ప్రాణాయామము/రెండవ ప్రకరణము

రెండవ ప్రకరణము

ధ్యానము చేయు గది

ధ్యానము చేసికొనుటకు ప్రత్యేకముగ ఒక గదిని ఏర్పరుచుకొని, దానికి తాళమువేసి వుంచుము. ఇతరులను ఎవరినీ దానిలోనికి రానివ్వకుము. దానిని చాల పవిత్రముగ వుంచుము. నీకు ప్రత్యేకముగ గదిని ఏర్పాటు చేసికొనుటకు వీలులేనిచో, నీ యింటియందు ప్రశాంతముగ వుండుగదిలో ఒక భాగమును యిందుకొరకు ప్రత్యేకించి వుంచుకొనుము. ఆ ప్రత్యేకించు కొన్న భాగమును మరుగుగా వుండుటకు ఏదైన తెరనుగాని, తడికనుగాని అడ్డముగ వుండులాగున పెట్టుకొనుము. నీవు కూర్చొను ఆసనమునకు ముందుగా నీ గురువు లేక యిష్టదేవత యొక్క పటమును పెట్టుకొనుము. ప్రాణాయామము లేక ధ్యానమును ప్రారంభించ బోవుటకు ముందుగా ఆపటమును శారీరకముగను మానసికముగను పూజించుము. ఆ గదిలో అగరు వత్తులునుగాని, సాంబ్రాణినిగాని వెలిగించుచుండుము. రామాయణము, భగవద్గీత, ఉపనిషత్తులు, యొగవాసిష్ఠము మొదలగు పవిత్ర గ్రంధములను ప్రతిరోజు చదువుకొనుటకు ఆ గదిలో వుంచుము. నాలుగు మడతలు వేసిన దుప్పటిని పరచి, దానిపైన మెత్తగావుండు తెల్లగుడ్డను వకదానిని పరచుము. దానిపై నీవు కూర్చొనుము. వీలైనచో దర్భాసనముగాని, పులి లేక జింకచర్మమునుగాని ఆ దుప్పటిపై పరచి దానిపైన కూర్చొనుము. వీలైనయెడల సిమెంటుతో ఒక అరుగును కట్టించుకొని దానిపైన, నీ ఆసనమును పరుపవచ్చును. ఇటుల చేయుటచే నేలపై పాకెడి చీమలు మొదలగువాని బాధవుండదు. ఆసనములో కూర్చొన్నప్పుడు, తల, మెడ, మొండెములను నిలువుగ వుంచుము. ఇటుల చేయుటవలన వెన్నెముక య్ందలి వీణాదండము శ్రమలేనిదిగ వుండును.

ఐదు ప్రధాన విషయములు

ప్రాణాయామము చేయుటకు ఈ ఐదు విషయములను గురించి శ్రద్ధ వహించవలెను. 1. శుభ్రమైన స్థలము 2. తగిన సమయము 3. మితమై బలవర్థకమై సులభముగ జీర్ణమగు ఆహారము 4. ఓర్పు, పట్టుదల, శ్రద్ధలతో కూడియుండి ఆనందముతో అభ్యాసము చేయుట 5. నాడీశుద్ధి, నాడీశుద్ధి కాగానే సాధకుడు యోగసాధనయొక్క 'ఆరంభ' స్థితినిచేరును. ప్రాణాయామమును చేయువాడు మంచి ఆకలి, చక్కని జఠరాగ్ని గలిగి ధైర్యము, బలము, పుష్టి, ఆనందము, తేజస్సులతో కనిపించును. యోగి యగువాడు సూర్యనాడి(కుడిముక్కునందు గాలి సంచరించునప్పుడు) సంచరించునప్పుడు ఆహారమును తీసికొనవలెను. అటుల చేయుటచే సూర్యనాడి ఉష్ణకారి గాన త్వరగ జీర్ణము అగును. ఆకలితో వున్నప్పుడుగాని, అన్నము తినిన వెంటనేగాని ప్రాణాయామము చేయరాదు. క్రమక్రమముగ 3 ఘటికల (ఒకటిన్నర గంటల) వరకు గాలిని లోపల ఆపుజేయగలుగునంతవరకు అభ్యసించవలెను. ఇటుల చేయగలిగినచో అనేకములగు సిద్ధులు లభించును. ఈ రీతిని చాల సేపటివరకు గాలిని కుంభించుటను అభ్యసించదలచినవాడు ఈ విద్యలో ఉత్తీర్ణుడైన గురువువద్ద వుండి అభ్యసించవలెను. మూడు నిముషముల వరకు ప్రతివాడు సులభముగ గాలిని ఆపవచ్చును. ఈ మాత్రము అభ్యసించినచో, ఇది నాడీశుద్ధిని, మనస్సు నిలుకడను, ఆరోగ్యమును లభించులాగున చేయగలదు.

స్థలము

నది, చెరువు, సముద్రము ఒడ్డునగాని, చక్కటి జల ప్రవాహము, చెట్ల సమూహముగల కొండపైనగాని ప్రశాంతము, ఏకాంతము గలిగి, ఆహ్లాదకరముగ నుండు ఒకస్థలమును నిర్ణయించుకొనుము. పాలు, ఆహారపదార్థములు సులభముగ లభించెడి స్థలముగ వుండవలెను.

ఒక చిన్న కుటీరమును వేసికొనుము. ఒక ఆవరణను కూడ ఏర్పాటు చేసికొనుము. దొడ్డిమూల ఒక నూతినిత్రవ్వు కొనుము. ఇది చాలును. ఏలనన, అన్ని విషయములు కలిగి యుండి ఆదర్శవంతముగ నుండుచోటు లభించుట కష్టకరము.

నర్మద, యమున, గంగ, కావేరి, గోదావరి, కృష్ణా నదీతీరములు యీ రీతిగ కుటీరములను వేసికొనుటకు చాల అనుకూలముగ వుండును. ఏదైన అట్టి స్థలమును ఒక దానిని చూచుకొనుము. చుట్టుప్రక్కల ఎవరైన సాధకులు వున్నచోటును నిర్ణయించుకొనుట అవసరము. ఎందుకన, ఏవైన సంశయములు, చిక్కులు కలిగినప్పుడు వారు తీర్చెదరు. యోగక్రియలలో దృడమైన నమ్మకమును కలిగి యుండవలెను. నాసిక, హృషీకేశము, ఝూంసీ, ప్రయాగ, ఉత్తరకాశీ, బృందావనము, అయోధ్య, కాశీ మొదలగునవి చక్కని ప్రదేశములు. జన సమూహమునకు దూరముగ వుండెడి ఏదేని ఒక స్థలమును ఎంచుకొనుము. జన సమూహమునకు దగ్గర వున్నచో, ఏమిటో చూతమని జనులు ప్రోగగుటయు, అందువలన సాధనకు భంగము కలుగుటయు తటస్థించును. ఇందు వల్ల ఆధ్యాత్మికశక్తి కంపనములు లేకుండ పోవును. ఇక, మహారణ్య మధ్యమున ప్రారంభించదలచినచో, నీకు అక్కడ ఏవిధమగు రక్షణయు దొరకదు. దొంగలు, వనమృగములు నిన్ను బాధింతురు. ఆహార సమస్య వచ్చును. కావుననే, శ్వేతాశ్వతరో పనిషత్తులో, "చదునైనట్టిన్నీ, రాళ్ళు, నిప్పు, కంకర లేకుండులాగునను, చూచుటకు ఇంపుగా వుండులాగునను ఒక గుహను బాగుచేసికొని, గాలివల్ల ఏవిధమగ బాథ కలుగకుండులాగున ఏర్పాటు చేసికొని, ఆ పిమ్మట, తన మనస్సును దేవునివైపు మరల్చవలెను." అని చెప్పబడెను.

ఇంటియందు అభ్యాసముచేయువారు, తమ గదిని పరిశుభ్రముగను, నిశ్శబ్దముగను వుండునటుల చేయవలెను.

కాలము

ప్రాణాయా మాభ్యాసమును వసంతఋతువు(చైత్ర) వైశాఖములు, లేక శరదృతువు (ఆశ్వయుజ కార్తీకములు) లో గాని ప్రారంభించవలెను. ఏలనన, ఈ ఋతువులలో ఏ విధమగు శ్రమము లేకుండా జయములభించును. ఎండాకాలములో మధ్యాహ్న సాయంకాలములందు ప్రాణాయామము చేయరాదు. ఉదయ సమయమున చల్లనిగాలి వీచునప్పుడు చేయవలెను.

అధికారి

ప్రశాంతమైన మనస్సు, ఇంద్రియదమనము, శాస్త్రములందు గురు వాక్యములందును నమ్మకముగలవాడు. ఆస్తికుడు (దేవునియందు నమ్మకముకలవాడు), మితముగ భుజించువాడు, మితముగ నిద్రించువాడు, జననమరణ బంధమునుండి విముక్తి పొందగోరువాడు, ఇట్టి లక్షణములు గలవాడు యోగసాధనకు తగినవాడు. ఇట్టివాడు ప్రాణాయామమేకాదు, తదితర యోగ సాధనలలోకూడ సులభముగ జయమునుపొందును. ప్రాణాయామమును శ్రద్ధ, ఓర్పు, పట్టుదల, జాగ్రత్త, విశ్వాసములు గల వాడై చేయవలెను.

ఇంద్రియ సౌఖ్యములకు లోబడినవారు, గర్వపోతులు, మర్యాదలేనివారు, అబద్దీకులు, కుయుక్తులుపన్నువారు, వంచకులు, విశ్వాసఘాతుకులు, సాధువులు, సన్యాసులు, గురువులు, యోగీశ్వరులను అగౌరవముగచూచువారు, వ్యర్థముగ తర్కించువారు, తాగుబోతు, ఎవరిని నమ్మనివారు, ప్రాపంచిక వ్యామోహములకు లోనైవున్నవారితో అమితముగ సంబంధము కలిగివుండువారు, క్రూరులు, పరుషముగ మాట్లాడువారు, తిండిపోతులు, వ్యర్థవ్యవహారములు చేయువారు, వీరు ప్రాణాయామములోగాని, తదితర యోగసాధనలలోగాని ఎన్నటికీ జయమును పొందజాలరు.

అధికారులు మూడురకములు

1. ఉత్తముడు, 2. మధ్యముడు, 3. అధముడు అని. వారి సంస్కారములు, బుద్ధి, వైరాగ్యము, వివేకము, ముముక్షుత్వములయొక్క పరిమాణము, సాధానాశక్తినిబట్టి - పైరీతిని విభజించవలెను.

యోగశాస్త్రమును జీర్ణముచేసికొని, సాధించిన గురువు వద్దకు వెళ్ళుము. అతని పాదములవద్ద కూర్చొనుము. అతనిని సేవించుము. తెలివిగలిగి, తగు ప్రశ్నలనువేసి, ఆతనినుండి నీ సంశయములను తీర్చుకొనుము. అతనినుండి సాధనా విధానమును చెప్పించుకొని, సంతోషము, శ్రద్ధ, ఓర్పు, పట్టుదల, విశ్వాసములతో అభ్యసించుము.

ప్రాణాయామాభ్యాసి ఎల్లప్పుడు మధురముగను, ప్రేమతోను మాట్లాడవలెను. ప్రతి వానియందు దయగలిగి వుండవలెను. అందరిని ప్రేమించవలెను. నిష్కపటిగా వుండవలెను. నిజము పలుకవలెను. వైరాగ్యము, ఓర్పు, శ్రద్ధ, భక్తి, కరుణ మొదలగు లక్షణములను వృద్ధిచేసికొనవలెను. బ్రహ్మచర్యమును పూర్తిగా పాటించవలెను. గృహస్థాశ్రమములో వుండి ప్రాణాయామమును చేయు సాధకుడు, అభ్యాసకాలములో చాల మితముగ సంభోగము చేయవచ్చును.

ఆహార నియమములు

యోగశాస్త్రములో ప్రవీణుడు కాదలచువాడు, యోగసాధనకు హానిని కలిగించు ఆహారపదార్థములను అన్నిటిని విసర్జించవలెను. ఉప్పు, ఆవాలు, పులుపు కారముగాగల వస్తువులు, ఘాటుగను, చేదుగను వుండువస్తువులు, ఇంగువ, అగ్ని పూజ, స్త్రీసేవ, అతిగా నడచుట, సూర్యోదయ సమయమందు స్నానముచేయుట, ఉపవాసమువల్ల శరీరమును కృశింపజేసికొనుటలను మానవలెను. సాధనయొక్క ప్రారంభ దశలో పాలు నెయ్యిని ఆహారముగా తీసికొనవలెను. గోధుమలు, ఆకుకూరలు, దంపుడుబియ్యము, సాధనకు తోడ్పడును. వీటివలన శరీరమునకు బలము చేకూరును. అందువల్ల గాలిని ఎక్కువసేపు కుంభించి వుంచగలడు. ఈ రీతిని ఎక్కువసేపు కుంభించి గలుగుటవల్ల కేవల కుంభకము (ఉచ్ఛ్వాస నిశ్స్వాసలు లేకుండుపోవుట) సిద్ధించును. ఇట్టి సిద్ధిని పొందినవానికి మూడులోకములందును పొందవలసినది ఏదియు వుండదు. సాధన మొదలిడగానే చెమట పోయును. కప్పవలె, పద్మాసనస్థుడగు యోగి కొద్దికొద్దిగ భూమినుండి పైకి కదలుచుండును. మరికొంతకాలము సాధనచేసినచో, భూమిపైనుండి పైకి లేవగలుగును. ఇటుల భూమినుండి పైకి లేవగలిగినవాడు అనేకములగు వింతలను చేయకలుగును. ఏ విధమగు బాధయు, అతనికి వేదనను కలిగించదు. మలమూత్రములు, నిద్రలయొక్క పరిమాణము తగ్గిపోవును. కన్నీరుకారుట, కంటిపుసి, చొంగకారుట, చెమట, శరీరదుర్వాసన, నోటి దుర్వాసనలు లేకుండ పోవును. ఇంకను అధికముగ సాధనచేయుటచే భూచరసిద్ధి లభించును. ఇందువల్ల భూమిపై సంచరించు ప్రతిప్రాణి అతనికి వశపడును. పులులు, శరభములు, ఏనుగులు, సింహములు మొదలగునవి అన్నియు వశపడుటయే కాదు, అతనిచేతితో తట్టినంత మాత్రమున చచ్చిపోగలవు. ప్రేమ దేవునివలెమిక్కిలి అందగాడుగ అగును. శుక్లధారణవలన యోగి శరీరమునుండి ఒక విధమగు సువాసన బయలుదేరును.

యోగి యొక్క ఆహారము

నీ అంతర్వాణి, నీకు తగిన ఆహారపదార్ధములను ఎంచుకొనుటలో మార్గదర్శి కాగలదు. నీ శరీరమునకు తగిన సాత్వికాహారమును ఎంచుకొనుము. తదితర వివరములకు అనుబంధములో చూడుము.

మితాహారము

సాత్వి కాహారముతో పొట్టలో సగభాగమును నింపుము. మిగిలిన నాల్గవ భాగమును ఖాళీగా వదలము.

ఆహార పారిశుధ్యము

"ఆహారశుద్ధౌ, సత్త్వ శుద్ధి:, సత్త్వశుద్ధౌ, ధృవస్మృతి: స్మృతిలభ్యౌ, సర్వగ్రంధినం విప్రమోక్ష:,"

ఆహార పారి శుధ్యము వలన స్వభావము పవిత్రమగును; పవిత్ర మగు స్వభావము వలన జ్ఞాపకశక్తి ధృడపడును. జ్ఞాపక శక్తి బలపడుట వలన సమస్త బంధములు విడిపోయినవాడై, బుద్ధిమంతుడు అందువలన మోక్షమును పొందును.

భోజనము చేసినవెంటనే ప్రాణాయా మాభ్యాసము చేయరాదు. బాగా ఆకలితో వున్నప్పుడు కూడ అభ్యసించరాదు. ప్రాణాయామమునకు కూర్చొన బోవు ముందు మరుగుదొడ్డికి వెళ్ళి కాల కృత్యములను నెరవేర్చు కొనుము. ప్రాణా యామమును అభ్యసించు వాడు, ఆహార పానీయముల విషయమై తగు కట్టుబాటులను కలిగియుండవలెను.

ఆహార విషయములో (అభ్యాస సమయమున) తగినంత శ్రద్ధ తీసికొనినచో మంచి ఫలితములు కనిపించును. వారికి అతి త్వరగా విజయ ప్రాప్తి కలుగును. చాల కాలము నుంచి మలబద్ధముచే బాధపడు వారును, సాయంత్రములందు మల విసర్జనము చేయు అలవాటు కలిగియున్న వారును, ప్రకృతి పిలుపులకు జవాబివ్వకుండగనే ఉదయమున పెందలకడ ప్రాణాయామమును చేయవచ్చును. ఇట్టివారు ఉదయమున మల విసర్జనముచేయుటకై శక్తికొద్దీ ప్రయత్నించుట మంచిది.

యోగ సాధన చేయువారికి ఆహార విషయికమగు కట్టుబాటు చాల ముఖ్యము.

ప్రారంభ దశలో ఆహార విషయమై చాల ఎక్కువ శ్రద్ధతీసికొనవలెను. ప్రాణాయామము సిద్ధించిన పిమ్మట, ఆహార నియమములను పాటించ నక్కరలేదు.

పాయసము

ఉడికిన తెల్లటి బియ్యమూ, నెయ్యి, పంచదార, పాలు కలసి వండిన పదార్థము బ్రహ్మచారులు, ప్రాణాయామసాధకులకు చాల లాభకారి.

పాలు

పాలను కాచి త్రాగవలెను. కాని ఎక్కువగ మరగనివ్వరాదు. దీనికి గుర్తు: పాలు పొంగు రానారంభించగనే పొయ్యిమీదనుంచి దింపివేయవలెను. ఎక్కువగా కాగుట వలన అందలి బలపర్థక పదార్థములు నశించును. పాలు సరియగురీతిని పుచ్చుకొన్నచో, శరీరమునకు కావలసిన ప్రాణ పోషక పదార్థములను అన్నిటినీ అది వక్కటే యివ్వగలిగి వున్నది. అంతేగాక, అది ప్రేవులలో చాల కొద్ది మలము మాత్రమే వుండులాగున చేయగలదు. ఇది యోగులకు, ప్రాణాయామసాధకులకు ఆదర్శకరమైన ఆహారము.

ఫలములు

ఫలాహారము శరీర ఆరోగ్యమును బాగుచేయును. యోగులకు ఇది చక్కని ఆహారము. ఇంతేగాక యిది ప్రకృతి సిద్ధమైన ఆహారముకూడను. ఇవి చాల బలమును యిచ్చును. అరటిపళ్ళు, ద్రాక్ష, తీపినారింజ, సీమరేగు, దానిమ్మ, మామిడి, సపోటా, ఖర్జూరములు శ్రేష్ఠమైనవి. నిమ్మకాయలు రక్తమునకు పుష్టినియిచ్చును. ఫలరసమునందు 'సీ' విటమినువుండును. సపోటాకాయలు, పరిశుద్ధరక్తమును వృద్ధిచేయును. మామిడి పళ్ళు, పాలు ఆరోగ్యకారులు. పాలు, మామిడిపళ్ళు మాత్రమే తిని జీవించవచ్చును. దానిమ్మగింజల రసము శరీరమునకు చల్లదనమును యిచ్చుటేగాక బలవర్థకము కూడను. అరటిపళ్ళు కూడ ప్రాణపోషకమైనవిన్నీ, బలవర్థకమైనవిన్నీ అయివున్నవి. ఫలాహారము మనస్సునకు ఏకాగ్రతను కలిగించును.

తినదగినవి

బార్లీ, గోధుమ, నెయ్యి, పాలు, బాదం కాయలు, ఆయువును వృద్ధిచేసి, బలమును, శక్తిని కలిగించును. యోగులకు, సాధకులకు బార్లీ చక్కని ఆహారము. శరీరమునకు చల్లదనమునుకూడ యిచ్చును. "ఏక్‌సంత్ కా అనుభవ్" అనే గ్రంథమును రచించిన శ్రీనారాయణస్వామి బార్లీ రొట్టెను మాత్రమే తిని జీవించును. ఇతడు తన శిష్యులను అందరిని ఈ రొట్టెనే తినవలసినదిగా చెప్పును. అక్బరుపాదుషా బార్లీ ఆహారమునే పుచ్చుకొనెడివాడట.

నీవు-పాలు, గోధుమ, బియ్యము, బార్లీ, రొట్టె, ఆవు పాలు, నెయ్యి, పంచదార, వెన్న, పటికబెల్లము, తేనె, శొంఠి, పచ్చికాయగూరలు, పెసలు, బంగాళదుంప, సర్జరసము, ఖర్జూరము, పులగములను తినవచ్చును. కుంభక సమయమును అధికము చేయుట కొరకు, ఆహారపదార్థములయొక్క పరిమాణమును తగ్గించవలెను. ప్రారంభదశలో చాల ఎక్కువగ ఆహార పరిమాణమును తగ్గించరాదు. సూర్యనాడియందు గాలి ప్రవహించునపుడు ఆహారము తీసికొనుము. పనస, దోస, వంకాయ, అరటిఊచ, సొర, బెండకాయలను కూడ తిన వచ్చును.

తినరానివి

బాగా వేయించిన కూరలు, కారపు కూరలు, పచ్చళ్లు, మాంసము, చేపలు, మెరపకాయలు, పుల్లగా వుండు వస్తువులు, చింతపండు, ఆవాలు, అన్నిరకముల నూనెలు, ఇంగువ, ఉప్పు, వుల్లిపాయ, వెల్లుల్లి, మినపప్పు, చేదువస్తువులు, ఎండిన లేక ఆరిపోయిన పదార్థములు, బెల్లము, ద్రాక్షసారాయము, మద్యసారము, పులి పెరుగు, పాచిపోయిన ఆహార పదార్థములు, ఆమ్లములు, వగరు వస్తువులు, ఘాటుగావుండు పదార్థము, బాగా వేగిన వస్తువులు, సులభముగ జీర్ణము కాని కూరలు, పక్వముకాని లేక మిగుల పండిన ఫలములు, గుమ్మడి కాయలు మొదలగు వానిని తినరాదు. మాంసము శాస్త్రవేత్తగా చేయుటకు పనికివచ్చునే కాని, వేదాంతి, యోగి, తత్త్వజ్ఞానిగా చేయుటకు పనికిరాదు. ఉల్లి, వెల్లుల్లి ఇవి మాంసముకంటె అపాయ కారులు. ప్రతి ఆహార పదార్థమునందును, కొంత భాగము ఉప్పు వుండును. కాన నీవు, ఆహారపదార్థములకు ఉప్పును జేర్చక పోయినప్పటికి, నీవు తినిన ఆహార పదార్థములనుండి, కావలసిన ఉప్పును శరీరము తీసికొనగలదు. పాశ్చాత్య (ALLOPATHIC) వైద్యులు తెలివి తక్కువగ తలంచు లాగున, ఉప్పును వేరే తీసికొన నందువలన శరీరమునందు ఉదజహరి కామ్లము లోపించి మందాగ్ని ఏర్పడునని నమ్ముట తెలివి తక్కువ. ఉప్పును మానినందు వలన ఏ విధమగు చెడుగు కలుగదు. గాంధీ మహాత్ముడు, యోగానందస్వామి - వీరు పదమూడు సంవత్సరముల కంటె ఎక్కువ కాలమునుంచి ఉప్పును తినుట మాని వేసిరి. ఉప్పును విసర్జించుటవలన నాలుక, మనస్సు వశపడుటయేగాక ఇచ్ఛా శక్తికూడ వృద్ధియగును. ఆరోగ్యము చక్కగ వుండును, నిప్పు వద్ద కూర్చొనుట, ఉపవాసము, ప్రాపంచిక విషయలోలురు, స్త్రీలతో సాంగత్యము, యాత్రలు, దూరపునడక, పెద్ద పెద్ద బాధ్యతలను పెట్టుకొనుట, ప్రొద్దున చాల పెందలకడ చన్నీటి స్నానము, కటువైన మాటలు, అబద్ధములు చెప్పుట, మోసకృత్యములు, దొంగతనము, జీవహింస, మనో వాక్కాయ కర్మలకు సంబంధించిన అన్ని విధములగు హింసలు, ఎవరితోనైన విరోధము, ఎవరిపైనైన అసూయ, దెబ్బలాట, పోట్లాట, గర్వము, కపటము, కుట్రలు చేయుట, చాడీలు చెప్పుట, కొండెములు చెప్పుట, తిన్నగా మాట్లాడకుండుట, ఆత్మకు మోక్షమునకు సంబంధించని సంభాషణలు, మనుష్యులు జంతువులకు భయమును కలిగించుట, అతిగా ఉపవసించుట, రోజుకు ఒకమారు మాత్రమే భుజించుట - మొదలగు వాటిని అన్నిటిని ప్రాణాయామమును అభ్యసించువాడు మానివేయవలెను.

సాధనకు గది

మారుమూలలో లేకుండ వుండులాగున ఒక అందమైన కుటీరమును ఏర్పరచుకొనుము. ఆ గదిని ఆవుపేడతో గాని, తెల్లసున్నముతో గాని చక్కగా అలికించుము. ఆ గదిలో నల్లులు, దోమలు, గోమారులు మొదలగునవి ఏవియు వుండరాదు. దానిని ప్రతిరోజు శుభ్రముగా చీపురుతో వూడ్చుము. ఆ గదిలో సువాసన వచ్చులాగున అగరువత్తులు గంధపుపొడిని వెలిగించుము. ఎక్కువ ఎత్తు ఎక్కువ పల్లము కాకుండ వున్న ఆసనమును ఏర్పరచుకొనవలెను. దానిపై దర్భాసనము, దానిపైన జింకచర్మము, దానిపైన గుడ్డపరచి పద్మాసనములో శరీరమును వంపులేకుండ నిలువుగ వుండు లాగున కూర్చొని, భక్తి భావముతో చేతులుజోడించి, విఘ్నేశ్వరునకు ఓం శ్రీ గణేశాయనమః అని నమస్కరించి, ఆ పిమ్మట ప్రాణాయామమును ప్రారంభించవలెను.

మాత్ర

అరచేతితో మోకాటివరకు ఒక చుట్టు అగునంతవరకు త్రిప్పుటకుగాని, మరీతొందరగాను, నెమ్మదిగాను కాకుండ ఒక వ్రేలితో మరొకవ్రేలుపై (చేతి) కొట్టుటకు పట్టుకాలమును గాని మాత్రయందురు.

ప్రతిక్షణమును మాత్ర యనవచ్చును. రెప్పపాటు సమయమునుగాని, ఒక్కసారి గాలిపీల్చుటకు పట్టు సమయమును గాని మాత్ర యనవచ్చును. ‘ఓం’ అను ప్రణవమును ఉచ్చరించుటకు పట్టు కాలమునుకూడ మాత్రయందురు. ఇది సులభమైనది. ప్రాణాయామసాధకులు దీనినే కాలమును లెక్కించుటకు ఉపయోగింతురు.

పద్మాసనము

దీనిని కమలాసనము అనికూడ అందురు. కమలము అన పద్మము. ఈ ఆసనము వేసినప్పుడు పద్మమువలె వుండుటచే, ఈ పేరుతో పిలువబడినది.

జపము, ధ్యానములకుగాను నిర్ణయింపబడిన నాల్గు ఆసనములలోనను, పద్మాసనము శ్రేష్ఠమైనది. ధ్యానమునకు యిది శ్రేష్ఠమైనది. ఘేరండుడు, శాండిల్యుడు మొదలగు ఋషులు దీనిని గొప్పగ పొగడెదరు. ఇది గృహస్థులు, స్త్రీలు, సన్నగ వుండువారు, యువకులు అందరకు అనుకూలమైనది.

రెండు కాళ్ళను బారజాపుకొని క్రిందకూర్చొనుము. ఆ పిమ్మట, కుడిపాదమును ఎడమతొడపైన ఎడమ పాదమును కుడితొడపైన పెట్టుము. చేతులను మోకాళ్ళపై పెట్టుము. లేనిచో, చేతివ్రేళ్ళను ఒకదానిలో నొకటి దూర్చి ఎడమ చీల మండపైన పెట్టవచ్చును. ఇది కొందరకు సౌకర్యముగ వుండును. లేకపోయిన, ఎడమ చేతిని ఎడమ మోకాటిపైన, కుడిచేతిని కుడిమోకాటిపైన పెట్టుము. అటువంటి సమయమున అరచెయ్యి మోకాటివైపు వుండులాగునను, చూపుడువ్రేలు బొటనవ్రేలి మధ్యభాగమును తాకులాగునను చిన్ముద్ర పెట్టుము.

సిద్ధాసనము

పద్మాసనము తరువాత సిద్ధాసనము శ్రేష్ఠమైనది. కాని కొందరు ‘ధ్యానము’ చేయుటకు ఈ ఆసనము, పద్మాసనము కంటె శ్రేష్ఠమైనదని చెప్పెదరు. ఈ ఆసన సిద్ధి పొందినవారికి చాలసిద్ధులు లభించును. దీనిని అనేక సిద్ధులు వేయుటచే, సిద్ధాసనమని అనుచున్నారు.

లావుగా వుండి మిక్కిలి లావుగా వుండెడి తొడలుగల వారుకూడ దీనిని అభ్యసించ వచ్చును. ఇది కొందరకు పద్మాసనము కంటె ఎక్కువ అనుకూలముగ వుండును. యువబ్రహ్మచారులు దీనిని అభ్యసించుట వలన బ్రహ్మచర్యమును కాపాడు కొనవచ్చును. కాని, ఈ ఆసనము స్త్రీలకు తగదు.

ఎడమకాలి మడమును గుదమువద్ద పెట్టుము. కుడి మడమను జననేంద్రియ మూలమువద్ద పెట్టుము. పాదములను కాళ్ళను చీల మండల అతుకులు రెండునూ ఒకదానిని మరొకటి తాకు లాగున వుంచుకొనుము. చేతులను పద్మాసనములో వలె పెట్టుము.

స్వస్తికాసనము

‘స్వస్తికము’ అన శరీరమును నిఠారుగా వుంచుకొని సుఖముగ కూర్చొనుట. కాళ్ళను ముందుకు చాపుము. ఎడమ కాలును ముడుచుము. ఆ పిదప ఆపాదమును కుడితొడ కండరముల దగ్గరగా ఆనించుము. అదేవిధముగ కుడికాలిని మడచి, ఆపాదమును తొడకు పిక్కకు మధ్యగా వుంచుము. అప్పుడు నీరెండుపాదములు కాళ్ళయొక్క తొడలు పిక్కలకు మధ్యగా వుండగలవు. ఇది ధ్యానము చేయుటకు అనుకూలముగ వుండ గలదు. చేతులను పద్మాసనములో వలె వుంచుము.

సమాసనము *[1]

ఎడమమడమను కుడితొడ మొదటను, కుడిమడమను ఎడమతొడ మొదటను పెట్టుము. సుఖముగా కూర్చొనుము. కుడివైపుకుగాని ఎడమవైపుకుగాని వంగకుము. దీనిని సమాసనము అందురు.

మూడు బంధములు

ఇవి నాల్గురకములు. సూర్య, ఉజ్జయి, సీతలి, బస్తి. కుంభకమును ప్రారంభించ బోవునపుడు యోగి యగువాడు ఈ మూడు బంధములను చేయవలెను. మొట్టమొదట మూలబంధము, రెండవదిగా ఉడ్యాణము, ఆ పిమ్మట జాలంధరములను చేయవలెను.

గుదమును గట్టిగా పైకిలాగి బిగబట్టుటవల్ల క్రిందివైపుకు ప్రవహించుచుండెడి అపానము పైకి ప్రవహించును. దీనిని మూలబంధము అందురు. ఈ అపానమును పైకి అగ్నివుండెడి చోటునకు ఈ లాగునచేసి పంపుటవల్ల, అగ్ని ప్రజ్వలించి పెద్ద మంటగలదిగా అగును. అందువలన వేడిపుట్టును. ఈ అగ్ని శరీరమున మంటలు మంటలుగ వ్యాపించి ఆ వేడిచే నిద్రించుచున్న కుండలినీ శక్తిని మేల్కొలుపును. అప్పుడు ఆకుండలినీ శక్తి దెబ్బతినిన త్రాచువలె బుసకొట్టుచులేచి సుషుమ్నా రంధ్రములో ప్రవేశించును. కావున యోగులు ప్రతినిత్యము మూలబంధమును చేయుట మంచిది. ఉడ్యాణబంధము కుంభకమును ముగించబోవు నప్పుడును, గాలిని బయటకు విడువ బోవునప్పుడును చేయవలెను. ఇటుల చేయుటవలన ప్రాణవాయువు సుషుమ్నలో ప్రవేశించును. వజ్రాసనములో కూర్చొని కాలిబొటన వ్రేళ్ళను రెంటిని చేతులతో చీలమండల వైపు తిరిగి యుండులాగున గట్టిగా పట్టుకొనుము. ఆ పిదప పొట్ట యొక్క పైభాగము (బొడ్డుకు పైభాగము)ను వెనుకకు సరస్వతీ నాడిని ఒత్తిపట్టులాగున చేయుము. (క్రమక్రమముగ) ఆ పిదప యీ ఒత్తి పట్టుటను హృదయమువరకును, అచ్చటి నుండి మెడవరకును చేయుము. ఇటులచేయుటచే ప్రాణవాయువు బొడ్డుయొక్క సంధిని జేరును. ఇందువల్ల నాభికి సంబంధించిన వ్యాధులు క్రమక్రమముగ లేకుండపోవును.

జాలంధరబంధమును పూరకము చివరకు చేయవలెను. మెడ నరములను గట్టిగా నొక్కి, పైకి బిగపట్టి, వాయువు ప్రవహించు గొట్టమును పైకి ఎగతన్ని యుంచుటనే జాలంధర బంధము అందురు. మెడను క్రిందికి వంచి, రొమ్మునకు గడ్డమును నొక్కి పట్టుట మూలముగ, మెడ బిగలాగి యుంచుట వలన, ప్రాణము బ్రహ్మనాడిగుండ ప్రవహించును. ఇదివరలో చెప్పినరీతిగా, ఆసనములో కూర్చొని, సరస్వతీ నాడిని నొక్కిపట్టి ప్రాణవాయువును వశములోనికి తెచ్చుకొనుము. మొదటిరోజున కుంభకమును నాల్గుమారులును, రెండవనాడు పదిమారులను, ఆ తరువాత ఐదుమారులు కొంతసేపాగియు చేయుము. మూడవరోజున ఇర్వైమారులు చేయుము. ఆ పిమ్మట బంధనముల సహితముగ కుంభకమును చేయుచూ రోజుకు రెండుమారులు చేయుచుండుము.

ఆరంభావస్థ

ప్రణవము (ఓం) ను మూడు మాత్రల కాలమువరకు ఉచ్చరించుము. ఇది నీ పూర్వ పాపములను నాశమొనర్చును. మంత్రప్రణవము అన్ని ఆటంకములను, పాపములను పోద్రోల గలిగి యున్నది. ఇటుల అభ్యసించుటచే ఆరంభవస్థ సిద్ధించును. యోగియొక్క శరీరమునకు చెమటపట్టును. చెమటపట్టినపుడు ఆ చెమటను శరీరమునకు అంతటికి రుద్దవలెను. శరీరము తిమ్మిర్లెక్క వచ్చును, ఒక్కొకప్పుడు కప్పవలె ఎగరవచ్చును.

ఘటావస్థ

ఆ తరువాత స్థితి ఘటావస్థ. ఇది తరుచు కుంభకము చేయుటచే సిద్ధించును. ప్రాణము, అపానము, మనస్సు, బుద్ధి, జీవాత్మ పరమాత్మల ఏకత్వప్రాప్తి కలుగుటనే, ఘటావస్థ అందురు. అట్టి స్థితి ప్రాప్తించినవాడు, అభ్యాసము చేయుటకుగాను నిర్ణయింపబడిన కాలములో నాల్గవవంతుకాలము సేపుమాత్రము అభ్యాసముచేసిన చాలును. ఉదయము సాయింత్రము 3 గంటల సేపు మాత్రము చేసిన చాలును. కేవల కుంభకము, రోజుకు ఒకమారు చేసిన చాలును.

గాలిని ఆపుజేసి వుంచిన సమయమున, ఇంద్రియముల నన్నిటిని వాటి యొక్క విషయముల నుండి మరల్చుటను ప్రత్యాహారము అందురు. నీవు కంటితో చూచు ప్రతివస్తువును ఆత్మగా తలచుము. చెవితో విను ప్రతి దానిని, ముక్కుతో వాసనచూచు ప్రతి పదార్థమును, నోటితోరుచిచూచు ప్రతివస్తువును, చేతితో తాకు ప్రతిదానిని ఆత్మగా తలచులాగున అభ్యసించుము. ఇట్టివానికి యోగదృష్టి, దివ్యదృష్టి, ఆకాశగమనము, కోరిన రూపమును పొందగలుగుట, ఇచ్ఛవచ్చిన భాషలో మాట్లాడగలుగుట, కనిపించకుండ మాయముకాగలుగుట, ఇనుమును బంగారముగ మార్చగలుగుట - మొదలగు ఎన్నోశక్తులు లభించగలవు

యోగమును చక్కగాఅభ్యసించువాడు, గాలిలో ఎగుర గలడు. కాని యోగసిద్ధికి, ఈ మహిమలుఅన్నియు విఘ్న కారులని తెలివిగలవాడు తలచవలెను. కావున వీటికి లోబడరాదు. ఈ శక్తులను ఎవరిపైనను ప్రయోగించరాదు. ఈ మహిమలు లేని సామాన్యమానవునివలె సంచరింపవలెను. శిష్యులు తమ వాంఛలను నెరవేర్చుకొనుటకై, గురువుయొక్క మహిమలను ప్రదర్శింపవలసినదిగా కోరుదురు. ఇందుకు సమ్మతించినవాడు, యోగసాధన చేయుటకు అవకాశము లేక వదలివేయవలసి వచ్చును. కావున, తాను బాగుపడవలెనని తలచువాడు రాత్రింబవళ్ళు యోగాభ్యాసనమును మాత్రమే చేయుచుండ వలెను. ఎడతెగకుండ యోగసాధనము చేయుట వలన త్వరలోనే ఘటావస్థ సిద్ధించును. నిరుపయోగకరముగ, యీప్రాపంచిక వ్యామోహములలో మునిగియుండు వారి సాంగత్యము వలన, ఏవిధమగు ప్రయోజనమును లేదు. దుస్సాంగత్యమును వదలి యోగసాధనను పట్టుదలతో చేసి సుఖించుము.

పరిచయావస్థ

ఇటుల ఎడతెగకుండ యోగసాధన చేయుటవలన పరిచయావస్థ(3 వ మెట్టు) వచ్చును. ఈస్థితిలో ఎడతెగని సాధనచే కుండలిని మేల్కొని, సుషుమ్నలో ప్రవేశించును. చిత్తము ప్రాణముతో పాటు సుషుమ్నలో ప్రవేశించుటచే శిరస్సు (తన ఉన్నతాసనము)ను ప్రాణముతోసహా చేరును. యోగసాధనచే క్రియాశక్తి సిద్ధిని పొంది, షట్చక్రములగుండా మార్గమును ఏర్పరచుకొని కర్మయొక్క త్రివిధఫలములను అప్పుడు చూడ గలుగును. ఆపిమ్మట, అతడు ప్రణవ (ఓం) సహాయముచే కర్మలను రూపుమాపవలెను. అందుచే కాయవ్యూహ సిద్ధిలభించును. ఇందువలన పునర్జన్మ లేకుండుటకై, తన శరీరము నుండి అనేక శరీరములను తన మహిమవల్ల సృష్టించి కర్మలను అన్నింటిని యీ రీతిగా పోగొట్టుకొనిన వాడగును. ఇట్టి స్థితికి వచ్చినవాడు *[2] పంచధారణలను చేసి పంచభూతములను తన వశములోనికి తెచ్చికొనగలుగును.

నిష్పత్త్యవస్థ

ఇది ప్రాణాయామముయొక్క నాల్గవ మెట్టు, యోగి యగువాడు తన కర్మబీజముల నన్నింటిని భస్మమొనర్చుకొని, మరణ రాహిత్యము గలవాడగును. అతనికి ఆకలి, దప్పిక, నిద్ర, స్పృహ దప్పుటలు - ఏమియు వుండవు. అతడు సంపూర్ణముగ స్వతంత్రుడై వుండును. ప్రపంచమునందు ఎచ్చటికైన తాను పోగలుగును. మరల జన్మ లెత్తనక్కరలేదు. అన్ని విధములగు వ్యాధులు, వార్ధక్యము, చావులనుండి విముక్తుడగును. సమాధి ఆనందమును అనుభవించును. ఇట్టి స్థితికి వచ్చినవాడు, ఇక ఏవిధమగు యోగసాధనను చేయనక్కరలేదు. నాలుకను తాలుమూలము వద్దకు పోనిచ్చి ప్రాణవాయువును త్రాగ గలుగును. ప్రాణపానవాయువుల కార్యవిధానమును తెలసి కొనును. ముక్తిని పొందును. యోగ సాధకుడు క్రమక్రమముగ, శ్రద్ధతో ఎడతెగకుండ సాధన చేసినచో పైన చెప్పిన సిద్ధులన్నియు ఒకదాని తరువాత ఒకటిగ లభించగలవు. ఓర్పులేకుండ సిద్ధులు లభించలేదని విచారపడి మానివేయువానికి ఏ ఫలితములును లభించవు. ఆహారము, బ్రహ్మచర్యముల విషయములలో శ్రద్ధ వహించుము.

మూడవ ప్రకరణము

ప్రాణాయామ మంటే ?

‘తస్మిన్‌సతి శ్వాసప్రశ్వాసయో ర్గతివిచ్ఛేదః ప్రాణాయామః’

“శ్వాసను నియమించుట లేక వశపరచుకొనుట యన ఉచ్ఛ్వాసనిశ్వాసలను ఆపుజేయుట. ఇది ఆసనసిద్ధి కలిగిన పిదప సహజముగ సిద్ధించును.”

ప్రాణాయామమును గురించి పతంజలి యోగసూత్రములలో 2 అ. 49 సూత్రములో ఈ విధముగ వివరించబడి యున్నది.

‘శ్వాస’ యన లోపలికి పీల్చుగాలి, ‘ప్రశ్వాస’ యన బయటకు విడచుగాలి. ఆసనసిద్ధి కలిగిన పిమ్మట ప్రాణాయామమును అభ్యసించవచ్చును. ఒకే ఆసనములో కదలక మెదలక ఒకేసారిగ మూడుగంటలసేపు కూర్చొన గలుగుటయే ఆసనసిద్ధి. అరగంటనుండి గంటవరకు ఒకే ఆసనములో కూర్చొన గలిగినప్పటినుండి ప్రాణాయామము చేయుటను ప్రారంభించ వచ్చును. ప్రాణాయామము చేయకుండ ఆధ్యాత్మిక సాధనలో జయము పొందుట చాల కష్టము.

  1. * ఆసనములను గురించి పూర్తిగా తెలసికొన గోరువారు నాచే రచింపబడిన ‘సచిత్ర యోగాసనములు’ చదువుడు.
  2. * అనుబంధములో చూడుము.