బొబ్బిలియుద్ధనాటకము/ప్రస్తావన

శ్రీ

బొబ్బిలియుద్ధనాటకము.

శా. శ్రీనాథుం డిలకున్ భరం బుడుప నాజిం బెట్టుడున్, దాన, వీ
       రానీకంబు లుర:క్షతాధ్వమున డాయన్ డూయ, నెవ్వాఁడు క
       న్గో నౌఁ దేనియప ట్టొకో తితఉ వొక్కో నాఁగ, శర్మార్థి యా
       భానుం డేనవజార్జి లోకపతి సర్వశ్రీయుతు న్జేయుతన్.

చం. కరమున శూలు, నెన్నుదుటికంటను గీలి, సిగన్ భపాలి, యం
       బరమునఁ జూళి, భిక్షఁ గొనుపాత్రమునం గకపాలి, మేన సుం
       దరతమకాళి, భూషణగణంబున వ్యాళి, జడం బ్రియాళి, కం
       ధరమున క్ష్వేళి,యై కరుణ స న్గనువేలుపుమిమ్ముఁ బ్రోచుతన్.

________

ఇఁక ప్రస్తావన.

నాంద్యంతమున.

సూత్రథారుడు. - (ప్రవేశించి) మారిషా, త్వరగా రమ్ము.

పారిపార్శ్వికుఁడు. - (ప్రవేశించి) ఇదుగో వచ్చినాను బావా.

సూత్ర. - ఇప్పుడే ఈయార్యమిశ్రులమ్రోల బొబ్బిలియుద్ధము నాడవలయును; నీవు పోయి పాత్రవర్గమును హెచ్చరింపుము.

పారి. - అబ్బబ్బ ! బొబ్బిలినాటక మంటే నాగుండెలు తల్లడిల్లి నావొళ్లు జల్లు మంటుంది బావా. మరొకనాటకం ఆడరాదా?

సూత్ర. - [పరిహాసముగా] అంతటి బంటవేని విజయరామరాజు వేసము వేసికోరా. పారి. - [మొగము చిట్లించుకొనుచు] తాండ్ర పాపయ్యవేసాన వొచ్చి 33 పోట్లు లెక్కపెట్టి పొడిచి చంపడానికా?

వ్సూత్ర. - [పారిపార్శ్వికునిం బోనీక పట్టుకొని] కాదురా మూర్ఖా. మనకు కీర్తివలయునేని దానినే ఆడవలయును. ఏల యన?

               ఆ. తప్పు లెల్ల నడఁచి యొప్పులు గురియించు
                    రంగారావుకీర్తి రంగమందుఁ,
                    బాప మడఁచి యిష్టఫలము లానఁగఁ జేయు
                    పారిజాత పాదపంబు కరణి. ౧

పారి. - నా కక్కరలేదయ్యా. (స్వగతము) ఇందులో యే వేసం వొచ్చినా నాకు మధ్యలో డింకకొట్టేదిగానే వొస్తుంది.

[అని తటాలున విడిపించుకొని నిష్క్రమించును.]

సూత్ర. - ఔరా, ఎంతమూర్ఖుఁడు ! [కోపముగా నేపథ్యమువైపు చూచి] ఆర్యా, ఇటు రమ్ము; నీవు పూనుకోక ఈపనిగాదు.

నటి [ప్రవేశించి] - కోప మెందులకు ఆర్యపుత్రా?

సూత్ర. - నీతమ్ముడు ఇపుడు అమాంతముగా నాపుట్టి ముంచినాఁడు. ఈయార్యమిత్రులమ్రోల బొబ్బిలియుద్ధమునాడి మనవైరులకు చెంపపెట్లు వేయింపవలసియుండగా వేసమువేయక పరారి యైనాఁడు!

నటి. - వానితో నేమి ఆర్యపుత్రా? మీతమ్ములు లేరా; నేను లేనా? కోపము మాని ప్రకృత మానతిమ్ము. మన మాడవలసిన బొబ్బిలినాటకము ఎవరు కావించినది?

సూత్ర. - శ్రీమద్వేంకటగిరి సింహపీఠాధిష్ఠాతృ శ్రీ శ్రీరాజగోపాలకృష్ణయాచేంద్రమహారాజ నిరంతర బహూకృత శ్రీమద్వేదాన్వవాయ వేంకటరాయ శాస్త్రి గారు కావించినట్టిది.

నటి. - అదే?

సూత్ర. - అదే.

నటి. - బలే ! బలారే ! అది మనపాలిటి కల్పవృక్షము గదా ! మఱి నే నరిగి పాత్ర వర్గమును సిద్ధపఱిచెదను. [అని పోనుంకించును.

సూత్ర. - పోకుము. ఈయార్యమిశ్రులు నీశరద్గీతమును వినుటకుంజెవులూరు చుం గనుపెట్టుకొని యున్నారు. నటి. - అటయినఁ బాడెదను.

             వచ్చెఁ జెలియ, యంచ లులియు వాసరంబులే
             చెచ్చెర వికసిల్లు కల్వ శ్రీసరంబులే. వచ్చె ....

సూత్ర. - [స్వగతము] ఆహా ! యేమిపాటరా దీనిది! ఈనాటకమువలన మరల నాకీర్తి పర్వి నావైరివర్గమునకు పెద్దలచేత చెంపకాయ లగును. నిశ్చయము. నిశ్చయము.

[నేపథ్యమున]

[భేరులు మ్రోఁగును, వీరకాహళములు మొరయును]

[వెండియు నేపథ్యమున]

హా ఆలాంటిచెంపపెట్లు మేము దప్ప మరెవ్వరూ యెప్పుడూ తిని వుండరు మహాప్రభో, వీరభద్రుడి చేత దక్షప్రజాపతి సమేతూ తినివుండడు !

[నటి విని ఱిచ్చవడి యరయుచుండును.]

సూత్ర. - [ఱిచ్చవడి] ఏమి యీ విఘ్నము ! [మరల భేరీకాహళములు మెరయును ఆలోచించుట నభినయించి] - వహవ్వా వహవ్వా ! ఎంతమంచి యుపశ్రుతి ! ఆ వాద్యధ్వానములవలె మనకీర్తి వ్యాపించి, ఆమొఱ్ఱవలె మనవైరులకు చెంపపెట్లగు ననుట ! అవునుగాని ఈయడావుడియంతయునేమి ? [నిర్వర్ణించి] ఓహో యిపుడే మహాపరివారముతో విజయనగరాధీశ్వరులు మన్నెసుల్తాన్ బహద్దరు విజయరామరాజుగారు గోలకొండవారి సేనాపతి బుస్సీదొరగారిబేటికి, ఎదుట సానిమేళాలతోఁ గూడతరలి, ఈదారినే వచ్చుచున్నారు. అమొఱ్ఱ ఈగుంపులోనిదే కావలయు. ఈవఱదలో తగుల్కొనక తప్పించుకొనిపోవుదము రమ్ము.

[అని వడివడిగా నిష్క్రమింతురు.]

ప్రస్తావన సమాప్తము.

_____________