భారత నీతికథలు/విశ్వామిత్రుఁడు - గర్వభంగము

3. విశ్వామిత్రుఁడు - గర్వభంగము.


గంధర్వుడు చెప్పిన కథవిని పాండవులు మిక్కిలిసంతసించిరి. ఆతపతీ సంవరణులకుఁ బుట్టిన కురుని మూలంబుననే మీవంశము కౌరవవంశమయినదనికూడ నాతఁడు వారి కెఱింగించెను. అంతయువిని యర్జునుండత్యానంద భరితుఁడై గంధర్వోత్తమా ! పూజ్యులును బుణ్యభాగులును నగు మాపూర్వులకుఁ బురోహితుఁడైన వసిష్టమహర్షి మహాత్మ్యత మేమింకను వినఁగోరెదము. మమ్మనుగ్రహించి వచింపు మని ప్రార్థింప గంధర్వుండిట్లనియె.

తొల్లి కన్యాకుబ్జంబున గాధిన దనుండు విశ్వామిత్రుండను రాజుకలఁడు. అతఁడు తన పరాక్రమాతి శయంబున ధాత్రి నిరమిత్రంబుగాఁ జేసి తన్నెదుర్కొను వారు లేకుండ నిర్భయంబుగ రాజ్యపరిపాలనము గావించుచుండెను. తానుక్షత్రియుండగుటయుఁ దన్నెదిరింపగల శత్రుబలంబులు లేకుండుట యుఁదలఁచి, గాధేయుఁడు క్షత్రబలంబుకంటె మించిన బలంబులేదని గర్వించుచుండెను. ఆ గర్వాతిశయంబున నతండు బ్రాహ్మణ ప్రభావంబులను గాని తపఃప్రభావంబులను గాని లేశమును బాటింపకుండెను .

ఇట్లు రాజ్యమదాంధుఁడైన విశ్వామిత్రుం డొక్క నాడు మృగయా వినోదార్ధం బపారసేనా సమేతుండై మహారణ్యంబుల కరిగి, పెద్దయుంబ్రొద్దు వేటాడి మిక్కిలి డస్సెను. అయ్యరణ్య భాగంబున ననతి దూరంబుననే వానికొక మున్యాశ్రమము గానవచ్చినది. అయ్యాశ్రమాంతరంబున గాధేయుం డ్కొక్కింత విశ్రమింపఁ దలంచి మెల్లఁగా నచ్చటఁ జేరుకొనియెను. చేరి ప్రాంతముల సంచరించు ఋషికుమారులం బిలిచి, యతఁ డియ్యాశ్రమ మెవ్వరిదని యడుగ వసిష్ఠమహర్షిదని చెప్పి వారాతని లోనికిఁ గొనిపోయిరి. అప్పుడు మహాత్ముఁడైన వసిష్ఠుఁడు వాని రాక నెఱిగి యెదురేగ వచ్చి యర్ఘ్యపాద్యాదు లొసంగి, విశ్వామిత్రు నతిప్రీతిం బూజించెను. మఱియు రాజును సైనికులను మృగయవిహారంబునఁ గడుంగడు డస్పినవారగటచే నయ్యందఱం గూడ నభిమతాహారంబు లొసంగి పరితృపులఁ గావింపుమని వసిష్ఠుఁడు తన హోమధేనువైన నందినికి నియోగించెను.

మహర్షి యజ్ఞానుసారంబుగ - నా నందిని తన సంకల్ప మాత్రంబుననే ఘృతంబును నదిగాఁ బ్రవహంపఁ జేసెను. అన్న రాసులను బర్వతపంక్తులుగాఁ బేర్చేను. రసపూరితంబులగు బహువిధోప దంశముల ననేకములఁ గల్పించెను. వివిధ భక్ష్య భోజనంబుల సపారంబుగా సృష్టించెను. ఇట్లు తనకును లక్షలకొలఁది గల తన సేనలకును క్షణమాత్రుంబుననే చతుర్విధాహారంబులఁ బ్రసాదించి పరితృప్తులఁ గావింపఁ గలిగిన యా హోమధేనువుం జూచి, దాని యద్భుత కృత్యంబునకు విశ్వామిత్రుం డెంతయు నిశ్చేష్టితుఁడయ్యెను. ఆఁత డట్లు విస్మితుండగుచు నాత్మగతంబున అద్దిరా! శంఖంబులం బోలు కర్ణంబులును మెత్తని వలుద పొదుఁగును గుఱుచలై పొలుచు కొమ్ములును మృదువైన రోమంబులును శరత్కాల చంద్రికా సన్నిభంబైన మేనిచాయయుఁ గల యిమ్మొదవు పెన్నిధిచిక్కిన ట్లిమ్ముని కెట్లు చిక్కెను? దీని నెట్టులైన నేను దక్కించుకొందు" నని నిశ్చయించుకొనెను. అట్టి నిశ్చయముతో విశ్వామిత్రుఁడు వసిష్ఠుని సమీపించి, యిట్లనియె. “మునిచంద్రమా ! మీ యొసగిన యాతిథ్యంబున మేము కృతార్థులమైతిమి. మీ యాజ్ఞనుసారముగ నాశ్రితజనా నందినియగు నందిని సంకల్పమాత్రంబు ననే షడ్రసోపేత భోజనంబుల మమ్ముఁ బరితుష్టులఁ గావించె. సకలభోగంబులు వర్జించి యరణ్యంబులం జేరి వారిభక్షులును బర్ణభక్షులునై తవము చేసికొనుచుండు మీవంటి ఋషులకు మహదైశ్వర్య దాయకంబగు నీ హోమధేనువు వలన నేమి ప్రయోజనం బున్నది? ప్రయోజనము లేకుండుటయే కాదు. అనర్థదాయకంబునుగాఁగలదు. ఈ నందిని కల్పించు భోగంబులయందు మీ కాసక్తి వొడముచుండును. అట్టియాసక్తి వలనఁ దపోభంగము జరుగుచుండును. కామధేనువుంబోలు నిట్టి హోమధేనువు మీవంటి యుత్తమ తపస్వులకడ నుండరానిది. కావున దీనిని నాకనుగ్రహింపుఁడు. నందినికన్న నుత్తమంబులగు నొకలక్ష మొదవుల మీ కిచ్చెద.”

వసిష్ఠుఁడు వానిమాటలకు నవ్వుచు, "రాజేంద్రా ఈచిడిపి కుఱ్ఱకి లక్ష మొదవుల నొసంగనేల? వానిని నేనెట్లు కాపాడఁగలను? పితృదేవతలను మీవంటి యతిథులను దీనిచేతనే నిత్యమును సంతృపులఁ జేయ కలుగుచున్నాను. అందుచే నియ్యది యన్యుల కీయఁ బడదని బదులు చెప్పెను. తోడనే కోపస్వభావుఁడగు విశ్వామిత్రునకు వసిష్టునిపై దురాగ్రహము జనించినది. " నేను క్షత్రియుండను. నిగ్రహావగ్రహా సమర్థుండను. నీవు బ్రాహణుఁడవు. పరమ శాంతుండవు. నన్నేమి సేయఁగలవు? లక్ష్మి మొడవులనిచ్చెద నన్న నొల్లవైతివిగావున నవశ్యముగ బలిమింజేసియైనను దీనింబరిగ్రహింతు" నని పలుకుచు నందినింబట్టుకొనుఁడని తనసైనికులకు నియోగించెను. పరుల వలన భాధకలగకండ సాధుజనుల రక్షింపవలసిన రాజు తానే సాధుబాధ కుపక్రమించునెడ నింక నెవరేమి చేయఁగలరు ?

గాధేయుని యనుమతి చొప్పున నాతని సైనికులు నందినిం జుట్టుముట్టిరి. కాని యయ్యది వారికిం బట్టువడక, తీవ్రములగు వారిదండ తాడనంబులచేఁ బీడింపఁబడి యఱచుచు పసిష్ఠునొద్దకువచ్చి యిట్లనియె. మహాత్మా ! అధర్మపరులగు నిన్నరులకు నన్నిచ్చితిరే! నన్నేల యుపేక్షించితిరి? ఇది మీకు ధర్మమా? ' వసిష్ఠుడామాటల కేమియుఁ బ్రత్యుత్తరం బీయక యూరకుండె. అందువలన వాని యభిప్రాయం బెఱింగి, తన్ను వారికీయలేదని గ్రహించి; నందిని తన వత్సంబును బట్టుకొను చుండిన సైనికులవంకకుఁ బరుగెత్తెను. తోడనే తక్కినసేనలును నందిని వెంబడించెను. అప్పట్టున నా కామధేనువు విజృంభించి, మండు వేసంగిలోని మధ్యందిన మార్తాండ మూర్తియుంబోలె దుర్నిరీక్షయై యొక్క మారంగవిక్షేపంబు గావించెను. తోడనే భయంకరమగు నంగారవృష్టి కురియసాగెను. మఱియు నందినివాలంబునుండి శబర సేనలును శకృస్మూత్రములనుండి శక యవన పుండ్ర పుళింద ద్రవిళ సింహళ సైన్యములును, ఫేనంబునుండి దరద బర్బర సైన్యములును జనించినవి. ఇట్లుజనించి శత్రుసైన్యములకంటె నధిక సంఖ్యాకంబులై యాయధ్బుత సైన్యములు విశ్వామిత్రుని సేనలనెల్ల నిముసములో నేలపాలు గావించెను.

అట్టి బ్రహ్మతేజో జనితంబైన ప్రభావంబుచూచి విశ్వామిత్రుఁడు లజ్జావనత వదనుఁడై తన క్షత్రబలమును నిందించి యెల్లబలంబులకు మిక్కిలి తపోబలంబెయని తెలిసికొనెను.

చ. పొలుపగు రాజ్యసంపదల భోగములెల్లఁ దృణంబుగామదిం
    దలఁచి విరక్తుఁడై విడిచి దారుణశైల వనాంతరంబులన్
    వెలయఁ దపంబుసేసి గుణవిశ్రుతుఁడై పడసెన్ మహాతపో
    బలమున సర్వసంపదలు బ్రహ్మఋషిత్వముదివ్యశక్తియున్.