బిరాన వచ్చెను శివుడు తరలి

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు


బిరాన వచ్చెను శివుడు తరలి బిరాన వచ్చెను శివుడు 

ఆనందమ్మున అడుగులు వడి వడి ధిం ధిం ధిమ్మని చిందులు వేయగ
కాళ్ళకు కట్టిన బంగరు గజ్జెలు ఘలు ఘలు ఘల్లని సవ్వడి చేయగ
మెడలో పాములు సుడులై ముడులై బుసు బుసు బుస్సని రేగగ
తలపై గంగమ వళులై అలలై గలగల గలమని పొంగులు బెట్టగ

వెంబడి తగిలిన పర్వత పుత్రిక చిడి ముడి నడకల వెలయింప
చుట్టూ ముట్టిన ప్రమథ గణేశులు బూరలు సారెకు పూరింప
శంఖమ్ములలో శృంగమ్ములలో గాలులు సుడులై హోరెత్త
శివునికి ముందర నంది యెనర్చెడు నాట్యమ్ముద్ధతమై హత్త

మందర గిరికిని కాశీ పురికిని మెరపుల రథములు పరుగెత్త
ఆ రథములకు ప్రమథుల మనసులె చక్రములై గిర్రున తిరుగ
అంబర వీధుల నానందాద్భుత నాట్యోత్సవములు చెలరేగ
కాశీ పురమున రాశీ కృతమై సచిదానందము రూపెత్త

బిరాన వచ్చెను శివుడు తరలి బిరాన వచ్చెను శివుడు