బ్రహ్మోత్తరఖండము
పీఠిక
కృత్యవతరణిక
శా. |
శ్రీగౌరీసతిఁ గూడి హైమవిలసత్సింహాసనాసీనుఁ డై
వాగర్థాంచితరీతినుండి నిజలావణ్యప్రసంగంబులన్
రాగంబొప్ప వినోదమున్ సలిపి యార్యారత్నహారప్రభన్
దాఁగన్పట్టినమాత్ర నూఱడిలు భద్రాత్మున్ శివుం గొల్చెదన్.
| 1
|
ఉ. |
ఆదియుగంబునందు మహిషాసురశుంభనిశుంభరక్తబీ
జాది సమస్తదుర్మదనిశాటవిదారణ మాచరించి బ్ర
హ్మాదులు గొల్వఁ దాండవము లాడిన శ్రీజగదంబ మాకు న
త్యాదరలీల నిచ్చు విజయంబుల శాశ్వతవైభవంబులన్.
| 2
|
ఉ. |
ఎప్పుడు ధర్మహాని యగు నీధరణీస్థలి నాక్షణంబునన్
దప్పక మాటిమాటి కవతారము లెత్తుచు సాధుకోటి మే
లొప్పఁగ నుద్ధరించి కుజనోధ్ధతి మాన్పిన విష్ణుమూర్తి మా
యప్ప కృపాపయోనిధి నిరంతరసౌఖ్యము మాకు నీవుతన్.
| 3
|
సీ. |
ఏసుందరాంగి పాలేటిరాచూలన
నమృతంబుతోఁగూడ నవతరించె
నేభామినికటాక్ష మెసఁగిన నజరుద్ర
మఘవుల కబ్బె సామ్రాజ్యపదవి
నేచకోరేక్షణ కేప్రొద్దు శ్రీవిష్ణు
వక్షఃస్థలంబు నివాస మయ్యె
నేదేవిభజనంబు హితమతిఁ గావింపఁ
జలియించి లేములు దొలఁగిపోవు
|
|
తే. |
శారదయు శంభురాణియు శక్రసతియు
నేజగన్మాతసఖ్యంబు నిచ్చగింతు
రట్టి విష్ణువధూటి భాగ్యములపేటి
శ్రీమహాలక్ష్మి మమ్ము రక్షంచుఁగాత.
| 4
|
చ. |
ప్రజల సృజించి వారల పురాకృతకర్మఫలానుభూతులన్
నిజముగ ఫాలదేశముల నెమ్మి లిఖింపఁగ నేర్పుగల్గు వా
రిజభవుఁ డష్టనేత్రుఁడు విరించి సురాసురమౌనిసన్నుతుం
డజుఁడు విభుండు మా కొసఁగు నాయువు శ్రేయము నర్థసిద్ధియున్.
| 5
|
ఉ. |
చుక్కలరాయఁ డౌదలను శోభిలఁ గేలను వీణె మీటుచున్
మక్కువ బుస్తకంబు జపమాలికయున్ ధరియించుతల్లికిన్
జక్కనియంచతేజిగల సాధ్వికి నాశ్రితకల్పవల్లికిన్
మ్రొక్కెద శారదాంబకు నమోఘకవిత్వపటుత్వసిద్ధికిన్.
| 6
|
మ. |
కటనిష్యందమదభ్రమద్భ్రమరసంఘక్షేపణవ్యాజవి
స్ఫుటకించిచ్చలితస్వకర్ణపవనప్రోక్షిప్తశైలోత్కరున్.
|
|
|
బటుదంతాంచలఖేలనోర్ధృతధరాభారైకసంప్రీణిత
స్ఫటిరాడాదివరాహకీర్తితబలున్ బ్రార్థింతు హేరంబునిన్.
| 7
|
క. |
సామజవదను గణేశ్వరుఁ
జామరకర్ణుని మహాత్ము శంకరతనయున్
వామనరూపు నుతించెద
నేమముగ మదీయకావ్యనిర్విఘ్నతకున్.
| 8
|
మ. |
శ్రుతిచోరుం డగుసోమకుం డనెడు రక్షోవీరునిం ద్రుంప రో
హితరూపంబున వార్ధిఁ జొచ్చి యతనిన్ హింసించి యామ్నాయముల్
చతురత్వంబున బ్రహ్మకున్ మరలఁగా సంప్రీతితో నిచ్చి తాఁ
గృతకృత్యుం డగుదేవదేవుని హయగ్రీవున్ బ్రశంసించెదన్.
| 9
|
మ. |
ఉదయాస్తాచలసీమల న్నిలిచి యయ్యుష్ణాంశునిం జేరి నె
మ్మది నాచార్యునిఁగా వరించి సకలామ్నాయాదివిద్యాఢ్యుఁడై
కదనక్షోణిని దైత్యవీరవరులన్ ఖండించి శ్రీరామకా
ర్యదయాళుం డగునాంజనేయునిఁ దగన్ బ్రార్థింతు నశ్రాంతమున్.
| 10
|
పూర్వకవి స్తుతి
తే. |
వరుస వల్మీకసంభవ వ్యాస కాళి
దాస భవభూతి బిల్హణ దండి మాఘ
భట్టబాణ మయూరాది భద్రయశులఁ
గావ్యదక్షుల గీర్వాణకవులఁ దలఁతు.
| 11
|
ఉ. |
నన్నయభట్టుఁ దిక్కఘను నాచన సోముని భీమనాఖ్యునిం
బన్నగశాయిభక్తుఁ డగుబమ్మెరపోతన నల్లసానిపె
|
|
|
ద్దన్నను బాండురంగకవిధన్యునిఁ బింగళిసూరనార్యునిన్
సన్నుతిఁ జేతు నాంధ్రకవిసత్తములన్ సుకవిత్వసిద్ధికిన్.
| 12
|
క. |
మక్షికములు దుర్వ్రణముల
నీక్షించెడిభంగి తప్పు లెన్నుచునుండే
కుక్షింభరు లగుకుకవుల
నక్షములయినట్టివారి నాక్షేపింతున్.
| 13
|
వ. |
అని మదీయకులదేవతాప్రార్థనంబును నాంధ్రగీర్వాణకవి
రాజకీర్తనంబును గుకవిధిక్కరణంబునుం గావించి యేనొక్క
పురాతనపుణ్యచరిత్రంబు పద్యకావ్యంబుగాఁ దెనుఁ
గున రచియింపవలయు నని మనంబున విచారించుచున్న
సమయంబున.
| 14
|
కవీశ్వరునకు శ్రీరామమూర్తి సాక్షాత్కరించుట
సీ. |
బలభిన్మణిశ్యామభాసురాంగముతోడఁ
గమలవిశాలనేత్రములతోడ
నాజానుదీర్ఘబాహాదండములతోడ
శశిబింబసుందరాస్యంబుతోడఁ
గరయుగ్మకీలితశరచాపములతోడ
నవరత్నమయభూషణములతోడ
హాటకమయదీప్తహరితాంశుకముతోడ
రతిరాజకోటివిభ్రమముతోడఁ
|
|
తే. |
గామినీయుక్తవామభాగంబుతోడఁ
గలితకరుణాకటాక్షవీక్షణము లమర
మామకస్వప్నమునఁ దోఁచె మాననీయుఁ
డొకమహాపురుషుండు శౌర్యోజ్జ్వలుండు.
| 15
|
వ. |
ఇట్లు మదీయభాగ్యదేవతయనుంబోలెఁ బ్రసన్నుండయి
వెలుంగుచున్న యద్దివ్యపురుషునిం గాంచి భయభక్తి
వినయసంభ్రమంబులు దోఁపం బులకీకృతశరీరుండ నయి
యేను బ్రణామకృత్యంబు లాచరించి నిటలతలఘటితాంజలి
పుటుండ నయి యున్న నన్నుం గరుణార్ద్రదృష్టిం జూచి
యమ్మహాత్ముండు సర్వజ్ఞుండు గావున మన్మనోభిప్రాయం
బెఱింగి యేను గరుణామృతసముద్రుండ నగురామ
భద్రుండ భవద్వాంఛితంబు సఫలంబుసేయుటకు నీకుం
బొడసూపితి నని పలికి మఱియు ని ట్లని యానతిచ్చె.
| 16
|
తే. |
నీవు కృతి నొనరింపఁ బూనితివిగాన
దాని కేను సహాయతఁ దగ నొనర్తు
రమ్యతురముగ నాంధ్రగీర్వాణభాష
ణములరచియింపు మఖిలమానవులువొగడ.
| 17
|
క. |
శంకరుఁ డేనును నేనే
శంకరుఁడును గాన నీదు సమ్మతముగ ని
శ్శంకమతి నొకరిపేరిట
నంకితముగఁ గృతియొనర్చు మలరు శుభంబుల్.
| 18
|
వ. |
అని యానతిచ్చి యమ్మహాత్ముండు తిరోధానంబు నొందిన
నేను బ్రభాతసమయంబున మేల్కాంచి యాశుభ
స్వప్నంబు మదీయచేలాంచలస్థితం బయినమహాధనంబుగా
నిశ్చయించి మత్కావ్యంబునకు నెయ్యది సమకూరునో
యని వితర్కించుచున్నసమయంబున.
| 19
|
వంశానుక్రమణిక
సీ. |
శ్రీదేవితోఁగూడి చెలఁగుచుండెడువాఁడు
చుట్టుకైదువుఁ జేతఁ బట్టువాఁడు
బంగరువన్నెదుప్పటము గప్పెడువాఁడు
పక్కిరాతేజిపై నెక్కువాఁడు
కాండజాతభవాండకాండ మేలెడువాఁడు
నాద్యంతరహితుఁడై యలరువాఁడు
నీలంపుఁజాయలనెమ్మేనుగల్గువాఁ
డిష్టకామ్యార్థంబు లిచ్చువాఁడు
|
|
తే. |
నారద వ్యాస సనక సనందనాది
మౌనిహృత్పద్మకర్ణికాసీనుఁ డగుచు
నఖిలజగములక్షేమంబు లరయుచుండు
నార్తరక్షణుఁ డాదినారాయణుండు.
| 20
|
తే. |
అట్టి శ్రీవిష్ణునాభియం దవతరించె
తామరసగర్భుఁ డతనిసంతతిఁ జనించె
వేదవేదాంతశాస్త్రార్థవేది యయిన
మునివరేణ్యుండు విష్ణువర్ధనుఁ డనంగ.
| 21
|
క. |
వెలయఁగ నమ్మునిసంతతి
నలఘుప్రాభవుఁడు వైష్ణవాచారుం డై
తలిశానప్ప జనించెను
కలియుగమునఁ జతురుపాయకార్యజ్ఞుం డై.
| 22
|
క. |
ఈతలిశానప్ప వశీ
భూతానిలనందనుండు బుధనుతుఁడు మహా
|
|
|
భూతోచ్చాటనదక్షుఁడు
జ్యోతికులాంభోధిపూర్ణసోముఁడు వెలయున్.
| 23
|
క. |
ఘనుఁ డామంత్రిశిఖామణి
యనుపమయశుఁ డొప్పె నాశ్వలాయనసూత్రుం
డన నాచార్యధురంధరుఁ
డన బడగల్నాటికన్నడాన్వయుఁ డనఁగన్.
| 24
|
క. |
ఈతలిశానప్పకు విమ
లాతతసత్కీర్తిశాలి హరిచరణాంభో
జాతధ్యానపరుం డగు
సీతారామప్రభుండు చెలువుఁడు పుట్టెన్.
| 25
|
శా. |
చేతోజాతజయంతసుందరుఁడు కాశీసేతుపర్యంతవి
ఖ్యాతప్రాభవశక్తియుక్తుఁడు లసద్గాంభీర్యవారాశిని
ర్ధూతాఘుండును విష్ణువర్ధనసగోత్రుం డాశ్రితత్రాణుఁడై
సీతారామఘనుండు పొల్చు జగతిన్ శ్రీమంతుఁడో నాజనుల్.
| 26
|
తే. |
అతఁడు నిజపత్నియైన లక్ష్మాంబయందు
సొరిది గోవిందరాముని సుబ్బనార్యుఁ
గాంచె రఘుపతి జానకీకాంతయందు
మున్ను కుశలవధీరులఁ గన్నపగిది.
| 27
|
మ. |
నరసంఘంబు నుతింపఁగాఁ బ్రబలె శ్రీనారాయణబ్రహ్మస
ద్గురుకారుణ్యకటాక్షలబ్ధవిలసద్యోగానుసంధానని
ర్భరజాగ్రత్సహజామనస్కపరమబ్రహ్మైక్యబోధామృతాం
కురితాదృశ్యచరాచరాత్మకుఁడునై గోవిందరాముం డిలన్.
| 29
|
ఉ. |
మంత్రియుగంధరుండు శతమన్యుమహావిభువుండు లోభిదు
ర్మంత్రిగజాంకుశుండు రిపుమర్దనవిక్రమశాలి దేవతా
మంత్రిసమాననీతిగుణమాన్యుఁడు ధన్యుఁడు తారకస్ఫుర
న్మంత్రపరాయణుండు బుధమాన్యుఁడు సుబ్బనమంత్రి ధారుణిన్.
| 30
|
క. |
హరిభక్తియు గురుభక్తియుఁ
బరజనహితమార్జనంబు బంధుప్రియమున్
గరుణాపరతయుఁ గలిగిన
సరసుఁడు సుబ్బన్నసాటి సభ్యులు గలరే.
| 31
|
శా. |
ఆసుబ్బన్నయనుంగుమామ నరసింహస్వామిపాదాబ్జసే
వాసంభావితభాగ్యవైభవుఁడు తత్త్వజ్ఞానవైరాగ్యదూ
ర్వాసవ్యాసవసిష్ఠసన్నిభుఁడు భాస్వన్మంత్రతంత్రాగమా
భ్యాసప్రజ్ఞుఁడు పోల్చు వేంకటనృసింహామాత్యచంద్రుం డిలన్.
| 32
|
సీ. |
శ్రీమహనీయలక్ష్మీనృసింహపదాబ్జ
మధుపాయమానసన్మానసుండు
రమ్యగుణుండు భారద్వాజగోత్రుండు
సలలితరాజాంశసంభవుండు
ధర్మార్థకామామృతప్రాప్తచరితుండు
విమలతేజుండు భూవిదితయశుండు
ప్రాహుణికప్రజాపటలచింతామణి
బంధుమండలకల్పపాదంబు
|
|
తే. |
సరసరామాయణాన్వయజలధిచంద్రుఁ
డైనవేంకటరామున కాత్మజుండు
|
|
|
సొరిది రాఘవనరసింహసోదరుండు
ధరణిఁ బొగడొందు వేంకటనరసఘనుఁడు.
| 33
|
తే. |
అతఁడు నిజసాధ్వియైన లక్ష్మాంబయందుఁ
గాంచె నరసమ్మ యనఁగ వెంకమ్మ యనఁగఁ
బరఁగు నిద్దఱు దుహితల భద్రమతుల
మఱియుఁ జిక్కప్పయను సత్కుమారమణిని.
| 34
|
శా. |
ఆచిక్కప్ప మహాప్రధానమణి వేదాంతార్థవిజ్ఞాతమే
ధాచక్రీశుఁడు రాజయోగసుకళాధౌరేయుఁ డాత్మైక్యని
ష్ఠాచాతుర్యపరుండు సద్గురుకటాక్షావాప్తిధీరుండునై
భూచక్రంబునఁ బేరుగాంచి వెలసెన్ బూర్ణప్రయోగాఢ్యుఁడై.
| 35
|
క. |
ఘనుఁ డాసుబ్బన్న జగ
ద్వినుతుఁడు రామాయణంబు వేంకటనరసిం
హునిపుత్త్రి యైననరస
మ్మను బరిణయమయ్యె హరి రమాసతిపగిదిన్.
| 37
|
సీ. |
అతిథిసత్కారంబు లాచరించెడివేళ
నన్నపూర్ణకు నుద్ది యనఁగవచ్చు
నతిశయభోగంబు లనుభవించెడిపట్ల
శ్రీదేవికిని సాటి చెప్పవచ్చు
సతతక్షమాగుణసంపత్సమృద్ధిచే
భూదేవికిని సరిపోల్పవచ్చుఁ
బరమపాతివ్రత్యభవ్యశీలంబుల
నయ్యరుంధతికి జో డనఁగవచ్చు
|
|
తే. |
నౌర సుబ్బన్న మంత్రియర్ధాంగలక్ష్మి
యనఁగఁ జెలువొందు నిరతంబు నవనియందు
విమలసౌజన్యసీమ సాధ్వీలలామ
నవ్యసౌభాగ్యనికురుంబ నరసమాంబ.
| 38
|
మ. |
సూనశరోపమానుఁ డగు సుబ్బనమంత్రి ముదంబు మీఱఁగా
నానరసమ్మయందు నుదితార్కసమానులఁ గాంచె మువ్వురన్
భూనుతకీర్తి పాండునృగపుంగవుఁ డాపృథయందు ధర్మజున్
మానితశౌర్యు భీము నసమానుని బార్థునిఁ గన్నకైవడిన్.
| 39
|
తే. |
ఆకుమారాహ్వయంబుల నభినుతింతు
ధర్మశీలుండు రామప్రధానమౌళి
రాజమాన్యుండు లక్ష్మీనారాయణుండు
రమ్యతరకీర్తి చెంగల్వరాయవిభుఁడు.
| 40
|
క. |
ఈమువ్వురుసుతులందు మ
హామతి శేషాహిమూర్తి యనఁగా వెలసెన్
రామన్న కల్పతరుచిం
తామణిసురధేనుసదృశదానోజ్జ్వలుఁడై.
| 41
|
సీ. |
పక్షపాతంబునఁ బక్షపాతములేని
నిర్మలస్వాంతుండు నీతిపరుఁడు
రణభీరుతయు వితరణభీరుతయు లేని
సత్యప్రతిజ్ఞుండు సజ్జనుండు
హరునందు దైత్యసంహరునందు మతభేద
వాదంబులేని తత్త్వజ్ఞమూర్తి
|
|
|
అధికారులందు ననధికారులందును
సమదృష్టిగలుగునిశ్చలగుణుండు
|
|
తే. |
యవనకర్ణాటహూణదేశాధినాథ
ఘనతరాస్థానమంటపాగ్రముల నిలిచి
రాజకార్యధురీణతాప్రౌఢివెలయు
ధైర్యగుణశాలి రామప్రధానమౌళి.
| 42
|
క. |
ఆరామామాత్యునకును
గూరిమితమ్ముఁ డన వెలసెఁ గూరిమి లక్ష్మీ
నారాయణప్ప ధారుణిఁ
బేరయ్యె మహేంద్రునకు నుపేంద్రునిమాడ్కిన్.
| 43
|
సీ. |
తనకీర్తి దరకుందఘనసారచంద్రికా
శరదభ్రవిభ్రమస్ఫురణ మెరయఁ
దనవిక్రమోద్వృత్తి తారకప్రత్యర్థి
పరశురామాతిగప్రతిభ వెలయఁ
దనవదాన్యత కర్ణదారాధరామర
క్షోణీరుహంబులఁ జుల్కసేయ
తనదువైష్ణవభక్తి తార్క్ష్యవిష్వక్సేన
పార్థాదిసామ్యవిభ్రమత నెనయ
|
|
తే. |
ధారుణిస్థలిఁ జెలువొందుధర్మపరుఁడు
బంధుపోషణుఁ డతిమృదుభాషణుండు
శౌర్యగాంభీర్యధైర్యాదిసకలసుగుణ
రత్నములకుప్ప లక్ష్మినారాయణప్ప.
| 44
|
చ. |
అతనియనుంగుఁదమ్ముఁడు మహామతిమంతుఁడు దానమానవి
శ్రుతుఁడు ముకుందభక్తిపరిశుద్ధమనస్కుఁడు సాధులోకస
|
|
|
మ్మతుఁడును నీతిశాలి యసమానగుణాఢ్యుఁడు రూపకాంతిస
ద్రతిపతి యొప్పుఁ జెంగలువరాయఁడు ధైర్యకళాభిరాముఁడై.
| 45
|
క. |
రామఘనుఁ డధికసుగుణా
రాముఁడు కొవ్వూరి యాదిరాజతనూజన్
శ్రీమతి యగునచ్చమ్మను
గోమతిని వరించె నుభయకులములు వెలయన్.
| 47
|
ఉ. |
సమ్మతశీలవృత్తముల శాంతరసానుభవంబునన్ వివే
కమ్మున దానమానములఁ గారుణికత్వమునన్ బతివ్రతా
త్వమ్మున జోతి రామసచివాగ్రణికిం బ్రియపత్నియైన య
చ్చమ్మకు సాటివత్తురె నిజమ్ముగ లోకములోన భామినుల్.
| 48
|
క. |
ఆలక్ష్మీనారాయణుఁ
డోలిమి యతిరాజు రాఘవోత్తమసుతయౌ
శీలవతి సుబ్బమాంబను
బాలామణి నుద్వహించె భాగ్యము లొలయన్.
| 49
|
సీ. |
కొనవ్రేలఁ జూపించుకొనని యరుంధతి
చలనంబు నొందని కలిమిబోఁటి
చండిక గానట్టి శైలరాజతనూజ
తలవాఁకి లెఱుఁగని పలుకువెలఁది
పతివచోహితవృత్తిఁ బఱగు లోపాముద్ర
భయకంపములులేని పంటపొలఁతి
చెలువుని నకళంకుఁ జేసిన రోహిణి
పరుషోక్తులాడని ధరణితనయ
|
|
తే. |
యనఁగ విలసిల్లి లక్ష్మినారాయణప్ప
పాలి సౌభాగ్యలక్ష్మి యై ప్రబలుచుండు
స్థిరకృపాలంబ పోషితద్విజకుటుంబ
సోమసంకాశముఖబింబ సుబ్బమాంబ.
| 50
|
తే. |
కంతుసన్నిభుఁ డైన చెంగల్వరాయ
ఘనుఁడు రామాయణంబు చిక్కప్పపుత్త్రిఁ
జెంచమాంబను వరియించె నంచితముగ
ఫల్గునుండు సుభద్రఁ జేపట్టినట్లు.
| 51
|
క. |
ఆరామఘనుఁడు లక్ష్మీ
నారాయణధీరుఁడును జనస్తుత్యగుణో
దారతఁ బేరొందిరి కా
శీరామేశ్వరసుమధ్యసీమలయందున్.
| 53
|
వ. |
మఱియు నమ్మహాప్రధానశేఖరులు శ్రీరామచంద్రచరణార
విందమరందబిందుబృందాస్వాదనతుందిలేందిందిరాయ
మానానందమానసులును నిరంతరాన్నదానసంతర్పితా
నేకభూసురాశీర్వాదసంపన్నులును మహావిభవాభిరాము
లును సమస్తజనమాన్యులును సకలసద్గుణసంపన్నులును
బరేంగితజ్ఞాననిపుణులును నీతికార్యవిదులును బరోపకారు
లును బరస్పరసౌభ్రాత్రకులును నై యనవరతంబు నఖిల
బాంధవమిత్రపుత్త్రవిద్వజ్జనకవిగాయకపౌరాణికసహి
తంబుగా నిష్టకథానులాపంబులఁ బ్రొద్దుఁ గడపుచుండి
యొక్కదివసంబున సప్తసంతానలాభమహాభిలాషంబు మనం
|
|
|
బున నంకురింప సప్తసంతానంబులయందు ముఖ్యసంతానంబు
ప్రబంధంబుగావున నస్మద్గురుదేవతావతంసుం డగుపార్థివేశ్వ
రునిపేరిట నంకితంబుగాఁ గృతి రచియింప నొక్కకవీంద్రు
నియోగింపవలయు నట్లైన నస్మద్వంశంబు పావనం బగు
నాచంద్రతారార్కంబుగా యశంబు ధ్రువం బయియుండునని
మనంబున నిశ్చయించి.
| 54
|
శా. |
శ్రీమద్వేంకటరామనామునిఁ గవిశ్రేష్ఠున్ రమావల్లభ
ప్రేమాపాంగవిశేషలబ్ధకవితాభివ్యక్తసూక్త్యన్వితుం
గామారిస్తవభుక్తియుక్తు విలసద్గాంభీర్యధైర్యాఢ్యు న
న్నామోదంబునఁ జూచి పల్కిరి సముద్యత్కౌతుకం బొప్పఁగన్.
| 55
|
క. |
వనములును దటాకంబులు
ధననిక్షేపములు దేవతాగృహములు నం
దనములు పురములు కృతులును
జనముల కివి తలంప సప్తసంతానంబుల్.
| 56
|
క. |
ఈచెప్పినసంతానము
లాచంద్రార్కముగ నుండు నయినను గృతియే
భూచక్రంబునఁ బుణ్యక
థాచరితం బగుచు శాశ్వతంబుగ వెలయున్.
| 57
|
సీ. |
శ్రీవేంకటాచల శ్రీయహోబలమధ్య
సీమలయందుఁ బ్రసిద్ధ మగుచు
సిరులచేఁ జెన్నొంది శ్రీశైలదక్షిణ
ద్వారమై తగు సిద్ధవటపురంబు
|
|
|
నప్పురంబునకుఁ బ్రత్యగ్భాగమున నర్ధ
యోజనదూర మై తేజరిల్లు
జలసస్యతరులతాజనకృతానందమై
పురుహూతపురిఁ బోలు జొన్నవోలు
|
|
ఆ. |
అది పురాతనంబు నస్మదీయగ్రామ
మచట జనపదంబు లైదు గలవు
అట్టిపల్లెలందు నంబాపురంబు నా
వెలయు నొకటి భూమితిలక మగుచు.
| 59
|
ఉ. |
శ్రీపతిమిత్రుఁ డార్యజనసేవ్యపరుండు పినాకినీతట
స్థాపితమందిరుండును భుజంగవిభూషణుఁ డీశ్వరుండు నం
బాపురవాసుఁ డైన వృషభధ్వజుపేరిట నంకితంబుగా
దీపితమైన యొక్కకృతిఁ దెల్లముగా రచియింపఁగాఁ దగున్.
| 60
|
క. |
ఖండేందుధరప్రియ మా
ఖండలభాగ్యప్రదంబు కల్మషలతికా
ఖండన మగు బ్రహ్మోత్తర
ఖండము రచియింపు పద్యకావ్యము గాఁగన్.
| 61
|
తే. |
తరుతటాకాదిసప్తసంతానములకు
నొక్కవేళల శైథిల్య ముప్పతిల్లు
గాని కృతులకు నెన్నండు హాని లేదు
ప్రతియుగంబున ధ్రువములై బ్రబలుచుండు.
| 62
|
ఉ. |
శ్రీవనితాధిపాంఘ్రిసరసీరుహయుగ్మము సేవచేసినన్
కేవల భక్తియుక్తి శివకేశవభేదముఁ జేయ మెన్నఁడున్
గావున నీశ్వరాంకితముగా రచియింప మహాంధ్రకావ్యమున్
బావనమైనపుణ్యకథఁ బల్కిన సర్వశుభంబు లయ్యెడిన్.
| 63
|
వ. |
అని పలికి బహుమానపూర్వకంబుగాఁ దాంబూలజాంబూన
దాంబరాభరణంబు లొసంగిన నేనును బరమానందకందళిత
హృదయారవిందుండ నై స్కందపురాణోక్తంబైన బ్రహ్మో
త్తరఖండంబు పరమేశ్వరమహిమానుభావంబును బురాతన
పుణ్యచరితంబును భోగమోక్షప్రదంబును నగుటంజేసి.
| 64
|
ఉ. |
ఉత్తము లైనపూర్వకవు లొక్కట నాంధ్రకృతుల్ రచింపుచు
న్నిత్తఱి మన్మహాసుకృత మెట్టిదొ మున్ దెనిఁగింపరైరి బ్ర
హ్మోత్తరఖండ మిప్పు డది యొప్పుగఁ జెప్పెదఁ బద్యకావ్యమున్
జిత్తమునందు సమ్మదముఁ జెందఁగ జన్మము సార్థకంబుగన్.
| 65
|
క. |
పురహరునుతించుకావ్యము
లిరవుగ శబ్దార్థపుష్టిహీనములైనన్
సరసంబు లిక్షుఖండము
లురువక్రములైన రసము లూరకయున్నే.
| 66
|
వ. |
అట్లుగావున నిమ్మహాపురాణంబు సకలజనమనోహరంబుగాఁ
దెనుఁగుఁ గావించెద నని మనంబున నిశ్చయించి కృతి
నాథుం డైన శ్రీమహాదేవునకు షష్ఠ్యంతంబులు వివరిం
చెద.
| 67
|
షష్ఠ్యంతములు
క. |
ఓంకారరూపునకుఁ బా
శాంకుశశూలాయుధునకు నకలంకునకున్
శంకరునకుఁ బన్నగరా
ట్కంకణునకు శాశ్వతునకు గౌరీశునకున్.
| 68
|
క. |
సారంగదనుజనాయక
సారంగమృగేంద్రునకును సజ్జనపటలీ
సారంగవారిధరునకు
సారంగకరాగ్రునకును సర్వజ్ఞునకున్.
| 69
|
క. |
హాలాహలభక్షణునకుఁ
గైలాసనివాసునకును గాలాత్మునకుం
గాలమదధ్వంసునకును
ఫాలాక్షున కభవునకును బరమాత్మునకున్.
| 70
|
క. |
ఉక్షేంద్రవాహునకు సం
రక్షితబాణునకు రాజరాజాప్తునకున్
కుక్షిస్థితభువనునకును
దక్షాధ్వరహరున కమితతాపఘ్నునకున్.
| 71
|
క. |
అంబరకచునకు గజచ
ర్మాంబరధారునకు సచ్చిదానందునకున్
శంబరధరశేఖరునకు
నంబాపురవాసునకు మహాదేవునకున్.
| 72
|
వ. |
అంకితంబుగా నారచియింపంబూనిన బ్రహ్మోత్తరఖండం
బనుమహాపురాణంబునకుఁ గథాప్రారంభం బెట్టిదనిన.
| 73
|