బొబ్బిలియుద్ధనాటకము/చతుర్థాంకము

చతుర్థాంకము.

[రాణి పురోహితభార్య వేంకటలక్ష్మి వేగుయువతులును

ప్రవేశింతురు.]

రాణి. - [పురోహితభార్యను నిర్దేశించి] అవ్వగారూ ఈదాసీయువతులను ఇరువురను బయటివృత్తాంతములు తెచ్చుటకై పంపుచున్నాను. [అని వారింగని] ఓధన్యురాండ్రారా మీరు పోయి మీయన్నదమ్ములద్వారాన రాజువిడిదలలోని వృత్తాంతములం దెలిసికొనివచ్చి నివేదింపుఁడు.

వేగుయువతులు. - మమ్మేలిన తల్లిగారి చిత్తము. [అని నిష్క్రమింతురు.

రాణి. - అవ్వా, అరుంఢతీదేవిగారూ. తాతగా రేమయిన మాకు ఈయిడుమ తప్పు నని చెప్పినారా?

పురో-భా. - ఏమిచెప్పుదును తల్లీ, మీపురోహితులవారికి నాతో పలుకుటకు తీఱలేదు. నిరంతరము శాంతిక పౌష్టికములకు జతనములు చేయుటగా నున్నారు.

రాణి. - వారి యాశీర్వచనము లైన ఇపుడు ఫలింపరాదా?

వేగుయువతులు. - [ప్రవేశించి] దండం దండం మమ్మేలిన తల్లిగారికి.

రాణి. - బాలికలారా, ఏదేని చల్లనివార్త తెచ్చితిరా ?

వేగు. - చల్లనివార్త లెక్కడివి ! మాతల్లీ, ఆపాపాత్ముడి హృదయం ఏమిచెప్పుదుము మమ్మేలినదేవీ ?

రాణి. - వివరముగా చెప్పుఁడు.

వేగు. - ఆరాజు తనకూ మన దొరగారికీ వున్నపగలు బొబ్బరిస్తావున్నా డంట బొబ్బిలికోట దున్నించి, పొగాకుతోట వేయిస్తాడంట. ఆ పాటిపొగాకు పుచ్చుకోక తనపగలు తీరవంట. రాయనింగారి శిరస్సు గోసుకొని పోతాడంట. తనయన్న కుమారుడికి ఆనందరాజుకి బొబ్బిలికోట పట్టం కడతా డంట. ఈలాగ గర్జించి ఇంకను పాడుమాటలు పలికినాడంట తల్లీ.

రాణి. - వానిని గూడ వినిపింపుఁడు. ఇప్పుడు మాకాలము అట్టిది.

వేగు. - మఱి రంగారాయనింగారి బంగారపు మంచముపై పరుంటేనేగాని, తన పగలు తీర వని అరుస్తావున్నాడంట. రాణి, పురో. భా. - హరీ ! హరీ !

రాణి. - బాలికలారా మీయనురక్తిని మఱవను. [వేంకటలక్ష్మి బాలికలకు పసద నంబిచ్చును.]

వేగు. - రాయనింగారికి జయంకలిగితే మాకేమితక్కువ.

రాణి. - మంచిది పోయిరండి. [వేగుబాలికలు నిష్క్రమింతురు.] కానీ: ఇందులకు బదులు నేను గోపాలస్వామి సన్నిధిలో పలికెద. అవ్వగారూ, ఇక మాకు స్వామియే దిక్కు గోపాలస్వామిని కడసారి సేవించుకొని మేము సిద్ధముగా నుండెదము. వేంకటలక్ష్మీ, మాబాబును, మాకొమార్తను, తెమ్ము. పెండ్లి కొమార్తలను, దాసీజన సమేతముగా తోడ్కొని వచ్చి, గోపాలస్వామికి పూజచేయించి, మాకు దర్శనమునకు సిద్ధము చేయింపుము.

వేంక. - దేవిగారియాజ్ఞ.

[అని నిష్క్రమించును.

రాణి. - [ఒకదాసిని ఉద్దేశించి] ఓసీ ! కామాక్షీ ! నీవు బ్రాహ్మణవీథి కేగి పేరంటాండ్రను గుడికి తోడ్కొనిరా.

కామాక్షి. - దేవిగారియాజ్ఞ.

[అని నిష్క్రమించును.

[అంతట సుందరమ్మ, చిన వేంకట రాయఁడు

పెండ్లి కొమారితలు, దాసీజనమును ప్రవేశింతురు.]

వేంక. - [వచ్చి] దేవిగారు ఆజ్ఞాపించినట్లు స్వామికి ఆచార్యులచే పూజచేయించితిని. మఱి తమ రందఱు దర్శనము చేయవచ్చును.

రాణి. - రండి, నాబంగారు కొండలారా ; మావంశాంకురము లారా, రండి; [అని కొమారితను కుమారునిం జేర దివిచి.] రండి నన్నుఁగన్న తల్లులారా ! రా రండి గోపాలస్వామికి కడసారి సేవచేసి కొందము.

[అందఱు మల్లమ్మదేవివెంట దేవళములోనికి ప్రవేశ మభినయింతురు.

రాణి. - ఆహా !

          తే. పరమపురుషునింటి పట్టుసొచ్చిన మాత్ర
              నాత్మ యెంత శాంత మయ్యె నహహ !
              జాగిలంబులట్లు చాఁజీల్చితిను వగల్
              కలయుఁబోలె విరిసి తొలగి పోయె. ౫౮

[ఆత్మగతము] అయినను మరల దిగులు మిగులుచున్నది.

[కామాక్షియు పేరఁటాండ్రును ప్రవేశింతురు.]

రాణి. - [పేరఁటాండ్ర నుద్దేశించి] అమ్మారండి: మాకడపటి పూజను కైకొండి. [అని వారికి పసుపు కుంకుమ పువ్వులు ఇచ్చి] ఈనూలిపోగును గైకొండి.

[అని వస్త్రాభరణములిచ్చి మ్రొక్కును.]

పేరఁటాండ్రు. - ఈ మీ యిడుమలో సత్కారము లెట్లు కైకొందుము తల్లీ!

రాణి. - కమలాక్షీ, ఈవస్తువులను, గొనిపోయి వీరియిండ్లలో నప్పగింపుము. [వారింగూర్చి] అమ్మా, మీకు ఉద్దేశించినవి మేము మరల ఎట్లు ఉంచుకొందుము ? అమ్మా, నిరాకరింపకుడు.

రాణి. - పిల్లలారా ? రండి స్వామికిని అమ్మవారికిని మీకోర్కొ చెప్పుకొండి.

బాలికలు. - [ఇట్లు వేఁడుకొందురు.]

               పరమ పురుష, నీదు పాద పద్మముల
                       శరణుఁ జొ చ్చితిమయ్య ; సామీ ! నిన్ను శ....
               కరుణతో మాప్రాణే శ్వరులకై యీ యొక్క
                        గండము తప్పింపు : సామీ ! ఈయొక్కగండము....
               బాలల ము మే మే పాపమె ఱుంగము
                        ప్రాపని నిన్నే నమ్మితిమి; సామి ప్రాపని....
               వ్రాలితి మి నీదు పాద పద్మములందుఁ
                        బాలింపు మని వేఁ డితిమి. సామి పాలింపు...
               ఎల్లలో కముల తల్లిరో లక్ష్మీ, నీ
                        పిల్లల కు దిక్కు గమ్మా; అమ్మానీపిల్లలకు
                ఉల్లము మామీఁదఁ జల్లఁగ జేసి మా
                        వల్లభు లను గావ వమ్మా. అమ్మామావల్లభు...

రాణి. - స్వామిమ్రోలను నామొఱ వెట్టుకొనెద. స్వామీ, మాదొరల పాలిటికి ఈయొక్కగండము నైనకావలేవా ? ఈమాఱు రాయనింగారి కోట విడిచి కొండలోనికి వలస వెళ్లితివా ? ఎక్కడికి స్వారి వెళ్లితివయ్యా గోపాలస్వామీ.

           ఉ. భావజుతాత; మాదొరల పాలిటి వాఁడవ ; వారి నిత్తఱిన్
               గావుము దేవ; మాకు నలికంబునఁ గుంకుమ నిల్పు మాధవా.

              ఈవిలయంబుఁ ద్రోచెదవ యేని యొసం గెద నీకు హైమముల్
              సీవిరు లాతపత్రములు సింగపుద్వారము తార్క్ష్యయానమున్. ౬౦

మామీదనే పగలు పట్టితివా గోపాలస్వామీ ? మాదొరలు పోయిన శుక్రవారపు టారగింపు నీకు ఎవ్వరు చేయుదురు స్వామీ ?

[స్వామి మెడలోని పూదండలు ధరణిం బడును. కిరీటము గిఱ్ఱునఁ దిరుగును.]

రాణి. - ఆహా అవశకునము ! [అని ఇట్లు పాడును.]

అవశకు నంబులే చూపెను !

అక్కటకటా ! అవ

రాణి. - బాలికలారా, అమ్మవారికి మొఱపెట్టుకొందము. అమ్మా ! తల్లీ ! ఈపెండ్లికొమారితల కంకణాలు స్వర్గములో విప్పింతువా?

బాలికలు. - [ఇట్లు పాడుదురు.]

నమ్మిన మముఁ గావవమ్మా !

అమ్మా తల్లీ, - నమ్మి

రాణి. - హా ! అమ్మవా రేమియు సూచన చేయదాయెను. కానీ, స్వామి యొకటియు, అమ్మవారొకటియు అనుగ్రహింతురా ? మఱి, యిఁక గుడి వెలువడుదుము. [అని పరిక్రమించి] ఇదిగో, వీథిమన్ను [అని మన్నెత్తుట నభినయించి] ఓ దేవతలారా ! నా పూర్వజన్మపు గొఱనోములచేత నిపుడు నాపై కరుణింపరేని, ఓ గోపాలస్వామీ, ఓ మహాలక్ష్మీ, [ఊర్ధ్వ మవలోకించి] ఓ సూర్యనారాయణమూర్తీ, ఓదిక్పాలురారా, నేనే వీరపతివ్రతనేని, మీకు నేను ఈపుట్టువున త్రికరణశుద్ధిగా సేవలుచేసి యుంటినేనియు, ఇది యైన నగుఁగాక: - నా యార్యపుత్త్రునికే, ఈ విజయరామునివలన మరణమగు నేని, ఆమూఁడవనాఁడే వీనిగతియు [అని మన్ను తూర్పారం బట్టుచు] ఇట్లు అగుఁగాక. ఈ పాపాత్ముఁడు నాయార్యపుత్త్రుని పసిండి మంచముపై పరుండనయేని దానిమీఁదనే వీనికి చిత్రవధ యగుగాఁక. [పెండ్లికొమారితల నుద్దేశించి] మఱి, మనము పైయాలోచన చేసికొందము. [ఒక దాసిని] ఓసీ కమలాక్షీ, నీవు పోయి సరాబును మే మడిగితి మని చెప్పి. [ఉంగరము దీసి యిచ్చి] యీగుర్తు చూపించి వేయి వరహాలు తెమ్ము.

దాసి. - దేవిగారియాజ్ఞ.

[అని నిష్క్రమించును.]

రాణి. - వేంకటలక్ష్మీ ; ఈ స్వామియెదుట, ఈ యమ్మవారియెదుట ఈనారాయణమూర్తియెదుట, నిన్ను మావంశమును నిలువఁబెట్టునట్లు వేడుకొనుచున్నాను. మాకుఁ గల 33 దాసీజనములలోను నిన్ను పెద్దదాసిగా గణనచేయు చుంటిమి. నీవు మాసంస్థానమును నిలుపఁగదే వేంకటలక్ష్మీ. సామర్లకోటలో మాచెల్లెలు జగ్గమ్మకడకు వేంకటరాయని నీవు కొనిపొమ్ము. మేము బలిమిచావులు చత్తుమని మాచెల్లెలితో చెప్పకువే వేంకటలక్ష్మీ.

వేంకట. - అమ్మా ! మీరు చావను మేము బ్రతుకనా?

[అని కన్నీరు నించును.]

రాణి. - [అశ్రులు దుడుచుకొని] కాదే ; మావేంకటరాయఁడు బ్రతికిన, మేము బ్రతికినట్లే గదే ; వేంకటరాయని పెద్దవాఁ డగుదాఁక, నీవు పోషింపుము. ఆ తర్వాత, మానాయనయే నిన్ను పోషించును. మాకుమారుఁ డని తెలిసినచో, మానాయనను పగవాండ్రు బ్రతుకనీయరే. అడ్డగించువారితో బాపనవారి యచ్చమ్మకొడు కని చెప్పవే. ఓసి మా బాబయ్యకు మొలకు నులకత్రాడు తెచ్చి మొలత్రాఁడు గట్టుఁడు.

[ఒక దాసి పోయి త్రాఁడు తెచ్చి కట్టును.]

రాణి. - ఆరత్నాలమొలత్రాఁడు తీసివేయుఁడు.

[తీసి వేయుదురు.]

రాణి. - ఆభరణముల నెల్ల నూడ్చివేయుఁడు.

[అట్లే చేయుదురు.]

రాణి. - [బాలు నెత్తుకొని] అయ్యో ! నాయనా !

          క. దారులు గొట్టుకిరాతులు
              ఘోరాటవిలోన నధ్వగుల కిడునిడుమల్
              క్రూరను దల్లిని జోరిని
              గారాబుఁగుమార నీకుఁ గావించితిరా ! ౬౩

[అని యేడ్చి] ఓసీ ; మానాయనకు విభూతితెండు.

[ఒక దాసి పోయి తెచ్చును.]

అవ్వ. - ఇటు తెమ్ము.

[అని కైకొని తాను పూయును.

రాణి. - నాయనా, తండ్రికంటె యోగశాలి వని పెదలు చెప్పిరిగాని, యిట్లు పకీర నౌదు వని యెవ్వరును చెప్పరైరి నాకొండా ! [అని అశ్రువులు తుడుచుకొని] ఓసీ; మానాయనకు ఒక జందెము తెండు.

[ఒకతె దారము తెచ్చును. అవ్వ దానిని జందెమువలె చేసి బాలునికి వైచును.]

రాణి. - [పుత్త్రుని నిర్వర్ణీంచి] నాయనా !

          క. ఏ పేద తల్లి కడుపున
              నో పుట్టితివేని హాయి నుందువు తనయా !
              యీ పాడు మల్లి కడుపున
              నే పట్టీ, పుట్టి యిట్టి యిడుమఁ బడితివే ! ౬౪

వేంకటలక్ష్మీ; 'వడుగైనదా ?' అని యెవరైన నడిగిన, 'కాలేదు, అయిన కుఱ్ఱవాండ్రను చూచి యేడ్చి తానును జందెము వేయించుకొన్నాఁడు.' అని చెప్పవే.

కమలాక్షి. - [ప్రవేశించి] దేవీ, ఇవుగో 1000 వరహాలు, ఇదుగో తమ యుంగరము.

రాణి. - వేంకటలక్ష్మీ, ఒడిపట్టు. [కమలాక్షి నుద్దేశించి] ఓసీ, ఆవరహాలు ఆ యొడిలో పోయుము. [అట్లే చేయుదురు. వేంకటలక్ష్మి గట్టిగా కట్టుకొనును.]

రాణి. - ఈపదార్థమున కాశింపకే వేంకటలక్ష్మీ. కోట తరలఁగానే సోలుజర్లు, సిపాయీలు, రౌతులు, చుట్టువేసికొందురు. వారికి నీయొడిలోని పదార్థము నంతయు వెదచల్లుము. దానిని వారు ఏఱుకొను సందడిలో నీవు తప్పించుకొనిపోవే; [అని శిశువును ముద్దాడును. శిశువు కన్నీళ్లు విడుచును. తల్లి మరల కన్నీళ్లు ఇడుకొని, బుడుతని కన్నీళ్లు దుడుచుచు తనకన్నీళ్లను తుడుచుకొని] అయ్యో ! అయ్యో ! నీవును ఏడ్చుచున్నావా ! నాయనా ! నిన్ను నేనెట్లు ఎడఁబాయుదును నా కూనా ! [అని బాలుని కన్నీళ్లను ముద్దులతో తొలఁగించి] వేంకటలక్ష్మీ, వీఁడుగో నీబిడ్డఁడు; మాబిడ్డఁడు గాఁడు [అని వేంకటలక్ష్మి చేతికి వేంకటరాయని ఇచ్చి కన్నీళ్లతో] వేంకటలక్ష్మీ, ఈదిడ్డివాకిటినుండి వెలువడుము.

వేంకట. - ఇదే దేవిగారికి నాకడసారి దండము. [అని శిశువును దింపి, రాణికి మ్రొక్కి లేచి కైజారు ఒడిలో సముదాయించుకొని, కన్నీ ళ్లుబుకఁగా అడఁచుకొని] తల్లీ !

          ఉ. వేవురు సోలుజారు లరివీరులు వచ్చిన, నీకటారితోఁ
              జావఁగఁ గ్రుమ్ముదాన, నెడసందునఁ బట్టిని బట్ట నీను; దాఁ
              గేవల మింద్రజాల మనఁ గీడ్వడనీయక కాతు నాదొరన్
              జీవము మాకు నిల్పఁగ వశీకృతమాయుని సంస్మరించెదన్. ౬౫

[ఆకాశము చూచుచు] స్వామీ ! నారాయణమూర్తీ, ఈనాయనను జగ్గమ్మకు ఎట్లు చేర్పించెదవో ! [రాణి నుద్దేశించి] నాతల్లీ,

          ఉ. రావులవారు నేర్పిన పరప్రతిఘాతనవిద్య లెల్ల బా
              గౌ వినియుక్తి గొల్పెద ; నపాయము లేని యుపాయ యుక్తిమై
              నేవగ నైనఁ జేరిచెద నీకొడుకున్ బినతల్లిసందిటన్,
              భావజ బాలభావ పరిభావుక రూప మహ: ప్రభావునిన్. ౬౬

[అని శిశువును ఎత్తుకొన్నదై నేపథ్యద్వారము వఱకు రాణి లోనగువారు కూడవచ్చి చూచుచుండఁగా నిష్క్రమించును.

రాణి. - [మోమున చేలాంచల ముంచుకొని యేడ్చి] మానాయనకు నాకును ఈవిధమున ఋణము తీఱిపోయినది.]

[అందఱు ఏడ్తురు.

పురో. భా. - అమ్మా ! ఏడువకు. నీబిడ్డఁడు నీచెల్లెలికడ క్షేమముగా వర్థిల్లును. ఏడువకు మాతల్లి, ఏడువకు.

రాణి. - [మఱియు మఱియు ఏడ్చి కనులు తుడుచుకొనుచు] అవ్వా ! తమకును మాకును గూడ నిటనే యిట్లు ఋణము తీఱినదా ?

పురో. భా. - కాల మట్లు వచ్చినది నాతల్లీ ! అయినను ఇప్పు డైనను పరమేశ్వరుఁడు మనలను గావరాదా?

రాణి. అవ్వా, ఎప్పటికైనను, మన మెడబాయవలసినదే గదా ? తమరు ఈపేరఁటాండ్రతో వెళ్లవచ్చును.

పురో. భా. - ఔను మాతల్లీ.

[అని దు:ఖదు:ఖముగా ఆవిప్రపురంధ్రులతోడ నిష్క్రమించును. కామాక్షి దత్తములం గొని వెంట నేఁగును.

రాణి. - బాలికలారా, వీరపత్నులకు మనకు ఈ దీనత్వము తగదు. మనము మన ప్రాణేశ్వరులు పోవుతావునకు వారికన్న ముందే పోయి అచట వారికి స్వాగతము చెప్పవలసినవారము. అందులకు సిద్ధపపడుదుము రండు.

[అందఱు నిష్క్రమింతురు.


___________