పీఠిక
రామతారకశతకము రచించినకవి పేరు నివాసము కాలము నెఱుంగనగు నాధారము లీశతకమున లేవు. ఈశతకములో తొంబది తొమ్మిది పద్యములు మాత్రమే కనుపించుటవలన నింకను గొన్నిపద్యములు లభింపవలసియున్నవనియుఁ బ్రత్యంతరసహాయమునఁ బరిశోధించిన కడమపద్యములతోఁబాటు కవిచరిత్రముగల పద్యముగూడ లభించు నేమోయని తోఁచుచున్నది. భాషాభిమానులగు సోదరులలో నీశతకమాతృకలు గలవారు మిగిలిన పద్యములను జూచి పంపుదురేని కృతజ్ఞతాపూర్వకముగఁ బరిగ్రహించి ప్రకటించెదము.
ఈశతకము వ్రాసినవాఁ డొకపరమభక్తుడు. శ్రీరామనామామృతపానముపై మక్కువ దీఱక తనకు వచ్చిరానికవితతో శతకము రచించి కృతార్థుఁడయ్యెను. ఈశతకకర్త కవితానైపుణ్యము గలవాఁడు కాడు. భావముల గ్రహించి సుశబ్దముల సమకూర్చి కవితాసుందరి నలంకరించుటయే కవికర్తవ్య మని యీకవి తలంపక తనకు భక్తిపారవశ్యమున నెటులఁ దోఁచిన నటులఁ బద్యములు వ్రాసియున్నాడు. కవి ఛందోనియమములు వ్యాకరణనిబంధనలు బొత్తిగాఁ బాటింపక యెటులో పద్యములు వ్రాసి తన భక్తిభావనమాత్రము ప్రకటించుకొనెను గాన నిందుఁ గొన్నిచోటుల నపశబ్దప్రయోగములు గలవు. వానిని సవరింతు మేని గణనియమము చెడి పద్యము నడకపోవుచున్నదిగాన వాని సంస్కరింపవీలైనది కాదు.
రామభక్తులు పెక్కం డ్రీశతకము భక్తిశ్రద్ధలతోఁ బఠించుటఁ జూచి జనాకర్షణమగు నీశతకమును కవ్యభిప్రాయానుగుణముగ ముద్రించితిమి.
శ్రీరామతారకశతకము
సీ.
శ్రీరామనామమే శృంగారవర్ణన
సకలశాస్త్రవివేకసాధనంబు
శ్రీరామనామమే శృంగారచారిత్ర
సకలదానవిశేషసంగ్రహంబు
శ్రీరామనామమే శృంగారధ్యానంబు
సకలతీర్థాదృతసత్ఫలంబు
శ్రీరామనామమే శృంగారచింతన
సకలమంత్రరహస్యసమ్మతంబు
గీ.
అనుచు బ్రహ్మాదిసురలెల్ల ననుదినంబు
భక్తితో రామమంత్రంబు పఠన జేసి
మ్రొక్కిసేవించి చెందిరి మోక్షపదవి
రామతారక దశరథరాజతనయ.
1
సీ.
శ్రీరామ నాయొక్క జిహ్వపై మీనామ
యక్షరబీజము లమర వ్రాసి
వాని నాపలుకుల వసియింపఁగాఁ జేసి
శత్రుసంహారంబు సలుపఁ బూని
యుక్తియు బుద్ధియు నూహ దాసున కిచ్చి
భక్తితో మీపాదభజనయందు
నాసక్తి బుట్టించి యమృతసారం బెల్లఁ
దారకశతకంబు త్వరితముగను
గీ.
బలుకు పలుకించు వేవేగ పరమపురుష
యింపుగఁ బఠించువారికి నిహము పరము
దాతవై యిచ్చి రక్షించు ధన్యచరిత...
2
సీ.
నరులార సేయుఁడీ నారాయణజపంబు
మ్రొక్కి సేవించిన మోక్షకారి
జనులార పల్కుఁడీ జయరామనామంబు
కార్యార్థముల కెల్లఁ గల్పవల్లి
ప్రజలార సేయుఁడీ పంకజాక్షునిపూజ
సాయుజ్యపదవికి సాయకారి
మానవబుధులార మఱువక దలఁచుడీ
పరమాత్మశబ్దంబు పాపహారి
గీ.
పెక్కుమార్గంబులను బోక ప్రేమచేత
భక్తితో రామమంత్రంబు పఠన జేసి
మ్రొక్కి సేవించి చెందుఁడీ మోక్షపదవి...
3
సీ.
తలఁచుఁడీ జనులార తారకనామంబు
గోవిందనామమే కొల్లగొనుఁడి
కృష్ణనామం బెపుడు కీర్తన జేయుఁడీ
మాధవనామంబు మఱువకండి
హరినామకీర్తన లందందు సేయుఁడీ
వాసుదేవస్మృతి వదలకండి
విష్ణుసంకీర్తన విడువక సేయుఁడీ
నరసింహనామంబు నమ్ముకొనుఁడి
గీ.
కలియుగంబున జనులార కష్టపడక
నామకీర్తనపరులౌట నయమునుండి
మఱలజన్మంబు గాంచరు మహిని మీరు...
4
సీ.
ఓపియోపక నైన నొక్కసారైనను
వెఱుచి వెఱపు లేక వేడ్కనైన
'హా రామ! హా కృష్ణ! హా యచ్యుతా!' యని
భయముతోనైనను భక్తినైనఁ
బ్రేమతోఁ బుత్రులపేరు బె ట్టయినను
జిలుకను బెంచైన చెలిమినైన
భువిలోన కీర్తికిఁ బురము గ ట్టయినను
వనతటాకములుంచి వాంఛనైన
గీ.
నీదునామంబు బలుకుట నిఖిలసుఖము
గలుగు వర్ధిలు పురుషుండు ఘనత మెఱయ
జన్మకర్మంబు లతనికి జెప్పనేల...
5
సీ.
నీనామమే కదా నిఖిలశాస్త్రము లెల్ల
పరలోకప్రాప్తికిఁ బట్టుకొమ్మ
నీనామమేకదా నిఖిలజీవుల కెల్ల
నఖిలవైభవముల కాలయంబు
నీనామమేకదా నిర్మలాత్ముల జేయ
నజ్ఞానజీవుల కౌషధంబు
నీనామమేకదా నిశ్చలభక్తుల
కార్యసిద్ధికి నాదికారణంబు
గీ.
తునిమి భేదించు దారిద్ర్యదుఃఖమెల్ల
వాసి కెక్కించు సంసారవార్థి గడుప
శాశ్వతం బైనపదవిచ్చు జగతియందు...
6
సీ.
హరిరామ నీవు నాయంతరంగమునందు
సాక్షివై యుండుట సత్యమైనఁ
భావనంబాయెను బాంచభౌతిక మెల్లఁ
గాయంబు జలముల గడుగ నేల
మమకార ముడిగిన మానును కర్మంబు
వేధించువేల్పుల వెఱుప నేల
విత్తు క్షీణం బైన వీడును గర్మంబు
మోహంబు లుడిగిన మోక్ష మదియె
గీ.
నిష్ఠ యీరీతి నిజముగా నిలిచెనేని
మనసు గట్టిన చాలదా మాయగెల్వ
భ్రాంతు లుడిగిన బ్రహ్మంబు బట్టబయలు...
7
సీ.
కామితార్థము నిచ్చు కామధేనువుగల్గ
వెలబెట్టి గోవుల వెదక నేల
మరణంబు లేకుండ మందు దాఁ గల్గఁగా
సభయులై యమునికి జడియ నేల
కల్యాణ మొసఁగెడి కల్పవృక్షము గల్గ
వనపుష్పఫలముల వాంఛ యేల
అమరుల కబ్బని యమృతంబు సేవించి
మధురసంబుల మీఁద మమత లేల
గీ.
తారతమ్యంబు లేరీతి తథ్యమనుచు
భజన జేతురు మిమ్ముల బ్రహ్మవిదులు
స్తుతులు జేయుదు రెప్పుడు సురలుగూడి...
8
సీ.
భూపతి యైపుట్టి భూమి యేలఁగవచ్చు
శత్రుసంహారంబు సల్పవచ్చు
చౌషష్టి విద్యలు చదివి చెప్పఁగవచ్చు
బహుమంత్రసిద్ధులఁ బడయవచ్చు
కోటికిపడిగెత్తి కొల్ల బెట్టఁగవచ్చు
సకలమంత్రంబులు చదువవచ్చు
గంగాదినదులకుఁ గ్రక్కునబోవచ్చు
నుత్తమాశ్రమముల కుఱకవచ్చు
గీ.
మగుడ జన్మంబు రాకుండ మాయ గెలుచు
విద్య సాధించి శత్రుల విఱచికట్టి
అరసి బ్రహ్మంబు గనుగొను టంతెగాక...
9
సీ.
సతమని దేహంబు సంతసిల్లఁగ నేల
నిలుచునో యిది వట్టి నీరుబుగ్గ
కాయంబు నిలువదు కడు బ్రహ్మకైనను
బ్రాణంబు నిలుచునా భ్రాంతిగాక
విభవంబు జూడకు విశ్వంబులోపల
సంపద లెప్పుడు సతముగావు
పరులు నావారని పాటింపఁ జెల్లదు
వెళ్లంగఁ దనవారు వెంటరారు
గీ.
అనుచు తలపోసి బుధు లెల్ల యాశ లుడిగి
మోహజాలంబు లోఁబడి మోసపోక
నిన్ను సేవించుచుందురు నీరజాక్ష...
10
సీ.
ఆవేళ యమునిచే నాపదబడలేక
జడిసి యిప్పుడ మిమ్ము దలఁచుకొంటి
అపరాధి నపరాధి నపరాధి నని మ్రొక్కి
యాశ్రయించితి మిమ్ము నప్రమేయ
శరణన్న మాత్రాన శంక లన్నియు మాని
భయనివారణమాయె భజనచేత
నింత సులభుఁడగు టెఱుఁగనైతినిగాక
యేమరియుందునా యెఱిఁగియున్న
గీ.
దెలిసె మీకృప నా కెల్ల తేటపఱిచె
మర్మ మెఱిఁగితి మీకీర్తి మహిమ వింటి
గట్టుదాఁటితి నీవె నాగతియటంటి...
11
సీ.
పరము దప్పక ధర్మవర్తన వర్తించి
వేదోక్తమర్మముల్ వెదకి చూచి
శిష్టశీలురయొక్క శుశ్రూషణము చేసి
సర్వప్రదానంబు సంగ్రహించి
శాంతదయాగురుస్వాముల మది నుంచి
హరి జేరు మార్గంబు సరవి నడిగి
వారిచేఁ బడసిన వరమంత్రరాజంబు
పరచిత్తుఁడనుగాక పఠన జేసి
మఱచి యేమియుఁ గోరక మర్మ మెల్ల
హరికి నర్పించినట్టి యా యధికపుణ్య
మరసి రక్షించు టదియెల్ల నంతెగాక...
12
సీ.
హరినామకీర్తన లానాడు చేసిన
నా వేదనత్రయ మంటకుండు
నీక్షించి మదిలోన నిననులోత్తమయన్న
నీషణత్రయములు నీడ్వకుండు
దశరథాత్మజుఁ గూర్చి ధ్యానంబు జేసిన
దారిద్ర్యదోషముల్ తలఁగియుండు
జానకీపతిమంత్రజపము నొనర్చిన
జన్మకర్మంబులు చెందకుండు
గీ.
భక్తిపుష్పంబు పక్వమై పండుఁగాక
అమితకాలంబు లిన్నాళ్లు హరణమయ్యెఁ
బాతకుఁడ నన్ను రక్షించు పరమపురుష...
13
సీ.
మఱిమఱి జిహ్వకు మాధుర్యమైయుండు
మనసు మీస్మరణకు మఱిగియుండు
వీనులు మీకథ ల్విన వేడ్క లయియుండుఁ
జూడ్కులు మీరూపు చూచుచుండు
బుద్ధి మీతత్త్వంబు పొందఁగోరుచునుండు
బూజింప హస్తము ల్పొంగుచుండు
గామ్యంబు మోక్షంబు కాంక్షజేయుచు నుండు
భక్తి యీరీతిని బ్రబలుచుండు
గీ.
నితరనామంబు పలుకుట కింపుగాదు
సతతమును నీదు నామంబు సంస్తుతింప
హర్ష మానందమగుచుండు ననుదినంబు...
14
సీ.
నీప్రభావంబులు నిగమంబులేకాని
పలికి వర్తింప నా బ్రహ్మవశమె
నీనామమధురుచి నీలకంఠుఁడె గాని
వేయికన్నులుగల వేల్పువశమె
నీపాదసఖముచే నిర్భిన్నమయినట్టి
బ్రహ్మాండకటక మెవ్వరికి వశమె
నీకీర్తి గొనియాడ నిశ్చలులయినట్టి
నారదాదులుగాని నరులవశమె
యెన్నఁగూడని తారల నెన్నవచ్చు
జలధికణముల గణుతించి చెప్పవచ్చు
పరమతారకమంత్రంబు పలుకవశమె...
15
నిన్నాశ్రయించితి నీవాఁడ ననియంటిఁ
బాహి మాం కోదండపాణి యంటి
రఘుకులదీపక రక్షించు మనియంటిఁ
గరుణసాగర నన్ను గావుమంటి
దైవము నీవని దిక్కు నీవనియంటి
దుష్కృతకర్మముల్ ద్రుంచుమంటి
అఖిలలోకారాధ్య యభయమిమ్మనియంటి
నీప్సితార్థము లిప్పు డియ్యమంటి
గీ.
అడుగ నెంతయు నితరుల నమరవంద్య
పరుల యాచింప నాకేల పరమపురుష
దాతలకు నెల్ల దాతవో దైవరాయ...
16
సీ.
యెచ్చోట హరికథ లచ్చోట సిద్ధించు
గంగాదితీర్థముల్ గన్నఫలము
ఎచ్చోట సత్యంబు లచ్చోట నిత్యంబు
లక్ష్మీసరస్వతు లమరియుందు
రెచ్చోట ధర్మంబు లచ్చోట దైవంబు
జయము నెల్లప్పుడు జెందుచుండు
నెచ్చోట భక్తుండు నచ్చోట హరియుండు
నిధులఫలం బిచ్చు నింట నుండు
నీదుభక్తునిగుణములు నిర్ణయింప
ఫలము భాగ్యము నింతని ప్రస్తుతింప
వశమె యెవ్వరికైనను వసుధలోన...
17
సీ.
పదివేలగోవులు ప్రతిదినం బొసఁగిన
పంచభక్ష్యాన్నము ల్పరగనిడిన
గ్రహణపర్వములందు గజదాన మొసఁగిన
నశ్వదానంబులు నమితమైనఁ
బెక్కుయాగంబులు ప్రేమతో జేసిన
నితరధర్మంబులు నెన్నియైనఁ
గీ.
దుల్యమగునట్టి మీనామతుల్యమునకు
హస్తిమశకాంతరము సాటి యవును గాక
యింతఫలమని వర్ణింప యెవ్వఁ డోపు...
18
సీ.
నాపాలిదైవమ నామనంబున నిన్నుఁ
దలఁచి సేవించెద తండ్రి వనుచు
నామూలధనమని నమ్మి యుప్పొంగుచు
దండ మర్పించెద దాతవనుచు
నాతోడు నీవని నవ్వుచుఁ జేరుచు
రంజిల్లుచుండెద రాజవనుచు
నాకును గురుఁడవై నాతప్పు లెన్నక
కాచి రక్షింపఁగఁ గర్త వనుచుఁ
గీ.
బెంచి పోషించు కాపాడు పెద్ద వనుచుఁ
బుత్రుపై ప్రేమ తండ్రికి బుట్టినట్లు
కృపకు పాత్రునిగాఁ జేసికొనుము దేవ...
19
సీ.
బహుజన్మముల నెత్తి బాధనొందఁగ నేల
పరమపురుషుని గొల్చి బ్రతుకవలయు
శేషవాసనచేతఁ జిక్కి వగవఁగ నేల
శ్రీనివాసునిపూజ సేయవలయు
విషయభోగంబుల విఱ్ఱవీఁగఁగ నేల
విష్ణుచరిత్రంబు వినఁగవలయు
అస్మదాదులకొఱ కనృతమాడఁగ నేల
హరినామకీర్తన లాడవలయుఁ
గీ.
దనువు తథ్యంబు గాదని తత్వవిదులు
సంతతధ్యానులై మిమ్ము సంస్మరించి
నిరతమును గొల్చుచుందురు నీరజాక్ష...
20
సీ.
ఈప్సితార్థము లిచ్చి యిహమందు రక్షించి
పరమందు మీ సేవప్రాప్తి జేసి
అగణితం బైననీయాశ్రయవంతుల
గణుతించి గ్రక్కున గారవించి
భక్తుని కృప జేసి పరిపూర్ణముగ నుంచి
నిజముగా దాసుల నిర్వహించి
ప్రియముతో బిలిచినఁ బ్రేమతోఁ బొడసూపి
యభయహస్తము లిచ్చి యాదరించి
గీ.
యొరుల యాచింప సేవింప నోర్వ లేక
వెదకి కనుగొంటి నాపాలి వేల్పువనుచు
మగుడ జన్మంబు లేకుండ మందుగోరి...
21
సీ.
మూఢుల రక్షించి మోక్షమిచ్చుట కీర్తి
ద్రోహులఁ గాచుట దొడ్డకీర్తి
పాపకర్ముల కెల్ల పదమిచ్చు టది కీర్తి
ఆత్మసంరక్షణ యమితకీర్తి
నీవాఁడవనియంటె నిర్వహించుట కీర్తి
ప్రేమ దీనులఁ బ్రోవఁ బెద్దకీర్తి
సామాన్యజీవుల సంతసించుట కీర్తి
మునుల రక్షించుట ఘనతకీర్తి
గీ.
పెద్దలైనట్టి సంసారపామరులకు
నరసి సాయుజ్యపదమిచ్చు టంతెకాక
యనుచు సేవింతు రీరీతి ననుదినంబు...
22
సీ.
జంతుజాలమునందె జన్మించి కొన్నాళ్లు
ఇతరజన్మంబుల నెత్తి యెత్తి
మానవదేహంబు మఱమఱి యెత్తుచు
నన్నివర్ణంబుల నరసి చూచి
యేపుణ్యవశమున నీజన్మ మెత్తితి
విప్రదేహం బిఫ్డు విమలచరిత
ఈజన్మమందైన నిప్పుడు నీ సేవ
మానక జేసెద మౌనివంద్య
గీ.
వేదశాస్త్రంబులన్నియు వెదకిచూచి
తప్పుగాకుండ నడుప నాతరముగాదు
శరణుజొచ్చితి నిఁక నాకు శంక యేమి...
23
సీ.
దశరథాత్మజ నీకు దండంబు దండంబు
వైదేహిపతి నీకు వందనంబు
కౌసల్యసుత నీకుఁ గలుగుఁ గల్యాణంబు
జానకీపతి నీకు జయము జయము
అమరవందిత నీకు నాయురారోగ్యముల్
శరధనుర్ధర నీకు శరణుశరణు
నీలమేఘశ్యామ నీకు సాష్టాంగంబు
సురరాజపూజిత శుభము శుభము
గీ.
అనుచు వర్ణించి భజియించి యాత్మ దలఁచి
నిలచి సన్మార్గవంతుండు ని న్నెఱుంగు
నతని గనుగొన్నఫల మెన్న నావశంబె...
24
సీ.
భానువంశమునందుఁ బ్రభుఁడవై జన్మించి
యఖిలవిద్యల నెల్ల నభ్యసించి
తాటకి మర్దించి తపసియాగముగాచి
శిలను శాపముమాన్పి స్త్రీని జేసి
శివునిచాపము ద్రుంచి సీతను బెండ్లాడి
పరశురాముని త్రాణ భంగపఱచి
తండ్రివాక్యమునకై తమ్మునితో గూడి
వైదేహితోడను వనము కరిగి
ఖరదూషణాదుల ఖండించి రాక్షస
మారీచమృగమును మడియ జేసి
రాక్షసరాజగు రావణుఁ డేతెంచి
సతి గొనిపోవంగ శాంత మలర
సుగ్రీవు గనుగొని సుముఖుఁడై యప్పుడు
వాలిని వధియించి వరుసతోడ
రాజ్య మాతని కిచ్చి రాజుగాఁ జేపట్టి
కిష్కింధ యేలించి కీర్తివడసి
గీ.
వాయుసుతు చేత జానకివార్త దెలిసి
తర్లి సేతువు బంధించి త్వరను దాఁటి
రావణానుజు కభయంబు రయము నొసఁగి
ఘోరరణమందు రావణుఁ గూలఁ జేసి
యతనితమ్ముని రాజుగా నమరఁజేసి
సతిని జేకొని సురలెల్ల సన్నుతింప
రాజ్య మేలి తయోధ్యకు రాజ వగుచు...
25
సీ.
దేహంబు విడుచుట దినము తా నెఱుఁగఁడు
కర్మంబువచ్చుటఁ గానలేఁడు
మూఁడవస్థలలోన మునిగి తేలఁగలేఁడు
ఆఱ్వురుశత్రుల నణఁచలేఁడు
మగువల రతులందు మమతమానఁగలేఁడు
వాఁడు వీఁడనిపల్క వదలలేఁడు
అభిమానరహితుఁడై యాసలాపఁగలేఁడు
ఇంచుకహరిమాయ యెఱుఁగలేఁడు
గీ.
నందు బ్రహ్మంబు తానగు టరయలేక
బుద్ధిహీనులకడ కేఁగి పొందుఁ జేసి
యుదరభరణంబు గానక యుర్విలోన....
26
సీ.
నీతి యెఱుంగవు నిందకు నోడవు
చంచలం బెప్పుడు చెడ్డగుణము
వాయువేగముకంటె వడిగలవాఁడవై
సాఱెద వెప్పుడు పడుచుతనము
పేరుపే రొక్కటి నిలుచుట యొక్కటి
చేరువకర్మంబు చెప్పలేవు
పుత్రమిత్రాదులే పుణ్యలోకం బని
సద్గతి యెఱుఁగవు జడుఁడ వగుచు
గీ.
మనను నీరీతి వర్తించు మందమతివి
నడచి నగరంబు కేగుట నయమె నీకు
ముందు తెలియక విహరించి మోసపోక...
27
సీ.
యమునిచే బాధల నెట్లోర్వఁగావచ్చు
నగ్నికంబంబున కంటగట్టి
పాపంబు నానోట బల్కించి మెప్పిందు
చిత్రగుప్తుని బిలచి చెప్పుమనుచుఁ
దప్పక వారు నాతప్పులన్నియుఁ జెప్ప
నుగ్రుఁడై దూతల కొప్పగించి
బాధించువేళ నా బ్రతు కేలొకో యని
యేడ్వంగ నెవ్వరు నచటరారు
గీ.
తెలిసి వర్ణించు మిప్పుడే తెలివి గలిగి
యనుదినంబును శ్రీరాము నాశ్రయించి
మ్రొక్కి సేవించి కనుగొంటి మోక్షపదవి...
28
సీ.
మఱిమఱి నాయొక్క మర్మకర్మంబులు
ప్రఖ్యాతి జేసెద పాపహరణ
ధరశీలుఁడయినట్టి ధన్వంతరి దొరక
దేహరోగం బెల్ల దెలిపినట్లు
గురుశిష్యఁడయినట్టి గురువును గనుగొని
ముక్తిమార్గమునకై మ్రొక్కినట్లు
రక్షింపఁదలఁచిన రాజులఁ గనుగొని
యార్తుఁడై యన్నంబు నడిగినట్లు
గీ.
విన్నవించెద నావార్త విమలచరిత
అగణితంబైన కలుషంబు లణఁగఁజేసి
నిర్మలాత్మునిగాఁ జేయు నిగమవేద్య...
29
సీ.
ఎన్నిజన్మంబుల నెత్తికి నేనని
తప్పకబలుకు నాతపసి యొకఁడు
శత్రుల మిత్రుల సమముగాఁ జూచుచు
శ్రీహరి నమ్మిన సిద్ధుఁ డొకఁడు
సకలేంద్రియంబులు సాధకంబునఁ బట్టి
ముక్తుఁడై యుండు నా మునియు నొకఁడు
గీ.
బ్రహ్మ యీరీతివాఁడని పలుకవచ్చుఁ
గాని యితరులు నేర్తురే కనుగొనంగ
సకలవేదాంతముల గల్గు సార మిదియ...
30
సీ.
జపము దేవార్చన చెందనట్టి మతంబు
తామసంబునఁ జేయు తపసితపము
పతిభక్తి లేనట్టి పడఁతుల వ్రతములు
యజమాను గూర్చని యాగములును
గురుభక్తి లేనట్టి గూఢమంత్రంబును
విత్తమార్జించెడి వేదములును
కాసు లార్జించెడి కన్యకాదానంబు
ధనము వాటునగొన్న ధర్మములును
గీ.
నెంచి చూచిన నవి యెల్ల నేమిఫలము
ఫలము దెలియంగ నేరక పాటిదప్పి
నడచి నరకంబు కేఁగుట నయమె నీకు...
31
సీ.
అఖిలాండకోటిబ్రహ్మాండనాయక నీవు
ముచుకుందునకు మోక్ష మిచ్చినావు
ఆకుచేలునిచేతి యటుకులు భక్షించి
యింపైన సంపద లిచ్చినావు
శరణాగతత్రాణ శబరి దెచ్చినపండ్లు
అంచితంబుగ నారగించినావు
వేదవేదాంగ యావిదురుని యన్నంబు
కోరి వేడుకతోను గుడిచినావు
గీ.
జానకీనాథ మీదాసజనులయిండ్ల
తులసిదళమైన మాజిహ్వ తృప్తిఁబొందు
నచ్యుతానంద గోవింద హరి ముకుంద...
32
సీ.
ఆశ్రమధర్మమం దాసనొందనివాఁడు
పాపవాక్యం బెప్డు పలుకువాఁడు
శ్రీరాము నర్చించి సిరియుఁ గోరినవాఁడు
మమకారబుద్ధియు మానువాఁడు
లబ్ధపదార్థంబు లాభంబులనువాఁడు
పరులకు హితముగాఁ బలుకువాఁడు
పరులద్రవ్యమునకై పరుగులెత్తనివాఁడు
చెడుగుచేష్టల కొడఁబడనివాఁడు
గీ.
యోగసంసారి కీగుణ మెంచవలయుఁ
గాక కడుభక్తివేషంబు గణనజేయ
వలదు సంసారబుద్ధుల వాంఛగాక...
33
సీ.
విష్ణుప్రసంగముల్ విడువక విని గడు
పులకాంకురంబులు పొడమువాఁడు
హరి గానములయందు నాసకల్గినవాఁడు
సకలోపచారముల్ సలుపువాఁడు
అతని కర్పించి తా ననుభవించెడివాఁడు
సుమతునికైవడిఁ జూచువాఁడు
సాధుల మాన్యుల సౌఖ్యపెట్టెడివాఁడు
మనసులో శ్రీరామ యనెడివాఁడు
గీ.
పుణ్యపురుషుండు భక్తుండు పూజితుండు
ధర్మమార్గుండు ధన్యుండు ధార్మికుండు
కలఁడు వేయింట నొక్కఁడు కడమ లేఁడు...
34
సీ.
తల్లిదండ్రులఁ గన్న తాతముత్తాతలు
తర్లిపోయినవార్త తాను దెలిసి
జీవించు పెక్కండ్రు జీవకోట్లను జూచి
జననమరణముల జాడ లెఱిఁగి
సర్వకాలము నిల్చి సంపదనుండు నా
విభవంబు రాజులవింత జూచి
పారంబు లేనట్టి పాపపుసంసార
మావేదనలచేత ననుభవించి
గీ.
కనియుఁ గానంగజాలరు కర్మవశులు
అస్థిరం బెల్ల స్థిరమన కవనిబుధులు
సన్నుతింతురు మిమ్మును సంతతంబు...
35
సీ.
ఈషణత్రయమును నీక్షించి మదిలోన
మేలు లేదని వీడు మేటి యొకఁడు
సద్గుణంబు తనకు సామాన్య మని యెంచి
స్వస్థుఁడై యుండు నా సాధుఁ డొకఁడు
అష్టభోగంబుల నాభాసమని యెంచి
తుచ్ఛంబుగాఁ జూచు దొడ్డ యొకఁడు
విషయంబులను బట్టి విరహింపఁజాలక
సూటి దప్పక జూచు సుముఖుఁ డొకఁడు
గీ.
వనము పురమని కోరక వాన యనక
యెండ మంచు లటంచును నెఱుకలేక
యుండు నీరీతి యవధూత యుర్విలోన...
36
సీ.
జన్మ దాల్చుఫలము జగదీశ్వరుని మేటి
భవ్యంపుగుణకథల్ బలుకనైతి
బుద్ధిగల్గుఫలము బుధులచెంతనుఁ జేరి
హరిజేరుమార్గంబు లడుగనైతి
కాయ మొందుఫలమ్ము కర్మసంసారినై
నీయందు చిత్తంబు నిలుపనైతి
బహువత్సరంబులు బ్రతికినబ్రతుకుకు
సకలతీర్థపుసేవ సలుపనైతి
గీ.
బాల్య కౌమార యౌవన భ్రాంతిచేత
వ్యర్థమాయెను గాలంబు వాసవనుత
ద్రోహి శరణంటి ననుఁ గావ దొడ్డఘనత...
37
సీ.
సంభ్రమించుఫలము సంసారరహితుఁడై
భజియించి నిశ్చలభక్తుఁ డగుచు
భక్తివాత్సల్యంబు భావంబున నెఱింగి
యటుమీఁద సంతాన మమరజేయ
సంతానమార్గంబు సతమని నెఱనమ్మి
యమృతస్వరూపుఁడై యలరుచుండు
నిన్మది నెంచక నిత్యంబునై చాల
దుష్కరనరకమందునను పడక
గీ.
చదువుఫల మిది జగమున నరులకెల్ల
కోటివిద్యలు నవియెల్ల కూటికొఱకు
కోన భేదించి యెలుకను గొనఁగవలెనె...
38
సీ.
మధుశర్కరక్షీరదధిఘృతంబులకంటె
రామనామామృతరసము రసము
పనసజంబూద్రాక్షఫలరసంబులకంటె
రామనామామృతరసము రసము
కదళికామకరందఖర్జూరములకంటె
రామనామామృతరసము రసము
నవసుధాపరమాన్ననవనీతములకంటె
రామనామామృతరసము రసము
గీ.
రామనామంబునకు నేమి రాదు సాటి
రామనామంబు సేవించి నారదుండు
బ్రహ్మఋషియయ్యె నిహమందుఁ బదవినొంది...
39
సీ.
శ్రీమంతుఁ డగు రామచంద్రుని దలఁచిన
నఱచేత మోక్షంబు నందినట్లు
జయరామనామంబు జపము గావించిన
జీవాత్మకును ముక్తి జెందినట్లు
కాకుత్థ్సతిలకుని గన్నులఁ జూచిన
బహుపేదలకు ధనం బబ్బినట్లు
శ్రీరామచంద్రుని సేవింపఁగలిగిన
నష్టభోగంబులు నమరినట్లు
గీ.
గరుణగలయట్టి సద్గురు గలిగినట్లు
జీవనదులందు స్నానంబు జేసినట్లు
కుటిలమది లేక జ్ఞానంబు కుదిరినట్లు...
40
సీ.
ఓరాఘవా! యని యొకసారి దలఁచిన
దుఃఖావళు లవన్ని దొలఁగిపోవు
ఒనర రెండవసారి యో రాఘవా! యన
బహుభోగభాగ్యసంపదలు గల్గు
చెలఁగి మూఁడవసారి శ్రీరామ! యన్నను
ముక్తుఁడై వైకుంఠమున వసించు
రమణ నాలవసారి రామచంద్రా! యన
సతినీ ఋణస్థుఁడ వయ్య నీవు
గీ.
అల్పసంతోషసులభుఁడ వగుదువయ్య
యెలమి యాజీవపర్యంత మరయ మిమ్ము
దలఁచువారికి నాపదల్ దొలఁగు టరుదె...
41
సీ.
బీడు మేలని రెండు క్రిందటిజన్మంబు
సంగ్రహించినయట్టి సంచితంబు
అనుభవించుచు నరు లాత్మతథ్యములేక
మే నెల్ల తమ దని మెచ్చుకొనుచుఁ
గీడువచ్చినవేళ క్రియ కోర్వఁజాలక
పాపంబు దలఁతురు భ్రాంతిచేత
నట్టిపాపంబు తా ననుభవించుచునుండుఁ
బాయని సంసారపాశములను
గీ.
బద్ధులై యుండు దుర్జనుల్ పందలగుచుఁ
బాపఫలములు భాసురభ్రాంతిగాక
వలదు యితరులవలె వట్టివాంఛగోర...
42
సీ.
కర్మశేషమ్మునఁ గల్గుజన్మంబును
జన్మహేతువుచేతఁ జెడు నతండు
మూఢుఁడై ముందటి ముచ్చటఁ దెలియక
బద్ధుఁడై యుండును భ్రాంతితోడ
దనువు సంసారంబు తథ్యం బని తలంచి
హరినామభజన నాసక్తిలేక
అనుదినంబును నరుఁ డాసక్తుఁడైనట్టి
పుత్రమిత్రాదులే పుణ్యమనుచుఁ
గీ.
బరుల యాచించి పీడించి పాపమొంది
పుట్టు నీరీతి కాలంబు పృథివిలోన
నిన్ను చింతింపఁ జేకూరు నీపదంబు...
43
సీ.
రామరామాయని రంజిల్ల నావంతు
నిజముగా రక్షింప నీదువంతు
అపరాధి నని పల్కి యాచింప నావంతు
నిజముగా రక్షింప నీదువంతు
నీపాదపద్మంబు నెఱనమ్మ నావంతు
నిజముగా రక్షింప నీదువంతు
ఒరుల సేవింపక యోర్చుట నావంతు
నిజముగా రక్షింప నీదువంతు
గీ.
నేను పంతంబు దప్పక నిన్ను గొలుతు
నీవు పంతంబు దప్పక నిర్వహించు
పంత మిది నీకు నాకును పరమపురుష...
44
సీ.
గోవుమందల కోటిగోదాన మొసఁగిన
సరిరావు మీనామసంస్మరణకు
కాశీప్రయాగయు గంగాదితీర్థముల్
సరిరావు మీనామసంస్మరణకు
బహుయజ్ఞములు చేసి ప్రస్తుతి కెక్కిన
సరిరావు మీనామసంస్మరణకు
వేదశాస్త్రంబులు వెదకిచూచినగాని
సరిరావు మీనామసంస్మరణకు
గీ.
నెంచఁగా నిన్ను వశమె బ్రహ్మేంద్రులకును
బుధజనస్తోత్ర సద్గుణపుణ్యచరిత
అఖిలసురవంద్య దివ్యపాదారవింద...
45
సీ.
అల్పులమాటల కాసపడఁగ నేమి
ఫలము బూరుగజూచి శ్రమసినట్లు
నీచులమాటలు నిశ్చయింపఁగనేల
నీరుగట్టినమూట నిలిచినట్లు
గుణవిహీనునిమాట గుఱి సేయఁగా నేల
గొడ్డుగోవులపాలు గోరినట్లు
కపటఘాతకుమాట కాంక్ష సేయఁగ నేల
కలలోను మేలు దాఁ గన్నయట్లు
గీ.
పామరునిమాట నెంతైన పాటి జేసి
అడుగఁగోరెడివారిదే యల్పబుద్ధి
నీతిమంతుల కివి యెల్ల నిశ్చయములు...
46
సీ.
శ్రీరామనామంబు చిత్తాబ్జమున నిల్పి
ఫాలలోచనుఁ డిల బ్రణుతి కెక్కె
గాకుత్స్థతిలకుని కరుణారసంబునఁ
గల్పాంతరస్థితి కపివహించె
ఖరవైరిపదరేణుకణములు సోకినఁ
గలుషము ల్బాసెను గాంత కిపుడు
పులుగురాయఁడు రఘుపుంగవు నుతియించి
నిర్వాణపదముందు నిలచె వేడ్క
గీ.
హాటకాంబరు లక్ష్మీశు నాత్మ దలఁచి
కూర్మి నరులార మోక్షంబు గొల్లకొనుఁడి
రామనామామృతంబున కేమి సమము...
47
సీ.
సకలభూతవ్రాత సంఘవిధ్వంసంబు
రామతారకమంత్రరాజ మరయ
సకలరక్షోవీరజాలనిర్మూలంబు
రామతారకమంత్రరాజ మరయ
సకలతీర్థామ్నాయసారసంగ్రహవేది
రామతారకమంత్రరాజ మరయ
సంతతఘోరాఘసంఘవినాశంబు
రామతారకమంత్రరాజ మరయ
గీ.
సకలమునిజనచిత్తాబ్జసౌరభృంగ
మైన శ్రీ రామనామంబు ననుదినంబు
స్మరణ సేయుఁడి జనులార సత్ఫలంబు...
48
సీ.
గాధినందనుయజ్ఞకార్యంబు సమకూర్పఁ
బ్రకటితంబయిన యాప్రాభవంబు
వాసవతనయుని వసుధపైఁ బడవైచి
వర్ణన కెక్కిన వైభవంబు
రావణుఁ డాదిగా రాక్షసావళినెల్ల
నాశ మొనర్చిన నైపుణంబు
గీ.
నిట్టి కార్ముకదీక్షాధురీణుఁ డయిన
భూమిజాధిప మిమ్మును బుద్ధియందుఁ
దలఁచి కైవల్యమందిరి తత్త్వవిదులు...
49
సీ.
నాముద్దులయ్యను నాదేవదేవుని
నాపిన్నయన్నను నామురారి
నారత్నమును బట్టి నాబంగరయ్యను
నానిధానము రాము నాదువిష్ణు
నాకూర్మిశౌరిని నాబ్రహ్మతండ్రిని
నాదీననాథుని నాదువిభుని
నామనోనాథుని నానోముఫలమైన
నాజానకీభవు నామహాత్ము
గీ.
వెదకి కీర్తించి హర్షించి వేడుకొనిన
నఖిలసంపద లిప్పుడు నమరినట్లు
తప్పుత్రోవలఁ బోయిన ధన్యుఁడౌనె...
50
సీ.
చెడిపోక నామాట చిత్తమం దుంచుఁడీ
దేవాధిపుని మహాదేవుజపము
నియమంబుతో నైన నిష్ఠతో నైనను
భయముతో నైనను భక్తి నైన
శక్తితో నైనను యుక్తితో నైనను
శాంతంబుతో నైన సరస నైన
రాకపోకలనైన రమ్యంబుగా నైన
నాటపాటలనైన నలసియైన
గీ.
సొక్కియైనను మిక్కిలిసోలియైన
సురతినైనను భక్తుని జూచియైన
జేసి కైవల్య మందుఁడి సిద్ధముగను...
51
సీ.
శ్రీజానకీనాథ శ్రీరామ గోవింద
వాసుదేవ ముకుంద వారిజాక్ష
శ్రీరంగనాయక శ్రీవేంకటేశ్వర
ప్రద్యుమ్న యనిరుద్ధ పంకజాక్ష
శ్రీరుక్మిణీశ్వర శ్రీహృషీకేశవ
నారాయణాచ్యుత నారసింహ
శ్రీరమావల్లభ శ్రీ జగన్నాయక
శ్రీధర భూధర శ్రీనివాస
గీ.
రామ జయరామ రఘురామ రామ రామ
యనుచుఁ దలఁచిననామము లాత్మయందు
గష్టములు దీర్చి రక్షించు గారవించు...
52
సీ.
కడవాఁడనా నీవు కన్నులఁ జూడవు
నీబంటుబంటును నీరజాక్ష
చెడ్డవాఁడని నన్ను సరకుసేయవదేమొ
పతితపావనకీర్తి పద్మనాభ
వీఁ డెవ్వఁడని నన్ను విడనాడి బాయకు
కరుణాసముద్ర యోకమలనయన
వేఱుజేసియు సన్ను వెరపుగాఁ జూడకు
గోపాల భూపాల గోపవేష
గీ.
ఆదిదేవ పరంధామ యవ్యయాత్మ
శ్రీరమానాథ శ్రితపోష శ్రీనివాస
కాచి రక్షించు మిఁక నన్నుఁ గామజనక...
53
సీ.
చిన్నముద్దులయన్న చిన్నారిపొన్నారి
సురభూజమా రార సుందరాంగ
నన్ను గన్నయ్య నీ కన్యుఁడఁగాను వే
నవ్వులు సేయకు నాగశయన
దిక్కుమాలిన నన్ను దేవర బ్రోవుమా
చక్కని నాపాలి చక్రపాణి
అక్కఱతో నన్ను ఆదరింపుము వేగ
నిక్కంబు నీవాఁడ నీలవర్ణ
గీ.
అనుచు వేఁడితి రక్షింపు మరసి నన్ను
నెంత లేదని నీమది నెంచవలదు
కరుణ జూడుము నామీద కామజనక...
54
సీ.
ఎంతని వేఁడుదు నెంతని దూరుదు
నెంతని భాషింతు నేమి సేతు
నెంతని చింతింతు నెంతని భావింతు
నెంతని సేవింతు పంతమలర
నెంతెంతనగవశ మిందిరారమణ నీ
సచ్చిదానంద సౌందర్యమహిమ
చెప్పను చూడను చెవుల వినంగను
శక్య మెవ్వరికి నాస్వామి నీదు
గీ.
వేషభాషలు వర్ణింప వేయినోళ్ల
శేషునకునైన వశమౌనె శ్రీనివాస
గాన మనుజుండ వర్ణింపఁగా నెఱుంగ...
55
సీ.
మాయలవాడవే మాయలన్ని యు జూడ
జలధులన్నియు మాయ జనులు మాయ
సూర్యుండు నీమాయ చుక్కలు నీమాయ
యింద్రుండు మాయ చంద్రుండు మాయ
మెఱయ నగ్నియు మాయ మేఘంబులును మాయ
యురుములు నీమాయ మెఱపు మాయ
వర్షధారలు మాయ వానకాలము మాయ
చలికాలమును మాయ చలియు మాయ
గీ.
యిట్టిమాయలు గట్టిగా నుర్వి నిలిపి
జనుల కెల్లను గర్వము ల్గలుగఁజేసి
జగతి నడుపుదు నీరీతి శాశ్వతముగ ...
56
సీ.
నీచమీనములోన నీచవృత్తిని జొచ్చి
సోమకు జంపిన సుభగరామ
తల లేనివాఁడవై తగకొండ మోసిన
పతితపావననామ పద్మనాభ
మిట్టరోమంబుల మేదిని మూతితో
ద్రొబ్బుచు విహరించు దుష్టహరణ
సగము సింగంబవై జగదపకారుని
యుదరంబు భేదించు నురగశయన
తిరిపెంపువాఁడపై మురియుచు గొడ్డంట
తిరుగుచు హాలివై తివిరి గొల్ల
గీ.
తనువు గైకొని వ్రతములు తలఁగఁజేసి
గుఱ్ఱమెక్కిన శతకోటి కోటిమదన
మోహనాంగ దయానిధి ముద్దులయ్య...
57
సీ.
కేశవదేవుని కీర్తనానలముచేఁ
గలుషాటవులనెల్లఁ గాల్పవచ్చు
దామోదరునిస్మృతితరణిచే సంసార
వార్ధి దాఁటఁగవచ్చు వసుధలోన
శ్రీరామదేవుని చింతన జేసినఁ
బాపసంఘముల భంజింపవచ్చు
బద్మనాభస్తోత్రభవ్యగొడ్డలిచేత
దురితవనాటులఁ ద్రుంచవచ్చుఁ
గీ.
గాన గుమతులు మిమ్మును గానలేక
వెఱ్ఱిత్రోవల బోదురు వెఱపు లేక
తెలిసి సేవించువారికి దివ్యపదవి...
58
సీ.
మహిలోనఁ బొట్టకై మానవిహీనుని
వెంటనే దిరుగుచు వెఱ్ఱిబట్టి
నటువలె రాక్షసి యంటినకైవడి
గ్రహముబట్టినరీతి కష్ట మతని
నడుగఁబోయినవార లదలించి పొమ్మన్న
గద్దించి తలవంచి కండ్లనీళ్లు
గ్రక్కుడు మదిలోన సొక్కుచు నటుమీఁద
నినుజీరు కొందఱు నిజముగాను
గీ.
దీనజనమందిరాంగణదేవభూజ
వెనక కడతేరఁజూతురు వేడ్కతోడ
నట్టి నిన్నును సేవింతు నహరహంబు...
59
సీ.
ఎందుల కేగిన నేపని చేసినఁ
జలముచేనైనను శాంతినైన
బంగారుపనినైన శృంగారములనైన
సుద్దులనైనను ముద్దునైన
యాత్రలనైనను రాత్రులనైనను
ఉపవాసములనైన నుబ్బియైన
జపములనైనను తపములనైనను
కలుగదు నీదివ్యఘనపదంబు
గీ.
భక్తిచే నిన్నుఁ దలఁచిన భాగ్యవంతు
లిందునందును వేడ్కతో నెనయుచుండి
ప్రబలుదురుగాన నను గావు పంకజాక్ష...
60
సీ.
రావణుజంపిన రామభూపాలుని
సేవించుఁడీ మీరు సిద్ధులార
సేతుబంధనురాము చేరి మెచ్చుఁడి మీరు
తలఁప రదేటికో ధన్యులార
ఘనజటాయువు కిచ్చె గాంభీర్యపదమని
విని యెఱుంగ రదేమి విమతులార
యొక్కబాణంబున వాలిని బడవేసి
సుగ్రీవు బ్రోచెను సుజనులార
గీ.
యట్టి త్రైలోక్యధాముని నాదరమునఁ
దలఁప రదియేమి పాపమో ధన్యులార
భూమిజానాథుఁ డొసఁగును బుణ్యపదము...
61
సీ.
పద్మనాభునిమీఁద పాటలు పాడుఁడీ
భవబంధములు మాయ భద్ర మగును
కమలామనోనాథుఁ గన్నుల జూడుఁడీ
నేత్రఫలంబయి నెగడియుండు
శ్రీగదాధరుసేవఁ జేయుఁ డెల్లప్పుడు
రోగముల్ దొలఁగి నీరోగి యగును
కోదండరాముని కోరి భజించుఁడీ
శత్రునాశనమగు సమ్మతముగ
గీ.
నిట్టిలీలావతారుని నీశు హరిని
బలునితమ్ముని గోపాలబాలవిభుని
బరగ నుతియించి సంపూర్ణపదవి గొనుఁడి...
62
సీ.
పాఱెడిపాఱెడి బావమఱిందికి
బండిదోలినయట్టి పరమచరితు
గొల్లముద్దుల చిన్నగుబ్బెతలను గూడి
విహరించు గోపీకావినుతకృష్ణు
అడవియెంగిలిమేఁత యావంత బోకుండ
యెత్తిమ్రింగినయట్టి యేపుకాని
దనపోటివారల తగుబాలురను గూడి
పామును మర్దించు భవ్యచరితు
గీ.
దేవు నాశ్రితధేనువు దేవదేవు
జగములన్నియుఁ బుట్టించి సంహరించి
పొసఁగ రక్షించువాని నాబుద్ధి దలఁతు...
63
సీ.
కౌసల్యసుతు రాముఁ గరుణాసముద్రుని
గంగాదినదిపాదకమలయుగళు
ఖండేందుధరచాపఖండను జగదేక
మండను బ్రహ్మాదిమౌనివంద్యుఁ
దాటకాంతకు రాము దైత్యసంహారుని
మునియాగరక్షుని మోహనాంగు
బరశురాముని గర్వభంజను లోకైక
రంజను రఘురాము ఘనతమౌళి
గీ.
నెందు సేవింతు కీర్తింతు నేర్పుతోడ
బుద్ధిగల్గిన నీదగుపుణ్యపదము
గని ప్రమోదింపవలయును గష్టపడక...
64
సీ.
ఏల సేవింపరో యేలభావించరో
శ్రీరామనామంబు చిత్తమందు
మాటలాడుచునైన మఱచియునైనను
యెఱుకనైన దినంబు నెఱుఁగలేరు
దినమునందైనను తివిరి రాత్రులనైన
సంధ్యవేళలనైన సంజనైన
భ్రమతచేనైనను భయమునొందైనను
నోపకనైనను నోపియైన
గీ.
సకలలోకాధినాథుని సర్వసాక్షి
యాదిదేవుని జిన్మయానందమూర్తి
బుద్ధి దలఁచిన దురితము ల్పోవుటరుదె...
65
సీ.
తెలిసి తెలియఁగ లేరు తెల్విచేనొల్లరో
మాయలఁబడి లోకమమతతోడ
రామభూపాలుని రమ్యాక్షరంబులు
నేవేళనైనను నెప్పుడైన
బనిసేయువేళైనం బనిలేక యున్నను
జనువేళనైనను జదువునైన
భయమునొందైనను భ్రమతోడనైనను
గలయిక యందుల కలిమినైన
గీ.
పరమకల్యాణపరిపూర్ణభద్రమూర్తి
వెన్నదొంగను గోపాలవిభుని ఘనుని
బుద్ధి దలఁచిన కనులకుఁ బుణ్యపదవి...
66
సీ.
పరకాంతలను గూడి భంగంబు నొందక
పరధనంబులఁ గోరి పట్టుపడక
పరులను వేడక పరిహాస మెంచక
పరుల నిందింపక భయము లేక
పరులయిండ్లను జేరి పాపము ల్సేయక
పరదారలను బట్టి భ్రమలఁ బడక
సిరుల కాశింపక పరులవెంటను బోక
పరసేవ సేయక పట్టుగాను
గీ.
మన్మథుని గన్నవానిని మాయకాని
శంఖచక్రాబ్జములవాని శౌరి నెపుడు
వర్ణనను జేసి పల్కుఁడీ వందనముగ...
67
సీ.
మీనమై జలధిలో మేనును దడియక
వేదముల్ దెచ్చిన వేల్పువాని
తాఁబేటిరూవున తగ మందరాద్రిని
వీఁపున నిల్పిన విభవశాలి
పందిరూపంబునఁ బరిపంథిఁ బరిమార్చి
కోఱమీఁదను నిల్పు గోత్రధరుని
మెకములసామియై మేటిదైత్యుని బట్టి
చించి చెండాడిన సింహమూర్తి
గీ.
పొట్టితనమున బలిదైత్యు భూమి ద్రొక్కి
రామ రఘురామ బలరామ బౌద్ధ కలికి
రీతులను నుతిసేయు దీరీతిగాను...
68
సీ.
రుక్మిణీనాథుని రూపవర్ణన జేసి
సత్యభామను గూడు శౌరి గనుఁడి
జాంబవతీవనసంచారు వేఁడుడీ
సూర్యవంశేశుని సుభగమూర్తి
నాలాగుగాదని యాయాస పెట్టిన
ముకుళితహస్తుఁడై మ్రొక్కువాఁడ
మొగి నన్నుఁ గైకోక మోసబుచ్చెద నంటె
పాదారవిందము ల్పట్టువాఁడఁ
గీ.
దల్లివయినను నీవె నాతండ్రి వైన
దాత మ్రొక్కితి నిన్ను నాదైవ మనుచు
పాహి మామని పలుమాఱు పలుకువాఁడ...
73
సీ.
వాసుదేవునిపూజ వదలక జేసిన
వైభవంబులు గల్గు వసుధలోన
గోవిందు నెప్పుడు గొల్చి సేవించిన
సంపద లెప్పుడు చాలగల్గు
నారాయణస్మృతి నమ్మకముండిన
భుక్తిముక్తియు రెండు పొసఁగ నిచ్చు
విష్ణుసంకీర్తన విడువక జేసిన
దారిద్ర్యదుఃఖముల్ తలఁగియుండు
గీ.
నరులకెల్లను హరిసేవ నయము సుమ్మి
యఖిలసంపదలును గల్గు నాశ్రితులకు
సకలదురితము లెల్లను సమసిపోవు...
74
సీ.
పంకజాసనవంద్య బ్రహ్మాండనాయక
పంకజలోచన పరమపురుష
శంకరవందిత సంకర్షణవతార
పంకజాక్షవిలోల పద్మనయన
లక్ష్మీశ యోగీశ లక్ష్మణాగ్రజ రామ
ధాత్రీశ యోగీశ ధర్మహృదయ
సకలలోకాతీక సర్వగుణాతీత
సుప్రభాసూర్యకోటిప్రకాశ
గీ.
సకలజీవదయాపర సార్వభౌమ
క్షీరసాగరశయన రక్షింపవయ్య
నిన్ను నే నమ్మియున్నాను నీరజాక్ష...
75
సీ.
నీలమేఘశ్యామ నిగమగోచరరామ
ఫాలలోచననుత పరమపురుష
దశరథనందన తాటకిమర్దన
ఇందీవరేక్షణ యినకులేశ
అయ్యోధ్యపురవాస యాశ్రితజనరక్ష
కల్యాణగుణహార కంసహరణ
విధిశివరక్షక విష్ణుస్వరూపక
బుధజనపాలక పుణ్యపురుష
గీ.
జానకీనాథ మీకును జయము జయము
సకలబ్రహ్మాండనాయక శరణు శరణు
కాచి రక్షించు నన్నును గామజనక...
76
సీ.
రామనామామృతరసము ద్రావేకదా
ము న్నజామిళుఁడు తా ముక్తుఁడగుట
రామనామామృతరసము ద్రావేకదా
మునిపత్ని శాపవిముక్త యగుట
రామనామామృతరసము ద్రావేకదా
యపవర్గమందె ఖట్వాంగుఁ డిలను
రామనామామృతరసము ద్రావేకదా
యొప్పుగా మోక్షంబు నొందె శబరి
గీ.
రామనామామృతంబును రక్తిఁ గ్రోల
ముక్తిమార్గంబు గలుగును మూఢులకును
రామనామామృతంబున రసికుఁడగును...
77
సీ.
పంకజాక్షునిపూజ పలుమాఱు చేయక
పరుల నిందించుట పాటియగునె
విష్ణుసంకీర్తన ల్వీనుల వినకను
బరుల మెచ్చుట నీకుఁ బ్రాతియగునె
శేషశయను చాల చెలఁగి కీర్తింపక
పరుల కీర్తించుట భవ్యమగునె
నారాయణస్మృతి నమ్మిక యుండక
పరదేవతల గొల్వఁ బాటియగునె
సీ.
శ్రీరమానాథుఁ డెప్పుడు జిహ్వయందు
పుణ్యపరు లైననరు లెన్నఁ బొందుమీఱ
తలఁచువారికి మోక్షంబు తథ్య మరయ...
78
సీ.
సాకేతపురిరామ శరణు జొచ్చితి నీకు
రక్షింపవే నన్ను రామచంద్ర
దయతోడ బ్రోవవే దశరథాత్మజ నన్ను
కరుణతోఁ బ్రోవవే కమలనయన
కౌసల్యసుత నన్నుఁ గాచి రక్షింపవే
మన్నింపవే నన్ను మదనజనక
జానకీపతి చాల సత్కృపతో నాకు
విజయంబు లియ్యవే వేదవేద్య
గీ.
పరమపదరామ గోవింద పద్మనాభ
భక్తవత్సల లోకేశ పరమపురుష
ధర్మచరితారిషట్కవిదారశూర...
79
సీ.
నేత్రముల్ గల్గియు నెమ్మితో మీచూపు
సుస్థిరత్వంబునఁ జూడనైతి
జిహ్వ గల్గియు నోట శ్రీహరినామము
తాల్మితోడుత నెఫ్డు తలఁపనైతి
శిర మది గల్గియు క్షితిమీఁద సాష్టాంగ
ముగఁ జక్కఁగా సాగి మ్రొక్కనైతి
కర్ణముల్ గల్గియు ఘనమైన మీకథ
ల్వివరించి నేనెఫ్డు వినఁగనైతి
గీ.
హస్తములు గల్గి మిము చాల ననుదినంబు
శాంత మొనరంగ పూజలు సలుపనైతి
చిత్తశుద్ధిని మీసేవ జేయనైతి...
80
సీ.
నాస మున్నందుకు నయముగా నీపాద
తులసి వాసన జూచి చెలఁగనైతి
సంసారమను మహాసాగరంబున మున్గి
శ్రీరామభజన నే జేయనైతి
బాల్యంబునను చోరబోధకత్వము జెంది
నీయనుభక్తియు నిలుపనైతి
యౌవనంబునఁ గామ్యమానసమును నొంది
కూహరంబున బుద్ది నడువనైతి
గీ.
నెంతపాపినొ గాకున్న నెన్నడైన
దేవుఁడని నీవె దిక్కని దెలియఁదగనె
గాన దుష్కృతమెంచక కావు నన్ను...
81
సీ.
శ్రీరామ వినుము నే క్షితిని జన్మించిన
విధము నెవ్వరితోను విన్నవింతు
తల్లిదండ్రుల నాత్మతనయుల బంధుల
నతులసోదరదేహనుతుల సఖుల
అక్కల చెల్లెండ్ర నాప్తుల హితులను
నితరబంధువులను నిష్టసఖులఁ
బరుల నావారని బాటించి యెప్పుడు
జనము లోకము నెల్ల సత్యమనుచు
గీ.
భార్యరతికేళిసంబంధభరిత మమర
దీనికన్నను గల్గునె దివ్యమైన
బంధ మన్యంబు ద్రుంచ నీపదమె చాలు...
82
సీ.
ఇలను బుట్టినవార లెంతేసిఋషు లైరి
వీరితో నెటువలె విన్నవింతు
తల్లి తండ్రి సుతుండు దాతవు భ్రాతవు
ప్రభుఁడవు గురుఁడవు బాంధవుఁడవు
నీవుదక్కగ నింక నెవ్వరితో నేని
బల్కు టదెట్టుల పరమపురుష
ఆత్మరక్షక నిన్నె యాశ్రయించితి దేవ
కాచి రక్షించుమా కమలనయన
గీ.
నీదులాభంబు గోరిన నిక్కముగను
గోర్కె లెల్లను నాకు చేకూరుచుండు
దీనరక్షక భువి నాకు దిక్కు నీవె...
83
సీ.
తోచి తోచక నేను తొడరి మీచింతన
చేయక సంసారజలధి మున్గి
యడఁగని తృష్ణల నాహారవాంఛలు
బదపడి మోహసంభ్రాంతిఁ జెంది
తెలిసియు తెలియక దేహవాసన జెంది
తరిగోరి మిమ్ములఁ దలఁచనైతి
మఱచి మర్వక నిత్యమార్గంబులను మిమ్ముఁ
దల్చక యింద్రియతతులఁ దగిలి
గీ.
నట్టిపాపాత్ముఁడను నన్ను నెలమి నెఫ్డు
కాచి రక్షించు మన్నించు ఘనతమీఱ
కృపకుఁ బాత్రునిగాఁ జూడు కువలయేశ...
84
సీ.
జననిగర్భమునందు జన్మించినది మొదల్
బాల్యంబునను గొంత ప్రబలుచుండి
యటమీఁదఁ గొమరుప్రాయంబునఁ గొన్నాళ్లు
తల్లిదండ్రుల ప్రేమ దనరియుండి
యౌవనప్రాయంబునందు సతిక్రీడ
నింద్రియంబుల ప్రేమ నెప్డు దగిలి
ముసలితనంబున మునుఁగుచుఁ గొన్నాళ్లు
కార్పణ్యముల చేతఁ గష్టపడుచు
గీ.
నింతకాలంబులను నిన్ను నెఱుఁగలేక
వృద్ధిబొందితి ప్రకృతిచే విశదముగను
గరుణ జూడుము నన్ను దుష్కర్మి యనక...
85
సీ.
శ్రీరామ నామీఁద చిత్తంబు రాదాయె
నాతల్లిదండ్రని నమ్ముకొంటి
దశరథాత్మజ నీకు దయయింత లేదాయె
నాయిలువేల్పుని నమ్ముకొంటి
సత్యసంధుఁడ నీదు చనువింత లేదాయె
నాప్రాణవిభుఁడని నమ్ముకొంటి
భక్తవత్సల నీకు భావంబు లేదాయె
నామూలధనమని నమ్ముకొంటి
గీ.
దొరవు గావున బ్రోవుము దురితహరణ
నింద లేకుండ చేపట్టి నిర్వహించు
పరుల నిందింప నాకేల పరమపురుష...
86
సీ.
మూఢుఁడు మూర్ఖుఁడు ముచ్చటాడఁగ వింత
దీనులకల్పు లదొక్కవింత
కోతికోణంగులు గూడియుండఁగ వింత
కుక్క నక్కలు గూడి కూయ వింత
కోపితోఁ గుటిలుండు కూర్మి జేయుట వింత
కపటఘాతకు లెప్డు కలయ వింత
మంత్రులతో మంత్రి మచ్చరించుట వింత
కీడు మే లెఱుఁగని కీర్తి వింత
గీ.
యెంతవారికి లబ్ధంబు లంతెగాక
ననుభవింపఁగ నేర్తురె యధములెల్ల
కలుగు జ్ఞానులసంగతి ఘనత యశము...
87
సీ.
శ్రీరామ నీవు నాచిత్తమందే నిల్చి
రక్షింపవయ్య న న్నక్షయముగ
నన్ను రమింపను నాథు లెవ్వరు లేరు
నాస్వామి నీవని నమ్మినాను
తల్లివైనను నీవే తండ్రివైనను నీవె
వేదాంతవేద్య ని న్వేఁడినాను
అయ్యోధ్యవాసా యనంతస్వరూపక
ఈవేళ నీవు న న్నేలుకొనుము
గీ.
వేగ రక్షించుమని నిన్ను వేడినాను
నమ్మఁగాఁజాల నెవ్వరి నెమ్మితోడ
నీకుఁ బ్రియుఁడను మ్రొక్కతి నీరజాక్ష...
88
సీ.
దీనదయాకర దీనరక్షణ నీవు
కావవే న న్నిప్డు కమలనయన
పరమాత్మ పరమాత్మ పలుకుఁ బొంకించకు
పనులకు మీపాదపద్మసేవ
కమలేశ కమలాక్ష కరుణతో రక్షింపు
వరము లియ్యవె నాకు వరద ఈశ
లక్ష్మీశ లక్ష్మీశ లలిమీఱఁగను నాత్మ
దలఁచి రక్షింపవే నీరజాక్ష
గీ.
పద్మలోచన పరమాత్మ పారిజాత
స్వామి రక్షించు మిఁక నన్ను సార్వభౌమ
నిన్ను నెప్పుడు సేవింతు నీలవర్ణ...
89
సీ.
నిను గొనియాడితి నీకృప గనుగొంటి
నిజముగా రక్షింప నీవె యంటి
నీప్రాపు గలదని నీదులోకంబులఁ
గొనియాడ నేవేళఁ గోరియుంటి
బ్రహ్మంబు నీవని పలుమాఱు నిన్ను నే
బ్రస్తుతి సేయుదుఁ బరమపురుష
దాసుండనని యంటి దయకుఁ బాత్రుఁడ నంటి
నీకు నే వశుఁడను నేర్పుగంటి
గీ.
తల్లితండ్రియు నీవని తలఁచియుంటి
నేను నీవాఁడనై యుండి నిన్ను గొల్తు
కాచి రక్షించు మిఁక నన్ను కరుణతోడ...
90
సీ.
ఆనాఁడె తెలియ యాయాసమందితి
నెన్నఁడు మీసేవ యెఱుఁగనైతి
ముక్తికి మొదలని మూలంబు తెలిసిన
నీపాదకమలంబు నెమ్మికొల్తు
నింతసులభుఁడని యిన్నాళ్లు యెఱిఁగిన
నానాఁడె మిమ్ము నే నాశ్రయింతు
కర్మంబు లెడచాపి కరుణతోడుత నన్ను
నరసి రక్షించుమీ యాదిపురుష
గీ.
తలఁపులో జాల నమ్మితిఁ దండ్రివనుచు
పుత్రవాత్సల్యమును నుంచి పొందుమీఱ
నిలిపి రక్షించు మిఁక నన్ను నీరజాక్ష...
91
సీ.
హారామ హాకృష్ణ హాయచ్యుతా యని
గోరి గొల్చెద మిమ్ము కోర్కె లలర
యీవేళ నావేళ నేవేళనైనను
బ్రాపు దాపని యేను బ్రస్తుతింతు
నారాయణస్మృతి నామది నెప్పుడు
కట్టివేసియునుండు కరుణతోడ
వామన శ్రీధర వసుధపాలక నన్ను
కాచి రక్షించుమా ఘనత మీఱ
గీ.
నాకు నిష్ఠుఁడవని చాల నమ్ముకొంటి
నీవు కాపాడకున్న నిం కెవరు దిక్కు
నీకు భక్తుఁడ మ్రొక్కెద నీరజాక్ష...
92
సీ.
రామకీర్తన లెఫ్టు లాలించి వినువాఁడు
వైకుంఠపురమున వదలకుండు
కృష్ణనామం బెప్డు కీర్తించి వినువాఁడు
మధ్యమపురమందు మరగియుండు
మధుసూదనాయని మఱువక దలఁచిన
మర్మకర్మంబులు మాయమౌను
గోవిందనామంబు కోరి నాదము జేయ
దోషపాపంబులు తొలగిపోవు
గీ.
అచ్యు తానంత గోవింద హరి ముకుంద
పదవి నా కిమ్ము నిన్ను నే బాయకుందు
పద్మలోచన నాతండ్రి పరమపురుష...
93
సీ.
నీభక్తులగువారి నిఖలలోకంబుల
నిజముగాఁ బ్రోతువు నీలవర్ణ
నీకీర్తి పొందుగా నీకు సేవలు జేయు
పరమపుణ్యులకెల్ల భవ్యపదము
గోరి నీకీర్తిని గొనియాడి కీర్తించు
మనుజుల కొదవు నీమందిరంబు
భక్తుఁడై యిరీతి భజన చేయఁగ నీవు
నుప్పొంగి యిచ్చెద వొప్పుతోడ
గీ.
నిట్టిసేవలు గొని నీవు నిహపరములు
నాదరంబున నా కిమ్ము మోదమూని
గట్టిగా నీవు నన్నుఁ జేపట్టవయ్య...
94
సీ.
యోగమార్గంబున నెగసెద నంటినా
యోగంబు వగలు నాయొద్ద లేవు
గగనమార్గంబునఁ గదలెద నంటినా
కవచభూషణ మేది కమలనయన
ఆత్మమార్గంబున నెగసెద నంటినా
యాత్మనమ్మినబంధు వరయలేదు
అభ్రమార్గంబున నరిగెద నంటినా
యశ్వవాహనములు నావిగావు
గీ.
నీదుదయ యది నాయందు నిలిచియున్న
నఖిలలోకంబు లగును నా కల్ప మిపుడు
కుతుకమున నన్ను బ్రోవుము కువలయేశ...
95
సీ.
చిరకాలమున నేను స్థిరమనియుంటినా
జన్మకర్మంబులు జెప్పనేల
శ్రీకృష్ణనామంబు స్థిరమనియుంటినా
భయనివారణమౌను పరమపురుష
మదహర మిమ్ము నాహృదయంబులో నిల్ప
గరుణతోఁ గాతువు కమలనయన
మురహర నీకు నే ముకుళితహస్తుఁడై
మ్రొక్కి సేవింపఁగ మోక్షపదవి
గీ.
సన్నుతించెద నిన్ను కౌసల్యతనయ
చిత్తగింపుము నాయన్న శ్రీనివాస
శరణుఁ జొచ్చితి నీకును శరణు శరణు...
96
సీ.
కైవల్యపదమును ఘనమని యంటినా
కైవల్య మది మిముఁ గన్నచోటు
బ్రహ్మలోకం బాదిపద మని యంటినా
బ్రహ్మాదులును నిన్నె ప్రస్తుతింత్రు
ఇంద్రలోకమె నాకు నిష్టం బటంటినా
అష్టదిక్పతులు మి మ్మాశ్రయింత్రు
పదవి పదవిగాదు పరమాత్మ నీపాద
కమలపదవి యదియ కంసహరణ
గీ.
ఇట్టిపదవులు నా కేల యినకులేశ
కష్టపెట్టక యే వళ కరుణజూడు
నిష్ఠతో నన్నుఁ గావుము నీలవర్ణ...
97
సీ.
కమలనాభుఁడ నిన్ను కన్నులఁ జూచిన
సంభవించు ఫలము స్వామినాథ
జలజలోచన నిన్ను శరణని వేఁడిన
చేపట్టి రక్షించు శేషశయన
పరమాత్మ పరమేశ పద్మలోచన నిన్ను
గొనియాడ నేఁజాల గోరినాను
నారాయణ ముకుంద నరహరి నిన్ను నే
నెప్పుడు సేవింతు నీలవర్ణ
గీ.
యిటకు రావయ్య నాతండ్రి యినకులేశ
తడవు జేయక న న్నేలు ధర్మనిపుణ
నిలువకను వేగ రావయ్య నీరజాక్ష...
98
సీ.
ధర్మంబు దలఁచిన దనకును జయమిచ్చు
కర్మంబు దలఁచిన కాదు జయము
శాంతంబు నుంచిన శాశ్వతపద మొందు
శత్రుత్వమున మహాచేటు నొందు
కుటిలత్వమునను దుష్కృత మొందు మనుజుఁడు
కుటిలత్వమే చేటు కువలయేశ
బద్ధులైనటువంటి బంధుల గూడిన
తనవెంట నొకరైన తర్లి రారు
గీ.
ఇట్టివారలు నాకేల యినకులేశ
కరుణ నాపయి గట్టిగాఁ గలుగఁజేసి
పరమపద మిచ్చి నన్నుఁ జేపట్టవయ్య...
99
సీ.
ఆవేళ యమునిచే నాయాసపడలేక
నీవేళనే మిమ్ము నెలవుతోడ
నాతల్లిదండ్రని నమ్మి నీపాదము
ల్పట్టి సేవించెద పద్మనాభ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మిమ్ము
స్మరణ చేసెదనయ్య చక్రపాణి
కోదండ కోదండ కోదండరామని
కొలిచి సేవించెదఁ గోర్కెదీఱ
గీ.
పద్మసంభవముఖనంతపరమపురుష
నన్ను గాచియు రక్షించు నయముతోడ
కరుణతోడుత నను జూడు కమలనయన
రామతారక దశరథరాజతనయ.
100[ 1]
శ్రీరామతారకశతకము సంపూర్ణము.