భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/పరిచయ వాక్యం

డాక్టర్‌ ఆవుల మంజులత, M.A.Ph.D.
వైస్‌ ఛాన్స్‌లర్‌
పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
హైదారాబాద్‌.

పరిచయ వాక్యం

ప్రపంచ విముక్తిపోరాటాల చరిత్రలో భారతీయులు సాగించిన స్వాతంత్య్ర
సంగ్రామం సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహత్తర ఘట్టం. బ్రిీటిష్‌ లసపాలకుల
నుండి స్వేచ్ఛ - స్వాతంత్య్రాలు కోరుకుంటూ భరతగడ్డ మీద ఉన్న అన్ని సాంఫిుక జనసముదాయాలు ఏకోన్ముఖంగా పోరుబాటన సాగాయి. ఈ పోరాటాలలో పురుషులతోపాటు మహిళలు కూడ ప్రత్యక్షంగా పరోక్షంగా కీలక పాత్రలను పోషించారు. సమరశీల మహిళలు పురుషులతోపాటుగా ప్రత్యక్షపోరాటంలో భాగస్వాములు కాగా, ఆచార సంప్రదాయాలు, సామాజిక పరిమితులలో ఉన్న మహిళలు ఉద్యమకారులైన తమ కుటుంబ సభ్యులను బ్రిీటిషు ప్రభుయత్వ వ్యతిరేక పోరాటాల దిశగా ప్రోత్సహిస్తూ స్వాతంత్య్ర పోరాటంలో అద్వితీయ పాత్ర వహించారు. కాని, భారతదేశ దాస్య శృంఖలాల విముక్తికి తమ సర్వస్వంఒడ్డి పోరాడిన అనేక మంది మహిళల గురించి నేటితరానికి తెలిసింది తక్కువ. చాలా మంది మహిళల పోరాటగాథలు చీకటి పుటల్లోనే ఉండిపోయాయి. ముస్లిం మహిళల విషయంలో ఈ వివక్ష మరింత ఎక్కువగా కనబడుతుంది. మాతృ దేశం కోసం,జాతి జనుల కోసం పోరాడి, ఆపో పోరాటాలకు స్పూర్తి నిచ్చిన ముస్లిం మహిళల జీవిత చరిత్రలను క్లుప్తంగా మన ముందా ఉంచడం ద్వారా రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ నేటి తరానికి అత్యంత అవసరమై న అమూల్యమెన చరిత్ర గ్రంథాన్ని అందించారు. ఇది కేవలం చరిత్ర గ్రంథం మాత్రమే కాదు, చరిత్రలో మరుగునపఫడిన మాణిక్యాలను వెలికితీసి, వారి త్యాగమయ జీవితపు ప్రేరణాత్మక వెలుగులను మనకు
పరిచయం చేసే పరిశోధానాత్మక గ్రంథం.

స్వాతంత్య్ర పోరాటంలో లక్ష్లాలాది మంది పాల్గొన్నారు. అందులో స్త్రీలు కూడ చాలామంది పాల్గొన్నారు. కాని స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న స్రీల గురించి చాలా తక్కువ సమాచారం నేడు అందుబాటులో ఉంది. ముస్లిం స్రీలకు సంబంధించి,

దేశస్వాతంత్య్ర పోరాటంలో వారు నిర్వహించిన అసాధారణ భూమిక గురించి సమాచారం నేటి సామాన్య చరిత్ర పుస్తకాల్లో దాదాపుగా అలభ్యం అనే చెప్పాలి. అందుకు కారణాలు ఏమైనా గాని, స్త్రీల పట్ల వివక్ష వల్ల ఇలా జరిగినా లేక మరే విధమైన వివక్షలు దీని వెనుక ఉన్నాగాని, స్వాతంత్య్రపోరాటంలో స్త్రీలు పోషించిన పాత్ర గురించి ముఖ్యంగా ముస్లిం స్త్రీలు పోషించిన పాత్ర గురించి నేడు సమాచారం దాదాపుగా మృగ్యం.

ఈ పరిస్థితుల్లో దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన ఆ త్యాగమూర్తుల గురించి వివరాలను అనేక వనరుల ద్వారా సేకరించి రచయిత మన ముందు ఉంచారు. ముఖ్యంగా గాంధీజీ రాసిన ఉత్తరాలు, యంగ్‌ఇండియా, నవజీవన్‌ పత్రికల్లో ఆయన రాసిన వ్యాసాల్లో వచ్చిన ప్రస్తావనలు, ఈ మహిళామణుల దేశభక్తిని మెచ్చుకుంటూ ఆయన రాసిన ప్రశంసా వాక్యాలు, పలు ప్రామాణిక చారిత్రక గ్రంధాలలో వచ్చిన ప్రస్తావనలు, బ్రిటీషు రచయితలు చేసిన వ్యాఖ్యలు, స్వాతంత్య్రపోరాట యోధుల కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా జరిపిన చర్చలలో వెల్లడైన సమాచారం, పలు చరిత్ర గ్రంథాలలో, ఆత్మ కథలలో అక్కడక్కడా రచయితలు పేర్కొన్న వివరాలు తదితర వనరుల ద్వారా ఈ పుస్తకానికి అవసరమగు విషయ సామగ్రిని సేకరించడానికి రచయిత చేసిన ప్రయత్నం ప్రశంసించదగ్గది.

జాతీయోద్యమంలోని ఆగ్రనాయకత్వం మెప్పు పొందిన ఈ ముస్లిం మహిళలు ఎలాంటి స్వాతంత్య్రకాంక్షను హృదయాల్లో నింపుకుని పోరాటాల్లో పాల్గొన్నారో ఊహించడం కష్టం కాదు. ఉద్యమం కోసం తమ సంపదలను త్యాగం చేసి, శరణార్థి శిబిరాల్లో తలదాచుకుని, ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్‌ డబ్బులను తిరస్కరించి, నిర్బంధాలను, లాఠీ దెబ్బలను భరించి ముస్లిం మహిళలు ప్రదర్శించిన దేశాభిమానం చరిత్రపుటల్లో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గది. కాని దురదృష్టవశాత్తు నేటి పాపులర్‌ చరిత్ర గ్రంథాల్లో మనకు ఈ జాతిరత్నాల జీవితచరిత్రలు నమోదు చాలా తక్కువగా కన్పిస్తాయి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలోని ఈ లోటును పూడ్చడానికి బహుగ్రంథకర్త, పాత్రికేయుడు, న్యాయవాది సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ వ్యయప్రయాసలకు ఓర్చి ఈ గ్రంథాన్ని రూపకల్పన చేశారు. ఈ లక్ష్యసాధనలో విజయవంతమైన ఆయన ప్రయత్నం అభినందించదగ్గది.

ఈ పుస్తకంలో మనకు బ్రిటీషు వ్యతిరేక పోరాటాలు చేసిన స్త్రీలు, జాతీయో ద్యమంలో పాల్గొన్న మహిళలు, హైదరాబాద్‌ విలీన పోరాటంలో పాల్గొన్న స్త్రీలు, తెలంగాణా రైతాంగ పోరాటంలో పురుషులతో పాటు సమాన పాత్ర పోషించిన మహిళలు ఇలా వివిధ కాలాల్లో, విభిన్న రూపాల్లో, భిన్నపోరాటాల్లో పాల్గొన్న ముస్లిం మహిళల పాత్రల వైనం ఈ పుస్తకం ద్వారా తెలుస్తోంది. ముస్లిం మహిళలు చరిత్రలోని ప్రతి దశలోను, ప్రతి సందర్భంలోను వెల్లడించిన తమ దేశాభిమానాన్ని, స్వాతంత్య్రకాంక్షను, జాతి కోసం ప్రాణాలర్పించే త్యాగనిరతిని రచయిత ఈ పుస్తకం ద్వారా పాఠకులకు తెలియజేశారు. ఈ ప్రయత్నం దేశంలో విభిన్న వర్గాలు ఒకరి త్యాగమయ చరిత్రను మరొకరు తెలుసుకోవడానికి, ఒకరి పట్ల మరొకరు ఆదరాభిమానాలు పెంచుకోవడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. సరిగ్గా ఈ అభిప్రాయాన్నే రచయిత తన లక్ష్యంగా నిర్దేశించుకోవటం అభినందనీయం.

ఈ పుస్తకంలో పొందుపరిచిన వివిధ ముస్లిం స్త్రీల పోరాటమయ జీవిత చరిత్రలను పరిశీలిస్తే మనకు అనేక విషయాలు అవగాహనకు వస్తాయి. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో పాల్గొని బ్రిటీష్‌ సైన్యాలను ఎంతో వీరోచితంగా ఎదుర్కొని, ఆత్మబలిదానాలతో విముక్తి పోరాటాలను సుసంపన్నం చేసిన బేగం హజరత్‌ మహాల్‌, బేగం అజీజున్‌, తిరుగుబాటు యోధుల రహస్యాలను వెల్లడించ నిరాకరించి సజీవ దహనానికి సిద్ధపడిన ఆక్బరీ బేగం, ఆయుధాలు చేతపట్టి పోరాటంతో శత్రుసైని కులను ఎదుర్కొన్న పలువురు సామాన్య మహిళలు ఈ గ్రంథంలో మనకు దర్శన మిస్తారు. జాతీయోద్యమంలో పాల్గొన్న షఫాతున్నీసా బేగం లాంటి వారు భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వైనం పుట్టినగడ్డపై వారిరకున్న మమకారాన్ని చాటిచెబుతోంది. అంతేకాదు, భారతవిభజనను అధికసంఖ్యాక ముస్లిములు ఇష్టపడలేదన్న వాస్తవాన్ని కూడా తెలియజేస్తుంది. అలాగే, సహాయనిరాకరణలో భాగంగా ప్రభుత్వ గ్రాంటులతో నడిచే విద్యాసంస్థల నుంచి విద్యార్థులను బయటకు రావాలని గాంధీజీ పిలుపు ఇచ్చినప్పుడు జాహిదా ఖాతూన్‌ షేర్వానియా లాంటి మహిళలు ఈ వైఖరిని నిరసించారు. విద్యాభ్యాసం చేయవలసిన విద్యార్థులు విద్యాలయాలను బహిష్కరిస్తే వారి చదువులు ఎలా సాగుతాయని, వారి భవిష్యత్తు ఏమిటని మహాత్ముడ్నే ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఆనాటి మహిళల ముందుచూపు, అవగాహనలను మనకు పరిచయం చేస్తోంది. ఈ విధంగా స్వాతంత్య్ర సంగ్రామంలో, ప్రజాపోరాటాలలో మహత్తర పాత్రను నిర్వహించి చరిత్ర సృష్టించిన ముస్లిం మహిళల జీవితవిశేషాలు మన ముందుంచడం ద్వారా భారతీయ ముస్లిం జనసముదాయం, ముఖ్యంగా ముస్లిం మహిళల దేశాభిమానాన్ని, వారి పోరాట స్ఫూర్తిని పాఠకులకు అందించడంలో రచయిత చాలా వరకు కృతకృత్యులయ్యారు. మతసామరస్యం కోసం తీవ్రంగా కృషిచేసిన బేగం మజీదా బానో, హింద్‌ పత్రికను నడుపుతూ జాతీయభావాలను ప్రోత్సహించిన బేగం ఖుర్షిద్‌ ఖ్వాజా మన హైదరాబాది మహిళ కావడం మనకు గర్వకారణం. బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఈ ధీరవనిత జీవితవిశేషాలు నేటి తరానికి స్ఫూర్తినిస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. పత్రికలు నడిపిన నాటి ముస్లిం మహిళల్లో మరొకరు బీబీ అమతుస్పలాం. ఆమె హిందూస్తాన్‌ పత్రికను స్థాపించి జాతీయసమైక్యత, సమగ్రతల కోసం విశేష కృషిచేశారు. వివిధరంగాల్లో తమదైన ప్రత్యేకతను నిలుపుకుంటూ, దేశసేవ చేసిన ఈ మహిళల జీవితగాధలను పాఠకులకు అందించడం ద్వారా రచయిత, దేశంలోని వివిధ వర్గాల మధ్య సదవగాహనకు తోడ్పడే పుస్తకాన్ని ప్రచురించారు. అంతేకాదు, ముస్లిం మహిళలు ఇంటి నాలుగు గోడలకే పరిమితం అన్న అపోహను కూడా ఈ పుస్తకం పటాపంచలు చేస్తుంది.

ఈ విధంగా మన పూర్వీకులు జీవితవిశేషాలను అందించే రచనల్లో చారిత్రక సమాచారంతోపాటుగా పాఠకులకు విసుగు లేకుండా చదివించగల చక్కని రచనా శైలి చాలా అవసరం. ఈ రెండు అంశాలు ఈ గ్రంథంలో పుష్కలంగా కన్పిస్తున్నాయి. చదువరులను కట్టిపడేసే ప్రవాహశీల శైలితో సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఈపుస్తకం లోని సమాచారాన్ని పాఠకులకు అందించారు. అవసరమైన చిత్రాల ద్వారా అదనపు సమాచారాన్ని కూడా అందివ్వడం రచయితగా ఆయనకున్న నైపుణ్యానికి నిదర్శనం. సరికొత్త సమాచారం, చక్కని అరుదైన చిత్రాలు, ఫోటొలతో కూడిన ఈ చరిత్ర గ్రంథం మూడవ ముద్రణగా వెలుగు చూస్తుందంటే చరిత్ర గ్రంథాలకు పాఠకుల ఆదరణ తక్కువనే అభిప్రాయం తప్పన్పిస్తుంది. ఈ పుస్తకం మూడవసారి పాఠకుల చెంత చేరటం ద్వారా పాఠకాదరణ ఏ మేరకు లభించిందో వేరేగా చెప్పనక్కర్లేదు. ఈ నూతన గ్రంథానికి కూడా అంతకంటె అత్యధిక ఆదరణ తప్పక లభించగలదని ఆకాంక్షిస్తూ, ఉత్తమ అభిరుచి గల పాఠకులు ఆ ఆకాంక్షను తప్పక నెరవేర్చగలరని ఆశిస్తాను. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లింల మహత్తర పాత్రను వివరిస్తూ శరపరంపరగా చరిత్ర గ్రంథాలను రాస్తున్న శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ కలం ద్వారా ఇలాంటి ఉపయుక్త గ్రంథాలు మరెన్నో వెలువడాలని, తెలుగు భాషలో చరిత్రపరిశోధనకు ఆయన గ్రంథాలు కొత్త అధ్యాయాన్ని లిఖించాలని, ఆ గ్రంథాలు స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రకు సంబంధించిన సాహిత్యాన్ని మరింతగా సుసంపన్నం చేయాలని కోరుతూ ఆ దిశగా సాగుతున్న ఆయన ప్రయత్నాలను మనసారా అభినందిస్తున్నాను.