బిల్వమంగళ/మొదటి అంకము
మొదటి అంకము
________
మొదటి రంగము
(నడుతోవలో బిల్వమంగళుడు)
(భిక్షకుడు పాడుతూ వచ్చును.)
తోడిరాగము - (వెడలెను కోదండపాణి వరుస)
వలపవెడు తుపానులోన - చెలగు జీవమను నావ !
కలగు హృదిని కల్లోలము - కాంచ గాంచ మించెనయ్యో||వల||
ఏడ ప్రాణములు చేర్చునొ - ఎవ్వ డెరుగు దైవమాయ?
నుడివడు పెనుసుడిలోబడి - బడలిక మునుగ,
జడమురీతి జరుగుచుండు - జగమంతయు దిగులునొందు,
నడలులేక రాగలతిక - సందడించు చున్నదయ్యో ||వల||
బిల్వ - ప్రాణాలు నిల్చునట్లు లేదు.
బిచ్చ - బాబూ, దిక్కుమాలిన పక్షిని-ధర్మం చేసుకోరా?
బిల్వ - పోపో - నాప్రాణాలుతీయకు..ఏమిటాపాటా? సందడిస్తున్నదా?
బిచ్చ - ఆకలిచేత పేగులు బిగబట్టుతూన్నవి.
బిల్వ - ఆపాట నాకు చెప్పు, వ్రాసుకొంటాను.
బిచ్చ - ఒక్కచోట నుండిపోతే కడుపు నిండుతుందా బాబూ? నాలుగువీధులూ తిరిగితే కదా నాలుగిజ్జంజలు దొరకుతాయి.
బిల్వ - ఒకక్షణ మాగు - నీకేమైనా యిస్తానులే.
బిచ్చ - అంతమాటే చాలు - నాకేమీ వద్దు బాబూ!
బిల్వ - ఆలాగుకాదు - పాట వ్రాసుకోనిస్తే నీకు రూపాయి యిస్తాను. బిచ్చ - నిజమే? నా తోడే?
బిల్వ - ఇదిగో ఇంద. (ఇవ్వబోవును)
బిచ్చ - నన్ను పోలీసువాళ్ళ కప్పగించరు కదా?
బిల్వ - లేదులేదు, పాటచెప్పు.
బిచ్చ - దీనిని నేను దొంగలించలేదు, కృషిచేసి నేర్చుకొన్నాను.
బిల్వ - సరే, చెప్పు.
బిచ్చ - (పాడును)
బిల్వ - పాడవద్దు - మాటలు చెప్పు వ్రాసుకొంటాను.
బిచ్చ - వలపనెడి తుపానులోన...కల్లోలము.
బిల్వ - అబ్బో! వలపు మితిమీరందే! అలలు లేస్తూ పడుతూన్నవి - తరువాత?
బిచ్చ - ఏడ ప్రాణములు చేర్చునొ - ఎవ్వడెరుగు దైవ మాయ?
బిల్వ - ప్రేమ యెట్టి దనుకొన్నావు? నీ వెరుగుదువా?
బిచ్చ - (న్వ) ఈతనికి పిచ్చిపట్టింది కాబోలు?
బిల్వ - నీవు చెప్పలేవా? మెడ కురిపోసెదను సుమా! మాటాడవేమి? పాట చెప్పు...కానీ...
బిచ్చ _ సుడివడు పెనుసుడిలోబడి...
బిల్వ - ఉండుండు - సుడిగుండమా? మానుపండుగ నాటిదా?... బిచ్చ - (పాట ముగించి) పాట సరి, బాబూ! ఇప్పించరా?
బిల్వ - ఆగాగు! నేనుచూడనీ సరిగాఉందో లేదో.
బిచ్చ - చిత్తము.
బిల్వ - సందడిస్తూన్నదా?
బిచ్చ - బాబూ! రూపాయి యిప్పించరా?
బిల్వ - ఈపాట బాగులేదు.
బిచ్చ - ఏం బాబూ! ఆలా సెలవిస్తారు?
బిల్వ - ఓరీ, నీ వెప్పుడైనా వలపులో పడినావా?
బిచ్చ - అదేమో నాకు తెలియదు గాని, ఒకసారి జెయిల్లో పడ్డాను-నా ప్రారబ్ధ మది-అప్పటినుండీ కల్లూ గంజాయి రోజూ తాగడ మ్మానేశాను. ఎప్పుడేనా దొరకుతే పుచ్చుకొంటాను, లేకుంటే లేదు.
బిల్వ - నేను చెప్పినపని చేస్తావా?
బిచ్చ - బిచ్చ మెత్తుకోవాలి, పోతా నిప్పించండి.
బిల్వ - ఇస్తాను కాని, నేను చెప్పినట్లు చేస్తే ఇంకొక రూపాయి యిస్తాను...(స్వ) వీడి మూలాన దానిగుట్టు తెలుసుకోవలెను. దాని మనసులో ఆందోళనము పుట్టించవలెను..."అతడు వచ్చునని ఎంచుతూన్నావు కాబోలు - ఆయాశ సున్న సుమా!" అని కబురంపుతాను...ఓరీ, ఇటు విను-ఆయింటికి వెళ్ళు-చింతామణి అని ఒక ఆడ దగుపడు తుంది. అదేమి చేస్తున్నాదో చూచి దానితో "అతడు వస్తాడని అనుకొంటున్నావు కాబోలు, ఇక రాడుసుమా" అని చెప్పిరా.
బిచ్చ - అలాగే - ఏ యిల్లు?
బిల్వ - అదిగో పెద్దయిల్లు, కనబడుతూన్నదా? అది సళాకులా గుంటుంది...ఏలాగున్న నేమి? నాకు నచ్చింది... ఈపాట వినిపించు.
బిచ్చ - ఏ మనవలెను? అతడు వస్తాడనా?
బిల్వ - కాదుకాదు. అత డిక రాడని...
బిచ్చ - తెలిసింది. నే నెరుగుదును - ఒక మహారాజు కోపమువచ్చినప్పుడెల్లా ఇట్లే కబు రంపేవాడు.
బిల్వ - నే నీమర్రిచెట్టుక్రింద ఉంటాను. అన్ని విషయములు సవిస్తరముగా తెలుసుకొనిరా, ఎక్క డున్నాదో, ఏమి చేస్తూన్నదో చూచిరా. జాగ్రత్త - పాటమాత్రము వ్రాసియివ్వకు.
బిచ్చ - అబ్బో! ఆలాగు చేస్తానా? నే నెరుగుదును.
బిల్వ - అదే చూడు - ఒక మగవానివెంట ఒక ఆడది వస్తూన్నది, అది విడిచివచ్చిన యిల్లే. ఆయింటిదాసి అది, ముందు దాని నడుగు, నాప్రసంగము వస్తే ఏమీ అనకు - నే నాచెట్టుక్రింద నుంటాను. (పోవును)
బిచ్చ - నాకు చేతకా దనుకొన్నారా? ఇష్టముంటే ఎట్టి కార్యమైనా చేయగలను (త్రోవలో నిలువబడును) (సాధువు దాసియూ వత్తురు)
సాధు - ఇటు విను - ప్రేమానుబంధము పరిశీలించడములో నీవు మిన్నవు - నీహృదయ మెంత కోమలము! ప్రేమ అంటే సాధారణవిషయ మనుకొన్నావా? అది స్వర్గమంతా వ్యాపించి యున్నది, రాధాకృష్ణులు ప్రేయసులే సుమా!
దాసి - ప్రేమ ఎట్టిదో నాకు తెలియదు, నాకు నచ్చిన మగవాడు దొరకలేదు.
సాధు - నచ్చినవారని కొంద రుందురా? వెర్రిదానా, నీవు వాళ్ళ నట్లు కావించవలెను. పురుషులు భృంగముల వంటివారు, ఈవిషయ మతిరహస్యము సుమా...ప్రేమ బైట పడగూడదు. చూడు - రాధ మేనత్త, కృష్ణుడు మేనల్లుడు; ఐనా, వారి రాసలీల ఎంత గుహ్యము! ...నీ వేదో పనిమీద పోతూన్నట్లుంది...లేకుంటే ప్రేమనుగురించి ఇంకా ప్రసంగింతును. చెడుదారిలో పడ్డ నిన్ను మంచిదారిలోనికి తేవడమే నా ముఖ్యోద్దేశము.
దాసి - ఆలాగైతే సాయంత్ర మొకసారి దర్శన మిప్పించండి. నాకుకూడా మీ యుపదేశము వినా లనే వుంది. కడుపు జరుగక పోవడముచేతనే ఇట్లు నడుచుకుంటున్నాను అమ్మో! వీడెవడు?
సాధు - ఏడీ?
దాసి - నా యజమానురాలి దగ్గరికి పోయేటట్లున్నాడు. ఆమె ప్రాపకునికీ ఆమెకూ జగడము పెరిగి ఆతడు బైట వెడలి నాడు.
సాధు - సరే - నేను సాయంకాలము వస్తాను - ఇంట నింకెవ్వరినీ ఉండనీయకు - తలుపు మూడుసార్లు మెల్లగా తట్టుతాను. ఊరు మంచిదికాదు, ఎవరి కంటనైనా మనము పడితే ప్రమాదము.
దాసి - ఆలాగే - మరచిపోక వస్తారు కదా! (అతడు పోవును)
(బిచ్చగాడు వచ్చును)
బిచ్చ - నేను మీయింటి కే వస్తూన్నాను.
దాసి - నీ వెవడవు?
బిచ్చ - ఇప్పుడు చెప్పను - త్వరగా ఇంటికి పద.
దాసి - చావు - ముండకొడకా! నీ మొగాన నిప్పు పెట!
బిచ్చ - నాకే కాదు, నాపితాళ్లకందరికీ అలా అయింది. నేను నీవలలోపడను, ముందు నీవుపద, వెనుక నేనుంటాను.
దాసి _ ఓరి నీయిల్లు కూల! నీకు పిచ్చి పట్టిందా?
బిచ్చ - జాలము చేయకు, మాట చెప్పవలెను - ఆతడు చెట్టు క్రింద నున్నాడు.
దాసి _ ఎవరు, మా అయ్యగారేనా? చెప్పు చెప్పు - ఎక్కడున్నారు?
బిచ్చ - ఉఁ ? ఇక్కడ చెప్పుతా ననుకొన్నావా ? ఇంటికి పద. దాసి - ఓరి చచ్చినోడా! నాతో విగటమా?
బిచ్చ - కాదు - ఒకమాట చెప్పవలెను - ఇంటికి పద చెప్పుతాను.
దాసి - చెప్పవా? మా అయ్యగారు నీకంటపడ్డారా?
బిచ్చ - పడితే పడ్డారు, లేకుంటే లేదు - ఇంటికి పద. అక్కడ చూసుకుందాము. కనబడిన వాళ్లందరితో చెప్పు మందువా?
దాసి - (చింతామణినిచూచి) ఆతని వెదకాలనే కాబోలు - అదిగో - నా యజమానురాలు ఒకగడియ తాళలేకుంది. ఇల్లు వెడలి వచ్చింది - నేను మరచిపోయినా ననుకొన్నది - కాబోలు.
బిచ్చ - అదే కాబోలు చింతామణి! ఇది తనయజమానురా లంటున్నది, లోపలిమాట బయటికి రాకుండా కొంచె మాగుతాను.
(చింతామణి వచ్చును)
దాసి - ఏమమ్మా, కొంచెము శాంతించకూడదా? ఓపికలేదా ? ఇల్లు విడచి ఇప్పుడే రావలెనా? చూచేవాళ్లేమందురు?
చింతా - అనుకోనీ, నే నోర్వలేను. స్నానానికి పోతూన్నాను.
దాసి - ఏడీ, ఆతడెక్కడా కనబడడే! గొప్పింటివాడు కదా? నీవు కొద్ది చేతలు చేస్తే సంహించునా? చింతా - నే నేమన్నాను ! నీ వింట్లోలేవు - నేను భోజనము చేస్తున్నాను, అందుచేత ఆలస్యమయింది... ఆపాటి దానికి రాత్రిఅంతా గొణగొణలే, మాటాలేదు, మంతీలేదు. నన్ను నిద్రపోనివ్వలేదు, తెల్లవారేదాకా నిష్ఠూరాలే! ఒళ్ళుమండి నేను మాటాడలేదు - వెంటనే మేడదిగినాను ఆతనికీ నాకూకోపము వచ్చింది. రెండు మూడుసార్లు తిరిగీ వచ్చెను, కాని నేను పల్కరించలేదు.
బిచ్చ - అదిగో - ఆచెట్టుక్రింద నున్న యాతడేనా?
దాసి - ఎక్కడ?
బిచ్చ - (చింతామణితో) ఇదిగో విను - (దాసితో) నీవుకాదు. అతడు వచ్చు ననుకొంటున్నారు కాబోలు ! అతడికరాడు.
చింతా - ఎక్క డున్నాడు?
బిచ్చ - ముందు నీయింటికి పద - నీ వేమిచేస్తున్నావో చూడవలెను, ఏలాగు భోజనము చేస్తావో గాంచవలెను, ఏమందువో వినవలెను; అప్పుడు మర్రిచెట్టుదరికి పోయి ఆ మాటలు చెప్పవలెను. అద్దరి నాత డున్నాడు - (బిల్వమంగళుడు పొదలో దూరును).
చింతా - దాసీ, చూడుచూడు - ఆపొదలో దాగు కొన్నాడే! బిచ్చ - పాట
గౌరీమనోహరి రాగము - (బ్రోవసమయమిదే రామయ్యవరుస) సరసుడు దూరెనుగా పొదలో - సరసుడు దూరెనుగా పొదలో!
మరిమరినిన్ను మరపించుచుండె-
చేరివానిచెంత జేర్చుకొమ్మునీదు|| సర||
మనసులోని మా-టను దెల్పడాయె-
ధనములేమి చిన్నతనము నొందెనో?
వనములోన జీ-వనముసల్పునేమొ
-కనుమువాడద్దరి-గొనజూచు చుండె ||సర
బిల్వ - (స్వ) దానికి నాచింతేలేదు-నవ్వుతూన్నది - (ప్రకా) కట్టెలుకొనడాని కిట్లు వచ్చినాను- కంటపడ్డావు కావున ఒకమాట చెప్పెదను.
చింతలోననున్న చిరునవ్వు వెలయునా?
విశ్వదాభిరామ వినుర వేమా.||
చింతా - ఏమన్నావు? కర్ర లెందుకు ? నీ చితిపైన పేర్చుటకా?
బిల్వ - నీ వుదార వనుకొంటిని కాని వట్టి తుచ్చురాలవు సుమా !
చింతా - అబ్బో! నీవుదారుడవా ? నీపనులే తెల్పుతూన్నవి లే-ముంజేతు కంకణమ్మున కద్దమేల?
దాసి - అయ్యా, నామాటవినండి - మీరు గొప్పవారు గనుక ఈమె మాటలు పాటించకండి - చింతామణీ, నీవన్న మాట బాగాలేదు సుమా!
బిల్వ ... దాసీ, నీవేమీ చెప్పనక్కరలేదు - ఇక నేను రాను. నా దు:ఖమంతా నీ కొకనాడు తెల్పుతాను - నేను గొప్పయింటివాడను. గౌరవ మెచ్చటపొందిన నక్కడుంటాను. కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?
చింతా - ఏమీ? నేను నిన్నేమన్నాను? దాసి యింట్లో లేదు - నేను భోజనానికి కూర్చున్నాను, అందుకోసము తలుపు తీయడమునకు జాల మైంది, ఈపాటిదానికే నీ మనసులో కోపాగ్ని రాత్రిఅంతా రగులుతూనే ఉండనా? గౌరవ మెక్కడ కలిగిన నీ వక్కడికిపోదువా? నేనిదివరలో చెప్పినాను - బాగా ఆలోచించుకో.
దాసి - నా దొకమాట - ఆడవాళ్లిట్లు వీధిలో పడడము అన్యాయము.
చింతా - నీనెత్తి! నేను జలకమాడ వచ్చితిని - న న్నెందుకు నిందిస్తావు? ప్రొద్దుటనుండీ ఇక్కడ హాయిగా ఉన్నాడు. అతనికేమి? ఏమయినాడో అని నేను చస్తూ ఉన్నాను. ఒక మాటైనా కనిపించలేదు!
దాసి - అయ్యా! ఇ దన్యాయము కాదా? ఆడది, చిక్కిఉంది, ఆమెగతి "తానుండి తనతల్లి గొడ్రా" లన్నట్లుంది.
బిల్వ - చింతామణీ, నిన్ను చూస్తే నాకు విచారముగా నుంది. చింతా - అయితే కోపముపడక తిన్నగా ఇంటికి పద.
బిల్వ - ఇప్పుడు రాను. నేడు మాతండ్రి తద్దినము. వేళ మీరుతున్నది.
చింతా - అట్లైన ఆలస్య మెందుకు? కోపములేదని చెప్పి ఇంటికిపో.
బిల్వ - ఆఁ కోపమెందుకు?
చింతా - ఆలాగు కాదు. ఇటు విను. ఇప్పటికే పొద్దెక్కింది. "నాకుకోపము లేదు" అని నీవనేదాకా నిన్ను పోనీయను.
బిల్వ - నాకు కోపము లేదు.
చింతా - సరే, ఇక నింటికి పో; నేను స్నానానికి పోతాను; త్వరగా ఏరు దాటు - సాయంకాలము వత్తువా? - కాదు, కాదు - నే డేరు దాటరాదు కదా?
బిల్వ - అట్లైన నన్నెట్లు రమ్మంటావు?
చింతా - నేడొద్దు - రేపుదయము రా - రాకుంటే ఒట్టు సుమా!
బిల్వ - రేపేలాగు రాగలను?
చింతా - చూచినావా దాసీ నీ ఉదారుడు ! నేడు పోతున్నాడు, ఈరాత్రి కంట పడడు, రేపుదయమైనా రా జాలడట! .. కోపమే లేదట? కోపము నాకులేదు, ఉన్నమాట అన్నాను.
బిల్వ - ప్రొద్దుటే ఎట్లు రాగలను? కోపముతోనన్న మాటా ఇది? పనిపాటు లుండవా?
చింతా - అదంతా నాకు తెలియదు, రేపు రాకుంటే ఒట్టు వేస్తున్నాను - నన్ను చంపుకొన్నట్టే.
బిల్వ - ఆలాగే వస్తానులే.
చింతా - వస్తానులే కాదు, రేపు మధ్యాహ్నము సరికి నీ విక్కడికి రాకుంటే మీయింటికి నేనే వస్తాను.
బిల్వ - తప్పకుండా వస్తానని చెప్పడ మేలాగు?... (పోవును)
బిచ్చ - అయ్యా, బావనయ్యా, నాకిస్తానన్న దేదీ? (పోవును)
దాసి - కోపము తగ్గిందని తెలిసీ ఇంటి కెందుకు తీసుకొని పోలేదూ?
చింతా - తండ్రిశ్రాద్ధము పెట్టుకోవద్దా! ఇంటికి కొనిపోతే ఏలాగు? ... ఈరాత్రికి వీనిపీడ వదలింది...అబ్బబ్బా... నాకు కైదే కదా? కొంగు వదలడే, ఎటూ కదలనీయడు... రాత్రి అంతా గుసగుసలే! తలాలేదు తోకాలేదు...నిన్ను వలచినాను, నిన్ను వలచినాను, అని ఒకటే రోకలిపాట! వలచి నన్ను కొన్నాడా?...అదిగో చూడు, మళ్ళీ వస్తున్నాడు ! (బిల్వమంగళుడు వచ్చును.]
బిల్వ - ఈరాత్రి నేను రాను, నా బట్టలు జాగ్రత్త సుమా!
చింతా - విన్నావా దాసీ, బట్టలు వీధిలో పార వేయుదునా?
బిల్వ - అంతదానవు కనుకనే చెప్పుతున్నాను. (పోయివచ్చి) చూడు - చిలక, గోరింకపిల్లలకు కందిగింజ శనగ గింజ మేతపెట్టు (పోయివచ్చి) నీళ్ళిమ్మా, లేకుంటే గొంతు కార్చుకొని పోతుంది.
చింతా - మేతా నీళ్లూ పెట్టవలెనేమి! గొంతుక పిసిగి గోతిలో పెట్టెదను, లేదా మెడనులిమి మింట నెగుర గొట్టెదను.
బిల్వ - అబ్బో! నీ వంతదానవే! కనుకనే చెప్పుతూన్నాను. అవి మాటలాడితే ఆడనీ.
చింతా - చాదస్తపు బాపడా, ఇంటికి పో - శ్రాద్ధము పెట్టవలె నంటివే! తిండెప్పుడు తింటావు ? ప్రొద్దెక్కింది పోవయ్యా.
బిల్వ - ఇదిగో పోతున్నాను. (తిరిగీవచ్చి) చెప్పమరచి నాను, లేడిపిల్లకు గడ్డివేసి, కొమ్ము కర్రకి కొట్టుకోకుండా కట్టు, జొరావరిచేస్తే కోపగించకు, నేనుపోయివస్తాను.
చింతా - అనడమే కాని ఆచరణము లేదే! నాకు స్నానానికి వేళయింది. రేపుదయము వత్తువా?
బిల్వ - చూదాము లే...
_________
రెండో రంగము
_________
(బిచ్చగాడు, సాధువు)
బిచ్చ - సరేకాని ముం దీమాట చెప్పండి, మీ రపరాధపరిశోధకులు కారుకదా?
సాధు - శివశివా! ఎంతమాట ! నాపూర్వోత్తరము విను - నేను మొదట నవాబుకొలువులో నుంటిని, నాపేరు రామకుమారుడు. ఇది కలికాలము కదా ! అధర్మభీతి గలవాని కాపదలు మెండు. నేను కొంతధనము దొంగిలించినానని నాపై దావా తెచ్చినవెంటనే నాకు వైరాగ్య ముదయించి కాశికి పోగా, అక్కడ నాపూర్వభవపుణ్యవిశేషము వల్ల నాకొక గురువు లభించెను - అతడు సిద్ధుడు - పండ్రెండేండ్లు నన్ను తన సుతునివలె చూస్తూ నా కుపదేశించెను.
బిచ్చ - సొత్తు దొంగిలించినందుకు పోలీసువాళ్ళు పట్టుకోలేదా?
సాధు - శివశివా ! నేనేమి ? దొంగలాడడమేమి! ఎవరో కిట్టనివా ళ్ళీకింవదంతి పుట్టించినారు.
బిచ్చ - అయితే పోలీసువాళ్ళు మిమ్మేమీ చేయలేదూ?
సాధు - "యతో ధర్మ స్తతో జయ:", దైవకృపవల్ల ప్రమాద మేమీ ఘటిల్ల లేదు.
బిచ్చ - మీ రదృష్టవంతులు! నేను మరుగుదొడ్డిలో దాగున్నా నన్ను బయటికీడ్చినారు!
సాధు - నాగురువుగారి కృపవల్ల యోగశాస్త్రము, ధర్మశాస్త్రమూ, చికిత్సాశాస్త్రమూ మొదలయినవాటి నభ్యసించినాను. ఎప్పుడూ జగత్‌క్షేమంకరములైన కార్యములే చేస్తూందును, నిన్ను శిష్యునిగా నొనర్చుకోవలెనని ఉన్నది; నీవు త్యాగివలె నున్నావు. నీచరిత మెట్టిదో వినవలెనని ఉంది, చెప్పుము.
బిచ్చ - మీ రపరాధపరిశోధకులు గారని నాకు నమ్మకము ఇప్పటికి చిక్కింది. అందరి తలవ్రాతా ఒకతీరున నుండదు. నేను చిన్నప్పుడు మత్తువస్తువులు సేవించి యిల్లు గుల్లచేసి తుదకు కడుపుజరుగక బంగారుపూత పూసిన గిన్నె దొంగిలించి దానివల్ల ఒకమాసము హాయిగా గడిపినాను. నేను కాశికిపోయి ఒకపూజారి తలపై నున్న బంగారు వస్తువు దొంగిలించినాను.
సాధు - సరిపోయింది. నాకు తగిన శిష్యుడవే!
బిచ్చ - మీదయవల్ల ఎట్టి పనైనా పట్టుబట్టి సాధించగలను, కాని ఒక చిక్కుంది. నేనెక్కడ కనబడితే అక్కడ పట్టుకొమ్మని గవర్నమెంటువారి హుకు ముంది.
సాధు - దానికొక ఉపాయ ముంది; జడలు ధరించి ఎర్రశారీలు గట్టి ఒళ్ళంతా విభూతి పూసుకుంటేసరి.
బిచ్చ - ఆవేషముతోనే నేను దొంగిలించినది. అందుచేత జడలు కత్తిరించవలసి వచ్చింది. సాధు - నావద్దనుంటే నీకు భయము లేదు. అంతర్ధానవిద్యచేత నిన్ను దాచగలను.
బిచ్చ - అందుకే మీరదృష్టవంతు లన్నాను. పోలీసు వాళ్ళ కళ్ళు సూక్ష్మగ్రాహ్యములు. నీట్లో దాగుకొన్నా జాడదీసి అవి దొంగని బైట కీడ్వగలవు.
సాధు - నాదగ్గర నుంటే నీకు భయ మనవసరము.
బిచ్చ - సరే - ఈ వినోద మెన్నాళ్ళో! ఇందు దొనగేమి?...అయ్యా, మీరు మాటలాడుతారా, లేక మౌనముద్ర వహిస్తారా?
సాధు - యోగ్యులతోమాత్రమే మాటలాడడము.
బిచ్చ - జ్ఞానపత్రి సేవిస్తారా?
సాధు - అప్పుడప్పుడు మోతాదుగా.
బిచ్చ - మీ కష్టాంగసిద్ధి యైందా ?
సాధు - అది పరమరహస్యము.
బిచ్చ - వచ్చినవా ళ్లందరినీ యాచింతురా, లేక యిచ్చవచ్చిన వాళ్ళనే అడుగుదురా?
సాధు - హోమకుండము ముందుంటుంది - ఇష్టమున్న వా ళ్లేమైనా ఇచ్చెదరు.
బిచ్చ - సరే - మీ యాశ్రమ మెక్కడ ?
సాధు - గుడిగాని గుండముకానీ చూసుకోవలెను.
బిచ్చ - సరే - వంతులు పంపక మేలాగు ?
సాధు - నాకు కుటుంబ ముంది, వాళ్ళకి నెలకి పది హేనురూపాయిలు పంపించవలెను. మా అమ్మ, నాభార్య, ఇద్దరుపిల్లలూ ఉన్నారు. వాళ్ళఖర్చులు పోగా మిగిలినదానిలో నాకు పదివంతులు, తక్కినవి నీవి.
బిచ్చ - మీకు సాధువుల మర్యాద తెలియనట్లుంది - శిష్యునికీ గురువుకూ భాగము సమానము కావలెను.
సాధు - దానికేమిలే - నీవు నాకు శిష్యుడవైన చాలు. నీకుతోచిన గురుదక్షిణ మాకర్పిస్తూ ఉండు.
బిచ్చ - అదీ మేలైనమాట!
సాధు - నేటిరాత్రి చిన్నపని ఉంది.
బిచ్చ - నాకుకూడా కొంచెము పనిఉంది.
సాధు - ఒకర్తెయింటికి నేను పోవలెను.
బిచ్చ - నేనుకూడా ఒకచోటికి పోవలెను.
సాధు - అద్దరినా?
బిచ్చ - మరేమీ?
సాధు - సరే - నేడే దానిని ముగించుకో -
(పిచ్చిది పాడుతూ వచ్చును)
సింహేంద్రమధ్యమరాగము - (నతజన పరిపాలయ - వరుస)
ఎటనుందువొ - ఎరుగనునీ - విటురాగదే - మాఅమ్మ
కటకట పల్కరాదా నే - నిటుల మొరలనిడుచుబిల్వ ||నెట||
పోనీ నాయనను పిల్తునా? అబ్బబ్బా, ఎవరూ పల్కరు - పాషాణి తల్లి పాషాణమే కదా? - అమ్మా, అమ్మా - ఒక్క సారి కంటపడవా? సాధు - ఆహా! ఏమి మధుర గానము!
బిచ్చ - నీ వెవతెవు? ఎటు పోతున్నావు?
పిచ్చి - నేనా - వెర్రిదాని కూతురిని - పిచ్చిదానిని.
బిచ్చ - నీకు పెళ్ళి అయిందా?
పిచ్చి - ఆహా! పిచ్చివానికి నన్నిచ్చినారు! (పోవును)
సాధు - దీనిని పట్టుకో - చక్కగా పాడుతుంది.
బిచ్చ - మనపని బాగానే సాగుతుంది.
సాధు - నీకు కూడా అష్టాంగసిద్ధి అలవడునే!
బిచ్చ - ఆలాగైతే నేనింకోశిష్యుని వెదకుకోవలెను-
మూడో రంగము
(బిల్వమంగళుడు శ్రాద్ధముపెట్టుచుండ పురోహితుడు మంత్రము చెప్పుచుండును)
బిల్వ - ఇదిగో మీకీ స్వయంపాకము పితృప్రీతికై ఇస్తున్నాను. సూర్యాస్తమయము కాబోతూన్నది, మీ మంత్రము ముగిసేటట్టు లేదు.
పురో - ఆలస్యము మీదే - మీబోటి యజమాను లిద్దరు దొరికితే ఇక మా జరుగుబాటు కేమికొదవ? నిమంత్రితులైన బ్రాహ్మణులు ఉపవాసముచేత స్రుక్కినారు.
బిల్వ - నేను షడ్రసోపేతముగా బోజనము చేస్తినా?
పురో - మీరు వైదికకర్మల నిట్లాచరిస్తే మిమ్మల్ని వెలివేస్తారు.
బిల్వ - కోపపడకకండి, లోనికి పోయి సమారాధన సరిగా జరుగుతూన్నదో లేదో చూడండి - రామా!
(అతడు వచ్చును)
వడ్డన వాళ్ళ నిటు రమ్మను - (ఆతడుపోయి వచ్చి)
రాము - అయ్యా వడ్డనయింది - వడ్డన వాళ్ళు వస్తూన్నారు.
బిల్వ - సరే, నీవుపోయి అయిదు గిన్నెలలో అన్ని పదార్థములూ ఉంచుమను. అయ్యా - మీరు దయచేయండి - దేవతార్చనపెట్టె లోపలికి గొనిపొండి, రామా, నీవూ వెళ్ళు.
పురో - అబ్బో? ఇంత తెలివియున్నదా? (ఇద్దరూ పోదురు)
బిల్వ - అయిదు చాలునా? ఏదీ, - చింతామణి, దాసి - యిద్దరు - దాసి కోముసలమ్మ, చింతామణి కొకర్తె - నాకొకటి - ఐదు - నే నక్కడే తింటాను - అబ్బా! పశ్చిమాన మేఘావరణ ముందే! గాలివాన వచ్చునేమో? ... ఏమి యురుములు, ఏమి మెరుపులు! (రాముడు వచ్చును)
రాము - అయ్యా! బ్రాహ్మణులకు వడ్డించిన అన్నములో ధూళిపడ్డదని వాళ్ళు లేచిపోతా మంటున్నారు.
బిల్వ - దానికి నేనేమి చేయగలను? - ఐదు గిన్నెలూ సిద్ధమైనవా? వాటిని పడవల రేవుకి చేర్పించు - నేను దొడ్డిలోకి పోతాననే మిషపెట్టి బయటికి దాటుతాను. నన్ను గురించి ఎవరైనా అడుగుతే జ్వరము వచ్చిందని చెప్పు - వీ డెవడు? (గుమస్తా వచ్చును) గుమా - బ్రాహ్మణులు భోజనము చేస్తున్నారు, కుంభవృష్టి కురుస్తున్నది - రామా, ఇక్క డెందుకున్నావు?
బిల్వ - వాని కిట పనిఉంది - నీవు లోనికిపోయి సమారాధన చూడు.
గుమా - సమారాధన వర్షముచేత నాగింది.
బిల్వ - సరే - నాకు నూరురూపాయీలు కావలెను, ఏలాగైనా జాగ్రత్తపెట్టు - తెలిసిందా?
గుమా - సొమ్మేదీ? ఇల్లు తాకట్టు పెట్టవలెను.
బిల్వ - ఏలాగైనా సరే.
గుమా - నేను లోనికి పోతాను. కొంచె మాగండి.
బిల్వ - త్వరలో సొమ్ము జాగ్రత్తపెట్టు - లేకుంటే ఫలమనుభవిస్తావు సుమా!
గుమా - ఆలాగే - ఇక నీకొలువునకు నీళ్ళొదులుకోవలెను.
బిల్వ - ఏమి వాన! బయటపడకుంటే పడవ దొరకదు - ఎంత ఖర్చైనా అద్దరి చేరవలెను - (పోవును)
రాము - ఇదిగో తాళముచెవి. ఇక్కడే ఉంది. మతి లే దీయనకు. నాకు జీతమురాళ్ళు ముట్టనే లేదు. సాధ్యమైనంత చేజిక్కించుకొనవలెను. విసిరినమ్మకి బొక్కిందే కూలి.
నాల్గో రంగము
(శ్మశానములో నొక చితివక్క పిచ్చిది కూర్చుండగా బిల్వ
బిల్వ - ఇక్కడికి రెండుకోసుల దూరాన ఇంకో రే వుంది, అక్కడ జాలరివాళ్ళ పడవలో చిన్ననావలో ఉండక మానవు - అంతదూరము పోనక్కర లేకుండా ఇక్కడే తెప్పగాని, లేక దుంగగానీ, దొరికితే బాగుండును. విడిచేతుల నీదడము కష్టము. ఈచుట్టుపక్కల వెదకుతాను. అబ్బా! ఆకాశము చిల్లిపడ్డట్టు ముసలధారావృష్టి! ఇంద్రునికి కోపము వచ్చింది కాబోలు? ...నేను రాకపోతే తాను వస్తానంది, పాపము, అద్దరి నది నావలె నడుస్తూంటుంది...హా! ప్రాణేశ్వరీ! మనమిద్దరమూ చక్రవాకమిధునములాగు విరహవ్యధ ననుభవిస్తూన్నాము కదా? మనల ఈయేరుఎడబావుతూన్నది. ..ఈతుప్పచాటున వెలుగేమి? చితిమంట ఏమో? కాలమను నది కలకాలమూ పారుతూనే ఉండును. ఒకరికై కనిపెట్టుకొని యుండక దానితోవ నది పోతూండును...నా కాకలి చేత ప్రాణములు పోవునట్లున్నవి...తుపాను పట్టినట్లుంది. పిశాచములు పోరునట్లు మేఘములు గర్జించుతూన్నవి. ప్రాణమా, నీవు తుచ్ఛమని భావించియుందును గాని చింతామణి దర్శనమునకు వెలియౌదును కదా అని వెరచుతూన్నాను... ఏమి చేయుదును? దాని ప్రాణాలూ ఇట్లే ఉండును, కాని ఆదది, అబల - ఏమిచేయగలదు? లేకుంటే ఏరుదాటి నన్ను బిగియార కౌగలించి ఏడ్చి నిష్ఠురము లాడదా? చింతామణి నాది, నేను దానివాడిని. నాప్రాణములు నావికావు - చింతామణివి. దానికి నాపై నెంతప్రీతి! ... ఏమి చేయడానికీ తోచదు, ఏరు దాటడ మేలాగు? ప్రవాహ మతితీవ్రముగా నుంది. ఈశ్మశానములో ఏదైన దుంగ దొరకదా? (ముందునడిచి పిచ్చిదానిని చూచి) ఇదేమి భూతమా, పిశాచమా?.. పిశాచమే! శవములను కాల్చుకొనితింటూన్నది. దీనిమనస్సు కరిగితే న న్నావలియొడ్డు చేర్చగలదు. నేను బ్రతికియున్నా నాప్రాణములు కుదుట లేవు. దీనిచేతిలోపడితే చావుతప్పదు. కానీ, పల్కరించి చూస్తాను...ఓసీ! నిన్ను షోడశోపచారములతోను ఆరాధిస్తాను, అద్దరిని నన్ను చేర్చగలవా? తల్లీ! దయజూపి ధర్మము కట్టుకో - చింతామణికై నాచిత్తము తత్తర పడుతూన్నది.
పిచ్చి - ఏది ఏది చింతామణి? ఎక్కడికి నేగినది?
మెడనున్న మణిహారము వెడగువోలె కాటనుంటి,
ఆమె యెచటి కేగినదో? అద్రిగుహల జేరినదా?
అడవిలోని కేగినదా? అక్కడనే నిల్చినదా?
ఏడ నాకు దోచదాయె ఏల బ్రతుకునాస యింక?
దేశదేశములను తిరిగి దేహమెల్ల బూదియలిమి,
కడుపుమంట నార్పగాను కడువడిపడుచుంటి నేను;
పిడుగువడగ నురముచాచి చిడిముడి హృదయమున దోచి,
అన్ని చోటులను జూచి అన్ని దు:ఖముల దాచి,
రాదె సైకతశ్రోణి ♦ ఏది? యేది? చింతామణి?
బిల్వ - (నవ్వి) ఇ దెవతె? చింతామణి నెందుకు పిలుస్తూన్నది? ... ఇది భూతము కాదు, మానవగణములోనిదే? పిచ్చిదానివలెనుంది. నీవెవతెవు? చింతామణి నీ కేమవుతుంది?
పిచ్చి - చింతామణి నాది. పేరుపెట్టి పిలువకూడదు - సిగ్గు కాదా?
బిల్వ - అది ఆడదాని పేరు కాదా?
పిచ్చి - చింతామణియె నాదు ♦ చిన్నారిచిలుక
ముక్తకేశిని అయ్యు ♦ ముద్దుల కిరవు
కలుముల యిల్లాలు ♦ కట్టదు బట్ట;
వరమిచ్చి వెతదీర్చు ♦ వరశుభమూర్తి
సంతతంబును నామె ♦ శవముపై నాడు;
రేపల్లెవాడలో ♦ వ్రేవెలందులకు
వేణునాదము తాను ♦ వినిపించు నెపుడు;
శిరమున జడలు నం ♦ బరములీ దిశలు
ఉండునొకప్పు డా ♦ వెండిమల మీద
తాండవమాడుచు ♦ తద్ధిమ్మియనుచు;
ప్రతిమయై ప్రేమయే ♦ ప్రభవింప నోపు:
రాసకేళులలోన ♦ రమియించుబాల,
ఉవిదలలోనెల్ల ♦ యుడుపతిరాణి,
వనమాల ధరియించి ♦ వలపులో జిక్కి,
వనమాలి వెతకుచు ♦ వనిత తా స్రుక్కు
పురుషుని ప్రకృతిని ♦ పోషించుచుండు
విపరీతమగు రీతి ♦ వేడ్క దోపగను.
ఒక్కచో శవము వే ♦ రొక్కచో చపల,
ఏకాకృతిగ నుండు ♦ నెందుజూచినను,
కాలంపునియమముల్ ♦ గానరా వచట,
లేదు హిల్లోలంబు ♦ లేదు కలకలము,
నిమ్మకు తొక్కిన ♦ నీరంబువోలె
నిశ్చలంబై దోచు ♦ నెచ్చట గనిన.
మానసము వాక్కును ♦ గానంగలేవు,
ఆది యంతము లేని ♦ యతులస్వరూప,
రూపము న్నామము ♦ రోయలే రెవరు,
గతమును భావియూ ♦ గానంగ రావు,
అంతయు ప్రకృతంబు ♦ వింత గొల్పెడును;
చింతామణియె నాదు ♦ చిన్నారిచిల్క.
బిల్వ - నా చింతామణేనా ? ఇన్ని దినాలనుండీ ఆమె రూపసీమను గాంచలేకున్నాను. అదియవాఙ్మౌనసగోచర! ఎట్లు చేరగలను? ఏమిచేయుదును? చింతామణీ, చింతామణీ, ఇక్కడే నాప్రాణాలు విడువవలసివచ్చునా ఏమి? దైవమా!
పిచ్చి - ప్రాణములు పోగలవా?... లేదులేదు - అవి పోవు - నీటిలో నురికినాను, - నీ రెండిపోయింది. అగ్నిలో పడ్డాను అగ్గిచల్లారింది...ఆహా! నామనోహారిణి ఎక్కడ నుందో? మన మిద్దరమూ చెరియొకచోటా వెదకుదాము రా. అమ్మా! అమ్మా! ఎక్క డున్నావు? ఇక్కడ అవతరించరాదా?
బిల్వ - నిబిండాంధకారము, దిక్కు తోచదాయెను! ప్రాణము పోజాలదన్న మాట నిజమే. అయ్యో! నాప్రాణము పోతే చింతామణిని చూడడ మేలాగు? మేఘగర్జనమా, నీకు జడియను, నదీతరంగములారా! మీ కోలాహలముకు వెరవను. దేహమా! నీయందలి మమకారము విడిచినాను. చింతామణిని గాంచకల్గుదునో లేదో అను సంశయము మాత్రముంది. అదిలేకున్న నీ వొక నదివా? పిల్ల కాల్వపాటి ఉండవు - సముద్రమైనా దాటడానికి సిద్ధము - చింతామణీ, చింతామణీ!
పిచ్చి - చింతామణీ! నిన్ను గనగోరడము వృధా. పిచ్చి దాననై ఇల్లు విడిచితిని. ఎంతవెదికినా కానరావు, ఎంతపిల్చినా పలుకవు - రాత్రి భయంకరమై యున్నది. అదిగో! నాపిచ్చివాడు! మొగ మలాగే ఉంది. ప్రాణప్రియ చింతామణి ఒంటరిగా నుంది - నేను పోయెదను. .........(పోవును)
బిల్వ - నేనూ చింతామణిని గాంచెదను - చింతామణీ!
(నదిలో దుముకును)