భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - మొదటి ప్రకరణము
భారత అర్థశాస్త్రము
మొదటిభాగము - వాంఛాకాండము
మొదటి ప్రకరణము
అర్థాభ్యుదయమునకు ధర్మప్రవర్తన ఆధారము
గీ. జరయు మృతియులేని జనునట్లు ప్రాజ్ఞుండు
ధనము విద్య గూర్పదలప వలయు
ధర్మ మాచరింప దగు మృత్యుచే దల
పట్టి యీడ్వ బడిన వాడువోలె. -చిన్నయ్యసూరి.
హిందువులమగు మనయొక్క శాస్త్రములు వేయితలల సర్పముల వంటివి. అనగా నవి యేవిషయమును గుఱించియైనను నొకమాటగ బల్కుటలేదు. మఱియేమన్ననో పరస్పరవిరుద్ధములగు విషఘోషలు చేయుచు నల్పబుద్ధులగు వినువారి మనస్సులకు భ్రమగల్పించునవిగా నున్నవి. విమర్శనజ్ఞానములేని మూర్ఖులు గొందఱు సత్యాసత్య విచారణమునకుం జొరక ఇదియునిజమే, అదియునిజమే, ఇంకను ద్రోవబోవువాడేమైన జెప్పిన నదియునిజమేయనియెంచి మూడభక్తియను పంకమున బొరలాడుచు నంతకే కృతార్థులమైతిమని యెంచి తృప్తిజెందినవారై తెలిసినవారు దమ్ముజూచి నవ్వుచున్నారు గదాయను శంకయులేక కాలంబుగడుపుచున్నారు ఇది యెంతయు జింతనీయము. చూడుడు. జనసామాన్యముచే నైదవవేదమని ప్రమాణతమగ్రంధముగా గొనియాడబడు మహాభారతములో అహింసా విషయక ప్రసంగము లనేకములున్నవి. అందు కొన్నిచోట్ల హింసచెడ్డదనియు, మఱికొన్నియెడల నదియంతగా జింతింపవలసిన విషయముగాదనియు, వ్రాయబడివున్నది. అట్లే అర్థంబునుగూర్చియు, సృష్టికి జ్ఞానంబును, స్థితికి నర్థంబును, లయంబునకు దమోగుణంబును ప్రధానంబులని త్రిమూర్తులయు దద్భార్యలయు నామవ్యవహారంబులే చాటుచున్నవిగదా ? ఈషణత్రయంబులలో నొకటి యగుటచే ధనమునం దాసక్తితగదనియు, మఱియు నర్థంబు చతుర్విధపురుషార్థంబులం దొండగుట నవశ్యంబు గాంక్షింప దగినదనియు నదేభారతమున జెప్పబడియున్నది. ఇం దేమాట నమ్మవలయు ? నేది విడువ వలయు ? ఇట్లొక విషయమేకాదు. అన్నియెడలను మనశాస్త్రంబులలో నొకటి కొకటి సంబంధములేని యిట్టి ప్రలాపములు పెక్కులు గలవు. కాన నాశాస్త్రవిచారణ యటుగట్టిపెట్టి మనుజులకు స్వతస్సిద్ధమగు బుద్ధి నుపయోగించి పురుషార్థములలో నెల్ల నిప్పటికి ముఖ్యమగు నర్థముయొక్క తత్త్వమును గ్రహించుట ప్రధానకార్యంబు.
అర్థార్జనము సర్వపాతకంబులకును కారణభూతంబని యనేకులు నమ్మెదరు. అందులకు నిమిత్తంబు లేకపోలేదు. అబద్ధములు చెప్పుట, దొంగతనమునకు బూనుట, అన్నదమ్ములతోను, బంధువులతోను గలహించుట మొదలగు చెడుకార్యములను మనుజు డవలంబించుట యర్థము నాసించియేకదా ! నిజమేకాని మఱి ధనసంపాదనమునకు మంచిత్రోవలులేవా ? చూడంబోయిన నీయాక్షేపణ ధనము నార్జించుట మాత్రమున కననేల ? ఇతర పురుషార్థము లన్నిటికిని జేయ వచ్చును. మోసముచేసి విద్యను గడించువారు లేరా ? మనవారిలో వివాహకాలమున వేలకొలది దబ్బఱలాడుట సదాచారములలో నొకటిగ నుండలేదా ? అట్లగుట నెపంబుగ విద్యావివాహములు విసర్జనీయములని వాదింప గూడునా ? ఇంచుక యాలోచించినచో,
"ఎద్దానిఁ జూడఁ బోయిన
నద్దానన్ గీఁడు మేలు లమరియ యుండున్"
ఇంతేకాదు. మొత్తముమీద ధర్మగుణము లెక్కువగ నుండిననేగాని యెట్టివారును నైశ్వర్యవంతులు గానేరరు. సత్యము, ధైర్యము, దమము, దీర్ఘదర్శిత్వము ఇత్యాద్యుత్తమ గుణంబులు ఏదేశమున మిక్కుటముగ నుండునో యందేగాని యితర రాజ్యంబులలో లక్ష్మీ స్థిరముగ నెలకొనదు. ఒకానొకడు తనునమ్మినవానినో, చెలికానినో, భాగస్థునినో యేమరించి వానిసొత్తులు గ్రహించి యైశ్వర్యవంతు డేలకాగూడదని యేరైన నడుగవచ్చును. ఇదియొక విధముగ నిజమేయైనను ఈరీతినే యొక దేశములోని జనులందఱు శ్రీమంతులగుదురనుట యసంభవము. ఇందునకొక నిదర్శనము. గ్రామములలో రెడ్లు మొదలగు ప్రబల పురుషులు ఊరివారి హింసించి వారు కష్టించి గడించిన సొత్తుల నన్యాయముగ నాక్రమించుకొని ధనవంతు లైనందుననే గ్రామ మంతయు మంచిస్థితిలో కళగలిగి యున్నదని చెప్పవలనుపడునా ? కాదు. అట్లే గ్రామములో నొకరిద్దఱు రెడ్లు ప్రబలస్థితిలో నుందురో యా యూరనుండు తక్కినకాపులు తినుటకు గడ్డియైనలేని బీదలుగ నుందురనుట మనమెఱిగినదేగదా ? ఈ రీతి నొకరిరువురు గొప్పగా నున్నను మిగత జనసంఘమంతయు హీనదశకు వచ్చుననుట స్పష్టము. మఱియు సంఘము శిధిలమైనచో నేనాటికైన నాగొప్పవారికిని చేటు మూడుట నిశ్చయము. ఇదియును మన కనుభవమునకు వచ్చిన విషయమే. ఊరిలో పులిమాదిరినుండు రెడ్లు కాలక్రమమున బోలీసువారియొద్ద పిల్లులుగను, వకీళ్ళయెదుట కుక్కలుగను, న్యాయాధీశుల సముఖమున నక్కలుగను ఉండుట ప్రసిద్ధాంశమేకదా ?
మన గ్రామము లెట్లో దేశములు నట్లె, రాజులు, పాదుషాలు, నవాబులు మొదలగువారు స్వప్రయోజనపరులై జనుల సుఖ దు:ఖంబుల గణింపక యిచ్ఛవచ్చినట్టు ప్రవర్తించి మితిమీరిన పన్నులు విధించి యన్యాయార్జిత విత్తంబుచే నుత్తమములగు నగరులు సింహాసనములు నగలుచేయించి తామే భూలోక దేవేంద్రులమని విఱ్ఱవీగి నందులకు ఫలము గానకపోయిరా ? ప్రజలకు బలక్షయమగుడు దమకు రాజ్యక్షయమునాయె. దేశమునకు దారిద్ర్యము గలుగుడు దామును బరతంత్రవృత్తుల శరణ మాశ్రయింపవలసినవారైరి. క. ధనమునకై ధర్మము దెస
ననాదరముచేసెనేని నా నృపతికి వ
ద్దనమును జెడు దుర్యశముం
బనుగొను దుదిదుర్గతియును బాటిలుననఘా.
అను భారతనీతికి ఇండియాదేశపు ప్రాచీనరాజుల చరిత్రంబులు విస్పష్ట ప్రమాణంబులు.
కావున దారిద్ర్యమనునది సుగుణములవలన గలుగు ఫలము గాదు. మఱి దుర్గుణముల ఫలమే. ఏదేశమున బీదతన మెక్కువగ నున్నదో యా దేశము జనుల దుర్మార్గావలంబనముననే యట్టి దశకు వచ్చెననుట నిర్వివాదాంశము. ఏమియు లేనివాడు తప్పుచేయడనుట నిజమేకాని, తప్పుచేయనందున ఏమియు లేనివా డయ్యెననుట నిశ్చయముగాదు. బీదలు విధిలేక మంచివారుగా నుండిననుండవచ్చు గాని, అది కారణముగ మంచివారెల్లరు బీదలుగా నుండవలయుననుట యసంబద్ధప్రలాపము. దీనినే మఱియొకరీతిని దృష్టాంతీకరింపవచ్చును. మంచిప్రాయమున బసవెద్దురీతిని వర్తించి వ్యాధిగ్రస్తుడై అన్నియు నుడిగి యొకడు కాలక్షేపార్థము వేదాంత వాదంబులకు దొడగి విభూతిధారణం బొనరించినంతనే, బలహీనత సత్ర్పవర్తనకు మూలాధారభూతంబని సిద్ధాంతము జేయబూనుట హాస్యాస్పదముగదా ? తొలుతనుండియు మంచిత్రోవనేయుండిన బలహీనత యేల సంభవించును ?
ఈ హిందూదేశము తొలుత మంచిస్థితిలో నుండినది. కాలక్రమేణ జాతిమతాదిభేదములు ప్రబలమై, మూడభక్తిదురాచారములు జనులబుద్ధిని మెండుగ నాక్రమించుటజేసి, మనవారు పౌరుషం, ఐకమత్యము పోగొట్టుకొన్నవారై, పరులపాలై తన సర్వస్వమును గోలుపోయి తుదకిట్లు నిరంతర దారిద్ర్యస్థితి ననుభవింపవలసివచ్చిరి. 'తమకంపు తమకింపు' అను సామెత ప్రకారము ఈ దారిద్ర్యమే మిగుల గొప్పదశయనియు, మోక్షసాధనమున కెత్తిన యుపకరణమనియు బ్రసంగింపబూనిరి. 'తనకు నందని ద్రాక్షపండ్లు పుల్లనివి' యని నక్క యనుకొన్న ప్రకారము ధనము నీషణమనియు దదార్జనమునకై శ్రమపడుట యనంతములగు దు:ఖములకును, పాపములకును గారణమనియు నట్లగుట నది వర్జనీయమనియు వాక్రుచ్చిరి. ఈసిద్ధాంతములలో నొకింతయైన నిజము లేదనుటకు వారి వర్తనమును శాస్త్రములునే ప్రబలప్రమాణముగ నున్నవి. అదియెట్లనిన:-
దానము పుణ్యకర్మలలో నెల్ల నెత్తినదిగా వర్ణింపబడినదిగదా? బ్రాహ్మణులకు భూరిదక్షిణలొసగి తృప్తులగావించిన (ఇది యెవరిచేనైన నగునా !) తప్పక స్వర్గసిద్ధి యగునట ! అవునుగాని భూరియే లేనిది భూరిదక్షిణలెట్లు ! వనప్రతిష్ఠ, దేవాలయములు గట్టించుట, పెండ్లిలేనివారికి బెండ్లిచేయించుట, పెండ్లియైనవారికి శాంతి ప్రస్తుతం గావించుట మొదలగు ధర్మకార్యముల కన్నిటికిని ధనములేకున్న సాగదుగదా ! కావున ధనార్జనంబు కూడదగుట మూడమతంబు. మఱియు సన్యాసము నవలంబించుట చాల గొప్పకార్యమందురే. సన్యసించుటయననేమి ? తనకుగల సమస్త పదార్ధములను విసర్జించుట యని యర్థముగదా ! ఏవస్తువులేకున్న దేనిని విసర్జింపనగును ? ఎట్లు చూచినను అర్థార్జనం బవశ్యకర్తవ్యంబు
ఐరోపాదేశీయులింత ప్రబలస్థిలో నుండుటకు వారి దుర్గుణములు దౌష్ట్యమును గారణములని తెలిసి తెలియనివా రనుకొనెదరు. ఇదియెంతమాత్రము నమ్మదగిన యూహకాదు. వారిఘనతకు వారి సుగుణములే కారణములు. ఎట్లన్న మనదేశములో నంగడికిబోయి వస్తువులు కొనవలయునన్నచో నరగంటసేపు బేరమాడవలసివుండును. ఇందుచే గాలయాపన మగుటయేకాక నమ్మకము జెడుచున్నది. ఇంగ్లీషువారి షాపులలో నెవరుపోయినను నికరమైన వెలయొకటే. కావున వారిలో కొనుట అమ్ముటయన బహుత్వరలో జరుగును. మన జనులు రెండుబేరములు ముగించులోపల వారు నూరుమందితో వ్యాపారము జరుపగలరు. మోసముజేసి యార్జించి యేదేశమువారును వృద్ధిజెందరని పూర్వమే నిర్ణయింపబడియె. చూడుడు ! ఇంగ్లాండు దేశమెక్కడ, ఇండియా చీనా జపాన్ అనుదేశము లెక్కడ ! వారు తెల్ల వారు, క్రైస్తవులు, వర్ణమతభాషాది విషయములలో మనకు వారికి నేలాటి సంబంధమునులేదు. ఇట్లుండియు వారు ప్రపంచమంతయు వ్యాపించిన బేహారము నడపెదరు. సత్యములేనిది సర్వవ్యాపిత్వము సిద్ధించునా ? యోజింపుడు. నేరుగా మాటలాడి బేరము చేయుటకు వీలులేదుగదా ? నేరు బేరములేని వ్యాపారము నమ్మకముమీదగాక మఱెట్లు సమకూరును ? యోగ్యత, న్యాయము, నాణెము ఇవి మొత్తముమీద ప్రసిద్ధములుగ నుండకుండిన నమ్మకము కలుగుట యెట్లు ? చెడ్డనుండి మంచివచ్చుట దుర్లభము. మంచికి మంచియే కారణము. ఐరోపియనులు పరరాష్ట్రముల నన్యాయముగ నాక్రమించి తన్మూలమున ధనికులైరని కొందఱనెదరు కాని యిదియు విచారించిచూచిన వారికి గౌరవావహమైన విషయమే కాని లజ్జాకరంబుగాదు. పరరాష్ట్రముల నాక్రమించుటకు వలయు సాధనములెవ్వి ? వీరులైన భటులు, యుద్ధోపకరణములగు ఫిరంగులు మొదలగువాని తత్త్వము నెఱింగి నానాటికి వృద్ధిసేయు ప్రకృతి శాస్త్రజ్ఞులు, ముందు వెనుకలు విచారించి సమయాసమయములు గుర్తింపనేర్చిన మంత్రులు, సీమాంతరములలో నెవరైన గ్రొత్తగా నేదియైన గనిపట్టిన దానిని గ్రహింప నుత్సాహముగల విద్యార్థులు, ఐకమత్యము, స్థైర్యమునుగల జనులును ఇట్టి లక్షణములును, సాధనములును నుండినగాని పరరాజ్యముల నోడించుటకు సాధ్యమగునా ? కూపస్థమండూకములట్లు ఒకచోటికినిబోక నూతన విషయములు గ్రహింపక, పెద్దలమార్గములోనే యుండెదమను మూర్ఖులు పెద్దలతోనే కలిసికొందురుగాని యీ లోకమున దమకును దమదేశమునకును కీర్తికరములగు పనులగావింపనేర్తురా ? మఱియు బూర్వము నిష్కారణముగ రాజసూయార్థము దిగ్విజయము జేయవలయునను పేర జుట్టుప్రక్కలనుండు చిన్న రాజులపై దండెత్తి వారి సంపదలను గొల్లగొట్టి తమబొక్కసము నించుకొనుచుండిన యుధిష్ఠి రాదులను బొగడు మనము యూరోపియనుల నేటికి నిందింతుమో తెలియరాకున్నది. ఈర్ష్యచే మనకున్న నెక్కువగనుండువారిని దూషింపక, ఇది మనకర్మమని మిన్నకుండక, స్వప్రయత్నముచే వారివలె నౌన్నత్యము వహింప జూచితిమేని అదియే మగతనము.
ధర్మమేజయమందురుగదా ? కనుక జయము స్థిరముగ నుండుచోట ధర్మమున్నదనుట కేమిసందేహము ? హిందూదేశమున జయమెన్నడో మాయమాయెను. ధర్మమంతకుమున్నే మాయమయి యుండును. కావున నర్థాభివృద్ధికి నాధారభూతమగు ధర్మమును బునరుద్ధారణ మొనరించి యందుమూలమున జయము సంపాదింప బ్రయత్నింప వలయును.[1]
ఈ ధర్మము నుద్ధరించుటకు దగిన సుగుణము లెవ్వియనిన - 1. కాయకష్టము. 2. యోగ్యత, నమ్మకము. ఇవిరెండును బరస్పర కారణములు. యోగ్యతలేనిదేశములో నమ్మకముండదు. నమ్మకము లేనిచో యోగ్యతయుండియు ఫలములేదు గాన యోగ్యతయు నుండదు. 3. ప్రకృతిశాస్త్రవిచారణము. నీటియావిరి, విద్యుచ్ఛక్తి, లోహములుగలచోటులు, వానిగుణంబులు, మొదలగు విషయంబుల నెంతో శ్రమకోర్చి పరిశీలించినందుననే యూరోపియనులు యంత్ర నిర్మాణమున నిపుణులై యపారమైన వ్యాపారమును నడపు శక్తిగల వారైరి. 4. దీర్ఘదర్శిత్వము. అనగా ముందు విచారణ. ఇంగ్లాండు, అమెరికాదేశములలో ఇంక నూరేండ్లకుగాని ఫలమునియ్యని గొప్ప గొప్ప పనులలోను ప్రవేశింతురు. తమకు లాభములేకున్నను బుత్ర పౌత్రాదులకైన మేలుకలిగిన జాలునని కష్టింతురు. అంతటియోర్పు, జ్ఞానము, పరోపకారబుద్ధి మనవారిలో నంతగా గానరాదు. 5. ధైర్యము, కర్మలు, వాణిజ్యము, వీనిలో మూలధనము వినియోగింపవలసియున్నది. ఒకవేళ నష్టమువచ్చి యీ ధనము మునిగిపోయినను బోవును. ఖండితముగా లాభమే కలుగునను నిశ్చయ మేకృషిలోనులేదు. అట్టిపనులకు ధైర్యములేనివారు, నెలనెలకు నియమముగ జీతము లభించుగాన తఱుచు రాజకీయోద్యోగముల నాసింతురు. ఇంగ్లాండులో పట్టపరీక్షలదేరిన విద్యావంతులుసైతము మనదేశములోబలె గుంపులు గుంపులుగా గవర్ణమెంటు సేవలో జొరరు. అపాయమున్నను సంపాద్యము ఎక్కువ గావచ్చునను కోరికచే స్వతంత్ర వ్యవహారవృత్తుల నవలంబింతురు.
ఈ విషయ మిక ముందును జర్చింపబడుగాన నిక్కడ నింకను విపులముగ వ్రాయునవసరము గానము. "ధర్మార్థంబులు పరస్పరహేతువులు" అనుట యీ ప్రకరణముయొక్క ముఖ్యాంశము.
- ↑ ధర్మమనగా యదార్థధర్మముకాని వర్ణాచారములనబడు దప్పుత్రోవలుకావు. వీనింగూర్చిన చర్చకై అధికప్రకరణముం జూడుడు.