బసవరాజు అప్పారావు గీతములు/విహారము
విహారము
కొండకోనల నదుల వనముల
నెండచొరని నికుంజ గృహముల
పండువౌ నెమ్మదికి నీతో
పడతి! తిఱుగాడన్.
మండజేసెడు మండువేసవి
యెండసైతము నీవు నాదగు
దండ నుండగ సుకమునిచ్చును
పండు వెన్నెలటుల్.
పండు ఫలములు పూవు దేనెలు
నిండు నమృతము రుచులతోడను
నిండువలపున బ్రకృతిసుందరి
తాండవము సల్పున్.
గండుకోయిల పాట విని కం
తుండు ప్రేమోత్సాహ రభసత
తాండవింపగ పొంగి నాయెద
తప్పటలు జరచున్.