బసవరాజు అప్పారావు గీతములు/ఉపశాంతి
పాపాయిలీలలు
(నాగేశ్వరీరాగము - జంపెతాళము - ఖండిజాతి)
దినదినము పాపణ్ణి దీవించి పొండీ
దేవలోకములోని దేవతల్లారా !
నాపాప నిద్ధట్లొ నవ్వుకుంటాడు
ఆస్సెకాలాడేవొ అప్సరలతోను? దిన||
మాతండ్రి నిద్దట్లొ మాటాడుతాడు
తెలియజెప్పేనేమె దేవరాశ్శాలు? దిన||
కన్నయ్య నిద్దట్లొ కన్నుగిలికేను
వెఱ్ఱిలోకము జూచి వెక్కిరించేనొ? దిన||
వాగీశ్వరీ ప్రేమరాగ మాలించి
చిన్నయ్య బభ్భోరశ్రీరామరక్ష! దిన||
----
ఉపశాంతి
వేదాద్రి శిఖరాన వెలిగేటిజోతి
నాపూవిగుడిసెలో దీపమై వున్నె!
స్వర్గ వుద్యానాల వాసించు పూవు
నామోటుచేతిలో నలిగిపోనేనె?
భూర్భువర్లోకాల బోయేటి పిట్ట
కటిక నాకౌగిటకైదులో వున్నె !
పరమాత్ముడౌ జగవ్య్వాపి పాపాయి
ఇరుకు నాగుండెలో ఇమిడిపోయేనె?
---
జీర్ణంజీర్ణం
వేదాద్రి శిఖరాన వెలిగిన్నజోతి
మినుకు మని కాసేపు కునికిపోయింది !
దేవలోకమునుంచి దిగినట్టె గంగ
వచ్చిన్న దారినే పట్టి మళ్లించి !
పంజరం దూరిన బంగారు పిట్ట
తలుపు దీ నేనేపొ తర్లి పోయింది !
కాపుర మొచ్చిన కన్ని పాపాయి
యిల్లు కాళీజేసి వెళ్లి పోయాడు !