భక్తిరసశతకసంపుటము/మొదటిసంపుటము/వృషాధిపశతకము

పీఠిక

ఈ వృషాధిపశతకమును వీరశైవమతస్థాపకు డగుబసవేశ్వరుని లీలల నభివర్ణించుచు నాంధ్రకవులలో బేరెన్నికగన్న పాలకుఱికి సోమనాథమహాకవి రచించెను. ఇందు వర్ణింపఁబడిన బసవేశ్వరుఁడు నందీశ్వరునియంశమువలన నొకపుణ్యదంపతుల కుదయించి పసితనముననే సమస్తవిద్యాపారంగతుఁడై యుపనయనాదిబ్రాహ్మ్యధర్మము లుల్లంఘించి సంగమేశ్వరాలయమున నీశ్వరసాక్షాత్కారమునొంది వీరశైవమత ప్రచారము చేయ బయలువెడలి స్వప్రతిభాతిశయములవలన కల్యాణపురరాజ్యము పరిపాలించు బిజ్జలునివద్ద మంత్రిగాఁ బ్రవేశించి మతాభివృద్ధిఁ జేయసాగెను.

బిజ్జలుడు జైనుఁడగుటవలన బసవేశ్వరునకు బిజ్జలునకుఁ ద్వరలో విరోధము పొసంగెను. పిదప బసవేశ్వరుఁడు మతాభినివేశపరవశులగు జంగముల సహాయముచే బిజ్జలుని జంపించి జైనుల నిర్మూలము గావింపఁజేసి వీరశైవమతము ప్రపంచమున సాట బయలువెడలెను. బసవేశ్వరుని సమకాలికులలో అల్లమప్రభువు, చెన్నబసవన్న, మల్లికార్జునపండితారాధ్యులు మిగుల సుప్రసిద్ధులు. మల్లికార్జునపండితారాధ్యులశిష్యుఁడే యీపాలకుఱికి సోమనాథమహాకవి.

సోమనాథకవి యాంధ్రసంస్కృతకర్ణాటభాషలలో నుత్తమగ్రంథములు పెక్కు రచించెను. అన్నియు మతవిషయికములే. ముఖ్యముగ బసవేశ్వరుని లీలావతారాదులను బసవపురాణములోఁ గొనియాడి దానితోఁ దనివినొందక పిదప నీశతకమును రచించి తనయప్రతిమానభ క్తిని లోకమునకుఁ దెలుపుకొనెను. సోమనాథుఁ డీశతకమునఁ దనకవితను బెక్కుతెఱంగుల నలంకరించెను. "బసవన్న దండనాయకునకు" అను సోమనాథుని పద్యపాదమువలన బసవేశ్వరుఁడు రాజకీయముగఁ గూడ సుప్రసిద్ధు డనుట విశ్వసనీయము.

సోమనాథకవి కాకతీయరుద్రదేవునికాలమున నుండెను. ఇతనినిఁ దరువాతి శైవకవులు దైవస్వరూపముగా భావించినటుల గ్రంథాదికమువలనఁ దెలియుచున్నది. ఈశతకమువలన సోమనాథుని నిరర్గళకవితాధారయు సుప్రసిద్ధులగు వీరశైవమతనిర్మాతలచరిత్రములు బసవేశ్వరుని దైవలీలలు కవికిఁగల బహుభాషాపరిచయము సువ్యక్తము కాగలదు. కవి క్రీ.శ. 1150. ప్రాంతమున గ్రంథరచన మొనరించుచు సుప్రసిద్ధుఁడై యుండెను. ఇతఁడు నిజామురాష్ట్రములోని ఓరుగల్లు చెంతగల పాలకురికిలో సిద్ధినొందెను. కాన నితఁడు నిజామురాష్ట్రకవి.


నందిగామ.శేషాద్రిరమణకవులు.

శ్రీరస్తు

పాలకురికి సోమనాథకవివిరచిత

వృషాధిపశతకము

ఉ. శ్రీగురులింగమూర్తి! సువిశేష మహోజ్జ్వలకీర్తి! సత్క్రియో
     ద్యోగ కళాప్రపూర్తి! యవధూత పునర్భవజార్తి! పాలితా
     భ్యాగత సంశ్రితార్ధి కవిపండితగాయక చక్రవర్తి! దే
     వా! గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా!1
చ. ప్రమథవిలోల! భక్తపరిపాల ధురంధరశీల! సంతతా
     స్తమిత సమస్తదేహ గుణజాల! సుఖప్రదలీల! లింగ జం
     గమ మహిమానుపాల! గతకాల సమంచిత నాదమూల! దే
     వ మము భరింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! 2
ఉ. అప్రతిమప్రతాప! సముదంచిత నాదకళాకలాప! దీ
     ప్త ప్రమథస్వరూప! శివభక్తగణాత్మ గతప్రదీప! ధూ
     త ప్రబలేక్షుచాప! విగతప్రకటాఖిలపాప లింగ త
     త్త్వప్రద! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!3
ఉ. భక్తిరసాభిషిక్త! భవపాశవితాన విముక్త! జంగమా
     సక్త! దయాభిషిక్త! తనుసంగతసౌఖ్యవిరక్త! సంతతో

     ద్యుక్త గుణానురక్త! పరితోషితభక్త! శివైక్యయుక్త! ప్ర
     వ్యక్తమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!4
ఉ. శత్రు లతాలవిత్ర! గుణజైత్ర! భవాబ్ధివహిత్ర! జంగమ
     క్షేత్రవిచిత్ర! సూత్ర బుధగీత చరిత్ర! శిలాదపుత్ర! స
     త్పాత్ర! విశుద్ధగాత్ర! శివభక్తి కళత్ర! శరణ్యమయ్య! భా
     స్వత్త్రిజగత్పవిత్ర బసవా! బసవా! బసవా! వృషాధిపా!5
ఉ. త్ర్యక్షసదృక్ష! సంచితదయాక్ష! శివాత్మక దీక్ష! సత్ప్రసా
     దాక్ష! ప్రతాప శిక్షిత మహాప్రతిపక్ష! మహోక్ష! భూరి క
     ర్మక్షయదక్ష! జంగమ సమక్షమ భక్తిపరోక్ష! లింగ త
     త్త్వక్షమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!6
ఉ. అక్షయభక్తిపక్ష! బసవాక్షర [1]పాఠక కల్పవృక్ష! రు
     ద్రాక్ష విభూతిపక్ష! ఫలితార్థ ముముక్ష! శివప్రయుక్త ఫా
     లాక్ష! కృపాసమంచిత కటాక్ష! శుభాశుభ పాశమోక్ష! త
     త్త్వక్షమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!7
ఉ. ఆర్య వితానవర్య! భువనాదిక శౌర్య! యుదాత్త సత్పదా
     చార్య! యవార్యవీర్య! బుధసన్నుతచర్య! విశేష భక్తి తా
     త్పర్య! వివేకధుర్య! పరిపాలితతుర్య! శరణ్యమయ్య! దు
     ర్వార్య యనూన ధైర్య! బసవా! బసవా! బసవా! వృషాధిపా!8
ఉ. తజ్ఞ! జితప్రతిజ్ఞ! యుచిత ప్రమథానుగతజ్ఞ! నమ్ర దై
     వజ్ఞ! కళావిధిజ్ఞ! బలవచ్ఛివభక్తి మనోజ్ఞ! ధూతశా

     స్త్రజ్ఞ! సువాదపూరిత రసజ్ఞ! తృణీకృత పంచయజ్ఞ! స
     ర్వజ్ఞ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!9
ఉ. క్షీణజనప్రమాణ! యసికృత్త కుయంత్రక ఘోణ! జంగమ
     ప్రాణ! వినిర్జిత ప్రసవబాణ! సమంచిత భక్తియోగ సం
     త్రాణ! కళాప్రవీణ! శివధర్మ రహస్యధురీణ! దత్తని
     ర్వాణ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!10
ఉ. గానరసప్రవీణ! గతకాల వితాన! సమస్త భక్తస
     న్మాన! మహాకులీన! యసమాన చరాచర రూపభేద సం
     ధాన! జితాభిమాన! తనుధర్మవిహీన! మహాప్రదాన! దే
     వా ననుఁ గావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!11
ఉ. లింగమయాంతరంగ! గురులింగ పదాంబుజ భృంగ! సత్ప్రసా
     దాంగ! కృపాపరిస్ఫురదపాంగ! విముక్త భుజంగ! జంగమో
     త్తుంగ! జితాభిషంగ! గతదుష్కృత భంగ! మదీయలింగ! నీ
     వంగడ మేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!12
ఉ. ఉత్తమ భక్తివృత్త! భజనోత్సుకచిత్త! యుదాత్త చిత్సుఖా
     యత్త! క్రియాప్రమత్త! నిఖిలాగమవేత్త! గుణోపయుక్త స
     ద్వృత్త! ప్రసాద భోగ సముదీర్ణ విశేషసుఖప్రమత్త! భా
     స్వత్తమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!13
ఉ. దేహజవైరివాహ! శివదీపితదేహ! సుఖప్రవాహ! ని

     ర్మోహ! వినమ్ర సంయమిసమూహ! లసద్గుణగేహ! సంతతో
     త్సాహ! నిరీహ! జంగమ వితానదయావిహితావగాహ! ని
     ర్వాహమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!14
ఉ. న్యాసఫలానివాస! దరహాస ముఖప్రతిభాస! దత్తకై
     లాస! విశేష జంగమవిలాస! శివైక్య సమాస! నిర్జితా
     యాస! సమస్త భక్తహృదయాంబుజ నిత్యనివాస! ధిక్కృత
     వ్యాస! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!15
ఉ. రాగపరోపభోగ! గతరాగ! విధూతభవాదిరోగ! ని
     ర్యాగ! మహానురాగ! బహిరంతర నిష్ఠితయోగ! సత్క్రియో
     ద్యోగ! యకర్మయోగ! శివయోగ సమగ్ర సుఖాతిభోగ! దే
     వా గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా!16
ఉ. శీలలతాలవాల! యవశిష్ట భవప్రతికూల! లాలితో
     త్తాల గుణానుకూల! శివధర్మ మతప్రతిపాల! నిత్య స
     ల్లీల యశోవిశాల! చరలింగ సుఖోదయకాల! జియ్య! దే
     వా లలిఁ బ్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!17
ఉ. కామితభక్తిభామ! గతకామ! మహాగణ సార్వభౌమ! ని
     స్సీమ యశోభిరామ! సవిశేష విముక్తిలలామ! సద్గుణ
     స్తోమ! శివైక్యదామ! సుఖదుఃఖ విరామ! ప్రమోదసీమ! దే
     వా మముఁ గావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!18

ఉ. సాధిత జన్మబాధ! గతసర్వనిషేధ! [2]హతాపరాధ దు
     ర్బోధ కళావిరోధ! పరిపోషిత శాంభవవేధ! వర్జిత
     క్రోధ! నిరాకృతాఖిల విరోధ! శివైక్య సుబోధ! యీ భవ
     వ్యాధికి నీవె మందు బసవా! బసవా! బసవా! వృషాధిపా!19
ఉ. శ్రీవిలసత్ప్రభావ! [3]ప్రవిశిష్ట పరాజిత యన్యదైవ! స
     ద్భావ! యుత స్వభావ! శివతత్త్వ విశిష్ట మహానుభావ! యం
     హోవనదావ! పాలిత మహోద్ధతశైవ! విభుండవీవ దే
     వా వరదానశీల బసవా! బసవా! బసవా! వృషాధిపా!20
ఉ. ఆద్య! సమర్పితాఖిల పురాతనభక్తగణానువేద్య! సం
     పాద్య! గుణానవద్య! యనుభావశివాంకిత గద్యపద్య! ని
     ర్భేద్య! గణైకవేద్య యురరీకృతవాద్య! భవాదిరోగ స
     ద్వైద్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!21
ఉ. నాద కళావినోద! యభినందిత వేదహృతాపవాద! సం
     పాదితభక్తిమోద! బుధవందితపాద! చిరప్రమోదనా
     స్వాదిత సుప్రసాద! యవిషాదశిలాద సుతావిభేద! దే
     వా దయఁ జూడుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!22
ఉ. కాయ గుణావిధేయ! జితకాయ! వినమ్ర జగన్నికాయ! యా
     మ్నాయవచోప్రమేయ! యసమాన సమంచితగేయ! భక్తి ధౌ
     రేయ! సదానపాయ! సుచరిత్రసహాయ! జితాంతకాయ! దే

     వా యొడయండ వీవ బసవా! బసవా! బసవా! వృషాధిపా!23
ఉ. స్వీకృత భక్తలోక! యవశీకృత కర్కశవావదూక! యూ
     రీకృత సద్వివేక! యురరీకృత జంగమభక్తి శూక! దూ
     రీకృత దుష్టపాక! యధరీకృత వేద విరుద్ధబౌద్ధ చా
     ర్వాక! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!24
ఉ. నిత్య యుదాత్తసత్య! యతినిశ్చల జంగమ భృత్య! సజ్జన
     స్తుత్య! కృపాకటాక్ష పరిశోభితచైత్య! మహిష్ఠ భక్తి సం
     గత్యభిరామ సత్య! గురుకార్య పరాయణకృత్య! వర్జిత
     వ్రాత్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!25
ఉ. ధన్య మహావదాన్య! గతదైన్య! విధూత జఘన్య! భక్తిచై
     తన్య! గుణైక్యమాన్య! హతదర్పక సైన్య! నిరస్త మాతృకా
     స్తన్య! జితారిఘోరభవజన్య! శరణ్యము చిత్సుఖాత్మ భా
     వన్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!26
ఉ. చర్వితశృంగిగర్వ! గుణసంపద ఖర్వ! యపూర్వగీతగాం
     ధర్వ! దిగంతపూర్ణ సముదాత్త యశః కృతకర్ణపర్వ! యం
     తర్వినివిష్టశర్వ! విదితస్ఫురణాంచిత [4]దర్వ! కావుమో
     పర్వఘనప్రసాద బసవా! బసవా! బసవా! వృషాధిపా!27

ఉ. ఖ్యాత దయాభిజాత! విపదంబుధిపోత! యజాతతత్త్వ ని
     ర్ణేత! వినేత భక్తిపరిణేత! మనోరథదాత! జంగమ
     స్తోత! ముముక్షుగీత పరిశోభిత నీతిసమేత! సద్గుణ
     వ్రాత శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!28
ఉ. మారమదాపహార! సుకుమార శరీర! గణప్రసాద వి
     స్తార! వృషావతార సముదార విహార! [5]సమద్దయాపరి
     ష్కార! శుభప్రకార! యవికార! మహా జగదేకవీర! దు
     ర్వార శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!29
ఉ. దేశిక జన్మదేశ! యవిదేశ యనావృతపాశ! సంహృత
     క్లేశ! మహాప్రకాశ! కృత కిల్బిషనాశ! దయానివేశ! నం
     దీశనికాశ! జంగమ సమీహితకారి గుణావకాశ! దే
     వా శరణీయవయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!30
ఉ. ఉద్ధతభక్తవృద్ధ! వినుతోత్తమ సిద్ధపరీత జంగమ
     శ్రద్ధ! సదాత్మశుద్ధ! గుణరాజిసమృద్ధ! విముక్తపాశస
     న్నద్ధ! మహాప్రసిద్ధ యగుణ త్రయబద్ధ! శరణ్యమయ్య! భా
     స్వద్ధత చిత్ప్రబుద్ధ! బసవా! బసవా! బసవా! వృషాధిపా!31
ఉ. నందితభక్తబృంద! యవినాశిరదాంశు ముఖారవింద! [6]సా
     నంద వినీతికంద! కరుణామకరంద! రసోపలాలిత

     స్కంద! యుదాత్త భక్తి తరుకంద! యశోజితకుంద! నాకరా
     డ్వందిత! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!32
ఉ. లౌల్యపరాయణాత్మ గుణలౌల్య! యమూల్య సదోపయుక్త ని
     ర్మాల్య! వినీతికల్య! యసమానదయా రసకుల్య! నిత్యనై
     ర్మల్య! యమూల్య! దుష్టజనమానసశల్య! పదాబ్జలబ్ధ కై
     వల్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!33
చ. గురుపద సద్మ సద్మ! యవికుంఠిత జంగమశీలఖేల! సు
     స్థిర మృదుపాదమోద! సముదీర్ణ విశేషమహత్వ తత్త్వ! ని
     ర్భర భుజశౌర్య ధుర్య! పరిరంభితభక్తి కళత్ర గోత్ర! మ
     ద్వరద శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!34
చ. భువన హితార్థ తీర్థ! భవభూరుహ శాతకుఠారధార! గౌ
     రవ సముదాత్తవృత్త! యనురాగ రసామృతసారపూర! శాం
     భవమయ వేదబోధ! శివభక్తహృదబ్జ వికాసభాస! దే
     వ వరద కావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!35
చ. వినుత నవీనగాన గుణవిశ్రుత భక్తవిధేయకాయ! య
     త్యనుపమగణ్యపుణ్య నయనాంచల[7]దూర భవోపతాప! స
     ద్వినయ వికాసభాస సముదీర్ణ శివైక సుఖైకపాక! దే

     వ నను భరింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!36
ఉ. అంచిత భక్తియుక్త! యసహాయ విశృంఖల వీరపూర! ని
     శ్చంచలశైవభావ! శ్రిత జంగమపాదకిరీట కూట! హృ
     త్సంచిత సత్త్వ తత్త్వ! దురితవ్రజశైలకదంబశంబ! ని
     ర్వంచక నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!37
ఉ. నిర్గతధర్మ కర్మ! యవినీత పునర్చవ యంత్ర తంత్ర! దు
     ర్మార్గ విహీనయాన! గుణమాన్య మహావృష[8]సామ్య! సౌమష
     డ్వర్గ విరక్త శక్త! మదడంబర వర్జిత వేషభూష! నీ
     వర్గమునేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!38
చ. సరసవచస్క! నిర్మలయశస్క! శివైక్యమనస్క! భక్తహృ
     త్సరసిజగేహ! క్లుప్తభవదాహ! దయాపరివాహ! చిత్సుఖో
     త్తర నిజశిల్ప! భక్తపరతల్ప! మహావృషకల్ప! మన్మనో
     వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!39
చ. హర సమసౌఖ్య! యాదివృషభాఖ్య! పురాతనముఖ్య తత్త్వవి
     త్పరిషదుపాస్య! వీతగుణదాస్య! త్రిలోకసమస్య! తార్కికో
     త్కర జయశౌండ! దీర్ఘభుజదండ! మహాగుణషండ! మన్మనో
     వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!40

చ. వరగుణదీప్ర! భక్తజనవప్ర! తృణీకృతవిప్ర! తాత్త్వికాం
     కుర పదపద్మ భక్తిరసగుంభ! నిరాకృతదంభ! సద్గుణ
     స్ఫురిత విశిష్ట! శాంతగుణపుష్ట! నిరస్త నికృష్ట! మన్మనో
     వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!41
ఉ. లింగనిరూఢ! సంచితవిలీఢ! పరాక్రమగూఢ! మానసా
     సంగి వృషాంక! నిర్గళితశంక! నిరస్తకళంక! సంతతా
     భంగురపుణ్య! శీలముఖమణ్య త్రిలోకవరేణ్య! దేవ నీ
     వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!42
చ. ఉరుతరభాగ్య! మన్మహితయోగ్య! జగత్త్రయమృగ్య! పాపసం
     హరణసమర్థ! నమ్రచరితార్థ! లసద్గుణసార్థ! భావ భా
     స్వర నయసాంద్ర! కీర్తిజితచంద్ర! వివర్జితతంద్ర! మన్మనో
     వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!43
చ. విరచిత శుద్ధసాళగ నవీన మృదుస్వర మంద్ర మధ్య తా
     ర రుచిర దేశిమార్గ మధురస్వర గీతసుధాతరంగిణీ
     తరళ తరంగజాల సముదంచిత కేళివిలోల సంగమే
     శ్వర శరణయ్య నీకు బసవా! బసవా! బసవా! వృషాధిపా!44
చ. అసమవదాన్య మాన్య! ప్రణుతార్యయవార్య! రసజ్ఞతజ్ఞ! దు
     ర్వ్యసన విదూర! శూరగణవంద్య! యనింద్య! యమాఢ్య యాఢ్య! భ
     క్తిసుఖసమృద్ధ వృద్ధ! చిరదీప్తి పవిత్రచరిత్రపాత్ర! నా

     వసి గని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!45
చ. అసమశిలీముఖ స్ఫురదహంకృతికర్తన! కర్మకర్మఠా
     భ్యసన ధురీణ విభ్రమ! గణాధిప పాదసరోజ సంతత
     ప్రసృమరసౌర భోరుమకరంద కసిక్త వన క్రియాకళా
     వ్యసన! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!46
చ. అసదృశ విస్ఫురద్గుణ దృగంచల కల్పిత సృష్టిపాలన
     గ్రసనకళాకలాప ఘనకౌశల ఖేలన లింగమూర్తి మా
     నసకలనా వశీకరణ నైపుణతత్పరశీల జంగమ
     శ్వసన శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!47
చ. ప్రమథగణాధినాథ సముపాసన భాసుర పార్వతీమనో
     రమ రమణీయ హృత్కమలరాజిత నవ్యపతంగ సౌరభ
     భ్రమరవిలోలతా మధుకరాయిత దివ్యశరీర! సత్ప్రభా
     వమహిత! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!48
ఉ. కందళితాత్మయంత్రిక వికర్తనశీల మరీచిమన్మనో
     మందవిహార విస్ఫురిత మధ్యమయాన చిదంబరేందు ని
     ష్యంద సుధారసానుభావ సంతతదివ్యశరీర యోగిరా
     డ్వందిత నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!49
ఉ. "ఖ్యాతయశఃప్రపూరిత జగత్త్రియాయ నమోనమో, మహా
     పాతక సూతకఘ్న పదపద్మ యుగాయ నమోనమో, సము
     ద్ద్యోత వృషాయతే" యనుచు నుత్సుకతన్‌ బ్రణుతింతు సంయమి

     వ్రాత శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!50
ఉ. "ఆప్తగణ ప్రవిష్ట సకలార్తి హరాయ నమోనమో, సుఖా
     వాప్తి కరస్మితాంచిత కటాక్ష దయాయ నమోనమో, సము
     ద్దీప్త గుణాయతే" యనుచు దీనగతిన్‌ బ్రణుతింతు నిన్ను ని
     ర్వ్యాప్త జగత్ప్రపంచ బసవా! బసవా! బసవా! వృషాధిపా!51
ఉ. "కల్పితలింగ జంగమసుఖ స్ఫురణాయ నమోనమో, యసం
     కల్ప వికల్ప మార్గకథిత ప్రథితాయ నమోనమో, గుణా
     కల్ప వరాయతే" యనుచు గౌరవలీల నుతింతు నిన్ను న
     స్వల్పతర ప్రభావ బసవా! బసవా! బసవా! వృషాధిపా!52
ఉ. "తర్జిత దుష్కృతాయ! భవతాపనికృంతన కల్మషాయ! భ
     క్త్యూర్జిత మానసాయ! సుగుణోత్తమరత్న కరండకాయ! తే
     యార్జిత సత్క్రియాయ! సదయాయ నమో" యని సన్నుతింతు నా
     వర్జిత భక్తలోక! బసవా! బసవా! బసవా! వృషాధిపా!53
ఉ. "చూర్ణిత మన్మథాయ! పరిశోభితభస్మవిలేపనాయ! సం
     పూర్ణమనోరథాయ! గతపూర్వ భవాశ్రిత వర్తనాయ! తే
     వర్ణ నిరాసకాయ! సశివాయ నమో" యని సంతతంబు ని
     న్వర్ణన సేయువాడ బసవా! బసవా! బసవా! వృషాధిపా!54

ఉ. "హృన్నళినే స్మరామి భవదీయ పదద్వితయం భవాటన
     స్విన్న తను శ్రమాపహ మశేష జగత్ప్రణుతం మదీశ ని
     ష్పన్న దయానిధే" యనుచు 'సంస్కృతభాష' నుతింతు నిన్ను వి
     ద్వన్నుత నామధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా!55
చ. "పరమనె యన్నె యాండవనె పన్నగతానె యనాథ నాధనే
     పెరియనెపే నివుందనవె పేరు డయాననె పేరు జెప్పనే
     తరి మురియాయనే" యనుచు 'ద్రావిడభాష' నుతింతు మన్మనో
     వరకరుణా విధేయ! బసవా! బసవా! బసవా! వృషాధిపా!56
చ. "హసుళెయరెన్న రక్షిసువుదారయ లెన్న వనీవనెందు మ
     న్నిసువుడు నిమ్మడింగెరగ నిమ్మ ప్రసాదిత నిమ్మదాత్మ వే
     కసిగతి" యంచు భక్తి నినుఁ 'గన్నడభాష' నుతింతు షడ్గుణ
     శ్వసన పురాతనాత్మ! బసవా! బసవా! బసవా! వృషాధిపా!57
చ. "దేవ పరీ తుమ్హీచ గురుదేవ మణూను తరీ తుమ్హీచ గో
     సావి తరీ తుమ్హీచ తుమచాచ ప్రసాదచమ్హీ కృపా కరా
     హే వరదా" యటంచు నుతియించెద నిన్నును 'నారెభాస' దే
     వా వినుతార్య లీల బసవా! బసవా! బసవా! వృషాధిపా!58
చ. "అనయముఁ జేతులందు భవదంఘ్రి సరోజయుగం నమామి నె
     మ్మనమున సంస్మరామి యను మాటల నిన్‌ వరివస్క రోమ్య హ"

     మ్మనుచు 'మణిప్రవాళము'న నంకన సేయుదు భక్తలోక హృ
     ద్వనజ విహారలోల బసవా! బసవా! బసవా! వృషాధిపా!59
చ. "అరశుగిరి ప్రసాముదయానె భవద్గుణ వర్ణసల్పి నా
     కొరువని నేస్మరామి సురయేశ్వరురే గణవర్య" యంచు ని
     'ట్లరుదు మణిప్రవాళము'న నంకన సేయుదు నిన్ను మన్మనో
     వర కరుణావిధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా!60
ఉ. "వాయువు వొందు యీవిగతవావ అమా పరహంబ భౌ
     న్యాయ విధేయమీశతరి యన్యన బాణు కళాభి" దంచు 'వా
     గ్దేయ మణిప్రవాళము'నఁ దెల్లము నిన్ను నలంకరింతు దే
     వా యమిబృంద వంద్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!61
చ. [9]బలుపొడ తోలు చీరయును పాపసరుల్‌ గిలుపాడు కన్ను వె
     న్నెల తలఁ జేఁదు కుత్తుకయు నిండినవేలుపుటేఱు పల్గు పూ
     సలు గలఱేని లెంకవని 'జానుఁదెనుంగు'న విన్నవించెదన్‌
     వలపు మదిన్‌ దలిర్ప బసవా! బసవా! బసవా! వృషాధిపా!62
చ. తిరువడి నెమ్మనంబునను నే హృదయేశ్వర కింపరీయ తాం
     బరి కరితంబు రాణి నిను బాహిరిఁ బోలుట శాసితాహ తా

     వరద నెగిల్లె యంచు నిను బ్రస్తుతిసేయుదుఁ బెక్కుభాషలన్‌
     వరద వివేకశీల బసవా! బసవా! బసవా! వృషాధిపా!63
ఉ. హాడువె దామహార సదినంఘ్రియుగ భ్రమగొండు సద్గుణా
     మాడు వదర్చనంబిడె సమగ్రనుతిత్వయి సత్క్రియన్‌ దగన్‌
     'గూఢమణిప్రవాళము'నఁ గోరి నుతింతును సంచితార్థముల్‌
     పాడిగ నివ్వటిల్ల బసవా! బసవా! బసవా! వృషాధిపా!64
ఉ. రుద్ర గణాదిరుద్ర! వినిరూపిత లింగసుఖాదిసంద్ర య
     చ్ఛిద్ర! దయాసముద్ర! సవిశేష పరాక్రమ వీరభద్ర! య
     క్షుద్ర జనావళీభవ నిషూదన రౌద్ర! సమస్త భక్త దే
     వ ద్రుమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!65
చ. ఇహపరసిద్ధ! సిద్ధ వృషభేశ్వర! ఈశ్వర భక్త! భక్త హృ
     ద్గహన విలోక! లోకహిత కారణ! కారణజన్మ! జన్మదో
     షహరణ దక్ష! దక్షరిపుసన్నిభ! సన్నిభరూప! రూప ని
     ర్వహణ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!66
ఉ. సన్నుత జంగమాగమము స్వాతిజలంబులు భక్తనిమ్నగం
     జెన్నుగ నీదు చూడ్కులను చిప్పల జొన్నలు ముత్తియంబులై
     యున్న నొకయ్య మ్రుగ్గు నియమోన్నతి నిల్పిన ధన్యు నిన్ను శ
     శ్వన్నుతులన్‌ భజింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా!67

ఉ. బల్లహు నొద్దనున్న నినుఁ బట్టణవీధులఁ జల్లలమ్ము చో
     గొల్లతఁ జీరువాఱి కడుఁ గూర్మిమెయిన్‌ బసవా యనన్‌ భువిన్‌
     ద్రెళ్ళఁగనీక పట్టిన యతిస్థిర సర్వగతైక భావ! మ
     ద్వల్లభ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!68
ఉ. వేఁడిన మిండ జంగమము వెక్కసమందగఁ దత్సభాస్థలి
     న్నాఁడట నారి వల్వొలువ నైజపుమానము దూలకుండఁగాఁ
     బోఁడిమిఁ బట్టుపుట్టములు ప్రోవులు పెట్టిన పుణ్యమూర్తి నీ
     వాఁడఁ జుమయ్య జియ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!69
చ. అరయఁగ సిద్ధరాము రజతాద్రిపయిన్‌ బసవాఖ్యు నిన్నుఁ బే
     రరులున జంగమాజ్ఞ మెయినారయ నప్పుడు భక్తిపెంపు సొం
     పరుదుగఁ బార్వతీశు హృదయాంబుజ కర్ణిక నత్తమిల్లు భా
     స్వరుఁడగు నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!70
ఉ. వర్ణవిహీనుఁడంచు ద్విజవర్గము దా గళమెత్తి పల్కుడున్‌
     వర్ణములెల్లఁజూడ శివనాగయగారి కరంబులందు స
     ద్వర్ణుఁడితండనా నమృతధారలు చూపిన భక్తిరూఢ! నీ
     వర్ణము నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!71

ఉ. బిజ్జలు నర్థమంతయు బ్రీతిగ జంగమకోటికిచ్చె నా
     నజ్జగతీశ్వరుండడుగ, నక్షయ బండరువా క్షణంబులో
     నిజ్జగమెల్లఁ జోద్యపడ నిచ్చిన, లింగ సదర్థ నమ్ర వి
     ద్వజ్జన నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!72
చ. ఉరు శివయోగనిద్ర మెయినున్న తఱిన్‌ ఫణిహారి యేఁగుడున్‌
     మరచి చనంగ జంగమసమన్వితమై మును బ్రాణమేగి యు
     ద్ధుర గతివారు వచ్చుటయుఁ దోడనె వచ్చిన జంగమాత్మ! నీ
     వరవుఁడ నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!73
ఉ. సంగయదేవుఁడర్థి నొక జంగమమై చనుదెంచి వేఁడ ను
     ప్పొంగి లలాటలోచనము భోరున నద్దము వట్టి చూపుడున్‌
     జెంగి యదృశ్యుఁడైన శివుఁ జేకొని యార్చిన యప్రతర్క్య! నీ
     వంగడ మేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!74
ఉ. కర్ణవతంసమీక పెనఁగన్‌ సతిచెక్కిలి వ్రేయుడున్‌ మహా
     తూర్ణతఁజెంది జంగమము దో స్థలమెత్తి పసిండియాకు సం
     పూర్ణ నికృష్టభక్తి మెయిఁబొల్పుగ నిచ్చిన నిష్ప్రపంచ! నీ
     వర్ణము నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!75
ఉ. శృంగి పురోగమాఖిల విశేషవిషంబులు గూర్చి మండుచున్‌
     బొంగి భుగిల్లు భుగ్గురను భూరివిషాగ్ని నిషాదులార్తులై

     చెంగి చనన్‌ శివార్పితము చేసి భుజించిన సుప్రసాద! నీ
     వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!76
ఉ. చిత్తజవైరి విక్రమముఁ జెప్పకు చెప్పకు త్రావనోడి తాఁ
     గుత్తుక నిల్పెనంచుఁ గడు గ్రూరతరంబగు కాలకూటమున్‌
     గుత్తుక బంటి గ్రోలిన యకుంఠితవిక్రమ చక్రవర్తి! భా
     స్వత్తమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!77
ఉ. తంగెటిజున్ను, ముంగటి నిధానము, పండిన కల్పవల్లి, ముం
     గొంగున ముత్తియంబనఁగ, గూర్మి మనంబునఁ దొంగలింపగా
     జంగమకోటికర్చనలు సల్పుచునున్న యగణ్యపుణ్య! నీ
     వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!78
ఉ. భీమగజంబు డీకొనిన బిట్టరఁజంపుడు బిజ్జలేంద్రుఁడు
     ద్దామతఁ దక్కి మ్రొక్కుటయుఁ దత్కరినెత్తిన విక్రమోద్ధతుం
     డా మడివాలు మాచయకు నగ్గలమైన మహానుభావ! నా
     స్వామివి నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!79
ఉ. శంకదలిర్చ నెంతయు వెసన్‌ బరదైవ పతంగ కోట్లకున్‌
     బింకముతోడ ఫాలతట భీమవిలోచన వహ్ని నేర్చు నా
     శంకరదాసి దేవునకు సద్భటుఁడంచు నుతించు నన్ను నీ

     వంకను ద్రిప్పుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!80
ఉ. ఏఁడులు నూఱటంచు శ్రుతులెన్నఁగ శ్రీగిరిమీఁద నాఱునూ
     ఱేఁడులు సంచరించు సకలేశ్వర దేవర మాదిరాజు నా
     నేఁడులు నూఱుమన్న భువి నిష్ఠురకాలమహోగ్రదృష్టి క్రొ
     వ్వాఁడులణంపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!81
ఉ. సూత్రము దప్పి గొఱ్ఱె గుడిఁ జొచ్చిన మిండనిఁ జంపి సాక్షిగా
     నో త్రిపురాంతకా! యనుచు నో యని పిల్చిన యల్ల [10]సద్యశః
     పాత్రుఁడు కిన్నరయ్యకును బ్రాణసఖుండగు నిన్నుఁ గొల్తు దే
     వా త్రిజగత్పవిత్ర! బసవా! బసవా! బసవా! వృషాధిపా!82
ఉ. ఒక్కఁడె రుద్రుఁడన్న శ్రుతులొల్లక ప్రేలు పురాణభట్టులన్‌
     వ్రక్కలుసేసి తత్తనువు వారిలు [11]బ్రువ్వులుగాఁగఁ జూచు నా
     కక్కయగారి బిడ్డఁడనగా నుతికెక్కిన నిన్నుఁ బూన్తు మ
     ద్వాక్కలికాసమూహి బసవా! బసవా! బసవా! వృషాధిపా!83
ఉ. డంభమయాన్య దర్శన విడంబనుఁ డష్టమదాపహారి యా
     శుంభ దుదాత్తకీర్తి యగు చోడలదేవర బాచిరాజు వి
     స్రంభసఖుండ వీవని ప్రశంస యొనర్తు జగత్ప్రపూత వి

     శ్వంభర శంభుమూర్తి! బసవా! బసవా! బసవా! వృషాధిపా!84
ఉ. దీవ్రము నీ మహామహిమ దివ్యము నీ మహనీయ విక్రమం
     బప్రతిమంబు నీ చరిత మాద్యము నీ నిజరూపమంచు న
     ల్ల ప్రభుఁడర్జితోడ నుపలాలన సేయఁగ నొప్పుచున్న దే
     వా ప్రణుతింతు నిన్ను బసవా! బసవా! బసవా! వృషాధిపా!85
ఉ. మేదురభక్తి నీశ్వరుఁడు మెచ్చగ జిహ్వయె పళ్ళెరంబు గా
     నాదటఁబ్రాచి యంబలి సమర్పణ చేసి పొగడ్తకెక్కు నా
     మాదర చెన్నలింగము కుమారుఁడ! నిన్ను భజింతు సంతతా
     స్వాదిత సుప్రసాద! బసవా! బసవా! బసవా! వృషాధిపా!86
ఉ. బల్లిదుఁడై గణాధిపుల పాదజలంబులు కట్టెమోపుపైఁ
     జల్లికడాని గావుడును జంగమకోటికిఁ బంచి యిచ్చుచున్‌
     మొల్లపు భక్తిఁ బేర్కొనిన మోళిగ మారయ కూర్మిబంట! మ
     ద్వల్లభ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!87
ఉ. భీకర రుద్రనేత్ర శిఖిఁ బెద్దఁగఁ జేయఁగ వీరభద్రు ను
     ద్రేక గజంబునా నితర దేవతలన్‌ బడఁదాఁకు నుద్ధతుం
     డా కలికేత బ్రహ్మయకు నర్మిలి భృత్యుఁడ! నిన్నుగొల్తు దే

     వా కరుణింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!88
చ. పసిగ మెయిన్‌ [12]వృషాధిపుని ప్రాణము జంగమకోటి ప్రాణముల్‌
     మసలక యెత్తుచున్‌ భువన మాన్యచరిత్రతఁ దేజరిల్లు న
     మ్ముసిఁడిగ చౌడరాయనికి మున్నిటి భృత్యుఁడ! నిన్భజింతు న
     న్వసిగొని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!89
ఉ. ఎన్నఁగ జంగమంబుఁ దన యింటికి నెప్పుడు వచ్చునప్డు దాఁ
     గన్నము వెట్టితెచ్చి యధికంబగు నర్థము వానికిచ్చు నా
     కన్నడబ్రహ్మ సంయమికి గాదిలిభృత్యుఁడవైన నిన్ను శ
     శ్వన్నుతులన్‌ భజింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా!90
ఉ. అసురవృత్తిఁ జూపఱు భయంపడి మ్రొక్కఁ బ్రసాద వహ్నిచే
     భూసురులిండు లన్నియును బొగ్గుల ప్రోఁకలుఁ సేయు ధూత సం
     త్రాసుల బిబ్బబాచయల దాసియనన్‌ విలసిల్లు సద్గుణా
     వాస! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!91
ఉ. సుంకపుఁ బైఁడి భక్తులకుఁ జూరలు విడ్వఁ బసిండి క్రాగులన్‌
     శంకరుఁ బూటవెట్టి నరనాయకుచేతను మ్రొక్కుగొన్న యా
     సుంకర బంకిదేవునకు సూనుడవైన ప్రసాది! దేవ! నీ

     వంకకుఁ ద్రిప్పుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!92
ఉ. దివ్యవిమానపంక్తి దివిఁ దేజరిలన్‌ రజతాద్రికిన్‌ జగ
     త్సేవ్యముగాఁగ మున్ను దనచే మృతిబొందు మృగాళిఁ బుచ్చు సం
     భావ్యుఁడు తెన్గు జొమ్మయకుఁ బ్రాణసఖుండగు నిన్నుఁ గొల్తు దే
     వా వ్యసనాది దూర బసవా! బసవా! బసవా! వృషాధిపా!93
ఉ. చెన్నగు ప్రాణ లింగరతిచేగ ప్రసాదము పుట్టినిల్లు న
     త్యున్నత భక్తిసీమ శివయోగ సమగ్రత కల్మియైన మా
     యన్నకు నాది చెన్నబసవన్నకు సద్గురుఁడైన నిన్ను శ
     శ్వన్నుతులన్‌ భజింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా!94
చ. అడరఁగఁ గళ్ళుచేసి రుచిరాన్నము లాదటనంది యిచ్చుచోఁ
     గడిఁగడి నందుకొంచు నతికాంక్షమెయి\న్‌ శివుఁడారగింపఁగా
     సడినను భక్తుఁడా సురియ చౌడయగారి ప్రసాది దేవ నీ
     వడుగఁ జుమయ్య జియ్య! బసవా! బసవా! బసవా! వృషాధిపా!95
ఉ. జంగమ [13]మారగింపక విషంబును మీకు ననర్హమంచుఁ దా
     ముంగల నారగించిన సముద్ధతభక్తియుతుండు సత్ప్రసా
     దాంగుఁడు శృంగిబొప్పయకు నగ్గలమైన మహానుభావ నీ

     వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!96
చ. కొఱతను లేఁత పత్తిరియు గొడ్డునఁ బాలును రేయి జంగమం
     బఱిముఱివేఁడినన్‌ బడసి యా క్షణమాత్రన యిచ్చినట్టి యా
     మొఱటదవంక దేవునకు ముద్దుతనూజుఁడవైన నిన్ను నే
     వఱలఁగఁ బ్రస్తుతింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా!97
చ. అనయము భక్తులీడ్యకు లటంచును వేదములా ద్విజోత్తముల్‌
     విన నుతియింపఁ గుక్కఁ జదివించిన హావినహళ్ళికళ్ళి దే
     వునకు ననుంగువాడవని యుత్సుకతన్‌ నుతియింతు భక్తహృ
     ద్వనజవిహారలోల బసవా! బసవా! బసవా! వృషాధిపా!98
ఉ. భక్తుని మ్రింగఁ జంప మును భర్గునకున్‌ జిఱుతొండనంబికి\న్‌
     యుక్తమెయంచు వారిపయి నొక్కట నుద్ధత ఘంట వ్రేసి యు
     ద్రిక్తత నొప్పఁగా నలరు దిట్ట హలాయుధు కట్టనుంగ! ప్ర
     వ్యక్తమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!99
చ. ధర నురులింగమూర్తి ధ్వజదండముగా మలమచ్చతోఁక (?) శ్రీ
     కరముగ భక్తికిం బడగఁగా శివుగర్భముఁ జొచ్చి పొల్చు మా
     యరి యమరాజుగారి పరమాప్తుఁడవైన మహానుభావ! నీ

     వరవుఁడనేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!100
ఉ. దండితవాదియై శివుఁడ దైవముగా కని కన్నులిచ్చి తా
     నిండు మనంబుతో నిలువు నిద్దపుఁగన్నులు దాల్చి పొల్చు మా
     పండిత మల్లికార్జునుఁడు ప్రస్తుతి సేయఁగ నేర్చు నిన్ను నె
     వ్వండు నుతింప నేర్చు బసవా! బసవా! బసవా! వృషాధిపా!101
చ. వసుమతిఁ బేరుకొన్న నరువత్తురు మువ్వురి కూర్మిబంట! షో
     డసుల సుతుండ! తేరసుల దక్కిన భృత్యుఁడ! వీరలాది గా
     నెసగు మహానుభావులకు నెల్ల ననర్గళమైన భక్తినన్‌
     వసిగొని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!102
చ. బసవ నిధానమా! బసవ భవ్యనిధీ! బసవామృతాంబుధీ!
     బసవ మహానిధీ! బసవ భర్మగిరీ! బసవామరద్రుమా!
     బసవ మహాబలీ! బసవ బండరువా! బసవోల్లసన్మణీ!
     వసిగని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!103
ఉ. నా యొడయండ! నా విభుఁడ! నా హృదయేశ్వర! నా మనోరమా!
     నా యిలవేల్ప! నా వరుఁడ! నా గురులింగమ! నాదు జంగమా!
     నా యదినాథ! నా వరద! నన్నుఁ గృపామతిఁ బ్రోవుమయ్య దే
     వా యమిబృందవంద్య! బసవా! బసవా! బసవా! వృషాధిపా!104

ఉ. నోరికి వచ్చినట్టు నిను నూఱువిధంబులఁ బ్రస్తుతింతు నే
     నేరుతు నేరఁ బొమ్మనక నీపయి నొచ్చెములేని మచ్చికన్‌
     గారవమంద మత్ప్రణుతిఁ గైకొనఁగాఁ దగు గౌరవంబునన్‌
     వారని కూర్మి పేర్మి బసవా! బసవా! బసవా! వృషాధిపా!105
చ. బసవఁడు ప్రీతిఁ గైకొనియె భక్తిమెయిన్‌ రచియించినాఁడ నే
     బసవపురాణమంచు మునుఁ బ్రస్తుతి సేయుదురట్లుగాన నీ
     యసమదయాధురీణతకు నంకిలిపాటు ఘటిల్లకుండ నన్‌
     వసిఁగొని బ్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!106
చ. సురవరమల్ల! మల్లవిత సూత్రసుధాంబుధిఖేల! ఖేలసం
     గర కలకంఠ! కంఠమణినాయకభీమభుజంగ! జంగమ
     స్థిరతరనాథ! నాథక నిధీకృతరూప! విరూప సమ్మతా
     వర! కరుణాబ్ధి! ప్రోవు బసవా! బసవా! బసవా! వృషాధిపా!107
చ. సురవర పూజ్య! పూజ్యగుణశోభిత! శోభితరూప! రూప వి
     స్ఫురతరశీల! శీలగుణపుంగవ! పుంగవ సత్త్వ! సత్త్వసం
     వర పరవాద! వాద భయవర్జిత పాపవిచారచార! ఈ
     శ్వర సమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!108

చ. అకుటిల లింగ జంగమ సమగ్రదయాకలిత ప్రసాది పా
     లకురికి సోమనాథుఁడతి లౌల్యమునన్‌ బసవన్న దండ నా
     యకునకు [14]నొప్ప నీ శతక మర్పణచేసె [15]నలిన్‌ బఠించు వా
     రికి వినువారికిన్‌ గలుగు శ్రీయును నాయువు భుక్తిముక్తియున్‌. 109

వృషాధిపశతకము సంపూర్ణము.

  1. సాధక
  2. జితాన్యగాథ
  3. వ్రత
  4. దర్పకోటమా పర్వఘనప్రసాద, పర్వఘనమ్రపాద.
  5. సముద్దయా
  6. యానందవిలీయమానకరుణా
  7. మారమదోపతాప...భావసముదీర్ణవిశాలసివైక్యపాల
  8. సైన్యధన్య
  9. శుద్ధాంధ్రము
  10. నాదయా
  11. పురువుశబ్దమున కిది పూర్వరూపము
  12. గణాధిపుల
  13. మారగింపఁగ
  14. నీకు
  15. ధరన్