బిల్హణీయము/రెండవయంకము


 (నగరునుంci ఆభరణ భూషితలగు స్త్రీలు బంగారు పళ్ళెరములో సంక్రందన తాంబూలములూ పచ్చలహారమూ తెచ్చి నమస్కరింci బిల్హణునికి సమర్పింతురు. )

ఒకతె : అమ్మాజీ మహారాణీవారు తాము వారికి అంకితముగా రచించిన గీతమునకు సంతోషించి వారు ధరించే ఈ పచ్చల హారము తమకు దయ చేయించిరి. ధరించి సముఖమునకు రండి. (బిల్టణుడితో నిష్క్రమింతురు.)

నానా : (రామశాస్త్రులు, మాధవశర్మ ఉన్నచోటికి వచ్చి వారలతో) ప్రభువులు ఒక మాట మీదను నిలచివుండరు.

మాధవ : శకం తిరిగింది.

రామ : చక్రం యెప్పుడూ తిరుగుతూనే వుంటుంది. మరో, తిరుగులో, మీదు కిందికి దిగుతుంది, విచారమేలా?

(తెర దించవలెను)

బిల్హణీయము

రెండవయంకము

నారాయణభట్టు యింటి సావిడి.

(నారాయణభట్టూ, శిష్యుడు వామనశర్మ, ప్రవేశింతురు. )

నారా : అరవైయేళ్లు దాటి, యిప్పుడు కవిత్వం నేర్చుకోవాలంటే, యెలా సాధ్యమౌతుంది. రాజుకు కవిత్వం పిచ్చి, ఘట్టిగా పట్టుకుంది.... ఈ కవిత్వవఁన్నదానికి, వొక తోవా, తెన్నూ, సవబూ, సందర్బవూఁ, కానరాదు. యేదీ బిల్హణుడు చెప్పిన పద్యంలో మొదటి వాక్యం చదువూ.

శిష్యు : (చదువును) “అంకం కేపీ శశంకిరే జలనిధేః పంకం”

చంద్రుళ్లో, కళంకమును, కొంతమంది, సముద్రంలో బురదగా భావించారు.

నారా : కొంతమంది మనుష్యులు, చంద్రుళ్లో వుండుకున్నఘువంటి మచ్చయేదైతే వున్నదో దాన్ని సముద్రపు బురద అనుకున్నారని కదూ, కవి అభిప్రాయం? యే వెఱ్ఱివాడైనా, యెన్నడైనా, అలా అనుకుంటాడ్రా? బిల్హణుడు మహాపండితుడే గాని, కవిత్వంలో దిగగానే, అసత్యం కల్పించాడు. యేవఁంటావ్?  శిష్యు : ఔనండి.

నారా : ఇక పద్యం యెలా అల్లాడో చూదాం....'అంకం' అనే ఒక మాట తీసుకున్నాడు. దానికి అనుప్రాసార్థం 'పంకం' అనే మాటొకటి యెత్తాడు... అటుపైని “ఆ అంకానికీ, యీ పంకానికీ, యెలాగయా అతకడం?” అని ఆలోచించి యేం యెత్తు యెత్తాడంటే, పంకం సముద్రంలో వుంటుంది గదా, చంద్రుడున్నూ సముద్రంలోనే పుట్టాడు గదా, ఆ పుట్టడంలో బురద యేమాత్రమైనా వొంటికి అంటకుండా వుంచ్చుందా అని యోచించి, అంక పంకాలకి లంకె వేశాడు. అంతే కదూ?

శిష్యు : అంతేనండి.

నారా : సరేగానీ, బురదంటూ వొకవేళ తగిల్నా, యెవడయినా కడుక్కోడ్రా? యిదంతా అసందర్భం చాలా కానవస్తూంది.

శిష్యు : అవునండి.

నారా : అయితే మనక్కూడా వొక ప్రాసముక్క చూచిపెట్టు; శ్లోకం అల్లుదాం.

శిష్యు : ‘శంఖం' బాగుందండి.

నారా : బాగుంది. అయితే శంభానికీ, చంద్రుడికీ, యెలాగరా అతకడం?

శిష్యు : యలాగనా అండి తెలుపు గనుక ఉపమానం చేద్దాం.

నారా : అంకం, వొకటి తగలడుతూంది కదూ! శంఖానికి కళంకమేదీ?

శిష్యు : కొంచెం మసిపూస్తే, కళంకం సాధ్యమౌతుందండి.

నారా : ఓరీ, మూర్ఖుడా! శంఖం పనికిరాదు. మరో మాట చూడు.

శిష్యు : శంకా.

నారా : శంకా?... శంకా?... శంకా... కళంకానికి, శంకేలా తగిలించడంరా? ఆఁ, కుదిరింది, రాయి.

(నారాయణభట్టు చెప్పును. శిష్యుడు రాయును. )

“అంకం కిమితి శశాంకే |
కథమిహ నౄణాం విజాయతే శంకా11

“శశాంకుడిలోవున్న మచ్చ యేమిటని మనుషులకు శంక యేలాగు పుట్టగలదు?” మహాబాగా వొచ్చిందిరా, శ్లోకం! యేవఁంటావు.  శిష్యు : బాగానే వుందండి.

నారా : మహా, మహా, అనాలి. వొట్టి బాగుండడం కాదు. మహా బాగుందను. మొట్టమొదటికే తాళంపట్టాం అనగా, శంకకే శంక తగిలించావఁన్న మాట! యీ పద్యం చూస్తే రాజు డంగైపోతాడు. వోమూల శశాంకుడని తానే అంటూ యింకా అంకవఁన్నది యేమిటీ, అని యెంత బుద్దీ తక్కువ మనిషైనా అడుగుతాడా?

శిష్యు : (నవ్వు ఆపుకుంటూ) యెవ్వడూ అడగడండి, ఉత్తరార్ధం శలవియ్యరా?

నారా : ఇంకా ఉత్తరార్థం కూడా వుందిట్రా! యేమి సాధనం; చెప్పవలసిన అభిప్రాయం అంతా చెప్పేశాం గదా?

శిష్యు : 'శంకర', అనే మరోమాట తీసుకుని శంకరుడి సిరస్సు మీద చంద్రుడు వున్నాడు గనుక యేదైనా వొహ కల్పన యెత్తితే సరండి.

నారా : అసలు శంకనే, కొట్టిపారేశిం తరువాత, మరి కల్పనకి జాగా వొకటి వుంచావాఁ? ఇక తోవ కనపడదే... కనపడదే... హాఁ! దొరికింది రాయి!

(నారాయణభట్టు చెప్పును. శిష్యుడు రాయును. )

“అంకం కిమితి శశాంకే!
కదాపి నౄణాం నజాయతే శంకా”

శశాంకుడిలో అంకం యేమిటి? అనే శంక నరులకు ఎన్నడూ కలుగ నేరదు...

నారా : ప్రశస్తతరంగా వొచ్చిందిరా? యేమంటావ్?

శిష్యు : (నవ్వు ఆచుకొనను, ముఖం పక్కకు తిప్పి) ఔనండి.

నానా : అట్టి శంక యెన్నడూ పుట్టనేరదనీ ప్రథమార్ధంలో ప్రశ్నకు సమాధానం మా బాగా కుదిరిందిరా. ఏది పద్యం కలిపి చదువూ.

శిష్యు : (శిష్యుడు చదువును)

“అంకం కిమితి శశాంకే
కథమిహ నౄణాం విజాయతే శంకా11"

నారా : తగలేశావురా! బంగారంలాంటి పద్యం! కొంచెం రాగ వరస పెట్టి యాడవరాదూ!

శిష్యు : (రాగవరసతో) అంకం కీమితి శశాంకే! ఆ పైని చదవజాలక వీరగబడి నవ్వును. )

నారా : యెందుకు నవ్వుతావు? ఓరిపాడగట్టా! పద్యం బాగుంది కాదంటావా యేమిటి? | (నానా మంత్రి ప్రవేశించును) వూరుకో! వూరుకో! నానా మంత్రాస్తున్నారు, ఆ పత్రం దాచెయ్యి, (గురుశిష్యులు నిలుతురు).  నానా : యేవిఁటండోయి శిష్యుడిచేత రాయిస్తున్నారు? (శిష్యుడితో) యేమి, అబ్బాయీ, కనబడ్డవేఁ మానేశావూ?

నారా : యేమీ లేదండి. గ్రంథం రాయిస్తున్నాను.

నానా : (శిష్యుడితో) యేదీ ఆ రాసింది చదువూ. (శిష్యుడు తలగోక్కుంటూ గురువ్వేపు చూచును).

నానా : (శిష్యుడి చేతులో పత్రం లాక్కుని చదువును, తలయెత్తి నారాయణభట్టుతో) యవరు చెప్పారండీ యీ శ్లోకం?

నారా : మా శిష్యుడూ.

శిష్యు : యింతకన్న బాగా చెప్పగలనండి.

నారా : యేడిశావూరుకో.

నానా : శ్లోకం మట్టుకు మహా బాగా వుందండి.

నారా : బాగుందంటారా? నాకు అలాగే తోచింది.

నానా : బాగుండడవఁంటే ఆలాగా యిలాగా అనుకున్నారా యేవిఁటి? బిల్హణుడి పద్యాన్ని పగలగొట్టారే!

నారా : మా శిష్యులు చెప్పమని పీక్కుతింటే యేదో చెప్పి చూదావఁని చెప్పాను.

నానా : తర్కం కురిపించిపోతిరే. యిఖ బిల్హణుడు తలదాచుకోవాలి.

నారా : పద్యం అంత ప్రశస్తంగావుందని శలవిస్తారా?

నానా : 'శలవియ్యడం” కాదు “మనవి” అనండి. మీ శిష్యకోటిలో వాణ్ణి మాట మరిచిపోకండి. ఆ శ్లోక ప్రాశస్త్యానికి, అవధి అంటూ వుందండి? మీరే కవిత్వం చెప్పడం ప్రారంభిస్తే, యీ కవీశ్వర్లంతా సూర్యుడి ముందర చుక్కల్లాగ చకాపికలై పోరా?

నారా : శాస్త్రాలు చదువుకున్న మా బోట్లకి కవిత్వం చెప్పడఁవన్నది, తక్కువ పని కాదండీ?

నానా : యీ రోజుల్లో తక్కువ విద్యలకీ, తక్కువ మనుష్యులకే యెక్కువ విలువ. “రాజద్రోహీ! తులువా!” అని కాశ్మీరం నుంచి, అక్కడి రాజులు వెళ్ళగొట్టిన, యీ బిల్హణుడికి మహా ప్రాజ్ఞులైన మన మహారాజులే, మీ అందరికంటే యెక్కువ గౌరవం చేస్తున్నారు? కారా?

నారా : బిల్హణులను కాశ్మీరం నుంచి వెళ్ళగొట్టారండీ?  నానా : కూచోండి, చెబుతాను (శిష్యుడితో) అబ్బాయీ, మీరు కొంతసేపు అవతలకు వెళ్ళి చదువుకోండి, చదువు వంటి వస్తువ లేదు.

(శిష్యునికి వెళ్ళమని గురువు సంజ్ఞ చేయును. శిష్యుడు వెళ్ళును. నారాయణభట్టు నానామంత్రి కూచుందురు. )

నానా : విన్నారా, కలశ మహారాజు వొక వేశ్యను వుంచారు. ఆ వేశ్య మీద బిల్హణుడు ఒక ప్రబంధం చెప్పగా, కలశ మహారాజు సంతోషించి బిల్హణుడికి ఆ వేశ్య దగ్గిర ప్రవేశం కలుగజేశారు. యీ రాజులకి దయపుడితే, చెయ్యతగిన మర్యాదా, చెయ్యదగని మర్యాదా, కానరు. ఆ పైని జరగవలసిన పని ఏదో, జరిగింది. దాంతో యీ తుంటరి కవికి ఉద్వాసన అయింది..

నారా : యింత విద్వాంసుడు గదా, అలా జరిగి వుంటుందండీ? పండితుడన్నవాడు క్షుద్రులవలె నీచవృత్తులకు దిగడు. కిట్టక ఎవరో యీ కథ కల్పించి వుంటారని నా మతం.

నానా : మీకు లోకం తెలియదు. అట్టి సంశయమే మీకుంటే, ఈ రంకు శ్లోకం చదీవి . నిజానిజాలు కనిపెట్టండి. దస్తూరీ యెవరిదో పోల్చారా?

(పత్రం వొకటి చేతికి యిచ్చును.)

నారా : యేమిటండిది? దస్తూరి బిల్హణులదే అనుకుంటాను. (చదువును)

‘అలమతిచపలత్వా త్స్వప్నమాయోపమత్వా
త్పరిణతి విరసత్వా త్సంగమేనాంగనాయాః |
ఇతి యది శతకృత్వస్తత్వమాలోచయామ
స్తదపిన హరిణాక్షీం విస్మరత్యంతరాత్మా ||

ఈకవిత్వమూ, శృంగారం అన్నవి, యేంతటి పండితుడికైనా, కళంకం తేకమానవు. అందుచాతనే మా తండ్రిగారు కవిత్వం చెప్పబోయేవు సుమా, చెడతావని శలవిచ్చేవారు. నే చెప్పిన శ్లోకం చింపేయ్యండి.

నానా : యిది చింపవలసిన శ్లోకం కాదు. మహారాణీవారికి చూపిస్తాను. బిల్హణుణ్ణి కొట్ట గలిగినపాటి కవి, మన ఆస్థానంలో వొకరంటూ వున్నారు గదా, అని వారు యెంతో సంతోషిస్తారు. ఈ మూలంగా మీపైని మహారాణీ వారికి కలిగిన ఆగ్రహం కొంత మళ్ళ గలదు. నారా : నా మీదే ఆగ్రహం! యేం, నాయనా! యేం, నాయనా! ఎన్నడూ యే పాపం యేరగనే!

నానా : మీ అంత అమాయకమైన బ్రాహ్మణ్ణి నేను ఎక్కడా చూడలేదు. ఊరందరికీ తెలిసిన మాటైనా మీకు తెలియదు.

నారా : నా వంటి బీద బ్రాహ్మడియందు ఆగ్రహానికి, కారణవేఁవిఁటి నాయనా?

నానా : వొక కారణం, స్త్రీలోలుడైన ఈ బిల్హణుడి సహవాసం చేస్తున్నారనే - రెండో కారణం, మీరు ఈ ఆస్థానంలో పండితులయి వుండిన్నీ బిక్షాటనం చేసే పరదేశ పండితుడివల్ల బహుమానం పరిగ్రహించడం, ఆ పరిగ్రహించిన తావళం మెడని వేసుకొని నిర్భయంగా తిరగడం. నేనంటూ, యెంతో దూరం మీ యోగ్యత, శ్రీవారి సమక్షంలో మనవి చెయ్యబట్టి, మీకు అట్టే హానిలేకుండా సరిపోయినది.

నారా : పిల్లలవాణ్ణి, మహరాజా, నా కొక హానిరాకుండా కాపాడండి. నాకు లౌక్యం తెలియదు. అయితే ఈ తావళం అతగాడికి పంపివేదునా?

నానా : అదికాదు కర్తవ్యం. మీకు సమ్మతవైఁతే నేనొక ఉపాయం చేస్తాను. రుద్రాక్షలు ప్రతి బైరాగి దగ్గిరా దొరుకుతాయి. వాటికి విలువేమిటీ! బంగారం యే మాత్రం వుంటుందో?

నారా : యిరవై తులాలు వుంటుందని, మా యింటి ఆవిడే అంది.

నానా : చూశారా, మొగవాళ్ళకంటె ఆడవాళ్ళకి యెక్కువ బుద్ధి వుంది. “క్షణశః కణశశ్చైవ విద్యా మర్థం చ సాధయేత్" అన్నాడు. యీ తావళం యెప్పటికైనా మీకు దక్కేది కాదు, గనక, ఆ యిరవై తులాల మీదా మరి నాలుగు తులాలు వేసి ఆ విలవగల కాసులు యిస్తాను; అవి పుచ్చుకొని అక్కగారికి ఒక కాసుల పేరు చేయించండి. రండి, అక్కగారితో ఆ మాట నేను స్వయంగా మనవి చేస్తాను.

(ఇద్దరును యింటిలోకి వెళుదురు.)

(అదే స్థలం) కేశవభట్టు ప్రవేశించి, యిటూ అటూ, చూచి, ఎవరినీ కానక ఒక మూలకు కూచుని పుస్తక పత్రాలు తీరగవేస్తూ వుండును. కొంతసేపటికి రుద్రాక్ష తావళమూ, ఒక పత్రమూ, పట్టుకుని, నానామంత్రిన్నీ, సంతోషంగల ముఖంతో నారాయణ భట్టున్నూ ప్రవేశింతురు. వీరు మూలకూచున్న కేశవభట్టును చూడరు. )

నానా : ఇటుపైని బిల్హణుడితో కలియకండి. మాట్లాడ్డం కూడా తప్పించుకొండి. రుద్రాక్ష తావళం యేమైపోయిందని యవరడిగినా, పోయిందనండి. రాజడిగితే అమ్మేశాననండి. 

కేశవభట్టు :(ముందుకు వచ్చి నిలిచి) ఈ అబద్ధాలు ఆడవలసిన అవసరమేమిటండి?

నానా : మరేం లేదు. నారాయణభట్టు ధనికులు కారు. పిల్లల వాళ్ళు. అక్కగారి వంటను అట్టే హంగులేదు. అందుచేత, యీ రుద్రాక్ష తావళం విక్రయించి, ఆ సొమ్ముపెట్టి బంగారం కోసమని నాకు అక్కగారి శలవు కాగా, కాసులుతెచ్చి అక్కగారికి యిప్పుడే దాఖలు చేశాను.

కేశవ : కావొచ్చును. కాని బిల్హణులతో కలియకపోవడానికీ, మాట్లాడకపోవడానికీ కారణ మేముండునో కొంచెం శలవు దయచేయిస్తారా?

నారా : వేశ్య మాట మీకు తెలియలేదు కాబోలు?

కేశ : వేశ్య మాట యేమిటండి?

నారా : బిల్హణులు, కలశ మహారాజులు వుంచిన వేశ్యతో స్నేహం లావు చేశారట. అందుచేతనే వారు దేశం నుంచి తోలివేశారట.

కేశ : ఏ దుష్ట యీ కల్పన కల్పించాడండీ! (నారాయణభట్టు నానామంత్రి వేపు చూసి వూరుకొనును.)

కేశ : (నానామంత్రితో) తమరు యిప్పుడు దయచేయించినన్ని కాసులు, నేను తమకు దాఖలు చేస్తాను, భట్టుగారికి నేను చాలా సొమ్ము బాకీ వున్నాను. రుద్రాక్షతావళం యొక్క విలువ అన్నది ఆ బంగారంలో లేదండి, ఆ మాల అమూల్యమైనది. అది యిలా దయ చెయ్యండి. వారి కంఠమందు తిరిగీ వుంచుతాను.

నానా : అలా గయితే నేనే వుంచుతాను. (మాల నారాయణభట్టు మెడ వుంచబోవును.)

కేశవ : తమకంత శ్రమెందుకూ? నేనే వుంచుతాను. (కేశవభట్టు మాలను పట్టుకుని తాను వుంచ ప్రయత్నించును.)

నానా : నేను వుంచితే తస్పా!

కేశవ : తమరు తగిలించవలసిన సూత్రం, యెప్పుడో ఒకప్పుడు మా అందరికీ వుండనే వుంది.

(కేశవభట్టూ, నానామంత్రి తావళంతో పెనుగులాడుతూ వుండగా తావళం తెగుననే భయంచేత, నారాయణభట్టు కూడా తావళం పట్టుకొనును. యింతలో బిల్హణుడు ప్రవేశించును. ముగ్గురూ పట్టువదలగా, తావళమూ, నానామంత్రి చేతి పత్రమూ,నారాయణభట్టు చేతి పత్రమూ, నేలపడును.)

బిల్హ : (తావళమును, పత్రములను యెత్తి) యేమిటీ దురంతం? ఈ పండితాగ్రేసరుడికి | యెట్టి పాటు వచ్చినది! యీ ఉత్కృష్ణమాలకు యెట్టి పాటు వచ్చినది! (ఒక పత్రము  చదివి) ఇది నానామంత్రిగారి కవిత్వం కానోపును. (రెండవ పత్రం చూసి, ఆశ్చర్యపడి) యిది యిక్కడి కెలావచ్చింది?

కేశవ : యేమిటండి ఆ పత్రం?

బిల్హ : (ప్రత్యుత్తర మియ్యక) ఇక్కడ కేలావచ్చెను, యీ పత్రం?

నారా : చెప్పవద్దని నానామంత్రిగారు, నా చేత ఘోరమైన ప్రమాణం చేయించారు.

నానా : (బిల్హణుడి చేతులు తన చేతులతో పట్టుకొని) క్షమధ్వం! క్షమధ్వం!

బిల్హ : “క్షమధ్వం”, యేమిటి, నీ శ్రాద్ధం!

నానా : నా వల్ల గట్టి పొరపాటు వచ్చింది. క్షమించండి. తమవంటి మహా పండితులకు, ఆగ్రహవఁన్నది వుండదు. యీ శ్లోకం కాశ్మీర మహారాజులు వుంచిన వేశ్యను ఉద్దేశించి తాము రచించినారని తమ శిష్యుడొకడు తెచ్చి నాకు చూపించాడు. దాంతో నాకు అనుమానం కలిగిన మాట సత్యం. అనుమానం కలిగి తమతో సంబంధం వొదులు కొమ్మని, నారాయణభట్టుగారితో నేను చెప్పిన మాటా సత్యమే. వారి మంచికోరి ఆలా చెప్పాను. అంతేగాని మీకు అపకారం చేదామని కించిత్తు అయినా నా అభిప్రాయం కాదు. ఆ సోమనాథుడు సాక్షి. అబద్దవాఁడితే నా నెత్తి మీద ఆకాశవంతఁ పిడుగు పడిపొవాలి. తమవంటి మహానుభావుల విషయమై క్షుద్రులు చెప్పిన మాటలు నమ్మడం బహు పొరపాటు. కేశవభట్టుగారు యా వేశ్య కథ అంతా శుద్ద అబద్దవఁని యిప్పుడే శలవియ్యగా, “యెంతటి కబుర్లయినా పుట్టించే దుర్మార్గులు వుంటారని” ఆశ్యర్యపడ్డాను. వారి మాటంటే నాకు చాలా గురుతు. క్షమధ్వం అని తిరిగి ప్రార్థిస్తున్నాను.

బిల్హ : (ఇంత తడవు ఆలోచించి, తావళము నారాయణభట్టు మెడను తగిలించి) నేను వెళ్ళిపోయినదాకా అయినా, యిది మెడని వుండనియ్యండి. ఆ తరువాత యెలాగా మీకు దక్కదు. అప్పట్లో యీ దుష్టమంత్రికి యీ మహా హారమును అర్పించి ప్రాణం కాపాడుకోండి. శూరాగ్రేసరుడైన దాహలాధీశుని కంఠంనుంచి దుష్టాగ్రేసరుడైన ఈ కుమంత్రి కంఠమునకా! దేనికి యే కాలానికి యే అవస్థ వస్తుందో, కానలేం. (నానామంత్రి దగ్గరకు వెళ్ళి ముఖం మీద ముఖం వుంచి) నా మూలముగా అమాయకుడైన బ్రాహ్మడికి అపకారం చెయ్యకండి. మీ యందు నాకు ఆగ్రహం లేదు. అందుకు తగరు. అసహ్యం కద్దు. మీ కుట్రకల్లా లక్ష్యం నేను యీ దేశం విడిచి వెళ్ళడవేఁ గదా? మీరు అట్టే శ్రమపడకండి. వెంటనే వెళ్ళతలచినాను. ఆహా! యేమి దేశం! యేమి మనుష్యులు! (నిష్క్రమించును.)  నానా : యీ కళంకం లేకుండావుంటే, యింతవాడు మరిలేడు.

నారా : ఆ వార్త, అబద్ధవఁన్నారే?

నానా : అలా అనకపోతే, మొహం యదట యేవఁన్ను?

కేశ : (నానా మంత్రితో) అయ్యా, ఒక మనవి! తమ ఆగ్రహం మా వుభయుల యెడలాప్రసరింప చెయ్యమని తాము వరం అనుగ్రహిస్తేనే, యీ దేశంలో వుంటాం. లేకుంటే, దేశాంతరం పోతాం. మేము, అల్పులం. తాము ఆస్థానంలో చాలివున్నారు. వ్యవహారస్థితి ఎప్పుడు యే రీతిని వుండునో తెలియదు. యీ తావళం తాము వుంపించండి. యా సంగతి మేం యెవరితోనూ చెప్పం. మేం పండితులం; అనేది వొకమాటా, జేసేది ఒకపనీ కానేరదు. మామా స్వభావాలు కూడా, యీపాటి తాము కానే వుంటారు.

నానా : రామా రామా! తావళం నాక్కావాలనుకున్నారా యేవిఁటి? అక్కగారు ముచ్చటపడ్డారు కదా అని కాసులు తెచ్చాను. మీ వుభయులకీ నా కంఠంలో ప్రాణం వుండగా, హాని రాకూడదు. మీ నాయనగారికీ, మా నాయనగారికీ ఉండే స్నేహవైఁనా ఆలోచించుకోనా? పండితులంటే నాకు ప్రాణం కాదా? నేను శుద్ధ జయనుణ్ణి అనుకున్నారా యేవిఁటి? అక్కదగ్గర శలవు పుచ్చుకొని వెళతాను. మీ యోగ్యత వేరేనాతో చెప్పాలా?

(తెర దించవలెను)



బిల్హణీయము: అముద్రిత భాగము

బిల్హణీయము

* రెండవ అంకము

స్థలము

అనిహిల్లా పట్టణమునకు కొంచం దూరంలో సరస్వతీ నదీ తీరమందు కాశ్మీర రాజపుత్రులు వలస వచ్చి విడిచిన పేట, ఒక ఉద్యానవనము మధ్య ఆ కాశ్మీరుల యజమానిన్నీ, కాశ్మీర మహారాజులకు బంధువున్నూ, ఒకప్పుడు కాశ్మీర రాజ్యములో సామంతరాజున్నూ ఐన చంద్రవర్మ అనే రాజు యొక్క తోట మిక్కిలి రమ్యమైనది.

చంద్రవర్మ శూరుడు, విద్వాంసుడు, లోకానుభవము కలవాడు. మహమ్మదు ఘజినీ సోమనాథ క్షేత్రమును కొట్టినప్పుడు ఈయన కుమారుడు ఇంద్రవర్మ యుద్దంలో మృతి పొందెను. ఇంద్రవర్మకు రణసింహుడను పందొమ్మిదియేళ్ళ ప్రాయంగల ఒక కుమారుడును, పదహారేళ్ళ ప్రాయముగల కుమార్తెయును కలరు.

చంద్రవర్మగారి భవనమునకు సామీప్యములో ఆ యుద్యానవనములోనే ఒక కొలను వడ్డున ద్రాక్ష తీగ లల్లిన మంటపములో చిత్రాసనము మీద జమిలి స్థంభములకు చేర్చిన దిండును చారబడి బిల్హణుడు, యెదట మరి వక చిన్న చిత్రాసనము మీద రణసింహుడు కూచుని యుందురు.

బిల్హ : (పత్రము చేతపట్టి చదువును.)

అస్యాశ్చర్యమయస్య మస్త్రగతయః స్వైరం తరంగై రపి,
జ్ఞాయన్తే న విధేరివాతికుటిలా వైదగ్ధ్యసీమా భువః
శ్రూయన్తేప్రతిభూభృతాం వసతయ స్త్వంగత్తురంగావళి
విశ్వోత్జేల ఖురాగ్రఖణ్డితముణి క్షోణీతలాః కేవలమ్!

రణసింహుడు : ఆహా! యేమి శ్లోకం!

బిల్హ : కుమార, ఇది వినండి.

వాత్సల్యం నవహత్యపత్యవిషయే వ్యాక్షిప్యతే న క్షణం
దాక్షిణ్యేన సమీహతే నవవధూ వర్గేపి ధీరాశయః
నిష్ణాతః కుటిలే నయాధ్వని చరన్నాచారపూతః ప్రభో
దుస్సాధ్యా నపి సాధయత్యభిమతా నర్ధా సుసాధ్యానపి



రణ : తమవంటి మహాకవులవల్ల కృతి పొందడముచేత అమాత్య సంపత్కరుల జన్మ సఫలమైనది. ఆ మహాపురుషుడు అసమాన ప్రతిభావంతుడు, దయాళుడు, ప్రభు విశ్వాసపాత్రుడు; మరిన్నీ ఈ రాజ్యానికి కాలగతి చేత వలస వచ్చిన మమ్మును కాపాడుతున్న పరమ మిత్రుడు. తమ పొగడ్తకు తగినవాడేగానీ జైనుడు కాకుంటే యంతో బాగుండును కదా అని అనుకుంటాను.

బిల్హ : (చిరునవ్వు నవ్వి) ప్రభువు నమ్మిన బంటయి, మిమ్మల్ని కాపాడుతున్న మిత్రుడై, లోకోపకార ధురీణుడైనప్పుడు ఆయన మతం మీకు ఎక్కడ అడ్డు వచ్చెను కుమారా?

రణ : సకల సద్గుణ సంపన్నుడు గదా, మతం గూడా మంచిదైతే, చంద్రుడికి కళంకం లేనట్లు వుండును గదా అని నా మనస్సున కొరత.

బిల్హ : కుమార, నిజమైన జ్ఞానమును సాధించవలెననే అభిలాష గల మీబోటి పండితులకుపర మతములయందు అసూయ వుండకూడదు. ఈ భూ ప్రపంచమందు లెక్కలేని మతాలు వున్నవి. అన్ని పేరెక్కిన మతములలోనూ పండితులూ, సత్పురుషులూ కలరు, అన్ని పేరెక్కిన మతములలోనూ సంసారమును తరించే సాధనములు కలవు. ఆయా సాధనములను అవలంబించి ప్రాజ్ఞులు ధర్మమార్గానువర్తులై, సదా లోకోప కారపారీణులై ఆయా మతములకు వన్నె తెత్తురు. అందుకు అమాత్య సంపత్కరులే దృష్టాంతము. అఫ్రాజ్ఞులు ఆత్మలాభమునే ఆపేక్షించుచు అట్టి లాభము సమకూడుటకు వంకర తోవల నడిచి, తామసులై పరులను పీడించుచు జీవికలేని జప తపాదులను చేయుచు లోకమును, దేవుడినికూడా మభ్యపరుప యత్నింతురు. అట్టివాడు నానా మంత్రి. పేరుగల మతమల్లా సత్ప్రవర్తనను, భూతదయను ముఖ్యములని చాటు తున్నవి. వైదికమతములకన్న బౌద్ధ జైనమతములలోనే వీటికి ప్రాముఖ్యత లావు. సత్ర్పవర్తన అనేది ఆత్మకు కవచము. భూతదయ అనే ఉపాసన ప్రత్యక్ష స్వర్గమై సద్యో ఆనందదాయకము, నిర్వ్యాజమైన ఈ గుణములతో మేళనలేని జపతపాదులు వ్యర్థములు. మనస్సుయొక్క దుర్వృత్తులను మళ్ళించడం అల్ప బుద్దులకు సాధ్యంకాదు. ముక్కు బిగించుకు కూచొనుట ప్రతి కొంగకూ సాధ్యమే. గాన వైదికుడైన నానామంత్రి కన్న, జైనుడైన సంపత్కరులే శిష్టు. నాలుగు దేశాలూ తిరిగి నాలుగు దేశాలవారి తోడనూ అన్నదమ్ములవలె బతికిన వాళ్ళకు మతాభిమానాలు మాసిపోతాయి. బుద్ధికి సంకెళ్ళు విడిపోతాయి.

రణ : జైనులు వేదబాహ్యులు గదా అని.

బిల్హ : ఆ మాటకు వస్తే మన దర్శనాలు అన్నీ వేద ప్రామాణ్యమును సరిగ్గా వొప్పుకున్నవా? వొప్పుకున్నవి మాత్రం వక్క రీతినీ వొప్పుకున్నవా?  రణ : (యోచన నటించి) అవును నిజమేనండి.

బిల్హ : మరి యేలా వేదములను గూర్చి అభిమానము? అన్ని మతాల వారూ వొప్పుకునే శబ్ద ప్రమాణము వక్కటే, నాకు కనపడుతున్నది అందులో నా కంటే మీరే పండితులై వుంటారు.

రణ : యే విద్యలోనైనా తమ పాదముల వద్ద శుశ్రూషచేసి, అభ్యసించడముకు అర్హుడను గానీ, తమ యెదుట నేను పండిత పదవాచ్యుడను యెన్నడూ కానేరను.

బిల్హ : నే చెప్పవచ్చిన సర్వమత సమ్మతమైన శబ్ద ప్రమాణ మనేది ఇట్టిది అని చెప్పడముకు శక్యము కానీ ఆనందమును కలుగజేసే విలాసవతీ సంబంధి శబ్ద ప్రపంచం (తల తడిమి) ఒక్కొక్క వెంట్రుక నెరుస్తున్నది కనుక ఆ శబ్ద ప్రపంచము విషయంలో బధిరత అప్పుడే మమ్ములను ఆవహిస్తున్నది.

రణ : పూర్ణ యౌవనముయొక్క శృంగార రసగ్రహణ శక్తి, వార్ధక్యము యొక్క జ్ఞానసంపత్తీ, ఆ రెండు అవస్థలకూ సహజములైన దోషములు అంటకుండా, మహాకవుల యందు సదా కలిగి వుంటవి.

హేలాభ్యస్త సమస్త శాస్త్ర గహనః సాహిత్యపాథోనిధి
క్రీడాలోడన పణ్డితః ప్రియతమః శృంగారిణీనామ్ గిరామ్||

అని కర్ణ మహారాజు యెవరిని గురించి చెప్పగలిగారు? వస్తు ప్రపంచములో, జన సామాన్యమునకు గోచరము కాని రామణీయకమును కనిపెట్ట కలిగిన వారు కవులే కదా!

బిల్హ : కుమారా, యింత పరిజ్ఞానమూ, గుణసంపత్తీ కల మీరు పండితులు కాకపోతే యింక యెవరు పండితులు, సత్యమే: స్వర్గ నరకములనేవి యీ లోకంలోనే వున్నవి. చూడ నేర్చినవాడికి ప్రతిదేశంలోనూ కలవు, నందనవనాలు, దేవతా స్త్రీలూ, మహర్షులూ. అట్టి భూలోకమందుగల ఆ స్వర్గ రామణీయకమును కావ్యములుగా సర్వజన వేద్యము చేసినాడని కదా కాళిదాసును నేను మెచ్చుకుంటాను. ఊర్వసి పురూరవుడి కన్నులు మూయుటకు దొంగతనముగా వెనుక పాటున వచ్చునపుడు ఆమె అందెల యొక్క అణగీ అణగని చడియొక్క సొగసు కవులలోకల్లా కాళిదాసు కదా గ్రహించెను. “గూఢం నూపురశబ్దమాత్ర మపి మే కాంతం శ్రుతౌ పాతయేత్”. కవిత్వంలో ధ్వని అన్నది ఆ అందెల చడిలాగు వుండవలె. చూడండి కుమారా, నేను చెప్పిన శబ్ద ప్రమాణమును కాళిదాసే గదా నిర్వచనం చేశాడు. 

“సామన్త మౌళి మణీ రజ్ఞిత పాదపీఠ,
మేకాత పత్ర నవనేర్నతథా ప్రభుత్వమ్
అస్యా స్సఖే చరణయో రహ మద్య కాస్త
మాజ్ఞాకరత్వ మవిలంఘ్య యథాకృతార్థ?”

ప్రియురాలి ఆజ్ఞకు చక్రవర్తులు బద్దులు, ఇతరుల మాట చెప్పనేలా.

రణ : అహ యేమి శ్లోకం గురోజీ!

బిల్హ : కుమార, ఇది వినండి.

వాత్సల్యం నవహత్య పత్యవిషయే వ్యాక్షిష్యతే న క్షణం
దాక్షిణ్యేన సమీహితే నవవధూ వర్గేపి ధీరాశయః
నిష్ణాతః కుటిలే నయాధ్వని చరన్నాచారపూతః ప్రభో
దుస్సాధ్యానపి సాధయ త్యభిమతా నర్థాన్సుసాధ్యానపిః11

రణ : మహామాత్య సంపత్కరుడు మీవంటి మహాకవివల్ల కృతి పొందడం; యేమి అదృష్టవంతుడు. మనకు ఆప్తుడు తమ పొగడ్తకు తగినవాడే గాని జైనుడు కాకుండావుంటే బాగుండును.

బిల్హ : (చిరునవ్వు నవ్వి) కుమార! నిజమైన జ్ఞానమును సాధించవలెనన్న పండితుడికి పరమతముల యెడల అసూయ వుండకూడదు. ఈ భూ ప్రపంచమందు లెక్కలేని మతాలు వున్నవి. అన్ని మతాలలోను ప్రతిభావంతులు, మహాపండితులూ కలరు. మన మతమే నిజమూ, పర మతములన్నీ అబద్దమూ అనుట అజ్ఞత. ఏ దేశంలో, యే మతంలో, యేమేమి మేలు వుంటే అదల్లా గ్రహించదగినదే. నాలుగు దేశాలూ తిరిగి నాలుగు మతాల వాళ్ళతోనూ అన్నతమ్ముల్లాగ బతికిన వాళ్ళకి మతాభిమానాలు మాసిపోతాయి. బుద్ధికి సంకెళ్ళు విడిపోతాయి. వైదిక మతావలంబియై రోజూ రెండు ఝాములు మఠంవేసి జపతపాలు చేసే నానామంత్రి ప్రవర్తనకు, జైనుడై వేదబాహ్యుడైన సంపత్కరుడి ప్రవర్తనకు కల భేదము చూస్తిరి కదా! నానామంత్రి తనకు తెలుసునని గర్వించే ఆ భగవద్గీతలోనే తొమ్మిదవ అధ్యాయంలో దేవప్రకృతి, రాక్షస ప్రకృతి వర్ణింపబడియున్నవి. అందులో వైదికుడైన నానామంత్రియందు ఆదిరాక్షస గుణములు మూర్తీభవించి వున్నవి. జైనుడైన సంపత్కుమారుడి యందు దేవగుణాలు వున్నవి. గీతలోకల్లా విలవైన శ్లోకాలు ఆ అధ్యాయంలో వున్నాయి. అవి మనసును పట్టినవాడు తన్నూ లోకాన్ని కూడా జయిస్తాడు.  రణ : అయితే వేదములు ప్రమాణములు కావా?

బిల్హ : మన దర్శనములు మాత్రం అన్నీ వేదప్రమాణం అంగీకరించాయా, వక్కరీతిని అంగీకరించాయా, అన్ని మతాలూ వొప్పుకునే శబ్ద ప్రమాణము నాకు ఒక్కటే కనబడుతున్నది.

రణ : ఏమిటండి అది?

బిల్హ : యౌవ్వనులైన మీరెరుగరా, కుమారా?

రణ : పోల్చలేకుండా వున్నాను.

బిల్హ : విలాస రతులతో సంబంధించిన శబ్దజాలం. ఆ శబ్ద ప్రమాణం సృష్ట్యాదినుండి అన్ని మతాలవారూశిరసావహించుకుంటున్నారు. ఆ ప్రమాణం యొక్క బలం నిన్నటి రోజునే నాకు వ్యక్తమయింది.

రణ : (అయిష్టమును ముఖమున కనపర్చి తరువాత చిరునవ్వు నవ్వును.)

బిల్హ : కుమారా? గురువు మీద శిష్యులకు అలకపొడమిందా? ఏమి ఈ బ్రాహ్మణుడు మహారాజకుమారికల శృంగారం విషయమును ప్రలాపం చేస్తున్నాడా అని కావచ్చును. తరవాత ఇంత పండితుడు అయినాడా అని నవ్వు వచ్చినదా? అయితే బిల్హణుడు కవిశేఖరుడన్న మాట మరచితిరి కుమారా! కవి అంటే యెవడు. వస్తు ప్రపంచమునందు యితరులు చూడలేని సొగసులు చూసేవాడు. ఇతరులకు అవేద్యమైన రసమును అనుభవించేవాడు. కాళిదాసును ఈ విషయంలో ఎంతైనా మెచ్చవలసి వున్నది. ప్రియురాలు దొంగతనంగా ప్రియుడి వెనకపాటున కన్నుమూయుటకు వచ్చేటప్పుడు, ఆమె అందెలయొక్క అణగి అణగిన చడి సొగసు కవుల్లోకల్లా అతనే గ్రహించాడు! గూఢం నూపుర శబ్దమాత్రమపి మే కాంత వచోపాతయేత్.

కవిత్వంలో ధ్వని ఆ అందేల చడిలా వుండాలి. ప్రియురాలి శబ్ద ప్రామాణ్యం మళ్ళీ కాళిదాసే చెప్పాడు.

సామన్త మౌళి మణిరజ్ఞిత పాదపీఠ
మేకాతపత్రమవనేర్న తథా ప్రభుత్వమ్
అస్యాస్సఖే చరణయో రహ మద్యకాస్త
మాజ్ఞాకరత్వ మధిగమ్య యథా కృతార్థః



పాదము యొక్క ఆజ్ఞాకరుడు కావడం అత్యుత్కృష్ట పదవి అన్నాడు. ఒక్కొక్క విలాసినియొక్క వాక్కులయందు ఈశ్వరుడు అనిర్వచనీయమైన రమణీయకత వుంచాడు. వెనుకటికి మా దేశంలో ఒక దరద్దేశపు స్త్రీని చూచాను. దాని మాటలు విని విని చెవికి మత్తెక్కి ఆ స్థలంనుంచి లేచిరావడం కష్టమైంది. మహారాజ కుమారికా వారి వాఙ్మాధుర్యము, ఆ మాధుర్యమును వెయ్యిరెట్లు మీరియున్నది. అదుగో మళ్ళీ కుమారా! బొమ ముడిపడ్డది రాజపుత్రికల యొక్క రమ్యతను యెన్నుటకు ఈ బ్రాహ్మడి తల తగునా అని కదూ! సంతోషమే. పైకి అండమే కదూ తప్పూ, మాటలయొక్క మంజులత విని చెవి ఆనందించినది, ఆనందించినది అని పైకి అనడంలో నా తప్పు యేమి; చంద్రమండలము ఆకాశమందు వున్నది. దాని కాంతికి కళ్ళు మూసు కొమ్మంటే యెవడి శక్యం. కాని పదిహేను రోజులాయె నేను గీత చెబు తున్నాను. ఇన్నాళ్ళూ వారు మౌనమవలంబించారు, నిన్ననే మాటాడారు, వారు మాటాడగానే ఆ మాటలయొక్క ఆనందం యొక్క భావము, వేదాంత శాస్త్రవేద్యమై శబ్దజాలములో కప్పబడి యెక్కడా కానరానప్పటికీ యెప్పుడో లభ్యమవుతుందని యీ జన్మమట్టుకు వృధా అని అట్లు బ్రహ్మానందము యొక్క అభావము కనపడి, ఆహా ఎందుకు ఈ పుస్తకాలు? ఇవి వున్నాయనే ఆనందం యెక్కడా కనబడదు. ఈమె మాటలు వినడమే బ్రహ్మానందం. ఈమె వాక్కులయందే అత్యంతమైన శబ్దప్రమాణము అని నిశ్చయించాను.

రణ : మీ కల్పనా చాతురికి సంతోషించాను.

బిల్హ : యేమి కల్పనాచాతురి. ఆ వాఙ్మాధురి వర్ణన శబ్దమునకు పట్టుపడనిదే. అభూతోపమ.

రణ : వారిని చూస్తి రా!

బిల్హ : చూడలేదు. చూడడమేలా? దేవుణ్ణి చూస్తున్నామా? వాడి మహిమ ప్రపంచ మంతటనూ చూసి అత్యాశ్చర్యపడుతున్నాము కామా? మనిషిని చూడకుండా మాటల వల్ల సమ్మోహమును పొందుతూ వుండుటలో ఒక అనిర్వచనీయమైన సొగసు వున్నది. మరి వక చమత్కారము చెబుతాను. తరుచు స్త్రీ వ్యక్తులలో అంగమునకు అను రూపమైన అంగసౌష్టవము ఉండుట కష్టము. స్త్రీ నడుచుకు పోతూవుంటే ఆ నడకా, అంగములూ అతి రమ్యముగా కనబడుతాయి. ముఖం చూస్తే జాదూ విరిగిపోతుంది. కనుక దేవుణ్ణి చూడకుండా సృష్టి వైచిత్రిని చూచి ఆనందించినట్టే ఆమెను చూడకుండా ఆమె మాటలలో నిమగ్నమై పోవడం మాబోటి కవులకు బ్రహ్మానందము.  రణ : (నిస్పృహను సూచించి, విచార రసము కల నవ్వునవ్వి) వాఙ్మాధురిని మీరిన రూపసౌందర్యము ఆమెకు కలదు.

బిల్హ : కుమారా మీరెలా చూస్తిరి.

రణ : ఒకమారు మదనపాలుల కుమార్తె చంద్రలేఖా, మహారాజ పుత్రికయును యీ వనము చూచుటకు వచ్చియుండిరి. నేను వారి రాక చూచి ఒక కుంజమున దాగుంటిని. చెలికత్తెలు పొదనుండి పొదకు వేటాడి పట్టుకుని ఆమె యెదుట వుంచిరి. ఆమె తమ తల్లిగారికి నన్ను కనపర్చినారు. వారు కూడా దయ కనపర్చినారు. అప్పటినుండి కమలములు కోసి తీసుక పోనాజ్ఞ అయేను. అట్లు నెల రోజులు తీసుకు వెళ్ళితిని. మాధవశర్మగారు దగ్గర వుండగా నేను వెళ్ళుట కలదు. ఆమె పాఠములు చదువునప్పుడు దగ్గర వుండేవాడను. శ్లోకములు రచించేవాళ్ళము. ఇలా నెల రోజులు అయిన తరువాత మా తాతగారు వద్దన్నారు. మరి నేను వెళ్ళలేదు. యీ వనంలో వారు విహరించడం తరచు కద్దు. అట్టి సమయంలో నేను యీ యింట్లో వచ్చి దాగొనమని ఆజ్ఞ.

బిల్హ : ఆమె పెద్దపులి కారే? నాకు బోధపడ్డది. మీ మనస్సు ఆమె యందు లగ్నమాయెను కాబోలు. యిప్పటి అవస్థనుబట్టి మీ ప్రేమను రాజకుటుంబము వారు నిరాకరించిన అవమానము వచ్చునని కాబోలు.


***