బసవరాజు అప్పారావు గీతములు/మరణావస్థ

మరణావస్థ

అలలు ఘోరముగ లేచెడు స్వామీ
కలగుచున్నదే మహాసముద్రము!
    ఇటు గాంచ మహాప్రళయమ్మే
    అటు గాంచ మహాప్రళయమ్మే
    ఎటు గాంచుటయును ఈ నా కన్నుల
    మటుమాయ గప్పనంతవరకెగా ? ||అలలు||
జ్వాలలు పైపై లేచెడు దేవా
కాలానలమిదె నోరు విప్పెడిని!
    ఈదిశ ఘోరదవానలమే
    ఆదిశ ఘోరదవానలమే
    ఏదిశ బోవుటయైన నాతనువు
    బూదిగాక నున్నంతవరకెగా ||జ్వాల||
కూలెడు కూలెడు కొండలు స్వామీ
వ్రాలుచుండె నాతలపై మిన్నులు!
    తల పైకెత్తిన నంతమ్మే
    తల నిటువంచిన నంతమ్మే

తల నెత్తుటయును దించుటయును నే
    నలిగి హతము గానంతవరకెగా కూలె...
అలలు ఘోరముగ లేచెడు స్వామీ
కలగుచున్నదే మహాసముద్రము!

అధోగతి

అమావాస్య రాత్రి నాకాశమ్మునుండి
చంద్రకళ తళతళా జారెను భువికి

మలమల మాడ్చెడు మధ్యాహ్నవేళ
కన్నెరోజా విచ్చి కంపలో బడియె.

కానికాలమ్మున కన్నె చపలతను
బాల కుల్కుచు పాపపంకాన దిగియె.

అరసికులకు కవితాదాన మిచ్చి
కవికోకిలమ్ము మృత్యుగహనమ్ము జొచ్చె.