బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/రెండవ ప్రకరణము

రెండవ ప్రకరణము

బోస్టను పట్టణము - శుశ్రూష

రెండుసంవత్సరములవఱకు బెంజమిను తండ్రికి సహాయము జేయుచు వచ్చెను. తన జ్యేష్ఠభ్రాత జాను ఫ్రాంక్లిను, చిన్ననాటనుండి తండ్రికి పనిలో సహకారియై యుండి, రెండవసంవత్స రాంతమున వివాహమాడి, 'రోడు' దీవికి కాపురమువెళ్లి, సబ్బు, కొవ్వు వత్తులు, తయారు చేయుచుండెను. ఈకారణముచేత, బెంజమినుసహాయము తండ్రికి ముఖ్యావశ్యకమై, తన కిష్టము లేని పనినుండి తప్పించుకొనుటకు మార్గము లేవియు బెంజమినుకు గానరాకుండెను. ఈ సూచనలవల్ల చాల దు:ఖాక్రాంతుడై, యసంతుష్టి జెందినందున, నతడు సముద్రయానము జేయుటకు బ్రయత్నించు నేమోయని భయపడి, యతనికి మనస్కరించిన వ్యాపారమునందు నియోగించుటకు తండ్రి యుద్యుక్తు డాయెను. వడ్రంగులు, తరిమెన పెట్టువారు, కంచరివాండ్రు - వీరియంగళ్లకు తండ్రి కుమారుని గ్రమముగ దీసికొనివెళ్లి, యేవ్యాపారమునం దితనికి మొగ్గుకలదో, దానియం దతనిని బ్రవేశపెట్టి, యోడప్రయాణమును మానిపింపవలెనని తండ్రి యాలోచించెను. లండను పట్టణమం దచ్చుకొట్టుటను నేర్చుకొనిన బెంజమినుయొక్క జ్యేష్ఠభ్రాత, జేమ్సు ఫ్రాంక్లిను, బోస్టను పట్టణమునకు వచ్చి స్వంతముగ ముద్రాక్షరశాలను బెట్టెను. ఒకసంవత్సరమునకు పైగా నితని కచ్చుపనిలేక యుండెను. వర్తకులకు చిన్న పుస్తకముల నచ్చువేసి యిచ్చుటయు, స్త్రీల కుపయోగమైన పట్టు, నార, చీట్లమీద ముద్రించుట, మొదలుగాగల పనుల జేయుచు వచ్చెను.

తండ్రి కుమారులు కార్ఖానాలను గ్రమముగ దిరిగి చూచినపుడు, ముద్రకుని వ్యాపార మంతగ వీరికి వచ్చినట్టు కనబడదు. ఎందుచేత నన, ఈ వ్యాపారము జేయుచున్న జేమ్సు కంతగా లాభము లేనందున, కుటుంబములో నిదివఱకే యొక డావ్యాపారము జేయుటయే, చాలు నని తండ్రి యెంచెను.

జేమ్సు ఫ్రాంక్లిను వ్యాపార మారంభముచేసిన రెండవ సంవత్సరమున, బెంజమినుకు గ్రంధపారాయణయందుండు అపరిమితాభిలాషను తల్లిదండ్రులుచూచి, చాల యాలోచనపైని, ముద్రకుని వ్యాపారమును నేర్చుకొనుటకై, జేమ్సుకు శుశ్రూష చేయునట్టులు బెంజమినును నిర్ణయించిరి. ఓడప్రయాణాభిలాష మనోగతమైనందున, నీ గురుకుల వాసమునకు బెంజమిను మొదట శంక జేసెనుగాని, తుదకు సమ్మతించి, దీని పూర్వోత్తర మంతయు తన చరిత్రలో వ్రాసికొనెను. "నేను 12 సంవత్సరముల ప్రాయము వాడను. నాకు 21 సంవత్సరము వచ్చువఱకు నేను శుశ్రూష చేసి, యాఖరు సంవత్సరమున కూలివాని వేతనములను బుచ్చుకొనవలయునట. కొద్ది కాలములోబనిని బాగుగ నేర్చుకొని, నాయన్న కెంతో సహకారిగ నున్నాను" అని స్వీయచరిత్రలో బెంజమిను వ్రాసెను.

ఇతను శుశ్రూష చేయుకాలములో, నిప్పటివలె, బోస్టను పట్టణము పుస్తకములకు, విద్యకుస్థాన మని ప్రసిద్ధి కెక్కినది. బెంజమిను పుట్టుట కిరువదిసంవత్సరములు పూర్వము, పుస్తకములమ్మువారయిదుగురుమాత్ర మీపట్టణమునందుండిరి. ఈనాటికి పదిమంది పోగయిరి. కావలసిన పుస్తకముల నింగ్లాండునుండి తెప్పించి, నిలవచేయుటయేకాక, మతోపన్యాసములు, వివాద గ్రంథములు, పంచాంగములు, నారుపాటలు, (Ballads) చిన్న పుస్తకములు మొదలగువానిని ముద్రింపించి ప్రచురించుచుండిరి. వీరికి దైవిక గ్రంధములే మూలాధార మయినవి. అయినను మాతృ దేశమందు బుధులు పరనచేసెడు ముద్రిత నూతన గ్రంధములన్నియు, నూతనసీమలకు (Colomes) దేబడి, యక్కడి పట్టణము లందలిసాహిత్య విద్యానైపుణులచే ధారాళముగ జదువబడుచుండెను.

పుస్తకములు గొనుట కశక్తుడైనందున, పుస్తకములమ్మువారివద్ద పనిచేయువాని సహవాసమూలముగ వానిని సంపాదించి బెంజమిను చదువుచుండెను. యజమానుడు పుస్తకము లేకపోవుట వలన గోపగించు నేమోయను భయముగలిగి, సాయంత్ర మరువుగ దెచ్చిన పుస్తకమును మరుచటి యుదయమున నిచ్చి వేయవలసిన ధర్మము గనుక, రాత్రి చాలభాగము మేలుకొని దాని కితడు చదువుచుండెను. "కొంతకాలము గడచిన పిదప, వివేకియు, సూక్ష్మబుద్ధిగల యొక 'మాత్యూ ఆదామ్సు' పేరుగల వర్తకు డొకడు పుస్తక భాండాగారముగలవాడై, మా ముద్రాక్షరశాలకు తఱచుగ రాకపోకలు కలిగి, నన్ను తన భాండాగారమును జూచుటకు రమ్మను మని వేడి, చదువుటకు నేనుగోరిన పుస్తకములను బదులిచ్చుటకు సంతసించెను" అని ఫ్రాంక్లిను వ్రాసెను.

నవీన సుహృదులు తన కప్పుడప్పు డిచ్చు చున్న కావ్యములు చదువుటచే తన పినతండ్రి బెంజమినునుబోలె, యతడుకూడ కవనము జెప్పుట యం నభిరుచికలవాడై, యంత్య నియమములతో గూడిన చరణము లనేకములుగ జెప్పెను. ఈ రచనా శక్తిని సార్థకముగ వినియోగింపవలె నని, నితనియన్న, జేమ్సున కాలోచనపుట్టెను. ఆ కాలమునందు వీధులలో నారుపాటలు పాడుట వాడుకయై యుండెను. సముద్రపు దొంగల సాహస కృత్యములు, సంఘాతకుల నురిదీయ కధలు, దారికొట్టు దొం గల పరాక్రమములు, భయావహమైన యోడల విధ్వంసనములు, ఘోరమైన పాపములు, తదితర తత్కాల సంప్రాప్తానుభవాధిక్య విషయములు, నివి, యన్నియు శోకరసాశ్లిష్ట ఛందోనిబద్ధ కావ్య స్వరూపాలంకృతంబులై, గ్రామపుర సీమలయందమ్మబడుచు వచ్చినవి. అన్నగారి ప్రోత్సాహమున, బెంజమిను సర్వజన సమ్మోదసఫలైకరచనాయత్త చిత్తుండయ్యెను.

తన కవనము రసవిహీన మైనదని బెంజమి నొప్పుకొనెను. ఇతనియన్న లక్షణ విరుద్ధము లయిన కావ్యములను ముద్రిపించి, చెల్లుబడికై పైగ్రామములకు బంపుచువచ్చెను. అయినను, కుమారుని సద్బుద్ధినిరక్షింపవలయునని. అతని రచనా లోపములను జూపించి, యిట్టి లక్షణ విరుద్ధకవులు దరిద్రులగుదు రని చెప్పి, యీక వనరచనయం దెన్నటికిని యాధిక్యతను బొందుట కష్టమని బెంజమినుకు జూపించి, దాని నతడు విడుచునటుల తండ్రిచేసెను. తండ్రిగారి విమర్శనల మూలముగ, బెంజమిను శృంగారరచన గద్యశైలిని వ్రాయుటకుద్యుక్తు డాయెను.

వాదప్రియుడు, మాటకారియు, గ్రంధపఠనలోలుడైన 'జానుకాలిన్సు' అను నత డీతని కీసమయమున సహకారియై యుండెను. పితృ సంబంధ వివాద వైదిక గ్రంధపఠన మూలమున, ఫ్రాంక్లినుకూడ వివాదోద్ధిత చిత్తుడైనను, తుదకీ దుర్గుణాతీతు డయ్యెను. శాస్త్రాభ్యాసము స్త్రీల కెంతవఱకు సార్థకమో యనెడి వాదము స్నేహితు లిరువురికి జరిగెను. శాస్త్రజ్ఞానము స్త్రీలకు గలుగదని కాలిన్సు, గలుగునని ఫ్రాంక్లిను, వాదించిరి. మంచివాగ్ధోరణి లేనివాడుగాన, వాదములో స్నేహితుడు చెప్పిన హేతువులకంటె, నతనివాక్ప్రవాహమే తనను నోరు మూసికొనునటుల చేయుచున్నదని బెంజమి నభిప్రాయపడెను. ఇదమిద్దమని నిర్ణయింపకయే, స్నేహితులకు వియోగము కలిగెను. కొంతకాలమువఱకు వీరు కలిసికొనుటకు వీలు లేక పోయినందున, తన వాదములయొక్క సారాంశములను వ్రాసి బెంజమిను కాలిన్సుకు పంప, నతను వానిని జదివి బ్రత్యుత్తర మిచ్చెను. ఈ యుత్తరప్రత్యుత్తరము లొకనాడు తండ్రిచూచి, వాదాంశము నెత్తక, ప్రతివాదియొక్క నిర్దుష్టశైలిని స్తుతించెను. వర్ణక్రమమందు. వాక్య విరామస్థాన నిబంధనయందు, బెంజమిను నిర్దోషియని చెప్పి, స్పష్టత, సొంపు - యీ రెండును ప్రతివాది శైలిలో గనబడుచున్నవని నిదర్శన వాక్యములను తండ్రి సూపించెను. తండ్రి చేసిన యాక్షేపణ న్యాయమనితోచి, నాడు మొదలు బెంజమిను తనశైలిని జక్క బెట్టుట కుద్యుక్తుడాయెను.

నానావిధ గ్రంధపఠనమునకు, శుశ్రూష చేయుచున్న బెంజమినుకు కాలమెటుల సమకూరెను? సాయంసమయముల విరామ ముండె కాబోలును. ఇది లేకపోయిన, దీపములు పెట్టిన తరువాత విశ్రాంతికాలముండెను. ఇతను మాంసభక్షణమాని, శాక భక్షకుడై, తనకు వంటచేయువారి కెంతయు గష్టము గలుగ జేయుచు వచ్చెను. భోజనమునకై యిచ్చుచున్న ద్రవ్యములో సగమే సరిపోవునని బెంజమిను చెప్పినందున, అన్నగా రెంతయు సంతసించి సగమే యిచ్చుచు వచ్చిరి. అతను (బెంజమిను) శాక భక్షకుడైనందున, నీ సగము సొమ్ములో సగము భోజనపదార్థములకు వినియోగించి, మిగిలిన సొమ్ముతో పుస్తకములను కొనుచు, ముద్రాక్షరశాలయందు భోజనము చేసి, విరామ కాలములో వానిని జదువుచు వచ్చెను. ప్రాత:కాలమున వేగముగ లేచి, పనియారంభముకు ముందొక గంటవఱ కతడు చదువుచుండెడి వాడు.



________________