అనుబంధము

సౌర నాడీమండలిపై ధారణ

సౌరనాడీ మండలి ఒక ప్రధానమైన నరముల కూటమి. ఇది పొట్టకు పైభాగముననుండు గుంటకు వెనుకవైపుగా వుండును. మనుష్యుని ఆంతరికావయములన్నిటి పైన ఈ నాడీ మండలి ఆధిపత్యమును కలిగియున్నది. మనుష్యుని ఆ వేగములు శారీరక కృత్యములను వశపరుచుకొనుటలో యిది ప్రధాన పాత్రను వహించి యున్నది. ఈ మండలి తెల్లని బూడిద వన్నెగా గల మజ్జాపదార్థముచే చేయబడి యున్నది. ఈనాడీ మండలిపై తీవ్రమగు దెబ్బతగిలినచో, మనుష్యుడు స్పృహ తప్పి పడిపోవును. ఇది ప్రాణముండుచోటు, శక్తినిలయము. అది పదునారు ఆధారములందు ప్రధానమైనది. ఇచ్చట తీవ్రమగు దెబ్బ తగులుటచే చచ్చిన మనుజు లెందరో గలరు. ఇది సక్రమముగ వున్నచో శరీరమంతయు సక్రమముగ వుండును. శరీరము నందలి అన్ని భాగములకు, యిచ్చటినుండియే శక్తి కిరణములు పంపబడును. ప్రాణాయామాభ్యాసముచే ప్రాణమును యీ నాడీ మండలిపై ధారణ చేయుటవల్ల, ఈ నాడీ మండలిలో అణగియున్న ప్రకాశము బయల్వెడలును.

సిద్ధాసనములో గాని పద్మాసనములోగాని నిలువుగ కూర్చొనుము. కనులు మూయుము.

నీవు సులువుగా పీల్చగలిగి నంతసేపు నెమ్మదిగా ఎడమ ముక్కుతో గాలిని పీల్చుము. కుడిముక్కును కుడిబొటన వ్రేలితో మూయుము.. మానసికముగా 'ఓం'ను జపించుము. గాలిని కుంభించుము. ఈ సమయమున, నీమనస్సును సౌరనాడీ మండలిపై నిలుపుము. ఇటుల చేయుటలో మనస్సునకు అనవసరముగ ఏవిధమగు శ్రమయు కలుగ నివ్వకుము. నీవు కుంభకము చేసినప్పుడు, నీవు పీల్చిన ప్రాణవాయువు సౌరనాడీ మండలి (Solar Flexus) వద్ద చేరియున్నట్లుగా భావించుము. అప్పుడు మానసికముగ "నేను ప్రాణవాయువును, సౌఖ్యమును, ఆనందమును, బలమును, శక్తిని, పుష్టిని, ప్రేమను పీల్చుచున్నాను." అని భావించుము. తరువాత నెమ్మదిగా కుడి ముక్కుతో గాలిని విడువుము. ఆ పిమ్మట కుడిముక్కుతో గాలినిపీల్చి పై ప్రకారముచేసి, చివరకు ఎడమముక్కుతో గాలిని విడువుము. ఈ రీతిని ప్రతిరోజు ఉదయము 12 మారులు చేయుము. భయము, దుర్బలత, తదితరములైన కోరరాని ఆవేగములు, ఆధ్యాత్మికోన్నతికి భంగము కలిగించు తదితర దోషములు లేకుండపోవును. రానురాను మిక్కిలి ధైర్యశాలివై, ఆత్మజ్ఞానమును పొందగలవు.

పంచ ధారణలు

పృధ్వి, ఆపస్, అగ్ని, వాయువు, ఆకాశములని ఐదు మూలద్రవ్యములు గలవు. శరీరము యీ ఐదు ద్రవ్యములచే చేయబడినది. పాదములనుండి మోకాళ్ళవరకు పృధ్వీతత్వ ముండుచోటు, ఇది చతుష్కోణాకృతి గలిగి, పసుపువన్నె గలదియై 'ల' ఆనెడి వర్ణముగలిగి వున్నది. ఈ స్థానము పై రోజుకు రెండు గంటలు ధారణ చేయుటచే, పృధ్వీతత్త్వము వశపడును. దీనిని లోబరచుకొనినవానికి పృధ్వీతత్త్వముచే మరణము రాదు.

అంభసి ధారణ

ఆపస్తత్త్వముయొక్క నివాసస్థానము మోకాళ్ళ నుండి గుదము వరకు వున్నది. ఇది అర్ధచంద్రాకృతిని గలిగి, తెలుపు వన్నెగలదై యున్నది. దీని బీజాక్షరము. 'వ'. 'వ'ను స్మరించుచూ ఆపస్తత్త్వ నివాస స్థానమువరకు గాలిని (పీల్చి) గొంపోయి, నాల్గుచేతులు, కిరీటము, పీతాంబరధారియగు నారాయణుని ధ్యానించుచూ, ఆతడునాశరహితుడని భావించు చుండవలెను. ఈ రీతిని ప్రతిదినము రెండు గంటలు ధారణ చేయువాడు, అన్ని పాపములనుండి విముక్తుడగుటయేగాక ఏవిధమగు జలగండము లేని వాడగును.

అగ్ని ధారణ

గుదమునుండి హృదయమువరకు అగ్ని తత్త్వ వాసస్థానము. ఇది త్రికోణాకారముగను, ఎరుపురంగుగను వుండును. 'ర' దీని బీజాక్షరము, గాలిని 'ర'ను ఉచ్చరించుచూ అగ్ని వాసస్థానమునకు పీల్చి, త్రినేత్రుడు, వాంఛలను తీర్చువాడు. మధ్యాహ్న సూర్యుని వంటి రంగు గలవాడు అగు రుద్రుని ధ్యానించవలెను. ఈ రీతిని రెండు గంటలు ప్రతి నిత్యము ధ్యానించువాడు అగ్నివలన ఏవిధముగను బాధింపబడడు.

వాయు ధారణ

హృదయమునుండి రెండు కనుబొమల మధ్యవరకు వాయు 'తత్త్వ వాసస్థానము, నలుపురంగు, బీజాక్షరము 'య' వాయు తత్త్వ వాసస్థానమునకు గాలిని పీల్చి, ఈశ్వరుని ధ్యానించవలెను. ఇట్టి వానికి వాయువు వల్ల మరణమురాదు.

ఆకాశ ధారణ

రెండు కనుబొమల మధ్యనుండి తలపైవరకు ఆకాశ వాసస్థానము. పొగరంగు గలిగి, వృత్తాకారముగ వుండును. 'హ' బీజాక్షరము. ఆకాశవాసస్థానమునకు గాలిని పీల్చి, సదా శివుని ధ్యానించవలెను. ఇట్టివాడు పైకి ఎగురగలుగుటే గాక, అనేక సిద్ధులను పొందును.

యోగి భుశుండుని చరిత్ర

యోగులలో చిరంజీవులుగా వున్నవారిలో భుశుండుడు ఒకడు. ప్రాణాయామశాస్త్ర పండితుడు. మహామేరువుకు ఉత్తర శిఖరముపైగల కల్పవృక్షముయొక్క దక్షిణశాఖపై పర్వతమంత పెద్దదగు గూటిని కట్టుకొని యీ భుశుండుడను కాకి నివసించుచుండెడివాడు. యోగు లందరికంటె ఎక్కువ కాలము జీవించినవానిగా యితనిని చెప్పెదరు. ఈతడు త్రికాల జ్ఞాని. ఎంతసేపటివరకైన యోగసమాధిలో వుండగల శక్తి శాలి, వాంఛారహితుడు. ఉత్తమమైన శాంతిని, జ్ఞానమును పొందిన మహాత్ముడు. ఇతడు తన గూటియందే ఆత్మానందము ననుభవించుచూ, యిప్పటికిని జీవించియుండెను. ఆతడు బ్రహ్మ శక్తియగు అలంబుసోపాసకుడు. తన యీ గూటియందే ఎన్నో కల్పములనుండి నివసించుచూ పంచవిధధారణలను చేసి సిద్ధిని పొందెను. ద్వాదశాదిత్యులు తమ ప్రభావముచే ప్రపంచము నంతను భస్మమొనర్చునపుడు తన ఆపోధారణచే ఆకాశమును చేరును.

ఈ కిరణాగ్నినుండి అగ్నిధారణనుచేసి తన్ను కాపాడు కొనును. ప్రపంచమంతయు జలమయ మైనప్పుడు, వాయుధారణ చేసి మహామేరు సహితముగా నీటిపై తేలియుండును. సృష్టి యంతయు వినాశమగు కాలము వచ్చినప్పుడు బ్రహ్మవాసస్థాన మందు పున:సృష్టి జరుగునంతవరకు సుషుప్త్యవస్థ యందుండి సృష్టి జరుగుటతోడనే తిరిగి తన వాసస్థానమునకు వచ్చును. ఈ రీతిని ఆతని సంకల్పమువల్ల ప్రతికల్పమందును చేయుచుండును.

ఆంతిరిక యంత్రము

మనము తీసికొను ఆహారము నత్రజని సంబంధమైన ద్రవ్యములు, మాంసకృత్తులు, క్రొవ్వు, పిండిపదార్థములు మొదలగువానితో కూడియున్నది. (నెయ్యి, బియ్యము, పంచదార మొ) మాంసకృత్తులు స్నాయువులను, ధాతువులను నిర్మించును. పిండిపదార్థములు శక్తిని కలిగించును. ఇవిగాక మరికొన్ని రకములైన లవణములు కూడగలవు. వివిధములగు ద్రవములు కూడ గలవు. లాలాజలము నోటియందు, జఠర రసము పొట్టయందు, పైత్యరసము, మధురరసము, ఆంత్రరసము లనునవి ప్రేవులయందుండి ఆహార పదార్హములు జీర్ణకోశములోనికి పోవునప్పుడు ఆహారపదార్థములపై పని చేయుచుండును. లాలాజలము పిండిపదార్థములను చక్కెరగామార్చును. ఆతరువాత యీ చక్కెరగా మార్చబడిన పదార్థము మధురసము, ఆంత్రరసములతో కలియును. పైత్యరసము క్రొవ్వు పదార్థములపై పనిచేయును. జఠర రసము, మధుర రసము మాంసకృతులపై పనిచేయును. ఈ రసము లన్నియు వివిధ ఆహార పదార్థములతో చేరి, వాటి నన్నిటిని అన్నరసముగా మార్చివేయును. ఈ అన్నరసము క్షీరవాహికల ద్వారా రక్తమున కలియును. హృదయమునకు కుడివైపున అపరిశుద్ధ రక్తము వుండును. ఈ అపరిశుద్ధరక్తము పరిశుద్ధ పరుపబడుటకు గాను శ్వాసాశయములకు పంపబడును. అచ్చట పరిశుద్ధ పరుపబడిన పిమ్మట, తిరిగి హృదయముయొక్క ఎడమ భాగమునకు వచ్చి, అచ్చటనుండి బృహద్ధమని ద్వారా శరీరమున కంతకును యీ పరిశుద్ధ రక్తము పంపబడును. ఈ పరిశుద్ధ రక్తము శరీరమందలి ప్రతిభాగమును తనతో నింపి, వాటికి జలము నిచ్చును. ఆపైన యీ మాళములందున్న అపరిశుద్ధ రక్తమును సిరలు, హృదయమునకు కుడివైపున వున్న మలిన రక్తాశయమునకు తీసికొని వచ్చుచుండును.

ఇటుల వుపయోగపడగా మిగిలిపోవు పనికి మాలిన పదార్థము పీదప్రేవులగుండా ఆరడుగుల పొడవుగల గుదనాళికలోనికి కొంపోబడును. అచ్చటినుండి ఉదయమున జరుగుచుండు మలవిసర్జనము ద్వారా బయటకు నెట్టి వేయబడును. మూత్రనాళములు రక్తమునుండి వచ్చు మలిన పదార్థమును మూత్రాశయమునకు పంపును. అచ్చటినుండి యీ మలినపదార్థము మూత్రద్వారము ద్వారా బయటకు వెళ్ళిపోవును.

నాడీవిధానమునందు బృహస్మస్తిష్కము, అను మస్తిష్కము, కశేరుకనాడి, ఆనుకంపిక మజ్జాతంతువు లనునవి వుండును. ఇవిగాక మెదడునందు వినుట, చూచుట, రుచి చూచుట, వాసనచూచుట, మాట్లాడుట మొదలగు పనులు చేయుటకు అనేకములగు కేంద్రములుగలవు. వ్రేలిపై తేలు కుట్టినదనుకొనుడు. అందువలన కలిగెడి ఆ వేదనను జ్ఞానవాహిక మజ్జాతంతువులు వెన్నుపామువద్దకు మొట్టమొదట కొంపోయి, అచ్చటనుండి మెదడునకు కొంపోవును. అప్పుడు మెదడునందుండు మనస్సు దాని పరిణామమును శరీరముపై కలిగించును. ఎటులన, ఆ ఆవేదన మరల వెన్నుపామువద్దకు కొంపోబడును. అచ్చటినుండి గతివాహక మజ్జాతంతువుల ద్వారా చేతివద్దకు కొంపోబడును. అప్పుడు మన చేతివ్రేలిని తేలు కరచినదిగదా యని తలంచి, అచ్చటినుండి వ్రేలిని పైకి తీసికొందుము. ఇదంతయు ఒక రెప్పపాటులో జరిగిపోవును. ఈ బాధను అనుకంపిక మజ్జాతంతువులు పొట్ట, హృదయము, యకృత్తు, ప్లీహ మొదలగువాని ఆంతరి కేంద్రియములకు గొంపోవును.

ఇక ప్రాణపోషకమగు శుక్ర మేరీతిని తయారగుచున్నదో చెప్పెదను. అండకోశమునందుండు వృషణములు రెండింటిని స్రావక గ్రంధులందురు. ఇవి తేనెటీగ ఒక్కొక్క బిందువును ప్రోగుచేయురీతిని, రక్తమునుండి శుక్రమును ప్రోగుచేయును. అచ్చటినుండి ఈ ద్రవము (వీర్యము) రెండు శుక్రవాహికల ద్వారా శుక్రసంచయ తిత్తులు రెంటిలోనికి గొంపోవబడును. ఇట్టి నిలువచేయబడియున్న శుక్రము, కామోద్రేకము కలిగినప్పుడు Ejaculatory ducts అనబడు చిన్నగొట్టముల ద్వారా మూత్రద్వారము నందలి Prostatic Portion లోనికి నెట్టి వేయబడును. అచ్చట యీ శుక్రము Prostate Gland నందు కూడ బెట్టబడియున్న Prostatic Juice అనబడు ద్రవముతో కలియును. ఈ ఆంతరిక పరికరమును నిజముగా నడుపువాడెవడు ? దీనినంతను ఆలోచించినచో నీకు ఆశ్చర్యము వేయదా ? వివిధ విధములగు అసంఖ్యాకములగు యీ యంత్రములన్నియు ఎంతప్రశాంతముగను, త్వరగను తమ కార్యములను నెరవేర్చుచున్నవో గమనించితివా ? రక్తమును శరీరమున కంతకు పంపు వాడెవడు ? పరిశుద్ధ పరచు వాడెవడు ? ఆహారమును జీర్ణముచేసి, శరీరమునకు పుష్టినిచ్చి, పనికిమాలిన పదార్థములను బయటకు నెట్టివేయు వాడెవడు ? ఆతడే భగవంతుడు ! ఈ తొమ్మిదిదారులుగల శరీర మను పట్టణమందుండి పాలించు వాడతడే ?

యోగుల ఆహారము

మనస్సుకు శరీరమునకు సన్నిహిత సంబంధము కలదు. మనస్సనునది ఆహారముయొక్క అతి సూక్ష్మ భాగముచే నిర్మింపబడును. దీనిని గురించి ఉద్దాలకుడు తన కుమారుడగు శ్వేతకేతువునకు యీ రీతిని చెప్పెను. "ఆహారము మూడు విధములుగ మారును. స్థూల భాగము (Excreta) గను, మాధ్యమిక భాగము చర్మముగను, అతిసూక్ష్మభాగము మనస్సు గను మారును" ఇదేవిషయమును గురించి మరల ఛాందోగ్యోషత్తులో "ఆహారపారిశుధ్యము గలిగి యండుటచే పవిత్రా చరణ గలవాడుగా నగును. ఇట్టి పవిత్రా చరణ స్వభావముచే ఆత్మ జ్ఞానోదయమున్నూ, అందువల్ల సమస్త బంధములు త్రెంచివేయ బడినవాడున్నూ అగును" అని చెప్పబడి యున్నది.

ఆహారము మూడు విధములు: సాత్విక, రాజసిక, తామసికములని. పాలు, ఫలములు ధ్యానము, వెన్న జున్ను, బంగాళదుంప, Spinach మొదలగునవి సాత్వికములు. వీటి వలన మనస్సు సాత్వికమైనదిగ మారును. చేపలు, కోడిగ్రుడ్డు, మాంసము మొదలగునవి రాజసికములు. కామోద్రేకమును కలిగించును. గో మాంసము, ఉల్లి, వెల్లుల్లి మొదలగునవి తామసికములు. అవి మనస్సుకు జడత్వమును కలిగించి క్రోధము గలవానినిగ చేయును. దీనినే గీతలో శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు యీ రీతిని చెప్పెను. "ఆహారము మూడువిధములు. ఆయుర్వృద్ధిని గలిగించుచూ, చిత్తస్థైర్యమును కలిగించి, బలమును ఆరోగ్యమును యిచ్చి, ఇహ పర సుఖముల యందు ప్రీతిని గలిగించుచూ రుచిగాను, మృదువుగాను స్థిరముగాను మనోహరముగాను వుండునట్టి పదార్థములు సాత్త్వికములు. చేదు, పులుసు, ఉప్పు, వేడి, తీక్షణము, మోటు,దాహమును గలవి రాజసికములు. నిలువ పదార్థములు, రుచిలేనివి, దుర్గంధము గలవి, గురువుగాక తదితరుల యుచ్ఛిషము, మద్యమాంసములు మొదలగునవి తామసికములు."

(గీత 17 అ. 8-10 శ్లో)

ఆహారము నాల్గు విధములు. త్రాగెడి ద్రవపదార్థములు, నమలవలసిన ఘనపదార్థములు, నాకి చప్పరించవలసినవి, నమలకుండా మ్రింగెడివి. ఆహార పదార్థములను నోటితో చక్కగా నమలవలెను. ఇటుల చేయక పోయినచో సరిగా జీర్ణముకాక, వ్యర్థముగా మలరూపమున పోవును.

ఆహారమనునది శరీరపోషకముగను, ఆరోగ్యవర్ధకముగను వుండవలెను. మనిషి జీవించుటకు కావలసినది సరియైన ఆహారమే. చాలావ్యాధులు చెడ్డఆహారమును తీసికొనుటవల్లనే వచ్చుచున్నవి. ఆరోగ్యవంతుడుగా వుండదలచువాడు ఆహార పదార్థములను గురించి పూర్తియగు జ్ఞానమును కలిగియుండవలెను. మనకు కావలసినది విలువగల ఆహారముగాదు. సక్రమమైన ఆహారమే. విలువగల ఆహారము అనారోగ్యమును కలిగించును. సక్రమమైన ఆహారము ఆరోగ్యమును కాపాడును.

శరీరమునకు కావలసిన వేడినిచ్చుటకు, క్రొత్త జీవాణువులను సృష్టించుటకు ఈ రెండింటికిగాను మనము ఆహారమును తీసికొనవలెను. ఈ ఆహారపదార్థములలో మాంసకృత్తులు, పిండి పదార్థములు, ఉదజకర్భనము, స్ఫురితములు, లవణములు, వివిధములగు భస్మములు, జలములు, విటమినులు మొదలగునవి వుండును. మాంసకృత్తులుండు పదార్థములు నత్రజని సంబంధమైనవిగా వుండి, శరీరమందలి నాళనిర్మాణ మొనర్చును. ఇవి పాలు, పప్పు మొదలగువానిలో గలవు. వీనిలో కొన్నింట కర్బనము, ఉదజని, ఆమ్లజని నత్రజనియున్నూ, ఒక్కొక్కప్పుడు ఇనుము, గంధకము, భాస్వరము గలవిగను వుండును. పిండిపదార్థములు కర్బనోజ్జనితములు. ఇది బియ్యములో గలదు. ఇది శరీరమునకు పుష్టి లేక ఉష్ణము నిచ్చును. కర్బనోజ్జనితములో పిండిపదార్థము, పంచదార లేక జిగురువుండును. వీటియందు కర్బనము, ఉదజని, ఆమ్లజను లుండును. ఉదజకర్బసము లేక క్రొవ్వు నెయ్యి, వనస్పతి నూనె అందుండును. శరీర యంత్రమునకు తారు వేయుటకు నూనె పదా ర్థము లావశ్యకములు. వెన్న, జున్ను, మీగడ, ఆలివ్ నూనె, వేరుశనగనూనె, ఆవ నూనెలు యీ పనికి చాల ఉపయోగపడును.

సరియైన ఆహారము శరీరమును అన్ని విధముల కాపాడును. పాలు పూర్ణాహారము. శరీరమునకు కావలసిన పదార్థము లన్నియు దీనియందు గలవు. మాంసకృత్తులు, క్రొవ్వు, పిండి పదార్థములు-యివి తగు నిష్పత్తిలో మనము గై కొను ఆహార మందుండవలెను. ఈ మూడింటిలో ఏ ఒకటి తమ నిష్పత్తిలో హెచ్చు తగ్గులుగా వున్నప్పటికీ, అది శరీరారోగ్య భంగ కారియే. కావున జాగరూకత వహించవలెను. కొందరు కోడి గ్రుడ్డు కాయగూరలవంటి దందురు. ఇది తప్పు, కావున యోగ సాధకులు దీనిని వర్జించవలెను. పాలు, వెన్న, జున్ను, ఫలములు, బాదం పప్పు, బంగాళాదుంపలు, పచ్చిముల్లంగి, Turnip దుంప వీటిలో సమస్త ప్రాణపోషక పదార్థములు గలవు.

ఆహారమును జీర్ణము చేయు ద్రవములలో లాలాజలము నోటియందును, పొట్టలో జఠర రసమును, చిన్నప్రేవులలో పైత్యరసము, ఆంత్రరసమున్నూ ముఖ్యములు. లాలాజలము లాలాగ్రంధులందుండును, ఇది పిండిపదార్థములను జీర్ణమగు నటుల చేయును. జఠర రసములో లవణ ద్రావకము వుండును. ఇది జఠర గ్రంధులందుండును. ఇది మాంసకృత్తులను జీర్ణమగు లాగున చేయును. మధురసము పిండిపదార్థము, మాంసకృత్తు, క్రొవ్వులను జీర్ణము చేయును. పైత్యరసము యకృత్తు నందుండును. ఇది క్రొవ్వు పదార్థములను జీర్ణ మగునటుల చేయును. ఈ పై పదార్థము లన్నిటివల్ల ఆహారపదార్థములన్నియు అన్న రసముగా మారి చిన్నప్రేవులందలి క్షీరవాహికలలో ప్రవేశించును.

తిండిపోతులు, విషయలోలురగు వారికి యోగము సిద్ధించదు.

క్రుళ్ళిన, పాసిన, చెడిపోయిన, పులిసిన, శుభ్రముగా లేని, రెండుమారులు వండిన, రాత్రి నిలవవున్న పదార్థములను విసర్జించవలెను. ఆహారము కొద్దిగను, తేలికగ జీర్ణమగు నట్టిదిగను, పుష్టికరమైనదిగను వుండవలెను. తినుట కొరకు జీవించువాడు పాపి, బ్రతుకుటకొరకు తినువాడు యోగి. ఆకలిగావున్నప్పుడు తినిన ఆహారము చక్కగా జీర్ణమగును. ఆకలిలేనప్పుడు ఏమియూ తినవద్దు. పొట్టకు విశ్రాంతి యిమ్ము.

రుచులకై ప్రాకులాడకుము. అర్ధములేని యీ రుచులకై ప్రాకులాడుటవలననే అనేకులు అనేకములగు బాధల ననుభవించుచున్నారు. ఏదైన క్రొత్తస్థలముకు వెళ్ళినప్పుడు నీకు యిష్టమగు పదార్థములు లభించనిచో మిక్కుటమగు వేదన పొందెదవు. ఇదేనా నీ బలము ? ఎందుకిటుల గర్వించెదవు ? నీవు నీ నాలుకకు బానిసవు కాలేదా ? ఇదితప్పు, స్వల్పమగు స్వాభావికాహారమును గై కొమ్ము. సుఖము ననుభవించగలవు. తినుటకై బ్రతుకకుము. బ్రతుకుటకై తినుము. పవిత్రమగు ధ్యానమునకే కాలమును వినియోగించు యోగసాధకునకు చాలకొద్ది ఆహారము చాలును. శేరులేక శేరున్నర పాలు, కొన్ని ఫలములు చాలును. శారీరక పరిశ్రమను కూడ చేయకోరు సాధకునకు ఎక్కువ ఆహారము కావలసివచ్చును.

ఆరోగ్యమును కాపాడుకొనుటకు మాంసము అక్కర లేదు. ఇది ఆరోగ్యమునకు హానికారి. దీనివల్ల నారికురుపు మొదలగు అనేకవ్యాధులు వచ్చును. ఆహారమునకై జంతు వులను చంపుట మహాపాపము. కొందరు దేవుళ్ళ పేరుచెప్పి జంతువులను బలియిచ్చెదరు. ఇది మూర్ఖత్వము.

"అహింసా పరమోధర్మ:" అహింసయే గొప్పధర్మమని చెప్పలేదా ? "దీనినే యేసుప్రభువు, "దయతో నుండువారు ప్రభునిచే దయతో చూడబడుదురు" అని చెప్పెను.

మహా వీర ప్రభువు "ప్రతి ప్రాణిని తన్నుగా తలచి, దేనికిని కీడును చేయకుము" అనెను. ఇతరులకు నీవుచేయు ప్రతి కీడు, నీకే తిరిగివచ్చును.

లేడీ మార్గరెట్ హాస్పిటలునందలి ప్రధానవైద్యుడగు డా. జే. ఓల్డుఫీల్డ్ యీ విధముగా వ్రాసెను.

"మానవునకు కావలసిన సమస్త ప్రాణపోషక పదార్థములు శాకములలో గలవని యీనాడు శాస్త్రపరిశోధనచే రుజువు అయ్యెను. మాంసము అస్వాభావికాహారము. అందు వల్ల అనేకములగు అపాయములు కలుగును. నేటి ఆధునిక నాగరకులు దీనిని నాగరకముగ ఎంచి, తిని, అనేకవ్యాధులకు గురియగుచున్నారు. నూటికి తొంబది తొమ్మిది వ్యాధులు మాంసాహారమువల్లనే వచ్చుచున్నవని చెప్పుటలో ఆశ్చర్యము ఏమియూ లేదనుటను ఎవ్వరును కాదనజాలరు."

మాంసాహారము, మద్యపానము యివి రెండును సోదరులవంటివి. మాంసాహారులు సంతాననిరోధము నొనర్పజాలరు, వీరికి మనస్సును వశపరచు కొనుట పూర్తిగా అసంభవము. మాంసమును తిను పులి ఎంతభీకరముగను, గడ్డినితిను ఆవు ఏనుగులు ఎంత ప్రశాంతముగను వుండునో చూడుము. మాంసము మెదడుపై చాల దుష్పలితమును కలిగించును.

ఆధ్యాత్మికోన్నతి కోరువాడు మొట్ట మొదట మాంసాహారమును మానివేయ వలెను. మాంసాహార దేశము అందలి వారు మిక్కుటముగ దుష్ట గ్రంధి వ్యాధిచే పీడింప బడుదురు. శాకాహారులు వార్ధక్యము వరకు ఆరోగ్యవంతులై వుందురు. పాశ్చాత్యదేశములందలి వైద్యశాలలలో (యీనాడు) రోగులకు శాకాహారము నిచ్చు చున్నారు. ఇందువలన వారు త్వరలో ఆరోగ్యమును పొందుచున్నారు.

పై ధాగరన్ అను గ్రీసు తత్త్వవేత్త మాంసాహారము పాపమని చెప్పెను. అతడు, "ఓ మర్త్యులారా! మీ శరీరములను పాప కరమగు ఆహారముతో పెంచుటలో జాగరూకులై యుండుడు. అనేకములగు ఫలములు, ద్రాక్ష, కూరలు, దుంపలు, నీకు బలమునిచ్చి, జఠరాగ్నిని తీర్చుటకు గలవు. అట్లుగాక, పాలు, తైమా పుష్పముయొక్క సువాసనకూడ నీకు యిష్టము కానిచో, ఏవిధమగు రక్తపాతము లేకుండ, పవిత్రమైన ఆహారమును నీకీ భూమాత యివ్వగలదు."

నీవు మాంసాహారమును మానగోరుచో , జంతువధ జరుగు నప్పుడు ఆ జీవులు పడుచుండు బాధను కనులార చూడుము. వెంటనే నీకు జాలికలుగును. మాంసాహారమును మానుటకు నిశ్చయించెదవు. ఇటుల చేయుటకు వీలు కాకపోయినచో, పరిసరములను మార్చి, మాంస మనునది లభించని హోటలులో వుండుము. శాకాహారము వల్ల వచ్చు లాభము మాంసాహారము వల్ల వచ్చు చెడుగులను గురించి ఎల్లప్పుడు తలపోయు చుండుము. శాకాహారులగు వారితోనే కలసి మెలసి వుండుము. ఇందువల్ల నీకు ఫలితము కనిపించనిచో, మాంస విక్రేత యింటికేగి క్రుళ్ళుకంపు కొట్టు చుండు జంతువుల ప్రేవులు మొదలగు వానిని స్వయముగా చూడుము. ఇటుల చేయుటచే మాంసాహారముపై ఏవగింపు కలిగి, వైరాగ్యోదయము కలుగును. పాలు, వెన్న మొదలగు విలువగల పదార్థములను మన కిచ్చుచుండెడి ఆవు, మేకలను చంపుట మహాపాపము కాదా! ఓపాపీ ? ఇట్టి నోరు లేని జంతువులను చంపకుము, నీకు గొప్ప శిక్ష విధింపబడును. నీవు చేయు ప్రతిపనికి నైతికముగ నీవే బాధ్యుడవు. గోవధ మాతృవధతో సమానమైన పాపకారి. నీకు పాలిచ్చి, నీ శరీరమును పోషించు వీటిని చంపుటకు నీకేమి హక్కు గలదు ? ఇది మూర్ఖమైన, అమానుషమైన, హృదయ విదారకమైన కృత్యము. ఈ పశువధ వెంటనే ఆపుజేయ బడవలెను. ఈ హత్య చేయబడు జంతువు హత్యా సమయమున భయము, కోపముగలదిగా వుండుటచే దాని రక్తమున అనేక విషక్రిములు జన్మించును. అట్టి మాంసమును తినుటవలన, మనకు అనేక వ్యాధులు వచ్చును. కావున శాకాహారివిగమ్ము.

ఆహారము విటమిను లను ప్రాణపోషక పదార్థము గలదిగా వుండవలెను. ఇందువలన శరీరము పెరుగును. ఇది లేనిచో శరీరము పెరుగకపోవుటచే అస్థిమార్దవరోగము మొదలగునవి వచ్చును. ఇవి నాల్గువిధములు. ఏ,బి, సి, డీ అని. 'ఏ' విటమిను పాలయందుండును. 'బీ' విటమిను ముడిబియ్యము, టొమాటోపండు రసమునందుండును. 'బీ' విటమిను తక్కువైనవారికి నంజువ్యాధి వచ్చును. తెల్లబియ్యము తినువారికి కూడ యీ వ్యాధి రాగలదు. 'సీ' విటమిను కూరలు, ఫలములు, పచ్చి ఆకుకూర లం దుండును. ఇది వండుటవల్లను, కళాయిచేసినవాటిలో పెట్టుటచేతను చెడిపోవును. నావికులు యీ పదార్థములను పొందుట కష్టముగాన శీతాదము అను వ్యాధిచే బాధపడుచుందురు. వారు నిమ్మరసమును తరచుగా తీసికొనిపోవుచుందురు. ఈ రసము త్రాగుటచే శీతాదవ్యాధి వృద్ధిపొందకుండా ఆగిపోవును. 'డీ' విటమిను పాలు, వెన్న, కోడిగ్రుడ్డు, కాడ్‌లివర్ ఆయిల్ మొదలగువాటిలో గలదు. 'డీ' విటమిను తక్కువైనచో పిల్లలకు అస్థిమార్దవ వ్యాధి వచ్చును.

ఆహార మన శరీరమునకు పుష్టి నిచ్చు పదార్థముల మొత్తము. ఆహారము శరీరము, మనస్సులకు బలమును నిచ్చును. నీ పరిశుద్ధమగు యిచ్ఛాశక్తిచే యోగవిధానమువల్ల సూర్యుని నుండి నేరుగా యీప్రాణపోషక పదార్థములను గైకొను మర్మమును తెలసికొన్నచో, ఆహారము లేకుండ ఎంతకాలమేని జీవించవచ్చును. ఇతడు కాయసిద్ధి పొందగలడు.

ఆహారము పూర్తిగా జీర్ణము కానిచో మలబద్ధము వచ్చును. ఆహారమున, కొంత పొట్టుపదార్థము వుండవలెను. ఇందుచే మలబద్ధమురాదు. జీర్ణక్రియ జరుగునప్పుడు నీటిని త్రాగరాదు. అందువలన జీర్ణరసము పలుచబడుటచే, సరిగా జీర్ణముకాదు. భోజనముకాగానే ఒక గ్లాసెడు నీరు త్రాగుము.

ముష్టెత్తుకొని మాత్రమే జీవించు సన్యాసులకు ప్రతి దినము ఒకేమాదిరి ఆహారము లభించదుగదా ! అట్టివారు తాము తినెడి ఆహారమును, తమ యోగశక్తిచే పవిత్రపరచుకొని, పుష్టికరమైనదానినిగ చేసికొందురు. ఇది సామాన్యులకు తెలియదు.

యోగసాధకులు ఉపవసించరాదు. అందుచే నీరసము వచ్చును. అప్పుడప్పుడు ఉపసించుట లాభకారియే. యోగ సాధకులు ఉదయం 11 గం. లకు కడుపునిండ ఆహారము పుచ్చుకొనవచ్చును. ఒక గ్లాసెడు పాలు ఉదయమునను, అర్థశేరు పాలు, 2 అరటిపండ్లు, లేక 2 నారింజపండ్లు లేక 2 ఆపిలు పండ్లను రాత్రియందును తీసికొనవలెను. రాత్రిభోజనము అతి తేలికగా వుండవలెను. పాలు, ఫలములతో మాత్రమే కూడి యుండు ఆహారము సాధకులకు మిక్కిలి లాభకారి.

______

ప్రశ్నోత్తరములు

____(0)____

ప్రశ్న: రాజయోగమునకు ప్రాణాయామము అనవసరమా ?

జ: కాదు. ప్రాణాయామము రాజయోగమునందలి అష్టాంగములలో నొకటి.

ప్ర: గురుసాహాయ్యము లేకుండా ప్రాణాయామా భ్యాసముచేయుట అపాయకారియా ?

జ: ప్రజలు అనవసరముగ సందేహింతురు. సామాన్య ప్రాణాయామములను గురువు లేకుండగనే చేయవచ్చును. దీర్ఘ కుంభకము, ప్రాణాపానములను ఐక్య మొనర్చుటలను అభ్యసించ గోరువారికి గురువు అవసరమే. గురుసాహాయ్యము దొరకనిచో యోగసిద్ధి పొందినవారు రచించిన గ్రంథముల సహాయము గైకొనవచ్చును. ఎటులైనను ఒకగురుని ఏర్పఱచుకొని, అతనితో కనీసము ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారానైనను సందేహములను నివర్తించు కొనుటమంచిది. 1 2 లేక 1 లేక 2 నిమిషములవరకు ఏ భయము లేకుండ కుంభకము చేయ