బ్రహ్మానందము/రామావధూటితారావళి

శ్రీరస్తు

రామావధూటితారావళి

సీ.

శ్రీరాధికాకుచాశ్లేషజసంతోషవివశుఁడౌ శ్రీకృష్ణవిభున కెరఁగి
సకలవిద్యావాప్తిసాధనభూత యౌ శారదాంబకు నమస్కారము లిడి
యైహికానందప్రవాహపూరక మైన శృంగారరస మాత్మ నిరవు కొలిపి
మదనసామ్రాజ్యసింహాసనారూఢులై పురణించు రసికశేఖరుల నెంచి


గీ.

వివిధరతితంత్రపాండిత్యభవమహానుభవములె పదార్థములుగ నేర్పఱిచి సీస
పద్యనక్షత్రమాలిక భావవిదుల మనము లలరంగఁ గూర్చు రామావధూటి.


సీ.

చక్కని కెమ్మోవి సరసంపుఁబలుకులు బారైనకురులు పొల్పారు బొమలు
సొగసైనచూపులు సోగకన్నులు తళ్కుదేరుచెక్కులు కాంతు లూరునొసలు
తీరైనచుబుకంబు దిద్దినశ్రీచూర్ణలేఖయు మృదువైన లేఁతనగవు
కుదురైనరదనముల్ గుమ్మబుగ్గలు నందమగునాస నాసికామండలములు


గీ.

కలిగి చెలువొందునీమోముఁ దలఁచి వలచి తాల్మి చెడి బెట్టుకై కొంతధైర్య మూని
గుట్టు చెడకుండఁ గాలంబు నెట్టుచుంటి మరునిరతనాలపేటి రామావధూటి.


సీ.

కనుమూసినంతలోఁ గలకల నవ్వుచు వచ్చి కౌఁగిటఁ జేర్చి ముచ్చటాడి
మోము మోమునఁ జేర్చి ముద్దుల నూరార్చి సారెసారెకు మోవి చప్పరించి
నన్నిట్టలు లెడబాయ నాయమా మీకని యతినిష్ఠురము లాడునంతలోన
మేల్కని నలుదెసల్ మిణుకుచుఁ జూచి కన్నీరు మున్నీరుగా నెగడఁ బ్రతిది


గీ.

నంబు రాత్రులు నిటులుండె నా యవస్థ యిట్లు కలలోన నన్నలయించకుంటె
వారిజాతాక్షి నాతోడ వచ్చి యిటనె మమతతో నుండరాదె రామావధూటి.


సీ.

నీమోము నీగోము నీమోవి నీతావి నీసౌరు నీతీరు నీకుఁ దగునె
నీచనుల్ నీకను ల్నీకౌను నీమేను నీతొడ ల్నీనడల్ నీకుఁ దగునె
నీతళ్కు నీబెళ్కు నీనీటు నీగోటు నీహొయల్ నీలయల్ నీకుఁ దగునె
నీగుట్టు నీబెట్టు నీకురుల్ నీమరుల్ నీచెల్మి నీతాల్మి నీకుఁ దగునె

గీ.

నీకుఁ దగినట్టి పురుషుఁడ నేన నాకుఁ దగినసుందరి వీవ కాఁదలఁచి చాల
వలచి యన్యోన్య మతనుని గెలిచి మిగుల మంచితో నుంటిమిగదె రామావధూటి.


సీ.

ఒకనాఁటికలలోన సకియ నీకాలిపాజేబులో జందెంబు చిక్కినట్లు
ఒకనాఁటికలలోన సకియ నీచేతిపోచీలోన నాకురుల్ చిక్కినట్లు
ఒకనాఁటికలలోన సకియ కౌఁగిఁటఁ జేర్చుతఱిఁ గంటె గడ్డానఁ దాకినట్లు
ఒకనాఁటికలలోన సకియ మెల్లన నాదుగూబలో కొక్కొరో కూసినట్లు


గీ.

లిన్నివిధమలు నచ్చట నున్న నాఁటివన్నె లన్నియుఁ గలలోన వచ్చి యిచట
గాసి గూర్చుచున్నవి నిన్నుఁ బాసి యెట్లు మరులు నిల్పఁగనేర్తు రామావధూటి.


సీ.

నమ్మినవాని నన్యాయంబు సేయుట కాశిలో గోహత్యగాదె కలికి
వలచి వచ్చినవాని వంచనల్ సేయుట నరహత్యగాదె పున్నాగవేణి
చెలిమి కోరినవానిఁ జేపట్టి విడుచుట బ్రహ్మహత్యయెకాదె పంకజాక్షి
ఆడి తప్పినదోష మన్ని దోషములలో మొదటిదోషము సుమీ మోహనాంగి


గీ.

నిన్ను నమ్మితి వలచితి నీవు నన్నుఁ బ్రేమఁ జేపట్టితివి యిఁక విడువ ననుచు
బాసఁ జేసితి విప్పు డీపగిదిఁ గూర్మి మఱచిపోవంగఁ దగునె రామావధూటి.


సీ.

చంద్రఖండంబుపైఁ జంద్రఖండము రేక నుదుటఁ గుంకుమవంకఁ బదిలపఱిచి
కొండలపై మంచు నిండియుండినరీతిఁ జనులపై మైఱైకఁ జక్కపఱిచి
కలువరేకలఁ దుమ్మెదలు వ్రాలి యున్నట్ కనుదోయి నంజనంబును ఘటించి
బంగారుప్రతిమలఁ బటిక నార్చినరీతి లలి జిల్గుమల్లిసెల్లా ధరించ


గీ.

యంగజప్రభు విజయకాహళులపగిదిఁ గాళ్ళ నందెలు పాంజెబుల్ ఘల్లురనుచు
మ్రోయ మెల్లన వచ్చి నామ్రోల నిలుచు ఠీవి మఱవంగఁ దరమె రామావధూటి.


సీ.

ఒకనాఁడు మేడపై నొంటిగా కిటికిటీలెల్ల బిగించి శయంచువేళఁ
జల్లగా నేవచ్చి మెల్లమెల్లనె ముద్దు లిడఁబోవఁగాఁ ద్రుళ్ళిపడి బిరాన
లేచి చెంగట నన్నుఁ జూచి సెబాసు రా రండి యటంచు నురంబపైకి
తిగిచి నాచిబుకంబుఁ దివురుచు నవ్వుచు మధురవాక్యముల నన్ మరులుకొల్పి


గీ.

సరసులైనట్టి నీవంటిజాణ లిట్లు చెలులమానంబులను బయల్ సేయఁదగునె
యంచు మంచిగ బోధించినట్టినేర్పు మదికి మఱవంగఁ దరమె రామావధూటి.

సీ.

చిననాఁటి నుండి విజృంభించి సఖులతోఁ బొందు లొనర్చితిఁ గుందరదన
యీలాటిమోహంబు లీలాటివిరహంబు లేనాఁ డెఱుంగనే యిగురుఁబోడి
నీవంటిచెలియతో నేస్త మబ్బె నటంచుఁ జాలఁ బొంగితిఁగదే జలజగంధి
యిప్పు డిట్లెడఁబాసి యేఁగుట నాపూర్వపుణ్యంబు గాఁబోలుఁ బూవుఁబోఁడి


గీ.

యింతపాపంబు జగతిలో నెచటనైనఁ గలదె నాపాప మిటు పండెఁగాక యైనఁ
దరుణి నీమది కరుణమాత్రంబు తప్పి పోవకున్నను జాలు రామావధూటి.


సీ.

ఒకనాఁటి కలలోన నుదయమే నినుఁ బట్టి రతిగోల ‘నిపుడు నిస్త్రాణఁజేయు
మద్యాహ్న’ మని తెల్పి మద్యాహ్నమున రాఁగ ‘విడెము సేయుండ’ని విడెము సేసి
నంతట ‘నిద్రించి యావల మీయిష్ట’ మని కూర్మి లేచిన వెనుక ‘జుట్టు
దువ్వెద రమ్మ’ని దువ్వుచు ‘రాత్రికి సిస’లని చేతిలోఁ జెయ్యి వేసి


గీ.

యిటుల దంధనసేయునంతటను నిద్ర మేలుకొని గుండెఝల్లన మేనుమఱచి
సొమ్మసిల్లి యొకింత యుసూరుమనుచు మదిని దపియించుచుంటి రామావధూటి.


సీ.

‘బోఁటి నేఁ డూరికిఁ బోవలె’ ననుచు నే నొక్కింత పలుకంగ నుస్సురనుచు
‘నెపుడుఁ బ్రయాణాలె యేమి సేతు’ నటంచు గనుఁగొలఁకుల నీరు గ్రమ్మఁ గొంత
సేపున ‘కెపుడు విచ్చేయుదు రొక్కొ! యచ్చటనె యచ్చటల ముచ్చటల మరగి
యుందురో’ యన భయం బొంది నేనెన్నటికిని నట్టివాఁడఁగా నని పలుకఁగ


గీ.

నొట్టునుండి తప్పక హుటాహుటిగ రండి యనుచుఁ గౌఁగిటఁ జేర్చి బాష్పాంబు లొలుక
రేపు పోవచ్చు ననుచుఁ బ్రార్థించునట్టి మంచి మఱవంగఁ దరమె రామావధూటి.


సీ.

ఫలహారమును జేసి పవళింపఁగా వచ్చి విడెమిచ్చి “నేఁడు నేఁ దలకుఁ బోసు
కోవలె, నిట పండుకొనుఁడు మీ”రని పోయి జలకంబులాడి పూసలు ధరించి
లలి జిల్గుమల్లుసెల్లా గట్టి రవిక చేపట్టి రాఁజూచి యాపాదమస్త
కంబు గాన్పింప మోహంబునఁ బైఁబడి గ్రుచ్చి కౌఁగిటఁజేర్చి కుచయుగంబు


గీ.

బట్టఁబో రామలక్ష్మి బార్శ్వముననుండి ‘హుమ్మ’నుచుఁ బల్క నంత నే నులికిపడఁగ
‘దానితో నే’మనుచు నీవు పూనుకొన్నఠీవి మఱవంగఁ దరమె రామావధూటి


సీ.

ధరలోన జన్మ మెత్తంగ నేమి ఫలంబు సరసవిద్యల నెల్ల జదువవలయుఁ
జదివిన నేమాయె సారస్య మెఱిఁగిన చెలియతో స్నేహంబు సేయవలయుఁ

జేసిన నేమాయెఁ జిడిముడి లేక విచ్చలవిడి ముచ్చట్ల మెలఁగవలయు
మెలఁగిన నేమాయె నెడబాయ కెల్లప్పు డేకీభవించి వర్తింపవలయు


గీ.

నటుల వర్తింప నేమాయె నవ్విధమునఁ జెడని ప్రేమలతోఁ దను ల్విడువవలయు
నహహ యివి యెల్లఁ బూర్వపుణ్యమునఁ గాక మనుజులకు వీలుపడునె రామావధూటి.


సీ.

మేడలోఁ జన్నీళ్ళు మెండుగాఁ జల్లించి తడియొత్తి చిఱిచాఁప లిడి సుమృదుల
తల్పంబుఁ బఱిచి చెంతల మిన్న లగుషర్భతులును షోడావాటరులును గల్గు
సీసాలు చక్కెరల్ జీడిపప్పులును బాదముపప్పులును మంచి ద్రాక్షపండ్లు
కజ్జాయములు ముంతఖర్జూరము ల్గలపళ్ళెముల్ ప్రేమతో భద్రపఱిచి


గీ.

భోజన మొనర్చి నేను రాఁ బొలుపు మీఱ శయ్యపైఁ జేర్చి యుచితోపచారములను
వేసఁగిపగళ్ళ సుఖియింపఁ జేసినట్టి మంచి మఱవంగఁ దరమె రామావధూటి.


సీ.

కమలాక్షి నీమోముఁ గనుఁగొన్న నాకన్ను లేమియుఁ గనుఁగొన నేవగించు
బింబోష్ఠి నీదు మోవిని గ్రోలునాజిహ్వ యేమియుఁ గ్రోలంగ నేవగించుఁ
గలవాణి నీదు పల్కులు విన్న నావీను లేమియును వినంగ నేవగించుఁ
గనకాంగి నీతోడఁ గలసిన నాదుమే నేమియు స్పృశియింప నేవగించుఁ


గీ.

సరసిరుహగంధి నీమేని పరిమళంబుఁ గొన్న నానాస యెదియు మూకొనఁగఁబోదు
అహహ! పంచేద్రియములు నీయందె నాటి మఱల విఁక నేమి సేతు రామావధూటి.


సీ.

సౌధంబుపై నీళ్ళు చల్లించి చిమ్మించి చాపలు పఱిపించి చారురత్న
కంబళంబులు వేసి ఘనహంసతూలికాతల్పంబు బఱిపించి తమక మలర
నందుపై ననుఁ జేర్చి యగరుగంధముఁ బూసి చలువపన్నీరులు చల్లి మల్లె
పూదండలును జాజిపూదండ లురమున వేసి చల్లనిగాలి వీచుచుండ


గీ.

రమణ నీరీతి వేసవిరాత్రులందు రాగ మెచ్చంగ నిష్టోపభోగములను
నన్ను సుఖియింపఁ జేసిననాఁటికూర్మి మదికి మఱవంగ వశమె రామావధూటి.


సీ.

ఉదయమే లేచి నిల్ వదలలే కై దాఱుగడియలవఱ కుండి కదలి మేడ
డిగి వచ్చుచో వాకిటికిముందు గుబగుబ నీ వేఁగి యీవాల నావలఁ గని
సై యన నే వేగఁ జని బసలోఁ గల పనులెల్లఁ దీర్చి సాపాటు చేసి
గంధంబుఁ బూసి వేడ్కల మించి కెలఁకుల నమ్మలక్కలు వెఱఁగంది చూడ

గీ.

నీటుగా వచ్చుచోఁ జూచి ‘నేఁడు దృష్టి తాఁకు!’ నని ప్రొద్దు గ్రుంకినతత్ క్షణంబు
జీడిగింజస దృష్టి తీసినవిధంబు మఱచిపోవంగఁ దరమె రామావధూటి.


సీ.

ఊరు నేఁడే బైలుదేరుట నిశ్చయం బైనచో నెదురు మాటాడలేక
మోము వెల్వెలఁబోవ ముచ్చటాడుచుండి ధ్యానంబు వేఱుగాఁ దల్లడిలుచు
నామాట లీమాట లడుగుచు నుచితోపచారముల్ సేయుచు గారవమున
భోజనానంతరంబునను దమ్ములము గుడాన్వితంబుగ నిచ్చి యవలఁ జేయి


గీ.

చేతిలో నుంచి ‘యూరికి క్షేమముగను బోయి శీఘ్రంబు రమ్మ’ని పొలుపు మీఱ
నన్నుఁ బంపిన యానాఁటినైపుణంబు మఱచిపోవంగఁ దరమె రామావధూటి.


సీ.

కడుపులోఁ గమ్మనికాంక్ష లూరుచునుండు నిను జ్ఞాపకము సేయఁ గనకగాత్రి
కనుల కేమో తళుక్కను నట్లుగాఁ దోఁచు నిన్నెన్న సౌదామనీలతాంగి
నిలువెల్ల నేమేమొ పులకించు నీతీరు స్మరియించ శీతాంశురుచిరసుముఖి
సారెకు నేమేమొ నో రూరుచుండు నీ మాటలఁ దలఁప బింబాధరోష్ఠ


గీ.

యోచనగ నుండు మది కేమి తోఁచకుండు దిగులుగా నుండు మరుమాయ దెలియకుండు
దైవ మిఁక ముందెటులు సేయఁ దలఁచినాఁడొ మనకుఁ దెలియంగరాదు రామావధూటి.


సీ.

ధరలో ననేకసుందరు లుందు రైన వారలయందు నెందు నీవలెనె మంచి
గుణము విశ్వాసంబు కుదురు సత్యము తప్పకుండుట యుక్త మయుక్త మెఱిఁగి
తివురుట వినయవిధేయత లభిమాన మాదరంబు దయామయాంతరంగ
మందంబు చందంబు నళుకును బెళుకును సమయంబునను దెంపు సౌష్ఠవంబు


గీ.

దగినసరసునిఁ జేపట్టి తప్పు లొప్పు లెఱిఁగి విడువక ప్రేమచే నేలికొనుట
తెలివితేట లుపాయముల్ లలితవాక్యమాధురియు నిన్ని గలవె రామావధూటి.


సీ.

కలగంటి నొకరాత్రి కనకాంగి నీతోటి సమరతిలోఁగేళి సల్పినట్లు
కలగంటి నొకరాత్రి కలకంఠిరో నీ వుపరతిలో నను గుపాల్పఱచినట్లు
కలగంటి నొకరాత్రి కలికి గాఢాలింగనాదిసౌఖ్యంబుల నలరినట్లు
కలగంటి నొకరాత్రి కమలాక్షి నీతోడ బంధలీలల జాల బడలినట్లు


గీ.

ఒక్కరాతిరి కలఁగంటి సొక్కి నేను నీదుకెమ్మోవియానుచో నీవు నాదు
పైపెదవినానుచును ఱెప్పపాటులేక మన్ముఖముజూచునట్లు రామావధూటి.

సీ.

నీయాత్మ నాయాత్మ నిజముగా నొకటంచు నామనంబునఁ జాల నమ్మియుంటి
నాతోడఁ జేసిననమ్మిక లెప్పుడు మఱచిపా వని రూఢి పఱిచియుంటి
నెవరెన్ని చెప్పిన నిఁక నన్ను విడనాడవంచు నామది నిశ్చయించుకొంటి
మనశరీరము లున్న మట్టుకు మనలోనఁ బొర కల్గదనమి తలపోసియుంటి


గీ.

వనితరో యిప్పు డిటు కాలవశముచేత మనల కెడబాపు కల్గె నీమది విరక్తిఁ
బొరయ లోగడ సంగతుల్ మఱచిపోవ మంచిమార్గము కాదు రామావధూటి.


సీ.

ఘన మైనమోహంబుఁ గలవాఁడ నౌటచే లలన నే నీకింత తెలుపవలసెఁ
బట్టుకై యభిమానపడువాఁడఁ నౌటచేఁ దెఱవ నీకింత బోధింపవలసెఁ
బ్రౌఢానుభవ మాసపడువాఁడ నౌటచే నింతి నిన్నింత ప్రార్థింపవలసెఁ
జెలిమిపై లక్ష్యంబు గలవాఁడ నౌటచే వనిత నీకింతగా వ్రాయవలసెఁ


గీ.

గాక తమతమ యక్కఱల్ గడపుకొనెడువార లందఱతో పాటివాఁడ నైన
నింత యేటికి? నీకు నొక్కింతయైన మనమునను దయ లేదు రామావధూటి.


సీ.

కొంతకాలము నీదు గుణగణంబు లెఱుంగనేరక భయముచే నూరకుంటిఁ
గొంతకాలము నీకుఁ గోపమేమో యని సంశయంబునఁ జాల జంకియుంటిఁ
గొంతకాలము మది గోర్కెలూరఁగ సంతనపురాయబారముల్ నడుపుచుంటిఁ
గొంతకాలము నిన్నుఁ గూడియు పుల్లాయమాటలు మనములో నాటియుంటిఁ


గీ.

గాని యీయూరిలోనుండు కాలమందునైన తమిదీఱ రతులలో నలరనైతి
నేమి సేయుదు నయ్యయో యిప్పుడిటుల మదిని దపియించవలసె రామావధూటి.


సీ.

నీమోము నే నొక్క నిముసంబు గనుఁగొన శశి యేటి కనిపించుఁ జంద్రవదన!
నీమోవి నే నొక్కనిముస మానిన దొండపండేటి కనిపించుఁ బల్లవోష్ఠి!
నీకను లే నొక్కనిమిషంబు గనినఁ బద్మమ్మేటి కనిపించుఁ దరళనయన!
నీబొమల్ నే నొక్కనిమిషంబు గనుఁగొన్ విల్లేటి కనిపించు విలసితభ్రు!


గీ.

నీదుచెక్కులు నే నొక్కనిమిష మైనఁ గనిన నద్దంబు లేమిటి కనుచుఁ దోఁచు
నిట్టి నినుఁ బాసి యున్న నా కిపుడు జన్మమే వృథా యని తోఁచు రామావధూటి.


సీ.

శ్రీమించునెమ్మోము తామరవిరి తళ్కుఁ గన్నులు విరిసినకైరవములు
కుదురైనరదనముల్ కుందకుట్మలములు తీరైననాసిక తిలసుమంబు
తరళాధరోష్ఠంబు దాసానిపుష్పంబు పొలుపైనపొక్కిలి పొన్నపువ్వు
అదోఁక లగుజంఘ లరఁటిపూమొగ్గలు చక్కనిమెయి శిరీషప్రసూన

గీ.

మహహ మురిపించి మంచిపూ లరసి తెచ్చి బొదవి నీమేనుఁ జేసెఁ గాఁబోలు బ్రహ్మ
దాన నిలఁ గల యెల్ల సుందరులలోన మాకు స్పృహణీయ వైతివ రామావధూటి.


సీ.

కార్యవశంబు దీర్ఘప్రవాసము సేసి రెండు నొక్కటిసేయు దండిదేవు
నెనరున నేను రా నిధిఁగన్న నిఱుపేదకరణి గొబ్బున వచ్చి కౌఁగిలించి
బాష్పంబు లురమున బడిబడి యొత్తుచు గళ గద్గదిక దోప కలరవమున
నిష్ఠురంబుల నాడి నీకేళిసౌధమ్మునకును నీవట్లు దోడుకొనిపోయి


గీ.

పాన్పుపైఁ జేర్ప వెనుకటిపాటు లెల్ల మఱచి యానందరసపూర్తి మనము లలర
మదనకైవర్తసామ్రాజ్యపదవిని మన మెటుల నుంటిమిగదె రామావధూటి.


సీ.

నారంగములు బృహన్నారంగములు గల్గి విలసిల్లు నుద్యానవీథులందుఁ
గాదంబములు పద్మకాదంబములు గల్గి తనరారు కాసారతటములందుఁ
బర్యంకములు మహాపర్యంకములు గల్గి గణన కెక్కిన సౌధవీథులందు
మణిపుత్త్రికలు నభోమణిపుత్త్రిగలు గల్గి సౌరు మీఱిన చంద్రశాలలయందు


గీ.

మనముమనముల మోహ ముమ్మరముగాఁగ మరునిఁ బూజించి మించి యేమరక రతుల
నతులగతులను దేలి సమ్మతుల మేఱి ఠీవిగ నుంటిమి గదవె రామావధూటి.

సంపూర్ణము