బసవరాజు అప్పారావు గీతములు/క్రొత్తవింతలు
క్రొత్తవింతలు
"ఈ తమ్మలపు ముద్రలేడవే చెలియ?"
నిద్రలో ప్రియుడు నన్ ముద్దాడెనేమొ.
"ఈ మేని గందంబు యేడదే చెలియ?"
భువన మోహనమూర్తి పూసినాడేమొ.
"మగువ! నేడీ కంఠమాధుర్య మేమె?"
నా మోహనుడు నింపెనేమొ ప్రేమముతో.
"కాంత నీ కీ దివ్యకాంతి యెక్కడిదే?"
నా దేవదేవుండు నన్ మెచ్చెనేమొ.
మురళీకృష్ణుడు
హృదయములు రెండు ప్రేమచే నేకమైన
లీల శ్రుతిలోన వేణువు లీనమయ్యె
విశ్వమెల్లను నిండిన ప్రేమరాగ
మట్లు నీరాగ మెల్లర నావహించె.