భాగవతము - ఏకాదశస్కంధము

శ్రీ
భాగవతము
హరిభట్టారకప్రణీతము

ఏకాదశస్కంధము


శా.

శ్రీ రాజత్కుచకుంభ యుగ్మ నిహిత శ్రీగంధ సంవాసితో
దార స్వీయభుజాంతరాళ విచలద్రత్నప్రభారంజితున్
కారుణ్యైక నివాసు వాసవపయోనాథాదిసంసేవితున్
గారావంబున సన్నుతింతుఁ ద్రిజగత్కళ్యాణమూర్తిన్ హరిన్.

1


క.

మనమున రఘునాయక పద
వనరుహ యుగళంబు దలఁచి వైభవలీలన్
దినదినము హర్ష మందెడి
హనుమంతుని సన్నుతింతు ననురాగమునన్.

2


సీ.

గురుతరమాణిక్య కుండలద్వయదీప్తి
        మండితగండ యుగ్మంబు వాని
బాలభానుప్రభా భాసుర సంరక్త
        సలలిత వక్త్రాంబుజంబువాని
కాంచనశైల సంకాశదేహమున య
        జ్ఞోపవీతంబు చెన్నొందువాని
కౌపీనమేఖలా కలితకటిస్థల
        స్థాపితపుష్పగుచ్ఛములవాని
వాలరోమాగ్ర నిర్బిన్న వారివాహ
సంఘనిష్ఠుర నిర్దోష చలితభువన
నిర్జితేంద్రాది సన్నుత నిజచరిత్రు
బాహుబలవంతు హనుమంతుఁ బ్రస్తుతింతు.

3

శా.

బంధూకప్రసవాతిరక్తవదనున్ బ్రఖ్యాతునిం రామహృ
ద్బంధున్ వాయుతనూభవున్ దలఁచి విద్వత్కోటి మద్వాగ్విభూ
తిం ధాత్రి న్వినుతింప భాగవతమం దేకాదశద్వాదశ
స్కంధంబుల్ దెనిగింతుఁ బూర్వకథిత స్కంధానుసారంబునన్.

4


క.

మారుతసుతుఁ డఁట కృతిపతి
పారీణత భాగవతము పలికెడి దఁట యీ
సారస్య మిచట గల్గఁగ
వేఱొక మార్గమునఁ బోవు వెఱ్ఱియుఁ గలఁదే.

5


క.

శ్రీ రాఘవపదసేవా
పారాయణ భక్తలోక బహుళాపన్ని
స్తారకరజనీచరసం
హారాధిక జయసనాథ హనుమన్నాథా!

6


వ.

నారాయణ చరణకమల ధ్యానామృతపాన పరవశులగు శౌనకాది
మునివరులకు సకలవేదవేదాంత పురాణేతిహాస కథావ్యాఖ్యానవైఖరీ
సమేతుం డగు సూతుం డిట్లనియె; నట్లు పరీక్షి న్నరేంద్రునకు శుక
యోగీంద్రుం డిట్లనియె.

7


క.

జననవ్యాధుల కౌషధ
మనయంబును గర్మబంధహరణము తిరమై
వినుము నృపాలక! హరికథ
వినిపించెదఁ గర్ణములకు వేడ్క దలిర్పన్.

8


సీ.

అంతట శ్రీకృష్ణుఁ డధికసైన్యముఁ గూడి
        సకలరాక్షస బలక్షయముచేసి
హర్షంబుతోడుత నఖిలభూభారంబు
        మానిచి సురలు సమ్మతమునొంద
దుర్ద్యూత హేళనాదులు నిమిత్తముచేసి
        పాండవకురుభూమిపాలబలము
లను జంపి నందాదులకును సంతోషంబు
        కావించి లోకరక్షణము చేసి

యంతలోపల నిజభక్తులైన యాద
వుల సమూహంబు చెలరేఁగి పొదవఁజూచి
ఋషుల శాపంబు దలపోసి రోషమంది
తద్వినాశము సేయంగ దలఁచి యపుడు.

9


మ.

విదితుండై సకలామరుల్ వొగడ నుర్వీభారమున్ మాన్చి దు
ర్మదసంయుక్త వనుంధరాధిపతులన్ మర్దించి కంసాదులన్
దుదముట్టన్ వధియించి కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁడై యున్నచో
యదుసైన్యంబులు భూమిలోనను నసహ్యం బయ్యె నత్యుగ్రమై.

10


వ.

ఇవ్విధంబున యశోదానందనుండు పూతన, కేశి, ప్రలంబ, తృణా
వర్త, శకట, ధేనుక, వత్స, ముష్టిక, చాణూర, కంస, సాల్వ,
శిశుపాల దంతవక్త్రాదులం బరిమార్చి దుర్ద్యూతనిమిత్తంబునఁ
గురుపాండవసైన్యంబుల నేపణంచి యంత నిజసేవాపరులైన యాద
వులబలంబు లుదిలంబులై భూమికి వెక్కసంబులై వ్రక్కతిలుచు
వర్తించునెడ వారలం జూచి మనంబున నిట్లనియె.

11


గీ.

మత్సమర్పితశక్తిచే మలయుఁ గాన
నన్యపరిభవ మెఱుఁగ దీయదుబలంబు
వీరిఁ బరిమార్ప నేఁదక్క వేఱె మఱొక
దైవ మోపునె త్రిభువనాంతరములందు.

12


క.

అని విప్రశాపమూలం
బున యాదవబలము నణఁచి భూభారము మా
న్చిన మీఁదఁ బరమపదమును
జనియెన్ వసుదేవసుతుఁడు సంరంభమునన్.

13


వ.

అని పలికిన మునివరునకు రాజవరుం డిట్లనియె.

14


సీ.

బ్రహ్మణ్యులై జగత్పావనమూర్తులై
        వాసుదేవాంఘ్రి సేవాధురీణు
లగునట్టి యాదవులకు నెట్లు భూదేవ
        శాపంబు దగిలె నాశాప మెట్లు

హరి మాన్పలేఁడయ్యె నఖిలలోకేశ్వరుఁ
        డతనికి సమ్మతంబయ్యె నెట్లు
యే మూలమున వచ్చె నీశాపకాలాగ్ని
        నేరీతి హతమయ్యె నీబలంబు
నిట్టి వృత్తాంతమంతయు నేర్పడంగ
విమలవాక్ప్రౌఢితోడుత విస్తరించి
శ్రవణపుటయుగ్మమునకు నుత్సాహ మొదవ
నఖిలమునిలోకవంద్య నా కానతిమ్ము.

15


వ.

అవి పలికిన నరపాలపుంగవునకు యతిపుంగవుం డిట్లనియె.

16


క.

విను భూపాలక యాకథ
వినిపించెద మనములోన వేడుక పుట్టన్
ఘనతర మద్వాగ్విభవం
బునఁ దోచినకొలది నధిక మోదముతోడన్.

17


క.

నిరుపమసుందరదేహము
ధరియించి సమస్తకర్మతత్పరుఁడై యా
చరణంబుచేసి ధర్మము
హరి మనమునఁ దలచె నణఁప యాదవబలమున్.

18


వ.

ఆసమయంబున జటావల్కల జపమాలాదండకమండలు సహితు
లైన విశ్వామిత్ర, అశిత, కణ్వ, భృగ్వాంగీరస, కశ్యప, వామదేవ,
అత్రి, వసిష్ఠ నారదాది మునివరులు స్వేచ్ఛావిహారంబున, ద్వారకా
నగరంబున కరుగుదెంచి, యందు మంజుశింజానమంజీర కీలిత వివిధ
రత్నకాంతిచ్ఛటాపుంజ పింజరిత పాదాంబుజాత యుగళుండును
ఝణ ఝణత్కార ముఖర రత్న ఘంటికాసమంచిత కటిస్థల విరాజ
మాన పీతాంబరాలంకృతుండును నానావిధరత్నహార దేదీప్యమాన
వక్షస్స్థల నిత్యనివాస లక్ష్మీసమాలోకన స్మితముఖాంబుజాతుండును
అంబుజాత సమానకరకంకణ క్రేంకార సంకుల దశదిశాభ్యంతరుండును

అభ్యంతరనిలయ చతుర్దశభువన పరిపూర్ణుండును పూర్ణాబ్జమండల
స్వచ్ఛకపోలస్థల విలంబమాన మకరకుండల ద్వయదీప్త శ్యామ
లలితకంబుకంధరుండును కంధరపోత నికరశ్యామల నిజాకారభాసు
రుండును సురనికరమౌళిరత్న నానావిధరంజిత పాదాభిరాముండును
నిజకిరీట సముల్లసద్గారుత్మతమణి సహస్రద్యుతి పిశంగీకృత నిజాస్థాన
ప్రదేశుండును కరుణారస పరిపూర్ణ కటాక్షవీక్షాసముజ్జ్వలుండును
శంఖచక్రగదాసిశార్ఙాద్యుదాయుధధరుండును మదనకోటిలావణ్య దేదీ
ప్యమానుఁడునునైన యప్పుండరీకాక్షుం గనుంగొని తత్సమర్పితసవిన
యార్ఘ్యపాద్యంబు లంగీకరించి హేమాసనసమాసీనులై మునివరులు
వాసుదేవసమ్ముఖంబున నిట్లనిరి.

19


క.

దలమయిన కలుషజాతము
దొలఁగును భాగ్యంబులెల్ల దూకొనఁగలిగిన్
ఫలియించెను మాతపములు
ఫలములు నేఁ డంబుజాతపత్త్రశుభాక్షా.

20


చ.

కలిగెను నేడు భాగ్యములు కంటిమి నీపదపద్మయుగ్మమున్
బొలిసెను పాపసంఘములు పోయె నవిద్య సమస్తయోగి హృ
జ్జలరుహ మధ్యవర్తి వగు శాశ్వతమౌ నిజమూర్తి నిచ్చటన్
నెలకొని చూడఁగల్గె నిదె నిర్మలమైన విలోచనంబులన్.

21


సీ.

ఒకవేళఁ బరమాణువులకన్న మిక్కిలి
        సూక్ష్మరూపము దాల్చి సూక్ష్మమగుదు
వొకవేళ విభురూప మొనరించి వేడ్కతో
        విశ్వంభరుండవై వెలయుచుందు
వొకవేళ సగుణంబు నొంది రుద్రాదులు
        వినుతింపనుందువు విమలచరిత
యొకవేళ నిర్గుణయుక్తమై యోగీంద్ర
        మానసంబులయందె కానఁబడుదు

విట్టిరూపంబు వాఁడని యెట్లు నిన్ను
నిశ్చయముతోడఁ దెలియంగ నేరనగునె
వామనాచ్యుత గోవింద వాసుదేవ
నీమహత్త్వము నేము వర్ణింపఁగలమె.

22


సీ.

నీ నామకీర్తన నిఖిలమర్త్యస్తోమ
        పాపతూలాహార్య పవనసఖుఁడు
నీ పాద యుగభక్తి నిర్మలకమలాల
        యాకర్షణంబున కాశ్రయంబు
నీగుణశ్రవణంబు నిబిడజన్మార్జిక
        కర్మపాశచ్ఛేద కర్తరగును
భవదీయసద్భక్త పదసేవ ముక్తికి
        బాటయేర్పఱుచు చొప్పరి ముకుంద
సర్వపరిపూర్ణ సర్వేశ సర్వతుల్య
నీ నిజాకార మిట్లని నిర్ణయింప
నెమ్మితోడుత వర్ణింప నిర్జరేంద్ర
హరవిరించాదులకునైన నలవియగునె?

23


క.

శ్రీనాయక నీనామము
నానావిధకర్మరోగనాశమునకు వి
న్నాణంబగు నౌషధ మిది
గానరు దుష్టాత్ము లకట! కంజదళాక్షా!

24


వ.

అని సన్నుతించిన మునివరుల వీక్షించి వసుదేవకుమారుం డిట్లనియె.


మ.

భవరోగఘ్నము లిందుశేఖరహరిబ్రహ్మాది ధార్యంబు లు
త్సవసన్మంగళకారణంబు లొగి సంతాపఘ్నముల్ నిత్యసం
భవపాపచ్ఛిదముల్ జయప్రదము లెప్పాటన్ మఱెల్లప్పుడున్
భవదీయాంఘ్రిసరోజసంజనిత విభ్రాజద్రజఃపుంజముల్.

25

క.

ధరణీసురుల మనంబుల
పరితాపము మాన్చి వారి భక్తిని భజియిం
తుర యెవ్వరేని వారికి
సిరి యాయువు గలిగియుండుఁ జిరకాలంబున్.

26


వ.

అని పలికి వెండియు.

27


క.

విచ్చలవిడి మును లందఱు
సచ్చట మామీఁది భక్తి నెలమి దలిర్పన్
విచ్చేసినకారణ మిది
చెచ్చెర నా కానతిండు శీఘ్రముతోడన్.

28


వ.

ఇట్లు బలభద్రానుజుండు పలికిన మును లిట్లనిరి.


క.

వనజాతరమ్యలోచన
మునిహృదయాంతర్నివాసమోదముతోడన్
బనివింటిమి నిను దర్శిం
పను నింతకు నెక్కుడైన పనులుం గలవే.

29


వ.

అని సన్నుతించి మునువరులు నిజనేత్రచకోరంబులచే వాసుదేవ
వదనచంద్రచంద్రిక పానంబుచేసి తద్విసృష్టులై ద్వారకానగరంబున
కనతిదూరంబున విండాతకంబను పుణ్యతీర్థంబున కరిగి రంత.

30


సీ.

దర్పితులైన యాదవకుమారులు గూడి
        జాంబవతీసూను సాంబుఁ బిలిచి
సకలభూషణములు సమకూర్చి వానిని
        గామినిరూవంబుగా నొనర్చి
మూకలై నవ్వుచు మును లున్నచోటికిఁ
        జని దుర్వినీతులై సాగి మ్రొక్కి
యడుగ సిబ్బితిపడి యట మాటుపడియున్న
        దీగర్భవతియైన యింతి కెవ్వ
రుదయమయ్యెద రూహించి హృదయమందు
నట్టి వృత్తాంత మంతయు నానతీయ
వలయు నని పల్కి ముందఱ నిలచినట్టి
డింభకులఁ జూచి మునులు సంరంభమునను.

31

కవిరాజవిరాజితము.

అని యదుబాలకు లాడిన మాటలు మునులందఱు నాత్మదలం
చినఁ బరిహాసముచిహ్నలు దోఁచిన జిఱ్ఱనఁగోపము చిత్తములం
దెనయఁగ మోముల నెఱ్ఱలు దేరఁగ నీపశుబాలుర నీక్షణ చే
సిన యటమీఁదట జిహ్వల నిప్పులు చెచ్చెర రాలగఁ జెప్పి రయో!

32


క.

వాలాయము యదుకుల ని
ర్మూలకరంబైన యట్టి ముసలం బొక డి
బ్బాలిక కుదయించుం బొం
డాలస్యము లే దటంచు నటఁ బల్కుటయున్.

33


వ.

అంత మదోద్రేకాంధులైన యదుబాలకులు మునుల శాపదగ్ధులై
వణంకుచు సాంబుకుక్షి సిక్షిప్తచేల గ్రంథిమోచనంబు సేయు సమ
యంబున ముసలం బొక్కటి భూతలంబునం బతితంబైన విస్మయం
బంది, దానిం బట్టుకొని వాసుదేవసమక్షంబున కరుగుదెంచి ఏత
త్కథావృత్తాంతం బెఱింగించిన నంత డాత్మకల్పితమాయారూపం
బగుట యెఱింగియు నెఱుంగని యట్ల వారలం జూచి యిట్లనియె.

34


చ.

మదిమదినుండి యాదవ కుమారకులెల్లను మూఁకమూఁకలై
మదమునఁ గన్ను గానక సమగ్రతపోమహిమానురక్తులై
పొదలెడు సన్మునీశ్వరుల బొంకఁగఁ జేయుద మంచు వారలం
గదియఁగఁ బోవఁగా దరలె గ్రక్కున శాపము నాశహేతువై.

35


ఆ.

ఇట్టి విప్రశాప మేరీతినైనను
నడ్డుపెట్ట నొరుల కలవిగాదు
శర్వ కమలజాత శక్రాదు లైనను
దిరుగఁబెట్టలేరు తెలిసిచూడ.

36


వ.

అది గావున.

37


ఉ.

వారిధితీరమందు నొక వర్ణితమైన మహోపలంబు వి
స్తారముతోడ నున్నయది చక్కఁగ మీరట కేఁగి యాదవుల్
దారుణ బాహుసత్త్వములు దప్పక యీ ముసలంబు నూరఁగాఁ
జూరిన చూర్ణమంతయును జల్లుఁడు నీటఁ బడంగ సంగతిన్.

38

వ.

అని యివ్విధంబునం గృష్ణు డానతిచ్చిన యదువీరు లమ్ము
సలంబు పట్టుకొని సముద్రతీరంబునం గలుగుమహోపలంబుమీద జూర్ణం
బుగాఁ దివిచి జలంబులం గలిపి తత్కీలితమగు లోహఖండంబును
సరకుసేయక సముద్రంబునం బడవేయ నది మత్స్యంబు గ్రహించు
టయు, నానుత్స్యంబును లుబ్ధకుండు జాలమార్గంబునం బట్టి తదు
దరగతంబైన లోహఖండంబును బాణాగ్రఫలంబుగా నొనరించుట
యును నిట్లే తత్కథావృత్తాంతం బెఱింగించిన పరీక్షిన్నరేంద్రునకు
శుకయోగీంద్రుఁ డిట్లనియె.

39


సీ.

వినుము నృపాలక వివరించి చెప్పెదఁ
        బూర్వమయినకథ పొలుపు మీఱ
పరమేశభుజగుప్త పాలితద్వారకా
        నగరంబునకు వచ్చి నారదుండు
తద్దయుఁ గృష్ణసందర్శన కాంక్షియై
        హర్షంబుతోఁ దద్గృహాంతరమున
కరిగిన వసుదేవుఁ డమ్మునీంద్రునిఁ జూచి
        తఱితోడ నర్ఘ్యపాద్యముల నొసంగి
యుచితహేమాసనంబున నునిచి బంధ
పుష్పములచేత మిక్కిలి పూజచేసి
చేర డగ్గఱి యామౌని సేమమడిగి
పలికె నాతఁడు నమ్రుఁడై భవ్యచరిత.

40


క.

ఏనరుఁడైననుగానీ
శ్రీనాథుని చరణయుగము సేవించిన య
మ్మానవునకు నమృతము వి
న్నాణంబుగ నేవిధంబునం గవియునొకో.

41


సీ.

నీసమాగమ మది నిఖిలదేహములకు
        మంగళార్థంబు నిర్మలచరిత్ర
తల్లిదండ్రులభంగి ధరణి భూతములకు
        సుఖదుఃఖరూపమై సొంపుమీఱ

నచ్యుత స్థిరచిత్తులైన మీవంటి స
        జ్జనుల రాకలు సుఖాశ్రమము లగును
పరువడి దేవతాభజనంబు చేసిన
        వారిని దేవతల్ వదల రెపుడు
ఛాయమాడ్కిని సత్కర్మసచివులై న
సజ్జనులు దీనులైనట్టి జనులయందు
భక్తి సేతురు గాన నీ భాగవతము
లైనధర్మంబు లడిగెద నానతిమ్ము.

42


క.

ఏ ధర్మంబులు విని యమ
బాధలలోఁ బడక నరుఁడు పావనుఁడై లో
కాధారపదముఁ జెందునొ
యాధర్మము లానతిమ్ము హర్షం బొదవన్.

43


క.

శ్రీ రమణుఁ దొల్లి సుతుఁగాఁ
గోరితి భువిలోన ముక్తిగోచరమార్గం
బారూఢి నడుగ మఱచితి
దారుణసురమాయచేతఁ దత్తరపడుచున్.

44


క.

ఏ రీతిని జిత్తవ్యధ
నారక్షితమైన యాశ్రయంబగు నీసం
సారచ్ఛేదక మెట్లగు
నారీతిని నానతిమ్ము హరికథ లనఘా.

45


వ.

ఇట్లు వసుదేవకృతప్రశ్నుండై నారదుండు హరికథాసల్లాప సం
స్మారితుండై సంతసంబంది యి ట్లనియె.

46


సీ.

నీవు చేసినప్రశ్న నిర్మల సుజ్ఞాన
        జనకంబు సాత్త్వతర్షభ సమస్త
శాస్త్రవేదంబుల సారమ్ములౌ భాగ
        వతధర్మముల నడిగితివి యనఘ

విశ్వపావనములై వినినఁ బఠించిన
        నాదరించినఁ జిత్తమందు నిలుప
సద్ధర్మచయము విశ్వద్రోహినైనను
        బావనుఁజేయు విభ్రాజమాన
పరమకళ్యాణుఁ డైనట్టి పరమపురుషుఁ
డాదిదేవుఁడు భగవంతుఁడైన విష్ణు
మనములోపలఁ బరితోష మినుమడింప
స్మారితుండయ్యె నీచేత సత్యవినుత.

47


వ.

అది గావున విష్ణుభక్తిజనకంబై ముక్తిపదప్రాప్తికరం బగు
నార్షభవిదేహసంవాదంబు నాఁబరగు నొక్కపురాతనంబగు కథా
వృత్తాంతం బెఱింగించెద నాకర్ణింపుము.

48


సీ.

వినుము స్వాయంభవుండను మనువునకు
        రమణ నుదయించెనట ప్రియవ్రతుఁ డనంగ
..................................
        ..................................
..................................
        .................................
..............................
        ..............................
................................
................................
తనయుఁ డాతని కాగ్నీధ్రుఁడను సుతుండు
జాతుఁడయ్యెను భువనవిఖ్యాతుఁ డగుచు.

49


క.

ఆగ్నీధ్రునకు న్నాభను
ప్రాజ్ఞుండగు సుతుఁడు పుట్టి బలిమిం ద్రిజగం
బాజ్ఞాసిద్ధిగ నేలుచు
సౌజ్ఞామాత్రంబు చేసె సకలాహితులన్.

50

క.

మతమున నానాభికి స
త్సుతుఁడయి ఋషభుండు పుట్టి సుందరహృదయ
స్థితవిష్ణుభక్తుఁ డగుచును
జతురతతో నతఁడు తనుజశతముం బడసెన్.

51


వ.

ఇట్లు గాంచిన ఋషభకుమారశతంబున కగ్రజుండైన భరతుం
డనుమహాత్ముండును నారాయణపరాయణుండై ఇహలోకసుఖంబుఁ
బరిత్యజించి ఘోరతప మాచరించి జన్మత్రితయంబునం బరమపథంబు
నకుం జనియె నతనిమూలంబున భారతవర్షం బనియెడి నామంబు
జగంబునఁ బ్రసిద్ధంబయ్యె మఱియు నందు తొమ్మండ్రు గుమారకులు
బలపరాక్రమతేజోరూపసంపన్నులై, నవఖండంబులకు నధీశ్వరు
లయిరి. మఱియు నెనుఁబదియొక్కండ్రు గుమారకులు కర్మతంత్ర
నిష్టులై విప్రత్వం బంగీకరించిరి. అందు శేషించిన వారలు కవి,
హరి, యంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిహోత్ర, ద్రవిళ,
సమస్త, కరభాజను లనంబరగిన సుతనవకంబు నూర్ధ్వరేతస్కులై
యాత్మవిద్యావిశారదులై సకలజగంబును బరమాత్మాధిష్టితంబు
గాఁ దెలియుచు ముక్తులై యవ్యాహతగమములగుచు సురఁ సిద్ధ
సాధ్యగంధర్వ యక్షకిన్నర నాగలోకంబుల స్వేచ్ఛావిహారంబు
సేయుచు నొక్కంనాడు :-

52


మ.

త్రిజగన్నాధుని సద్గుణంబు లొగి భక్తిన్ సన్నుతుల్ సేయుచున్
విజితాత్మేంద్రియులైన యట్టి మును లుర్వీభాగమధ్యంబునన్
దజనాభక్షితిపాలవుంగవుని యజ్ఞాంతంబున న్వచ్చినన్
యజమానర్త్విజుల న్నెదుర్కొనిరి సూర్యాభీలతేజస్కులన్.

53


క.

నారాయణరూపములగు
వారలఁ దోతెంచి భక్తివైభవసుగుణో
దారుండైన విదేహ
క్ష్మారమణుఁడు పూజచేసె సభలోన నృపా.

54

సీ.

దివ్యకాంతులచేతఁ దేజరిల్లెడు మిమ్ము
        హరికి బార్షదుల నానెఱుఁగుచుందు
విష్ణురూపంబుల వెలయు మూర్తులు లోక
        పావనంబునకునై పరగుచుండు
క్షణభంగురములైన సకలదేహములందు
        మానుషాకారంబు పూను టరుదు
ఆమానవాకృతియందు దుర్లభమగు
        విష్ణు సద్భక్తులవీక్షణంబు
నట్లు కావున మిమ్ము నాత్యంతికస్వ
రూపమయినట్టి సేమంబు రూఢితోడ
నడుగవలసెను సంసారమందు సుజన
సంగతించుక సేపైనఁ జాలమేలు.

55


క.

నారాయణుఁడు ప్రసన్నుని
కేరీతిని నిజశరీర మిచ్చును దయతో
నారీతి విష్ణుకథలను
తేరకొనన్ నేడు నాకుఁ దెలుపుఁడు మీరల్.

56


వ.

అని యిట్లు విదేహుం డడిగిన హరిచరణస్మరణామృత
మత్తనిజస్వాంతులై శాంతులైన నవమునుల సమాజంబునందు
యను మహాత్ముం డిట్లనియె.

57


సీ.

ఉద్విగ్న బుద్ధిసంయుక్తుఁడయ్యు పదాత్మ
        భావుఁడై నిత్యంబు బరగునట్టి
వానికి సంసారవార్ధిలో నెప్పుడు
        నచ్యుతపాదయుగాబ్జసేవ
విశ్వంబు నాత్మయు వేఱుగా భావన
        సేయ జయం బెల్లఁ జెఱచు మఱియు
నజ్ఞులయినవారి నాత్మవిజ్ఞానార్థ
        మైహరి యేయుపాయములఁ జెప్పె

నప్రమాదములై నట్టి యాయుపాయ
ముల మనుష్యుండు తానొంది మురువుతోడ
బరగు బ్రహ్మాదిసన్నుతంబగుచు మీఁద
నుజ్వలంబగు విష్ణుసాయుజ్యమునకు.

57


గీ.

నయనములు మూసికొని చక్కనైనత్రోవ
బరువువెట్టుచు నటఁ దొట్రుపాటు లేక
చనెడి మనుజునిమాడ్కి నిశ్చలయథార్థ
భక్తిచేఁ బొందు సులభంబు పరమపదము.

58


క.

పరువడిఁ గాయవచోహృ
త్సరసేంద్రియబుద్ధిభావసంఘముచేతన్
నరుఁ డేమి చేసె భక్తిని
హరి కర్పణ సేయవలయు నాకర్మములన్.

59


సీ.

ఈశాదిజేత యయినవానికి ద్వితీ
        యాభినివేశాన నధికభయము
దోఁచినఁ దన్మాయతోడ సంకలితుఁడై
        స్మృతివిపర్యయములఁ జెందుచుండు
నదిగాన గురుదేవతాత్ముఁడై బుధుఁడు శ్రీ
        విభు నేకభక్తి సేవింపవలయు
స్వప్నమనోరథచ్ఛాయ నీశుఁడ విద్య
        మానుఁడై తోఁచును మనమునందు
సర్వసంకల్పనాశకచలనహేతు
వైనదాని నరుఁడు కుదియంగఁ దిగిచి
సంతతధ్యాన మేప్రొద్దు జరిపెనేని
కలుగు నతనికి ముక్తి విఖ్యాతముగను.

60

మ.

అనయంబున్ హరిజన్మకర్మకథలన్ హర్షంబుతో వీనులన్
వినియుం బాడుచు నాడుచున్ వ్రతముతో విశ్వంబులో సంచరిం
పను లజ్జింపక లోకబాహ్యుఁడగుచున్ భావంబులో నవ్వుచున్
ఘనతత్పాదకృతానురాగుఁడగుచున్ గాంతారదేశంబులం
దునె వర్తించును వెఱ్ఱివానిక్రియఁ దుల్యోత్సాహసంపన్నుఁడై.

61


వ.

మఱియు నాకాశంబును వాయువును నగ్నిసలిలంబులను ధర
ణిని తేజంబును దేశంబులను మహీరుహంబులను నదులను సముద్రంబు
లను నారాయణశరీరంబుగా విచారించి భేదంబు సేయని ప్రసన్ను
నికి భుజియించెడివానికి నొక్కకాలంబునం దతుష్టియు, క్షుధా
పాయంబునునైన చందంబున భక్తియుఁ బరేశానుభవంబు నన్యత్ర
విరక్తియుం గలుగు; నిట్లచ్యుతాంఘ్రిసేవాపరుండై భాగవతుండు
సాక్షాత్కారంబునంద వసియించు నని వారి భక్తిప్రకారంబు
చెప్పిన విని విదేహుం డిట్లనియె.

62


ఆ.

వరుసతోడ భాగవతధర్మ మెద్ది చ
ర్చింప భాగవతుల చిహ్న లెవ్వి
అతఁడ యేమి పలుకు నాచరించునొ యెద్ది
చెలఁగి యెట్టికథలు చెప్పవలయు.

63


వ.

ఇట్లు విదేహుం డడిగిన నందు హరియను మహాత్ముం డిట్లనియె.

64


సీ.

సర్వభూతములందు సర్వేశుభావంబు
        సర్వేశునందును సర్వభూత
భావంబు నొనరించుఁ బరమభాగవతుండు
        ఉత్తమోత్తముఁడన నుర్వి వెలయు
పరమేశ తదధీన బాలిశరిపులందు
        ప్రేమమైత్రియు గృపాపేక్ష లొసఁగు
నతఁడు మధ్యముఁడగు నర్చావతార స
        ద్భక్తిసంయుక్తుండు ప్రాకృతుండు

ఏనరుండైన నర్థంబు లింద్రియముల
చేత గ్రహించియును సర్వజాతులందుఁ
గ్రమము దప్పక యొక్కమై సమముగాను
యోగమును జూచు నాతఁడ భాగవతుఁడు.

65


సీ.

అనయంబు దేహేంద్రియప్రాణహృద్బుద్ధు
        లకు నేవి గాలంబు ప్రకటమగుచు
సొరిది జన్మాప్యయక్షుద్భయతర్షాది
        బహుళసంసార సంభవములైన
యట్టి ధర్మములచే నవిముహ్యమానుఁడై
        కర్మకామంబుల కాశ్రయంబు
గాక జన్మాదికకర్మ వర్ణాశ్రమ
        జాతివర్గంబులచేతఁ జెడక
స్వపరవిత్తాత్మభేదంబు సలుప కఖిల
భూతములయందు సమమైన బుద్ధి కలిగి
పరమపురుషుని పాదాబ్జభక్తిఁ దనరు
పరమపుణ్యుఁడు వాడువో భాగవతుఁడు.

66


వ.

మఱియు సస్యస్త సకల కర్మారంభుండై యఖిలజీవవత్సలుఁడైన
పరమేశ్వరభక్తుండు బాలభాస్కరుండు కిరణరేణుచయంబుచే లోక
త్రయంబును బావనంబు సేయుచందంబున నతండు నిజపాద జనిత
రజఃపుంజంబులచేత జగంబు పవిత్రంబు సేయుచు సురాసుర మృగ్యం
బైన భగవత్పాదారవిందంబుల భక్తి వలన లవమాత్రంబును జలిం
పక చంద్రోదయంబున భాస్కరజనిత తాపనివారణం బగుచందం
బున భగవత్పాదాంగుళి నఖమణి చంద్రికా నిరసితహృదయ
తాపుండై యాత్మీయభక్తికతన వాసుదేవాంఘ్రిసరోరుహంబు
గలుగునతండు భాగవత ప్రధానుండని యెఱింగించిన విని విదేహుం
డిట్లనియె.

67

క.

మాయగల వారి నొయ్యన
మాయలఁ బొందించునట్టి మరుజనకుఁడు యా
మాయను వినుపింపుడు మీ
రాయతవాక్ప్రౌఢి మెఱసి హర్షం బొదవన్.

68


గీ.

జనుఁడు సంసారతాపనిస్తప్తుఁ డగుచు
న్మహారోగమున కౌషధం బనఁగ
దనరు భవదీయవాచామృతంబుఁ గ్రోలిఁ
దృప్తిఁ బొందగ కథ లానతిండు మీరు.

69


వ.

అనిన విని యంతరిక్షుం డిట్లనియె.

70


సీ.

భవ్యనిర్గుణపరబ్రహ్మంబు నందును
        దనకు విపర్యయజనకమైన
జ్ఞానంబు దోఁచును సర్వేశుఁ డేమాయ
        చేతను జగము విఖ్యాతముగను
నిర్మించి యటమీఁద నిశ్చిత్తుడై యుండి
        విహరించు నదియ శ్రీవిష్ణుమాయ
ఇంద్రియార్థభ్రమం బిదియ జాగ్రదవస్థ
        మానసభ్రమము దుర్మదుర కెపుడు
స్వప్నజావస్థ మరియుఁ దద్వాసనలకు
సూచకంబగు బీజంబు సుప్త్యవస్థ
సరుసఁ బరమేశు జోడ నన్వయము సేయు
నదియ పరికింప నాల్గవదగు నవస్థ.

71

వ.

మఱియు స్వప్నమందు గ్రాహ్యగాహకగ్రహిత్వభేదంబులచే
మూఁడువిధంబులై తోఁచు చందంబున జ్ఞానంబును మాయాసమావృ
తంబై త్రివిధంబై పర్యవసించు మనోరథంబు స్వప్నావస్థయం దణంగిన
క్రియ త్రివిధం బగు మాయయు నాత్మయందే లీనంబగు; పరమేశ్వరుండు
మొదలను పృథివ్యాదిమహాభూతమయమైన సృష్టి సృజించి పంచధాతు
వుల చేతఁ బ్రవేశించి యాత్మ నేకాదశేంద్రియంబులచే భవంబు పుట్టిం
చుచు గుణంబులచేత గుణంబుల నంగీకరించుచు నాత్మప్రద్యోతితగుణం
బులచేతను గుణానుభవంబు చేయుచున్నవాఁడై యీసృష్టిని నాత్మీ
యంబుగా విచారించుచు దేహి కర్మమూలంబున నైమిత్తిక కర్మంబుల
నాచరించుచు దత్ఫలం బంగీకరించి దుఃఖైకవశుండై వర్తించు; పెక్కు
విధంబుల బొందిన యీదేహి కర్మఫలంబుల నంగీకరించుచు, భూత
సంప్లవపర్యంతము పరవశుండై జన్మంబుల బొందుచుండు, నంత
ధాతూప్లవం బాసన్నం బైన ద్రవ్యగుణస్వరూపంబగు జగంబును,
అనాధినిధనంబగు కాలంబును, ప్రకృతింబొందుచు నటమీఁద శతవర్షం
బులు వర్షంబులేమియు నంత సూర్యుండు నిజతేజంబుచే సకలలోకం
బులు దహించుటయు, పాతాళలోకంబువలన సంకర్షణ ముఖజనితా
నలం బూర్ధ్వముఖంబై వాయుసహాయంబై దిక్కులయందు వర్ధిల్ల నంత
సంవర్తకమేఘంబులు నూఱుసంవత్సరములు ధారావర్షంబులు గురియు
నంద విరాడ్రూపం బగు; నంత వై రాజపురుషుండు నిరింధనంబగు నగ్ని
చందంబున నవ్యక్తంబుఁ బ్రవేశించు నంతభూమి వాయుహృతగంధంబై
జలరూపంబు దాల్చు; నాజలంబు హృతంరసంబై తేజోరూపంబు నొందు;
నాతేజంబు తమోవినిహతసారంభై వాయునం దణంగు; నా వాయువు
హృతస్పర్శ గలదై యాకాశంబునందు సంక్రమించు; నా యాకాశంబును
వితతశబ్దగుణంబు గలదై యాత్మయం దణంగు; నంత నింద్రియంబులు

మనంబున బుద్ధియు వికారగుణంబుతోడ నహంకారంబునందు ప్రవేశించు;
నా యహంకారంబును స్వగుణయుక్తమై పరమాత్మం జేరు; నిట్ల ద్రివర్ణా
త్మంబైన మాయారూపంబు మాహాత్మ్యం బిది యని చెప్పిన విని నరపా
లకుం డిట్లనియె.

72


గీ.

జ్ఞానహీనులైన నరులచేఁ దరియింప
రాని మాయ నంతరాత్మ యెట్లు
దాఁటి పరమపదము డాయంగఁ జనుచుండు
నట్టి కథలు నాకు నానతిండు.

73


వ.

అనిన నందుఁ బ్రబుద్ధుం డిట్లనియె.

74


క.

నిరుపమదుఃఖవినాశము
కొఱకును ఘనమైన సుఖమ్ము కొఱకును గర్మా
చరణంబు సేయు నరులకు
వెరవుడిగవు చుండు పాక విపరీతమ్ముల్.

75


క.

దినదినము దుఃఖకర మ
యిన విత్తగృహార్త పుత్ర హితపశువులచేఁ
దనువేమి సంతసం బొద
గావును గాన నరులుఁ దొంగుచుందురు వృథయై.

76


చ.

అతిశయతుల్యనాశముల కాశ్రయమైన జగంబు యోగి దా
సతతము నశ్వరం బని విచారము సేయుడు విష్ణుభక్తిసం
పదలను విఱ్ఱవీగుచు ప్రసన్నతఁ బొందినయట్టి సద్గురున్
ప్రతిదివసంబు తీవ్రమగు భక్తిని సేవ యొనర్ప మేలగున్!

77


చ.

మొదలను సాధుసంగమము ముక్తిద విష్ణు కథానురాగమున్
హృదయమునందు భూతదయ హీనవిసర్జన మాత్మశౌచమున్
వదలని బ్రహ్మచర్యమును ద్వంద్వసమత్వము వేఱెత్రోవలన్

బదమిడకుంట చూడ నినె భాగవతోజ్జ్వల ధర్మపద్ధతుల్.

78


సీ.

ఈరీతి బరమేశహితులందు నెయ్యముల్
        సేయుచు హరికథల్ సెప్పుకొనుచు
పులకాంకురంబుల బొదలి బాష్పాక్షుఁడై
        యొకవేళ సంతోషయుక్తు లగుదు
రొకవేళ భాషింతు రొకవేళ నాట్యంబు
        సలుపుదు రధికవిస్తంద్రు లగుచు,
నొకవేళఁ బరమాత్ము నూహింతు రాత్మలో
        నొకవేళఁ జూతురు సకలజగము
నివ్విధంబున వర్తించు భవ్యమతుల
చేత దరియింపవచ్చు విశ్వేశుమాయ
సస్యమతులవర్తించు నట్టివాఁడు
యెట్లు దాటంగనోపు నుర్వీశ్వరేశ.

79


వ.

అనిన విని నరపాలపుంగవుండు వారల కిట్లనియె. పరమభాగ
వతులారా! సకలలోకనాయకుండగు నారాయణాభిధానంబు గల
పరమాత్ముని నిష్ఠ వినవలయు నానతిండని పలికన నందు పిప్పలాయనుం
డిట్లనియె.

80


క.

సురసంఘములకు సన్ముని
వరులకు హృదయంలో నివాసుండగునా
పరమాత్మ నిష్ఠ చెప్పెద
సరసత నాలింపవయ్య సౌభాగ్యనిధీ.

81


వ.

మఱియు సకలలోక స్థిత్యుద్భవ లయ కారణంబై స్వప్న
జాగ్రత్సుషుప్త్యవస్థలయందుఁ గలుగుచున్న దేహేంద్రియ ప్రాణంబు
లెవ్వనిచేత సంజీవితంబు లగు నదియ పరంబు జ్వాలలు దిరుగ నగ్ని

యందుఁ బ్రవేశింప వీ రీతి నింద్రియంబు లాత్మయందుఁ బ్రవేశింపవు.
విశ్వంబు బోధకనిషిద్ధం బగుటంజేసి యర్థోక్తముఁ జెప్పును. మొదలను
సత్వ రజస్తమోగుణంబులను మహదహంకారరూపంబుగాఁ జెప్పుదురు.
మఱియు జ్ఞానక్రియార్థఫలరూపంబు గల దౌటంజేసి జీవంబుగాఁ జెప్పు
దురు. ఇది సదసద్రూపంబునం బర్యవసించు. దీనికి బెరయైనది పర
మాత్మగా నెఱింగి బ్రహ్మాదులు నన్ను సన్నుతింతురు. ఇట్టి పరమాత్మ స్థావర
జంగమాధిష్ఠితంబై వృద్ధి క్షయంబులం బొందక యుపలబ్ధి మాత్రయై
యండవిశితకలలాదులందు జీవంబుల బాసి తన్మధ్యంబుఁ వేఱయై వర్తించు.
మఱియు నయ్యాత్మ సర్వేంద్రియావృతంబగు నాకారంబు నష్టంబైన మనం
బునం బాసి స్మృతిలేక వర్తించు నిర్మలదృష్టిఁ గలవానికి సూర్యప్రకాశంబు
దోఁచినగతి జ్ఞానవంతుఁడు హరిభక్తిచేత గుణకర్మోత్థంబులైన విత్త
దోషంబులం బరిత్యజించి భగవత్పదంబు చేరునని చెప్పిన రా జిట్లనియె.

82


క.

పురుషుం డేకర్మము లా
చరించునో వానిచేత సత్కృతుఁడై శ్రీ
హరిపాదము లెటు చేరునొ
దురితంబులఁ బాసి సంతతోత్సాహమునన్.

83


వ.

అనిన విని యావీతిహోత్రుం డిట్లనియె.

84


సీ.

కర్మంబె కర్మనికర్మంబులగు వేద
        వాదంబు లౌకికవర్తితంబు
వేదసంఘములు సర్వేశురూపము గాన
        మొనసి విద్వాంసులు మోహపడుదు
రట్టివేదంబు కర్మాచారమునె చెప్పు
        జతురత కర్మమోక్షంబుకొఱకు

విష్ణుమూలంబుగా వేదోక్తకర్మంబు
        లాచరింపక ఫలంబందువాంఛ
సేయువారలు వివిధజన్మాయుతములఁ
బొందుచుందురు మోక్షంబు నొందఁగోరు
వాండ్రు తంత్రోక్తమార్గాన వనజనాభు
పూజ సేయంగ వలయు సమ్మదముతోడ.

85


వ.

ఆపూజాప్రకారం బెట్టి దనిన.

86


సీ.

శుద్ధాత్ముఁడై దేహశోధనం బొనరించి
        శ్రీనాథ సన్ముఖాసీనుఁ డగుచు
పూజాది చిత్తంబు పూతంబుగాఁ జేసి
        ప్రకటలబ్ధోపచారముల చేత
నభినవద్రవ్యభూమ్యాత్మలింగంబుల
        సంప్రోక్షణముఁ జేసి చక్రధరు
కాసనంబును నర్ఘ్యమాచమనీయంబు
        పాద్యంబు భక్తి సమర్పణఁ జేసి
పుష్పగంధాక్షతల చేతఁ బూజ చేసి
భక్తి తోడుత దీపధూపంబు లొసఁగి
బహువిధాన్నంబు లారగింపంగఁ జేసి
గరిమ జేయంగవలె నమస్కారములను.

87


క.

ఈరీతిని బరమాత్మగు
శ్రీరమణుని భక్తిఁ బూజ సేయుచు నతనిన్
నిరాగ్న్యర్కావిధులం ?
దారయ వీక్షించు నతఁడు హరిఁజేరు నృపా.

88


వ.

అని పలికిన విదేహుం డిట్లనియె.

89

ఈశ్వరుండువిష్ణు డేమేమి కర్మంబు
లాచరించె నాకు నానతిండు
సొరిది యుష్మదీయ సూక్తులు విని నాదు
చితి మంతకంత చెంగలించె.

89


వ.

అని పలికిన నందు ద్రవిముం డిట్లనియె.

90


క.

భూరేణు వెన్నవచ్చును
నే రీతినినైనఁ ద్రిభువనేశ్వరు గుణముల్
(ధీరతవో) నెఱుఁగుదు మను
వారలు పో చాల బుద్ధివారు నృపాలా.

91


సీ.

ఆత్మసృష్టంబులై అధికమైన పంచ
        భూతసంఘంబుచేఁ బుర మొనర్చి
యాపురంబందు నిజాంశంబుచేఁ జొచ్చి
        నారాయణాభిధానంబుఁ గలుగు
నట్టి సన్ముని వరు నాదిదేవుఁడు వొంది
        నీ దేహ మాశ్రయం బీజగత్తు
లే మునీశ్వరుని రసేంద్రియముల చేత
        నీ దేహధారుల నింద్రియములు
పాలితములయ్యె మఱియు భూభాగమునను
జగము రక్షింప నిర్మింప సమయఁ జేయ
లాలి గుణనిష్ఠుఁడై రాజసంబు మెఱసి
దివిజగణములు మెచ్చ వర్తించు నతఁడు.

92


రాజసంబున బ్రహ్మయై రమణ మెఱసి
సత్వగుణమున విష్ణుఁడై జగము నిలిపి

తామసంబున రుద్రుఁడై తనరుఁ బరమ
పురుషుఁ డొక్కఁడు త్రిగుణసంపూర్ణుఁ డగును.

93


వ.

అట్టి నారాయణ చరిత్రంబుఁ జెప్పెద నాకర్ణింపుము.

94


సీ.

ధర్మరాజటఁ గాంచె దక్షుని సుతయిందు
        నారాయణాభిధానంబు గలుగు
శాంతుఁడైన మునీశ్వరు నాతఁ డొనరించె
        వైష్కర్మ్యమగు లక్షణంబు మిగుల
నఖిల సుజ్ఞానియై యఖిల సన్మునివంద్యుఁ
        డగు మునీశ్వరు నమరవిభుఁడు
ఈక్షించి శంకించి యిచ్చలో బెగ్గిలి
        యితఁడు మత్పదవిఁ గో దేగుదెంచు
ననుచు మదనుని రప్పించి యమరలోక
కామినులఁ గూర్చి వారి వేగంబుతోడ
నిమ్మహాత్ముని సామర్థ్య మెఱుఁగలేక
రమణఁబనిచెను బదరికాశ్రమమునకును.

95


వ.

ఇట్లప్సరోగణసమేతుండైన మదనుండు నిజబలంబులఁ గూడి
నారాయణాశ్రమంబుఁ బ్రవేశించె నంత.

96


చ.

వనమునఁ గల్గు భూజములు పర్ణితపల్లవ పుష్పసత్ఫలా
భినుతములయ్యు షట్చరణ బృందనినాద మనోహరంబులై
యనవరతంబుఁ గోకిల కలార వసంకులమయ్యె నాశ్రమం
బనయము గామినీసహితుఁడై మదనుండు చరించె నంతటన్.

97


క.

మరుఁదాయత సంతసమున
సురకాంతల చూపు లనెడి సురుచిరబాదో

త్కరములను భేదపఱచెను
దిరముగ నామౌని హృదయదేశం బధిపా.

98


క.

జలచరకేతన మాయెను
దలకక హృదయంబులోనఁ దాత్పర్యముతో
బలభిన్మాయను ఋషి దాఁ
దెలిసి కనుంగొనియె నచటి దేవాంగనలన్.

99


వ.

అంతట నారాయణమునీంద్రుఁ డకాలవసంతాగమము నిరీ
క్షించి మనంబున దిరంబుఁ దప్పక కాంతాజనసహాయుండైన మదను
నాలోకించి యిట్లనియె.

100


క.

వెఱవకుము మత్స్యకేతన
సురకాంతాజనములార సొంపున నిచటన్
కరమొప్ప గ్రీడ సల్పుఁడు
పురుహూతుని యాజ్ఞ చేసి పూజితు లగుచున్.

101


వ.

అని నారాయణ మునివరుం డానతిచ్చిన యాజ్ఞానమితకంధ
రులై సురకామిను లిట్లనిరి. దేవా! పరమపదంబు కొఱకు సమ్యత్ జ్ఞాన
భరితులై నిశ్చలంబున పుత్రదారాప్త గృహ పశుద్రవ్యంబులయం దా
సక్తి వర్జించి పరమపదనివాసంబు కొఱకు తపం బొనరించు పరమ
పుణ్యులకు సుకృతంబులైన విఘ్నంబులు ప్రాప్తం బగుఁ గాని బర్హిస్సు
లందు సురభాగంబు లైన బలులం బెట్టెడి కర్మనిష్ఠులకు దత్కృతాంతరా
యంబులు చెందవు. క్షుధయు, తృష్ణయుఁ ద్రికాలగుణంబును పంచ
మారుతంబులును జిహ్వమేహన వికారంబు లనియెడి మహాసముద్రము
లును పరమయోగి మనోవికారగుణంబులగు మమ్మును దరియింపలేక
క్రోధవశులై తపంబును దిగనాడి గోష్పదోదకంబు నందె మునుంగు
దురు. మునిపుంగవా! నీ తపోమాహాత్మ్యం బచింత్యంబు భవదీయ

గుణంబులు సన్నుతింప బ్రహ్మరుద్రాదులుగాని మదీయవాచాగోచరంబు
గాదు. మావలని యపరాధంబులు సహింపవలయునని దండప్రణామ
పూర్వకంబుగా సన్నుతించి సమ్ముఖంబున నిలిచి యున్నసమయంబున.

102


క.

ఆ మునివరుఁడు సృజించెను
కామినులను నూరురోట్ల ఘనభూషణులన్
ఆ మానినులను జూచిరి
వేమఱు సురలోకసతులు విస్మయయుతులై.

103


వ.

ఇట్లు నారాయణమునీంద్రుఁడు నిజశరీరంబు వలనఁ గాంతల
సృజించి యంత.

104


గీ.

వీరిలోన నొక్క నారీశిరోమణి
బొదుపుమీర దొడొక పొండటంచు
సొరిది నమ్రులైన సుకలోకకాంతల
కానతిచ్చె మునివరాగ్రవరుఁడు.

105


వ.

అని మునీశ్వరుఁ డివ్విధంబున నానతిచ్చిన దేవతలా వనిత
సతులందు మిక్కిలి వర్ణితంబగు నూర్వశింగొని దివంబున కేగి యీకథ
గోత్రభేదను పెద్ద కొల్వునఁ దగ న్వినిపింపఁ జిత్తములోన నింద్రుఁడు
బెగ్గిలెన్.

106


క.

ఈ నారాయణ చరితం
బేనరుఁడు పఠించు నాతఁ డిహలోకమునన్
మానిత సంపత్సహితుం
డౌ నరహరి పదముఁ జేరు నటమీఁదఁ దగన్.

107


సీ.

పరమహంసుని స్వరూపంబున ఋషుభుని
        కాత్మయోగముఁ జెప్పి యచ్యుతుండు
ధారుణిలో జగద్భారావతరణంబు

        కొఱకు మత్స్యాకృతి గోరిపొంది
సోమకాసురుఁ జంపి సొరిది వేదము హయ
        గ్రీవ వక్త్రంబున గీలుకొల్పి
యాదివరాహమై యటరాత్రి చరియింప
        యుదకరాశి వలన నుర్వియెత్తి
జలధి మధనంబుఁ జేసెడి సమయమందు
కూర్మరూపంబు వడిఁదాల్చి కుధర మెత్తి
మకరిచేఁ జిక్కి మొఱవెట్ట మత్తగజము
గాంచె వేదంబు దివిజసంఘంబు వొగడ.

108


చ.

నరహరిరూపమై యసురనాధుని బట్టి వధించి దర్పితా
సురహృతదేవకామినుల సుందరరూపవిరాజమానలన్
జెర విడిపించి గాఢమగు చీఁకటిఁ డాగిన గోత్రభేదనున్
బరువడి దెచ్చి వాకమున బట్టము గట్టెను సంతసంబునన్.

109


క.

ఈడాడ దిరుగులాడుచు
వేడబమున జన్నవడుగు వేషముతోడన్
గ్రీడించుచు లక్ష్మీశుఁడు
మూడడుగులు దనుజు నడిగె ముదమున ధరణిన్.

110


క.

అయ్యవసరమున భార్గవు
డయ్యమరులు మెచ్చ ఘనశరాసనధరుఁడై
ముయ్యేడుమార్లు రాజులఁ
గయ్యంబున నేపడంచె ఘనరోషమునన్.

111


చ.

దశరథనందనుం డగుచు దర్పితులౌ ఘన యాతుధానులన్
నిశితశరాలిచే దునిమి నీరధిదాటి సమస్తమర్కటా

తిశయబలంబు గొల్వ నట దేవగణంబులు సన్నుతింపఁగా
దశవదను న్వధించెను ప్రతాపముఁ తోడుత సానుజాతుఁడై.

112


క.

విదితాయువుల వధింపను
సదయుండై దివిజవరుల సంరక్షింపన్
ఉదయింపఁగలఁడు కృష్ణుఁడు
యదుకులమున కృష్ణరాముఁ డనియెడి పేరన్.

113


గీ.

గరిమతో బుద్ధరూపమై కర్మయోగ
మునఁ బ్రవర్తించు వారల మోహపఱచు
కలియుగాంతంబు నందును కల్కియగుచు
సకల శూద్రక్షితీశులఁ జంపఁగలఁడు.

114


వ.

అని యివ్విధంబున ననంతంబులైన భగవజ్జన్మకర్మంబులఁ
జెప్పిన విని విదేహవరపాలకుఁ డిట్లనియె.

115


క.

హరిపాదయుగళసేవా
పరతంత్రులు గాక మనసు పరమార్గములన్
జరియింపఁ జేయుచుండెడి
నరులకు గతి యేది మౌనినాథమునీంద్రా.

116


వ.

అని పలికిన నందు చమనుం డిట్లనియె.

117


క.

శ్రీరమణీశుని ముఖబా
హూరుపదాబ్జముల వలన నుద్భవమయ్యెన్
ధారుణి నాశ్రమములతో
సారెపడన్ భూసురాది జాతులు నవడిన్.

118


క.

వీసరులం దెప్పుడు శ్రీ
మానినిపతి పాదసేవ మరుగక తిరిగి

యానరుఁడు నరకరూపము
లోన పడున్ గూలు హీనలోకస్థితుఁడై.

119


చ.

కలియుగమందు శూద్రులును గామినులున్ హరిపాదభక్తి సం
కలితులు గాన వారు హతకల్మషు లెచ్చటనైన భూసురా
దులు యజనంబు సేయుచును దుర్మదులై కమలాధినాథభ
క్తుల దర్శించి నవ్వుదురు దూరమునన్ ఘనకర్మసంగులై.

120


క.

సుదతులుఁ బురుషులు దఱచై
సదనంబులయందుఁ గ్రీడసల్పుచు నటస
మ్మదమునఁ బశుసంఘము జం
పుదు రవిధానంబుతోడ భూసురు లనఘా.

121


క.

సిరిచేతఁ గులముచేతను
సరసంబగు విద్యచేత జాగముచే దు
ర్నరులు మదంబున గానక
హరిభక్తులు నవ్వుచుందు రతిగర్వమునన్.

122


గీ.

ఆకసంబుమాడ్కి నఖిలజీవులయందు
పూర్ణుఁ డైన పరమపురుషు కథలు
వినక కోర్కులందు వితతప్రయత్నులై
ఖలులు చనుదు రంత్యగతుల కడకు.


క.

ఘనధర్మైకఫలంబగు
ధనమును జ్ఞానంబు పుత్రదారాప్తులచే
తను బూర్ణమైన గృహమం
దును నిలుచుచు నెఱుగ రాత్మ దుర్మృత్యువులన్.

128


సీ.

బహువిధానములచేఁ బ్రారంభితంబగు
        శాస్త్రీయమైన పశ్వాదిహింస

వరుస తోడుతఁ బ్రత్యవాయకరంబుగా
        దదికర్మమార్గ మర్యాద జూడ
శాస్త్రంబు వర్జించి సద్విధానము లేక
        దుర్జనుల్ పశువులఁ దునుముచుందు
రాఖలుల్ పరమేశు నందు రోషించుచు
        దుర్గతిఁ జెందుచుందురు నృపాల
పొలుపుతో ముక్తిమార్గంబుఁ బొందలేక
జ్ఞానహీనతఁ బొంది యజ్ఞాన మొదవి
యాత్మఘాతకులైన దుష్టాత్మకుల న
కాలమృత్యువు సమయించుఁ గరుణ లేక.

124


శా.

అప్రత్యమ్ము విముక్తమార్గమని విద్యాగర్వసంపన్నులై
విప్రుల్ గొందఱు దారపుత్రసమితిన్ వీక్షించి విత్తార్థమై
యప్రామాణ్యపదంబున న్దిరుగుచున్ యజ్ఞానగుప్తోల్లస
త్సుప్రాజ్ఞారహితాత్ములై నిలుతు రస్తోకాగతిన్ మాధవా.

125


సీ.

కామార్తులై మీదుఁ గానక పరకీయ
        కామిని కుచనేత్త్రకచములందు
కరబాహుమూలవక్త్రాబ్జపాదాధర
        ప్రకటకుంతలతనుప్రభలయందు
గండద్వయోదారఘననితంబములందు
        వర్ణితోరుద్వయవర్ణమందు
భూషణాంబరమ్యభాషణంబులయందు
        తీపులఁ బచరించు చూపులందు
మమత సేయుచు హరిభక్తి మఱచి కాల
మనుదినంబును గడుపుచున్నట్టి నరులు

బహువిధాంతరఘనపాశబద్ధు లగుచు
ఘోరనరకములలోనఁ గూలువారు.

126


క.

సుతులందు గృహములందును
సతులందును మమతఁ జేసి సర్వేశునం
దతిదినము విముఖు లగు దు
ర్మతులకు నరకంబుఁ గలుగు మానవనాథా!

127


వ.

అని మునివరుం డానతిచ్చిన విదేహుం డిట్లనియె.

128


గీ.

ఏయుగంబునందు యేరీతి వర్తించు
నెట్టిరూపువాఁడు నేవిధాన
మున నుతింపఁబడును మునిదేవగణముచే
విష్ణుఁ డవ్యయుండు విశ్వవిభుఁడు.

129


క.

నానాకారంబులతో
దానవులను సంహరింప ధరణీస్థలిలో
శ్రీనాథుఁ డుద్భవించును
పూనితమై ప్రతియుగమున మహానీయుండై.

130


వ.

మఱియు నప్పురాణపురుషుండు కృతయుగంబునందు శుక్లవర్ణుండై
చతుర్బాహుండై జటావల్కల కృష్ణాజినోపవీత జపమాలా
దండకమండలధరుండై నిర్వైరులై శాంతులై తపోధ్యాననిష్ఠులై తద్యుగ
సంభవులైన మనుష్యులచే హంసయు సువర్ణుండును నమలుండును ఈశ్వ
రుండును పురుషుండును పరమాత్ముండును ననంబరగు దివ్యనామంబుల
చేత సన్నుతింపంబడు; త్రేతాయుగంబునందు రక్తవర్ణుండై బాహు
చతుష్కవిరాజమానుండై మేఖలాశ్రయ సహితుండై హిరణ్యకేశుం
జై సృక్ సృవాద్యుపలక్షణుండై విష్ణువు యజ్ఞపురుషుండును, పృశ్ని
గర్భుండును సర్వదేవమయుండును, వృషాకపియు, జయంతుండును,

నురుగా యుండు నని బ్రహ్మవాదులచేత వినుతి సేయంబతును; ద్వాపర
సంభవుండై పరమేశ్వరుండు శ్యామలదేహుండునుపీతాంబరధరుండును
బాహుద్వయోపశోభితుండును దివ్యనిజాయుధధరుండును శ్రీవత్స
కౌస్తుభవనమాలావిరాజమానుండును మహారాజోపలక్షణుండునునై
వాసుదేవ సంకర్షణానిరుద్ధ ప్రద్యుమ్ననారాయణ మహాపురుష విశ్వే
శ్వర విశ్వరూప సర్వభూతాత్మ కాదినామంబుల వెలయుచు నరపాలపుం
గవులచేత సన్నుతింపఁబడు. కలియుగంబందు కృష్ణవర్ణుండై పీతాం
బరధరుండై దివ్యనిజాయుధ శ్రీవత్సకౌస్తుభవనమాలాకిరీటధరుండై
హరి- రామ- నారాయణ నృసింహ- కంసారి - నలినోదయ నామంబుల
వెలయుచు భక్తరక్షకుం డగు పుండరీకాక్షుండు బ్రహ్మ మునీంద్రులచే
యజ్ఞసంకీర్తనలచే వినుతి సేయంబడు నని చెప్పి మఱియు నిట్లనియె.

131


క.

హరి కమలాసన చింత్యము
పరిభవహరణంబు భక్తపాపఘ్నము సు
స్థిరపదసంధాయక మగు
హరిపాదజలంబుఁ దలతు ననురాగమునన్.

132


గీ.

సకలదేవబృందసంప్రార్థితంబైన
రాజ్యలక్ష్మి విడిచి రమణి కోర్కి
కై మృగంబు వెంట నడవిలోఁ దిరుగాడు
నట్టి మూర్తిఁ దలఁతు నాత్మలోన.

133


క.

ఈరీతిని బ్రతియుగమున
నారాయణుఁ డవతరించి నరముఖ్యులచే
శౌరినృసింహుడు హరికం
సారన వినుతింప బడుఁ బ్రసన్నతతోడన్.

134

క.

నలినాక్షుని కీర్తనమునఁ
గలుగును మోక్షం బటంచు ఘనులైన మునుల్
కలియుగమున వినుతింతురు
కలదే మఱి లాభ మింతకన్న నృపాలా.

135


క.

వినుతింపఁ గృతయుగాదుల
ఘనులగు నరవరులు కలియుగంబున దఱచై
జననంబుఁ గోరుచుందురు
వనజూక్షుని లోకమందు వసియించుటకై.

136


సీ.

ద్రవిడదేశంబునఁ దామ్రపర్ణీనది
        కావేరి యను పేరఁ గలుగు పుణ్య
దివ్యవాహినియుఁ దోతెంచి మహానది
        ప్రవహించుఁ దజ్జలపాన మెవ్వ
రొనరింతు రాజను లుర్వీశ పితృదేవ
        మునిఋణంబుల వలన ముక్తు లగుదు
రచట దీపంబు నిత్యంబు సేయుచు విష్ణు
        పాదాబ్జముల భక్తి బరగువారి
నఖిలలోకేశుఁడైన శ్రీహరి పరేశుఁ
డాదిశూన్యుండు శ్రీనాధుఁ డవ్యయుండు
నిఖిలజీవాంతరంబుల నిలుచువాఁడు
చెడని యాత్మీయపదమునఁ జేర్చు మిగుల.

137


వ.

అని యివ్విధంబున ఋషభకుమారులైన భగవత్ప్రతిబింబంబులైన
యోగివరులు విదేహనరపాలకునకు నవ్యయపదప్రాప్తికరంబులైన
భాగవతధర్మంబుల నుపదేశించి తత్పూజితులై యంతర్ధానంబు

నొందిన విస్మయంబంది యమ్మిథిలేశ్వరుండు కర్మానుష్టానంబు
సమాప్తించి జ్ఞానయోగం బవలంబించి తన్మూలంబునఁ బరమపదం
బునకుం జనియె; నీయుపాఖ్యానంబుఁ బఠించిన వినిన నరులు హత
కిల్బిషులై విష్ణులోకనివాసు లగుదు రని నారదుండు వసుదేవున
కీవృత్తాంతం బెఱింగించి మఱియు నిట్లనియె.

138


క.

భగవద్భక్తికి సాధన
మగు నీధర్మముల వినియు హతకలుషుఁడవై
సుగతికిఁ జనియెద వీము
జ్జగములు వినుతింప విగతసంగుఁడ వగుచున్.

139


క.

నీకీర్తులు నిర్మలమై
లోకంబులఁ బూర్ణమయ్యు లోకోత్తర యీ
శ్రీకాంతుఁ డుద్భవించెను
మీకుం దనుజాతుఁ డగుచు మేదినీలోనన్.

140


క.

శ్రీహరిపైఁ దనుజాత
స్నేహం బొనరించి వర్ణనీయం బగుమా
దేహములు శుద్ధిఁ బొందెడు
నాహారాలింగనోజ్జ్వలాలాపములన్.

141


క.

పగఁగొని శిశుపాలాదులు
భగవంతుని నతివిలాస భావస్మరణం
బొగిఁ జేయుచు ననుదినమును
సుగతికిఁ జని రెచట నిట్టిచోద్యము గలదే.

142


క.

ఎడపక రివుల వధింపను
బుడమిని నవతీర్ణుఁడైన పురుషోత్తముపైఁ
గొడు కనియెడి మోహం బది
విడువుము వసుదేవ సర్వవిద్యార్థజ్ఞా.

143

గీ.

భూమిపతులఁ జంపి భూభార మొగి మాన్పఁ
బంచి సుజనరక్షణంబుకొఱకు
నవతరించి కృష్ణుఁ డమరులు వొగడఁగ
నిలిపెఁ గీర్తి దిశల నెమ్మితోడ.

144


వ.

ఇట్లా నారదుండు భగవద్భక్తికరంబులగు జయంతోపాఖ్యానంబుఁ
జెప్పిన విని విస్మయంబంది దేవకీవసుదేవులు వాసుదేవునందుఁ
బుత్రమోహంబు విసర్జించి, పరమాత్మగాఁ దలంచుచు వర్తించి రని
శుకయోగీంద్రుఁ డానతిచ్చిన విని పరీక్షిన్నరపాలపుంగవుం డిట్లనియె.

145


గీ.

ఏమిచేసె కృష్ణుఁ డిటమీఁద యదువుల
నేవిధంబు తోడ నే పడంచె
భక్తజనులచేతఁ బ్రార్థితంబైనట్టి
పదము నెట్లు వొందె భవ్యచరిత.

146


వ.

అని పలికిన రాజవరునకు యతివరుం డిట్లనియె.

147


సీ.

మునిగణంబులతోడ మొనసిన బ్రహ్మయు
        గణములు గొలున శంకరుఁడు దేవ
బృందంబుతోనఁ ద్రిభేదనుం డాదిత్యు
        లశ్వినుల్ వసువులు నంగిరసులు
ఋభువు లప్సరసలు రుద్రులు సాధ్యులు
        గంధర్వసిద్ధనాగమునులఁ గూడి
కింపురుషుల్ పితృకిన్నరవర్గముల్
        సంఘమై కృష్ణ దర్శనముఁ గోరి
ధరణి దివములఁ గల పదార్థములచేతఁ
బొలుపు మీఱుచు విభవసంపూర్ణమైన
ద్వారకాపురి దేవకీతనయుఁడైన
విష్ణుఁ గాంచిరి వేదాంతవేద్యు నచట.

148

క.

సుర లిట్లు వాసుదేవుని
మరుజనకుని దివ్యమైన మాల్యంబులచేఁ
గర మొప్పఁ బూజ చేసియుఁ
బరువడి వినుతించి రమరపంక్తులు సుజనా!

149


దండకము.

శ్రీమన్మహేంద్రాదిమౌళిస్థలీకీలితానేకరత్నచ్ఛటాపుంజసంరంజి
తాంఘ్రి ద్వయోదార లక్ష్మీకుచద్వంద్వ నిక్షిప్తకస్తూరికా నాసి
తాత్మీయ వక్షస్థలాలంబి సత్కౌస్తుభోద్భోసితా నేకయోగీంద్ర
హృత్పద్మపంకేరు హాంతర్నివాసా జగన్నాధ నీదాసవర్గంబుచే నెల్ల
కాలంబు బుద్ధీంద్రియప్రాణ వాక్చిత్తసంఘంబుచేఁ జింతితానేక
దేహుండవై యుండు; దీశా మహామాయచే దుర్విభాగుండవై
ధాతృభూతేశ లక్ష్మీశభావంబులం బొంది తత్తద్గుణస్థుండవై సర్య
లోకోద్భవస్థిత్యుపా యాదిహేతుండవై యుందు; వీదేహి యుష్మ
త్పదాంభోజు భక్తిన్ విసర్జించి విద్యాశ్రుతధ్యాన దాసక్రియాకర్మ
తంత్రంబుచే శుద్ధి బొందంగ లేఁ డచ్యుతా మాకు యోగీంద్ర హృ
చ్చింత్య మైనట్టి నీపాద మెల్లప్పుడున్ మంగళార్థం బవుంగాక, నారా
యణా! నీవు సుజ్ఞానసంపన్నులై యున్న సన్మౌనిసంఘంబుచే
ముక్తి సంప్రాప్తికై వ్యూహలం దర్చితాకార విభ్రాజమానుండవై
యుందు వాయ్వగ్ని నాజ్యాదుల న్వేదసన్మంత్రజాలంబుచే వేల్చు
భూదేవసంఘంబుచే నాత్మజిజ్ఞాసులైనట్టి యోగీంద్రబృందంబుచే
వందనీయుండవై యుందు వెందు న్విచారింప నీ మాయగాదే సురే
శా వసుశ్రీగృహాపత్యవిత్తాది సంజాత దుర్మోహులై మర్త్యు లాశా
మహాపాశసద్బద్ధులై బుద్ధిమార్గంబు వర్జించి విద్యాకులాచార లక్ష్మీ
మదోద్రేక సంపన్నులై కన్నులం గాన కత్యంతలాభంబునం జేసి
నీ పాదభక్తి న్విసర్జించి హీనంబులైనట్టి జన్మంబులం బొంది తప్తంబులై
యుండు సంఘాతకూపంబులం దుందు రుత్సాహరూపా మహారూప, నీ

కంఠికంబైనదామంబుతోఁ గూడి సంస్పర్థియై లక్ష్మి వక్షఃస్థలంబందు నిత్యం
బు వర్తించు ముక్తిప్రదా పద్మజాతాదిబృందారకానీకముల్ గోప
గోగోపికారూపముల్ దాల్చి నీ పాదభక్తిన్ ప్రవర్తింతు రత్యంతముం
జూడ మాయామహాపూరుషాన్యంబులై యున్న కాలస్వరూపంబు
దానైన నీపాదకంజంబు మాకెప్పుడు న్మంగళార్థం బవుగాక; పద్మోద్భవుం
డాది నిర్మించే హేమాండ ముర్వీధరారణ్యరూపాభిరామంబుగాఁ జక్ర
హస్తా జగత్స్వామివై నీవు మాయాగుణోత్థంబులైనట్టి యర్థంబులం
బొంది తద్గ్రాహివై పద్మపత్త్రంబులో నీటిచందాన లిప్తుండవుంగాక
వర్తింతు వింద్రాదివంద్యాసమస్తావనీభార నిర్వాపణార్థంబు వై దేవకీ
దేవి గర్భాబ్ధిలో నుద్భవంబంది సంసారిదేవారి సంఘంబుల న్మర్త్యరా
జన్య వర్గంబులన్ ముత్తి యత్యంతహర్షంబుతో నల్లరేపలైలో గొల్ల
వారిండ్లు శోధించి చోరాధినాథుండవై బాలగోపాలురంగూడి తోడెట్టు
పాలందులో మీగడల్ వెన్నలున్ మెక్కి యొక్కుమ్మడిన్ వమ్ముగా
కుండ క్రీడింతు వాశావిషాధీశతల్పా మనోజాత బాణానలాభీల కీలాభి
సంతప్తులై యున్న యీషోడశస్త్రీసహస్రంబులున్ యుష్మదీయేంద్రి
యక్షోభ సేయంగలేరైరి నీపాదతీర్థంబు లోకత్రయంబున్ బవిత్రంబుగాఁ
జేయు సర్వాత్మకా! సర్వవంద్యా నమస్తే నమస్తే నమస్తే నమః.

150


క.

ఈ రీతిని వసుదేవకు
మారకుఁడై వెలయునట్టి మధుసూదనునిన్
నీరజభవ భవముఖ బృం
దారకులు నుతించి రధికతాత్పర్యమునన్.

151


వ.

అంత నాఖండలాది దేవతామండలంబున కధినాయకుండగు చతు
ర్ముఖుండు పుండరీకాక్షునకు వెండియు నిట్లనియె.

152


ఆ.

పూర్వమందు నీవు పుడమి భారము మాన్ప
నవతరించి దిశలయందుఁ గీర్తి
సత్యసంధులందు సకలధర్మము నిల్పి
సవడి నొంది తసురనివహములను.

153

సీ.

యదుమహావంశమం దవతరించిన నీవు
        దివ్యతేజంబునఁ దేజరిల్లు
వెరవున నుద్దామ వృత్తకర్మంబుల
        నఖిలరక్షణకునై యాచరించి
జగములు నిలిపితి సజ్జనుల్ కలియందు
        నీనామకీర్తన నెమ్మిఁజేసి
సత్పథంబునకునై చనుదు రుజ్జ్వలరూప
        మేదిని నీవు జన్మించి నూట
యిరువదేవగు వర్షమ్ము లిచటఁ జనియె
నమరకార్యంబు సాధితం బయ్యె విప్ర
శాపమున స్రుక్కి యాదవుల్ సమయువారు
పరమపదవీథి జను మింక పద్మనయన!

154


వ.

అని యివ్విధంబునఁ బంకజాసనాదిబృందారకసంఘంబు లమంద
హర్షంబున ననేకధముల సన్నుతించిన వారలం జూచి వాసుదేవుం
డిట్లనియె.

155


చ.

ఎఱుఁగుదుఁ జిత్తమందు విబుధేశ్వరు లిక్కడిరాక మున్ను నే
ధరణిభరంబు మాన్ప ఘనదానవులన్ వధియించినాఁడ దు
ష్కరమదగర్వసంపదలఁ గన్నులుగానని యాదవక్షమా
వరులను నేపడంచి యిదె వచ్చెడ ముక్తికి సత్వరంబునన్.

156


క.

వీరి వధింపక యేఁ జన
వారిధి దన మేరదప్పి వచ్చినక్రియ దు
ర్వారులగు యాదవులచే
భారంబగు దిరుగ భూమి భాగంబునకున్.

157


క.

అని పలికి వాసుదేవుం
డనిపిన జలజాతపద్భవాదులు వేడ్కన్
జనిరి నిజాలయములకును
మనమునఁ దత్పాదభక్తి మఱువక భూపా.

158

వ.

అంత.

159


సీ.

ఘూకసృగాలాది ఘోరజంతువు లెల్ల
        పగలు విజృంభించి పలుకఁదొడఁగెఁ
గాకకుక్కుటశుకక్రౌంచశారికములు
        రాత్రికూజితముల రమణ మెఱఁగె
నశ్వవారంబులం దనలంబు వెలువడె
        విలసితాన్నంబులు మొలకలెత్త
నురువడిగృహములం దుత్పల లుదయించె
        నొకజీవమునకు వేఱొకటి పుట్టె
కడకు నీరీతి ననుదైవికమ్ములైన
ద్వారపుకాపుర సంభవోత్పాతములను
హరి నిరీక్షించి వరుసతో నాత్మపాద
భక్తులగు యాదవులఁ జూచి పలికె నంత.

160


ఆ.

పొందరాని యట్టి భూదేవశాపంబు
దగిలె వంశమునకుఁ దప్పదెచట
నిచట నుండవలవ దీరీతిగను మహో
త్సాతములు జనించెఁ బట్టణమున.

161


వ.

అదిగాన సముద్రతీరంబున ప్రభాసతీర్థంబను పుణ్యతీర్థంబు గలదు.
అందు దక్షుశాపదగ్ధుఁడై నిశాకరుండు స్నానముచేసి రాజయక్ష్మ
వలన విముక్తుండై కళోదయంబు నొందె, నట్టి క్షేత్రంబునకుం
జని భూసురపితృదేవగణంబులం దృప్తిబొందించిన మనకు సకల
దురంతంబులు నివర్తించు; నని వసుదేవతనూభవుం డానతిచ్చిన
యాదవులు సకలపదార్థఫూజితంబులైన శకటంబులు సమకూర్చి
పుత్త్రమిత్త్రకళత్త్రాదిసమేతులై ప్రభాసక్షేత్రంబునకై ప్రయా
ణాభిముఖులైన సమయంబున.

162

ఆ.

పయనమునను వృష్ణిబలములఁ బరికించి
యుద్ధవుండు యోగయుక్తుఁ డగుచు
వేగ నరుగుదెంచి విష్ణు నీక్షణఁ జేసి
పాదయుగము నెరఁగి పలికె నతఁడు.

163


సీ.

సర్వగ సర్వేశ సర్వజ్ఞ సన్నుత
        సచ్చిదానంద విశ్వాధినాథ
సాహసాహితచక్రసంహార సరసీరు
        హాయతేక్షణ ఘనాద్యంతశూన్య
సనకాదియోగీంద్రచారుమానసపద్మ
        నిలయాతినిర్మల నిర్వికార
కంసచాణూరాది ఖండనాఖండల
        ప్రముఖవందితలసత్పాదయుగళ
సకలలోకైకనాయక చక్రహస్త
కోటిమన్మథసమరూప కుంభినీశ
వామనాచ్యుత గోవింద వాసుదేవ
నిన్నుఁ దలఁచెద నేపొద్దు నిత్యచరిత.

164


సీ.

దేవ యోగీశ్వర దేవేశ నీవిట
        సకలయాదవబలక్షయముఁ జేసి
మహిమీఁద నిలయంబు మాని కైవల్యంబుఁ
        బొందుచున్నాఁడవు భువనవంద్య
నిశ్చయం బిది నేను నీపాదయుగళంబుఁ
        బాసి యుండఁగలేను భవ్యరూప
కొనిపొమ్ము నీపదంబునకు న న్నచ్యుత
        నీక్రీడ నరులకు నిఖిలపుణ్య
కారణముగాన వినుతించు ఘనులు దివ్య
లోకములఁ బొందుదురు పద్మలోచనాఢ్య
చతురతశయ్యాసనాటన స్నానభోజ
నాదులందును విడువలే ననఘ నిన్ను.

165

సీ.

భవదుపభుక్తపుష్పములచే గంధాంశు
        కములచే విరచితాకారయుతుఁడు
నగుచు నీయుచ్ఛిష్ట మనురాగమతితోడ
        భుజియించువాఁడను భువనవంద్య
నీమాయఁ దరియింప నేర్తునే శ్రవణాది
        మునులు నీభక్తిచే ముక్తికరిగి
రది గానఁ గర్మవిఖ్యాతమార్గంబున
        ననయంబు వర్తించి యాదరమున
నిన్నుఁ దలఁచుచు మనమందు నీగుణంబు
లను దినంబును వర్ణించు నట్టినాకు
దుస్తరంబగు నీమాయ దు..........
..............కోణపాధీశ కువలయేశ.

166


వ.

ఇవ్విధంబునఁ బ్రియసేవకుండగు నుద్ధవుండు పల్కిన దరహాసవిక
సితవదనుండై వసుదేవతనయుఁ డిట్లనియె.

167


క.

ఏమాట నీవు పల్కితి
నామాట నిజంబు ముక్తి కరిగెడు కొఱకై
దామరససంభవాదులు
వేమఱు నను వేఁడి రటకు, వేగమ చనుదున్.

168


సీ.

బ్రహ్మాదిసురలచేఁ బ్రార్ధింపఁబడియు నే
        నంశంబుతోడుత నవతరించి
దేవకార్యంబు సాధించితి నిటమీఁద
        యదువంశనాశన మగు మునీంద్ర
వారాసి యేడవవాసరంబునకును
        ద్వారావతిని ముంచుఁ దడవులేక
మాచేత సంత్మక మగుచు నీలోకంబు
        కలిసమాక్రాంతమై బలిమి చెడును

అంతఁ గలియుగ మాసన్నమైన పిదప
జను లధర్మంబుచేతనే జరుగువారు
గాని నిజబాంధవప్రీతి మాని నీవు
సముఁడవై భూముఁ జరియింపు సంతసమున.

169


క.

మానసవాగక్షిశ్రుతి
మానంబుల గృహ్యమాణ మగువస్తువు వి
న్నాణముగ నాశహేతువు
గా నెఱుఁగుము హృదయమందు గతజాడ్యుఁడవై.

170


క.

పురుషునకున్ నానార్థాం
తరసంజాతభ్రమంబు తద్దయు నతిదు
ష్కరనిజగుణదోషమ్మగుఁ
బరికింపఁగ నింద్రియములఁ బట్టఁగవలయున్.

171


వ.

అది గాన నిరంకుశవ్యాపారపారీణంబులగు నింద్రియంబుల గుది
యఁగఁ దిగిచి మనోవికారంబుల నిగ్రహించి విత్తదారసుత బాంధవ
ప్రీతి విసర్జించి సుఖదుఃఖములయందు సమత్వం బంగీకరించి ఈజగం
బాత్మాధిష్ఠితంబుగా నెఱుంగుము, గుణదోషనిషేధంబు లేక మదీ
యార్పితమానసుఁడవై విశ్వంబు మదాత్మకం బని నిశ్చయించి
వర్తింపవలయు నని కృష్ణుడు పల్కిన నుద్ధవుండు భక్తిపూర్వ
కంబున వాసుదేవునకు దండప్రణామం బాచరించి బద్ధాంజలియై
యిట్లనియె.

172


సీ.

యోగీశ్వరేశ్వర యోగసంభవ కృష్ణ
        నిశ్రేయసార్థమై నీవు నాకు
నానతిచ్చినయట్టి యఖిలసన్యాస ల
        క్షణము దుష్కరము నిష్కాము లైన
నాచరింపంగ లేరఁట భవన్మాయచేఁ
        బూరితంబైన సంసారమందు
నా లక్షణము చెప్పు మది యథార్థంబుగా
        నాచరించెద భృత్యుఁడైన యేను

దేహధారులై బ్రహ్మాది దివిజవరులు
బాహ్యవస్తువులందు సంభ్రాంతు లగుచుఁ
దిరుగుచున్నారు నీమాయఁ దెలియలేక
సంతతంబును మోహితస్వాంతు లగుచు.

173


క.

ప్రాక్తమమాయను నీపద
ప్రాక్తులు దెలియంగలేరు పలుమఱు దానిన్
యుక్తులచే వివరింపను
శక్తులె శక్రాబ్జజాత శంకరులైనన్.

174


గీ.

గృహముఁ గట్టుకొన్న గృహిణి గృహస్థుల
కైన యతులకైన ననుదినంబు
సర్వపాపహరము సత్సంగమంబు స
త్కీర్తనంబు లోకసమ్మతంబు.

175


క.

అదిగాన సర్వలోకా
స్పదహృదయ! సమస్తలోకపావన! నిను నే
ముద మొదవ శరణ మొందెద
సదయుఁడనై యానతిమ్ము సర్వం బధిపా.

176


వ.

ఇవ్విధంబునఁ బ్రియసేవకుండగు నుద్ధవుండు పలికిన కంసమర్ధనుం
డిట్లనియె.

177


క.

తఱచై భూతలమునఁ గొం
దఱు మును లశుభాశయప్రధానం బగుసం
సరణమువలన నిజాత్మను
దెరువున జన నాత్మచేతఁ దిగుతురు విప్రా.

178


క.

పురుషుఁ డాత్మకు నాత్మయ
గురువని మనమందుఁ దెలిసి కుపథంబులపై
బరువులు పెట్టక నిలిచినఁ
బరమంబగు మన్నివాసభవనముఁ జెందున్.

179

గీ.

సర్వమూలశక్తి సహితుఁడనగు నన్ను
సాంఖ్యయోగవిధులు సంతసంబు
భావమందు పురుషభావంబు గా విచా
రించి తలచుచుందు రెట్టి యెడల.

180


సీ.

పరగనేకద్విత్రిబహుపాదములతోడ
        వర్తించు జీవులు వరుసఁ బెక్కు
లాజీవకోటిలో నభిమతం బైనట్టి
        నరవరాకారంబు నాకుఁ బ్రియము
గాన యోగీంద్రు లేకాలంబు సంతత
        ధ్యానయోగంబున దనివి మెఱసి
యనుమానములచేత నగ్రాహ్యుఁ డగునన్ను
        ఘనలక్షణగ్రాహ్యు గా నెఱింగి
స్వాంతపంకమధ్యమస్థానమందు
జీవపరమాత్మభేదంబు నేవగించి
శంఖచక్రాబ్జకౌస్తుభశార్ఙ్గఖడ్గ
సహితుగఁ దలఁతు రనయంబు సంతసమున.

181


వ.

మఱియు నవధూతసంవాదంబు నాఁబఱగునొక్కపురాణేతిహాసంబుఁ
జెప్పెద నాకర్ణింపుము.

182


క.

యదువను పేరిటఁగల మా
పదునాలవ తాతయతఁడు పావనమూర్తిన్
నదయుని భయరహితుని జన
విదితుని నవధూతఁ జూచి వెస నిట్లనియెన్.

183


సీ.

యోగీంద్ర యెచ్చోట నుండి యేతెంచితి
        రీలాగు బాలుని లీలమీఱి
రూపవిద్యాజ్ఞానరూఢమూలుండవై
        జడుని చందంబున జడతఁబొంది

కామలోభదవాగ్నికలితులై జను నెల్ల
        సంతప్తదేహులై సంచరింప
పవమానసఖువల్లఁ బాసి గంగాజల
        స్థితమైన కరిరాజుగతిని బొల్చి
తాప మందక ఘనపదార్థముల యందు
వాంఛ వర్జించి యానందవశుఁడవై న
కారణం బెయ్య దిది నాకుఁ గ్రమముతోడ
నాన తీయంగవలయు విఖ్యాతచరిత.

184


వ.

అని పలికిన యదువరునకు నవధూత యిట్లనియె.

185


క.

గురువులు గల రిరువదినలు
గుమ నాకును వారివలన గుణమొక్కొకటిన్
బరికించి చూచి పొందితిఁ
బరమజ్ఞానంబు నుభయపావనచరితా.

186


చ.

అని యవధూత పల్కిన మహాద్భుతవృత్తి దలిర్ప వానికి
ట్లనియె యదుప్రభుండు వసుధామర యెవ్వరికైన నొక్కఁడే
వినుతగురుండు గాని పదివేవురు లేరిట నీవు నాకుఁ జె
ప్పిన వచనంబు చాల విని పెద్దవిచారము దోఁచె నామదిన్.

187


వ.

ఇట్లు యదుపుంగవుండు యుక్తియుక్తవచనంబులు పలికిన యతి
వరుం డిట్లనియె.

188


గీ.

అడిగినట్టి మాట కనువుగా నుత్తరం
బీయకున్న జ్ఞానహీనుఁ డండ్రు
గాన నుత్తరంబు క్రమముగాఁ జెప్పెద
రమణ నీవు సేయు ప్రశ్నలకును.

189

వ.

విను మిక నీ వడిగిన వచనంబులకు సవిస్తరంబుగా నుత్తరంబు
చెప్పెద; భూమియు ననిలంబును, నాకసంబును, ననలంబును కళా
నిధియును, భానుండును, కపోతంబును నజగరంబును సముద్రంబును
శలభంబును, ద్విరేఫంబును, గజంబును, మధుమక్షికయు, హరిణం
బును, మత్స్యంబును, పింగళయును, కమతంబును, బాలకుండును,
కుమారికయును, శరాకారుండును, సర్పంబును, నూర్ణనాభియు,
కణుందుటీఁగయు ననఁబఱగువీని వలన నొక్కొకగుణం బంగీకరించి
పుత్రదారాది మోహంబు విసర్జించి జగం బనిత్యంబుగాఁ దలంచి
పరమపదనివాసంబు కొఆకునై హరినామస్మరణంబు సేయుచు
వసుధాతలంబున సంచరింతు నది యెట్లనిన.

190


గీ.

భూతధాత్రిభంగి భూతావృతుండయ్యు
దనమనంబులోన ధైర్య మొదవ
సత్త్వమార్గమందుఁ జలన మించుకలేక
చనునతండు సత్యసమ్మతుండు.

191


క.

పరిమళము దెచ్చి వాయువు
పరులకు సౌఖ్యంబు జేయు పగిదిఁ బరార్థ
స్థిరచిత్తుఁడగుచు వాంఛా
విరహితుఁ డగువాడె యోగి వీక్షింపంగన్.

192


గీ.

అరయఁ బార్థివంబు లైనట్టి దేహంబు
లందు జొచ్చి తద్గుణాశ్రయుండు
నగుచు వానిగూడి యలసి తిరుగక యాత్మ
నాత్మతోడఁ గూర్చు నతఁడె యోగి.

193


క.

అరయఁగ నంతర్బహిరా
వరణంబులయందు జీవవర్గములందున్
బరము విధంబున నాత్మను
బరిపూర్ణునిగానెఱుంగు భావమువలనన్.

194

క.

ఆయాకాశము విభువై
వాయుసహాయంబులైన వనదంబులచే
నేయెడ లిప్తముగా వె
ట్లాయోగి చరింపవలయు నగుణస్థుండై.

195


గీ.

స్నిగ్ధమధురయుక్తజీవనంబులరీతి
నరుల యోగి పావనంబు సేయు
ప్రేక్షణంబుచేతఁ బృథుకరస్పర్శచే
నయము మీఱఁ గీర్తనంబుచేత.

196


గీ.

కాంతి గలిగి తపము కతన సందీప్తుఁడై
యుదరభాజనత్వ ముడుగ కెపుడు
సర్వభక్షుఁడైన సప్తజిహ్వునిభాతి
నిర్మలాత్ముఁ డగుచు నిలువవలయు.

197


క.

అజమాయాసృష్టంబగు
త్రిజగంబునఁ గలసి సర్వదివ్యాకృతియై
యజరామరణుండై పం
కజనాభుఁడు సమిధ నగ్నికరణి వసించున్.

198


శా.

భావింప న్ప్రభవాప్యయాదులగు నీభావంబు లెల్లప్పుడున్
దేవాధీశునకైన దేహగుణముల్ దేహుబు పడ్డప్పుడే
జీవుం డన్యశరీరమధ్యగతుఁడై చేష్టావశస్వాంగుఁడై
జీవించున్ యతిసూక్ష్ముఁడై తనరురాజీవారచందంబునన్.

199


క.

ఈచందంబున దేహం
బాచంద్రార్కంబు నిల్వ దని యెఱిఁగి మదిన్
యోచింపక యోగీంద్రుఁడు
భూచరణము సేయవలయుఁ బొదలిన వేడ్కన్.

200


మ.

తిరమై భూరుహగుల్మపర్వతజలాదివ్యక్తిసంక్రాంతుఁడై
పరిపూర్ణుండగు నాత్మఁదద్గతునిగా భావింతు రజ్ఞుల్ సము
ద్ధురసుజ్ఞానపరాయణుల్ తదితరస్ధుల్ గా విచారించి వే
మఱు సప్తాశ్వునిరీతిఁ జూతురు మనోమార్గంబుచే నిత్యమున్.

201

ఉ.

దారలయందు పుత్రధనధాన్యములందు ననేకభంగులన్
గూరిమిఁ జేసి మర్త్యుఁ డతిఘోరవియోగజదుఃఖమగ్నుఁడై
నేరుపు దక్కి చిక్కువడి నీతివివేకవిహీనుఁడై మహా
భారముతోఁ గపోతమను పక్షివిధంబునఁ బోవు నష్టమై.

202


వ.

అది యెట్లన్న.

203


సీ.

ఎలమి నవ్వనములోపలఁ గపోతం బొక్కఁ
        డనుకూలభార్యాసహాయుఁ డగుచు
ననువుతో భూరుహంబున గూడు నిర్మించి
        మేలిమియగు మేత మేసి యందు
గరిమ నన్యోన్యాంగకముల సంస్పర్శన
        మాచరించుచుఁ జిత్తమందుఁగూర్మి
సలుపుచు నేప్రొద్దు సంతసంబును బొంది
        గొనకొని విహరింపఁ గొంతకాల
మునకుఁ గాంచెనుఁ దత్పత్ని ముదముతోడ
నండములు మూడుఁ నాల్గింటి నవియుఁ గొన్ని
యహరహంబుల కవిసి సర్వాంగకములు
లావుసమకూరి పిల్లలై లేవఁ బొదలె.

204


ఉ.

అరయ నొక్కనాఁడు వనమందుఁ జరింపుచు లుబ్ధకుండు నా
భూరుహ మెక్కి పక్షు లటువోవఁగఁ జూచి తదీయమాంసవాం
ఛారమితాత్ముఁడై మిగులసంతస మందుచు గూటివాకిటన్
నూరువిధంబులౌనురుల నూఁది తలంగిన యంతలోపలన్.

205


గీ.

కడుపునిండ మేసి కవగూడి మున్నాడి
వచ్చి పతగకాంత వైపుదప్పి
యురులలోనఁ జిక్కి యున్నట్టి పిల్లలఁ
జేరబోవ దాన చిక్కువడియె.

206

క.

ఈరీతి నురులఁ జిక్కిన
దారాపత్యములఁ జూచి తత్పతి దుఃఖా
పూరిత నిజమానససం
ప్రేరితుఁడై యిట్లు పలవరింపఁ దొడంగెన్.

207


సీ.

పరమపాతివ్రత్యపావనురాలైన
        భార్యయుఁ బ్రాణమై పరఁగుసుతులు
నురులచేఁ జిక్కుపడున్నారు నాకింక
        నెయ్యది దిక్కు, నే నెట్లు నిలుతు
నొకటి విచారింప నొకకర్మ మేతెంచె
        దైవికయత్నంబు దప్ప దెచట
వీరలఁ బాసి నే ధీరత నెట్లుందు
        దిగనాడి చనుచున్న దిటుకుటుంబ


గీ.

మనుచు బెగ్గిలి విరహాకులాత్ముడగుచు
బెక్కువిధముల విలపించి బీరముడిగి
పాయరానట్టి కూరిమిఁ బాయలేక
తగులుపడె నందుఁ బతగంబుఁ దత్తరమున.

208


క.

తగిలిన పతగంబుల నా
యగచరుఁడు వధించి చిక్కమం దిడుకొని, వాఁ
డగణిత హర్షసముజ్జ్వలుఁ
డగుచుం జనె నిలయమునకు యదువంశనిధీ.

209


క.

ఈరీతి మోహవశమున
దారాపత్యాదులందుఁ దత్పరుఁడై , స
ర్వారంభహీనుఁ డగుచును
జేరువ నరకంబులందుఁ జెందు నరుండున్.

210

క.

ఏనరుఁ డైననుఁ గానీ
మానవలోకంబు బొంది మతిమంతుండై
శ్రీనాథుని మదిఁ దలఁపని
యానరుఁ డారూఢపతనుఁ డనఁగాఁ బరఁగున్.

211


ఆ.

పట్టె డంతయైనఁ బరిపూర్ణమైనను
రుచివిహీనమైన రుచ్యమైన
కణఁక గోర్కిలేక గ్రాసంబు వచ్చిన
సంగరంబుమాడ్కి నందవలయు.

212


గీ.

జీవనంబు గల్గి చేవ మీఱినవేళఁ
బూని జీవనంబు లేనివేళ
నుబ్బుస్రుక్కు లేక యుండంగవలయును
సాగరంబుమాడ్కి యోగయుతుఁడు.

213


క.

శలభము సంతతదీప
జ్వలనంబున సమయునట్లు వామాక్షులయు
జ్జ్వలభూషాంబరవాంఛా
కలితుండగు నరుఁడు వొందు ఘననరకంబుల్.

214


క.

జవమునఁ దుమ్మెద పుష్పా
సవపానము సేయురీతి శాస్త్రాంతరసం
భవసారములను మునిపుం
గవుఁ డాచరణంబు సేయఁ గల్గును సుఖముల్.

215


క.

దారువినిర్మితకాంతా
కారములును ముట్టెనేని ఘనుఁడగు యతి తా
నేరుపు చెడి బద్ధుఁడగు
గారవమునఁ గరిణిఁ జేరు కరిచందమునన్.

216

క.

అధికాసవసంగ్రహమున
మధుమక్షిక మడియుకరణి మహిలో యతిదు
ర్వీధమున బిక్షాసంగ్రహ
మధమంబుగఁ జేసెనేని హతపుణ్యుఁడగున్.

217


ఆ.

జనులచేత దుఃఖసంచితంబై యువ
భోగములకు రాక పోవుధనము
కూర్మి జుంటియీఁగ కూర్చు తేనెయమాడ్కి
పొలుపుమీఱిఁ యన్యభోగ్యమగును.

218


క.

నెలకొన్నవేడ్క యతి రా
మలగీతము వినఁగవలదు మాటికి, వినినన్
దలఁ పెక్కి ఋష్యశృంగుని
వలెఁ దద్గతహృదయుఁ డగుచు వర్తన విడుచున్.

219


క.

గీతము చెవులకు సోకిన
చాతురిఁ దనుమఱచి మృగము సమసినకరణిన్
గీతము విని యతి తద్వశుఁ
డై తా సుజ్ఞాన ముడిగి హతుఁడగు నధిపా.

220


క.

రసమోహితులై మర్త్యులు
రసనాదోషంబువలన రాయిడి పడుచున్
దెసచెడి మీనంబులక్రియ
నసమాంతకపాశబద్ధు లగుదురుకు దఱచై.

221


క.

అనయము జిహ్వాచాపల
మున నింద్రియజయము లేక ముక్తికిఁ బదిలం
బున జనెడిమార్గ మెఱుఁగక
మనుజుఁడు సమవర్తిలోకమందు వసించున్.

222

క.

జిహ్వాచాపలసహితుఁడు
బహ్వాశాకలితుఁ డగుచుఁ బలితుండగు, నా
జిహ్వాచాపలరహితుఁడు
బహ్వమరసమేతుఁ డగుచు వడిఁ జను దివికిన్.

223


సీ.

నెఱి విదేహమహావనీపురమునఁ రాజ
        వీధిఁ బింగళ యను వేశ్య గలదు
తన్మూలమునఁ గొంతతత్త్వ మే నెఱిఁగితి
        నా కథావృత్తాంత మాదినుండి
విస్తరంబుగ నీకు వివరించి చెప్పెద
        విను మాదరంబున విమలచరిత
యావేశ్య యొకనాఁడు భావంబులో నర్థ
        సంగ్రహార్థం బాత్మసఖుని మొఱఁగి


గీ.

గరిమఁ గూరిమిసల్పు వాక్యములచేత
రాకపోకల వచ్చువారల మనంబు
లందు మన్మథభావంబు లాదుకొనఁగ
రమణ వర్తించె నిజమందిరంబునందు.

224


క.

ధనమిచ్చువానిఁ బిలిచెద
నని రాత్రిట నిద్ర మాని యామానిని వీ
థినిఁ దిరుగాఁడఁగ దన్మన
మున నొకనిర్వేద మొదవె ముక్తిప్రదమై.

225


వ.

ఇవ్విధమున నిద్రాసుఖము పరిత్యజించి విత్తాశాపరవశయై నిశా
సమయంబున రాజమార్గంబునఁ దిరుగాడుచు నధికశ్రమంబు నొందిన
యావేశ్యాలలామ మానసంబున నిర్వేదంబు జనియించిన నాత్మలో
నిట్లనియె.

226

క.

రతిపతితోడుత సరియై
రతి సేయఁగ నేర్పుగలిగి ప్రబలుండగు నా
పతిఁ గాదని, పరపురుషునికిఁ
బతిగా మతిఁ గోరు నాకుఁ బాపం బొదవెన్.

227


సీ.

సర్వలోకేశుని సచ్చిదాకారుని
        వాసుదేవుని భక్తవనజమిత్రుఁ
జింతింపనొల్లగ చింతాశతంబుచే
        స్రుక్కి విత్తాశచే నుక్కుమిగిలి
చర్మాస్థిరక్తమాంసావృతంబై నట్టి
        కష్టదేహంబు విక్రయము సేసి
ధనసంగ్రహము సేయ మనమున నూహించి
        వీథులఁ దిరుగాడి వెఱ్ఱినైతి


గీ.

ననుచుఁ బింగళ రోసి, విత్తాశ మాని
హరిఁ బరేశునిఁ జిత్తాబ్జమందు నిలిపి
చారుపుష్పాభినిర్మితశయ్యమీఁద
బ్రియునితోఁ గూడ నిద్రించెఁ బ్రేమతోడ.

228


మ.

గురుసంసారమహార్ణవాంతరనిమగ్నుండై, దురాశాపరం
పరచే నష్టవిలోచనుం డగుచు, నాపత్పంకసంలిప్తుఁడై
వరుసన్ గాలమహాహిజిహ్వతుదపై వర్తించు నీజీవునిన్
హరిదక్కన్ బరులెవ్వ రోపుదురు సత్యాచార రక్షింపఁగన్.

220


సీ.

దేహంబు నిజమని తెలివితోఁ జూచిన
        బుద్బుదంబులరీతిఁ బోవునడఁగి
విత్తంబు నిజమని వీక్షింప నది మోహ
        జనకమై తొరఁగును దనకు రాక

రూపంబు నిజమని రూఢితోఁ గొనియాడ
        ఘనజరాపంచాస్యబాధికంబు
సంపద నిజముగాఁ జర్చించి పలికిన
        మెఱుపుచందంబున మెఱసిపోవు


గీ.

అరయఁ గాంతాత్మసంజాతులప్పువారు
పూర్వకర్మంబు లనుభవంబునకు రాక
మాననేరవు గాన నీమమత విడిచి
చింత సేయంగవలయు లక్ష్మీశపదము.

230


క.

కురరంబొక్కటి మాంసము
కరమునఁ గొని మింటి నెగయఁగాఁ జూచి మదో
త్కరమై పతంగసంఘ
మ్మఱిముఱిఁ దన్మాంసమునకు నరిగినపిదపన్.

231


గీ.

బలిమితోడ మింటఁ బఱదెంచుపక్షుల
నీక్ష సేసి మోహమెల్ల మాని
మాంస మూడఁ దన్ని మది వాంఛ సేయక
కురర మరిగె నెలవుగూఁటికడకు.

232


క.

ఆకుకరముచందంబున
శ్రీకాంతలయందు వాంఛ సేయక ప్రాప్తం
బే కొలది నా విధంబునఁ
బోకడఁ గని నరుఁడు దృప్తిఁ బొందఁగవలయున్.

233


క.

మానము నవమానము సరి
గా నూహయొనర్చి యేను గతకలుషుఁడనై
పూనిక నాత్మారాముఁడ
నై నయమున సంచరింతు నర్భకుపగిదిన్.

234

సీ.

ఒకనాఁడు ధరణిలో నొకవిప్రకన్యక
        కౌతుకంబున నింటి కావలుండి
బంధువు లేతేర భక్తితో వారల
        కతిముదంబునఁ పాద్య మర్ఘ్య మొసఁగి
తద్భోజనార్థమై [1]తతి రాజనంబులు
        వరుస దంపఁగ శంఖవలయపంక్తి
ఘల్లుఘల్లని మ్రోయఁ గడుసిగ్గుపడిఁ జేత
        నొకటి నిల్వఁగఁ వైచియున్నదాని


గీ.

వరుసతో నొక్కటొకటి పోవంగఁ జేసి
నంత నొరయిక లేనిచో నారవంబు
లణఁగిపోయిన సంతోష మగ్గలింప
దంచె రాజనములు బాల ధన్యశీల.

235


ఆ.

ఆ కుమారికంకణాళి చందంబునఁ
బెక్కుయుతులుఁగూడ బెనఁగు జగడ
మొక్కఁడైన మాట లుడిగి నిశ్చలచిత్త
సహితుఁ డగుచు బొందు సత్పదంబు.

236


మ.

శరకారుండు శరంబుమీఁద నిజదృక్స్వాంతంబు లేకంబుగా
నెఱి సంధించి దదేకనిష్ఠుఁ డగుచున్ వీక్షింపుచో ముందఱన్
తురగంబెక్కినరాజు గాంచినక్రియన్ దోరంబుగా యోగి బా
హ్యరుచిజ్ఞానము[2] మాని చేర్పవలయున్ యజ్ఞేశుపై జిత్తమున్.

237

క.

చీమలు పెట్టిన పుట్టలఁ
బాములు సుఖియించునట్లు పరమజ్ఞానుల్
ప్రేమంబునఁ బరగృహమున
వేమఱు సుఖియింతు రధికవిభవముతోడన్.

238


చ.

అరయఁగఁ నూర్ణనాభిహృదయమ్మునఁ దంతువికాన మొప్పఁగా
బరువడితో రచించి యది భగ్నము సేసి గ్రహించునట్లు, వే
మరు హరి భూతపంచకసమన్వితపృష్టి, సృజించి దాని సం
హరణము సేయు నంత్యమున నక్షయరోషకషాయితాక్షుఁడై.

239


ఆ.

నరుఁడు కూర్మినైన నతిరోషముననైనఁ
జిత్త [3]మేమిటందుఁ జేర్చునేని
నతఁడు తత్స్వరూప మగుచుండు షట్పదా
క్రాంతమైన కీటకంబుకరణి.

240


వ.

ఇవ్విధంబున నేను భూమివలన క్షమయును, వాయువువలనఁ బరోప
కారంబును, ఆకాశంబువలనఁ గాలసృష్టగుణాసంగమంబును, జలం
బువలన నిత్యశుచిత్వంబును, అనలంబువలన నిర్మలత్వంబును, నిశాక
రునివలన నధికాల్పసమత్వంబును, సూర్యునివలన జీవనగ్రహణ
మోక్షణంబులును, కపోతంబువలనఁ బుత్రదారాదిస్నేహవిసర్జనం
బును, నజగరంబువలన స్వేచ్ఛాసమాగతాహారభోజనంబును,
సముద్రంబువలన నుత్సాహశోషణపరిత్యాగంబును, శలభంబు
వలన శక్త్యనుకూలకర్మాచరణంబును, షట్పదంబువలన సార
గ్రహణసామర్థ్యంబును, గజంబువలన కాంతావైముఖ్యంబును,
ౙుంటీఁగవలన సంగ్రహణార్జవంబును, హరిణంబువలన నిశ్చలచిత్త
ప్రచారంబును, మీనంబువలన జిహ్వాజయంబును, పింగళ వలన
యథాలాభసంతుష్టియును, గురరంబువలన మోహత్యాగంబును

బాలకునివలన చింతాపరిత్యాగసుఖంబును, కుమారికవలన సంగ
త్యాగంబును, శరకారునివలనఁ దదేకనిష్ఠత్వంబును, సర్పంబువలన
బరగృహనివాసంబును, నూర్ణనాభంబువలన సంసారవినిహతజ్ఞాన
విచ్ఛేదంబును, కీటంబువలన లక్ష్యగతజ్ఞానసంపాదకంబును, నభ్య
సించి విరక్తుండనై యహంకారమమకారంబులు మాని పుర
వనగ్రామపర్వతంబులయందు సంచరింపుదు. మఱియును.

241


శా.

జయాపత్యధనాదులం దగిలి సంజాతభ్రమోన్మతుఁడై
మాయారూపశరీర మెత్తి భువిలో మర్యాద వర్జించి, య
న్యాయప్రాప్తిపదార్థసంగ్రహములం దాసక్తుఁడై మోక్షణో
పాయంబుల్ వెసఁజింత సేయఁడు గుణభ్రాజిష్ణుఁడై మర్త్యుఁడున్.

242


సీ.

నేత్రముల్ పరకామినీరూపములయందు
        రసన తియ్యనిపదార్థములయందుఁ
సంగతి చర్మ మాలింగనాదులయందు
        శోత్ర మసత్కథాసూత్రమందుఁ
బరికింప నాసిక పరిమళంబులయందు
        మానస మన్యాయమార్గమందు
ధీరవాక్యముల సత్కీర్తనంబులయందు
        కర మన్యజనధనగ్రహణమందు


గీ.

దినదినంబున రూఢివర్తించుఁగాని
పొలుపుతోడుత లక్ష్మీశు బొందలేవు
కాన మర్త్యుండు వీని నేకంబు జేసి
నలిననాభుని నేప్రొద్దుఁ దలఁపవలయు.

243


సీ.

ముదిమి దేహమ్ముపై మోపకరింపకమున్న
        జోకమై రోగముల్ రాకమున్న
దిలమైన (?) చీకటుల్ దృష్టిఁ గప్పకమున్న
        పరుసనై నర లేరుపడకమున్న

మదిలోన బుద్ధులు చెదరిపోవకమున్న
        యొడికమయినలావు చెడకమున్న
ఘనమారుతముల నంగములు దీయకమున్న
        ప్రాణముల్ దల్లడ పడకమున్న


గీ.

కంఠనాళంపుజాడ పైఁ గ్రమ్మి శ్లేష్మ
మగ్గలింపకమున్న దేహాభిమాన
ముడిగి దేహంబు నిజము గాకుంట యెఱిఁగి
సేయవలయును బరలోకచింత నరుఁడు.

244


చ.

సరసిజసంభవుండు నిజశక్తిని భూరుహపర్వతాదులన్
బురపశుపక్షికీటములఁ బొల్పుగ ధాత్రి సృజించి వానిచే
బరువడిఁ దుష్టిఁ బొందగ శుభంబున బ్రహ్మవిలోకనక్రియా
పరుఁడగు మానవోత్తమునిఁ బన్నుగఁజేసి తరించె వేడ్కలన్.

245


మ.

వినుతింపన్ బహుసంభవాంతముల సద్విజ్ఞానసంపన్నుఁడై
మనుజాకారముఁ బూని యందు వసుధామర్త్యత్వ మంగీకరిం
చినయాజీవుఁడు మృత్యువగ్గలికమై చెండాడుచున్నంతక
న్నను మున్నాఁడిఁ దలంపగాఁవలదె సన్మానమ్ముతో మాధవున్.

246


వ.

అని యివ్విధంబున నయ్యవధూత నిజవృత్తాంతం బెఱింగించిన విని
సంతసంబంది మత్పూర్వుండైన యదువు పుత్రదారధనాదులయందు
మోహంబుఁ బరిత్యజించి సమ్యగ్జ్ఞానసమేతుండై పరమపదంబు
నకుఁ జనియె నని యీయుపాఖ్యానంబు వాసుదేవుం డుద్ధవునకు
నానతిచ్చి మఱియు నిట్లనియె.

247


క.

కలిమందుఁ బుత్రదారా
ఫులయందు నయంబుఁగూర్మి పొదలుచునుంటల్
కలలోన రాజ్య మేలఁగఁ
గలిగినయ ట్లరసిచూడగా మునివర్యా.

248

సీ.

వరుసతో శత్రుషడ్వర్గంబుఁ బరిమార్చి
        మాత్సర్యమందున మట్టుపడక
కల్లమాటలు మాని ఘనవిత్తనుతవధూ
        బాంధవస్నేహంబుఁ బరిహసించి
ధర్మమార్గంబును దప్పి వర్తింపక
        లోకమధ్యస్థ మంగీకరించి
ఆకారవిభవవిద్యాకులాహంకార
        ముల నిక్కి మిక్కిలి మోసపోక


గీ.

యొడలు వలియించి, నియమసంయుక్తుఁడగుచు
సంతతంబును బుణ్యదేశాశ్రమములు
దిరుగులాడుచు భక్తితో గురుపదాబ్జ
యుగము సేవింపవలయు నత్యున్నతమున.

249


క.

బహువిఘ్నంబులఁ జెందక
సహజజ్ఞానంబుతోడ సత్యవ్రతుఁడై
విహితాచారంబున నరుఁ
డహితాత్ముల యెడ సమత్వ మందఁగవలయున్.

250


సీ.

వేదసూక్ష్మార్థంబు వీక్షింపనేరక
        కర్మమార్గము మించుగాఁ దలంచి
బుధులు కొందఱు యజ్ఞములచేత నింద్రాది
        దివిజులఁ దృప్తిఁ బొందించి పిదప
దేవలోకముఁ బొంది దేవాంగనాజనం
        బులఁ గూడి తద్గానమునను జొక్కి
వరుస గంధర్వకిన్నరులు సన్నుతిసేయఁ
        బుష్పకారూఢులై పొలుపు మీఱి

గీ.

కొంతకాల మీరీతినిఁ గోర్కిదీర
నమరలోకస్థసౌఖ్యము లనుభవించి
పుణ్యమంతయు క్షీణమై పోవునపుడు
దిరుగ జన్మింతు రుర్విపైఁ దేజముడిగి.

251


సీ.

యజ్ఞాతులందు దుష్ప్రజ్ఞాసమేతులై
        మహిని సర్వజ్ఞులమంచుఁ గొంద
ఱామ్నాయమార్గగూఢార్థంబు లెఱుఁగక
        విధి లేక పశువుల విశమనంబు
సేసి యా పశుపురోడాశఖండంబుల
        నగ్నిలోపల వేల్చి యఖిలభూత
భేతాళములకు సంప్రీతి తోడుతఁ దృప్తి
        సమకూర్చు జీవహింసకులు, మీఁద


గీ.

నపునరావృత్తికరమైన యట్టి పదముఁ
జెంద నేరక యాత్మవంశీయులైన
యట్టివారలతోఁ గూడి హర్ష ముడిగి
పడుదు రతిఘోరనరకకూపములలోన.

252


ఉ.

నిర్మలుఁడైన నన్ను మదినిల్పక కొందఱు బుద్ధిహీనులై
కర్మము లాచరించి యధికశ్రమసంకలితాత్ములై మహా
ధర్మము సంగ్రహించి యటఁ దత్ఫలమందు విషక్తచిత్తులై
నిర్మలిభూమిలోన జననంబులఁ బొందుదు రెల్లకాలనన్.

253


ఆ.

లోకపతులకైన లోకంబులకునైన
వనజభవునకైన మునులకైన
దివిజవరులకైన దిలముతో(?) నావల్ల
భయము కలిగియుండు భావమందు.

254

సీ.

గుణములు కర్మమార్గోన్నతిఁ బుట్టించు
        గుణములు సృజియించు గుణగణంబు
గనుక నీజీవుండు గుణసమాకాంతుఁడై
        బలిమిఁ గర్మఫలానుభవము సేయు
వరుసతోఁ దద్గుణవైషమ్య మెందాకఁ
        నందాక నానాత్వ మాత్మయందు
నానాత్వ మెందాఁక నంతపర్యంతంబుఁ
        బారతంత్ర్యంబునఁ బ్రబలియుండు


గీ.

జీవుఁ డెందాఁక స్వాతంత్ర్యభావమందు
నంతపర్యంత మాదినాయకునివలన
భయము గలదని నరుఁడు తత్వంబుఁ దెలిసి
వేడ్కతోడుత నన్ను సేవింపవలయు.

255


వ.

ఇవ్విధంబున వాసుదేవుం డానతిచ్చినఁ బ్రియసేవకుండగు నుద్ధవుఁ
డిట్లనియె.

256


ఆ.

అరయ దేహజంబులైనట్టి గుణముల
యందు వర్తమానుఁడైన దేహి
తద్గుణంబుచేతఁ దద్దయు దృఢబద్ధు
డగునొ కాదొ నాకు నానతిమ్ము.

257


క.

ఏవిధమున లక్షితుఁడగు
నేవిధమునఁ గ్రీడ సేయు నేవి భుజించున్
ఏవిధమునఁ జరియించును
జీవుఁడు గుణబద్ధు డగుచుఁ జిత్రచరిత్రా.

258


శా.

విద్యావిద్యలు నా శరీరములుగా వీక్షించి యీ రెంటిలో
నాద్యంబై తనరారుచున్నయది మోక్షాధ్వంబుగాఁ జూడుమా
విద్యానామకమైన వస్తువది సద్విజ్ఞానరూపంబు, త
ద్విద్యాన్యం బపవర్గబంధకరమై వేధించు సుజ్ఞానమున్.

259

వ.

మఱియు బద్ధముక్తులకు వైలక్షణ్యంబుఁ జెప్పెద. విరుద్ధధర్మంబు
గల రెంటిని నొకధర్మంబందుఁ బ్రవర్తించువానిగా నెఱుంగుము.
ఒక్క మహీరుహంబుదు నన్యోన్యమిత్రత్వంబు బాటిల్లుచు నిజ
నిలయంబందు సుపర్ణద్వయంబు వర్తించు నందొక్కటి పిప్పలాశి
యయ్యె. తదితరంబైన యది యశనఖాదనంబు సేయక బలసమే
తంబై యధికంబుగ వర్తించు. నం దవిద్యాసహితంబైనది నిత్య
బంధనంబునన్, విద్యాసహితంబైనది నిత్యముక్తం బయ్యును వర్తిం
చును. ఇట్టి మాయారూపంబైన మహీరుహంబును సమ్యగ్జ్ఞానం
బున నెఱింగి యర్థంబుల నిందియములచేత గ్రహింపుచు వికార
రహితుండై సంచరించు పరమయోగి ముక్తుండగు. దైవాధీనంబగు
శరీరంబుచేఁ గర్మాచరణంబు సేయుచుఁ గర్తృత్వంబు భజియించి
జీవుండు బద్ధుండగు. ఇట్లు బద్ధముక్తలక్షణం బెఱింగి శయనాసనాటన
మజ్జనదర్శనస్నానస్పర్శనాఘ్రాణభోజనశ్రవణాదిగుణంబుల నంగీక
రింపని విద్వాంసుండు ముక్తుండగు. మఱియును.

260


సీ.

పగగొని పఱదెంచు పశుఘాతకునియందుఁ
        బూజ సేయఁగ వచ్చు పుణ్యునందు
రోషహర్షంబులు రూఢిగా వర్జించి
        సర్వమానవులందు సమతఁ బొందిఁ
నెలకొని పరులపై నిందాస్తుతులు మాని
        పరపదార్థంబుల వాంఛ విడిచి
అర్థితోఁ బుత్రదారాదిమోహంబుల
        దిగనాడి మదిలోనఁ దెల్వి గల్గి


గీ.

శబ్దమయమైన బ్రహ్మంబుఁ జక్క నెఱిఁగి
తద్గతస్వాంతుఁ డగుచు నత్యాదరమున
బాహ్యమంతయు మఱచి యభ్యంతరమున
సంతసంబందు వరయోగి సంతతంబు.

261

గీ.

కాన మానవు డన్యమార్గంబునందుఁ
దెలివి వర్ణించి రూఢి వర్తించెనేని
ధనము వాంఛించి, విధిలేని తావు వెదకు
నతనిరీతిని విఫలత్వమందుఁ బిదప.

261


సీ.

క్రమమునఁ గర్మమార్గమున వర్తింపుచు
        ఫలమంతయు మదర్పణము సేసి
మన్నామ మనయంబు మదిలోనఁ దలఁపుచుఁ
        దుదిముట్ట మద్భక్తిఁ బొదలిబొదలి
సత్సంగతులఁ బొంది షడ్గుణైశ్వర్యసం
        పన్నుండనౌ నన్నుఁ బరమయోగి
చిత్తాంబుజాంతరస్థితునిగాఁ దలపోసి
        వితతమల్లక్షణాంకితుఁడ వగుచు


గీ.

మత్ప్రియంబుగ ధర్మకామముల నెప్పు
డాచరింపుచు మత్పరాయణుఁడ వగుచు
నఖిలజగమును మద్రూపమని యెఱింగి
పుడమిలోపలఁ జరియింపు భూసురేంద్ర.

262


వ.

అని యశోదానందనుండు మందహాసంబుసం బలికిన ధరణిసురుం
డిట్లనియె.

263


క.

ఏ విధమున నీ రూపము
భావంబునఁ దెలియవచ్చు, భక్తి యనఁగ నే
భావంబున నుదయించును
శ్రీవర నా కానతిమ్ము చిత్రచరిత్రా.

264


చ.

అనిన ధరాసురేంద్రునకు నావసుదేవకుమారుఁ డిట్లనున్
వినుము మునీంద్ర, భావమున వీక్షణ సేయుము, నన్ను భక్తితోఁ
గనకమయాంశుకోజ్జ్వలునిగా, జలజాంబుజ [4]శంఖనందకా
భినుతకరాబ్జుగా విమలబింబఫలాధరుగా నుదారతన్.

265

వ.

మఱియు నఖిలజీవులయందు[5] గృపాలుండవై సత్యంబు దప్పక
సర్వదేహులయందు సమత్వంబు భజియించి పరోపకారబద్ధ
కచ్ఛుండవై కామాహతబుద్ధిసమేతుండవై నిత్యశుచిత్వంబు
నొంది పరార్ధవిత్తాదులయం దీహమాని మితాహారభోజనుండవై
ధైర్యంబు దప్పక శత్రుషడ్వర్గజయంబు కలిగి మత్పరాయణుండవై
మత్పూర్వకథితకర్మంబుల నాచరింపుచుఁ దత్ఫలంబు మదర్పణంబు
గాఁ జేయుచు వర్తింపుచు మద్భక్తుండు భాగవతజనదర్శనస్పర్శ
నార్చనంబులను, దత్పరిచర్యానుకీర్తనంబులను మజ్జన్మకర్మకథనంబు
లను, మత్కథాశ్రవణంబునను మత్సన్నిధానంబునం ప్రవర్తించు
గీతతాండవాదిత్రాదిమహోత్సవసందర్శనంబులనుం గోరుచు మచ్చే
ష్టుండై మచ్చరణుండై దేహపతనపర్యంతంబు పరిభ్రమించి
యంత్యకాలంబున మదూపధరుండై మత్సాయుజ్యంబుఁ బొందు.
నివ్విధంబున వైదికతాంత్రికరూపంబులైన మదీయవ్రతధారణంబు
ను, మన్నిలయోపలేపనమార్జనరచనావిశేషంబులును భక్తిసమే
తుండై చేయుచుండవలయును. భాస్కరుండును, నగ్నియు, విప్రుం
డును, ధేనువును, వైష్ణవుండును, నాకాశంబును, వాయువును, నుద
కంబును, భూమియు, నాత్మయు నాఁబరఁగు నీ పదియును మత్పూజా
స్థలంబులు, ఇందు వేదంబులచేత సూర్యమండలంబును, హోమ
ద్రవ్యంబులచేత ననలంబును, నాతిథ్యంబున విప్రోత్తమును, బాల
ఘాసకబళంబులచేత ధేనువులను, సత్కారంబులచేత విష్ణుభక్తులను,
ధ్యానంబుచేత హృదయాకాశంబులను, ముఖ్యబుద్ధిచేత వాయువును
దోయపురస్కృతద్రవ్యంబులచేతఁ దోయంబును మంత్రాదులచేత
స్థండిలంబులను, బూజసేయుచు శంఖచక్రశార్ఙగదానందకాద్యా
యుధధరుండనైన నన్ను ధ్యానంబు సేయుచు సంచరింపంగవలయును.

క.

మును బ్రహ్లాదకుమారుం
డును, శుకసనకాదిచారణులు యాదవులున్
అనవరతభక్తియోగం
బునఁ బొందరె మత్పదంబు భూసురవర్యా.

267


క.

వినుతింప భక్తియోగం
బునకును సరిరాదు, దానమును, దీర్థంబున్
ఘనమైన తపము యాగం
బును ప్రతినియమాదులైనఁ బుణ్యచరిత్రా.

268


సీ.

గంధర్వయక్షనాగములు దైతేయులు
        సిద్ధు లప్పరసలు సిద్ధపతులు
మృగములు గుహ్యకుల్ ఖగ యాదవాదులు
        బాణుండు బలియుఁ గుబ్జయును, యజ్ఞ
పత్నులు, గోపికల్ పరికింప సుగ్రీవ
        హనుమదాదులు, విభీషణుఁడు గృధ్ర
మయ మునీంద్రారు లధ్యయనంబు వర్జించి
        సవడి నిత్యోపవాసములు మాని


గీ.

నిత్యకర్మాదివిధుల నసత్య మనుచు
సంతతాధ్వరమార్గంబు చక్కిఁబోక
ముదము తోడుగ సత్సంగముస మదీయ
లోకమందున వసియింతు రేకమతిని.

269

ఉ.

శీరకరుండు నేను నతిచిత్రరథంబు నెక్కి వేడ్క న
క్రూరునితోడున్ మధురకున్ జనువేళ సమస్తగోపికల్
మారుని బారిఁ జిక్కువడి మమ్ములఁ బెాసిన జాముఁ బుత్తు రం
భోరుహజాతకల్పముగ భోజనభూషణవాంఛ జాఱ్పునన్.

270


క.

ఆ రమణులు నిజపతులను
నారూపముగాఁ దలంచి నయమార్గములన్
వారలతోఁ గ్రీడించెద
రారయ మద్భక్తిసహితలై విప్రవరా.

271


క.

ఈరీతిని గోపిక లవి
కారంబున భక్తియోగ కలితోద్యమలై
నేరుపున నన్నుఁ బొందిరి
యారయ నీక్షింప భక్తి కన్యము గలదే.

272


ఆ.

సుతధనాదులందు సతులందు గృహముందు
దేహమందు మిగుల నీహ మాని
భక్తి కలిగి చిత్తభవనంబులోపల
శరణు వొందు నన్ను సంయమీంద్ర.

273


వ.

ఈ విధమున నానతిచ్చిన వాసుదేవునకు మునివరుం డిట్లనియె.

274


క.

శ్రీవల్లభ కమలాసన
బావాంబుజమధ్యనిలయ పావనచిత్తం
బేవిధమున భ్రమియించును
దేవాధిప నాకు నానతీయఁగవలయున్.

275


వ.

అని పలికిన ధరణిసురునకు శౌరి యిట్లనియె. మునీంద్రా, దారుమధ్య
మానం బగు ననలంబు సూక్ష్మరూపంబున జనియించి సమిత్సమేధితం
బగుక్రమంబన సూక్ష్మతరంబున మద్రూపంబు గుణవర్ధితంబై భూతం

బుల గ్రసియించు. జీవుండు సకలదేహాంతరగతుండై యచ్ఛేద్యుండై
యదాహ్యుండై యశోష్యుండై వర్తించు, ఈ జీవుండు సంసారచక్ర
పరిభ్రమితుండై జన్మావ్యయంబులఁ బొందుచుండు. అట్టి పురాతనం
బైన సంసారమహీరుహంబు కర్మాత్మకంబై శతమూలసమేతంబై
నాళత్రయంబు కలిగి పంచస్కంధవిశాలంబై పంచరస ప్రసూతి
జనకంబై దశైకశాఖానిస్తృతంబై సుపర్ణద్వయసేవితంబై ఫలద్వ
యవిరాజితం బగు. అం దొకఫలంబును గ్రామచరులును మరియు
నొక్కఫలంబు నరణ్యవాసులును భుజింతు. రివ్విధంబున బహు
విధంబై మాయారూపంబగు నీ సంసారమహీరుహంబును సద్గురు
సేవామూలంబున సంభవించు విద్య యను కుఠారంబున మొదలు
ముట్టం దునిమి యప్రముత్తుండవై యాత్మ నాత్మతోఁ గూర్చి కర్మంబ
బరిత్యజింపవలయు నని యశోదానందనుం డానతిచ్చిన మరియు
ని ట్లనియె.

276


సీ.

సత్త్వరజస్తామసములు నాఁ బరగును
        సద్గుణత్రయమందు సత్త్వగుణము
సుజ్ఞానజనకమై శుభదాయకం బగు
        నది గాక సాత్త్వికం బైన యట్టి
సకలధర్మమ్ములఁ జరియింపవలయును
        బహువిధంబుల మదర్పణము గాఁగ
నా రజోమూలమై నట్టి ధర్మంబులు
        చర్చింపఁగాఁ బునర్జననహేతు


గీ.

వందుఁ దామసధర్మంబు లఖిలనరక
కారణంబులుగాన, నీ క్రమముఁ దెలిసి
నరుఁడు సాత్త్వికమూల మై నట్టి ధర్మ
మాచరింపంగవలయు విఖ్యాతితోడ.

277

వ.

అని పలికిన సత్యభామావల్లభుఁ డిట్లనియె.

278


క.

సనకాదుల కే రూపం
బునఁ జెప్పితి వఖిలయోగమును దద్రూపం
బనఘ రమాధిప నాకును
వినుపవలయు మనములోన వేడ్కఁ దలిర్పన్.

278


చ.

అని ముని పల్కి నంత విబుధాహితఖండనుఁ డానతిచ్చె ని
ట్లనఘ మునీంద్రవర్య సనకాదులు పూర్వవిధాతమానసం
బున జనియించి తత్త్వము సమున్నతితో నెఱుగంగఁ బూని, వా
రనుమతి బ్రహ్మఁ జే రడిగి రందఱుఁ నొక్కెడఁ బ్రశ్నబీజమున్.

279


ఆ.

కోరి చిత్తమందు గుణములు వర్తించుఁ
దద్గుణంబులందుఁ దనరుఁ జిత్త
మాయురంబులోన నన్యోన్యసంత్యాగ
మెట్లు సేయవచ్చు హేమగర్భ.

280


సీ.

సనకాదు లీ విధంబునఁ బశ్నఁ జేసిన
        బ్రహ్మజ్ఞుఁ డైన యా పద్మభవుఁడు
పరువడిఁ దత్కృతప్రశ్నబీజము గాన
        లేకుంట యెఱిఁగి నే లోకభర్త
కీ ప్రశ్నబీజంబు నెఱుఁగ జెప్పగఁ బూని
        హంసరూపముఁ దాల్చి యచట కరుగ
నా మునీంద్రులు నాకు నర్ఘ్యపాద్యము లిచ్చి
        పాదాభివందనం బరగఁ చేసి


గీ.

బ్రహ్మ మొదలైన సనకాది బ్రహ్మమునులు
తత్త్వజిజ్ఞాసు లై నన్ను [6]దగ్గ ఱడిగి
నంత వారల కేఁ జెప్పినట్టి యోగ
మంతయును నీకు నెఱిఁగింతు నాదినుండి.

231

వ.

అది యెట్లనిన.

283


సీ.

నానామనశ్శ్రోత్రనయనయుగ్మముచేత
        నెఱి గృహ్యమానమై నిలుచు నెయ్య
దా పదార్థం బనిత్యంబుగా నెఱుఁగుఁడు
        బ్రహ్మంబు జగ మని రమణఁ దెలియుఁ
డా బ్రహ్మ మఖిలభూతాంతర్నివాసియై
        వర్తించు సాక్షియై వానియందు
దేహి కర్మార్జితదేహంబు ధరియించి
        శాంతుఁడై సంసారచింత మాని


గీ.

మమత వర్జించి తుర్యాశ్రమస్థుఁ డగుచు
నిర్మలజ్ఞాననియతుఁడై నెమ్మితోడ
యోగమార్గాధిరూఢుడై యుండెనేని
మత్పదంబున [7]వసియించు మాన్యుఁ డగును.

284


వ.

మరియు దేహి స్వప్నగతుండై పదార్థదర్శనంబు సేసినట్లు జాగ్ర
దవస్థం దోఁచిన యవి నిత్యంబులు గావు. యోగి లోకమందు
మదిరాపానంబుఁ జేసి మదాంధుఁ డైనవాఁడు పరిధానాంశుక
పాతనాపాతనంబుల నెఱుంగని చందంబున దైవకృత్యంబు లైన నిజ
దేహ స్థితి నాశనంబుల నెఱుంగఁడు. కర్మానుభవసమాప్తిపర్యం
తంబు దేహంబు వర్తించు నని సనకాదులకు సాంఖ్యయోగం
బుపదేశించి వారిచేఁ బూజితుండనై పరమనిలయంబున కరిగితి
నంత నీ యోగంబును విధాత యెఱింగి భృగ్వాదులకును, బ్రహ్మ
ఋషులకును జెప్పె. వారు దేవ దానవ గంధర్వుల కుపదేశించిరి.
తన్మూలమున మర్త్యలోకవాసు లభ్యసించిరి. ఇవ్విధంబునఁ

బరంపరానుగతం బగు సాంఖ్యయోగం బెఱింగి సమ్యజ్ఞానసమే
తుఁడవై పుణ్యదేశనదీవనసంచారంబు లాచరింపు మరి యాద
వేంద్రుం డానతిచ్చిన నుద్ధవుం డి ట్లనియె.

285


క.

పరకాంతాధనములపై
దిరుగాడెడు చిత్త మెట్లు త్రిదశేశ్వర నీ
వరరూపమందు నిలుచును
దిరముగ నిది నాకు నానతీయఁగవలయున్.

286


వ.

అని పలికిన ధరణీసురసత్తమునకుఁ బద్మనాభుం డి ట్లనియె.

287


ఉ.

కొందఱు ధర్మమార్గముల గొందఱు సంపదఁ గొంద రర్థమున్
గొందఱు నిత్యదానములఁ గొందఱు కీర్తులఁ బుత్రదారలన్
గొందఱు సంతతాధ్వరముఁ గొందఱు తీవ్రతపక్రియాదులన్
గొందఱు కామయంత్రములఁ గోరుచునుందురు మోహితాత్ములై.

288


క.

శ్రీ రమణుం డగు నను మదిఁ
గోరి భజిపంగ లేక కుపథంబులపై
నేరుపు చెడి వర్తింపుదు
రీ రీతిని నరులు మోక్షహితవిరహితులై.

289


ఆ.

నీరసంబు లైన భూరుహంబుల నగ్ని
యేచి నీరుగా దహించు నట్లు
మాన్యమైన యట్టి మత్పాదయుగభక్తి
పాపసమితిఁ జెఱచుఁ బంతముగను.

290


క.

ఒకవంక నాఁగు నగువే
ఱొకచో గానంబు సేయ నుబ్బిన వేడ్కన్
సకలంబు విష్ణుమయ మని
ప్రకటంబుగ మత్పదాబ్జభక్తుడు దెలియున్.

291

సీ.

హరిభక్తి గలవాని చరణరేణుచయంబు
        సోఁకిన భూ మెల్ల శుద్ధి పొందు
హరిభక్తి గలవాని కన్నంబుఁ బెట్టిన
        నరు నింట [8]వేడుక నారగింతు
హరిభక్తిసంపన్నుఁ డగువాని సేవింపఁ
        బాపతూలాద్రులు భస్మ మగును
హరిభక్తిసంయుక్తుఁ డగువాని వెనువెంట
        దిరుగులాడుచు నుందుఁ దెలివి సెడక


గీ.

వ్రతము లైనను సంతతక్రతువు లైన
ధర్మ మైనను బహువిధాధ్యయన మైన
నీడుజోడుగ మద్భక్తితోడ నెపుడు
[9]సవతు రా నేర వెచ్చోట సంయమీంద్ర.

292


గీ.

భోగవాంఛతోడఁ బొదలెడి చిత్తంబు
భోగ్యవస్తుసమితి పొందుఁ గోరుఁ
దనివి లేక నన్నుఁ దలఁపుచు వర్తించు
మనము మత్పదాబ్జమున నిలుచు.

293


శా.

కాంతసంగము మాని సంతతము నేకాంతప్రదేశంబునన్
శాంతుండై ధనదారమోహకలితేచ్ఛావర్జితుండై రమా
కాంతుం డౌ నను నెప్డుఁ బ్రేమమున మోక్షప్రాప్తికై యోగి శు
ద్ధాంతఃపద్మమునం దలంపవలయు హర్షోల్లాసత్స్వాంతుఁడై.

294


మ.

హరి యీ రీతిని నానతిచ్చిన మునీంద్రాగణ్యుఁ డా పంకజో
దరుతో ని ట్లనియెన్ సమస్తజగదాధారప్రపన్నార్తిసం
హర యెవ్వానిమనంబులోఁ దలఁచి యోగారూఢుఁ డింద్రాది డు
స్తరయుష్మత్పదవాసియై తనరుఁ దద్ధ్యానంబు వర్ణింపవే.

294

వ.

యి వ్విధమ్మున ధ్యానయోగం బడిగిన ధరణీసురోత్తమునకు
యదుపుంగవుం డిట్లనియె.

293


సీ.

శాంతుఁడై నియతి నశ్రాంతంబు నేకాంత
        మున సమాసీనుఁడై ముదముతోడ
హస్తంబు లూరుద్వయంబునఁ గీలించి
        నాసాగ్రవిన్యస్తనయనుఁ డగుచు
హృదయనాళంబులో నుదయార్కసమకాంతి
        కలిగిన పద్మకుట్మలము మిగుల
..........................
        ...........................


గీ.

వికసితంబైనవానిగా వీక్ష చేసి
కర్ణికామధ్యమంబునఁ గ్రమముతోడ
విమలచంద్రాగ్నిరవిమండలముల నిలిపి
తద్విభావసుమండలస్థానమందు.

296


వ.

మఱియుఁ దప్తకాంచనసంకాంశదివ్యదేహుండును, కటిఘటిత
రత్నఘంటికాసమంచితపీతాంబరాలంకృతుండును, కమలాయత
కుండలద్వయదీప్తిశ్యామలితకపోలద్వయవిరాజమానవద
నుండును, చంపకప్రసూనసమాననాసాలంబితమౌక్తికధవళి
తాధరుండును, కౌస్తుభశ్రీవత్సవనమాలాలంకృతుండును, బహు
విధరత్నవిచిత్రభూషాసమేతుండును, రత్నకిరీటదేదీప్యమా
నుండును, బాహుచతుష్కోపశోభితుండును, శంఖచక్రగదా
నందనాద్యనేకాయుధధరుండును, మరకతమణినూపురద్వితయ
ద్యుతిపిశంగీకృతపాదాబ్జుండును, కరుణారసపరిపూరితుండును,
వామాంకనివాసకమలాలోకనకుతూహలసంతుష్టహృదయుం
డును, కనకసింహాసనసమాసీనుండును, నైన నన్ను భావించి సం
తసంబున ధ్యానంబు సేయవలయును.

297

క.

ధారుణిఁ బెక్కగు నా యవ
తారంబులు గలవు నరుఁడు దన చిత్తములో
నే రూపమంద రుచి గల
దా రూపము దలఁపవలయు నభ్యాసమునన్.

298


ఆ.

పరమయోగివరులు పరతత్త్వమైనట్టి
నన్ను విమలచిత్తనలినమందుఁ
దనివి లేక యేకతంబుగాఁ దలఁచినఁ
బొంద రెచట జన్మముల మునీంద్ర!

299


వ.

మరియు యోగంబునకు నష్టాదశధారణావిశేషంబులు గలవు.
అం దెనిమిది మత్ప్రధానంబులై గుణహేతువు లగు, అణిమయు,
మహిమయు, లఘిమయు, నింద్రియప్రాప్తియు, శ్రుతదృష్టంబుల
యందుఁ బ్రకాశమగు శక్తియుఁ బ్రేరణంబు నీశత్వంబు ననాఁ బరగు
నీ యెనిమిదియును యోగసిద్ధకారణంబు లని యోగశాస్త్రజ్ఞులు
చెప్పుదురు. ఇంద్రియంబుల స్వేచ్ఛావిహారంబు మాన్చి, మనంబు
నం గూర్చి, మనంబు నాత్మయందుఁ దగులం జేసి యాత్మ నాత్మ
తోఁ గూర్చి బ్రహ్మమార్గంబున శరీరత్యాగంబు సేయవలయు.
యోగసిద్ధిపారగుఁడైన మానవోత్తమునకు నితరధర్మానుసంధానం
బు వలదు. తొల్లి కురుపాండవయుద్ధానంతరమున భీష్ముండు శరతల్ప
గతుండై యోగధారణారూపం బడిగిన నతనికి నేఁ జెప్పిన రూప
లక్షణంబు చెప్పెద. చరాచరరూపంబైన జగంబులందుఁ దదాకా
రంబు దాల్చి భూతంబులయం దాధారభూతంబై సూక్ష్మంబుల
యందు జీవుండును, దుర్జయంబులయందు మనువును, దేవర్షుల
యందు నారదుండును, ధేనుగణంబులయందుఁ గామధేనువును,
సిద్ధులయందుఁ గపిలుండును, బతగంబులయందు సుపర్ణుండును,
బ్రహ్మలయందు దక్షుండును, పితృగణంబులయం దర్యముండును,

దైత్యులయందు బ్రహ్లాదుండును, నక్షత్రోషధులయందుఁ గళా
నిధియును, గజంబులయం దైరావతంబును, దురంగంబులయం
దుచ్చైశ్శ్రవంబును, దర్వీకరంబులయందు వాసుకియును, మృగం
బులయందు సింహంబును, నాశ్రమంబులయందు యత్యాశ్రమంబు
ను, వర్ణంబులయం దకారంబును, నదులయందు గంగయు, సాగ
రంబులయందు క్షీరసాగరంబును, ఆయుధంబులయందు ధనువును,
గిరులయందు మేరుశైలంబును, వసస్పతులయం దశ్వత్థంబును, నోష
ధులయందు యవధాన్యంబును, యజ్ఞంబులయందు బ్రహ్మయజ్ఞం
బును, వ్రతంబులయం దహింసయు, యోగంబులం దాత్మసంరోధం
బును, స్త్రీలయందు శతరూపయు, మునులయందు నారాయణుండు
ను, యుగములందుఁ గృతయుగంబును, సిద్ధులయందు దేవళుండును,
ధర్మంబులయందు సన్న్యాసంబును, గోప్యంబులయందు సత్యంబును,
ఋతువులయందు వసంతంబును, మాసంబులయందు మార్గశీర్ష
మాసంబును, నక్షత్రంబులయం దభిజిన్నక్షత్రమును, భగవదాకా
రంబులయందు వాసుదేవుండును, కింపురుషులయం దాంజనేయుం
డును, జయశీలంబు లగు నాయుధములయందు సుదర్శనంబును,
రత్నంబులయందుఁ బద్మరాగంబును, దానంబులయం దన్నదానం
బును, తిథులయం దేకాదశియును, నీతులయందు వైష్ణవుండును నై
వర్తింతు. ఇవి మద్విభూతులుగా నెఱుంగుము. మరియు, నింక
జగంబులయందు నే వస్తువులం దెయ్యవి మించు చూపు నవి మద్రూ
పంబులుగా నెఱుంగవలె నని పుండరీకాక్షుం డానతిచ్చిన విప్రవరుం
డిట్లనియె.

300


క.

అర్ణనరశనానాయక
వర్ణితసుగుణాభిరామవైభవ! నాకున్
వర్ణాశ్రమధర్మంబులు
నిర్ణయముగ నానతిమ్ము నిత్యచరిత్రా!

301

వ.

అని పలికిన సర్వంసహాసురేంద్రునకు నారాయణుం డి ట్లనియె.

302


సీ.

కృతయుగంబందు సత్కృతుఁడనై
        హంసరూపంబున నలరియుందు
ఆ యుగంబున ధర్మ మంతయు వృషరూప
        మున వృద్ధిబొందును దినదినంబు
త్రేతాయుగంబునఁ జాతురి నా ధర్మ
        మంతయుఁ బాదత్రయమునఁ దనరు
ద్వాపరంబందుఁ బాదద్వయంబున నది
        వర్తించు నెచ్చోట వరుస చెడక


గీ.

బలిమి నొందక కలియుగంబందుఁ బాద
మాత్రమున నుండి యదియును మాసిపోవు
నీ విధంబున ధర్మంబు నేపు దప్పి
యుగయుగంబున వర్తించు నుర్విమీద.

303


సీ.

ఆరయ వక్త్రబాహూరుపాదములందు
        రమణవిప్రాదివర్ణములు పుట్టె
యజ్ఞంబు సత్య మధ్యయనంబు శమమును
        విప్రధర్మంబులై వెలయుచుండు
దాన మాస్తిక్యంబు దయయును శౌర్యంబు
        క్షత్రధర్మంబులై జరుగుచుండు
నియమంబు శాంతి వాణిజ్య గోరక్షణా
        దులు వైశ్యధర్మము తెలిసి చూడ


గీ.

విప్రసేవయు దానంబు విష్ణుభక్తి
స్వామికార్యంబు మాయగాఁ జరుపకుంట
జయము చేఁగొంట శత్రుల సమయఁజేయు
టరయ నివి శూద్రధర్మంబు లన్నిదిశల.

304

ఆ.

హింసచేయకుంట హిత వాచరించుట
దానగుణము శాంతదయయుఁ గలుగు
టనృత మాడకుంట హర్షంబు నొందుట
వరుస నివియ సర్వవర్ణసమము.

305


వ.

మరియు నందు బ్రహ్మవర్ణంబుల బ్రహ్మచారి గృహి వానప్రస్థ
యత్యాశ్రమభేదంబుల నాల్గువిధంబు లయ్యె. నా యాశ్రమంబుల
యందు యథాకాలవిహితోపనయనాదిసంస్కారసంస్కృతత్వం
బును, మౌంజీకృష్ణాజినోపవీతిదండకమండలుధారణంబును, నింద్రి
యజయంబును, గురుశుశ్రూషణంబును, నిత్యశుచిత్వంబును, భిక్షాచర
ణంబును, స్వాధ్యాయపఠనంబును, సర్వసమత్వంబును, నాఁ దగు నివి
బ్రహ్మచారి ధర్మంబులు. పుణ్యతీర్థస్నానంబు భూతదయయును,
బ్రహ్మయజ్ఞంబును, దేవర్షిపితృతర్పణంబును, నగ్నిహోత్రంబును,
దర్శపౌర్ణమాసియు, నౌపాసనవైశ్వదేవాదినిత్యక్రియాచరణంబును,
శ్రాద్ధనియమంబును, దేవతారాధనంబును, స్వభార్యయందు ఋతు
కాలగమనంబును, దానంబును, బ్రతిగ్రహంబును, నతిథిపూజనంబు
ను, నివి గృహస్థధర్మంబులై పర్యవసించు. శిలోంఛధాన్యసంగ్ర
హంబును, జటావల్కలధారణంబును, నిత్యనైమిత్తికకర్మాచరణం
బును, కామ్యనిషిద్ధకర్మపరిత్యాగంబును, భూతదయయును, సుఖ
దుఃఖసమత్వంబును, మదీయసేవానియమంబును, వానప్రస్థ
ధర్మంబు లనాఁబరగు. కౌపీనాజినదండకమండలుధారణంబును,
భిక్షాచరణంబును, బ్రహ్మజ్ఞానంబును, బ్రహ్మచర్యంబును, బరమా
త్మదర్శనంబును, బుత్రదారాదిస్నేహవిసర్జనంబును, రిపుషడ్వర్ణ
జయంబును, బుణ్యతీర్ణాశ్రమపర్యటనంబును, మన్నామస్మరణంబును,
మదాకృతిధ్యానంబును, సర్వకర్మపరిత్యాగంబును నివి యతిధర్మం
బు లనాఁబరగు. నీ యాశ్రమములయందుఁ దుర్యాశ్రమంబు నా రూ
పంబుగా నెఱుఁగుము. అట్టి యత్యాశ్రమస్థుండు పుత్రదారధ
నాదులతోడి సంగమంబు పరిత్యజించి గ్రీష్మకాలంబునం బంచాగ్ని

మధ్యంబందును, వర్షాకాలంబున వర్షంబులయందును, శిశిరంబునఁ
గంఠదఘ్నసలిలంబులయందును దపము సేయుచుఁ జాతుర్మాస్యా
దులయందుఁ గాలపక్వపదార్థంబు లనుభవించుచు నాత్మారోపి
తాగ్నిసమేతుండై నఖఛ్ఛేదనంబు పరిత్యజించి యనిందితగృహం
బుల యందు భిక్షాటనంబు సేయుచు, దృష్టిపూతం బగు మార్గంబున
గమనం బాచరింపుచు, వస్త్రపూతజలపానంబు సేయుచు, సత్య
పూతం బగు వచనంబులు పల్కుచు, రిపుషడ్వర్గజయంబు గల్గి, విర
క్తుండై , యేకాంతసమాసీనుండై, మదాకృతిధ్యానసుఖం బెఱింగి,
యెఱుకి గలిగియును బాలుని చందంబునఁ గ్రీడించుచు, గుశలుం
డయ్యును జడునిమాడ్కి సంచరించుచు, జ్ఞానంబు గల్గియు నున్మత్తుని
రీతిఁ బ్రవర్తించుచుఁ బాషండసంగమంబు పరిత్యజించి, పశువు
క్రమంబునఁ బరులయందు వైరంబు సేయక ప్రాణధారణ
మాత్రంబు నీరసాహారంబు భుజియింపుచు, దుఃఖోదకంబు లైన
కామంబులయందు సంజాతవైరాగ్యుండై, గురుసేవాపరిజ్ఞాన
తత్త్వసారుండై, మద్భక్తిసంయుక్తుండై మోక్షమార్గంబు చింతిం
చుచు వర్తింపవలయు.

306


క.

ఆ యతివరుఁ డీ జగమును
మాయారూపం బటంచు మదిఁ దలఁచుచు న
న్యాయంబు విడిచి దేహ మ
పాయం బని యెఱుఁగవలయు బ్రహ్మవిధిజ్ఞా.

307


క.

జ్ఞానం బెక్కువ నరునకు
జ్ఞానంబున ముక్తి గలుగు జ్ఞానముచే దు
ర్జ్ఞానంబు మాసిపోవును
జ్ఞానంబునఁ గీడు గలదె జగములలోనన్.

308

గీ.

ఆత్మ యను పేరఁ దనరుచున్నట్టి యనల
మందు నధ్యాత్మ యను నాజ్య మమర వేల్చి
జ్ఞానయజ్ఞంబు చేసిన జనుల కెల్ల
కలుగు మోక్షంబు నిక్క మీ కథ మునీంద్ర.

309


చ.

సమరములోన బాంధవుని జక్కగఁ జేసి యమాత్మజుండు చి
త్తమున విరక్తి కల్గి తాపము నొందుచు నన్ను మోక్షధ
ర్మములను భక్తితో నడుగఁ గ్రమ్మఱఁ జెప్పినయట్టి మోక్షధ
ర్మములను నీకుఁ జెప్పెద ధరామర వీనులు హర్షమందగన్.

310


క.

అజ్ఞాన ముడిగి కేవల
సుజ్ఞానము బొడముదాక సువిధిజ్ఞుండై
యజ్ఞాదికర్మసమితి మ
దాజ్ఞను జరుపంగవలయు నఫలాశుండై.

311


శా.

ఆ యజ్ఞాదులు చేసి తత్త్ఫలముపై నాసక్తి వర్జించి మ
న్మాయామోహితమైన యీ జగములో మధ్యస్థుఁడై కర్మమా
ర్గాయాసంబు పరిత్యజించి నరుఁ డత్యంతాత్మయోగంబునన్
గాయం బేర్పడకుండఁ దన్నవలయున్ సంసారబాహ్యస్థుఁడై.

312


గీ.

స్నానయాగదానతర్పణంబులు మాని
పుత్రదారవిత్తబుద్ధి మాని
గర్వ ముడిగి సర్వకర్మముల్ జరుపక
తలఁపులోన నన్ను దలఁపవలయు.

313

వ.

అని, ఇవ్విధంబునం జక్రి నిర్వక్రసమ్యగ్జ్ఞానప్రకాశకరంబు లైన
వచనంబులు పల్కిన ధరామరముఖ్యుండు సంతసించి యిట్లనియె.

314


క.

తెలియనివి గొన్నిమాటలు
గల వడిగెద భువనవంద్యకళ్యాణసము
జ్జ్వలరూప నాకుఁ గ్రమ్మఱఁ
దెలుపుము చిత్తంబులోనఁ దెలివి తలిర్పన్.

315


సీ.

యమ మెన్నివిధములు శమ మన నెయ్యది
        దమ మేది ధృతి యేది దాన మేది
తప మేవిధంబు సత్యత్యాగ ధన యజ్ఞ
        దక్షిణావిద్యలుఁ దనర నెవ్వి
లక్ష్మియు సుఖ దుఃఖ లజ్జ లనా నెవ్వి
        పండితమూర్ఖు లేపగిదివారు
మార్గోత్పథంబుల మహిమ లేవిధములు
        స్వర్గనారకముల జాడ లెవ్వి


గీ.

బంధు లెవ్వారు గృహమేధి పరగ నాఢ్యుఁ
డనఁగ నెవ్వఁడు ఘనదరిద్రాంధకార
సహితుఁ డెవ్వాఁడు నాథుఁ డే జాడవాఁడు
దీనమందార యివి నాకు నానతిమ్ము.

316


వ.

అనిన విప్రవరునకు గోపికావల్లభుం డిట్లనియె.

317


క.

నీ వడిగిన యీ ప్రశ్నల
కే వంకను సవతు లేద యీ భావము నీ
భావంబున కొడఁబడ సం
భావన నెఱిఁగింతు నీకుఁ బటువాక్ప్రౌఢిన్.

318


వ.

ఆకర్ణింపు మది యె ట్లనిన నహింసయు, సత్యంబును, కార్యరాహి
త్యంబును, అసంగమంబును, అసంచయంబును, ఆస్తిక్యంబును,
బ్రహ్మచర్యంబును, మౌనంబును, స్థైర్యంబును, క్షమాభయంబు

లును, శౌచంబును, జపంబును, తపంబును, హేమంబును, అతిథి
సత్కారంబును, మదర్చనంబును, తీర్థస్నానంబును, పరమయోజన
కర్తృత్వంబును, తుష్టియు, ఆచార్యసేవనంబును నివి యమం బనాఁ
బరగు. సర్వేందియనిగ్రహంబు శమంబు. శత్రుమిత్రాదుల
యందు మాధ్యస్థ్యంబు భజియించుట దమంబు. జిహ్వామేహన
జయంబు ధృతి. మూఢమతులకు జ్ఞానోపదేశంబు చేయుట దానంబు.
కామత్యాగంబు తపంబు. సమదర్శనత్వము సత్యంబు. కర్మాసంగ
మంబు త్యాగంబు. వైష్ణవధర్మార్జనం బిష్టధనంబు, మల్లక్షణం
బెఱుంగుట యజ్ఞంబు. సూక్ష్మజ్ఞానం బడుగుట దక్షిణ. ప్రాణా
రూమంబును, నిశ్చలభక్తి, విద్య లనన్ దనరు శమాది గుణంబులు
లక్ష్మి. ఆశారాహిత్యంబు సుఖంబు. కామసుఖాపేక్ష నిశ్చయం బగు
దుఃఖము. బోధను వికర్మమంబులయందు ప్రవర్తనంబు మాన్పుట
లజ్జ. బంధమోక్షణమార్గజ్ఞుండు పండితుండు. దేహాదులయం
దహంకారంబు బొందినవాఁడు మూర్ఖుఁడు. మద్భక్తిమార్గంబు చిత్త
విక్షేపం బుత్పథంబు. సత్త్వగుణోదయంబు స్వర్గంబు. తమో
గుణోదయంబు నరకంబు. గురువు బంధువుం డనాఁ బరగు. నిజశరీ
రంబు గృహంబు. గుణాఢ్యుం డాఢ్యుండు. తుష్టి లేని యతండు
దరిద్రుండు. సర్వసంగవిరక్తుం డీశ్వరుండు. అని ప్రశ్నోత్తరంబు
లిచ్చి వాసుదేవుండు మరియు నిట్లనియె.

319

  1. తతి=ఈశబ్ద మిచ్చట రహస్యము లేక యేకాంతము అనునర్థమునఁ బ్రయుక్తము—మూలములో:-
    తేషామభ్యవహారార్థం శాలీన్ రహసి పార్థివ। అవఘ్నంత్యాః ప్రకోష్ఠన్థాశ్చక్రుశ్శం ఖాఃస్వనం మహత్.
  2. పాఠాంతరము— రౌతు. కాని 'రాజు' పాఠము యుక్తమని తోఁచెడిని- మూలములో
    యథేషు కారో నృపతిం ప్రజంత మిషౌ గతాత్మో న దదర్శపార్శ్వే.
  3. ఏమిటందు = ఈశబ్దము ‘దేనియందైనను’ అను అర్ధమునఁ బ్రయుక్తము. మూలములలో,
    'యత్ర యత్ర మనో దేహీ ధారయేత్ సకలం ధియా స్నేహాద్ద్వేషా ద్భయాద్వాపియాతి తత్తత్స్వరూపతాం?
  4. ఈ ప్రయోగము తాళపత్రమున నిట్లనే యున్నది.
  5. పాఠాంతరము :- జీవంబులందు
  6. దగ్గఱి+అడిగినంత. క్త్వార్థకసంధి
  7. వరించు. వ్రాఁతప్రతి
  8. నే భోజనంబు సేతు - వ్రాఁతప్రతి
  9. సమత కానేరవు - వ్రాఁతప్రతి