బసవరాజు అప్పారావు గీతములు/గోపికా గీతలు-1

గోపికా గీతలు

1

నీపై మోహము నో కృష్ణా!
     నిలుపగ లేనోయీ కృష్ణా!
ముద్దుమోము గాంచన్‌ కృష్ణా!
     మోహ మాపలేరా కృష్ణా!
చిన్నదాన నీకై కృష్ణా!
     చింతల జిక్కితిరా కృష్ణా!
నీసిగలో దొకటీ కృష్ణా!
     నెమలికన్ను నీరా కృష్ణా!
నిన్ను జూడకుండన్‌ కృష్ణా!
     నిముస మాగలేరా కృష్ణా!
పతి గలదాననురా కృష్ణా!
     పదెపదె తిప్పకురా కృష్ణా!
బతిమాలుదు నోయీ కృష్ణా!
     బాధపెట్టకోయీ కృష్ణా!
అబలను ప్రాణములో కృష్ణా!
     అర్పించితి నీకో కృష్ణా!

బ్రతికింపను చంపన్‌ కృష్ణా!
     భారము నీదేరా కృష్ణా!
నీపై మోహము నో కృష్ణా!
     నిలుపగ లేనోయీ కృష్ణా!

గోపికా గీతలు

2

చిలిపి చేష్టలు జేయ1[1]
చెట్టునకు గట్టిరా2[2]
చిన్ని నాముద్దు కృష్ణా!
               నిన్నో
       చిన్ని నాముద్దు కృష్ణా!
    
     శ్రీకృష్ణ నిను నన్ను
     జేర్చి 3[3]చెట్టున గట్ట
     చిలిపి చేష్టల జేతురా
               యెన్నో
        చిలిపి చేష్టల జేతురా!

  1. 1. జేస్తె
  2. 2. చెట్టుకూ గట్టార
  3. 3. చెట్టుకు గడితె