బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/నాల్గవ ప్రకరణము

నాల్గవ ప్రకరణము

లండనుకు ప్రయాణము

ఉదయమున లేచి, వస్త్రములను ధరించి, యోగ్యతాపత్రికను బట్టుకొని, ముద్రాక్షరశాలాధికారియైన, 'బ్రాడుఫర్డు'ను జూచుటకు బెంజమిను వెళ్లెను. అత డితనిని మర్యాదచేసి, మాటలాడి, భోజనము చేయు మని నిరోధించెను. తదనంతర మతడు, తనశాలలో బనిజేయువా డప్పటి కనావశ్యకమని జెప్పి, 'కీమరు' అను నతడు నూతనముగ ముద్రాక్షరశాలను స్థాపించినందున, నతనికి బనివాండ్రు గావలసియుండు నని నుడివి, యతడు గూడ జరుగురు లేదనిన పక్షమున, తాను బెంజమినుకు బసయిచ్చి, చిన్న చిన్న పనులలో నప్పుడప్పుడు నియోగించుట కిష్టపడెను.

కాలాతీతము కానీయక, వెంటనే కీమరును జూచుటకు బెంజమిను వెళ్లెను. ప్రాతగిలి శిధిలమైన అచ్చుయంత్రమువద్ద, నరిగిపోయిన యక్షరపూసలతో బనిని జేయుచున్న 'కీమరు'ను కచ్చేరిగదిలో బెంజమిను దర్శించెను. వచ్చిన వానినిజూచి, కీమరు కొన్ని ప్రశ్నలువేసి, బెంజమినుయొక్క పని నేర్పును పరిశోధించి, తనకు జరుగురు లేదని చెప్పి యతనిని బంపివేసెను. బెంజమిను చాలదినములవఱకు బ్రాడుఫర్డు గృహములో బసచేసి, కొంచెము కొంచెము పనిజేయుచు వచ్చెను. తుదకు బెంజమినుకు కీమరు కబురుపంపి పిలిపించి, పనిలో నియోగించెను. నూతనముగ ముద్రించుట కుపయుక్తములగు సామగ్రులను దెప్పించినందున, చిన్న పుస్తకములను ముద్రింపించి, కీమరు వానిని బ్రచురించుచుండెను. తనకు ప్రతికక్షలో జేరిన 'బ్రాడుఫర్డు' గృహములో బెంజమిను బసచేయుటకు సమ్మతింపక, కీమ రితనిని రీడుధొరగారింటికి తీసికొనిపోయి, యక్కడ బసయేర్పాటు చేసెను. ఆ నాడాది వారమున నితను రొట్టెను దినుచు వీధి వెంబడిని బోవుచుండ, గుమ్మములో నిలబడి, బెంజమినుయొక్క వికారవైఖరినిజూచి యాశ్చర్యమును బొందిన 'కన్యకరీడు' యొక్క తండ్రియే యీరీడు ధొరగారు.

దినదిన ప్రవర్థమానముగ, మంచి వేతనములను బెంజమిను సంపాదించుచు, తగుపాటి స్నేహితులతో సాయం సమయముల గ్రీడించుచు, తనయన్న గారి నిరంకుశాధికారముచే బోస్టను పట్టణమం దసహ్యము కలవాడై, తన పూర్వపు స్నేహితుడు, జానుకాలిన్సుతో దప్ప, తదితరులతో నుత్తర బ్రత్యుత్తరములు లేక యుండెను.

కొంతకాలమునకు స్వగృహమునుండి క్షేమవార్త వచ్చెను. బెంజమిను చెల్లెలు, బోస్టను డెల వేరు పట్టణముల మధ్యస్థముగ తిరుగు సామాను పడవనాయకుడైన, 'రాబర్టు హోమ్సు'ను వివాహ మాడినటులు దెలిసెను. ఫిలడల్‌ఫియాకు 40 మైళ్లు క్రిందుగనుండు పట్టణములో గాపురము జేయుటచే, పరారియైన బావమఱది ఫిలడల్‌ఫియాలోనున్న సంగతిదెలిసి, బెంజమినుకు హోమ్సు జాబువ్రాసెను. అందులో తలిదండ్రు లితని విషయమై దు:ఖాక్రాంతులై యుండిరనియు, నితనిని వారి యొద్దకు వెళ్లుమనియు, వెళ్లి వారిని సంతోషపఱచుట ఇతనికి శ్రేయోదాయకమనియు వ్రాయబడియుండెను. బోస్టను పట్టణమును విడుచుటకు గారణము విరివిగవ్రాసి, తాను ఫిలడల్‌ఫియాలో నుండుటకు నిశ్చయించినట్లు, బెంజమిను తన బావమఱదికి దెలియజేసెను.

ఈ యుత్తరము బెంజమినుకు లాభకర మాయెను. దీనిని హోమ్సు చదువుచున్న సమయమున, 'పెన్సిలువానియా' 'పరగణాగవర్నరు 'సర్‌విల్డియంకీతు', తన వద్దనుండినందున, బావమఱదివ్రాసిన నిర్దుష్టశైలిగల లేఖను గవర్నరుకు జూపించెను. వీరిరువు రా లేఖను జూచి సంతోషించి, యామాదిరి నితరులు వ్రాయ లేరనియు, 'బ్రాడుఫర్డు' డజ్ఞానావృతుడనియు, కీమరు మూడుడు దొంగయనియు, తమలో దాము బలుకుకొనిరి. బెంజమినును ప్రోత్సాహము జేయవలెనని యెంచి, ఫిలడల్‌ఫియాలో నతనిచేస్వంతముగ ముద్రాక్షరశాలను స్థాపింప జేయు టకు దగిన సన్నాహముజేయ వారిరువురు యత్నించిరి. ఇందుచే, హోమ్సు బావమఱదికి వెంటనే ప్రత్యుత్తరము వ్రాయ లేక పోయెను. కొన్ని మాసములు గడిచినపిదప, బావ మఱుదు లిరువురును గలిసికొనిరి.

ఒక రోజున, బెంజమిను యజమానితో గలిసి శాలలో బనిచేయుచున్న సమయమున, నిద్దరు పెద్దమనుష్యులు అచ్చాఫీసులోనికిరాగా, వచ్చిన వారిలో నొకడు గవర్నరుకీతు, రెండవవాడు 'కర్నలుఫ్రెంచి' గా, వీరిరుగురిని తెలిసికొని, తన నిమిత్తము వచ్చినవారని గ్రహించుకొని, మేడదిగివచ్చి, వారిని కీమరు మర్యాదచేసెను. కొంతవఱకు కూర్చొని, గవర్నరు ఎవరు ఫ్రాంక్లినో కీమరువలన తెలిసికొని, బెంజమినుతో మర్యాదగ మాటలాడి, యతనిని స్తోత్రముచేసెను. అంత కాలమువఱకు తనను బెంజమిను చూడనందుకు నిష్ఠురమాడి, యొక విరామస్థలమున కతనిని రమ్మనుమని చెప్పి, కర్నలు ఫ్రెంచితో గవర్నరులేచి వెళ్లెను. ఫ్రాంక్లిను, కీమరు, లుభయు లాశ్చర్య మగ్నులయిరి. కోరిన ప్రకారము వారిని దర్శించుటకు బెంజమిను వెళ్లెను. వా రితనితో కొంతవఱకు మాటలాడి, తుద కితని నేవ్యాపారమునందు నియోగించుట యని యోచించిరి. తండ్రి సహాయముచే బెంజమిను స్వంతముగ నొక ముద్రాక్షరశాలను స్థాపించుట, గవర్నరందులకు దగిన సహాయము జేయుట, గవర్నరు వ్రాసియిచ్చిన శిఫారసు ఉత్తరమును బట్టుకొని తండ్రియొద్దకు బెంజమిను వెళ్లుటయు మొదలగు సంగతులను వీరుమాటలాడిరి. ఈ సంగతులను రెండవవానికి తెలియనీయక, యధాప్రకారము కీమరు యొద్దనే బెంజమిను పని జేయుచు, సాధ్యమయినంత వేగముగ బోస్టనుపట్టణమునకు వెళ్లవలసినదని వీరు నిర్ణయించిరి. అప్పుడప్పుడు గవర్నరు తన గృహమునకు బెంజమినును భోజనమునకు బిలుచుచుండెను.

1724 సంవత్సరము యేప్రిల్ నెలాఖరున నొక పడవవచ్చినందున, బెంజమిను దానిమీద బయలుదేరి వెళ్లెను. తల్లిదండ్రులను జూచివచ్చెద నని నలుగురితో జెప్పెను. రెండు వారములు తుపానులో ప్రయాణముచేసి, బోస్టను పట్టణము చేరెను. అన్నయైన జేమ్సుకు తప్ప, మిగిలిన వారికి సంతోషము కలుగునట్టులు బెంజమిను స్వగృహము జొచ్చెను.

పెన్సిలువానియా పరగణాలోని విశేషములను బెంజమిను వలనవిని, ఇతని పూర్వపు స్నేహితుడు కాలిన్సు తపాలాఫీసులోని పనిని విడిచిపెట్టి, వెంటనే తన సామానును పడవలో వేయించి, నాటున వాడు బయలుదేరి వెళ్లెను.

శిఫారసుత్తరమును జదివి, యేమియు జెప్పక, తండ్రి యూఱకుండెను. ఇంతలో, హోమ్సువచ్చి, గవర్న రునుగుఱించి తెలిసిన సంగతులను మామగారితో జెప్పెను. 18 సంవత్సరములు వయస్సుగలిగి, యుక్తాయుక్త విచక్షణ తెలియని బెంజమినును స్వతంత్రముగ వ్యాపారమునందు ప్రవేశ పెట్టింపుమని వ్రాసినందుకు, గవర్నరంత తెలివికలవాడుగ కనపడం డని తండ్రి పలికెను. అల్లుడెంత దూరము బావమఱది విషయమై నొక్కి చెప్పినను, జోషయా ఫ్రాంక్లిను చెవి నొగ్గలేదు. కుమారుని యోగ్యతను గవర్నరు శ్లాఘించినందుకు, తండ్రి సంతసించెను. 21 సంవత్సరము వఱకు ఫిలడల్‌ఫియాలో బనిచేసి, కొంతధనమును గూడ బెట్టినపిదప, కొఱత పడినసొమ్మును దా నిచ్చుట కంగీకరించి, తదనంతరము కుమారు డచ్చుయంత్రమును కొని స్వతంత్రముగ జీవింపవచ్చునని, తండ్రి సలహా యిచ్చెను. కుమారుని విషయమై గవర్నరు స్తోత్రముగ వ్రాసినందుకు మన్నించి, వానిసలహా ప్రకారము నడచుట కప్పటి కవకాశము లేదని క్షమాపణ పూర్వకముగ వానికి తండ్రి జాబువ్రాసి పంపెను.

ఈ సమయములో నొక ముచ్చటజరిగెను. ఆముచ్చటను, 60 సంవత్సరముల వయస్సున బెంజమిను, కాటను మేధరుగారి కుమారుని జాబువ్రాసి పంపెను. 1724 సంవత్సర ప్రారంభమున, నేను మీతండ్రిగారి నాఖరుపర్యాయము సూచితిని. ఆ సమయమున నేను పెన్సిలువానియాకు మొదటిమారు వెళ్లి వచ్చితిని. వారునన్ను మర్యాద జేసిరి. వారి పుస్తక భాండాగార ముండిన గదిలో మేము గొంతవఱకు మాటలాడితిమి. నన్నంపకము పెట్టుటకు వారు నాతోవచ్చునపుడు, నేను వారితో మాటలాడుచుంటిని. మాటలసందడిని, దారిలోనున్న దూలమును నేను చూడనందున, వారు 'శిరస్సువంచు, వంచుమని' ప్రక్కనుండి నాతో జెప్పిరిగాని, నాశిరస్సు దూలముదాకి దెబ్బతినువఱకు, నేను వారిమాటను గ్రహింప లేక పోతిని. సమయోచితముగ బుద్ధిని గఱపువారుగాని, 'నీవు బాలుడవు, ఈ ప్రపంచములో శిరస్సువంచుకొని, నీవు తిరిగిన, ననేకములుగ దెబ్బలు తినవ,ని నాతో వారు చెప్పిరి. ఈసలహా నాశిరస్సున నాటినందున, నేను బాగుపడితిని. శిరస్సు లెత్తుకొని, తమకు శృంగ భంగము జరిగి, విపత్తుల ననుభవించువారిని చూచినపుడు, నాజ్ఞప్తికిసలహావచ్చుచుండె'నని బెంజమిను వ్రాసెను.

తలిదండ్రుల దీవనలుపొంది, జ్ఞాపకార్ధమై వారిచ్చినవస్తువులను బట్టుకొని, వారిసెలవుగైకొని, బెంజమిను పడవ నెక్కెను. ఆపడవ 'న్యూపోర్టు' పట్టణమునకు వచ్చెను. అక్కడ బెంజమిను పడవదిగి, తనయన్న 'జాను'ను జూచుటకు వెళ్లెను. అన్నదమ్ములుకలిసికొని, పరస్ప రాహ్లాదముతో గొంతమాటలాడిరి. 6, 7 సంవత్సరములకు బూర్వము వీరిరువురు దండ్రికి బనిలో సహకారులై యుండిరి. ఇట్లు, న్యుపోర్టులో గొంతకాల ముండుటవలన, బెంజమిను ముందుకు నష్టమును బొందవలసి వచ్చెను. పెన్సిలువానియాలో, 6, 7 కాసులు ఋణముక్రింద నియ్యవలసిన వానియొద్ద నాసొమ్మును బుచ్చుకొనవలసిన దని, తన యన్న స్నేహితుడు 'వెర్నను' అనువాడు బెంజమినుకుత్తర మిచ్చెను. తానుదిరిగి వ్రాయువఱకు వసూలుచేసిన సొమ్మును బెంజమినునే జాగ్రత్తచేయుమని వెర్నెను చెప్పెను. ఈ పనిని జేయుటకు బెంజమి నొప్పుకొనెను.

'న్యుపోర్టు' పట్టణము వదిలి 'న్యూయార్కు'కు వచ్చునప్పటికి, బెంజమినుతో గలిసి ఫిలడల్‌ఫియాకు బోవుట కితని స్నేహితుడు, కాలిన్సు ఎదురు చూచుచుండెను. గృహమునుండి వెలువడివచ్చినది మొద లతని నడవడి చెడినదని స్నేహితులవలన వినినందు కెంతయు బెంజమిను విచారించెను. సోమరియై, కాలిన్సుత్రాగుబోతాయెను. ఇతను న్యూయార్కులో జేసిన ఋణములనుదీర్చుటయేగాక, ప్రయాణములోనితని కర్చులకు గావలసిన సొమ్మును బెంజమిను పెట్టెను. ఇందులకు, బెంజమిను ముందుకు విచారింపవలసివచ్చెను. బెంజమిను తలచుకొన నదియు, యతనికి బ్రీతికర మగునదియు నగుసంగతి యొకటి న్యూయార్కు పట్టణములో జరిగెను.

నూతన సీమలలో నుండువారికి పుస్తకాపేక్ష, యన్యోన్యానురాగము నాపాదించునని తలంపవచ్చును. ఆకాలమునందు పుస్తకములు విశేషము వెలగలవి, సర్వజనోపయోగముగల పుస్తకభాండాగారములు లేవు; గృహస్థులు తగుమాత్రము స్వోపయోగమునకు వానిని సంపాదించుటకలదు, మతగ్రంధములను దప్ప, తదితరగ్రంధములను పఠన జేయువారు లేరు. బెంజమిను యొక్క చిన్నతనములో, గ్రంధపారాయణచేయు వాడనినను, యేబదిసంపుటములను సంపాదించిన వాడనినను, అట్టివానిని గౌరవముగ నితరు లెన్నుటకలదు. మొదటినుండి, పాండిత్యమును నూతన సీమలవాసు లెన్నికతో జూచుచుండిరి.

1724 సంవత్సరమున 'విలియంబర్నెటు' అను నతడు న్యూయార్కు పట్టణమున గవర్నరుగనుండెను. 'పనిముందు, తరువాత నాలోచన' జేయువాడీగవర్నరు. నూతన సీమలలోని యధికారులతో జిరుకలహములాడి, గవర్నరు తనమంచి ప్రాయమంతయు బోగొట్టుకొనెను. స్థాపింపబడినపుస్తక భాండాగారములలో మంచి దొకటి గవర్నరుకు గలదు. పుస్తకములనిన, వానిని జదువువారనిన, నితనికి బ్రాణము. బోస్టనునుండి వచ్చు ప్రయాణికులలో నొకడు కొన్ని సంపుటములుగల వాడని నతడు పడవలోనుండెనని, పడవయధికారివలన, గవర్నరు వినెను. అతనిని తనయొద్దకు, తీసికొనిరమ్మను మని పడవయధికారితో గవర్నరు చెప్పెను. "నేను గవర్నరును జూచుటకు వెళ్లితిని. కాలిన్సుత్రాగి తెలివిలేక పడియున్నందున నాతో వానిని తీసి కొని వెళ్లుటకు వీలులేకపోయెను. గవర్నరు నన్ను మర్యాదచేసి, తన పుస్తకములన్నియు నాకు జూపించెను. కొంతవఱకు పుస్తకములు, గ్రంధకర్తలనుగుఱించి మేము ముచ్చటించితిమి. నన్ను గౌరవించి, నాతో మాటలాడిన వారిలో నితడు రెండవ గవర్నరు. ఇట్టిసన్మానము నావంటి దీనుల కెంతమనోల్లాసముగ నుండు?"నని యతడు వ్రాసెను.

బెంజమిను, కాలిన్సు, లిరువురు బయలుదేరి ఫిలడల్‌ఫియాకు పోయిరి. వెర్ననుకు రావలసిన సొమ్మును మార్గములో బెంజమిను వసూలు చేసెను. కాలిన్సు, దురాపరి కర్చుదారుడైనందున, నతని నిమిత్తము కొంతయు తనవిషయమున కొంతయు ఈ ధనములో నుండి బెంజమిను వ్యయపఱుపవలసి వచ్చెను.

ఈకాలమందు, డెలవేరు నదిమీద ప్రయాణము జేయునపుడు జరిగిన విశేషమును, మరి 55 సంవత్సరములయిన పిదప, శాస్త్రజ్ఞుడైన 'ప్రీస్టి'తో బెంజమిను చెప్పెను. దీనిని 'ప్రపంచమునందలి యన్ని యవస్థలు తద్ధర్మానుసారముగ నొడుదుడుకులు గలవి మనుజులు బ్రస్తుతావస్థసంబంధ దు:ఖము లనుభవించుచు తాము కోరు అవస్థలలో నెట్టి శ్రమలుండునో తెలియనేరరు" అను నీతివాక్యమును ముచ్చటించు సందర్భమున చెప్పెను. "డెల వేరు నదిమీద దిగువగ వెల్లుచున్న నొకపడవలో నేను పోవుచుంటిని. గాలిలేనందున పడవను గట్టివేయవలసి వచ్చెను. పడవమీద నెండనిప్పులు కురియుచుండెను. అందులోని వారినెవరిని నేనెఱుగను. పడవలో నుండుటకు గష్టముగ నుండెను. ఒడ్డుననేదో పచ్చికబయలుకలె నొకటి నాకు గనబడెను. దాని మధ్య నొక వృక్షమును జూచితిని. పడవ నడచువఱకు, చెట్టునీడకుపోయి పుస్తకమును జదువుకొనవలె నని కోరి, పడవయధికారి నడిగితిని. వాడు సమ్మతించినందున, నే నొడ్డున చేర్ప బడితిని. ఈ ప్రదేశము చాలభాగము చిత్తడి నేల యగుటవలన, మోకాలుబంటి బురదలో దిగబడి, కష్టముతో జెట్టు చేరితిని. ఇక్కడ నైదునిమిషముల కాలమైన వ్యయము కాకమునుపే, వందలకొలది దోమలువచ్చి, నా కాళ్లు, చేతులు, ముఖమును గఱచి వేసినవి. అక్కడినుండి తిరిగి, యొడ్డునకువచ్చి, తెప్పమీద దాటి, పడవలోనికి బోతిని. ఎండబాధ భరింపవలసివచ్చెను. ఇతరుల పరిహాసమునకు బాలయితిని. సంసారములో దీనింబోలిన విషయము లనేకములు నాకు దృగ్గోచరము లయినవి".

తండ్రి వ్రాసియిచ్చిన యుత్తరమును బెంజమిను గవర్నరు కీతునకు కనపఱచెను. పట్టినపట్టు విడువక, బెంజమినును పనిలో బ్రవేశ పెట్టుటకు గవర్న రుపగమించెను. "నీతండ్రి వివే కముగ నడవలేదు. అతని సలహా బాగులేదు. మనుజులలో జాల వ్యత్యాసముగలదు. ఈడుతో విచక్షణరాదు. యౌవన పురుషులు విచక్షణలేక యుండరు. నిన్ను పనిలో బెట్టుట కతనికిష్టములేదు గనుక నేనట్లు చేసెదను. ఇంగ్లాండునుండి తెప్పింపవలసిన వస్తువులను పట్టీ వ్రాసియిమ్ము. నేను వానిని దెప్పించి నీకిచ్చెదను. నీకు డబ్బుకలిగినపుడు, ఆఋణమును దీర్పవచ్చును. ఈ గ్రామములో దెలివిగల ముద్రకు డొకడుండవలయును. అదితప్పదు. నీవాపనిని బాగుగ నెరవేర్చెదవని నా నమ్మకము" అని గవర్నరు చెప్పెను. ఈ మాటలనువిశ్వసించి, యుత్సహించి, కావలసిన వస్తువులను నూరుకాసులు విలువగునటులు పట్టీవ్రాసి బెంజమి నుగవర్నరు చేతికిచ్చెను. ఈ జాబితాను గవర్నరు పుచ్చుకొని, బెంజమిను స్వయముగ నింగ్లాండు వెళ్లి కావలసిన వస్తువుల నెంచుకొని వానిని కొనుట మంచిదని యతనితో జెప్పెను. "ఇంతియకాదు. ఒక పర్యాయము నీ వక్కడికి వెళ్లిన, నలుగురు ముద్రాక్షర శాలాధికారులతోను, పుస్తకముల దుకాణదారులతోను సహవాసము జేయుటకు నీ కవకాశము గలుగును" అని గవర్నరు చెప్పినమాటను బెంజమినువిని, పరమ సంతోషమును లోలోపున బొంది, వెంటనే సమ్మతించి నందున, "నీ సమ్మతము బాగుగనున్నది. వెంటనే ప్రయాణ మగుము, ఓడకస్తాను 'ఆనిస్సు'తో గలిసి, వెళ్లుమని" గవర్నరు నుడి వెను. ఈయోడ ప్రతి రేవును దాకుచు సంవత్సరమున కొక పర్యాయము, ఫిలడల్‌ఫియానుండి బయలుదేరి లండను పట్టణమునకు బోవుట వాడుకయై యున్నది.

ఓడ బయలుదేరుటకు కొన్ని నెలలు కాలమున్నందున బెంజమిను వెర్రిబాగులవాడైన గవర్నరుకు పనులుచేయుచు, తమయుభయులకు జరిగినమీమాంస యెవరికిని చెప్పక కాలము గడుపు చుండెను. అందుచేత, నీ గవర్నరు డాంబికములు, యప్రామాణికములు, వ్యర్థము లైన మాటలను జెప్పిజనరంజకమును గోరువాడని, బెంజమినుతో జెప్పుట కవకాశ మెవరికిని గలుగలేదు. అతని మాటలను నిండుగ విశ్వసించి, సుఖముగ నాగామిచింతతో ననేక నెలలు గడిపెను. ఓడకు నిరీక్షించుచు, ఏ మాసముల నీ చింతతో గడిపెనో, యామాసము లీయనకు సంతోషాస్పదము లయినవి యని బెంజమినుకు దోచెను. ఆశానుకూలసుహృదై శ్వర్యయౌవనోపేతుడై, స్వమోహాంగీకారమోహినీలాలిత నిర్భర చేతస్కుండై, కాలమును బనులలో నెమ్మదిగ నడిపి, దినములు పండుగలవలె బెంజమిను వెళ్లబుచ్చెను.

ఎంతనెమ్మదిగ గాలమును వెళ్లబుచ్చుట కభిలషించినను, మధ్యమధ్య గొన్ని యవాంతరములు వచ్చుచుండును. జాను కాలీన్సు, సోమరియై, పనిపాటలు చేయక, బెంజమిను బసలో జేరి, వాని డబ్బును బుచ్చుకొనుచు, పనిలో బ్రవేశించి ఋణమును దీర్చెద నని చెప్పుచు, శరీరముపైని స్మారకము పోవునటులు దప్పత్రాగుచుండెను. ఒక నాడు, వీరిరువురును, మరి కొందఱును గలిసి విహారార్థము పడవనెక్కి నదిమీద బ్రయాణమయిరి. వారొండొండపడవను గడపుచుండిరి. అపుడు కాలిన్సు పడవగడపవలసివచ్చెను. అతను పడవను గడప నని మూర్ఖించెను. అందుపైని స్నేహితు లిరువురుగలహించి పోట్లాడినందున, నీత నేర్చినవాడని తెలిసి, బెంజమి నితనిని నీటిలోనికి బడద్రోసి, కడమవారితో బడవను గడపుకొని పోయెను. ఈదుకొని పడవదగ్గిఱకు కాలిన్సు వచ్చినను, పడవనుగడపుట కిష్టపడిన లోనికి రానిచ్చెద మని వీరు చెప్ప, వాడుగడప నని బదులు చెప్పినందున, పడవను దోసికొని దూరముగ వీరు వెళ్లిపోయిరి. కాలిన్సు మండి పడెను. ఈదుటచే బడలినవానిని కరుణించి, పడవలోనికి వారు లాగుకొనిరి. అనంతర మంద రాగట్టు జేరి, స్వగృహములకు వెళ్లిరి. తరువాత స్నేహితు లిరువురు సఖ్యతగ నుండలేదు.

ఎక్కడను న్నను, బెంజమినునుబోలిన సాధువు లితరులను స్నేహము జేసికొనకయుండరు. ఇప్పుడితనికి మువ్వురు స్నేహితులు గలరు; ఇతనివలె, సంసారపక్షముగ నున్నవారు. కొంచెము నడవడిలో భేదమున్నను, గ్రంధావలోకనాసక్తి వీరిని దగ్గఱకు జేర్చెను. ఆస్బోర్ను, రాల్ఫు, బెంజమిను, వీరుమువ్వురు పద్యకావ్యములయం దభిరుచికలవారు. కనుకనే, చాటుపద్యములను వీరు చెప్పుచువచ్చిరి. "ఆదివారములనాడు, విహారార్థ మేటిగట్టునబోవుచు, మేమొకరికొకరు చదువుచు, చదివినదానిని విమర్శించుచుంటిమి" అని బెంజమిను వ్రాసెను.

ఈ కాలములోనె, బెంజమిను కన్యకరీడుల కన్యోన్యానురాగము బలసెను. ఆరోజులలో, కన్యకను తన కనురాగాస్పదుడైన పురుషుని వివాహమాడనీయక, పరునకిచ్చు స్వాతంత్ర్యము తండ్రికి గల దైనను, దీనినంతగ దండ్రులు బాటించు చుండలేదు. బెంజమిను లండనుకు బయలుదేరి వెళ్లుటకు రెండు నెలలుపూర్వమే, జానురీడులో కాంతరగతుడయ్యెను. ముందుకు తాను ముద్రాశాలాధ్యక్షుడు కాగలనని 'గృహిణిరీడు' తో జెప్పి, తన కామెకూతురునందుగల ప్రేమను బెంజమిను సూచించెను. ఆమె, బుద్ధిమంతురాలుగాన, నితనిమాటలను విని, సంబంధమున కొప్పు కొని, వధూవరులు 19 సంవత్సరములు పూర్తిగ నిండ లేనివా రగుటవలనను, ఇతను ప్రయాణోన్ముఖుడై యుండుటవలనను నాసమయము మంచిదికాదని చెప్పెను. అందువలన, లండనుకు వెళ్లి, తిరిగివచ్చి, పని లోనిలుకడను బొందువఱకు బెంజమిను నిరీక్షింపవలసి వచ్చెను. 'తల్లి రీడు'తో నిటులు నిర్ణయించుకొని, బెంజమిను 'కన్యకరీడు' లు మాటలాడునపుడు, తమయన్యోన్యానురాగము లొకరి కొకరు వెల్లడిచేసికొని, బద్ధులయిరి.

ఇంతలో గ్రీష్మము గడచెను. శరదృతువు అంతము గావచ్చెను. లండనుకుబోవు యోడ సిద్ధముగ నుండెను. అది బయలుదేరు రోజు సమీపించెను. ఆశజూపుచు, లండనులో నున్న తన స్నేహితులకు యోగ్యతా పత్రికల నిచ్చెదనని చెప్పుచు, ప్రతిరోజున తనయింటికి రమ్మనుచు, బెంజమినును గవర్నరు త్రిప్పుచుండెను. బయలుదేరు రోజునకూడ యోగ్యతాపత్రికల నియ్యక, 'న్యూకాసిలు' పట్టణపు రేవుకు వచ్చు సరికి పనిమీద తానక్కడికివచ్చి యోగ్యతాపత్రికల నిచ్చెదనని చెప్పి, బెంజమినును గవర్నరు పంపివేసెను. బెంజమిను పడవ నెక్కెను. లంగ రెత్తిరి. ఓడనడవసాగెను. అందులో జేమ్సు రాల్ఫు', బెంజమినుకు ప్రత్యక్షమయ్యెను. భార్యాపుత్రాదుల విడనాడి, కీర్తిసంపదలను బొందుటకు లండనుకు రాల్ఫు పోవుచుండెను.

ఓడ న్యూకాసిలు రేవులో లంగరు దించెను. గవర్నరును దర్శించుటకు బెంజమిను వెళ్లెనుగాని, వానిదర్శనము కాలేదు. అతని కార్యదర్శి వచ్చి, పనితొందరలో నుండుటచే గవర్నరును జూచుటకు బెంజమినుకు వీలుపడ దనియు, ఇతనికి కావలసిన యోగ్యతాపత్రికలను వెనుకనుండి గవర్నరు పంపుననియు జెప్పి నందున చేయుట కేమియు తోచలేదుగాని, మనస్సులోఅపనమ్మకము మాత్రము బెంజమినుకు బుట్టలేదు. బెంజమిను యోడలోనికి వచ్చిచేరెను. అంతలోనే, గవర్నరుపంపిన యుత్తరములను బట్టుకొని, తట్టిమీదికి కర్నలు ఫ్రెంచివచ్చెను. వానిని కప్తానుకు ఫ్రెంచియిచ్చివేసెను. తనయుత్తరముల నియ్యవలసినదని కప్తానును బెంజమి నడుగ, ఇంగ్లాండు వెళ్లులోపున నుత్తరములను సంచిలోనుంచి తీసికొనవచ్చునని కప్తాను చెప్పెను.

నవంబరు 10 తేది నాడు, యోడ సముద్రముమీద బోవుచుండెను. చాల కష్టదినములు యాత్రకు బట్టియుండెను. సంచివిప్పి యుత్తరముల జూడగ, నందులో గొన్నియుత్తరములపైని బెంజమిను విలాసము వ్రాయబడియుండెను. వానిలో నొకటి, రాజుగారి ముద్రాశాలాధ్యక్షునకు, మరియొకటి పుస్తకముల దుకాణదారునకు, చిరినామావ్రాయబడి యుండెను. ఇవి తనవియే యని బెంజమిను తలంచెను.

డిశంబరు 24 తేది నాటికి, లండను పట్టణపు రేవులో నోడ లంగరు వేసెను. ఉత్తరమును పట్టుకొని, వెంటనే బెంజమిను దుకాణదారునియొద్దకు వెళ్లి, గవర్నరు కీతు వ్రాసిప్ంపిన లేఖను, వానిచేతిలో బెట్టెను. గవర్నరు కీతు పేరు వినినతోడనే, "అతనెవరో నేనెఱుగనే" అని దుకాణదారుడు చెప్పి, యుత్తరమును విప్పి చదువుకొని, "ఇది, 'రిడిల్సు'డను అనువాడు వ్రాసిన యుత్తరము. వీడు దుర్మార్గుడని కొద్దిరోజులక్రిందట నేను వినియుంటిని. వీనితో నా కేమిపని? వీని యుత్తరములను జూచుట యేల? అని కోపగించి, యుత్తరము పారవైచి, తనఖాతాదారునికి గావలసిన వస్తువుల నిచ్చుటకు దుకాణదారుడు వెళ్లెను.

మిగిలిన యుత్తరములు గవర్నరు వ్రాయనటులు బెంజమినుకు దోచెను. ఇన్ని రోజులకు గవర్నరుయొక్క సౌజన్యతను సందేహించి, యోడలో బరిచయముగలిగిన "డెనుహము"తో సకృచ్ఛముగ నీ సంగతిని బెంజమిను చెప్పెను. క్షణములో సంగతిని గ్రహించి, గవర్నరు బెంజమిను విషయమై యెవరికి నుత్తరములు వ్రాసియుండ డనియు, గవర్నరుమాట లవిశ్వసనీయము లనియు, గవర్నరుకు బరపతిలేదనియు బెంజమినుతో 'డెనుహము' చెప్పెను. మనోధైర్యముచెడినవాడై, డబ్బులేదని బెంజమిను డెనుహాముతో జెప్ప, "ఇక్కడి ముద్రకులతో గలిసి పనిచేసిన, నీవు లాభమును బొందగలవు. అమెరికాకుపోయి స్వతంత్రముగ బనిచేయుటకు సమర్థు డ వగుదువు" అని డెనుహాము బెంజమినుకు సలహాయిచ్చెను.

రెట్టించిన యధైర్యమును గలిగించుటకు, రాల్ఫు లండనులోనె యుండిపోయెద నని బెంజమినుతో జెప్పెను. రాల్ఫు డబ్బు లేని వాడనియు, కాసిచ్చి సహాయము జేయు స్నేహి తుడు తాను దప్ప మరియెవరు నతని కింగ్లాండులో లేరనియు బెంజమినుకు దెలియును.

గవర్నరు చేసిన ఈసహింపరాని పితలాటకమును గుఱించి, బెంజమిను వ్రాసిన యాక్షేపణ న్యాయముగ శ్లాఘింపబడి యున్నది. "అజ్ఞానులైన బీదకుఱ్ఱవాండ్రను నిర్హేతుకముగ మోసపుచ్చి వారియెడల కపటముగ ప్రవర్తించిన గవర్న రెట్టివాడని యూహింపవచ్చును? అట్లుచేయుట, మొదటినుండి యతని కలవాటుగ నున్నది. అందఱను సంతోషపెట్టవలె నని యభిలషించి, వారి కిచ్చుట కేమియు సొమ్ములేక, వారికి యాశమాత్రము గవర్నరు చూపించుచుండెను. ఇంతకుతప్ప, మిగిలిన విషయములలో వివేకమును, చురుకుదనమును కలిగి, మంచి లేకరియై, ప్రజలను బాగుగపరిపాలించువాడు", అని బెంజమిను వ్రాసెను.