బసవరాజు అప్పారావు గీతములు/పలుకవేలనే?

పలుకవేలనే?

          కల కల లాడుచు
          కిల కిల నవ్వుచు
          కలికీ! నాతో
          పలుక వేలనే?

          వలపు నీ పయిం
          గలిగెను నిజముగ
          పలుకకున్న నెద
          నిలుప జాలనే!

          తలపులు నిను విడి
          తొలగ కున్న వే,
          అలరన్ వీనులు
          పలుక రాదటే?

          చలువ వెన్నెలల
          నలమజేసి మది
          నలరిచె చంద్రుడు
          చల మింకేలనే?

          చెలియరొ నీ మది
          వెలిగెడు వలపుం
          దెలిపి ప్రాణములు
          నిలువ రాదటే?