బసవరాజు అప్పారావు గీతములు/నివృతయాథార్థ్యము

సద్దేమియు లేని నిశీథమ్మే
    సంతాపము హెచ్చించును దేవా!

మృత్యువుతలపే సంతోషలతను
మోడువడగ గొట్టును దేవా!

సత్యదీప్తమౌ నీ తేజమ్మున
సన్నగిల్లె నాయాశలు దేవా!

నివృతయాథార్థ్యము

జలబిందువులో భాస్కరుబింబము
తలతల మెఱయుం గాదే దేవా?

నిప్పురవ్వ యందున ప్రళయేశ్వరు
నిటలాగ్ని యణగియుండదె దేవా?

ప్రకృతి ప్రేమమంతయు సంజప్రియుల
వలపు కౌగిళుల లేదే దేవా?

నిశ్చల భక్తుల హృదయపీఠముల
నీ వధివసించి వెల్గవె దేవా?