బాలకాండము - సర్గము 2

బాలకాండము - రెండవసర్గము

రామాయణకావ్యముయొక్క ఆవిర్భావము

వాల్మీకి రామాయణము
రామాయణ కాండములు
1. బాలకాండము
2. అయోధ్యాకాండము
3. అరణ్యకాండము
4. కిష్కింధకాండము
5. సుందరకాండము
6. యుద్ధకాండము
7. ఉత్తరకాండము


నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః |

పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహామునిః |1-2-1|

యథావత్ పూజితః తేన దేవర్షిః నారదః తథా |

ఆపృచ్ఛైవ అభ్యనుజ్ఞాతః స జగామ విహాయసం |1-2-2|

ధర్మాత్ముడును, శబ్దార్థవిశేషములను బాగుగా నెఱిగి, వివరించుటయందు నేర్పరియు ఐన వాల్మీకిమహర్షి నారదుడు ఉపదేశించిన (తెలిపిన) సంక్షిప్తరామాయణవిశేషములను గ్రహించి, శిష్యసహితుడై ఆదేవర్షిని విధివిధానముగా పూజించెను. దేవమునియైన నారదుడు వాల్మీకి నుండి పూజలను అందుకొని, ఆయనఅనుజ్ఞను గైకొని, గగనమార్గమున వెళ్ళిపోయెను. [1-2-1, 2]


స ముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిః తదా |

జగామ తమసా తీరం జాహ్నవ్యాత్ అవిదూరతః |1-2-3|

నారదుడు బ్రహ్మ (దేవ)లోకమునకు వెళ్ళిన పిమ్మట వాల్మీకి మహాముని గంగానదీతీరమునకు సమీపమునగల తమసానదీతటమునకు చేరెను. [1-2-3]


స తు తీరం సమాసాద్య తమసాయా మునిః తదా |

శిష్యం ఆహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థం అకర్దమం |1-2-4|

ఆ మహర్షి తమసానదీతీరమునకు చేరి, నిర్మలములైన ఆ జలములలోనికి దిగుచు పక్కననున్న శిష్యునితో ఇట్లనెను. [1-2-4]


అకర్దమం ఇదం తీర్థం భరద్వాజ నిశామయ |

రమణీయం ప్రసన్న అంబు సన్ మనుష్య మనో యథా |1-2-5|

న్యస్యతాం కలశః తాత దీయతాం వల్కలం మమ |

ఇదం ఏవ అవగాహిష్యే తమసా తీర్థం ఉత్తమం |1-2-6|

"ఓ భరద్వాజా! ఏ మాత్రము బురదలేని ఈ తీర్థము నిష్కల్మషమైన సత్పురుషుని మనస్సువలె స్వచ్ఛమై రమణీయముగానున్నది. దీనిని చూడుము. నాయనా! ఉదకపాత్ర ఒడ్డున ఉంచి, నాస్నానవస్త్రమును ఇమ్ము. గంగాజలమువలె పవిత్రమీన్ ఈ తమసాతీర్థమునందు స్నానము చేసెదను. నీవును ఇచటనే స్నానమాచరింపుము." [1-2-5, 6]


ఏవం ఉక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా |

ప్రయచ్ఛత మునేః తస్య వల్కలం నియతః గురోః |1-2-7|

స శిష్య హస్తాత్ ఆదాయ వల్కలం నియతేంద్రియః |

విచచార హ పశ్యన్ తత్ సర్వతో విపులం వనం |1-2-8|

మహామనస్వియైన వాల్మీకి ఇట్లు ఆదేశింపగా గురుసేవా నిరతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వల్కలమును అందించెను. జితేంద్రియుడైన ఆ ముని శిష్యునినుండి తనవస్త్రమును గ్రహించి, విశాలమైన ఆ వనమును తిలకించుచు దివ్యమైన దాని రమణీయకమునకు మిక్కిలి అబ్బురపడెను. [1-2-7, 8]


తస్య అభ్యాశే తు మిథునం చరంతం అనపాయినం |

దదర్శ భగవాన్ తత్ర క్రౌఙ్చయోః చారు నిస్వనం |1-2-9|

శాపానుగ్రహసమర్థుడైన వాల్మీకి ఆ వనసమీపమున క్షణకాలమైనను ఎడబాటును సహింపజాలని క్రౌంచ పక్షులజంటను చూచెను. అన్యోన్యానురాగములతో మసలుచున్న వాటిమధుర ధ్వనులను వినెను. [1-2-9]


తస్మాత్ తు మిథునాత్ ఏకం పుమాంసం పాప నిశ్చయః |

జఘాన వైరనిలయో నిషాదః తస్య పశ్యతః |1-2-10|

తం శోణిత పరీతాఙ్గం చేష్టమానం మహీతలే |

భార్యా తు నిహతం దృష్ట్వా రురావ కరుణాం గిరం |1-2-11|

వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణా |

తామ్ర శీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై |1-2-12|

సమస్త ప్రాణులను నిష్కారణముగా హింసించు స్వభావము గల క్రూరాత్ముడైన ఒక కిరాతకుడు వాల్మీకిముని చూచుచుండగనే ఆ క్రౌంచపక్షుల జంటలో మగపక్షిని బాణముతో కొట్టెను. కిరాతుని బాణపు దెబ్బకు నేలపైబడి, రక్తసిక్తమైన అంగములతో గిలగిల కొట్టుకొనుచున్న ఆ మగపక్షిని ఆడుపక్షి చూచెను. అనుక్షణము తనపై అనురాగముతో మసలుకొనునదియు, బలమైన ఱెక్కలు గలదియు, రతిపారవశ్యమున మత్తిల్లి యున్నదియు, ఐన తనభర్తయగు మగపక్షి నెత్తురోడుచున్న తలతో, అట్లు విలవిలలాడుచుండగా దాని వియోగమునకు తట్టుకొనలేక జాలిగొలుపు ధ్వనితో క్రౌంచ (ఆడుపక్షి) ఏడువసాగెను. [1-2-10, 11, 12]


తథా విధిం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం |

ఋషేః ధర్మాత్మానః తస్య కారుణ్యం సపద్యత |1-2-13|

క్రూరుడైన కిరాతునిహింసకు గురియై, నెత్తురోడుచు పడియున్న ఆ క్రౌంచపక్షిని చూచి, ధర్మశీలుడైన వాల్మీకిమహర్షి హృదయమున కరుణరసము పొంగి పొరలెను. [1-2-13]


తతః కరుణ వేదిత్వాత్ అధర్మో అయం ఇతి ద్విజః |

నిశామ్య రుదతీం క్రౌంచీం ఇదం వచనం అబ్రవీత్ |1-2-14|

మిక్కిలి జాలిగొలిపెడి ఆక్రౌంచపక్షులదురవస్థను జూచి, సుతిమెత్తని హృదయముగలవాడైన ఆ వాల్మీకిముని "ఇట్లు రతిక్రీడలోనున్న పక్షులను హింసించి విడదీయుట" కటికి కసాయితనము అధర్మము అని భావించుచు ఇట్లు పలికెను. [1-2-14]


మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః|

యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్| |1-2-15|

ఓ కిరాతుడా! క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి. అందువలన నీవు ఎక్కువకాలము జీవించియుండవు. (శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు). [1-2-15]

[1. ఇది శ్రీమద్రామాయణమునకు మంగళాచరణ శ్లోకముగా (నాందిగా) పేర్కొనబడుచున్నది - "ఓ శ్రీనివాసా! కామాతురుడైన (పరమసాధ్వియగు సీతాదేవిని అపహరించిన) దుష్టరావణుని చంపి నీవు చిరస్థిరకీర్తిని పొందితివి." అని పండితుల వివరణము.

2. ఈ శ్లోకమునందు రామాయణమునందలి ఏడుకాండల కథాంశములు సూచించబడుచున్నట్లు - పండితులు విశ్లేషింతురు.

మా + నిషాద = లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని చెట్టబట్టిన ఓ రామా! ఈ పదముద్వారా శ్రీ సీతారాముల కల్యాణఘట్టము (బాలకాండకథ) సూచితమగుచున్నది.

ప్రతిష్ఠాం, త్వం, అగమః = పితృవాక్య పరిపాలనమొనర్చి, నీవు జగద్విఖ్యాతిని పొందితివి. ఈ పదముద్వారా అయోధ్యాకాండ కథ వెల్లడియగుచున్నది.

శాశ్వతీః సమాః = ఆడిన మాట తప్పకుండుటకై (ఓ రామా! నీవు) పెక్కు సంవత్సరములు వనవాసమొనర్చితివి - ఈ పలుకులవలన అరణ్యకాండ వృత్తాంతము ప్రకటింపబడుచున్నది.

క్రౌంచమిథునాత్ = కుటిల (దుష్ట) ప్రవర్తనగల తారావాలిదంపతులలో వాలివధ - దీనివలన కిష్కింధకాండ కథ సూచితము.

ఏకమ్ = అసహాయశూరుడు, ఏకైక వీరుడు హనుమంతుడు - దీని వలన సుందరకాండ గాథ సూచితము.

అవధీః = లోకకంటకుడైన దుష్టరావణుని వధించితివి - దీనిద్వారా రావణవధ. అనగా యుద్ధకాండ సూచింపబడినది.

కామమోహితమ్ = పట్టాభిషేకానంతరము సీతాదేవియొక్క వనవిహార కుతూహలస్థితి - అనగా ఉత్తరకాండ వృత్తాంతము సూచితము.]


తస్య ఏవం బ్రువతః చింతా బభూవ హృది వీక్షతః |

శోకార్తేన అస్య శకునేః కిం ఇదం వ్యాహృతం మయా |1-2-16|

క్రౌంచపక్షులదుఃస్థితిని గాంచుచు పలికిన ఆ మునీశ్వరుని మనస్సున "ఈ పక్షి విషయమున శోకాతురడనై నేను పలికినదేమి?" అను ఆలోచన మెదలెను. [1-2-16]

చింతయన్ స మహాప్రాజ్ఞః చకార మతిమాన్ మతిం |

శిశ్యం చ ఏవ అబ్రవీత్ వాక్యం ఇదం స మునిపుఙ్గవః |1-2-17|

పాద బద్ధః అక్షర సమః తంత్రీ లయ సమన్వితః |

శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు న అన్యథా |1-2-18|

మిక్కిలి ప్రజ్ఞాశలియు, శాస్త్రకోవిదుడును ఐన వాల్మీకి ఇట్లాలోచించుచు, ఒక నిర్ణయమునకు వచ్చెను. పిమ్మట ఆ మహర్షి తన శిష్యునితో ఇట్లు వచించెను. "నేను పలికిన మాటలసమూహము సమానాక్షరములుగల నాలుగుపాదములతో ఒప్పుచున్నది. లయబద్ధమై వాద్యయుక్తముగ గానము చేయుటకు తగియున్నది. కనుక ఇది ఛందోబద్ధమైన శ్లోకమే. [1-2-17, 18]

శిష్యః తు తస్య బ్రువతో మునేర్ వాక్యం అనుత్తమం |

ప్రతి జగ్రాహ సంతుష్టః తస్య తుష్టోః అభవత్ మునిః |1-2-19|

సోఽభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి |

తం ఏవ చింతయన్ అర్థం ఉపావర్తత వై మునిః |1-2-20|

ఆ విధముగా పలికిన ముని వచనములను (శ్లోకమును) శిష్యుడు సంతోషముతో స్వీకరించెను. దానిని కంఠస్థము చేసికొనెను. ఆ శిష్యునివిషయమున మహర్షియు సంతుష్టుడాయెను. అనంతరము ఆ మహర్షి తమసానదీ జలములలో యథావిధిగా మధ్యాహ్నికస్నానమాచరించి, అప్రయత్నముగా తననోటినుండి వెలువడిన "మానిషాద" శ్లోకార్థవిశేషములనే స్మరించుచు తన ఆశ్రమమునకు చేరెను. [1-2-19, 20]


భరద్వాజః తతః శిష్యో వినీతః శ్రుతవాన్ గురోః |

కలశం పూర్ణమాదాయ పృష్ఠతః అనుజగామ హ |1-2-21|

వినయసంపన్నుడు, వేదశాస్త్రములను అభ్యసించినవాడు, "మానిషాద" శ్లోకమును ధారణ చేసినవాడు ఐన భరద్వాజుడను పేరుగల ఆశిష్యుడు కలశమున నీరు నింపుకొని, గురువుగారి వెంట ఆశ్రమమునకు వచ్చెను. [1-2-21]


స ప్రవిశ్య ఆశ్రమ పదం శిష్యేణ సహ ధర్మవిత్ |

ఉపవిష్టః కథాః చ అన్యాః చకార ధ్యానమాస్థితః |1-2-22|

ఆ మహర్షి శిష్యునితోగూడి, ఆశ్రమమున ప్రవేశించి దేవ పూజాదికధర్మములను నిర్వర్తించెను. పిదప సుఖాసీనుడై నదీతీరమున జరిగిన సంఘటనలనే తలపోయుచు ఇతర కథాప్రసంగములను పురాణ పారాయణాది కార్యక్రమములను నిర్వర్తించెను. [1-2-22]


ఆజగామ తతః బ్రహ్మో లోకకర్తా స్వయం ప్రభుః |

చతుర్ ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుఙ్గవం |1-2-23|

సృష్టికర్తయు, లోకములకు అధిపతియు, మహాతేజశ్శాలియు ఐన చతుర్ముఖబ్రహ్మ ఆ వాల్మీకిమహర్షిని చూచుటకై స్వయముగా ఆయన ఆశ్రమమునకు విచ్చేసెను. [1-2-23]


వాల్మీకిః అథ తం దృష్ట్వా సహసా ఉత్థాయ వాగ్యతః |

ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః |1-2-24|

పూజయామాస తం దేవం పాద్య అర్ఘ్య ఆసన వందనైః |

ప్రణమ్య విధివత్ చ ఏనం పృష్ట్వా చ ఏవ నిరామయం |1-2-25|

అంతట వాల్మీకి ఆ బ్ర్హ్మదేవును జూచి, పరమాశ్చర్యముతో కుశలప్రశ్నలు గావించెను. శాస్త్రోక్తముగా క్రమముగా సర్వోపచారములనొనర్చి, సాష్టాంగ దండప్రణామము చేసెను. లేచి నిలబడి, ఏకాగ్ర చిత్తుడై మౌనముగా ఆయనకు అంజలిఘటించెను. పిమ్మట ఆ బ్రహ్మదేవునకు పాద్యమును, ఆర్ఘ్యమును సమర్పించి ఆయనను సుఖాసీనుని గావించి స్తుతించెను. [1-2-24, 25]


అథ ఉపవిశ్య భగవాన్ ఆసనే పరమ అర్చితే |

వాల్మీకయే చ ఋషయే సందిదేశ ఆసనం తతః |1-2-26|

బ్రహ్మణా సమనుజ్ఞాతః సోఽపి ఉపావిశత్ ఆసనే |

ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాత్ లోక పితామహే |1-2-27|

తత్ గతేన ఏవ మనసా వాల్మీకిః ధ్యానం ఆస్థితః |

పాపాత్మనా కృతం కష్టం వైర గ్రహణ బుద్ధినా |1-2-28|

యత్ తాదృశం చారురవం క్రౌంచం హన్యాత్ అకారణాత్ |

శోచన్ ఏవ పునః క్రౌంచీం ఉప శ్లోకం ఇమం జగౌ |1-2-29|

అనంతరము బ్రహ్మోపదేశమునకు అర్హమగునట్లుగా పూజింపబడిన ఆసనముపై ఆసీనుడై, బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కూర్చొనుటకు ఆజ్ఞాపించెను. బ్రహ్మయొక్క అనుజ్ఞతో వాల్మీకియు (కొంచెము ఎత్తు తక్కువగానున్న) ఆసనముపై కూర్చొనెను. బ్రహ్మయంతటివాడు (సాక్షాత్తుగా బ్రహ్మయే) ఎదుట కూర్చొని యున్నప్పటికిని వాల్మీకి క్రౌంచపక్షి కిరాతునిచే చంపబడినదృశ్యమునే మనస్సున చింతించుచుండెను. "క్రౌంచపక్షిని వేటాడవలెననెడి దుర్భుద్ధితో పాపాత్ముడైన కిరాతుడు ఎంతటి క్రూరకార్యము చేసినాడు! రతిక్రీడలో మునిగి, మధురధ్వని చేయుచున్న క్రౌంచపక్షిని ఆ కిరాతుడు నిష్కారణముగా వధించెనుగదా!" ఆ దృశ్యమునే తలంచుచు, ఆడు (క్రౌంచి) పక్షియొక్క దురవస్థనుగూడ స్మరించుచు కరుణార్థహృదయుడై, తాను అప్రయత్నముగా పలికిన "మానిషాద" అను శ్లోకమునే మనస్సులో మఱల పఠించెను. [1-2- 26, 27, 28, 29]


పునర్ అంతర్గత మనా భూత్వా శోక పరాయణః |

తం ఉవాచ తతో బ్రహ్మా ప్రహసన్ మునిపుంగవం |1-2-30|

శ్లోక ఏవాస్త్వయా బద్ధో న అత్ర కార్యా విచారణా |

మత్ చ్ఛందాత్ ఏవ తే బ్రహ్మన్ ప్రవృత్తే అయం సరస్వతీ |1-2-31|

అంతట బ్రహ్మ (తన అభిమతానుసారమే అతని ముఖమున ఆ పలుకులు వెలువడినవని భావించి) చిఱునవ్వు నవ్వుచు ఆ మహర్షితో పలికెను. "నీవు కనికరముతో పలికిన మాటలు ఛందోబద్ధమైన శ్లోకమే. ఈ విషయమున విచారింపవలసిన పనిలేదు. ఓ బ్రాహ్మణోత్తమా! ఈ నీ వాక్కు (సరస్వతి) నా సంకల్ప ప్రకారమే ప్రవర్తిల్లినది. ఓ ఋషీశ్వరా! నీవు శ్రీరామచరితమును సంపూర్ణముగా ఇట్టి ఛందస్సులోనే రచింపుము. [1-2-30, 31]


రామస్య చరితం కృత్స్నం కురు త్వం ఋషిసత్తమ |

ధర్మాత్మనో భగవతో లోకే రామస్య ధీమతః |1-2-32|

శ్రీరాముడు "ధర్మాత్ముడు, (ధర్మమును స్వయముగా ఆచరించుచు, ఇతరులచే ఆచరింపజేయును.) కరుణాళువు, సకలసద్గుణసంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరునగధీరుడు". అని లోకమున ఖ్యాతికెక్కినవాడు. అట్టి శ్రీరామునిచరిత్రమును నారదుడు నీకు తెల్పిన ప్రకారము వర్ణింపుము. [1-2-32]


వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాత్ శ్రుతం |

రహస్యం చ ప్రకాశం చ యద్ వృత్తం తస్య ధీమతః |1-2-33|

రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః |

వైదేహ్యాః చ ఏవ యద్ వృత్తం ప్రకాశం యది వా రహః |1-2-34|

తత్ చ అపి అవిదితం సర్వం విదితం తే భవిష్యతి |

న తే వాక్ అనృతా కావ్యే కాచిత్ అత్ర భవిష్యతి |1-2-35|

కురు రామ కథాం పుణ్యాం శ్లోక బద్ధాం మనోరమాం |

యావత్ స్థాస్యంతి గిరయః సరితః చ మహీతలే |1-2-36|

తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి |

యావత్ రామస్య చ కథా త్వత్ కృతా ప్రచరిష్యతి |1-2-37|

ప్రతిభామూర్తియైన శ్రీరాముని యొక్క చరితము, లక్ష్మనుని ఉదంతము, సీత వృత్తాంతము, భరతాదుల గాథలు రావణాది రాక్షసులకథలు లోకప్రసిద్థములైనవీ, రహస్యముగానే మిగిలినవీ అన్నింటినీ వివరింపుము. నారదుడు నీకు స్పష్టముగా వివరింపని రహస్యములుగూడ సాకల్యముగా నీస్ఫురణకు వచ్చును. నీవు రచింపబోవు రామాయణమునందలి అంశములు అన్నియును సత్యములేయగును. అందలి పదములలోగాని, వాక్యములలో గాని, వాటి అర్థాదులలోగాని ఎట్టి దోషములూ ఉండవు. రామకథ పాపములను రూపుమాపునది, వినినమాత్రముననే పరమానందము గూర్చునది. కనుక దానిని శ్లోకములలో రచింపుము. ఈ భూమండలమున పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఈ రామాయణగాథ సమస్తలోకములయందును కీర్తింపబడుచుండును. నీచే రచితమగు రామాయణగాథ శ్లాఘింపబడుచుండునంతవఱకును నీకీర్తిప్రతిష్ఠలు ముల్లోకములయందును వ్యాపించుచుండును." [1-2-33, 34, 35, 36, 37]


తావత్ ఊర్ధ్వం అధః చ త్వం మత్ లోకేషు నివత్స్యసి |

ఇతి ఉక్త్వా భగవాన్ బ్రహ్మా తత్ర ఏవ అంతరధీయత |

తతః స శిష్యో భగవాన్ మునిః విస్మయం ఆయయౌ |1-2-38|

ఈ విధముగా పలికి, బ్రహ్మదేవుడు అచ్చటనే అంతర్థానమాయెను. అప్పుడు వాల్మీకిమహర్షియు, ఆయనశిష్యులును ఆశ్చర్యమున మునింగిరి. [1-2-38]

తస్య శిష్యాః తతః సర్వే జగుః శ్లోకం ఇమం పునః |

ముహుర్ ముహుః ప్రీయమాణాః ప్రాహుః చ భృశ విస్మితాః |1-2-39|

అనంతరము ఆమునిశిష్యులు అందఱును "మానిషాద" అను శ్లోకమును అత్యంతప్రీతితో గానముచేసిరి. వారిలోవారు (పరస్పరము) తమఆనందాశ్చర్యములను ప్రకటించుకొనిరి. [1-2-39]


సమాక్షరైః చతుర్భిః యః పాదైః గీతో మహర్షిణా |

సః అనువ్యాహరణాత్ భూయః శోకః శ్లోకత్వం ఆగతః |1-2-40|

వాల్మీకిమహర్షి శోకాతిరేకమున కారుణ్యముతో సమానాక్షరములు గల నాలుగుపాదములశ్లోకమును పలికెను. దానినే శిష్యులు పలుమాఱులు వెంటవెంట పఠించుటవలన ఆ శ్లోకము మిక్కిలి ప్రసిద్ధికెక్కినది. శోకమే శ్లోకరూపమును పొందినది. అందువలన రామాయణము కరుణరసభరితమైనది. [1-2-40]


తస్య బుద్ధిః ఇయం జాతా మహర్షేః భావితాత్మనః |

కృత్స్నం రామాయణం కావ్యం ఈదృశైః కరవాణ్యహం |1-2-41|

అంతట ఆ వాల్మీకి పరమాత్మను ధ్యానించినవాడై "ఈ రామాయణకావ్యమును పూర్తిగా ఇట్టి స్లోకములలోనే రచించెదను" అని సంకల్పము చేసెను. [1-2-41]


ఉదార వృత్త అర్థ పదైః మనోరమైః

తదా అస్య రామస్య చకార కీర్తిమాన్ |

సమ అక్షరైః శ్లోక శతైః యశస్వినో

యశస్కరం కావ్యం ఉదార దర్శనః |1-2-42|

తద్ ఉపగత సమాస సంధి యోగం

సమ మధురోపనత అర్థ వాక్య బద్ధం |

రఘువర చరితం మునిప్రణీతం

దశ శిరసః చ వధం నిశామయ అధ్వం |1-2-43|

మిక్కిలి ధీశాలియు, ఋషులలోసుప్రసిద్ధుడును ఐన వాల్మీకి వాసికెక్కిన శ్రీరాముని యొక్క కీర్తిపరిమళములను ముల్లొకములలో గుబాళింపజేయునట్లు "రామాయణకావ్యము"ను సమానాక్షరములుగల పాదములతో, విశేషవృత్తములతో, అర్థవంతములైన చక్కను పదములతో వందలకొలది (ఇరువదినాలుగువేల) శ్లోకములతో మనోహరముగా రచించెను. వాల్మీకిమహర్షిప్రణీతమైన ఈ మహాకావ్యము రఘువంశోత్తముడైన శ్రీరామునిచరితమును, దశకంఠుడైన రావణునివథను వర్ణించుచున్నది. ఇందలి సమాసములు, సంధులు శాస్త్రానుకూలములై చక్కగా కుదురుకొనినవి. రసస్ఫోకములై, మధురములై అర్థవంతములైన వాక్యములతో ఇది కూర్చబడినది. అట్టి ఈ "రామాయణకావ్యమును వినుడు" - అని వాల్మీకి శిష్యులకును, లోకమునకును వెల్లడించెను. [1-2-42, 43]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్వితీయస్సర్గః |1-2|

వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు రెండవసర్గము సమాప్తము