బసవరాజు అప్పారావు గీతములు/జీవనావ
కూనురాగముల దీయు న న్నిటు
కొనిపోయెదవే వింతసీమలకు?
మానిని, యిచ్చట నొక్కింత నిలిచి
మదిలోనిమాట జెప్పిపోగదే?
జీవనావ
ఎన్ని సంద్రముల నెన్ని నదంబుల
నీ జీవనావ గడపితి నౌరా
కన్నులకు నెత్తు రెగదట్టెదు నది
జ్ఞాపకమ్మునకు వచ్చెడి నేనిన్!
ఘోరమౌ తుపానుమధ్యమున బడి
కొట్టుకొనుచు జీవితాశ వీడుచు
కారుణ్యరాశియౌ పరమేశ్వరు
కరుణ నెట్లొ బ్రతికి బైటబడితిన్.
సుడిగుండంబుల జిక్కుక బిఱబిఱ
సురసుర దిరుగుచు మునుగుచు దేలుచు
నడియాసగ నెంచి బ్రతుకుటెల్లను
గడచి యెట్టులో త్రప్పి బ్రతికితిన్.
నిర్జనంబులౌ ద్వీపాంతరముల
నెట్లెట్లో చేరి యచ్చటను తి
ర్యగ్జంతువులను బోలి జ్ఞాన మను
నది యేమాత్రము లేక తిరిగితిన్.
మలమాంసమే మృష్టాన్నమ్మటు
మెక్కుచు క్షారజలంబుల ద్రావుచు
కాలవశుడ నై క్రూరభోగినుల
కౌగిళుల జొక్కి విషరుచి గంటిన్.
పడిపడి యిడుముల బడరానిపాట్లు
బడి కలగి తలగి యలజడి బెగ్గిలి
కడ కాపరమేశ్వరు నవ్యాజపు
కరుణ చేతనే బ్రతికి వచ్చితిన్.
సాయంకాల మ్మరుణవదనుడై
సముద్రగర్భము జొచ్చెడు సూర్యుని
వేయాఱు విధముల దీనుడనై
వేడికొంటిని నన్నిలు జేర్పుమంచు.
కడకు కంటి నా తపఃఫలమ్ముగ
కరుణాహాసోదంచితమూర్తిని
కడచి బడసి చింతనామృతమ్మును
కన్నీళ్ళ తీపి నాత్మను దనిపితి
నెన్ని సంద్రముల నెన్ని నదంబుల
నీ జీవనావ గడపితి నౌరా!
కన్నులకు నెత్తు రెగదట్టెడు నది
జ్ఞాపకమ్మునకు వచ్చెడి నేనిన్!
వరుస వావి (కల)
సకియ నేను గూడి సరస
సల్లాపము లాడుకొంచు
వాకిట నిలుచునియుండగ
వచ్చె నొక్క బేరగాడు.
సంతసరుకు లమ్మువాని
చెంతజేరి సంతసమున