బాల వ్యాకరణము/ప్రకీర్ణక పరిచ్ఛేదము
ప్రకీర్ణక పరిచ్ఛేదము.
1. పదాద్యంబులు ఋ ఌ వర్ణంబులు ర ల తుల్యంబులు.
అతఁడు ఋషి - ఇట సంధి లేదు. ఆ ఋషి - ఇట యడాగమము లేదు. వచ్చె ఋషి - వచ్చెన్ ఋషి - వచ్చెను ఋషి. ఇట ద్రుతమునకు లోప సంశ్లేష స్వత్వములు.
2. ఆచ్ఛికపదంబులం దుత్తమంబు లగు రు లు డు ల ముందఱి యేత్వంబునకు హ్రస్వంబు విభాష నగు.
నల్లేరు - నల్లెరు, పల్లేరు - పల్లెరు, పెన్నేరు - పెన్నెరు, మానేరు - మానెరు, ఆడేలు - ఆడెలు, కుందేలు - కుందెలు, తోఁడేలు - తోఁడెలు, నాఁగేలు - నాఁగెలు, నేరేడు - నేరెడు, మారేడు - మారెడు, పూరేడు - పూరెడు, తంగేడు - తంగెడు.
3. ఊ యే ల పయ్యెద తాయెతులం ద్రిక్క నామంబులందు యాకుం దాలవ్య వక్రయోగంబు లేదు.
స్పష్టము.
4. ఊయేల యూయాల ల చాఁపుల నొండొంటికిం గుఱుచ యొండె నగు.
ఉయేల - ఊయెల - ఊయేల - ఉయాల - ఊయల - ఊయాల. వక్ష్యమాణంబు యద్విత్వంబు. ఉయ్యేల - ఉయ్యెల - ఉయ్యాల - ఉయ్యల. 5. పయ్యెద పయ్యద.
6. ఊ యే లాదులం దొలియచ్చుమీఁది హల్లునకు ద్విర్వచనం బొండె నగు.
ఉయ్యేల - ఊయేల, ఊయేల - ఊయెల, ఊయాల - ఊయల, ఆయె - ఏవిధము - ఓయ - ఓయారము - కోపు (ధనురగ్రము) - జాగర - తీనియ - తీయము - తేప(ప్లవము) - తేమ - తోయలి - దీవియ - నూవు - నోవి - నోవు - పూవు - పేయ - మోక(అంకురము) మోటిక - మోపు - వీయము ఇత్యాదు లూయేలాదులు.
7. ఱ కారంబు క్రింది ఱ కారంబునకుం దుది ను లు ల క్రింది న ల లకు లోపంబు బహుళంబుగ నగు.
అఱ్ఱు - అఱు, గొఱ్ఱియ - గొఱియ, కన్ను - కను, నన్ను - నను, పల్లు - పలు, విల్లు - విలు.
8. అక్కటాదుల ౙడ్డకు లోపంబు విభాష నగు.
అకట - అక్కట. అక్కట - అట్టిక - అట్టుక - అట్టె - అయ్యో - అయ్యారె - అవ్వారి - ఇట్టిక - ఉప్పవడము - ఉమ్మి - ఎక్కసక్కియము - ఎక్కసెక్కియము - ఎక్కిరింత - ఎడ్డ - ఎన్నిక - ఎమ్ముక - కజ్జాయము - కట్టా - కట్టిక - కప్పురము - కమ్మటము - కమ్మతము - కువ్వాడము - కొట్టిక - కొమ్ము - కొయ్యగూర - గయ్యాళము - గిజ్జిగాఁడు - గుజ్జరాతి - చిట్టి - చిన్న - చిమ్మట - చెన్నఁటి - చెప్పుము - చెప్పుఁడు - చెమ్మట - చెల్లి యలు - జవ్వాజి - జాబిల్లి - తమ్మటము - తమ్ములము - తల్లి - తుమ్మికి - తువ్వర - తెల్ల - దువ్వు - దివ్వియ - నవ్వు - నిద్దుర - నివ్వరి - నివ్వాళి - నువ్వు - నెట్టిక - నెమ్మలి - పవ్వళించు - పిన్న - పుల్లియ - పువ్వు - పెద్ద - పొట్టి - ప్రాకెన్న - ప్రెగ్గడ - బెగ్గడు - బొమ్మ - బొమ్మికము - బొమ్మిడికము - బొమ్మిడీకము - మజ్జ - మత్తాబు - మల్లారము - ముక్కు - మద్దియు - మెట్టిక - మొక్కరము - మొగ్గరము - మొల్లాము - రడ్డి - లొట్టిపిట్ట - వట్టి - వయ్యాళి - సన్నియ - సవ్వడి - సివ్వంగి - అట్టు - ఇట్టు - ఎట్టు - అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు - అన్ని - ఇన్ని - ఎన్ని - కొన్ని - మమ్ము - మిమ్ము - తమ్ము - అమ్మ - అక్క - అవ్వ - అయ్య - అప్ప - అచ్చొటు - ఇచ్చొటు - ఎచ్చొటు - అచ్చటు - ఇచ్చటు - ఎచ్చటు. ఇత్యాదులు లక్కటాదులు.
9. ౙడ్డక్కరంబుతోఁ బదాదిస్వరంబు గూడుచో జడ్డకు లోపంబు లేదు.
అఱ్ఱెత్తె - కన్నదరె - నన్నడిగె - పల్లొత్తె - విల్లందె.
10. హాదులయు నీలుగు లోనగు వాని తొలి హల్లునకు లోపంబు బహుళంబుగానగు.
హడపము - అడపము, హరిదళము - అరిదళము, హలఁది - అలఁది, నీలుగు - ఈలుగు, నీలుగు - నెగయు, పొందు - పొనరు. పూను పొదవుల కాదిలోపం బొకండు వచియించె నది యవిచార మూలకంబు. 11. ఆరాటాదులం బ్రథమేతర దీర్ఘంబునకు హ్రస్వంబు విభాష నగు.
ఆరాటము - ఆరటము. ఆరాటము - కక్కూఱితి - కేళాకూళి - కొమారుఁడు - కొమారిత - గంబూరము - పెండారము - బంగారము - బేహారము - వీటతాటము - సంతోసము.
12. ఓయారాదులం దొలిదీర్ఘంబునకు హ్రస్వంబు విభాష నగు.
ఓయారము - ఒయారము. ఓయారము - కేళాకూళి - కోలె - గూడారము - గోరువంక - పక్షి - జోహారు - నీలుగు - పేఁడ - బేహారము. దీర్ఘమధ్యంబు - మాఱు - మూలుగు - మోఱకు - వీటతాటము - వీడియము - ఇత్యాదులు.
13. అడంగ్వాదుల డాకు ణ కారంబు విభాషనగు.
అడఁగు - అనఁగు. అడఁగు - కడఁగు - చిల్లాడము - తడగము - నాఁడెము - పోఁడి - మిడుఁగు - వదఁకు - మిడుఁగుఱు ఇత్యాదు లడంగ్వాదులు.
14. దక్కులోనగువాని దాకు డ కారంబు విభాష నగు.
దక్కు - డక్కు. దక్కు - దగ్గఱు - దాఁగు - దాకలి - దిగు - దిగ్గియ - దూయు - దెందము - దెప్పరము - దెప్పు - దొంగ - దొప్ప ఇత్యాదులు. 15. ఏతాదులకు మువర్ణకంబు పరంబగునపుడు దీర్ఘంబు విభాష నగు.
ఏతము - ఏతాము. ఏతము - కళ్ళము - గాలము - గుడ్డము - గోణము - గోతము - జాజము - జుంజము - జోతము - తణగము - బొండ్లము - మండము - లాతము - వీణము ఇత్యాదులు.
16. పదాంతంబు లయి యసంయుక్తంబు లయిన ను లు రు ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగ నగు.
ఇందు నురుల కుత్వలోపంబు ప్రాయికంబుగ హల్పరకంబులకుఁ జూపట్టెడు. మ్రాన్పడె - మినువడె - మిన్వడె - వత్తురు వారు - వత్తుర్వారు - కారుకొనియె - కార్కొనియె - రాములు - రాముల్ - వనములు - వనముల్.
17. ఆచ్ఛికంబులం బదమధ్యంబుల న ల డ ర ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగ నగు.
కినుక - కిన్క, కానుక - కాన్క, చిలుక - చిల్క, కాలువ - కాల్వ, అడుగు - అడ్గు, కడుపు - కడ్పు, పెరుగు - పెర్గు, కూరుకు - కూర్గు.
18. లాఁతియచ్చునకు సహిత మొకానొకచో నుడినడుమ లోపంబు గానంబడియెడి.
కలికి - కల్కి, ములికి - ముల్కి, బుడిపి - బుడ్పి, పొలఁతి - పొల్తి. 19. అబ్బురాదులం దుత్వంబునకు లోపంబు విభాష నగు.
అబ్బురము - అబ్రము. అబ్బురము - కప్పురము - అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు - చప్పుడు - నెత్తురు ఇత్యాదులు.
20. చుక్పరక రు వర్ణంబునకు ముందఱి దు వర్ణంబు నుత్వంబునకు లోపంబు విభాషనగు, నగుచోఁ దత్పూర్వంబు గురువు గాదు.
అదురుచు - అద్రుచు, ఎదురుచు - ఎద్రుచు, పదురుచు - పద్రుచు.
21. జూదాదుల దాకు జకారంబు విభాష నగు.
జూదము - జూజము. అవుదు - జవాది - జాది - జాదు - విరవాది.
22. నిందయం దామ్రేడితంబు నాద్యక్షరములకు హ్రస్వదీర్ఘంబులకు గిగీ లగు. కుంభకర్ణుఁడు - గింభకర్ణుఁడు, రావణుఁడు - గీవణుఁడు.
23. పాదంబునం బ్రథమ ద్వితీయాక్షరములు వళిప్రాసంబులు నాఁబడు.
24. య వ ల లు లఘ్వలఘువులు మైత్రిం బొరయు, రేఫంబులు పొరయవు.
25. రేఫంబులు లఘ్వలఘువులుం దక్కుంగల విశేషంబులు నార్యవ్యవహారంబులఁ దెలియుట శ్రేయంబు.
శ్లో. శ్రీస్తనాఞ్చితకస్తూరిపఙ్కసఙ్కలితోరసే పఙ్కజాక్షాయ నాథాయ వేఙ్కటేశాయ మఙ్గళమ్.
ఇది ప్రకీర్ణక పరిచ్ఛేదము.
బాలవ్యాకరణము సంపూర్ణము.