బొబ్బిలియుద్ధనాటకము/షష్ఠాంకము

షష్ఠాంకము.

[రంగారాయఁడు పెండ్లికుమారులతోను, ఇతర బంధువులతోను,

దళవాయులతోను, సపరివారుఁడై నిండోలగంబుగా ప్రవేశించును.]

రంగా. - చెలికాని వెంకయ్యా, మనము బురుజు దిగి వచ్చు చున్నప్పుడు, పరాసువానిడేరాకు కొండబోటునకు నడుమ కొండంత మంట ఎగసి మాయమైనదే, అదేమి? నల్లమందు పఱపా ?

చెలికాని వెంకయ్య. - అవును మహాప్రభూ. దానిలక్షణ మట్టిదే ;

రంగా. - అచట వెంగ,ళ్రావు పోరుచుండెనా?

వెంక. - అట్టి దేమి లేనిచో ఏల నల్లమందు మారమ్మ అట్లు మండును ?

సభ్యులు. - ఈ నల్లమందు మారమ్మ ముందు ఆఁగలేక యున్నాము బాబూ !

రంగ. - మాయదృష్ట మెట్లున్నదో ?

[అంతట నల్లఁబాఱిన మానిసి యొకడు వడివడిగా,

లేచుచు పడుచు ప్రవేశించును.]

నల్లమానిసి. - దండం మహాప్రభో, దండం, యెంగళబాబు యీరస్సొర్గంయెల్లి నారు బాబూ.

రంగ. - హా ! హా ! హా ! [అని మూర్ఛిల్లి, తేరి, అరసికొని,] నీ వెవరవురా ?

నల్లమా. - నేను వారి బంటుని, జక్కణ్ణి ఖబురు చెప్పడానికి మిగిలుండ మంటే మిగిలి వచ్చినాను బాబూ.

రంగ. - మాతమ్ముడు మా కేమియు చెప్ప లేదటరా ?

జక్క. - అన్నయ్యగారు నారణయిహారం సూడరైరి గదా అన్నారు బాబూ. నేను శెప్తా నని మనివి చేసుకొన్నా.

రంగ. - ఏమిరా ఎట్లు పోరినాఁడురా నా తమ్ముఁడు ?

జక్క. - శినబాబు మొగలాయీవాళ్ల గుఱ్ఱాలని రెండువేలని సవార్లతో తెగ నఱికినారు. 1000 ఫిరంగీలవాళ్లని కూల్చి ఆఫీరంగీలు పరాసులమీదికి తిప్పించి కాల్పించినారు. అప్పటికి మిగిలిన మాతో ఆళ్ల డేరాలమీదికి వురికే తలికి నడమ నల్లమందు మారెమ్మమంటలో అందఱము మాడిపోయినాం. శినబాబూ నేను మిగిలినాము. ఆనక బుస్సీడేరాలోకి విజయరామరాజు కోసరం యెల్లి ఆయన్ని తఱుముకపోయి శినబాబు మూర్ఛపోయినారు. ఆళ్ల చేతులతో తెప్పిరిల్లి ఆళ్లు ఎంత బతిమాలుకొన్నా యినక రాజుని వొదలనని లగువు చేసిపడి యీరస్సొర్గానికి యెల్లినారు, బాబూ.

[అని సొమ్మసిల్లి కూలును. నౌకరులు వాని బయటికిం గొనిపోవుదురు.] రంగ. - [ఱిచ్చవడియుండి] హాహాహాహా ! ఎపుడును నా యనుచరుండవుగా నుండువాఁడవు ; ఇప్పుడు నాకన్న ముందు నీవు ఎట్లు వీరస్వర్గమునకు వెళ్లితివయ్యా! హాహాహాహా ! నా యదృష్టము !

రంగ. - అన్నలారా, పడవాళ్లారా నాకుడిభుజము విఱిగిపోయినదే! ఇఁక నే మున్నది ! వెంగళ్రావు పోయిన పిమ్మట ఇంక నేమి బొబ్బిలి !

[ఫిరంగియగాదులు, నౌకరులు సంభ్రాంతులై ప్రవేశింతురు.]

నౌక. - మహాప్రభో, పరాసుల ఫిరంగిగుళ్లు వొచ్చి కోటలోనంతా పడతావున్నయి, లోగిళ్లు కూలిపోతావున్నయి. గుళ్ల దెబ్బలకి మన నౌభత్తువాళ్లు నాశమై పోయినారు. మనజెండా ఏమయిందో తెలవకుండా యెగిరిపోయినది.

[రంగారాయని మ్రోల దివాణములో ఫిరంగిగుండ్లు పడును.]

రంగ. - హాహా ! అయ్యా పెండ్లికుమారులారా, ఓబంధువులారా -

           సీ. పెండ్లికై విచ్చేయఁ బిలిచికొంటిని మిమ్ము ;
                   నిట నిట్టు లగు నని యెఱుఁగనైతి!
               దురమునకై మిమ్ముఁ దోడు వేడఁగలేదు,
                   దైవంబు మా కిప్డు దాయ యయ్యె.
               మముఁగూర్చియే కదా మలకలు వచ్చిరి,
                   వారికి మీమీద వైర మేమి ?
               దారికి సామగ్రి దయసేసి కైకొని
                   సకుటుంబముగ మీరు సాగిపొండు
          ఆ. 'పెండ్లికతమున మేము బొబ్బిలికి వచ్చి
                   యేఁగుచున్నార' మనినఁ, బోనిత్త్రు మిమ్ము.
               మిగిలియుండుఁడు నేమాన మీరలేని;
                   మాకొఱకు మీకు సంఘాతమరణ మేల ? ౬౮

[పెండ్లికుమారులు రాజబంధువులు అందఱు ఉగ్రవీక్షణులై నిష్క్రమింతురు.]

రంగ. - వెంకయ్యా, ఏమి ? వీరు బదులు చెప్పకయే లేచిపోయినారు ?

వెంకయ్య. - మహాప్రభూ, వారి గాంభీర్యము మీకు తెలిసినదే గదా ?

          ఆ. ప్రాణ మిచ్చునట్టి బంధులు గావునఁ,
               బ్రాణబంధుసంజ్ఞఁ బడసినారు ;

               మిత్తి నైనఁ బోర మీకై పొడుచువారు,
               తొడుగు తొలఁచుకొఱకుఁ దొలఁగినారు. ౬౯

రంగ. - ఆహాహా ! ఏమి వారి యనురాగము ! ఏమి తెగువ ! నాకుం గూడ వారు మార్గ దర్శకు లైరే. నాకును స్వయముగా వదిలించుకోవలసిన తొడుగులు కలవు గదా ? అంత:పురము నగళ్లకే దారి చూపుము.

వెంకయ్య. - ఏలినవారు ఇటు రావలయును. [రంగ - వెంకయ్య - నిష్క్ర.]

స్థలకము. - అంత:పురము.

[పెండ్లికొమారితలు, మల్లమ్మ దేవిగారును ఉపవిష్టలై ప్రవేశింతురు పెండ్లికుమారులు సంభ్రమున ప్రవేశింతురు. పెండ్లికొమారితలు లేతురు.]

మల్లమ్మ. - ఏమి నాప్రాణములారా ! ఇట్లు మీ రొక్కుమ్మడి అంత:పురము ప్రవేశించిన కారణ మేమి ?

పెంద్లి కుమారులలో నొక్కఁడు - దేవిగారికి ! ఇవి మా కడపటి దండములు. వెంగళ్రాయనింగారు వీరస్వర్గమునకు వెళ్లినారు. రంగారాయనింగారు కోట వెలుపలకు రాజుతోను, పరాసులతోను, కలయబడుటకు తరలుచున్నారు. పరాసులు బొబ్బిలి కోటను కూల్చుచున్నారు మఱి మే మేలవచ్చితిమో తమకు చెప్పవలయునా ?

[వెంగళ్రాయని భార్య సుభద్రమ్మ శోకించును.]

రాణి. - అమ్మా, సుభద్రమ్మా, నాబంగారు చెల్లెలా, నీప్రాణేశ్వరుఁడు రవంత ముందు పోయినందులకు దు:ఖించెదవా ? ఈసమయములో మనకు దు:ఖము పనికిరాదు. నాకూనా, నాముద్దుఁగూతులారా ! మాప్రాణేశ్వరులతో మీప్రాణేశ్వరులు వీరస్వర్గమునకు తరలియున్నారు. మన మచటికి ముందుగాఁ బోయి వీరు విజయంచేయు సమయమునకు గృహాత్మాలంకారములు గావించుకొని వీరికి స్వాగతము సెప్పవలదా ? ఎవరి దొరను వారు, తొలిచూపే కడసారి చూపు చూచుకొని, తొలిదండమే కడసారి దండము పెట్టి, ముందుగా తరలుఁడు.

[పెండ్లి కొమారితలు భర్తలకు ప్రణమిల్లి లేచి వారిబాకులం గైకొందురు.]

[నేపథ్యమున]

'గోవింద గోవింద, నారాయణ, నారాయణ.' [అందఱు ఆకర్ణింతురు.]

రాణి. - ఆహా ! పెద్దవారు అందుఱు మనకన్న ముందుగానే తరలినారు ! వెనుకఁ బడుట మనకు అవమానము గాదా ? ఇదిగో నాకు నా ప్రాణేశ్వరులు ఇచ్చిన బా కున్నది. సుభద్రమ్మకు వెంగళ్రావు ఇచ్చి బోయిన బా కున్నది. స్త్రీలు అందఱు. - (గేయము.)

              భారతీ దేవిరో, భార్గవీ దేవిరో, పార్వతీ దేవిరో ;
              దీవింపుఁ డీమమ్ము దీనలను మీయ ధీనలను దల్లులారా!
              వీరపత్నుల మమ్ము వినక కనక ముందే
                    విడనాడు చున్నట్టి వీరే;
              ప్రతిజన్మ మందుమా, ప్రాణనాథులుగాఁగ
                    వరమొసం గుఁడు తల్లులారా !
              మాకిట్టి వంతలు మరలరా కుండఁగ
                    మముఁగావుఁ డీతల్లులారా!
              కడపటి మా మ్రొక్కు గైకొని మామీద
                    కనికరింపుఁడు తల్లులారా!
         [అని బాకు ఱొమ్మునకు గుఱిచేసి కొని]
              రంగరంగ శ్రీ రంగారంగా కావేరి రంగా
              కమలా కాంతా మనోబ్జ భృంగ కస్తూరీ రంగా.

[అని పొడుచుకొన నుంకింతురు. తెర వ్రాలును, తెరలో "గోవింద గోవింద, నారాయణ నారాయణ" పెండ్లికుమారులు బాకులు తుడుచుకొనుచు పూర్వస్థానమునకు వత్తురు. ఇతరులును అట్లే వత్తురు.

[రంగారావును అట్లే ప్రవేశించును.]

రంగ. - అయ్యలారా, మాయన్న లారా, మాతమ్ములారా, నాబంగారులారా,

          సీ. విజయ బంధువులార, వేజన్మముల కైనఁ
                    దీర్చుకో నేర మీ పేర్చు ఋణము.
              చేతు లారంగఁ బూజించితి మెవ్వారి,
                    ఖండించితిమి వారి ఖడ్గథార!
              లీలలు మీర లాలించితి మెవ్వారి.
                    బడఁగ్రుమ్మితిమి వారి బాకు మొనల!
              ఆఁడుబురువు లేదు! హతమయ్యె మగకూన!
                    కోట పా డయ్యె నింకేటి కిచట!
          తే. నాదు ప్రాణంబు వెంగళ నాయకుండు
                    న న్నెదురు సూచు చున్నాఁడు కన్ను నొవ్వ,

     అరుల బొందుల మీఁదుగా నతనికడకు
              క్షణములోఁ జేరుదుము రండు రణపథమున.
౭౧

[వెంకయ్య ప్రవేశించును.]

రంగ. - వెంకయ్యా, ఏమిచేసి వచ్చితివి ?

వెంకయ్య. - మహాప్రభూ! ఎల్లవారితొడుగులు వదలించి వచ్చితిని.

      సీ. వరవుడులుం గూడ వలసపో నొల్లక
                    యిటనె యీల్గఁగ నిశ్చయించుకొనిరి!
              పండ్రెండును *[1]బడాలు వారి గృహంబులు
                    ఖాలి సేయించి యాబాలముగను
              తెలగా పడంతుల, వెలమ మడంతుల,
                     లోనికిఁ దోలి, తల్పులు బిగించి,
              తోరంబుగా నన్ని చూరుపట్టెల వెంటఁ
                     జిచ్చు లంటించి, నేవచ్చినాఁడ.
          తే. గవను తెరచి మనము గడచునప్పటికి భూ
                     చక్రమునకు నాక చక్రమునకు
              మంటయిరుసు గూరి మనకంటి కగపడు,
                     నేల తడయ నింక నేలినదొర.

             రంగ. - [ఆత్మగతము]

     తే. విజయరాముని కోర్కియే విజయ మొందె!
                     పాఒఇ పింజారి హైదరు పలుకె నెగ్గె.
              బొబ్బిలిగడీని బా డిడి పోటు మగఁడు
                     రంగరాయండు వెడలె గౌరవము దక్కి.

ఆహా ! ఆహా ! ఆహా ! [ప్రకాశము] వీరాగ్రణులారా! మనము పరాసుల డేరా మీదికే పోదము ; మఱి తరలుఁడు. గోవిందా, హరి గోవిందా.

[అందఱు 'గోవిందా హరి గోవిందా' అని అఱచుచు వికటముగా నిష్క్రమింతురు.]


___________
  1. *పా. బటాల.