బసవరాజు అప్పారావు గీతములు/ముసిడిపండు

చనగ చనగ నీ జాడల
సౌఖ్యము మునుముందె తోచు!

తలప తలప నీ లీలలు
తనువు పులకరించు స్వామి!

వలచి వలచి దేవ నిన్నె
వంతలెల్ల మరచిపోతి!

ముసిడిపండు

మరకత మాణిక్య మనుచు
మనసుపడితి గాదె మనమ?
కైవశమయినంతనె యది
గాజుపూస యయ్యె నొక్కొ?

    బంగరుగని యంచు నెంతొ
    బ్రమసి బ్రమసి మురిసితీవు
    చితమెల్ల సురిగిపొవ
    నిత్తడిగా మారె నొక్కొ?

అమృతఫలమ్మంచు నెంతొ
యాసపడితి గాదె మనమ!
నోట నిడినయంత కాల
కూటవిష మ్మయ్యె నొక్కొ?

    పూలహారమనుచు నెంతొ
    పొంగి మెడను దాల్చినావు
    కంఠసీమ జేరినంత
    కాలసర్ప మయ్యె నొక్కొ?

ప్రణయరత్న మనుచు మేను
పరవసమై గంతులిడితి
కౌగిలింప రక్త మాను
గబ్బిలముగ మారె నొక్కొ?

    మరకత మాణిక్య మనుచు
    మనసు పడితిగాదె మనమ!