బసవరాజు అప్పారావు గీతములు/గోపాలకృష్ణుడు
గోపాలకృష్ణుడు
(అసావేరి రాగము)
ఏమని పాడితివో
గోపాలకృష్ణా
ఏమని పాడితివో?
భామలు పదియారువేలు
పరవశలై సొక్కి సోల ||నేమని||
బృందావన మా
నందమయముగా ||నేమని||
యమునా నదిలో
నమృతము పొంగగ ||నేమని||
వెన్నెల లెల్లెడ
వెల్లివిరియగా ||నేమని||
లోకము లన్నియు
లోలాడంగా
నేమని పాడితివో
గోపాలకృష్ణా
ఏమని పాడితివో?