భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - మూడవ ప్రకరణము

మూఁడవ ప్రకరణము

అర్థలక్షణము

ఇక నర్థస్వభావంబు నిర్ణ యింపవలయు. అర్థంబన ద్రవ్యము మాత్రమే కాదు వాంఛాపూర్తికి నిమిత్తమాత్రమగు మూల్యసహిత వస్తుసముదాయంబంతయు నర్థంబునాబడు. తోటలు, పొలములు, ఇండ్లు, ఎద్దులు మొదలగునవియన్నియు రూప్యంబులబోలె నర్థములే. కానుకలుండువారేగాక సామగ్రులు సమగ్రముగా గలవారు సైతము భాగ్యవంతులనబడుదురు. ద్రవ్యమనగా క్రయవిక్రయంబులు సులభముగ జరుపుకొఱకు సాధనమగు నాణెములమొత్తంబు ప్రకృత మీదేశములో రూపాయలు, సవరనులు, అణాలు, పైసలు నాణెములుగా నుపయోగింప బడుచున్నవి కొన్నిదేశములలో పైసలకన్న దక్కువనాణెములుగా చిల్లిగవ్వల వాడెదరు అమ్ముటకును గొనుటకును ననుకూలముగనుంటయే ద్రవ్యసామాన్యలక్షణంబు

అర్థమునకు వాంఛాపూర్తియే ప్రయోజనంబు, ప్రయోజనమునకురాని యేవస్తువుగాని యర్థముగా బరిగణింపబడదు. ఉపయోగ సహితమైనది యర్థంబు కావచ్చును. తద్రహితమైనది వ్యర్థంబు.

అర్థంబువలన మనకు గలుగు సుఖంబు ద్వివిధంబు. తృష్ణ శమింపదేని బాధాగానుండునుగదా ! ఆబాధను నివారించుట యొకటి; ఇచ్ఛాపూర్తియైనందున సంతోషము జనియించుట రెండు. తృష్ణా శమనంబునకును సంతోషజననంబునకును అనుగుణమైనది యర్థంబు.

వాంఛ లుత్కృష్టంబులనియు నికృష్టంబులనియు రెండు విధములు. దేశమునకును దనకును వృద్ధికరములైన కోరిక లుత్కృష్టంబులు; కర్తవ్యములు కల్లుద్రావగోరుట, జూదమాడజూచుట మొదలగునవి నికృష్టములు. కావుననే యవి వ్యసనములు నాబడు.

ఈ తారతమ్యము మిక్కిలి ముఖ్యమైనదే యైనను నీతిశాస్త్రమునకు జేరినదికాని యర్థశాస్త్రమునకు సంబంధించినదికాదు. వాంఛల యుక్తాయుక్తతలను విచారించుట నీతిశాస్త్రపుబని. వాంచలెట్లున్నను తచ్ఛాంతికి సాధనములగు వస్తువుల నర్థములని భావించుట యీ శాస్త్రమున నావశ్యకము. ఇందులకు గారణములు :- అర్థములు చెడ్డవైననుసరే మంచివైననుసరే సామాన్యలక్షణములు కలవిగానున్నవి. చూడుడు. సారాత్రావగోరువాడును ఇల్లుకట్టి పత్నీ పుత్రులను బోషింపజూచు నరునిబోలె పాటుపడవలసినవాడే. అనగా 'అర్థార్జనంబునకు శ్రమ ఆధారభూతంబు' అనుట సామాన్య న్యాయంబు. ఇట్టి సామాన్యన్యాయంబులు పెక్కులు గలవు. వీనిని విమర్శించుటయే యర్థశాస్త్రముయొక్క ముఖ్యోద్దేశము.

మఱి నీతిశాస్త్రమట్లు ఇది యుపదేశ శాస్త్రంబుగాదు. ఏకారణములకే కార్యములు ఫలంబులు, ఏకార్యములకే కారణములు మూలంబులు, ఏహేతువులంబట్టి యేసిద్ధాంతములను నిర్ణయింపనగును, ననువిషయములను విచారింతుమెకాని 'ఇట్టికార్యము చేయవలయును, ఇట్టికార్యము చేయరాదు' అని యుపదేశించు ప్రతిజ్ఞ మనదిగాదు. శాస్త్రంబును ఉపదేశ నిర్దేశములని రెండువిధములు. నిర్దేశశాస్త్ర మనగా వస్తువుల లక్షణములను తత్సంబంధములను తెలియజేయునది. కర్తవ్యాకర్తవ్యబోధకమైనది యుపదేశశాస్త్రంబు ఇందుకు దృష్టాంతము.

రసాయనశాస్త్రంబు పాషాణముయొక్క గుణములను వివరించును శారీరశాస్త్రము ఆ పాషాణమును భుజించినచో దేహములో నేయేమార్పులు కలుగునో వానిని బ్రకటించును. ఇవి రెండును నిర్దేశ శాస్త్రములు ఇక 'బాషాణము మనుజులకు బెట్టవచ్చునా, కూడదా ? ఎందుచేత నది పాపకార్యంబని యెన్నబడును ?' అను విచారములు ఉపదేశశాస్త్రంబైన నీతిశాస్త్రమునకు సంబంధించిన విషయములు. ప్రకృతము మన యర్థశాస్త్రమును రసాయన శారీరకాది శాస్త్రములట్లు నిర్దేశశాస్త్రమని యెన్నవలయును.

కావున వాంఛల విషయమునగాని అర్ధంబుల విషయమునగాని యోగ్యతాయోగ్యతలను చర్చించుట యీ శాస్త్రమున నధిక ప్రసంగము. ఐనను మనుష్యజీవితమునకు బరమాప్తంబైన శాస్త్రము గావున నట్లుచేయకుండుట పొసగను బొసగదు. సాధ్యంబునుగాదు. మఱియు నిష్టార్థముల నీడేర్చుటకు నిజంబుగ శక్తిమంతములు గాకపోయినను శక్తియుక్తములని నమ్మితిమేని జాలును. అయ్యవియు నర్థంబులుగ నెన్నబడును. అనారోగ్యముచే బీడితుడగు నరుండు దేహముతోడ బుద్ధిబలంబుం గోలుపోయినవాడై యౌషధముల వలనం గానిపని సిద్ధి మణిమంత్రంబుల చేనగునని తలంచి భూతవైద్యులకు వారడిగినంత కానుక లొసగునుగదా ! కావున నట్టి బూతులను జీవనోపాయము లౌటజేసియు మూల్యయుక్తంబులు. గావునను అర్థంబు లనబడవలయు.

సరూపములగు వస్తువులేకాదు. క్రియలుసైత మర్థింపబడినచో నర్థములగును. తలిదండ్రులు తమకుమారుని యభివృద్ధిగోరి శిక్షా నిపుణుండగు విద్యావంతున కెంతైనధనంబొసగి ఉపాధ్యాయుడుగ నుండ వేడికొందురుగాదె ? గురుండైనవాడు పదార్థములనమ్ము వ్యాపారివలె నిజపాండిత్యము నితరులకిచ్చి తాను అదిలేనివాడు కాకపోయినను, దానంబుట్టు ప్రతిభావిశేషమున కితరులను బాత్రులుగ జేయును. వ్యాపారి పదార్థముల నమ్మెనేని తనకవి లేకపోవుట తటస్థించును. విద్య, ఆరోగ్యము, దేహబలము, వీని నారీతిని విక్రయించుట సాధ్యముగాదు. అయినను తత్సంభవములగు ఫలముల నితరులనుభవించునట్లు చేయవచ్చును బలవంతుడైనవాడు దుర్బలుడగు సాహుకారియొద్ద గేహరక్షకుడుగానుండి వాని దౌర్బల్యము వలన గలుగు బాధలను నిరాకరింపగలడుగాని తనబలము వానికిచ్చి వానిని పరాక్రమవంతునిగా జేయనేరడు. క్రియాజన్య ఫలంబులను పరివర్తింపనగునుగాన క్రియలు నర్థంబులనియే భావింపవలయును.

ప్రయోజనత్త్వంబు అర్థత్వంబునకు బ్రధాన కారణంబనుటయు, విత్తోపార్జనంబున కనుకూలములగు క్రియలును అర్థంబులనబడు ననుటయు విలువగలిగినవన్నియు నర్థంబు లనుటయు నీప్రకరణములోని ముఖ్యాంశములు అర్థత్వమునకు మూల్యవత్త్వము ప్రధాన లక్షణము. కావున నర్థము, మూల్యము, ప్రయోజనము వీనికుండు సాంగత్యము నెఱుంగుట ఈ శాస్త్రమున విఘ్నేశ్వర ప్రార్థనవంటిది.