భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - పదియవ ప్రకరణము
ఉత్పత్తికాండము - ప్రకృతి
పదియవ ప్రకరణము
ఉత్పత్తికి మూలాధారములు
ఉత్పత్తికి మూలాధారములు రెండు. ప్రకృతియు పౌరుషమును. నిసర్గజ వస్తుసముదాయంబు ప్రకృతి. పురుషోద్యోగంబు పౌరుషంబు. దీనికే శ్రమయనియుం బేరుకలదు. ఇవిరెండును క్షేత్రబీజములట్లు అన్యోన్యసహకారులైనంగాని ఫలంబు సమకూరదు. స్వచ్ఛందముగ నింటిముంగిట మొలచిన కూరలు సైతము మనము సంగ్రహించి కొనినంగాని భోగ్యములుకావు. ఎంతలేదన్నను సంగ్రహవినియోగములైన నుండితీరవలయును. సంగ్రహములేకున్న నర్థములు ప్రాప్తింపవు. వినియోగములేకున్న నర్థములు లభించియు ఫలము లేదు.
శ్రమ ద్వివిధంబు. దేహశ్రమ. మనశ్శ్రమ. శ్రమవంతులుగాని పురుషుల కేపురుషార్థములును లభింపవు.
కొందఱు సర్వము దైవికంబందురు. ఇందు నిజంబు గానము. సర్వమును దైవికంబేయయిన మనుష్యప్రయత్నమును దైవికమె యగుగాన నది కూడదనుట విరుద్ధవాదము. దైవికంబని యాహార నిద్రల మానియున్నవాని నెవరు నెఱుగరు. సోమరిపోతులు తమ పరముగా జేసికొన్న రాద్ధాంతములలో నిదియొకటి . ఇది నిజమేయైన పక్షమున ధర్మాధర్మముకు భేదము లవమాత్రము నుండదు. కామక్రోధాదులును దైవికములే యగునుగాన వాని నరిషడ్వర్గములని యంటిమేని దేవుడు తనకుదానే శత్రువనియు, ఆత్మహత్య జేసికొనుటలో జాల సమర్థుడనియు జెప్పవలసి వచ్చును. ఇది యటుండనిండు. భూదేవికి వసుమతి, రత్నగర్భ యను నామములు గలవు గాని తనంతట వస్తువులుగాని రత్నములుగాని మనకు గొనితెచ్చి యిచ్చునంతటి కరుణాశాలినిగాదు. మఱేమన్న శ్రమించువారికేకాని యితరుల కెట్టిఫలము నొసగదు. ఈ ప్రపంచమున నణగియుండు ప్రయోజనములన్నియు శ్రమార్జితములేకాని యూరక దొరకునవికావు.
మనుష్యునకు వస్తువును సృష్టించు ప్రభావములేదు. విశ్వామిత్రునకు బిదప వడ్లు, రాగులు, లోహములు, కొయ్య మొదలగు నురువుల నుత్పత్తిజేయు బ్రహ్మతేజము గలవా డెవ్వడునులేడు. ఇక మనమహిమచే సాధ్యము లెవ్వియన వస్తువులలో లీనమైయుండు స్వాభావికశక్తులను ఉచితరీతి నడచునట్లుచేసి యందలి ప్రయోజనమును వెలిపుచ్చి వినియోగ్యములుగా జేయుటయే. దీనికి దృష్టాంతము. సేద్యమననేమి? స్వభావసిద్ధములైన నీళ్ళు, నేల, విత్తనములు వీనిని తావుమార్చి యొకతీరున నుండునట్లు జేయుటయేకదా! పయిరు మొలకెత్తి పెరిగి పంటకువచ్చుట ప్రకృతశక్తుల వలనగాని మనశక్తులచేగాదు. బల్లలుచేయుట యనగానేమి? మనుజ కృత్యముగాని కొయ్యలనుకోసి, తుండ్లుగా ఖండించి యొకవిధముగా జేర్చుట. వస్తుకోటిలో నంతర్యామిగానుండు ఆకర్షణశక్తిచే నవి కలసినట్లుండును. అగ్నిజలవాయువిద్యుదాదుల గుణమ్ములు మన కనుగుణమ్ములుగ జేయుటయే మనుజుల ప్రభావము. వస్తువుల రూపములను తావులను మార్చుటయే కార్యసిద్ధికి నియతవిధానము.
నైసర్గిక స్వభావములు
నైసర్గిక స్వభావము ప్రతివాని స్వంతమగు ఆస్తిలో జేరినదికాదు. అయినను పదార్థములయొక్కయు జనసమాజములయొక్కయు నిర్ధారణవలన దేశైశ్వర్యస్థితిని నిర్ణయించు కారణములలో నొకటిగా నున్నది. దేశములో నుత్పత్తియయి వ్యవహారములచే దయారుచేయబడుట కుపయోగించు సస్యములు, లోహములు, జంతువులు మొద లగునవి భూమియొక్క శీతోష్ణ స్థిత్యాదుల ననుగమించియున్నవి. ఇంతేకాదు. జనుల స్వభావములు సైతము కొంతవఱకును దేశస్థితి ననుసరించియుండును.
శీతోష్ణస్థితి
ఉష్ణమువలన మధ్యాహ్ననిద్ర, సోమరితనము అలవడును. భూమి మిగుల సారముగల్గియున్న గొంచెముగా దుక్కిచేసి విత్తులు చల్లినను అధికముగ పంటలు పండును. ఇందుచేతను పరిశ్రమ యధికముగ నక్కఱలేనందున జనులు చుఱుకులేనివా రగుదురు. మనపూర్వులు మునుపు గంగా ప్రాంతముల నాక్రమించి స్వాధీనము చేసికొన్నందున, ఆ భూములు సహజ సస్యాఢ్యములౌటచే బనిపాటలు చాలించి కాలక్రమమున దోస్సార మనస్సత్వవిరహితులై మందులై పౌరుషహీనులై పౌరుషము లేకుండుటయే పరమధర్మంబని వాదించు నంతటి క్షీణతకు లోనైరి. ఇంగ్లాండునందు చలి మిక్కుటముగాన ఎంతో కడంకమై ప్రయాస పుచ్చుకొనినంగాని దేహమున నుడుకెత్తి చెమటబట్టి యారోగ్యము గలుగదు. మఱియు నిక్కడికన్న నక్కడ జీవితాధారములు (కంబళ్ళు, బనాత్ చొక్కాయలు మొదలగునవి) యెక్కువ గావలయుగాన నల్పసంపాదనమున దృప్తిజెంది చెట్ల క్రింద బరుండి గుఱక లిడి నిద్రించుటకు వలనుపడదు. కావుననే యూరోపియనులు మనకన్న నెక్కువ దేహసత్త్వమును మనస్థైర్యమును పట్టుదలయు గలవారుగానున్నారు. మనమున్నట్టుండి బహుపరాక్రమముతో నారంభశూరులమై కొంతసేపుపనిజేసి అనతి కాలమ్మున నలసటగొని శ్రద్ధ చాలించి మఱల నెంతవడికోకాని పనికి బూనుకొనము. ఇంగ్లాండులో జలి యొకటియేకాదు. భూమియు నిటవలె నచట బోతరించినదికాదు. కావున నొడలు వంచి శ్రమతో సేద్యము జేయ నిది ఫలప్రదంబు గాజాలదు.
మనరాష్ట్రములో నెన్నిసత్తువ లున్ననేమి? ఆశంసగలిగి మహోత్సుకత శ్రద్ధాళువులై యనవరత ప్రయత్నముం జేయుచు బ్రకృతిశాస్త్రపరిశీలనమ్మున వాని నుపయోగమునకు దెచ్చు తెఱంగు లెఱింగి కష్టనష్టము లెన్నికలిగినను ఉత్సావాహీనులుగాక, యుద్యోగము నెఱవేరినంగాని యుద్యమము సమాప్తి నొందింప మను స్థిరచిత్తము గలవార లున్నంగాని దేశమున కభ్యుదయము ప్రాప్తింపదు.
నైసర్గికస్వభావములు ప్రతివానికిని ఆస్తిగాకపోయినను దేశాభివృద్ధికి గారణములై తద్ధ్వారా మనకును మేలుదెచ్చును. ఎట్లనిన గోదావరీనది నీదికాదు. నాదియుగాదు. ఐనను తత్ప్రవాహమున ఫలవంతములైన లంకలు నేలలు ఉండబట్టి యచటి వారు ధనికులుగ నున్నారు. ఇందుచే వ్యవహారములు వ్యాపించి బీదసాదలకు జీవనోపాయము గల్పించునవిగానున్నవి.
దేశములలో దారతమ్యనిరూపణ జేయబూనితిమేని నైసర్గిక స్వభావములను లెక్కకు దేవలయును. ఏకదేశస్థులలో నెక్కువ తక్కువల జర్చించుచో నివి యెల్లరకును సామాన్యములే యగుట నట్లుచేయుట తగదు.
ప్రకృతులు పారాపారములని రెండువిధములు
మేరగలవి మేరలేనివి యని ప్రకృతులు రెండువిధములు. అందు గాలి మేరలేనిది. ప్రతివానికిని కోరినంత దొరకును. గాన దానికి మూల్యము సాధారణముగలేదు.
ప్రకృతులలో అనంతములు గానివి యెక్కువ ముఖ్యములు. మితరాశియుక్తములుగాన ఒకరికెక్కువయైన దదితరులకు దక్కువ యగుట సంభవించును. అంత్యప్రయోజనమును మూల్యమును అధికముగ గలవి గాన నివి సర్వజనాదరణీయములై పోటాపోటిని బుట్టించునవిగా నున్నవి. భూమియు నాకాశమువలె నక్షయముగా ననంతముగా నుండిన ఒకరిభూమి నొక రాక్రమించుకొనుటయు 'ఇదినాది అదినాది' యని స్వామ్యమును స్థాపించుటయు, రాజులు ఒకరితోనొకరు యుద్ధము జేయుటయు సంభవింపవు. మితత్వమే స్పర్థాదుల కుత్పత్తి స్థానము. మితప్రకృతులలో గణ్యములైనవి గనులు, వనములు , నదులు, క్షేత్రములును. (క్షేత్రములన యాత్రాస్థలంబులుగావు పంటల కనుగుణములైన పొలములు)
గనులు
లోహములు గనులలో నుద్భవించును. వీనిలో నుత్తమోత్తమములు ఇనుము, బొగ్గు. ఇవి అన్యోన్యసమీపస్థములైన ఆ దేశము భాగ్యమేభాగ్యము. ఇనుము కరగించి యంత్రములు, కత్తులు మడకలు మొదలైన సామానులను జేయుటకు బొగ్గు మిక్కిలి యుపయోగించునది. కట్టెలలో నుష్ణ మంతలేదు. ఇది గాక యవి త్వరలో భస్మములౌను గాన వానిని ఎగంద్రోయుట వ్రేయుట యను పనులలోనె కాలము బహుళముగ వ్రయమగును. కావున గొయ్యలంత శ్రేష్ఠములు గావు. ఇండియాలో సేలము జిల్లా మొదలగు స్థలములలో నినుపగనులున్నవిగాని దగ్గఱగా బొగ్గులేనందున నవి యింకను బ్రయోజనమునకు రాలేదు. కలకత్తాకు సమీపమున రెండును అనతిదూరస్థములుగ నుంటచే నచట 'అయ:కర్మశాల' యొకటి మిగుల గొప్పది స్థాపింపబడుచున్నది.
అడవులు
ఉష్ణదేశములలో నడవులు ప్రాణసమానముగ నెన్నబడవలయును. వీనివలన దేశము శాంతత్వమును వహించును. వానలు గురిసిన నానీరంతయు అతివేగమున నిష్ప్రయోజనముగ గొండప్రక్కలగోసి ప్రవహింపకుండునట్లుచేసి నదులను సర్వకాలమునందు నేకరీతిని మందగమనమున బ్రవహించునట్లును భూమి యార్ద్రత వహించునట్లును జేయును. చెట్లవేరులు క్రింద బడిన యాకలములును జలమునడ్డగించి పుడమిలో నూరునట్లుగ జేయుటయేకాక మంచి యెరువుగను ఏర్పడును. పూర్వకాలమందు మనభరతఖండంబున ఎండకును వానకును జొరరాక దట్టములై వన్యమృగ సంతతులచే భయంకరములైన కామ్యకద్వైత దండకాది వనములుండినవని పురాణేతిహాసములు ఘోషించు చున్నవి. తాత్కాలిక ప్రయోజనార్థులును వివేకశూన్యులు నగువారిచే నట్టికాఱడవు లన్నియుగొట్టబడి నాశంబునొందె. ఇప్పుడు ఆసాము మైసూరు తిరువాన్కూరు మొదలగు కొన్నిదేశములలో మాత్రము కాననములు కాననయ్యెడిని. ఇట్లు మహారణ్యము లన్నియు నడుగంటుటచేతనే యీదేశము క్షామపాత్రంబయ్యె ననుట నిర్వివాదాంశము. రామరాజ్యము నాటికిని నేటికిని భేదమేమనగా అప్పుడు మేఘముల నాకర్షించునట్టి యరణ్యములచే నలంకృతములగు కొండ లుండినవి. ఇప్పుడన్ననో కొండలున్నవి కాని చెట్లు లేకపోవుటచే నవి మబ్బును చల్లార్చుశక్తి లేకపోవుటయే కాదు, ఎండను ఇంకను మిక్కిలి మనపై వ్యాపింప జేయునవియై యున్నవి. కావుననే ఆ కాలమున నెలకు మూడువానలును ఈ కాలమున మూడేడులకొక వానయుగా నుండుట. కలియుగమునకును ద్రేతాయుగమునకును నిజమైన వ్యత్యాసము అరణ్య సముదాయమేకాని ధర్మదేవతా పాదములు గావు. ఐరోపాలో స్పెయిన్ అనుదేశము మునుపు బహుసారవంతమును ఫలవంతమునై యుండెను. కాని వనరాజి రాను రాను క్షయంబునొందెగాన ప్రకృత మనావృష్టిపాలై యిడుముల కెడమై యున్నది.
జలాధారములు లేనిది ప్రశస్తభూమియును మరుభూమి యవును. వర్షములు కురియుటకును కురిసిన జలంబు వ్యర్థముగ నొకే దాటున బోకయుండుటకును అడవులు సాధనములైనవి. ఇంగ్లీషు వారీవిషయములను చక్కగ శోధించి తెలిసికొన్న వారౌట నీదేశములో మిగిలియుండు నడవులను రక్షించుటకును లేనిచోట బునరుత్పత్తి జేయుటకునై శాసనముల నేర్పఱిచి యున్నారు. ఇది యెంతయు గౌరవింప దగిన క్రమంబని దృడంబుగ జెప్పవచ్చును.
అడవుల గొట్టివేయుట కొన్నినాళ్ళపని. పునర్జీవితం బొనర్చుట తరములకైనంగాదు. ఎంతోశ్రమకును కష్టమునకు నోర్చి యపుడు నష్టమైనను భావిని మేలగునవి యెంచి యభినివేశముతో నుద్ధరించినం గాని యది సాధ్యంబుగాదు. ఇంతటియోర్పు ముందు జాగ్రత్తయు మనవారి కున్నదని నమ్ముట సాహసకార్యము.
కొండలు
కొండలు నీళ్ళక్కడక్కడ నిలిచి చెఱువులుగా నేర్పడుటకును నదులు పుట్టుటకును మేఘనిరోధమొనర్చి వానలు గురిపించుటకును ఱాళ్ళు దొరుకుటకును అనుకూలములు. దక్షిణదిక్కునుండి ఉత్తరముగా బోవు మేఘమాలలు నడ్డగించి నీరు వెలిగ్రక్కజేయు హిమాలయ మహాపర్వత పజ్త్కియే లేకయుండెనేని హిందూదేశమున వర్షమును నదులును అవతరించియుండవు. ఈ దేశమున కంతయు నేడుగడవంటిది గాన నది రక్షకులగు దేవతల కునికిపట్టనియు గైలాసంబనియు నెన్నబడియె గాబోలు! హిమవంతంబుననుండు మంచు కరగి నదులను నిండించును గాన గంగాప్రాంతమున నుండువారలు వానలు లేకున్నను క్షామపీడితులుగారు.
ఉన్నతములైన పర్వతములు సదా చల్లగానుండును గాన వేసవిని తాపపరిహారార్థము దేహారోగ్యమునకునై ధనికులును అనారోగ్యముచే గృశించినవారును నీలగిరి ఉదకమండలము మొదలగు స్థలములకుబోయి కొన్నిమాసములు ప్రతియేడునను నివసింతురు. శీతము దార్ఢ్యము గలిగించునది గాన నీలాటి యుపాయములచే యూరోపియనులు తమ నైజశక్తిని తఱుగనీయక కాపాడుకొను చుందురు. ఆచారగ్రస్తులై అనాయాసముగ బ్రయాణముచేయ శక్తులుగానందున మనపూర్వులు ఎండదెబ్బకు శుష్కించినవారై దినక్రమేణ క్షయించిరని తోచెడిని. వారిసంతతివారైన మనము ఉష్ణస్థితి యను ప్రమాదమొకటి చాలక అతిబాల్యవివాహము దగ్గరసంబంధము మొదలగు నికృష్టవర్తనల నవలంబించి ఇంకను హీనదశకు వచ్చియుండుట యెల్లరకును విదితమే. సముద్రములు
శాఖోపశాఖలుగ భూమిలో బ్రవేశించి వంకర టొంకరగా నుండు తీరములుగల సముద్రములు ఓడయాత్రలకును మత్స్యగ్రహణమునకు ననుకూలములైనవి. వైశాల్యమును విచారించి చూచిన ఇండియాకన్న ఇంగ్లాండు చిన్నదియయ్యు నెక్కువతీర వైశాల్యమును మంచిరేవులునుగలిగి వాణిజ్యార్థమే సృష్టింపబడినట్లు పొందిక గలిగియున్నది. ఇట బొంబాయితప్ప మఱెచ్చోటను బ్రశస్తములైన నౌకాశ్రయములం గానము. మదరాసునొద్ద లక్షలుకొలది సెలవుజేసి యొక చిన్నరేవును గట్టించియున్నారు. కాకినాడలో ఓడలు కూలమునకు మూడునాల్గుమైళ్ళ సమీపమునకైన రాజాలవు. ఇక మంగళూరన్ననో యంతకన్న నికృష్టము. కావుననే కాబోలు మనవారుసముద్రయానమున గౌశలమును కుతూహలమును జెందరైరి. ఇందునకుదోడు నౌకాయాత్రకూడదన్న దబ్బరశాస్త్రములునుజేరి మనల సాహసహీనుల జేసినవి. ఎగుమతి వర్తకములేనిది ధనము దేశమునకు రాదు. ధనములేనిది వృద్ధి పౌరుషములు నశించును. కావున నెగుమతికి ముఖ్యోపకరణమగు సముద్రయానం బవశ్యకర్తవ్యంబు.
క్షేత్రముల విచారణ సంపూర్ణముగ గావలయునన్న కృషి శాస్త్రంబు జదువవలయును. ఇచ్చట గొన్ని యంశములుమాత్రము వివరింపబడును.
అధిక సమ హీనవృద్ధి న్యాయములు
అపూర్వముగ సాగుబడి క్రిందికి దేబడిన పొలములు మిక్కిలి పోతరించి ఫల మమేయముగ నొసగును. అట్టి నేలలో నొకింత ఎరువు వేసిన రెండింతలకన్న నెక్కువ ఫలము బండును. రెండింతలువేసిన నాల్గుమడుగులకన్న నధికముగ సస్యాభివృద్ధి యగును. దీనికి "అధికవృద్ధిన్యాయంబు" అని పేరు. కొంతకాలమునకు ఎంతమంచినేలయు సారహీనత జెందును. అప్పుడు కష్టమును ఎరువును ఎక్కువగ జేయజేయ పూర్వమట్లుగాక యథాక్రమంబుగ మాత్రము ఫలించును. అనగా రెండింతలకు రెండింతలు మూడింతలకు మూడింతలుగా ఫలము నిచ్చును. దీనిని యథాక్రమ వృద్ధియనిగాని సమవృద్ధియనిగాని పేర్కొందురు.
ఇంకను సాగుబడి జరుగను జరుగను భూమిబలముతగ్గి మొదటి కన్న నెక్కువగా నెరువు మొదలగునవి యుపయోగించినంగాని మునుపటియంత ఫలమియ్య శక్తిగలది గాకపోవును. ఈ యవస్థ తటస్థించుడు రెండింతలు ఫలము గావలయునన్న మూడు నాలుగింతలు ఆకు పేడ వినియోగింపవలసి వచ్చును. దీనిపేరు "హీనవృద్ధి న్యాయము".
పైమూడున్యాయములును అనుభవవిదితములు. అనాగరికులగు మూఢులుసైతము వీని నెట్లో గ్రహించి యనుష్ఠానమునకు దెచ్చినవారుగ నున్నారు. ఇందునకు దృష్టాంతము. ఎట్టి కుగ్రామము నందైననుసరే ఒకతూరి చెఱకుపయిరు జేసినవెనుక మఱి రెండు మూడేడులకుగాని యాభూమిలో చెఱకు నెవ్వడును నాటడు. ఎందుకని యడిగిన ఆ మళ్ళలోని సత్తువ యంతయు బీల్చివేయ బడినదనియు రాగి మొదలగునవి నాటి కొన్నివత్సరము లైనపిదప గాని చెఱకు వేసిన నెదుగదనియు కృషికుడు ప్రత్యుత్తరమిచ్చును. అట్లుగాక మఱుకారులోనే చెఱకు నాటవలయునన్న బండ్లకొలది ఎరువు వేయవలయును. అంత సెలవుచేసిన లాభము గిట్టదు. హీనవృద్ధి న్యాయంబున కిదియే తార్కాణము.
ఈ న్యాయంబుల నింకను స్పష్టముగ వివరింతము
1. అధికవృద్ధి
10 రూపాయలు సెలవుచేసి పంటబెట్టిన 20 పుట్లుత్పత్తియౌననుకొందము.
భూమిలో సారము ప్రబలముగా నుండుపర్యంతము
20 రూపాయలతో బంటబెట్టిన 50 పుట్లును (రెండితంలుకన్న నెక్కువ)
40 రూపాయలతో (బంటబెట్టిన) 110 పుట్లునుగా వృద్ధియగుచు వచ్చుననుట దీనిభావము. 2 సమవృద్ధి లేక యథాక్రమవృద్ధి
10 రూపాయలు వినియోగించిన 20 పుట్లు
20 రూపాయలు వినియోగించిన 40 పుట్లు
40 రూపాయలు వినియోగించిన 80 పుట్లు
ఇట్లే యధాక్రమముగ వృద్ధియౌననుట యూహ్యంబు.
3 హీనవృద్ధి
ఈ తఱిని నేల నిస్సారత్వము నొందినదిగాన
10 రూపాయలకు 20 పుట్లు
20 రూపాయలకు 35 పుట్లు
40 రూపాయలకు 60 పుట్లు
ఇట్లే తదితరముల గ్రహించునది.
హీనవృద్ధియనఁగా వృద్ధిలేకపోవుటయని యర్థంబుగాదు యథాక్రమమునకైనఁ దక్కువగా వృధియగుననుట. మొత్తములో క్షయమనుటగాదు. సామ్యములో క్షయమనుట. ఇది మఱవక గమనించ వలయును.
ఈ న్యాయములనే యింకొక తీరున నిర్వచింపనగును. అధిక వృద్ధికాలములో రాశి యెక్కువయగుకొలది ప్రతిభాగమునకునై పడెడు శ్రమయో వ్యయమో తక్కువయగును.
ఎట్లన మీది నిదర్శన ప్రకారము.
తొలుత ఒకపుట్టికి సెలవు 1/2 రూపాయ. 8 అణాలు
ఉత్పత్తి యెక్కువకాగా ఒకపుట్టికి ర్పూ 20/80 = 6 చిల్లర అణాలు.
తుదకు ర్పూ 40/110 = 4/11 = 1/3 = 5 చిల్లర అణాలు.
సమవృద్ధి కాలములో రాశి యెట్లున్నను ప్రతిభాగము యొక్కయు విలువ మారుటలేదు. స్పష్టము.
హీనవృద్ధిదశలో రాశి యధికముగఁ జేయవలయునన్న ప్రతి భాగముయొక్క వెలయు నధికమగును. ఎట్లన్న ఉదాహృత నిదర్శన ప్రకారము. తొలుత 1 పుట్టికగు వ్రయము 8 అణాలు.
పిదప ఎక్కువ పుట్లు పండించిన పుట్టికి 20/35 = 9 చిల్లరఅణాలు.
అటుతర్వాత నింకను వృద్ధి జేయగోరిన పుట్టికి 40/60 = 10 చిల్లర అణాలు సెలవగును.
రాశి యెక్కువ కానుగాను ప్రతిభాగముయొక్కయు వ్రయ మధికమగును. వ్రయ మెక్కువయైన క్రయమును ఎక్కువయౌట సహజము. మనతాతలనాఁటికన్న నేఁడు ధాన్యములు గిరాకిగా నుండుటకు ఇదియొక ముఖ్యకారణము. ప్రజాసమృద్ధి కతన నెక్కువ యుత్పత్తి చేయవలసివచ్చె. ప్రాతభూములు హీనవృద్ధికి జేరినవగుటయు క్రొత్తగా సాగుబడికిఁ దేఁదగు నూతన భూములు అలభ్యము లౌటయు నిమిత్తములుగ ధాన్యములవెల నానాఁటికి బెరుగుచున్నది. ఈ 1911 వ సంవత్సరములో ఐరోపాఖండమున జనులును ఇందుచే మిక్కిలియు నలజడి గొన్నవారై కొన్ని పట్టణములలో వెలలు హెచ్చుటచే నయిన క్షామబాధ నోర్వఁజాలక దుండగములకుంజొచ్చి కొల్లలువెట్ట నారంభించిరి.
ఈ న్యాయముల కొంకొక నిర్వచనము
సారము సహజముగ నభివృద్ధిఁజెందుడు ఒక్కరాశి నార్జింప వలయునన్న ఒకతూరికంటె రెండవతూరియు ఇట్లే క్రమంబుగను వ్రయము తగ్గుచువచ్చును.
సారము సమరీతి నుండెనేని వ్రయమును స్థిరతఁ గాంచును.
సారము తగ్గుట కారంభించిన ఏకరాశికే ప్రతితూరియు నెక్కువగా వ్రయము చేయుట యవశ్యమగును.
హీనవృద్ధి యనేక క్రియలయం దుపగతమైయున్నది. కుండలు కడుగునపుడు సగముమైల వదలినను తుదిభాగమును బోఁగొట్టవలయునన్న ఎన్నియోమార్లు తోమినఁగాని సాధ్యముగాదనుట యిల్లాండ్ర కెల్లరకును గోచరమైన సంగతియే. ఒక పర్యాయము పుస్తకముఁ జదివిన మూఁడింటనొకపాలు మార్కులు తీయుట సులభము. ఇంతకుఁ ద్రిగుణముగ మార్కులు రావలయునన్న నైదాఱుమారులు చదివినను దుస్తరము. బావులలో బండమీది పాచిని ఱాత రుద్దుదుమేని పదినిమిషములలో సగము పాచిపోవును, తక్కినసగము ఒకగంట రుద్దినను బొత్తిగబోదు.
హీనవృద్ధి న్యాయముయొక్క ప్రభావము
దీనివలన గలుగు విశేషము లెవ్వియనుట యోచింపవలసిన విషయము. ఒకేతీరున కృషి జేయుచుంటిమేని ప్రాతభూములు నానాటికి సమసినవై తక్కువ తక్కువగా ధాన్యము లొసగును. ధాన్యరాసులు స్ఫారములు గావలయునన్న క్రమము దప్పక యెక్కువ జాగ్రత్తతోను కష్టముతోను నేలలు క్షీణింపకుండునట్లు సేద్యము జేయవలయు. అట్లుగాక తాతముత్తాతలరీతినే యుండుదమన్న కాలముగాని భూమిగాని యా రీతినే యుండక మార్పులు జెందుటవలన నివియు దాతముత్తాతలకడకే చేరును.
ప్రాతరాజ్యములలో జనసంఖ్య హెచ్చుగనుండుట సహజము. ముఖ్యముగా నిర్బంధ వివాహములకు నాకరమైన ఈ కర్మభూమిలో మేతకు మీఱిన ప్రాణు లుండుట యేమి యాశ్చర్యము? జనులెంత వేగముగ వృద్ధిజెందుదురో యంతకన్న వేగముగ నాహార మతిశయించినంగాని సుభిక్షత కలుగుటెట్లు?
ప్రాణికోటులను పరీక్షించినవారు ఆహారమునకుమించి జంతువులు వృద్ధిజెందుట స్వాభావికమనియు కావుననే జంతుజాలములో నన్యోన్య విరోధములు సంభవించి కలహములు నడుచుచున్నవనియు వక్కాణించెదరు. మనుజులలోను ఈ వర్తన సహజముగా నున్నయది. కావుననే యుద్ధాదులు జరుగుట. ఈ నియమమేలేకున్న సర్కారు వారికి న్యాయస్థానముల నేర్పాటుజేయుటయు నందుచే గలుగు వ్రయమును లేకయుండును. మృత్యువేలేక యిరువదియేడులు గడచిన యెడల మనకు నిలుచుటకు జోటులేనంత సాంద్రముగ బ్రజ క్రిక్కి ఱిసి జగమున మిలమిలలాడును. అందఱికిని జాలినంత యాహారము నుండదు. ప్రకృత కాలమున గృషికి గలిగిన దౌర్బల్యమువలనను జనులు నానాటికి వృద్ధియగుటవలనను గలుగు శ్రమలను బోగొట్టి ప్లేగు కలరా మొదలగు వ్యాధిదేవతలు చేతనైనంత లోకోపకారమును జేయుచున్నవి.
హీనవృద్ధికి బ్రతికూలములైన హేతువులు
ఐననేమి! ఏడులకొలది నరు లధమగతు లగుదురా యన్న నట్లగుట విధికాదు. కృష్యాదులను వృద్ధిజేసి యిదేభూమిలో నిప్పటికన్న నెన్నియోమడుంగుల ధాన్యము నుత్పత్తి చేయవచ్చును. జపానుదేశములో వర్తకములు కళలు వ్యాపించి పదునైదు సంవత్సరములే యైనను నాటికన్న నేడు పంట రెండింతలుగానున్నది ఈ యద్భుతమునకు వారి శక్తిసామర్థ్యములును నవీనాచార పరాయణత్వమును గారణములు. వారు దున్నుట, విత్తుట, కలుపుదీయుట, కోయుట మొదలైన పనులలో నధికానుకూలములైన క్రొత్తక్రొత్త విధానముల నవలంబించుటయేగాక "ఇంత మంచిస్థితిలో నున్నాము, ఇక విశ్రాంతిగ నుండవచ్చుగదా" యని తనియరు. ఆ దేశములో సర్కారువారు పరీక్షించి తగినదని యామోదింపనిది ఎరువు విత్తులను అమ్మగూడదు. ఈ మార్గపరిశీలనమునకు దొలుత దారిజూపినవా రమెరికా దేశస్థులు. చెఱకు, వరి, గోధుమ, పొగాకు మొదలగునవియు, గొఱ్ఱెలు, మేకలు, ఎద్దులు, ఆవులు, కోళ్ళు అన్నియును మనముందువారికన్న నెక్కువ మేలైనవిగాను పుష్కలములగాను నొనర్చి యింకను నూతన ప్రయోజనముల నన్వేషించుచున్నారు. నాగదాడిని గొడ్లకు మేతగాజేసిరి. చవిటినేలల వృద్ధియై పశువులకు ఆహారములగు చెట్లను గనిపెట్టిరి. హిందూదేశమునకన్న ఎక్కువ వైశాల్యము గలిగిన యా దేశములోనుండు ప్రతిభూమిని తద్భాగములను చక్కగ బరీక్షించి గుణదోషముల గనుగొని ఏపైరు లెట్లు కృషిజేసిన జక్కగా ఫలించును? నేల క్షీణతకురాక క్రొవ్వెత్తుటకు దగిన చికిత్స లెవ్వి? యను విషయములను నిర్వచింపవలయునను అద్భుతోద్యమము గొనియున్నవారు. సాహసోదగ్రుల కనపహార్యమైన రహస్యములేదు గాన వ్యవసాయశాస్త్ర మింకను వీరిచే నెంత వికాస మొందనున్నదో యెవరెఱుగుదురు!
బ్రిటిష్ గవర్నమెంట్ వారు శాస్త్రానుసారమైన సాగుబడి యీ దేశములోని కాపులకును తదితరులకును నేర్పుటకునై కోయంబత్తూరు, పునహా మొదలగు స్థలములలో వ్యవసాయ కళాశాలల స్థాపించి యున్నారు. మఱియు గ్రామపాఠశాలలలో నీవిషయము బాలురకు బోధించుటకు దగిన ఏర్పాటులు చేయుచున్నారు సెనగకాయలు, ప్రత్తి, వరి, చెఱకు వీనిలో మేలైనరకములు అన్యదేశముల నుండి తెప్పించి యెంతమాత్ర మిచ్చోట వృద్ధికివచ్చునోయని శోధనలు జఱుపుట, ఆస్ట్రేలియా అమెరికానుండి నూతనములగు నారింజ మొదలగు ఫలవృక్షముల దెప్పించుట. విదేశపు గోవుల నిచట వాలాయముగ బెఱుగువానిని దెప్పించుట, మొదలగు ననేకవిధముల మనకు మేలుజేయ గడక గొనియున్నారు గాని మనవారి మూర్ఖతయు నవవిద్వేషమును అందులకు విఘ్నములుగా నున్నవి.
యుక్తవిధానమున సేద్యమునుజేసిన భూసత్త్వం బనశ్వరమయి యింకను ఉద్ధురమగునని శాస్త్రజ్ఞులు కొంద ఱభిప్రాయపడెదరు. ఈ విధానములలో ముఖ్యమైనవి నాలుగు.
1. మన్నును ద్రిప్పివేయునట్టి మడకలతో లోతుగాదున్నుట, ఇందుచే లోభాగపుమన్నున కెండవేడిమి తగులును. సూర్యకాంతిచే శ్రేయస్కరమగు మార్పునుజెంది భూమి సారముగలదియగును.
2. దోహదములు. చెట్లు పొగరెక్కి పెఱుగుటయేగాని పూచి కాచుట లేనిచో ఆ మదము నణగించుటకు ననేక తంత్రములున్నవి. ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో ఆ చికిత్సలజేయుట. 3. ఎరువులు, ఇవియన్నియు నొకేరకమైనవిగావు. ఆకెక్కి ఫలించని వానికి వేయవలసినవి గొన్ని. గింజ పెద్దయగుటకు గొన్ని, ఇట్లు వివిధములు.
4. పంటలు మార్చుట. భూమిలో ననేక ద్రవ్యము లున్నవి. ఒక్కొక్క పంటకు వీనిలో గొన్నిమాత్ర మాహారమున కుపయోగించును వరివేసితిమేని ఆ వరి తినివేయుటవలన గొన్ని ద్రవ్యములు ముక్కాలు మువ్వీసమ్ము నశించినవనుకొందము. మఱుకారునకు ఎరువువేయక మఱల వరియే చల్లిన నాధాన్యమున కాహారము చాలనందున పంట బలహీనమగును. వరిగాక రాగి చల్లితిమేని రాగులకు గావలసినవి వేరు ద్రవ్యములు గావున ఈ ద్రవ్యములు సమగ్రముగ నుంటచే పయిరు పుష్కలముగ బండును. మఱి యింకొక విశేషము. రాగి పెరుగుచుండు కాలములో వరికి గావలసిన ద్రవ్యములు ఎండ, గాలి మొదలగు ప్రకృతుల భావముచే బునరుత్పత్తి జేయబడును. రాగి కోతయైన తరువాతి కారునకు బిమ్మట వరిచల్లితిమేని నిండు పంట నెఱయును. ఈ విషయము దృష్టాంతముగా జెప్పబడినదని భావింపవలయు.
ఐరోపాలో మూడుకారుల కొకతూరి పెట్టిన పైరే పెట్టుదురు. నేలను మూడుభాగములుగజేసి అందు ఒకదాన గోధుమ, ఇంకొకదాన ఓట్సునువేసి మిగిలినదానిని దుక్కిజేసి యూరకవిడుతురు. ఈ రీతినె క్రమప్రకారము జఱుపుట పూర్వమునుండివచ్చిన శుభసంప్రదాయములలో నొకటిగా నున్నది. మనదేశములో ఎండవేడిమి ఎక్కువకాబట్టియు గ్రీష్మాంతమువఱకును నేలలు బీడుగా బడి యుండుటంబట్టియు, ఎరువు వేయుటగాని, పంటలు మార్చుటగాని యంత మిక్కుటముగజేయుట అనావశ్యకమని తోచెడిని పంటలలో వంతుబెట్టుటచే ఫలము సమృద్ధియౌననుట నిస్సందేముగా నిక్కువము. అమెరికాలో కార్నెల్ కళాశాలయందు వ్యవసాయ శాస్త్ర పండితులైన యొకరు గొడ్డునేల యని త్యజింపబడిన భూములను ఈ యుక్తిచే సస్యాఢ్యములుగా జేసిరి. కొన్నిపంటలు తమకు వలయు ద్రవ్యములు గ్రహించినను ఇతర ధాన్యముల కనుగుణమైన ద్రవ్యముల నుత్పాదించునట. ఈరహస్యముల శోధించి వారు ఆయా పొలములకు సరియైన సస్యక్రమము నిర్దేశించి భూమికి వంధ్యత్వముం బాపి ప్రజలకు మహోపకారము గావించిరి.
పయిరులకును ఫలవృక్షములకునువచ్చు వ్యాధులు తన్నివారణ క్రియలు, వీనిశోధనలో ననేకులు పాటుపడుచున్నారు. వారిచే గనిపెట్టబడిన సంగతులను మన గవర్నమెంటువారు ప్రచురపఱచెదరు. మైసూరిలో పోకను బాడుజేయుచున్న పురువులను కొన్ని తైలముల జల్లి సంహరించుట ఇపుడు సర్వసాధారణముగనున్నది. టెంకాయచెట్ల చిగుళ్ళను దినివేయు పురుగులు, చీడ మొదలగు కీడులను దొలగజేయు సిద్ధులు ఇపుడు మనకు దెలిసినవిగాక యింకను నెన్నో యున్నవి. అమెరికాలో 'కాలిఫోర్నియా' యను సీమలో నొక మహామహుడు అంట్లుగట్టుట, సంకరములు గల్గించుట వీనిలో బహు కుశలియై గింజలులేని నారింజలు, తిత్తిరీతిని క్రిందిభాగమున నొకటి యేర్పడి అందులో గింజలన్నియు నడగియుండెడు నారింజలు. పుల్లదనము తీపియు వేర్వేరు భాగములనుండు బేరిపండ్లు, ఇట్టి చిత్ర విచిత్రముల నెన్నియో కల్పించినాడని ప్రసిద్ధిగలదు.
మాంసభక్షణము
అమెరికావారు మనలంజూచి చుఱుకుదనము లేనివారనియు, అసాహసికులనియు, తమమేలు నెఱిగి తద్విధమున వర్తింప శ్రద్ధా జ్ఞాన ధైర్యములు లేనివారనియు గర్హించి పలుకుదురు. నేను కార్నెల్ సర్వకళాశాల దర్శింపబోయినపుడు హిందూదేశమున యాత్రజేసిన అర్థశాస్త్రపండితుండౌ 'జెంక్సు' గారిని జూచి మాట్లాడ బ్రస్తావవశంబున నతడు "మాంసవిసర్జనమున మీకు బహు హానికలిగె" నని నుడువ, అదెట్లని నేనడుగుడు నత డిట్లనియె . "కోళ్ళు ,మేకలు పెంచుటకు వేరుశ్రమయంతగా నక్కరలేదు, పైరులనుండి ! వాలిన గింజలు స్వచ్ఛందముగ పెరిగిన గడ్డి మొదలగు వానితో నవి యెదుగును. పంటలతో నివియునుండిన ' భోజన పదార్థము లెక్కువయౌననుట కేమిసందేహము. అంతేకాదు. పక్షులు యధేచ్ఛా విహారములుగాన పయిరులను బాడుచేసి ధాన్యమును దినిపోవుచున్నవి. ఈ నష్టముచే బంట నూటికి బది బదినేనువంతులు దగ్గుచున్నది. మీరు వానిని దినరు. వానిచే మిమ్ముల దిననిత్తురు. ఇది యేమివెఱ్ఱి? బరోడాలో బదేడులక్రిందట ఎలుకలు పండినగింజలం దినిపోవుటంబట్టి క్షామంబు దటస్థించె. ఈ మాట నీదేశములోజెప్పిన నందఱును నవ్వుదురు ఎలుకలచే భక్షింపబడు జనులున్నారా యని యాశ్చర్య మొందుదురు. అహింస మంచిదేకాని మనుష్యులకు హింస రాకయుండునట్లు భద్రమొనర్చుట ఇంకను మంచిది. పాములను బులులను జంపువారు వేరుమార్గముల నంతకన్న క్షోభబుట్టించు ఎలుకల నేల చంపరాదు? అందులో లేనిపాప మిందుమాత్ర మెట్లు వచ్చె? ఈ దేశములో పొలము కాపులు ఉదయమున నాయుధపాణులై గింజలు మిక్కుటముగమెక్కు పావురము మొదలగు పక్షుల వేటాడుదురు. ఇందుచేత ధాన్యము మిగులుటయేకాదు. ఇంకొక మోస్తరు ఆహారమును లభించును. మఱి మాంసాశనంబు శాఖభక్షణమునకన్న నెక్కుడు బలప్రదంబు. మీదేశంబులో వేదురుగొన్న అహింసంబట్టి భూమినుండి సగముమాత్ర ముత్పత్తిచేయబడుచున్నది. ఆచారభిన్నులైతిరేని ఫలితము ననాయాసముగ ద్విగుణము జేయవచ్చును" అని మందలించు తఱికి భారతములోని
చ. సలిలము లుర్వియాకసము సర్వము జంతుమయంబు గావునన్
గలుగు వశ్యమున్ సకలకర్మలయందును హింస; హింసకుం
దొలగిన దేహయాత్రయును దుర్ఘటమై నటులుండు: వింతయుం
దలపరు, హింసచేయమని తారచరింతురు కొందఱిమ్మహిన్.
క. పనివడి యహింసవ్రతముగ
గొని వనముననున్న మునులకుం దొడరదె హిం
సనము తరు మూలపల శా
క నిపీడన మదియు హింస గాదొకొ తలపన్.
క. ఫల మూలౌషధిశాకం
బులు పశు మృగతతులు భక్ష్యములుగా భూతం
బుల కజుడు సేసెనని య
స్థలితంబుగ మ్రోయుశ్రుతులు గాదనవశమే?
అను పద్యములు నామనసునకుం దట్టినవి.
కొంద ఱహింసాపరులు చీమలకుం గుక్కలకుంబెట్టి పోషింతురు! మాంసము దినవచ్చుననువారు కాలక్రమంబు లెఱుగక ప్రాణులను వధింతురు. ఇందుచే మృగపక్షి జలచరంబులు సమసి యపురూపంబులుగాజొచ్చె. పశ్చిమఖండవాసులు నియమంబెఱిగి వధింతురు. గర్భఋతువులలో వేటాడరు. పెయ్యలని యెఱిగిరేని కాల్వరు. మత్స్యములు చిన్నవిగానున్న బట్టియు మఱల విడుతురు. కావున నచటి జంతుసమూహంబు శిధిలత నొందకున్నవి. మనదేశములో నదుల సముద్రముల వనముల విచ్చలవిడి ప్రాణులంగొనుట నానాటికి నవి యరుదుగుచున్నవి. దీనిచే నిక ముందు మిక్కిలి కీడుకలుగును. మాంసము దుర్లభమగుటయేకాదు శాకవర్గంబులను శత్రువులైన క్రిమికీటకములం దినియు తమశరీరములనుండి యెరువును విసర్జించియు జంతువులు కృషికి సహాయభూతములు. కావున దద్రక్షణం బరణ్య రక్షణం బట్లవశ్యకరణీయంబు. 'సర్ విలియం నిఖిల్‌సన్' గారు చేపలను సమృద్ధములనొనర్ప ఈ రాజధానిలో గృషిజేయుచున్నారు గాని జనులకు శ్రద్ధయు దెల్వియు రానిచో వారివల్ల నేమగును? వారు జపాన్ మొదలైన దేశాంతరములనుండి నానావిధములగు చేపల దెచ్చి యిచ్చటి నదులలోను చెరువులలోను విడిపించుచున్నారు. హీనవృద్ధిని అడ్డగించుట కింకొక యుపాయముం గలదు. అదేమన పరరాజ్యములను విజన ప్రదేశములను ఆక్రమించుకొనుట. దీనిని గుఱించి బలపరాక్ర మైకమత్యంబులులేని మనము చింతించుట హాస్యకారణమగును. ఉన్నది కాపాడుకొనజాలని మనము ఇతరుల నోడించి లక్ష్మీయుతుల మగుదుమనుట హాస్యమనియుం జెప్పగూడదు. హాస్యమునకు బట్టినదయ్య మనవలయు. ఐరోపాఖండీయులు ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలేండు, న్యూగినీ, కనడా, అమెరికా, దక్షిణపు అమెరికాలోని రాష్ట్రములు, వీనికి జనులబంపి భూములిచ్చి జీవనోపాయములను గల్పించి వారు సుఖులౌన ట్లాచరించుటయు తమకు జనాధిక్యమువలని సంకటములు వాయుటయునను సుఖముల వడయుచున్నారు మలయ, దక్షిణాఫ్రికా, కనడా రాజ్యములలో హిందువులున్నను కూలినాలిచేసికొని క్లేశభాజనముగ నోసరిల్లుటయే గాని సుఖజీవన గౌరవంబులు వారికిలేవు. మనము మాలవారి నెట్లు బహువిధబాధలం బొరలజేతుమో తెల్లవారును అట్లే వర్ణ ద్వేషంబున వికలితధర్ములై మనజనుల పలుగోడుల గుడిపింతురు. ఆఫ్రికాలోని నల్లజనులు పడుపాటులు వర్ణింపనలవిగాదు. తెల్లవారి నంటకుండురీతి దొలగినడుచుట, రైలుబండ్లలో మొదటితరగతిలో బ్రయాణము జేయకుండుట, యజమాను లెంతక్రూరతతో వర్తించినను శాంతత నవలంబించి యూరకుండుట ఇత్యాదులు వీరికి విధింపబడిన ధర్మములు. మనుస్మృతి మనదేశములో బ్రకృతము ఇంచుమించుగ నామమాత్రావిశేషముగ నున్నది. అందలి శాసనముల నంగీకరించువారును ననుసరించువారును దఱుచులేరు. ఒకవేళ నెవడైన నారీతి నాచరించి హీనకులజుల దాసులం జేయబూనెనేని గవర్నమెంటువారీ సనాతనధర్మముల జెల్లనియ్యరు. ఇక్కడ నస్తమించిన మనువు దక్షిణాఫ్రికాలో నవతరించి యక్కడను మనవారి ప్రాణమానముల కురిగా నేర్పడినాడుగదా! ఈ దేశమున వర్ణధర్మములు అడుగంటివను ఆఫ్రికాలో ప్రబలములుగా నున్నవి. ప్రజా వృద్ధి
ఇన్నిదేశములు చూఱగొన్నవారౌట జనసంఖ్య ఎంత హెచ్చినను అందుచే బ్రకృతము విపత్తు లుప్పతిల్లవని ఐరోపాలోని యర్థశాస్త్రజ్ఞులు పల్కుదురు. ఈన్యాయము మనమును శక్తిమంతులమైన గాని మనయెడ నమోఘంబుగాదు.
ప్రజావృద్ధికి బ్రతికూలము లేవనగా:- 1. యుద్ధములు. 2. క్షామాది మహోత్పాతములు. 3. వ్యాధులు మొదలగునవి. వీనిచే భూభారము కొంతకుగొంత దీరును. అనగా అర్థసమృద్ధిలేక ప్రజావృద్ధి మాత్రమయ్యెనేని తినుటకుంజాలక జను లనేకవిధమ్ముల గృశించి యంతము నొందుదురనియు దన్మూలమున జనసంఖ్య యొక మితి నతిక్రమింపక యుండుననియు భావములు, ఈ రీతి నుచిత సంహారంభు సర్వదా ప్రవర్తిల్లుచునేయుండు. బలహీనులైనవారు బలవంతుల పాలబడి అమెరికాలోని తామ్రవర్ణులైన ఇండియనులు, ఆఫ్రికాలోని నీగ్రోలు, ఆస్ట్రేలియాలోని పర్వతజనులట్లు క్రమమున నిర్మూలము నొందుదురు. పరస్పరోన్మూలన క్రియాలోలత్వంబు భూతములకు♦[1] మితాహారయుక్తింజేసి కలిగిన సహజగుణంబు. న్యాయ వాదంబుచే నీస్పర్థలను నిగ్రహింప జూచుట అగ్నికణంబుచే సముద్రము నార్పజూచినట్లు. మతములు మొదలగు నియమములు వీని నెదరించి విగతసత్త్వములైనవి. చూడుడు! సమస్తము నీశ్వరుడేయని వేదాంతము బోధించుచున్నను మనదేశంబునబలె నెచ్చోటను జాతిభేదములు ప్రాబల్యము గాంచలేదు. మాలయు నీశ్వరుడే; బ్రాహ్మణుడు నీశ్వరుడేయని తత్త్వము. ఆ యీశ్వరుని జూచిన నీ యీశ్వరుడు గంగాస్నాన ప్రాయశ్చిత్తము జేసికోవలయుననుట అనుష్ఠానము! దైవము మనుష్యులలో బ్రతిబింబించి యుండునట! తానెంత వికారముగానిది ప్రతిబింబ మింత యసహ్యమైనదో తెలియరాకున్నది. ఇక క్రైస్తవమతమును అట్లే. ఏసుక్రీస్తును నమ్మినవారందఱు నన్నదమ్ములట! అయిన నీలోకమునగాదు పరలోకమున ననుట యనుభవరచిత వ్యాఖ్యానము! న్యాయవాదములనమ్మి రక్షణోపకరణముల సేకరింపనివాడు పరమ మూఢుడనుట ముమ్మాటికి నిక్కువము.
ఐరోపా అమెరికాఖండములలో ననేకులు స్వయముగ సంతాన నిగ్రహ మొనర్చుదరు. ఫ్రాన్‌స్‌దేశములో నలువది సంవత్సరములపు డున్న జనసంఖ్యయ నేటికిని ఉన్నదిగాని పెరుగలేదు. ఇది మనుష్య కల్పితముగాని స్వభావసిద్ధముగాదు. జనాభివృద్ధిని గుఱించి ఇకముందు ఇంకను జర్చింతుము. మొత్తముమీద అమితమగు ప్రజోత్పత్తి వలన యూరోపియనులకన్న మనకు నెక్కు డిక్కట్టులు వాటిల్లు. అది యట్లుండె.
హీనవృద్ధిచేనగు నవస్థలకు, జికిత్సంబోని మార్గములు రెండు వివరింపబడియె. అవేవన్న:- కృషిని శాస్త్రవిహితరీతి ననుష్ఠించుట; రాష్ట్రవైశాల్యమును స్ఫారము గావించుట.
హీనవృద్ధి న్యాయంబు గనులు మత్స్యాశయములు వనములు వీనియందును ప్రవర్తిల్లును. గభీరతయౌకొలది లోహముల ద్రవ్వి తెచ్చుట దుర్ఘటంబు. చెట్లు నఱుకనఱుక దూర మెక్కువయై రాకపోకలు కష్టతరములౌటయు తుదకు అడవియే అంతమొందుట సంభవించును. మీనములును అట్లే. మునుపుతీరమున పుంఖానుపుంఖముగ జిక్కునవి ఇపుడు రెండుమూడుమైళ్ళు పడవలలో బోయినగాని దొరకవు. సంహారక్రియ ఇట్లేనడచిన నిక గొన్నియేడులకు యోజనమ్ములు పోవలసివచ్చునేమో! ఉత్పత్తిచేయంజేయ శ్రమ యధికముగ వృద్ధిజెందుననుట ఈ న్యాయములచే నిర్ణీతంబు. యథావృద్ధి అపురూపమైనది. కావున దీనివిచార మంతగా నక్కరలేదు. అధికవృద్ధి న్యాయము
అధికవృద్ధి న్యాయంబు కృష్యాదులుతప్ప తక్కిన కళలయందు బ్రవర్తించును. ముఖ్యముగా యంత్రకళలలో దీనిప్రభావము తెల్లమగును. 1000 రూపాయలు ఇచ్చికొన్న యంత్రములో దినమునకు 10 తానులు గుడ్డ నేయబడునేని 2000 రూపాయలు మూలధనముగా నేర్పఱుపబడిన ఫ్యాక్టరీలో దినమునకు 30 - 40 తానులు నేయుట సుకరంబు. ఒకగుడ్డ నేయవలయునన్న రెండురూపాయ లగునను కొనుండు, 20 గుడ్డలు అదేచోట నేయవలయునన్న 40 రూపాయల కన్న దక్కువ పట్టుననుట అనుభవవిదితమేకదా! మొత్తముగా సరుకులనుదీసి యమ్మువాడు చిల్లరవ్యాపారము చేయువానికన్న నయముగానమ్మి లాభముబొందుట యందఱెఱిగిన విషయమే. కావుననే సీమగుడ్డ లంత సరసముగనుండుట. కోట్లకొలది మూలధనము వినియోగించిన కర్మశాలలలో నేయబడు మంచివస్త్రములు ప్రాచీనరీతిని చేతితో నేయబడిన మోటుగుడ్డలకన్న తక్కువ క్రయమునకు గొనవచ్చుననుట కిదియే తార్కాణము. ఉత్పత్తి యెక్కువ యగుకొలది ఈ కళలలో యధాక్రమమునకన్న న్యూనమైన శ్రమ వ్యయములు కావలసివచ్చును. అనగా శ్రమ యధికముచేసిన నంతకన్న ననులోమముగ ఫలితము హెచ్చును.
ఐరోపాలో జనసంఖ్య పెరుగుకొలది కళావాణిజ్యంబులును అధికముగ వ్యాపించుటంజేసియు, ఇందు లాభము అధికవృద్ధి రూపముగ వచ్చుటంబట్టియు మొత్తముమీద ప్రతివానికిని ఆదాయము ఎక్కువయై, ధాన్యమువెల హెచ్చినను సుభిక్షత సిద్ధింపజేయును. మనరాజ్యములో కృషులేకాని కళ లింకను ప్రాబల్యము గాంచలేదు. కావున జనసంఖ్య యెక్కువయైన ధాన్యాదులవెల హీనవృద్ధి న్యాయంబుచే హెచ్చును. ఈ లోపము నివారింపజాలు కళాప్రాబల్యమువలని యాదాయోద్దీపనంబు ఇంకను మనకు సమకూడలేదు. ఇంగ్లాండులో నెంతవేగమున నెదుగునో అంతవేగముగ నిట జనసంఖ్య ప్రసరింపలేదని చింతించువారు, ఎక్కువ ప్రజ నుద్ధరింపజాలు కళా విస్తీర్ణత యున్నదా కలుగునా యని యోచింపవలయును. జీవనాధారము లిప్పటియట్లనేయుండి ప్రజమాత్రము మిక్కుటమైన నష్టమేగాని లాభము గలుగదు. వణిగ్వ్యవహారము లనంతములుగ విజృంభించు సీమలో నెందరు పుట్టినను మేలేకాని భారముగా నుండదు.
సంకేత నామములు
త్రివిధ వృద్ధులును అధిక సమహీనంబులనియు అనులోమ యధాక్రమ విలోమంబులనియు పేర్కొనబడును.
భూజలాది ప్రకృతులనుండి వస్తువుల నుత్పత్తిజేయుట గ్రహించుట యిత్యాదులు కృషులనంబడును. సేద్యము లోహ మత్స్యాది గ్రహణము మొదలగునవి కృషులు. ఇందు వస్తుగ్రహణంబు ప్రధానంబు గావున 'ఆకర్షణ క్రియలు' 'పరికర్షణక్రియ' లనియుం జెప్పవచ్చును. ఇవి హీనవృద్ధి ననుసరించినవి.
అట్లు సంపాదించినవానిని అనేకవిధములుగ దయారుచేసి పక్వమునకు దెచ్చుట 'కళ' యనబడును. ఇందు రూపస్థలభేదంబులు ప్రధానంబులు గావున వీని 'పరివర్తన క్రియలు' అనవచ్చును. పరివర్తనమనగా వస్తువుల మార్పు.
ఇందుకు దృష్టాంతము. ప్రత్తి సేద్యమునకుం జేరినది. వస్త్రములు కళాసంబంధములు. ప్రత్తి హీనవృద్ధి ననుసరించును గాన ఎక్కువగా నుత్పత్తిచేసిన దానివెల యధికమగును వస్త్రములు. ఎక్కువగా నేయుకొలది వెలతగ్గును. కావున కళ లధికవృద్ధి ననుసరించును. కళకు వ్యవహారము పర్యాయపదముగా నెఱుగునది.
ఇది కర్మలు వ్యాపారము అని రెండు తెఱగులం బ్రవర్తిల్లు. కర్మ లనగా వస్తువులను జేయుపనులు. ఉదాహరణము శిల్పాదులు. వ్యాపారమనగా వాణిజ్యము వర్తకము. అనగా క్రయవిక్రయములు. వస్తువుల నొండొంటితో మార్చుట కొనుట యనుట.
కర్మలు హస్తకర్మలు యంత్రకర్మలు అని రెండువిధములు. వీనికింగల యంతరువు లికముందు విదితములగును.
- ↑ ♦ అనగా పిశాచములుగాదు జంతువులు.