.

2401


ఉ.

కావున నీవు నాపలుకుఁ గైకొనఁగాఁ దగుఁ గాదు నాక సం

భావనతోడ సచ్చరితభాసుర యైనమహీసుతన్ దిగీ
శావలి సంతసిల్లఁగఁ బ్రియం బొదవంగఁ బరిగ్రహింపు రా
జీవహితాన్వయాభరణ సింధుగభీర గుణైకభూషణా.

2402


వ.

అని సీత నొప్పించి విన్నవించిన.

2403


క.

ఆపావకువచనంబులు, భూపాలకమౌళి విని ప్రభూతస్ఫుటచిం
తాపరుఁ డై తనయాత్మ ని, రూపించుచు నట నిరుత్తరుం డై యెలమిన్.

2404


వ.

ఒక్కింత విచారించి హిరణ్యగర్భవిరూపాక్షులుం బురుహూతప్రముఖదిక్పతు
లును గంధర్వయక్షోరగాదులును మునులును వినుచుండ దశనచ్ఛవివ్యాజంబు
నం దనయశంబు సకలహరిదంతరాళంబులు నిండ ధీరధారాధరోదారనాదంబు
న సందర్శనాగతస్కందమయూరంబు ముక్తకలాపం బై యద్భుతనర్తనం బొన
రింప ని ట్లనియె.

2405


చ.

సురనదివోలె భూమిసుత శుద్ధమనోజ్ఞచరిత్ర శీలబం
ధురతరచిత్త దా నెఱుఁగుదున్ భయభక్తులు గల్గి నాయెడం
దిర మగుకూర్మి నెంతయుఁ బ్రతీక్ష్యయ కావున నీమృగాక్షియం
దరసిన లేదు దోషము సదాదరణీయగుణాఢ్య యెల్లెడన్.

2406


క.

నలకూబరుశాపంబున, బలిమిమెయిన్ రావణునకుఁ బరకాంతల ని
మ్ములఁ గవయరామి యెఱుఁగుదుఁ, గలచి పతివ్రతలఁ జేరగాఁ దర మగునే.

2407


చ.

జలజిని శీతభానురుచిసంగతిచే వికసింపనేర్చునే
వెలయఁగ నాకుముద్వతి రవిద్యుతివేఁడిమి నుల్లసిల్లునే
నెలకొని పాఱునిర్ఝరిణి నీరధిఁ జేడ్పడి పాసిపోవునే
నిలుకడ తప్పి సీత యతినీచపువృత్తికి వేడ్క సేయునే.

2408


చ.

ఘనతరదోషుఁ డైనదశకంఠుఁడు దాఁ గొనిపోయి జానకిం
దనవనభూమిలో నిలుపఁ దద్దయుఁ గాముకుభంగి రాఘవుం
డనుచితవృత్తిఁ దెచ్చె ననయం బపకీర్తికి నోడఁ [84]డన్మహీ
జనులమహాపవాదమును సైఁపక చేసితి నింత యిత్తఱిన్.

2409


శా.

సందేహంబులు మానె నన్నియు మనస్సంతాపముం దీఱె నా
నందాసూనపయోధి వెల్లివిరిసెన్ నాకోర్కి సేకూరె భూ
నిందావాదము లెల్లఁ బాసె మదియున్ నిశ్చింతభావస్థితిం
బొందెన్ సంస్తవనీయకీర్తి నయితిం బుణ్యాతిరేకంబునన్.

2410


మ.

భవదాజ్ఞామహిమాతిభూతి నెలమిం బాటించి నే జానకిం
బ్రవరప్రీతిఁ బరిగ్రహించితిఁ గృపాపర్యాప్తసత్కాంతి న
త్యవదాతం బగుచూడ్కి నాదెసఁ బ్రియం బారంగ నూల్పొల్పి గౌ

రవ మొందం గరణీయ మేది నయ మారం జెప్పుఁడా చేసెదన్.

2411

శివుఁడు రాముని స్తుతించుట

వ.

అనిన.

2412


ఆ.

రాజతాచలైకరాజితనిలయుండు, రాజరాజసఖుఁడు రాజమౌళి
రాజమౌళి యైనరాజీవహితవంశ, రాజమానుఁ డైనరాముఁ బలికె.

2413


క.

నీకు సరి గలరె రాఘవ, లోకపరిత్రాణభరణలోలుఁడవు పర
శ్లోకచరిత్రుఁడవు సురా, నీక భయాపహృతిమాననీయుఁడ వెందున్.

2414


చ.

సురలకు గుండెతల్లడము [85]శూరులడెందములోనికొఱ్ఱు ఖే
చరతతికంటిలో[86]నలుసు సాధ్యులకొంగున నున్నచిచ్చు భూ
సురులకు నెల్లనాఁడు మెడఁ జుట్టినపాము మునీంద్రకోటిపైఁ
బొరిఁ బడ నున్నయాపిడుగుఁ బొల్పఱఁ జేసితి వీవు రాఘవా.

2415


వ.

కుంభకర్ణమేఘనాదాతికాయమహాకాయాదు లగుమహాసురుల [87]నసంఖ్యేయు
ల నజేయులం దెగటార్చి ప్రాజ్యం బగుస్వారాజ్యంబు నిష్కంటకంబు గావించి
సకలభువనంబులు నిరాతంకంబులుగాఁ బావనంబులు సేసి తింక నీవు కృతకృ
త్యుండవు కరణీయవిశేషం బెద్దియు లే దయినను జేయవలయునది యెయ్యది
యనిన భవజ్జనని యైనకల్యగుణసాకల్య యగుకౌసల్యయు నీకుఁ బరమభక్తుం
డు ననురక్తుండును శుభచరితుండు నగుభరతుండు నాతనిజనయిత్రి యైనకేకయ
రాజపుత్రియు భవద్వనవాసైకసహచరుండును రణాగ్రచరుండును నగులక్ష్మణు
తల్లి పోషితమిత్ర యైనసుమిత్రయు వీరశత్రుఘ్నుం డగుశత్రుఘ్నుండు నితరబం
ధువర్గంబులు నీదర్శనంబుఁ బ్రతీక్షించుచున్నవారు గావునం బరాయోధ్య య
గునయోధ్య కరిగి వారల యథాక్రమంబున సంభావించి సకలప్రధానప్రజాను
రంజనంబుగా రాజ్యంబు సేయుచు హయమేధముఖంబు లగుమఖంబు లనేకంబు
లు నిర్వర్తించి సముచితదక్షిణాప్రదానంబుల మహీసురులం దనిపి సుఖంబు
లనుభవింపు మని మఱియు ని ట్లనియె.

2416


క.

నీజనకుఁడు దశరథుఁ డదె, నీజయమున కాత్మ మెచ్చి నిర్జరతతిచేఁ
బూజితుఁ డై వరపుష్పక, రాజితుఁ డై వచ్చినాఁడు రాఘవ కంటే.

2417


క.

ముదమున సావరజుఁడ వై, మది నుల్లాసంబు నిగుడ మహితస్థితి న
భ్యుదయమ్ము నెదుర్కొనుగతి, సదయుని దశరథునిఁ గనుము సదమలచరితా.

2418


క.

అనినన్ భక్తిముదంబులు, పెనఁగొనఁ బులకించి మించి పెరిఁగినకడఁకన్
జనవిభుఁడు సానుజుం డై, జనకునకు నమస్కరించె సంభ్రమలీలన్.

2419


వ.

నందనద్వయంబును దనకుఁ బ్రణామం బాచరించినం దిగిచి గ్రుచ్చి కౌఁగిటం

జేర్చి మూర్ధఘ్రాణంబు సేసి పుత్రస్పర్శముఖావలోకనసుఖంబు సురలోకసు
ఖాతిశాయిగాఁ దలంచుచు ని ట్లనియె.

2420


సీ.

త్రైలోక్యరక్షణదక్షు మహాప్రాజ్ఞు, శూరధురంధరు శుభచరిత్రు
నిన్నుఁ బట్టము గట్ట నెఱయ నాయిత మయ్యుఁ, బాపపుఁగైకేయిపలుకు లట్లు
విని కాననమునకు వేవేగ పంపితిఁ, గీడ్పాటుమై వివేకకింప నైతి
రాజవై సుఖలీల రాజ్యంబు సేయంగ, హీనపుణ్యత జూడఁ గాననైతి
నాకవాసి నయిననన్ను నీశోకాగ్ని, కడఁగి యెల్లప్రొద్దుఁ గ్రాఁచుచుండు
వెరవిఁడితనమునకుఁ బురపురఁ బొక్కుదు, స్త్రీపరత్వమునకు సిగ్గుపడుదు.

2421


క.

నీముఖసందర్శనమున, నామది వగ లెల్లఁ బాసె నరనుతగుణ నిన్
రామ యని పిలుచుభాగ్యం, బీమహి లేదయ్యె నాకు నినసమతేజా.

2422


ఉ.

మంజుగుణాధివాస పరమప్రియశుద్ధచరిత్రతోఁ బ్రజా
రంజనతత్పరుండ వయి రక్షణశిక్షణదక్షతన్ ద్విష
ద్భంజనకృత్య మేమఱక బాహ్యవిపక్షజయంబు గల్గి యి
క్కంజహితాన్వయంబు సవికాసముగాఁ బ్రభవింపఁజేయుమీ.

2423


వ.

అని తనమ్రోల ముకుళితకరకమలుం డయి యున్నసుమిత్రాపుత్రునిం జూచి
యి ట్లనియె.

2424


ఉ.

రామునిఁ గొల్చి నీ విటు లరణ్యములందుఁ జరించి విక్రమ
శ్రీమహనీయకీర్తి విలసిల్లితి నీ విటమీఁద నెంతయుం
బ్రేమము భీతియుం గలిగి పెంపుగ నన్నకు భక్తి సేయుమీ
యీమహితాత్ముఁ డారయ మహీపతిమాత్రుఁడు గాఁడు పుత్రకా.

2425


వ.

అని పలికి తనకు మ్రొక్కి లజ్జాత్రాసభక్తినమ్రవదన యై యున్న మైథిలిం గ
నుంగొని సస్నేహబహుమానంబుగా ని ట్లనియె.

2426


తే.

ఉద్భవానుగృహీతోర్వి వురుచరిత్ర, విహసితారుంధతివి సంప్రవేశపూత
హవ్యవాహవు శుభచిహ్నభవ్య నీవు, పరమకళ్యాణి నినుఁ బోలు పడఁతు లేరి.

2427


క.

నీతగునడవడి యెఱిఁగియు, నాతనయుఁడు భువనసమితినమ్మికకై యా
దైతేయగృహస్థితిసం, భూతం బగుసందియంబుఁ బొరిఁ బెడఁ బాపన్.

2428


ఆ.

నిన్ను నొవ్వఁ బలికె నీచేఁ బ్రమాణంబు, గొనియెఁ గాని నమ్మ కునికిఁ గాదు
తల్లి నీవు తేటతెల్లమి సేసితి, మనమునందు నతనిఁ గినియవలదు.

2429


క.

పతి దైవము సతులకుఁ దాఁ, బతియ పరాయణము పతియ పరమహితుండుం
బతిశుశ్రూషాపర యగు, నతివసుమీ పరమపూజ్య యఖిలజగములన్.

2430


ఉ.

శ్రీమహనీయమూర్తుల నశేషజనస్తవనీయకీర్తులన్
భూమిగుణాభిరాములఁ బ్రభూతభుజాబలశక్తిధాములన్
రామునిఁ బోలుపుత్రులఁ బరార్థచరిత్రుల సత్పవిత్రుల

న్ధీమహితాత్ములం గనుము నీ వని దీవన లిచ్చె నత్తఱిన్.

2431

ఇంద్రునివరంబున మృతవానరులు పునర్జీవితు లగుట

చ.

అనునెడ నింద్రుఁ డిట్లనియె నంబుజలోచన నీవు మాకుఁగా
మనుజుఁడ వై జనించి యతిమానుషశక్తి వహించి పోరులన్
దనుజులఁ ద్రుంచి మాతగుపదంబులు వేడ్కఁ దిరంబు సేసి జీ
వనములు నిల్పి కాచితివి వారిజబాంధవవంశవర్ధనా.

2432


సీ.

నీనిమిత్తంబున నిర్జరావలిఁ గూడి, నాకాధిపత్యంబు నాకుఁ గల్గె
నీప్రభావంబున నెఱి హవిర్భాగంబు, లంచితస్థితి సంభవించె నాకు
నీప్రసాదంబున నిఖిలదిక్పతులును, దమతమరాజ్యపదములు గనిరి
నీదయామృతదృష్టి నిగిడిన నిక్కంబు, పాతాళవాసులు బ్రదికి రెలమి
మాకు నెంతయు సమకూరె మంగళంబు, తోయజాక్షులతోఁ గూడి తొంటిపగిది
గలిగెఁ గ్రీడింప నెమ్మది నెలమి మిగులు, [88]నీవ శరణంబు రాఘవ నిక్క మరయ.

2433


వ.

పరిపూర్ణసుగుణాభిరాముండును నిష్కాముండును బూరితభక్తమనోరథుండును
జగన్నాథుండును జనార్దనుండు నగు నీకు వరంబు లిచ్చెద నంగీకరింపు మ
నుట [89]బేలతనం బయినను నీకుం బ్రియంబు లయినవాని నడుగు మిచ్చెద ననిన
రామచంద్రుం డి ట్లనియె.

2434


చ.

నెఱయఁగ నీప్రసాదమున నిర్జరలోకలలామ నాకు నే
కొఱఁతయు లేదు కోరఁ దగుకోర్కియు నెద్దియుఁ గాన నైననా
కొఱకు రణంబునందుఁ గపికుంజరు లీల్గినవారు వీరలన్
మఱలఁగ వేడ్క నిచ్చుటయ మన్నన దీనన సంతసిల్లుదున్.

2435


చ.

కపివరు లున్నచోట్లఁ గలకాలము నెందు ఫలించి వన్యపా
దపములుఁ గందమూలములుఁ దద్దయు నొప్పఁగఁ బద్మవిస్ఫుర
ద్విపులసరోవరంబులు నదీనదముల్ దనరారునట్లుగాఁ
గృప [90]దళుకొత్త నిమ్ము నవగీతమహోదయ విస్ఫురద్దయా.

2436


వ.

అనవుడు.

2437


తే.

ఇనకులోత్తముపలుకులు విని సురేంద్రుఁ, డంతరంగంబులోపల సంతసంబు
నిండి దైవాఱ నంబుదనినద మొదవు, భంగి ని ట్లని రాఘవుఁ బలికె నంత.

2438


ఉ.

ఘోరరణంబులోనఁ బడి కూలినవానరు లెల్ల యోగని
ద్రారతిఁ బొంది నెమ్మదిఁ బదంపడి మేల్కనుభంగిఁ [91]బ్రాక్తను
స్ఫారబలంబులం దనరి ప్రాణములం దగ నొంది యుద్ధత
స్మేరత నెంతయున్ మిగిలి చేవఁ దలిర్తురుగాక యెమ్మెయిన్.

2439

క.

సురుచిరఫలభరితము లయి, తరువులు విలసిల్లుఁగాతఁ దద్దయు నదులున్
సరసిజములఁ దనరుసరో, వరములుఁ గడు నొప్పు సకలరవానరుల కనన్.

2440


చ.

చటులనిశాచరాయుధవిశంకటఘాతకృతవ్రణంబు లు
త్కటగతిఁ గానరాక సముదంచితవేదనపేరు లేక యొ
క్కట వడి నిద్రమేలుకనుకైవడి వానరకోటి లేచెఁ బ్ర
స్ఫుటముగఁ బ్రాణముల్ మగుడఁ బొంది సమగ్రమహాబలోన్నతిన్.

2441


క.

సురపతిపనుపున మంద్ర, స్ఫురదురుగర్జితము లులియు భూరిఘనంబుల్
సరసత్వ మొనర గిరిచర, వరవాహినిమీఁద నమృతవర్షము గురిసెన్.

2442


ఆ.

ఔర్వవహ్నిఁ బోలునాఁకలి గలకుంభ, కర్ణుఁ డుగ్రభంగిఁ గడఁగి మ్రింగ
నఱిగి జమునిపురికి నరిగినవానరుల్, దక్క నితరు లెల్ల దక్కి రపుడు.

2443


చ.

కనకమయంబు లై మనముకంటె జవంబున నొప్పి యిచ్చ వ
చ్చినకడ కేఁగ నోపినప్రసిద్ధవిమానము లెక్కి వేల్పు లె
ల్ల నలినగర్భునిం గొలిచి లక్ష్మణపూర్వజు సన్నుతించుచుం
జనిరి నిజాలయంబులకు సమ్మదవారిధి నోలలాడుచున్.

2444


వ.

అంత.

2445


చ.

అంచితభక్తిమై నినకులాధిపుఁ బల్కు విభీషణుండు నా
సంచితపుణ్య మెట్టిదొకొ సంతస మారఁగఁ గోర్కు లెల్ల సి
ద్ధించె భవత్ప్రసాదమున దేవర నన్ గరుణించి లంక కే
తెంచిన నేఁ గృతార్థుఁడ సుధీజననందిత లోకవందితా.

2446


వ.

అనవుడు రఘువీరుం డి ట్లనియె.

2447


క.

తరణిసుతుఁడు మొద లగువ్, నరులకు సత్కారవిధు లొనర్పుము వీరల్
పరమసుఖోచితు లతిబహు, చిరతరసంగ్రామఖేదశీలను లరయన్.

2448


మ.

భరతుం డక్కడ సాంద్రవల్కలజటాభారంబుతో నుండ మా
కరయంగా మణిభూషణాంబరములం దాసక్తి యొప్పారునే
పొరి భోగింప మనంబు మైకొనునె యాపుణ్యాత్మునిం జూడఁగా
నరుగం గౌతుక మౌచు నున్నయది దైత్యాధీశవంశాగ్రణీ.

2449


వ.

అనిన నవ్విభీషణుం డట్ల కాక యని కమనీయంబు లగుకనకమణిభూషణంబు
లు మహనీయంబు లగునంబరంబులు నతిస్వచ్చు లైనయధికారులచేత మంగ
ళతూర్యఘోషంబులు మొరయు రయంబునం దెప్పించి భయభక్తిసమన్వితుం
డై నైసర్గికప్రణయంబు తేటపడ గంధాక్షతంబు లిచ్చి రామలక్ష్మణులకుఁ బర
మసాధ్వి యైనసీతకుం గట్టనిచ్చి ముందట ముకుళితకరకమలుం డై యున్న
నతనిం జూచి దశకంఠారి యి ట్లనియె.

2450


క.

మా కింకఁ దడవుసేయక, సాకేతపురంబునకును జనవలయును మా

రాకకు నెదుళ్లు సూచుచుఁ, బ్రాకటగతి నుండువారు పౌరులు ప్రీతిన్.

2451


క.

గిరులు వనంబులు నదులు ని, తరపురఖేటములు వేగ దాఁటఁగవలె నీ
తెరువు కడుదువ్వు నేఁ డిట, వరవిభవా కదలిపోవవలయును మాకున్.

2452


వ.

అనవుడు విభీషణుండు రామున కి ట్లను మీరు నేఁడ పూర్వప్రహారార్ధంబునన
యయోధ్యకు విజయంచేయునుపాయంబు గల దవధరింపుము.

2453


చ.

విపులబలుండు దైత్యకులవీరుఁడు తొల్లి రణంబునన్ ధనా
ధిపుని నుదగ్రతన్ గెలిచి తెచ్చిన పుష్పక మున్న దిక్కడం
దపనరథాతివేగ మది తార్క్ష్యుని మెచ్చదు కామగంబు నీ
విపు [92]డురురూఢి నెక్కి సుఖవృత్తి నయోధ్యకు నేఁగు మంచుఁ దాన్.

2454


క.

అంత రఘూద్వహుననుమతి, సంతసమున దైత్యరాజు చలదురుఘంటా
సంతతరవ ములియఁగఁ దదు, పాంతమున విమాన మునిచె నవ్విభుఁ డలరన్.

2455


సీ.

కమనీయపద్మరాగప్రభామండలి, బాలాతపస్ఫూర్తి బయలుపఱుప
లాలితహరినీలజాలాంశుపటలంబు, గలయంగ దెసలఁ జీఁకట్లు గొలుప
రమణీయచంద్రకాంతమణిప్రభావలి, నిండువెన్నెలవెల్లినిగ్గు లుమియ
మరకతరత్నాంశుమంజరీసంహతి, రవితురగవ్యక్తిరచన చూప
వజ్రవైడూర్యమౌక్తికావలులరుచులు, వరుస దిగ్భిత్తితటములు వన్నె వెట్ట
రజతసౌవర్ణవేదికావ్రజము శార, దాభ్రములమీఁదిమెఱుపుల నలమి కొనఁగ.

2456


వ.

మఱియు గగనమహోరగనిర్ముక్తనిర్మోక[93] పట్టచ్ఛేదలలితంబు లగుకేతనంబు
లును సుధాకరుకరంబులం గూడఁబెట్టి యమృతంబునం గసటువోఁ గడిగి విరచి
తంబు లైనయట్లు శోభిల్లుచు [94]పినద్ధంబు లైనచామరంబులును మయూరాధిష్ఠి
తంబు లగురోహణగిరిసానుతలంబులం బోలు విచిత్రాస్తరణంబులు గలవేదిక
లును దదీయరచనావిశేషవిస్మితు లయి కదలక చూచుచున్నయచ్చర లనం బొ
లుచుమణిసాలభంజికలసొం పారురత్నస్తంభంబులును విద్యుత్సహస్రంబులు దె
చ్చి గట్టిపఱిచి తేటపడ రచించి రన నొప్పు మిగులుకనకకుట్టిమంబులును సుర
ధనుశ్శతంబులు గరఁగి నిర్మించినట్లు విలసిల్లువివిధమణిభిత్తులును గలిగి సమా
సద్ధఘంటాసహస్రగంభీరఘోషతిరస్కృతజీమూతగర్జితంబును నై విశ్వకర్మ దన
నేర్పు మెఱయఁ జేసినపుష్పకంబుఁ జూచి సంతసిల్లి రఘునాయకుండు సుగ్రీవా
దులం జూపి రావణావరజున కి ట్లనియె.

2457


చ.

తడయక వీరిలావున నుదారగతిన్ జలరాశి గట్టి పెం
పడరఁగ దాఁటి యుద్ధతి వియచ్చరు లచ్చెరు వంద లంక పై
విడిసి నిశాటకోటి భుజవీర్యమునం దెగటార్చి రావణున్

వడి నవలీలమైఁ దునిమి వైచితి [95]నేచితి ముజ్జగంబులన్.

2458


ఉ.

కావున వీరలం దగినగారవ మొప్పఁగఁ బ్రేమతోడ సం
భావన సేయు మంచితశుభస్ఫుటభూషణరత్నహేమనా
సోవిలసత్పదార్థముల సొంపు వహింపఁగఁ గట్ట నిమ్ము శో
భావహభవ్యసంపదలు నందఱఁ దృప్తులఁ జేయుమా యనన్.

2459


క.

తదనంతరంబ దైత్యుఁడు, సదమలభూషాదిదానచతురాశయుఁ డై
ముదమారఁగ సుగ్రీవుఁడు, మొద లగువానరుల నెల్ల ముదితులఁ జేసెన్.

2460

రాముఁడు పుష్పకం బెక్కి యయోధ్యకుఁ బోవుట

ఉ.

సీతయుఁ దాను దమ్ముఁడును జేరఁగ వచ్చి ప్రసూనగంధము
ఖ్యాతులితార్చ లిచ్చి వినయంబున మ్రొక్కి ప్రదక్షిణించి యా
భూతలనాథ శేఖరుఁడు పుష్పక మెక్కె శచీమురాంతకో
పేతముగా సురేశ్వరుఁడు హేమనగేంద్రము నెక్కుచాడ్పునన్.

2461


ఆ.

రాజరాజశైలరాజతనయలతో, రాజఖండధరుఁడు రాజతాద్రిఁ
బొలుచుభంగి ననుజభూమిజోపేతుఁడై, పుష్పకంబుమీఁదఁ బొలిచె విభుఁడు.

2462


వ.

పర్యాప్తమనోరథసిద్ధి యైనయమ్మహావీరుండు సుగ్రీవుండు మొదలయినవానరు
లం గనుంగొని యి ట్లనియె.

2463


క.

దిక్కుల నెల్లఁ బొగడ్తకు, నెక్కినయక్కజపుఁగడిమి నేపారెడుమీ
రిక్కడ నుండియ మీమీ, యిక్కువలకుఁ జనుఁడు వానరేశ్వరులారా.

2464


ఆ.

అన్నఁ బాసి నన్ను నాశ్రయించినవిభీ, షణుని లంకలోన [96]జయ మెసంగ
దనర రాజుఁ జేయఁ గనుట మీలావునఁ, గాదె నాకుఁ గలిగెఁ గడమపడక.

2465


క.

అనినఁ గృతాంజలు లై యా, వనచరయూథపులు రాఘవక్షితిపాలుం
గనుఁగొని కడునక్కఱ ని, ట్లనిరి కుతూహలకళాసమంచితమతు లై.

2466


సీ.

దేవరఁ గొల్చి యేతెంచి భూరమణికి, భూషణం బైనమీపురము సూచి
చెలువార మీయభిషేకంబు గనుఁగొని, భరతశత్రుఘ్నులఁ బరఁగఁ గాంచి
వినయంబుమై భవజ్జనయిత్రులకు మ్రొక్కి, సరయూజలంబులఁ జల్లులాడి
కన్నులపండువు గావించి మాజన్మ, కర్మముల్ సఫలంబు గా నొనర్చి
మఱి కృతార్థవృత్తి మరలెద మనవుడు, జానకీధవుండు సంతసిల్లి
వారి నాదరించి వల నైనసత్కృపఁ, జూచి మందహాసశోభి యగుచు.

2467


వ.

తపనతనయపవనసుతవాలిసూనులును జాంబవత్సుషేణగంధమాదనాదు లగు
వానరభల్లూకయూథపులును విభీషణప్రభృతిదానవులును రా సమ్మతించినం దద
నుజ్ఞాతు లై కౌబేరం బగుయానం బెక్కి రంత నమ్మహాత్ముచిత్తం బెఱింగి యద్ది
వ్యవిమానంబు ధరణిపతితసముత్పతత్సురలోకదృశ్యంబుగా దివికి నెగసి విస్తాత

పక్షమరాళయూథసమూఢం బై సానులీలాచలశారదనీరదం బైనమేరునగంబు
గతిం దేజరిల్లుచు వలయీభూతనిజప్రభాపటలశోభితం బై యపూర్వగతి గల
భానుమండలంబుంబోలె నొప్పె నద్దివ్యవిమానంబునందుఁ గుబేరుండునుంబోలె
నొప్పారునారాజపరమేశ్వరుండు వైదేహిం గనుంగొని యిట్లనియె.

2468

రాముఁడు పుష్పకాధిరూఢుఁ డై పూర్వవృత్తాంతములు సీతకుఁ జెప్పుచుంబోవుట

చ.

చెలువుగ విశ్వకర్మ విరచించెఁ ద్రికూటముమీఁద లంక ను
జ్జ్వలతరసౌధరత్నగృహజాలములుం దనరారుకోటలున్
విలసితగోపురంబులు నవీనవనంబులు నిద్ధసంపద
ల్గలిగి మనోవినోదవిమలస్థితి నున్నది సీత చూచితే.

2469


మ.

అని మేదోరుధిరాస్థిమాంససముదాయాపూరితం బై ఘన
స్వనబేతాళపిశాచభూతనివహవ్యాప్తంబు నిష్క్రాంతజీ
వననక్తంచరవానరేంద్రకరటివ్రాతాదికీర్ణంబు నై
జనితత్రాసమహారణంబు గమలాస్యా చూచితే ముందటన్.

2470


చ.

త్రిదశులఁ జీరికిం గొనక తేజమునం దగ మించి సంతతా
భ్యుదయము నొంది బాహుపరిఘోద్ధతి శంకరుశైల మెత్తి నె
మ్మది భువనాధిపత్యమున మానితుఁ డైనదశాననుండు నా
కదనమునందుఁ గూలె నిటఁ గంజదళాయతచారులోచనా.

2471


ఉ.

వానరవీరసంహతుల వావిరి మ్రింగుచు నుగ్రవిక్రమా
నూనబలాతిభూతి విభవోన్నతిఁ బేర్చి యెదిర్చి యుద్ధత
ధ్వానజితాంతమేఘుఁ డగుదానవవీరుఁడు గుంభకర్ణుఁడుం
దా నిట మత్ప్రయుక్తసముదగ్రశరంబులఁ గూలె జానకీ.

2472


క.

ఇక్కడఁ దగ నీలునితో, నక్కజముగఁ దాఁకి యాప్రహస్తుఁడు దనుజుల్
స్రుక్కఁగ విబుధులు నిక్కఁగ, గ్రక్కున జముప్రోలి కరిగె రణసంస్థితుఁ డై.

2473


క.

విద్యున్మాలిపయోదము, విద్యున్మాలాస్త్రవితతివిభవము సెడఁగా
నుద్యత్సుషేణపవన, ప్రోద్యద్గతి రూపుమాసి పొలిసె మృగాక్షీ.

2474


ఉ.

ఏచినసాహసం బొదవ నెంతయు నుద్ధతి నింద్రజిత్తు మా
యాచతురత్వ మేర్పడ నిరంకుశవిక్రముఁ డై సమస్తదృ
గ్గోచరవృత్తి లేక మము ఘోరగతిం బటునాగపాశసం
కోచితబద్ధగాత్రబలకుంఠితశీలురఁ జేసె నిక్కడన్.

2475


ఆ.

అతిబలోగ్ర మైనయతికాయసింహంబు, గడఁగి కపినికాయకరులఁ జంపఁ
జండసత్త్వ మైనసౌమిత్రిశరభంబు, దునిమె నిచటఁ బేర్చి తోయజాక్షి.

2476


క.

వికటాకారము గల్గిన, వికటభుజంగంబు దర్పవిశ్రుతబాహా
ప్రకటాంగదతార్క్ష్యునిచే, నికటస్థలిఁ గూలె నిచట నీరజవదనా.

2477

ఉ.

దిక్కరిదంతఖండనరతివ్యపనీతసమగ్రబాల్యుఁ డై
ధిక్కరణాదికృత్యకరదీకృతదిక్పతిచిత్తశల్యుఁ డై
తక్కువ గానిబాహుబలదర్పము దూలిన వీతసత్త్వుఁ డై
చిక్కి మహేంద్రజిత్తు సమసెం బటులక్ష్మణబాణసంహతిన్.

2478


వ.

రోషారుణాహిమకరాక్షుం డగుమకరాక్షుండును ఘనప్రభాజితాగ్నికేతుం డగు
నగ్నికేతుండును సంగ్రామాకంపనుం డగునకంపకుండును మృత్యుసహోద
రుండపోలె మహోదరుండును గులిశమహాపార్శ్వుం డగుమహాపార్శ్వుండును
మహీదేవాంతకుం డగుదేవాంతకుండును గిన్నరాంతకుం డగునరాంతకుండును
నిసర్గప్రకాశజితాగ్నివర్ణుం డగునగ్నివర్ణుండును దపఃప్రసాదితవిరూపాక్షుం డగు
విరూపాక్షుండును బొలిసినచో ట్లివి యవి యని చెప్పుచు.

2479


చ.

కడఁగినవేడ్క నభ్రనదిఁ గౌఁగిటఁ జేర్పఁగఁ బూనుకైవడిన్
విడువక మింటితో నొఱయువీచిభుజంబుల నొప్పి సంతసం
బడరెడుభంగి మ్రోయుచు నుదంచితఫేనము నవ్వు గాఁగ నొ
ప్పెడు నదె సాగరుండు గడుఁబెంపునఁ బేర్చుప్రియుండుఁ బోలుచున్.

2480


ఉ.

సేతువుఁ జూచితే యబల సింధువుమీఁద మదీయసద్యశో
హేతువు సర్వజంతుసముదీర్ణమహాదురితవ్యపక్రియా
కేతువు విశ్వకర్మసుతకీశపరాక్రమకేళివిస్ఫుర
త్కేతువు మోదితత్రిదశతికిన్నరగోపతిరాజకేతువున్.

2481


ఆ.

సేతుబంధ మనఁగఁ జెలువారుతీరంబు, పుణ్యతమము లోకపూజితంబు
పరమపావనంబు పాతకహరణంబు, మత్కృతంబు చూడుమా మృగాక్షి.

2482


క.

[97]ఈదివ్యక్షేత్రమున మహాదేవునిసత్ప్రసాద మందితి మును నే
నీదారి నరుగుతఱి నో, వైదేహీ కంటే భక్తవత్సలునిఁ బ్రభున్.

2483


చ.

లలితగతి మరుత్సుతుఁడు లంకకు వచ్చుచు నుండునత్తఱిన్
జలనిధి గ్రక్కునన్ వెడలి సమ్మదలీల సపర్య సేసి యి
మ్ముల విలసిల్లు సన్మణిసమూహహిరణ్యలసత్తటీసము
జ్జ్వలము హిరణ్యనాభ మనుశైలముఁ జూచితె లోలలోచనా.

2484


సీ.

ఇది యివ్విభీషణుఁ డేతెంచి మముఁ బొడ, గన్నచో టుత్ఫుల్లకమలనయన
కోరి యంబుధి వేఁడఁ గుశశయనుండ నై యుంటి నిక్కడ సువర్ణోజ్జ్వలాంగి
బ్రహ్మాస్త్ర మంబుధిపైఁ బ్రయోగించితి, నిచ్చోట నిల్చి నే నిందువదన
వాలి నొక్కమ్మున వసుధపైఁ గూలంగ, నేసితి నిక్కడ నిగురుఁబోఁడి
విపుల మగుచున్న నీతోడి విరహమునను, వారిదవ్రజపరిముక్తరవారిలేశ
ములకుఁ దల్లడమందుచు నలసియలసి, వనిత నే నుంటి నీమాల్యవంతమందు.

2485

క.

ఫుల్లానేకానోకహ, వేల్లత్సముదగ్రగహనవీథీవిలస
ద్భిల్లీవృత యై యున్నది, యల్లదె కిష్కింధ చూడు మనవుడుఁ బ్రీతిన్.

2486


చ.

అనఘచరిత్ర తార మొద లైనకపీంద్రసరోరుహాక్షు లా
వనచరకోటికామినులు వావిరి నందఱు నేఁగుదేరఁగా
మనమున సంతసం బొదవ [98]మానితసంస్థితిమై నయోధ్యకుం
జనఁ గడువేడు కయ్యెడుఁ బ్రసన్నమతిం బిలిపింపు వారలన్.

2487


చ.

అన విని రాముఁ డిట్లనియె నర్కతనూభవ నీవుఁ గీశులుం
జని లలనాసమేతు లయి సమ్మద మొప్పఁగ రండు విభ్రమం
బొనరఁగ నాత్మ వేడ్క పడుచున్నది భూమితనూజ నాదునె
మ్మనమును నట్ల యున్నయది మానుగ వారలఁ దోడితె మ్మొగిన్.

2488


వ.

అనిన సుగ్రీవుండును గపిసనాథుండై కిష్కింధకుం జని వానరుల నెల్ల నిజదార
సమేతుల రయి రయంబునం జనుదెండని నియోగించి తా నంతఃపురంబు సొచ్చి
తారావల్లభముఖి యగుతారం గాంచి కోసలేంద్రునాజ్ఞయు భూనందనకోర్కి
యు నెఱింగించిన నామృగాక్షి సంజాతకుతూహల యై సపత్నీవర్గంబునం దాను
నలంకృత యై సకలవానరవధూసమేతంబుగా నున్న నన్నిజసుందరిం దోడ్కొని
వచ్చి రాఘవులకుం బ్రణమిల్లె నాకాంతలుం బ్రణత లై జానకియనుమతంబున
విమానం బెక్కిన నది యతిరయంబున నరుగ రాఘవుండు ఋష్యమూకశైలంబు
సేరం జని వైదేహిం గాంచి యిట్లనియె.

2489


ఉ.

లోకముదావహం బతివిలోలమదోద్ధతవర్తివానరా
నీకము రత్నరాజిరమణీయతటీరుహచిత్రపాదప
శ్రీకముఁ జారుతుంగబహుశృంగశిరోధితస్ఫురద్దిగా
లోకము మత్తకుంజరవిలూనమధూకము ఋశ్యమూకమున్.

2490


ఉ.

చూచితె యీగిరీంద్రముఁ బ్రసూనలతారతభృంగనాదసం
సూచితపుష్పచాపగుణశోభితమంజురవంబు నిందు శు
ద్ధాచలితాంతరంగుఁ డగుకర్కతనూభవుతోడిమైత్రి సా
మోచితవృత్తిఁ జేసితిఁ బయోరుహపత్రవిశాలలోచనా.

2491


క.

గాలివడి నొరయుచును ను, త్తాలము లై పెరిఁగి మిన్ను దాఁకి పరఁగునా
తాలమ్ము లేడు నొక్కటఁ, గూలఁగ నేసితి శరమునఁ గువలయనయనా.

2492


సీ.

కరిణీసమన్వితకాననసింధుర, భూరిదానోదకకపూరితంబు
శబరీపయోధరచందనోత్క్షితవీచి, ధవళితరక్తాబ్జకువలయంబుఁ
దీరసంరూఢమహీరుహపుష్పసౌ, రభ్యవాసితవారిరమ్యతరముఁ
దటతరులంబిలతాడోలికారూఢ, ముదితనదత్పక్షిముఖరితంబుఁ

దరళవిభ్రమవనదేవతావిహార, మమృతకరబింబనిర్గళగదమృతమయము
పగిదిఁ దనరుచునున్న పంపాసరోవ, రంబుఁ జూచితె పరిపూర్ణరాజవదన.

2493


శా.

నీతోఁ బాసి యసహ్యదుఃఖ మొదవన్ నే నిక్కడన్ విస్ఫుర
చ్చేతోజాతశిలీముఖప్రతతులం జె ల్వేది మూర్ఛిల్లుచో
శీతోదంచితశీకరోల్లసితవీచీపద్మగంధంబుతో
వీతెంచెం బవనుండు మోహలహరీవిస్పష్టతాపాది యై.

2494


చ.

దల మగుచున్ భవద్విరహతాపము మిక్కుట మై తనర్చినం
దలిరులఁ బువ్వులం దగినతల్పము నా కొనరించి లక్ష్మణుం
డలయక తాపతాంతి బిసహారపరీతుఁడ నైన మెల్పునన్
లలితనవీనవారిజదళంబుల నల్లన వీచె నుగ్మలీ.

2495


మ.

తరణిన్ మ్రింగి కృశానుఁ దేజమున నుద్యద్వృత్తి నోడించి సా
గరమున్ దాఁటి నిశాటులం దునిమి లంకాదాహి యై నీదువా
ర్త రతిన్ మా కెఱిఁగించి లక్ష్మణుని నుద్యజ్జీవుఁ గావించి సు
స్థిరతం గ్రాలెడువాయుజుండు మముఁ గాంచెన్ సీత యిచ్చోఁ దగన్.

2496


క.

ఘనతరతపమునఁ గృశ మగు, తనువునఁ దనరారి సత్యధర్మస్థిత యై
మునివృత్తి నున్నశబరిం, గనుఁగొంటిమి యిచట విమలకమలదళాక్షీ.

2497


క.

సూకరకరిమహిషంబులఁ, బ్రాకటముగఁ బట్టి మ్రింగి బహుసత్వములం
జేకొలఁది నమలునాభయ, దాకారుఁ గబంధు నిచట నడిచితి మబలా.

2498


మ.

వడి నక్తంచరరాజు నిన్నుఁ గొనిపోవ వానిఁ బో నీక లా
వడరన్ వచ్చి జటాయు వుగ్రగతి నుద్యత్క్రోధుఁ డై పోరి పెం
పెడలం దద్గురుచంద్రహాసహతిచే నీల్గెన్ రణారంభ మే
ర్పడ నిచ్చోట విశీర్ణలూనవిగళత్పక్షాంగుఁడై మైథిలీ.

2499


చ.

చటులస్యందనదంతివాజిసముదంచద్భీమనక్తంచరో
ద్భటవృత్తిన్ ఖరదూషణత్రిశిరు లుద్యత్క్రోధు లై వచ్చి యు
త్కటమత్కార్ముకముక్తబాణములచేతన్ గ్రక్కునం గూలి రి
చ్చట నే పారఁగఁ జూడుమా యిది జనస్థానంబు లోలేక్షణా.

2500


ఆ.

రాక్షసేంద్రుఁ డైనరావణుచెలియలి, ముక్కుసెవులు పట్టి మొదలు గదియ
లాఘవంబు మెఱయ లక్ష్మణుఁ డేపార, నిచటఁ ద్రెంచెఁ గాదె యిందువదన.

2501


శా.

మారీచుండు దశాస్యుకోర్కి యొదవన్ మాయామృగం బై నిజో
దారస్ఫారశరీరకాంతి వనమధ్యం బెల్ల నిండన్ ననుం
జేరన్ వచ్చి క్రమంబుతోడ నెలయించెన్ వాని నే నత్తఱిన్
ఘోరాస్త్రంబునఁ గూల నేసితి మహాక్షోభంబుగా నిక్కడన్.

2502


మ.

మన మారం దగ నీవు పుత్రులగతిన్ మన్నించి కుంభోదకం

బునఁ దత్తత్క్రియఁ బ్రేమనిర్భరగతిం బొల్పొందఁగా నాఁడు పెం
చినచూతంబులనీడ బాలమృగముల్ సేమంబుతో నుండ నిం
డినలచ్చిం దనరారుపంచవటిఁ గంటే ధారుణీనందనా.

2503


క.

మనకట్టినయుటజం బదె, ఘనమాయావేది పంక్తికంఠుఁడు వడిఁ దా
నిను నిచ్చటఁ గొనిపోయె, న్వినువీథిని దివిజు లడల నీరజవదనా.

2504


వ.

ఇదె చూచితే విమలచరితంబున సుతీక్ష్ణుం డగుసుతీక్ష్ణునాశ్రమం బిల్వలవా
తాపిదవానలకాలమేఘంబును జులుకితపయోరాశియు [99]వామనీకృతవింధ్యా
చలుండు నురగీకృతనహుషుండును నిజోదయప్రసాధితసకలజీవనుండును నగు
నగస్త్యమహామునిపుణ్యాశ్రమం బదె హుతవహహుతశరీరుం డగుశరభంగు
తపోవనం బల్లదె పుత్రీకృతపురుషత్రయుండును దాదృగ్విధప్రభావమహితాన
సూయాపరిగ్రహుండును నగుత్రిమహామునీంద్రుపుణ్యాలయం బిది యిచ్చో
ట నీకు ననసూయ పుణ్యనిత్యసౌరభ్యం బగునంగరాగం బొసంగె నల్లవె కంటి
వే యారభమాణనవోటజంబులును విరచ్యమానవల్కలంబులును సంవర్ధ
మానబాలపాదపంబులును బరిపూజ్యమానాతిథివర్గంబులును విప్రకీర్యమాణనీ
వారబలులును హూయమానవైశ్వానరంబులును సంతర్ప్యమాణపితృదేవతం
బులును శుకశారికాపఠ్యమానేతిహాసంబులును మూలబద్ధ్యమానవేదికానోక
హంబులును హోమధూమవ్యాప్యమాననభోభాగంబులును నగుతత్పుణ్యతపో
వనంబు లని చూపుచు.

2505


ఆ.

జనపదాపనీతజనమనస్త్యానాస్థి, విప్రదుస్సహుండు వీరతముఁడు
రాక్షసాధముఁడు విరాధుండు నాచేతఁ, బొలిసె నిందుఁ దాను బువ్వుఁబోఁడి.

2506


క.

వానరసంచయభల్లూ, కానీకవరాహసైరిభాకులవివిధా
నూనతరుచిత్రకూటం, బై నెరసినచిత్రకూట మదె కనుఁగొంటే.

2507


ఆ.

దురితదూరుఁ డైనకభరతుండు సనుదెంచి, రమణమై నివృత్తరరాజ్యకాంక్షఁ
బరమభక్తి నన్నుఁ బ్రార్థించి పాదుకల్, గొనుచు నరిగె నిచటఁ గుటిలకేశి.

2508


క.

క్షోణీరమణికి నమరిన, వేణి యనం దగినయమున వీక్షించితివే
క్షీణీకృతాఘసలిల, శ్రేణీయుత జహ్నుకన్యఁ జెలువుగఁ గంటే.

2509


క.

హరులకుఁ బుట్టినగతి ది, క్కరులకు జనియించినట్టు ఘనసత్త్వములం
బరఁగిననిషాదులం గడు, బెరసినగుహుఁ డున్నశృంగిబేరము సుమ్మీ.

2510


క.

మహనీయచరితశీలుఁడు, బహుమానమునన్ నిషాదభటపరివృతుఁ డై
గుహుఁ డిక్కడ ననుఁ గాంచెను, బహుశస్త్రఫలోపహారబంధురకరుఁ డై.

2511


క.

పలుయూపంబుల నస్మ, త్కులనృపయాగములఁ జెప్పుకూలంబులచేఁ
జెలువారుచు నతిపావన, జల యగుసరయూనదిం బ్రసన్నతఁ గంటే.

2512

చ.

సురనదివీచులం దడియుశృంగములం దనరారుమేడలన్
సురతసుఖంబుచే నలసి సోలి ప్రియం బగుచల్లగాలిచేఁ
బరమముదంబునం జెలఁగుపౌరులచేఁ దగ నెల్లకాలముం
బరఁగునయోధ్య సూచితివె పంకజపత్రవిశాలలోచనా.

2513


వ.

అని యీరాజధాని యస్మత్కులనృపక్రమపాలిత యై యొప్పుచున్నది యిప్పురి
కిం బ్రణమిల్లు మని జానకి నియోగించినం బ్లవంగనక్తంచరులు చూచి యచ్చె
రుపడుచు.

2514


సీ.

దిగ్గజోపమమదద్విపదాననిర్ఝర, దుర్దినాయితభూమిదోహలంబు
హరితురంగోపమహరిఖురక్షతహేమ, కుట్టిమోత్థితరేణుగూహితంబు
జితమనోజవహయోర్జితమణిస్యందన, విస్తారితాదిత్యవిపులరథము
నన్యోన్యవిభవాపహాసిమహాయోధ, శరభపంచాననసంకులంబు
సురవధూపమసుందరీశోభితంబు, గనకమందిరధృతమేరుగౌరవంబు
నిప్పురోత్తమ మెంతయు నొప్పు ననుచుఁ, జూచి సంతసమందిరి చూడ్కు లలర.

2515


వ.

అంత.

2516

శ్రీరాముఁడు భరద్వాజాశ్రమంబు చేరుట

ఉ.

రాజితపుష్పితక్షితిజరాజిసమన్విత మైనయాభర
ద్వాజమునీంద్రునాశ్రమము దవ్వులఁ గాంచి రఘూద్వహుండు తే
జోజితభానుయాన మయి సొంపెసలారెడుపుష్పకంబు వి
భ్రాజితలీల నిల్పె ననుభావపదస్థితి నంబరంబునన్.

2517


ఉ.

ఆవిభుఁ డంత నీలజలదాకృతి నల్లన డిగ్గి శాంతస
త్త్వావృత మైనయమ్మనివరాశ్రమ మెంతయు మెచ్చి చూచుచుం
బావనహోమగంధయుతభాసురధూమము గ్రోలి సోలుచుం
బావకకల్పతేజుఁ డగుభవ్యమునీంద్రునిఁ గాంచె వేడుకన్.

2518


క.

వినయాదరసంభ్రమములఁ, జనుదెంచి మహామునీంద్రుచరణంబులకున్
జనలోకవిభుఁడు మ్రొక్కెను, ఘనభక్తిని నిలిచి ఫాలఘటితాంజలి యై.

2519


క.

అమ్మునివలన విభుఁడు ప్రి, యమ్మున దీవనలు వడసి హర్షత్కర్షో
త్క మ్మయినచిత్త మలర ర, యమ్మున ని ట్లనియె సవినయాదరమతి యై.

2520


క.

పదునాలుగేండ్లు నిండెం, దుదిఁ బంచదశమ్ము నిదియె తోఁతెంచె దయా
స్పద నీసందర్శనమున, సదమలగతి నాకు సంతసము సమకూరెన్.

2521


మ.

తమలో వైరము దక్కి యెంతయుఁ బ్రమోదం బంది యుష్మత్సమీ
పమునం గ్రుమ్మరి సత్క్రియాప్రహితదర్భగ్రాససంవర్ధ్యమా
నము లై యున్నమృగవ్రజంబు లసమానవ్యాధముక్తాశుగా
దిమహాబాధలు లేక యున్నవె తపోధీనాశయప్రక్రియన్.

2522

చ.

వరసుతనిర్విశేషపరివర్ధిత మై రుచిరామృతైకసో
దరఫలభార[100]పూర్ణ మయి సంభృతపల్లవపుష్పయుక్త మై
పర పగునీడలం దనరుపాదపబృందము తీవ్రమారుత
ద్విరదజనాద్యుపద్రవవిధిం జెడిపోవక యొప్పుచున్నదే.

2523


క.

స్నానాదిక్రియలకుఁ దగి, మానుగఁ బితృతర్పణక్రమములకుఁ [101]దగ నిం
పూని సలిలాశయము ల, నూనము లై సంతతంబు నొప్పుచు నున్నే.

2524


చ.

జపములు హోమకర్మములు జన్నములున్ నియమంబులున్ మహా
తపములు నాగమాధ్యయనతత్పరభావము లాశ్రమాగతా
దిపరిచితార్హణక్రియలు దేటపడన్ భవదాశ్రమంబునన్
వ్యపగతవిఘ్నవృత్తిఁ దనరారునె సంచితసత్తపోధనా.

2525


ఆ.

అనిన సంతసిల్లి యమ్మునీంద్రుఁడు రామ, ధరణిపతికి ననియె దంతకాంతి
దెసలఁ బర్వి చంద్రదీధితిఁ దెగడంగ, నోలిఁ బులకితాంగశాలి యగుచు.

2526


చ.

జనవర నీప్రసాదమున సర్వము భద్రము మాకు సంతతం
బును గతవిఘ్నదోషముగ భూరితపోవిభవంబు గల్గె నీ
వనయము [102]శాసితుండ వయి సాయుధహస్తుఁడ వైనఁ జాలదే
ఘనతరధర్మసచ్చరితకగౌరవముల్ విలసిల్ల నెంతయున్.

2527


క.

నీపాదుక లొగి ముందట, నేపారఁగ నిడి ప్రమాదహీనాశయుఁ డౌ
భూపతి యగుభరతునిచే, గోపాయిత మబ్జజాండగోళం బెల్లన్.

2528


క.

లలి నీ వడవికి నరిగిన, వెలయఁగ నీనడుమ నైనవృత్తాంతంబుల్
దెలిసితి విమలజ్ఞానో, జ్జ్వలదీపముమహిమకలిమి జలజదళాక్షా.

2529


క.

వనవాసము దగ నిండిన, నినకుల నీ వెట్టకేని నేతెంచితి మా
మన మలరఁగ నేఁ డిక్కడ, ఘనరాగముతోడ నుండఁగావలయుఁ జుమీ.

2530


క.

[103]రేపకడ యెల్లి యెమ్మెయి, మాపనుపున నరిగి భరతు మానితచరితున్
రూపితతాపసజనవే, షోపేతుం జూడవలయు నుర్వీనాథా.

2531


క.

నరపాలలోకశేఖర, వర మిచ్చెద వేఁడు మనిన వసుధాపతియుం
గర మనురాగంబునఁ దన, కరములు ముకుళించి పలికె గౌరవ మెసఁగన్.

2532


క.

సాకేతపురముచుట్టును, నైకతరుల్ యోజనత్రయాయామము లై
ప్రాకటఫలమధునిష్యం, దాకల్పము లై తనర్ప నానతి యీవే.

2583


ఆ.

అనిన నట్ల కాక యని ముని పల్కిన, మధురమధురసార్ద్రమంజుమంజ
[104]రీఫలాదివల్లరీరమ్యదృశ్యంబు, లై నగంబు లెల్ల నతిశయిల్లె.

2584

రాముఁడు హనుమంతుని భరతునొద్దకుఁ బంపుట

వ.

తదనంతరంబ జానకీజాని పవనతనయు నవలోకించి చేరం బిలిచి నీవు శృంగిబేర
పురంబున కరిగి నాకుఁ బ్రియసఖుం డగుగుహునికి మదాగమనంబు సెప్పి
తన్ముఖవిదితపథుండ వై నందిగ్రామంబున కేఁగి భరతుం గాంచి తదీయేంగితమనో
భావచేష్టితవచనంబు లెల్ల నెఱింగి మద్వృత్తాంతంబు నివేదించి రమ్ము పొ మ్మనిన
నతండు కామరూపి గావున మానుషరూపధరుం డై కడలి శృంగిబేరపురంబు
నకు వచ్చి యందు.

2535


సీ.

ఘనతరవ్యాయామకర్కశాకారుని, దిగ్దంతికరమహాదీర్ఘహస్తు
శైలతటాభవిశాలతరోరస్కు, మహితసమున్నతమాంసలాంసు
ననవరతకృతచాపాభ్యాసనిష్ణాతు, విఖ్యాతతనుభావవృత్తమధ్యుఁ
గనదురుజ్యాఘాతకఠినస్ఫుటాంగుళిఁ, జటులారిభయదోగ్రసమరదక్షు
శీలశుద్ధసత్త్వు సేవాసమాగత, శబరసేవ్యమానుఁ జారుకీర్తి
కాంతు గుహుని నంతఁ గాంచె హనూమంతుఁ, డధికమోదనిర్భరాత్ముఁ డగుచు.

2536


ఉ.

అంతఁ బుళిందసైన్యపతు లందఱు నచ్చెఱువంద నాహనూ
మంతుఁడు నేరవచ్చి యసమానకుతూహల మొప్పఁగా మహీ
కాంతుని రాక యాశబరకాంతుని కేర్పడఁ జెప్పి వానిచే
నెంతయుఁ బూజ నొంది యట యేఁగె నుదగ్రమనోజవంబునన్.

2537


వ.

చని సరయువు దాఁటి నందిగ్రామంబు సొచ్చి.

2538


సీ.

కపిలసమున్నద్ధవిపులజటాభారు, ధృతవల్కలాజినోర్జితశరీరు
భసితత్రిపుండ్రకభాసితోజ్జ్వలఫాలు, రుద్రాక్షమాలికాభద్రమూర్తి
నసమాగ్రసంభవవ్యసనకృశీకృతు, శీలితతరుఫలమూలనిరతు
హితమంత్రిగణపురోహితయోగిమునిజన, పరివృతు నరవేషధరగిరీశు
నగ్రవిన్యస్తతత్పాదుకార్చనాఢ్యు, భువనరక్షణదక్షిణబుద్ధిమహితుఁ
బరమపావనచారిత్రు భరతుఁ గాంచి, మ్రొక్కి పావని నిలుచుండె ముదముతోడ.

2539


వ.

భరతుం డతనిం గనుంగొని పూర్వపరిచయంబు లేకుండియు నాత్మీయబుద్ధిం జేసి
సస్నేహంబుగ ని ట్లనియె.

2540


ఉ.

ఎక్కడనుండి వచ్చి తిట యెవ్వరివాఁడ వి టెందుఁ బోయె దీ
విక్కడి కేఁగుదేరఁ గత మెయ్యది తావకనామ మెద్ది ని
న్నిక్కము చూచుచుండ మది నెయ్యము పుట్టుచునున్న దెంతయున్
గ్రక్కున నీసమాగమనకారణ మంతయు నాకుఁ జెప్పుమా.

2541


చ.

అనవుడు ఫాలభాగఘటితాంజలి యై కపియూథనాథుఁ డి
ట్లను రఘునాథుబంటఁ బవనాత్మజుఁడన్ హనుమంతుఁడన్ జగ
ద్ఘనుఁ డగుభూమిభ ర్త నను గౌరవ మొప్పఁగఁ బంప నర్థితో

నినుఁ బొడగాన వచ్చితి ననిందితవర్తన వైరికర్తనా.

2542


క.

సీతాలక్ష్మణయుతుఁ డై, భూతలపతి దుర్గగహనభూముల భువన
ఖ్యాతిగఁ జతుర్దశాబ్దము, లాతతగతిఁ బుచ్చి వచ్చె ననఘచరిత్రా.

2543


ఉ.

ఆతతపుణ్యశీలుఁ డనపాయసమంచితసత్యపాలన
స్ఫీతుఁడు శీలవృద్ధజనసేవకుఁ డాభరతుండు భక్తి వి
ఖ్యాతి మదీయపాదుకలయందుఁ గృతక్షితిభారుఁ డైనవాఁ
డాతనిసేమ మారసి రయంబున ర మ్మని పంప వచ్చితిన్.

2544


మ.

అనినన్ సంతస మంది కర్ణపుటపేయం బైనవాక్యామృతం
బున సౌహిత్యము నొంది యశ్రులహరీపూర్ణాక్షుఁ డై కంపితాం
గనతుం డై పులకించి కోర్కు లొదవంగా నుబ్బి యాలింగనం
బొనరించెన్ భరతుండు వాయుసుతుఁ జిత్తోద్యత్ప్రమోదంబుగాన్.

2545


వ.

అంత నతనికి భరతుండు గోసహస్రంబును గ్రామశతంబు నుత్తమతురంగసహ
స్రంబును మత్తదంతావళసహస్రంబును మణిమయభూషణంబులును రమణీయ
లావణ్య లగురమణులను ధనకోట్లునుం బసదనంబు లొసంగి యి ట్లనియె.

2546


సీ.

తండ్రిపంపున ధరాతలరాజ్య మది మాని, తాపసవేషంబు దాల్చి యడవి
కరిగి చతుర్దశరహాయనంబులు నెట్టు, జరపె దినంబులు జరపినట్టు
లెచ్చోట నేక్రియ నిచ్చమై వర్తించె, నాదట నెయ్యది యాచరించె
నిప్పుడు భూమిశుఁ డెక్కడ నున్నవాఁ, డంతయు నెఱిఁగింపు మమలచరిత
నమ్మనయ్యెద నీమాట నరవరేణ్యుఁ, డరుగుదెంచుట నిక్కమే యనినఁ జారు
మందహసితంబుతోఁ బవమానసుతుఁడు, భరతు నేర్పడ విను మని పలికె నంత.

2547

హనుమంతుఁడు భరతునితో రామువనవాసాదివృత్తాంతంబు చెప్పుట

చ.

అనయము భూవిభుండు ముద మారఁగఁ బట్టముఁ గట్టఁ బూని మీ
జననివరంబులం గరుణ సాలక రాము నరణ్యభూమికిం
జను మనినన్ జటాజినవిశంకటవల్కలముల్ ధరించి యా
జనకసుతాసుమిత్రభవసంయుతుఁ డై వెస నేఁగి కానకున్.

2548


సీ.

అట పాదచారి యై యారాఘవుఁడు చిత్ర, కూటంబు సేరినఁ గోసలాధి
పతి సంస్థితుం డైనభరత నీ వప్పుడు, రప్పింపఁబడి మహీరాజ్య మొల్ల
నని రాముఁ బ్రార్థింప జనపతి రాకున్నఁ, దత్పాదుకలు దాల్చి ధరణి యేలు
తలఁ పేమియును లేక తాపసవేషంబు, గైకొంటి విచ్చోటఁ బ్రాకటముగ
నీప్రసంగ మీవు నెఱుఁగుదు వటమీఁద, వెలఁది లక్ష్మణుండు వెనుక నరుగ
దానవోగ్ర మైనదండకాటవిని వి, రాధుఁ జంపెఁ గడఁక రామవిభుఁడు.

2549


వ.

అంత సాయంతనసమయంబున శరభంగునాశ్రమంబు సేరి తపోధనుల నూఱడిం
చి జనస్థానంబునకుం జని విచ్ఛిన్నశూర్పణఖాకర్ణనాసుం డై ఖరదూషణత్రిశిరః

ప్రముఖచతుర్దశసహస్రరాక్షసులం జంపె నంత శూర్పణఖానివేదితస్వజనవృ
త్తాంతుఁ డై పౌలస్త్యుండు మాయాదక్షుం డైనమారీచుం దోడ్తేర నద్దానవుం
డు మృగరూపంబు ధరించి రామాశ్రమంబునకుఁ జనుదెంచి.

2550


సీ.

అంతంతఁ బొడసూపు నడఁగుఁ జేరువ నేఁగుఁ, బొదలీఁగు నిలుచును బెదరుఁ గలఁగుఁ
గదలుఁ గ్రమ్మఱివచ్చు నెదురుగా నేతెంచు, మగిడి యుప్పరవీథి కెగయు దెసలు
సూచును దరువులు సొచ్చి లేఁదలిరులు, చవిచూచు దర్భలు చప్పరించు
మృగయూథములఁ గని [105]యెగయుచు నల్లన, గొమ్ముల నంగంబు గోఁకికొనుచు
నున్న నట్లు మృగంబు నయ్యువిద చూచి, దీనిఁ దెమ్మన్న నజ్జగతీవిభుండు
చటులశరచాపహస్తుఁ డై చనియె నట్ల, యతనితమ్ముఁడు లక్ష్మణుఁ డరిగె నంత.

2551


క.

మునివేషంబున జానకిఁ, గొనిపోవఁగఁ బంక్తిముఖుఁడు ఘోరాకృతి యై
చనుదెంచి యజ్జటాయువు, దనుజపతిం దాఁకి కూలెఁ దద్ఘనహేతిన్.

2552


తే.

ఆజటాయువు నిర్జించి యసురవిభుఁడు, సింధునాథుని లంఘించి సీతఁ గొనుచు
లంకలోపల వనభూమి శంక లేక, యునిచె నెమ్మదిఁ దత్సతి నుత్సుకతను.

2553


వ.

అంత దాశరథులు సీతను వెదకుచువచ్చి దశాననహేతిహతపక్షీంద్రప్రకటితజాన
కీవృత్తాంతులయి గోదావరీతటంబునఁ గ్రుమ్మరుచుం గబంధు వధియించి తన్నియో
గంబున శబరిం గాంచి పంపాతీరంబున నన్నుం గని సంభావించి ఋశ్యమూకా
ద్రియందు సుగ్రీవునితో బద్ధసఖ్యు లయి వాలిం బొలియించి తత్పదంబునఁ
సుగ్రీవు నునిచి యంగదు యౌవరాజ్యంబున కభిషిక్తుం జేసి రంత భానుసూ
నుండును సీత వెదకం గపులఁ బనుప నేనును సంపాతివచనంబున నుల్లంఘితసా
గరుండ నయి లంకయందు సీత నీక్షించి రామదత్తం బైనయభిజ్ఞానం బిచ్చి
యప్పురంబు దహించి హతరాక్షసుండ నయి మగిడి రామునకుఁ దద్వృత్తాం
తంబు సెప్పినం గపిసేనాసమేతుం డై సముద్రతీరంబున విడిసిన.

2554


సీ.

అంత రావణు దిగనాడి విభీషణుఁ డర్కకులాధీశు నాశ్రయించె
వానరోపేతుఁ డై వారాశి బంధించి, వీరుఁడు లంకపై విడిసి కుంభ
కర్ణాదిదైత్యులఁ గడతేర్చి రావణుఁ, దెగటార్చి జగములఁ దేజ మెసఁగ
దైత్యరాజానుజుఁ దత్పురాధిపుఁ జేసి, సరసిజగర్భాదిసురులచేతఁ
దగినవరములు గొని యట దశరథేశుఁ, గాంచి ప్రణమిల్లి యగ్నిముఖంబునందు
శుద్ధయగుసీతఁ గయికొని శుభవిమాన, మెక్కి రాక్షసవానరోపేతుఁ డగుచు.

2555


తే.

వచ్చి రఘుపుంగవుఁడు భరద్వాజుపావ, నాశ్రమంబున నున్నవాఁ డనఘచరిత
యఖలపౌరుల కానంద మతిశయిల్ల, వెల్లి నిక్కువ మిక్కడి కేఁగుదెంచు.

2556


క.

అనవుడు నాతనిపలుకులు, విని మిక్కిలి సంతసిల్లి వేడుక శత్రు
ఘ్నునిఁ గాంచి పలికె నుద్గత, ఘనతరసమ్మోదబాష్పకణములు దొరఁగన్.

2557

చ.

తడయక నీ వయోధ్యకు ముదంబున నేఁగి మహోత్సవంబుపెం
పడరఁగఁ జాటఁ బంపుము ప్రియంబున సౌధములందు వీథులం
బడగలుఁ దోరణావళులు భాతి దలిర్పఁగఁ గట్టఁ బంపు మీ
యెడ నెడ లేక భద్రము లనేకములున్ విలసిల్లునట్లుగాన్.

2558


ఆ.

అమల మయిన రాఘవాస్థానగృహమున, సింధుబంధనాదిచిత్రకథలు
వ్రాయఁ బంపు దేవ వసుమతీసురమంది, రము లలంకరింప రమణఁ బంపు.

2559


క.

రాముఁడు దశముఖుఁ బొరిగొని, శ్రీమహితుం డెల్లి వచ్చు సిద్ధ మనుచుఁ ద
ద్భూమీశుల నిట ర మ్మని, వే మనుజులఁ బంపుమా పవిత్రచరిత్రా.

2560


వ.

అనిన శత్రుఘ్నుండు సని జననీవర్గంబునకు రాఘవాగమనంబు చెప్పి యధికారి
పురుషుల రప్పించి సాకేతపురనందిగ్రామమధ్యపథంబు సవరం జేసి కస్తూరికాఘన
సారమిళితచందనరసంబున నవనీతరజంబు గావించి [106]శోభితార్థంబుగాఁ వ్గ్రొవి
రులు నెఱపి పొడయెండయుఁ బొలయనీక కేతనంబులు గట్టించి తత్తత్ప్రదేశంబు
లలంకరింపం బంపుం డని నియోగించినయనంతరంబ.

2561


సీ.

ఘనసారచందనకలితజలంబుల, లలి మణివేదిక లలుకువారుఁ
దారాగణోదారతారమౌక్తికములఁ, బెంపార మ్రుగ్గులు పెట్టువారు
మణిమరీచులు నభోమణిదీధితులుఁ గప్ప, నెలమిఁ గేతనతతు లెత్తువారు
సుకుమారపిప్పలచూతపల్లవములఁ, గడఁగి తోరణములు గట్టువారు
సౌధవాతాయనంబుల సరస వెడల, మంచిధూపంబు లెలమి నమర్చువారుఁ
జారుమంగళధీరఘోషములు వెలయ, మించి తూర్యము లొగిని వాయించువారు.

2562


వ.

అంత ననంతసేనాసహితసేనాపతిదండనాథులును నానాపురాణేతిహాసకుశలు లగు
పౌరాణికులును జతురామ్నాయచతురు లగుమహీసురులును ఘృష్టిజయంత
విజయసిద్ధార్థధర్మపాలాశోకమంత్రపాలసుమంత్రప్రముఖు లగుమహామాత్యు
లును మౌరజికవాంశికవైణికవైణవికగాయకనర్తకాదు లగుకుశీలవు
లును లావణ్యసాగరసముద్ధృతలక్ష్మీప్రతియాతనంబు లగుశరీరంబుల నొప్పు
వారవిలాసినులును వందిమాగధులును హస్తిపకసారథపదాతివరసహస్రంబు
లును బంధుమిత్రధాత్రీపాలబాలవృద్ధులును జనుదేర శిబికాందోళికాకర్ణీరథ
గజవరాశ్వోష్ట్రాదియానారూఢు లయినవారలచేతం బరివేష్టితుం డయి కౌస
ల్యాకైకేయీసుమిత్రాసమేతంబుగా శత్రుఘ్నుండు పంచమహాశబ్దంబు లులియ
వచ్చి భరతునకు మ్రొక్కి నిలిచియున్నఁ దదవసరంబున.

2563


క.

ధర గదలఁ గొండ లగలఁగ, వరరథహయగజపదాతికవర్గస్థితి భూ
వరులు గొలువంగఁ గదలెను, భరతుం డానందసారభరితాత్ముం డై.

2564


క.

మానుషరూపంబునఁ బవ, మానతనూజుండు దనరి మంజులదంతా

నూనరుచి నిగుడ ని ట్లను, భానుకులప్రవరుఁ డైనభరతునితోడన్.

2565


శా.

కంటే ముందట మింట నూర్జితగతిక్రాంతాఖిలాశాంత మై
ఘంటాగర్ఘరికానినాద మొదవంగా సాంద్రతేజంబు లే
వెంటం బాఱఁగఁ జారుహేమమణిదిగ్వీథీక మై వచ్చె ము
క్కంటిం బోలునృపాలుపుష్పకము వేగక్షిప్తపక్షీశ మై.

భరతుఁడు రాము నెదురుకొనుట

క.

వనవాసపరిక్లేశం, బున నెంతయు డస్సి వల్కభూషితతనుఁ డై
యనుజన్మసేవితుం డగు, జనకసుతాసహితు రామచంద్రునిఁ గంటే.

2567


వ.

అని సుగ్రీవజాంబవత్సుషేణులను విభీషణాదులను జూపిన నతండు పరమానం
దంబునం బొంది యద్దివ్యవిమానంబు గనుంగొని నమస్కరించి ప్రాచీశైలోపరి
భాగంబున నొప్పుపద్మబాంధవుమాడ్కి నిజప్రకాశదీప్తదిగ్వలయుం డై యున్న
యారాఘవుం జేరి సాష్టాంగనమస్కృతి సేసి యగ్రజుచేత నాలింగితుం డై
యతం డంకపీఠంబున నునిచి నఖాగ్రంబులఁ గపోలంబులు పుణికి యానందా
రోహితనయనుం డై విఘ్నీభూతతద్దర్శనుం డగుటయు మొక్కి మ్రొక్కి పునః
పునరాలింగితుం డై తదనంతరంబ.

2568


క.

అకలంకుఁ డయినలక్ష్మణు, నకు ధరణీతనయకుం బ్రణామము సేసెన్
వికచాననుఁ డై నామముఁ, బ్రకటించుచు భరతుఁ డంతఁ బ్రముదితుఁ డగుచున్.

2569


వ.

విభీషణసుగ్రీవజాంబవదంగదాదుల నాలింగనంబు సేసి వార లటమున్న నర
రూపధరు లై యుండుటం జేసి మనోహరాకారు లగువారలకుశలం బడిగి తద
నంతరంబ విభీషణుం గనుంగొని.

2570


క.

దనుజాధిప నీకతమున, మనుజాధిపుఁ డని [107]గతప్రమాదుం డై యే
పున మిగిలినదశకంఠునిఁ, దునుమాడె నుదగ్రశస్త్రదోర్వీర్యములన్.

2571


తే.

అనియె వేడుక శత్రుఘ్నుఁ డరుగుదెంచి, దశముఖాచలవజ్రిపాదముల కెరఁగి
పంబి లక్ష్మణునకుఁ బ్రణామంబు సేసి, ముదము నొందుచు సీతకు మ్రొక్కె నెలమి.

2572


క.

పతినిధనంబునఁ గృశ యై, హతపాదపవల్లికరణి నాత్మజశోకా
వృత యగుకౌసల్యకు భూ, పతి సాఁగి నమస్కరించె భక్తిభరమునన్.

2573


క.

చన్నుల మొగిఁ బా లొలుకఁగఁ, గన్నుల బాష్పములు దొరఁగఁగాఁ దల్లి సమా
సన్నుఁ డగుకొడుకుఁ గౌఁగిటఁ, జెన్నగు నెయ్యమునఁ జేర్చి చెలఁగెం బ్రీతిన్.

2574


ఆ.

తనరఁ గేకయేంద్రతనయకుఁ బ్రణమిల్లి, యట సుమిత్ర కెరఁగి యవనివిభుఁడు
ననుపమానతత్తదాలింగనాదిసం, భావనలఁ దనర్చె భానుకులుఁడు.

2575


ఉ.

అత్తఱి సీత యత్తలకు నందఱకుం దగ మ్రొక్కి యున్న వా
రత్తరళాక్షి నెత్తి ప్రియమారఁగఁ గౌఁగిటఁ జేర్చి సాధ్వి నీ

యుత్తమసచ్చరిత్రమున యుద్ధమునన్ రఘువల్లభుండు దాఁ
దత్తదుదగ్రదానవులదర్ప మడంచె విపద్విదూరుఁ డై.

2576


వ.

అంత.

2577


క.

సోదరవనితాయుతుఁ డై, మోదంబున నవ్వసిష్ఠమునిపతివిలస
త్పాదముల కెరఁగి గురువిన, యాదరములతోడ మానవాధిపుఁ డెలమిన్.

2578


ఆ.

తలఁచినపుడ నీవు తడయక ర మ్మని, పూజ చేసి ధనదుపుష్పకంబు
నృపతి వీడుకొల్ప నెఱి ను త్తరమునకు, నరిగి యాకుబేరు నాశ్రయించె.

2579


చ.

దురితవిదూరుఁ డైన భరతుండు గృతాంజలి యై వసుంధరే
శ్వరుఁ డగురాముతో ననియె సప్రణయాదరభక్తినమ్రుఁ డై
తిరముగ నేఁటిదాఁక భవదీయపదంబులయందు ధారుణీ
భర మిడి నీదురాజ్యము విభావమునం బరికించితిం దగన్.

2580


క.

దేవరయానతి తప్పక, యీవరపాదుకలు గొలిచి యిల్లూ రనుసం
భావనతో నిలఁ గాచితి, నేవెంటం దప్పు లేక యినసమతేజా.

2581


చ.

అని తనయిష్టదైవతము లై తనరారుచు నున్నపాదుకల్
గొని చనుదెంచి భక్తి యొడఁగూడఁగ మంగళతూర్యనాదముల్
ఘనముగ మ్రోయుచుండ దశకంధరవైరిపదంబులందుఁ బెం
పునఁ బ్రమదంబుతోఁ దొడిగి భూనుతపుణ్యచరిత్రుఁ డి ట్లనున్.

2582


క.

గిరిగజఫణిరాజులచే, భరియింపఁగఁ దగినధరణిభారమ్ము దగం
గరికలభము రాజిలమును, ధరియింపఁగ నెట్టు లోపు దానవభేదీ.

2583


క.

అవిరళ మయి భువనంబులఁ, గవియునభేద్యోద్ధతాంధకారము సెఱుపన్
రవి దక్కఁగ ఖద్యోతము, వివరింప సమర్థ మగునె విశ్రుతచరితా.

2584


సీ.

దివసకృత్యము లెల్ల దివసాంతమున నీదు, పాదుకలకు విన్నపంబు సేసి
కాని నిద్రింప మహీనాథ [108]యిల్లూరు, సొమ్మును నేమఱుచొప్పు లేద
యవధరింపుము ధాన్యభవనముల్ గోశగృ, హమ్ములుఁ గరిరథరహయపదాతి
వర్గముల్ నీప్రభావంబున దశగుణి, తంబు లై యున్నవి ధర్మవృత్తిఁ
దప్పి శాసింపఁ బ్రజల నుదారవృత్తి, నున్నవారలు బాధల నొంద రెలమిఁ
బ్రాకటేప్సితసంసిద్ధి నాకుఁ గలిగె, ననఘవృత్తి గృతార్థుఁడ నయితి నేఁడు.

2585


ఉ.

కావున నీవ ధారుణికిఁ గర్తవు భర్తవు [109]శాసితుండవుం
గావఁగఁ బ్రోవ దక్షుఁడ వఖండితశాసనవైభవాదిసం
భావనతోడ నీభువనభారము నెల్ల వహించి సర్వమో
దావహ మైన రాజ్యముఁ బ్రియంబునఁ జేకొను మిద్ధపౌరుషా.

2586

సీ.

నేఁడు నాకోర్కులు నివ్వటిల్లఁగ నయో, ధ్యకుఁ బోవవలయును ధరణినాథ
యీనారచీరలు నీజటాభారంబు, విడిచి యీతాపసవేష ముడిగి
మహనీయరాజార్హమంగళాలంకార, ములు దాల్చి సాంద్రప్రమోద మెసఁగ
మాన్య బాంధవమిత్రమంత్రివర్గంబుల, చిత్తాభిలాషముల్ చెలువు మిగులఁ
గరము గన్నులపండువుగా సమస్త, జనులు విప్రులు మునులు నుత్సాహ మొంద
నెఱయ నావిన్నపమ్మును నీవు ప్రీతి, నవధరించుట యొ ప్పగు నవనినాథ.

2587


వ.

అనవుడు [110]భక్తిప్రణయపూర్వకంబు లగుభరతుపలుకులకు సంతసిల్లి యంగీకరిం
చిన శత్రుఘ్నుపనుపునం బ్రసాధకులు వచ్చి భరతపూర్వకంబుగా రామలక్ష్మ
ణులజటాభారంబు లల్లన వెరువుతోడ విడిచి యతిసురభితైలాభ్యంజనం బాచ
రించిన నిర్వర్తితోద్వర్తను లయి మంగళాభిషేకం బవధరించి సహవర్తిసుగ్రీ
వాదివానరేంద్రవిభీషణాదినక్తంచరాభిషేకు లై తదనంతరంబ.

2588


తే.

శేషనిర్మోకనిర్మలస్ఫీతపట్ట, వస్త్రములు దాల్చి హరినీలవర్ణుఁ డైన
రామచంద్రుండు విమలశారదపయోద, పరివృతాసితశైలంబుభాతిఁ దనరె.

2589


క.

నునువెన్నెలఁ దడఁబఱిచెడు, ననులేపన మమర నలఁది యాతతశోభా
జనితాలంకృతి నెంతయుఁ, దనరినతొడవులు ధరించె ధరణీపతియున్.

2590


క.

భరతుఁడు నాసౌమిత్రియుఁ, ధరణిజుఁడును దైత్యవిభుఁడుఁ దక్కినవారున్
వరభూషణాంబరాదుల, నురుతరశోభావిభూతి నొప్పిరి మిగులన్.

2591


తే.

దశరథేశ్వరుతరుణులు ధరణిసుతకు, నిబిడనిర్భరహార్దంబు నివ్వటిల్లఁ
జెలువు దళుకొత్తఁ జేయారఁజేసి రెలమి, గారవంబునఁ దగునలంకారవిధులు.

2592


శా.

సుగ్రీవాదికపీంద్రకాంత లెలమిన్ శోభావహాకల్పసా
మగ్రీభాస్వరమూర్తు లౌచు నపరిమ్లానోత్సవశ్రీకరో
దగ్రస్మేరముఖంబులం దనరి యుద్యచ్చంద్రరాజత్క్రియా
మాగ్రస్ఫారరుచిం దలిర్చి రట దీవ్యద్రత్నవారోన్నతిన్.

2593


వ.

అంత శత్రుఘ్నుపనుపున సుమంత్రుండు సజ్జంబుగా రథం బమర్చి తెచ్చిన.

2594


క.

సురరాజు వరుణహస్తం, బరుదారఁగఁ బట్టి యెక్కుననువున ధాత్రీ
వరుఁడు భరతుచే యూఁదుచు, సురుచిరగతి నరద మెక్కె జూపఱు లలరన్.

2595


క.

తనకంటె మును వసిష్ఠుం డనుపమశోభనముహూర్త మరియుటకై యె
క్కె ననూనరథము మంగళ, జననమహామంత్రపఠనచతురాననుఁ డై.

2596


క.

విలసన్మణిరంజిత మై, జలజాహితచారుబింబసమ మై దుగ్ధా
బ్ధిలసత్ఫేనసదృశ మై, పలితం బగుతెల్లగొడుగు భరతుఁడు పట్టెన్.

2597


క.

కమలాసనహంసద్వయ, విమలము లగుచామరములు వేడుకతోడన్
యము లొగి వీచిరి పుంజిత, హిమధామకరంబు లన మహీపతి కెలమిన్.

2598

తే.

భూధరంబునఁ దనరారుభూతపతియుఁ, బోలె నత్తఱి రాక్షసపుంగవుండు
చారుహిమధామమండలసదృశ మైన, రథ మధిష్ఠించి వెనుకన రమణఁ గదలె.

2599


క.

శత్రుంజయనామక మగు, గోత్రాచలసదృశ మైనకుంజరపతి నా
మిత్రసుతుఁ డెక్కి కదలెను, సుత్రాముఁడపోలె విభవశోభితుఁ డగుచున్.

2600


క.

అందలము లెక్కి వానర, సుందరులు ప్రియంబుతో వసుమతీసుత నా
నందమునఁ గొల్చి చనిరి పు, రందరుసతిఁ గొల్చువిబుధరమణులుపోలెన్.

2601


చ.

అడవులలోనఁ గొండలఁ బ్రయాసము నాక సుఖైౌకలీలమై
నిడుమలఁ బొంది ధైర్యమున నెంతయు వంతల కోర్చి నేఁడు మా
కొడుకులు పుణ్యశీల యగుకోడలు నిమ్మెయి వచ్చి రంచుఁ జొ
ప్పడర మహీశుభార్యలు ప్రియంబున నేఁగిరి హృష్టచిత్త లై.

2602


క.

కర్ణాంతాయతనేత్ర సు, వర్ణసువర్ణోజ్జ్వలాంగి వరమణిభూషో
దీర్ణ యగుజనకనందన, కర్ణీరథ మెక్కి కదలెఁ గౌతుక మెసఁగన్.

2603

రామునియయోధ్యాపురప్రవేశము

వ.

అంతఁ బౌరులు యథోచితవాహనంబు లెక్కి పరివేష్టింప నాసన్నభృత్యులుం
బరిచారకులు నంతంతఁ జనుదేర విజయాదిమంత్రివర్గంబు సుగ్రీవాదివానరపరా
క్రమంబులు దనవలన వినుచుం జనుదేరఁ బురోహితవిప్రవర్గంబులు ముందటం
జన నుభయపార్శ్వంబుల గజారూఢు లై వాలితనయపవనతనయు లరుదేర రథా
ధిష్ఠితుం డగువిభీషణుండు చరమభాగంబున నడవ నెడనెడ ననేకాశీర్వాదంబులు
సేయువిప్రజనులవాక్యంబులు నిగుడ సేతుబంధనాదిప్రసంగంబులు సంకీర్తించు
వందిమాగధాదులస్తుతివచనంబులు బెరయ భేరీభాంకారంబులుఁ బటహపటు
ఘోషంబులుఁ గాహళబహుళరవంబులును దిక్కుహరస్పర్శిఢక్కానిక్వణంబు
లును మృదంగమంగళరవంబులును శంఖవిరావంబులును డోలికాధ్వానంబులు
ను గాంస్యమయతూర్యనిస్వనంబులు వివిధనాళీభేదారావంబులును మత్తసిం
ధురబృంహితంబులును జటులఖురపుటదళితధరాతలతురగహేషితంబులును
సర్పిస్యందననేమిధ్వనులును బ్రహృష్టసుభటోద్భటకలకలంబులును సందర్శనా
గతపురజనకోలాహలంబులును నొక్క టయి బోరుకలఁగ రఘునాథునిరథాగ్ర
భాగంబున వృద్ధపురంధ్రీవర్గంబు ముఖవిన్యస్తనవామ్రపల్లవాశ్వత్థకిసలయపూర్ణ
సువర్ణకలశహస్త లయి మంగళగానంబులు సేయుచు నడవ నంతంత దూర్వా
క్షతకుసుమలాజలు మీఁదఁ జల్లుచుం బౌరకామిను లరుగఁ దారాగణసహి
తుం డైనచంద్రుండునుఁబోలె విలసిల్లుచు రామచంద్రుండు నిజరాజధాని యగు
నయోధ్యానగరంబుఁ బ్రవేశించె.

2604


ఆ.

అంతఁ బౌరు లెల్ల ననక్కడ నక్కడ, సంతసంబు నొంది జలజమిత్ర
కులపవిత్రుఁ డైనకోసలేశ్వరుఁ జూడ, నరుగుదెంచి యతిరయంబుతోడ.

2605

వ.

తమలో నిట్లనిరి.

2606


సీ.

ఆలిమాటలకు భూపాలుండు వీరల, బేల యై యడవికి నేల పంపెఁ
దనయులతోఁ బాసి తల్లు లేక్రమమున, నుల్లంబులను నోర్చి యుండిరొక్కొ
యంటినఁ గందెడు[111]నంగంబు గలసీత, యలయక వనములు మెలఁగె నెట్లు
కొడుకునకై యిట్టిగోరంబు సేసిన, యింతి యాకైకేయి యేమి గనియె
విమలమంగళచరితులు వీరు లేని, పురములోపల నిలువంగఁ బోలు నెట్లు
మనకుఁ దొల్లింటిపుణ్యంబుమహిమఁ జేసి, సొలవ కెప్పటి వీరలఁ జూడఁగలిగె.

2607


క.

తనపిన్ననాఁడ తాటక, దునిమెం గౌశికుమఖంబు దొలఁగక కాచెన్
మనసిజహరువిల్లు విఱిచెను, మునుకొని యాజామదగ్న్యముని భంజించెన్.

2608


తే.

తండ్రిపంపున నడవికిఁ దపసి యగుచుఁ, జని విరాధునిఁ దునుమాడి దనుజసమితిఁ
గూల్చి సుగ్రీవుతోఁ దగఁగూర్మి చేసి, వాసవాత్మజు నతిశూరు వాలిఁ దునిమి.

2609


క.

సింధుగభీరుఁడు వారిధి, బంధించి సమగ్రకీశబలసహితుం డై
సంధానుకూలముగ దశ, కంధరుఁ దెగటార్చె నితఁ డకంపితబలుఁ డై.

2610


క.

జనకునిపనుపున నడవికిఁ, జనునప్పుడు నేఁడు మగిడి జనతతు లలరం
జనుదెంచునపుడు నానన, వనజమురుచి యొక్కరూప వర్ణింపంగన్.

2611


తరల.

ఘనభుజాయుగశక్తి మైఁ ద్రిజగంబులన్ సురరాజుఁ గై
కొనక మాయల దుర్జయుం డయి క్రూరసాహసచేష్టలం
దనరుశూరుని మేఘనాదుని దర్ప మంతయుఁ దూలఁగాఁ
దునిమి తేజము నొందులక్ష్మణుఁ దోయజానన చూచితే.

2612


మత్తకోకిల.

పాపచేష్టితుఁ బంక్తికంధరుఁ బాసి యీరఘురామునినా
భూపతిన్ శరణంబు సొచ్చెఁ బ్రభూతసద్వినయంబునం
బ్రాపు గల్గి సమగ్రపుణ్యవిభావ మొప్పగువాఁడు లం
కాపురీపతి యైనదైత్యనికాయవల్లభుఁ జూచితే.

2613


పృథ్వీవృత్తము.

ఇతండు హరిసూనుసోదరుఁ డహీనసత్త్వోద్దతుం
డతం డరయ వాలినందనుఁ డుదారశీలుండు వాఁ
డతుల్యబలపౌరుషం డురుభుజార్దితారాతి యూ
ర్జితప్రకటకీర్తికాంతుఁడు సుషేణుఁ డబ్జాననా.

2614


క.

వనరాశి దాఁటి జానకి, గని లంకానగర మెల్లఁ గాలిచె నీతం
డనిలోఁ గూలిన లక్ష్మణు, మనిచెన్ సంజీవి దెచ్చి మహితబలుం డై.

2615


క.

ఇలపైఁ గలశైలంబుల, జలనిధి బంధించి విపులసారము పేర్మిన్
లలి లంకకు నడపించిన, నలుఁ డీతఁడు విశ్వకర్మనందనుఁ డబలా.

2616


క.

జగములఁ గలవీరులలో, నెగడినవాఁ డితనిపేరు నీలుఁడు ఘోరం

బగురణములోఁ బ్రహస్తుం, దెగటార్చె సమాన మైనతేజం బెసఁగన్.

2617


క.

తారావల్లభసమరుచి, తారావల్లభుఁ డితండు దానవసేనా
పారావారౌర్వానల, సారభుజుం డర్కజుండు చంచలనయనా.

2618


చ.

అని ముద మంది పౌరజను లందఱునుం దమలోన నిట్లు పెం
పొనరఁగ వేడ్కఁ జెప్పుకొనుచుండఁగ రాఘవుఁ డింద్రగేహమం
డనసమపూర్ణవైభవవిడంబన మై తనరారుచుం గన
త్కనకమయాలయాతిసముదంచితరాజగృహంబు సొచ్చినన్.

2619


క.

పరమానందామృతరస, భరితాంతఃకరణు లగుచుఁ బౌరు లమందా
దరు లై తమతమయిండ్లకు, నరిగిరి రవివంశవల్లభాశ్రితకరు లై.

2620


వ.

అంత ననంతప్రసాదసుందరుం డగురఘునందనుండు భరతశత్రుఘ్నులం జూచి
మణికనకరమణీయంబు లగుమందిరంబులు గలిగి యుపకంఠస్ఫీతపల్లవితకుసు
మితఫలితతరువాటికాశోభితం బగుస్థలంబున సుగ్రీవునిం దత్సమం బగుప్రదేశం
బున విభీషణుని విడియించి నలనీలాంగదహనుమత్సుషేణజాంబవదాదులకుం
దగినవీడుఁబట్లు చూపి సముచితభక్ష్యంబులు యథోచితంబుగా సమకూర్చి రం
డని పంచిన వార లట్ల చేయం దరణితనయాదులు మనోనురూపమజ్జనభోజ
నాదుల నపనీతప్రస్థానఖేదు లయి సుఖం బున్నంత భరతుండు మందస్మితచంద్రి
కాసముల్లసితవదనచంద్రుం డై సుగ్రీవున కి ట్లనియె.

2621


ఉ.

స్వీకృతపుణ్యశీలుఁడు వశీకృతసర్వనిలింపనాథుఁ డూ
రీకృతధర్మమార్గుఁ డురరీకృతనీతివిశారదుండు దూ
రీకృతదుష్టచేష్టుఁ[112]డు నరీకృతదానవవల్లభుండు మో
ఘీకృతవీరవైరి సుముఖీకృతధీరుఁడు రాఘవుం డిలన్.

2622


క.

శరణాగతవత్సలునకుఁ గరుణామృతమానసునకు ఘనతరతేజ
స్స్ఫురణాపరిణతమయునకుఁ, జరణానతరక్షకునకుఁ జతురాత్మునకున్.

2623


క.

క్షితినాథశిఖామణికిని, జితవైరికి భక్తలోకచింతామణికిం
దతకాంతినిశామణికిని, బ్రతీతతేజోనుభావభరదినమణికిన్.

2624


క.

రాజీవదళాక్షునకును, రాజితబహుధర్మనిరతిరణదక్షునకున్
రాజితపృథువక్షునకును, రాజసదృక్షునకుఁ బతికి రామున కెలమిన్.

2625


క.

పట్టము కౌతూహలమునఁ, గట్టంగావలయు నెల్లి కమనీయగతిన్
నెట్టన సంభారంబులు, గట్టిగ నాయితము లయ్యెఁ గమలాప్తసుతా.

2626


తే.

ఘననదీశతతీర్ధోదకకములు నబ్ధి, వారిపూరంబుఁ దెప్పింపవలయుఁ గాన
వానరేంద్రులఁ బంపుము వలనుగాఁగ, నుదయవేళకుఁ జనుదేర నోజచేసి.

2627


ఉ.

అనినన్ సంతన మంది భానుతనయుం డత్యాదరోల్లాసి యై

మన మారంగ మనోజవం బొదవ సన్మానైకసత్వాద్యధీ
ను నుదగ్రుం డగుజాంబవంతుని సుషేణున్ వేగదర్శిం గ్రమం
బున గంగాదికపుణ్యతీర్థసలిలంబుల్ దేరఁగాఁ బంపుచున్.

2628


వ.

గవాక్షుం బూర్వసముద్రంబునకు ఋషభు దక్షిణాంబుధికి నలుం బశ్చిమపయో
ధికి హనుమంతు నుత్తరపారావారంబునకు నరుగ నియమించి వారలచేతికిం
గనకకలశంబు లిచ్చి పంపిన వార లతిత్వరితగమనంబునం [113]దత్తీర్థనదీపరికలిత
పుణ్యసలిలంబులుం జతురుదన్వదుదకంబులుం దేరం జనిన.

2629

ప్రాతస్సాయంకాలములవర్ణనము

ఆ.

మత్కులీనుఁ డైనమనువంశపతి యెల్లి, యతులరాజ్యపదము నందు నాకు
నింకఁ దడవుసేయ నేటికి ననుభంగి, నస్తశిఖరిఁ జేరె నర్కుఁ డంత.

2630


చ.

ఉరుతరకుంకుమారుణపయోధర యై కరసక్తభాసురాం
బర యగుపాశహస్తుదెస భానుఁడు చేర దృఢానురాగసుం
దర యగుతూర్పు దాల్చె నుచితస్థితి లేనిదపోలె నన్యునిన్
మరగినయింతి కాంతులకు మానుగఁ బశ్చిమగణ్యయే కదా.

2631


చ.

రవివరబింబ మూర్ధ్వగతరశ్మిక మై పరిలంబమాన మై
వరుణహరిద్వధూటి తగ వారిధితోయము చేఁదువేడుకం
గరపరిముక్త మైనకనకంపుఘటం బనఁ జక్రవాకికా
విరహకృశానుకూట మన వీక్షణదృశ్యత నొందె నెంతయున్.

2632


చ.

తరువులయందుఁ బల్లవపదస్థితి నద్రులయందు ధాతుబం
ధురగతి నంగనాజనపృథుస్తనమండలిఁ గుంకుమంబు నై
పరఁగుచు సాంధ్యశోణిమ విభాసుర మై జలనాథదిక్తట
[114]ద్విరదముకుంభసంభవనవీనగళద్రుధిరంబు నాఁ దగెన్.

2633


తే.

విపులతర మైనకమలినీకవిరహ మంది, పల్లవారుణభాసురపటల మమర
నంగజాగ్నికి [115]నోర్వనియట్లపోలె, వనజినీపతి వారాశి మునిఁగె నంత.

2634


చ.

చెలు వగుభంగిఁ గించిదవశిష్టనిమీలనవారిజాస్య యై
జలజిని భానుమద్విరహసంభృతఖేదయపోలె విన్న నై
చలదురుసౌరభోచ్ఛ్వసితకసంకుల యై ప్రవిశన్మధువ్రతా
[116]విలరవ ముప్పతిల్లఁగ నవీనదశాంతర మొందె నెంతయున్.

2635


క.

కవ వాసినకతమున జ, క్కవ లంతను విరహదాహకలితమనములం
బవలింటికూర్మి దలఁచుచుఁ, బొవులుచుఁ గాసారకూలభూముల నుండెన్.

2636


చ.

లలితగతిన్ గళంబులు మలంచి తనూరుహజాలమధ్యమం

బుల నిడి యింపుతో దివసభుక్తమృణాళము లైనరాజహం
సలు వరటాసమేతముగ సంభృతనిద్రల నొప్పి నిమ్నగా
పులినపరార్థ్యతల్పములపొందునఁ బొందుగ నుండె నెల్లెడన్.

2637


ఆ.

సురతనాటకంబు దొరఁకొన రాతిరి, కరపుటమునఁ జల్లువిరు లనంగ
నెఱసె నంబరమున నెఱిఁ దారకలు వియ, జ్జలధిఁ బెరుఁగుఫేనసమితి యనఁగ.

2638


చ.

తన కరయంగఁ దండ్రి యగు, తామరసప్రియుఁ డంతరించినన్
మనమున శోకవేగ మది మానుపఁజాలక ఖిన్నమూర్తి యై
వెనుకన వచ్చు నయ్యమునవీచులఁ బోలుతమంబు లెల్లచో
మునుకొని నిండఁ బర్వె నతిమోహతరస్థితిభాసమాన మై.

2639


శా.

పాతాళంబుననుండి వచ్చెనొ నభోగభాగంబునందుండి సం
ఘాతవ్యగ్రత నేఁగుదెంచెనొకొ దిక్చక్రంబునందుండి యు
జ్జాతం బై యరుదెంచెనొక్కొ యనఁగా సర్వంకషం బై తమో
జాతం బంతఁ బదార్థదర్శనవినాశస్థేమ మై పర్వినన్.

2640


చ.

అమితలసత్ప్రకాశ మలరార నదృశ్యత నొంది పోవుఁ దే
జము దగ లేక యున్నరభసంబున నప్పుడ తోఁచు నింద్రజా
లము దగ నేర్చుచందమున లాఘవవృత్తి వహించుచున్నయా
తిమిరము రాకపోకలు మదిం బరికింప నశక్య మేరికిన్.

2641


వ.

అంత వివేకశూన్యుం డగు రాజుచిత్తంబునుంబోలె సమీకృతనీచానీచపదంబై
కత్పావసానంబునుంబోలెఁ గ్రోడీకృతబ్రహ్మాండం బై కుకావ్యంబునుంబోలె నన
భివ్యంజితపదార్థం బై వధూచేష్టితంబునుంబోలె ననిశ్చితతత్త్వం బై శబ్దావబో
ధరహితకృతవాక్యబంధంబునుంబోలె సాశంకీకృతపదవిన్యాసం బై సూచి
భేద్యం బగునంధతమసంబు కవచితగజాజినం బగుహరశరీరంబుగతిఁ గజ్జలపట
సంబు నిగిడింపంబడినయట్లు భువనంబుం బొదువునవసరంబున.

2642


చ.

కలువలవిందు జక్కవలగాలము తమ్ముల కెల్ల వైరి చు
క్కలచెలికాఁడు చోరతతికన్నులనొప్పి తమంబుగొంగ జా
రులపెనుఁగాలినంకలియ [117]రుద్రునిపువ్వు సుధాహ్రదంబు వె
న్నెలయనుతీఁగదుంప రజనీకరుఁ డొప్పె సురేంద్రుదిక్కునన్.

2643


చ.

కుముదిని నవ్వె నత్తఱిఁ జకోరము గ్రొవ్వెఁ గరావరుద్ధ మై
కమలిని స్రుక్కె వారినిధి గ్రక్కున నిక్కె సమస్తచంద్రకాం
తములు గరంగె మన్మథుఁ డుదగ్రతఁ బొంగె వియోగిబృందమా
నములు దొలం గె దస్యులమనంబు గలంగెఁ గ్రమక్రమంబునన్.

2644


సీ.

నెలకొన నమృతంబు నిండారఁబోసినఁ, గొమరారురాజతకుంభ మనఁగఁ

జిరకాలసంభృతవిరహపాండుర మైన, వరయామినీవధూవదన మనఁగఁ
బాలసముద్రంబుఁ బాసి వచ్చినసుధా, గురుతరసారంపుఁగుప్ప యనఁగ
వలరాజు శృంగార మలవడ వీక్షింప, నమరింపఁ దగునిల్వుటద్ద మనఁగ
వెలయ రామునియభిషేకవిధికిఁ ద్రిదశ, కాంత లెత్తినమౌక్తికకలశ మనఁగ
జీవలోకంబు మిక్కిలి చెలఁగి చూడ, మిగులఁ జంద్రుండు నభమునఁ బొగడ నెగడె.

2645


వ.

అంత.

2646


చ.

తిమిరముఁ బాపి యంబుజతతిన్ వికసింపగఁ జేసి చక్రవా
కములకుఁ బొం దొనర్చి పరికల్పితదిగ్వలయప్రకాశుఁ డై
కుముదిని నిద్ర పుచ్చి పరికుంచితచంద్రమరీచిజాలుఁ డై
సముదితుఁ డయ్యె భాస్కరుఁడు సర్వజగజ్జనబోధకారి యై.

2647


ఆ.

కపివరేణ్యు లంత గౌతమీనది దాఁటి, సలిలపూర్ణకనకకలశహస్తు
లై రయంబుతోడ నరుదేర భాస్కరా, త్మజుఁడు భరతుఁ బలికె మనము చెలఁగ.

2648


ఉ.

తీర్థజలంబు గొంచు నరుదెంచిరి వీరె కపీంద్రు లింక నీ
వర్థి మునీంద్రులం బురజనావళులన్ ధరణీసురేంద్రులం
బార్థివబృందముం బిలువఁ బంపు రఘూద్వహుమంగళాభిషే
కార్థము నిర్వహింపు జగదభ్యుదయం బొడఁగూడునట్లుగన్.

2649


మ.

అని సుగ్రీవుఁడు పల్కిన భరతుఁ డుద్యన్మోద మొప్పం బురీ
జనులన్ విపుల రాజులన్ మునుల శశ్వత్ప్రీతి రప్పించినన్
ఘనగంభీరతదీయఘోషము చలకత్కల్లోలమాలోల్లస
ద్వనధిధ్వానమిపోలె నిండె నట దిగ్వ్రాతంబునున్ భూమియున్.

2650


వ.

అట భరతుశాసనంబున వసిష్ఠుండును విజయుండును జాబాలియుఁ గశ్యపముని
యును గాత్యాయనుండును గౌతముండును వామదేవుండును భరద్వాజుండును
గణ్వుండును నగస్త్యుండును మొదలుగాఁ గలతాపసోత్తములు చనుదెంచి రంత
రత్నస్తంభనిర్మితంబును విచిత్రవితానశోభితంబును బినద్ధలంబమానవివిధమణి
మాలికాకీర్ణంబును రత్నకుడ్యభాసమానంబును జంద్రకాంతకుట్టిమంబును
ననూనామ్రాశ్వత్థపల్లవతోరణభాసమానంబును [118]నగుచతుష్కంబునందు మ
ధ్యవిన్యస్తభద్రపీఠంబున బహువిధతూర్యమంగళఘోషంబు లులియ వంది
మాగధస్తుతులు బెరయఁ జారజనసమ్మోదాలాపంబులు నెఱయఁ బుణ్యాంగ
నాభద్రగీతంబులు చెలంగ విప్రజనాశీర్వాదంబులు నిగుడ ద్వారోపాంతవి
న్యస్తపూర్ణకలశసనాథం బగుమణిమండపంబు ప్రవేశించి యందు సీతాసమేతుం
డగు రామభద్రు నునిచి యవాంకురదూర్వాంకురప్లక్షచూతాదిమంగళౌషధీస
నాథంబు లగుకలశోదకంబుల ఋగ్యజుస్సామాధర్వణమంత్రంబుల నభిషేకంబు

చేయునంతఁ గన్యకామహామాత్యమూలభృత్యమాగధులు నైగములు నభిషే
కించునవసరంబున.

2651

శ్రీరామచంద్రపట్టాభిషేకమహోత్సవము

ఆ.

అమరలోకవిభుఁడు యముఁడును వరుణుండు, యక్షనాయకుఁడును హర్ష మెసఁగఁ
జెలఁగి రాఘవాభిషేకంబు చూడంగ, వచ్చి రఖిలవిబుధవరులతోడ.

2652


ఆ.

మంత్రసంయుతంబు మంత్రనిబద్ధ మై, ఫాలమందు హేమపట్ట మమరఁ
జలజటాంశుకపిలశశిఖండుఁ డగుభర్గు, పగిది నపుడు రామభద్రుఁ డొప్పె.

2653


క.

శతమఖుఁడు సౌరభాంగీ, కృతనందనమధుపగణపరిష్కారమహో
ర్జితకనకపద్మమాలిక, యతనికిఁ బుత్తెంచెఁ బ్రీతి ననిలునిచేతన్.

2654


ఆ.

మహితనిఖిలరత్నమయ మగుహారంబు, నమరువేడ్కతోడ నమరవిభుఁడు
నెలమిఁ గూర్మి మిగుల నిచ్చి పుత్తెంచిన, మఱియు ననిలుఁ డొసఁగె మనుజపతికి.

2655


ఉ.

అంచిత మైనకూర్మి నమరాధిపుఁ డట్లు సమీరుచేతఁ బు
త్తెంచినరత్నహారము ధృతిన్ ఘనశీలుఁడు రాఘవుండు పా
టించి ధరించి పొందు ఘటియించిన నుజ్జ్వలతారకాలిచే
మించినయభ్రమండలము మీఱె మనోహరదివ్యమూర్తియై.

2656


తే.

కంఠలగ్నకనకకమలమాలికచేతఁ, దనరెఁ జూడ నంత ధరణివిభుఁడు
చక్రవాకమిథునసంగతిచే నొప్పు, వరకళిందజాప్రవాహ మనఁగ.

2657


ఆ.

మహితపద్మరాగమణికిరీటము దాల్చి, యుదయదర్కమండలోదయాద్రి
యనఁగఁ బొలిచెఁ ద్రిజగదభ్యుదయస్ఫూర్తి, మూర్తి వైభవప్రమోద మెసఁగ.

2658


వ.

అంత రాఘవుండు వసుమతీదేవోత్తములకు ముప్పదికోట్లసువర్ణంబులును లక్ష
గుఱ్ఱంబులును నన్నియమదగజంబులును గోటిపరిగణితంబు లగుసవత్సధేను
గణంబులును దాసదాసీజనంబులును బహువిధసస్యసమగ్రంబు లగుమహాగ్ర
హారంబులును ననేకాభరణంబులును నొసంగె నమ్మహోత్సవంబున.

2659


క.

ధర సస్యసమితిఁ బొలిచెను, దరువులు గుసుమఫలరాజిఁ దనరారెఁ దగన్
విరులు సుగంధము లయ్యెను, బరువడి నెయ్యెడల నధికభద్రము లయ్యెన్.

2660


క.

వననిధిగంభీరుం డగు, జనపతికులశేఖరుండు సమ్మదలీలం
గనకమయపుష్పమాలిక, నినతనయున కిచ్చె నాతఁ డిచ్చం జెలఁగన్.

2661


సీ.

కమనీయమణికనత్కనకాంగదంబులు, ముదితచిత్తునకు నంగదున కిచ్చె
సరఘమాలాకారహరినీలమాలిక, ఘనతరాత్మునకు నీలునకు నిచ్చె
మరకతమాణిక్యమహనీయదామంబు, మానుగా మారుతాత్మజున కిచ్చె
బద్మరాగారుణప్రాలంబ మేపార, ననఘాత్మునకు సుషేణునకు నిచ్చె
నంత వేడుక వీరు వా రనక రామ, ధారుణీపతి కపులకు వేఱువేఱ
యమలభూషణచారుదివ్యాంబరములు, గొమరు మిగులంగఁ జిత్తముగొలఁది నిచ్చె.

2662

క.

ధనదానుజుఁ డగుదైత్యుని, మనమున విన్మయము గదుర మన్ననతోడన్
మనుజపతి గట్ట నిచ్చెను, దనుజులఁ గరుణించి సముచితం బగుపూజన్.

2663


చ.

అమృతకళాంశుతుల్య మగుహారము రాముఁడు సీత కిచ్చె నా
రమణి ధరింప నొల్లక కరంబులఁ దాల్చి నిజేశుఁ జూడ భూ
రమణుఁడు నింతిక న్నెఱిఁగి రాగముతో నగుఁ గాక యన్న న
క్కమలదళాక్షి వాయుజునికంఠమునం దగిలించె వేడుకన్.

2664


క.

ఆముక్తాహారంబున, నామారుతసూతి శారదాంబుదనిచితం
బై మెఱయుమేరుగిరిగతి, భూమవిహారమున జనులు పొగడఁగ నెగడెన్.

2665


క.

మందరధీరుఁడు రాఘవుఁ, డందఱఁ గరుణించి చూచి
హర్షామృతని
ష్యంది యగుప్రియము పలుకుచు, మందస్మితవదన మమర మఱి యి ట్లనియెన్.

2666


చ.

అనయము మీకతంబునఁ బ్రయాసము నొందక యొక్కమాత్రలో
వననిధిఁ గట్టి దాఁటి యనివార్యబలుం డగుపంక్తికంధరుం
దునిమితి నెల్లరాక్షసులఁ ద్రుంచితి మించితి నీజగంబునన్
నినిచితిఁ గీర్తి రాజ్యపదనిష్ఠితవృత్తిఁ దనర్చితిం దగన్.

2667


క.

నెఱినీతియు ధర్మంబును, మఱవక నాతోడికూర్మి మానక మర్మం
బెఱుకపడ నీక మతి నే, మఱక సుఖం బుండి యప్రమాదుల రగుఁడీ.

2668


వ.

అని హితోపదేశంబులు మఱియునుం జేసి మీమీదేశంబులకుఁ జనుం డని
యాలింగనప్రియాలాపమందస్మితకరుణాతరంగితకటాక్షవీక్షణాదుల సంభావించి
సుగ్రీవాంగదపవనసుతాదు లగుప్లవంగయూథపులను విభీషణాదిరాక్షసులను
జాంబవదాదు లగుభల్లూకనాయకులను వీడ్కొలిపిన వారలు కృతప్రణా
ము లై నిజనివాసంబులకుం జనిన.

2669


ఉ.

విశ్రుతకీర్తి యైనరఘువీరుఁడు ధర్మదయానయాదులం
బ్రశ్రయధైర్యశౌర్యగుణభాసురుఁ డై నిరపాయవృత్తి వ
ర్ణాశ్రమపాలనంబులు ప్రయత్నముతో నొనరించుచున్ [119]నమో
పాశ్రయుఁ డై జగత్త్రయనియామకశాసన మొప్పఁ జేయుచున్.

2670


సీ.

ధర్మార్థకామముల్ దమలోన నొండొంటిఁ, బెంపుసొంపార బాధింప నీక
పంచాంగమంత్రంబు పరిపాటి దప్పక, తగుమంత్రిపక్షపాతంబు గలిగి
[120]ప్రణిపాతముఖగుణకప్రథితప్రయోగంబు, సేయుచుఁ దత్ఫలశ్రీఁ దనర్చి
శక్తిసిద్ధత్రయసంప్రాప్తి భవ్యుఁ డై, విజితారిషడ్వర్గవిమలుఁ డగుచు
నంచితప్రవృద్ధి సప్తాంగముల మించి, చతురుపాయయుక్తి వితతి నొంది
యాతతవ్యసనములందు సంగతి లేక, యేలె ధరణి రాఘవేశ్వరుండు.

2671


మ.

నిరతిశయానుభావమును నీతియు ధర్మపదైకనిష్ఠయున్

గ్రంథపాతం

హేయకర్మాన్యాయహింసాపరాభవ, కరణంబులును బాలమరణములును
బ్రజ లెఱుంగకుండఁ బ్రథమానశాసన, పాకశాసనుండు లోకగురుఁడు
దండ్రిపోలె మిగులదయతోడఁ గాచుచుఁ, బరఁగ రామవిభుఁడు ధరణి నేలె.

2679


క.

సారాచారోదారుఁడు, వీరేంద్రుఁడు పదునొకొండువేలేండ్లు నిజా
జ్ఞారంభ మొదవ నిత్య, స్మేరయశస్ఫూర్తి నేలె మేదిని యెల్లన్.

2680


క.

ఈరామాయణసంహిత, సారమతిన్ వినిన వ్రాయఁ జదివిన దురితా
పారజలరాశిఁ గడతురు, ధీరులు ధర్మార్థకామదీపితవృత్తిన్.

2681


ఆ.

[121]ఎవ్వఁ డెద్ది గోరి యిక్కథ విను వ్రాయు, నాతఁ డదియ పడయు నర్థితోడ
ననఘధర్మవైభవాయురారోగ్యముల్, గలుగు నొక్కమాత్రఁ జెలఁగి చదువ.

2682


చ.

అమర హుళిక్కిభాస్కరమహాకవి చెప్పఁగ నున్నయుద్ధకాం
డముతరువాయి చెప్పెఁ బ్రకటప్రతిభాషణుఁ డప్పలార్యస
త్తమసుతుఁ డయ్యలార్యుఁడు గృతస్థితి నార్యులు మెచ్చునట్లుగా
హిమకరతారభాస్కరమహీవలయస్థిరలక్ష్మి చేకుఱన్.

2683


ఉ.

ఆగమసత్యవేద్య దివిజాధిపమానసహృద్య
సంతత
శ్రీగరిమాభిరామ పరుషీభవదాసురభీమ [122]నిస్సర
ద్రాగయతీంద్రసాధ్య వినతత్రిదశాఖిలసాధ్య సుస్థిరా
భోగమహానుభావ బహుభూతిదనిర్మలభావభావనా.

2684


క.

ప్రణమన్మరుదీశశిరో, మణిఘృణివిమలాంబుధౌతమానితచరణా
గణనాతిగగుణశరణా, గణలోకకృతాధికరణ కరుణాభరణా.

2685


మాలిని.

కనకకుధరచాపా కల్పకల్యాణరూపా
వనజనిలయవంద్యా వారిజాతాభినంద్యా
జననవిలయదూరా సర్పనిష్పన్నహారా
మనసిజహరనేత్రా మంగళోద్యచ్చరిత్రా.

2686


గద్యము.

ఇది శ్రీ శాకల్యమల్లకవిరవిరాహు నృసింహావర జాప్పలార్యనందనోభయ
భాషాకవితావిశారద శారదాచరణకమల పరిచరణపరిలీఢమానసాయ్యలార్య
విరచితం బయినశ్రీరామాయణమహాకావ్యంబునందు యుద్ధకాండశేషంబు సర్వం
బు నేకాశ్వాసము.

శ్రీసీతాలక్ష్మణభరతశత్రుఘ్నహనుమత్సమేత
శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః

————

  1. దుష్పాపహరంబు నా
  2. ర్తస్వరతోరణవరణవిరాజితమును వేద
  3. యేమునివన మొకో, యచట... గాన నేమి
  4. మంజుగానసంకుల
  5. 'మద్గతమహీజీమూతమో' అ. ప్ర.
  6. యుద్ధురతరోన్మాదంబునం
  7. మేనితోఁ బాసెనో మిథిలేంద్రసుతయును, మనువంశకీర్తియు మడిసెనొక్కొ
  8. కులితుం డై... సరాగుం డై ప్రియం బేర్పడన్.
  9. యుగము నాకౌఁగిటి
  10. వరశాంతులకుఁ బృథుమద
  11. ఇట నడుమ నీపద్యము వ్రాఁతప్రతులఁ జూపట్టుచున్నది.
  12. మొగిఁ గాళ్ల దట్టించి
  13. జాడ్యత్వదుర్ణయ
  14. తీర్థాధివాసవర
  15. దురటిల్లు నెవ్వగలఁ బొందుచు వందురుచుండ
  16. నిర్వికారుఁ డయి కన్నుల
  17. సత్ప్రణుతప్రక్రియ
  18. గోరక చంపి తీవు
  19. గూడి కలయఁ బెరుఁగ
  20. యొదిఁగె దిక్కులఁ బాఱుచున్న
  21. రసంబుఁ జిల్కుకరణిన్
  22. 'సంతమసంబు నా నడంగె నతి' అ.ప్ర.
  23. కళామనోహరుఁడు నవ్య
  24. మేల యది ద్రెక్కొని
  25. బు లో
    లఘనాస్రక్రమవేది లోకసతతశ్లాఘార్హసచ్చేష్టితుం
    డఘదూరుండును మేరుధీరుఁడు నయవ్యాపారపారంగతుం
    డు ఘనప్రాభవ
  26. వీరోత్తమాగ్రేసరున్
  27. 'యుద్ధతాహితుల ముందట' అ. ప్ర.
  28. వనరాజికైవడి
  29. ద్రుమముతోఁ బాసినతీఁగఁ బోలి
  30. రూఢవిక్రమబలా
  31. నిలుచువారును
  32. గట్టి యుపాయనంబులు సలుపుచు
  33. సరిఁ జెందఁగ
  34. నూనోల్లసద్భాసుఁ డై
  35. శుంభద్విక్రమాడంబరున్.
  36. “హేమమయపుంఖశరంబుల' వ్రా. ప్ర.
  37. ‘పొంపిరివోవఁగఁ జూచి' వ్రా. ప్ర. ఈకవి ఋకారముతోడ నుకారమునకు యతిమైత్రి పాటించినట్లు చూపట్టుచున్నది. ఈ కాండముననె 1895వ పద్యమునఁ 'గృతకోదంచితమత్స్యమై యతఁ డతిక్రూరాత్ము నాక్రవ్యభుక్పతి' అని యున్నది. 'అతిక్రూరాత్ము' ననుటను 'అతిక్లేశాత్ము' నని పండితులు దిద్దిరి. 1930వ సీసమున 'వరవసంతుఁడు లేని వనలక్ష్మికైవడి, ద్రుమముతోఁ బాసినతీఁగఁ బోలి' అని యున్నది 'ధృతిఁ దరువును బాయుతీఁగ యనఁగ' నని మార్పఁబడినది. 2005వ చంపకమునఁ 'బృథిని పగిల్చి హేమమయపుంఖశరంబుల' నని యున్నది. ఇది 'పగిల్చి బంగరపుఁబింజలయమ్ముల' నని మార్పఁబడెను, 2011వ చంపకంబునఁ 'బృథుతరవిస్మయక్రమము పొంపిరివోవఁగ' నని యున్నది 'క్రమము పెంపొనరంగ' నని మార్పఁబడెను.
  38. సామజభేరుండశరభోరగంబులు, వప్రతిభటము లై యనికిఁ గడఁగి
    వృత్రేంద్రులును ఫాలనేత్రగజామరుల్, చటులతరాహవసంభ్రమంబు
    సల్పు
  39. లతావలమై చనుదేర
  40. ను దిగ్మతరం బగునట్టహాసమున్, ఆఱని
  41. నిశితదంష్ట్రారాతి నిష్ఠురత్వంబులఁ, దార్క్ష్యుని భేదించు తలము
  42. రౌద్రాహిశస్త్రంబుపొలుపు
  43. గాళీవ్యాళీహస్తసమానధారజల మై
  44. బేలుఁదనము; పెలుచఁదనము
  45. తీవ్రతాటోపుఁ డగుచు
  46. విజయోన్మాదంబునం బేర్చెదన్.
  47. నిక్షుదండభంజనంబుగా భంజించి నిరం
  48. యగుకేతన
  49. శితశరంబుల నేసెన్.
  50. ఇది యెఱ్ఱాప్రెగడవారిపద్య మని వ్రాఁతప్రతులు గొన్నిట నున్నది.
  51. సుం, దర నైర్మల
  52. దోస్సారముల్
  53. వ్యాపారఘోరాతిదు, ష్కరముల్ నీదుకరంబు
  54. తేఁకువయు నాగ్రహపుబుద్ధిఁ ద్రిప్పవైతి.
  55. నుద్భూతారిరక్తార్ణవంబు
  56. ననేకాంగవీరసమన్వితంబును
  57. నవోష్ణశోణితము
  58. నెలకొన్న యఱగమిఁ గళవళించు
  59. దోరంబుబొట్టులఁ దొరఁగు
  60. తో నెనయుచు భూరమణ
  61. తలఁ పేమి లెస్స దలపోయంగన్.
  62. నూత్నముక్తావళి
  63. జనకుఁడు దానవనాథుఁడు,... గాంతుఁడు నాకుం, దనయుండు
  64. చిహ్నవిహీనమై
  65. రది సౌహార్దవ్యతికరమే...... బహుమతి నొందున్.
  66. గాంచుటకు దిక్పాలురస్రుక్కు దీఱె
  67. నిట్టినిధనంబు .... నెవ్వరి నమ్మవచ్చు
  68. జలదపుష్కరవర్షసమితి నాఱెఁ
  69. దురటిల్లు
  70. రాజ్యలక్ష్మి గలిగెఁ
    గొఱఁత లెల్ల దీఱెఁ గోర్కులు దలకూడె, దొట్టు వాసె
  71. కీదుర్దశాశోచ్యుఁడే.
  72. సాశ్రుతు లైనయగ్రజన్ము
  73. నాసికయందు స్రుక్కను గర్ణంబులయందు ద్రౌశియు
  74. నిండఁ బైఁ బాఱిననీకృపామృతమునఁ బరఁగ
  75. పాత్రుండనే, ఫుల్లాంతఃకరణుండు భూవిభుఁడు
  76. మఱియొకఁడు చేయుపాపము, మఱొకఁడు దాఁ బుచ్చుకొన సమర్థుఁ డగునె
  77. కాంతానుచితయోగగరళమహావ్యాప్తి
  78. నదియ పాటిసేయుము దీని
  79. 'దగుగుఱిగా' అనియే వ్రా.ప్ర.
  80. యై మిథిలేంద్రకన్య దాన్.
  81. ద్రవీకృతం బగునజ్ఞానగ్రంథి గదల్ప
  82. దదీయకైతవంబు లనుభవించువారు
  83. పైఁ బరపు గలదె
  84. డంచు భూజనుల
  85. 'సూరులడెందము' అ. ప్ర.
  86. కసవు
  87. 'అజేయుల' ననియే శక్యార్థమునఁ గవి ప్రయోగించియున్నాఁడు.
  88. నీవ రాఘవ శరణంబ వెల్ల నాఁడు.
  89. బేలుఁదనంబు- బెలుచఁదనంబు
  90. దిలకించి యి మ్మనపరీతమహోదయవిస్ఫురద్దయన్.
  91. బ్రాప్తసంస్ఫారబలంబులం
  92. విపుడు నిరూఢి... నేఁగు మీశ్వరా.
  93. 'పటలతులితంబు లగుపక్షచ్ఛదకేతనంబులును' అ. ప్ర.
  94. నవంబు లైనచామరంబులును
  95. గాచితి ముజ్జగంబులన్.
  96. సంగతంబు దనర
  97. ఇది వ్రాఁతప్రతులం దఱచుగాఁ గనుపట్టదు.
  98. 'మానితసుస్థితిమై' అ. ప్ర.
  99. ధారుణీకృతవింధ్యా
  100. పూర్ణసముదంచితపల్లవపుష్ప
  101. గతి యై పూనిన
  102. శాసకునకు శాసితుం డని యీకవిప్రయోగము.
  103. 'రేపకడ నెల్ల నెమ్మెయి' అ. ప్ర.
  104. రీఫలతరువల్లరీ... లై వనంబు లెల్ల నతిశయిల్లె.
  105. యగలించు నల్లన
  106. గుల్భద్వయసమంబుగాఁ గ్రొవ్విరులు
  107. గతప్రమాణుం డై
  108. యిల్లూరసొ మ్మని యేమఱుచొప్పు లేక
  109. 'శాసితుం' డనియే శాసకపర్యాయముగా భీమకవిప్రయోగము.
  110. భరతుభక్తిప్రణయంబులకు సంతసిల్లి
  111. నందంబు గల
  112. డుపరీకృతదానవ
  113. దత్తీర్థనదీపంచకశతపుణ్యసలిలంబులు
  114. ద్విరదళకుంభసంభవనవీనగళద్రసరాజి నాఁ దగెన్.
  115. నోర్వమినట్లు పోలె
  116. విలపము లుప్పతిల్లఁగ
  117. ‘రొక్కపుమేటి' అ. ప్ర.
  118. నగుచతుఃస్తంభమంటపమధ్యవిన్యస్తభద్రపీఠంబున
  119. శమోపాశ్రయుఁ డై
  120. పణబంధముఖగతప్రథిత
  121. ఎవ్వఁ డెద్ది గోరి యెక్కడ విను నాతఁ, డదియ పడయు సందియంబు లేదు
    ననఘధర్మవైభవాప్తులు గలుగును, జగతి నొక్కమాత్రఁ జదువఁగనిన.
  122. వీరసద్రాగ