భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/ఫాతిమా బేగం
గాంధీజీ ఆధ్వర్యంలో ' నిఖా ' చేసుకున్న
ఫాతిమా బేగం
స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కోరుకున్న ప్రజలు వివక్షతను ఏమాత్రం సహించరు. మహత్తరమైన స్వేచ్ఛా,సమానత్వాల కోసం నడుం కట్టిన యోధులు సుఖ,సంపదలను లెక్కచేయరు. లక్ష్యసాధాన పరమావధిగా భావించిన వారు ఆ మార్గం తప్ప అందుకు అడ్డం వచ్చే ప్రతిదాన్ని త్యజిస్తారు. ఆ కార్యాచరణకు ప్రతిరూపంగా నిలుస్తారు శ్రీమతి ఫాతిమా బేగం.
దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలలో మహాత్మాగాంధీ తోపాటుగా పాల్గొని, అక్కడున్న లక్షలాది రూపాయలను ఆర్జించిపెట్టే వ్యాపారాన్ని వదులుకుని, గాంధీజీ తోపాటుగా భారతదేశం విచ్చేసిన కుటుంబ సభ్యురాలు ఫాతిమా బేగం. ఆమె తండ్రి ఇమామ్ అబ్దుల్ ఖాదిర్ దక్షిణాఫ్రికాలో ప్రఖ్యాత అరేబియా గుర్రాల వ్యాపారి. దక్షిణాఫ్రికాలో సాగుతున్న వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఇమామ్ ఖాదిర్ గాంధీజీకి క్రియాశీలక సహకారం అందించారు. ఆ క్రమంలో అక్కడున్న సర్వసంపదలను త్యజించి అతి సామాన్య ఉద్యమకారునిగా కుటుంబంతో సహా ఆయన భారత దేశం వచ్చారు.బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్నవిముక్తి పోరాటంలో భాగస్వామ్యం వహించేందుకు సర్వసంపదలు వదులుకుని గాంధీజీ వెంట నడిచారు.
99 ఆ మహనీయుని పెద్ద కుమార్తె ఫాతిమా బేగం. ఆమె కుంటుంబం అంతా సబర్మతీ ఆశ్రమంలో గడిపింది. ఆ కారణంగా ఫాతిమా గాంధీజీ కనుసన్నలలో పెరిగారు. ఆశ్రమంలో అన్ని పనులలో ప్రతిఒక్కరికీ చేదోడుగా ఉంటూ ఆశ్రమ నిబంధనలను పాిటిస్తూ ఆశ్రమవాసుల, ప్రత్యేకంగా మహాత్ముని ప్రశంసలను అందాుకున్నారు.
ఆమె తండ్రి అబ్దుల్ ఖాదిర్‌ను గాంధీజీ స్వంత సోదరునిగా భావించి గౌరవించారు. ఆ అనుబంధంతో 20 సంవత్సరాల ఫాతిమా వివాహం విషయంలో గాంధీజీ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆమె వివాహా ఆహ్వానపత్రాన్ని ఆయన స్వయంగా రూపొందించారు. ఆ వివాహానికి ప్రముఖులను, ప్రజలను ఆహ్వానిస్తూ 1920 ఏప్రిల్ 2న వెలువడిన ఆహ్వాన పత్రిక గాంధీజీ పేరిట ప్రచురితమై జాతీయోద్యమ సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. ఆ ఆహ్వాన పత్రిక ఇలా సాగింది.
ప్రియమైన మిత్రమా! ఫాతిమా బేగం నా మిత్రులు మరియు నా సోదరులు ఇమాం అబ్దుల్ ఖాదిర్ సాహెబ్ గారి జ్యేష్ట పుత్రిక. ఇమాం సాహెబ్ దాక్షిణాఫ్రికాలో, భారత దేశంలోని ఆశ్రమ, జైలు జీవితంలో నా సహచరులు. సయ్యద్ హుస్సేన్ మియాతో ఫాతిమా బీబీ వివాహం 1920 ఏప్రిల్ 26 తేది శనివారం సాయంత్రం ఏడు గంటలకు జరపాలని నిశ్చయమైంది. ఆరున్నరకు మిలాద్ షరీష్ ఆరంభమవుతుంది. ఈ సంతోషకర సమయంలో మీరు కూడ పాల్గొని వధూ, వరులను తమ శుభాకాంకలతో అలంకృతులను చేయగలరు.
ఇట్లు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.
ఈ వివాహ కార్యక్రమం గాంధీజీ ఆద్వర్యంలో అతి సాదాసీదాగా పూర్తయ్యింది. ఈ వివాహం గురించి గాంధీజీ తన నవజీవన్ పత్రికలో విశేషంగా ఉలేఖించారు. వివాహం తరువాత ఫాతిమా అత్తవారింకి వెళ్ళింది. ఆశ్రమ జీవితంలో అలవర్చుకున్న శిక్షణ, సహష్టుత, దేశబక్తి సామాజిక సేవాభావాలను అత్తవారింట పరిమళింప చేయాల్సిందిగా కోరుతూ గాంధీజీ ఆమెను ఆశీర్వదించారు. ఆ దిశగా అత్తవారింట కూడ జాతీయోద్యమ భావాలను పరిమళింప చేసిన ఫాతిమా బేగం చిన్న వయస్సులోనే కన్నుమూశారు.
100