భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/బేగం రహీమా

బ్రిటీష్‌ సైనిక మూకలను సాయుధంగా ఎదుర్కొన్న ధైర్యశాలి

బేగం రహీమా

(1829-1857)

ప్రథామ స్వాతంత్య్ర సంగ్రామం, మాతృదేశాభిమానులైన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ లో త్యాగాల బలివేదికను ఆనందంగా అధిరోహించగల సాహసాన్ని, ఆత్మార్పణ స్పూర్తిని కలుగచేసింది. ఆ వీరగుణం కొందర్ని వ్యక్తిగత సాహసాలకు పురికొల్పితే మరికొందర్ని ఉమ్మడి పోరాటాలకు సన్నద్ధులను చేసింది. ఈ మేరకు బ్రిటిష్‌ సైనికదళాల మీద విరుచుకుపడ్డ తిరుగుబాటుదాళాలతో కలసి పోరుబాటను ఎంచుకున్నారు బేగం రహీమా.

ఆమె ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ జిల్లాకు చెందిన రాజపుత్రుల కుటుంబంలో 1829లో జన్మించారు. రాజపుత్రుల శౌర్యప్రతాపాలు సంతరించుకున్న ఆమె స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్‌ సైనిక మూకల మీద సమర శంఖరావం పూరించారు. ఆయుధం ధరించి తిరుగుబాటు దాళాలతో కలిసి శత్రుమూకలను సంహరించే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ పోరులో గాయపడిన ఆమె బ్రిటిష్‌ సెనికాధికారులకు బందీ అయ్యారు. శత్రువు గుప్పెట్లో ఉన్నా, ఏమాత్రం తలవంచని ఆ యోధురాలికి సైనికాధికారులు ఉరిశిక్ష విధించారు. మాతృదేశం కోసం మరణించటం అత్యంత గౌరవంగా భావించిన బేగం రహీమా చిన్న వయస్సులోనే, పుట్టిన గడ్డకోసం ప్రాణాలను అర్పించారు. ఆ తరువాతి తరం విప్లవకారులకు ఆమె ఆదర్శంగా నిలిచారు. (Who is who Indian Martyrs, Dr. PN Chopra, Govt. of India Publications, New Delhi.1973, Page. 118)

65