బిల్వమంగళ/మూడో అంకము
మూడో అంకము
________
మొదటి రంగము - రాదారి.
(సోమగిరి బిల్వమంగళుడూ వత్తురు)
సోమ - నీవు విదేశీయునివలె కనిపిస్తూన్నావు, త్యాగివలె నున్నావు; నీ కాటంకము లేకుంటే నేటిరాత్రి నావెంట వచ్చి నున్న కృతార్థుని చేయుము.
బిల్వ - అయ్యా, నావా రెవరో చూపగలవా? పోనీ చెప్పగలవా? నా కెక్కడా అట్టివాళ్లు కనబడలేదు.
సోమ - నీవు ప్రేమోన్మాదివగు మహానుభావుడవు. ఇదే నమస్కారము.
బిల్వ - మీరెవరో నే నెరుగను-నే నొక హీన లంపటుడను. నాకు మీరు నమస్కరించరాదు. నేనే నమస్కరిస్తూన్నాను. చూడనాహృదయంబు - శూన్యగేహంబు
ఎవ్వడు నావాడొ - యిందు రావచ్చు,
తిమిరపూరము నాదు - దేహపంజరము
ఉండజాలదు ప్రాణ - మురుభీతికలన
అయ్యయో! భంగంబు - నందె నాయాశ
మరుభూమిమధ్యాన - మనియుండు నేను.
ఎవడను? నేనిట - కేలవచ్చితిని?
ఛీ! ఏల నీయుదాసీనత గల్గె?
ఏది మేలొనగూర్చు - నీప్రాణములకు?
ఏదియోప్రేమాబ్ధి - యెచటుండునదియొ?
కోరుచుందునుప్రేమ - కొమరొప్పజూప
ధన్యాత్మ చెప్పవే - ధన్యుండనౌదు.
సోమ - అయ్యా? నీవు ధన్యుడవే. ప్రేమమయియైన రాధ నిన్ను ప్రేమపూర్ణునిగా చేసింది. నీకు భగవంతుని యెడ ప్రేమ కుదిరింది.
బిల్వ - అయ్యా! మిమ్ము గురువుగా భావిస్తాను. ప్రేమమయియైన రాధ యంటిరి, ఆమె యెక్కడ నుంది?
సోమ - నేను గురువునా? శ్రీకృష్ణు డొక్కడే అందరికీ గురువు. ఇంకొకరు కారు.
బిల్వ - రాధ ఎవతెయో చెప్పవా?
సోమ - రాధాకృష్ణమూర్తులు నా కగుపడుతూన్నవి. అవే చూడు...ప్రేమ ఎంత గబీరమో ఎవ్వ డెరుగును? నీ వామూర్తి ద్వయమును గాంచదలచుకుంటే వాటిని ధ్యానించు-ఆమర్మము గాంచగలవేమో చూడు.
బిల్వ - (ధ్యానించి) ఆహా! సత్యమే. ఇన్నాళ్ళూ నాకగుపడలేదు. ఆహా! ఏమి సుందరమూర్తియుగము ! ఈ బొమ్మలు తథ్యమేనా? రాధాకృష్ణులను మనము గాంచగలమా?
సోమ - దైవకృప లేకుంటే దర్శనము కాదు.
బిల్వ - కృష్ణు డెక్క డుండును?
సోమ - పిలిచి చూడు-అతడే చెప్పును.
బిల్వ - అయ్యా! మీ రెవరు? మృతప్రాయమైన నాహృదయమున ఆశాప్రసార మొదవజేసినారు. గురుదేవా! మీచరణదాసునిగా నన్ననుగ్రహించండి.
సోమ - అట్లనవద్దు. మీకు శ్రీకృష్ణు డాశ్రయ మిచ్చెను! రండి -నావాంఛాఫలసిద్ధి యొనర్చండి.
బిల్వ - మీరొకరు లభించినారు గనుక మిమ్ము విడువజాలను, మీయాన జవదాటను. దగ్ధమవుతూన్న నా హృదయమున ఆశాంకూరము నాటినారు. ఆ లత ఫలించడానికి మీకృపయే జీవనము, రండి పోదాము.. (పోవుదురు)
_______
రెండో రంగము
_______
(చింతామణి యింటిదగ్గర)
దాసి - అమ్మా, నీ వతని నిజముగా వలచినావు. ఆమాట నేనంటే "నన్ను తిట్టుతూన్నావు" అని అంటావు. అన్నము ముట్టవు, పాన మడుగవు. రేయుంబగ ళ్ళదే చింత! నేడు వెళ్ళినవాడు రేపు రాకుండునా? కోపగించి ఎక్కడికి పోగలడు? పదిరోజులు చూడు, పరుగెత్తి వచ్చును. లేకుంటే మరిపదిరోజులు-కాకుంటే ఒక నెల -
చింతా - ఆత డిక రాడే, నేను బాగా ఎరుగుదును. నాకంట పడక యిన్నా ళ్లున్నాడు! నన్ను వంచించినాడు. ఇది నిజము.
దాసి - పోనీ, నీవు క్రమక్రమముగా చిక్కిపోతూన్నావు, బెంగచేత కాబోలు? ఊళ్ళో నొకసంపన్నుడు నాకొరకెన్నోసార్లు వచ్చినాడట ! నే నాతని లెక్కచేయలేదు. అతడు రెండుమేడలను వ్రాసియిచ్చునట!
చింతా - అయ్యో ! నాకోస మాతడు సర్వమూ చెరచుకొన్నాడే! ఇప్పుడు దేశమును కూడా విడిచినా డేమో? ఆతని ఆత్మసంయమము నీ వే మెరుగుదువు?
దాసి - ఇంకా యిల్లుంది, వాకిలుంది. దేశమును త్యజిస్తాడా? పురుషుల స్వభావము నీవెరుగన ట్లుంది.
చింతా - కోపమే అయితే ఇంటివద్దనేనా ఉండును... అక్కడలేడు-మనుష్యులు విరాగు లవుతా రంటారు. ఆత డాలాగయ్యెనేమో?
దాసి - అట్టివాడు విరాగి కావడ మేలాగు? ఇటువంటివారిని చాలామందిని నేను చూచినాను. సన్యాస మేమి సామాన్య మనుకొంటివా? ఈసుద్దులు నావద్ద కట్టిపెట్టు.
చింతా - నేటికి నాకళ్ళు విడ్డవి. వలపన్న వట్టి భ్రాంతి అని లోగడ తలుస్తూ ఉంటిని, కాని ఇప్పుడు నిజము తేలింది. వలపు నిజమే! ఒక్కనాడేనా అతనితో మంచిమాట ఆడినానా? ఆతడు పిలువగానే కోపమువచ్చి తలుపువేసి పడక గదిలో పరుంటిని. రాత్రి అంతా ఆతడు మేడపై నుండెను. నాకు నిద్రాభంగ మవుతుందనే భయముచేత రాత్రి ఒకమారేనా నన్ను పిలువలేదు... నాకంటినుండి రెండు నీటి చుక్కలు జారితే అతడు బాష్పవృష్టి కలిగించేవాడు! అతడు నన్ను బతిమాలినకొద్దీ బెట్టుచేసి కాలితో తన్నుతూంటిని.. దానికి తగినశాస్తి నా కిప్పు డయింది.
దాసి - ఈప్రపంచములో ఎవరికి వారేకాని ఒకరి కొకరు కారు. ఆకలిబాధ భరించ నలవికాదు! కోటివేషాలూ కూటికొరకే! పురుషులు అద్దాలవంటివారు, మనము నవ్వితే వాళ్లూ నవ్వుతారు. మనమేడిస్తే వాళ్ళూ ఏడుస్తారు ! పాడుపొట్టకోసము పరులను ఆశ్రయించాలి. చేరువ కొచ్చిన వారిని చేత చిక్కించుకోవలెను.
చింతా - అట్లుచేర్చినవారు మనవారు కావద్దా అప్పుడే సుఖము చేకూరుతుంది. నాకు నచ్చినవాళ్ళందరినీ అరచేతిలో నుంచుకొన్నాను. సుఖపడవలెనని నా నుదుట వ్రాస్తే అట్లే ఉండి యుందును. ఇక నట్టివాడు సమకూరడు. రాణినై ఉండవలసిన దానను రట్టుపా లైనాను, వేశ్యనై వెగటుపుట్టించినాను. ఇంక నన్నట్లు మన్నించువా రుండరు.
దాసి - ఎవరూ లేరనకు. అందరికీ ఆహరియే గతి-పరితాప పడకు.
చింతా - ఆ పరమాత్మ నావంటి నిర్భాగ్యురాలిపై కృపవహించునా? అతడు దయానిధి అనీ ప్రేమసముద్రుడనీ ప్రతీతి, నేను ప్రేమరహితనైన వేశ్యను. నే నెవరినీ ప్రేమించక పోవుటచేత ఒకవేళ నన్నాతడు దయతో చూచినా అది నేను గ్రహించలేను. నాహృదయము ప్రేమశూన్యము...చూడు... నేను మునుపటిలా గున్నానా?... కాలినబొగ్గులాగు కనబడ లేదా? నాకోర్కెలన్నీ నీట కలిసినవి-ఎందరినో మోసగించినాను, అందుకు ప్రతీకార ముండదా? ఇప్పుడు నావంతు వచ్చింది!.. కాని బిల్వమంగళుని నేను వంచించినట్లు నన్నాతడు వంచించలేదు. అతడు నేనే సర్వమని భావిస్తూంటే నే నాతని పాలిటికి కాలసర్ప మైనాను. అతడు ప్రేమార్ద్రహృదయు డవడముచేత భగవత్కృపాపాత్రుడు కాగల్గెను; నా హృదయమో శుష్కమరుభూమి... ఇందు ప్రేమాసారము కల్గబోదు!
దాసి - ఆ! పుట్టి మున్గిం దంటూన్నావు! ఒకడుపోతే ఇంకొకడు, విటులకోసము వెతకనక్కరలేదు. నీవే ఆలోచించుకో.
చింతా - సరే కాని పిచ్చిదాని వృత్తంత మేమైనా తెలిసిందా?
దాసి - తెలియ కేమి? అది కలయింటిబిడ్డ, తల్లిదండ్రులుగానీ ఇతరబంధువులుగానీ లేరు. యోగ్యునకే యిచ్చి పెళ్ళిజేసినారు. అల్పకాలముననే పాప మతడు మృతుడయ్యెను, అప్పటినుండీ ఈ మెకు పిచ్చియెత్తింది.
చింతా - ఈ కథ నీ కేలాగు తెలిసింది?
దాసి - నాకు తెలియదా? మావీధిలోనే దానియిల్లు. ఎప్పుడూ అక్కడే తిరుగుతూంటుంది. పడుచువారి కంటపడితే బాధపెట్టుతూంటారు. ఇదిగో, యిక్కడికే వస్తూన్నది.
చింతా - ఈమె సాధారణపు పిచ్చిదికాదు. పరమాత్మునిచేత వంచింపబడి నాలాగేయింటినుండి వెడలగొట్టబడ్డది.
(పిచ్చిది వచ్చును)
పిచ్చి - పరమాత్మునికి నాపై దయలేదని యెంచుతూన్నారా? ఆతని కందరిపైనీ కృపయున్నది. ఏమో నాయెడ మాత్ర మింకా దయరాలేదు. నన్ను మరచినాడేమో? ఎప్పటికైనా ఉద్ధరించితీరును.
చింతా - అమ్మా! నీ వెవతెవు? సాక్షాజ్జగదంబవా?
పిచ్చి - ఔనమ్మా, ఆ యభాగ్యురాలను నేనే. అంతటా నీకామెయే కనబడుతూన్నదా? ... మాటాడ కూరు కో!..సిగ్గుచేటు...(నోరు నొక్కుకొనును)
చింతా - నీమాటలు విన్న నాఒళ్ళంతా కంపము చెందుతూంది. నీ వెవతె వమ్మా?
పిచ్చి - నేను వెర్రివాళ్ళ పిల్లను-నీకూతురిని-నీవే నా వెర్రితల్లివి-నేనొక వెర్రితల్లిని.
చింతా -
పాషాణహృదయమా-పల్లటిలెదేల?
అన్యులకథలకు నడఅవీ వెపుడు
వంచనపాలైతివా? మానసంబ!
వేశ్యవు-నీ వేల వేషభూషలను
మరచి ధరించితో మురికివస్త్రంబు?
వేడుకపుట్టెనా వెంగలివి కాగ?
క్రించుదనమున కిట్లు-వంచింపబడితొ?
ఎవ డీసడించె నన్నిట్టులు తుదిని?
కాయమమ్మితి తుచ్ఛ-కాంచనము చేర్ప
ధనమునార్జించి తేధన్యులకొరకు?
ప్రాణమర్పించవు-పరుల కెన్నడును
కొత్తధర్మము దీని చిత్తమున నిల్పు.
అన్యు లెక్కడనైన-యాప్తు లయ్యెదరా?
నమ్ముము దీనిని న్యాయ మియ్యదియె.
కడచినదివసము-ల్గానంగరావు
వెలుగుపోకుండగనె-వెతకుకొనవలెను.
పిచ్చి - అవును-నాకు జాల మవుతూంది-సెలవిమ్ము పోతాను.
చింతా - నీవు నాకూతురి నంటివే? ఉండు నానగలు నీకిస్తాను.
పిచ్చి - తే-నాకు నగలన్నీ పెట్టవూ?
చింతా - (ఇయ్య బోవును-పిచ్చిది పారిపోవును)
దాసి - పారిపోయింది!
చింతా - పోనిమ్ము-మన మింటికి పోదాము రా - (పోవును)
దాసి - ఈమెకుకూడా పిచ్చి పట్టినట్లుంది.
(సాధువు వచ్చును)
సాధు - దాసీమణీ!
దాసి - ఏమంటావు? నాకు తల నొస్తూన్నది.
సాధు - ప్రేమోదంతము వినడానికిది సమయమా?
దాసి - సొమ్ము తెస్తే సొద వింటాను.
సాధు - అది లేదు, శుద్ధ విష్ణుప్రేమయే-గళమందు వనమాల -
దాసి - ఆగాగు-(స్వ)వీడికి చిన్న పని కల్పిస్తాను. - నాయజమానురాలికి మతిపోయింది-కనబడ్డవారి కందరికీ కాసులిస్తూన్నది. వీడిమూలాన ఏమైనా రాబట్టెదను. సన్యాసులను చాలాసత్కరిస్తుంది. (ప్రకా) నీకృష్ణప్రేమను చింతామణి కుపదేశించకూడదా?
సాధు - ఉపదేశించగలను, కాని నీ కుపదేశించవలెనని నాకోర్కె.
దాసి - అదినేనెరుగుదును. చింతామణిని చేరపొమ్ము. ఈవేషముతో కాదు, పిచ్చివాని వేషము వెయ్యవలెను - నా యజమాని వృత్తాంతము నీవెరిగినదే-కావలసిన సన్నాహము సన్నాహము కావించెదను. ఆదాయములో ఎనిమిదోవాటా నీ వుంచుకో, తక్కినది నాది.
సాధు - నీమాటేకానీ-తరువాత నీకు ప్రేమ ఉపదేశిస్తాను. అప్పు డంతా నీదే!
దాసి - ఇం కేమైనా చెప్పవలసిం దుందా?
సాధు - లేదు.
దాసి - నీవార్జించిందంతా నాకిస్తావా?
సాధు - సొమ్మేనా? నాప్రాణాలే నీవి.
దాసి - నే నొకదగ్గర నుంటాను, నీ వింకోచోటుండు. నీ యింట్లోకుండలుతప్ప ఇంకేమీ ఉండరాదు, నీబట్టలపెట్టె నాయింట్లో నుండనీ; నీకూ నాకూ పొసగకుంటే కట్టుగుడ్డలతో నీవు బయటికి పోవలెను, నా వద్ద నీకు దాపరిక ముండరాదు.
సాధు - ఆలాగేకానీ.
దాసి - సాయంత్రము నీవువస్తే చింతామణిద్రవ్యము సేకరించే మార్గము చెపుతాను-చింకిగుడ్డలతో పిచ్చివాని లాగు రా- (లోపలనుండి "దాసీ" అనిపిలువు) ఇదిగో వస్తూ న్నాను. నాకు పనిఉన్నది. సాయంత్రము తప్పక రా (పోవును)
(బిచ్చగాడు వచ్చును)
బిచ్చ - ఏమయింది?
సాధు - అవుట కేముంది? సాయంత్రము రావలెను.
బిచ్చ - ఏమన్నది?
సాధు - నీవుచెప్పినట్లు రొక్కము పట్టుకొని రమ్మంది.
బిచ్చ - సరిసరి-ఇక సాయంత్రము రావడ మెందుకు?
సాధు - ఇంకోసారి యత్నించి చూస్తాను.
బిచ్చ - ఆఁ. నాదగ్గర దాచుతూన్నావు, సరిగా చెప్పలేదు. నేను చూస్తున్నాను చాలాసేపు గుసగుసలాడి నారే?
సాధు - ఇంకేమీ లేదు, ముడిమా టంతే! నావెంట వస్తే నీకూ తెలిసియుండును. పోదాము రా.
బిచ్చ - తెలిసింది-ఏదో వంకపెట్టి నాకళ్ళలో దుమ్ము కొట్టవలెనని నీయుహ! నేను లేకపోవడము నీకు మంచిదేగా? సరే-నడువు, నావం తెగవేయడానికే ఈయె త్తెత్తినావు.
సాధు - నే నాలాటివాడిని కాను.. ఈ సాయంత్రము నీ కగుపడను-ఎక్కడికో ఎందుకో పోతాను... (పోవును)
బిచ్చ - మంచిది-వీనివెంట యుందును.
(పిచ్చిది వచ్చును)
పిచ్చిదాని కీనగ లెక్కడివి?..ఇవి చింతామణి నగలులా గున్నవి. తెలివిమాలిన దీనికి నగలెందుకో? పిచ్చి - నీవేనా నవనీతచోరుడవైన గోపాలుడవు? (నగచూపి) ఇవి నీకు కావలెనా?...వీటితో ఆడుకో హాయిగా! (కొన్నిచ్చును.)
బిచ్చ - ఇది సి-ఐ-డి లోది కాదు గదా?..ఎవరి కంటాపడలేదు-వీటితో నే నాశ్రమము నిర్మించుకో వచ్చును.
________
మూడో రంగము
________
(సోమగిరి శిష్యుడున్నూ వత్తురు)
సోమ - నేడే గోకులబృందావనానికి పోదాము.
శిష్యు - మీరు చూడదలచిన మహాపురుషు డేడి స్వామీ?
సోమ - నే నతని దర్శించినాను-నీవు చూడలేదా?
శిష్యు - నా కాభాగ్యమబ్బలేదు.
సోమ - బిల్వమంగళుని నీవు చూడనే లేదా?
శిష్యు - ఏమీ! ఒక లంపటుని చూడడానికా మీరింత దూరము వచ్చినారు! వేశ్యమూలాన నతడు విరాగి అయినాడు-ఈదశ ఎన్నా ళ్ళుండునో తెలియదు.
సోమ -
కాంతయుకనకము గన నొకమాయయె,
ఇటునటు లీడ్చెడు నీ జీవంబుల;
విషమబంధముల-విడివడిజాలక
మోహముగ్ధు లిల-మూల్గుతునుందురు.
కనకకామినులకాంక్ష బోవిడిచి
నిరంజనుండై నెగడెడు మనుజుని
సకలదిశాసంచారము చేసియు
నెరిగింపుము నీ వెక్కడ గననగు.
కామరహితమగు ప్రేమగన్పరచి
వేశ్యనుగొలువగ వెంగలియౌనా?
ఆశాశూన్యుడు స్వార్థవిహీనుడు
బిల్వమంగళుడు విజ్ఞుడు కాడె?
అర్థంబు కామంబు నరయ నిష్ఫలము -
క్షుద్రంబులగు నివిచొచ్చిన మనసు
ఆయతంబగుప్రేమ కాధారమౌనా?
ప్రేమమత్తుండగు ప్రేయసుం డెపుడు
చిత్తంబు నీశ్వరాయత్తంబు చేసి
సంసారజలధిని సంచరించెడును.
నిస్సంగతత్వంబు నిష్ఠురనిష్ఠ
వావిరియగు వెర్రి వైరాగ్యమెపుడు
ఏకత్వమునుబొందు నీశుతత్వమున.
శిష్యు - సంశయచ్ఛేదంబు నరగచేయగను
కృపచూపి చెప్పు డీకృపణు డీతండు
ఎట్లు మహాత్ముడై నెగడుచున్నాడు?
కామార్థములవీడి ఘను లెల్లయెడల
సన్యాసులై జోక సంచరించెదరు,
గౌరవింపరువారి గాని మీ రితని
పెద్దజేయుట చూడ పెరిగె నుత్కంఠ.
సోమ -
ఎరుగవు వత్స నీ వెరుగనేలేవు
ఆశ్చర్యజనకమౌ నా మాయలీల-
ధనముకై కొందరు ధరియింత్రు జడలు,
కొందరు తిరుగను కులటలవెంట;
సన్యాసివేషంబు చాన గికురించు
జడలపొడవునబట్టి జరుగు గౌరవము.
అష్టసిద్ధుల నెవ్వ డాసించు నేడు?
నిర్హేతుకపుభక్తి నెరయు విరళముగ.
ఆకతాయ యటంచు ననబోకు మతని
ప్రాణమర్పించె నీశ్వరపాదములకు.
మానంబు దు:ఖ మవమానంబు సుఖము
వీడి గాంచునతండు వెన్నునిపదము,
వ్రజకిశోరునియందు వరలు నాప్రేమ
అన్యసామాన్యమా అరసిచూడంగ?
కౌగలించెను శవము కాంతకై యతడు,
కోడెతాచును బట్టి గోడ లంఘించె!
చేయజాలడు దేని శ్రీరమణుకొరకు?
చిన్నికృష్ణునియందె చిత్తమున్నిలిపు.
సోమ -
భావి గోచరమవునె భావింప మనకు?
సర్వశక్తుడొకండె ♦ సర్వజ్ఞు డగును.
ప్రాణికోటి కపూర్వ ♦ బంధంబు చెలగును
నిఖిలేశ్వరుని ♦ దివ్యనీమమునను;
సరకుచేయక దాటి ♦ సంద్రంబులన్నియు
ప్రతిప్రాణియును తన ♦ బంధు నరయు
సంధానమొనరించు ♦ సర్వశక్తుడుతాను,
ఇంద్రియంబుల కెల్ల ♦ నిది గోచరంబు;
మతము, యుక్తియు, నభి ♦ మానంబు మొదలు
భావప్రపంచంబు ♦ భ్రాంతమగు నిందు;
సుఖము మిథ్యనె యెపుడు ♦ సూచించుచుండు,
దు:ఖమగ్నున కెందు ♦ దోచు సత్యంబు
బందుగులెవరొకో ♦ పరులెవరొక్కొ;
ఈశునికృపచేత ♦ నెరిగితినినేను.
స్వార్ధశూన్యప్రాణి ♦ పల్కుసత్యంబని
పలుమారునామది ♦ ప్రత్యయము కుదిరె
వంగదేశపుసాధు ♦ సంగతిమహిమ.
వంగదేశపుసాధు ♦ సాంగత్యగరిమ
భరతఖండముదివ్య ♦ భావిసౌఖ్యంబు, పరలోకసుఖము
ననుభవించునుచూపె ♦ అచిరకాలమున;
తథ్యమో మిథ్యయో ♦ దాని నారయము.
శిష్యు. - అతనిగురువులు మీర ♦ లతడు శిష్యుండు
శిష్యుని తా పెద్ద ♦ చేయునే గురువు?
సోమ - ఎవ్వాడు గురు విల ♦ నెవ్వడుశిష్యు
డాశివుడు కేశవుడు ♦ నన్యోన్యగురువులు,
నన్యోన్యమును శిష్యు ♦ లగుదురు కుర్ర!
శిష్యు - సరిపోయె గురుశిష్య ♦ సాంప్రదాయంబు!
సోమ - సంసారమున పొడము ♦ సందేహచయము;
ఇంద్రియము లనజాల ♦ విదమిత్థమనుచు;
ఒనర్చి గొప్పతర్కము ల్మహోర్వి తార్కికోత్తముల్
అహో మహేశు జేతురే స దానుమానసిద్ధునిన్
తెగించి లేడు దేవుడే అనే! కుతర్కవాదికీ
ప్రమాణ జాల మెట్లు కల్గ ప్రత్యంబు జేసెడున్.
సందేహతిమిరంబు ♦ జనియించునేని,
తరుగనిపాతర ♦ తర్కవాదంబు.
జ్ఞానసాధకు డీశు ♦ గానగా లేడు
ఈశలుబ్ధుడెవాని ♦ నెరుగంగజాలు;
వ్యాకులంబైనట్టి ♦ భక్తునిహృదయ
మెరుగంగజాలునా ♦ యీశునిక్కువము.
సదయుడైభక్తునకు ♦ సర్వేశ్వరుండె
ఒందగోరినరత్న ♦ మొడివడచేయు.
ఆకస్మికంబుగా ♦ నరుదెంచిగురువు
ఉపదేశమొనరింప ♦ సూడు సందియము.
చిత్తనైర్మల్యమున ♦ చిగురొత్తు నాశ
ఈశునివాక్యమని ♦ యెన్ని నిమిత్త
గురువును మన్నించు ♦ సురుభక్తితోడ-
ప్రత్యయంబున పొడము ♦ ప్రాణికి లాభ
మీశ్వరుడే కర్త ♦ యెందునకైన,
మానవుండు నిమిత్త ♦ మాత్రుడుసుమ్ము.
విశ్వాసముదయించు ♦ విశ్వేశుకృపను.
వాగ్రూపమునబ్రహ్మ ♦ పరలుచున్నాడు,
దానినెరిగినవాడె ♦ తత్వజ్ఞుడగును.
బిల్వమంగళుడట్టి ♦ విజ్ఞుండుగాన
నతడు గురువగు నాకు ♦ నతనిశిష్యుడను
ప్రేయసుడాత డే ♦ ప్రేమహీనుండ
ఎప్పుడుపొడమునో ♦ ప్రేమ నామదిని?
వత్సపోవుదమింక ♦ వానివెదకుచును...(పోదురు)
(బిల్వమంగళుడు వచ్చును)
బిల్వ - చిత్తమా, తత్తరపడకు స్థిరముగా నుండు.. నీచపలత్వము విడువవా? పొమ్మెంతదూరము పోదువో... జిహ్వా! నీవు హరిభజన మొనర్చుతూండు. (కళ్లుమూయును)
(అహల్యా, దాసియువత్తురు)
దాసి - అమ్మా! ఇత డొక ఉచ్ఛిష్టభోజ.
అహ - ఆలాగనకు. సాధువులా గున్నాడే-చూడు-జపము చేస్తున్నాడు.
దాసి - ఈతని కున్మాద మమ్మా! చూపుతా నుండు. ఓరి పిచ్చివాడా! అన్నము తింటావా?
బిల్వ - ఓహో! స్వర్గానికివెళ్లినా సవతిపోరే అన్నట్లు ఇక్కడికి వచ్చినా ఏకాంతమైన చోటు లేదాయెనే?
(అహల్యనుచూచి) కన్నులారా! ఏమి మీపొగరు? మానసమా, ఈమూఢచక్షువులకు దాసి వవుతూన్నావా? చాల్చాలు, నీబుద్ధి! దృష్టినిమరల్చు.
దాసి - అమ్మా! అదిగో పిచ్చివాడు నిన్నేకాగ్ర దృష్టితో చూస్తున్నాడు. ఇక్కడ మన ముండరాదు-నడువు-వీడికన్నులు చింతనిప్పులలాగు వేపచిగుళ్లవలెనూ ఎర్రవారినవి..(పోదురు)
బిల్వ - కన్నులారా, నన్నెంతకాలము మీదాసునిగా చేయగలరో చూస్తాను-(వారి వెంటనే పోవును)
దాసి - అమ్మయ్యో! పిచ్చివాడు మనవెంటే పడ్డాడు. త్వరగానడువు, నాకుభయము వేస్తూన్నది!
అహ - అతనియూసు మనకెందుకు? మనదారిని మనము పోదాము. (పోవుదురు) బిల్వ - నయనమా, మారనే ♦ నాపతి వీవె,
తలుపులుతీయు ♦ దాతస్కరుడు దూర
కలవరపడతావు ♦ కనుటకై సుఖము;
ఆశాపరంపర ♦ నాశమొందెడునా?
వేషధారివటంచు ♦ వేడబముకుప్ప!
తెలివిమాలిన మనసు ♦ తెలియమి నీకు
ఇంగితమెరుగంగనీ ♦ నిచ్చెపెత్తనము
కాలసర్పమవని ♦ కనజాల దయ్యొ!
కాటువేసినవెంట ♦ గ్రాలు లోభాగ్ని
జ్వాల మానసవీధి ♦ వ్యాకులముచేయ
మక్కువ మానసం ♦ బక్కునజేర్చి
ఎంతనీవుతిరస్క ♦ రించుచునున్న.
శిరసావహించును ♦ చిరసంగి వనుచు,
కోరినయర్థంబు ♦ కూర్చునునీకు
సంస్కారమొల్లదు ♦ సంసర్గమహిమ
చిత్తనైర్మల్యంబు ♦ చేకురదు గాన
ఈశ్వరభక్తికి ♦ నిర వెట్టు లబ్బు ?
"చెరచు వనమెల్ల తా ♦ చెడినట్టి కోతి"
అనువాక్య మన్వర్థ ♦ మయ్యె నీపట్ల
మానసమ వీడుదే ♦ మానుషత్వంబు?
నిన్నన్న పనియేమి? ♦ నేనె యీబరిని!
నడుచుచుందువు నీవు ♦ నయనంబువెన్క.
నాలుగో రంగము
_______
(చింతామణి యింటియెదుట పొదలో బిచ్చగాడు బైట దాసి సాధువున్నూ ప్రవేశము.)
దాసి - ఇంట్లోకన్న నిక్కడమేలు. నాల్గువైపులా దారులున్నవి, మనమాట లెవరికీ వినిపించవు.
బిచ్చ - (స్వ) అట్లే యనుకోండి- నే నిక్కడున్నాను.
దాసి - నీవు తిరిగీ రుద్రాక్షలతో సిద్ధమయినావా? పిచ్చవానిలాగు రమ్మన్నాను కానా?
సాధు - నీతో నొకరహస్యము చెప్పవచ్చినాను.
దాసి - నీ కృష్ణప్రేమ అటుంచి, కర్తవ్య మూహించు. మాయజమానురా లిప్పు డేమీ చూడడములేదు. బీదసాద లెవ్వ రగుపడినా, వారికి కావలసినంత ధన మిస్తూన్నది. నీవూ అడిగిచూడు, నీప్రాప్త మెట్లుందో.
సాధు - చెట్టంతా పెల్లగించడము శ్రేయము కాదా?
దాసి - అనగా?
సాధు - దేనినీ చూడలే దన్నావే?
దాసి - ఓహో! అంతా ఒక్కసారే హరిస్తా నంటావా? అబ్బో? ఒకక్షణమైనా యిల్లు విడిచిపోదు. తలుపులన్నిటికీ తాళాలు, సాయంత్రము స్నానానికి పోతుంది. దొంగలాడితే నీకు మంగలము దొరకునేమో! ఇనుపపెట్టె బద్దలు గొట్టి లొడ్డు లొసుగూ దక్కించుకోగలవా? సాధు - నాభావము నీకు బోధపడలేదు. అన్నమూ పానమున్నూ అరసి చూచునా?
దాసి - ఆ గోలేలేదు. ఏమి చేయదలచుకొన్నావు?
సాధు - అట్లైతే మరీమేలే.
దాసి - నీళ్ళు నమలక చేయదలచిం దేదో చెప్పు.
సాధు - పాలలో విషము కలిపితే?
దాసి - అమ్మయ్యో! విషమే! విష మెవరు పెట్టుతారు? నాచేతకాదు సుమా! నాపీకమీదికి తేవలెనని నీ యూహ!
సాధ్ - ఆలాగు కాదు. రాత్రి నదిలో స్నానముచేసి వచ్చును కదా? వంట చేయడము నీవే, ఆమె పిచ్చిది, అసలే తెలుసుకోలేదు; పాలలో కలిపిపెట్టి నీదారి నీవు పట్టు.
దాసి - నీ కనడము సులభమే, నాఒళ్ళు ఒడకుతూంది, ఆపని నాచేతకాదు. నాకు విషము దొరకడ మెలాగు?
పెట్టినప్పు డెవరికంటనైనా పడితే నన్ను రక్షించేవారెవరు? నా వల్లకాదు. సుమా.
సాధు - పిచ్చియెత్తినవాళ్ళు చచ్చుట మేలుకాదా?
దాసి - నీ వెంతచెప్పినా సరే, ఆపని నావల్ల కాదు.
(పిచ్చిది వచ్చును)
సాధు - (పొట్లముతీసి) ఇదిగోమందు, తీసుకొనిపోయి పాలలో కలుపు. ప్రాణము పోగానే పూడ్చివేతాము. దాసి - నీకి దెక్కడిది?
సాధు - ఇదెప్పుడూ నాదగ్గర నుంటుంది. నా కనుక్షణమూ చావవలెననే యుంది, కాని నీమీదిప్రేమచేత నిట్లు జీవించియున్నాను. నీవు చిక్కకుంటే చావడము నిశ్చయము!
దాసి - ఈపని నావల్ల కాదు. వంటింట పాలున్నవి, నీ చిత్తమువచ్చినట్లు చేయవచ్చును-నేనింట్లో ఉండను-అంతా నీవే చక్కచేయుము.
సాధు - నే నొక్కడనే పాతగలనా?
దాసి - పడుచువాడవు పాతలేవా? నాచేతకాదు సుమా! ఆమా టంటేనే నాకడలు.
సాధు - నీకేమి భయమూ? రహస్యమైన చోటు చూపితే మిగిలింది నేనే సర్దుకొంటాను.
దాసి - ఆమె సర్వస్వమూ నాచేతిలో నుంది-మంచి వాళ్ళ దొకటే మాట-ఏమి జరుగుతూంటుందో చూస్తాను.
సాధు - అదీ మాట! (పిచ్చిది పోవును)
దాసి - చెప్పే దొకటి, చేసే దొకటి నాచేతకాదు.
బిచ్చ - అభ్భా! ఈదుర్మార్గు డెంతచేయ దలచినాడు! తలవ్రాత ఎట్లుండే అట్లు తప్పకుండా జరుగును. అదే ఆమె వస్తూన్నది, అంతాఆమెతో చెప్పుతాను. ఈ పిచ్చిదికూడా వచ్చిందే?... పాపముచేసిన ప్రాణము క్షోభిస్తుంది - పాప మమాయికురాలి నెంత చేయదలచినారు వీరిద్దరు! ఆమె యెవ రేమిచ్చినా తింటుంది. అందరూ మంచివారనే యెంచుతూంది. (చింతామణి వచ్చును)
చింతా - సూర్యు డస్తమించినాడు, మరల రాత్రి అయింది; ధనలుబ్ధు లెవరైనా నన్ను చంపితే నా కిహమూ పరమూ కూడా చెడుతవి-మనమా, ధనము నార్జించడమునకే కదా లోకుల మానసములందు వ్యధ పట్టిస్తూన్నావు, అట్టి వారు నిద్రకి సెల వివ్వవలెనుకదా?...బిల్వమంగళుడున్నంత కాలము ఈయూహతోపనే లేదు..అయ్యో! మానసమా అతనిప్రేమ నొకనాడైనా రుచి చూచినావా? హీనమగు వేశ్య మానస మవు-నీతల్లి నిన్నిందు ప్రవేశింపచేసింది-ఈ జన్మ మధ్యాన నీవా డనదగినవా డొక్కడైనా ఘటించినాడా? ఏ రూపౌద్ధత్యము బిల్వమంగళుని మర్మముల భేదింపగల్గెనో ఆరూపమే ప్రకృతమున నీకు అమితాపకారి యైంది. ఎందరి నెంతక్షోభపెట్టి యుంటివో ఆలోచించుకో. నిరాశ్రయివగు నీవక్క్షమున ఎవరైనా కత్తితో పొడుస్తే ఏమిచేయగలవు? తుదకు నీగతి యింతకు వచ్చిందా? నీకు మృత్యువు తప్పదని ఎప్పుడైనా భావించినావా? అట్టి దిన మెప్పుడు వచ్చునో ఇప్పుడైనా ఎరుగుదువా? నీ కెవరు దిక్కు? ఎక్కడికి పోయెదవు? మహాపాతకివైన ని న్నుద్ధరించువా రెవరు?...పోతాను... బిల్వమంగళుని దగ్గరకే పోతాను! అతడు సాధుసంపన్నుడు, నన్ను నిరసించడు...నా కాముష్మికసుఖోపాయము తప్పక ఎరిగించువాడు... నే నొంటిగా... అబలను....ఎట్లు? పోగలను? అతని నెక్కడ వెతకుదును? ఈ పాడుశరీరము నాకు శత్రువైనదే!
(పిచ్చిది వచ్చును)
పిచ్చి - అమ్మా! అమ్మా! నేను నిన్ను చూస్తూనే ఉన్నాను... అదిగో... నక్క లీడుస్తూతింటూన్నవి-చూడు, చూడు-నేనూ కడుపునిండా తిన్నాను-పశువులు క్రిములు పక్షులూ ఆన్నీ ఆలాగే తింటూన్నవి... అదే-అదే-చూడు.
చింతా - మాయింటికి వస్తావా?
పిచ్చి - రాను-ఇక నింటికి రాను - అత డక్కడ లేడు- నీ అల్లుడు....వెర్రివాడు...ఇంట్లో లేడు... శ్మశానములో ఉన్నాడు! ఇక నింటికి రాను-అదంతా శూన్యము!
చింతా - నిజమే-ఇంటికి పోవడమన్న భయము వేస్తూంది.
పిచ్చి - అమ్మా! విషము, విషము-మగవాడూ ఆడదీ ఆలోచించుకున్నారు. సముద్రమధనము చూడబోయినారు-విషము... విషము-నీవు నావెంట రా. విషము తాగలేవు! సంసారసముద్రమథనం చేస్తే విషము వెలువడుతుంది. హరుడూ గౌరీ చూడబోయినారు. ఎరుగుదువా?
బిచ్చ - ఓహో! ఇది వెర్రిది కాదు-దీనిమాటలన్నీ నిజము. (పిచ్చిదానితో) నీ, వెవర్తె వమ్మా? (చింతామణితో) ఈమెమాటలు నిజము సుమా! ఈమె ఎవర్తెయో మహాత్మురాలు. పిచ్చి - మరపించి విడిచె నా ♦ మగడు ప్రాణములు,
వేనరిత జగమంత ♦ వెర్రెత్తి తిరిగి,
ఎటనైన నాకంట ♦ నెప్పుడు పడడు,
ఏడ నున్నాడో నా ♦ కెరిగింతు రెవరు?
చీకటిపడుచోటు ♦ నాకదే యిల్లు,
శ్యామలమేదిని ♦ శయ్యయగు నాకు,
ఆకస మగు నాకు ♦ నాచ్ఛాదనంబు,
మర్త్యనైనను నేను ♦ మరణింప బోను-
అతనిమనసున నెట్టి ♦ యాశ లుండెనొకొ?
చింతా - ఎవ్వడు నీభర్త ♦ ఎలనాగ చెపుమ
పిచ్చి - ఐదుగురుపతులు నా ♦ కబ్జాక్షి వినవె:
శివుడు, కృష్ణుడు, కాళి ♦ శివ కాదు కాదు,
మగడొక్కడే నాకు ♦ మగనాలి నమ్మ
అల్లడుగో నామగం ♦ డదిగొ నాభర్త
అన్యులెవ్వరు కారు ♦ అతివరో నేను
అతనికి దాసిని ♦ అన్యులకు కాను-
వేణునాదము చేయు ♦ విశ్వేశు డడుగొ.
నాకు సిగ్గౌతూంది-ఇక్క డుండలేను, విషము విషము, విషము-పరుగెత్తి నా వెంట రా?
బిచ్చ - అన్ని సంగతులూ తెలుసును, ఇదేటి పిచ్చి! (చింతామణితో) ఈమె పిచ్చి దనుకోకు, నిజమే చెప్పింది; ఈపొదలోనుండి నేనంతా గనిపెట్టుతూన్నాను. ఆ నాడు నా వెంటవచ్చిన సాధువుతో నీదాసి నీకు పిచ్చిపట్టిందని చెప్పింది, వారిద్దరూ దుస్తంత్రము పన్నినారు; నేడు పాలలోకలిపి నీకు విషము పెట్టడానికీ, ప్రాణాలు పోగానే పాతిపెట్టడానికీ నిశ్చయించుకొన్నారు.
చింతా - విషమా! ఆమూలమూ తెలిసింది. దాసిమాట తలుచుకొంటే దడ పుట్టుతూన్నది -
పాడుచిత్తమ నీవు ♦ పరికించి చూడు
ఈధనము రూపు ని ♦న్నెంతకు తెచ్చె!
ఇల్లు జాతియు చేసె ♦ నింత ద్రోహంబు.
పిచ్చి - అవి కావు హేతువు ♦ లట్లనబోకు
లోభనీయము ధనము ♦ లోకంబులోన
చెట్టుక్రింద వసింతు ♦ శ్రీహరినేని
కోరనేదియు; కడలి ♦ కూతు రొకనాడు
ముద్దులుగా రా నా ♦ వద్దకు రాగ
పోవమ్మ వేగమే ♦ పొమ్మంచు నామె
పోనాడితిని మించు ♦ బోడిరో రమ్ము
ఇంటిలో నుండక ♦ జంట పోవుదము.
చింత - విషమయము సంసృతి ♦ వెగటు పుట్టించు
విడువజాలనిప్రాణి ♦ వెంగలియె కాడె
మందేహతో దాని ♦ నిందనుక వలచి
మత్తుచెందెను కాని ♦ చిత్త మీనాడు
మెలకువజెందె నో ♦ మెలత బోధింప,
జోకపుట్టెను మది ♦ జోడు దొరకగను,
వెర్రిదానా, నిన్ను ♦ విడువంగజాల;
రావమ్మ నమ్మితిని ♦ రా ముద్దుగుమ్మ,
నీతోడ నుందును ♦ నీనీడ వోలె
అమ్మ నినుచూడ నా ♦ కాశ పొడమినది
కారణం బరసిన ♦ గానంగరాదు,
ధైర్యంబు చిక్కె నీ ♦ దరి జేరుకతన,
కోర్కెలు నాయవి ♦ కొనసాగగలవు.
నీవుచెప్పినదంత ♦ నిక్కమే తల్లి!
కంకితోడనె తన ♦ కడుపు నిండంగ
నింగికి విహగంబు ♦ నీల్గుచుపోయి
కొనితెచ్చుకొను నను ♦ కోని యాపదలు.
వీడి సర్వంబు నీ ♦ వెంటవచ్చెదను,
అభయమిచ్చితిగాన ♦ నాశ్రయము దొరకె,
ఎట గొనిపోదువో - యేర్పరుపు మీవ.
పిచ్చి - యమునాతీరమునకు పయనము కమ్ము.
చింతా - నడువు-పోదాము (తాళముచేతులు పార వేయును)
పిచ్చి - దాని నాకిమ్ము.
చింతా - తీసుకో...(ఎత్తి ఇచ్చును)
పిచ్చి - నీవు తీసుకో.. (బిచ్చగాని కిచ్చును)
బిచ్చ - అయ్యో! సర్వస్వమూ విడిచి చింతామణి పోతూన్నదా? ఇక నేనెవ్వరిని కాచుకొని యుందును? నేను కూడా వారివెంటనే పోతాను. (తాళముచెవులు పారవైచి) ఇంత కూటికున్న పోలీసువారు నన్నేమిచేయుదురో? ఇప్పుడేమి చేయగల్గినారు! నా నుదుటిరాత ఎట్లుంటే అట్లు జరుగుతుంది. వీరు దేశాటనము చేస్తారు. హరిభజనమే వారి కుభయతారకము. లోభము నెవ్వ డాపుకొనగలడు? జగదంబ దుర్గయే దిక్కు ! ఈచింతామణి మృత్యువు నోటినుండి బైట పడింది కదా? నే నీపోలీసువారినుండి తప్పించుకో లేనా?.. (పోవును)
_______
ఐదో రంగము
_______
(వర్తకుని ద్వారముచెంత బిల్వమంగళుడు)
వర్త - అయ్యా, మీరెవరు?
బిల్వ - నేను బాటసారిని, నిలువ నీడ అడుగ వచ్చినాను.
వర్త - మీకీదశ పట్టిందేమి? మీవాసస్థల మేది?
బిల్వ - ఎక్కడుంటే అదే నాయిల్లు.
వర్త - గృహస్థాశ్రమము విడిచినారా?
బిల్వ - లేదు.
వర్త - నేడు నా ఆతిథ్యము స్వీకరింతురా?
బిల్వ - అందుకే ఇటు వచ్చినాను. వర్త - మాఅదృష్టము! దయచెయ్యండి.
బిల్వ - నాకొక కోర్కె కలదు.
వర్త - సెల వివ్వండి.
బిల్వ - ముందు నావృత్తాంతము విను.
వర్త - మీ రెట్టివారైన నేమి?
బిల్వ - అట్లుకాదు. నేనొక లంపటుడను. వేశ్య మూలమున సంసారభ్రష్ఠుడ నైనాను.
వర్త - అభ్యాగతులు కావున మాకు విష్ణుస్వరూపులు. దయచేసి లోపలికి రండి.
బిల్వ - నాకోరిక నెరవేర్చెదవా?
వర్త - అదేదో సెల వివ్వండి.
బిల్వ - నారులమిన్న నీ ♦ నవమోహనాంగి
అబ్జాకరముచెంత ♦ హరియించె మదిని
వాలుచూపులు మోహ ♦ వార్ధి బడదోసె
ఓర్వంగజాల నీ ♦ యౌర్వానలంబు
పాపిమానస మెంత ♦ బండయో కాని
పూర్వసంస్కారంబు ♦ పోకుండకతన
నెంత వారించినా ♦ పంతమును విడక
కొని తమి నీకాంత ♦ గోరు వీక్షింప.
కాననే వచ్చితిని ♦ కాంక్ష మది హెచ్చి
నతిథిసత్కారప ♦ రాయణుడ వైన
ఏకాంతమున నొసగు ♦ మాకాంత నాకు.
విలువగల వసనంబు ♦ తులలేని నగలు,
వాసన వస్తువుల్ ♦ వలపు చేష్టలును,
అనురాగపూరితం ♦ బగు మానసంబు,
గలుగంగజేసి ♦ నాకడ కంపు నేడు.
వ్యక్తపరిచితి పాప ♦ సక్తమగు కోర్కె;
నెరవేర్పవేడెద ♦ నెయ్యంబు మీర;
కాదు నిర్బంధమిది ♦ కాంచు మర్భకుడ,
నీయలేనన్నచో ♦ నేగెద నిపుడె.
వర్త - (స్వ) విశ్వేశ్వరా! ఎట్టి ♦ విషమసంకటము
దాపురించితి? వేది ♦ దారి గనరాదు.
లేదన్న నీ యతిథి ♦ లేచిపోయెడును,
ఎరుగంగజాల నిత ♦ డే మహాత్ముండొ,
తలముమీరిన యిట్టి ♦ ఛల మేలపన్నె?
విముఖుతజేయ విధి ♦ విహితంబు కాదు,
సడల నిత్తునె అతిథి ♦ సత్కారధర్మ;
మదికదా గృహమేధి ♦ కధికధర్మంబు!
ధనము దారను వీడి ♦ ధర్మరక్షణము
చేయంగ సిద్ధించు ♦ శ్రేష్ఠమగు గతులు.
కాంతయెవ్వతె నాకు ? ♦ కనక మెట్టిదియొ?
ఋణము చెల్లిన పిదప ♦ గణనకు రావు;
ధర్మమే ముక్తికా ♦ ధారంబు గాన,
వేడ్కతో రక్షింతు ♦ వీటిని విడిచి.
(ప్రకా) వింటిని రమ్ముము ♦ క్కంటి కెనయౌదు,
వీరీతి నన్నుప ♦ రీక్షచేయుదువె?
కొమ్ము నాకాంత నీ ♦ కోర్కె తీరంగ
నీకాంతగా రేయి ♦ నిండు తమకమున.
బిల్వ - కంటివా చిత్తమా ♦ కన్నెంత గడుసొ,
ఏమి చేయగనెంచి ♦ తేమి నీవెర్రి?
ఆరో రంగము
(అహల్య-దాసి)
అహ - ఇంకోసారి పోయి అతనిని మంచిమాటలతో సమాధానపరిచి తీసుకొని రా. అతని కేదికావలెనంటే అదే భుజించనీ.
దాసి - నేను వెళ్లనమ్మా, బెల్లముకొట్టిన రాయి లాగ ఉలుకడు పలుకడు.
అహ - చీకటి పడేలాగుంది-ఒక్కసారి పోయిరా; ఆత డింతవరకు రాలేదనీ భుజించలేదనీ అయ్యగారికి తెలిస్తే, నామొగ మింక చూడరు-వారు వచ్చువేళ కావచ్చింది. పో, పో.
దాసి - మొగముముడుచుకొని మొద్దులాగ కూర్చున్నాడని మనము చెప్పలేమా? ఆ నిర్భాగ్యు డెక్కడా కనబడడు; పెద్దయింటిపడుచు పుక్కెడు నీరైనా తాగలేదని ఎరుగడా? అసలే పిచ్చిముండాకొడుకు! బిందెడు నీళ్లు నెత్తిమీద పోస్తే మెదడు చల్లబడి మతికుదిరి అప్పుడు తింటాడేమో? (వర్తకుడు వచ్చును)
వర్త - దాసీ-నీవు అతిథిని భోజనము కాగానే నావద్దకు తీసుకొని రా.
దాసి - ఎట్లు రాను? ఆపిచ్చివా డెక్క డున్నాడో?
వర్త - పిచ్చివా డనకు, అతడు మహానుభావుడు! చండీమండపమందు కూర్చుండును, పోయి తీసుకొని రమ్ము. (అది పోవును)
ప్రేయసీ, నీదగు ♦ వేషభూషలను
గాంచ పులకితమయ్యె ♦ గాత్రంబు చూడు;
ధన్య నీరూపమా ♦ ధారంబు గాగ
నబ్బెను నీకిప్పు ♦ డబ్జాక్షు కొల్వు;
హితము బోధింతు నో ♦ యతివరో వినుము:
సారంబులేనిసం ♦ సారంబులోన
ధర్మమొక్కటె సుమ్ము ♦ తథ్యంబు, దాని
రక్షణచేయుప ♦ రీక్షయగు నిలను-
అతికష్టములు మనల ♦ నలమిన గాని
విడువగూడదు ధర్మ ♦ ముడురాజ వదన,
అన్నమాటను నిల్పు ♦ టంత్యధర్మంబు.
అగ్నిసాక్షిగ నిన్ను ♦ నందిన నాడె
అతిథుల నర్చింతు ♦ మని బాసచేసి
గాహన్‌స్థ్యపదవిని ♦ కా లూనితిమిగ.
దైవకృప నిన్నటి ♦ దనుక నది జరిగె,
నేడు కానున్నది ♦ చూడు పరీక్ష,
నిల్పుదుమో ప్రతిన ♦ నిల్పజాల మొకొ
నీయందె ఉన్నది ♦ పాయకుము దాని.
దీనుండు హీనుండు ♦ మ్లానవదనుండు
నాకాంక్షతోడ న ♦ న్నడిగెను, "రేయి
నేకాంతమున నొసగు ♦ నీకాంత నాక"ని
ఎంత యాశ్చర్యమో ♦ యింతి కనుగొంటె,
పతినిగోరుట యిమ్ము ♦ సతిని నాకంచు?
ధర్మరక్షణ మనకు ♦ తప్పదు గాన
అతిధికోర్కెను తీర్పు ♦ మతిప్రసన్నతను,
సత్కార్యమున గాదె ♦ సద్గతులు కలుగు!
అహ - హానాధ, మీరిట్టు ♦ లాడంగ తగవె?
విపరీత మిటులాడ ♦ వేడ్క పొడమెనొకొ?
మానమే భూషణము ♦ మానవతి కెందు;
భంగంబు చేయుదురె ♦ భర్తలే దాని?
ధర్మమార్జింప న ♦ ధర్మ మొనరింప
వచ్చునే ? మనఖ్యాతి ♦ మచ్చమాయదొకొ?
మానంబె భూషణము ♦ మానవతి కెందు
కోలుపోయిన దాని ♦ గోడు చేకూరు.
కావర మది యన్యు ♦ కాంతను గోరు
టొప్పకుండిన నగునె ♦ తప్పు మన కిందు?
మీరలే ప్రాణంబు ♦ మీరలే యాత్మ,
మీరలే జ్ఞానంబు నాకు ♦ మీరె ధ్యానంబు,
శివుడైననేమి కే ♦ శవుడైన నేమి?
ఇతరుండు నామది ♦ నెలయజాలు నొకొ?
సర్వదేవతసార ♦ సంభూతులయ్యు
కుత్సితాచారంబు ♦ కొనజూతురేల?
వర - త్రికరణశుద్ధిగా ♦ సకలంకప్రేమ
నీవుజూతువు నన్ను ♦ నెరుగుదు నబల,
కోరవు ప్రేమకు ♦ మారుప్రేమంబు,
తుచ్ఛమగు స్వార్థంబు ♦ ద్రుంచలేవైతి.
నాసొత్తు వీవని ♦ నమ్మితి గాన
నేను వితరణచేయ ♦ నీకు జం కేల?
సారంబు ధర్మంబు ♦ సం సారమునను,
ఇతరార్థచయ మంత ♦ హీనసారంబు!
అతిథి పోదోలిన ♦ నడగు ధర్మంబు,
ధర్మంబు తప్ప మి ♦ థ్యావాది నగుదు;
గళితుడగు నీభర్త ♦ కంటకము కాడె?
కనుక నామేలు నే ♦ డొనగూర్పు మతడు
కోరినదెల్ల నే ♦ గూర్చెద నంటి-
క్షమియించు జాల్ముడ ♦ సత్యంబు నిల్పు.
స్వార్థపరుండనై ♦ చాన! నిన్నమ్మి
ఆర్జించుచుంటినే ♦ నాత్మధర్మంబు.
అతిర్హిపూజావ్రత ♦ మాదుకొనునాడె
చింతింపబోలు నీ ♦ చిక్కు నిర్వురము.
స్వర్గంబునకు త్రోవ ♦ సంకటం బతివ!
"సమకూరు విఘ్నములు ♦ సత్కార్యములకె".
సరకుచేయక విఘ్న ♦ సమితి కార్యములు
నిర్వహించుట సుమ్ము ♦ నియతి ధీరులకు;
అతిథి కోరినదాని ♦ నర్పింతుమనుచు
నియమంబు దాల్పమే ♦ నెలత! ఇర్వురము?
"ఒప్పకుండిన నగునె ♦ తప్పు మన" కంటి
వ్రతభంగమును చూడ ♦ వత్తురా జనులు
అనుచు దలపగరాదు ♦ అతివరో! సర్వ
సాక్షి లేడే హృదయ ♦ సారసంబునను?
వాని మొరంగుట ♦ వశమౌనె మనకు?
ప్రఖ్యాతి వడసితివి ♦ పతిపత్ని వనుచు
నీసద్ర్వతపరీక్ష ♦ నేడు కాగలదు,-
నీపతిధర్మంబు ♦ నిల్పుదువొ లేదొ
ధర్మసాక్షిగ నేడు ♦ తథ్యంబు తేలు.
ఆగంతువుండగు ♦ నాదివిష్ణునకు
ధారపోసితి నాదు ♦ దారవగు నిన్ను,
ధర్మమగునో కాదొ ♦ తథ్య మారయుము.
అహ - తరుణుల కట్టివి ♦ తర్కంబు తగదు;
ఇట్టిచో నన్ను ప ♦ రీక్షించనేల?
మీకు దాసిని కాన ♦ మీయాజ్ఞ శిరము
నందు దాల్చుటె నాకు ♦ నౌను విధి సతము,
బదులుచెప్పను నేను ♦ పతియాజ్ఞ కెపుడు.
వర్త - తరుణి! ధర్మంబులకు ♦ దైవమే ఠావు,
అతిథిపూజాధర్మ ♦ మత్యుత్తమంబు.
(దాసి వచ్చును)
దాసి - అయ్యా, అతిథి యంగణమున నున్నాడు.
వర్త - ప్రేయసీ, నేను వానిని తోడుకొని వత్తునా?
అహ - ఇంక నాలస్యమేల? అన్నిటికీ మిమ్మే నమ్ముకొన్నాను.
(వర్తకుడూ బిల్వమంగళుడూ వత్తురు)
వర్త - ఆర్యా, ఈమెయే నా గృహిణి, మీ చరణదాసి...(పోవును)
అహ - అయ్యా, మీ రీశయ్య నలంకరించండి.
బిల్వ - వలదు-ఇక్కడ నుండియే నిన్ను వీక్షిస్తాను.
(స్వ) మానసమా! నీవు ♦ కానంగలేదె
కన్నులు నిన్నెట్టి ♦ గతి కీడ్చి తెచ్చె?
ప్రభవించితివి నీవు ♦ బ్రహ్మముఖమునను,
వీరిడి వైతివి ♦ వెలయాలి నమ్మి,
పితృశ్రాద్ధ మొనర్ప ♦ ప్రీతి విడచితివి,
కోలుపోయితి ధృతి ♦ కులట గలియుటకు;
ఓరుగాలియు వాన! ♦ ఘోరమగు రాత్రి
పోరాడు చుండగా ♦ వ్యోమంబు భూమి
కల్లోలయుతమైన ♦ గంగలో దుమికి
శవము నాశ్లేషించి ♦ చావుతప్పితివి!
భ్రాంతిచే సర్పంబు ♦ రజ్జువు గాగ
కులటను గానంగ ♦ గోడ దాటితివి!
ఏమిపురస్కార ♦ మిచ్చె నావేశ్య?
కారించు నాతిర ♦ స్కారంబు గుండె
వ్రక్కలు చేయంగ ♦ వైరాగ్య మూని
సర్వంబు త్యజియించి ♦ సన్యాసివైతి;
కృష్ణు డెక్కడ యంచు ♦ కీరంబు పగిది
బిగ్గర నరచితివి ♦ ప్రేమ నుప్పొంగి.
వీక్షింప నీతెరగు ♦ విస్మయం బొదవు!
పాపిచిత్తమ! నీవు ♦ పల్వలము చెంత
పలుమారు ధ్యానించు ♦ బకమువలె నుండి,
కంకణంబులరవము ♦ కర్ణముల సోక
నపురూపముగను ము ♦ త్యపు చిప్పవోలె
తెరచి కన్నుల గాంచి ♦ తెరవ నొక్కర్తు.
సై పంగలేక మరు ♦ శరముల బారి
చెరుపవచ్చితి వామె ♦ శీలంబు నిపుడు.
ఏమి యున్మాదమే ♦ కామినుల గనిన!
కన్ను లున్నవటంచు ♦ గర్వ మిదియేల?
ఈపాటి భాగ్యంబు ♦ రూపరు నంచు
వందురు దేమొ? కను ♦ వాటి దుండగము.
ప్రాణంబు పోవునను ♦ భయముచే నదిని
క్రోడము చేర్పించె ♦ కుళ్ళిన శవము!
హేయమగు వస్తువని ♦ ఎంచమే దాని?
పునుగు జవ్వాజియు ♦ పుత్తడి నగలు,
విలువైన వసనంబు ♦ వెలలేని హొయలు,
ఈరేడుజగముల ♦ నీసడింపగజాలు
నిట్టి తనులత కూడ ♦ నట్టిదే నమ్ము.
బొందిలో ప్రాణంబు ♦ పోయిన వెన్క
వెడలును దుర్గంధ ♦ వీచికలె దీన,
నిది నాశరహితమని ♦ యెంచితివే మొ?
సారహీనంబు సం ♦ సారమని యెరుగు,
హీనతర సారంబు ♦ నీతనువు! రోత!
కన్నులు మెరుగును ♦ గని భ్రమియింపగ
వెర్రివై వర్తకుని ♦ వేడితివి భార్యన్.
నీదు రత్నంబులే ♦ నిన్ను వంచించె
ఇవి లేకయుండిన ♦ నింత వచ్చేనా?
కోలువోయిన నివి ♦ కొంత శ్రేయంబు
కొరగామి పోయిన ♦ కొరత యుండదుగా?
నిస్సార మెప్పుడే ♦ న్నిత్యధన మగునా?
ఈహ వీడుమ యిట్టి ♦ మోహజాలమున.
(ప్రకా) తరుణీమణీ, నీ సిగపువ్వు నిట్లిమ్ము. (ఆమె యిచ్చును) నాయాజ్ఞ నీ కవిలంఘ్యమని నీభర్త నీతో చెప్పెనా!
అహ - చిత్తము.
బిల్వ - అమ్మా! నేను మీ వెంగలిసుతుడను, ఈ మాట నీపతితో మనవిచేయుము, పొమ్ము.
అహ - నిజముగా నీతడు మహాత్ముడే!....(పోవును)
బిల్వ - మానసమా, ఇంత ♦ మమత నీకేల?
కాలసర్పంబు లీ ♦ కళ్ళంచు దలచి
శత్రునాశంబును ♦ సమకట్టు చేయ;
ఉత్తమనయనంబు ♦ నిత్తు నిత్తరిని.
దాన జూడగవచ్చు ♦ దానవారాతిన్.
జ్ఞానంబు నిచ్చునదె ♦ జ్ఞానేంద్రియంబు
తనుకుడ్య జాలరం ♦ ధ్రంబు లీకళ్ళు.
జ్ఞానరత్నము గొన ♦ జాలు తస్కరులు!
పొడిచెద వీటిని ♦ పొల్లువో తుడిచి
సారంబు గొనెద సం ♦ సార నన్యమున.
(కళ్ళు పొడుచుకొనును)
కళ్ళు పోయెను కాన ♦ కదలుడీ యింక
కాలు సేతులు మీరు ♦ కంజాక్షు గొల్వ.